Go to full page →

5—ఆత్మవరం AATel 35

ఆత్మను పంవుతానని శిష్యులకు క్రీస్తు వాగ్దానం చేసినప్పుడు లోకంలో ఆయన పరిచర్య దాదాపు అంతమౌతున్నది. ఆయన సిలువ నీడలో నిలిచి ఉన్నాడు. పాప భారం మోసేవాడిగా తనపై పడనున్న అపరాధాలభారం ఎంత గొప్పదో ఆయన పూర్తిగా గ్రహించాడు. తన్నుతాను బలిపశువుగా అర్పించుకోకముందు తాను ఇవ్వనున్న అగత్యమైన పరిపూర్ణమైన వరాన్ని గూర్చి శిష్యులకు ఉవదేశించాడు. అది అంతులేని తన కృప వనరుల్ని వారి అందుబాటులో ఉంచనున్న వరం. ఆయన ఇలా అన్నాడు: ” నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మికను గ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడ నివసించును, మిలో ఉండును.” యోహాను 14 : 16, 17, తన ప్రతినిధిగా వచ్చి అద్భుతమైన పరిచర్యచేయనున్న పరిశుద్ధాత్మను గూర్చి రక్షకుడు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. యుగాలుగా పోగుపడూ వస్తున్న చెడుగును పరిశుద్ధాత్మ శక్తితో ప్రతిఘటించాల్సి ఉంది. AATel 35.1

పెంతెకొస్తుదినాన పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఫలితంగా ఏంజరిగింది? రక్షకుని పునరుత్థాన శుభవార్త ప్రపంచంలో ప్రజలున్న ప్రాంతాలన్నిటికి వెళ్లింది. శిష్యులు రక్షణ కృపావర్తమానాన్ని ప్రకటించినప్పుడు ఎంతోమంది ఆవర్తమానాన్ని అంగీకరించారు. అన్ని దిశల నుంచి ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి సంఘంలో చేరారు. ఆసక్తి కోల్పోయిన సభ్యులు తిరిగి మారుమనసు పొందారు. పాపులు విశ్వాసులతో కలిసి అమూల్యమైన ముత్యాన్ని వెదకడంలో నిమగ్నులయ్యారు. సువార్తకు బద్ద విరోధులైన కొందరు సువార్త వీరులయ్యారు. ” అ కాలమున వారిలో శక్తి హీనులు దావీదువంటివారుగాను దావీదు సంతతివారు.... యెహోవా దూతల వంటివారుగాను ఉందురు “(జెకర్యా 12 : 8) అన్న ప్రవచనం నెరవేరింది. ప్రతీ క్రైస్తవుడు తన తోటి క్రైస్తవుడిలో ప్రేమానురాగాలు దయాదరాలు ప్రతిబింబించడం చూశాడు. వారిది ఒకే ఆసక్తి. ప్రభువు ఆదర్శం ఒక్కటే అన్నిటికన్నా ఆసక్తికరమైన అంశం. క్రీస్తు మాదిరిగా నడుచుకోడం ఆయన రాజ్యవ్యాప్తికి కృషి చేయడం ఇదే విశ్వాసులు ఆశించింది. AATel 35.2

“అపొస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను.” అ. కా. 4 : 33. వారి సేవల ఫలితంగా ఎంపికైన మనుషులు సంఘంలో చేరారు. సత్యవాక్యాన్ని అందుకొన్నవారు తమ ఆత్మల్ని సమాధానంతో ఆనందంతో నింపిన నిరీక్షణను ఇతరులకు చేరవేయడానికి తమ జీవితాల్ని అంకితం చేసుకొన్నారు. నిర్బంధాలకు బెదిరింపులకు వారు భయపడలేదు. ప్రభువు వారి ద్వారా మాట్లాడాడు. వారు ఒక స్థలం నుంచి మరో స్థలానికి వెళ్లినప్పుడు బీదలకు సువార్త ప్రకటించారు. దైవ కృపద్వారా సూచక క్రియలు చేశారు. AATel 36.1

