Go to full page →

10 - తీవ్రంగా మందలించిన స్వరం PKTel 77

ఏలీయా కొంతకాలం కెరీతువాగు పక్కనున్న పర్వతాల్లో దాగి ఉన్నాడు. అక్కడ అనేక మాసాలు అతడికి అద్భుతంగా ఆహారం సరఫరా అయ్యింది. అనంతరం అనావృష్టి కారణంగా వాగు ఎండిపోటం దుర్భిక్షం కొనసాగటంతో ఒక అన్యదేశంలో ఆశ్రయం పొందాల్సిందిగా ఏలీయాను దేవుడు ఆదేశించాడు. ఆయన ఇలా ఆదేశించాడు, “నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికిపోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక విధవరాలికి నేను సెలవిచ్చితిని.” PKTel 77.1

ఈమె ఇశ్రాయేలీయురాలు కాదు. దేవుడు ఎన్నుకున్న ప్రజలు పొందిన ఆధిక్యతల్ని దీవెనల్ని ఈమె పొందలేదు. కాని ఆమె యధార్థ దేవుని విశ్వసించిన స్త్రీ. తన మార్గంలో ప్రకాశించిన వెలుగంతటిలోనూ ఆమె నడిచింది. ఇప్పుడు ఇశ్రాయేలులో ఏలీయాకు భద్రత లేకపోవడంతో దేవుడు అతణ్ని ఈ స్త్రీ వద్దకు పంపించాడు. ఇక్కడ అతడు ఆశ్రయం పొందాల్సి ఉన్నాడు. PKTel 77.2

“అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి - త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసికొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడామెను మరల పిలిచి - నాకొక రొట్టెముక్కను నీ చేతితో తీసికొని రమ్మని చెప్పెను.” PKTel 77.3

పేదరికం అనుభవిస్తున్న ఈ గృహంలో పులిమీద పుట్రలా కరవు ఒత్తిడి ప్రబలంగా ఉంది. ఉన్నకొద్ది బత్తెం దాదాపు అయిపోయింది. ప్రాణం నిలుపుకోటానికి తాను సలుపుతున్న పోరాటాన్ని ఇక కొనసాగించలేనని ఆ విధవరాలు చేతులెత్తేసిన తరుణంలో ఏలీయా రాక, తనకు అవసరమైన వాటిని దేవుడే సమకూర్చుతాడన్న తన విశ్వాసానికి తీవ్ర పరీక్షగా మారింది. అయినా తన తీవ్ర విపత్తులో సైతం తన చివరి భోజనంలో పాలుపంచుకోగోరిన పరదేశి మనవిని మన్నించటంద్వారా తన విశ్వాసం ఎలాంటిదో చాటి చెప్పింది. PKTel 77.4

అన్నపానాలు కోరుతూ ఏలీయా చేసిన మనవికి విధవరాలు ఇలా సమాధాన మిచ్చింది, “నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నాయొద్ద నున్నవేగాని అప్పమొకటైనను లేదు, మేము చావక ముందు నేను ఇంటికిపోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసికొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితిని.” ఆమెతో ఏలీయా ఇలా అన్నాడు, “భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము; అయితే నాకొక చిన్న అప్పము మొదటచేసి నాయొద్దకు తీసికొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసికొనుము. భూమిమీద యెహోవా వరము కురిపించువరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువకాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు.” PKTel 78.1

ఇంతకన్న గొప్ప విశ్వాస పరీక్ష ఎవరికీ వచ్చి ఉండదు. క్రితంలో ఈ విధవరాలు పరదేశులికి దయగా ఉదారంగా ఆతిథ్యమిచ్చేది. ఇప్పుడు తనకు తన బిడ్డకు లేమికలిగే ప్రమాదమున్నప్పటికీ ఇశ్రాయేలు దేవుడు తనకవసరమైన ప్రతీదాన్నీ సమకూర్చుతాడని విశ్వసించి “ఏలీయా చెప్పిన మాట చొప్పున చెయ్యటంద్వారా ఈ సర్వోన్నత పరీక్షలో నెగ్గింది. PKTel 78.2

ఈ ఫొనీషియా స్త్రీ దైవ ప్రవక్తకు ఇచ్చిన ఆతిథ్యం అద్బుతమైనది. ఆమె విశ్వాసానికి ఔదార్యానికి కలిగిన ప్రతిఫలం కూడ అద్బుతమైనది. “అతడును ఆమెయు ఆమె యింటివారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువకాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. PKTel 78.3

