సిద్కియా రాజ్యపాలన తొమ్మిదో ఏట “బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సైన్యమంతయును యెరూషలేమును” ముట్టడి వేయటానికి వచ్చారు. 1 రాజులు. 25:1. యూదా పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. యెహెజ్కేలు ద్వారా ప్రభువిలా అన్నాడు, “నేను నీకు విరోధినైతిని. నీతిపరులనేమి దుష్టులనేమి నీలో ఎవరు నుండకుండ అందరిని నిర్మూలము చేయుటకై నా ఖడ్గము ఒర దూసియున్నాను... మరల ఒరలో పడకుండ దాని దూసియున్నాను.... అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమవును, అందరి మనస్సులు అధైర్యపడును, అందరి మోకాళ్లు నీరవును.” “అచ్చటనే నా రౌద్రమును నీమీద కుమ్మరించెదను; నా ఉగ్రతాగ్నిని నీమీద రగులబెట్టెదను, నాశనము చేయుటయందు నేర్పరులైన క్రూరులకు నిన్ను అప్పగించెదను.” యె హే. 21:3, 5-7,31. PKTel 315.1
ముట్టడికి గురి అయిన పట్టణాన్ని రక్షించటానికి రావటానికి ఐగుప్తీయులు ప్రయత్నించారు. అయితే వారిని రాకుండా చెయ్యటానికి కల్దీయులు యూదా ముఖ్య పట్టణం చుట్టూ తమ ముట్టడిని కొంతకాలం విరమించుకున్నారు. సిద్కియా హృదయంలో నిరీక్షణ పుట్టింది. హెబ్రీ జాతికోసం దేవునికి ప్రార్ధన చెయ్యమంటూ యిర్మీయా వద్దకు దూతను పంపించాడు. PKTel 315.2
ప్రవక్త తిరిగి పంపిన సమాధానం కల్దీయులు తిరిగి వచ్చి పట్టణాన్ని నాశనం చేస్తారన్నది. ఆజ్ఞ జారీ అయ్యింది. పాప పశ్చాత్తాపం లేని పట్టణం దేవుని తీర్పులనుంచి తప్పించుకోటం ఎంతమాత్రం సాధ్యంకాదు. ప్రజల్ని ప్రభువిలా హెచ్చరించాడు, “కల్దీయులు నిశ్చయముగా మియొద్దనుండి వెళ్లుదురనుకొని మిమ్మును మీరు మోస పుచ్చుకొనకుడి; వారు వెళ్లనే వెళ్లరు. మితో యుద్ధము చేయు కల్దీయుల దండువారందరిని మీరు హతము చేసి వారిలో గాయపడినవారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారములలో నుండి వచ్చి యీ పట్టణమును అగ్నితో కాల్చివేయుదురు.” యిర్మీ. 37:9,10. వారు అనుకూల పరిస్థితుల్లో నేర్చుకోటానికి నిరాకరించిన పాఠాలు కష్టాలు శ్రమలు అనుభవిస్తున్న కాలంలో నేర్చుకోవాల్సి ఉంది. ఈ పరిశుద్ధ పరిశీలకుని తీర్పుకు అప్పీలు ఉండదు. PKTel 315.3
ఎవరికి దేవుని సంకల్పం స్పష్టపర్చటం జరిగిందో ఆ నీతిపరులు ఇంకా యెరూషలేములో ఉన్నారు. వారిలో కొందరు పది ఆజ్ఞల రాతిపలకలున్న మందసాన్ని కఠినుల చేతుల్లో పడకుండా నిగూఢంగా దాచి ఉంచాలని కృతనిశ్చయులయ్యారు. అలాగే చేశారు. దుఃఖిస్తూ విచారంగా మందసాన్ని ఓ అజ్ఞాత గుహలో దాచారు. తమ పాపాల కారణంగా ఇశ్రాయేలు యూదా ప్రజలకు కనిపించకుండా దాన్ని దాచారు. అది ఇక వారికెన్నడూ లభించదు. ఆ పరిశుద్ధ మందసం ఇంకా నిగూఢ గుప్తంగా ఉన్నది. అది దాచబడ్డప్పటినుంచి దాన్ని ఎవరూ ముట్టలేదు. PKTel 316.1
