Go to full page →

అధ్యాయం 17—ఉదయ దూతలు GCTel 278

రక్షణ కార్యాన్ని పూర్తిచేసే క్రీస్తు రెండోరాక బైబిలు వెలువరిస్తాన్న గంభీరమైన అతి తేజోవంతమైన సత్యాలలో ఒకటి. “గాడాంధకారపు లోయలో” సంచరించటానికి ఎంతో కాలం విడువబడ్డ దేవుని యాత్రిక ప్రజలకు “పునరుత్థానమును జీవమును” అయిన ప్రభువు ప్రత్యక్షతలో ప్రశస్తమైన ఆనందదాయకమైన వాగ్దానం ఉన్నది. రెండోరాకడ సిద్ధాంతం పరిశుద్ధ లేఖనాల ప్రధానాంశం. ఆది దంపతులు ఏదెను వనం నుంచి విచారంగా వెళ్లిపోయిన నాటి నుంచి వారిని సాతాను శక్తి నుంచి విడిపించి తాము పోగొట్టుకొన్న పరదైసుకు తమను తిరిగి తీసుకు వెళ్లే వాగ్దాత్త ప్రభువు కోసం కనిపెట్టారు. పూర్వం పరిశుద్ధులు తమ నిరీక్షణ నెరవేర్పుగా మెస్సీయా రాకకు ఎదురు చూశారు. ఏదెను వాసులైన ఆదామువ్వల నుంచి ఏడోవాడు మూడు శతాబ్దాల పాటు దేవునితో నడచిన వాడు అయిన హానోకు విమోచకుని రాకను దూరం నుంచి వీక్షించే భాగ్యం కలిగింది. “ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను “యూదా 14:1. పితరుడైన యోబు తన శ్రమల సమయంలో అచంచల విశ్వాసంతో ఇలా అన్నాడు, “అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును. రంలాగు నా చర్మము చీకిపోయినను తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను. మరి ఎవరునుకాదు నేనే కన్నులారా ఆయనను చూచెదను” యోబు 19:25-27 GCTel 278.1

నీతి పరిపాలనను నెలకొల్పటానికి క్రీస్తు రాక అన్న అంశంపై పరిశుద్ధ రచయితలు గంభీర నిష్పాక్షిక వాక్కులు ఉచ్చరించటానికి వారిని ఆవేశం నింపింది. బైబిలు కవులు, ప్రవక్తలు పరలోక అగ్నితో మండే మాటలతో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇశ్రాయేలు రాజైన ప్రభువు శక్తిని, ఈవినిగూర్చి కీర్తన కారుడిలా అంటున్నాడు, “పరిపూర్ణ GCTel 278.2

సౌందర్యముగల సీయోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. ఆయన మౌనముగా నుండడు... ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై... మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు” కీర్తనలు 50:24. “యెహోవా వేంచేయుచున్నాడు. ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక... భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయు చున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును” కీర్తనలు 96:111 3. GCTel 278.3

యెషయా ప్రవక్త అంటున్నాడు, “మంటిలో పడియున్న వారలారా, మేల్కోని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు, భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును.” (“మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగివేయును.” యెషయా 26:19; 25:8, 9. GCTel 279.1

పరిశుద్ద దర్శనంలో నిమగ్నుడై ఉన్న హబక్కూకు ప్రభువు రాకడను వీక్షించాడు. “దేవుడు తేమానులో నుండి బయలుదేరు చున్నాడు. పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. ఆయన మహిము ఆకాశమండల మంతటను కనబడుచున్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది.” “అయన నిలువబడగా భూమి కంపించును, ఆయన చూడగా జనులందరు ఇటు అటు తొలగుదురు. ఆది కాల పర్వతములు బద్దలైపోవును, పురాతన గిరులు అణగును. పూర్వకాలము మొదలుకొని ఆయన ఈలాగు జరిగించువాడు.” నీ గుఱ్ఱములను కట్టుకొని రక్షణార్ధమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నావు” “నిన్ను చూచి పర్వతములు కంపించును జలములు ప్రవాహముగా పారును. సముద్రాగాధము ఘోషించుచు తన చేతులు పై కెత్తును... సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు” “నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు. నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు. ” హబక్కూకు 3:3;4,6,8,10,11,13. GCTel 279.2

రక్షకుడు వెళ్లిపోడానికి కాస్తముందు దుఃఖంలో మునిగి ఉన్న తన శిష్యుల్ని ఈ మాటలతో ఓదార్చాడు, “మీ హృదయమును కలవరపడనీయ్యకుడి... నా తండ్రి యింట అనేక నివాసములు కలవు... మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నే నుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును” యోహాను 14:1-3. “తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలుసు వచ్చును” “ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై యుండును. అప్పుడు సమస్తజనములు ఆయన ఎదుట ప్రోగుచేయబడుదురు” మత్తయి 25:31,32. GCTel 279.3

క్రీస్తు ఆరోహణం అనంతరం ఇంకా ఒలీవ కొండపైనే ఉన్న దేవదూతలు క్రీస్తు పునరాగమన వాగ్దానాన్ని ఈ మాటల్లో శిష్యులకు మళ్లీ చెప్పారు, “మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏరీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆరీతిగానే ఆయన తిరిగి వచ్చును” అని చెప్పారు. అ.పొ.1:11. అపోస్తలుడు పౌలు పరిశుద్దాత్మ ఆవేశం వల్ల ఇలా సాక్ష్యమిస్తున్నాడు, “ఆర్భాటముతోను ప్రధానదూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును.” 1థెస్స 4:16. పత్మాసు ప్రవక్త అంటున్నది వినండి, “ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును” ప్రకటన 5:7. GCTel 280.1

“అన్నిటికి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద ప్రవక్తల నోటు” (అ.కొ.3:21). వెలువరించిన మహోజ్వల విషయాలు ఆయన రాకకు సంబంధించినవే. ఆయన రాక సంభవించినప్పుడు ఎంతోకాలం నుంచి సాగుతున్న దుర్నీతి పాలన అంతమౌతుంది. ” ఈ లోక రాజ్యములు” “మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును” అయి’ “యుగయుగముల వరకు ఏలును” ప్రకటన 11:15. యెహోవా మహిమ బయలుపరచబడును... సర్వశరీరులు దాని చూచెదరు” “సమస్త జనముల యెదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయును” “యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా నుండును.” యెషయా 40:5; 61:11; 28:5. GCTel 280.2

మెస్సీయా స్థాపిస్తాడని ఎంతో కాలంగా ఆశిస్తున్న శాంతి రాజ్యం భూమండలంపై అప్పుడు స్థాపితమౌతుంది. “యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు. దాని పాడైన స్థలములన్నింటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు” (లెబానోను సౌందర్యము దానికి కలుగును. కర్మలు షారోనులకున్న సొగసు దాని కుండును” (’విడువబడిన దానివని ఇక మీదట నీవనబడవు. పాడైనదని ఇంకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సీబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును.” “పెండ్లి కుమారుడు పెండ్లికుమార్తెను చూచి సంతోషించునట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును” యెషయా 51:3; 35:2; 62:4,5. GCTel 280.3

