Go to full page →

9—ఏడుగురు పరిచారకులు AATel 63

ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయులమీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగసాగిరి.” AATel 63.1

ప్రారంభదినాల సంఘం నానాజాతులు తరగతుల ప్రజలతో కూడివున్నది. పెంతెకొస్తునాడు పరిశుద్ధాత్మ కుమ్మరింపు సమయంలో “ఆకాశము క్రిందనుండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి.” అ.కా. 2:5. యెరూషలేములో సమావేషమైన హెబ్రీయుల విశ్వాసంగలవారిలో కొంతమంది గ్రీకులు. వీరికీ పాలస్తీనకు చెందిన యూదులకు మధ్య అనుమానాలు శతృత్వం ఎంతో కాలంగా సాగుతూ వచ్చాయి. AATel 63.2

అపొస్తలుల పరిచర్యవలన మార్పుపొంది క్రైస్తవులైన వారి వైఖరి మెత్తబడి క్రైస్తవ ప్రేమలో ఒకటయ్యారు. గతకాలపు విరోధభావాలు ఉన్నా అందరూ ఒకరితో ఒకరు సామరస్యంగా సమభావంతో మసిలారు. ఈ ఐక్యత ఉన్నంతకాలం సువార్త సత్యం ప్రగతిని అడ్డుకోడం తనకు సాధ్యపడదని సాతానుకి బాగా తెలుసు. వారి గత ఆలోచనా భ్యాసాల్ని ఆసరగా తీసుకొని సంఘంలో అనైక్యత సృష్టించాలని ప్రయత్నించాడు. విశ్వాసుల సంఖ్య పెరిగే కొద్దీ విశ్వాసంలోని సహోదరులపై అనుమానాలు వ్యక్తం చేయడం, వారంటే అసూయ పడడం, మత నాయకుల్ని విమర్శించడం వంటి వారి పాత అలవాట్లను రెచ్చగొట్టడంలో విరోధి విజయం సాధించాడు. అందువల్ల “హెబ్రీయుల మిద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగసాగిరి.” అనుదినం పంచే సహాయంలో గ్రీకు విధవరాండ్రను ఆశ్రద్ధ చేశారన్నది పిర్యాదు. ఎలాంటి అసమానతవున్నా అది సువార్త స్ఫూర్తికి విరుద్ధం. అయినా అపోహలు సృష్టించడంలో సాతాను జయం సాధించాడు. అపవాది విశ్వాసుల మధ్య భేదాలు పుట్టించి విశ్వాసుల్లో, చీలికలు తేకుండా అడ్డుకొనేందుకు గాను అసంతృప్తిని పూర్తిగా తొలగించడానికి తక్షణ చర్యచేపట్టాలి. AATel 63.3

తమ అనుభవంలో యేసు శిష్యులకు ఇదొక గడ్డు సమస్య. పరిశుద్దాత్మ శక్తివల్ల ఐక్యంగా పరిచర్య చేస్తున్న అపొస్తలుల నాయకత్వం కింద సువార్త ప్రబోధకుల సేవ వేగంగా ముందుకు సాగుతున్నది. సంఘం నిత్యం పెరుగుతున్నది. సభ్యులు పెరగడంతో నాయకుల బరువు బాధ్యతలు పెరిగాయి. సంఘం అభివృద్ధి దెబ్బతినకుండా ఏ ఒక్క వ్యక్తిగాని వ్యక్తుల కూటమిగాని ఈ భారం మోస్తూ పోవడం సాధ్యం కాదు. సంఘం ప్రారంభ దినాల్లో కొందరు నాయకులు ఎంతో నమ్మకంగా నిర్వహించిన బాధ్యతల్ని ఇంకా ఎక్కువమందికి పంచాల్సిన అవసరం ఏర్పడింది. AATel 64.1

అప్పటిదాకా తాము నిర్వహించిన బాధ్యతలో కొన్నింటిని ఇతరులకు అప్పగించడం ద్వారా సువార్త పరిచర్య వ్యవస్థను రూపుదిద్దడమన్న ముఖ్య కర్తవ్యాన్ని అపొస్తలులు చేపట్టాలి. విశ్వాసుల సమావేశం ఏర్పాటు చేసి సంఘంలోని పనివారందరిని మెరుగుగా వ్యవస్థీకరించడానికి పరిశుద్దాత్మ నాయకత్వం కింద అపొస్తలులు ఒక ప్రణాళికను తయారు చేశారు. సువార్త బోధించడంలో తాము ఎక్కువ సమయం గడిపేందుకుగాను బీదలకు సహాయం పంచడంవంటి కార్యభారం నుంచి తమను విడుదల చేయాల్సిన సమయం వచ్చిందని సంఘ నాయకత్వ బాధ్యతలు వహిస్తున్న నేతలైన అపొస్తలులు వ్యక్తం చేశారు. “కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరుపొందిన యేడుగురు మనుష్యులను నాలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థనయందును వాక్యపరిచర్యయందును ఎడతెగకయుందుము” అన్నారు. ఈ సలహాను అందరూ ఆమోదించారు. ప్రార్థన ద్వారాను వారిపై చేతులుంచడం ద్వారాను పరిచారక సేవకు ఏడుగురిని ప్రత్యేకించారు. AATel 64.2

