Go to full page →

1—ఉపమాన బోధన COLTel 6

లోకంలో క్రీస్తు పరిచర్యలో ఏ సూత్రం కనిపిస్తుందో అదే సూత్రం ఆయన ఉపమాన బోధనలోను కనిపిస్తుంది. తన దివ్య గుణాని, జీవితాన్ని మనం గ్రహించేందుకుగాను క్రీస్తు మన స్వభావం కలిగి మన మధ్య నివసించాడు. మానవత్వంలో దైవత్వం వెల్లడయ్యింది. కనిపించే మానవ రూపంలో కనిపించని మహిమ వెల్లడయ్యింది. తెలిసిన దాన్ని బట్టి తెలియని వాటిని మనుషులు గ్రహించవచ్చు. పారలౌకిక విషయాలు ప్రాపంచిక విషయాల ద్వారా వెల్లడి అయ్యాయి. దేవుడు మానవుల రూపంలో ప్రకటితమవ్వటం జరిగింది. క్రీస్తు బోధనలో జరిగిందీ ఇదే. అదేంటంటే తెలిసిన వాటి ద్వారా తెలియని వాటిని ఉదహరించడం. ప్రజలకు బాగా తెలిసిన ఈ లోక సంగతుల ద్వారా దైవసత్యాన్ని విశదం చెయ్యటం. COLTel 6.1

“నేను నా నోరు తెరిచి ఉపమానరీతీగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులనన్నింటిని జన సమూహనమునకు ఉపమానరీతిగా బోధించెను” అని లేఖనం అంటుంది. మత్త 13:34:35. స్వాభావిక విషయాలు ఆధ్యాత్మిక విషయాల వివరణకు సాధనాలు. ప్రకృతి విషయాలు, క్రీస్తు శ్రోతల జీవితానుభవాలు, దైవ వాక్యంలోని సత్యాలతో జతపడి ఉన్నాయి. ఇలా స్వాభావిక ప్రపంచం నుండి ఆధ్యాత్మిక ప్రపంచానికి నడిపిస్తూ ఉన్న క్రీస్తు ఉపమానాలు లోకాన్ని దేవునితో అనుసంధానపర్చే గొలుసులో లింకులు. ప్రకృతి విషయాల గురించిన తన భోదనలో క్రీస్తు వేటిని తన సొంత హస్తాలతో చేసి వాటికి లక్షణాలన్ని శక్తుల్ని ప్రసాదించాడో వాటిని గూర్చి ఆయన ప్రస్తావిస్తున్నాడు. సృష్టి అయినవన్నీ ఆదిలో తమ పరిపూర్ణతలో దేవుని ఆలోచనలకు వ్యక్తీకరణగా నిలిచాయి. తన ఏదెను గృహంలోని ఆదామవ్వలకు ప్రకృతి దేవున్ని గూర్చిన జ్ఞానంతో నిండి ఉంది. దాని నిండా దేవుని ఉపదేశం ఉంది. జ్ఞానం కన్నుతో మాట్లాడింది, హృదయం దాన్ని అందిపుచ్చుకుంది. ఎందుచేతనంటే అవి దేవుని సృష్టితో సంప్రదింపులు జరిపాయి. పరిశు దులైన ఈ జంట మహోన్నత దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన వెంటనే ప్రకృతిలో ఉన్న దేవుని ముఖ ప్రకాశం మాయమయ్యింది. భూగ్రహం ఇప్పుడు పాపంతో కలుషితమై భ్రష్టమయ్యింది. అయినా దాని భ్రష్ట స్థితిలో సయితం దానిరమణీయతలో చాలా భాగం మిగిలియున్నది. దేవుని ఉపమాన పాఠాలు చెరిగిపోలేదు. సవ్యంగా అవగాహన చేసుకుంటే ప్రకృతి దాని సృష్టికర్తకు సాక్షిగా నిలుస్తుంది. COLTel 6.2

