Go to full page →

4 - అతిక్రమఫలితాలు PKTel 28

సొలొమోను దుబారాకి, హింసకు పాల్పడటానికి ప్రాథమిక కారణాల్లో ప్రధానమైనది అతడు ఆత్మత్యాగ స్వభావాన్ని ప్రోది చేసి పోషించటంలో వైఫల్యం చెందటమే. PKTel 28.1

“నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను.” అన్న దైవాజ్ఞను గురించి మోషే సీనాయి పర్వతం వద్ద ప్రజలతో చెప్పినప్పుడు ఇశ్రాయేలీయులు సముచితమైన కానుకలతో స్పందించారు. “ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరు వచ్చి” కానుకలు ఇచ్చారు. నిర్గమ. 25:8; 35:21. గుడార నిర్మాణానికి ఎంతో సిద్దబాటు అవసరమయ్యింది. మిక్కిలి ప్రశస్తమైన ఖరీదైన వస్తువులు పెద్ద సంఖ్యలో అవసరమయ్యాయి. కాని ప్రభువు స్వేచ్ఛార్పణల్ని మాత్రమే అంగీకరించాడు. “మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యునియొద్ద దాని తీసికొనవలెను” అన్న ఆజ్ఞను మోషే సమాజానికి పునరుచ్చరించాడు. నిర్గమ. 25:2. దేవునిపట్ల భక్తి తత్పరత, ఆత్మ త్యాగ స్ఫూర్తి - ఇవి సర్వోన్నతునికి నివాసస్థలం సిద్ధబాటుకి ప్రప్రథమంగా కావలసినవి. PKTel 28.2

దేవాలయ నిర్మాణ బాధ్యతను దావీదు సొలొమోనుకు అప్పగించినప్పుడు ఆత్మ త్యాగానికి ఇటువంటి పిలుపునే ఇవ్వటం జరిగింది. సమావేశమైన జన సమూహానికి దావీదు ఈ ప్రశ్న వేశాడు, “ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా?” 1 దిన వృ. 29: 5. సమర్పణకు ఇష్టపూర్వక సేవకు వచ్చిన ఈ పిలుపును ఆలయ నిర్మాణంతో సంబంధం ఉన్నవారు నిత్యం గుర్తుంచుకుని ఉండాల్సింది. PKTel 28.3

అరణ్య గుడార నిర్మాణానికి ఎంపికైన మనుషులికి దేవుడు ప్రత్యేక నైపుణ్యాన్ని, జ్ఞానాన్ని ఇచ్చాడు. “మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లనెను - చూడుడి; యెహోవా ... బెసలేలును పేరు పెట్టి పిలిచి ... విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును ... ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపియున్నాడు. అతడును దాను గోత్రికుడు ... అహోలీయాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ది పుట్టించెను. చెక్కువాడేమి చిత్రకారుడేమి నీలధూమ రక్తవర్ణములతోను, సన్న నారతోను, బూటాపని చేయువాడేమి నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పనియైనను చేయువారి యొక్కయు విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులు చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి యున్నాడు ... యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగజేసెనో అట్టి బెసలేలును అహోలీయాబును మొదలైన ప్రజ్ఞా వంతులందరును యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున” చేశారు. నిర్గమ. 35:30-35; 36:1. దేవుడు ఎంపిక చేసుకున్న పనివారికి పరలోక నివాసులు సహకరించారు. PKTel 28.4

ఈ పనివారి సంతతివారు తమ పితరులికి దేవుడిచ్చిన వరాల్ని కొంతమేరకు వారసత్వంగా పొందారు. యూదా దాను వంశాలకు చెందిన ఈ మనుషులు కొంత కాలం వినయ హృదయులై స్వార్థరహితంగా నివసించారు. కాని కాలగమనంలో తమకు తెలియకుండానే వారు దేవున్ని విడిచిపెట్టారు. దేవునికి స్వార్థరహిత సేవ చేయాలన్న కోరిక ఇక వారికి లేదు. లలితకళల పనిలో తమ ప్రజ్ఞాపాటవాల్నిబట్టి వారు తమ సేవలకు హెచ్చు వేతనాలు కోరారు. కొందరి విషయంలో వారు కోరింది జరిగింది. కాని ఎక్కువమంది చుట్టుపట్ల ఉన్న జాతుల్లోకి వెళ్లి ఉపాధి సంపాదించుకున్నారు. కీర్తిశేషులైన తమ పితరుల గుండెలనిండా ఉన్న ఆత్మ త్యాగ స్పూర్తి వీరికిలేదు. వీరు ఆత్యాశతోనిండి ఎక్కువ చేజిక్కించుకోటానికి తెగబడ్డారు. తమ స్వార్థాశల్ని కోరికల్ని నెరవేర్చుకోటానికి తమకు దేవుడిచ్చిన నిపుణతని అన్యరాజుల సేవలకు వినియోగించారు. సృష్టికర్తకు పరాభవం తెచ్చే పనుల్ని సాగించే కార్యాలికి తమ వరాల్ని వినియోగించారు. PKTel 29.1