“అటు తరువాత ఆ యింటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగియై ప్రాణము నిలువ జాలనంత వ్యాధిగలవాడయెను. ఆమె ఏలీయాతో - దైవజనుడా, నాయొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నాయొద్దకు వచ్చితివా? అని మనవి చేయగా PKTel 78.4

“అతడు - నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి, ఆమె కౌగిటిలోనుండి వానిని తీసికొని తానున్న పై అంతస్తు గదిలోకి పోయి తన మంచము మీద వాని పరుండ బెట్టి .. ఆ చిన్నవానిమీద ముమ్మారు తాను పారచాచుకొని .... యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రదికెను. PKTel 78.5

“ఏలీయా ఆ చిన్నవాని తీసికొని గదిలోనుండి దిగి యింట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి - ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రదుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలీయాతో - నీవు దైవ జనుడవైయున్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదు ననెను.” PKTel 78.6

సారెపతు విధవరాలు తన ఆహారాన్ని ఏలీయాతో పంచుకుంది. ఫలితంగా ఆమె ప్రాణం, ఆమె కుమారుడి ప్రాణం పరిరక్షించబడ్డాయి. శ్రమల్లో లేమిలో మరెక్కువ అవసరం ఉన్న ఇతరులికి సానుభూతి చూపి సహాయమందించే వారందరికీ దేవుడు విస్తారమైన దీవెనలు వాగ్దానం చేస్తున్నాడు. ఆయనలో మార్పులేదు. ఆయన శక్తి ఏలీయా దినాల్లోకన్నా ఇప్పుడు తగ్గలేదు. “ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును.” (మత్త. 10:41) అని రక్షకుడన్నప్పుడు ఈ మాటలకున్న నిశ్చయత ఇప్పుడు ఏమి తగ్గలేదు. PKTel 79.1

“ఆతిథ్యము చేయ మరవకుడి; దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి.” హెబ్రీ. 13:2. ఈ మాటల ప్రాధాన్యం కాల గమనంతో ఏమాత్రం తగ్గలేదు. మన పరలోకపు తండ్రి తన బిడ్డలకు దీవెనలుగా పరిణమించే అవకాశాల్ని వారిమార్గంలో పెడుతూ ఉంటాడు. ఈ అవకాశాల్ని సద్వినియోగం చేసుకునేవారు అమితానంద భరితులవుతారు. “ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచిన యెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. అంధకారము నీకు మధ్యాహ్నమువలె నుండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ యెముకలను బలపరచును. నీవు నీరుకట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు.” యెష. 58:10,11. PKTel 79.2

నేడు తన నమ్మకమైన సేవకులతో క్రీస్తు ఇలా అంటున్నాడు, “మిమ్మును చేర్చు కొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వాని చేర్చుకొనును.” ఆయన పేర జరిగిన ఏ దయా కార్యమైనా గుర్తింపు పొందుతుంది. దానికి ప్రతిఫలం ఉంటుంది. దేవుని కుటుంబములోని మిక్కిలి బలహీనుల్ని మిక్కిలి అల్పుల్ని ఈ గుర్తింపులో క్రీస్తు చేర్చుతున్నాడు, “ఈ చిన్నవారిలో ఒకనికి” - విశ్వాసంలోను క్రీస్తును గూర్చిన జ్ఞానంలోను - “శిష్యుడని యెవడు ... గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.” మత్త. 10:40,42. PKTel 79.3

అనావృష్టి క్షామం కొనసాగిన సంవత్సరాల్లో ఇశ్రాయేలు జనుల హృదయాలు విగ్రహారాధననుంచి వెనుదిరిగి దేవునికి నమ్మకంగా ఉండేటట్లు మార్పు చెందాలని ఏలీయా చిత్తశుద్ధితో ప్రార్థన చేశాడు. రుజాగ్రస్తమైన ఆ దేశంపట్ల దేవుడు కఠినంగా వ్యవహరిస్తున్న తరుణంలో ప్రవక్త ఓపికగా కనిపెట్టాడు. బాధ లేముల నిదర్శనాలు అన్నిచోట్లా దర్శనమిచ్చినప్పుడు అతడి హృదయం దుఃఖంతో నిండింది. అయితే దేవుడే తన ప్రణాళికను అమలు చేస్తున్నాడు. ఆయన సేవకుడు చేయాల్సిందల్లా విశ్వాసంతో ప్రార్థిస్తూ ఆయన తీసుకునే చర్యకోసం కనిపెట్టటం. PKTel 79.4

