Go to full page →

అధ్యాయం 23—గుడారమంటే ఏమిటి? GCTel 382

రెండువేల మూడువందల దినముల ఘట్టుకే ... అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును” (దానియేలు 8:14) అన్న లేఖనం ఆగమన విశ్వాసానికి పునాదేగాక మూలస్తంభం కూడా. ప్రభువు త్వరితాగమనం సందర్భంగా ఇవి విశ్వాసులందరికీ తెలిసిన మాటలే. వేలాది విశ్వాసులు ఈ ప్రవచనాన్ని తమ విశ్వాసంలో ప్రధాన సిద్ధాంతంగా పదే పదే పేర్కొంటారు. ఆ ప్రవచనంలో చెప్పిన సంభవాలమీద వారి ఆశలు నిరీక్షణలు ఆధారపడి ఉన్నాయని అందరు భావిస్తారు. ఈ ప్రవచన దినాలు 1844 లో అంతమౌతాయని సూచించటం జరిగింది. ప్రపంచంలోని క్రైస్తవులందరిలాగే ఆగమన విశ్వాసులు కూడా ఈ భూమి లేక అందులోని కొంత భాగం గుడారమని భావించారు. ఆలయ పవిత్రత అంటే చివరి మహాదినాన సంభవించే అగ్నిలో ఈ భూమి శుద్ధి అవుతుందని ఈ క్రియ క్రీస్తు రెండో రాక సమయంలో జరుగుతుందని వారు భావించారు. అందుచేత 1844 లో క్రీస్తు వస్తాడని నిర్ధారించారు. GCTel 382.1

కాకపోతే నిర్దిష్ట సమయం దాటిపోయిందిగాని ప్రభువు రాలేదు. దేవుని మాట నెరవేరి తీరుతుందని విశ్వాసులకు తెలుసు. అయితే పొరపాటు ఎక్కడ జరిగినట్లు? పలువురు 2300 దినాల ప్రవచనం 1844 లో అంతంకాలేదని చెప్పి తప్పించుకొన్నారు. వారు కనిపెట్టిన సమయానికి క్రీస్తు రాలేదన్నది తప్ప దీనికి మరే కారణమూ ఇవ్వలేకపోయారు. ప్రవచన దినాలు 1844 లో అంతమై ఉంటే అగ్నితో భూమిని శుద్ధీకరించటం ద్వారా ఆలయాన్ని పవిత్ర పర్చటానికి క్రీస్తు వచ్చివుండేవాడని ఆయన రాలేదు కాబట్టి ఆ దినాలు అంతం అయి ఉండవని ఒక వాదన వినిపించింది. GCTel 382.2

ఈ అభిప్రాయాన్ని అంగీకరించటం ప్రవచన కాలాన్ని నిర్ధారించే పూర్వ ప్రక్రియను పరిత్యజించటమౌతుంది. యెరూషలేము పునరుద్ధరణకు, అర్తహషస్త జారీచేసిన ఆజ్ఞ క్రీ. పూ. 457 శరత్కాలంలో అమలు కావటంతో 2300 దినాలు ప్రారంభమైనట్లు కనిపిస్తున్నది. దీన్ని ప్రారంభంగా తీసుకొని పరిశీలిస్తే దానియేలు 9:2527లోని కాలావధి వివరణ సందర్భంగా ప్రవచనం చెబుతున్న సంభవాలన్నీ చక్కగా అన్వయిస్తున్నాయి. అరవై తొమ్మిది వారాలు అనగా 2300 దినాల్లోని మొదటి 483 దినాలు అభిషిక్తుడైన అధిపతి రాక వరకు కొనసాగాల్సివున్నాయి. క్రీ. శ. 27లో క్రీస్తు బాప్తిస్మం, పరిశుద్ధాత్మ అభిషేకం, ప్రవచనం నిర్వేశించిన వాటిని కచ్చితంగా నెరవేర్చాయి.డెబ్బయ్యో వారం మధ్య మెస్సీయా మరణించాల్సి వున్నాడు. బాప్తిస్మం అయిన మూడున్నర సంవత్సరాలకు అనగా క్రీ.శ. 31వ వసంతకాలంలో క్రీస్తు సిలువ మరణం పొందాడు. డెబ్బయి వారాలు లేదా 490 సంవత్సరాలు ప్రత్యేకించి యూదులకు వర్తించే కాలావధి అంతంలో క్రీస్తు అనుచరులను హింసించటం ద్వారా యూదు జాతి క్రీస్తును నిరాకరించింది. అప్పుడు అపోస్తలులు క్రీ. శ. 34 లో అన్యుల రక్షణకు కృషి మొదలు పెట్టారు. 2300 సంవత్సరాల్లోను 490 సంవత్సరాలు అంతంకాగా 1810 సంవత్సరాలు మిగిలాయి. క్రీ.శ.34 నుంచి 1810 సంవత్సరాలు 1844 వరకు కొనసాగాయి. “అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును” అన్నాడు దూత. ప్రవచనం నిర్దేశించిన వివరాలన్నీ నిర్దిష్ట సమయంలో నిరుష్టంగా నెరవేరాయి. GCTel 382.3

ఈ లెక్కల ప్రకారం అంతా స్పష్టంగాను సవ్యంగాను కనిపించింది. కాకపోతే ఆలయ పవిత్రతను సూచించే ఘటన ఏదీ 1844 లో సంభవించినట్లు లేదు. ఆ దినాలు అప్పుడు అంతమొందలేదని అనటం ఈ అంశాన్ని గందరగోళానికి గురిచేసి పొరపాటులేని ప్రవచన నెరవేర్పుపై ఆధారితమైన సత్యాలను తోసిపుచ్చట మవుతుంది. GCTel 383.1