అన్ని యుగాలలోను ప్రభువును యధార్ధంగా నమ్మిన ప్రజలకు ఆయన రాకడే ఆశాజ్యోతి. ఆరోహణ సమయంలో తిరిగి వస్తానంటూ ఒలీవ కొండపై ప్రభువు చేసిన వాగ్దానం ఆయన శిష్యుల భవిష్యత్తును ఉత్తేజపరిచింది. వారి హృదయాల్లో చోటుచేసుకొన్న ఆనందోత్సాహాల్ని నిరీక్షణను దుఃఖం ఆర్పదు. కష్టాలు, బాధలు మసకబార్చ లేవు. శ్రమలు, హింసల మధ్య “మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు... ప్రత్యక్షత ” శుభప్రదమైన నిరీక్షణ. ” ప్రభువు వచ్చే వరకు జీవించి ఉంటారని తాము నిరీక్షించిన, ఆప్తులను సమాధిచేసి దుఃఖంలో మునిగి ఉన్న థెస్సలోనీకయులకు వారి బోధకుడైన పౌలు క్రీస్తు రాకడ సమయంలో సంభవించనున్న పునరుత్థానాన్ని గూర్చి వివరించాడు. క్రీస్తుమీద విశ్వాసముంచి మరణించినవారు అప్పుడు లేస్తారు. వారు జీవించివున్న విశ్వాసులతో కలసి ప్రభువును మధ్యాకాశంలో కలుసుకోటానికి వెళ్తారు. “కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము. కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి “(1థెస్స 4:1618.) అంటూ ప్రోత్సహించాడు. GCTel 281.1

“త్వరగా వచ్చుచున్నాను” అన్న వాగ్దానాన్ని పత్మాసు దీవిలో అనుంగు శిష్యుడు యోహాను విన్నాడు. తన యాత్ర కాలమంతా “ప్రభువైన యేసూ రమ్ము” అంటూ సంఘం చేసిన ప్రార్ధననే తానూ చేస్తూ స్పందించాడు. ప్రకటన 22:20. GCTel 281.2

భక్తులు, హతసాక్షులు చీకటి కొట్లలో నుంచి, సజీవ దహన స్థలం నుంచి, ఉరికంబం నుంచి సత్యాన్ని చాటుతూ సాక్ష్యం చెప్పారు. వారి విశ్వాసాన్ని నిరీక్షణను గూర్చిన సాక్ష్యం శతాబ్దాల పొడవునా వినబడూనే ఉన్నది. యేసు వ్యక్తిగత పునరుతాన నిశ్చయత ద్వారా ఆయన రాక సమయంలో తమ పునరుత్థాన నిశ్చయత వారికి కలిగింది. అందుచేత వీరిలో ఒక క్రైస్తవుడు “వారు మరణాన్ని లెక్కచేయలేదు. దాన్ని అధిగమించారు” అన్నాడు- డేనియెల్ టి, టేలర్, ది రెయిస్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ఎర్త్, ఆర్ ది వాయిస్ ఆఫ్ ది చర్చ్ ఇన్ ఆల్ ఏజెస్, పుట 33. “స్వేచ్ఛగా తిరిగి లేచేందుకుగాను” వారు సమాధిలోకి వెళ్లటానికి సంసిద్ధంగా ఉన్నారు. ”- అదే పుస్తకం, పుట 54. “ప్రభువు తన తండ్రి మహిమతో పరలోకం నుంచి మేఘాలలో వస్తాడని వారు ఎదురు చూశారు. వాల్దెన్సీయులు ఇదే విశ్వాసంతో జీవించారు. ” అదే పుస్తకం, పుటలు, 129-132. “విమోచకుడైన యేసు ప్రత్యక్షత సంఘ నిరీక్షణగా భావించి విక్లిఫ్ ఆయన కోసం ఎదురుచూశాడు. ”- అదే పుస్తకం, పుటలు 132-134. GCTel 281.3

తీర్చు దినం రావటానికి నిండా మూడువందల సంవత్సరాలు కూడా పట్టదన్నది నా ధృఢ నమ్మకం. ఈ పాపలోకాన్ని ఇంతకన్నా ఎక్కువ కాలం దేవుడు సహించడు, సహించలేడు.” “ఈ హేయ రాజ్యం కూలిపోయే ఆ మహాదిసం సమీస్తున్నది” - అదే పుస్తకం, పుటలు 134,158. GCTel 282.1

“ఎంతోవయస్సు పైబడ్డ ఈలోకం అంతం ఎంతో దూరంలో లేదు.” అన్నాడు మెలాంగ్ తన్. “సంఘటనలన్నింటిలోను క్రీస్తు రాకను మిక్కిలి శుభప్రదమైనదిగా ఆశించటానికి సందేహించవద్దంటూ క్రైస్తవులను ఉద్బోధిస్తూ “ప్రభువు రాకడ దినాన్ని విశ్వాసుల కుటుంబం యావత్తు దృష్టిలో ఉంచుకుంటుందని” కెల్విన్ ప్రకటించాడు. ఆయన ఇంకా అంటున్నాడు, “క్రీస్తు రాక కోసం మనం ఆకలిగొనాలి, ఆ మహా దినం వచ్చేంతవరకూ మనం వెదకాలి, ధ్యానించాలి. అప్పుడు మన ప్రభువు తన రాజ్యమహిమను సంపూర్ణంగా కనపర్చుతాడు” - అదే పుస్తకం, పుటలు 158, 134. GCTel 282.2

మన ప్రభువైన యేసు మన శరీరాన్ని పరలోకానికి తీసుకువెళ్లలేదా? అందును బట్టి ఆయన తిరిగి రాడా? ఆయన తిరిగి వస్తాడని, త్వరగా వస్తాడని మనకు తెలుసు” అన్నాడు స్కాచ్ సంస్కర్త నాక్స్. తమ ప్రాణాల్ని సత్యం కోసం త్యాగం చేసిన రిడ్లి, వేటిమలు ప్రభువురాక కోసం విశ్వాసంతో కనిపెట్టారు. రిడ్లి ఇలా రాశాడు, “లోకం అంతానికి సమీపంగా ఉంది. అందుకు సందేహం లేదు. నేను ఇది నమ్ముతున్నాను కాబట్టి చెబుతున్నాను. దైవ సేవకుడైన యోహానుతో కలసి “ప్రభువైన యేసూ రమ్ము” అంటూ మన రక్షకుడు క్రీస్తుకి మొర పెట్టుకొందాం”- అదే పుస్తకం, పుటలు 157,145. GCTel 282.3

“ప్రభువురాకను గూర్చిన ఆలోచనలు నాకు ఎంతో ఆనందాన్నిస్తాయి” అన్నాడు బే స్టర్. - రిచ్చర్డ్ బెస్టర్, వర్క్సు , సం 17, పుట 555. “పరిశుద్ధులు తమ విశ్వాసాన్ని బట్టి, ప్రవర్తనను బట్టి ఆయన ప్రత్యక్షతను ఆశించి ఆ శుభప్రద ఘటనకోసం ఎదురు చూస్తారు. ” “పునరుత్థానమప్పుడు నశించబోయే చివరి శత్రువు మరణమైతే సంపూర్ణమైన ఈ తుది విజయం సంభవించనున్నప్పుడు క్రీస్తు రెండోరాక కోసం విశ్వాసులు ఎంత ఆశతో కనిపెట్టి ప్రార్ధన చేస్తారో మనం గ్రహించవచ్చు” అదే పుస్తకం, సం 17, పుట 500. విశ్వాసుల రక్షణ కార్యం వారి హృదయ వాంఛలు, ప్రయత్నాలు సఫలమయ్యే ఈ దినం కోసం విశ్వాసులంతా ప్రగాఢంగా ఆశించాలి, నిరీక్షించాలి, ఎదురుచూడాలి.” (1 ప్రభువా, ధన్యమైన ఈ దినాన్ని వేగవంతం చేయి.” అదే పుస్తకం, సం 17, పుటలు 182, 183. అపోస్తలుల సంఘం,” అరణ్యంలోని సంఘం” సంస్కర్తల సంఘం నిరీక్షించింది ఇదే. GCTel 282.4