నమ్మకమైన దైవసాక్షిగా యిర్మీయా అనేక సంవత్సరాలు ప్రజలముందు నిలబడ్డాడు. అయితే ఇప్పుడు ఆ అభాగ్య పట్టణం అన్యజనుల చేతుల్లో పడనుండగా అతడు తన కర్తవ్యం ముగిసినట్టుగా భావించి అక్కడనుంచి నిష్క్రమించటానికి ప్రయత్నించాడు. కాగా ఎవరికి యూదా ప్రజలు లొంగి ఉండాలంటూ యిర్మీయా ప్రబోధిస్తూ వచ్చాడో ఆ బబులోనీయులతో ఏకమవ్వటానికి అతడు ఆయత్తమౌతున్నాడని ఒక అబద్ద ప్రవక్త శిష్యుడు నివేదించటంతో ఆ ప్రయత్నం విఫలమయ్యింది. అది నిజం కాదని యిర్మీయా ఖండించాడు. అయినా “అధిపతులు యిర్మీయా మిద కోపపడి అతని కొట్టి తాము బందీ గృహముగా చేసియున్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతని వేయించిరి.” 15వ వచనం. PKTel 316.2
ఐగుప్తీయుల్ని ఎదుర్కోటానికి నెబుకద్నెజరు సైన్యం దక్షిణ దిశగా సాగినప్పుడు ప్రధానులు ప్రజల హృదయాల్లో చిగురించిన ఆశలు అనతికాలంలో కుప్పకూలి పోయాయి. ప్రభువన్న మాట ఇది, “ఐగుపు రాజైన ఫరో... నేను నీకు విరోధిని.” ఐగుప్తుకున్న శక్తి విరిగిపోయిన రెల్లు వంటిది. అప్పుడు నేను యెహోవానై యున్నానని ఐగుప్తీయులందరును తెలిసికొందురు. ఐగుపు ఇశ్రాయేలీయులకు రెల్లు పుల్లవంటి చేతికట్టి ఆయెను.” అంటుంది. పరిశుద్ధ లేఖనం. “బబులోను రాజుయొక్క చేతులను బలపరచి ఫరో చేతులను ఎత్తకుండ చేసి, ఐగుప్తు దేశముమీద చాపుటకై నేను నా ఖడ్గమును బబులోను రాజు చేతికియ్యగా నేను యెహోవానై యున్నానని ఐగుప్తీయులు తెలిసికొందురు.” యెహె. 29:3,6; 30:25. PKTel 316.3
యూదా ప్రధానులు ప్రజలు సహాయంకోసం వ్యర్ధంగా ఐగుపు తట్టు చూస్తుండగా సిద్కియా రాజు ఖైదులో మగ్గుతున్న యిర్మీయాను గురించి భయాందోళనలతో ఆలోచిస్తున్నాడు. అనేక దినాలైన తర్వాత రాజు అతణ్ని పిలిపించి “యెహోవాయొద్ద నుండి ఏ మాటైనను వచ్చెనా?” అని ప్రశ్నించాడు. అందుకు యిర్మీయా, “నీవు బబులోను రాజు చేతికి అప్పగించబడెదవను మాట వచ్చెననెను.” PKTel 316.4
“మరియు యిర్మీయా రాజైన సిద్కియాతో ఇట్లనెను - నేను నీకైనను నీ సేనకైనను ఈ ప్రజలకైనను ఏ పాపము చేసినందున నన్ను చెరసాలలో వేసితివి? బబులోను రాజు మి మీదికైనను ఈ దేశము మీదికైనను రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడనున్నారు? రాజా, నా యేలినవాడా, చిత్తగించి వినుము, చిత్తగించి నా మనవి నీ సన్నిధికి రానిమ్ము, నేను అక్కడ చనిపోకుండునట్లు లేఖికుడైన యోనాతాను యింటికి నన్ను మరల పంపకుము.” యిర్మీ. 37:17-20. PKTel 317.1
