Go to full page →

2వ అధ్యాయం - పాపికి అవసరమైన క్రీస్తు SCTel 13

ఆదిలో మానవుడి సాధు గుణాలు, సమతుల మానసిక శక్తులున్నవి. మానవుడు శారీరక పరిపూర్ణత, దేవునితో సామరస్యం కలిగి జీవించాడు. అతడి భావాలు పవిత్రంగాను, లక్ష్యాలు పరిశుద్ధంగాను ఉండేవి. అవిధేయతవల్ల అతడి శక్తులు వక్రించాయి. ప్రేమ స్థానంలో స్వార్ధం నెలకొంది. అతిక్రమణవల్ల అతడి సెజం బలహీనమైనందున చెడును ప్రతిఘటించే శక్తిని కోల్పోయాడు. సాతానుకు బందీ అయ్యాడు. దేవుడు కలుగజేసుకుని చేయూత నివ్వకపోతే మానవుడు ఆ స్థితిలోనే నిత్యము కొనసాగి ఉండేవాడే. మానవుడి సృష్టిలో దేవుని ప్రణాళికను నిరర్ధకం చేసి శ్రమలు, నాశనం దుఖంతో నిలపాలన్నది శోధకుని సంకల్పం. ఈ చెడు అంతటికి కారణం దేవుడు మానవుని సృజించడమేనని చెప్పాలనుకున్నాడు. SCTel 13.1

పాపానికి ముందు మానవుడు దేవునితో ఇష్టగోష్టి జరిపేవాడు. బుద్ది, జ్ఞానముల సర్వ సంపదలు ఆయనయందే గుప్తమైయున్నవి. (కొలస్సి 2:3) అయితే పాపం అనంతరం అతనికి పరిశుద్ధతయందు ఆనందంకనిపించలేదు. దేవునికి కనిపించ కుండా దాక్కోవడానికి ప్రయత్నించాడు. మార్పులేని హృదయ పరిస్థితి ఇప్పటికీ అదే. దేవునితో సమాధానముండదు. ఆయనతో సంబంధం ఆనందానివ్వదు. పాపి దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండలేడు. పరిశుద్ధుల సహవాసానికి దూరంగావుంటాడు. పాపి పరలోకానికి వెళ్ళటం జరిగితే, అక్కడ సంతోషంగా నివశించలేడు. అక్కడ రాజ్యమేలేనిస్వార్ధ ప్రేమ అతడి హృదయాన్ని స్పందింపజేయలేదు. అక్కడ పరిశుద్ధులను క్రియాశీలంజేసే వాతావరణానికి అతడి ఆలోచనలు, అశక్తులు, ఉద్దేశాలు విరుద్ధంగావుంటాయి. పరలోకంలోని మధుర సంగీతములో అతడొక అపస్వతిగా పరిణమిస్తాడు. పరలోకం అతడికి ఒక హింసాస్థలిగా మారుతుంది. పరలోకానికి వెలుగు, అక్కడ ఆనందానికి కేంద్రబిందువు అయినప్రభువుకు దూరంగా దాక్కోవడానికి అతడు ప్రయత్నిస్తాడు. దుష్టుల్ని పరలోకంనుంచి బహిష్కరించే తీర్మానం దేవుడు నిరంతరంగా జారీ చేసిన ఆజ్ఞ కాదు. అక్కడ నివశించడానికి వారే తమ్మును తాము అనర్హతుల్ని చేసుకుంటారు. దేవుని మహిమ వారికి దహించే అగ్నిలా కనిపిస్తుంది. తమను రక్షించడానికి మరణించిన ఆ మహనీయునికి కనిపించకుండా దాక్కోవడానికి గాను వారు మరణాన్ని స్వాగతిస్తారు. SCTel 13.2

మనం మునుగుతున్న పాప కూపంనుంచి మనల్ని మనం రక్షించుకోవడం అసాధ్యం. మన హృదయాలు దృష్టత్వంతో నిండి వున్నాయి. వాటిని మనం మార్చుకోలేము. “పాప సహితునిలోనుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంతమేలు? అలాగున ఎవడును పుట్టలేదు” శరీరానుసారమెన్ల మనస్సు దేవునికి విరుద్ధమైయున్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏమాత్రం లోబడనేరదు. (యోబు 14:4, రోమా 8:7) విద్య సంస్కృతి, ఎంపిక ప్రక్రియ, మానవ కృషి అన్నిటికి వాటి వాటి పరిధులున్నాయి. ఇక్కడమాత్రం అవి శక్తిలేనివి, అవి బాహ్యంగా నిర్దుష్ట ప్రవర్తనను ఉత్పత్తి చేయవచ్చునేమోగాని ప్రవర్తనను మాత్రం మార్చలేవు. జీవితపు ఊటల్ని శుద్దిపర్చలేవు. మనుష్యుల పాపంనుంచి పరిశుద్ధతకు మార్పు చెందకముందు అంతరంగంలో పనిచేసే శక్తి, పైనుంచి జీవం లేని ఆత్మను చెత్తన్యపర్చి దాన్ని దేవునివద్దకు నడిపిస్తుంది; దానికి పరిశుద్ధతను ఆపాదిస్తుంది. SCTel 14.1