మొరీయా కొండపై దేవాలయ నిర్మాణ నాయకత్వానికి వీరిలో ఒక నిపుణుడి కోసం సొలొమోను వెదికాడు. ఈ పరిశుద్ద నిర్మాణం ప్రతీభాగం విషయంలో చిన్న చిన్న వివరాలు రాతపూర్వకంగా సొలొమోనుకి ఇవ్వటం జరిగింది. అంకితభావంగల సహాయకులకోసం సొలొమోను విశ్వాసంతో దేవునిమిద ఆధారపడాల్సింది. ఆ పనికి అవసరమైన ప్రత్యేక నిపుణతను దేవుడు ఆ సహాయకులికి అనుగ్రహించేవాడు. దేవునిపై తన విశ్వాసాన్ని ప్రదర్శించుకోటానికి ఈ అవకాశాన్ని విస్మరించాడు. “యూదా దేశములోను, యెరూషలేములోను ... బంగారముతోను వెండితోను, ఇత్తడితోను, ఇనుముతోను, ఊదా నూలుతోను, ఎఱ నూలుతోను, నీలి నూలుతోను ... అన్నివిధముల చెక్కడపు పనియును నేర్చిన ప్రజ్ఞగల మనుష్యునొకని నాయొద్దకు పంపుము” అని తూరు రాజుకి వర్తమానం పంపాడు (2 దిన వృ. 2:7). PKTel 29.2

ఫొనీషియా రాజుహూరామనేవాణ్ని పంపాడు. “అతడు దాను వంశపురాలగు ఒక స్త్రీకి పుట్టినవాడు. వాని తండ్రి తూరు సంబంధమైనవాడు.” 14వ వచనం. హూరాము తన తల్లి తరపున అహోలీయాబు సంతతివాడు. అహోలీయాబుకు వందల సంవత్సరాల పూర్వం గుడార నిర్మాణం నిమిత్తం దేవుడు ప్రత్యేక ప్రజ్ఞను, వివేకాన్ని ఇచ్చాడు. నిస్వార్థంగా దేవునికి సేవ చెయ్యాలన్న కోరికలేని వ్యక్తి నాయకత్వంలో ఇలా సొలొమోను పనివారు పనిచేయటం ప్రారంభించారు. ఆ నాయకుడు ఈ లోకానికి దేవుడైన సిరికి సేవచేశాడు. అతడిలో ప్రతీ అణువు స్వార్థంతో నిండి ఉంది. PKTel 30.1

తన అరుదైన నిపుణతవల్ల హూరాము పెద్ద వేతనం డిమాండు చేశాడు. అతడు అనుసరించిన తప్పుడు సూత్రాన్ని అతడి సహచరులూ అంగీకరించారు. అతడితో ప్రతీరోజూ వారు అతడి వేతనాన్ని తమ వేతనాన్ని పోల్చి చూసుకుని తమ పని పవిత్రతను విస్మరించారు. వారిలో స్వార్ధత్యాగ స్పూర్తి నశించింది. దాని స్థానాన్ని దురాశ ఆక్రమించింది. ఫలితంగా వారు ఎక్కువ వేతనాన్ని డిమాండు చేశారు. వాటిని పొందారు కూడా. PKTel 30.2