ఈ మేరకు “రాజైన సిద్కియా సెలవియ్యగా బంటులు బందీ గృహశాలలో యిర్మీయాను వేసి, పట్టణములో రొట్టెలున్నంతవరకు రొట్టెలు కాల్చువారి వీధిలోనుండి అనుదినము ఒక రొట్టె అతనికిచ్చుచు వచ్చిరి, ఇట్లు జరుగగా యిర్మీయా బందీ గృహశాలలో నివసించెను.” 21వ వచనం. PKTel 317.2
యిర్మీయాపై నమ్మకమున్నట్లు రాజు బాహాటంగా చూపించుకోలేదు. తనను తొలిచివేస్తున్న భయం యిర్మీయా వద్దనుంచి రహస్యంగా సమాచారం పొందటానికి అతణ్ని నడిపించినప్పటికీ, ప్రజల అసమ్మతిని తోసిపుచ్చటానికి అతడు అతడి ప్రధానులు సాహసించలేకపోయారు. ప్రవక్త తెలిపినట్లు దేవుని చిత్తానికి తన్నుతాను అప్పగించుకోటానికి సిద్కియా భయపడ్డాడు. PKTel 317.3
బబులోను పాలనకు లోబడవలసిందిగా బందీగృహశాలనుంచి హితవు పలకటం యిర్మీయా కొనసాగించాడు. ప్రతిఘటించటం మరణాన్ని ఆహ్వానించటమేనని హెచ్చరించాడు. యూదాకు దేవుడిచ్చిన వర్తమానం ఇది : “ఈ పట్టణములో నిలిచి యున్నవారు ఖడ్గముచేతనైనను క్షామము చేతనైనను తెగులుచేతనైనను చత్తురుగాని కల్దీయుల యొద్దకు బయలు వెల్లువారు బ్రదుకుదురు. దోపుడు సొమ్ము దక్కించు కొనునట్లు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రదుకుదురు.” ఈ మాటలు స్పష్టంగా సానుకూలంగా ఉన్నాయి. దేవుని నామంలో ప్రవక్త ఇలా ధైర్యంగా ప్రకటించాడు. “ఈ పట్టణము నిశ్చయముగా బబులోను రాజు దండుచేతికి అప్పగింపబడును, అతడు దాని పట్టుకొనును.” యిర్మీ. 38:1,2. PKTel 317.4
తాము ఎంచుకున్న ప్రతిఘటనా విధానానికి విరుద్దంగా లొంగుబాటును సూచిస్తూ యిర్మీయా పదేపదే పలుకుతున్న హితవుకు తీవ్రంగా ఆగ్రహించిన ప్రధానులు చివరికి రాజుముందు తమ నిరసనను వ్యక్తంచేసి, ప్రవక్తను జాతి శత్రువుగా చిత్రించి, అతడి మాటలు ప్రజల చేతుల్ని బలహీనపర్చి తమకు విఘాతం కలిగించాయని కనుక అతడు మరణించాలని డిమాండు చేశారు. PKTel 317.5
అవి తప్పుడు ఆరోపణలని రాజుకి తెలుసు. కాని దేశంలో ఉన్నత హోదా ప్రాబల్యంగలవారిని తృప్తిపర్చటానికి వారి అబద్దాల్ని నిజాలుగా నమ్ముతున్నట్లు నటించాడు. అతడిపై తమ యిష్టంవచ్చిన చర్య తీసుకోమని యిర్మీయాని వారికి అప్పగించాడు. వారు ఆ ప్రవక్తను “కారా గృహములోనున్న రాజకుమారుడు మల్కీయా గోతిలోనికి దింపిరి. అందులోనికి యిర్మీయాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లులేవు, బురద మాత్రమే యుండెను. ఆ బురదలో యిర్మీయా దిగబడెను.” 6వ వచనం. ఇలాగుండగా దేవుడు అతడికి మిత్రుల్ని లేపాడు. వారు అతడి పక్షంగా రాజును కలిసి మళ్లీ అతణ్ని బందీగృహశాలకు మార్పించారు. PKTel 318.1