క్రీస్తు రాకడ తీరు తెన్నులను ఉద్దేశాన్నేకాక అది సమీపంలో ఉన్నదని తెలిపే సూచనలను కూడా ప్రవచనం ముందుగానే విశదీకరించింది. యేసు చెప్పిన ఈ మాటలు గమనించండి, “సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు...కలుగును” లూకా 21:25. “చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును. అప్పుడు మనుష్యకుమారుడు మహా ప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు” మార్కు 13:2426. రెండో రాకకు ముందు సంభవించే సూచనల్లో మొదటి దాన్ని ప్రకటన రచయిత ఇలా వర్ణిస్తున్నాడు. “పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబళివలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తమాయెను” ప్రకటన 6:12. GCTel 283.1

ఈ గుర్తులు పందొమ్మిదో శతాబ్దారంభానికి ముందు కనిపించాయి. ఈ ప్రవచనం నెరవేర్పుగా 1755 లో ముందెన్నడూ సంభవించని భయానక భూకంపం నమోదయ్యింది. సామాన్యంగా లిస్బన్ భూకంపంగా పేరుగాంచినా ఇది ఐరోపా, ఆఫ్రికా, అమెరికాల్లో ఎక్కువ ప్రాంతాలకు విస్తరించింది. వెస్ట్ ఇండీస్ లోని గ్రీన్ లేండ్ లో మదేర దీవిలో, నార్వేలో, స్వీడన్లో, గ్రేట్ బ్రిటన్లో, ఐర్లాండులో దీని ప్రభావం కనిపించింది. నలభై లక్షల చతురపుమైళ్ల మేర అది విస్తరించింది. కంపం ఐరోపాలో ఉన్నంత ఉదృతంగా ఆఫ్రికాలోనూ ఉంది. అల్జీ లో ఎక్కువభాగం ధ్వంసమయ్యింది. మొరాకోకు దగరలో ఏడెనిమిది వేల జనాభాగల గ్రామం మటుమాయమయ్యింది. భూకంపం ప్రభావానికి ఉవ్వెత్తున లేచిన తరంగాలు స్పెయిన్, ఆఫ్రికా తీరాలను తాకి అక్కడి నగరాల్లో విస్తార విధ్వంసం కలిగించాయి. GCTel 283.2

ఆ భూకంప బీభత్సం స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో ఎక్కువగా కనిపించింది. కాడిలోకి ప్రవహించిన కెరటం అరవై అడుగుల ఎత్తున్నదట. పోర్చుగల్ లోని “అత్యున్నత పర్వతాలు కొన్ని పునాదుల్లో నుంచి కదిలిపోయాయి. వాటిలో కొన్నైతే శిఖరాలు బద్దలై విచిత్రంగా చీలిపోయాయి. బ్రహ్మాండమైన చరియలు సమీప లోయల్లో పడ్డాయి. ఈ పర్వతాల నుంచి మంటలు పుట్టినట్లు భోగట్టా.” సర్ చార్లెస్ లయెల్, ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజి, పుట 495. GCTel 283.3

లిస్బన్ “భూగర్భంలో నుంచి పిడుగు ఎన్ని నిమిషాల వ్యవధి శబ్దం వినిపించింది. దాని వెంటనే ఆ నగరమంతా భయంకరంగా కంపించింది. ఆరు నిమిషాల వ్యవధిలో ఆరువేలమంది మరణించారు. సముద్రం ముందుకు వెనుకకు వెళ్లింది. నీళ్లులేని నేల కనిపించింది. ఆ తర్వాత ఏబై అడుగుల ఎత్తుకు లేచి సముద్రం తిరిగి వచ్చింది.” లిలో ఈ విపత్తు జరిగిన సమయంలో చోటు చేసుకొన్న అసాధారణ ఘటన చాలా వ్యయంతోనిర్మితమైన పాలరాతి ఓడ రేవుకు సంబంధించింది. భద్రత కోసం చాలా మంది ప్రజలు అక్కడ పోగుపడ్డారు. ఎలాంటి ప్రమాదము తమకు వాటిల్లదని నమ్మిన ప్రజలు అక్కడకు చేరుకొన్నారు. అయితే గుమికూడిన ప్రజలందరితో ఆ రేవు మునిగిపోయింది. ఒక్క శవం కూడా పైకి తేలలేదు. ” - అదే పుస్తకం,పుట 495. GCTel 283.4

“దద్దరిల్లిన” భూకంపానికి ప్రతీ దేవాలయం, కాన్వెంట్, పెద్ద పెద్ద భవనాలు నాల్లో పంతుకుపైగా గృహాలు నేలమట్టమయ్యాయి. భూకంపం జరిగిన రెండు గంటల కాలంలో మంటలులేచి మూడు రోజులపాటు భయంకరంగా వ్యాపించాయి. ఆ నగరం నిర్జీవం నిరాకారం అయ్యింది. భూకంపం సెలవుదినాన సంభవించింది. చర్చ్ లు, కాన్వెంటులు ప్రజలతో నిండి ఉన్నాయి. తప్పించుకొన్నవారు బహుకొదిమంది.” ఎన్ సైక్లోపీడియా అమెరికానా,ఆర్ట్స్, లిబన్, నోట్ (ఎడి 1831). ప్రజల భయాందోళనలు వర్ణనాతీతాలు. ఏడ్చిన వారు లేరు. ఎవరికీ కనీళ్లు మిగులలేదు. ప్రజలు భయభ్రాంతులై మతి భ్రమించి రొమ్ములు బాదుకొంటూ “మిసరి కార్డియా,” లోకం అంతమొందు తున్నది, అని కేకలు వేస్తూ అటూఇటూ పరుగెత్తారు. తల్లులు తమ పసిపాపలను మరచిపోయి సిలువ విగ్రహాలు పట్టుకొని పరుగులు తీశారు. అనేకులు చర్చీల్లోకి పరుగెత్తారు అక్కడ క్షేమంగా ఉంటామని. కాని సంస్కారం ఆచరించటం వ్యర్ధమయ్యింది. పాపం వాళ్లు బలిపీఠాన్ని కౌగలించుకోటం వ్యర్థమయ్యింది. విగ్రహాలు, ప్రీస్టులు, ప్రజలు ఉమ్మడి సమాధిలో సమాధి అయ్యారు.” భయంకరమైన ఆ దినాన తొంభై వేలమంది మరణించినట్లు అంచనా. GCTel 284.1

