Go to full page →

14 - “ఏలీయాఆత్మతోను శక్తితోను” PKTel 113

ఏలీయా కాలంనాటి నుంచి అతడి జీవిత సేవను గూర్చిన చరిత్ర గతిస్తున్న శతాబ్దాల పొడవున మతభ్రష్టత నడుమ సత్యంలో నిలబడటానికి పిలుపు పొందినవారికి స్ఫూర్తిని, సాహసాన్ని ఇస్తున్నది. “యుగాంతమందున్న మనకు” ఇది ప్రత్యేక ప్రాముఖ్యంగల విషయం (1 కొరి. 10:11). చరిత్ర పునరావృతమవుతుంది. నేటి ప్రపంచంలో అహాబులు యెజెబెలులు ఉన్నారు. ఏలీయా కాలంలాగే ప్రస్తుత యుగం విగ్రహారాధనతో నిండి ఉంది. కంటికి కనిపించే గుళ్లు లేకపోవచ్చు. కంటికి కనిపించే విగ్రహాలు లేకపోవచ్చు. అయినా వేలమంది ఈ లోక దేవతల్ని అంటే సిరిసంపదల్ని, ఘనతను, సుఖభోగాల్ని, దుష్టహృదయ వాంఛల్ని ప్రోత్సహించే కట్టుకథల్నీ పూజిస్తున్నారు. కోట్లాది ప్రజలకు దేవునిపట్ల తప్పుడు అభిప్రాయాలున్నాయి. ఆయన గుణగణాల విషయంలో దురభిప్రాయాలున్నాయి. బయలు ఆరాధకుల్లా వారూ అబద్ద దేవుణ్ని పూజిస్తున్నారు. క్రైస్తవులమని చెప్పుకుంటున్న వారిలో అనేకమంది దేవునికి విరుద్ధమైన ప్రభావాలతోను దేవుని సత్యాలకు విరుద్ధమైన ప్రభావాలతోను జట్టుకడుతున్నారు. ఇలా వారు దేవునికి దూరంగా వెళ్లిపోయి మానవుణ్ని ఘనపర్చుతున్నారు. PKTel 113.1

ప్రస్తుతకాలంలో అవిశ్వాస, మత భ్రష్ట స్వభావం విస్తరిస్తున్నది. అది సత్యజ్ఞానం వల్ల కలిగిన వికాసమన్న స్వభావం. నిజానికి అది దురభిమానం. మానవ సిద్ధాంతాల్ని సమున్నతపరిచి వాటిని దేవుని స్థానంలో ఉంచటం జరుగుతున్నది. అవిధేయత తమకు స్వేచ్చ ఇస్తుందని అది తమను దేవునిలా చేస్తుందన్న వాగ్దానంతో సాతాను మనుషుల్ని శోధిస్తాడు. దైవ వాక్యానికి ప్రతికూలత, దైవ జ్ఞానానికి పైగా మానవ జ్ఞానాన్ని ఉంచి దాన్ని విగ్రహంగా చేసుకుని పూజించే స్వభావం కనిపిస్తుంది. మనుషులు తమ మనసుల్ని చీకటితో నిండటానికి, లోకాచారాల్ని ప్రభావాల్ని అనుసరించటంవల్ల తికమకపడటానికి ఎంతగా విడిచిపెట్టారంటే వెలుగుకి చీకటికి సత్యానికి అసత్యానికి మధ్య తేడాను వారు గుర్తించలేకపోతున్నారు. వారు సత్యమార్గం నుంచి ఎంతగా తొలగి పోయారంటే తత్వవేత్తలనిపించుకునే కొందరి అభిప్రాయాల్ని బైబిలు సత్యాలకన్నా ఎక్కువ విశ్వసనీయంగా పరిగణిస్తున్నారు. దైవవాక్యంలోని విజ్ఞాపనలు వాగ్దానాలు, అవిధేయులికి విగ్రహారాధకులికి వాక్యం చేస్తున్న హెచ్చరికలు - ఇవి వారి హృదయాన్ని కరిగించటంలో శక్తిహీనమవుతున్నాయి. పౌలు, పేతురు, యోహానుల్ని కార్యశీలుల్ని చేసిన విశ్వాసాన్ని పాతకాలం నాటిది, మర్మపూరితమైంది అధునాతన కాలంలోని ఆలోచనపరుల ప్రతిభకు అయోగ్యమైంది అని వారు పరిగణిస్తారు. PKTel 113.2