రాజు మరోసారి యిర్మీయాని రహస్యంగా పిలిపించుకుని యెరూషలేము విషయంలో దేవుని సంకల్పం ఏంటో వివరించమని కోరాడు. ప్రతిస్పందిస్తూ యిర్మీయా ఇలా అన్నాడు, నేను ఆ సంగతి నీకు తెలియజెప్పిన యెడల నిశ్చయముగా నీవు నాకు మరణ శిక్ష విధింతువు, నేను నీకు ఆలోచన చెప్పినను. నీవు నా మాట వినవు.” ప్రవక్తతో రాజు రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాడు. “జీవాత్మను మనకను గ్రహించు యెహోవా తోడు నేను నీకు మరణము విధింపను, నీ ప్రాణము తీయజూచుచున్న యీ మనుష్యుల చేతికి నిన్ను అప్పగింపను.” 15, 16 వచనాలు. PKTel 318.2
యెహోవా హెచ్చరికల్ని ఆచరించేందుకు సంసిద్ధతను కనపర్చటానికి, పట్టణం మీద జాతిమీద ఇప్పుడు సయితం పడుతున్న తీర్పుల్ని దయతో మిళితం చెయ్యటానికి ఇంకా అవకాశం ఉంది. రాజుకిచ్చిన వర్తమానం ఇది : “నీవు బబులోను రాజు అధిపతుల యొద్దకు వెళ్లినయెడల నీవు బ్రదికెదవు, ఈ పట్టణము అగ్నిచేత కాల్చబడదు. నీవును నీ యింటివారును బ్రదుకుదురు. అయితే నీవు బబులోను అధిపతుల యొద్దకు వెళ్లనియెడల ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడును, వారు అగ్నిచేత దాని కాల్చివేసెదరు, మరియు నీవు వారి చేతిలోనుండి తప్పించుకొనజాలవు.” PKTel 318.3
రాజు ఈ సమాధానం ఇచ్చాడు, “కల్దీయుల పక్షముగా ఉండు యూదులకు భయపడుచున్నాను. ఒకవేళ కల్దీయులు నన్ను వారి చేతికి అప్పగించినయెడల వారు నన్ను అపహసించెదరు.” “వారు నిన్ను అప్పగింపరు” అని ప్రవక్త వాగ్దానం చేశాడు. అతడు ఇంకా ఇలా విజ్ఞాపన చేశాడు, “నీవు బ్రదికి బాగుగానుండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతినిగూర్చి యెహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించుము.” 17-20 వచనాలు. PKTel 318.4
న్యాయమైన తన ధర్మవిధుల్ని ఆచరించటానికి ఎంపిక చేసుకునే వారిపట్ల దయ చూపించటానికి చివరి గడియవరకూ సంసిద్ధంగా ఉంటానని దేవుడు ఇలా స్పష్టం చేస్తున్నాడు. రాజు లోబడటానికి ఎంపిక చేసుకుని ఉంటే, ప్రజలు ప్రాణాలు కోల్పోయే వారుకారు. పట్టణం దగ్ధమయ్యేదికాదు. తాను తిరిగి రాలేనంత దూరం వెళ్లిపోయానని రాజు భావించాడు. యూదులికి భయపడ్డాడు. ఎగతాళికి భయపడ్డాడు. తన ప్రాణానికి భయపడ్డాడు. సంవత్సరాలకొద్దీ దేవునిపై తిరుగుబాటుచేసిన సిద్కియా ఇప్పుడు యిర్మీయా ప్రవక్తద్వారా వచ్చిన దేవుని మాటను అంగీకరిస్తున్నానని ప్రజలకు చెప్పటం భరించలేని పరాభవమని తలపోశాడు. ఈ హెచ్చరికలన్నీ ఉండగా నేను శత్రువుతో పోరాటానికి సాహసించలేను అనుకున్నాడు. PKTel 319.1
