Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

యుగయుగాల ఆకాంక్ష

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    78—కల్వరి

    “వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ.... ఆయనను సిలువచేసిరి.”DATel 838.1

    “కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమపొందెను.” హెబ్రీ 13:12. దేవుని ధర్మశాస్త్రం ఉల్లంఘనకు ఆదామవ్వలు ఏదెను నుంచి బహిష్కృతులయ్యారు. మన ప్రత్యామ్నాయమైన క్రీస్తు యెరుషలేము వెలపల మనకోసం శ్రమపడవలసి ఉన్నాడు. మహాపరాధులు హంతకులు ఏ గుమ్మం వెలపల ఉరితియ్యబడేవారో ఆ గుమ్మం వెలపల ఆయన మరణించాడు. ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి, “క్రీస్తు మనకోసము శాపమై మనను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను” గలతీ 3:13-14.DATel 838.2

    పెద్ద జన సమూహం తీర్పు హాలునుంచి కల్వరి వరకు యేసుని వెంబడించింది. ఆయనకు విధించిన మరణ శిక్షను గూర్చిన వార్త యెరుషలేమంతా తెలిసి అన్ని తరగతులు వర్గాల ప్రజలు సిలువవేసే స్థలానికి చేరుకున్నారు. క్రీస్తు తన్నుతాను తమకు అప్పగించుకున్నట్లయితే ఆయన శిష్యుల్ని అనుచరుల్ని హింసించకూడదన్న ఒప్పందం యాజకులు అధికారుల మధ్య జరిగింది. కనుక ఆ పట్టణం నుంచి దాని పరిసరాల నుంచి విశ్వాసులు వచ్చి రక్షకుడు వెంట వెళ్తున్న జనసముహంతో కలిసివెళ్లారు.DATel 838.3

    సిద్ధం చేసిన సిలువను దెబ్బలతో రక్తం కారుతున్న ఆయన భుజాలపై పెట్టారు. బరబ్బ సహచరు లిద్దరు యేసుతో పాటు సిలువ పొందాల్సి ఉన్నారు. వారి మీద కూడా సిలువు పెట్టారు. రక్షకుడున్న బలహీన స్థితిలో ఆయనపై ఉన్నభారం ఆయన మోయలేనంత బరువుగా ఉంది. శిష్యులతో కలిసి చేసిన పస్కా భోజనం తర్వాత ఆయన ఆహారం గాని పానీయంగాని తీసుకోలేదు. గెత్సెమనే తోటలో సాతాను శక్తులతో సంఘరణలో ఆయన చాలా బాధ ననుభవించాడు. తన అప్పగింతవలన కలిగి వేదనను భరించాడు. శిష్యులు తనను విడిచిపెట్టి పారిపోడం చూసి కుమిలిపోయాడు. అన్నవద్దకు, ఆతర్వాత కయప వద్దకు పిలాతు వద్దకు ఆయన్ని తీసుకువెళ్లారు. పిలాతు వద్ద నుంచి హేరోదు వద్దకు అక్కడ నుంచి మళ్లీ పీలాతు వద్దకు ఆయన్ని తిప్పారు. అవమానం నుంచి సరికొత్త అవమానానికి, ఎగతాళి నుంచి ఎగతాళికి రెండుసార్లు కొరడాదెబ్బలకు ఆయన్ని గురిచేసిన సన్నివేశాలు ఆ రాత్రంతా ఒకదాని వెంట ఒకటి జరిగాయి. అవి ఆయన ఆత్మను ఎంతో క్షోభింపజేశాయి. క్రీస్తు వాటన్నిటిని జయించాడు. దేవుని మహిమ పర్చడం తప్ప ఆయన ఒక్కమాట ఎవర్నీ అనలేదు. తనకు జరిగిన తీర్పు ప్రహసనంలో ఆదినుంచి అంతం వరకు ఆయన స్థిరంగా మర్యాదగా ప్రవర్తించాడు. అయితే రెండోసారి కొరడా దెబ్బల దరిమిలా తనపై సిలువను మోపినప్పుడు మానవ నైజం గల ఆయన ఆ భారాన్ని మోయలేకపోయాడు. మూర్చిల్ని భారమైన ఆ సిలువ కింద పడిపోయాడు.DATel 838.4

    ఆయన వెంట వెళ్తున్న జనసమూహం ఆయన బలహీనతను తడబడున్న ఆయన అడుగుల్ని చూశారుగాని ఆయనపట్ల దయ చూపించలేదు. భారమైన ఆ సిలువను మోయలేకపోతున్నందుకు ఆయన్ని వెక్కిరించారు. ఎకసక్కెం చేశారు. మళ్లీ ఆ సిలువను ఆయనకు ఎత్తారు. మళ్లీ ఆయన దాన్ని మొయ్యలేడని తన హింసకులు గుర్తించారు. సిగ్గుకరమైన ఆ భారాన్ని మొయ్యడానికి ఎవరు దొరుకుతారా అని వారు ఆందోళనగా చూస్తున్నారు. యూదులు ఈ బరువును మొయ్యడానికి లేదు. ఎందుకంటే దాని వల్ల కలిగే అపవిత్రత వారిని పస్కాను ఆచరించకుండా చేస్తుంది. ఆ సిలువను మొయ్యడానికి ఎవ్వరూ, తుదకు ఆ మూకలో ఉన్న వారు కూడా, సిద్ధంగా లేరు.DATel 839.1