మానవాళి సంతోషాన్ని నిత్యజీవాన్ని సాధించే సాధనంగా దేవుడు ఆదిలో ధర్మశాస్త్రాన్నిచ్చాడు. సాతాను దేవుని ఉద్దేశాల్ని భంగపర్చే ఒకేమార్గం దైవ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించటానికి మానవుల్ని నడిపించటం. దాని బోధనలికి తప్పుడు భాష్యం చెప్పి దాని ప్రాముఖ్యాన్ని తగ్గించటానికి నిత్యం కృషి చేయటం. మనుషులు ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్నట్లు కనపడుతూ దాని సూత్రాల్ని అతిక్రమించేందుకు నడిపించటానికి అతడి గొప్ప ఎత్తుగడ ఏకంగా ధర్మశాస్త్రాన్నే మార్చటానికి ప్రయత్నించటం. PKTel 114.1

దైవ ధర్మశాస్త్రాన్ని మార్చటానికి ప్రయత్నించటాన్ని రెండు మార్గాలు కలిసే చోట పాతిన మార్గసూచనను తప్పు దిశగా తిప్పే పాతకాలపు తుంటరి చేష్టతో పోల్చుతున్నాడు ఒక రచయిత. ఈ దుప్రియ తరచుగా కలిగించే ఇబ్బంది ఆందోళన అంతా ఇంతా కాదు.. PKTel 114.2

ఈ లోకంలో ప్రయాణం చేస్తున్న వారికోసం దేవుడు మార్గసూచనను స్థాపించాడు. ఈ సూచనల్లో ఒకరెక్క సృష్టికర్తకు ఇష్టపూర్వక విధేయతకు ఘనతకు నిత్యజీవానికి నడిపే మార్గాన్ని, రెండోరెక్క దుఃఖానికి నిత్యమరణానికీ నడిపే అవిధేయ మార్గాన్ని సూచించాయి. పూర్వం యూదులకాలంలో ఆశ్రయపురానికి ఎంత స్పష్టంగా మార్గాన్ని నిర్వచించటం జరిగిందో అంత స్పష్టంగా సంతోషానికి మార్గాన్ని నిర్వచించటం జరిగింది. కాని మానవ జాతికి మంచికి బద్ద శత్రువు ఒక క్లిష్ట తరుణంలో మార్గ సూచనను తిప్పివేసి దిశలు మార్చాడు కోట్లాది ప్రజలు తప్పు మార్గాన్ని అనుసరిస్తున్నారు. PKTel 114.3

దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయుల్ని ఇలా ఉపదేశించాడు, “నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను మిమ్మును పరిశుద్ధ పరచు యెహోవాను నేనే అని తెలిసికొనునట్లు అది మీ తరతరములకు నాకును మికును గురుతగును. కావున మీరు విశ్రాంతిదినము నాచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్దము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఆరు దినములు పనిచేయవచ్చును. ఏడవ దినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష నొందును. ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుచరించి ఆ దినమునాచరింపవలెను. అది నిత్య నిబంధన. నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడును గురుతైయుండును. ఏలయనగా ఆరుదినములు యెహోవా భూమ్యాకాశములను సృజించి యేడవ దినమున పనిమాని విశ్రమించెను.” నిర్గమ 31:13-17.. PKTel 114.4

దేవుని పట్టణానికి మార్గంగా ప్రభువు ఈ మాటల్లో విధేయతను నిర్వచించాడు. అయితే పాప పురుషుడు మార్గ సూచనను తిప్పి దిశమార్చి తప్పు మార్గాన్ని సూచించాడు. తప్పుడు సబ్బాతును స్థాపించి ఆ దినాన విశ్రమించటం ద్వారా తాము సృష్టికర్త ఆజ్ఞను ఆచరిస్తున్నామని మనుషులు తలంచేటట్లు చేస్తున్నాడు. PKTel 115.1