తనను తన ప్రజల్ని రక్షించుకోవలసిందిగా యిర్మీయా కన్నీటితో సిద్కియాను బతిమాలాడు. దేవుని ఉపదేశాన్ని ఆచరిస్తే తప్పా ప్రాణం దక్కించుకోలేవని, తనకున్న సమస్తం బబులోనీయుల పరమౌతుందని తీవ్ర మనస్తాపంతో యిర్మీయా చెప్పాడు. అయితే రాజు తప్పుదారిని ఎన్నుకున్నాడు. వెనక్కు మళ్లటానికి ఇష్టపడలేదు. అబద్ద ప్రవక్తల సలహాల్ని, తాను నిజంగా తృణీకరించిన వారి సలహాల్ని, తమ కోర్కెలు తీర్చటానికి అంత వేగంగా మెత్తబడే తన బలహీనతను ఎద్దేవా చేసినవారి సలహాల్ని, పాటించటానికి నిశ్చయించుకున్నాడు. పరిణతిగల వ్యక్తిగా తన స్వతంత్రతను త్యాగం చేసి ప్రజాభిప్రాయానికి బానిస అయ్యాడు. చెడు చెయ్యటానికి అతడికి నిశ్చితమైన ఉద్దేశం లేదు. అలాగని నిజానికి నిలబడే ధృఢ చిత్తమూ లేదు. ధైర్యమూలేదు. యిర్మీయా ఇచ్చిన సలహా విలువైందని నమ్మినా దాన్ని ఆచరించటానికి నైతిక శక్తి లోపించింది. పర్యవసానంగా అతడు క్రమక్రమంగా తప్పుడు దిశగా సాగాడు. PKTel 319.2
యిర్మీయాతో తన సమావేశం సంగతి తన ఆస్థానంలోని వారికి ప్రజలకు తెలియటం ఇష్టంలేనంత బలహీనుడు సిద్కియా. అతణ్ని మానవుడి భయం అంతగా అదుపు చేసింది. సిద్కియా ధైర్యంగా నిలబడి ప్రవక్త మాటల్ని నమ్ముతున్నానని ప్రకటించిఉంటే ఎంత నాశనం జననష్టం తప్పి ఉండేది! నేను ప్రబువు మాట వింటాను అని పట్టణం సర్వనాశనం కాకుండా కాపాడి ఉండాల్సింది. మనుషులికి భయపడో లేక వారి ప్రాపకం కోరో నేను దేవుని ఆజ్ఞల్ని నిర్లక్ష్యం చెయ్యలేను అనాల్సింది. నేను సత్యాన్ని ప్రేమిస్తున్నాను, పాపాన్ని ద్వేషిస్తున్నాను. ఆరు నూరైనా నేను సర్వశక్తిగల ఇశ్రాయేలు దేవుని ఉపదేశాన్ని అనుసరిస్తాను అని చెప్పాల్సింది. PKTel 319.3
అప్పుడు అతడి ధైర్యగుణాన్ని ప్రజలుగౌరవించేవారు. విశ్వాసం అవిశ్వాసం మధ్య ఊగిసలాడ్తున్న వారు న్యాయపక్షంగా స్థిరంగా నిలబడలేరు. ఈ మార్గంలోని నిర్భయం, న్యాయాలే తాను పాలించే ప్రజల అభిమానాన్ని విశ్వసనీయతను పొందగలిగేవి. అతడికి విస్తారమైన మద్దతు లభించేది. యూదాకు కరవు దహనకాండ మారణహోమంవల్ల కలిగిన అపార దుఃఖ వేదన తప్పేది. PKTel 320.1
సిద్కియా బలహీనత ఓ పాపం. దానికి అతడు భయంకర మూల్యం చెల్లించాడు. శత్రు సేనలు అడ్డూ ఆపూలేని హిమ ప్రవాహంలా పట్టణంపై పడి ధ్వసం చేశాయి. హెబ్రీ సేనల్ని వెనక్కి తరిమి కొట్టాయి. జాతి పరాజయం పాలై పరాధీనమయ్యింది. సిద్కియాని కల్దీయులు ఖైదీగా పట్టుకున్నారు. సిద్కియా కుమారుల్ని అతడి కళ్లముందే సంహరించారు. రాజుని బానిసగా తీసుకుపోయారు. అతడి కళ్లను తోడేశారు. బబులోనుకి చేరిన కొద్దికాలానికి అతడు అతి దీన పరిస్థితిలో మరణించాడు. నాలుగు శతాబ్దాలకు పైగా సీయోను పర్వతానికి మకుటంగా భాసిల్లిన సుందర దేవాలయాన్ని కల్దీయులు నాశనం చేశారు. “కల్దీయులు దేవుని మందిరమును తగుగలబెట్టి, యెరూషలేము ప్రాకారమును పడగొట్టి, దానియొక్క నగరులన్నిటిని కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా పాడుచేసిరి.” 2 దినవృ. 36:19. PKTel 320.2