కాగా దేవుడు ఆగమన మహోద్యమంలో తన ప్రజలను నడిపించాడు. ఆ ఉద్యమంలో దేవుని శక్తి మహిమలు ప్రస్ఫుటంగా కనిపించాయి. దాన్ని అయోమయంలోను నిరాశ నిస్పృహల్లోను ఆయన విడిచిపెట్టడు. అది తప్పుడు ఉద్యమమని ఛాందస భావజాలంతో కూడిన ఉద్రేకమే అని ప్రజలు విమర్శించటానికి దాన్ని విడిచిపెట్టడు. తన వాక్యాన్ని ఆయన సందేహంలోను అనిశ్చితిలోను విడిచి పెట్టడు. GCTel 383.2

ప్రవచన కాలాల లెక్కల విషయంలో క్రితం తాము అనుసరించిన పద్ధతులకు స్వస్తి చెప్పి వాటి ఆధారంగా తాము చేపట్టిన ఉద్యమం వాస్తవమైంది కాదనే వారు చాలామంది ఉన్నప్పటికీ లేఖనాలు ప్రబోధిస్తున్న విశ్వాసాన్ని దేవుని ఆత్మ ఇస్తున్న సాక్ష్యాన్ని త్యజించటానికి సిద్ధంగాలేని వారు కొందరున్నారు. ప్రవచన అధ్యయనం విషయంలో మంచి విశధీకరణ సూత్రాలను అనుసరించామని, తెలుసుకొన్న సత్యాలను గట్టిగా పట్టుకొని ఉండటం తవు విధిఅని బైబిలు పరిశోధనలోనూ అదే విధానం అవలంబించాలని వారు గట్టిగా నమ్మారు. పట్టుదలతో ప్రార్ధించి తమ స్థితిని పునరవలోకించుకొని, తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకొనేందుకు లేఖనాలను అధ్యయనం చేశారు. ప్రవచన కాలాల నిర్ధారణలో ఏ పొరపాటూ కనిపించక పోవటంతో ఆలయ అంశాన్ని మరింత నిశితంగా పరీక్షించటానికి పూనుకొన్నారు. GCTel 383.3

భూలోకమే ఆలయం అన్న సామాన్య అభిప్రాయానికి లేఖనాధారం లేదని తమ పరిశోధనలో తేలింది. కాని ఆలయాన్ని గురించి దాని స్వభావం నిర్మాణ స్థలం సేవల గురించి సమగ్ర వివరణ వారికి బైబిలులో కనిపించింది. పరిశుద్ధ లేఖన రచయితల సాక్ష్యం ఎలాంటి సందేహానికి తావులేనంత స్పష్టంగాను సమగ్రంగాను ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఇలా అంటున్నాడు. “మొదటి నిబంధనకైతే సేవా నియమములును ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఏలయనగా మొదట ఒక గుడారమేర్పర్చబడెను. అందులో దీపస్తంభమును, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలును ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ సలమను గుడారముండెను. అందులో సువర్ల ధూపారియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహారోను చేతి కట్టియు, నిబంధన పలకలును ఉండెను. దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గూర్చి యిప్పుడు వివరముగా చెప్పవల్లపడదు,” హెబ్రీ 9:15. GCTel 384.1

ఇక్కడ పౌలు ప్రస్తావిస్తున్న గుడారం ఈ లోకంలో తన నివాసం కోసం నిర్మించుమని సర్వోన్నతుడైన దేవుడు ఆజ్ఞాపించగా మోషే నిర్మించింది. ‘’నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను” (నిర్గమ 25:8), అన్నది కొండమీద దేవునితో మోషే ఉన్న తరుణంలో దేవుడు మోషేకిచ్చిన ఆదేశం. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. అందువలన స్థలం నుంచి స్థలానికి తీసుకొని పోవటానికి వీలుగా ఈ గుడార నిర్మాణం జరిగింది. అయినప్పటికీ అది వైభవోపేతమైన నిర్మాణం. దాని గోడలు బంగారు రేకులు పొదిగిన నిలువు పలకలతో చేశారు. వాటిని వెండి దిమ్మలతో అమర్చారు. దాని కప్పు లోపలి భాగం తెరలతోను, వెలుపలిభాగం చర్మాలతోను లోపలి తెరకింది భాగం కెరూబుల చిత్రాలతో అద్దిన సన్నని నారబట్టతోను తయారయ్యింది. బలిపీఠమున్న ఆవరణంగాక గుడారంలో పరిశుద్ధ స్థలం, అతిపరిశుద్ధ స్థలం అని రెండు భాగాలున్నాయి. ఈ రెండు భాగాల్నీ వేరుచేస్తూ వాటి మధ్య అందమైన తెర ఉన్నది. పరిశుద్ధ స్థలం ప్రవేశాన్ని మూసివేస్తూ అలాంటి తెరే వేలాడుతున్నది. పరిశుద్ధ స్థలంలో దక్షిణాన ఏడు ప్రదీపాలుగల దీప వృక్షముంది. ఇది రాత్రింబగళ్లు గుడారానికి వెలుగునిచ్చింది. ఉత్తరాన సన్నిధికి రొట్టెల బల్ల, పరిశుద్ధ, అతిపరిశుద్ధ స్థలాల్ని వేరుచేసే తెరముందు ధూపం ముఖపు వేసే బంగారు వేదిక ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజల ప్రార్థనలతోపాటు ఆ దీపవేదికపై నుంచి అనుదినం దేవుని సన్నిధికి ధూపం ఎగసేది. GCTel 384.2

మందసం అతిపరిశుద్ధ స్థలంలో ఉన్నది. మందసం విలువైన చెక్కతో తయారై బంగారు రేకులు తాపిన పెట్టె. రెండు రాతి పలకలమీద దేవుడు రాసిన పది ఆజ్ఞల చట్టం ఈ మందసంలో నిక్షిప్తమై ఉంది. మందసం పైన కరుణాపీఠం ఉంది. అది మందసానికి మూతగా కూడా వుంది . అది చక్కని కళాఖండం. కరుణాపీఠానికి ఒక చివర ఒక కెరూబు ఇంకో చివర ఒక కెరూబు ఉన్నారు. వాటిని మేలిమి బంగారంతో చేశారు. గుడారం ఈ విభాగంలో ఈ రెండు కెరూబుల మధ్య దేవుని సముఖం ఉండేది. GCTel 385.1