క్రీస్తు దినాల్లో ఈ పాఠాల్ని విస్మరించటం జరిగింది. సృష్టిలో దేవున్ని గుర్తించడం మనుషులు దాదాపు మర్చిపోయారు. మనవ కోటి పాప ప్రవృత్తి అందమైన సృష్టి ముఖానికి మసిపూసింది. అందుచేత దేవుని కనపర్చే బదులు ఆయన సృష్టి కార్యాలు ఆయన్ని మరుగుపర్చే అడ్డుగోడ లయ్యాయి. మనుషులు “సృష్టికర్తకు ప్రతిగా స్పష్టమును పూజించి సేవించిరి’ ఈ రీతిగా అన్య ప్రజలు “తమ వాదములయందు వ్యర్ధులైరి”. రోమా 1: 25,21 ఇశ్రాయేలులో ఇదే జరిగింది. మనుషులు మానవ సిద్ధాంతాల్ని దేవుని సిద్ధాంతాల స్థానంలో ఉంచి గౌరవించారు. ప్రకృతి విషయాలే కాదు, బలి అర్పణ, వ్యవస్థ దేవున్ని వెల్లడించడానికి ఇవ్వబడిన లేఖనాలు సయితం వక్రీకరణకు గురి అయి దేవుని మరుగుపర్చటానికి సాధనాలయ్యాయి. COLTel 7.1

సత్యాన్ని అడ్డుకునే ప్రతీ బంధకాన్ని తొలగించటానికి క్రీస్తు ప్రయత్నిం చాడు. ప్రకృతి ముఖాన్ని కప్పిన తెరను తొలగించి, ఆద్యాత్మిక మహిమను ప్రదర్శించటానికి సృష్టి అయిన సమస్తాన్ని ఆవిష్కరించటానికి క్రీస్తు లోకంలోకి వచ్చాడు. ఆయన మాటలు ప్రకృతి బోధనల్ని బైబిలు బోధనల్ని నూతన దృక్కోణంలో చూపించి వాటిని కొత్త ప్రత్యక్షతగా తీర్చిదిద్దాయి. COLTel 7.2

యేసు చక్కని పుష్పాన్ని కోసి దాన్ని పిల్లల చేతుల్లో పెట్టి వారు తన ముఖంలోకి -- తండ్రి వద్ద నుండి వస్తున్న సూర్యకాంతిలో తాజాగా ప్రకాశవంతగా ఉన్న ఆ ముఖంలోకి -- చూస్తుండగా అడవి పువ్వులు ఏలాగు నెదగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు ఒడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సాలొమోను సహితము వీటిలో నొకదాని వలెనైనను అలంకరింపబడలేదు” అన్న పాఠం బోధించాడు. “నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన యెడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింప జేయునుగదా? COLTel 7.3

కొండమీది ప్రసంగంలో పిల్లలూ, యువతనే గాక ఇంకా ఇతరుల్ని కూడా ఉద్దేశించి ఈ మాటల్ని ఆయన అన్నాడు. జనసమూహాన్ని ఉద్దేశించి ఈ మాటల్ని పలికాడు. ఆ జన సమూహాల్లో విచారాలు ఆందోళనలు ఆశాభంగాలు దు:ఖాలు ఉన్న స్త్రీలు పురుషులు ఉన్నారు. ప్రసంగాన్ని కొనసాగిస్తూ యేసు ఇలా అన్నాడు. కాబట్టి ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతించకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. అప్పుడు చేతులు బార్లా చాపి చుట్టు ఉన్న జనసమూహంతో “కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, ఆప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును” అన్నాడు మత్త 6:28-33. COLTel 8.1

పొలంలోని పువ్వలికి గడ్డికి స్వయాన తానే ఇచ్చిన వర్తమానాన్ని క్రీస్తు ఇలా వివరించాడు.ఆ వర్తమాన్ని ప్రతీ పువ్వులోను ప్రతి గడ్డిపోచలోను మనం చదువుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు.ఆయన మాటలు నిశ్చయతతో కూడిన మాటలు, దేవుని పై ధృడ నమ్మకాన్ని పుట్టించే మాటలు. COLTel 8.2

సత్యం విషయంలో ఆయన దృక్పధం ఎంత విశాలమైంది. ఆయన బోధన ఎంత విస్తృతి గలది అంటే దాన్ని ఉదహరించేందుకు ఆయన ప్రకృతిలోని ప్రతీ భాగాన్ని వినియోగించుకున్నాడు. దృష్టి అనుదినం ఏ దృశ్యాలపై నిలుస్తుంటుందో వాటన్నిటికి సత్యంతో సంబంధం ఉంది. అందుకే ప్రకృతి ప్రభువు ఉపమానాలతో నిండి ఉంది. COLTel 8.3

