Go to full page →

శక్తిమంతమైన సాదృశ్యాలు ChSTel 105

మానవులపట్ల దేవునికి అనంత(ప్రేమ పుట్టింది. అంత గొప్ప ప్రేమను పొందుతున్న వారిలో పైపై కృతజ్ఞత మాత్రమే చూసి దేవదూతలు ఆశ్చర్యపడ్తున్నారు. దేవుని ప్రేమను మానవులు ఎక్కువ అభినందికపోటం దేవదూతల్ని విస్మయ పర్చుతుంది. మానవాత్మల విషయంలో కనపర్తుతున్న నిర్లక్ష్యానికి పరలోకం ఆగ్రహిస్తున్నది. మానవాత్మను క్రీస్తు ఎలా పరిగణిస్తాడో తెలుసుకోగోరుతున్నామా? చలిలోను మంచులోను చిక్కకున్న తమ కుమారుణ్ని రక్షించగలిగి ఉండేవారు పట్టించుకోకుండా అతణ్ని నశించిపోటానికి విడిచి పెట్టి వెళ్లిపోయారని తెలుసుకున్న తల్లి తండ్రి ఎలా పరగణిస్తారో అలా. వారు తీవ్ర దుఃఖానికి అపరిమిత ఆగ్రహానికి గురికారా? ఆగ్రహంతో కన్నీటితో ఆ హంతకుల్ని నిందించరా? దేవుని బిడ్డకు ప్రతీ మనుషుడి బాధలు తన బాధలుగా ఉంటాయి. నశిస్తున్న తోటి మానవుల్ని కాపాడటానికి చెయ్యి అందించని వారు ప్రభువు పరిశుద్ధ ఉగ్రతకు గురి అవుతారు. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 825. ChSTel 105.1

చలికాలంలో ఓ రోజు దట్టమైన మంచులో ప్రయాణం చేస్తున్న ఓ వ్యక్తిని గురించి చదివాను. అతడు మంచు చలి వల్ల మొద్దుబారిపోయాడు. అది కనిపించకుండా అతడి జీవశక్తుల్ని దాదాపు హరించివేస్తుంది. మంచు తాకిడి వల్ల దాదాపు మరణించటానికి సిద్ధమై జీవించటానికి ప్రయత్నం దాదాపు మానుకున్నప్పుడు, అతడికి తనవంటి ఇంకో ప్రయాణికుడి మూలుగు వినిపించింది. మరణించటానికి తనూ సిద్దంగా ఉన్నట్లు అతడూ మరణిస్తున్నాడు. అతణ్ని రక్షించటానికి తనలోని మానవత మేల్కొంది. మంచులో కూరుకుపోయి మూలుగుతున్న ఆ వ్యక్తిని బయటికి తియ్యటానికి ఎంతో సేపు శ్రమించి చివరికి అతణ్ని తన కాళ్లమీద నిలబెట్టాడు. ఆ అభాగ్యుడు నిలబడలేకపోతున్నందున అతణ్ని చేతుల్లో పెట్టుకుని, ధారాపాతంగా పడుతున్న ఏ మంచులోనుంచి తాను ఒంటరిగా బయటపడలేనని భయపడి నిస్పృహ చెందాడో దానిలోనుంచి అతణ్ని మోసుకువెళ్లాడు. తోటి ప్రయాణికుణ్ని సురక్షిత స్థలానికి చేర్చినప్పుడు, తన పొరుగు వాణ్ణి రక్షించటంలో తన్ను తాను రక్షించుకున్నానన్న వాస్తవం అతడికి గ్రాహ్యమయ్యింది. ఇంకొకణ్ని రక్షించటానికి అతడు చేసిన శ్రమ తన రక్త నాళాల్లో గడ్డకట్టుకు పోతున్న రక్తానికి చురుకుతనం పుట్టించి కాళ్లలోను చేతుల్లోను ఆరోగ్యవంతమైన వేడిని పుట్టించింది. తమ క్రైస్తవానుభవంలో తామూ అలాంటి ఫలితాల్నే సాధించేందుకు, మాటలలోనేగాక ఆచరణలోనూ ఈ పాఠాన్ని యువవిశ్వాసుల దృష్టికి నిత్యం తేవటం అవసరం. టెస్టిమొనీస్, సం.4, పులు. 319, 320. ChSTel 105.2

మీకు మీరే స్వయం సమృద్దులుగా పరిగణించుకుని కొంత సత్యజ్ఞానంతో సంతృప్తి చెందకూడదు. సత్యాన్ని మీకు ఎవరు అందించారు? దైవవాక్య వెలుగును మీకు ఎవరు చూపించారు? దేవుడు తన వెలుగును కుంచం కింద దాచటానికి మీకివ్వలేదు. సర్ జాన్ పేంక్లిన్న్ని వెదకటానికి పంపిన ఓ దండయాత్రను గురించి నేను చదివాను. సాహసవంతులైన మనుషులు తమ గృహాలు విడిచి పెట్టి, ఉత్తర సముద్రాల్లో సంచరిస్తూ లేమిని ఆకలి బాధను చలిని విపత్తును అనుభవించారు. ఇదంతా ఎందుకు చేశారు? అన్వేషకుల మృతదేహాల్ని కనుక్కోటమన్న ఘనత లేదా సకాలంలో సహాయం అందకపోతే తప్పక మృత్యువాత పడనున్న ఆ బృందంలోని కొందరినైనా రక్షించటమన్న ఘనతను పొందటానికే. నాశనం నుంచి ఒక్క ప్రాణాన్ని రక్షించ గలిగితే, తాము పడ్డ శ్రమంతా ఫలించినట్లు వారు భావించారు. వారు తమ సర్వసుఖాల్ని సంతోషాన్ని త్యాగం చేసి ఈ పనిచేశారు. ChSTel 106.1

