Go to full page →

41 - మండుతున్న అగ్నిగుండం PKTel 350

లోకాంతం వరకు చోటుచేసుకోనున్న ఘటనల్ని నెబుకద్నెజరు దృష్టికి తెచ్చిన బ్రహ్మాండమైన ప్రతిమ దర్శనం అతడికి ఇవ్వటం ఎందుకు జరిగిందంటే, లోక చరిత్రలో తాను నిర్వహించాల్సిన పాత్రను తన రాజ్యానికి దేవుని రాజ్యంతో ఉండాల్సిన సంబంధాన్ని నెబుకద్నెజరు అవగాహన చేసుకునేందుకే. ఆ కల భావ వివరణలో దేవుని నిత్య రాజ్య స్థాపనను గూర్చి స్పష్టంగా ఉపదేశించటం జరిగింది. దానియేలు ఇలా అన్నాడు, “ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయునుగాని అది యుగయుగముల వరకు నిలుచును.... కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది.” దాని. 2:44,45. PKTel 350.1

రాజు దేవుని అధికారాన్ని గుర్తించాడు. అతడు దానియేలుతో “నీ దేవుడు దేవతలకు దేవుడును... మర్మములు బయలుపరచువాడునై యున్నాడు.” అన్నాడు. 47వ వచనం. తర్వాత కొంతకాలం నెబుకద్నెజరు దేవునికి భయపడి నివసించాడు. అయినా ఆతడి హృదయాన్ని లోకాశలు ఆత్మగౌరవం ప్రభావితం చేశాయి. తన పరిపాలనలో చోటుచేసుకున్న ప్రగతి అతణ్ని గర్వంతో నింపింది. కొంతకాలానికి దేవుణ్ని ఘనపర్చటం మానేశాడు. విగ్రహారాధనను తిరిగి మొదలు పెట్టి రెట్టింపు ఉత్సాహంతో మూఢభక్తితో విగ్రహానికి పూజలు చేశాడు. PKTel 350.2

“తామే ఆ బంగారు శిరస్సు” (38వ వచనం) అన్న మాటలు రాజు మనసులో నాటుకుపోయాయి. అతడు విగ్రహారాధనకు తిరిగి వెళ్లటాన్ని ఆసరా చేసుకుని, తాను కలలో చూసిన ప్రతిమలాంటి ప్రతిమను నిర్మించి తన రాజ్యాన్ని సూచిస్తున్నట్లుగా అర్థంచెప్పిన ఆ బంగారు శిరస్సును అందరూ చూడగల స్థలంలో ఆ ప్రతిమను నిలపాల్సిందిగా రాజుకి ఆ రాజ్యంలోని జ్ఞానులు ప్రతిపాదించారు. PKTel 350.3

ఆ సలహా రాజుకి ఎంతో నచ్చింది. దాన్ని ఆచరణలో పెట్టాలని తీర్మానించు కున్నాడు. అంతేకాదు దాన్ని మించి ఇంకా ముందుకి పోవాలనుకున్నాడు. కలలో తాను చూసిన ప్రతిమను ఉన్నదున్నట్టుగా తిరిగి రూపొందించే బదులు ఇంకా ఎక్కువ చెయ్యాలని నిర్ధారించుకున్నాడు. తను నిర్మించదలచిన ప్రతిమ విలువ విషయంలో తలనుంచి పాదాలవరకు ఏమి తగ్గకూడదనుకున్నాడు. అది పూర్తిగా బంగారుతోనే నిర్మితమవ్వాలనుకున్నాడు. నాశనం కాకుండా సర్వోన్నత అధికారంకలిగి తక్కిన రాజ్యాల్ని తుత్తునియలు చేస్తూ నిరంతరం కొనసాగే రాజ్యమని బబులోను అంతటా చాటటానికి అది ఒక చిహ్నంగా నిలవాలని ఉద్దేశించాడు. PKTel 351.1

