Go to full page →

అధ్యాయం 32—సాతాను ఉచ్చులు GCTel 488

దాదాపు ఆరువేల సంవత్సరాలుగా సాగుతున్న మహా సంఘర్షణ త్వరలో సమాప్తం కానున్నది. మానవ పక్షంగా క్రీస్తు చేస్తున్న పనిని నిరర్ధకం చేయటానికి సాతాను తన ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తూ మనుషుల్ని తన ఉచ్చుల్లో బంధించటానికి చూస్తున్నాడు. పాపానికి ప్రాయశ్చిత్తం ఇక వుండదు గనుక రక్షకుని విజ్ఞాపన పూర్తి అయ్యేవరకు ప్రజలను పశ్చాత్తాపం లేకుండా అజ్ఞానంలో ఉంచటమే తన లక్ష్యం. GCTel 488.1

తన శక్తిని అడ్డుకోటానికి ప్రత్యేక కృషి జరగనప్పుడు, సంఘంలోను ప్రపంచంలోను ఉదాసీనత ప్రబలినప్పుడు, సాతాను ఆందోళన చెందడు. ఎందుకంటే తన స్వాధీనంలో ఉన్న బందీలను కోల్పోయే ప్రమాదంలో ఉన్నానన్న భయం అతనికి ఉండదు. కాని నిత్యజీవానికి సంభంధించిన విషయాలపైకి దృష్టి మళ్లినప్పుడు “రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను?” అని ఆత్మలు ప్రశ్నిస్తుంటే అతను ఆప్రమత్తుడై తన బలాన్ని క్రీస్తు బలానికి దీటుగా పెంచుకోటానికి, పరిశుద్ధాత్మ ప్రభావాన్ని వమ్ముచేయటానికి ప్రయత్నిస్తాడు. ఒకప్పుడు దేవదూతలు తమ్మునుతాము దేవునికి కనపర్చుకోటానికి ఆయన ముందుకు రాగా వారితోపాటు సాతాను కూడా వచ్చినట్లు లేఖనాలు చెబుతున్నాయి. దేవుని ముందు వంగి నమస్కారం చేయటానికి కాదు అతను వచ్చింది. పరిశుద్ధులకు వ్యతిరేకంగా తన కుతంత్రాన్ని అమలు పర్చటానికి పచ్చాడు. ప్రజలు దేవుని ఆరాధించటానికి సమావేశమైనప్పుడు అదే ధ్యేయంతో సాతాను కూడా హాజరవుతాడు. కంటికి కనిపించకపోయినప్పటికీ ఆరాధకుల మనసులను నియంత్రించటానికి అతను శాయశక్తుల కృషిచేస్తాడు. నిపుణ సేనాధిపతి వలే అతను తన ప్రణాళికల్ని ముందే రూపొందించుకుంటాడు. దైవ సేవకుడు లేఖన పరిశోధన చేయటం చూసినప్పుడు, ఆ బోధకుడు ప్రజలకు బోధించాల్సిన అంశాన్ని అతను గమనిస్తాడు. అప్పుడు తాను ఎవరిని వంచింప జూస్తున్నాడో వారికి ఆ వర్తమానం చేరకుండా పరిస్థితులను అదుపుచేయటానికి తన శక్తి యుక్తులన్నింటిని ఉపయోగిస్తాడు. ఆ హెచ్చరిక ఎంతో అవసరమైన వ్యక్తిని ఏదో వ్యాపార వ్యవహారంలోకి ఆకర్షించటమో లేక తన జీవితానికి జీవార్ధమైన జీవపు వాసన కాగల ఆమాటలు వినకుండా ఇంకోరకంగా తప్పించటమో చేస్తాడు. GCTel 488.2

ప్రజలను ఆవరించిన ఆధ్యాత్మిక అంధకారాన్ని చూసి దైవ సేవకులు హృదయ భారంతో నిండి ఉండటం సాతాను చూస్తాడు. ప్రబలంగా ఉన్న ఆ ఉదాసీనతను అజాగ్రత్తను, సోమరితనాన్ని తొలగించటానికి దైవ కృపకోసం శక్తికోసం వారు చేసే ప్రార్ధనలు వింటాడు. అంతట రెండంతల ఉత్సాహంతో తన వంచన కళలను ఆచరణలో పెట్టాడు. మనుషుల్ని భోజనం విషయంలో శోధించి భోజన ప్రియుల్ని చేస్తాడు. ఇతర రకాల సుఖభోగాలకు నడిపించి వారు నేర్చుకోవలసిన విషయాలు వినిపించకుండా వారి మానసిక శక్తులను మొద్దుబార్చుతాడు. GCTel 489.1

ప్రార్ధనను వాక్య పఠనాన్ని నిర్లక్ష్యం చేయటానికి సాతాను ఎంతమందిని నడిపించగలడో వారందరూ అతని దాడులకు లొంగిపోతారు. అందుచేత వారి మనసుల్ని ఆకట్టుకోటానికి ఎన్నెన్నో కుతంత్రాలు పన్నుతాడు. భక్తి పరులమని చెప్పుకొనే ప్రజలు కొందరున్నారు. వారు సత్యాన్ని తెలుసుకోటానికి క్రీస్తును వెంబడించే బదులు తమకు కిట్టని వారిలో ఏదో ప్రవర్తన లోపాన్ని లేదా విశ్వాస దోషాన్ని కనుగోటమే తమ మతమున్నట్లు వ్యవహరిస్తారు. అలాంటివారు సాతానుకి కుడిభుజం. సహోదరులను నిందించే వారికి కొదువలేదు. దేవుడు పని చేస్తున్న తరుణంలో, ఆయన సేవకులు ఆయనను కొనియాడుతున్న సమయంలో వారు చురుకుగా పని చేస్తారు. సత్యాన్ని ప్రేమించి అనుసరించే వారి మాటలకు తప్పుడు అర్ధాలు తీస్తారు. సేవా తత్పరులు, స్వార్ధరహితులు ఉత్సాహవంతులు అయిన దైవ సేవకులను వారు మోసగాళ్లుగానో మోసపోయిన వాళ్లగానో ప్రచారం చేస్తారు. ప్రతీ మంచి పనికి దురుద్దేశాలు అట్టగట్టటం, వ్యంగ్యదూషణలు ప్రచారం చేయటం, యువత మనస్సుల్లో అనుమానాలు రేపటం ... ఇదే వారు చేసేపని. పవిత్రమైన, నీతిమంతమైన పనులను అసత్యమైన, మోసపూరితమైన కార్యాలుగా చిత్రించటానికి కృషిచేస్తారు. GCTel 489.2