ప్రవచనం పేర్కొన్న తర్వాతి గుర్తు- సూర్యుణ్ణి, చంద్రుణ్ణి చీకటి కమ్మటం- ఇరవై అయిదు సంవత్సరాల అనంతరం కనిపించింది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది సంభవించే నిర్దిష్ట సమయం తెలియరావటం. ఒలీవ కొండమీద శిష్యులతో తన మాటల్లో సంఘం ఎదుర్కోనున్న సుదీర్ఘ శ్రమకాలాన్ని గురించి పోపుల పాలనలోని 1260 సంవత్సరాల హింసను గురించి దాని నిడివిని తక్కువ చేస్తానన్న తన వాగ్దానం గురించి ప్రస్తావిస్తూ రక్షకుడు తన రాకకు ముందు సంభవించనున్న కొన్ని సంఘటనలను పేర్కొని వాటిలో మొదటిది ఎప్పుడు సంభవిస్తుందో నిర్దిష్టంగా చెప్పాడు. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు.” మార్కు 13:24. ఆ 1260 దినాలు లేదా సంవత్సరాల కాలం 1798 లో అంతమొందింది. దానికి పాతిక సంవత్సరాల పూర్వం హింస పూర్తిగా ఆగిపోయింది. క్రీస్తు చెప్పిన మాటల ప్రకారం, ఈ శ్రమలకాలం అనంతరం సూర్యుణ్ణి చీకటి కమ్మటం జరగాల్సి ఉంది. ఈ ప్రవచనం 1780 మే 19న నెరవేరింది. GCTel 284.2

“మే 19,1780 నాటి సంభవం వివరణకందని మర్మపూరితమైన ఘటన. న్యూ ఇంగ్లండ్ ఆకాశంలోను వాతావరణంలోను అకారణంగా, అగోచరంగా అలముకొన్న అంధకారమది” ఆర్.ఎమ్.డెనెన్స్, అవర్ ఫస్ట్ సెంచురి, పుట 89. GCTel 285.1

ఆ తరుణంలో మేసచూసెట్స్ నగరంలో నివసిస్తున్న ఒక వ్యక్తి ఆ ఘటనను ఇలా వర్ణిస్తున్నాడు, “ఉదయాన సూర్యుడు నిర్మలంగా ప్రకాశించాడు. కాని కొద్ది సేపటిలోనే మసకబారి పోయాడు. మేఘాలు కమ్మాయి. అవి నల్లగా మారి భీతి గొలిపాయి. మెరుపులు మెరిశాయి, ఉరుములతో భూమి దద్దరిల్లింది. చెదురు మదురుగా చినుకులు పడ్డాయి. తొమ్మిది గంటల ప్రాంతంలో మేఘాలు పలచబడి గోధుమ వర్ణం సంతరించుకొన్నాయి. భూమి, రాళ్లు, చెట్లు, కట్టడాలు, నీరు విచిత్రమైన వెలుగులో వింతగా కనిపించాయి. మనుషులు కూడా వింత రూపం సంతరించుకొన్నారు. కొన్ని నిమిషాల అనంతరం ఆకాశమంతా మేఘావృతమయ్యింది. ఎండాకాలంలో రాత్రి తొమ్మిది గంటలకు ఎంత చీకటిగా ఉంటుందో అంత చీకటిగా ఉంది. GCTel 285.2

“ప్రజల హృదయాల్లో భయాందోళనలు చోటుచేసుకొన్నాయి. మహిళలు గుమ్మాల్లో నిలబడి నల్లబడుతున్న ప్రకృతి చిత్రాన్ని వీక్షిస్తున్నారు. పురుషులు పొలం పనుల నుంచి ఇళ్లకు వచ్చేశారు. వడ్రం పనివాళ్లు, కమ్మరి పని వాళ్లు, కార్మికులు వారి వారి పనిముట్లు విడిచి ఇళ్లు చేరుకొన్నారు. పాఠశాలలు మూసివేశారు. బడిపిల్లలు వణుకుతూ ఇంటిముఖం పట్టారు. ప్రయాణికులు దగ్గరలో ఉన్న వ్యవసాయ గృహంలో బస చేశారు. ఏమి సంభవిస్తుంది? అంటూ ప్రతీవారూ ప్రశ్నించసాగారు. పెద్ద తుపాను వస్తున్నదా అనిపించింది. లేదా సమస్తం సంపూర్తి అయినట్లు అనిపించింది. GCTel 285.3

“కొవ్వొత్తులు వెలిగించారు. వెన్నెలలేని శరత్కాల సంధ్యవేళలో ఇళ్లలో మంటలు ప్రకాశించాయి... పక్షులు తమతమ గూళ్లకు వెళ్లిపోయాయి. పశువులు శాలలకు చేరి అరవనారంభించాయి. కప్పల బెకబెకలు, పిట్టల కలకలరాలు మొదలయ్యాయి. గబ్బిలాలు అడ్డదిడ్డంగా ఎగరనారంభించాయి. అయితే మసుషుడు మాత్రం అది రాత్రి కాదన్న విషయం తెలుసుకోలేదు. GCTel 285.4

“సాలెమ్ లోని టేబర్ నికల్ చర్చ్ పాదిరి డా. నతానియేల్ విక్టర్ సమావేశ గృహంలో ఆరాధన జరిపాడు. ఆ చీకటి దైవ సంకల్పితమంటూ ప్రసంగించాడు. ఇంకా ఇతర స్థలాల్లో ప్రజలు సమావేశమయ్యారు. ఆ చీకటి లేఖన ప్రవచనం ప్రకారం కలిగినదని చెప్పే వచనాల ఆధారంగా వెలువడిన అశు ప్రసంగాలవి... పదకొండు దాటిన కొద్ది సేపటికి చీకటి మరింత దట్టమయ్యింది. ” డి ఎసెక్స్ ఏంటిక్వేరియన్, ఏప్రిల్ 1899, సం 3,నం4, పుటలు 53,54. “దేశంలో ఆయాప్రాంతాల్లో పగలే దట్టమైన చీకటి కమ్ముకొంది. దినంలో అది ఏ సమయమో ప్రజలు చెప్పలేకపోయారు. దీపం లేకుండా భోజనం చేయలేక పోయారు. ఇంటి పనులు నిర్వహించలేకపోయారు. GCTel 286.1

“ఈ చీకటి విస్తీర్ణత అసాధారణమైనది. అది తూర్పున ఉన్న ఫాల మౌత్ వరకు విస్తరించింది. పడమట దిక్కున ఆ చీకటి కనెటికట్, ఆల్బనీ వరకు వ్యాపించింది. దక్షిణాన అది సముద్ర తీరాల పొడవునా వ్యాపించింది. ఉత్తరాన అమెరికా వలసల వరకూ ఆ చీకటి అలముకొంది.” - విలియమ్ గోర్డన్, హిస్టరీ ఆఫ్ ది రైజ్, ప్రోగ్రెస్, అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ ఆఫ్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ ది యు.ఎస్.ఎ., సం 3, పుట 57. GCTel 286.2

