Go to full page →

57 - దిద్దుబాటు PKTel 470

యూదా ప్రజలు దైవ ధర్మశాస్త్రానికి విధేయులమై నివసిస్తామని బహిరంగంగా గంభీరంగా ప్రమాణం చేశారు. కాని ఎజ్రా నెహెమ్యాల ప్రభావం కొంతకాలం లేకపోయినప్పుడు అనేకమంది దేవున్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. నెహెమ్యా పారసీక దేశానికి తిరిగి వెళ్లాడు. యెరూషలేములో అతడు లేనికాలంలో చెడుగు దుష్కార్యాలు ప్రబలి జాతిని తప్పుదారి పట్టించే పరిస్థితి ఏర్పడింది. విగ్రహారాధకులు పట్టణంలో ప్రవేశించటమేకాదు తమ సముఖంవల్ల దేవాలయాన్నే కలుషితం చేశారు. జాత్యంతర వివాహంద్వారా ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు అమ్మోనీయుడైన టోబియాతో వియ్యమందాడు. టోబీయా ఇశ్రాయేలీయులికి బద్ద శత్రువు. ఈ అపవిత్ర బాంధవ్యం ఫలితంగా ఎల్యాషీబు టోబియాని దేవాలయానికి సంబంధించిన ఓ గదిలో నివాసం ఉండటానికి అనుమతి ఇచ్చాడు. ఆ గది. అప్పటివరకూ ప్రజల కానుకలు దశమభాగాలు భద్రపర్చే గదిగా వినియుక్తమౌతూ వచ్చింది. PKTel 470.1

అమ్మోనీయులు మోయాబీయులు ఇశ్రాయేలీయులపట్ల క్రూరంగా ప్రవర్తించి నందువల్ల వారు నిత్యం తన ప్రజల సహవాస సాంగత్యానికి దూరంగా ఉండాలని దేవుడు మోషేద్వారా ప్రకటించాడు. ద్వితి. 23:3-6 చూడండి. ఈ వాక్యాన్ని లెక్క చెయ్యకుండా ప్రధాన యాజకుడు దైవమందిరంలోని గదిలో ఉంచిన కానుకల్ని బైటపెట్టి ఆ నిషిద్ద జాతి ప్రతినిధికి అందులో వసతి ఏర్పాటు చేశాడు. దేవునికి ఆయన సత్యానికి విరోధి అయిన అట్టి వ్యక్తికి ఉపకారం చెయ్యటంకన్నా తీవ్రమైన దైవ ధిక్కారం ఇంకొకటి ఉండదు. PKTel 470.2

పారసీక దేశంనుంచి తిరిగివచ్చిన తర్వాత, ఇశ్రాయేలులో చోటుచేసుకున్న అపవిత్రతనుగూర్చి నెహెమ్యా విని తక్షణ చర్య తీసుకుని చొరబాటుదారుల్ని బహిష్కరించాడు. నెహెమ్యా ఇలా అంటున్నాడు, “బహుగా దుఃఖపడి ఆ గదిలోనుండి టోబియా యొక్క సామగ్రియంతయు అవతల పారవేసి, గదులన్నియు శుభ్రముగా చేయుడని యాజ్ఞాపించగా వారాలాగు చేసిరి. పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్దములను సాంబ్రాణిని నేనక్కడికి మరల రప్పించితిని.” PKTel 470.3

ఆలయాన్ని అపవిత్ర పర్చటమే కాదు కానుకల్ని కూడా దుర్వినియోగం చేశారు. ఇది ప్రజల దాతృత్వానికి విఘాతం కలిగించింది. వారి ఉత్సాహం ఉద్రేకం చల్లారాయి. దశమభాగం చెల్లింపుకి ప్రజలు ఆసక్తి కనపర్చలేదు. దైవ మందిరపు ఖజానాలో ద్రవ్యం కొరవడింది. ఆలయ సేవలకు నియుక్తులైన గాయనీగాయకులు తదితరులు ఆర్థిక మద్దతు కొరవడినందువల్ల దైవ సేవ విడిచిపెట్టి ఇతరత్రా ఉపాధులు చూసుకున్నారు. PKTel 471.1