కాగా వారి విషయంలో ఎవరూ మోసపోవలసిన అవసరం లేదు. వారు ఎవరి పిల్లలో, ఎవరి మాదిరిని వారు అనుసరిస్తున్నారో ఎవరి పని వారు చేస్తున్నారో బాహాటంగా కనిపిస్తున్నదే. “వారి ఫలముల వలన మీరు వారిని తెలిసికొందురు” మత్తయి 7:16. వారి క్రియలు సాతాను క్రియల వంటివి. సాతాను అపవాది, మన సహోదరులమీద నేరము మోపువాడు ” ప్రకటన 12:10. GCTel 489.3

ఆత్మలను తన ఉచ్చులో బిగించటానికిగాను ప్రతీ విధమైన అసత్యం బోధించటానికి సాతానుకి ప్రతినిధులు అనేకులున్నారు. అతను మోసగించేవారి రుచులు అభిరుచులనుబట్టి వారు తప్పుడు సిద్ధాంతాలు రూపొందిస్తారు. దైవకార్య పురోగమనానికి చేయూతనిచ్చే విశ్వాసుల్ని అడ్డుకొనేందుకు సందేహం అపనమ్మకం ప్రోత్సహించి అపనమ్మకస్తుల్ని సంఘంలో ప్రవేశపెట్టటం సాతాను ఎత్తుగడ. దేవుని మీద గాని దైవవాక్యం మీదగాని యధార్ధమైన విశ్వాసం లేనివారెందరో కొన్ని సత్యాలను అంగీకరించి క్రైస్తవులుగా చెలామణి అవుతున్నారు. ఈ రకంగా వారు తమ అబద్ధ బోధలను లేఖన సిద్ధాంతాలుగా సంఘంలో ప్రవేశపెడున్నారు. GCTel 490.1

మనుషులు ఏమి నమ్ముతున్నారన్నది ఏమంత ప్రాముఖ్యం కాదన్నది సాతాను జయప్రదంగా సాగిస్తున్న మోసాల్లో ఒకటి. ప్రజలు సత్యాన్ని ప్రేమించి అంగీకరిస్తే అది వారి ఆత్మను పవిత్రపర్చుతుందని అతనికి తెలుసు. అందుచేత అతను తప్పుడు సిద్ధాంతాలను గాధలను వేరే సువార్తను సత్యం స్థానంలో ప్రవేశపెట్టటానికి సర్వదా ప్రయత్నిస్తాడు. దైవసేవకులు అబద్ధ బోధకులతో ఆది నుంచి పోరాడుతూ వచ్చారు. ప్రజలను దైవ వాక్యం నుంచి మళ్లించే వ్యక్తుల్ని దుర్మార్గులుగా మాత్రమేగాక ఆత్మకు నాశనానికి నడిపే అసత్య ప్రబోధకులుగా పరిగణించి ఏలీయా, యిర్మీయా, పౌలు తీవ్రంగా వ్యతిరేకించారు. మత విశ్వాసం అప్రాముఖ్యమని పరిగణించే స్వాతంత్ర్యాన్ని ఈ సత్యప్రబోధకులు సమర్ధించలేదు. GCTel 490.2

క్రైస్తవ లోకంలో ప్రబలుతున్న లేఖన వ్యాఖ్యానాలు, మత విశ్వాసం సంబంధంగా అనేక పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు మన బద్ద విరోధి అయిన సాతాను పనే. క్రైస్తవలోకంలోని సంఘాల్లో చోటుచేసుకొన్న అనైక్యతకు, విభజనకు కారణం ఒక ప్రియమైన సిద్ధాంతాన్ని సమర్ధించటానికి లేఖనాలను వక్రీకరించే దురాచారమే అనాలి. దైవ చిత్తమేమిటో తెలుసుకోటానికి దీనమనసుతో దైవవాక్యం అధ్యయనం చేసే బదులు ఏదో విచిత్ర సమాచారాన్ని, మూల విషయాన్ని కనుగోటానికి అనేకులు ప్రయత్నిస్తారు. GCTel 490.3

తప్పుడు సిద్ధాంతాలను అక్రైస్తవ ఆచారాలను కొనసాగించేందుకు కొందరు లేఖన భాగాలను సందర్భంతో సంబంధం లేకుండా విడదీసి బహుశా ఒక వచనంలోని సగభాగాన్ని మాత్రమే ఉటంకిస్తూ మిగిలిన వాక్యభాగాన్ని విడిచి పెడ్తారు. మిగిలిన వాక్యభాగం వ్యతిరేక భావమని సూచిస్తుంది. పాము వంటి కపట బుదితో తమ శరీరేచ్ఛలకు అనుగుణంగా పొంతనలేని వాక్య ఖండాలను ఉటంకిస్తారు. అనేకులు ఈ విధంగా దైవ వాక్యాన్ని తెలిసే వక్రీకరిస్తారు. పటుతరమైన ఊహ గల మరి కొందరు పరిశుద్ధ లేఖనాల్లోని గుర్తులు సంకేతాలను తీసుకొని వాటికి తమ ఊహకు అనుగుణంగా అర్థం చెబుతారు. లేఖనమే లేఖనానికి అర్ధం చెబుతుందన్న విషయాన్ని విస్మరించి వారు తమ చాపల్యాలే బైబిలు బోధనలని ప్రబోధిస్తారు. GCTel 490.4