ప్రత్యేక సేవల నిమిత్తం ఏడుగురి నియామకం సంఘానికి ఎంతో మేలుకరంగా పరిణమించింది. ఈ అధికారులు వ్యక్తిగత అవసరాల్ని సంఘ ఆర్థిక వనరుల్నీ జాగ్రత్తగా పరిగణించి విజ్ఞతతోను దైవ భీతితోను పనిచేస్తూ సంఘంలో వేర్వేరు ఆసక్తుల్ని కూడా గట్టుకొంటూవచ్చి సంఘ ఐక్యతను బలపర్చడంలో సహసంఘ అధికారులకు తోడ్పడ్డారు. AATel 64.3

ఇది దేవుని చిత్తం ప్రకారం జరిగిన కార్యం అని వెంటనే కనిపించిన సత్ఫలితాలే తేట తెల్లం చేస్తున్నాయి. “దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి.” ఆత్మల సంఖ్యలో ఈ పెరుగుదల అపొస్తలులు సాధించిన ఇతోధిక స్వేచ్ఛవలన ఈ ఏడుగురు పరిచారకుల ఉత్సాహం దైవభక్తి వలన లభించిందే. పేదలకు సహాయమందించే ప్రత్యేక పరిచర్యకు ఈ సహోదరులు అభిషేకించబడ్డ కారణంగా వారు సువార్త విశ్వాసాన్ని బోధించకూడదని కాదు. ఆమాట కొస్తే ఇతరులకు సత్యాన్ని బోధించడానికి వారికి సంపూర్ణ అర్హత ఉన్నది. ఆ సేవలో వారు నిమగ్నులై అపూర్వ విజయాలు సాధించారు. AATel 64.4

దిన దినం పెరుగుతున్న సువార్త పరిచర్య ఆదిమ సంఘానికి అప్పగించబడింది. సువార్త సేవా కేంద్రాన్ని స్థాపించడం, క్రీస్తు సేవకు తమ్మును తాము సమర్పించుకోడానికి సిద్ధంగా వున్న ఆత్మలను దీవించడం వారు నిర్వహించాల్సిన పరిచర్య. సువార్త ప్రచారం లోకవ్యాప్తంగా సాగాల్సివున్నది. క్రైస్తవ సహవాసంలో ఐక్యంగా నివసిస్తూ క్రీస్తుతో కలిసి దేవునిలో ఉన్నామని లోకానికి కనపర్చుకొంటే తప్ప సిలువ వర్తమాన ప్రబోధకులు ప్రాముఖ్యమైన తమ కర్తవ్యాన్ని నెరవేర్చలేరు. తమ ప్రభువు పరలోకమందున్న తండ్రికి ఇలా ప్రార్థన చేయలేదా? “మనము ఏకమైయున్నలాగున వారును ఏకమైయుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము”? శిష్యుల్ని గూర్చి ఆయన ఇలా అనలేదా, “వారు... లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును” “నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు” “వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా” ఉండాలని ఆయన తండ్రితో విజాపన చేయలేదా? యోహాను 17:11,14,23. సువార్త ప్రకటించమని ఎవరు తమను ఆదేశించారో ఆ ప్రభువుతో తమ సన్నిహిత సంబంధం పై వారి ఆధ్యాత్మిక జీవితం వారి శక్తి ఆధారపడివున్నాయి. AATel 65.1