హెబ్రీ ప్రజలు కనాను దేశంలో స్థిరపడిన తర్వాత గుడారం స్థానే సొలోమోను ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయం ఎక్కువ విస్తీర్ణం కలిగిన స్థిరమైన కట్టడమైనా అవే నిష్పత్తుల్ని అనుసరించటం ఒకేలాంటి ఉపకరణాల్ని ఉపయోగించటం జరిగింది. దానియేలు కాలంలో శిధిలావస్థలో ఉన్న తరుణంలో తప్ప క్రీ.శ.70 లో రోము పాలకులు నాశనం చేసే వరకు ఆలయం ఇలాగే కొనసాగింది. GCTel 385.2

బైబిలు ప్రస్తావిస్తూ సమాచార మందిస్తున్న ఆలయం లోకంలో ఇదొక్కటే. దీన్ని పౌలు మొదటి నిబంధన ఆలయమంటున్నాడు. అయితే కొత్త నిబంధనలో ఆలయం లేదా? GCTel 385.3

హెబ్రీ గ్రంధంపై మళ్లీ దృష్టి సారించిన సత్యాన్వేషులు రెండో ఆలయం లేదా నూతన నిబందన ఆలయం ఉనికిలో ఉన్నట్లు క్రితం ఉటంకించిన పౌలు మాటల ద్వారా గ్రహించారు. “మొదటి నిబంధనకైతే సేవా నియమములును ఈ లోకసంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను” ‘’మొదటి నిబంధనకైతే” అన్న పదబంధం పౌలు ఇంతకుముందు ఆలయం గురించి ప్రస్తావించినట్లు సూచిస్తున్నది. దీని ముందు అధ్యాయ ప్రారంభంలో ఇలా అన్నట్లు వారు గమనిస్తారు. “మేము వివరించుచున్న సంగతులలోని సారాంశమేదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడుకాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడైయుండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడి పార్శ్వమున ఆసీనుడాయెను.” హెబ్రీ 8:1,2. GCTel 385.4

ఇక్కడ నూతన నిబంధన ఆలయం వెల్లడవుతున్నది. మొదటి నిబంధన ఆలయం మనిషి నిర్మించింది, మోషే కట్టింది. ఇది ప్రభువు కట్టింది, మనుషుడు కట్టింది కాదు. ఆ ఆలయంలో మానవ యాజకులు తమ సేవలు చేశారు. ఇందులో మన ప్రధాన యాజకుడు క్రీస్తు దేవుని కుడి పక్కన సేవచేస్తాడు. ఒక ఆలయం భూమిపై ఉన్నది. తక్కినది పరలోకంలో ఉన్నది. GCTel 386.1

ఇంకా చెప్పాలంటే మోషే కట్టిన గుడారం ఒక మాదిరి ప్రకారం నిర్మితమయ్యింది. మోదీని ప్రభువు ఇలా ఆదేశించాడు, “నేను నీకు కనుపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నింటి రూపమును నిర్మింపవలెను” మళ్లీ ఈ ఆదేశం ఇచ్చాడు, “కొండమీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము” నిర్గమ 25:9,40. మొదటి గుడారం “ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమునుబట్టి... అర్పణలు, బలులు అర్పింబడుచున్నవి.” అని దాని పరిశుద్ధస్థలాలు “పరలోకమందున్న వాటి పోలిక” అని ధర్మశాస్త్రానుసారంగా బలులర్పించిన యాజకులు “పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు” అని “నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని, యిప్పుడు మనకొరకు దేవుని సముఖమునందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను” అని పౌలంటున్నాడు. హెబ్రీ 9:9,23; 8:5; 9:24. మన పక్షంగా యేసు ఏ పరలోక గుడారంలో పరిచర్య చేస్తున్నాడో అది గుడారం. మోషే నిర్మించిన గుడారం దాని నకలు. భూలోక గుడారాన్ని నిర్మించిన పనివారిని దేవుడు తన ఆత్మతో నింపాడు. గుడార నిర్మాణంలో ప్రదర్శితమైన కళానైపుణ్యం GCTel 386.2

దైవ జ్ఞానానికి ప్రతీక. గోడలు మేలిమి బంగారాన్ని పోలి ఉన్నాయి. బంగారు దీప వృ క్షపు ఏడు ప్రదీపాల కాంతిని ఆ గోడలు అన్ని దిశలకు వెదజల్లుతున్నాయి. సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదిక బంగారంలా మెరిశాయి. లోకప్పుకు ఉపయోగించిన అందమైన తెరలు నీల ధూమ్ర రక్తవర్ణపు దూతల బొమ్మలతో ఆ దృశ్యానికి మరింత శోభకూర్చాయి. రెండో తెరకు అల్లంత దూరాన దేవుని మహిమా ప్రదర్శనకు ప్రతీక అయిన పరిశుద్ధ షెకీనా ఉన్నది. ప్రధాన యాజకుడు తప్ప మరే మానవుడు దానిలో ప్రవేశించి జీవించలేడు. GCTel 386.3