రక్షకుడన్నాడు “ఒకడు క్రొత్తగా జన్మించితేనేగాని” నూతనజీవితాన్ని నడిపే నూతన హృదయాన్ని, నూతన కోరికల్నీ, ఉద్దేశాల్నిలక్ష్యన్నిపొందితేగాని, అతడుదేవుని రాజ్యానిచూడలేడు” (యోహాను 3:3) ప్రకృతి సిద్ధంగా మానవుడిలో నిక్షిప్తమైయున్న మంచిని అభివృద్ధి చేయాలన్న అభిప్రాయం మారణాంతకమైన మోసం. “ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగానున్నవి. అవి ఆత్మానుభవముతోనే వివేచింపదగును. గనుక అతడు వాటిని గ్రహింపజాలడు” “మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు” (1కొరింథి 2:14, 3:17) క్రీస్తు గురించి ఇలా ఉంది- “ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండును” “ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము” (యోహాను 1:4, ఆ.కా4:12) SCTel 14.2

దేవుని కృపాతిశయాల్ని గుర్తించటం. ఆయన ప్రవర్తనలోని త్యాగశీలతను ఋ, పితృవాత్సల్యాన్ని గ్రహించటంచాలదు. దేవుని ధర్మశాస్త్రం - న్యాయమెన్జది, వివేకంతో నిండినది అని, అది నిత్య ప్రేమా సూత్రంపై ఆధారితమై ఉందని గ్రహించటంచాలదు. “ధర్మ శాస్త్రము శ్రేష్టమైనదన్నట్లు ఒప్పుకొనుచున్నాను “ధర్మ శాస్త్రము పరిశుద్ధమైనదియు, ఉత్తమమైనదియైయున్నది” అన్నప్పుడు పౌలు ఇదంతా గ్రహించాడు. (రోమా 7:16, 17). ఆవేదన, నిస్సహనిండిన ఆత్మతో ఇంకా ఇలా అన్నాడు “అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినైయున్నాను” (రోమా7:14) పౌలు పవిత్రతను నీతిని ఆకాక్షించాడు. తన స్వశక్తితో ఆ లక్ష్యాన్ని సాధించకలేకపోవడంతో “అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్ను ఎవడు విడిపించును? “అంటూ విలపించాడు. (రోమా 7:14) అన్ని దేశాలనుంచి, అన్ని యుగాలలో దుఖ:భారంతో క్రుంగిపోతున్న హృదయాల ఆవేదన పరలోకం చేరుతుంది. అందరకీవచ్చే సమాధానం ఇదే. “ఇదిగో లోకపాపమును మోసికొనుపోవు దేవుని గొర్రెపిల్ల” (యోహాను 1:29). SCTel 15.1

ఈ సత్యాన్ని ఉదాహరించడానికి, పాపభారంనుంచి విముక్తి పొందాలని ఆశించే వారికి దీన్ని విశదం చేయడానికి దైవాత్మ పెక్కు సాదృశ్యరూపాల్ని ఉపయోగించాడు. ఏశావును మోసగించి తండ్రి ఇల్లు విడిచి పారిపోతున్న తరుణంలో యాకోబు అపరాధ భారంతో క్రుంగిపోయాడు. సుఖ సంతోషాలకు దూరమే నిస్పృహకు గురై ఒంటరిగా ఉన్న సమయంలో యాకోబును పదేపదే బాధిస్తున్న ఆలోచన ఒక్కటే- తన పాపం తనను దేవునికి దూరం చేసిందని, దేవుడు తనను విసర్జించాడని. ముంచుకువస్తున్న దుఖఃతో కటిక నేలమీద పడుకొని విశ్రాంతి తీసుకొంటున్నాడు. చుట్టూ కొండలు, పైన నక్షత్రాలతో మెరిసే ఆకాశం. అతడు నిద్రిస్తుండగా ఒక విచిత్రమైన వెలుగు అతనిపై ప్రకాశించినది. తాను పడుకొనివున్న స్థలం నుంచి పరలోక గుమ్మాల వరకు మెట్లు ఉన్నట్లు, వాటిపై దూతలు పరలోకానికి ఎక్కుతూ దిగుతూ ఉన్నట్లు చూశాడు. పైనున్న ప్రకాశతలో నుంచి నిరీక్షణ ఆదరణ నిచ్చే వర్తమానం అందిస్తున్న దైవ స్వరాన్నివిన్నాడు. ఇలా తన హృదయ వాంఛను అవసరాన్ని తీర్చే వ్యక్తి యాకోబుకు బయలు పర్చబడ్డాడు రక్షకుడు యేసు.పాపి అయిన తనతో దేవుని సంబంధం పునరుద్ధరణకు తెరచు కొన్న మార్గాన్ని యాకోబు సంతోషంతో, పొంగిపొర్లుతున్న కృతజ్ఞతతో తిలకించాడు. కలలోని నిగూఢమైన నిచ్చెన దేవునికి మానవునికి ఒకే ఒక మధ్యవర్తి అయిన యేసుకు సంకేతం. SCTel 15.2

