Go to full page →

18 - బాగుపడ్డ నీరు PKTel 151

పితరుల కాలంలో యెర్గాను లోయ “యెహోవా తోటవలెను... నీళ్లుపారు దేశమైయుండెను.” లోతు ఈ అందమైన లోయలో తన గృహాన్ని ఏర్పాటు చేసుకోగోరి “సొదొమ దగ్గర తన గుడారము వేసికొనెను” ఆది. 13:10,12. మైదానంలోని పట్టణాలు నాశనమైనప్పుడు చుట్టూ ఉన్న ప్రాంతం నిర్జన ప్రదేశమయ్యింది. అప్పటినుంచి అది యూదయ అరణ్యంలో భాగమయ్యింది. PKTel 151.1

రమ్యమైన ఆ లోయలో ఒక భాగం సెలయేళ్లు వాగులతో నిండి మానవుడి హృదయాన్ని ఆహ్లాదపర్చుతున్నాయి. యోర్గాను దాటిన తర్వాత పంటపొలాలు, ఖర్జూరవనాలు, ఇతర పండ్లచెట్లతో నిండిన ఈ లోయలో ఇశ్రాయేలీయులు శిబిరంవేసి వాగ్దత్త దేశంలోని ఫలాల్ని మొదటిసారిగా తిన్నారు. వారి ముందు అన్యజనుల దుర్గం, కనానీయ విగ్రహారాధనలో తుచ్ఛమైన నీచమైన అషారోతు ఆరాధనకు కేంద్రమైన యెరికో పట్టణ ప్రాకారాలు ఉన్నాయి. అనతికాలంలో దాని గోడలు కూలిపోయాయి. ఆ పట్టణ ప్రజలందరూ హతులయ్యారు. ఆ పటణం పతన సమయంలో ఇశ్రాయేలీయుల సముఖంలో ఈ గంభీర ప్రకటన చేయటం జరిగింది : “ఎవడు యెరికో పట్టణమును కట్టించపూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును, వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠకుమారుడు చచ్చును, దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ణ కుమారుడు చచ్చును.” యెహో. 6:26. PKTel 151.2

అయిదు శతాబ్దాలు గతించాయి. ఆ స్థలం దేవుని శాపం కింద నిర్జన ప్రదేశంగా మిగిలింది. ఈ లోయలో నివాసాన్ని ఎంతో వాంఛనీయం చేసిన సెలయేళ్లుకూడా ఈ శాపం ప్రభావం వల్ల ఎండి వసివాడిపోయాయి. అయితే అహాబు మత భ్రష్టత దినాల్లో యెజెబెలు ప్రభావం వలన అషారోతు ఆరాధన పునరుజ్జీవనం పొందినప్పుడు, ఈ ఆరాధనకు ప్రాచీన కేంద్రమైన యెరికో పట్టణాన్ని పునర్నిర్మించటం జరిగింది. దాన్ని కట్టివాడు భయంకర మూల్యం చెల్లించాడు. బేతేలీయడైన హీయేలు దాని పూనాదివేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయెను; దాని గవునుల నెత్తగా సెగూబు అను అతని కనిష్ఠపుత్రుడు చనిపోయెను. ఇది...యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను.” 1 రాజులు 16:34. PKTel 151.3

యెరికోకి అల్లంత దూరంలో పండ్లచెట్ల తోపుల నడుమ ప్రవక్తల పాఠశాల ఒకటి ఉంది. ఏలీయా పరలోకానికి ఆరోహణం అయిన తర్వాత ఎలీషా ఇక్కడికి వెళ్లాడు. అతడు అక్కడ ఉన్న సమయంలో ఆ పట్టణ ప్రజలు ప్రవక్తవద్దకు వచ్చి ఇలా అన్నారు, “ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా యేలినవాడనైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివికావు. అందుచేత భూమియు నిస్సారమై యున్నది.” కిందటి సంవత్సరాల్లో స్వచ్చమైన నీటితో ప్రవహించి ఆ పట్టణానికి ఆ జిల్లాకు తాగునీటిని సరఫరా చేసిన ఏరు ఇప్పుడు తాగటానికి పనికి రావటంలేదు. PKTel 152.1

