ఉత్తరం 76, 1895 CDTel 484.4
796. ఏ పరిస్థితుల్లోనూ ఎవరూ మాంసాన్ని రుచి చూడకూడదని చెప్పటం నావిధి అని నేనెన్నడూ భావించలేదు. అంత విస్తారంగా మాంసాహారానికి ప్రజలు అలవాటు పడ్డప్పుడు ఇది చెప్పటం విషయాల్ని మితిమీరి సాగదియ్యటమౌతుంది. సంచలనాత్మక ఉద్ఘాటనలు చెయ్యటం నా బాధ్యతని నేను ఎన్నడూ భావించను. నేనేమైతే చెబుతున్నానో దాన్ని నా విధి నిర్వహణలో భాగంగా చెబుతున్నాను. కాని నేను ఆచితూచి మాట్లాడున్నాను. ఎందుకంటే ఎవరూ ఇంకొకరికి మనస్సాక్షిగా వ్యవహరించటానికి నేను దోహదం చెయ్యకూడదన్నది నా అభిమతం..... CDTel 484.5
ఇక్కడ నాకు కలుగుతున్న అనుభవం అమెరికాలో నూతన సేవా క్షేత్రాల్లో నేను పొందిన అనుభవంలాంటిదే. తమ కుటుంబ పరిస్థితుల్ని బట్టి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తమ భోజనబల్లలపై పెట్టలేని కుటుంబాల్ని చూస్తుంటాను. విశ్వాసులు కాని ఇరుగు పొరుగు వారు ఇటీవల చచ్చిన జంతువుల మాంసం కొంత వారికి పంపిస్తుంటారు. ఆ మాంసంతో వారు సూపు చేసి పిల్లలున్న తమ పెద్ద కుటుంబాలకు బ్రెడ్, సూపు ఆహారంగా సరఫరా చేస్తారు. మాంసాహారం తాలూకు చెడుగును గురించి వారికి ఉపన్యాసం ఇవ్వటం నా విధి అని నేను భావించలేదు. అది ఎవరి విధీ కాదు. కొత్తగా విశ్వాసం స్వీకరించిన, తర్వాత భోజనం ఎక్కడ నుంచి వస్తుందో తెలియనంతగా పేదరికం కోరల్లో చిక్కుకున్న కుటుంబాలపట్ల నాకు జాలేస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం పై వారికి ఉపన్యాసమివ్వటం నా విధి కాదు. మాట్లాటానికి సమయముంది, మౌనంగా ఉండటానికి సమయం ఉంది. ఇలాంటి పరిస్థితులు సమకూర్చే తరుణం ఖండించే మాటలు, మందలించే మాటలు గాక ఉద్రేక పర్చే మాటలు, దీవించే మాటలు పలకటానికి తరుణం. తమ జీవితమంతా మాంసాహారం తీసుకున్నవారు దాన్ని కొనసాగించటంలో ఎలాంటి కీడూ చూడరు. వారి పట్ల దయ కనికరాలు కలిగి వ్యవహరించాలి. CDTel 485.1
(1909) 9T 163 CDTel 485.2
797. తిండిబోతుతనానికి అమితానుభవానికి వ్యతిరేకంగా పని చేస్తున్నప్పుడు మానవ కుటుంబం ఏ పరిస్థితికి లోనయ్యిందో దాన్ని మనం గుర్తించాలి. లోకంలోని వివిధ దేశాల్లో నివసించే ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని దేవుడు ఏర్పాట్లు చేస్తాడు. దేవుని జతపనివారు కావాలని ఆకాంక్షించేవారు తాము ఏ ఆహారం తినాలో ఏ ఆహారం తినకూడదో నిర్ధారించుకునే ముందు జాగ్రత్తగా పరిగణించాలి. మనం ప్రజాసామాన్యంతో కలసి ఉండాలి. ఆరోగ్య సంస్కరణను దాని తీవ్ర రూపంలో ఆచరించటానికి ఎవరి పరిస్థితులు సమ్మతించవో వారికి దాన్ని ఆ తీవ్ర రూపంలో బోధించటం జరిగితే వారికి మేలుకన్నా కీడు ఎక్కువ జరుగుతుంది. నేను బీదలకు సువార్త ప్రకటించేటప్పుడు తమకు ఏది బలవర్థకాహారమో దాన్ని తినాల్సిందని వారికి ఉపదేశించమని దేవుడు నన్ను ఆదేశిస్తాడు.” మీరు గుడ్లు తినకూడదని, పాలు లేదా మీగడ ఉపయోగించ వద్దని, ఆహారం తయారు చేసుకోటంలో వెన్న వాడకూడదని” వారికి చెప్పలేను. పేదలకు సువార్త ప్రకటించాలి. కాని ఖచ్చితమైన ఆహారాన్ని విధించాల్సిన సమయం ఇంకా రాలేదు. CDTel 485.3