Go to full page →

3—గొప్ప సువార్త ఆదేశం AATel 20

క్రీస్తు మరణం దరిమిల ఆయన శిష్యులు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురి అయ్యారు. వారి నాయకుడు గురువు అయిన యేసు తిరస్కారం, ఖండన సిలువ మరణం పొందాడు. “వీడు ఇతరులను రక్షించెను, తన్నుతానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలు రాజూగదా, యిప్పుడు సిలువ మీద నుండి దిగిన యెడల వాని నమ్ముదము” (మత్తయి 27 : 42) అంటూ యాజకులు పరిపాలకులు ఎగతాళి చేశారు. శిష్యుల అశాజ్యోతి అరిపోయింది. వారి హృదయాలు అంధకారంతో నిండాయి. వారు తరుచు ఈ మాటలు పలికేవారు, ” ఇశ్రాయేలును విమోచింప బోవువాడు ఆయనే అని మేము నిరీక్షించి యుంటిమి.” లూకా 24 : 42. ఒంటరి వారై హృదయ భారంతో కుంగిపోతున్న శిష్యులు రక్షకుని ఈ మాటలు గుర్చుచేసుకొన్నారు, ” వారు వచ్చి మ్రానుకే యీలాగు చేసిన యెడల ఎండినదానికేమి చేయుదురో?” లూకా 23 : 31. AATel 20.1

శిష్యులతో భవిష్యత్తు గురించి మాట్లాడటానికి యేసు ఎన్నోసార్లు ప్రయత్నించాడు కాని ఆయన చెప్పిన వాటి గురించి వారు పట్టించుకొలేదు. అందుచేత ఆయన మరణం వారికి తీవ్ర దిగ్రాంతి కలిగించింది. అనంతరం గతాన్ని సమీక్షించి తమ అవిశ్వాసం పర్యవసానాన్ని చూసినప్పుడు శిష్యులు సంతాప పడ్డారు. క్రీస్తు సిలువ వేయబడ్డప్పుడు ఆయన తిరిగి లేస్తాడని వారు నమ్మలేదు. మూడోరోజు తిరిగి లేస్తానని ఆయన స్పష్టంగా చెప్పాడు కాని ఆయన ఉద్దేశమేంటో వారికి గ్రాహ్యంకాలేదు. ఆయన మరణించినప్పుడు ఈ అవగాహన లోపం వల్ల వారు తీవ్ర నిస్పృహకు లోనయ్యారు. వారు తీవ్రంగా అశాభంగం చెందారు. తమ మార్గంలో సాతాను నిలిన నీడను వారి విశ్వాసం అధిగమించలేక పోయింది. అంతా సందిగ్ధంగాను మర్మపూరితంగాను వారికి కనిపించింది. రక్షకుడు చెప్పిన మాటలు వారు నమ్మి ఉంటే వారనుభవించిన తీవ్రమనస్తాపం తప్పేది. AATel 20.2

నిరాశ నిస్పృహలతో, వేదనతో కుప్పకూలిన శిష్యులు మేడ పై గదిలో సమావేశమై తమ ప్రభువుకు సంభవించిదే తమకూ సంభవిస్తుందేమో అని భయపడూ గది తలుపులు గట్టిగా బిగించారు. తిరిగిలేచిన ప్రభువు వారికి ఇక్కడ కనిపించాడు. AATel 20.3

తమ ముందున్న పరిచర్యకు శిష్యుల్ని సిద్ధంచేస్తూ అంత వరకూ వారు అవగాహన చేసుకోని అంశాల్ని వారికి విశదం చేస్తూ క్రీస్తు, నలభై దినాలు భూమిపై ఉన్నాడు. తన రాకను గూర్చిన ప్రవచనాల గురించి, యూదులు తనను విసర్జించటం గురించి, తన మరణం గురించి ప్రస్తావించి ప్రతీ చిన్నవివరం విషయంలోను ఈ ప్రవచనాలు నెరవేరాలని ఆయన వివరించాడు. తమ భావి పరిచర్యలో దేవుని శక్తి తమకు తోడుగా ఉంటుందన్న నిశ్చయత తమకున్నదని ఈ ప్రవచన నెరవేర్పునుబట్టి వారు గ్రహించాలని ఆయన చెప్పాడు. వాక్యం ఇలా చెబుతున్నది: ” అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సులు తెరిచి క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింప బడుననియు వ్రాయబడియున్నది.” ” మీరే నా సాక్షులు” అన్నాడాయన. లూకా 24 : 45 - 48. AATel 21.1