మనుషులు పరిశుద్ధాత్మ నియంత్రణకు తమ్మునుతాము సమర్పించు కొన్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా పనిచేస్తాడు. AATel 36.2

పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం ఒక వయసుకు గాని జాతికి గాని పరిమితం కాదు. ఆత్మతాలూకు దివ్య ప్రభావం ఆయన శిష్యులతో అంతం వరకు ఉంటుందని క్రీస్తు వ్యక్తం చేశాడు. పెంతెకొస్తు నాటి నుంచి నేటివరకూ తమ్ముముతాము సంపూర్తిగా ప్రభువుకు ఆయన పరిచర్యకు అంకితం చేసుకొన్నవారందరికి ఆదరణకర్తను పంపడం జరిగింది. క్రీస్తును రక్షకుడుగా స్వీకరించే వారందరికీ పరిశుద్దాత్మ సలహాదారుగా, శుద్ధీకరణకర్తగా, మార్గదర్శకుడుగా సాక్షిగా వ్యవహరిస్తాడు. హింస, శ్రమలు కొనసాగిన దీర్ఘ శతాబ్దాల్లో తరచుగా పరిశుద్దాత్మ సముఖాన్ని పొందిన విశ్వాసులు లోకంలో గుర్తులు మహత్కార్యాలుగా నిలిచారు. దేవదూతల ముందు మనుషుల ముందు రక్షణ ప్రదమైన ప్రేమలోని పరివర్తన శక్తిని వారు కనపర్చారు. AATel 36.3

పెంతెకొస్తు దినాన ఆత్మ శక్తి పొందిన వారికి తద్వారా శోధనలు శ్రమల నుంచి విముక్తి కలగలేదు. సత్యం గురించి నీతి గురించి సాక్ష్యమిచ్చినప్పుడు సత్యనిరోధి వారిని పదే పదే హింసకు గురిచేశాడు. వారి క్రైస్తవ విశ్వాసాన్ని అనుభవాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించాడు. దేవుడిచ్చిన సర్వశక్తుల్ని వినియోగించి క్రీస్తులోని స్త్రీపురుషుల పరిపూర్ల స్థాయికి చేరేంతవరకు వారు పరిశ్రమించాల్సి ఉన్నారు. పరిపూర్ణత్వం దిశగా ఉన్నత లక్ష్యాలు చేరేందుకుగాను కృపకోసం వారు అనుదినం ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్మ నడుపుదల కింద దేవునిపై క్రియాశీలక విశ్వాసం ద్వారా మిక్కిలి బలహీనులు సైతం తమకు దేవుడిచ్చిన సామర్ధ్యాన్ని వృద్ధి పర్చుకొని పరిశుద్ధత సంస్కారం ఔన్నత్యం సాధించగలిగారు. రూపుదిద్దే పరిశుద్ధాత్మ ప్రభావానికి వారు తమ్మును తాము వినయంగా సమర్పించుకొన్నారు. త్రిత్వంనుంచి సంపూర్ణత్వాన్ని పొందారు. దైవ స్వరూపంలోకి మార్పుచెందారు. తన ప్రతినిధిగా పరిశుద్ధాత్మను పంపుతానన్న క్రీస్తు వాగ్దానంలో కాలగమనం వల్ల ఎంలాటి మార్పూ కలగలేదు. దేవుని కృపా సంపద లోకంలోని మనుషుల దిశగా ప్రవహించక పోవడానికి దేవుడు విధించిన నిర్భందం ఏదీ హేతువుకాదు. ఒక వాగ్దానం నెరవేరినట్లు కనిపించకపోతే దానికి కారణం ఆ వాగ్దానాన్ని అభినందించాల్సిన రీతిగా అభినందించకపోవడమే. అందరూ ఇష్టపడితే అందరూ ఆత్మను పొందగలరు. పరిశుద్దాత్మ అవసరాన్ని గుర్తించడం ఎక్కడ జరగదో అక్కడ ఆధ్యాత్మిక దుర్భిక్ష ఆధ్యాత్మికాంధకారం ఆధ్యాత్మిక క్షీణత మరణం ప్రత్యక్షమవుతాయి. ప్రాధాన్యం లేని విషయాలపై సంఘం గమనం నిలిచినప్పుడు పెరుగుదలకు ప్రగతికి అవసరమైన దైవ శక్తి వాటితోపాటు ఎన్నో దీవెనలు తెచ్చేశక్తి అది సమృద్ధిగా అందుబాటులో ఉన్నప్పటికీ కొరవడుంది. AATel 36.4