భూలోక గుడార వైభవం పరలోక గుడార మహిమలను మానవులకు కనువిందు చేసింది. పరలోక గుడారంలో మన అగ్రగామి అయిన క్రీస్తు దైవ సింహాసనం ముందు మన కోసం పరిచర్య చేస్తున్నాడు. అది రాజులకు రాజు అయిన దేవుని నివాసస్థలం. అక్కడ వేవేల మంది ఆయనకు సేవలు చేస్తుంటే కోట్లాది మంది ఆయన ముందు నిలిచి ఉంటారు. దానియేలు 9:10. ఆ ఆలయంలో నిత్యసింహాసనం మహిమతో నిండి ఉంటుంది. ఆ ఆలయ రక్షక భటులైన మహాదూతలు పూజ్య భావంతో తమ ముఖాలు కప్పుకొంటారు. మానవ నిర్మితమైన అత్యంత వైభవోపేతమైన ఇహలోక గుడారం విస్తీర్ణ పరంగాను మహిమపరంగాను పరలోక గుడారానికి నీడ కూడా కాదు. అయినప్పటికీ, పరలోక గుడారం గురించి మానవ రక్షణార్థం అక్కడ జరుగుతున్న మహత్తర పరిచర్య గురించి భూలోక గుడారం దాని సేవలు గొప్ప సత్యాలు బోధిస్తున్నాయి. GCTel 387.1

భూలోక గుడారంలోని రెండు విభాగాలూ పరలోక గుడారంలోని పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలాల్ని సూచిస్తున్నాయి. పరలోకంలోని గుడారాన్ని దర్శనంలో వీక్షించే భాగ్యం అపోస్తలుడు యోహానుకు కలిగింది. ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నట్లు ” సింహాసనము ఎదుట ఉన్న ఆయన చూశాడు. ప్రకటన 4:5. “సువర్ణధూపారి చేత పట్టుకొనియున్న దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సువర్ణ బలిపీఠముపైన పరిశుద్ధులందరి ప్రార్ధనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యము ఇయ్యబడ”టం చూశాడు. ప్రకటన 8:3. ప్రవక్త ఇక్కడ పరలోక గుడారంలోని మొదటి విభాగాన్ని వీక్షించటానికి అనుమతి లభించింది. ఇంకా ఆయన ఏడు దీపములు” “సువర్ణ బలిపీఠము” చూశాడు. ఇవి భూలోక గుడారంలోని సువర్ణ దీప వృక్షాన్ని, ధూపవేదికను సూచిస్తున్నవి. మరియు “పరలోకమందు దేవుని ఆలయము” తెరువబడింది. ప్రకటన 11:19. ఆయన అతిపరిశుద్ధ స్థలంలోని తెరను చూశాడు. ఇక్కడ ఆయన “నిబంధన మందసము”ను చూశాడు. ఇది దైవ ధర్మశాస్త్రాన్ని ఉంచటానికి మోషే తయారుచేసిన పరిశుద్ధ పందసాన్ని సూచిస్తున్నది. GCTel 387.2

లేఖనాధ్యయనం చేస్తున్న వారు పరలోకంలో గుడారం ఉన్నదనటానికి తిరుగులేని రుజువును కనుగొన్నారు. దేవుడు తనకు ఇచ్చిన నమూనా ప్రకారం మోషే భూలోక గుడారాన్ని నిర్మించాడు. ఆ నమూనాయే నిజమైన గుడారం అని అది పరలోకంలో ఉన్నదని పౌలు చెబుతున్నాడు. తాను ఆ గుడారాన్ని పరలోకంలో చూశానని పౌలు తెలుపుతున్నాడు. GCTel 388.1

దేవుని నివాసస్థలమైన పరలోక గుడారంలో నీతినిమిత్తం తీర్పు నిమిత్తం దేవుని సింహాసనం స్థాపితమయ్యింది. ఆయన ధర్మశాస్త్రం అతిపరిశుద్ధ స్థలంలో వున్నది. అది గొప్ప నీతి నియమం. మానవాళిని పరీక్షించే ప్రమాణం. ధర్మశాస్త్రం ఉన్న మందసాన్ని కరుణాపీఠం కప్పుతున్నది. ఈ కరుణాపీఠం ముందు నిలిచి తన రక్తం సాక్షిగా క్రీస్తు విజ్ఞాపన చేస్తున్నాడు. మానవ రక్షణ ప్రణాళికలో ఈ విధంగా కృపా న్యాయాలు సమ్మిళితమౌతున్నాయి. ఈ సంయోగాన్ని అనంత జ్ఞానియైన దేవుడు మాత్రమే సంకల్పించి ఆచరణలో పెట్టగలడు. ఈ కృపా న్యాయాల సంయోగం పరలోక వాసుల్ని అమితాశ్చర్యంతో అభినందనతో నింపుతుంది. భూలోక గుడారంలోని కెరూబులు కరుణాపీఠం వంక భక్తిపూర్వకంగా చూడటం రక్షణ కార్యాన్ని పరలోక వాసులు అమితాసక్తితో పరిగణించటాన్ని సూచిస్తున్నది. దేవదూతలు తిలకించాలని ఆశిస్తున్న కృపాపుర్మం ఇదే. పశ్చాత్తపుడైన పాపిని నీతిమంతుడని తీర్చి పాపులతో తన సంబంధాన్ని నూతన పరచటంలో దేవుడు న్యాయవంతుడుగా ఉండటం, అసంఖ్యాక జనసమూహాలను నాశనం నుంచి కాపాడి ఎన్నడూ పడిపోని దూతలతో కలిసి దేవుని సముఖంలో నిత్యమూ నివసించటానికి క్రీస్తు తన నీతి అనే నిష్కళంక వస్త్రాలను వారికి ధరింపజేయటం కృపా మర్మమే. GCTel 388.2

జెకర్యా చక్కని ప్రవచనం “చిగురు అను ఒకడు” అంటూ మానవుడి విజ్ఞాపకుడిగా క్రీస్తు పరిచర్యను వివరిస్తున్నది. ప్రవక్త ఇలా అంటున్నాడు, “చిగురు అను ఒకడు కలడు” అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. అతడే యెహోవా ఆలయమును కట్టును. అతడు ఘనత వహించుకొని తండ్రి సింహాసనాసీనుడై యేలును. సింహాసనాసీనుడై ఆతడు యాజకత్వము చేయగా ఆ యిద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును” జెకర్యా 6:12,13. GCTel 388.3