అహాబు దినాల్లో ప్రబలుతున్న మతభ్రష్టత అనేక సంవత్సరాలుగా సాగిన దుర్మార్గత ఫలితం. అంచెలంచెలుగా ఏటికేడాది ఇశ్రాయేలు నీతిమార్గాన్ని విడిచిపెడ్తూ వచ్చింది. తరతరాలుగా వారి పాదాలు తిన్నని మార్గాల్లో నడవటానికి నిరాకరించాయి. తుదకు అధికసంఖ్యాక ప్రజలు చీకటిశక్తుల నాయకత్వానికి తమ్మును తాము అప్పగించుకున్నారు. PKTel 80.1

తమ దినదిన కృపలకు దేవునిపై ఆధారపడటాన్ని గూర్చి దావీదు రాజు ఏలుబడి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు సంఘటితంగా ఉత్సాహానందాలతో పరిశుద్దగీతాలతో సర్వోన్నతుని సన్నుతించి దాదాపు ఒక శతాబ్దం గతించింది. వారు ఈ మాటలతో ఆయన్ని సన్నుతిస్తూ ఆరాధించారు : PKTel 80.2

“మాకు రక్షణకర్తవైన దేవా, ...
ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోష
భరితములుగా చేయుచున్నావు
నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు
దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు
దేవుని నది నీళ్లతో నిండియున్నది
నీవు భూమిని అట్లు సిద్దపరచిన తరువాత
వారికి ధాన్యము దయచేయుచున్నావు
దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి
దాని గనిమలను చదును చేయుచున్నావు
వాన జల్లులచేత దానిని పదును చేయుచున్నావు
అది మొలకెత్తగా నీవు దాని నాశీర్వదించుచున్నావు
సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసియున్నావు
నీ జాడలు సారము వెదజల్లుచున్నవి
అడవి బీడులు సారము చిలకరించుచున్నవి
కొండలు అందమును నడికట్టుగా ధరించుకొనియున్నవి
పచ్చికపట్లు మందలను వస్త్రమువలె ధరించియున్నవి
లోయలు సస్యములతో కప్పబడియున్నవి
అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి PKTel 80.3

అన్నియు గానము చేయుచున్నవి.” కీర్త. 65:5, 8-13.

“భూమికి పునాదులు వేసిన” వానిగా ఇశ్రాయేలు దేవుని గుర్తించింది.తమ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఇశ్రాయేలు ప్రజలు ఇలా గానం చేశారు : PKTel 80.4

“దానిమీద అగాధ జలములను నీవు వస్త్రమువలె కప్పితివి
కొండలకు పైగా నీళ్లు నిలిచెను
నీవు గద్దింపగనే అవి పారిపోయెను
నీ ఉరుముల శబ్దము విని అవి త్వరగా పారిపోయెను
నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై
అవి పర్వతములెక్కెను పల్లెలకు దిగెను
అవి మరలివచ్చి భూమిని కప్పక యుండనట్లు
అవి దాటలేని పరిధులను నీవు వాటికి నియమించితివి.” PKTel 81.1

కీర్త. 104:5-9.

భూమిమీద సముద్రంలో ఆకాశంలో ఉన్న ప్రకృతి శక్తుల్ని వాటివాటి నియమిత పరిమితుల్లో ఉంచుతున్నది ఆ అనంత దేవుని మహాశక్తే. తాను సృజించిన ప్రాణుల ఆనందంకోసం ఈ ప్రకృతి శక్తుల్ని ఆయన వినియోగిస్తాడు. మానవుడి హస్తాలు చేసే కార్యమంతటిని ఆశీర్వదించుటకును” “వర్షము దాని కాలమందు కురిపించుటకును” ఆయన తన “మంచి నిధిని” ధారాళంగా వ్యయం చేస్తాడు. ద్వితి. 28:12. PKTel 81.2

“ఆయన కొండ లోయలలో నీటి బుగ్గలను పుట్టించును
అవి మన్యములలో పారును
అవి అడవి జంతువులన్నిటికి దాహమిచ్చును
వాటివలన అడవి గాడిదలు దప్పితీర్చుకొనును
వాటి ఒడ్డున ఆకాశపక్షులు వాసము చేయును
కొమ్మల నడుమ అవి సునాదము చేయును ....
పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర
మొక్కలను
ఆయన మొలిపించుచున్నాడు
అందుమూలమున భూమిలోనుండి ఆహారమును
నరుల హృదయమును సంతోషపెట్టుటకు ద్రాక్షారసమును
వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును
నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన
పుట్టించుచున్నాడు ....

“యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధముగా
నున్నవి!
జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి
నీవు కలుగజేసిన వాటితో భూమి నిండియున్నది.
అందులో లెక్కలేని జలచరములు
దానిలో చిన్నవి పెద్దవి జీవరాసులున్నవి .... ఇవన్నియు నీకొరకు కనిపెట్టుచున్నవి
నీవు వాటికి పెట్టునవి అవి కూర్చుకొనును; br/>
“నీవు గుప్పిలి విప్పగా అవి మంచివాటిని తిని తృప్తి br/> పరచబడును.” PKTel 81.3

కీర్త. 104:10-15, 24-28.

ఇశ్రాయేలు ప్రజలు సంతోషించటానికి గొప్ప కారణం ఉంది. ప్రభువు వారిని తీసుకువచ్చిన దేశం పాలుతేనెలు ప్రవహించే దేశం. వర్షానికి ఎలాంటి కొరతా ఎన్నడూ ఉండని దేశానికి తమను నడిపిస్తున్నానని తమ అరణ్య సంచారంలో వారికి ప్రభువు హామీ ఇచ్చాడు. ప్రభువు వారితో ఇలా అన్నాడు, “మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిదికాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూరతోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్లుచున్న దేశము కొండలు, లోయలు గల దేశము. అది ఆకాశ వరజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము.నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడు దానిమీద ఉండును.” వర్ష సమృద్ది వాగ్దానాన్ని వారి విధేయత షరతుపై ఇవ్వటం జరిగింది. ప్రభువిలా అన్నాడు, “మి పూర్ణ హృదయముతోను, మా పూర్ణాత్మతోను మి దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన యెడల మీ దేశమునకు వరము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందునట్లు నీ పశువులకొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను.” PKTel 82.1

ప్రభువు ఇలా హెచ్చరించాడు, “మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి యితర దేవతలను పూజించి వాటికి నమస్కరించకుండా మీరు జాగ్రత్త పడుడి. లేనియెడల యెహోవా మిమీద కోపపడి ఆకాశమును మూసివేయును; అప్పుడు వాన కురియదు, భూమి పండదు, యెహోవా మికిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండ మిరు శీఘ్రముగ నశించెదరు.” ద్వితి. 11:10-17. PKTel 82.2

ఇశ్రాయేలువారిని ఇలా హెచ్చరించటం జరిగింది, “నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు ఆచరించి నడుచుకొనిన యెడల నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట విననియెడల ... నీ తల పైని ఆకాశము ఇత్తడివలె ఉండును, నీ క్రిందనున్న నేల యినుమువలె ఉండును. యెహోవా నీ దేశపు వర్పమును ధూళిగాను బుగ్గిగాను చేయును; నీవు నశించువరకు అది ఆకాశమునుండి నీ మీదికి వచ్చును.” ద్వితి. 28:15,23,24. PKTel 82.3

ఇశ్రాయేలీయులికి యెహోవా అందించిన జ్ఞానయుక్తమైన సలహాల్లో కొన్ని, “మీరు ఈ నా మాటలను మీ హృదయములలోను మీ మనస్సులలోను ఉంచుకొన వలెను. వాటిని మీ చేతులమీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికముగా ఉండవలెను. నీవు నీ యింట కూర్చుండునప్పుడు త్రోవను నడచునప్పుడు, పడుకొనునప్పుడు లేచునప్పుడు వాటినిగూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు” నేర్పించాలి. ద్వితి. 11:18,19. ఇవి స్పష్టమైన ఆజ్ఞలు. అయినా శతాబ్దాలు గతించేకొద్దీ ప్రతీతరంలోని ప్రజలు తమ ఆధ్యాత్మిక సంక్షేమానికి ఏర్పాటైన దైవవిధుల్ని విస్మరించటంతో మతభ్రష్టత, దుష్ప్రభావాలు దైవకృప స్థాపించిన భద్రతను తుడిచివేసే ప్రమాదం ఏర్పడింది. PKTel 83.1

