Go to full page →

29 - బబులోను రాయబారులు PKTel 232

తన ప్రగతిశీల రాజ్యపాలన మధ్యలో హిజ్కియా రాజు హఠాత్తుగా ఒక మరణాంతక వ్యాధికి గురి అయ్యాడు. “మరణకరమైన రోగము” కలిగిన రాజు పరిస్థితి మానవుడు సహాయం చెయ్యలేనంత తీవ్రంగా ఉంది. యెషయా ప్రవక్త ఇచ్చిన ఈ వర్తమానంతో అతడిలో మిగిలి ఉన్న చివరి నిరీక్షణ మటుమాయ మయ్యింది, “నీవు మరణమవుచున్నావు గనుక నీవు నీ యిల్లు చక్కబెట్టుకొనుము.” యెష 38:1. PKTel 232.1

పరిస్థితి చీకటితోనిండి అయోమయంగా ఉంది. అయినా ఇంతవరకు తనకు “ఆశ్రయమును దుర్గమునై... ఆపత్కాలములో... నమ్ముకొనదగిన సహాయకుడు” అయిన (కీర్త. 46:1) ప్రభువుకి రాజు ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కనుక “అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని” - యెహోవా, యథార్ధహృదయుడనై, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను.” 2 రాజులు. 20:2,3. PKTel 232.2

దావీదు దినాలు ముగిసినప్పటినుంచి, మతభ్రష్టత, నిరాశ చోటుచేసుకున్న దినాల్లో దేవుని రాజ్య నిర్మాణానికి హిజ్కియాలా పాటుపడిన రాజు మరొకడులేడు. మరణిస్తున్న ఆ రాజు దేవునికి నమ్మకమైన సేవ చేశాడు. ప్రజలు యెహోవాను తమ సర్వోన్నత రాజుగా విశ్వసించటానికి సహాయపడ్డాడు. కనుక దావీదుమల్లే ఇప్పుడు ఇలా దేవునితో విజ్ఞాపన చెయ్యగలిగాడు : PKTel 232.3

“నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక
నా మొడ్డకు చెవియొగ్గుము
నేను ఆపదలతో నిండియున్నాను
నా ప్రాణము పాతాళమునకు సమీపించి
యున్నది.” PKTel 232.4

కీర్త.88:2,3 232

“నా ప్రభువా, నా నిరీక్షణాస్పదము
నీవే
బాల్యమునుండి నా ఆశ్రయము నీవే ...
నీవే నాకు ప్రాపకుడవైయున్నావు.”

“వృద్దాప్యమందు నన్ను విడనాడకుము”

“దేవా, నాకు దూరముగా నుండకుము
నా దేవా, నా సహాయమునకు త్వరపడి రమ్ము.”

“దేవా, వచ్చు తరమునకు నీ బాహు బలమునుగూర్చియు
పుట్టబోవువారి కందరికి నీ శౌర్యమును గూర్చియు
నేను తెలియజెప్పునట్లు తలనెరసి వృద్దునైయుండు
వరకు నన్ను విడువకుము.” PKTel 233.1

కీర్త.71:5,6,6,9,12,18.

ఎవరి వాత్సల్యం “యెడతెగక నిలుచు”నో ఆ యెహోవా తన సేవకుడి ప్రార్ధన విన్నాడు. (విలాప. 3:22). “యెషయా నడిమి శాలలో నుండి అవతలకు వెళ్లకమునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను - నీవు తిరిగి నా ప్రజలకు అధికారియైన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లునుము - నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చునదేమనగా - నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. నీ ప్రార్థన నేనంగీకరించి యున్నాను. నేను నిన్ను బాగు చేసెదను. మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. ఇంక పదునైదు సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణము నేను కాపాడుదును. నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండ నేను విడిపించెదను.” 2 రాజులు 20:4-6. PKTel 233.2

హామిని నిరీక్షణను ఇచ్చే మాటలతో ప్రవక్త సంతోషంగా తిరిగి వచ్చాడు. వ్యాధిగ్రస్తమైన శరీర భాగంపై అంజూరపు పండ్లముద్దను ఉంచాల్సిందని ఆదేశించి యెషయా దేవుని కృప, సంరక్షణ వర్తమానాన్ని అందించాడు. PKTel 233.3

మిద్యాను దేశంలో మోషేవలే, పరలోక దూత సమక్షంలో గిద్యోనువలే, తన యజమాని ఆరోహణానికి ముందు ఎలీషావలే, తనకు వచ్చిన వర్తమానం దేవుని వద్దనుంచి వచ్చిందనటానికి హిజ్కియా ఒక సూచన కోరాడు. అతడు ప్రవక్తను ఇలా ప్రశ్నించాడు, “యెహోవా నన్ను స్వస్థపరచుననుటకును, నేను మూడవ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోదుననుటకును సూచన ఏది?” PKTel 233.4

“తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ పదిమెట్లు ముందుకు నడిచెను గదా? అది పదిమెట్లు వెనుకకు నడిచిన యెడల అవునా?” అనగా హిజ్కియా ఇలా బదులిచ్చాడు, “నీడ పదిమెట్లు ముందరికి నడుచుట అల్పముగాని నీడ పదిగడులు వెనుకకు నడుచుట చాలును.” PKTel 234.1

నీడ గడియారంలోని నీడ దేవుని ప్రత్యక్ష జోక్యంవల్ల మాత్రమే పరిగడులు వెనక్కు వెళ్తుంది. దేవుడు తన ప్రార్థనను విన్నాడనటానికి హిజ్కియాకి సూచన కావాల్సి ఉంది. అలాగే “ప్రవక్తయగు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలకమీద పదిమెట్లు ముందరికి నడిచిన నీడ పదిమెట్లు వెనుకకు తిరిగి పోవునట్లు చేసెను.” 8-11 వచనాలు. PKTel 234.2

రాజుకి యధాపూర్వ శక్తి మళ్లీ చేకూరింది. యెహోవా చూపిన కృపను స్తోత్రగానంతో గుర్తించి, తన శేష జీవితాన్ని రాజులకు రాజైన యెహోవా సేవలో గడుపుతానని హిజ్కియా ప్రమాణం చేశాడు. తనపట్ల దేవుడు చూపించిన దయను అతడు కృతజ్ఞతతో గుర్తించటం, తమ జీవితాల్ని తమ సృష్టికర్త సేవలో గడపాలని ఆశించేవారికి స్ఫూర్తినిస్తుంది. PKTel 234.3

“నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ
ద్వారమున పోవలసివచ్చెను
నా ఆయుషేషము పోగొట్టుకొనియున్నాను.”

“యెహోవాను, సజీవుల దేశమున యెహోవాను
చూడకపోవుదును
మృతుల లోకనివాసినై ఇకను మనుష్యులను కానక
పోవుదునని నేననుకొంటిని.”

“నా నివాసము పెరికివేయబడెను
గొట్టెల కాపరి గుడిసెవలె అది నాయొద్దనుండి ఎత్తి
కొనిపోబడెను.”

“నేయువాడు తన పని చుట్టుకొనునట్లు నేను నా
జీవము ముగించుచున్నాను.
ఆయన నన్ను బద్దెనుండి కత్తిరించుచున్నాడు.”

“ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు
మంగలికత్తి పిట్టవలెను ఓదె కొరకువలెను నేను కిచకిచ
లాడితిని గువ్వవలె మూల్గితిని
ఉన్నత స్థలముతట్టు చూచి చూచి నా కన్నులు క్షీణిం
చెను.
నాకు శ్రమ కలిగెను; యెహోవా, నాకొరకు పూట
బడియుండుము.” “నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను ఆయనే
నెరవేర్చెను
నాకు కలిగిన వ్యాకులమునుబట్టి
నా సంవత్సరములన్నియు నేను మెల్లగా నడచు
కొందును.

“ప్రభువా, వీటివలన మనుష్యులు జీవించుదురు
వీటివలననే నా ఆత్మ జీవించుచున్నది
నీవు నన్ను బాగుచేయుదువు నన్ను జీవింప జేయు
దువు”

“మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు
కారణమాయెను
నీ ప్రేమచేత నా ప్రాణమును నాశనమను గోతి
నుండి విడిపించితివి
నీ వీపు వెనకతట్టు నా పాపములన్నియు నీవు పార
వేసితివి”

“పాతాళమున నీకు స్తుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతా
స్తుతి చెల్లించదు
సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయిం
చరు”

“సజీవులు, సజీవులేగదా నిన్ను స్తుతించుదురు
ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించు
చున్నాను
తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు”

“యెహోవా నన్ను రక్షించువాడు
మన జీవిత దినములన్నియు యెహోవా మందిరములో
తంతివాద్యములు వాయింతుము.” PKTel 234.4

యెష 38:10-20

టైగ్రీసు యూఫ్రటీసు సారవంతమైన లోయల్లో ఒక ప్రాచీన జాతి ప్రజలు నివసించారు. వారు అప్పట్లో అష్షూరు పరిపాలనకింద ఉన్నప్పటికీ వారికి భావిలో ప్రపంచాన్ని పాలించే అదృష్టం కలిగింది. వారిలో కొందరు జ్ఞానులున్నారు. వారు ఖగోళ శాస్త్ర పఠనంపై దృష్టిపెట్టారు. నీడ గడియారంలోని నీడ పదిగడులు వెనక్కివెళ్లినట్లు వారు గుర్తించినప్పుడు విస్మయం చెందారు. వారి రాజు మెరోదక్బలదాను. ఈ అద్భుత కార్యం యూదారాజుకి సూచనగా జరిగిందని, పరలోకమందున్న దేవుడు అతడికి నూతన జీవితాన్ని ప్రసాదించాడని తెలుసుకుని స్వస్తత పొందిన హిజ్కియాని అభినందించటానికి, గొప్ప అద్భుతాన్ని చేయగలిగిన దేవుణ్ని గురించి సాధ్యమైనంత తెలుసుకోటానికి రాయబారుల్ని పంపాడు. PKTel 235.1