యెరికో నివాసులు చేసిన మనవికి ఎలీషా ఇలా బదులు పలికాడు, “క్రొత్త పాత్రలో ఉప్పువేసి నా యొద్దకు తీసికొనిరండని వారితో చెప్పెను.” వారు దాన్ని చేసిన తర్వాత “అతడు నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పువేసి - యెహోవా సెలవిచ్చునదేమనగా - ఈ నీటిని నేను బాగు చేసి యున్నాను గనుక దీనివలన మరణము కలుగకపోవును. భూమి నిస్సారముగా ఉండదు అనెను.” 2 రాజులు. 2:19-21. PKTel 152.2

యెరికో నీటిని బాగుపర్చటం మనుషుడి జ్ఞానం వల్లకాదు దేవుని అద్భుత జోక్యం వల్లనే జరిగింది. పట్టణాన్ని నిర్మించినవారు దేవుని ప్రసన్నతకు అరులు కారు. అయినా “చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతుల మీదను వరము కురిపించు” ఆయన ఈ సందర్భంలో, కనికరాన్ని సూచించే ఈ కార్యంలో ఇశ్రాయేలు ఆధ్యాత్మిక రుగ్మతను బాగుచెయ్యటానికి తన సంసిద్ధతను వ్యక్తం చేశాడు. మత్త. 5:45. PKTel 152.3

అది నిత్యం నిలిచే పునరుద్దరణ. “నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదైయున్నది.” 2 రాజులు 2:22. యుగం వెంబడి యుగం పొడవునా నీళ్లు ప్రవహిస్తూ లోయలోని ఆ భాగాన్ని సుందరమైన ఓయాసిస్సుగా తీర్చిదిద్దాయి. PKTel 152.4

బాగుపడిన నీటినుంచి వస్తున్న, పాఠాలు ఎన్నో ఉన్నాయి. కొత్తకుండ, ఉప్పు, ఏరు - ఇవన్నీ గొప్ప సంకేతాలు. PKTel 152.5

చేదు ఏటిలో ఉప్పు వెయ్యటంలో ఎలీషా శతాబ్దాల అనంతరం యేసు తన శిష్యుల్ని ఉద్దేశించి “మీరు లోకమునకు ఉప్పయి ఉన్నారు” అన్నప్పుడు బోధించిన ఆధ్యాత్మిక పాఠాన్నే బోధించాడు. మత్త 5:13. కలుషిత ప్రవాహంలో కలిసిన ఉప్పు ప్రవాహపు నీటిని శుద్ధిచేసి క్రితంలో క్షామం మరణం ఉన్నచోటుకి జీవాన్ని దీవెనను తెచ్చింది. దేవుడు తన ప్రజల్ని ఉప్పుతో పోల్చినప్పుడు వారిని తన కృపతో నింపటంలో తన ఉద్దేశం వారు ఇతరుల్ని రక్షించటంలో సాధనాలు కావాలన్నదేనని ఆయన బోధిస్తున్నాడు. సర్వలోకం ముందు ఒక ప్రజను ఎన్నుకోటంలో దేవుని ఉద్దేశం వారిని తన కుమారులు కుమార్తెలుగా దత్తత తీసుకోటమేకాదు వారి ద్వారా లోకం రక్షణకూర్చే తన కృపను అంగీకరించాలన్నది కూడా. ప్రభువు అబ్రహామును ఎంపిక చేసుకున్నది కేవలం తనకు మంచి మిత్రుడుగా ఉండటానికే కాదు, ఆయన ఇచ్చే ప్రత్యేక ఆధిక్యతల్ని లోకంలోని జాతుల వారికందించే సాధనంగా ఉండటానికి కూడా. PKTel 152.6