ఇది శక్తిని పొందే మార్గం గనుక పరిశుద్ధాత్మ వరం కోసం మనం ఆకలి దప్పులుగొనం ఎందుకు ? ఆ వరం గురించి మాట్లాడం ఎందుకు ? దాని కోసం ప్రార్థించడమెందుకు ? ఆ అంశంపై ప్రసంగించడం ఎందుకు ? తల్లిదండ్రులు తమ చిన్నారులకు బహుమానాలు ఇవ్వడానికి ఇష్టంగా ఉండేకన్నా ప్రభువు తన సేవచేసే తన బిడ్డలకు పరిశుద్ధాత్మ వరాన్నివ్వడానికి మరింత ఇష్టంగా ఉంటాడు. ప్రతీ సేవకుడూ అనుదిన ఆత్మ బాప్తిస్మం కోసం ప్రభువుకు మొర పెట్టుకోవాలి. ప్రణాళికలు రూపొందించుకొని వాటిని విజ్ఞతతో అమలు పర్చడం ఎలాగో తెలుసుకోడానికి విశ్వాసులు సమూహాలుగా సమావేశమై దేవుని ప్రత్యేక సహాయం కోసం వివేకం కోసం ప్రార్థించాలి. సువార్త సేవా రంగంలో ఉన్న, ప్రభువుచే ఎంపికైన రాయబారుల్ని దేవుడు తన ఆత్మతో అభిషేకించాల్సిందిగా వారు ప్రత్యేకించి ప్రార్థించాలి. దైవ సేవకులతో దేవుని ఆత్మ ఉండడం సత్య ప్రచారానికి గొప్ప శక్తి నిస్తుంది. అది లోకం ఇవ్వగల గౌరవ ప్రతిష్ఠల్ని మించిన శక్తి. AATel 37.1

దేవునికి అంకితమైన సేవకుడు ఎక్కడున్నా అతనితో పరిశుద్ధాత్మ నివసిస్తాడు. శిష్యుల్ని ఉద్దేశించి ప్రభువు చెప్పిన మాటలు మనకు కూడ వర్తిస్తాయి. ఆదరణకర్త వారికే కాదు మనకు కూడా చెందుతాడు. లోకంలోని ద్వేషం నడువ తమ అపజయాలు అపరాధాల మధ్య పోరాడే ఆత్మలకు ప్రతీ ప్రమాద పరిస్థితిలోను పరిశుద్ధాత్మ శక్తిని బలాన్ని చేకూర్చుతాడు. దుఃఖంలో, శ్రమల్లో ఉన్నప్పుడు, చుట్టూ చీకట్లు ముసురుతున్నట్లు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా కనిపించి మనం నిస్సహాయంగా, ఒంటరిగా మిగిలి ఉన్నామన్న మనోభావం కలిగినప్పుడు - ఈ సమయాల్లోనే విశ్వాస ప్రార్థనకు జవాబుగా పరిశుద్దాత్మ మనకు ఆదరణ నిస్తాడు. AATel 37.2