ఇలా ప్రారంభమైన హానికరమైన ప్రభావాలు ప్రభువు సేవలోని ఇతర శాఖల్లోకి, దేశమంతటికీ విస్తరించాయి. పనివారు డిమాండుచేసి పొందిన హెచ్చు వేతనం ఉదంతం అనేకులు విలాసవంతమైన జీవితంలో దుర్వ్యయంలో ములిగి తేలటానికి దారితీసింది. ఉన్నవారు లేనివారిని రాచి రంపాన పెట్టారు. ఆత్మ త్యాగ స్పూర్తి దాదాపు నశించింది. మనుషులందరిలో మిక్కిలి జ్ఞానవంతుడుగా ఒకప్పుడు పరిగణన పొందిన వ్యక్తి భయంకర భ్రష్టత్వంలో పడిపోవటానికి ప్రధాన కారణం ఈ ప్రభావాల దీర్ఘకాలిక పర్యవసానాలేనని చెప్పక తప్పదు. అరణ్యంలో గుడారం నిర్మించిన పనివారి స్ఫూర్తికీ ఉద్దేశాలికీ సొలొమోను దేవాలయం నిర్మిస్తున్నవారి స్ఫూర్తికీ ఉద్దేశాలికీ మధ్యగల భేదంలో ముఖ్యమైన పాఠం ఉంది. దేవాలయం పనివారు ప్రదర్శించిన స్వార్థపరాయణతకు నేడు లోకంలో రాజ్యమేలుతున్న స్వార్థం ప్రతిరూపం. దురాశ, ఉన్నత పదవులకి, ఉన్నత వేతనాలికి పాకులాటలు పెచ్చరిల్లుతున్నాయి. గుడార నిర్మాణకుల ఇష్టపూర్వక సేవా స్ఫూర్తి, ఆత్మ త్యాగం ఇప్పుడు కనిపించవు. అయితే క్రీస్తు అనుచరులు ఈ స్వభావమే కలిగి పనిచెయ్యాలి. తన అనుచరులు ఎలా పనిచెయ్యాలో అన్నదానికి మన ప్రభువు తన ఆదర్శానిస్తున్నాడు. “నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతును” (మత్త. 4:19) అని ఆయన ఎవరిని ఆదేశించాడో వారికి తమ సేవ నిమిత్తం ఆయన ఏ ప్రతిఫలం ఇవ్వజూపలేదు. వారు ఆయన ఆత్మ నిరసనను, త్యాగాన్ని పంచుకోవాల్సి ఉన్నారు. PKTel 30.3

మనం వేతనం కోసం పని చెయ్యకూడదు. దేవునికి సేవ చెయ్యటానికి మనల్ని ఉద్రేకపర్చే ఉద్దేశంలో స్వార్థ ప్రయోజనం ఏ మాత్రం ఉండకూడదు. స్వార్థంలేని భక్తి, త్యాగస్ఫూర్తి దేవునికి అంగీకృతమైన సేవకు మొదట కావలసినవి ఇవే! తన పనిలో స్వార్ధానికి సంబంధించిన ఒక్క నూలుపోగు కూడా ఉండకూడదని మన ప్రభువు సంకల్పం. పరిపూర్ణుడైన దేవుడు ఇహలోక గుడార నిర్మాణకుల్నుంచి కోరిన జ్ఞానం, నిపుణత, నిర్దిష్టత, వివేకం మనంచేసే పనిలో ప్రదర్శించాల్సి ఉన్నాం. అయినా స్వార్థాన్ని సజీవ యాగంగా బలిపీఠంమీద ఉంచినప్పుడే మన అత్యుత్తమ వరాలు లేక ఉత్కృష్టమైన సేవ ఆయనకు అంగీకృతమౌతుందని మన సేవ అంతటిలోను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. PKTel 31.1

తుదకు ఇశ్రాయేలు రాజు పతనానికి దారితీసిన మరొక నియమ అతిక్రమం ఏదంటే దేవునికి మాత్రమే చెందాల్సిన మహిమను సొంతం చేసుకోటానికి వచ్చిన శోధనకు లొంగటం. PKTel 31.2

ఆలయ నిర్మాణం చేపట్టింది లగాయతు దాన్ని పూర్తి చేసేంతవరకు సొలొమోను ప్రకటిత లక్ష్యం “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును” కట్టించటం. 2 దినవృ. 6:7. ఆలయ ప్రతిష్ఠ జరిగినప్పుడు ఈ ఉద్దేశాన్ని పూర్తిగా గుర్తించటం జరిగింది. “నా నామము అక్కడ ఉండునని” యెహోవా చెప్పటాన్ని రాజు తన ప్రార్థనలో ఒప్పుకున్నాడు. 1 రాజు. 8:29. PKTel 31.3

యెహోవా ఘనత ఇతర జాతులమధ్య వ్యాపించగా సుదూర దేశాలనుంచి దేవున్నిగూర్చి ఎక్కువ నేర్చుకోవాలని వచ్చే పరదేశులగురించి ఆయనతో విజ్ఞాపన చేస్తున్న భాగం సొలొమోను ప్రార్థనలో హృదయాన్ని ద్రవింపచేసే భాగాల్లో ఒకటి. రాజు ఇలా విజ్ఞాపన చేశాడు, “నీ ఘనమైన నామమును గూర్చియు, నీ బాహు బలమును గూర్చియు, నీవు చాపిన బాహువు ప్రసిద్ధిని గూర్చియు విందురు. ఈ పరదేశ ఆరాధకుల్లో ప్రతీవారి పక్షంగా సొలొమోను ఇలా మనవి చేశాడు, “నీవు విని, పరదేశులు నిన్ను వేడుకొనుదాని ప్రకారము సమస్తము ననుగ్రహించుము, అప్పుడు లోకములోని జనులందరును నీ నామమును ఎరిగి, ఇశ్రాయేలీయులగు నీ జనులవలెనే నీయందు భయభక్తులు కలిగి నేను కట్టించిన యీ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని తెలిసికొందురు.” 42,43 వచనాలు. PKTel 31.4