యధార్థ క్రైస్తవ మతానికి నిదర్శనాలు లోకానికి అవసరం. పాప విషం సమాజం గుండెపై పనిచేస్తూ ఉంది. నగరాలు పట్టణాలు పాపంలోను నైతిక దుష్టతను కూరుకుపోయాయి. లోకం వ్యాధితోను బాధతోను పాపంతోను నిండి ఉంది. అన్నిచోట్ల ఆత్మలు పేదరికంలోను దుఃఖంలోను కొట్టుమిట్టాడుతూ, అపరాధ భారంతో కుంగిపోతూ రక్షణ ప్రభావం లేక నశించిపోతున్నాయి. సువార్త సత్యం వారి ముందు నిత్యం ఉన్నది. అయినా రక్షణార్ధమైన రక్షణ వాసన కావలసిన వారి ఆదర్శం మరణార్ధమైన మరణపు వాసనగా ఉండటంవల్ల జనులు నశించిపోతున్నారు. నిత్యజీవాన్నిచ్చే నీటి ఊటలు గల బావుల్లా ఉండాల్సిన వారి ఆత్మలు ఏరు విషపూరితమయ్యినందువల్ల చేదు నీరు తాగుతున్నాయి. PKTel 153.1

ఉప్పును ఏ పదార్థంతో కలుపుతామో దానితో అది మిళితం కావాలి. దాని లోపలికి అది చొచ్చుకుపోయి వ్యాపించాలి. అప్పుడే ఉప్పు ఆ పదార్ధాన్ని కాపాడగలుగు తుంది. అదే విధంగా వ్యక్తిగత సంబంధం సహవాసం ద్వారా సువార్త తాలూకు రక్షణశక్తి మనుషుల్ని రక్షిస్తుంది. మనుషులు గుంపులుగా కాక వ్యక్తిగతంగా రక్షణ పొందుతారు. వ్యక్తికిగల ప్రభావం ఒక రకమైన శక్తి, క్రీస్తులాగ పైకి లేవదీయ్యటానికి, నీతి సూత్రాల్ని నేర్పించటానికి, లోకంలోని దుర్మార్గం వృద్ధికి అడ్డుకట్టవేయటానికి ఆ శక్తి క్రీస్తు ప్రభావానికి లోబడి పనిచెయ్యాలి. క్రీస్తు మాత్రమే అనుగ్రహించగల కృపను అది విస్తరింపచెయ్యాలి. యధార్ధ విశ్వాసం, ప్రేమతో కలిసిన నీతివంతమైన ఆదర్శం వలన ఇతరుల జీవితాల్ని ప్రవర్తనల్ని ఉన్నతపరచి మాధుర్యంతో నింపాలి. PKTel 153.2

యెరికోలో అప్పటివరకు కాలుష్యంగా ఉన్న ఏటిని గురించి ప్రభువిలా ప్రకటించాడు, “ఈ నీటిని నేను బాగుచేసియున్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును. భూమియు నిస్సారముగా ఉండదు.” కలుషితమైన ఏరు దేవుని నుంచి వేరైన ఆత్మను సూచిస్తుంది. పాపం దేవున్ని మరుగుపర్చటమే కాదు దేవున్ని గురించి తెలుసుకోవాలన్న కోరికను సామర్థ్యాన్ని మానవాత్మలో నుంచి తుడిచివేస్తుంది. పాపం ద్వారా మానవ జీవితం తుచ్చమవుతుంది, మనసు వక్రమవుతుంది, ఆలోచన దుష్టమవుతుంది. ఆత్మ తాలూకు శక్తి సమర్ధతలు భ్రష్టమవుతాయి. స్వచ్ఛమైన మతం లోపిస్తుంది. హృదయంలో పరిశుద్దత ఉండదు. మారుమనసు కలిగించే దైవశక్తి ప్రవర్తనను మార్చలేదు. ఆత్మ బలహీనంగా ఉంటుంది. జయించటానికి నైతిక శక్తి లోపించటంతో అది కలుషితమై తుచ్ఛమవుతుంది. PKTel 153.3