క్రీస్తు తమతో ఉన్న కాలంలో శిష్యులు కొత్త అనుభవం గడించారు. జరుగుతున్న ఘటనల వెలుగులో తమ పరమ గురువు లేఖనాల్ని వివరించగా ఆయన పై వారి విశ్వాసం స్థిరపడింది. ” నేను నమ్మినవాని ఎరుగుదును” అని చెప్పేస్థితికి వారు వచ్చారు. 2 తిమోతి 1 : 12. తమ కర్తవ్యస్వభావాన్ని విస్తీర్ణతను గుర్తించి తమకు అప్పగించిన సత్యాల్ని లోకానికి ప్రకటించాల్సి ఉన్నామని వారు గ్రహించారు. క్రీస్తు జీవితంలో చోటుచేసుకొన్న సంభవాలు - ఆయన మరణ పునరుత్థానాలు, ఈ సంభవాల్ని సూచించే ప్రవచనాలు, రక్షణ ప్రణాళిక లోని మర్మాలు, పాపక్షమాపణకు యేసుకున్న శక్తి. వీటన్నిటికి శిష్యులు సాక్షులు. వారు వాటిని లోకానికి ప్రకటించాల్సి ఉన్నారు. పాప పశ్చాత్తాపం ద్వారా రక్షకుని శక్తి ద్వారా కలిగే రక్షణ సువార్తను వారు ప్రకటించాల్సి ఉన్నారు. AATel 21.2

పరలోకానికి ఆరోహణం కాకముందు శిష్యులకు క్రీస్తు తన సువార్త ఆదేశాన్ని ఇచ్చాడు. నిత్యజీవన సిరులు ప్రదానం చేసే తన వీలునామా అమలుకు తాము కార్యకర్తలు కావాలని శిష్యులతో ఆయన చెప్పాడు. లోకం కోసం నేను జీవించిన త్యాగపూరిత జీవితం మీరు చూశారు అని క్రీస్తు శిష్యులతో అన్నాడు. ఇశ్రాయేలు కోసం నేను చేసిన కృషి మీకు తెలుసు, నిత్యజీవం పొందటానికి నా ప్రజలు నా వద్దకు రాకపోయినప్పటికీ, యాజకులు పాలకులు తమకిష్టం వచ్చినట్లుగా నాకు హాని చేసినప్పటికీ, వారు నన్ను విసర్జించినప్పటికీ దైవ కుమారుణ్నయిన నన్ను అంగీకరించటానికి వారికి మరొక అవకాశం ఇస్తాను. తమ పాపాలు ఒప్పుకొని నా వద్దకు వచ్చేవారందరినీ నేను అంగీకరించడం మీరు చూస్తున్నారు. నా వద్దకు వచ్చేవాన్ని నేను ఎన్నడూ తోసిపుచ్చను. నా శిష్యులారా, మీకు నా కృపా వర్తమానాన్ని అప్పగిస్తున్నాను. దీన్ని యూదులకు అన్యులకు అందించాలి. ముందు ఇశ్రాయేలుకు ఆ మీదట సర్వ రాష్ట్రాలకు ఆయాభాషలు మాట్లాడే వారికి ప్రజలకు అందించాలి. విశ్వసించేవారందరూ ఒక సంఘంగా సంఘటితం కావలసి ఉన్నారు. AATel 21.3