ప్రజలు తమకు రక్షణ జ్ఞానం ఇచ్చే సత్యవాక్కుల్ని గ్రహించగలిగేటట్లు క్రీస్తు తన పరిచర్య పూర్వ భాగంలో వారితో అతి సామాన్యమైన రీతిగా మాట్లాడారు. అయినా అనేకుల హృదయాల్లో సత్యం వేరుపారులేదు. కొద్ది కాలంలోనే అది నశించింది. “ఇందు నిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూసి చెవులారా విని, హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది. వారి చెవులు వినుటకు మందములైనవి. వారు తమ కన్నులు మూసుకొనియున్నారు. అంటున్నాడాయన. మత్త 13:13-14 COLTel 8.4

పరిశోధనను ప్రోత్సహించాలన్నది క్రీస్తు కోరిక. ఆసక్తి లేని వారిని మేల్కొని వారి హృదయాల్లో సత్యాన్ని నాటటానికి ఆయన ప్రయత్నించాడు. ఉప మాన బోధనకు మంచి ఆదరణ ఉంది అది యూదుల్నే కాదు ఇతర జాతుల ప్రజల్ని కూడా అకట్టుకుంది. ఇంతకన్నా శక్తిమంతమైన పద్దతి వేరొకటి లేదు. ఆయన శ్రోతలు ఆధ్యాత్మిక సంగతుల జ్ఞానాన్ని ఆశించిన ట్లయితే వారు ఆయన మాటల్ని గ్రహించగలిగేవారు. ఎందుకంటే నిజంగా గ్రహించగోరేవాడికి విశదం చెయ్యటానికి ఆయన ఎప్పుడు సిద్ధమే. COLTel 9.1

మళ్లీ ప్రజలకి అందించాల్సిన సత్యాలు క్రీస్తుకి ఉన్నాయి. వాటిని అంగీకరించటానికి లేక అవగాహన చేసుకోవటానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఆయన ఉపమానరీతిగా మాట్లాడటానికి ఇదొక కారణం. తన బోధన జీవిత దృశ్యాలు అనుభవాలు లేక ప్రకృతిలో అనుసంధానపర్చడం ద్వారా ఆయన ప్రజల దృష్టిని ఆకర్షించి వారి మనసుల్ని ఆకట్టుకున్నాడు. తదనంతరం ఆయన తన బోధనలో వినియోగించిన సాధనాల్ని ఆ ప్రజలు చూసినప్పుడు వారు ఆ దివ్య బోదకుని బోధనల్ని స్పురణకు తెచ్చుకునేవారు. పరిశుద్దాత్మ ప్రభావానికి తావిచ్చన మనసులికి రక్షకుని బోధనల ప్రాధాన్యం ఇంతలంతలుగా గ్రాహ్యమయ్యేది. మర్మాలు స్పష్టమయ్యేవి. గ్రహించడం కష్టమైన విషయాలు చక్కగా బోధపడేవి. COLTel 9.2

యేసు ప్రతీ హృదయంలోకి ప్రవేశించే మార్గాన్ని అన్వేషించేవాడు. రకరకాల ఉదాహరణల వినియోగం ద్వారా వివిద రకాలుగా సత్యాన్ని సమర్పించటమే కాదు వివిధ శ్రోతల్ని ఆకట్టుకునేవాడు. ప్రజల దినదిన జీవితంలోని పరిసరాల నుంచి తీసుకున్న ఛాయా రూపక చిత్రాల ద్వారా వారిలో ఆసక్తి రేకెత్తించేవాడు. రక్షకుని బోధ విన్నవారెవ్వరు ఆయన తమను పరిగణలోకి తీసుకోలేదని గాని లేక విస్మరించాడని గాని భావించలేదు. అతిదీనులు, ఘోర పాపులు దయతో మాట్లాడున్న స్వరాన్ని ఆయన బోధనలో విన్నారు. COLTel 9.3