లేఖన పఠనం ప్రార్ధన పూర్వకంగాను, వినయమనసుతోను, నేర్చుకోవాలన్న కోరికతోను సాగకపోతే అతి స్పష్టమైన మిక్కిలి సామాన్యమైన వాక్యభాగాలే కాక మిక్కిలి కష్టమైన వాటి అవగాహన వక్రమారం పడుతుంది. పోపుమత నాయకులు తమ ఉద్దేశాలకు సరిపడే లేఖన భాగాలను ఎంపిక చేసుకొని తమకు అనుకూలమైన విధంగా అర్ధం చెప్పి అప్పుడు ప్రజలకు బోధించేవారు. తమంతటతాము బైబిలు చదివి దానిలోని పరిశుద్ధ సత్యాలను అవగాహన చేసుకోటానికి ప్రజలను అనుమతించేవారు కాదు. బైబిలును యథాతథంగా ప్రజలకు ఇవ్వాలి. బైబిలుకి ఈ విధంగా అపార్థం చెప్పేకన్నా అసలు బైబిలు ఉపదేశం ఇవ్వకుండటం ఎంతో మేలు. GCTel 491.1

తమ సృష్టికర్త చిత్తమేంటో తెలుసుకోవాలని ఆశించే ప్రజలందరి కోసం బైబిలు రూపొందింది. దేవుడు స్థిరమైన ప్రవచన వాక్యాన్ని మానవుల కిచ్చాడు. కొద్ది కాలంలోనే సంభవించనున్న సంగతులను దానియేలుకి యోహానుకి తెలియజేసేందుకు దేవదూతలు వచ్చారు. స్వయాన క్రీస్తే వచ్చాడు. మన రక్షణను గూర్చిన ప్రాముఖ్యమైన విషయాల్ని మర్మాలుగా మిగిలిపోనివ్వలేదు. సత్యాన్ని వెదకే యధార్ధ హృదయుల్ని గలిబిలి పరిచే విధంగానో తప్పుదారి పట్టించే విధంగానో అవి వెల్లడి కాలేదు. ప్రవక్త హబక్కూకు పరిముఖంగా ప్రభువిలా అంటున్నాడు, “చదువు వాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయములను పలక మీద స్పష్టముగా వ్రాయుము.” హబక్కూకు 2:2. భక్తి గల చిత్తంతో పఠించే వారందరికీ దైవ వాక్యం స్పష్టంగా బోధ పడుంది. చిత్తశుద్ధిగల ప్రతి వ్యక్తి సత్యాన్ని కనుగొంటాడు. “నీతిమంతుల కొరకు వెలుగు... విత్తబడి యున్నది. ” కీర్తనలు 97:11. గుప్త ధననిధి కోసం వెదకినట్లు సంఘ సభ్యులు సత్యం కోసం వెదకితే తప్ప ఏ సంఘమూ పరిశుద్ధతలో ప్రగతి సాధించలేదు. GCTel 491.2

“దాతృత్వ ” నినాదంతో తన కుయుక్తులతో ప్రజల్ని అంధుల్ని చేసి తన లక్ష్యాన్ని సాధించటానికి సాతాను ఎల్లప్పుడు కృషిచేస్తున్నాడు. బైబిలుకి ప్రత్యామ్నాయంగా మానవ ఊహాగానాలను నిలపటంలో అతను విజయం సాధించినప్పుడు దైవ ధర్మశాస్త్రాన్ని తోసిపుచ్చటం జరుగుతుంది. స్వతంత్రులమని చెప్పుకొంటున్నప్పటికీ సంఘాలు పాప దాస్యం కిందే కొనసాగుతున్నాయి. GCTel 491.3

శాస్త్ర పరిశోధన అనేకులకు శాపంగా మారింది. శాస్త్రపరమైన , కళాపరమైన ఆవిష్కరణల విషయంలో వరదవలె సమాచార విస్తరణను ఏర్పాటు చేశాడు దేవుడు. కాగా శాస్త్రానికి దైవ చిత్త ప్రకటనకు మధ్యగల సంబంధాన్ని పరిశోధించి గ్రహించటంలో దైవవాక్య మార్గ నిర్వేశం లేకుండా ఉద్దండ మేధావులకు కూడా సాధ్యంకాదు. GCTel 492.1

ప్రాపంచిక విషయాల్లోనేంటి అధ్యాత్మిక విషయాల్లోనేంటి మానవుడి జ్ఞానం పాక్షికం, అసంపూర్ణం. అందునుబట్టి అనేకులు శాస్త్రానికి లేఖనాలకి మధ్య గల బాంధవ్యాన్ని గ్రహించలేక పోతున్నారు. అనేకమంది సిద్ధాంతాలను, ఊహాగానాలను శాస్త్రపరమైన సత్యాలుగా అంగీకరిస్తారు. దైవ వాక్కుల్ని “జ్ఞానమని తప్పుగా చెప్పబడిన” విషయాలను బట్టి పరీక్షించాలని భావిస్తారు. 1 తిమోథి 6:20. సృష్టికర్త కార్యాలు వారి అవగాహనకు అతీతంగా ఉంటాయి. ఈ ప్రకృతి నియమాలను వారు విశదీకరించలేరుగనుక బైబిలు చరిత్ర విశ్వసనీయతను శంకిస్తారు. పాతకొత్త నిబంధనల విశ్వసనీయతను ప్రశ్నించే వారు మరో అడుగు ముందుకు వేసి దేవుని ఉనికిని సందేహించి ప్రకృతికి నిరవధిక శక్తిని ఆపాదిస్తారు. GCTel 492.2

