Go to full page →

22 - “నీనెవె మహా పట్టణము” PKTel 176

ఇశ్రాయేలు చీలిన దినాల్లో ప్రాచీన పట్టణాల్లోని గొప్ప పట్టణాల్లో నీనెవె ఒకటి. నీనెవె అపూరు దేశానికి రాజధాని. బాబెలు గోపుర నిర్మాణం నుంచి ప్రజలు చెదిరిపోయిన వెంటనే సారవంతమైన టైగ్రీసు నది ఒడ్డున ఈ పట్టణాన్ని స్థాపించారు. అది శతాబ్దాలుగా వృద్దిచెందుతూవచ్చి తుదకు “గొప్పదై మూడు దినముల ప్రయాణమంత పరిమాణముగల పట్టణము” అయ్యింది. యోనా 3:3. PKTel 176.1

దాని ఐహిక అభ్యుదయ కాలంలో నీనెవె నేరానికి దుర్మార్గానికి కేంద్రంగా తయారయ్యింది. లేఖనం దాన్ని “నరహత్య చేసిన....మోసముతోను బలాత్కారముతోను” కూడిన పట్టణంగా పేర్కొంటుంది. నహూము ప్రవక్త నీవైనీయుల్ని ఆకలిగా ఉన్న క్రూర సింహంతో పోల్చాడు. ఎందరు “ఎడతెగక నీచేత హింసనొందిరి!” అన్నాడు. నహూము 3:1,9. PKTel 176.2

నీనెవె దుర్మార్ధ పట్టణమైన అది దుష్టత్వంలో పూర్తిగా మునిగిపోలేదు. “నరులందరిని దృష్టించు” (కీర్తన 33:13) “అమూల్యమైన ప్రతివస్తువును చూచు” (యోబు 28:10) ఆయనచే ఉత్తమమైన దాన్ని ఉన్నతమైన దాన్ని అందుకోటానికి చూస్తున్నవారు, అవకాశం లభిస్తే తమ దుష్క్రియలు మాని జీవంగల దేవున్ని ఆరాధించేవారు ఆ పట్టణంలో చాలామంది ఉన్నట్లు చూశాడు. కనుక దేవుడు తన్నుతాను వారికి స్పష్టంగా కనపర్చుకున్నాడు. సాధ్యమైతే వారిని పశ్చాత్తాపానికి నడిపించాలనుకున్నాడు. PKTel 176.3

ఈ సేవకు దేవుడు ఎంపిక చేసుకున్న వ్యక్తి అమిత్తయి కుమారుడైన ప్రవక్త యోనా. అతడికి ప్రభువు వద్దనుంచి వచ్చిన వాక్కు ఇది, “నీనెవె పట్టణస్థుల దోషము నా దృష్టికి మౌరమాయెను గనుక నీవు లేచి నీనెవె మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము.” యోనా 1:1,2. PKTel 176.4

ఈ ఆదేశంలోని కష్టాలు, అసాధ్యాలుగా కనిపిస్తున్న విషయాలు గురించి ప్రవక్త ఆలోచించగా తనకు వచ్చిన పిలుపు సవ్యత గురించి అతడి మనసులో పలు ప్రశ్నలు లేచాయి. ఆ పట్టణంలో అలాంటి వర్తమానాన్ని ప్రకటించటంవల్ల ప్రయోజనం ఏమి ఉండనట్లు మానవ దృక్పథం నుంచి కనిపించింది. తాను సేవిస్తున్న దేవుడు సర్వజ్ఞాని సర్వశక్తుడు అని అతడు కాసేపు మర్చిపోయాడు. ఇంకా సందేహిస్తూ అతడు వెనకాడుతుండగా సాతాను అతణ్ని నిరుత్సాహంతో నింపారు. ప్రవక్త భయభ్రాంతు డయ్యాడు, తరీషునకు పారిపోవలెనని” లేచాడు. యెప్పేకి వెళ్లి అక్కడ ప్రయాణానికి సిద్దమై ఉన్న ఓడను కనుగొని “కేవు ఇచ్చి... ఓడవారితో కూడి తరీషునకు పోవుటకు ఓడ ఎక్కెను.” 3వ వచనం. PKTel 176.5