ఏడో దినం యెహోవా విశ్రాంతి దినమని దేవుడు ప్రకటించాడు. “ఆకాశమును భూమియు... పూర్తిచేయబడి” నప్పుడు తన సృష్టి కార్యం జ్ఞాపకార్థంగా ఆయన ఈ దినాన్ని ఘనపర్చాడు. “తాను చేసిన పనియంతటినుండి” ఏడో దినాన విశ్రమించి “దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను” ఆది 2:1-3. PKTel 115.2

ఐగుప్తు నుంచి నిర్గమనం జరిగిన సమయంలో ఒక ప్రాముఖ్యమైన రీతిలో సబ్బాతు ఆచారాన్ని దైవ ప్రజల దృష్టికి తేవటం జరిగింది. వారు బానిసలుగా ఉన్న కాలంలో వారిపై ఉన్న వెట్టిపనుల అధికారులు వారితో సబ్బాతునాడు పనిచెయ్యించటానికి వారంలో వారు చేయ్యాల్సిన పనిని పెంచుకుంటూ పోయేవారు. వెట్టిపని పరిస్థితుల్ని మార్చుతూ మళ్లీమళ్లీ వాటిని కఠినతరం చేస్తుండేవారు. అయితే ఇశ్రాయేలీయుల్ని బానిసత్వం నుంచి విడిపించి యెహోవా ధర్మవిధుల్ని నిరాటంకంగా ఆచరించగల స్థలానికి దేవుడు వారిని తీసుకువచ్చాడు. సీనాయివద్ద ధర్మశాస్త్రాన్ని ప్రకటించాడు. రెండు రాతి పలకల పై “దేవుని వ్రేలితో వ్రాయబడిన” దాని ప్రతిని మోషేకి ఇచ్చాడు. నిర్గమ 31:18. దాదావు నలభై సంవత్సరాల సంచారంలో, మన్నాను. ప్రతీ సబ్బాతు దినాన ఆపుచెయ్యటం ద్వారాను సిద్దబాటు దినాన ఇచ్చిన రెండంతల మన్నాను చెడిపోకుండా ఆశ్చర్యకరంగా కాపాడటం ద్వారాను దేవుడు నియమించిన విశ్రాంతి దినాచరణను ఇశ్రాయేలీయులకి నిత్యం జ్ఞాపకం చెయ్యటం జరిగింది. PKTel 115.3

వాగ్దత్త దేశంలో ఇశ్రాయేలీయులు ప్రవేశించకముందు వారికి మోషే “విశ్రాంతి దినమును పరిశుద్దముగా ఆచరించుము” అంటూ హితవు పలికాడు (ద్వితి 5:12). తమ సృష్టికర్తగాను విమోచకుడుగాను ఇశ్రాయేలీయులు తనకు జవాబుదారులుగా ఉండాలని యధార్ధమైన సబ్బాతాచరణ వారికి నిత్యం జ్ఞాపకం చెయ్యాలని దేవుడు సంకల్పించాడు. వారు సబ్బాతును సరైన స్వభావంతో ఆచరించాల్సి ఉండగా విగ్రహారాధన అస్సలు ఉండకూడదు. అయితే పది ఆజ్ఞల్లోని ఈ ఆజ్ఞను ఆచరించ బద్దులంకామన్న వాదనను అంగీకరిస్తే మనుషులు సృష్టికర్తను మర్చిపోయి ఇతర దేవతల్ని పూజిస్తున్నవారవుతారు. దేవుడిలా అంటున్నాడు, “యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలిసికొనునట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించితిని.” కాని “వారు నా విధులను తృణీకరించి నా కట్టడలననుసరింపక నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్ర” పర్చారు. తన వద్దకు తిరిగి రమ్మంటూ తాను చేసిన విజ్ఞప్తిలో సబ్బాతును పరిశుద్ధంగా ఆచరించటం ప్రాముఖ్యమని నూతనంగా సూచించాడు. ఆయన ఇలా అన్నాడు, “మా దేవుడనైన యెహోవాను నేనే గనుక నాకట్టడలననుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలిసి కొనునట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మాకును మధ్యను సూచనగా ఉండును.” యె హె 20:12,15,19,20. PKTel 115.4