“లోకమందున్న జనులందరును యెహోవాయే దేవుడనియు, ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియు” తెలుసుకొనేటట్లు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి నమ్మకంగాను, యధార్థంగాను ఉండవలసిందంటూ ప్రతిష్ఠ కార్యక్రమం చివరలో సొలొమోను హితవు పలికాడు. (60వ వచనం). PKTel 31.5

ఆలయ రూపకర్త సొలొమోనుకన్న గొప్పవాడు. అందులో దేవుని వివేకం దేవుని మహిమ వెల్లడయ్యాయి. ఈ వాస్తవం తెలియనివారు సొలొమోనే ఆలయ రూపశిల్పి నిర్మాణకుడు అని అతణ్ని ప్రశంసించారు. కాని దాని రూపకల్పనకు గాని దాని నిర్మాణానికి గాని తాను బాధ్యుణ్నని రాజు చెప్పుకోలేదు. దానికి గౌరవాన్ని కోరలేదు. PKTel 32.1

షేబ దేశపు రాణి సొలొమోనుని దర్శించటానికి వచ్చినప్పుడు జరిగింది ఇదే. అతడి వివేకాన్ని గురించి అతడు నిర్మించిన వైభవోపేతమైన దేవాలయం గురించి విని “గూఢార్థముగల మాటలచేత అతని శోధించుటకై” ప్రఖ్యాతి గాంచిన అతని కార్యాలు స్వయంగా చూడటానికి వచ్చింది. సేవకులు అనుచర్లతో “గంధవర్ణమును విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెలమీద ఎక్కించుకొని” ఆమె దీర్ఘ ప్రయాణం చేసి యెరూషలేముకు వచ్చింది. “సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానినంతటినిబట్టి అతనితో మాట్లాడింది. ఆమె అతడితో ప్రకృతి మర్మాల్ని చర్చించింది. మహాకాశంలో నివసిస్తూ సమస్తాన్ని పరిపాలించే సృష్టికర్త అయిన దేవుణ్ని గురించి సొలొమోను ఆమెకు బోధించాడు. “సొలొమోను ఆమె ప్రశ్నలన్నియు ఆమెకు విడదీసి చెప్పెను; సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట యేదియు లేకపోయెను.” 1 రాజులు 10:1-3, 2 దిన వృ. 9:1,2. PKTel 32.2

“షేబరాణి సొలొమోను యొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును .... చూచి విస్మయ మొందినదై రాజుతో ఇట్లనెను.” “నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినినమాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులార చూడకమునుపు ఆ మాటలను నమ్మకయుంటిని.” “నీ యధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు. నిన్ను గూర్చి నేను వినిన దానికంటే నీ కీర్తి యెంతో హెచ్చుగా నున్నది. నీ సేవకుల భాగ్యము మంచిది. ఎల్లప్పుడును నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది.” 1 రాజులు 10:4-8; 2 దిన వృ. 9:3-6. PKTel 32.3

ఆమె సందర్శన పూర్తి అయ్యేసరికి తన జ్ఞానానికి అభ్యుదయానికి మూలం ఎవరో సొలొమోను ఆమెకు బోధించటంతో ఆమె మానవ సాధనాన్ని శ్లాఘించటం కాక ఇలా కొనియాడటం మొదలు పెట్టింది, “నీయందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయులమీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమయుంచెను గనుక నీతి న్యాయములను ఆచరించి రాజ్యకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను.” 1 రాజులు. 10:9. ప్రజలందరికి ఇలాంటి అభిప్రాయాన్నే కలిగించాలన్నది దేవుని ఉద్దేశం. “దేవుడు సొలొమోను యొక్క హృదయ మందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరును అతని ముఖ దర్శనము” చేసుకోగోరినప్పుడు (2 దిన వృ. 9:23), వారి గమనాన్ని భూమ్యాకాశాల సృష్టికర్త విశ్వ పరిపాలకుడు, సర్వజ్ఞాని అయిన దేవునిపై నిలపటంద్వారా సొలొమోను కొంతకాలం ఆయన్ని ఘనపర్చాడు. PKTel 32.4