నెబుకద్నెజరు యెరూషలేమును చివరగా నాశనం చేస్తున్న సమయంలో ఆ సుదీర్ఘ ముట్టడికి సంబంధించిన బీభత్సాల్ని తప్పించుకున్న అనేకులు ఖడ్గం వేటుకి నేలకూలారు. ఇంకా మిగిలిన కొందరిలో ప్రముఖులు ప్రధాన యాజకుడు, ఆ రాజ్యాధికారులు, ప్రధానులు. వారిని బబులోనుకి తీసుకువెళ్లి దేశద్రోహులుగా పరిగణించి హతమార్చారు. ఇతరుల్ని బానిసలుగా తీసుకువెళ్లారు. “రాజ్యము పారసీకుల దగువరకు వారు అక్కడే ఉండి అతనికి అతని కుమారులకు దాసులై... యిర్మీయా ద్వారా పలుకబడిన యోహోవా మాట” నెరవేర్చారు. 20,21 వచనాలు. PKTel 320.3
ఇక యిర్మీయా మాటకొస్తే ఆ దాఖలాలో ఇలా ఉంది : “మరియు యిర్మీయాను గూర్చి బబులోను రాజైన నెబుకద్నెజరు రాజ దేహ రక్షకులకు అధిపతియగు నెబూజరదానునకు ఈ ఆజ్ఞ ఇచ్చెను - నీవు ఇతనికి హాని చేయక దగ్గర నుంచుకొని పరామర్శించి, ఇతడు నీతో చెప్పునట్లు చేయవలెను.” యిర్మీ. 39:11,12. PKTel 320.4
బబులోనీయ అధికారులు యిర్మీయాను చెరసాలనుంచి విడుదల చేశారు. యిర్మీయా శేషించిన కొందరు బలహీనులతో నివసించాలని నిశ్చయించుకున్నాడు. వారు “దేశంలో పేదల్లో కొందరు.” “ద్రాక్షాతోటల కావలివారిగా, వ్యవసాయకులుగా” పనిచేసేందుకు బబులోనీయులు వారిని విడిచివెళ్లారు. వారిపై అధికారిగా గెదల్యాను బబులోనీయులు నియమించారు. కొన్ని మాసాలు గడిచీ గడవకముందే నూతనంగా ఏర్పాటైన అధికారి హత్యకు గురి అయ్యాడు. ఆ పేద ప్రజలు అనేక శ్రమలను భరించిన తర్వాత ఐగుపులో ఆశ్రయం పొందటానికి తమ నాయకులు వారిని ఒప్పించారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ యిర్మీయా మళ్లీ గళమెత్తాడు. “ఐగుపుకి వెళ్లవద్దు” అంటూ విజ్ఞాపన చేశాడు. ఆత్మ ప్రేరణవల్ల వచ్చిన ఆ హితవును వారు లెక్కచెయ్యలేదు. “యూదుల శేషమును... పురుషులను స్త్రీలను పిల్లలను రాజకుమార్తెలను” తీసుకుని ఐగుప్తుకి పారిపోయారు. వారు “యెహోవామాట విననివారై... తహపవేసుకు” వచ్చారు. యిర్మీ. 43:5-7. PKTel 320.5
ఐగుప్తుకు పారిపోటంద్వారా నెబుకద్నెజరు పై తిరుగుబాటు చేసిన శేషించిన యూదా ప్రజలకు నాశనం సూచిస్తూ యిర్మీయా ప్రకటించిన ప్రవచనాలు, తమ పొరపాటుకి పశ్చాత్తాపపడి తిరిగి రావటానికి సిద్దంగా ఉన్నవారికి క్షమాపణ వాగ్దానాలతో సమ్మిళితమై ఉన్నాయి. తన ఉపదేశాన్ని ఖాతరు చెయ్యకుండా మోసకరమైన ఐగుప్తు విగ్రహారాధనకు ఆకర్షితులైనవారిని ప్రభువు ఉపేక్షించడు గాని నమ్మకంగాను నిజాయితీగాను నీలిచినవారిపట్ల ఆయన దయ చూపిస్తాడు. ఆయన ఇలా ప్రకటించాడు, “ఖడ్గము తప్పించుకొనువారు కొద్దిమందియై ఐగుప్తు దేశములోనుండి యూదా దేశమునకు తిరిగి వచ్చెదరు. అప్పుడు ఐగుప్తు దేశములో కాపురముండుటకు వెళ్లిన యూదావారిలో శేషము ఎవరి మాట నిలకడగా నుండునో నాదో, తనదో అది తెలిసి కొందురు.” యిర్మీ. 44:28. PKTel 321.1