తమను తుదకు బబులోను బానిసత్వం పాలుచేసిన పాపాలకు యూదా గమనాన్ని ఆహ్వానించటంలో ప్రభువిలా ప్రకటించాడు, “నా విశ్రాంతి దినములను నీవు అపవిత్రపరచుచున్నావు.” “కావున నేను నా క్రోధమును వారిమీద కుమ్మరింతును. వారి ప్రవర్తన ఫలము వారి మీదికి రప్పించి వారిని దహింతును” యె హె 22:8,31. PKTel 116.1

నెహెమ్యా దినాల్లో యెరూషలేము పునరుద్దరణ సమయంలో సబ్బాతును మీరటం గురించి ఇలా కఠినంగా ప్రశ్నించటం జరిగింది, “మీ పితరులును ఇట్లు చేసి దేవుని యొద్దనుండి మన మీదకిని యీ పట్టణము మీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీయుల మీదికి కోపము మరి అధికముగా రప్పించుచున్నారు.” నెహె 13:18. PKTel 116.2

ఈ లోకంలో తన పరిచర్య కాలంలో సబ్బాతు ఆచరణ విధిని క్రీస్తు గట్టిగా బలపర్చాడు. స్వయంగా తానే నెలకొల్పిన ఈ పరిశుద్ధ వ్యవస్థపట్ల తన బోధ అంతటిలోను ఆయన గొప్ప భక్తి భావాన్ని ప్రదర్శించాడు. క్రీస్తు దినాల్లో సబ్బాతాచరణను వక్రీకరించారు. అది దేవుని ప్రవర్తనను ప్రతిబింబించే బదులు స్వార్ధపరులు, తమకు తోచిన విధంగా వ్యవహరించే వ్యక్తుల ప్రవర్తనను ప్రతిబింబించింది. తన్ను గురించి అసత్య కథనాలు చెబుతూ దేవున్ని నమ్ముతున్నామని చెప్పుకునేవారి తప్పుడు బోధల్ని క్రీస్తు తోసిపుచ్చాడు. రబ్బీలు తీవ్ర వ్యతిరేకతతో తన వెంటపడ్తున్నప్పటికీ వారి నియమాల్ని ఆయన ఆచరించలేదు. కాని దైవ ధర్మశాస్త్రం ప్రకారం సబ్బాతును ఆచరించటం కొనసాగించాడు. PKTel 116.3

యెహోవా ధర్మశాస్త్రంపట్ల తన గౌరవాన్ని విస్పష్టమైన మాటల్లో వ్యక్తం చేశాడు. ఆయన ఇలా అన్నాడు, “ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించి పోయిననేగాని ధర్మశాస్త్ర మంతయు నెరవేరు వరకు దాని నుండి యొకపొల్లయినను ఒక సున్నయైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొక దానినైన మిరి, మనుష్యులకు ఆలాగు చేయ బోధించువాడెవడోవాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడోవాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును.” మత్త 5:19-19. PKTel 117.1

మానవుల ఆనందానికి వ్యతిరేకి అయిన సాతాను నాల్లో ఆజ్ఞ నిర్దేశించే సబ్బాతును క్రైస్తవ శకంలో తన దాడికి గురిగా పెట్టుకున్నాడు. సాతాను ఇలా అంటున్నాడు. దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తాను. దేవుని సృష్టి స్మారక చిహ్నమైన ఏడవ దిన సబ్బాతును పక్కకు నెట్టటానికి నా అనుచరగణానికి శక్తినిస్తాను. దేవుడు పరిశుద్ధపర్చి ఆశీర్వదించిన దినం మార్చబడిందని ఈ రకంగా లోకానికి చూపిస్తాను. దాని జ్ఞాపకాన్ని తుడిచివేస్తాను. దాని స్థానంలో దేవుని ముద్రలేని ఒక దినాన్ని ఉంచుతాను. ఆ దినం దేవునికి ఆయన ప్రజలకు మధ్య గుర్తుగా ఉండదు. దేవుడు ఏడో దినంపై ఉంచిన పరిశుద్దతను ఆ దినం మిద ఉంచేటట్లు దాన్ని అంగీకరించే వారిని నడిపిస్తాను. PKTel 117.2