దేవుడు యోనాకు అప్పగించిన బాధ్యత చాలా భారమైంది. అయినా తనను వెళ్లమని ఆజ్ఞాపించిన ప్రభువు తన సేవకుణ్ని కాపాడి అతడికి జయం చేకుర్చటానికి సమర్థుడు. ప్రవక్త ప్రశ్నించకుండా ఆ ఆజ్ఞను ఆచరించి ఉంటే అనేక చేదు అనుభవాలు తప్పేవి. గొప్ప దీవెనలు లభించేవి. అయినా యోనాకు కలిగిన విపత్తు ప్రభువు అతణ్ని విడిచిపెట్టలేదు. కొన్ని శ్రమల ద్వారాను వింతైన ఏర్పాట్ల ద్వారాను దేవునిపట్ల రక్షించటానికి ఆయన అనంత శక్తి విషయంలో ప్రవక్త విశ్వాసం పునరుజ్జీవనం పొందాల్సి ఉంది. PKTel 177.1

తనకు మొదటగా పిలుపు వచ్చినప్పుడు యోనా ఆగి తాయితీగా ఆలోచించి ఉంటే, తనపై దేవుడు పెట్టిన బాధ్యత నుంచి తప్పించుకోటానికి ప్రయత్నించటం ఎంత బుద్దిహీనమో గ్రహించేవాడు. కాని తన పిచ్చి ప్రయాణంలో అతడు ఎక్కువ దూరం సమస్య లేకుండా కొనసాగటానికి లేకపోయింది. “యెహోవా సముద్రము మిద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవుగతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్ధించి, ఓడ చులకన చేయుటకై అందులోని సరకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి యుండెను.” 4, 5 వచనాలు. PKTel 177.2

నావికులు సహాయంకోసం తమ అన్యదేవతలకు మొర పెట్టుకుంటుండగా, ఓడ నాయకుడు చింతాక్రాంతుడై యోనా వద్దకు వచ్చి “ఓయీ నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్ధించుము. మనము చావకుండ ఆ దేవుడు మనయందు కనికరించునేమో” అన్నాడు. 6వ వచనం. PKTel 177.3

అయితే తన విధిని నిర్వర్తించకుండ పక్కదారి పట్టిన మనిషి ప్రార్ధనలు సహాయపడలేదు. తుపాను వింతగా ఉగ్రరూపం దాల్చటం దేవతల ఆగ్రహానికి సూచనని నమ్మిన నావికులు “ఎవని బట్టి ఇంతకీడు మనకు సంభవించినది తెలియుటకై” చివరి ప్రయత్నంగా చీట్లు వెయ్యాల్సిందిగా ప్రతిపాదించారు. “చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చెను. కాబట్టి వారు అతని చూచి - యెవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారమేమిటో, నీవెక్కడ నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో యీ సంగతియంతయు మాకు తెలియజేయమనగా, “అతడు వారితో ఇట్లనెను - నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడైయున్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనైయున్నాను. PKTel 177.4

“తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవుచున్నట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసియుండెను గనుక వారాసంగతి తెలిసికొని మరింత భయపడి - నీవు చేసిన పని ఏమని అడిగిరి. PKTel 178.1

“అప్పుడు వారు - సముద్రము పొంగుచున్నది, తుపాను అధికమౌచున్నది, సముద్రము మా మీదికి రాకుండ నిమ్మళించునట్లు మేము నీకేమి చేయవలెనని అతని నడునగా” PKTel 178.2

“నన్నుబట్టియే యీ గొప్ప తుపాను మిమిదికి వచ్చెనని నాకు తెలిసి యున్నది; నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి. అప్పుడు సముద్రము మిమిదికి రాకుండ నిమ్మళించునని అతడు వారితో చెప్పినను వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహు బలముగా వేసిరిగాని గాలి తమకు ఎదురై తుపాను బలముచేత సముద్రము పొంగియుండుట వలన వారి ప్రయత్నము వ్యర్ధమాయెను. కాబట్టి వారు - యెహోవా, నీ చిత్త ప్రకారముగా నీవే దీని చేసితివి, ఈ మనుష్యుని బట్టి మమ్మును లయము చేయకుందువుగాక; నిర్దోషిని చంపితిరన్న నేరము మామిద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసికొని యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి. పడవేయగానే సముద్రము పొంగకుండ ఆగెను. ఇది చూడగా ఆమనుష్యులు యెహోవాకు మిగులు భయపడి, ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్లు చేసిరి. PKTel 178.3

“గొప్ప మత్స్యము ఒకటి యోనాను మ్రింగవలెనని యెహోవా నియమించి యుండగా యోనా మూడు దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను.” PKTel 178.4

“ఆ మత్స్యము కడుపులో ఉండి యోనా యెహోవాను ఈలాగున ప్రార్ధించెను: PKTel 178.5

“నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా
ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను.
పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా
నీవు నా ప్రార్ధన నంగీకరించియున్నావు.”

“నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో
పడవేసి యున్నావు
ప్రవాహములు నన్ను చుట్టుకొని యున్నవి
నీ తరంగములును నీ కరుళ్లును నన్ను కప్పియున్నవి”

“నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను
నీ పరిశుద్ధాలయముతట్టు మరల చూచెదననుకొంటిని
ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొని యున్నవి” “సముద్రారాధము నన్ను ఆవరించియున్నది
సముద్రపు నాచు నాతలకు చుట్టుకొనియున్నది
నేను మరెన్నటికిని ఎక్కిరాకుండ భూమి
గడియలు వేయబడియున్నవి”
“నా దేవా, యెహోవా, నీవు నాప్రాణమును
కూపములో నుండి పైకి రప్పించియున్నావు
కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా
నేను యెహోవాను జ్ఞాపకము చేసికొంటిని
నీ పరిశుద్దాలయములోనికి నీ యొద్దకు
నా మనవి వచ్చెను”

“అసత్యమైన వ్యర్ధదేవతలయందు లక్ష్యముంచువారు
తమ కృపాధారమును విసర్జింతురు
కృతజ్ఞతాస్తుతులు చెల్లించు నేను నీకు
బలుల నర్పింతును
నేను మొక్కుకొనిన మొక్కుబళ్లను
చెల్లింపక మానను.
యెహోవా యొద్దనే రక్షణ దొరుకును
అని ప్రార్ధించెదను.” PKTel 178.6

7 నుంచి 2:9 వచనాలు.

“రక్షణ యెహోవాది” అని చివరికి యోనా నేర్చుకున్నాడు. (కీర్త 3:8) పశ్చాతాపంతోను, రక్షించే దైవకృప గుర్తింపుతోను విడుదల కలిగింది. అగాధ సముద్రంలోని అపాయాలనుంచి యోనాకి విమోచన లభించింది. మత్స్యం అతణ్ని ఆరిన నేలమీద కక్కింది. నీనెవెని హెచ్చరించవలసిందిగా యోనాని దేవుడు మళ్లీ ఆదేశించాడు. “అంతట యెహోవా వాక్కు రెండవమారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా - “నీవు లేచి నీనెవె మహానగరమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము.” ఈసారి యోనా ప్రశ్నించటంగాని సందేహించటంగాని చెయ్యకుండా వెంటనే ఆచరించాడు. అతడు “లేచి యోహోవా సెలవిచ్చిన ఆజ్ఞప్రకారము నీనెవెకు పోయెను.” యోనా. 3:1-3. PKTel 179.1

యోనా ఆ పట్టణంలో ప్రవేశించటంతోనే “ఇక నలువది దినములకు నీనెవె పట్టణము నాశనమగును” (4వ వచనం) అన్నవర్తమానం ప్రకటించటం మొదలు పెట్టాడు. హెచ్చరిక చేస్తూ వీధివీధికి వెళ్లాడు. PKTel 180.1

ఆ వర్తమానం వ్యర్ధంకాలేదు. దేవుడు లేని ఆ పట్టణం వీధుల్లో మారుమోగిన హెచ్చరిక ప్రతీనోటా పలికి చివరికి ఆ పట్టణ నివాసులందరికీ వినిపించింది. పరిశుద్దాత్మ ఆ వర్తమానాన్ని ప్రతీ హృదయానికి విశదం చేయటంతో ప్రజలు తమ పాపాల నిమిత్తం భయంతో వణుకుతూ దీనమనసుతో పశ్చాత్తాపపడ్డారు. PKTel 180.2