దినమంతా చీకటిగా ఉంది. సాయంత్రానికి ఒకటి రెండు గంటల ముందు ఆకాశం కొంతవరకు నిర్మలమయ్యింది. అయినా నల్లని పొగమంచు వల్ల ఇంకా చీకటిగానే ఉంది. పొద్దుకుంకిన తర్వాత పైన మళ్లీ మేఘాలు వచ్చాయి. కొద్ది సేపటిలోనే చీకటి అలముకొంది. రాత్రి చీకటి పగటి భయంకర చీకటి ఏమాత్రం తీసిపోలేదు. దాదాపు పున్నమిలాంటి వెన్నెల కాస్తున్నా దీపంలేకుండా ఏ వస్తువూ కనిపించలేదు. చుట్టుపట్ల ఇళ్లలోనుంచి, కాస్త దూరంగా ఉన్న స్థలాల్లో నుంచి చూసినప్పుడు ఆ వెలుగు కిరణాలు చొరలేని ఒక విధమైన ఐగుపు చీకటిలో నుంచి కనిపించినట్లు తోచింది.”- ఐజయ తామస్, మెసె చూసెట్స్ సృయి, ఆర్ అమెరికన్ ఓరకిల్ ఆఫ్ లిబర్టీ, సం 10, నం 472 (మే 25,1780). ఆ దృశ్యం చూసిన ఒక ప్రత్యక్ష సాక్షి ఇలా అంటున్నాడు, “విశ్వంలో ఉన్న ప్రకాశవంతమైన జ్యోతులన్నింటినీ కప్పివేస్తే లేదా పూర్తిగా తొలగించివేస్తే ఆ చీకటి మరేమీ ఎక్కువయ్యేది కాదు అని ఆ సమయంలో నాకు కలిగిన బలమైన నమ్మకం” - లెటర్ బై డా|| సెమ్యుల్ టెన్నీ, ఆఫ్ ఎగ్జిటర్, న్యూహేమ్ షయిర్, డిసెంబర్, 1785 (ఇన్ మెసె చూసెట్స్ హిస్టారికల్ సొసైటీ కలెక్షన్స్, 1792, ఫస్ట్ సీరీస్, సం 1, పుట 97.) ఆ రాత్రి తొమ్మిది గంటలకు పూర్ణ బింబంతో చంద్రుడు ప్రకాశించినా ఆ వెలుతురు మరణ భయాన్ని పారదోలలేక పోయింది.” మధ్య రాత్రి తర్వాత చీకటి మాయమయ్యింది. చంద్రుడు మొదటగా కనిపించినప్పుడు రక్తవర్గం ధరించాడు. GCTel 286.3

చరిత్రలో మే 19,1780 చీకటి దినం”గా మిగిలిపోయింది. ఇలాంటి సాంద్రత, విస్తీర్ణత, కాలవ్యవధిగల అంధకార సమయం చోటుచేసుకొన్న దాఖలాలు మోషే కాలం నుంచి నేటివరకూ ఎక్కడాలేవు. ఈ ఘటనను గూర్చి ప్రత్యక్ష సాక్షుల వర్ణన ప్రభువు చెప్పిన ప్రకారం వాటి నెరవేర్పుకు ఇరవై అయిదు వందల సంవత్సరాలు ముందే యోవేలు ప్రవక్త లిఖించిన ఈ మాటలకు ప్రతి ధ్వని మాత్రమే, “యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును” యోవేలు 2:31. GCTel 287.1

తన రాకకు గుర్తులకోసం కనిపెట్టి వస్తున్న తమ రాజు రాక సూచనలను చూసి సంతోషించవలసిందిగా క్రీస్తు తన ప్రజలను ఉద్భోధించాడు. ఇవి జరగ నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తల లెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్న దనెను”. వసంతకాలంలో చిగురిస్తున్న చెట్లవంక చూపిస్తూ ఆయనిలా అన్నాడు, “అవి చిగిరించుట చూచి వసంతకాల మప్పుడే సమీపమాయెనని మీయంతట మీరు తెలిసికొందురు గదా? అటువలె మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయెనని తెలిసికొనుడి. ” లూకా 21:28, 30, 31 GCTel 287.2

సంఘంలో వినయశీలం భక్తి భావం పోయి అహంభావం, సంప్రదాయం బలపడటంతో క్రీస్తుపట్ల ప్రేమ, ఆయన రాకడ విషయంలో నిరాసక్తత చోటు చేసుకొన్నాయి. లోకాశలు, సుఖభోగాలలో తల మునకలై దైవ ప్రజలమని చాటుకొనే ప్రజలు ప్రభువు రాకకు సంబంధించిన సూచనలను గూర్చిన ఉపదేశాన్ని విస్మరిస్తున్నారు. రెండో రాకడ సిద్ధాంతాన్ని పట్టించుకోటం లేదు. ఈ సిద్ధాంతాన్ని గూర్చిన లేఖనాలకు అపార్ధాలు చెప్పి వాటిని భ్రష్టు పట్టించినందున ప్రజలు వాటిని చాలా మేరకు ఉపేక్షించి విస్మరిస్తున్నారు. ప్రత్యేకించి ఈ పరిస్థితి అమెరికా సంఘాల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సమాజంలో సకల వర్గాలకు లభించిన స్వేచ్ఛ సుఖ శాంతులు భోగభాగ్యాలపై అమితాసక్తి, ధనసంపాదనపై అనురక్తి అందరికీ అందుబాటులో ఉండే ప్రజాదరణ, అధికారం కోసం తహతహలాడటం మనుషులు లోకాశలపై మనసు పెట్టటానికి, యేసు రాకడ మహా దినం భవిష్యత్తులో ఎంతో కాలానికిగాని రాదని నమ్మటానికి దారితీస్తున్నాయి. GCTel 287.3

తన రాకకు గుర్తులను వివరించినప్పుడు తన రెండో రాకకు ముందు మతభ్రష్టత ఎలా ప్రబలుతుందో యేసు ముందే చెప్పాడు. ప్రజా వ్యవహారాలు, వ్యాపార కార్యకలాపాలు, సుఖానుభవం, దేవుని మరచిపోవటం, భవిషత్ జీవితాన్ని విస్మరించటం- ఈ విషయాల్లో లోకం నోవాహు దినాల్లోలాగే వ్యవహరిస్తున్నది. ఈ కాలంలో నివసిస్తున్న వారికి క్రీస్తు పలికే హితవు ఇది, “మీ హృదయములు ఒక వేళ తిండి వలనను, మతువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి”. కాబట్టి మీరు జరుగబోవు వీటి నెల్లను తప్పించుకొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తి గలవారమగునట్లు ఎల్లప్పుడును ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి.” లూకా 21:34,36. GCTel 287.4

ఈ సమయంలో సంఘ పరిస్థితి ఎలాగుంటుందో ప్రభువు ప్రకటన గ్రంధంలో ఇలా వివరిస్తున్నాడు, “జీవించుచున్నానన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. ” అజాగ్రత్తతో కూడిన భద్రత నుంచి మేల్కోటానికి ఎవరైతే నిరాకరిస్తారో వారికి ఈ గంభీరమైన హెచ్చరిక వస్తున్నది, “నీవు జాగరూకుడవై యుండని యెడల నేను దొంగవలె వచ్చెదను. ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు” ప్రకటన 3:1,3. GCTel 288.1

తమ ముందు అపాయమున్నదని ప్రజలను మేల్కొల్పటం, కృపకాలం ముగింపులో జరిగే సంఘటనలకు వారు సిద్ధపడటం అవసరం. ప్రవక్త ఇలా అంటున్నాడు, “యెహోవా దినము బహు భయంకరము. దానికి తాళగలవాడెవడు?” (దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైన...కనుదృష్టి” (“భాధించు వారి బాధను దృష్టింపజాలని ప్రభువు ప్రత్యక్షతను ఎవరు తాళగలరు?” యోవేలు 2:11. హబక్కూకు 1:13. “మాదేవా... మేము నిన్ను ఎరిగియున్న వారమే” అని అరుస్తూనే ఆయన నిబంధనను అతిక్రమించి, తమ హృదయాల్లో దుర్నీతిని దాచుకొని అసత్యమార్గాలను ప్రేమించి వేరొక దేవుణ్ణి వెంబడించే వారికి ప్రభువు దినం “నిజముగా వెలుగై యుండదు” హోషేయ 8:2,1; కీర్తనలు 16:4; ఆమోసు 5:20. ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును. మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసము వంటివారై యెహోవా మేలైనను, కీడైనను చేయువాడు కాడని మనస్సులో అనుకొను వారిని శిక్షింతును” జెఫన్యా 1:12. “లోకుల చెడుతనమును బట్టియు దుష్టుల దోషమును బట్టియు నేను వారిని శిక్షించబోవు చున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించెదను. బలాత్కారుల గర్వమును అణచివేసెదను” యెషయా 13:11. “యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును.” “వారి ఆస్తి దోపుడు సొమ్మగును, వారి ఇండ్లు పాడగును” రానున్న ఈ భయంకర సమయం గురించి ప్రస్తావిస్తూ యిర్మీయా ప్రవక్త ఇలా అంటున్నాడు, “నా అంతరంగములో నా కెంతో వేదనగా నున్నది...నా గుండె కొట్టుకొనుచున్నది తాళలేను, నాప్రాణమా బాకా నాదము వినబడుచున్నది గదా? కీడు వెంట కీడు వచ్చుచున్నది.” యిర్మీయా 4:19,20. GCTel 288.2