సొలొమోను వినయ మనస్కుడుగా ఉండి ప్రజల దృష్టిని తనపైగాక తనకు వివేకాన్ని, సంపదను, కీర్తిని ఇచ్చిన దేవునిపై నిలిపి ఉంటే అతడి చరిత్ర ఎంత స్పూర్తిదాయకంగా ఉండేది! అయితే లేఖనం అతడి సుగుణాల్ని దాఖలు చెయ్యగా అది అతడి పతనాన్ని కూడా నమ్మకంగా వివరిస్తున్నది. ఘనతలో శిఖర సమానుడై ఎన్నో వరాలు ఎంతో సంపదతో తులతూగుతున్న సొలొమోను బుద్దిహీనుడయ్యాడు. నిలకడ కోల్పోయి కింద పడ్డాడు. లోకప్రజలు తనను ప్రతినిత్యం కొనియాడటంతో చివరికి పొగడను తట్టుకోలేకపోయాడు. దేవుని మహిమపర్చేందుకు అనుగ్రహించబడ్డ వివేకం అతణ్ని గర్వంతో నింపింది. “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామ ఘనతకు రూపకల్పన, నిర్మాణం అయిన దేవాలయం నిమిత్తం ప్రశంసలందుకోటానికి తానే అరుడనన్నట్లు ప్రజలు మాట్లాడటానికి తుదకు అనుమతించాడు. PKTel 33.1

యెహోవా దేవాలయం ఈవిధంగా “సొలొమోను దేవాలయము”గా అన్ని దేశాల్లో పేరుపొందింది. “మరి ఎక్కువైన అధికారము నొందిన” (ప్రసంగి. 5:8) ప్రభువుకు చెందిన మహిమను మానవ ప్రతినిధి తన సొంతం చేసుకున్నాడు. “నేను కట్టిన యీ మందిరమునకు నీ పేరు పెట్టబడెను” (2 దిన వృ. 6:33) అని ఏ ఆలయం గురించి సొలొమోను ప్రకటించాడో ఆ దేవాలయం నేటికి “సొలొమోను దేవాలయము” గానే గాని యెహోవా దేవాలయంగా పిలువబడటంలేదు. PKTel 33.2

దేవుడిచ్చిన వరాల తాలూకు ఘనతను తనకు ఆపాదిస్తూ మనుషులు శ్లాఘించటాన్ని అనుమతించటంకన్న దారుణమైన బలహీనత మనుషుడికి ఇంకొకటి ఉండదు. యధార్థ క్రైస్తవుడు ప్రతీ విషయంలోను దేవుణ్ని మొదటివాడు కడపటివాడు శ్రేష్ఠుడుగా ఎంచుకుంటాడు. దేవునిపట్ల తన ప్రేమను ఏ ఆశలు ఆశయాలు చల్లార్చలేవు. పరలోక తండ్రికి ఘనత మహిమ చెల్లించటానికి నిత్యం ప్రయత్నిస్తాడు. మనం దేవుని నామాన్ని చిత్తశుద్ధితో ఘనపర్చినప్పుడే మన ఉద్రేకాలు దైవ పర్యవేక్షణ కింద ఉంటాయి. మనం ఆధ్యాత్మికంగా మానసికంగా వృద్ధి చెందటానికి శక్తి కలుగుతుంది. PKTel 33.3

పరలోక ప్రభువైన యేసు తన పరలోక జనకుని నామాన్ని నిత్యం ఘనపర్చాడు. “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామం ఘనపర్చబడునుగాక” (మత్త. 6:9 ఎ.ఆర్.వి.) అని ప్రార్థించటం తన శిష్యులికి నేర్పించాడు. “మహిమ ... నీదే” (13వ వచనం, ఎ.ఆర్.వి.) అని గుర్తించటం వారు మర్చిపోకూడదు. ఆ మహా వైద్యుడు ప్రజల గమనాన్ని తనమీదనుంచి తన శక్తికి మూలమైన తండ్రిమీద కేంద్రీకరించటానికి జాగరూకత వహించాడు. “మూగవారు మాటలాడుటయును అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గ్రుడ్డివారు చూచుటయును” జనసమూహం చూసి ఆశ్చర్యపడి ఆయన్ని మహిమపర్చలేదు “ఇశ్రాయేలు దేవుని మహిమ పరచిరి.” మత్త. 15:31. సిలువ వేయబడకముందు క్రీస్తు చేసిన ప్రార్థనలో ఆయన ఇలా అన్నాడు, “భూమిమీద నిన్ను మహిమ పరచితిని.” “నీ కుమారుడు నిన్ను మహిమ పరచునట్లు నీ కుమారుని మహిమ పరచుము” అని విజ్ఞాపన చేశాడు. “నీతి స్వరూపుడగు తండ్రీ, లోకము నిన్ను ఎరుగలేదు. నేను నిన్ను ఎరుగుదును; నీవు నన్ను పంపితివని వీరెరిగియున్నారు. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసితిని ఇంకను తెలియజేసెదను.” యెహా. 17:1,4,25,26. PKTel 34.1

“యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు - జ్ఞాని తన జ్ఞానమునుబట్టియు శూరుడు తన శౌర్యమునుబట్టియు అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టివాటిలో నేనానందించు వాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.” యిర్మీ. 9:23,24. PKTel 34.2

“నేను దేవుని నామమును స్తుతించెదను
కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరచెదను.”
“ప్రభువా, మా దేవా, ... నీవే మహిమ
ఘనత ప్రభావములు పొందనర్హుడవు.”
“నా పూర్ణ హృదయముతోను నేను నీకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లించెదను. నీ నామమును నిత్యము మహిమ పరచెదను.”

“నాతోకూడి యెహోవాను ఘనపరచుడి
మనము ఏకముగా కూడి ఆయన నామమును
గొప్ప చేయుదము.” PKTel 34.3

కీర్త. 69:30; ప్రక. 4:11; కీర్త. 86:12; 34:3.

త్యాగశీలాన్ని అణచివేసి ఆత్మస్తుతికి దారితీసే సూత్రాల ప్రవేశం తర్వాత ఇశ్రాయేలీయుల నిమిత్తం దేవుని ప్రణాళిక మౌర వక్రీకరణకు గురి అయ్యింది. తనవారు లోకానికి వెలుగుగా ఉండాలన్నది దేవుని సంకల్పం. వారి జీవితంలోను క్రియల్లోను దేవుని ధర్మశాస్త్రం వెల్లడవుతూ దాని మహిమ వారినుంచి ప్రకాశించ వలసిఉన్నది. ఈ సంకల్పాన్ని నెరవేర్చటానికి లోకంలోని జాతులన్నిటిలోను ప్రాముఖ్యమైన స్థానాన్ని తాను ఎంపిక చేసుకున్న జాతి ఆక్రమించేటట్లు దేవుడు చేశాడు. PKTel 35.1

సొలొమోను దినాల్లో ఇశ్రాయేలు రాజ్యం ఉత్తరాన హమాతునుంచి దక్షిణాన ఐగుప్తువరకు మధ్యధరా సముద్రంనుంచి యూఫ్రటీసు నదివరకు విస్తరించి ఉంది. ఈ భూభాగంగుండా లోక వాణిజ్యానికి అనేక స్వాభావిక రహదార్లు వెళ్లటంతో దూర ప్రదేశాలనుంచి ప్రయాణిక సమూహాల వాహనాలు నిత్యం అటూ ఇటూ వెళ్తూ ఉండేవి. సకల జాతుల మనుషులికి రాజులకు రాజైన దేవుని ప్రవర్తనను వెల్లడిపర్చే అవకాశం సొలొమోనుకి అతడి ప్రజలకి ఈ తీరుగా కలిగింది. ఆయన్ని ఘనపర్చి ఆయనకు విధేయులవ్వటానికి నడిపించటానికి వారికి తరుణం లభించింది. ఈ జ్ఞానాన్నివారు సర్వలోకానికి అందించాల్సి ఉన్నారు. నమ్మి పైకి చూసేవారందరూ రక్షణ పొందే నిమిత్తం, బలి అర్పణ సేవ బోధన ద్వారా వారు క్రీస్తును పైకెత్తాల్సి ఉన్నారు. PKTel 35.2

చుట్టూ ఉన్న జాతులికి వెలుగుగా ఉండటానికి స్థాపితమైన జాతికి నాయకుడుగా, దేవునిగూర్చి ఆయన సత్యాన్నిగూర్చి అజ్ఞానులైన ప్రజలికి జ్ఞానోదయం కలిగించటానికి సొలొమోను తనకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని, అధికార ప్రాబల్యాన్ని వినియోగించి గొప్ప ఉద్యమాన్ని వ్యవస్థీకరించాల్సింది. అలా చేసిఉంటే వేలాది ప్రజలు దైవవిధులకు నమ్మకంగా నిలిచేవారు. అన్యులు ఆచరిస్తున్న ఆచారాల్ని ఇశ్రాయేలీయులు విసర్జించేవారు. మహిమ ప్రభువుకి గొప్ప ఘనత కలిగేది. అయితే సొలొమోనుకి ఈ ఉన్నతాశయంలేదు. నిత్యం తన దేశంగుండా వస్తూ వెళ్తూ ఉన్నవారికి లేక తన దేశ ప్రధాన నగరాల్లో విడిది ఉంటున్న వారికి దేవునిగూర్చిన జ్ఞానాన్ని అందించటానికి అవకాశాల్ని అందిపుచ్చుకోటంలో అతడు విఫలుడయ్యాడు. PKTel 35.3