కాబట్టి దేవుడు ఇప్పుడు తన ప్రజలమీదికి కఠినమైన తీర్పులు పంపటం జరిగింది. ఏలీయా ప్రవచించింది నెరవేరుతున్నది. ఈ విపత్తును గూర్చిన వర్తమానాన్ని తెచ్చిన దైవసేవకుడి కోసం పట్టణాల్లోను, రాజ్యాల్లోను మూడు సంవత్సరాలు గాలింపు సాగింది. అహాబు ఆదేశం మేరకు అనేకమంది రాజులు ఏలీయా ప్రవక్త తమ రాజ్యాల్లో లేడని తమ గౌరవం మీద ఒట్టు పెట్టుకుని ప్రమాణం చేశారు. అయిన అతడికోసం గాలింపు కొనసాగింది. ఎందుకంటే యెజెబెలు, బయలు ప్రవక్తలు అతణ్ని ద్వేషించారు. అతణ్ని తమ వశంలోకి తెచ్చుకోటానికి శాయశక్తులా ప్రయత్నించారు. ఇంకా వర్షం లేదు. PKTel 83.2

కడకు “అనేక దినములైన తరువాత” యెహోవా వాక్కు ఏలీయాకు ప్రత్యక్షమై “నేను భూమిమీద వర్షము కురిపించబోవు చున్నాను; నీవు వెళ్లి అహాబును దర్శించుమని” సెలవిచ్చింది. PKTel 83.3

దేవుని ఆజ్ఞ ప్రకారం “అహాబును దర్శించుటకై ఏలీయా వెళ్లిపోయెను.” ప్రవక్త షోమ్రోనుకి దాదాపు తన ప్రయాణాన్ని ప్రారంభించిన సమయంలో మేతలేక కృషించిపోతున్న పశువులు, మేకలు, గొర్రెల మందలకు పచ్చగడ్డి దొరుకుతుందన్న ఆశతో ఎక్కడైన నీటి బుగ్గలు, వాగులు ఉంటాయోమోనని శ్రద్దగా వెదకవలసిందిగా తన గృహ నిర్వాహకుడైన ఓబద్యాకు అహాబు ప్రతిపాదించాడు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న అనావృష్టి ఫలితాలు రాజు ఆస్థానంలో సయితం కనిపించాయి. తన ఇంటివారి భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ రాజు తన సేవకుడితో కలిసి పచ్చిగడ్డి బీడులకోసం వ్యక్తిగతంగా వెదకాలని నిశ్చయించుకున్నాడు. కాబట్టి వారు దేశమంతట సంచరింప వలెనని చెరియొక పాలు తీసికొని, అహాబు ఒంటరిగా ఒకవైపునకు ఓబద్యా ఒంటరిగా నింకొకవైపునకును వెళ్లిరి.” PKTel 83.4

“ఓబద్యా మార్గమున పోవుచుండగా ఏలీయా అతనిని ఎదుర్కొనెను. ఓబద్యా యితనినెరిగి నమస్కారము చేసి - నా యేలినవాడవైన ఏలీయావు నీవే గదా” అని అడిగాడు. PKTel 84.1

ఇశ్రాయేలీయుల మతభ్రష్టత కాలంలో ఓబద్యా దేవునికి నమ్మకంగా నిలిచాడు. అతడి యజమాని అహాబు రాజు సజీవ దేవునిపై అతడి విశ్వాసాన్ని మార్చలేకపోయాడు. ఇప్పుడతడికి ఏలీయా ఒక కార్యాన్నప్పగించి గౌరవించాడు. “నీవు నీ యేలినవాని చెంతకు పోయి, ఏలీయా యిచ్చట ఉన్నాడని చెప్పుము.” అన్నాడు. PKTel 84.2

భయాందోళనలతో నిండిన ఓబద్యా “నేను చావవలెనని నీ దాసుడనైన నన్ను అహాబు చేతికి నీవు అప్పగింపనేల? నేను చేసిన పాపమేమి?” అన్నాడు. అతడిలా విశదీకరించాడు, “నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలెనని నా యేలినవాడు దూతలను పంపించని జనమొకటైనను లేదు, రాజ్యమొకటైనను లేదు; అతడు ఇక్కడ లేడనియు, అతని చూడలేదనియు, వారు ఆయా జనములచేతను రాజ్యములచేతను ప్రమాణము చేయించుచు వచ్చిరి. నీవు - నీ యేలినవాని చెంతకు పోయి, ఏలీయా యిచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే; అయితే నేను నీయొద్దనుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచుపోవును. అప్పుడు నేను పోయి అహాబునకు వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడని యెడల అతడు నన్ను చంపివేయును.” PKTel 84.3