ఒక వ్యక్తి అసాధారణ పరిస్థితుల్లో ఆధ్యాత్మికపారవశ్యం ప్రదర్శిస్తే అది అతను క్రైస్తవుడనడానికి నిశ్చితమైన నిదర్శనం కాదు. పరమానందం పరిశుద్ధత కాదు. పరిశుద్ధతంటే చిత్తాన్ని సంపూర్తిగా దేవునికి సమర్పించుకోడం. దేవుని నోటి నుంచి వచ్చే ప్రతీ మాట ప్రకారం జీవించడం. మన పరలోకపు తండ్రి చిత్రాన్ని నెరవేర్చడం. శ్రమల్లో చీకటిలో వెలుగులో దేవున్ని నమ్మడం. పరిశుద్ధతంటే చూపు వలనగాక విశ్వాస మూలంగా నడవడం. అది ఆయన ప్రేమలో విశ్రమిస్తూ ప్రశ్నలు సందేహాలు లేని విశ్వాసంతో దేవుని మీద ఆధారపడడం. AATel 37.3

పరిశుద్ధాత్మను నిర్వచించగలగడం ప్రాముఖ్యం కాదు. పరిశుద్ధాత్మ ఆదరణ కర్త. “కర్త అనగా తండ్రి యొద్దనుండి బయలుదేరు సత్య స్వరూపియైన ఆత్మ” అని క్రీస్తు చెబుతున్నాడు. ప్రజల్ని సర్వ సత్యంలోకి నడిపించే తన పరిచర్యలో “ఆయన తనంతట తానే యేమియు” బోధించడు. యోహాను 15:26, 16:13. AATel 38.1

పరిశుద్దాత్మ స్వరూప స్వభావాలు ఒక మర్మం. మనుషులు ఆయనను వివరించలేరు. ఎందుకంటే ప్రభువు ఆయనను గూర్చి ఏమి బయలుపర్చలేదు. వింత భావాలు గల వ్యక్తులు లేఖన భాగాల్ని పొందుపర్చి వాటికి మానవ అర్థాలు వ్యాఖ్యానాలు కూర్చవచ్చును కాని ఈ భావాల ఆమోదం సంఘాన్ని బలోపేతం చేయలేదు. మానవ అవగాహనకు మించిన ఈ మర్మాల విషయంలో మౌనం ఉత్తమం. AATel 38.2

పరిశుద్దాత్మ పనిని క్రీస్తు నిర్దిష్టమైన ఈ మాటల్లో వ్యక్తం చేస్తున్నాడు: “ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్యియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును.” యోహాను 16:8. పాపాన్ని ఒప్పుకొనజేసేది పరిశుద్ధాత్మ. పాపి పరిశుద్ధాత్మ ప్రభావానికి సుముఖంగా స్పందిస్తే అతను పశ్చాత్తాపం పొంది దేవుని ధర్మవిధుల్ని ఆచరించటం ప్రాముఖ్యమని గుర్తిస్తాడు. AATel 38.3

నీతికోసం ఆకలి దప్పులు గొనే పశ్చాత్తపుడైన పాపికి పరిశుద్ధాత్మ లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లను కనపర్చుతాడు. ” ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమ పరచును” అన్నాడు క్రీస్తు. “ఆదరణకర్త, అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్దాత్మ సమస్తమును నాకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని నాకు జ్ఞాపకము చేయును.” యోహాను 16:14, 14:26. AATel 38.4

రక్షకుని మరణం ద్వారా లభించిన రక్షణను ఫలప్రదం చేయడానికిగాను పునరుజ్జీవింపజేసే సాధనంగా పరిశుద్ధాత్మ రావడం జరిగింది. కల్వరి సిలువ పై క్రీస్తు చేసిన త్యాగానికి మనుషుల గమనాన్ని తిప్పడానికి, దేవుని ప్రేమను ప్రపంచానికి వ్యక్తం చేయడానికి, విశ్వసించిన ఆత్మకు ప్రశస్త లేఖన సత్యాల్ని తెరవడానికి పరిశుద్ధాత్మ నిత్యం ప్రయత్నిస్తున్నాడు. AATel 38.5