సొలొమోను హృదయంలోను యధార్థమైన ఇశ్రాయేలీయుల హృదయాల్లోను దేవుడు పెట్టిన మిషనెరీ స్ఫూర్తి స్థానే వ్యాపారతత్వం నెలకొంది. అనేక దేశాలతో సంబంధాలవల్ల ఏర్పడ్డ తరుణాన్ని వ్యక్తిగత ప్రాబల్యానికే వినియోగించుకోటం జరిగింది. వాణిజ్య ప్రవేశ ద్వారాలవద్ద ప్రాకారాలుగల పట్టణాలు నిర్మించటంద్వారా రాజకీయంగా తన స్థానాన్ని పటిష్ఠ పర్చుకోటానికే సొలొమోను ప్రయత్నించాడు. ఐగుప్తు సిరియాలకు మధ్య రహదారి పక్కయొప్పేకు సమీపంలో గెజెరును; యెరూషలేముకు పశ్చిమాన ఉండి యూదయనుంచి గెజెరుకు వెళ్లే రహదారిని పర్వత సందుల్ని సముద్రతీరాన్ని నియంత్రించే బెత్హోరోను; దమస్కునుంచి ఐగుపుకు యెరూషలేమునుంచి ఉత్తరానికి వెళ్లే రహదారి పక్కనున్న మెగిట్టోను; తూర్పునుంచి ప్రయాణీక సమూహ వాహన రహదారి పక్క “అరణ్యమందుండు తద్మోరుకును” (2 దినవృ 8:4) బలమైన ప్రాకారాలు కట్టాడు. “ఎదోము దేశపు ఎట్టి సముద్ర తీరమందున్న ... ఎసోనెబరునందు ఓడరేవు కట్టించు”ట ద్వారా ఎర్ర సముద్ర ద్వారంవద్ద విక్రయ కేంద్రాలు స్థాపించి వాణిజ్యాన్ని వృద్ది పర్చాడు. తూరుకు చెందిన సుశిక్షిత నావికులు “సొలొమోను సేవకులతోకూడ” “ఓఫీరు దేశమునుండి బంగారము ... చందనపు మ్రానులను రత్నములను బహు విస్తారముగా” తెచ్చిన ఓడల్ని నడిపారు. 18వ వచనం; 1 రాజులు 9:26;28; 10:11. PKTel 35.4

రాజు ఆదాయం, అతడి ప్రజల్లో అనేకుల ఆదాయం బాగా పెరిగింది. అయితే దాని మూల్యం ఎంత గొప్పది! దేవుడు తన లేఖనాల్ని ఎవరికి ధర్మనిధిగా అప్పగించారో వారి కాముకత్వం వల్ల ఆ రహదారులగుండా ప్రయాణించిన వేవేలమంది యెహోవాను గూర్చి ఏమి ఎరుగకుండానే ప్రయాణించారు. PKTel 36.1

సొలొమోను అవలంబించిన విధానం, క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అవలంబించిన విధానానికి ఎంతో భిన్నంగా ఉంది. రక్షకుడు “సర్వశక్తి” గలవాడైనా తన ప్రాబల్యంకోసం ఆ శక్తిని ఎన్నడూ వినియోగించుకోలేదు. మానవాళికి ఆయన పరిచర్య సంపూర్ణతను లౌకిక విజయం లోక ఘనత వికృతం చెయ్యలేదు. “నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములును కలవుగాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదు” అన్నాడాయన. మత్త. 8:20. ఆ ఘడియ పిలుపుకు స్పందించి ఆ అపూర్వ కార్మికుని సేవలో ప్రవేశించేవారు ఆయన పద్ధతుల్ని అధ్యయనం చేయవచ్చు. ప్రయాణికుల రద్దీ ఉన్న రహదారుల వెంబడి కలిగే సువార్త సేవావకాశాల్ని ఆయన జారవిడువలేదు. PKTel 36.2