లోకానికి ఆధ్మాత్మిక వెలుగు కావలసినవారి వక్రబుద్ధివల్ల ప్రవక్తకు కలిగిన దుఃఖం, సీయోను నాశనం విషయంలోను బబులోనుకి బానిసలుగా కొనిపోబడ్డ ప్రజల విషయంలోను దుఃఖం, అతడు రాసి మనకు విడిచివెళ్లిన విలాప వాక్యాల్లో వ్యక్తమౌతుంది. యెహోవా ఉపదేశం పక్కన పెట్టే మానవజ్ఞానంపై దృష్టి పెట్టటంలోని అవివేకానికి అది స్మృతి చిహ్నంగా ఉంది. విధ్వంసం శిధిలాల నడుమ యిర్మీయా ఇంకా ఇలా అనగలిగాడు, “ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము.” అతడి నిరంతర ప్రార్ధన: “మన మార్గములను పరిశోధించి తెలిసికొని మనము యెహోవా తట్టు తిరుగుదుము.” విలాప. 3:22,40. జాతుల్లో యూదా ఇంకా ఓ రాజ్యంగా ఉన్నప్పుడే దేవుణ్ని ఇలా ప్రశ్నించాడు, “నీవు యూదాను బొత్తిగా విసర్జించి తివా? సీయోను నీకు అసహ్యమాయెనా?” అంతట అతడు ధైర్యం తెచ్చుకుని ఇలా విజ్ఞాపన చేశాడు, “నీ నామమును బట్టి మమ్మును త్రోసివేయకుము.” యిర్మీ. 14:19,21. గందరగోళంలోనుంచి క్రమం తేవటానికి, తన న్యాయగుణాన్నీ వాత్సల్యాన్నీ భూ ప్రజలకూ సర్వ విశ్వానికీ ప్రదర్శించటానికి దేవుని సంకల్పంపై ప్రవక్తకు సంపూర్ణ అచంచల విశ్వాసం ఉంది. దుష్టత్వంనుంచి నీతివర్తనకు మారగల మనుషుల పక్షంగా ఇప్పుడు ధీమాగా విజ్ఞాపన చెయ్యటానికి అది అతణ్ని నడిపించింది. PKTel 321.2
అయితే సీయోను ఇప్పుడు పూర్తిగా నాశనమయ్యింది. దైవ ప్రజలు దాస్య శృంఖలాల్లో మగ్గుతున్నారు. పుట్టెడు దుఃఖంతో అతడు ఇలా వాపోయాడు : “జన భరితమైన పట్టణము ఎట్లు ఏకాకియై దుఃఖాక్రాంతమాయెను? అది విధవరాలి వంటి దాయెను. అన్యజనులలో ఘనతకెక్కినది సంస్థానములలో రాచకుమార్తె యైనది ఎట్లు పన్ను చెల్లించునదై పోయెను! రాత్రియందు అది బహుగా ఏడ్చుచున్నది కన్నీరు దాని చెంపలమీద కారుచున్నది. దాని విటకాండ్రందరిలో దానినోదార్చువాడొకడును లేడు. దాని చెలికాండ్రందరు దాని మోసపుచ్చిరి. వారు దానికి శత్రువులైరి. PKTel 322.1