“నీనెవె పట్టణపువారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నీనెవె రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి, తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదెలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులును ఆజ్ఞఇయ్యగా - ఒక వేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తపుడై మనము లయము కాకుండ తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏవియు పుచ్చుకొనకూడదు, పశువులుగాని యెద్దులుగాని గొట్టెలుగాని మేతమేయకూడదు, నీళ్ళు త్రాగకూడదు. మనుష్యులందరు తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను, మనుష్యులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకోవలెను, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెనని దూతలు నీనెవె పట్టణములో చాటించి ప్రకటన చేసిరి.” 5-9 వచనాలు. PKTel 180.3

రాజు, అధికారులు, సామాన్యులు, ఘనులు, దీనులు “యోనా ప్రకటన విని మారుమనస్సు పొంది” (మత్త 12:41) పరలోకమందున్న, దేవునికి మొరపెట్టుకున్నారు. ఆయన వారిపై కరుణ చూపించాడు. “ఈ నీనెవేవారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తపుడై వారికి చేయుదునని తాను మాటయిచ్చిన కీడుచేయక మానెను.” యోనా 3:10. వారి మీదికి రానున్న నాశనం తొలగిపోయింది. అన్యలోకమంతా ఇశ్రాయేలువారి దేవున్ని ఘనపర్చారు. ఆయన ధర్మశాస్త్రాన్ని గౌరవించారు. అనేక సంవత్సరాల అనంతరం దేవుని మర్చిపోవటంవల్ల గర్వం వల్ల నీనెవె తన చుట్టూ ఉన్న జాతులకు లొంగిపోయి పతనం కానుంది. (అష్పూరు. పతన వృత్తాంతానికి 30వ అధ్యాయం చూడండి) PKTel 180.4

గోనె పట్ట ధరించి బూడిదలో నిలబడి పశ్చాత్తాప పడినందుకు వారిని నాశనం చెయ్యకుండా కాపాడాలన్న దేవుని ఉద్దేశాన్ని గురించి యోనా తెలుసుకున్నప్పుడు దేవుని గొప్ప కృపను బట్టి సంతోషించటంలో అతడు మొదట ఉండాల్సింది. అలాకాక అతడు తనను ప్రజలు అబద్ద ప్రవక్తగా పరిగణించే అవకాశాన్ని గురించి ఆలోచించటం మొదలుపెట్టాడు. తన పలుకుబడి పేరు ప్రతిష్టల గురించి ఆలోచించటం మొదలు పెట్టి ఆ పట్టణంలోని ఆత్మల గొప్ప విలువను పూర్తిగా విస్మరించాడు. పశ్చాత్తాపబడిన నీనెవె ప్రజల పట్ల దేవుడు చూపించిన దయకు యోనా “చింతాక్రాంతుడై కోపగించు” కున్నాడు. “యెహోవా నేను నాదేశమందుండగా ఇట్లు జరుగునని నేననుకొంటిని గదా? అందువలననే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపగల దేవుడవై యుండి, పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలిసికొని దానికి ముందుగానే తరీషునకు పారిపోతిని” అన్నాడు. యోనా 4:1,2. PKTel 180.5

ప్రశ్నించటం, సందేహించటమన్న తన ప్రవృత్తికి యోనా మళ్లీ లోనయ్యాడు. మళ్లీ అతణ్ని నిరాశ కుంగదీసింది. ఇతరుల శ్రేయాన్ని మరిచిపోయి, ఆ పట్టణం నాశనం కాకపోవటం చూడటం కన్నా తాను మరణించటం మేలనుకున్నాడు. అసంతృప్తితో యోనా ఇలా అన్నాడు, “నేనిక బ్రదుకుటకంటే చచ్చుటమేలు, యెహోవా, నన్నిక బ్రదుకనియ్యక చంపుము.” PKTel 181.1

“నీవు కోపించుట న్యాయమా?” అని ప్రభువు అడిగాడు. “అప్పుడు యోనా ఆ పట్టణములో నుండిపోయి దాని తూర్పుతట్టున బసచేసి అచ్చట పందిరి యొకటి వేసికొని - పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చుని యుండగా దేవుడైన యెహోవా సొర చెట్టొకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తల పైగా నీడనిచ్చునట్లు చేసెను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను.” 3-6 వచనాలు. PKTel 181.2