“ఆ దినము ఉగ్రతదినము శ్రమయు, ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము. మేఘములును గాఢాంధ కారమును కమ్ముదినము. ఆ దినమున...ఘోషణయు బాకానాదమును పాడుచేయుటకును పాపులను బొత్తిగా దానిలో నుండకుండా బొత్తిగా నశింప జేయుటకును... అది వచ్చుచున్నది. “యెషయా 13:9 GCTel 289.1

ఆ మహాదినం దృష్ట్యా దైవ ప్రజలు తమ ఆధ్యాత్మిక నిరాసక్తత నుంచి మేల్కొని మారుమనసుతో దీనస్వభావంతో ప్రభువును వెదకవలసిందిగా వారిని దైవ వాక్యం ఆహ్వానిస్తున్నది. “సీయోను కొండమీద బాకా ఊదుడి. నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయెననియు దేశనివాసులందరు వణకుదురు గాక. “సీయోనులో బాకా ఊదుడి, ఉపవాసదినము ప్రతిష్ఠించుడి. ప్రతదినము నియమించి ప్రకటన చేయుడి. జనులను సమకూర్చుడి, సమాజకూటము ప్రతిష్టించుడి. పెద్దలను పిలువనంపించుడి. చిన్న వారిని, స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములోనుండియు పెండ్లి కుమార్తె గదిలోనుండియు రావలయును. యెహోవాకు పరిచర్యచేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీళ్లు విడుచుచు...వేడుకొనలెను” “ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఖిఃచుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణాకటాక్షములు గల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగల వాడునై యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాప పడును గనుక మీ వస్త్రములనుగాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి.” యోవేలు 2:1, 1517, 12,13. GCTel 289.2

దేవుని యందు నిలబడటానికి ఒక జనాంగాన్ని సిద్దపర్చటానికిగాను గొప్ప దిద్దుబాటు జరగవలసి ఉంది. తన ప్రజలమని చెప్పుకొంటున్న అనేకమంది నిత్య జీవానికి సిద్ధపడటం లేదని దేవుడు గుర్తించాడు. మైకం నుంచి మేల్కొలిపి ప్రభువు రాకకోసం వారిని సంసిద్ధం చేయటానికి కృపాసంపూర్ణుడైన దేవుడు వారికి హెచ్చరికా వర్తమానం పంపటానికి పూనుకొన్నాడు. GCTel 289.3

ఈ హెచ్చరిక ప్రకటన 14 వ అధ్యాయంలో ఉంది. పరలోక దూతలు ప్రకటిస్తున్నట్లు తెలియవస్తున్న మూడు భాగాల వర్తమానం అది. ఈ వర్తమాన ప్రకటన ముగిసిన వెనువెంటనే “లోకపు పంటను” కోయటానికి మనుష్య కుమారుడు వస్తాడు. ఇందులో మొదటి వర్తమానం రానున్న తీర్పును గూర్చి హెచ్చరిస్తున్నది. ప్రవక్త ఎగురుతున్న దేవదూతను చూశాడు. “అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయాభాషలు మాట్లాడు వారికిని ప్రతి జనమునకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశమధ్యమున ఎగురుచుండెను. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపర్చుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారులను కలుగజేసిన వానికే నమస్కారం చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను” ప్రకటన 14:6,7. GCTel 290.1

ఈ వర్తమానం “నిత్య సువార్తగా ” ప్రచురితమయ్యింది. సువార్త ప్రకటన బాధ్యత దేవదూతలకుగాక మనుషులకు లభించింది. ఈ కార్యాన్ని నడిపించటానికి పరిశుద్ధ దూతలు నియమితులయ్యారు. మానవ రక్షణ నిమిత్తం సాగుతున్న మహోద్యమాన్ని నడుపుతున్నది వారే. కాగా వాస్తవానికి లోకంలో సువార్తను ప్రకటించే వారు క్రీస్తు సేవకులే. GCTel 290.2

దైవాత్మ మార్గదర్శకత్వానికి దైవ వాక్య బోధనలకు విధేయులై నివసించే విశ్వాసులు లోకానికి ఈ హెచ్చరికా వర్తమానం ప్రకటించవలసి ఉంది. “తెల్లవారి వేకువ చుక్క... ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు స్థిరమైన ప్రవచన వాక్యము”ను అనుసరించి నివసించిన ప్రజలు వారు. (2 పేతురు 1:19), “వెండి సంపాదించటంకంటె జ్ఞానము సంపాదించుటమేలు, అపరంజి సంపాదించుటకంటె జ్ఞాన లాభము నొందుటమేలు” (సామెతలు 3:14) అని నమ్మి దాచి ఉంచిన ధనం కన్నా విలువైన దైవ వాక్య జానాన్ని వెదకిన మనుషులు వారు. ప్రభువు వారికి తన రాజ్య విషయాలను బయలు పర్చాడు. “యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేసెను” (కీర్తనలు 25:14) GCTel 290.3

ఈ సత్యాన్ని అవగాహన చేసుకొని దీని ప్రకటనకు పూనుకొన్న వారు వేదాంత తత్వజ్ఞానులు కాదు. నమ్మకమైన ఈ కావలివారు లేఖనాలను శ్రద్దగా ప్రార్ధనా పూర్వకంగా పరిశోధించి ఉంటే రాత్రి ఏ జామో వారికి అవగతమై ఉండేది. జరుగబోతున్న సంఘటనలను ప్రవచనాలు వారికి విశదం చేసి ఉండేవి. అయితే వారు ఈ స్థానాన్ని ఆక్రమించలేదు. అందుచేత ఆ వర్తమానాన్ని సామాన్యమసుషులు అందించారు. యేసు ఇలా అన్నాడు, “చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి” (యోహాను 12:35) దేవుడనుగ్రహించిన వెలుగును విడిచి వెనుదిరిగే వారు లేదా ఆ వెలుగు అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేసే వారు చీకటిలోనే మిగిలిపోతారు. అయితే రక్షకుడిలాగంటున్నాడు, “నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుకలిగియుండును” (యోహాను 8:12). అప్పటికి వచ్చిన వెలుగును అనుసరించి నివసిస్తూ దేవుని చిత్తాన్ని చిత్తశుద్ధితోను ఏకాగ్రతతోను ఎవరైతే అనుసరిస్తారో వారికి మరింత వెలుగును దేవుడిస్తాడు. ఆ ఆత్మను సర్వసత్యంలోకి నడిపించటానికి దేవుడు తన దూతను పంపుతాడు. GCTel 290.4