ఆ దూరదేశపు రాజు దూతల సందర్శన, సజీవుడైన తన దేవుణ్ని ఘనపర్చటానికి హిజ్కియాకి గొప్ప అవకాశాన్నిచ్చింది. తనకు ఎలాంటి నిరీక్షణాలేని తరుణంలో, ఎవరి ప్రసన్నతవలన తనకు బతికే ఆధిక్యత లభించిందో, సృష్టికి ఆధారభూతుడైన ఆ దేవున్నిగూర్చి చెప్పటం ఎంత సులభం! కల్దీయుల దేశంనుంచి సత్యాన్ని వెదుకుతూ వచ్చిన ఈ రాయబారుల్ని జీవంగల దేవుడు సర్వాధికారి అయిన యెహోవాను గూర్చిన జ్ఞానానికి నడిపించి ఉంటే ఎంత గొప్ప మార్పు చోటుచేసుకునేది! PKTel 236.1

అయితే గర్వం డంబం హిజ్కియా హృదయాన్ని నింపాయి. ఆత్మస్తుతికి లోనై తన ప్రజలకు దేవుడిచ్చిన ఐశ్వర్యాల్ని ఆశబోతు కళ్లముందు ఆవిష్కరించాడు. రాజు తన యింటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగుచేయక తన పదార్థములుగల కొట్లను వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించెను.” యెష. 39:2. ఇది అతడు దేవుని మహిమపర్చటానికి చెయ్యలేదు. విదేశ అధిపతుల దృష్టిలో తన్నుతాను ఘనపర్చుకోటానికే చేశాడు. ఈ మనుషులు దేవుని భయం ఆయనపట్ల ప్రేమలేని శక్తిమంతమైన రాజ్యానికి చెందిన రాయబారులని వారికి తన ఐహిక సిరిసంపదల వివరాలు తెలపటం అవివేకమని అతడు ప్రశాంతంగా ఆలోచించలేదు. PKTel 236.2

రాయబారుల సందర్శన హిజ్కియా కృతజ్ఞతకు భక్తికి ఒక పరీక్ష. వాక్యం ఇలా చెబుతున్నది, “అతని దేశము ఆశ్చర్యముగా వృద్ది చెందుటను గూర్చి విచారించి తెలిసికొనుటకై బబులోను అధిపతులు అతనియొద్దకు పంపిన రాయబారుల విషయములో అతని శోధించి, అతని హృదయములోని ఉద్దేశమంతయు తెలిసికొనవలెనని దేవుడతని విడిచిపెట్టెను.” 2 దినవృ. 31:31. ఇశ్రాయేలీయుల దేవుని శక్తి దయాళుత్వం కనికరాన్ని గురించి సాక్ష్యమివ్వటానికి వచ్చిన అవకాశాన్ని హిజ్కియా వినియోగించుకుని ఉంటే, రాయబారుల నివేదిక చీకటిని చీల్చే వెలుగులా ఉండేది. కాని సైన్యాలకు అధిపతి అయిన ప్రభువుని ఘనపర్చేబదులు హిజ్కియా తన్నుతాను ఘపర్చుకున్నాడు. అతడు “మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింప” లేదు. 25వ వచనం. PKTel 236.3

“పిమ్మట ప్రవక్తయైన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి ఆ మనుష్యులు ఏమనిరి? నీయొద్దకు ఎక్కడినుండి వచ్చిరి? అని యడుగగా హిజ్కియా - బబులోను దూరదేశమునుండి వారు వచ్చియున్నారని చెప్పెను. నీ యింట వారేమి చూచిరని అడుగగా హిజ్కియా - నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా యింటనున్న సమస్తమును నేను వారికి చూపించి యున్నాననెను. PKTel 237.1

“అంతట యెషయా హిజ్కియాతో నిట్లనెను - యెహోవా సెలవిచ్చుమాట వినుము - రాబోవు దినములలో ఏమియు మిగులకుండ నీ యింటనున్న సమస్తమును, నేటివరకు నీ పితరులు సమకూర్చి దాచి పెట్టినవి అంతయును బబులోను పట్టణమునకు ఎత్తికొని పోవుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసికొని పోవుదురు.” PKTel 237.2

“అందుకు హిజ్కియా - నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే.” యెష. 39:3-8. PKTel 237.3