ఈ విధంగా అనేకులు విశ్వాసం విషయంలో తప్పటడుగు వేసి సాతాను మోసాలకు లోనవుతారు. మనుషులు తమ సృష్టికర్తకన్నా జ్ఞానవంతులు కావటానికి ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్తులో ఎన్ని యుగాలకైన వీడని మర్మాలను పరిశోధించి వివరించటానికి మానవ తత్వశాస్త్రం ప్రయత్నిస్తున్నది. తనను గురించి, తన ఉద్దేశాలగురించి దేవుడు ఏమి చెప్పాడో అన్నది మనుషులు పరిశోధించి, అవగాహన చేసుకొంటే, వారికి యెహోవా మహిమౌన్నత్యాల్ని శక్తిని గ్రహించే దృష్టి లభిస్తుంది. అప్పుడు వారు తమ అప్రాధాన్యతను గుర్తించి, తమ నిమిత్తం తమ బిడ్డల నిమిత్తం దేవుడు ఏమైతే వెల్లడి చేశాడో దానితోనే తృప్తి చెందుతారు. GCTel 492.3

దేవుడు ఏది బయలుపర్చలేదో, ఏది మనం అవగాహన చేసుకోవాలని ఉద్దేశించలేదో దాన్ని మనుషులు వెదకి పట్టుకొని దానిపై ఊహాగానాలు చేసేందుకు వారిని మోసగించటమన్నది సాతాను పెద్ద ఎత్తుగడ. ఇలా చేసే లూసీఫర్ పరలోకంలోతన స్థానాన్ని పోగొట్టుకొన్నాడు. దేవుడు తన ఆంతర్యాలన్నింటిని తనకు తెలియజేయలేదన్న గుర్రుతో తనకు నియమితమైన ఉన్నత హోదాకు సంబంధించిన బాధ్యతల్ని సుతరామూ లెక్కచేయలేదు. తన అదుపులో చెప్పుచేతల్లో ఉన్న దూతలలో అదే అసంతృప్తిని పుట్టించి వారి పతనానికి కారకుడయ్యాడు. ఇప్పుడు అదే స్వభావాన్ని మనుషుల మనసుల్లో పెంపొందించి దేవుని ఆజ్ఞల్ని మీరేటట్లు వారిని అపమార్గం పట్టిస్తున్నాడు. GCTel 492.4

బైబిలు బోధించే సరళమైన సత్యాలను, విమర్శించే సత్యాలను అంగీకరించని వారు తమ అంతరాత్మలను శాంతపర్చే కట్టుకథల కోసం నిత్యం అన్వేషిస్తారు. ఆధ్యాత్మికం గాను, త్యాగశీలత, వినయమనసు విషయాల్లోను సిద్ధాంతాలు ఎంత నామ మాత్రంగా ఉంటే ప్రజలు అంత ఆప్యాయంగా వాటిని అంగీకరింటం జరుగుతుంది. ఈ వ్యక్తులు తమ శరీరేచ్ఛల్ని తీర్చుకోటానికి మానసిక శక్తులను దుర్వినియోగం చేస్తారు. దైవ మార్గ దర్శకత్వం కోసం విరిగినలిగిన హృదయంతోను ప్రార్ధనతోను లేఖన పరిశోధన జరపటానికి తమ అహం అడ్డుతగులుతున్నందు వల్ల మోసం నుంచి వారికి కాపుదల కొరపడుతున్నది. వారి హృదయ వాంఛలు తీర్చటానికి సాతాను ఉరకలు వేస్తుంటాడు. సత్యం స్థానే తన మోసాలను వారికి అందజేస్తాడు. మానవ మనసులపై పోపుల మతం ఈ విధంగానే అదుపు సాధించింది. అది శ్రమతో కూడిన పని కాబట్టి ప్రొటస్టాంటులు అదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. సదుపాయాన్ని, విధానాన్ని దృష్టిలో ఉంచుకొని దైవ వాక్య పఠనాన్ని అలక్ష్యం చేసేవారంతా లోకంతో భేదించకుండా ఉండేందుకు సత్యానికి బదులు నాశనకరమైన దుర్బోధను అంగీకరిస్తారు. ఒక మోసాన్ని భీతితో పరికించే వ్యక్తి ఇంకొక మోసాన్ని సులువుగా అంగీకరిస్తాడు. “దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న ” వారిని గురించి ప్రస్తావిస్తూ అపోస్తలుడైన పౌలు ఇలా అంటున్నాడు. “ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు.” 2 థెస్స 2:1012. మన ముందు ఇలాంటి హెచ్చరిక ఉండగా సిద్ధాంతాల పరంగా మనం జాగ్రత్తగా ఉండటం మంచిది. GCTel 493.1

ఈ గొప్ప వంచకుడి మోసాల్లో మిక్కిలి విజయవంతమైనవి భూతమత బోధనలు, భూత మత అబద్ద అద్భుతాలు. వెలుగుదూత వేషం ధరించి, అనుమానించని తావుల్లో తన ఉచ్చులను అతను అమర్చుతాడు. అవగాహన కోసం ప్రార్థనచేసి, మనుషులు దైవ వాక్యాన్ని పఠిస్తే, వారు చీకటిలో ఉండాల్సిన అవసరంగాని, తప్పుడు సిద్ధాంతాలను అంగీకరించాల్సిన అవసరంగాని వుండదు. సత్యాన్ని నిరాకరిస్తే వారు మోసాలకు ఆహుతి అయిపోతారు. GCTel 493.2