“నా ప్రతినిధి ద్వారా నన్ను నేను హెచ్చించుకుంటాను. ఆదివారాన్ని ఘనపర్చుతాను. ప్రొటస్టాంటు లోకం ఈ నకిలీ సబ్బాతును నిజమైన సబ్బాతుగా స్వీకరిస్తుంది. దేవుడు స్థాపించిన సబ్బాతు ఆచరణను ఆపివేయటం ద్వారా ఆయన ధర్మశాస్త్ర ధిక్కరణను సాధిస్తాను. “మా తరతరములకు నాకును మాకును గురుతగును’ అన్న మాటల్ని నా సబ్బాతు పరంగా పనిచేసేటట్లు చేస్తాను. PKTel 117.3

“ఈ ప్రకారంగా లోకం నాదవుతుంది. నేను భూమికి రాజును లోకానికి యువరాజును అవుతాను. నా అధికారం కింద ఉన్న ప్రజల మనసుల్ని అదుపుచేసి దేవుని సబ్బాతును వారు ధిక్కరించేటట్లు చేస్తాను. ఒక గురుతా? ఏడోదిన సబ్బాతు ఆచరణను లోకాధికారాలపట్ల అపనమ్మకానికి ఒక గుర్తుగా చేస్తాను. స్త్రీలు పురుషులు ఏడోదిన సబ్బాతును ఆచరించటం సాధ్యపడనంత కఠినంగా మానవ చట్టాల రూపకల్పన చెయ్యిస్తాను. అప్పుడు లోకం సంపూర్తిగా నా పరిపాలన కింద ఉంటుంది.” PKTel 117.4

తప్పుడు సబ్బాతును స్థాపించటం ద్వారా కాలాల్ని ధర్మవిధుల్ని మార్చాలని అపవాది భావించాడు. అయితే దైవ ధర్మశాస్త్రాన్ని మార్చటంలో అతడు నిజంగా విజయం సాధించాడా? నిర్గమకాండం ముప్పయి ఒకటో అధ్యాయంలోని మాటలే ఈ ప్రశ్నకు జవాబు. నిన్న నేడు నిత్యం ఒకలాగే మార్పులేకుండా ఉండే ప్రభువు ఏడోదిన సబ్బాతును గురించి ఇలా అన్నాడు, “అది మా తరతరములకు నాకును మీకును గురుతగును.” “అది ఎల్లప్పుడును గురుతైయుండును.” నిర్గమ 31:13,17. మార్చిన మార్గసూచన తప్పుదారి చూపిస్తున్నది. కాని దేవుడు మాత్రం మారలేదు. ఆయన ఇంకా ఇశ్రాయేలీయుల బలమైన దేవుడే, “జనములు చేద నుండి జారు బిందువులవంటివి. జనులు త్రాసుమిది ధూళివంటివారు. ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మరేణువులవలె నున్నవి. సమిధలకు లెబానోను చాలకపోవును. దహనబలికి దాని పశువులు చాలవు. ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే యుండును. ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును.” యెష 40:15-17. ఆయన తన ధర్మశాస్త్రం గురించి అహాబు ఏలీయా దినాల్లో ఎంత రోషంగా ఉన్నాడో ఇప్పుడూ అంతే రోషంగా ఉన్నాడు. PKTel 117.5

అయితే ఆ ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చెయ్యటం ఎలా జరుగుతుంది! లోకం నేడు దేవునిపై బాహాటంగా తిరుగుబాటు చేస్తుంది. నిజానికి ఇది ముందుకు దూసుకుపోయే తరం. కృతఘ్నత, లాంఛన బద్దత, వేషధారణ, అతిశయం, మతభ్రష్టతతో నిండిన తరం. ప్రజలు బైబిలుని నిర్లక్ష్యం చేస్తున్నారు. సత్యాన్ని ద్వేషిస్తున్నారు. ప్రజలు తన ధర్మశాస్త్రాన్ని విసర్జించటం, తన ప్రేమను తృణీకరించటం, తన ప్రతినిధుల్ని లక్ష్యపెట్టకపోవటం యేసు చూస్తున్నాడు. ఆయన తన కరుణా కటాక్షాలద్వారా మాట్లాడున్నాడు. కాని వీటిని ప్రజలు గుర్తించటంలేదు. హెచ్చరికల మూలంగా మాట్లాడ్తున్నాడు. వాటిని ప్రజలు లెక్కచెయ్యటంలేదు. మానవాత్మ ఆలయ ఆవరణం అపవిత్ర వ్యాపారానికి అంగడిగా మారింది. స్వార్ధం, అసూయ, గర్వం, ద్వేషం ప్రబలుతున్నాయి. PKTel 118.1

