మాంస రహిత ఆహారానికి విజ్ఞప్తులు (1884) CDTel 422.3
ఉత్తరం 3, 1884 CDTel 422.4
720. నీకు కొన్ని మాటలు రాయటానికి ఈ ఉదయం నాలుగు గంటలకు లేచాను. నీవు యాజమాన్యం వహిస్తున్న సంస్థను దేవుడు కోరుతున్నట్లు నడపాలి అన్న విషయమై ఇటీవలి కాలంలో నేను చాలా ఆలోచిస్తున్నాను. నీకందించటానికి నాకు కొన్ని సలహాలున్నాయి. CDTel 422.5
మనం ఆరోగ్యసంస్కర్తలం. సాధ్యమైనంతమట్టుకు ఆదిలో ప్రభువిచ్చిన మితాహార ప్రణాళికకు తిరిగి రావటానికి ప్రయత్నిస్తున్నాం. మితానుభవం కేవలం ప్రణాళికకు సారావంటి మత్తు పానీయాలకి పొగాకుకే పరిమితం కాదు. దీని పరిధి వీటికి మించి ఉంది. ఇది మనం తినే సమస్తాన్ని నియంత్రించాలి. CDTel 423.1
ఆరోగ్యసంస్కరణ పై వచ్చిన వెలుగు మీకందరికీ తెలుసు. కాని నేను మీ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించేటప్పుడు, మాంసాహారం విషయంలో ఆరోగ్య సంస్కరణ నుంచి మీరు దూరంగా తొలగిపోయినట్లు గమనిస్తున్నాను. మార్పు అవసరమని అది వెంటనే జరగటం అవసరమని నా నమ్మకం. మీ ఆహారం చాలా మట్టుకు మాంసంతో కూడివుంది. ఈ సంస్థని దేవుడు నడిపించటం లేదు. ఆహార సమస్యని తప్పుడు ప్రాతిపదికపై స్థాపించటానికి సాతాను ప్రయత్నిస్తున్నాడు. రోగుల రుచుల ప్రకారం ఆహారాన్ని తయారు చెయ్యటానికి సంస్థ అధికారుల్ని నడిపిస్తున్నాడు. CDTel 423.2
ప్రభువు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులోనుంచి నడిపించినప్పుడు వారిని కనానులో పవిత్రమైన, ఆనందం ఆరోగ్యం గల ప్రజలుగా స్థాపించాలని సంకల్పించాడు. ఆయన ఈ కార్యాన్ని ఎలా సాధించాడో దేవుని ప్రణాళికని అధ్యయనం చేసి తెలుసుకుందాం. ఆయన వారి తిండిని నియంత్రించాడు. చాలామట్టుకు మాంసాన్ని వారికి దూరంగా ఉంచాడు. కాని వారు ఐగుప్తు మాంసపు కుండల్ని వాంఛించారు. దేవుడు వారికి మాంసం ఇచ్చాడు. దాని పర్యవసానాల్ని కూడా వారిని అనుభవించనిచ్చాడు. CDTel 423.3
మందుల వినియోగం లేకుండా రోగులకి చికిత్స చెయ్యటానికి ఆరోగ్యాశ్రమం గొప్ప వ్యయంతో స్థాపితమయ్యింది. దాన్ని ఆరోగ్య నియమాల ప్రకారం నడపాల్సి ఉంది. సాధ్యమైనంత త్వరగా మందుల వాడకం తగ్గించి చివరికి వాటిని పూర్తిగా మానెయ్యాలి. సరియైన ఆహారం, వస్త్రధారణ, వ్యాయామంపై ఉపదేశం ఇవ్వాలి. మన ప్రజలకి మాత్రమే కాక ఆరోగ్య సంస్కరణ పై వెలుగు పొందనివారికి కూడా దేవుని ప్రణాళిక ప్రకారం ఆరోగ్యవంతంగా ఎలా నివసించాలో ఉపదేశమివ్వాలి. అయితే ఈ విషయంలో మనకే ఎలాంటి ప్రమాణం లేకపోతే, ఎంతో వ్యయంచేసి ఆరోగ్య సంస్థల్ని స్థాపించాల్సిన అవసరం ఏంటి? సంస్కరణ స్థానం ఏమిటి? CDTel 423.4