క్రీస్తు మొదటి రాకడ సమయంలో లేఖనాల్లో విశిష్ట జ్ఞానం కలిగి పరిశుద్ధ నగరంలో ఉన్న ప్రీస్టులు, శాస్త్రులు ఆ కాల సూచనలను అవగాహన చేసుకుని మెస్సీయా రాకను ప్రకటించగలిగి ఉండే వారే. (మీకా ప్రవచనం ఆయన జన్మస్థలాన్ని పేర్కొన్నది. దానియేలు ఆయన రాక సమయాన్ని తెలిపాడు, మీకా 5:25, దానియేలు 9:25. దేవుడు ఈ ప్రవచనాలను యూదునేతలకు అప్పగించాడు. మెస్సీయ రాక సమీపంలో ఉన్నదన్న సంగతి తమ అజ్ఞానం వల్ల తెలియక తాము ఆ వర్తమానం ప్రకటించలేక పోయామన్న సాకు వారు చెప్పటానికి లేదు. వారి అజ్ఞానానికి కారణం ఉపేక్ష. హతులైన దైవ ప్రవక్తలకు స్మారక చిహ్నాలు నిర్మిస్తూనే లోక ప్రధానుల పట్ల భక్తి గౌరవాలు చూపటం ద్వారా యూదులు సాతాను సేవకులకు నీరాజనాలర్పించారు. హోదాకోసం, అధికారం కోసం పోరాటం సాగిస్తూ పరలోక రాజు ఇస్తున్న సన్మానాన్ని వారు విస్మరించారు. GCTel 291.1

మానవుడి రక్షణను సాధించటానికి దైవ కుమారుడు నరుడుగా రావటమన్న అత్యున్నత చారిత్రిక సంఘటన అయిన క్రీస్తు జన్మ స్థలా సమయాన్ని, పరిస్థితులను, ఇశ్రాయేలు పెద్దలు అమితాసక్తితో అధ్యయనం చేస్తూ ఉండాల్సింది. లోక రక్షకుణ్ణి స్వాగతించటంలో ప్రధములుగా ఉండటానికిగాను ప్రజలందరూ మెళుకువగా ఉండి ప్రార్ధించవలసింది. కాని పాపం! నజరేతు కొండ ప్రాంతం నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు నజరేతు పట్టణంలో తూర్పున ఉన్న ఇరుకైన వీధికొనలో రాత్రి తలదాచుకోటానికి నీడకోసం వ్యర్ధంగా ప్రయత్నిస్తున్నారు. వారిని ఆహ్వానిస్తూ తలుపులు ఏవీ తెరుచుకోలేదు. పశువుల కోసం ఏర్పాటు చేసిన దయనీయమైన పాకలో చివరికి వారికి ఆశ్రయం దొరికింది. అక్కడ లోకరక్షకుడు జన్మించాడు. GCTel 291.2

లోకం ఉనికిలోకి రాకపూర్వం దైవ కుమారుడు తండ్రితో మహిమను పంచుకోటం పరలోక దూతలు కళ్లారా చూశారు. లోకం లోకి ఆయన రాకకు వారు అమితాసక్తితో ఎదురు చూసి దాని విషయమై ఎంతో సంతోషించారు. ఆయన రాకడ వార్తను అందుకోటానికి, ఆ వార్తను లోక ప్రజలకు చాటటానికి సిద్ధంగా ఉన్న వారికి దానిని చేరవేయటానికి దేవదూతలు నియమితులయ్యారు. క్రీస్తు తన్నుతాను తగ్గించుకొని మానవ స్వభావాన్ని స్వీకరించాడు. పాపం నిమిత్తం తన్ను తాను అర్పించుకోవలసి ఉన్నాడు. కనుక క్రీస్తు మన దుఃఖ భారాన్ని మోయవలసి వచ్చింది. అయినా తన దీన పరిస్థితిలో సైతం అత్యున్నత దైవ కుమారుడైన యేసు తన ఉన్నత నైతిక స్థాయికి దీటైన హూందాతనంతో మహిమా ప్రభావాలతో మనుషుల ముందు ప్రత్యక్షమవ్వాలని దూతలు ఆకాంక్షించారు. భూలోకంలోని ఘనులు, అధికులు ఆయన రాకను స్వాగతించటానికి ఇశ్రాయేలు ముఖ్య నగరంలో సమావేశమౌతారా? ఉత్కంఠతో ఎదురు చూస్తున్న జన సందోహానికి దూతగణం ఆయనను పరిచయం చేసి వారి ముందు నిలుపుతుందా? GCTel 291.3

స్వాగతం పలికి యేసును అంగీకరించటానికి ఎందరు సిద్ధంగా ఉన్నారో చూడటానికి ఒక దూత లోకాన్ని సందర్శించాడు. ప్రజలు కనిపెడున్న సూచనలు దూతకు కనిపించవు. మెస్సీయా రాకకు సమయం వచ్చిందంటూ స్తుతులు చెల్లించే స్వరాలు ఆయనకు వినిపించవు. పరిశుద్ధ పట్టణం పైన, యుగాలు తరబడి ఎక్కడ దైవ సముఖం ప్రదర్శితమౌతూ వచ్చిందో ఆ ఆలయం పైన దూత కొంత సేపు ఆగి ఉన్నాడు. పరిసయ్యులు ప్రజలనుద్దేశించి గంభీర స్వరంతో ప్రసంగిస్తున్నారు లేదా వీధుల మూలలో నిలిచి ప్రగల్భాలు పలుకుతూ ర్థనలు చేస్తున్నారు. మానవ రక్షకుడు లోకంలో అవతరించటానికి సంసిద్ధంగా ఉన్నా ఆ విషయమై పరలోక మంతా ఆనందోత్సాహాలతో ప్రతిధ్వనిస్తుండగా రాజభవనాల్లో తత్వవేత్తల సభల్లో రబ్బీల విద్యాలయాల్లో దాని గూర్చిన ఊసూ పలుకూ లేదు. GCTel 292.1

జీవనాధుడు వస్తున్నాడు అనటానికి ఎక్కడా ఏమీ గుర్తులు కనిపించలేదు. ఆశ్చర్యంతో ఆ సిగ్గుకరమైన వార్తను తీసుకొని వెళ్లిపోటానికి దూత సమాయాత్తమౌతున్న తరుణంలో ఆయనకు గొర్రెల కాపరుల బృందం కనిపించింది. వారు రాత్రివేళ తమ మందల్ని కాచుకొంటూ ఉండగా ఆకాశ నక్షత్రాలను చూస్తూ భూలోకానికి రావలసిన మెస్సీయాను గూర్చిన ప్రవచనాన్ని గూర్చి ఆలోచిస్తూ ఆయన రాకకై ఆశ వెలిబుచ్చారు. దైవ వర్తమానాన్ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్న ప్రజలు ఇక్కడ కనిపించారు. ప్రభువు దూత వారికి హఠాత్తుగా కనిపించి ఆనందదాయకమైన శుభవార్తను వారికందించాడు. ఆకాశం నుంచి ప్రవహిస్తున్న మహిమ వరదవలే ఆ పచ్చికబైలును కప్పివేసింది. లెక్కకు మించిన సంఖ్యలో దూతలు కనిపించారు. పరలోకంలోని ఆనందాన్ని వ్యక్తం చేయటానికి ఒక దూత సరిపోడన్నట్లు దూతల సమూహం గళాలుకలిపి “సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక” (లూకా 2:14) అని పాడారు. ఈ పాటను రక్షణ పొందిన ప్రజలందరు ఒక రోజున పాడబోతున్నారు. GCTel 292.2