పశ్చాత్తాపంతో నిండిన “హిజ్కియా హృదయ గర్వము విడచి, తానును యెరూషలేము కాపురస్తులును తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనులమీదికి రాలేదు.” 2 దిన వృ. 32:26. కాని దుష్టత విత్తనం నాటబడింది. సకాలంలో అది మొలిచి మరణం దుఃఖం పంటను పండుతుంది. తన గత వైఫల్యాల్ని సవరించుకుని, తాను ఆరాధిస్తున్న దేవుని నామాన్ని ఘనపర్చటానికి యూదరాజు పూనుకున్నాడు గనుక అతడి శేష సంవత్సరాల్లో గొప్ప వృద్ధి కలుగనుంది. అయితే అతడి విశ్వాసం తీవ్ర పరీక్షకు గురి అవుతుంది. తనను నాశనం చెయ్యటానికి తన ప్రజల్ని నాశనం చెయ్యటానికి కృషి చేస్తున్న అంధకార శక్తులపై విజయం సాధించటం యెహోవాను పూర్తిగా విశ్వసించటం ద్వారా మాత్రమే సాధ్యపడుందని అతడు నేర్చుకోవలసి ఉంది. PKTel 237.4

రాయబారుల సందర్శన సమయంలో తనపై ఉంచిన విశ్వాసాన్ని హిజ్కియా వమ్ముచేసిన ఉదంతంలో అందరికీ ప్రాముఖ్యమైన పాఠం ఉంది. మన అనుభవంలో ప్రశస్త అధ్యాయాలగురించి, దేవుని కృపా ప్రేమానురాగాల్ని గురించి, రక్షకుని అనంత ప్రేమను గురించి మనం మరెక్కువగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనసు హృదయం దేవుని ఆత్మతో నిండినప్పుడు, ఆధ్మాత్మిక జీవితానికి ఏది దోహదపడుందో దాన్ని అందించటం కష్టంకాదు. గొప్ప తలంపులు, ఉదాత్తమైన కోరికలు, స్పష్టమైన సత్యావగాహన, స్వార్థరహిత ఉద్దేశాలు, భక్తి పరిశుద్దతలపట్ల ఆసక్తి - ఇవి హృదయ ఐశ్వర్యాన్ని బయలుపర్చే మాటల్లో వ్యక్తమవుతాయి. PKTel 237.5

మనం అనుదినం ఎవరితో సహవాసం చేస్తామో వారికి మన సహాయం మన నడుపుదల అవసరం. వారు అనుకూల సమయంలో పలికిన మాటను అంగీకరించే మానసిక స్థితిలో ఉండవచ్చు. రేపు వారిలో కొందరు మళ్లీ మనం చేరలేని స్థితిలో ఉండవచ్చు. ఇలాంటి మనుషులపై మన ప్రభావం ఎలాంటిది? PKTel 238.1

ప్రతిదినం జీవితం బాధ్యతలతో నిండి ఉంటుంది. వాటిని మనం వహించాలి. మన మాటలు మన కార్యాలు మన సహచరులపై అనుదినం ప్రభావం చూపుతాయి. మనం మన మాటల విషయంలో క్రియల విషయంలో జాగ్రత్తగా ఉండటం ఎంత అవసరం! ఒక్క అనాలోచిత కదలిక ఒక్క అవివేకచర్య బలమైన శోధనై ఒక ఆత్మను అధోమార్గంలోకి నెట్టవచ్చు. మానవ మనసుల్లో మనం నాటిన తలంపుల్ని తిరిగి పోగు చేసుకోలేం. అవి దుష్ట తలంపులైతే, మనం కొన్ని పరిస్థితుల్ని దుష్టత్వపు ఉప్పెనను సృష్టించవచ్చు. దాన్ని నిలువరించటానికి మనం శక్తిహీనులం. PKTel 238.2

ఇదిలాగుంటే, మన ఆదర్శంవల్ల మంచి నియమాల రూపకల్పనకు సహాయపడితే మంచి చెయ్యటానికి వారికి శక్తినిస్తాం. వారు ఇతరులపై అదే సత్ర్పభావాన్ని ప్రసరిస్తారు. ఈ విధంగా మనకు తెలియకుండా మనం చూపే ప్రభావంవల్ల వందలు వేల ప్రజలు మేలు పొందుతారు. క్రీస్తుకి యధార్ధమైన అనుచరుడు తాను కలిసే ప్రతీ వ్యక్తి మంచి ఉద్దేశాల్ని బలపర్చుతాడు. విశ్వసించని, పాపాన్ని ప్రేమించే లోకం ముందు అతడు దైవ కృప శక్తిని, దేవుని ప్రవర్తన సంపూర్ణత్వాన్ని వెల్లడి చేస్తాడు. PKTel 238.3