అనేకులు దైవవాక్యాన్ని తిరస్కరించి అపహసిస్తున్నారు. వాక్యాన్ని యథాతధంగా విశ్వసించే వారిని ఎగతాళి చేస్తున్నారు. సమాజంలో క్రమంపట్ల క్రమ పద్దతిపట్ల ధిక్కరణ పెరుగుతుంది. ఇది యెహోవా ఆజ్ఞల్ని అతిక్రమించటం వల్ల కలిగిన ప్రత్యక్ష పరిణామం. విధేయతా మార్గం నుంచి పక్కకు తొలగినందువల్ల కలిగే ఫలితమే దౌర్జన్యం, నేరం. విగ్రహాల ఆలయాల్లో పూజలు చేస్తూ సంతోషాన్ని వ్యర్ధంగా వెదకుతున్న జనసమూహాల దుస్థితిని చూడండి. PKTel 118.2

సబ్బాతు ఆజ్ఞను దాదాపు లోకమంతా నిర్లక్ష్యం చెయ్యటాన్ని చూడండి. తాము భావించే ఆదివార పరిశుద్దతను కాపాడటానికి చట్టాలు చేస్తున్నవారు అదే సమయంలో సారా అమ్మకాన్ని చట్టబద్ధం చేస్తూ చట్టాలు చెయ్యటంలోని దుర్బుద్ధిని శీలహీనతను చూడండి. ప్రత్యక్షపర్చబడినదానికన్నా జ్ఞానవంతులమని ఊహించుకుని వారు మనుషుల మనస్సాక్షిని ఒత్తిడి చెయ్యటానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో దేవుని స్వరూపంలో సృష్టి అయిన మనుషుల్ని నాశనం చేసే దుర్మార్గ శక్తులికి వత్తాసు పలుకుతున్నారు. అలాంటి చట్టాలకు స్ఫూర్తిదాత సాతానే. దైవ ధర్మ శాసనాలికి పైగా మానవ చట్టాల్ని ఘనపర్చే వారిపై దేవుని శాపం ఉంటుందని అతడికి బాగా తెలుసు. అందుకే అతడు నాశనానికి నడిపే విశాలమార్గంలో మనుషుల్ని నడిపించటానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాడు. PKTel 118.3

మనుషులు మానవ అభిప్రాయాల్ని మానవ వ్యవస్థల్నీ దీర్ఘకాలంగా పూజించటంతో లోకమంతా విగ్రహాల వెంట పడటం జరుగుతున్నది. దైవ ధర్మశాస్త్రాన్ని మార్చటానికి ప్రయత్నిస్తున్న అతడు, దేవున్ని వ్యతిరేకించటానికి, నీతిమంతులు ఏ గుర్తు మూలంగా వెల్లడికానున్నారో ఆ గుర్తును వ్యతిరేకించటానికి మనుషుల్ని మోహరించటానికి ప్రతీ మోసపూరిత పన్నాగాన్ని పన్నుతున్నాడు. కాని తన ధర్మశాస్త్రాన్ని మీరటాన్ని తృణీకరించటాన్ని శిక్షించకుండా ప్రభువు ఎల్లకాలం ఊరకుండడు. ఒక సమయం వస్తుంది. అప్పుడు “నరుల అహంకార దృష్టి తగ్గింపబడును మనుష్యుల గర్వము అణగదొక్కబడును.” యెష 2:11. నాస్తికుడు దైవ ధర్మశాస్త్ర విధుల్ని ఎగతాళి చెయ్యవచ్చు, తోసిపుచ్చవచ్చు. లౌకికతత్వం పెక్కుమందిని భ్రషుల్ని చెయ్యవచ్చు, కొంతమందిని అదుపుచెయ్యవచ్చు. దేవుని సేవ గొప్ప శ్రమతోను, నిత్య త్యాగంతోను దాని స్థానాన్ని నిలుపుకోవచ్చు. కాని చివరికి సత్యం అద్భుత విజయం సాధిస్తుంది. PKTel 119.1