ఉపమానరీతిగా ఆయన బోధనకి ఇంకో కారణం ఉంది. తన చుట్టు మూగిన జన సమూహంలో యాజకులు, రబ్బీలు, శాస్త్రులు పెద్దలు, హేరోదీయులు, అధికారులు, లోకాన్ని ప్రేమించి మన దురభిమానులైన అత్యాశపరులైన మనుషులు ఉన్నారు. వీరు ఆయనలో ఏదో తప్పు పట్టుకోవాలని కని పెడుతున్నారు. తాను పలికే మాటలని బట్టి తనను తప్పు పట్టి లోక ప్రజల్ని ఆకట్టుకుంటున్న ఆయన్ని ఇక ఎన్నడు మాట్లాడకుండా శిక్షేంచేందుకు వారి గూఢచారులు రోజుకు రోజు ఆయన్ని వెంబడిస్తున్నారు. రక్షకుడు ఈ మనుషుల ప్రవర్తనను గ్రహించాడు. సన్ హెడ్రిలో ఈ మనుషులు తప్పు పట్టడానికి ఆస్కారం లేని విధంగా ఆయన సత్యాన్ని బోధించాడు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వంచనను దుర్మార్గాన్ని ఉప మానాల ద్వారా మందలించాడు. తీవ్రంగా ఖండించే సత్యాన్ని వారికి సున్నితమైన అలంకారిక భాషలో అందించాడు. ఖండిస్తూ నేరుగా మాట్లాడి ఉంటే, వారు ఆయన వర్తమానాల్ని వినేవారు కాదు. కొద్ది కాలంలోనే ఆయన పరిచర్యకు అంతం పలికేవారు. గూఢచారులు తప్పు పట్టటానికి తావియ్యకుండానే తప్పును ఎండగడుతూ ఆయన సత్యాన్ని విశదపర్చాడు. యదార్ధ హృదయలు ఆయన బోధనల వల్ల మేలు పొందారు. దేవుని సృష్టిలోని విషయాల వల్ల దైవ జ్ఞానం, దేవుని అపార కృప విశదం చెయ్యబడ్డాయి. ప్రకృతి ద్వారాను జీవితానుభవాల ద్వారాను దేవుడు మనుషులకి బోధించాడు. “ఆయన అదృశ్య లక్షణములు... జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి.” రోమా 1:20 COLTel 10.1

రక్షకుని ఉపమాన బోధనలో వాస్తవిక “ఉన్నత వ్యిద్య”లో ఏమేమి ఉండాలో అన్నదాన్ని గూర్చిన సూచన ఉన్నది. లోతైన విజ్ఞాన శాస్త్ర సత్యాల్ని క్రీస్తు మనుషులకి బయలుపర్చేవాడే. అనేక శతాబ్దాల పాటు పరిశ్రమిస్తేనే గాని అంతుచిక్కని మర్మాల్ని బహిర్గతం చేసేవాడు. కాలం చివర వరకు ఆలోచనకు అంశాన్ని అవిష్కరణలకు ప్రేరణను ఇచ్చే విజ్ఞాన శాస్త్రపరమైన సూచనలు చేసేవాడే. కాని ఇది ఆయన చెయ్యలేదు. ఉత్సుకతను తృప్తిపర్చటానికి గాని లేక లోకసంబంధమైన గొప్పతనానికి తులుపు తెరవడం ద్వారా మానవుడికి అత్యాశను తృప్తి పర్చటానికి గాని ఆయన ఒక్కమాట అనలేదు. తన బోధన అంతటిలోను క్రీస్తు మానవుడి మనసును అనంత దైవం మనసుతో అనుబంధపర్చటానికి ప్రయత్నించాడు. దేవుని గురించి ఆయన వాక్యం గురించి లేదా ఆయన కార్యాల గురించి మానవ సిద్ధాంతాలు ఆధ్యయనం చెయ్యాల్సిందిగా ప్రజలకి ఆయన సూచించలేదు. తన సృష్టికార్యాల్లోను తన వాక్యంలోను, తన కృపల్లోను ప్రదర్శితమైనట్లు తనను వీక్షించాల్సిందిగా ఆయన ప్రజలకు బోధించాడు. COLTel 10.2

క్రీస్తు ఆపురూప స్పష్ట సిద్ధాంతాన్ని బోధించలేదు. ప్రవర్తన నిర్మాణానికి అవసరమైనదాన్ని మానవడు దేవున్ని తెలుసుకొని సామర్ధ్యాన్ని విస్తృతపర్చి మేలు చెయ్యటానికి అతడి శక్తిని వృద్ధిపర్చేదాన్ని ప్రబోధించాడు. జీవిత సరళకి సంబంధించిన నిత్య జీవానికి సంబంధించిన సత్యాల్ని గూర్చి ఆయన మనసులతో మాట్లాడాడు. COLTel 11.1