మనం దేవుని ప్రణాళికననుసరించి కదులుతున్నామని నేను చెప్పలేను. మన పనులు కార్యాలు వ్యత్యాసంగా ఉండాలి. లేకపోతే మనం ధరిస్తున్న ఆరోగ్యాశ్రమం అన్న పేరు మార్చుకోవాలి. అది పూర్తిగా అసమంజసం. ఆరోగ్యసంస్థని ఏ ఒక్క వ్యక్తి రుచుల్ని తృప్తిపర్చటానికో లేక ఏ ఒక్క వ్యక్తి అభిప్రాయాలకి అనుగుణంగానో మలచ కూడదని ప్రభువు నాకు కనపర్చాడు. మన సంస్థల్లో మాంసాహారాన్ని అనుమతించటానికి చెప్పే వంక మన సంస్థలకు వచ్చే వినోద ప్రేమికులు ఏ ఇతర ఆహారాన్ని ఇష్టపడరన్నదని నాకు తెలుసు. ఇష్టపడకపోతే తాము కోరే ఆహారం దొరికే చోటుకు వారిని వెళ్లనివ్వండి. అతిథుల విషయంలో సయితం సంస్థని నియమాల ప్రకారం నడపలేనప్పుడు దాని పేరుని మార్చెయ్యండి. క్రితంలో చెప్పిన సాకు ఇప్పుడులేదు. బయటినుంచి వచ్చే మద్దతు చాలా తక్కువ. CDTel 424.1
నిత్యం మాంసాహారం తీసుకోటం శరీరవ్యవస్థకి హానికరం. భ్రష్టమైన వక్రమైన రుచితప్ప వారికి సాకు లేదు. మాంసాన్ని పూర్తిగా విసర్జించాలా? అని మీరు ప్రశ్నించవచ్చు. చివరికి అదే జరగాలి అన్నది నా జవాబు. కాని ఈ చర్యతీసుకోటానికి ఇప్పుడు సమయం రాలేదు. మాంసాహారాన్ని చివరకి విడిచి పెట్టాలి. జంతువుల మాంసం మన ఆహారంలో ఇక ఓ భాగం కాబోదు. మాంసం దుకాణాల్ని మనం ద్వేషిస్తాం.... CDTel 424.2
మనం తినే ఆహారమే మన శరీరాన్ని నిర్మిస్తుంది. జంతువుల మాంసం తిని పాశవిక ఉద్రేకాల్ని బలపర్చుకుందామా? ఈ అనుచిత ఆహారం పట్ల రుచిని పెంచుకునే బదులు, పండ్లు, గింజలు, కూరగాయలు తిని నివసించటానికి మనల్ని మనం తర్బీతు చేసుకోవాలి. మన సంస్థల నిర్వహణతో సంబంధమున్న వారందరూ చెయ్యాల్సిన పని ఇదే. మాంసం వినియోగం క్రమక్రమంగా తగ్గించి చివరికి పూర్తిగా విడిచి పెట్టండి. మాంసం వాడకం మానేస్తే, ఆదిశలో రుచిని తర్బీతు చెయ్యకపోతే, పండ్లు, గింజలపట్ల ఇష్టం పెంచుకుంటే, అది ఆదిలో దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఆహారమౌతుంది. దైవ జనులు మాంసం భుజించరు. CDTel 424.3