సువార్త ఆదేశం దేవుని రాజ్యం తాలూకు గొప్ప మిషనెరీ సేవా ప్రణాళిక. శిష్యులు ఆత్మలకోసం దీక్షతో కృషి చేయాల్సి ఉన్నారు. వారు అందరికి కృపావర్తమానం అందించాల్సి ఉన్నారు. ప్రజలు తమ వద్దకు వచ్చేవరకూ వారు వేచి ఉండకూడదు. తమ వర్తమానంతో వారే ప్రజల వద్దకు వెళ్లాలి. AATel 22.1

శిష్యులు తమ పరిచర్యను క్రీస్తు పేర నిర్వహించాల్సి ఉన్నారు. వారి ప్రతీమాట ప్రతీ క్రియ ఆయన పైకి దృష్టిని ఆకర్షించాలి. పాపుల్ని రక్షించే శక్తి గల నామంగా ఆయన నామాన్ని కేంద్రీకరించాలి. వారు తమ మనవుల్ని ఆయన పేర సమర్పించుకోవాల్సి ఉన్నారు. అప్పుడు ఆ మనవులకు సమాధానం పొందుతారు. తండ్రి కుమార పరిశుద్దాత్మ నామంలో వారు బాప్తిస్మం ఇవ్వాల్సి ఉన్నారు. క్రీస్తు నామం వారి నినాదంగా, గౌరవ బ్యాడ్జిగా, ఐక్యతాబంధంగా, వారి కార్యాలకు అధికారిక ధృవీకరణగా, వారి విజయాలకు మూలంగా ఉండాల్సి ఉన్నది. ఆయన నామం అధికారం లేనిదేదీ ఆయన రాజ్యంలో గుర్తింపు పొందకూడదు. AATel 22.2

విశ్వసించే వారందరిని నా నామంలో సంఘంలో కి పోగు చేయడానికి బయలుదేరి వెళ్లండి అని శిష్యులతో అన్నప్పుడు తాము నిరాడంబరత పాటించడం అవసరమని క్రీస్తు వారికి సూచించాడు. ఆడంబరం, డంబం ఎంత తక్కువగా ఉంటే వారి ప్రభావం అంత మేలుకరంగా ఉంటుంది. క్రీస్తు ఎంత నిరాడంబరంగా మాట్లాడాడు ! అలాగే శిష్యులూ మాట్లాడాల్సి ఉన్నారు. ఆయన నేర్పిన పాఠాల్ని బోధించి శ్రోతల్ని ప్రభావితం చేయాల్సి ఉన్నారు. AATel 22.3

తాము చేయనున్న పరిచర్య నల్లేరు మీద బండి నడకలా ఉంటుందని తన శిష్యులకు యేసు చెప్పలేదు. తమకు వ్యతిరేంగా మోహరించి ఉన్న దుష్ట శక్తుల కూటమిని ఆయన వారికి చూపించాడు. వారు పోరాడ వలసింది. “ప్రధానులతోను, ఆధికారులతోను, ప్రస్తుత అంధకార సంబధులగు లోక నాధులతోను, ఆకాశమండల మందున్న దురాత్మల సమూహములతోను.” ఎఫెసీ 6 : 12. ఒంటరిగా పోరాడడానికి ఆయన వారిని విడిచి పెట్టడు. తమతో ఉంటానికి వారికి హామీ ఇచ్చాడు. విశ్వాసంతో ముందుకు వెళ్తే సర్వశక్తిగల దేవుని సంరక్షణ తమకుంటుందని వారికి చెప్పాడు. ఎందుకంటే దూతల కన్న బలమైనవాడు పరలోక సైన్యాలకు అధిపతి అయిన ప్రభువు వారికి తోడుంటాడు. ఆయన వారి సేవకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసి ఆ సేవ విజయానికి బాధ్యత తనపై పెట్టుకొన్నాడు. ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ ఆయనతో కలిసి పనిచేసినంత కాలం వారికి అపజయం ఉండదు. సకల రాష్ట్రాలకు వెళ్లండి అన్నది ఆయన ఆదేశం. మీరు లోకం చివర ఉన్న ప్రదేశానికి వెళ్లండి. అక్కడ కూడా నేను మీతో ఉంటానని ఆయన వారికి వాగ్దానం చేశాడు. విశ్వాసంతో సేవ చేయండి. మిమ్మల్ని నేను ఎన్నడూ విడిచి పెట్టను. నేను ఎల్లప్పుడూ మీతో ఉండి మీ సేవలో నాకు సహాయం చేస్తాను. మిమ్మల్ని నడిపించి ఆదరించి పరిశుద్ధపర్చి బలపర్చి ఇతరుల్ని పరలోకానికి ఆకర్షించే మాటలు మాట్లాడడంలో మీకు విజయం చేకూర్చుతాను. AATel 22.4