దీన్ని గురించి ఆలోచించి అప్పుడు మన చుట్టూ ఉన్న ప్రశస్త ఆత్మల రక్షణకు మనం ఎంత స్వల్పం త్యాగం చెయ్యటానికి సిద్దంగా ఉన్నామో పరిగణించండి. నశిస్తుతున్న ఓ వ్యక్తి జీవితం కాపాడటానికి మనం గృహం విడిచి పెట్టి, ఆయాసకరమైన, సుదీర్ఘమైన ప్రయాణం చెయ్యటానికి ఒత్తిడికి లోనవ్వటం లేదు. మన తలపువద్దే, మన చుట్టూ, ప్రతీ పక్కా రక్షించబడాల్సిన ఆత్మలు, నశిస్తున్న ఆత్మలు - నిరీక్షణ లేకుండా, దేవుడు లేకుండా - ఉన్నాయి. అయిన మనం చలించటం లేదు. మాటల్లో కాకపోయినా మన క్రియల ద్వారా “నా తమ్మునికి నేను కావలివాడనా?” అంటున్నాం. ఇతరుల్ని రక్షించటంలో ప్రాణాలు కోల్పోయిన ఈ మనుషుల్ని ప్రపంచం వీరులని హతసాక్షులని కొనియాడుతుంది. మానవుల ఆత్మల రక్షణ కోసం దేవుడు మనల్ని కోరుతున్న చిన్నచిన్న త్యాగాల్ని చెయ్యకపోతే, నిత్య జీవావకాశం ముందు పెట్టుకున్న మనం ఎలా భావించాలి? రివ్యూ అండ్ హెరాల్డ్, ఆగ. 14, 1888. ChSTel 106.2

న్యూ ఇంగ్లండులో ఓ పట్టణంలో ఓ నుయ్యి తవ్వుతున్నారు. పని దాదాపు పూర్తి అయినప్పుడు, ఒక మనిషి ఇంకా అడుగున ఉండగా, భూమి చరియ విరిగిపడి అతణ్ని పూడ్చివేసింది. వెంటనే ప్రమాదాన్ని గూర్చిన వార్త పంపారు. రక్షించటానికి వెంటనే మెకానిక్కులు, వ్యవసాయదార్లు, వ్యాపారస్తులు, న్యాయవాదులు ప్రమాద స్థలానికి వచ్చారు. తాళ్లు, నిచ్చెనలు, పారలు, షవల్లు తెచ్చారు. “రక్షించండి, రక్షించండి” అన్న కేకలు వినిపించాయి. ChSTel 107.1

మనుషులు తెగింపుతో పనిచేశారు. వారి నొసళ్లపై స్వేదబిందువులు నిలిచాయి. అలసిపోయిన వారి చేతులు వణుకుతున్నాయి. చివరికి ఓ గొట్టం కిందికి పంపి, తాను బతికి ఉంటే తిరిగి మాట్లాడమంటూ గొట్టం ద్వారా అరిచిచెప్పారు. “బతికే ఉన్నాను కాని త్వరపపండి. ఇక్కడ భయంకరంగా ఉంది” అన్న జవాబు వచ్చింది. ఆనందోత్సాహాలతో కేకలు వేస్తూ వారు తమ ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు. చివరికి అతణ్ణి చేరి రక్షించగలిగారు. వారి ఉత్సాహ ధ్వనితో ఆకాశం చిల్లుపడినట్లనిపించింది. ఆ పట్టణం ప్రతీ వీధిలో “రక్షించబడ్డాడు అన్నమాటలు మారుమోగాయి. ChSTel 107.2

ఒక్క మనిషిని రక్షించటానికి ఇది గొప్ప ఉత్సాహం, ఆసక్తి, ఉద్రేకమా? కాదు. అయితే ఓ ఆత్మను పోగొట్టుకోటంతో పోల్చితే ఓ లౌకిక జీవితం కోల్పోటం ఏ పాటిది? ఓ ప్రాణాన్ని కోల్పోయే ప్రమాదం మానవ మృదయాల్లో అంత తీవ్ర భావోద్రేకం రేపితే, ఓ ఆత్మను కోల్పోటం గురించి క్రీస్తు లేకుండా నివసించేవారు ఏ ప్రమాదంలో ఉన్నారో అది తమకు తెలుసునని చెప్పుకునేవారు ఇంకెంతగా ఆందోళన చెందాలి? నుయ్యి కూలి దానిలో కప్పొడి పోయిన మనిషి విషయంలో ప్రజలు చూపించిన ఉత్సాహాన్ని ఉద్రేకాన్ని ఆత్మల రక్షణ విషయంలో దేవుని సేవకులు చూపించవద్దా? గాస్పుల్ వర్కర్స్, పులు. 31,32. ChSTel 107.3