క్రితంలో ఉపయోగించినట్లు మాంసం ఉపయోగించటం మానేస్తే, ఇంకా బాగా వంట చెయ్యటం మీకు వస్తుంది. మాంసం స్థానాన్ని మరోవంటకంతో భర్తీ చెయ్యగలుగుతారు. నూనె వినియోగం గాని చచ్చిన జంతువుల మాంసం వినియోగంగాని లేకుండా ఆరోగ్యదాయకమైన అనేక వంటకాలు తయారు చెయ్యవచ్చు. ఆరోగ్యదాయకమైన, బలవర్ధకమైన రకరకాల సామాన్య వంటకాలు మాంసం లేకుండా తయారు చెయ్యవచ్చు. మనుషులు ఆరోగ్యవంతులుగా నివసించటానికి కూరగాయలు, పండ్లు, గింజలు ఎక్కువగా తినాలి. మాంసం తింటేనే గాని తమ శక్తిని కాపాడుకోలేమని భావించేటట్లు తమ రుచుల్ని అభిరుచుల్ని తర్బీతు చేసుకున్న బయటివారికి అప్పుడప్పుడు మాంసం వడ్డించవచ్చు. కాని వారు మాంసం ఎక్కువ తినటం కన్నా దాన్ని విడిచి పెడితే వారికి సమధిక సహన శక్తులుంటాయి. CDTel 424.4
ఆరోగ్యాశ్రమం లోని వైద్యులు సహాయకులు మాంసాహారాన్ని విడిచి పెట్టటానికి ప్రధానంగా చెప్పే అభ్యంతరం తమకు మాంసం కావాలని కోరటం అది తమకు ఇవ్వాల్సిందిగా విజ్ఞాపన చెయ్యటం. కనుక మాంసం వాడకాన్ని వారు ప్రోత్సహిస్తున్నారు. కాని ఆరోగ్యాశ్రమానికి వచ్చేవారు మాంసాహారానికి శిక్షణ పొందాలన్నది దేవుని ఉద్దేశం కాదు. హాలులో ఉపన్యాసాల ద్వారా, వ్యక్తిగత ఆదర్శం ద్వారా ఇతర దిశలో వారికి శిక్షణ నివ్వండి. ఆరోగ్యకరమైన ఆహారం తయారు చెయ్యటానికి గొప్ప నిపుణత అవసరమౌతుంది. ఎక్కువ శ్రమ అవసరమౌతుంది. అయినా దాన్ని క్రమేపి చెయ్యటం అవసరం. మాంసం ఎక్కువగా వాడవద్దు. వంటచేసేవారు, బాధ్యత వహించేవారు తమ సొంత రుచులు, ఆహార అలవాట్లని ఆరోగ్య చట్టాలకి అనుగుణంగా తర్ఫీదు చేసుకోవాలి. CDTel 425.1
మనం ముందుకి సాగి కవానుకి వెళ్లేబదులు వెనుతిరిగి ఐగుప్తుకి వెళ్తున్నాం. మనం పరిస్థితుల్ని మార్చుకోవద్దా? అజీర్తి వ్యాధి కలిగించే వేడిబిస్కెట్లను తినటం మానవద్దా? తన వాక్యంలోను తన ఆత్మసాక్ష్యాల ద్వారాను దేవుడు తమకిచ్చిన వెలుగు ప్రకారం ఎవరు తమ ప్రమాణాల్ని ఆయన క్రమానికి సాధ్యమైనంత దగ్గరగా సమున్నత పర్చుతారో వారు తమ కార్యవిధానాన్ని దేవుని ఏర్పాటుకి విరుద్ధంగా మార్చుకోరు — వారు ఒకరు, ఇద్దరు లేక అనేకమంది అయినా. ఈ విషయాల్లో మనం నియమబద్ధంగా వ్యవహరిస్తే, ఆహారం విషయంలో ఖచ్చితంగా నిబంధనలు పాటిస్తే, క్రైస్తవులుగా మనం మన రుచులని దేవుని ప్రణాళికకు అనుగుణంగా తర్బీతు చేసుకుంటే మనం దేవుని చిత్తానికి అనుగుణమైన ప్రభావాన్ని చూపిస్తాం. అసలు సమస్య ఏమిటంటే, “మనం యదార్ధమైన ఆరోగ్య సంస్కర్తలుగా ఉండగోరుతున్నామా?” అన్నదే. CDTel 425.2