పాపాన్ని ఒప్పుకోజేసిన అనంతరం నీతి ప్రమాణాన్ని దృష్టికి తెచ్చిన అనంతరం, పరిశుద్ధాత్మ మనసుల్ని, లోకాశల నుంచి మళ్లించి ఆత్మను పరిశుద్ధ కోరికలతో నింపుతాడు’ ” ఆయన..... మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును” (యోహాను 16:13) అన్నాడు రక్షకుడు. మనుషులు సంసిద్ధత కనపర్చినట్లయితే దేవుడు తమను సంపూర్ణంగా పరిశుద్ధం చేయడం జరుగుతుంది. పరిశుద్దాత్మ దైవ విషయాల్ని ఆత్మపై ముద్రిస్తాడు. తన శక్తి ద్వారా జీవ మార్గాన్ని సుబోధకం చేస్తాడు. అందుచేత ఎవరూ పొరపడాల్సిన అవసరం ఉండదు. AATel 39.1

పతనమైన మానవాళి రక్షణ నిమిత్తం పరిశుద్ధాత్మ ద్వారా పనిచేస్తూ ఆది నుంచి దేవుడు మానవ సాధనాల్ని వినియోగిస్తున్నాడు. ఇది పితరుల జీవితాల్లో ప్రదర్శితమయ్యింది. మోషే కాలంలో అరణ్యంలోని సంఘంలో కూడా దేవుడు తన “ఉపకారాత్మను” దయచేశాడు. నెహెమ్యా 9:20. అపొస్తలుల కాలంలో పరిశుద్ధాత్మ ద్వారా అయన తన సంఘానికి గొప్ప కార్యాలు చేశాడు. పితరులను బలపర్చిన శక్తే, కాలేబు యెహోషువాలకు విశ్వాసాన్ని ధైర్యాన్ని ఇచ్చిన శక్తే, అపొస్తలుల సంఘాన్ని క్రియాశీలం చేసిన శక్తే అనంతర యుగాల్లోని నమ్మకమైన దైవ ప్రజల్ని బలోపేతుల్ని చేశాడు, చేస్తున్నాడు. చీకటి యుగాల్లో వార్డెన్ సీయ క్రైస్తవులు పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే సంస్కరణ ఉద్యమానికి మార్గం సుగమం చేశారు. నవీన సువార్త సేవా మిషన్లను స్థాపించడానికి, బైబిలును ఆయా భాషలు మాండలికాల్లోకి అనువదించడానికి ఉత్తములైన పురుషులు స్త్రీల కృషిని విజయవంతం, ఫలభరితం చేసింది పరిశుద్ధాత్మ శక్తే. AATel 39.2

తన సంకల్పాన్ని లోకంలో ప్రచురపర్చడానికి నేడుకూడా దేవుడు తన సంఘాన్ని ఉపయోగిస్తున్నాడు. ఈనాడు సిలువ సువార్త ప్రబోధకులు క్రీస్తు రెండో రాకడకు మార్గాన్ని సుగమం చేస్తూ ఒక నగరం నుంచి మరోనగరానికి ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణిస్తూ ఉన్నారు. దైవ ధర్మశాస్త్ర ప్రమాణాన్ని ఘనపరచడం జరిగుతున్నది. సర్వశక్తుని ఆత్మ మానవుల్ని చైతన్య పర్చుతున్నాడు. ఆ ఆత్మ ప్రభావానికి సానుకూలంగా స్పందించే వారు దేవునికి ఆయన సత్యానకీ సాక్షులు అవుతారు. క్రీస్తు ద్వారా రక్షణ మార్గాన్ని తమకు స్పష్టం చేసిన సత్యాన్ని భక్తులైన స్త్రీ పురుషులు ఇతరులతో పంచుకోడం అనేక చోట్ల కనిపించింది. పెంతెకొస్తు దినాన ఆత్మ బాప్తిస్మం పొందినవారరికిమల్లే ఈ వ్యక్తులు తమకు వచ్చిన వెలుగును ఇతరులతో పంచుకొనే కొద్దీ వారు ఆత్మశక్తిని మరింత పొందారు. ఈ విధంగా ఈ భూమండలం దేవుని మహిమతో ప్రకాశించవలసి ఉన్నది. AATel 39.3