ప్రభువు అప్పుడు యోనాకి ఒక సాదృశ్య పాఠం బోధించాడు. ఆయన ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమిగల తూర్పు గాలిని రప్పించెను. యోనాకును ఎండదెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి - బ్రదుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను.” PKTel 181.3

దేవుడు మళ్లీ తన ప్రవక్తతో మాట్లాడాడు, “ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా? అని యోనాను అడుగగా యోనా - ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే” అన్నాడు. PKTel 181.4

“నీవు కష్టపడకుండను పెంచకుండను ఒక రాత్రిలోనే పుట్టిపెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన యీ సొరచెట్టు విషయములో నీవు విచారపడుచున్నావే అయితే నూట ఇరువది వేలకంటే ఎక్కువై కుడియెడమలు ఎరుగని జనమును బహు పశువులును గల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా? అని యోనాతో సెలవిచ్చెను.” యోనా గందరగోళంలోపడ్డాడు, సిగ్గుపడ్డాడు. నీనెవెని నాశనం చెయ్యకుండా కాపాడటంలో దేవుని ఉద్దేశాన్ని యోనా గ్రహించలేకపోయాడు. అయినా ఆ పట్టణాన్ని హెచ్చరించాల్సిందిగా దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేర్చాడు. తాను ప్రవచించిన సంఘటన చోటు చేసుకోకపోయినా, ఆ వర్తమానం దేవుని వద్దనుంచి వచ్చిందే. అది దేవుడు ఉద్దేశించిన లక్ష్యాన్ని సాధించింది. ఆయన కృపా మహిమ అన్యజనుల్లో వెల్లడయ్యింది. “బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడినవారై చీకటిలోను మరణాంధకారము లోను” దీర్ఘకాలంగా కూర్చుంటున్నవారు “కష్టకాలమందు... యెహోవాకు మొఱ్ఱ పెట్టిరి” ఆయన “వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండియు మరణాంధకారములో నుండియు వారిని రప్పించెను.” “ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను. ఆయన వారు పడిన గుంటలలోనుండి వారిని విడిపించెను.” కీర్త 107:10,13,14,20. PKTel 181.5

నీనెవెలో యోనా బోధవల్ల జరిగిన మేలును గురించి ప్రభువు తన భూలోక సేవలో ప్రస్తావిస్తూ ఆ అన్యమత కేంద్రంలోని ప్రజల్ని తన దినాల్లోని నామమాత్రపు క్రైస్తవులతో సరిపోల్చుతూ మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు, “నీనెవె వారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నీనెవేవారు ఈ తరమువారితో నిలువబడి వారిమీద నేరస్తాపన చేతురు. ఇదిగో యోనాకంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.” మత్త 12:40,41. పొందగలిగిన లాభమంతా పొందటానికి ప్రయత్నించే వినిమయదార్లు వ్యాపారుల కేకలు వాదోపవాదాలతో నిండిన వీధిలోకి క్రీస్తు వచ్చాడు. ఆ గందరగోళానికి పైగా దేవుని బూరలా ఆయన స్వరం వినిపించింది: “ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పొగొట్టుకొనుట వారికేమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణముకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును?” మార్కు 8:36,37. PKTel 182.1

యోనా బోధ నీనెవె ప్రజలికి ఒక గుర్తు ఎలాగయ్యిందో అలాగే క్రీస్తు బోధన ఆయన తరంవారికి ఒక గుర్తు. అయితే లోకం అంగీకారం విషయంలో ఎంత వ్యత్యాసముంది! అయినా ఉదాసీనత, ధిక్కారం నడుమ కార్యసిద్ద కలిగేవరకు రక్షకుడు పని చేస్తూనే ఉన్నాడు. PKTel 182.2