మానవుడి పక్షంగా క్రీస్తు బలిదానం పరిపూర్ణం, పరిసమాప్తం. ప్రాయశ్చిత్తం షరతును ఆయన నేరవేర్చాడు. ఈ లోకంలో తాను చేయడానికి వచ్చిన కార్వాన్ని ఆయన నెరవేర్చాడు. రాజ్యాన్ని గెల్చుకొన్నాడు. సాతానుని జయించి దాన్ని గెల్చుకొన్నాడు. అంతటికి ఆయన వారసుడయ్యాడు. దేవుని సింహాసనాన్ని అధిష్టించడానికి, పరలోక నివాసుల నివాళులు అందుకోడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హద్దులు లేని అధికారం చేతబట్టుకొని శిష్యులకు ఈ ఆదేశం ఇచ్చాడు: AATel 23.1

“కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మితో కూడ ఉన్నాను.” మత్తయి 28 : 19, 20. AATel 23.2

శిష్యుల్ని విడిచి వెళ్లక ముందు తన రాజ్య స్వభావాన్ని గురించి మరోసారి క్రీస్తు వారికి జ్ఞాపకం చేశాడు. ఆ ప్రపంచంలో లౌకిక రాజ్యాన్ని స్థాపించటం తన ఉద్దేశం కాదని ఆయన వ్యక్తం చేశాడు. దావీదు సింహాసనంపై కూర్చొని లౌకిక రాజులా పరిపాలించడానికి తాను నియుక్తుడు కాలేదు. ” ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా ? ” అని శిష్యులు ఆయన్ను ప్రశ్నించినప్పుడు, ” కాలములను సమయములను తండ్రి తన స్వాధీన మందుంచుకొనియున్నాడు. వాటిని తెలిసికొనుట మీ పని కాదు” అన్నది ఆయన సమాధానం. అ.కా. 1 : 6, 7. ఆయన అనుగ్రహించిన శక్తితో తాము చూడగలిగిన దానికి మించి భవిష్యత్తులోకి వారు చూడాల్సిన అవసరంలేదు. సువార్త సందేశం ప్రకటించడం వారి కర్తవ్యం. AATel 23.3

క్రీస్తు భౌతిక సముఖం శిష్యుల మధ్య నుంచి వెళ్లి పోడానికి సిద్ధంగా ఉన్నది. కాని వారికి నూతన శక్తి రానున్నది. వారి మీదికి పరుశుద్ధాత్మ దిగిరానున్నాడు. తన పరిచర్యకు ఆయన వారిని ముద్రించనున్నాడు. రక్షకుడిలా అన్నాడు: “ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మిమిదికి పంపుచున్నాను; మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడి” లూకా 24 : 49. ” యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెనుగాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధతతో బాప్తిస్మము పొందెదరు.” ” అయినను పరిశుద్ధాత్మ మీ ఖాదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు. గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైయుందురని వారితో చేప్పెను.” అ.కా. 1 : 5,8. AATel 23.4