“అతడు యెహోవా ఆలయమును కట్టును.” తన త్యాగం, మధ్యవర్తిత్వం మూలంగా సంఘానికి క్రీస్తు పునాది మాత్రమే కాదు నిర్మాణకుడు కూడా. క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయి అయియుండగా అపోస్తలులును ప్రవక్తలును వేసిన పునాది మీద కట్టబడి యున్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధిపొందుచున్నది. ఆయనలో మీరు కూడ ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు.” అంటూ పౌలు సూచిస్తున్నాడు. ఎఫెస్సీ 2:2022. GCTel 389.1

“అతడు ఘనత వహించుకొని” పతనమైన మానవాళిని రక్షించటంలోని మహిమ క్రీస్తుకు చెల్లిస్తాడు. నిత్య యుగాల పొడవునా రక్షణ పొందిన వారి స్తుతిగానం ఈ రీతిగా వుంటుంది, “మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించువానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక” ప్రకటన 1:5,6. GCTel 389.2

ఆయన “సింహాసనాసీనుడై యేలును”. సింహాసనాసీనుడై యాజకత్వము చేయును. (తండ్రి) సింహాసనాసీనుడు కావటం ఇప్పుడు కాదు. మహిమారాజ్యం ఇంకా ప్రారంభమవ్వలేదు. మధ్యవర్తిగా ఆయన పరిచర్య ముగిసేంతవరకు దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకు ఇవ్వడు. అది “అంతము లేనిదై యుండు” రాజ్యం. లూకా 1:32, 33. యాజకుడుగా క్రీస్తు ఇప్పుడు తండ్రితో కలసి ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ప్రకటన 3:21. నిత్యుడు స్వయంభవుడు అయిన తండ్రితో కలిసి “మన రోగములను” భరించి మన వ్యసనములను” వహించి “మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడుగాని సమస్త విషయములలోను, మనవలె శోధింపబడినను... పాపములేని వాడుగా” ఉన్న క్రీస్తు శోధింపబడువారికి ...సహాయము” చేయగలిగివుండేందుకు సింహాసనా సీనుడవుతాడు. “ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు” యెషయా 53:4; హెబ్రీ 4:15; 2:18; 1 యోహాను 2:1. అది గాయపర్చబడి విరుగగొట్టబడ్డ శరీరపు విజ్ఞాపన. నిష్కళంక జీవితం చేసే విజ్ఞాపన. ఎవరి విమోచనకోసం నిర్ధారించటం సాధ్యంకాని మూల్యం ఆయన చెల్లించాడో ఆ పాపమానవుల నిమిత్తం గాయపడ్డ ఆయన హస్తాలు, తూట్లుపడ్డ పక్క, చీలలుదిగి వికృతమైన పాదాలు విజ్ఞాపన చేస్తున్నాయి. GCTel 389.3

ఆ యిద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. తండ్రి కుమారుల ప్రేమే నశించిన మానవాళికి రక్షణ ప్రవాహంలా ప్రవహిస్తున్నది. తాను వెళ్లిపోకముందు క్రీస్తు తన శిష్యులతో ఇలా అన్నాడు, “మీ విషయము నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు... తండ్రితానే మిమ్మును ప్రేమించుచున్నాడు.” యోహాను 16:26, 27. దేవుడు క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచు” కొంటున్నాడు. 2 కొరింథి 5:19. పరలోకమందున్న గుడారసేవలో “ఆ యిద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును”. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” యోహాను 3:16. GCTel 390.1

గుడారమంటే ఏమిటి? అన్న ప్రశ్నకు లేఖనాల్లో స్పష్టమైన జవాబువున్నది. బైబిలు ఉపయోగిస్తున్న “గుడారం” అన్న పదం మొట్టమొదటగా మోషే నిర్మించిన గుడారానికి వర్తిస్తుంది. ఇది పరలోకంలోని విషయాలకు నకలు. రెండవది ఈ భూలోక గుడారం; ఇది పరలోకంలో ఉన్న “నిజమైన ఆలయాన్ని సూచిస్తున్నది. క్రీస్తు మరణమప్పుడు ఛాయారూపక సేవ అంతమొందింది. పరలోకంలో ఉన్న “నిజమైన ఆలయం” నూతన నిబంధన గుడారం. దానియేలు 8:14 లోని ప్రవచనం ఈ కాలావధులో నెరవేరుంది. గనుక అది సూచించే గుడారం నూతన నిబంధన గుడారమే. 1844లో 2300 దినాలు సమాప్తమయ్యేటప్పటికి అనేక శతాబ్దాలుగా గుడారం లోకంలో లేదు. అందుచేత “రెండువేల మూడువందల దినముల మట్టుకే...అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును.” అన్న ప్రవచనం పరలోక గుడారానికి వర్తిస్తుందన్నది నిస్సందేహం. GCTel 390.2

కాకపోతే జవాబు కనుగొనాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఇంకా మిగిలేవుంది. ఆలయ శుద్ధీకరణ అంటే ఏమిటన్నదే ఆ ప్రశ్న. భూలోక గుడారం సందర్భంగా అలాంటి సేవ జరిగిందని పాతనిబంధన లేఖనాలు తెలుపుతున్నాయి... కాగా శుద్ధీకరించేందుకు పరలోకంలో ఏముంటుంది? హెబ్రీ 9 వ అధ్యాయంలో భూలోక గుడారం పరలోక గుడారం రెండింటి శుద్ధీకరణను గూర్చిన స్పష్టమైన బోధ వున్నది. “ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండ పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి యుండెనుగాని పరలోక సంభంధమైనవి వీటికంటె శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి యుండెను” హెబ్రీ 9:22,23. ప్రశస్తమైన క్రీస్తు రక్తం వలన శుద్ధి జరగాలి. GCTel 390.3