ఈ లొసుగుల్ని సరిచెయ్యటానికి నెహెమ్యా పూనుకున్నాడు. దేవుని సేవను విడిచి పెట్టి వేరే పనులు చేస్తున్నవారిని నెహెమ్యా సమావేశపర్చి వారిని “తమ స్థలములలో మళ్లీ నియమించాడు. ఇది ప్రజల్లో నమ్మకం పుట్టించింది. యూదా దేశమంతా “ధాన్య ద్రాక్షరస తైలములలో పదియవ భాగము ఖజానాలోనికి తెచ్చిరి.” “నమ్మకముగల మనుష్యులని పేరుపొందిన” వారిని “ఖజానామిద... కాపరులుగా” నియమించటం జరిగింది. “తమ సహోదరులకు ఆహారము పంచిపెట్టుపని వారికి నియమింపబడెను.” PKTel 471.2

విగ్రహారాధకులతో సాహచర్యంవల్ల కలిగిన మరొక విపరిణామం నిజదేవుని ఆరాధకులుగా ఇశ్రాయేలు ప్రజల్ని వేరుచేసే చిహ్నమైన సబ్బాతును నిర్లక్ష్యం చెయ్యటం. చుట్టూ ఉన్న ప్రాంతాలనుంచి యెరూషలేముకి వచ్చే అన్యమత వ్యాపారులు వర్తకులు అనేకమంది ఇశ్రాయేలీయుల్ని సబ్బాతునాడు వ్యాపార లావాదేవీల్లో పాల్గోటానికి ప్రేరేపించేవారు. నియమానికి నీళ్లిదలటానికి ససేమిరా ఇష్టపడనివారు కొందరున్నా ఇతరులు సబ్బాతునుమిరి, మనస్సాక్షితో వ్యవహరిస్తున్నవారి నియమ నిబద్దతను దెబ్బతియ్యటానికి అన్యులతో చెయ్యి కలిపారు. అనేకులు సబ్బాతును బహిరంగంగా అతిక్రమించటానికి సాహసించారు. నెహెమ్యా ఇలా రాస్తున్నాడు, “ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతిదినమున ద్రాక్షతోట్లను తొక్కుటయు, గింజలు తొట్లలో పోయుటయు, గాడిదలమీద బరువులు మోయుటయు, ద్రాక్షరసమును ద్రాక్షాపండ్లను అంజూరపు పండ్లను నానావిధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేము లోనికి తీసికొని వచ్చుటయు.... తూరు దేశస్తులును కాపురముండి, యెరూషలేములోను విశ్రాంతి దినములో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి.” PKTel 471.3

అధికారులు తమ అధికారాన్ని వినియోగించి ఉంటే ఈ పరిస్థితిని నివారించ గలిగేవారు. కాని స్వీయ ప్రయోజనాల్ని సాధించుకోవాలన్న ఆశ వారు దుష్టుల్ని కొమ్ము కాయటానికి దారితీసింది. తమ విధి నిర్వహణ లోపానికి నెహెమ్యా వారిని మందలించాడు. “విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యము చేయుదురు? మీ పితరులును ఇట్లుచేసి దేవుని యొద్దనుండి మనమిదికిని యీ పట్టణము మీదికిని కీడు రప్పించలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి ఇశ్రాయేలీయులమిదికి కోపము మరి అధికముగా రప్పించుచున్నారు.” అంటూ కఠినంగా విమర్శించాడు. అనంతరం అతడు ఈ ఆజ్ఞ ఇచ్చాడు, “విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు” యెరూషలేము గుమ్మాల్ని మూసి ఉంచాలి, సబ్బాతు గడిచి పోయేవరకు వాటిని తెరువకూడదు. యెరూషలేము న్యాయాధికారులమీద కన్నా తన సొంత సేవకులమీద ఎక్కువ నమ్మకం ఉండటంవల్ల నెహెమ్యా తన ఆజ్ఞ నెరవేరేటట్లు చూడటానికి వారిని గుమ్మాలవద్ద మోహరించాడు. PKTel 471.4