క్రీస్తు దేవుడు కాడని ఈ లోకంలోకి రాకపూర్వం ఆయన ఉనికిలోనే లేడని బోధించేది ఇంకొక ప్రమాదకరమైన సిద్ధాంతం. బైబిలును విశ్వసిస్తున్నట్లు చెప్పుకొనే వారిలో అనేకులు ఈ సిద్ధాంతాన్ని ఆమోదిస్తున్నారు. అయినా తండ్రితో క్రీస్తు సంబంధాన్ని గురించి, ఆయన ప్రవర్తనను గురించిన ఆయన పూర్వ ఉనికిని గురించిన సత్యాలను అది వ్యతిరేకిస్తున్నది. లేఖనాల్ని వక్రీకరిస్తున్నది గనుక అది అంగీకార యోగ్యం కాదు. అది విమోచన కార్యాన్ని గూర్చి మానవులకు తక్కువ అభిప్రాయాన్ని కలిగించటమేగాక బైబిలు దేవుని మూలంగా కలిగిన వాక్యమన్న విశ్వాసాన్ని బలహీన పర్చుతుంది. దీన్ని అపాయకరమైన సిద్ధాంతంగా మార్చి ఆచరణ పరంగా నిరుపయోగం చేస్తున్నది. ఎవరైనా క్రీస్తు దేవత్వాన్ని తోసిపుచ్చితే వారితో ఆ విషయాన్ని వాదించటం నిరర్ధకం. ఎంత బలమైన వాదనైనా వారిని మార్చటం కష్టం. “ప్రకృతి సంభంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెళ్లి తనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు” 1 కొరింథి 2:14. ఈ పోరపాటులో ఉన్నవారికి క్రీస్తు ప్రవర్తన గురించి ఆయన పరిచర్యను గురించి మానవ రక్షణార్ధం దేవుని రక్షణ ప్రణాళికను గురించి నిజమైన అభిప్రాయం ఉండటం సాధ్యం కాదు. GCTel 494.1

ప్రమాదభరితమైన మరోపొరపాటు వ్యక్తిగత జీవిగా సాతాను ఉనికిలో లేడని, మానవుడి దురాలోచనలకు, కోరికలకు ప్రతీకగా లేఖనం ఆ పేరును ఉపయోగించటం జరిగిందని నమ్మటం. క్రీస్తు రెండో రాకడ అంటే ప్రతీ వ్యక్తి మరణించేటప్పుడు ఆయన రావటమని ప్రసంగ వేదికల నుంచి బోధిస్తున్నారు. క్రీస్తు వ్యక్తిగతంగా మేఘాలలో రావటమన్న అంశం మానవుల మనస్సులను మళ్లించటానికి సాతాను పన్నిన పన్నాగం. ఎన్నో సంవత్సరాలుగా సాతాను ఇలా ప్రచారం చేస్తున్నాడు, “ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు” (మత్తయి 24:23-26). ఈ మోసాన్ని నమ్మి అనేక ఆత్మలు నశించిపోయాయి. GCTel 494.2

ఇంకా, ప్రార్థన ప్రాముఖ్యం కాదని లోక జ్ఞానం ప్రభోధిస్తున్నది. ప్రార్థనకు నిజమైన జవాబు ఉండదని శాస్త్రజ్ఞులు వాదిస్తున్నారు. ఇది శాస్త్ర నియమానికి విరుద్ధమని, ఆద్భుత కార్యాలు అన్నవి లేవని వారి వాదన. విశ్వం నిర్దిష్టమైన నిబంధనల ప్రకారం నడుస్తుందని, వాటికి విరుద్ధంగా దేవుడు కూడా ఏమీచేయడని వారంటున్నారు. దైవ నిబంధనలు దేవునికే స్వేచ్ఛలేకుండా చేస్తాయన్నట్లు దేవుడు తన చట్టాలకు బందీ అయినట్లు వారు ఆయనను చిత్రిస్తున్నారు. కాని ఆ బోధ లేఖన సాక్ష్యానికి విరుద్ధంగా ఉన్నది. క్రీస్తు ప్రభువు, ఆయన శిష్యులు అద్భుతాలు చేయలేదా? ఆ రక్షకుడే నేడూ ఉన్నాడు. మనుష్యుల మధ్య శారీరకంగా నడచిన ఆ ప్రభువే నేడూ నివసిస్తున్నాడు. విశ్వాస సహిత ప్రార్ధనను వినటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. స్వాభావికశక్తి మానవాతీత శక్తితో సహకరిస్తుంది. మనం అడుగనిదే ఇవ్వని దానిని విశ్వాస సహిత ప్రార్థనకు సమాధానంగా మనకనుగ్రహించటం దేవుని సంకల్పంలో భాగం. GCTel 494.3

క్రైస్తవ లోకంలో లెక్కకు మించిన సంఖ్యలో తప్పుడు సిద్ధాంతాలు విచిత్రమైన అభిప్రాయాలు చోటుచేసుకొంటున్నాయి. దైవ వాక్యం నిర్దేశించిన ఆనవాళ్లలో ఒకదానిని తొలగించటం మూలాన కలిగే దుష్ఫలితాలను అంచనావేయటం అసాధ్యం. ఇది చేయటానికి సాహసించిన బహుకొద్దిమంది ఒక సత్యాన్ని విసర్జించటంతో ఆగిపోరు. అధిక సంఖ్యాకులు ఒక దాని తర్వాత ఒకటిగా సత్యాలను విసర్జించి చివరకు నాస్తికులవుతారు. GCTel 495.1

లేఖనాలను విశ్వసించి ఉండే అనేకమందిని ప్రజారంజక వేదాంతంలోని పొరపాట్లు నాస్తికులుగా మార్చుతున్నాయి. న్యాయం, కారుణ్యం, ధార్మికత - వీటిపై ఒక వ్యక్తికున్న అభిప్రాయాలకు భిన్నంగా ఉండే సిద్ధాంతాలను ఆ వ్యక్తి అంగీకరించటం అసాధ్యం. ఇవి బైబిలు ప్రబోధాలుగా ప్రచారమవుతున్నందున అతను బైబిలును దైవ వాక్యంగా అంగీకరించటానికి నిరాకరిస్తాడు. GCTel 495.2