“యూదా బాధనొంది దాసురాలై చెరలోనికి పోయియున్నది. అన్యజనులలో నివసించుచున్నది. విశ్రాంతి నొందకపోయెను. దాని తరము వారందరు ఇరుకుచోట దాని కలిసికొందురు. నియామక కూటములకు ఎవరును రారు గనుక సీయోను మార్గములు ప్రలాపించుచున్నవి. పట్టణపు గుమ్మములన్నియు పాడైపోయెను. యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు. దాని కన్యకలు దుః ఖాక్రాంతులైరి. అదియు వ్యాకుల భరితురాలాయెను. దాని విరోధులు అధికారులైరి. దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు. దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొనిపోయిరి.” PKTel 322.2
“ప్రభువు కోపపడి సీయోను కుమార్తెను మేఘముతో కప్పియున్నాడు. ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశమునుండి భూమిమీదికి పడవేసెను. కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసికొనకపోయెను. ఒకటియు విడువక ప్రభువు యాకోబు నివాస స్థలములన్నిటిని నాశనము చేసియున్నాడు. మహోగ్రుడై యూదా కుమార్తె కోటలను పడగొట్టి యున్నాడు. వాటిని నేలకు కూల్చివేసి యున్నాడు. ఆ రాజ్యమును దాని యధిపతులను ఆయన అపవిత్రపరచియున్నాడు. కోపావేశుడై ఇశ్రాయేలీయులకున్న ప్రతి శృంగమును ఆయన విరుగగొట్టియున్నాడు. శత్రువులుండగా తన కుడి చెయ్యి ఆయన వెనుకకు తీసియున్నాడు. నఖముఖాల దహించు అగ్నిజ్వాలలు కాల్చునట్లు ఆయన యాకోబును కాల్చివేసియున్నాడు. శత్రువువలె ఆయన విల్లెక్కుపెట్టి విరోధివలె కుడి చెయ్యి చాపియున్నాడు. కంటికి అందమైన వస్తువులన్నిటిని నాశనము చేసియున్నాడు. అగ్నికురియునట్లుగా ఆయన తన ఉగ్రతను సీయోను కుమార్తె గుడారములమీద కుమ్మరించి యున్నాడు.” PKTel 322.3
“యెరూషలేము కుమారీ, ఎట్టి మాటలచేత నిన్ను హెచ్చరించుదును? దేనితో నిన్ను సాటిచేయుదును. సీయోను కుమారీ, కన్యకా, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది. నిన్ను స్వస్థపరచ గలవాడెవడు?” PKTel 323.1
“యెహోవా, మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసికొనుము. దృష్టించి మామీదికి వచ్చిన నింద యెట్టిదో చూడుము. మా స్వాస్థ్యము పరదేశుల వశమాయెను. మా యిండ్లు అన్యుల స్వాధీనమాయెను. మేము దిక్కులేనివారము తండ్రిలేని వారము మా తల్లులు విధవరాండ్రయిరి.... మా తండ్రులు పాపముచేసి గతించిపోయిరి. మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. దాసులు మాకు ప్రభువులైరి. వారి వశము నుండి మమ్మును విడిపింపగల వాడెవడును లేడు.... దీనివలన మాకు ధైర్యము చెడియున్నది... మా కన్నులు దీనిచూచి మందగిల్లెను.” PKTel 323.2
“యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవై యుందువు. నీ సింహాసనము తరతరము లుండును. నీవు మమ్ము నెల్లప్పుడును మరచిపోవుట ఏల? యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన యెడల మేము తిరిగెదము.” విలా. 1:1-5; 2:1-4,13; 5:1-3,7,8,17,19-21. PKTel 323.3