తమ ప్రయత్నం విరమించుకోటానికి ఇష్టంలేక “వర్తకులును నానావిధములైన వస్తువులను అమ్మువారును ఒకటి రెండు మారులు యెరూషలేము అవతల” బస చేశారు. ప్రాకారంలోపలి పౌరులతోను వెలపల ఉన్న సామాన్య జనాలతోను వ్యాపారం చెయ్యటానికి అవకాశం దొరుకుతుందన్న ఆశాభావంతో ఉన్నారు. అది కొనసాగిస్తే తమకు శిక్ష తప్పదని నెహెమ్యా వారిని హెచ్చరించాడు. “మీరు గోడచాటున ఎందుకు బస చేసికొంటిరి? మీరు ఇంకొకసారి ఈలాగు చేసినయెడల మిమ్మును పట్టుకొందును” అని హెచ్చరించాడు. అప్పటినుండి విశ్రాంతిదినమున వారు మరి రాలేదు.” సామాన్య ప్రజలకన్నా లేవీయులికి ఎక్కువ గౌరవం ఉంటుందని, దేవుని సేవతో తమకున్న దగ్గర సంబంధాన్నిబట్టి వారు ధర్మశాస్త్ర విధేయతను ఉత్సాహంతో అమలు పర్చుతారని ఆశించటం సబబే. PKTel 472.1

నెహెమ్యా ఇప్పుడు జాత్యంతర వివాహాలు, విగ్రహారాధకులతో సాంగత్యం వలన ఏర్పడ్డ అపాయంపై తన దృష్టిని నిలిపాడు. అతడు ఇలా రాస్తున్నాడు, “ఆ దినములలో అష్టాదు అమ్మోను మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసికొనిన కొందరు యూదులు నాకు కనబడిరి. వారి కుమారులలో సగముమంది అష్టాదు భాష మాటలాడు వారు. వారు ఆయా భాషలు మాటలాడువారు గాని యూదుల భాష వారిలో ఎవరికిని రాదు.” PKTel 472.2

చట్ట సమ్మతంకాని ఈ సంబంధాలు ఇశ్రాయేలులో గందరగోళం సృష్టిస్తున్నాయి. అలాంటి సంబంధాలు ఏర్పర్చుకున్నవారిలో ఉన్నతాధికారులు, ప్రధానులు ఉన్నారు. వారు ప్రజలికి హితవాక్యాలు పలికేవారుగాను, ఆదర్శనీయులుగాను ఉండాల్సిన మనుషులు. ఈ దుస్సాంగత్యాన్ని కొనసాగిస్తే దేశంపైకి ముంచుకొచ్చే ముప్పును ముందుగానే చూసి నెహెమ్యా తప్పిదస్తులు అపరాధులతో మాట్లాడాడు. సొలొమోను సందర్భాన్ని ఎత్తిచూపిస్తూ, లోక రాజ్యాలన్నిటిలోను జ్ఞాన వివేకాల విషయంలో అతడిలాంటి మనిషి ఇంకెవ్వరూ లేరని వారికి గుర్తుచేశాడు. అయినప్పటికీ విగ్రహారాధక భార్యలు అతడి మనసును దేవునికి వ్యతిరేకంగా తిప్పివేశారని, అతడి ఆదర్శం అనేకమంది ఇశ్రాయేలీయుల్ని పాడు చేసిందని చెప్పాడు. “ఇంతగొప్ప కీడు చేయునట్లు... అన్య స్త్రీలను వివాహము చేసికొనిన మీవంటివారి మాటలను మేము ఆలకింప వచ్చునా?” అంటూ వారిని నెహెమ్యా నిగ్గదీశాడు. “మీరు వారి కుమారులకు మా కుమార్తెలను ఇయ్యకయు, మీ కుమారులకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలెను.” PKTel 472.3