ఇశ్రాయేలీయుల విద్య విషయంలో మార్గనిర్దేశం చేసింది ఆయనే. తన ఆజ్ఞలు కట్టడల్ని గురించి ప్రభువిలా అన్నాడు. “నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ ఇంట కూర్చిండునప్పుడును త్రవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అది నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండువలెను. నీ ఇంటి ద్వార బంధములు మీదను నీ గవునుల మీదను వాటిని వ్రాయవలెను. ద్వితి 6:7-9 ఈ ఆజ్ఞను ఎలా నెలవేర్చాల్సి ఉందో యేసు తన బోధనలో చూపించాడు. దేవుని రాజ్య నియమాలు నిబంధనల్ని వాటి సౌందర్యం ప్రశస్థి బయలుపర్చేటట్లు ఎలా ప్రదర్శించగలమో ఆయన చూపించాడు. ఇశ్రాయేలుని తన ప్రత్యేక ప్రతినిధులుగా ప్రభువు తర్బీతు చేస్తున్నప్పుడు వారికి కొండలు లోయలు నడుమ గృహాలిచ్చాడు. తమ గృహ జీవితంలోను తమ మతపరమైన సేవల్లోను వారికి ప్రకృతితోను దైవ వాక్యంతోను ప్రతినిత్యం సంబంధము ఏర్పేడేది. ఈ విధంగా సరస్సు పక్క, పర్వతం పక్క, పొలాలు చెట్లతోపుల నడుమ, వారు ప్రకృతి దృశ్యాలు ఎక్కడ చూడగలిగారో అక్కడ తన శిష్యులికి క్రీస్తు బోధించాడు.ఆ విషయాల్ని తన బోధనలో ఉదాహరణంగా వినియోగించుకునేవాడు. క్రీస్తును గురించి నేర్చుకునే కొద్ది ఆయనతో సహకరించటానికి ఆయన సేవలో పని చెయ్యటానికి వారు తమ జ్ఞానాన్ని వినియోగించుకున్నారు. COLTel 11.2

కనుక మనం సృష్టిద్వారా సృష్టి కర్తతో పరిచయం ఏర్పర్చుకోవాలి. ప్రకృతి గొప్ప పాఠ్య గ్రంధం. ఆయన గుణాల్ని గురించి ఇతరులికి బోధించటంలోను తప్పిపోయిన గొర్రెల్ని దేవుని దొడ్డిలోకి చేర్చటంలోను ప్రకృతి గ్రంధాన్ని లేఖనాలతో జోడించి మనం వినియోగించాలి. మనం దేవుని కార్యాల్ని ఆధ్యయనం చేసేటప్పుడు పరిశుద్దాత్మ మనసులో దృఢనమ్మకం పుట్టిస్తాడు. అది హేతువాదం ఉత్పత్తిచేసే నమ్మకం కాదు. మనసు దేవున్ని తెలుసుకోలేనంత చీకటిమయమైతేనే గాని, కన్ను ఆయన్ని కానలేనంత మసకపడితేనే గాని, చెవి ఆయన స్వరం వినలేనంత మందగిల్లితేనేగాని లోతైన భావం గ్రాహ్యం కాదు. లిఖిత వాక్యంలోని గంభీర ఆధ్మాతిక సత్యాలు హృదయంలో నాటుకోవు. COLTel 12.1

ప్రకృతి నుంచి ప్రత్యక్షంగా వస్తున్న పాఠాల్లోని నిరాండంబరత స్వచ్ఛత వాటికి అత్యున్నత విలువను సమకూర్చుతున్నాయి. ఈ మూలం నుండి వచ్చే బోధన అందరికి అవసరం.ఆత్మను పాపం నుండి ప్రాపంచిక ఆకర్షణల నుండి దూరంగా ఉంచి, పవిత్రత, శాంతి,దేవుని దిశగా నడిపించే గుణం స్వతహాగా ప్రకృతి సౌందర్యంలోనే ఉంది. తప్పుగా విజ్ఞాన శాస్త్రం తత్వజ్ఞానంఅని పిలిచే మానవ సిద్ధాంతాలు ఊహగానాలతో తరుచు విద్యార్ధుల మనసులు నిండి ఉంటాయి. అవి ప్రకృతితో పరిచయం ఏర్పర్చు కోవడం అవసరం. సృష్టికి క్రైస్తవానికి ఒకే దేవుడని వారికి నేర్పించాలి. స్వాభావికం ఆధ్యాత్మిక ఈ రెంటికి మధ్య ఉన్న సామారస్యాన్ని గురించి వారికి నేర్పించాలి. వారి కళ్ళు చూసే సమస్తం వారి చేతులు మట్టుకునే సమస్తం ప్రవర్తన నిర్మాణానికి ఒక పాఠం కావాలి. మానసిక శక్తులు ఇలా బలో పేతమౌతాయి. ప్రవర్తన వృద్ధి చెందుతుంది. జీవితమంతా సమున్నతమౌతుంది. COLTel 12.2