తనకు ఆ కార్యం అప్పగించవద్దని ఓబద్యా ప్రవక్తను బతిమాలుకున్నాడు. “నీ దాసుడైన నేను బాల్యమునుండి యెహోవాయందు భయభక్తులు నిలిపినవాడను. యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా యేలిన వాడవైన నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రవక్తలలో నూరుమందిని గుహకు ఏబదేసి మంది చొప్పున దాచి, అన్నపానములిచ్చి వారిని పోషించితిని. ఇప్పుడు అహాబు నన్ను చంపునట్లుగా - నీ యేలినవాని దగ్గరకు పోయి ఏలీయా యిచ్చట ఉన్నాడని చెప్పుమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే?” అన్నాడు. PKTel 84.4

తాను చేపట్టనున్న కార్యం విఫలమవ్వదని ఏలీయా ఓబద్యాకు ప్రమాణం చేసి చెప్పాడు. ఏలీయా ఇలా అన్నాడు, “ఎవని సన్నిధిని నేను నిలువబడి యున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను అహాబును దర్శించుదునని చెప్పుచున్నాను.” ఈ భరోసాతో “ఓబద్యా అహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును” తెలియజేశాడు. PKTel 84.5

తాను ఎవరికి భయపడ్డూ ఎవరిని ద్వేషిస్తూ ఎవరికోసం అవిశ్రాంతంగా వెదకుతూ ఉన్నాడో ఆ ఏలీయా ఓబద్యాతో పంపిన వర్తమానాన్ని రాజు భయాశ్చర్యాలతో విన్నాడు. కేవలం తనను కలవటానికే ఏలీయా తన ప్రాణానికి అపాయం కొనితెచ్చుకోడని అతడికి బాగా తెలుసు. ప్రవక్త ఇశ్రాయేలు మీద మరో శాపం ప్రకటించటానికి వస్తున్నాడా? రాజు హృదయం భయంతో వణకుతున్నది. యరొబాము చెయ్యి ఎండిపోవటం గుర్తుకు వచ్చింది. ఆ ఆదేశానికి లోబడకుండా ఉండలేకపోయాడు. దైవ సేవకుడిమీద చెయ్యెత్తటానికి సాహసించ లేకపోయాడు. కనుక కలవరంతో నిండిన రాజు ఒక రక్షక భటుణ్ని వెంటబెట్టుకుని ప్రవక్తను కలవటానికి వెళ్లాడు. PKTel 85.1

రాజు ప్రవక్త ముఖాముఖి నిలబడ్డారు. అహాబు తీవ్రద్వేషంతో నిండి ఉన్నా ఏలీయా సమక్షంలో శక్తిలేనివాడిలా కనిపించాడు. “ఇశ్రాయేలువారిని శ్రమ పెట్టువాడవు నీవేకావా?” అని అతడు తడబడ్డూ అన్న మొదటి మాటల్లో రాజు తన మనోగతాల్ని అప్రయత్నంగా వ్యక్తం చేస్తున్నాడు. ఆకాశం వరాన్ని ఇవ్వకపోవటం దేవుని మాటవల్ల జరిగినదని అహాబుకి తెలుసు. అయినా ఆ దేశం పైకి దేవుడు పంపిన తీర్పులికి ప్రవక్తని నిందించటానికి ప్రయత్నించాడు. PKTel 85.2

నీతిమార్గం నుంచి తొలగిపోవటంవల్ల సంభవించే విపత్తులకు దేవుని సేవకుల్ని బాధ్యుల్ని చేసి నిందించటం అపరాధులికి స్వాభావికం. సాతాను అదుపును అంగీకరించేవారు పరిస్థితుల్ని దేవుడు చూసినట్లు చూడలేరు. వారిముందు సత్యమనే అద్దాన్ని ఉంచినప్పుడు గద్దింపు పొందటమన్న ఆలోచన వారికి కోపం పుట్టిస్తుంది. వారు పాపానికి గుడ్డివారవుతారు. పశ్చాత్తాప పడటానికి నిరాకరిస్తారు. దేవుని సేవకులు తమపట్ల శత్రుత్వం వహిస్తున్నారని కనుక వారు తీవ్ర ఖండనకు అర్హులని భావిస్తారు. PKTel 85.3