ఇలాగుండగా, ప్రస్తుత అవకాశాల్ని జ్ఞానయుక్తంగా సద్వినియోగ పర్చుకొనే బదులు ఊరకే కూర్చొని ప్రత్యేకమైన ఆత్మీయ ఉజ్జీవం వచ్చి తమను ఉత్తేజపర్చి తమను సామర్థ్యంతో నింపడానికి ఎదురు చూసేవారు కొందరుంటారు. తమ ప్రస్తుత విధుల్ని అవకాశాల్ని అశ్రద్ధ చేసి వారు తమ దీపాల్ని కొడిగట్టనిస్తారు. ఎలాంటి కషి చేయకుండా తాము మార్పుపొంది దైవసేవకు యోగ్యులయ్యేందుకుగాను ప్రత్యేక దీవెన పొందుతామని ఆ సమయం వస్తుందని ఎదురు చూస్తారు. AATel 39.4

లోకం చివరి కాలంలో లోకంలో దేవుని సేవ ముగిసే తరుణంలో పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వం కింద భక్తితత్పరులైన విశ్వాసుల పరిచర్యలో దైవ ప్రసన్నతను సూచించే గుర్తులు చోటు చేసుకొంటాయి. తూర్పు దేశాల్లో విత్తనాలు నాటే కాలంలోను పంటను కోసే కాలంలోను వచ్చే తొలకరి వర్షాల్ని కడవరి వరాల్ని సంకేతాలుగా ఉపయోగిస్తు దేవుడు తన సంఘంపై అసాధారణ పరిమాణంలో కుమ్మరించనున్న ఆధ్యాత్మిక కృపను గూర్చి హెబ్రీ ప్రవక్తలు ప్రవచించారు. అపొస్తలుల కాలంలోని ఆత్మ కుమ్మరింపు తొలకరి వర్షం ఆరంభాన్ని సూచిస్తుంది. దాని ఫలితం అమోఘం. యధార్ల సంఘంతో కాలాంతం వరకూ. పరిశుద్ధాత్మ నివసిస్తాడు. AATel 40.1

కాగా లోకం పంట చివరి దశలో మనుష్య కుమారుని రాక కోసం సిద్ధం చేసేందు నిమిత్తం ప్రత్యేక ఆధ్యాత్మిక కృపావర్షాన్ని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ ఆత్మ కుమ్మరింపు కడవరి వర్షంతో పోల్చబడుంది. “కడవరి వాన కాలమున” ఈ అదనపు శక్తి నిమిత్తం కోత ప్రభువుకు క్రైస్తవులు తమ మనవుల్ని సమర్పించుకోవాలి. వాటికి జవాబుగా “వాన కురిపించి పూర్వమువలె తొలకరి వరమును కడవరి వర్షమును మీకనుగ్రహించును”. జెకర్యా 10:1, యోవేలు 2:23. AATel 40.2

అయితే సమస్త ఆధ్యాత్మిక దీవెనలకు మూలమైన దేవునితో సజీవ అనుబంధం ఉంటే తప్ప నేడు దేవుని సంఘసభ్యులకు కోతకాలానికి సంసిద్ధంగా ఉండరు. తమ దివిటీల్ని చక్కబర్చుకొని వెలిగించి ఉంచుకొంటే తప్ప ప్రత్యేకావసరం ఏర్పడ్డప్పుడు వారికి అదనపు కృప దొరకదు. AATel 40.3