బెల్లెహేమును గూర్చి ఈ కథ నేర్పే పాఠం! ఎంత చక్కని పాఠం. అది మన అపనమ్మకాన్ని, అహంకారాన్ని, స్వయం సమృద్ధతను విమర్శిస్తున్నది. మన ఉదాసీనత వలన కాల సూచనలను అవగాహన చేసుకోకుండా ఉంటూ ఆ సమయాన్ని తెలిపే సూచనలను గ్రహించలేని స్థితికి చేరకుండా అప్రమత్తంగా ఉండాల్సిదంటూ అది మనల్ని హెచ్చరిస్తున్నది. GCTel 293.1

మెస్సీయా ఆగమనానికి ఎదురు చూస్తున్న ప్రజలు యూదయ కొండ ప్రాంతంలోను పేద గొల్లల సమాజంలోను మాత్రమే కనిపించలేదు దూతకు. ఆయన రాకకు ఎదురు చూసిన వారు అన్యుల దేశంలోనూ ఉన్నారు. వారు తూర్పు దేశాలకు చెందిన జ్ఞానులు, ధనికులు, ప్రధానులు, తత్వవేత్తలు. ఆ జ్ఞానులు గొప్ప ప్రకృతి పరిశీలకులు. వారు ప్రకృతిలో దేవున్ని చూశారు. యాకోబు వంశంలో నక్షత్రం ఉదయిస్తుందని వారు హెబ్రీ లేఖనాల నుంచి నేర్చుకొన్నారు. గొప్ప ఆశతో ఆయన రాకకు ఎదురు చూశారు. వస్తున్న ఆయన “ఇశ్రాయేలు యొక్క ఆదరణకొరకు” మాత్రమే గాక “అన్యజనులకు వెలుగుగా” ఉండవలసి ఉన్నాడు. లూకా 2:25,32; అపొ.13:47. వారు వెలుగును ఆశించిన ప్రజలు. అందుచేత దైవసింహాసనం నుంచి వెలుగు ప్రకాశించి వారి పాదాలకు మార్గం సుగమం చేసింది. సత్యాన్ని పరిరక్షించి దాన్ని విశదపర్చేందుకు నియమితులైన యెరూషలేము యాజకులు, రబ్బీలు చీకటిలో కొట్టుమిట్టాడుండగా దేవుడు ఏర్పాటు చేసిన నక్షత్రం వారిని అప్పుడే రారాజు పుట్టిన స్థలానికి పరదేశులైన అన్యులను నడిపించింది. GCTel 293.2

“తన కొరకు కనిపెట్టుకొని యుండు వారి రక్షణ నిమిత్తము” క్రీస్తు “పాపము లేకుండ రెండవసారి ప్రత్యక్షమగును” హెబ్రీ 9:28. రక్షకుని జన్మవార్తలాగునే ఆయన రెండోరాక వార్తను దేవుడు మతనాయకులకు అప్పగించలేదు. వారు దేవునితో తమ అనుబంధాన్ని నిలుపుకోలేకపోయారు. పరలోకం నుంచి ప్రకాశించిన వెలుగును వారు నిరాకరించారు. అందుకే అపోస్తలుడైన పౌలు వర్ణిస్తున్న ప్రజలలో వారుండరు. 6 సహోదరులారా, ఆ దినము దొంగవలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారుకాదు. మీరందరు వెలుగు సంబంధులును పగటి సంబంధులునై యున్నారు. మనము రాత్రివారముకాము, చీకటి వారము కాము” 1థెస్స. 5:4,5. GCTel 293.3

రక్షకుని రాకడ వార్తను మొట్టమొదటగా సీయోను ప్రాకారాలపై ఉన్న కావలి వారు గ్రహించి ఉండాల్సింది. ఆయన రాక సమీపంలో ఉన్నదని వారు తమ స్వరాలెత్తి మొదటగా ప్రకటించాల్సింది. ఆయన రాకకు సన్నద్ధం కావలసిందిగా ప్రజల్ని మొదటగా హెచ్చరించాల్సిన వారు వారే. అయితే ప్రజలు తమ పాప జీవితాల్లో నిద్రిస్తుండగా వారు శాంతి క్షేమాల గురించి కలలు కంటున్నారు. యేసు తన సంఘాన్ని చక్కని ఆకులతో నిండి ఉన్నా పండ్లు బొత్తిగాలేని అంజూరపు చెట్టుకు పోల్చాడు. మతాచారాలను నిష్టగా ఆచరిస్తున్నామన్న అతిశయం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా వారిలో అణకువ, సహనం, విశ్వాసం కొరవడ్డాయి. ఇవి ఉన్నప్పుడే వారి సేవ దేవునికి అంగీకార GCTel 294.1

యోగ్యమౌతుంది. ఆత్మీయ సుగుణాలు బదులు దర్పం, లాంఛన ప్రీతి, డంబం, స్వారప్రియత్వం, హింస వారిలో చోటు చేసుకొన్నాయి. స్వధర్మాన్ని విడిచిపెట్టిన సంఘం కాల సూచనలను గుర్తించలేక పోయింది. ఆ ప్రజల్ని దేవుడు విడిచిపెట్టలేదు. వారి పట్ల ఆయన ఆసక్తి తగ్గలేదు. కాకపోతే వారే ఆయన ప్రేమను కాదని దూరంగా వెళ్లిపోయారు. వారు ఆయన షరతులకు లోబడలేదు. కనుక వారికి ఆయన చేసిన వాగ్దానాలు నెరవేరలేదు. GCTel 294.2

దేవుడనుగ్రహించే వెలుగును ఆధిక్యతలను అభినందించి వృద్ధి పర్చుకోకపోతే దాని పర్యవసానం ఇలాగే ఉంటుంది. ప్రతీ సత్యకిరణాన్ని స్వీకరిస్తూ, తెలిసిన ప్రతీ విధిని నిర్వహిస్తూ దేవుడు నిర్దేశించిన మార్గాన్ని సంఘం అనుసరిస్తే తప్ప మతం కర్మకాండ స్థాయికి దిగజారి అతి ముఖ్యమైన భక్తిభావం కొరవడుంది. ఈ సత్యం సంఘ చరిత్రలో పదేపదే వ్యక్తమయ్యింది. తన ప్రజలు తాము పొందిన ఉపకారాలకు ఆధిక్యతలకు దీటుగా విశ్వాసపరమైన క్రియలు విధేయత కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. విధేయత త్యాగాన్ని కోరుంది. సిలువను భరించటానికి నడుపుతుంది. ఈ కారణం చేతనే క్రీస్తు అనుచరులమని చెప్పుకొనేవారిలో అనేకమంది దేవుడు పంపిన వెలుగును నిరాకరించారు. పూర్వం యూదులమల్లే తమకు వస్తోన్న శ్రమ కాలాన్ని వారు తెలుసుకో లేకపోయారు. లూకా 19:48. తమ గర్వం, అపనమ్మకం వలన ప్రభువు వారిని దాటివెళ్ళి, తాము పొందిన వెలుగునంతటిని అనుసరించిన బేల్లెహేము గొర్రెల కాపరులు, తూర్పు జానులవంటి వారికి తన సత్యాన్ని బయలు పర్చాడు. GCTel 294.3