అహాబు ముందు నిర్దోషిగా నిర్భయంగా నిలబడి ఏలీయా తన్ను గూర్చి సాకులు చెప్పటానికి గాని లేక రాజుని పొగడటానికి గాని ప్రయత్నించలేదు. అనావృష్టి కాలం దాదాపు ముగిసిపోయిందన్న మంచి వార్త చెప్పటం ద్వారా రాజు కోపాన్ని చల్లార్చటానికి ప్రయత్నించలేదు. అతడు క్షమాపణ చెప్పుకోవాల్సింది. ఏమిలేదు. అహాబు వేసిన నిందను దేవుని నామం విషయంలో పట్టుదలతో రోషంతో అతడి పాపాలు అతడి తండ్రుల పాపాలే ఇశ్రాయేలు ప్రస్తుత శ్రమలకు విపత్తుకు కారణమని నిర్భయంగా తిప్పికొట్టాడు. జంకు కొంకు లేకుండా ఏలీయా ఇలా అన్నాడు, “నేను కాదు, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలు దేవత ననుసరించు నీవును, నీ తండ్రి యింటివారును ఇశ్రాయేలువారిని శ్రమలు పెట్టువారైయున్నారు.” PKTel 85.4

నేడు అలాంటి తీవ్ర మందలిపు గళం అవసరం. ఎందుకంటే ఘోర పాపాలు ప్రజల్ని దేవునినుంచి వేరు చేస్తున్నాయి. దాంపత్య ద్రోహం ఫ్యాషన్ గా మారింది. “ఇతడు మమ్ము నేలుట మాకిష్టములేదు.” (లూకా 19:4) అన్నది అనేకులు మాట్లాడే భాష. తరచు ప్రసంగికులు చేసే సరళ ప్రసంగాలు పనికి రావటంలేదు. బూర ధ్వని నిర్దిష్టంగా ఉండటంలేదు. దేవుని వాక్యంలోని సరళమైన పదునైన సత్యాలు మనుషుల హృదయాల్ని చీల్చటం లేదు. PKTel 86.1

అంత స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అన్న తమ వాస్తవ మనోగతాన్ని వ్యక్తంచేసే నామమాత్రపు క్రైస్తవులు చాలామంది ఉన్నారు. బాప్తిస్మమిచ్చే యోహాను “సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ది చెప్పినవాడెవడు?” (లూకా. 8:7) అనాల్సిన పని ఏమిటి? అని వారు ప్రశ్నించవచ్చు. తన సహోదరుడి భార్యను ఉంచుకోటం అక్రమం అని హేరోదుకి చెప్పి అతడి కోపాన్ని యోహాను ఎందుకు రేపాల్సి వచ్చింది? క్రీస్తుకి పురోగామిగా ఉన్న అతడు సూటిగా మాట్లాడి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. పాపంలో ఉన్నవారి అసంతృప్తికి గురికాకుండా అతడు ఎందుకు చూసి చూడనట్లు వ్యవహరించలేదు? PKTel 86.2

ధర్మశాస్త్రాన్ని నమ్మకంగా పరిరక్షించాల్సిన వ్యక్తులు విశ్వసనీయత స్థానాన్ని వ్యవహార దక్షతకు ఇచ్చిన పాపాన్ని గద్దింపు లేకుండా విచ్చలవిడిగా సాగనిచ్చేంతవరకు ఇలా వాదిస్తున్నారు. సంఘంలో నమ్మకమైన గద్దింపు గళం మరోసారి ఎప్పుడు వినిపిస్తుంది? PKTel 86.3

“ఆ మనుష్యుడవు నీవే,” 2 సమూ. 12:7. నాతాను దావీదుతో అన్న ఇలాంటి సూటిమాటలు నేడు ప్రసంగ వేదికనుంచి వినిపించటంగాని వార్తా పత్రికల్లో కనిపించటం గాని అరుదయ్యింది. అవి అరుదు కాకుండా ఉండి ఉంటే మనుషుల మధ్య దేవుని శక్తి మరెక్కువగా ప్రదర్శితం కావటం జరిగేది. మనుషుల పోగడ ఆశించటం గురించి, మనుషుల్ని సంతోష పెట్టటానికి ప్రయత్నించి తద్వారా వారు సత్యాన్ని అణచి వెయ్యటానికి తోడ్పడటం గురించి పశ్చాత్తాపపడేవరకు దైవసేవకులు తమ సేవలు ఫలవంతం కావటంలేదని ఫిర్యాదు చెయ్యకూడదు. PKTel 86.4