సాతాను సాధించదలచుకొన్న లక్ష్యం ఇదే. దేవునిపైన దేవుని వాక్యంపైన నమ్మకాన్ని నాశనం చేయటం కన్నా ఎక్కువ ఆనందాన్నిచ్చే అంశం అతనికి మరొకటి లేదు. సందేహించే ప్రజలకు సాతాను అధినాయకుడు. ప్రజలను మభ్యపెట్టి తన పక్కకు ఆకర్షించటానికి తన శక్తి మేరకు కృషి చేస్తాడు. సందేహించటం ఫ్యాషను అయ్యింది. దేవుని వాక్యాన్ని అపనమ్మకంతో పరిగణించే ప్రజల సంఖ్య పెద్దదే. దానికి వారి కారణం సాతానుకున్న కారణమే. అది పాపాన్ని విమర్శిస్తుంది. ఖండిస్తుంది. దైవ వాక్యనియమాన్ని ఆచరించటం ఇష్టంలేని వారు దాని అధికారాన్ని తోసిపుచ్చుతారు. లేఖనాలను తప్పుపట్టటానికి లేదా ప్రసంగాన్ని తప్పుపట్టటానికో వారు బైబిలు చదువుతారు లేదా ప్రసంగం వింటారు. తమ్మును తాము సమర్థించుకోటం ద్వారా లేదా బాధ్యతల్ని నిర్లక్ష్యం చేయటాన్ని సమర్ధించటం ద్వారా నాస్తికులవుతున్న వారి సంఖ్యం చిన్నది కాదు. ఇతరులు అహంభావం వల్లో సోమరితనం వల్లో నాస్తిక సూత్రాలను ఆచరిస్తారు. సుఖలాలసత్వం వల్ల జీవితంలో పేరు ప్రతిష్ఠలు సంపాదించే పని ఏదీ చేయలేక - దానికి పరిశ్రమ ఆత్మనిరసన అవసరం- బైబిలును విమర్శించటం ద్వారా గొప్ప ప్రతిభావంతులమన్న ఖ్యాతి సంపాదించటానికి ప్రయత్నిస్తారు. దైవ జ్ఞానంతో వికాసం పొందని మనుషులకు అవగాహన శక్తి ఉండదు. అందుచేత వారు విమర్శలకు దిగుతారు. అవిశ్వాసం, నాస్తికత, అపనమ్మకం పక్కన ఉండటం గొప్ప అని భావించేవారు చాలామంది. చిత్తశుద్ధి మెరుగులతో కన్పించే దాని కింద ఆత్మ విశ్వాసం, గర్వం దాగి ఆ వ్యక్తులను నడిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇతరుల మనసుల్ని గలిబిలి పర్చటానికి లేఖనంలో ఏదో కనుగోటానికి అనేకులు ముచ్చటపడ్డారు. కొందరైతే కేవలం వాదనకోసమే మొదట తప్పును సమర్థిస్తూ వాదిస్తారు. అలా చేయటం ద్వారా తాము అపవాది ఉచ్చులో చిక్కుకు పోతున్నామని గ్రహించరు. తమకు నమ్మకం లేదని బాహాటంగా వ్యక్తీకరించిన మీదట అదే స్థితిని కొనసాగించాలన్న భావన వారికి కలుగుతుంది. ఈ రీతిగా వారు భక్తిహీనులతో ఏకమై పరలోక ద్వారాలను మూసివేసుకొంటారు. GCTel 495.3

తన వాక్యం తన మూలంగానే కలిగిందనటానికి దేవుడు తన వాక్యంలో చాలినంత నిదర్శనాన్నిచ్చాడు. మన రక్షణకు సంబంధించిన గొప్ప సత్యాలు అందులో స్పష్టంగా ఉన్నాయి. యధార్థ హృదయంతో వెదకే ప్రతీవారికి లభ్యమయ్యే పరిశుద్ధాత్మ సహాయంతో ప్రతీవ్యక్తి ఈ సత్యాలను అవగాహన చేసుకోవచ్చు. మనుషుల విశ్వాసానికి ఆధారంగా దేవుడు బలమైన పునాది ఏర్పాటు చేశాడు. GCTel 496.1

అయినా పరిమితులు గల మానవ మనసులు అనంత జ్ఞాని అయిన దేవుని ప్రణాళికలను ఉద్దేశాలను పూర్తిగా అవగాహన చేసుకోలేవు. అన్వేషణ ద్వారా మనం ఎన్నడూ దేవుని కనుగోలేం. దేవుని మహిమను మరుగుపర్చే తెరను మనం దురహంకారంతో తొలగించటానికి ప్రయత్నించ కూడదు. అపోస్తలుడు తన విస్మయాన్ని ఈ మాటల్లో వ్యక్తం చేస్తున్నాడు, “ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు” రోమా 11:33. ఆయన అనంత ప్రేమను, అపారశక్తితో కూడిన ఆయన కృపను మనం గ్రహించటానికి అవసరమైనంత మేరకు, మనతో ఆయన వ్యవహరించే విధానాన్ని, ఆయన కార్యాలెనుక హేతువును ఉద్దేశాలను మనం అవగతం చేసుకో గలుగుతాం. పరలోకమందున్న మన తండ్రి విజ్ఞతతోను నీతితోను సమస్తాన్ని అనుశాసిస్తాడు. మనం అసంతృప్తి చెందకూడదు, శశించ కూడదు. కాని భక్తి పూర్వకంగా మనల్ని మనం ఆయనకు సమర్పించుకోవాలి. ఆయన ఉద్దేశాలను ఎంత మేరకు తెలుసుకోటం మనకు మంచిదో అంత మేరకు ఆయన వెల్లడి చేస్తాడు. అంతకు మించి మనం సర్వశక్తిగల ప్రభువు హస్తాన్ని, ప్రేమతో నిండిన ఆయన హృదయాన్ని నమ్మాలి. GCTel 496.2