లోకంలో దేవుని సేవ చివరి ఘట్టంలో ఆయన ధర్మశాస్త్ర ప్రామాణికతను ఘనపర్చటం మళ్లీ జరుగుతుంది. అబద్ద మతం గెలుపు పొందవచ్చుగాక, దుష్టత్వం పేట్రేగవచ్చుగాక. అనేకమంది ప్రేమ చల్లార్చవచ్చుగాక, కల్వరి సిలువను ప్రజలు గుర్తించకపోవచ్చుగాక, మరణంలాంటి చీకటి లోకంలో వ్యాపించవచ్చుగాక, సత్యానికి వ్యతిరేకంగా ప్రజా వెల్లువ పోటెత్తవచ్చుగాక. దేవుని ప్రజల్ని మట్టు పెట్టటానికి కుట్ర, వెనుక కుట్ర జరగవచ్చుగాక. ఆ ఉపద్రవకర ఘడియలో ఎవరూ ఆపివెయ్యటానికి సాధ్యంకాని వర్తమానాన్ని అందించటానికి మానవ సాధనాల్ని ఏలీయా దేవుడు లేపుతాడు. అధిక జనాభాగల నగరాల్లో, సర్వోన్నతునికి వ్యతిరేకంగా మాటలాడటంలో చాలాదూరం వెళ్లిన మనుషులున్న స్థలాల్లో తీవ్రమందలింపు గళం వినిపిస్తుంది. దేవుడు నియమించిన మనుషులు సంఘం లోకంతో ఏకమవ్వటాన్ని ధైర్యంగా ఖండిస్తారు. మానవ స్థాపిత ఆరాధన దినం నుంచి వెనుదిరిగి సబ్బాతును ఆచరించాల్సిందిగా వారు స్త్రీ పురుషులికి విజ్ఞప్తి చేస్తారు. ప్రతీ జాతికీ వారు ఇలా ప్రకటిస్తారు, “మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసినవానికే నమస్కారము చేయుడి.... ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకుగాని యెవడైనను నమస్కారముచేసి, తన నొసటియందేమి చేతిమీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన యెడల ఏమియు కలపబడకుండ దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును.” ప్రక 14:7-10. PKTel 119.2

దేవుడు తన నిబంధనను అతిక్రమించడు. తన నోటినుంచి వచ్చిన మాటను మార్చడు. ఆయన మాట నిరంతరం నిలుస్తుంది. ఆయన సింహాసనంలాగే అది మార్పులేనిది. తీర్పు సమయంలో ఈ నిబంధనను తీసుకువస్తాడు. దాన్ని దేవుడే తన వేలితో రాశాడు. నిత్యుని న్యాయపీఠం ముందు లోకనివాసులు తీర్పుపొందనున్నారు. PKTel 120.1

ఏలీయా దినాల్లోలాగే నేడు కూడా ఆజ్ఞలు కాపాడే దైవ ప్రజలకు అబద్ద దేవుళ్ళను పూజించే ప్రజలకు మధ్య విభజన రేఖ స్పష్టంగా గీయబడింది. ఆ ప్రజలతో ఏలీయా ఎన్నాళ్లమట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిననుసరించుడి.” అన్నాడు. 1 రాజులు 18:21. ఈ కాలానికి దేవుని వర్తమానం ఇది: “మహా బబులోను కూలిపోయెను కూలిపోయెను.... నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండనట్లును దానిని విడిచిరండి దాని పాపములు ఆకాశమునంటుచున్నవి. దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసికొనియున్నాడు.” ప్రక 18:2,4,5. PKTel 120.2