శిష్యులు క్రీస్తుతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్దాత్మ శక్తిని దేవదూతల సహకారాన్ని పొందగలిగారు. ఈ దైవ మధ్యవర్తుల సహాయ సహకారాలతో లోకం ముందు ఐక్య సంఘంగా నివసిస్తూ తాము నిత్యమూ పోరాడవలసిన చీకటి శక్తులపై వారు విజయం సాధించాల్సివున్నారు. వారు కలిసి సమైక్యంగా పరిచర్య చేస్తుండగా పరలోకదూతలు మార్గం సుగమంచేస్తూ వారి ముందు నడుస్తారు. ప్రజలు సత్యాన్ని అంగీకరిస్తారు. అనేకులు క్రీస్తును రక్షకుడుగా స్వీకరిస్తారు. వారు ఐక్యంగా ఉన్నంతకాలం సంఘం “చంద్రబింబమంత అందముగలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలునుగలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణి” అవుతుంది. పరమగీతము 6:10. దాని పురోగమనాన్ని ఏ శక్తీ ఆపలేదు. జయం వెంట జయం సాధిస్తూ లోకానికి సువార్త ప్రకటించడమన్న దైవ కార్యాన్ని నిర్వహిస్తూ సంఘం ముందంజ వేస్తుంది. AATel 65.2

సువార్త ప్రబోధకులు ఎక్కడైతే విశ్వాసుల్ని సంపాదిస్తారో అక్కడ సంఘాల్ని వ్యవస్థీకరించేందుకు గాను యెరూషలేములో ఏర్పాటయిన సంఘం మాదిరిగా నిలిచి సేవచేయాల్సివుంది. సంఘ నాయకత్వ బాధ్యతలు నిర్వహించేవారు దైవ ప్రజల పై అధికారం చెలాయించకుండా విజ్ఞతగల కాపరులుగా వ్యవహరిస్తూ ‘దేవుని మందను పై విచారణ చేయుచు దానిని” కోయాల్సివున్నారు. (1 పేతురు 5:2,3). పరిచారకులు “ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందినవారై” ఉండాలి. వీరు సంయుక్తంగా సత్యం పక్కనిలిచి సత్యాన్ని దృఢచిత్తంతో కాపాడాలి. ఈ విధంగా వారు మంద పై ఐక్యపర్చే ప్రభావాన్ని ప్రసరించగలుగుతారు. AATel 65.3

అనంతరం తొలి సంఘ చరిత్రలో లోకంలోని ఆయా ప్రాంతాల్లో విశ్వాసుల గుంపులు సంఘాలుగా ఏర్పడ్డప్పుడు సంఘ వ్యవస్థీకరణ క్రమబద్ధమయ్యింది. క్రమము సమైక్యచర్య సాధ్యపడ్డాయి. ప్రతీ సభ్యుడు తన పాత్ర చక్కగా నిర్వహించాలంటూ సంఘం పిలుపునిచ్చింది. తనకున్న వరాల్ని ప్రతీ వ్యక్తి ఉపయోగించాల్సి ఉన్నాడు. కొంతమందికి పరిశుద్ధాత్మ ప్రత్యేక వరాలిచ్చాడు. “మొదట కొందరిని అపొస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారినిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములుగల వారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వము చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారినిగాను నియమించెను.”1 కొరింథీ 12:28. రకరకాల పనిచేసే వీరంతా సామరస్యంతో కలిసి పనిచేయాలి. AATel 66.1

“కృపావరములు నానా విధములుగా ఉన్నవిగాని ఆత్మయొక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవిగాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవుగాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడొక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలాగనగా, ఒకనికి ఆత్మమూలముగా బుద్ది వాక్యమును, మరియొకనికి ఆత్మననుసరించిన జ్ఞాన వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరియొకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి యొకనికి నానా భాషలును, మరియొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నది. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచియిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఏలాగు శరీరము ఏకమై యున్నను అవయవములు కలిగియున్నదో, యేలాగు శరీరము యొక్క అవయములన్నియు అనేకములై యున్నను ఒక్క శరీరమైయున్నదో ఆలాగే క్రీస్తు ఉన్నాడు.” 1 కొరింథీ 12:4-12. AATel 66.2

లోకంలో దేవుని సంఘ నాయకులుగా పిలుపు పొందినవారిపై గంభీర బాధ్యతలున్నాయి. దైవ స్వామ్యదినాల్లో బరువైన బాధ్యతల్ని నిర్వహిస్తూ తీవ్రమైన ఒత్తిడికి ఆందోళనకు లోనవుతున్న తరుణంలో తాను విజ్ఞతతో బాధ్యతల్ని పంపిణీ చేయడం అవసరమని మోషేకి మామ యితో హితువు చెప్పాడు. యితో మోషేకి ఈ సలహా ఇచ్చాడు, “ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. నీవు వారికి ఆయన కడడలను ధర్మశాస్త్ర విధులను బోధించి, వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను.” ఇంకా “వేయిమందికి ఒకనిగాను, నూరుమందికి ఒకనిగాను, పదిమందికి ఒకనిగాను” నాయకుల్ని నియమించాల్సిందిగా యిత్ర సలహా ఇచ్చాడు. వీరు “సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుష్యు” లైవుండాలి. వారు “ఎల్లప్పుడును ప్రజలకు న్యాయము తీర్చవలెను.” మోషే చిన్న చితక సమస్యల్ని పరిష్కరిస్తూ అలసిపోకుండా, సమర్థులైన సహాయకులు వాటిని పరిశీలించి పరిష్కరించడం ద్వారా ఆయనకు కొంత విశ్రాంతి నివ్వాల్సివున్నారు. AATel 66.3