నిత్యం కొనసాగే సామ్రాజ్య స్థాపన వంశస్థాపన అన్న ఆలోచన, ఎవరిధాటికి లోక రాజ్యాలు నిలువలేవో ఆ మహారాజైన నెబుకద్నెజరుకి ఎంతో నచ్చింది. అత్యాశతో స్వార్థంనుంచి పుట్టుకొచ్చిన ఉత్సాహంతో ఈ కార్యాచరణపై సలహాలకు తన జ్ఞానులతో సమావేశమయ్యాడు. ఈ బ్రహ్మాండమైన ప్రతిమను గూర్చిన కలకు సంబంధించిన అద్భుత విషయాల్ని మర్చిపోయి; ఇశ్రాయేలు దేవుడు తన సేవకుడు దానియేలుద్వారా ఆ ప్రతిమ ప్రాముఖ్యాన్ని విశదపర్చిన సంగతిని కూడా విస్మరించి; దాని భావాన్ని వివరించటం సందర్భంగా ఆ దేశంలోని జ్ఞానులు అవమానకరమైన మరణంనుంచి రక్షించబడటాన్ని విస్మరించి; తమ అధికారాన్ని ఆధిపత్యాన్ని స్థిరపర్చుకోవాలన్న యావ తప్ప తక్కినదంతా మర్చిపోయి, బబులోనును సర్వోన్నత దేశంగా హెచ్చించాలని, ఇతర దేశాలు దానికి విధేయత చూపాలని రాజు అతడి సలహాదారులు కృతనిశ్చయులయ్యారు. PKTel 351.2

ఏ చిహ్నంద్వారా లోక రాజ్యాల విషయంలో తన సంకల్పాన్ని రాజుకి ప్రజలికి వెల్లడి చెయ్యాలని దేవుడు ఉద్దేశించాడో అది ఇప్పుడు మానవుణ్ని మహిమ పర్చటానికి వినియోగం కానున్నది. కలకు దానియేలు చెప్పిన భావాన్ని తోసిపుచ్చారు, విస్మరించారు. సత్యానికి తప్పుడు అర్థం చెప్పి దాన్ని దుర్వినియోగం చేయనున్నారు. ప్రాముఖ్యమైన భావి సంఘటనల్ని మానవ మనుసులికి వెల్లడి చెయ్యటానికి దేవుడు రూపుదిద్దిన చిహ్నాన్ని, లోకానికి అందించాలని దేవుడు ఉద్దేశించిన జ్ఞానాన్ని విస్తరించకుండా అడ్డుకోటానికి ఉపయోగించనున్నారు. ఇలా దురాశాపరులైన మనుషుల కుతంత్రాల ద్వారా మానవాళి నిమిత్తం దేవుని సంకల్పానికి గండి కొట్టటానికి సాతాను ప్రయత్నిస్తున్నాడు. అసత్యంతో మిళితంకాని సత్యం రక్షించే మహత్తరశక్తి అని; అయితే అది అత్మోన్నతికి వినియుక్తమై మానవ పథకాలికి దోహదపడినప్పుడు అది ప్రబల దుష్టశక్తిగా రూపొందుతుందని అపవాదికి తెలుసు. PKTel 351.3