ఎంత బలమైన హేతుబద్ధమైన వాదన అయినప్పటికీ కఠిన హృదయాల్ని కరిగించలేదని లౌకికత్వాన్ని స్వార్థాన్ని నాశనం చేయలేదని రక్షకునికి తెలుసు. తన శిష్యులు పరిశుద్ధాత్మ కుమ్మరింపు పొందాల్సి ఉన్నారని, మార్గం, సత్యం, జీవం అయిన ఆ ప్రభుపును గూర్చిన జ్ఞాన వికాసం గల వ్యక్తులు ప్రకటించినప్పుడే సువార్త విజయాలు సాధిస్తుందని ఆయనకు తెలుసు. శిష్యులు తమ కర్తవ్యాన్ని నిర్వహించడానికి గొప్ప సమర్ధత అవసరమౌతుంది. ఎందుకంటే వారికి ఎదురుగా దుర్మార్గత వరదలా లేచింది. చురుకైన, పట్టుదల గల నాయకుడు అంధకార శక్తుల్ని నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడిచ్చే సహాయంతో మాత్రమే క్రీస్తు అనుచరులు సత్యం కోసం పోరాడగలుగుతారు. AATel 24.1

తమ పరిచర్యను యెరూషలేములో ప్రారంభించవలసిందిగా శిష్యుల్ని యేసు కోరాడు. మానవుల కోసం ఆయన చేసిన మహాత్యాగం ఆ పట్టణంలోనే జరిగింది. మానవావతారంలో ఉన్న ఆ ప్రభువు మనుషులతో నడిచాడు, మాట్లాడాడు. పరలోకం భూలోకానికి ఎంత దగ్గరయ్యిందో గ్రహించ గలిగినవారు బహు కొద్దిమంది. ఖండనకు గురిఅయి ఆయన సిలువ మరణం పొందింది అక్కడే. నజరేయుడైన యేసు మెస్సీయా అని రహస్యంగా విశ్వసించిన వారు యెరూషలేములో అనేక మంది ఉన్నారు. యాజకులూ అధికారుల వల్ల మోసపోయిన వారూ చాలా మంది ఉన్నారు. వీరికి సువార్తను ప్రకటించాలి. పశ్చాత్తాపం పొందాల్సిందన్న పిలుపును వారు వినాలి. క్రీస్తు ద్వారా మాత్రమే పాపక్షమాపణ లభిస్తుందన్న సత్యం విశదంగా ప్రకటితం కావాలి అంతకు ముందు కొద్ది వారాల క్రితం జరిగిన ఘటనలతో యెరూషలేము సంచలనంతో నిండిన నేపథ్యంలో శిష్యుల ప్రబోధం మంచి ఫలితాలు సాధించనుంది. AATel 24.2

పాప దాస్యం నుంచి లోకాన్ని విడిపించే తన సేవలో తనతో ఏకమై తాము పనిచేయాలన్న విషయాన్ని తన భూలోక సేవాకాలంలో యేసు శిష్యుల ముందు పెడుతూ వచ్చాడు. దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి వన్నెండు మంది అనంతరం డెబ్బయి మందిని పంపినప్పుడు ఏఏ సంగతులు వారికి తాను బోధించాడో వాటిని ఇతరులకు బోధించడం తమ బాధ్యత అని ఆయన వ్యక్తం చేస్తున్నాడు. తన పరిచర్య అంతటిలోనూ ఆయన వారిని వ్యక్తిగత పరిచర్యకోసం తర్ఫీదు చేశాడు. వారి సంఖ్య పెరిగే కొద్ది ఆ పరిచర్య విస్తరించి తుదకు అది లోకం నలుమూలల వరకు వ్యాపించాల్సి ఉన్నది. రక్షణ వర్తమానం లోకానికి అందజేసే నిమిత్తం దేవుడు తమకు అప్పగించిన నిధి అన్నది తన అనుచరులకు యేసు బోధించిన చివరి పాఠం. AATel 24.3