దేవుని ఆజ్ఞల్ని బెదిరింపుల్ని, ఈ పాపం నిమిత్తమే గతంలో ఇశ్రాయేలీయులపై పడ్డ భయంకర తీర్పుల్ని నెహెమ్యా వారి ముందుంచినప్పుడు, వారి అంతరాత్మలు మేల్కొన్నాయి. ఫలితంగా దిద్దుబాటు ప్రారంభమయ్యింది. దేవుని కోపం చల్లారింది. ఆయన వారిని అంగీకరించి ఆశీర్వదించాడు. PKTel 473.1

పరిశుద్ధ హోదాలో ఉన్న కొందరు అన్యురాండ్రయిన తమ భార్యల పక్షంగా విజ్ఞాపన చేశారు. వారిని త్యజించటం సాధ్యపడదని వెల్లడించారు. అయినా ఎలాంటి వివక్షా చూపించటం జరగలేదు. ప్రతిపత్తికిగాని హోదాకిగాని ఎలాంటి విచక్షణా ప్రదర్శించటం జరగలేదు. యాజకుల్లోను ప్రధానుల్లోను ఎవరైతే విగ్రహారాధకులతో తమ బాంధవ్యాన్ని తెంచుకోటానికి నిరాకరించారో వారిని వెంటనే దేవుని సేవనుంచి తొలగించారు. ప్రధాన యాజకుడి మనవడొకడు దుష్ణుడు సన్బల్లటు కుమార్తెను వివాహం చేసుకోగా అతణ్ని పదవి భ్రష్ణుణ్ని చెయ్యటమేకాదు ఇశ్రాయేలు దేశంనుంచి బహిష్కరించారు కూడా. నెహెమ్యా ఇలా ప్రార్థించాడు, “నా దేవా, వారు యాజక ధర్మమును, యాజక ధర్మపు నిబంధనను, లేవీయుల నిబంధనను అపవిత్ర పరచిరి గనుక వారిని జ్ఞాపకముంచుకొనుము.” PKTel 473.2

అవసరమైన ఈ కాఠిన్యం మూల్యం నమ్మకమైన ఈ దైవ సేవకుడికి ఎంతటి మనస్తాపాన్ని వేదనను కలిగించిందో ఆ తీర్పు దినాన్నే వెల్లడవుతుంది. ప్రత్యర్థి శక్తులతో నిత్యం సంఘర్షణ సాగుతున్నది. తమ్ముని తాము తగ్గించుకుని ఉపవాసముండి ప్రార్థన చెయ్యటంవల్లనే వారు పురోగమించటం సాధ్యపడింది. PKTel 473.3

విగ్రహారాధక స్త్రీలను వివాహం చేసుకున్న అనేకమంది బహిష్కృతులతో కలిసి ప్రవాసంలోకి వెళ్లిపోటానికి ఎంపిక చేసుకున్నారు. వారు సమరయుల్లో కలిసి పోయారు. దేవుని సేవలో ఉన్నత హోదాలు అలంకరించిన కొందరు ఇక్కడకు చేరుకున్నారు. కొంతకాలమైన తర్వాత వారితో మమేకమయ్యారు. ఈ బాంధవ్యాన్ని బలోపేతం చేసుకోవాలన్న ఆకాంక్షతో సమరయులు యూదుల విశ్వాసాన్ని ఆచారాల్ని మరెక్కువగా అనుసరించటం మొదలుపెట్టారు. మతభ్రష్టులైన వీరు తమ పూర్వ సహోదరులకన్నా ఎక్కువ నిష్టగా ఉన్నట్లు చూపించుకోటానికి, యెరూషలేములోని దేవాలయానికి ఎదురుగా ఉన్న గెరిజీము కొండపై దేవాలయాన్ని నిర్మించారు. వారి మతం యూదమతం అన్యమతం ఈ రెండింటి మిశ్రమంగా కొనసాగింది. వీరు తాము దేవుని ప్రజలమని చెప్పుకోటం ఈ రెండు జాతులమధ్య చీలికకు, అనుకరణకు, వైరుధ్యానికి హేతువయ్యింది. PKTel 473.4