విస్తారమైన తన ధనాగారంలోని ధనాన్నుపయోగించి నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమను చేయించాడు. అది తాను కలలో చూసిన ప్రతిమలాగే ఉన్నది సామాన్య పోలికల్లో ఒక్క విషయంలోనే అది తేడాగా ఉంది. దాన్ని తయారు చేసిన లోహంలో ఉంది ఆ తేడా. తమ అన్యదేవతల విగ్రహాల్ని ఆడంబరంగా రూపొందించటానికి అలవాటుపడ్డ కల్దీయులు ఇంత వైభవోపేతం బ్రహ్మాండం ఉజ్వలం అయిన విగ్రహాన్ని ఇంతకు ముందెప్పుడూ నిర్మించలేదు. అది అరవై మూరల ఎత్తు ఆరు మూరల వెడల్పుగల విగ్రహం. విగ్రహారాధనకు సార్వత్రిక వ్యాప్తిగల దేశంలో, బబులోను ప్రాభవ ప్రాశస్త్యాల్ని, అధికారాన్ని సూచిస్తూ దూరా మైదానంలో నిలిపిన సుందరమైన విలువైన విగ్రహం ఆరాధ్య వస్తువుగా ప్రతిష్ఠితం కావటంలో ఆశ్చర్యం లేదు. ఆరాధనకు ఏర్పాట్లు జరిగాయి. విగ్రహ ప్రతిష్ఠ జరిగే రోజు ప్రజలందరూ ప్రతిమకు నమస్కరించటంద్వారా బబులోను అధికారం పట్ల తమ అత్యున్నత ప్రభుభక్తిని చాటుకోవాలని ఒక ఆజ్ఞ జారీ అయ్యింది.. PKTel 352.1

నిర్ణీత దినం వచ్చింది. సకల “జనులును దేశస్థులును ఆయా భాషలు మాట్లాడు వారును” దూరా మైదానంలో సమావేశమయ్యారు. రాజు ఆజ్ఞమేరకు సంగీతం వినిపించగానే ప్రజలందరు సాగిలపడి “బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి.” ఆ చరిత్రాత్మక దినాన చీకటి శక్తులు విజయం సాధిస్తున్నట్లు కనిపించింది. ఆ దేశంలో జాతీయ మతంగా స్థిరపడిన విగ్రహారాధన రూపాలతో ఈ బంగారు ప్రతిమ ఆరాధన శాశ్వతంగా అనుసంధానమవ్వటానికి అంతా సిద్ధంగా ఉంది. బందీలుగా బబులోనులో ఉన్న ఇశ్రాయేలు యువకుల్ని సకల అన్యజాతుల ప్రజలకు దీవెనగా చేయటమన్న దైవ సంకల్పాన్ని ఇలా నిష్పలం చెయ్యాలని సాతాను నిరీక్షించాడు. PKTel 352.2

అయితే దేవుని ఆజ్ఞ దీనికి విరుద్ధంగా ఉంది. మానవాధికారానికి విగ్రహారాధక చిహ్నమైన ప్రతిమకు అందరూ నమస్కరించలేదు. ఆ ప్రతిమకు నమస్కరిస్తున్న జన సమూహాల మధ్య ముగ్గురు మనుష్యులున్నారు. వారు పరలోకమందున్న దేవున్ని ఆవిధంగా అగౌరవ పర్చకూడదని ధృఢంగా నిశ్చయించుకున్నారు. వారి దేవుడు రాజులకు రాజు దేవుళ్లకు దేవుడు. వారు ఇతర దేవుళ్లకు నమస్కరించరు. . PKTel 352.3

విజయాతిశయంతో నిండిన నెబుకద్నెజరుకు తన ఆజ్ఞను బేఖాతరు చేసిన వ్యక్తులు కొందరున్నారన్న వార్తను అందించటం జరిగింది. యధార్థవంతులైన దానియేలు మిత్రులికి దక్కిన గౌరవాభిమానాలు చూసి ఓర్చుకోలేని కొందరు జ్ఞానులు వీరు రాజు ఆజ్ఞను ఉల్లంఘించటాన్ని గురించి ఇప్పుడు రాజుకి ఫిర్యాదు చేశారు. వారు రాజుకి ఇలా నివేదించారు, “రాజు చిరకాలము జీవించునుగాక.... రాజా, తాము షద్రకు, మేషాకు, అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాచకార్యములు విచారించుటకు నియమించితిరి; ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు. తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు.” PKTel 352.4