నిజదేవుని గుణశీలాన్ని ఉద్దేశాల్ని గూర్చిన జ్ఞానం నాడు నీనెవె ప్రజలకి ఎంత అవసరమయ్యిందో అంతే అవసరమైన జాతులతో నిండిన పట్టణాలున్న ఈ దినాల్లో దైవ సేవకులకు ఈ పాఠం ఎంతైన అవసరం. క్రీస్తు రాయబారులు మనుషుల్ని మెరుగైన ప్రపంచానికి నడిపించాలి. దాన్ని గురించి ప్రజలు చాలామట్టుకు మర్చిపోయారు. లేఖనబోధనల ప్రకారం చిరకాలం నిలిచే పట్టణం దేవుడే దేనికి రూపశిల్పి నిర్మాణకుడో ఆ పరిశుద్ద పట్టణమే. దేవుడు మహిమతో ప్రకాశించే పరలోక ద్వారాన్ని మానవులు విశ్వాస నేత్రంతో చూడవచ్చు. నిత్యమైన స్వాస్థ్యాన్ని సంపాదించాలన్న పరిశుద్ధ కోరికతో కృషి చేయవలసిందంటూ తమ ధనాన్ని దైవ సింహాసనం పక్కదాచుకోవలసిందంటూ ఆయన విజ్ఞప్తి చేస్తున్నాడు. PKTel 182.3

క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్న దుష్టత దుర్మార్గం వల్ల నగరాలు పట్టణాల నివాసుల మీదికి సామాన్య దోషిత్యం వేగంగా వస్తూఉన్నది. విస్తరిస్తున్న దుర్నీతి మానవుడు వర్ణించలేనిది. సంఘర్షణలు, లంచాలు, మోసాలు రోజుకురోజు సరికొత్త రూపాల్లో దర్శన మిస్తున్నాయి. హృదయాన్ని రుజాగ్రస్తం చేసే దౌర్జన్యం, అన్యాయం, మానవ శ్రమలు బాధలపట్ల నిర్లిప్తత, మానవ ప్రాణాల్ని క్రూరంగా నాశనం చెయ్యటం రోజుకురోజు పెరుగిపోతున్నాయి. రోజుకు రోజు ఉన్మాదం, హత్యలు, ఆత్మహత్యలు పెచ్చరిల్లుతున్నాయి. PKTel 183.1

మానవుల మేలుకోసం దేవుని సంకల్పాల్ని గూర్చి ప్రజల్ని అజ్ఞానంలో ఉంచటానికి సాతాను యుగయుగాలుగా కృషిచేస్తూ వస్తున్నాడు. దేవుని ధర్మశాస్త్రంలోని న్యాయ సూత్రాలు, కరుణ, ప్రేమవంటి గొప్ప విషయాల్ని మానవుల దృష్టినుంచి మరుగు పర్చటానికి ప్రయత్నిస్తున్నాడు. మనం నివసిస్తున్న ఈ యుగంలోని ప్రగతిని గురించి, విజ్ఞానాన్ని గురించి మనుషులు అతిశయంగా చెప్పుకుంటున్నారు. కాని లోకం దుష్టత్యంతో దౌర్జన్యంతో నిండి ఉన్నట్లు దేవుడు చూస్తున్నాడు. దైవ ధర్మశాసనాలు రద్దయ్యాయని, బైబిలు ప్రామాణికం కాదని మనుషులు ప్రకటనలు చేస్తున్నారు. ఫలితంగా, నోవహు దినాలనాటినుంచి, మత భ్రష్టులైన ఇశ్రాయేలు వారి దినాల నాటినుంచి ఎన్నడూ కనిపించని దుర్మార్గం దుష్టత్వం ఏరులా ప్రవహిస్తూ లోకాన్ని ముంచుతున్నది. ఆత్మ సౌందర్యం, సాధుత్వం, కనికరం నిషిద్ధ భోగాల వాంఛను తృప్తి పర్చటానికి మారక వస్తువులవుతున్నాయి. లాభంకోసం పాల్పడే నేరాల దాఖలా వెన్నులో చలి పుట్టిస్తుంది. PKTel 183.2

మన దేవుడు కృపామయుడు. తన ధర్మశాస్త్రాన్ని అతిక్రమించే వారి పట్ల దీర్ఘ సహనంతో దయతో వ్యవహరిస్తాడు. పరిశుద్ధలేఖనాల్లో వెల్లడైన దైవ ధర్మశాస్త్రాన్ని మనుషులు అధ్యయనం చేసి గ్రహించటానికి ఎన్నో అవకాశాలున్న మన ఈ దినాల్లో దౌర్జన్యం నేరం రాజ్యమేలుతున్న దుర్మార్గ పట్టణాల్ని నగరాల్ని చూసి విశ్వపాలకుడైన దేవుడు తృప్తి చెందలేడు. PKTel 183.3