ఉపమాన బోధనలో క్రీస్తు ఉద్దేశం సబ్బాతు ఉద్దేశంతో ప్రత్యక్ష సంబంధము కలిగి ఉంది. తాను చేసిన సృష్టి కార్యాల్లో తనను మనుషులు గుర్తించేందుకు తన సృజన శక్తికి జ్ఞాపకార్ధ చిహ్నంగా దేవుడు సబ్బాతును మనషులికిచ్చాడు. సృష్టిలో సృష్టికర్తమహిమను వీక్షించాల్సిందిగా సబ్బాతు మనల్ని కోరుతున్నది. మనం ఇది చెయ్యాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి క్రీస్తు తన ప్రశస్త పాటాల్ని స్వాభావిక విషయాల సౌందర్యంతో ముడి పెట్టాడు. దేవుడు మన కోసం ప్రకృతిలో రాసి ఉంచిన వర్తమానాల్ని మనం పరిశుద్ద విశ్రాంతి దినం నాడు ఆధ్యయనం చేయ్యాలి.ఈ ఉప మానాల్ని రక్షకుడు ఎక్కడ చెప్పాడో ఆ పొలాల్లో చెట్ల తోపుల్లో, ఊరు బయట, ఆకాశం కింద, పచ్చిక బయళ్ళలో, పుష్పాల నడుమ వీటిని మనం అధ్యయనం చెయ్యాలి. మనం ప్రకృతికి అతి సమీపంగా వచ్చినప్పుడు క్రీస్తు మనతో ఉండటం వాస్తవమౌతుంది. తన సమాధానాన్ని గూర్చి ప్రేమను గూర్చి ఆయన మన హృదయాల్లో మాట్లాడాడు. COLTel 13.1

క్రీస్తు తన బోధనను విశ్రాంతి దినంతోనే కాదు. వారం దినాల పనితో కూడా జతపర్చాడు. నాగలి దున్ని, విత్తనాలు చల్లే కర్షకుడికి ఆయన జ్ఞానం ఇచ్చాడు. దున్నటం, విత్తటం, కోయ్యటంలో హృదయంలో తను చేసే కృపా పరిచర్యకు సాదృశ్యాన్ని చూడాలని మనకు భోదిస్తున్నాడు. అలాగే ఉప యోగకరమైన ప్రతీ పనిలో జీవింతలో ప్రతీ సహవాసంలో మనం దైవ సత్యాన్ని గూర్చిన ఓ పాఠాన్ని కనుగొనాల్సిందిగా ఆయన కోరుతున్నాడు. అప్పుడు మన దినవారీ శ్రమను గురించి ఆలోచించి ఆలోచించి దేవున్ని మర్చిపోం. అది నిత్యం మన సృష్టికర్తను విమోచకున్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. గృహ సంబంధమైన వృత్తి సంబంధమైన విచారాలన్నింటి నుంచి దేవుని గూర్చిన ఆలోచన బంగారు నూలులాగ కొనసాగుతుంది. అప్పుడు మనకు దేవుని ముఖం మీది మహిమ ప్రకృతి ముఖం మీద కనిపిస్తుంది. పరలోక సత్యాల్ని గూర్చి నూతన పాఠాలు మనం నిత్యం నేర్చుకుంటాం. ఆయన పవిత్ర రూపంలోకి మార్పు చెందుతాం. ఇలా మనం“యెహోవా చేత ఉపదేశము పొందుతాం. మనం ఏ స్థితిలో పిలుపు పొందుతామో ఆ స్థితిలోనే “దేవునితో సహవాసము కలిగి” ఉంటాం. యెష 54:13, 1 కొరింథి 7:24 COLTel 13.2