వారిని తనముందు నిలబెట్టమని రాజు ఆజ్ఞాపించాడు. “మీరు నా దేవతను పూజించుటలేదనియు, నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది అది నిజమా?” అని ప్రశ్నించాడు. వారిని భయపెట్టి జనసమూహాల్లో ఏకమై ప్రతిమకు మొక్కేటట్లు చెయ్యటానికి రాజు ప్రయత్నించాడు. మండుతున్న అగ్నిగుండం తట్టు చూపిస్తూ తాము తన ఆజ్ఞను ఉల్లంఘించటం కొనసాగిస్తే వారికి వేచియున్న శిక్షను గురించి వారికి గుర్తు చేశాడు. అయినా ఆ హెబ్రీ యువకులు దేవునిపట్ల తమ అచంచల విశ్వాసాన్ని భక్తిని ప్రకటించారు. తమను రక్షించటానికి తమ దేవుడు శక్తిమంతుడన్న విశ్వాసాన్ని ప్రకటించారు. ప్రతిమముందు వంగటం దాన్ని పూజించటమేనన్నది అందరికీ ఉన్న అవగాహన. అలాంటి నివాళి దేవునికి మాత్రమే చెల్లించాలి అన్నది ఆ యువకుల భావన. PKTel 353.1

ఆ ముగ్గురు హెబ్రీ యువకులు రాజు ముందు నిలబడి ఉండగా తన రాజ్యంలోని ఇతర జ్ఞానులికి లేనిది వీరికున్నదని రాజు గుర్తించాడు. తమకిచ్చిన ప్రతీ విధిని వీరు నమ్మకంగా నిర్వర్తించారు. వారికి ఇంకొక అవకాశం ఇవ్వాలని రాజు భావించాడు. అందరితో కలిసి వారు ప్రతిమకు నమస్కరించటానికి సమ్మతిస్తే వారికి అంతా మంచే జరుగుతుంది. అయితే “మీరు నమస్కరింపనియెడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్ని గుండములో మీరు వేయబడుదురు.” అన్నాడు రాజు. ఆ మీదట ధిక్కార స్వభావంతో చెయ్యి పైకెత్తి, “నా చేతిలోనుండి మిమ్మును విడిపించగల దేవుడెక్కడ నున్నాడు?” అని ప్రశ్నించాడు. PKTel 353.2

రాజు బెదిరింపులు వ్యర్థమయ్యాయి. వారి భక్తిని విశ్వపాలకుడైన దేవునిమిద నుంచి రాజు మరల్చలేకపోయాడు. దేవునికి అవిధేయులవటంవల్ల తమకు అగౌరవం, ఉత్పాతం, మరణం సంప్రాప్త మౌతాయని ప్రభువుపట్ల భయభక్తులు జ్ఞానానికి మూలమని, అదే వాస్తవమైన ప్రగతికి పునాది అని వీరు తమ పితరుల చరిత్రనుంచి నేర్చుకున్నారు. అగ్నిగుండానికి ఎదురుగా నిశ్చలంగా ప్రశాంతంగా నిలబడి వారిలా అన్నారు, “నెబుకద్నెజరూ, యిందును గురించి నీకు ప్రత్యుత్తర మియ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండములోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలిసికొనుము.” PKTel 353.3

రాజు ఆగ్రహానికి అవధులు లేవు. “అత్యాగ్రహము”తో “షద్రకు, మేషాకు, అబేద్నెగో అనువారి విషయములో ఆయన ముఖము వికారమాయెను.” వీరు చెరలో ఉన్న, తృణీకారానికి గురిఅయిన జాతి ప్రతినిధులు. అగ్నిగుండం వేడిని ఏడురెట్లు పెంచాల్సిందిగా ఆజ్ఞాపించి, ఇశ్రాయేలు దేవుణ్ని సేవించేవారిని మరణానికి సిద్ధపర్చుతూ బంధించమని తన సైన్యంలోని బలాఢ్యుల్ని రాజు ఆదేశించాడు. PKTel 354.1