ఛాయారూపక పరిచర్య నిజమైన పరిచర్య. రెండింటిలోనూ శుద్ధీకరణ రక్తం వలన జరగాలి. మొదటి పరిచర్యలోను, జంతువుల రక్తంతోను రెండో పరిచర్యలో క్రీస్తు రక్తంతోను శుద్ధి జరిగింది. ఈ శుద్ధీకరణకు రక్తం ఎందుకు కావలసి వచ్చిందన్న ప్రశ్నకు సమాధానంగా రక్తం చిందించకుండా పాపనివృత్తి జరుగదని పౌలు చెబుతున్నాడు. పాపక్షమాపణ లేదా పాపం తొలగింపు జరగాలి. పరలోకంలోనైనా భూలోకంలోనైనా పాపానికి గుడారంతో ఏమిటి సంబంధం? చిహ్న రూపక సేవను సమీక్షించటం ద్వారా దీన్ని గ్రహించవచ్చు. ఎందుకంటే ఈ లోకంలో పరిచర్య చేసిన యాజకులు “పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమందు” సేవచేశారు. హెబ్రీ 8:5. GCTel 391.1

భూలోక గుడారసేవలో రెండు విభాగాలుండేవి. యాజకులు పరిశుద్ధ స్థలంలో అనుదినం పరిచర్య చేసేవారు. కాగా ప్రధాన యాజకుడు సంవత్సరాని కొకసారి ఆలయ పవిత్రీకరణ కోసం అతిపరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చితార్ధమైన ప్రత్యేక పరిచర్య నిర్వహించేవాడు. పశ్చాత్తాపం పొందిన పాపి తన బలిని గుడార ద్వారం వద్దకు తీసుకు వచ్చి దాని తలపై చేయి ఉంచి తన పాపాల్ని ఒప్పుకొని తద్వారా ఛాయారూపకంగా తన పాపాలను ఆ నిరపరాధ పశువుపైకి మార్పిడి చేసేవాడు. అప్పుడు ఆ పశువును వధించేవాడు. “రక్తము చిందింపకుండ” పాపక్షమాపణ కలుగదంటున్నాడు అపోస్తలుడు. “రక్తము దేహమునకు ప్రాణము.” లేవీకాండము 17:11. అతిక్రమానికి గురి అయిన దైవ ధర్మశాస్త్రం ప్రాణాన్ని కోరుతుంది. బలి పశువు పాపి అపరాధాన్ని మీద వేసుకొన్నది. పాపి కోల్పోయిన ప్రాణాన్ని సూచిస్తున్న రక్తాన్ని యాజకుడు పరిశుద్ధ స్థలంలోకి తీసుకొనిపోయి పాపి అతిక్రమించిన ధర్మశాస్త్రం ఉన్న మందసం ముందున్న తెరముందు దాన్ని ప్రోక్షించేవాడు. ఈ ప్రక్రియ ద్వారా పాపం రక్తం ద్వారా సంకేతాత్మకంగా గుడారానికి మార్పిడి అయ్యేది. కొన్ని సందర్భాల్లో రక్తాన్ని పరిశుద్ధ స్థలంలోకి తీసుకువెళ్లేవారు. కాని అహరోను కుమారులకు మోషే ఈ విధంగా ఆదేశించినట్లు బలి పశువు మాంసాన్ని యాజకులు భుజించేవారు. “సమాజము యొక్క దోష శిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దానిని మీకిచ్చెను” లేవీ కాండము 10:17. ఈ రెండు ఆచారాలు పశ్చాత్తపుడైన పాపి పాపం గుడారంలోకి మార్పిడి అవ్వటాన్ని సూచించాయి. GCTel 391.2

సంవత్సరం పొడుగునా దినదినం ఇలాంటిసేవ జరిగేది. ఇశ్రాయేలు ప్రజల పాపాలు గుడారంలోకి మార్పిడి అయ్యేవి. వాటి తొలగింపుకు ప్రత్యేక పరిచర్య అగత్యమయ్యేది. ఈ రెండు పరిశుద్ధ విభాగాల్లో ఒక్కోదానికి ప్రాయశ్చిత్తార క్రియ జరపాలన్నది దేవుని ఆదేశం. “అటు అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టియు అనగా వారి అపవిత్రతను బట్టియు వారి అతిక్రమములను బట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్ష గుడారము వారి మధ్య ఉండుటవలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను” ఇశ్రాయేలీయుల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధ పరచటానికి బలిపీఠానికి కూడా ప్రాయశ్చిత్తం చెయ్యాలి. లేవీకాండము 16:16,19. GCTel 392.1

సంవత్సరానికొకసారి ప్రాయశ్చితార్ధదినాన గుడారాన్ని శుద్ధీకరించటానికి ప్రధానయాజకుడు అతిపరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించేవాడు. ప్రధానయాజకుడు అక్కడ నిర్వర్తించే సేవతో సాంవత్సరిక పరిచర్య సమాప్తమయ్యేది. ప్రాయశ్చితార దినాన గుడార ద్వారం వద్దకు రెండు మేక పిల్లల్ని తెచ్చి వాటిమీద “యెహోవా పేరట ఒకచీటీని, విడిచిపెట్టే మేక పేరిట ఒక చీటీని” వేసేవారు. 8 వచనం. యెహోవా చీటీ పడిన మేకను ప్రజల పాప పరిహారార్థ బలిగా వధించేవారు. యాజకుడు ఆ మేక రక్తాన్ని తెరలోపలికి తెచ్చి, కరుణాపీఠం మీద, కరుణాపీఠం ముందు ప్రోక్షించే వాడు. తెరముందు ఉన్న ధూపవేదిక మీద కూడా ఆ రక్తాన్ని ప్రోక్షించేవాడు. GCTel 392.2

“అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తలమీద తన రెండు చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల పాపములన్నియు అనగా వారి దోషములన్నియు వారి అతిక్రమములన్నియు దాని మీద ఒప్పుకొని, ఆ మేక తలమీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దాని పంపవలెను. ఆమేక వారి దోషములన్నిటిని ఎడారి దేశమునకు భరించిపోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను” 21,22 వచనాలు. ఆమేక ఇక ఇశ్రాయేలీయుల శిబిరంలోకి తిరిగివచ్చేది కాదు. దాన్ని అరణ్యంలో విడిచివచ్చిన వ్యక్తి స్నానం చేసి బట్టలు ఉదుక్కొని అప్పుడు శిబిరంలో ప్రవేశించేవాడు. GCTel 392.3

దేవుడు పరిశుద్ధుడని పాపమంటే ఆయనకు అతిహేయమని ఇశ్రాయేలీయులకి గుర్తింపచేయటమే ఈ ఆచారం ఉద్దేశం. అంతేకాదు పాపంతో సంబంధం పెట్టుకొంటే దాని కాలుష్యం నుంచి తప్పించుకోవటం సాధ్యంకాదని కూడా ఈ ఆచారం బోధిస్తున్నది. ప్రాయశ్చిత్త ప్రక్రియ సాగే సమయంలో ప్రతివారూ తమతమ హృదయాలు పరీక్షించుకోవలసి ఉంది. ఆ దినాన ఇశ్రాయేలీయుల సమాజం తమ పనులను నిలిపి ప్రార్ధనతోను ఉపవాసంతోను హృదయాలు పరీక్షించుకుంటూ దేవుని ముందు తమ్మునుతాము తగ్గించుకోవాల్సి ఉంది. GCTel 393.1

ఈ ఛాయారూపక పరిచర్య ప్రాయశ్చిత్తం గురించి ప్రాముఖ్యమైన సత్యాలు బోధిస్తున్నది. పాపికి బదులు ప్రత్యామ్నాయం అంగీకృతమే. కాకపోతే బలిపశువు రక్తం వలన పాపం రద్దుకాలేదు. పాపాన్ని గుడారానికి మార్పిడి చేయటానికి ఒక మార్గం ఏర్పాటయ్యింది. రక్తాన్ని సమర్పించటం ద్వారా పాపి ధర్మశాస్త్రాధికారాన్ని అంగీకరించి తన అతిక్రమ దోషాన్ని ఒప్పుకొని రానున్న రక్షకునిపై విశ్వాసం కనపర్చటం ద్వారా క్షమాపణ కోరేవాడు. అయినా ధర్మశాస్త్ర శిక్షనుంచి అతనికి ఇంకా పూర్తిగా విముక్తి లభించలేదు. ప్రాయశ్చితార్ధ దినాన సమాజం అర్పించే బలి రక్తాన్ని తీసుకొని ఆ రక్తంతో ప్రధాన యాజకుడు అతిపరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ప్రత్యక్షంగా ధర్మశాస్త్రంపై ఉన్న కరుణాపీఠంపై ప్రోక్షించేవాడు. ధర్మశాస్త్ర విధులను నెరవేర్చటానికి ఇది చేసేవాడు. అప్పుడు మధ్యవర్తి పాత్రలో ప్రధానయాజకుడు ఆ పాపాలను తన మీద వేసుకొని గుడారం నుంచి మోసుకుపోయేవాడు. విడిచిపెట్టే మేక తలపై చేతులుంచి దానిమీద ఈ పాపాలన్నింటిని ఒప్పుకొనేవాడు. ఛాయారూపకంగా ఇలా పాపాలన్ని తన మీద నుంచి మేక మీదకు మార్పిడి చేసేవాడు. ఆ మేక ఆ పాపాల్ని మోసుకొని పోయేది. ప్రజల నుంచి ఆ పాపాలు నితంతరం దూరమయ్యాయని భావించేవారు. GCTel 393.2

“పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకంగా అట్టి పరిచర్య జరిగింది. ఛాయారూపకంగా భూలోక గుడారంలో ఏ పరిచర్య జరిగిందో అదే పరిచర్య పరలోక గుడారంలో వాస్తవంగా జరుగుతున్నది. పరలోకానికి ఆరోహణమైన అనంతరం మన రక్షకుడు ప్రధాన యాజకుడుగా తన పరిచర్యను ప్రారంభించాడు. పౌలంటున్న ఈ మాటలు గమనించండి, “నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదుగాని యిప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను” హెబ్రీ 9:24. GCTel 393.3

పరిశుద్ధ స్థలం తలుపుగా పనిచేసి పరిశుద్ధ స్థలాన్ని ఆవరణం నుంచి వేరుచేసిన “అడ్డతెర లోపల” యాజకుడు సంవత్సరం పొడవునా నిర్వహించిన పరిచర్య ఆరోహణం దరిమిలా క్రీస్తు ప్రారంభించిన సేవను సూచిస్తున్నది. పాపపరిహారార్ధబలి రక్తాన్ని, ఇశ్రాయేలీయుల ప్రార్థనలతో పైకిలేచే ధూపాన్ని దేవుని ముందు సమర్పించటమే GCTel 394.1

యాజకుడు అనుదినం చేయాల్సిన పరిచర్య. అలాగే క్రీస్తు పాపుల పక్షంగా తండ్రిముందు నిలిచి తన రక్తం ఆధారంగా విజ్ఞాపనచేస్తూ ప్రశస్తమైన తన నీతి సువాసనతో పాటు పశ్చాత్తాపం పొందిన విశ్వాసుల ప్రార్ధనలను సమర్పించాడు. పరలోకంలోని ప్రధమ విభాగంలో జరిగే పరిచర్య ఇలాంటిది. GCTel 394.2