పతనమైన లోకంతో సర్వోన్నత పరిపాలకుడు వ్యవహరించే తీరులో ఊహించని మార్పులు చోటు చేసుకోటంలో మనుషులు ఆశ్చర్యపడాల్సిన పని ఉందా? అతిక్రమానికి పెచ్చరిల్లుతున్న నేరానికి శిక్ష రావటంలో మనుషులు ఆశ్చర్యపడాల్సిన పని ఉందా? మోసం వంచన ద్వారా సంపాదించే వారిని దేవుడు నాశనం చెయ్యటంలో ఆశ్చర్యపడాల్సిన పని ఉందా? దేవుని న్యాయవిధుల్ని గురించి పెరుగుతున్న వెలుగు తమ మార్గంలో ప్రకాశిస్తున్నప్పటికీ అనేకమంది యెహోవా పరిపాలనను గుర్తించటానికి నిరాకరిస్తున్నారు. ఆదిలో దేవునిపై తిరుగుబాటు చేసిన అపవాది నల్లజెండా కింద నిలిచిపోటానికి ఎంపిక చేసుకుంటున్నారు. PKTel 183.4

దేవునికి గొప్ప సహనం ఉంది. ఆయన పరిశుద్ద ఆజ్ఞల్ని అదేపనిగా ప్రజలు కించపర్చటం చూసినప్పుడు మనం విస్మయం చెందుతాం. సర్వ శక్తిగల ఆ ప్రభువు తన సొంత గుణలక్షణాల విషయంలో సంయమనం పాటిస్తున్నాడు. అయితే పదిఆజ్ఞల విధుల్ని ధైర్యంగా ధిక్కరించే దుష్టుల్ని శిక్షించటానికి ఆయన తప్పకుండా విజృంభిస్తాడు. PKTel 184.1

దేవుడు మనుషులికి కొంత కృపకాలం ఇస్తాడు. అయితే దేవుని సహనం ఇక కొనసాగని స్థితి వస్తుంది. అప్పుడు ఆయన తీర్పులు నిశ్చయంగా వస్తాయి. మనుషుల విషయంలోనేంటి పట్టణాల విషయంలోనేంటి దేవుడు దీర్ఘకాలం సహనం పాటిస్తాడు. తన ఉగ్రత నుంచి కాపాడటానికి ఆయన మనుషులికి కృపతో హెచ్చరికలు పంపుతాడు. కాని ఒక సమయం వస్తుంది. అప్పుడు కృపకోసం మనుషుల విజ్ఞప్తులు ఆయనకి వినిపించవు. సత్యకాంతిని తోసిరాజనే తిరుగుబాటుదార్లు నిర్మూలమవుతారు. ఆ కార్యం వారికేకాదు వారి ఆదర్శం వల్ల ప్రభావితులయ్యేవారికీ కృపాకార్యమే అవుతుంది. PKTel 184.2