తమకు అగత్యమైన కృపను నిత్యమూ పొందుతున్నవారు మాత్రమే తమ రోజువారి అవసరం నిష్పత్తిలో, దాన్ని ఉపయోగించడానికి తమ సమర్థతను బట్టి శక్తిని పొందుతారు. ఒక ప్రత్యేక వరం ద్వారా ఆధ్యాత్మిక శక్తి పొంది భవిష్యత్తులో AATel 40.4

ఆత్మల రక్షణకు సామర్థ్యం పొందాలని కని పెట్టేకన్నా, వారు దేవుడు తన సేవకు తమను సమర్థులుగా తీర్చిదిద్దేందుకుగాను దినదినం తమ్మును తాము ఆయనకు సమర్పించుకొంటారు. సేవ చేసేందుకు అందుబాటులో ఉన్న తరుణాన్ని దినదినం సద్వినియోగపర్చుకొంటారు. తాము ఎక్కడుంటే అక్కడ అది గృహంలో పనిలో ఉన్నప్పుడూ లేక బహిరంగ సేవారంగంలో ఉన్నప్పుడు ప్రతి దినం ప్రభువును గూర్చి వారు సాక్ష్యమిస్తారు. AATel 40.5

లోకంలో జీవించినప్పుడు తమకు అనుదినం అవసరమైన కృపకోసం క్రీస్తు సైతం తండ్రికి ప్రార్థించాడని తెలుసుకోడం నమ్మకమైన దైవ సేవకుడికి ఎంతో ఆదరణనిస్తుంది. దేవునితో ఈ గోష్ఠి అనంతరం ఇతరుల్ని బలపర్చడానికి ఇతరులకు ఉపకారం చేయడానికి ఆయన వెళ్లాడు. అడిగో, వంగి తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్న దైవకుమారుడు! దైవ కుమారుడైనప్పటికీ ప్రార్థన ద్వారా ఆయన తన విశ్వాసాన్ని పటిష్ఠం చేసుకొంటున్నాడు. దేవునితో మాట్లాడడం ద్వారా పాపాన్ని ప్రతిఘటించడానికి మానవాళికి పరిచర్య చేయడానికి శక్తిని సమకూర్చుకొంటున్నాడు. మానవులకు అన్నగా, పాపం శోధనలు చుట్టుముట్టిన లోకంలో నివసిస్తున్నవారు బలహీనులు అయినా తన సేవ చేయాలని ఆశిస్తున్నవారి అవసరాలు అయన ఎరిగినవే. తన సేవకు పంపడానికి క్రీస్తు యోగ్యులుగా భావించేవారు బలహీనులు దోషులు. అయితే తన సేవకు తమ్ముతాము సంపూర్తిగా సమర్పించుకొన్న వారికి ఆయన దేవుని చేదోడు వాగ్దానం చేస్తున్నాడు. ఎడతెగక విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేస్తే - అది దేవుని పై సంపూర్తిగా ఆధారపడి ఆయన సేవకు నడిపించే విశ్వాసం - పాపంతో మనుషులు సల్పే పోరాటంలో ఆ విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం లభిస్తుంది. AATel 40.6

లోకపు పంటను పక్వానికి తెచ్చేందుకు సంఘానికి దేవుడు వాగ్దానం చేసిన శక్తి క్రీస్తు ఆదర్శాన్ననుసరించి నివసించే ప్రతీ సేవకుడు పొంది ఉపయోగించవచ్చు. ప్రతీ ఉదయం సువార్త సేవకులు ప్రభువు ముందు మోకరించి తమ సమర్పణను నవీకరించుకొన్నప్పుడు వారికి తన పరిశుద్దాత్మను పునరుజ్జీవాన్ని పరిశుద్ధతను కూర్చే ఆయన శక్తిని అనుగ్రహిస్తాడు. ఆనాటి విధులు నిర్వహించడానికి బయలుదేరేటప్పుడు తాము దేవునితో జతపనివారుగా వ్యవహరించేందుకు పరిశుద్ధాత్మ తమకు తోడై ఉంటాడన్న నిశ్చయత వారికుంటుంది. AATel 41.1