ప్రతీ ఆత్మకు పరీక్ష వచ్చే సమయం ఎక్కువ దూరంలో లేదు. అబద్ధ సబ్బాతు ఆచరణకు విజ్ఞప్తులు వస్తాయి. దేవుని ఆజ్ఞలకు మానవుల ఆజ్ఞలకు మధ్యపోటీ జరుగుతుంది. క్రమక్రమంగా లౌకిక డిమాండులకు లొంగి లోకాచారాల్లో స్థిరపడ్డవారు ఎగతాళికి, పరాభవానికి, చెరసాల, మరణం బెదిరింపులికి గురయ్యేబదులు అప్పుడు అధికారుల నిర్ణయాన్ని అంగీకరిస్తారు. ఆ సమయంలో మాలిన్యం నుంచి బంగారం వేరు చెయ్యబడ్తుంది. రూపం తళుకు బెళుకుల నుంచి యధార్ధమైన దైవభక్తిని గుర్తించటం జరుగుతుంది. మనం ఎంతగానో అభిమానించిన అనేక ప్రఖ్యాత వ్యక్తులు అప్పుడు చీకటిలోకి మాయమైపోతారు. ఆలయ ఆభరణాల్నితప్ప క్రీస్తు నీతి వస్త్రం ధరించనివారు అప్పుడు దిగంబరులై సిగ్గుపడ్డారు. PKTel 120.3

భూనివాసుల్లో ప్రతీ దేశంలోకి చెదరిరిపోయి బయలుకి మోకాలు వంచనివారు ఉన్నారు. లోకాన్ని చీకటి ప్రజల్ని గాఢాంధకారం కప్పినప్పుడు నమ్మకమైన ఈ విశ్వాసులు రాత్రి మాత్రమే కనిపించే ఆకాశ నక్షత్రాల్లా ప్రకాశిస్తారు. అన్యమత ఆఫ్రికాలో, ఐరోపాలోని, దక్షిణ అమెరికాలోని కథోలిక్కు దేశాల్లో, చైనాలో, ఇండియాలో, సముద్ర ద్వీపాల్లో, లోకంలోని చీకటి మూలలన్నిటిలో దేవునికి ప్రత్యేక, ఎన్నికైన ప్రజలు ఉన్నారు. ధర్మశాస్త్ర విధేయతలో ఉన్న పరివర్తనా శక్తిని భ్రష్టమైన ప్రపంచానికి స్పష్టంగా కనపర్చుతూ వారు చీకటినడుమ దేదీప్యంగా ప్రకాశిస్తారు. ఇప్పుడు కూడా వారు ప్రతీ జాతిలో, ప్రతీ భాష మాట్లాడే ప్రజల నడుమ కనిపిస్తున్నారు. మత భ్రష్టత తీవ్రంగా ఉన్న సమయంలో “కొద్దివారుగాని గొప్పవారుగాని, ధనికులుగాని దరిద్రులుగాని, స్వతంత్రులుగాని దాసులుగాని అందరు” తమ విశ్వాసపాత్రతకు అబద్ద విశ్రాంతిదినాన్ని గుర్తుగా అంగీకరించేలా, మరణదండన బెదిరింపుతో, సాతాను ప్రయత్నించినప్పుడు “నిష్కళంకులును అనింద్యులునగు దేవుని కుమారులగు” వీరు “లోకమందు జ్యోతులవలె” ప్రకాశిస్తారు. ప్రక. 13:16, ఫిలి. 2:15,16. రాత్రి ఎంత చీకటిగా ఉంటే వారు అంత ఉజ్వలంగా ప్రకాశిస్తారు. భక్తిహీన ప్రజలమీద దేవుని తీర్పులు పడుతున్నప్పుడు ఇశ్రాయేలు వారిని ఏలీయా లెక్కించి ఉంటే ఎంత పొరపాటు చేసి ఉండేవాడు! ఒకడు మాత్రమే దేవుని పక్క ఉన్నట్లు లెక్కపెట్టాడు! అయితే “నేను ఒకడను మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణము తీసి వేయుటకై చూచుచున్నారు” అని అతడన్నప్పుడు, “అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్లూనకయు... నుండు ఏడువేలమంది నాకు ఇంకను మిగిలియుందురు” అన్న ప్రభువుమాట అతణ్ని ఆశ్చర్యపర్చింది. 1 రాజు 19:14,18. PKTel 121.1

కనుక ఈ రోజు ఇశ్రాయేలు వారిని ఎవరూ లెక్కపెట్టకుందురుగాక. కాని ప్రతీవారు దయగల మాంసపుగుండె, నశించిన లోకం రక్షణకోసం క్రీస్తు హృదయంలా ప్రయాసపడే హృదయం కలిగి ఉందురుగాక. PKTel 121.2