విశ్వసించటానికి కావలసినంత నిదర్శనాన్ని దేవుడు ఇవ్వగా అవిశ్వాసానికి సాకును ఆయన ఎన్నడూ పూర్తిగా తీసివేయడు. తమ సందేహాలను తగిలించుకోటానికి గోడకు కొట్టిన మేకుల కోసం వెదకే వారికి అవి దొరుకుతాయి. ప్రతీ సందేహం తొలగిపోయే వరకు-సందేహం తొలగిపోయే అవకాశం లేదు-దైవ వాక్యాన్ని అంగీకరించటానికి ఆచరించటానికి సమ్మతించని వారు సత్యాన్ని ఎన్నడూ తెలుసుకోలేరు. GCTel 497.1

దేవుడంటే నమ్మకం లేకపోవటం మార్పు పొందని హృదయంలో స్వాభావికంగా చోటు చేసుకొనే పరిణామం. మార్పు పొందని హృదయం ఆయనను వ్యతిరేకిస్తూనే ఉంటుంది. అయితే విశ్వాసం పరిశుద్ధాత్మ ప్రేరణ వలన కలుగుతుంది. మననం చేసుకోటం వల్లనే విశ్వాసం పెరుగుతుంది. దృఢ సంకల్పంతో కృషి చేయకపోతే బలమైన విశ్వాసం ఎవరికీ సాధ్యం కాదు. ప్రోత్సాహం లభించే కొద్దీ అవిశ్వాసం పెరుగుతుంది. దేవుడిచ్చిన నిదర్శనాల ఆధారంగా మనుషులు తమ విశ్వాసాన్ని పటిష్ఠపర్చుకొనే బదులు ప్రశ్నించటానికి విమర్శించటానికి దిగితే వారి సందేహాలు ఇంతలంతలై ధృవపడటం తథ్యం . GCTel 497.2

దేవుని వాగ్దానాలను, ఆయన కృపను గూర్చిన హామీని శంకించే వారు ఆయనను అగౌరపర్చుతున్నారు. వారి ప్రభావం ఇతరులను క్రీస్తు వద్దకు ఆకర్షించే బదులు ఆయన సుంచి దూరం చేస్తుంది. విశాలంగా విస్తరిల్లుతున్న పొడవాటి కొమ్మలు కలిగి, కింద మొక్కలకు సూర్యరశ్మి పడకుండా అడ్డుకొంటూ చల్లని తన నీడతో వాటిని కృషింపజేసి చంపుతూ బతికే ఫలించని వృక్షాలు వారు. ఈ వ్యక్తుల జీవితాలు పని వారికి వ్యతిరేకంగా నిరంతరం సాక్ష్యం చెబుతాయి. వారు విత్తుతున్న విత్తనాలు, సందేహం, నాస్తిక భావాలు. వాటి పంట విస్తారంగా ఉంటుంది. GCTel 497.3

సందేహల నుంచి విముక్తి పొందాలని ఆకాంక్షించే వారు అనుసరించాల్సిన మార్గం ఒక్కటే. తమకు అంతుచిక్కని అంశాన్ని గూర్చి ప్రశ్నించి విమర్శించేకన్నా అప్పటికే తమకున్న సత్యాన్ని ఆచరణలో పెట్టితే వారు అదనపు సత్యాన్ని పొందుతారు. తమకు సుస్పష్టంగా అవగాహన ఉన్న ప్రతీ విధినీ నిర్వహించినట్లయితే, ప్రస్తుతం తమకు సందేహంగా ఉన్న విధులు గ్రహించి వాటిని నిర్వహించటానికి సామర్యం పొందుతారు. GCTel 497.4

అచ్చు సత్యంలాగే కనిపించే నకిలీ సత్యాన్ని సాతాను రూపొందించగలడు. మోసపోటానికి ఇష్టంగా ఉన్న వారిని, సత్యం కోరే ఆత్మనిరసనను, త్యాగశీలతను పాటించని వారిని అతను ఇట్టే మోసగిస్తాడు. కాని సత్యాన్ని ఆశించే నిజాయితీగల ఆత్మను, తన శక్తి అంతటినీ వినియోగించినా అతను నిలువరించలేడు. క్రీస్తు సత్యం “నిజమైన వెలుగు అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది.” యోహాను 1:9. మనుషులను సత్యంలోకి నడిపించేందుకోసం సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చాడు. దైవ కుమారుని మాట విషయంలో ఇలా ప్రకటించటం జరిగింది. “వెదకుడి మీకు దొరకును” (ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన యెడల ఆబోధ దేవుని వలన కలిగినదో నేనే బోధించు చున్నానో వాడు తెలిసికొనును” మత్తయి 7:7.యోహాను 7:7. GCTel 497.5