నేడు జరగాల్సిన సంస్కరణ కృషిలో పాపాన్ని ఉపేక్షించని లేక దేవుని ఘనతను నిరూపించటానికి వెనుకంజవేయని ఎజ్రా నెహెమ్యాల్లా పనిచెయ్యగల మనుషుల అవసరం ఎంతైనా ఉంది. ఈ సేవాభారం ఎవరిపై ఉన్నదోవారు తప్పు జరిగినప్పుడు నోరు మెదపకుండా ఉండరు. లేదా దుష్టతను ప్రేమ అనే ముసుగుతో కప్పిపెట్టరు. దేవుడు పక్షపాతికాడని, కొందరి పట్ల కాఠిన్యవైఖరి అనేకులకు దయగా పరిణమించ వచ్చునని వారు జ్ఞాపక ముంచుకుంటారు. దుర్మార్గాన్ని మందలించే వ్యక్తిలో ఎల్లప్పుడూ క్రీస్తు స్వభావం ప్రదర్శింతం కావాలని కూడా వారు జ్ఞాపక ముంచుకోవాలి. PKTel 474.1

తమ పనిలో ఎజ్రా నెహెమ్యాలు దేవుని ముందు తమ్ముని తాము తగ్గించుకున్నారు. తమ పాపాల్ని తమ ప్రజల పాపాల్ని ఒప్పుకుని క్షమాపణ వేడుకున్నారు. ప్రజల పాపాల్ని ఒప్పుకోటంలో అవి తమ పాపాలే అన్నట్లు వ్యవహరించారు. సహనంతో కష్టపడి పనిచేశారు. ప్రార్థించారు, శ్రమలు భరించారు. వారి కృషిని కఠినతరం చేసింది అన్యజనుల వ్యతిరేకత కాదు. స్నేహితులుగా నటించినవారి రహస్య వ్యతిరేకత. వారు దుర్మార్ధతకు తమ అండదండలు అందించటంద్వారా ఆ దైవ సేవకుల భారాన్ని పదంతలు చేశారు. దైవ ప్రజలతో పోరాడటంలో ఉపయోగించటానికి దేవుని విరోధులకు ఈ ద్రోహులు సాధనాల్ని సమకూర్చారు. వారి దురావేశాలు, తిరుగుబాటు స్వభావాలు దేవుని న్యాయవిధులతో సర్వదా సంఘర్షణ పడుతూ ఉండేవి. PKTel 474.2

నెహెమ్యా కృషి సాధించిన విజయం ప్రార్థన, విశ్వాసం జ్ఞానయుక్తమైన ధృఢమైన చర్య ఏమి సాధించగలవో సూచిస్తున్నది. నెహెమ్యా యాజకుడు కాడు. ప్రవక్తకాడు. గొప్పవాడినని చెప్పుకోలేదు. అతడు ఓ ప్రాముఖ్యమైన సమయానికి అవసరమైన దిద్దుబాటు నిమిత్తం దేవుడు లేపిన సంస్కర్త. తన ప్రజలు దేవునిపట్ల న్యాయంగా వ్యవహరించేటట్లు వారిని దిద్దటమే అతడి గురి. గొప్ప ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకుని దాన్ని సాకారం చెయ్యటానికి తన శక్తి సామర్థ్యాల్ని ధారపోశాడు. అతడి సేవలో మొక్కవోని విశ్వసనీయత ముంజేతి కంకణం. దుష్టత ఎదురైనప్పుడు, న్యాయానికి వ్యతిరేకత తారసల్లినప్పుడు అతడి నిశ్చితమైన వైఖరి ఎలాంటిదంటే ప్రజలు ఉత్సాహంతో ధైర్యంతో పని చెయ్యటానికి ఉత్తేజితులయ్యేవారు. ప్రజలు అతడి యదార్థతను, అతడి దేశభక్తిని, దేవునిపట్ల అతడి ప్రగాఢ ప్రేమను ప్రస్పుటంగా గుర్తించేవారు. ఇది చూసి వారు అతడు ఎక్కడకు నడిపిస్తే అక్కడకు వెళ్లటానికి సిద్ధంగా ఉండేవారు. PKTel 474.3