నతానియేలుతో మాట్లాడుతూ “మీరు ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు, మనుష్య కుమారుడు పెకై ఎకుటయును దిగుటయును చూతురు’‘ (యోహాను 1:51) అని చెప్పినప్పుడు క్రీస్తు ఈ సాదృశ్య రూపాన్ని ప్రస్థావించాడు. జరిగిన మత భ్రష్టతలో మానవుడు దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోయాడు. భువికి దేవునితో ఉన్న సంబంధం తెగిపోయింది. మధ్యవున్న అగాధంవల్ల ఉత్తరప్రత్యుత్తరాలు నిలిచిపోయాయి. కాని క్రీస్తుద్వారా భూలోకానికి పరలోకానికి మళ్ళీ సంబంధాలు ఏర్పడ్డాయి. పాపం సృష్టించిన అగాధానికి క్రీస్తు తన నీతి వలన వంతెన వేశాడు. అందుకు మూలంగా సేవా తత్పరులైన దేవ దూతలు మానవుడితో సంభాషణలు జరపడం సాధ్యపడుతుంది. బలహీనుడు, నిస్సాహయుడు అయినమానవుణి అనంత శక్తికి నిధి అయిన దేవునితో క్రీస్తు అనుసంధాన పర్చుతాడు. SCTel 16.1

పడిపోయిన మానవ జాతికి సహాయం నీరీక్షణ వనరు అయిన యేసును మనుష్యులు ఉపేక్షిస్తే, ప్రగతిని గూర్చి వారి కలలు, మానవాళికి పురోగతికి వారి ఒంటిచేతి చప్పట్లే, “శ్రేష్టమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును” (యాకోబు 1:17) దేవునివద్ద నుంచి వస్తున్నది. ఆయన లేకుండా యదార్ధం సచ్ఛీలనంకాదు. క్రీస్తే దేవునివద్దకు ఏకైక మార్గం. “నేను మార్గమును, సత్యమును, జీవమును, నాద్వారా తప్ప ఎవడును తండ్రియొద్దరు రాడు” (యోహాను 14:6) అంటున్నాడు యేసు.. SCTel 16.2

లోకంలోవున్న తన పిల్లలమీద దేవునికిగల ప్రేమ మరణం కంటే బలమెస్టది. కుమారుణ్ణి త్యాగం చేయటంలో దేవుడు పరలోకం అంతటినీ ఒకే ఈవీలో మనకు అర్పించాడు. రక్షకుని జీవితం, మరణం, విజ్ఞాపన సేవ, దేవదూతల పరిచర్య, పరిశుద్ధాత్మ విజ్ఞాపన, పరలోక వాసుల నిరంతర ఆసక్తి - ఇవన్నీ మానవుడి విమోచన కోసం వినియుక్తమవుతున్నాయి. SCTel 16.3

మనకోసం యేసు చేసిన త్యాగం గురించి ఆలోచిద్దాం! నశించిన వారిని తిరిగి సంపాదించేందుకు, తిరిగి వారిని తండ్రి గృహానికి చేర్చేందుకు పరలోకం చేస్తున్న కృషిని పడుతున్న శ్రమలను అభినందించడానికి ప్రయత్నిద్దాం. ఇంతకన్నా అర్ధవంతమైన లక్ష్యాలు శక్తివంతమైన సాధనాల్ని ఆచరణలో పెట్టడం సాధ్యంకాదు. సత్ర్క్రియలకు కలిగే ఉత్కృష్ట ప్రతిఫలం, పరలోకానందం, దేవదూతల సాంగత్యం, దేవునితోను, యేసుతోను సహవాసం, ప్రేమానుబంధం, నిత్యకాల యుగాలన్నిటిలోను మన శక్తి సామర్ధ్యాల అభివృద్ధి - ఇవి మన సృష్టికర్త , విమోచకుడు అయిన యేసుకు హృదయపూర్వక సేవలర్పించడానికి ఉద్రేక పర్చేందుకు మనకు ప్రోత్సాహాలు కావా? పాప విషయంలో దేవుడు వెలుబుచ్చిన తీర్పులు, తప్పించుకోలేని శిక్ష, మన ప్రవర్తన క్షీణత, అంతిమ నాశనం - ఇవి సాతాను పనిని గూర్చి దైవ వాక్యంలో మనకున్న హెచ్చరికలు. SCTel 16.4

దైవ కృపను, నిర్లక్ష్యంచేద్దామా? ఆయన ఇంతకన్నా ఎక్కువ ఏం చేయగలడు? మనల్ని ఎంతో ప్రేమిస్తున్న ప్రభువుతో మన సంబంధాల్ని సరిచేసుకుందాం. ఆయన పోలికకు పరివర్తన చెందడానికి, దేవ దూతల సహవాస పునరుద్దరణకు, తండ్రి కుమారులతో సామరస్య సాధనకు ఏర్పాటైన సాధనాల్ని వినియోగించుకుందాం. SCTel 17.1