మనుషుల్ని సంతోష పెట్టటానికి చూసే బోధకులు, దేవుడు శాంతిని ఉద్దేశించినప్పుడు శాంతి శాంతి అని కేకలు వేసే బోధకులు తమ అపనమ్మకానికి నైతిక శక్తిహీనతకు దీన హృదయంతో దేవుని ముందు నిలిచి క్షమాపణ వేడుకోవాలి. తమ పొరుగువారిపట్ల తమకున్న ప్రేమవలన కాక తాము స్వార్థ ప్రియులు, సుఖలాలసులు గనుక దేవుడు తమకు అప్పగించిన వర్తమానాన్ని మెత్తగాను సాఫీగాను చెయ్యటానికి వారు ప్రయత్నిస్తారు. నిజమైన ప్రేమ దైవనామ ఘనతను ఇతరుల రక్షణను ముందు కోరుకుంటుంది. ఈ ప్రేమగలవారు సత్యాన్ని సూటిగా చెప్పటంవల్ల ఉత్పన్నమయ్యే అవాంఛనీయ ఫలితాల్నుంచి తప్పించుకోటానికి దాన్ని కప్పిపుచ్చరు. ఆ విషయమై మౌనం వహించరు. ఆత్మలు అపాయంలో ఉన్నప్పుడు దైవ సేవకులు స్వార్థాన్ని పరిగణించక తమకిచ్చిన వర్తమానాన్ని ప్రకటిస్తారు. వారు దోషాన్ని లెక్కచెయ్యకపోటంగాని లేక తక్కువ చెయ్యటంగాని ఉండదు. PKTel 86.5

ప్రతీ బోధకుడు తన స్థానానికున్న పవిత్రతను తన సేవకున్న పరిశుద్దతను గుర్తించి ఏలీయావలే ధైర్యాన్ని ప్రదర్శిస్తే ఎంత బాగుండును! దేవుడు నియమించిన దూతలుగా బోధకులు గొప్ప బాధ్యత గలవారు. వారు “సంపూర్ణమైన దీర్ఘశాంతముతో” “ఖండించి” “గద్దించి” “బుద్ధి” చెప్పాల్సి ఉన్నారు. (2 తిమో. 4:2). వారు క్రీస్తు స్థానంలో మర్మాలకు గృహనిర్వాహకులుగా వ్యవహరిస్తూ విధేయులయ్యేవారిని ప్రోత్సహించి అవిధేయుల్ని హెచ్చరించాల్సి ఉన్నారు. వ్యవహారదక్షత వారికి ప్రధానం కాదు. తాము నడవవలసిందిగా యేసు నిర్దేశించిన మార్గంలోనుంచి వారు ఎన్నడూ తొలగకూడదు. వారు విశ్వాసంతో ముందుకు సాగాలి. తమచుట్టూ సాక్షి సమూహం మేఘంలా ఆవరించి ఉన్నదని వారు జ్ఞాపకం ఉంచుకోవాలి. వారు తమ సొంత మాటలుగాక లోక రాజులకన్నా ఘనుడు ఆదేశించిన మాటల్ని మాట్లాడాలి. “యెహోవా సెలవిచ్చుచున్నాడు” అన్నదే వారి వర్తమానం కావాలి. ఏలీయా నాతాను బాప్తిస్మమిచ్చే యోహాను వంటి మనుషుల్ని దేవుడు పిలుస్తున్నాడు. పర్యవసానాల్ని లెక్కచెయ్యకుండా తన వర్తమానాన్ని నమ్మకంగా అందించే మనుషుల్ని, తమకున్న సమస్తాన్నీ త్యాగం చేయవలసివచ్చినా సత్యాన్ని నిర్భయంగా మాటలాడే మనుషుల్ని ఆయన పిలుస్తున్నాడు. PKTel 87.1

అపాయాన్ని ఎదుర్కుంటున్న సమయంలో అందరి శక్తి, ఉత్సాహం, ప్రభావం అవసరమైనప్పుడు, నీతిన్యాయాల పక్షంగా గట్టి చర్య చేపట్టటానికి భయపడే మనుషుల్ని దేవుడు ఉపయోగించలేడు. తప్పును వ్యతిరేకిస్తూ పోరాడేవారిని, ఈ లోకంలోని అంధకార శక్తులతో, ఉన్నత స్థానాల్లో ఉన్న ఆధ్మాత్మిక అంధకారంతో పోరాడేవారిని ఆయన పిలుస్తున్నాడు. ఇలాంటి వారిని ఉద్దేశించి ఆయన “భళా నమ్మకమైన మంచి దాసుడా, ... నీ యజమానుని సంతోషములో పాలు పొందుము.” అంటున్నాడు. మత్త. 25:23. PKTel 87.2