తండ్రి వద్దకు వెళ్లిపోడానికి సమయం వచ్చినప్పుడు క్రీస్తు తన శిష్యుల్ని బేతని వరకు తీసుకువెళ్లాడు. నిశ్చయంగా మిమ్మల్ని సంరక్షిస్తాను అన్నట్టుగా చేతులు చాపి దీవిస్తూ నెమ్మదిగా వారి మధ్య నుంచి ఆయన ఆకాశంలోకి లేచిపోయాడు. ” వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను.” లూకా 24 : 51. ఆరోహణు డౌతున్న ప్రభువుని చివరిసారి చూసేందుకు శిష్యులు పైకి చూస్తుండగా సంభ్రమానందాలతో ఎదురు చూస్తున్న దూతలు ఆయనను స్వాగతించారు. దూతలు ఆయనను వెంబడించి పరలోకానికి వెళ్తున్నప్పుడు విజయోత్సాహంతో ఇలా గానం చేశారు: ” భూ రాజ్యములారా, దేవుని గూర్చి పాడుడి ప్రభువును కీర్తించుడి... దేవునికి బలాతిశయము నారోపించుడి. మహిమోన్నతుడైన ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది.” కీర్తనలు 68 : 32 - 34. AATel 25.1

శిష్యులు ఇంకా ఆశగా ఆకాశంలోకి చూస్తున్నారు. అప్పుడు ” తెల్లని వస్త్రములు ధరించుకొనిన యిద్దరు మనుష్యులు వారి యొద్దనిలిచి - గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచు చున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే, ఏరితిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆరీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.” అ.కా 1 : 10, 11. AATel 25.2

యేసు రెండో రాకను గూర్చిన వాగ్దానం ఆయన శిష్యుల మనసుల్లో నిత్యము మెదులూ ఉండాలి. ఆకాశంలోకి ఆరోహణమవ్వడం వారు చూసిన ఆ యేసే మళ్లీ వస్తాడు. ఈ లోకంలో తన సేవకు తమ్మునుతాము అంకితంచేసుకొన్న వారిని తన వద్ద ఉండడానికి తీసుకు వెళ్లడానికి వస్తాడు. ” ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము నాతో కూడ ఉన్నాను” అని చెప్పిన స్వరమే పరలోక రాజ్యంలో తన సముఖంలోకి స్వాగతం పలుకుతుంది. AATel 25.3

ఛాయారూపక సేవలో యాజకుడు తన అధికార యాజక దుస్తులు తీసివేసి సామాన్యయాజకుడి తెల్లటి దుస్తులు ధరించి సేవచేసిన మాదిరిగానే క్రీస్తు తన రాజదుస్తులు పక్కన పెట్టి మానవ శరీరం ధరించి యాజకుడూ బలిపశువూతానే అయి బలి అర్చించాడు. అతిపరిశుద్ధ స్థలంలో తన సేవను ముగించిన తర్వాత ప్రధాన యాజకుడు తన అధికార ప్రధానయాజక దుస్తులు ధరించి, వేచి ఉన్న సమాజం ముందుకు వచ్చిన రీతిగానే ” లోక మందు ఏ చాకలియు...” చలువ చేయలేనంత తెల్లని వస్త్రాలు ధరించి యేసు వస్తాడు. మార్కు 9 : 3. ఆయన తన మహిమతోను తన తండ్రి మహిమతోను వస్తాడు. ఆయనతో పరలోక దూతలందరూ వస్తారు. ” నేను మరల వచ్చి .... మిమ్మును తీసుకొని పోవుదును” (యోహాను 14 : 3) అన్న క్రీస్తు వాగ్దానం ఇలా నేరవేర్తుంది. ఆయనను ప్రేమించి ఆయన కోసం కనిపెడున్న వారికి ఆయన మహిమ కిరీటం అమర్త్యత ఇస్తాడు. మరణించిన నీతిమంతులు పునరుత్థానులవుతారు. జీవించి ఉన్న నీతిమంతులు వారితో కలిసి మధ్యాకాశంలో ప్రభువును కలుసుకోడానికి వెళ్తారు. సంగీతం కన్నా మధురమైన స్వరంతో ఈ పోరాటం ముగిసిందని యేసు అనడం వారికి వినిపిస్తుంది. ” రండి, లోకము పుట్టినది మొదలుకొని నా కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించు కొనుడి.” మత్తయి 25 : 34. AATel 25.4

శిష్యులు తమ ప్రభువు రాకను గూర్చిన నిరీక్షణ కలిగి నివసిస్తూ ఆనందించ వచ్చు . AATel 26.1