సంఘంలో బాధ్యతగల స్థానాల్లో వున్న వ్యక్తుల సమయం, శక్తి సామర్ధ్యాలు, ప్రత్యేక జ్ఞానం, విశాల హృదయం అగత్యమైన విషయాలకు ఉపయుక్తం కావాలి. ఇతరులు సమర్థంగా సంబాళించగల చిన్న చిన్న సమస్యల్ని పరిష్కారానికి అట్టి వ్యక్తుల ముందుకి పరిష్కారానికి తేవడం దేవుని చిత్తంకాదు. అయితే గొప్ప వ్యాజ్యెములన్నిటిని నీ యొద్దకు తేవలెను. ప్రతి అల్ప విషయమువారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసినయెడల నీకు సుళువుగా ఉండును. దేవుడు ఈలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన యెడల నీవు ఈ పని చేయుచు దాని భారమును వహించగలవు. మరియు ఈ ప్రజలందరు తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళెదరు” అని యిత్రో చెప్పాడు. AATel 67.1

ఈ ప్రణాళిక ప్రకారం “మోషే... ఇశ్రాయేలీయులందరిలో సామర్థ్యముగల మనుష్యులను ఏర్పరచుకొని, వెయ్యిమందికి ఒకనిగాను, నూరుమందికి ఒకనిగాను, ఏబదిమందికి ఒకనిగాను, పదిమందికి ఒకనిగాను, న్యాయాధిపతులను ఏర్పాటుచేసి వారిని ప్రజల మీద ప్రధానులనుగా నియమించెను.” నిర్గమకాండము 18:19-26. AATel 67.2

దరిమిల, తనతో నాయకత్వ బాధ్యతలు పంచుకోడానికి డెబ్బయిమంది పెద్దల్ని ఎంపిక చేసుకొంటున్నప్పుడు గౌరవం సదాలోచన అనుభవం ఉన్న వక్తుల్నే సహాయకులుగా ఆచితూచి మోషే ఎన్నుకొన్నాడు. ఈ పెద్దల్ని అభిషేకించే తరుణంలో బాధ్యతల సవాలు ప్రకటనలో సంఘ నాయకత్వానికి అవసరమైన అర్హతల్లో కొన్నిటిని మోషే వివరించాడు, “మీ సహోదరుల వ్యాజ్యెములను తీర్చి. ప్రతి మనుష్యునికిని వాని సహోదరునికిని వాని యొద్దనున్న పరదేశికిని న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలెను. తీర్పు తీర్చునప్పుడు అల్పుల సంగతిగాని ఘనుల సంగతిగాని పక్షపాతము లేకుండా వినవలెను. న్యాయపు తీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుషుల ముఖము చూచి భయపడవద్దు.” ద్వితియోపదేశకాండము 1:16,17. AATel 67.3

తన పరిపాలన చివరిదశలో ఆ దినాల్లో దైవ సేవ బాధ్యతలు చేపడున్న వారి నుద్దేశించి దావీదురాజు గంభీర బాధ్యతల సవాలు ప్రకటనను చేశాడు. “గోత్రముల పెద్దలను, వంతులచొప్పున రాజునకు సేవచేయు అధిపతులను సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజునకును రాజు కుమారులకును కలిగియున్న యావత్తు చరాస్తి సదను స్థిరాస్తి మీదనువున్న అధిపతులను, అనగా ఇశ్రాయేలీయుల పెద్దలందరిని రాజువద్దనున్న పరివారమును పరాక్రమశాలులను సేవా సంబంధులైన పరాక్రమశాలులందరిని” యెరుషలేముకు రప్పించి వృద్దుడైన రాజు, “మీరు ఈ మంచి దేశమును స్వాస్థ్యముగా అనుభవించి, మీ తరువాత మీసంతతి వారికి శాశ్వత స్వాస్థ్యముగా దానిని అప్పగించునట్లు మీ దేవుడైన యెహోవా వాకిచ్చిన యాజ్ఞలన్నియు ఎట్టివో తెలిసికొని వాటిని గైకొనుడి అని యెహోవా సమాజమునకు చేరిన ఇశ్రాయేలీయులందరు చూచుచుండగను మన దేవుడు ఆలకించుచుండగను మిమ్మును హెచ్చరించున్నాను” అన్నాడు. 1 దినవృ, 28:1,8. AATel 67.4