శుద్ది పొందిన హృదయానికి అంతా మారిపోతుంది. ఆత్మలో క్రీస్తు నివసిస్తున్నాడని మారిన ప్రవర్తన లోకానికి సాక్ష్యమిస్తుంది. దేవుని ఆత్మ ఆత్మలో నూతన జీవాన్ని సృష్టించి ఆలోచనల్ని కోరికల్ని క్రీస్తు చిత్తానికి లోపర్చుతుంది. అప్పుడు లోపలి వ్యక్తి దేవుని స్వరూపంలో నూతనంగా రూపుదిద్దుకుంటాడు. కృప తాలూకు విమోచక శక్తి దోషపూరిత ప్రవర్తనను సంపూర్ణ సుందర ఫలభరిత ప్రవర్తనగా వృద్ధి పర్చగలదని బలహీనులు, దోషపూరితులు అయిన స్త్రీలు పురుషులు లోకానికి చూపిస్తారు. PKTel 154.1

దైవ వాక్యాన్ని స్వీకరించిన హృదయం ఎండిపోయిన మడుగులాంటిది, పగిలిపోయిన తొట్టిలాంటిది కాదు. నిత్యం ఊరే ఊటల కలయికతో పర్వతాలలోనుంచి దిగివస్తూ బండలు రాళ్లమీద నుంచి దూకుకుంటూ, భారాలు మోస్తూ అలసి దప్పికగా ఉన్న వారిని స్వచ్చమైన చల్లని నీటితో సేదదీరుస్తూ గలగల ప్రవహించే ఏరులాంటిది అది. అది నిత్యం ప్రవహిస్తూ, కొనసాగే కొద్దీ లోతుగాను వెడల్పుగాను తయారవుతూ, తుదకు తన జీవజలాల్ని భూమి అంతటికీ విస్తరింపజేసే నదిలాంటిది. ప్రవహిస్తూ కాపాడుకుంటూపోయే ఏరు దాని వెనక పచ్చని చేలను సస్య సంపదను విడిచిపెడ్తూ వెళ్తుంది. దాని గట్టుల మిది గడ్డి ఏపుగా పచ్చగా ఉంటుంది. చెట్లు పచ్చగా పెరిగి విస్తారంగా పుష్పిస్తాయి. ఎండాకాలంలోని సూర్యతాపానికి భూమి ఎండి ఎర్రగా మారినప్పుడు ఏది పొడవునా ఇరువైపులా పచ్చగా ఉంటుంది. PKTel 154.2

నిజమైన దేవుని బిడ్డ ఇలాగే ఉంటాడు. క్రీస్తు మతం శక్తినిచ్చే, విస్తరించే నియమంగా తన్నుతాను బయలుపర్చుకుంటుంది. అది సజీవమైన, క్రియాత్మకమైన ఆధ్యాత్మికశక్తి. సత్యం, ప్రేమ తాలూకు దివ్య ప్రభావానికి హృదయం తెరుచుకున్నప్పుడు, ఇప్పుడు నిస్సారం క్షామం ఉన్న ఎడారిలో ప్రవహించి ఫలాలు ఫలింపజేసే సెలయేళ్ళలా ఈ నియమాలు విస్తరిస్తాయి. బైబిలు సత్యజ్ఞానం వలన శుద్ధిని పరిశుద్ధతను పొందినవారు ఆత్మల్ని రక్షించే పరిచర్యలో నిమగ్నులైనప్పుడు వాస్తవంగా వారు రక్షణార్ధమైన రక్షణ వాసనగా ఉంటారు. తరగని కృప, జ్ఞానం ఊటలోనుంచి వారు అనుదినం తాగుతున్న కొద్దీ, తమ రక్షకుని ఆత్మతో తాము నిండి పొర్లిపోతున్నట్లు, తమ స్వార్ధరహిత పరిచర్య ద్వారా అనేకులు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా లబ్ది పొందుతున్నట్లు వారు గుర్తిస్తారు. అలసినవారు సేదదీరి తెప్పరిల్లతారు, రోగులు స్వస్తత పొందుతారు. పాపభారం తొలగిపోతుంది. దూరదేశాల్లో పాపమార్గాన్ని విసర్జించి నీతిమార్గాన్ని అనుసరిస్తున్న వారి నోటినుంచి వందన సమర్పణ గీతాలు వినిపిస్తాయి. PKTel 154.3

“ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును,” ఎందుకంటే దేవుడు “ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబానోను పర్వతప్రవాహము.” లూకా 6:38, పరమగీతము 4:15. PKTel 155.1