తమకు వ్యతిరేకంగా సాతాను అతని అనుచర గణం పన్నుతున్న కుట్రలు క్రీస్తు అనుచరులకు తెలియవు. కాని పరలోకంలో ఉన్న ప్రభువు ఆ కుతంత్రాలన్నిటినీ భగ్నం చేస్తాడు. తన ప్రజలు భయంకర శోధనలను ఎదుర్కోటానికి ప్రభువు సమ్మతిస్తాడు. వారికి కలిగే దుఃఖం, శ్రమలు, ఆయనకు ఆనందం కలిగిస్తాయని కాదు దాని అర్ధం. వారి అంతిమ విజయానికి ఈ ప్రక్రియ అవసరం. ఆయన తన మహిమతో వారిని శోధన నుంచి కాపాడలేడు. ఎందుకంటే పాప లోకంలోని ఆకర్షణలను ప్రతిఘటించటానికి వారిని సిద్ధం చేయటమే ఈ పరీక్ష లక్ష్యం. దేవుని ప్రజలు తమ్మును తాము తగించుకొని, విరిగి నలిగిన హృదయాలతో తమ పాపాలు ఒప్పుకొని, వాటిని విసర్జించి, విశ్వాసంతో దేవుని వాగ్దానాలను నమ్మితే, దుష్టులుగాని దురాత్మలుగాని దేవునిపనిని అడ్డుకోటంగాని ఆయన సన్నిధిని తన ప్రజల మధ్య నుంచి తొలగించటం గాని చేయలేరు. ప్రతీ శోధనను, ప్రతి ప్రతికూల ప్రభావాన్ని జయప్రదంగా ప్రతిఘటించవచ్చు. “శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను” జెకర్యా 4:6. GCTel 498.1

“ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి... మీరు మంచి విషయములో ఆసక్తి గలవారై తే మీకు హాని చేయగలవాడెవడు.?” 1 పేతురు 3:12, 13. విలువైన పారితోషికాలకు ప్రలోభపడి ఇశ్రాయేలును శపించటానికి ప్రభువుకు బలులు అర్పించి తద్వారా వారి మీదికి శాపం రప్పించటానికి ప్రయత్నిస్తున్న తరుణంలో బిలాము ఇలా ఒప్పుకోక తప్పలేదు, “ఏముని శపించగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్ట లేదే.” ” నీతిమంతుల మరణమువంటి మరణము నాకు లభించునుగాక. నా అంత్యదశ వారి అంతము వంటిదగును గాక. ” మరల బలి అర్పించిన పిదప భ్రష్టుడైన ప్రవక్త ఇలా పలికాడు. “ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను, ఆయన ఓడించెను, నేను దాని మార్చలేను, ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై యున్నాడు. రాజు యొక్క జయ ధ్వని వారిలో నున్నది. ” “నిజముగా యాకోబులో మంత్రము లేదు. ఇశ్రాయేలీయులలో శకునములేదు. ఆయాకాలము లందు దేవుని కార్యములు యాకోబు వంశస్తులగు ఇశ్రాయేలీయులకు తెలియజెప్పబడును” అయినప్పటికీ బలిపీఠాలు మూడోసారి నిర్మితమయ్యాయి. శపించటానికి బిలాము మళ్లీ ప్రయత్నించాడు. కాని అయిష్టంగా ఉన్న ప్రవక్త నోటి నుంచి దేవుని ఆత్మ దైవ ప్రజల అభ్యుదయాన్ని ప్రకటించి వారి శత్రువుల బుద్దిహీనతను దుర్భుద్ధిని ఖండించాడు. “నిన్ను దీవించువాడు దీవింపబడును గాక” నిన్ను శపించువాడు శపించబడును. సంఖ్యా. 23:8,10,20,21,23; 23:9. GCTel 498.2

ఈ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విధేయులై నివసించారు. వారు దేవుని ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తూ జీవించినంత కాలం భూమిపై ఏశక్తి వారిని ప్రభావితం చేయలేకపోయింది. బిలాము దైవ ప్రజల మీదికి ఏ శాపాన్ని ఉచ్చరించలేక పోయాడో వారిని పాపంలోకి నడిపించటం ద్వారా ఆ శాపాన్ని చివరికి వారి మీదకు తేవటంలో జయం సాధించాడు. వారు దేవుని ఆజ్ఞలు అతిక్రమించినప్పుడు ఆయనకు దూరమయ్యారు. నాశనానికి నడిపే సాతాను శక్తి కింద వారు మిగిలిపోయారు. GCTel 499.1

క్రీస్తులో నివసించే మిక్కిలి బలహీన వ్యక్తితో తన అనుచర సమూహాలు సాటికావని, తన్నుతాను బయలు పర్చుకొంటే తనకు తీవ్ర ప్రతిఘటన ఉంటుందని సాతానుకి బాగా తెలుసు. అందువలన అతను తన బలగాలతో పొంచి ఉండి తన తావుకు వచ్చేవారిని నాశనం చేయటానికి సన్నద్ధంగా ఉండి సిలువ యోధులను తమ స్థానాల నుంచి బయటికి ఆకర్షించటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. వినయ మనసు గలవారమై దేవుని మీద ఆధారపడి ఆయస ఆజ్ఞల ననుసరించి జీవించటమే మనకు క్షేమం. GCTel 499.2

ప్రార్ధనలేకుండా ఏ మానవుడూ ఒక దినం, ఒక గడియ క్షేమంగా మనలేడు. ఆయన వాక్యాన్ని ఆవగాహన చేసుకోటానికి జ్ఞానాన్ని అనుగ్రహించుమని మనం ప్రత్యేకించి ప్రార్ధించాలి. సాతాను జిత్తులు వాటిని చిత్తుచేసే మార్గాలు మనకు వెల్లడయ్యాయి. లేఖనాలను ఉటంకించటంలో సాతాను ఉద్దండుడు. కాని వాటికి తన సొంత భాష్యం చెప్పి మనల్ని పడగొట్టటం అతని ధ్యేయం. మనం దీన మనసుతో బైబిలుని పఠించాలి. దేవుని మీద ఆధారపడటం మరవ కూడదు. సాతాను దుస్తంత్రాల విషయంలో నిత్యం అప్రమత్తంగా ఉంటూ విశ్వాసంలో ఎడతెగక శోధనలో పడకుండా మమ్మల్ని తప్పించు” మంటూ దేవున్ని వేడుకోవాలి. GCTel 499.3