“వారు వారి అంగీలను నిలువుటంగీలను పైవస్త్రములను తక్కిన వస్త్రములను తియ్యకయే యున్నపాటున ముగ్గురిని వేడిమిగలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమిగలదైనందునను షద్రకు మేషాకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలలచేత కాల్చబడి చనిపోయిరి.” PKTel 354.2

కాగా ప్రభువు తనవారిని మర్చిపోలేదు. తన భక్తుల్ని అగ్నిగుండంలో పడవేసినప్పుడు రక్షకుడు వ్యక్తిగతంగా వారికి తన్నుతాను ప్రత్యక్ష పర్చుకున్నాడు. వారు ఆయనతో కలిసి అగ్ని నడిమధ్యన నడిచారు. ప్రభువు సముఖంలో మంటలు దహించే శక్తిని కోల్పోయాయి. PKTel 354.3

రాజు తన సింహాసనంనుంచి చూస్తున్నాడు. తనను ధిక్కరించిన మనుషులు మాడిమసి అయిపోతారని కనిపెడ్తున్నాడు. తన విజయాన్ని గూర్చిన మనోభావాలు అకస్మాత్తుగా మారిపోయాయి. అతడికి సమీపంలో నిలిచిఉన్న ప్రధానులు రాజు ఉలిక్కిపడి మండుతున్న మంటల్లోకి దీక్షగా చూస్తుండగా అతడి ముఖం తెల్లబోవటం గమనించారు. ఆందోళనతో తన మంత్రుల పక్కకు తిరిగి, “మేము ముగ్గురు మనుష్యులను బంధించి యీ అగ్నిలో వేసితిమి గదా?... నేను నలుగురు మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని యేమియు కలుగలేదు; నాల్గవవాని రూపము దేవతల (దేవుని కుమారుని) రూపమును బోలియున్నది” అన్నాడు. PKTel 354.4

దేవుని కుమారుడు ఎలాగుంటాడో అన్యుడైన ఆ రాజుకి ఎలా తెలిసింది? బబులోనులో బాధ్యతలుగల హోదాలో ఉన్న హెబ్రీ బానిసలు తమ జీవనంలోను నడవడిలోను అతడి ముందు సత్యాన్ని కనపర్చారు. తమ విశ్వాసానికి హేతువు అడిగి నప్పుడు వారు వెనకాడకుండా దాన్ని ఇచ్చారు. వారు నీతి సూత్రాల్ని స్పష్టంగా సామాన్యంగా సమర్పించటంద్వారా తమ చుట్టూ ఉన్నవారికి తాము సేవించే దేవున్ని గురించి బోధించారు. రానున్న విమోచకుడయిన క్రీస్తును గురించి బోధించారు. అగ్ని గుండంలోని నాల్గోవ్యక్తి రూపంలో రాజు దేవుని కుమారుణ్ని గుర్తించాడు. PKTel 354.5

ఇప్పుడు తన ఔన్నత్యాన్ని ఘనతను విస్మరించి నెబుకద్నెజరు తన సింహాసనం దిగి అగ్నిగుండం వద్దకు వెళ్లి, “మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండి” అని పిలిచాడు. PKTel 355.1

అప్పుడు షద్రకు మేషాకు అబేద్నెగోలు ఆ మహా జనసమూహం ముందుకి వచ్చారు. వారికి ఎలాంటి హానీ కలుగలేదు. తమ రక్షకుడి సన్నిధి ఏ హానీ కలుగకుండా వారిని కాపాడింది. కాలిపోయినవి వారి బంధకాలే. “అధిపతులును సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజుయొక్క ప్రధాన మంత్రులును కూడివచ్చి ఆ మనుష్యులను పరీక్షించి, వారి శరీరములకు అగ్ని యేహాని చేయకుండుటయు, వారి తల వెండ్రుకలలో ఒకటైనను కాలి పోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు అగ్ని వాసనయైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి.” PKTel 355.2