దేవుడు నియమించిన విధి నిర్వహణలో శ్రమించటం యధార్థ మతంలో ముఖ్యమైన భాగం. దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి మనుషులు పరిస్థితుల్ని దేవుని సాధనాలుగా మలుచుకుని పనిచెయ్యలి. సరిఅయిన సమయంలో సత్వర, నిర్ణయాత్మక చర్య ఉజ్వల విజయాలు సాధిస్తుంది. జాప్యం నిర్లక్ష్యం పరాజయాన్ని దేవునికి అపకీర్తిని కలుగజేస్తాయి. సువార్త పరిచర్యలోని నాయకులు ఉత్సాహోద్రేకాలు కనపర్చకపోతే, వారు నిర్లిప్తంగా, గురిలేకుండా ఉన్నట్లయితే, సంఘం అజాగ్రత్తగా, సోమరితనంగా, సుఖభోగాల్ని ప్రేమిస్తూ ఉంటుంది. అయితే వారు దేవున్ని మాత్రమే సేవించాలన్న పరిశుద్ద లక్ష్యం కలిగి ఉంటే, ప్రజలు కలిసికట్టుగా ఉండి నిరీక్షణతో నిండి సేవ చెయ్యటానికి ఆత్రంగా ఉంటారు. PKTel 475.1

దైవవాక్యంలో తీవ్ర వైరుధ్యాలు ఎన్నో ఉన్నాయి. పాపం పరిశుద్ధత ప్రక్కపక్కనే ఉంటాయి. వాటిని చూసి మనం ఒక దాన్ని విసర్జించి ఒకదాన్ని అంగీకరించవచ్చు. సన్బల్లటు టోబియా - ద్వేషం, మోసం, ద్రోహం, ఎజ్రా నెహెమ్యా సౌమ్యత, భక్తి భావం, ఆత్మ త్యాగాల్ని కూడా వర్ణిస్తున్నాయి. వీటిలో ఏదోదాన్ని ఎంపిక చేసుకుని అనుకరించటానికి మనకు స్వేచ్ఛ ఉన్నది. దేవుని ఆజ్ఞాతిక్రమంవల్ల కలిగే భయంకర పర్యవసానాలు ఆజ్ఞకు విధేయతవల్ల కలిగే దీవెనలకు ఎదురుగా కనిపిస్తాయి. ఏది చేసి బాధననుభవిస్తామో లేదా ఏది చేసి ఆనందాన్ని పొందుతామో నిర్ణయించు కోవలసింది మనమే. PKTel 475.2

జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యాల నేతృత్వంలో తిరిగివచ్చిన బానిసత్వ బందీలు నిర్వహించిన పునరుద్దరణ, దిద్దుబాటు కృషి లోక చరిత్ర చివరి దినాల్లో జరగాల్సిన ఆధ్మాత్మిక పునరుద్దరణ కృషిని సూచిస్తున్నది. శేషించిన ఇశ్రాయేలీయులు బలహీనులైన ప్రజలు. శత్రువులవల్ల ఎన్నో నష్టాలకు గురి అయిన ప్రజలు. అయినా వారి ద్వారానే తన్ను గూర్చిన, తన ధర్మశాస్త్రాన్ని గూర్చిన జ్ఞానాన్ని పరిరక్షించాలన్నది దేవుని సంకల్పం. యదార్థ దైవారాధనను కాపాడేవారు, పరిశుద్ద ధర్మశాసనాల్ని ఆచరించేవారు. వారే.” దేవాలయాన్ని యెరూషలేము ప్రాకారాన్ని పునర్నించినప్పుడు వారికి వివిధమైన అనుభవాలు కలిగాయి. వారు బలమైన వ్యతిరేకతను ఎదుర్కున్నారు. ఈ కృషిలోని నాయకులు వహించిన బాధ్యతలు బరువైనవి. అయినా ఈ మనుషులు అచంచల విశ్వాసంతో, దీన స్వభావంతో, దేవునిపై బలంగా ఆనుకుని, ఆయనే తన సత్యాన్ని గెలిపిస్తాడన్న నమ్మకంతో ముందుకు సాగారు. హిజ్కియా రాజువలే నెహెమ్యా “యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుదీయక... ఆజ్ఞలన్నిటిని గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా నుండెను.” 2 రాజులు. 18:6, 7. నెహెమ్యా దినాల్లో జరిగిన ఆధ్మాత్మిక పునరుద్ధరణ ఓ సంకేతం. దాన్ని యెషయా ఈ మాటల్లో సూచించటం జరిగింది. “చాలా కాలమునుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు. పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు. పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు. తరతరములనుండి శిథిలమైయున్న పురములను బాగు చేయుదురు.” “పూర్వకాలమునుండి పాడైనపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరల కట్టెదవు. విరుగబడిన దానిని బాగుచేయువాడవనియు దేశములో నివసించునట్లుగా త్రోవలు సిద్దపరచువాడ వనియు నీకు పేరుపెట్టుదురు.” యెష. 61:4; 58:12. PKTel 475.3