తమను విడిచి పెట్టి క్రీస్తు పరలోకానికి ఆరోహణమైనప్పుడు శిష్యుల విశ్వాసం అక్కడకు ఆయనను వెంబడించింది. వారి ఆశలు నిరీక్షణలు ఇక్కడే కేంద్రీ కృతమయ్యాయి. “ఈ నిరీక్షణ నిశ్చలమును, స్థిరమునై మన ఆత్మకు లంగరువలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. నిరంతరము...ప్రధానయాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను.” అన్నాడు పౌలు. “మేకల యొక్కయు, కోడెల యొక్కయు రక్తముతోకాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ సలములో ప్రవేశించెను” హెబ్రీ 6:19,20; 9:12. GCTel 394.3

గుడారం మొదటి విభాగంలో ఈ పరిచర్య పద్దెనిమిది శతాబ్దాల పాటు కొనసాగింది. పశ్చాత్తాపం చెందిన విశ్వాసుల పక్షంగా వినియోగమైన క్రీస్తు రక్తం వారికి క్షమాపణను తండ్రి ఆమోదాన్ని ప్రసాదించిందిగాని వారి పాపాలింకా గ్రంథాల్లో మిగిలి ఉన్నాయి. ఛాయారూపక పరిచర్యలో సంవత్సరాంతంలో ప్రాయశ్చిత్త ప్రక్రియ జరిగినట్లే మానవుల నిమిత్తం క్రీస్తు విమోచక చర్య పూర్తికాకముందు గుడారంలో నుంచి పాపం తొలగింపుకు ప్రాయశ్చిత్త కార్యం జరగాల్సి ఉంది. 2300 దినాలు సమాప్తమవ్వటంతో ప్రారంభమైన పరిచర్య ఇదే. దానియేలు ప్రవక్త ప్రవచించిన రీతిగా ఆ సమయంలో ఆలయాన్ని శుద్ధీకరించటంలో తన చివరి విభాగ పరిచర్య జరపటానికి మన ప్రధాన యాజకుడు అతిపరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. GCTel 394.4

పూర్వం ప్రజల పాపాలు విశ్వాసం ద్వారా పాప పరిహారార్ధ బలి మీద మోపి దాని రక్తం ద్వారా ఛాయారూపకంగా భూలోక గుడారానికి మార్పిడి చేసినట్లే కొత్త నిబంధనలో పశ్చాత్తాప పాపి పాపాలు విశ్వాసం ద్వారా క్రీస్తుపై మోపి వాస్తవంలో వాటిని పరలోక గుడారానికి మార్పిడి చేయటం జరుగుతుంది. భూలోక గుడారంలో ఛాయారూపక శుద్ధీకరణ, గుడారాన్ని అపవిత్ర పర్చిన పాపాల తొలగింపు ద్వారా జరిగినట్టు, పరలోక గుడార శుద్ధీకరణ పరలోకంలో దాఖలైన పాపాల్ని తొలగించటం ద్వారా లేక తుడిచివేయటం ద్వారా జరుగుతుంది. అయితే దీనికి ముందు జరగాల్సిన పని ఒకటుంది. పాపాలు ఒప్పుకొని క్రీస్తును విశ్వసించటం ద్వారా ప్రాయశ్చిత్తం ఒనగూర్చే మేళ్లు పొందటానికి అర్హులెవరో నిర్ధారించటానికి గ్రంధాల్లోని దాఖలాలను పరిశీలించటం అవసరం. ఆలయ శుద్ధీకరణ ప్రక్రియలో దర్యాప్తు, తీర్పు ఇమిడి ఉన్నాయి. క్రీస్తు తన ప్రజల్ని విమోచించటానికి రాకముందు ఈ తీర్పు పని పూర్తికావాలి. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ప్రతివారికి వారి వారి పనుల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. ప్రకటన 22:12. GCTel 395.1

2300 దినాలు 1844 లో సమాప్తమవటంతో ఈ లోకానికి రావటానికి బదులు క్రీస్తు తన రాకకు సిద్దబాటుగా ప్రాయశ్చిత్త చర్య ముగింపు కార్యాన్ని నిర్వహించేందుకు పరలోక గుడారంలోని అతిపరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడని ఇలా ప్రవచన వాక్యం వెలుగును అనుసరించినవారు గ్రహించారు. GCTel 395.2

పాప పరిహారార్ధ బలి క్రీస్తును బలి పశువుగా సూచిస్తుందని, క్రీస్తు ప్రధాన యాజకుడు మధ్యవర్తి అని, విడిచి పెట్టే మేక ఛాయారూపకంగా పాపానికి కర్త అయిన సాతానే అని, యధార్ధంగా పశ్చాత్తాపం చెందే పాపుల పాపాలు చివరగా అతడిమీదే పడతాయని వారు గ్రహించారు. పాపపరిహారార్ధబలి రక్తాన్ని బట్టి ప్రధానయాజకుడు గుడారం నుంచి పాపాల్ని తీసివేసి విడిచిపెట్టే మేకపై వాటిని మోపేవాడు. పరలోక గుడారంలో క్రీస్తు తన పరిచర్య సమాప్తంలో పాపాల్ని గుడారం నుంచి తీసివేసినప్పుడు వాటిని సాతానుపై మోపుతాడు. సాతాను ఆ పాపాలకు తీర్పులో కలిగే శిక్షను అనుభవిస్తాడు. విడిచిపెట్టే మేకను మనుషులులేని ప్రదేశంలో విడిచిపెట్టేవారు. అది మరెన్నడూ ఇశ్రాయేలీయుల సమాజంలోకి వచ్చేది కాదు. అలాగే సాతాను దేవుని సముఖం నుంచి దైవజనుల సహవాసం నుంచి బహిష్కృతుడౌతాడు. పాపులకు పాపానికి సంభవించే చివరి నాశనంలో సాతాను పూర్తిగా నశిస్తాడు. GCTel 395.3