అంత ఆడంబరముగా ప్రతిష్టించిన బంగారు ప్రతిమను గురించి మర్చిపోయారు. జీవంగల దేవుని సముఖంలో మనుషులు భయంతో వణికారు. కించపడిన మహారాజు ఇలా ఒప్పుకోవాల్సి వచ్చింది, “షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజారుడు; ఆయన తన దూతనంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికిగాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజుయొక్క ఆజ్ఞ వ్యర్ధపరచిరి.” PKTel 355.3

ఆ రోజు అనుభవాలు ఈ ఆజ్ఞ జారీ చెయ్యటానికి నెబుకద్నెజరుని నడిపించాయి, “ఏ జనులలోగాని రాష్ట్రములోగాని యే భాష మాట్లాడువారిలోగాని షద్రకు, మేషాకు, అబేద్నెగోయనువారి దేవుని యెవడు దూషించునోవాడు తుత్తునియలుగా చేయబడును. వాని యిల్లు ఎల్లప్పుడు పెంటకుప్పగా నుండును.” ఆ ఆజ్ఞకు రాజు ఈ కారణాన్ని చెప్పాడు, “ఇవ్విధముగ రక్షించుటకు సమర్థుడగు దేవుడుగాక మరి ఏ దేవుడును లేడు.” PKTel 355.4

హెబ్రీయుల దేవుడే శక్తి అధికారంగల దేవుడు. ఆయనే పూజారుడు అన్న తన ధృఢ నమ్మకాన్ని ఈ మాటల్లోను ఇలాంటి పదజాలంతోను లోక ప్రజలకు ప్రచురించటానికి బబులోను చక్రవర్తి ప్రయత్నించాడు. రాజు తనను ఘనపర్చుకోటానికి చేసిన కృషిని, దేవునిపట్ల తన విశ్వాసాన్ని బబులోను రాజ్యమంతటా ప్రకటించటాన్ని దేవుడు అభినందించి ఆనందించాడు. PKTel 355.5

రాజు బహిరంగంగా దేవునిపై విశ్వాసాన్ని ప్రకటించటం, పరలోకమందున్న దేవుణ్ని ఇతర దేవతలకన్నా పైగా హెచ్చించటం మంచిపనే. కాని తనలాగే ఆయనపట్ల భక్తి కలిగి ఉండాలని వారిని బలవంతం చెయ్యటానికి ప్రయత్నించటం మంచిపని కాదు. ఇలా చెయ్యటంలో నెబుకద్నెజరు ప్రజలకు లోకసంబంధమైన రాజుగా తన హక్కుని మించి ప్రవర్తిస్తున్నాడు. దేవున్ని పూజించనందుకు ప్రజల్ని చంపుతానని భయపెట్టటానికి అతడికి పౌరహక్కుగాని లేక నైతిక హక్కుగాని లేదు. బంగారు ప్రతిమకు నమస్కరించని వారిని అగ్ని గుండంలోవేసి కాల్చి వేస్తానన్న ఆజ్ఞ జారీ చేసే హక్కు అతడికి అంతకన్నా లేదు. దేవుడు మానవుడి బలవంతపు విధేయతను ఎన్నడూ కోరడు. ఎవరిని సేవించాలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఆయన అందరికీ ఇస్తాడు. PKTel 355.6