ఎప్పుడూ ఒకేలాంటి ఆహారం తినటం మానండి. ఆహారంలో మార్పులు చేస్తే ఆకలి బాగా వేస్తుంది. ఒకే రీతిగా ఉండండి. ఒకే భోజనానికి రకరకాల భోజనం బల్లమీద పెట్టి, తర్వాతి భోజనానికి అవేమీ లేకుండా చెయ్యకండి. ఈ విషయంలో పొదుపు పాటించండి. ప్రజలు ఫిర్యాదులు చేస్తే చెయ్యనివ్వండి. తమకు అనుకూలమైంది చాలినంత లేకపోతే వాళ్లు తప్పుపట్టనివ్వండి. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడూ మోషేమీద దేవుని మీద ఫిర్యాదులు చేసేవారు. ఆరోగ్య సంస్కరణ ప్రమాణాన్ని కొనసాగించటం మీ విధి. వ్యాధి బాధితులికి అనేకసార్లు స్నానాలు ఇవ్వటం ద్వారా కన్నా వారి ఆహారాన్ని నియంత్రించటం ద్వారా ఎక్కువ మేలు చెయ్యగలుగుతాం. CDTel 426.1
మాంసానికి వ్యయం చేసే ద్రవ్యంతో పండ్లు కొనండి. సరియైన జీవన విధానాన్ని ప్రజలకి చూపించండి. -లోని సేనిటేరియంలో మొదటినుంచి దీన్ని చేసి ఉంటే, దేవుడు సంతోషించే వాడు. ఆ కృషిని ఆయన అంగీకరించేవాడు.... CDTel 426.2
ఆహారం తయారు చెయ్యటంలో శ్రద్ధ, నిపుణత ఉపయోగించాలి. తనకు నియమించిన స్థానాన్ని డా. - నిర్వహిస్తుందని, ఆరోగ్యాశ్రమంలోని ఆహారం ఆరోగ్యసంస్కరణకి అనుగుణంగా తయారు చెయ్యాల్సిందిగా వంటగత్తెకి సూచిస్తుందని నా ఆశాభావం. ఒకడు తిండి ప్రీతి గలవాడైతే తనదే సరైన జీవన విధానమని అతడు వాదించకూడదు. అతడ తన క్రియా విధానం ద్వారా తన రుచులకి అభ్యాసాలకి తగినట్టుగా సంస్థను తీర్చిదిద్ద కూడదు. సంస్థ కు నాయకత్వం వహించే వారు తరచుగా సమాలోచనలు జరపాలి. వారు సంపూర్ణ సామరస్యంతో ముందుకి పోవాలి. CDTel 426.3
మాంసాహారానికి బానిస అయిన ఈ వ్యక్తో లేక ఆవ్యక్త మాంసం తినకుండా ఆరోగ్య ఆశ్రమంలో బతకలేనన్నాడు కాబట్టి మాంసం తినటం మంచిదని వాదించవద్దని మిమ్మల్ని బతిమాలుతున్నాను. చచ్చిన జంతువుల మాంసం తినిబతకటం అసభ్యజీవనం. దైవ ప్రజలుగా మనం మార్పుకోసం, దిద్దుబాటు కోసం పనిచేస్తూ, మాంసం ఇచ్చే బలం కన్నా ఎక్కువ బలం మెరుగైన ఆరోగ్యం ఇచ్చే ఆరోగ్యదాయక ఆహార పదార్థాలున్నాయని ప్రజలకి బోధించాలి. CDTel 426.4
ఈ యుగంలో ప్రబలుతున్న పాపం తిండిబోతుతనం - ఆబగా తినటం, తాగటం. భోజనం అనేకులు ఆరాధించే దైవం. ఆరోగ్య సంస్థకు సంబంధించిన వారు ఈ విషయాల్లో సరిఅయిన ఆదర్శాన్ని నెలకొల్పాలి. దైవ భీతితో ముందుకు సాగాలి. వారిని వక్రరుచులు నియంత్రించ కూడదు. ఆరోగ్యసంస్కరణ నియమాల విషయంలో వారికి మంచి అవగాహన ఉండాలి. అన్ని పరిస్థితుల్లోను వారు సంస్కరణ ధ్వజం కింద స్థిరంగా నిలిచి ఉండాలి. CDTel 427.1