ఒక ప్రదేశంనుంచి ఇంకో ప్రదేశానికి చేసిన ప్రయాణాల్లో విరామ సమాయాల్లో యేసు కపెర్నహోములో ఉండేవాడు. దాన్ని “తన పట్టణము”గా పిలవటం జరిగేది. మత్త. 9:1. దమస్కునుంచి యెరూషలేము, ఐగుప్తు మధ్యధరా సముద్రానికి వెళ్లే రహదారి పక్కఉన్న ఆ పట్టణం రక్షకుని పరిచర్యకు కేంద్రంగా ఉండటానికి అన్ని హంగులు కలిగి ఉన్నది. అనేక దేశాల ప్రజలు ఆ పట్టణం మీదుగా వెళ్లేవారు లేక విశ్రాంతి తీసుకోటానికి అక్కడ ఆగేవారు. అన్ని జాతులు హోదాల ప్రజల్ని యేసు అక్కడ కలిసేవాడు. ఈ రీతిగా ఆయన పాఠాలు అనేక దేశాలికి, అనేక గృహాల్లోకి వెళ్లటం జరిగేది. ఈవిధంగా మెస్సీయాను గూర్చిన ప్రవచనాలపై ఆసక్తి రగుల్కొన్నది. రక్షకునిపై ప్రజల దృష్టి నిలిచింది. ఆయన పరిచర్యను గూర్చిన అవగాహన లోకం ముందుకి వచ్చింది. PKTel 36.3

మనం నివసిస్తున్న ఈ దినాల్లో అన్నితరగతుల పురుషులతోను స్త్రీలతోను అనేక జాతుల ప్రజలతోను పరిచయం చేసుకోటానికి ఇశ్రాయేలీయుల దినాల్లోకన్నా ఎక్కువ తరుణాలున్నాయి. రహదార్లు ప్రయాణాలు ఎన్నో రెట్లు పెరిగాయి. PKTel 37.1

నేడు లోకంలోని ఆయా ప్రాంతాలనుంచి వచ్చే జనసమూహాల్ని క్రీస్తులాగ సర్వోన్నతుని రాయబారులు ఈ రహదారుల్లో కలవటానికి అనుకూలమైన తావుల్లో ఉండాలి. ఆయనలాగే వారు దేవునిలోదాగి సువార్త విత్తనాల్ని వెదజల్లాలి. పరిశుద్ధ లేఖనాల్లోనుంచి ప్రశస్తమైన సత్యాల్ని ఇతరులుకి అందించాలి. ఆ విత్తనాలు వారి మనసుల్లోను హృదయాల్లోను వేరుబారి నిత్యజీవ ఫలాలు ఫలిస్తాయి. PKTel 37.2

పాలకుడు పాలితులు దేవుడు తమకిచ్చిన సమున్నత కర్తవ్యం నుంచి వైదొలగిన సంవత్సరాల్లో ఇశ్రాయేలు వైఫల్యం గంభీర పాఠాలు నేర్పింది. వారు ఎందులో బలహీనంగా ఉన్నారో - అపజయం పొందేంతగా - అందులో నేటి ఇశ్రాయేలీయులు అనగా దేవుని రాయబారులైన దేవుని యధార్థ సంఘ సభ్యులు బలంగా ఉండాలి. ఎందుకంటే మానవుడికి అప్పగించబడిన పనిని ముగించే బాధ్యత, ప్రతిఫలాలు లభించే ఆ చివరి దినాన్ని ప్రవేశపెట్టే బాధ్యత వారిమీద ఉన్నది. కాగా సొలొమోను పరిపాలనకాలంలో ఏ ప్రభావాలు ఇశ్రాయేలీయులికి వ్యతిరేకంగా పనిచేశాయో అవే ఇంకా పనిచేస్తున్నాయి. వాటిని ఎదుర్కొనవలసి ఉంది. నీతిని వ్యతిరేకించే శక్తులు బలంగా పాతుకుపోయాయి. దేవుని శక్తిద్వారా మాత్రమే విజయం సాధ్యమవుతుంది. మనముందున్న పోరాటం ఆత్మత్యాగ స్పూర్తిని కోరుతున్నది. స్వీయశక్తిని నమ్ముకోకుండా దేవునిమిదనే ఆధారపడటాన్ని, ఆత్మల్ని రక్షించటానికి ప్రతీ తరుణాన్ని విజ్ఞతతో ఉపయోగించటాన్ని కోరుతున్నది. పాపపు చీకటిలో మగ్గుతున్న లోకానికి క్రీస్తులో ప్రదర్శితమైన ఆత్మార్పణ స్పూర్తిలోను, మానవుణ్నిగాక దేవుణ్ని ఘనపర్చటంలోను, సువార్త దీవెన అవసరమైన వారికి నిర్విరామంగా సేవ చెయ్యటంలోను ఉన్న పరిశుద్దతా సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ ఆయన సంఘం సమైక్యంగా ముందుకి సాగినప్పుడు దేవుని దీవెనలు సంఘానికి లభిస్తాయి. PKTel 37.3