నమ్మకమైన తన సేవకుల విమోచనలో తాను బాధితుల పక్క నిలబడతానని దేవుని అధికారంపై తిరుగుబాటు చేసే లోక పరిపాలకుల్ని మందలిస్తానని ప్రభువు వెల్లడి చేశాడు. ఆ ముగ్గురు హెబ్రీ యువకులు తాము సేవించే ప్రభువుమీద తమకున్న విశ్వాసాన్ని బబులోను రాజ్య ప్రజలందరికీ చాటి చెప్పారు. వారు దేవునిమీద ఆధార పడ్డారు. తమకు ఆపదవచ్చినప్పుడు ఈ వాగ్దానాన్ని గుర్తు చేసుకున్నారు, “నీవు జలములలోబడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును. నదులలోబడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు.” యెష 43:2. అందరూ చూస్తుండగా జీవవాక్యంపై వారి విశ్వాసం అద్బుతరీతిగా ఘనపర్చబడింది. ప్రతిమ ప్రతిష్ఠకు ఆహ్వానితులై వచ్చిన వివిధ జాతుల ప్రజలు అద్భుతమైన వారి విడుదలను గూర్చిన వార్తను అనేక దేశాలకు తీసుకువెళ్లారు. తన బిడ్డల నమ్మకమైన సాక్ష్యంద్వారా లోకమంతటా దేవుడు మహిమను పొందాడు. PKTel 356.1

దూరా మైదానంలో ఆ హెబ్రీ యువకులికి కలిగిన అనుభవం నుంచి నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన పాఠాలున్నాయి. ఈనాడు అనేకమంది దైవ సేవకులు ఏ తప్పు చెయ్యకపోయినా, సాతాను ప్రేరణవల్ల అసూయ మతమౌఢ్యంతో నిండిన వారివలన శ్రమలు అవమానం అత్యాచారాలికి గురిఅయి బాధపడటానికి అప్పగించ బడతారు. ముఖ్యంగా నాల్లో ఆజ్ఞపక్రారం సబ్బాతును ఆచరించే వారిపై మానవుడి ఆగ్రహం రగులుతుంది. తుదకు వీరు మరణార్డులంటూ లోకవ్యాప్తిగల ఓ ఆజ్ఞ జారీ అవుతుంది. PKTel 356.2

దేవుని ప్రజలముందున్న ఈ ఆపత్కాలానికి ధృడమైన విశ్వాసం అవసరం. ఆయనే తాము ఆరాధించే దేవుడని, తప్పుడు ఆరాధనకు తమను ఏ ఆలోచనా చివరికి తమ ప్రాణం సయితం మిక్కిలి స్వల్పమైన రాజీకి తమను సమ్మతింప చెయ్యలేదని ఆయన బిడ్డలు వెల్లడించాలి. నమ్మకమైన హృదయానికి నిత్యదేవుని వాక్యం పక్కపాప మానవుడి ఆజ్ఞలు కొరగానివవుతాయి. పర్యవసానం చెరసాలలేక దేశ బహిష్కరణ లేక మరణం అయినా వారు సత్యానికి విధేయులవుతారు. PKTel 356.3

షడ్రకు, మేషాకు, అబేద్నెగో దినాల్లోలాగే లోకచరిత్ర ముగిసేకాలంలో సత్యానికి నిబద్దులై ధృఢంగా నిలచేవారి పక్షంగా ప్రభువు మహత్కార్యాలు చేస్తాడు. మండుతున్న అగ్నిగుండంలో ఈ హెబ్రీ యువకులతో నడిచిన ప్రభువే తన అనుచరులు ఎక్కడున్నా వారితో ఉంటాడు. ఆయన సముఖం వారిని ఓదార్చి బలపర్చుతుంది. మానవజాతి ఉనికిలోకి వచ్చినప్పటినుంచి ఎన్నడూ సంభవించి ఉండని శ్రమకాలం రానున్నది. ఆ సమయంలో ఆయన ఎన్నుకున్న ప్రజలు నిశ్చలంగా ఉంటారు. తన దుష్ట సేనల బలం ఎంతఉన్నా సాతాను దేవుని భక్తుల్లో మిక్కిలి బలహీనుణ్ని సయితం నాశనం చెయ్యలేడు. బలాధీకులైన దూతలు వారిని సంరక్షిస్తారు. వారి పక్షంగా యెహోవా దేవుండ్లకు దేవుడుగా” తనను నమ్ముకున్నవారిని పూర్తిగా రక్షించటానికి సమర్థుడుగా తన్నుతాను ప్రత్యక్షపర్చుకుంటాడు. PKTel 357.1