సామాన్యంగా ప్రజలు సత్యానికి నీతికి నీళ్లొదులుతున్న కాలంలో దేవుని రాజ్యానికి పునాది అయిన న్యాయవిధుల్ని పునరుద్ధరించటానికి కృషిసల్పే ఓ తరగతి ప్రజల్ని ప్రవక్త ఇక్కడ వర్ణిస్తున్నాడు. వారు దేవుని ధర్మశాస్త్రంలో కూల్చబడ్డ దాన్ని బాగు చేసేవారు. తాను ఎంపిక చేసుకున్నవారి సంరక్షణకోసం ఆయన కట్టిన గోడ అది. దాని నీతి సూత్రాలకు, సత్యానికి, పరిశుద్దతకు విధేయంగా నివసించటమే వారికి నిత్యం రక్ష. PKTel 476.1

గోడను నిర్మించే ఈ శేషించిన ప్రజల ప్రత్యేక కర్తవ్యాన్ని ప్రవక్త ఈ స్పష్టమైన మాటల్లో వివరిస్తున్నాడు. “నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్టితమైన దినమని నీవు ఊరకుండిన యెడల విశ్రాంతి దినము మనోహరమైన దనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీ కిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల నీవు యెహోవాయందు ఆనందించెదవు. దేశముయొక్క ఉన్నత స్థలములమీద నేను నిన్నెక్కించెదను. నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే.” యెష. 58:13,14. PKTel 476.2

అంత్యకాలంలో ప్రతీ దైవ వ్యవస్త పునరుద్ధరణ పొందాల్సి ఉంది. మానవుడు సబ్బాతును మార్చినప్పుడు దైవధర్మ శాస్త్రానికి ఏర్పడ్డ గండిని బాగు చెయ్యాల్సి ఉంది. స్థిరమైన దిద్దుబాటుకు దైవధర్మశాస్త్రం పునాది అని, నాల్లో ఆజ్ఞలోని సబ్బాతు సృష్టి జ్ఞాపకార్థ చిహ్నంగాను దేవుని శక్తిని నిత్యం స్పురణకు తెచ్చేదిగాను ఉన్నదని శేషించిన దైవప్రజలు లోకంముందు దిద్దుబాటుదారులుగా నిలిచి ప్రదర్శించాల్సి ఉన్నారు. పది ఆజ్ఞలకు విధేయులై నివసించటం అవసరమని వారు స్పష్టంగా స్పష్టమైన మార్గాల్లో చూపించాలి. బలవంతంచేసే క్రీస్తు ప్రేమ ఆధారంగా పాడైన స్థలాల్ని నిర్మించటంలో ఆయనకు సహకరించాల్సి ఉన్నారు. విరగబడిన దాన్ని బాగుచేసే వారుగా దేశంలో నివసించేందుకుగాను త్రోవల్ని సిద్దపర్చేవారుగా వారు ఉండాలి. PKTel 476.3