లోకంనిండా దుఃఖం ఉండే సమయం దగ్గరలో ఉంది. దాన్ని ఏ మానవ తైలం బాగుపర్చలేదు. దేవుని ఆత్మను ఉపసంహరించుకోటం జరుగుతుంది. సముద్రం పైన భూమిపైన ప్రమాదాలు ఒకదాని వెంట ఒకటి జరుగుతున్నాయి. గొప్ప ప్రాణనష్టం, ఆస్తి నష్టంతో ప్రజల్ని కకావికలం చేసే భూకంపాలు, తుపాన్లు, అగ్నిప్రమాదాలు వరదల గురించి ఎంత తరచుగా వింటున్నాం! ఈ ఉపద్రవాలు మానవుడి అదుపును అధిగమించి, నియంత్రణ, క్రమం లేకుండా విశృంఖలంగా విరుచుకుపడే ప్రకృతి శక్తుల విజృంభణలు. అయితే వాటన్నిటిలో దేవుని ఉద్దేశం వ్యక్తమౌతుంది. తమకు వస్తున్న ప్రమాదాల గుర్తింపు మానవులకు కలిగేందుకు ఉపయుక్తమౌతున్న సాధనాలు ఇవి. రక్షణ శుభవార్తను ప్రకటించేటప్పుడు పెద్ద పట్టణాల్లోని దుర్మార్గాన్ని, అన్యాయాన్ని, భ్రష్టతను ఎదుర్కొనేటప్పుడు దైవసేవకులు అధైర్యం చెందకూడదని దేవుడు పిలుపు నిస్తున్నాడు. పౌలు దుర్మార్గంతో నిండిన కొరింథులో ఉన్నప్పుడు దేవుడు అతడికి ఇచ్చిన వర్తమానంతో అలాంటి ప్రతీ సేవకుణ్నీ ప్రభువు ఉత్సాహపర్చగోరుతున్నాడు : “నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము. నేను నీకు తోడైయున్నాను, నీకు హాని చేయుటకు నీమీదికి ఎవడునురాడు. ఈ పట్టణములో నాకు బహు జనమున్నది.” అ.కా 18:9,10. ఆత్మల రక్షణ పరిచర్యలో ఉన్నవారు దైవవాక్యంలోని ఉపదేశాన్ని పట్టించుకోనివారు అనేకమంది ఉండగా, ప్రపంచమంతా వెలుగునుంచి సత్యం నుంచి తొలగిపోయి, రక్షకుడిస్తున్న ఆహ్వానాన్ని విసర్జించదు. ప్రతీ పట్టణం దౌర్జన్యంతోను నేరంతోను నిండిఉన్నా, సరియైన ఉపదేశంతో యేసు అనుచర్లు అయ్యేవారు ఆ పట్టణంలో అనేకమంది ఉంటారు. ఇలా రక్షణ సత్యంతో వేలప్రజల్ని కలిసి క్రీస్తుని తమ రక్షకుడుగా ఎన్నుకోటానికి వారిని నడిపించవచ్చు. PKTel 184.3

లోక ప్రజలికి నేడు దేవుని వర్తమానం ఇది, ‘మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్దముగా ఉండుడి.” మత్త 24:44. సమాజంలోని పరిస్థితులు ముఖ్యంగా దేశాల్లోని మహానగరాల్లోని పరిస్థితులు దేవుడు తీర్పుతీర్చే ఘడియ వచ్చిందని, లోకం అంతమయ్యే సమయం సమీపంలో ఉందని ఉరుమువంటి స్వరంతో ప్రకటిస్తున్నాయి. మనం యుగాలుగా సాగుతున్న సంఘర్షణ ద్వారంలో నిలిచిఉన్నాం. దేవుని తీర్పులు ఒకదాని వెంట ఒకటి వేగంగా వస్తాయి - అగ్ని, వరద, భూకంపం, యుద్ధం రక్తపాతం. ఈ సమయంలో గొప్పవి నిర్ణయాత్మకమైనవి అయిన సంఘటనలు మనల్ని ఆశ్చర్యపర్చకూడదు. ఎందుకంటే పశ్చాత్తాపం లేని వారిని కాపాడటానికి కృపాదూత ఎక్కువకాలం ఆగలేడు. PKTel 185.1

“యెహోవా తన నివాసమునుండి వెడలివచ్చుచున్నాడు. భూమి తనమీద చంపబడినవారిని ఇకను కప్పకుండ తాను త్రాగిన రక్తమును బయలుపరచును.” యెష 26:21. దేవుని ఉగ్రత తుపాను రేగుతున్నది. యోనా బోధకు నీనెవె నివాసులు స్పందించినట్లుగా, కృపాహ్వానానికి సానుకూలంగా స్పందించి విశ్వపాలకుడైన దేవుని ధర్మశాస్త్రానికి విధేయులై ఉండటం ద్వారా పరిశుద్దులు అయ్యేవారు మాత్రమే దానికి నిలువగలుగుతారు. నాశనం దాటిపోయే వరకు నీతిమంతులు మాత్రమే క్రీస్తుతో దేవునిలో దాచబడతారు. ఇది ఆత్మ మాట్లాడే భాష కావాలి: PKTel 185.2

“ఇతర ఆశ్రయం లేదు నాకు
నా ఆత్మ నీపై ఆని ఉన్నది
విడువకు అయ్యో విడువకు నన్ను ఒంటరిగా
ఆదుకొని నన్ను ఓదార్చు”

“రక్షకా నన్ను దాచి ఉంచు
తుపాను దాటిపోయేదాక,
పరముకు నడిపించు క్షేమంగా
నా ఆత్మను స్వీకరించు చివరగా” PKTel 185.3