నాయకత్వ బాధ్యతకు పిలుపుపొందిన సొలొమోనుకు దావీదు ఈ ప్రత్యేక బాధ్యతల హెచ్చరిక ఇస్తున్నాడు. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునైయున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయ పూర్వకముగాను మనం:పూర్వకముగాను ఆయనను సేవించుము... యెహోవానిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము.” 1 దినవృ 28:9,10. AATel 68.1

మోషే కాలంలోను దావీదుకాలంలోను దైవప్రజల పాలకుల్ని నడిపించిన దైవభక్తి సంబంధమైన సూత్రాలే సువార్తయుగంలో నూతనంగా స్థాపితమైన దైవ సంఘ బాధ్యతలు వహించాల్సిన నాయకులూ పాటించాల్సివున్నారు. సంఘాలన్నిటి లోని విషయాల్ని క్రమబద్దీకరించడంలోను, అధికారులుగా వ్యవహరించడానికి అర్హులైన వ్యక్తుల్ని అభిషేకించడంలోను నాయకత్వం విషయంలో పాత నిబంధన లేఖనాలు నిర్దేశిస్తున్న ఉన్నత ప్రమాణాల్ని అపొస్తలులు పాటించారు. సంఘంలో నాయకత్వ బాధ్యతలు వహించడానికి పిలుపుపొందిన వ్యక్తి “నిందారహితుడై యుండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును. ముక్కోపియు, మద్యపానియు, కొట్టు వాడును, దుర్గాభమును అపేక్షించువాడునుకాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్దిగలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా విగ్రహము గలవాడునైయుండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుట కును, ఎదురాడువారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునైయుండవలెను.” తీతుకు 1:7-9. AATel 68.2

తొలి సంఘం పాటించిన క్రమం వారు దేవుని సర్వాంగ కవచం ధరించిన సైన్యంలా పటిష్ఠంగా ముందుకు సాగడానికి తోడ్పడింది. విశ్వాసుల సమూహాలు ఆయా ప్రాంతాల్లో చెదిరి ఉన్నప్పటికీ వారందరూ ఒకే సంఘ సభ్యులు. సామరస్యం సంఘీబావం కలిగి కలిసికట్టుగా వారు ముందడుగు వేశారు. ఒక స్థానిక సంఘంలో భేదాభిప్రాయాలు తలెత్తినప్పుడు - తర్వాత అంతియోకయలోను ఇతర స్థలాల్లోను తలెత్తినట్లు - విశ్వాసుల మధ్య ఏకీభావం కుదరని సందర్భాల్లో అవిసంఘంలో చీలికలు కలిగించడానికి మిగిలిపోకుండా విశ్వాసులు సర్వసభకు నివేదించాల్సి వున్నారు. స్థానిక సంఘాలు ఎన్నుకొన్న ప్రతినిధులు, అపొస్తలులు, నాయకత్వ బాధ్యతలుగా పెద్దలు ఈ సభకు సభ్యులు. కొన్ని మారుమూల స్థలాల్లో సంఘంపై దాడిచేయడానికి సాతాను చేసిన ప్రయత్నాల్ని సంఘం ఇలా సంఘటితంగా ఎదురుకోవడం ప్రతిబంధకాలు కలిగించడానికి నాశనం చేయడానికి సాతాను కుతంత్రాల్ని ఇలా నిర్వీర్యం చేయడం జరిగింది. AATel 68.3

“అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్తగాని అల్లరికి కర్తకాడు.” 1 కొరింథి 14:33. సంఘ సంబంధిత విషయాల్లో క్రమాన్ని పద్ధతిని పూర్వం కోరినట్లే ఈనాడూ దేవుడు కోరుతున్నాడు. తన ఆమోదముద్రను పొందేందుకుగాను తన పరిచర్య సమగ్రంగాను నిర్దిష్టంగాను జరగాలని ఆయన కోరుతున్నాడు. క్రైస్తవుడు క్రైస్తవుడితో, సంఘం సంఘంతో ఏకమౌతూ, మానవుడు దేవునితో సహకరిస్తూ, ప్రతీ సాధనం పరిశుద్ధాత్మకు లోబడూ దైవకృపా సువర్తమానం లోకానికి అందించాల్సివుంది. AATel 69.1