డా. - ఆరోగ్యకరంగా వండటం ఎలాగో నీవు నేర్చుకోవాలన్నది నా ఆశాభావం. ఆరోగ్యదాయకమైన ఆహారం సమకూర్చాలి. ఈ దిశలో పొదుపు చెయ్యటానికి ప్రయత్నించకూడదు. మాంసంపై ఖర్చు తగ్గించి ఎక్కువ పండ్లు, కూరగాయలు వాడు. అప్పుడు మీ వంటల్ని అందరూ ఎంతో ఇష్టంగా తినటం చూసి ఆనందిస్తారు. తిన్న మంచి, ఆరోగ్య వంతమైన ఆహారం నష్టమని ఎన్నడూ భావించవద్దు. అది మంచి రక్తాన్ని కండరాల్ని ఉత్పత్తిచేసి అనుదిన విధుల నిర్వహణకు శక్తినిస్తుంది. CDTel 427.2
[మన పాఠశాలల్లో మాంసం వండటం నేర్పకూడదు-817] CDTel 427.3
[మన ఆరోగ్య సంస్థల్లో మాంసాహారులైన వైద్యుల్ని నియమించకూడదు -433] CDTel 427.4
ఉత్తరం 2, 1884 CDTel 427.5
721. -లోని ఆరోగ్య సంస్థ గురించి నేను చాలా ఆలోచిస్తున్నాను. అనేక ఆలోచనలు నా మనసుని నింపుతున్నాయి. వాటిలో కొన్నింటిని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. CDTel 427.6
ఆరోగ్యసంస్కరణ పై దేవుడు నాకు, నా ద్వారా మీకు, ఇచ్చిన వెలుగును నేను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాను. ఈ విషయాల్లో దేవుని చిత్తమేంటో అవగాహన చేసుకోటానికి మీరు జాగ్రత్తగా ప్రాన పూర్వకంగా ప్రయత్నిస్తున్నారా? బయటి వాళ్లకి మాంసం ఇవ్వాలని అది తక్కువ పరిమాణంలో ఇచ్చినా, చాలా మట్టుకి మాంసం స్థానాన్ని తీసుకునే రీతిగా జాగ్రగాను, నిపుణంగాను వంటకాల్ని తయారు చేస్తే, చచ్చిన జంతువుల మాంసానికి దూరంగా ఉండటానికి వారికి నేర్పించవచ్చునన్నది సాకు. అయితే మాంసంపై ఎక్కువ ఆధారపడే వంటగత్తె వంటచేస్తే, మాంసాహారానికి ఎక్కువ ప్రోత్సాహం లభించవచ్చు, లభిస్తుంది. అప్పుడు ఈ ఆహారానికి వక్ర రుచి అన్ని రకాల సాకులు సృష్టిస్తుంది. CDTel 427.7
పరిస్థితులు ఎలా చేజారిపోతున్నాయో - వండటానికి మాంసం లేకపోతే దానికి మారుగా ఏమి వండాలో తెలియకపోవటం - చూసినప్పుడు, వెంటనే మార్పు అవసరమని నేను గ్రహించాను. మాంసం అవసరమైన క్షయ రోగులుండవచ్చు. వారికి తమ గదుల్లో దాన్నివ్వండి. మాంసం తినకూడని వారిని మాంసం పట్ల వక్రరుచిగల వారిని శోధించకండి... మాంసం లేకుండా పనిచెయ్యలేమని మీరనుకోవచ్చు. ఒకప్పుడు నేనూ అలాగే అనుకున్నాను. కాని తన తొలి ప్రణాళికలో దేవుడు చచ్చిన జంతువుల మాంసం చేర్చలేదని నాకు తెలుసు. అలాంటి ఆహారాన్ని వక్రమైన రుచి మాత్రమే అంగీకరిస్తుంది.... మాంసం చాలామట్టుకు రోగ గ్రస్తమయ్యిందన్న వాస్తవం దాని వినియోగాన్ని పూర్తిగా విడిచి పెట్టటానికి నడిపించాలి. ఇప్పుడు నేను మాంసాన్ని పూర్తిగా విడిచి పెడున్నాను. ఇది చెయ్యటానికి కొందరికి చాలా కష్టం. తాగుబోతుకి తాగుడు మానటం ఎంత కష్టమో అంత కష్టం. కాని ఈ మార్పు చేసుకోటం వారికే మంచిది. CDTel 428.1