    ఈ సమయంలో కురేనీయుడైన సీమోను అనే ఒక పరదేశి తన గ్రామం నుంచి వస్తూ ఆ జనాన్ని కలుసుకున్నాడు. ఆ మూక చేస్తున్న ఎగతాళి విన్నాడు. యూదుల రాజుకి దారివ్వండి అన్నమాటలు పదేపదే ప్రజలనడం విన్నాడు. ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపడుతూ నిలబడిపోయాడు. అతడు సానుభూతి వ్యక్తం చెయ్యడం చూసి మూక అతణ్ని పట్టుకుని అతడి భుజాల మిద ఆ సిలును మోపింది.DATel 839.2

    సీమోను యేసుని గూర్చి విన్నాడు. అతడి కుమారులు యేసు విశ్వాసులు. కాని అతడు మాత్రం క్రీస్తు అనుచరుడుకాడు. సిలువను కల్వరి వరకు మొయ్యడం సీమోనుకి మేలు చేసింది. విధివశాత్తు జరిగిన ఆ కార్యానికి అతడు తన బతుకంతా కృతజ్ఞుడై నివసించాడు. క్రీస్తు సిలువను ఇష్టపూర్వకంగా ఎత్తుకోడానికి సర్వదా ఆ భారం కింద ఆనందంగా నిలవడానికి ఈ అనుభూతి అతడికి స్ఫూర్తి నిచ్చింది.DATel 840.1

    ఆ నిరపరాధిని క్రూరమైన తన • మరణానికి తీసుకువెళ్తున్న జనసమూహంలో చాలా మంది స్త్రీలున్నారు. వారి గమనం క్రీస్తుమీద నిలిచి ఉంది. వారిలోని కొందరు ఆయన్ని చూశారు. కొందరు జబ్బుగా ఉన్న తమ ప్రియుల్ని ఆయన వద్దకు తీసుకువెళ్లారు. కొందరు ఆయన వలన స్వస్తత పొందిన వారే. జరిగిన సంగతుల కథనం వారు విన్నారు. ఎవరి గురించి తమ హృదయాలు నీరవుతున్నాయో బద్దలవ్వడానికి సిద్ధమవుతున్నాయో ఆయనపట్ల ఆ జనం ప్రదర్శిస్తోన్న ద్వేషం వారిని ఆశ్చర్యపర్చింది. ఉన్మాదులైన ఆ ప్రజల చర్యలతో, యాజకులు అధికారుల కోపంతో నిండిన మాటలతో నిమిత్తం లేకుండా ఈ స్త్రీలు తమ సానుభూతిని బహిరంగంగా వ్యక్తం చేశారు. యేసు మూర్చిల్లి సిలువ కింద పడినప్పుడు వారుకేకలు వేస్తూ విలపించారు.DATel 840.2

    క్రీస్తు గమనాన్ని ఆకర్షించింది ఇదొక్కటే. లోకపాపాన్ని భరిస్తూ తీవ్ర బాధకు గురి అయినప్పటికీ దుఃఖించే వారి విషయంలో ఆయన ఉదాసీనంగా లేడు. వారు ఆయన్ని విశ్వసించిన వారు కారు. ఆయన దేవుని వద్దనుంచి వచ్చిన వానిగా గుర్తించి వారు విలపించడం లేదు. వారు మానవీయతతో కరుణతో చలించి రోదిస్తున్నారు. వారి సానుభూతిని ఆయన తృణీకరించలేదు. కాని ఆయన హృదయంలో వారి పట్ల అది మరింత సానుభూతి పుట్టించింది. యేసు వారితో ఇలా అన్నాడు, “యెరుషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి; మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడ్వుడి.” తన ముందున్న దృశ్యంలో యెరుషలేము నాశనమయ్యే సమయాన్ని యేసు చూశాడు. ఇప్పుడు తన నిమిత్తం ఏడుస్తున్న స్త్రీలలో చాలామంది తమ పిల్లలతో మరణించనున్నారు.DATel 840.3

    యేసు ఆలోచనలు యెరుషలేము నాశనం నుంచి ఇంకా విస్తృతమైన తీర్పు పైకి వెళ్లాయి. పశ్చాత్తాపపడని యెరుషలేము నాశనంలో లోకానికి రానున్న చివరి నాశనానికి సూచనను ఆయన చూశాడు. “అప్పుడు - మా మిద పడుడని పర్వతములతోను, మమ్ముకప్పుడని కొండలతోను జనులు చెప్పసాగుదురు. వారు పచ్చిమ్రానుకే యీలాగు చెప్పిన యెడల ఎండిన దానికేమి చేయుదురో.” అన్నాడు. పచ్చిమాను నిరపరాధి అయిన విమోచకుడైన ఆయన్నే సూచిస్తోంది. పాపంపట్ల తన ఉగ్రతను తన కుమారుడి పై పడడానికి తండ్రి సమ్మతించాడు. మనుషుల పాపాల నిమిత్తం యేసు సిలువ మరణం పొందనున్నాడు. కనుక పాపంలో కొనసాగే పాపి ఏమి బాధను భరిస్తాడు? పశ్చాత్తాపం పొందనివారు, విశ్వసించని వారు మాటల్లో వర్ణించలేని దుఃఖాన్ని చింతను అనుభవిస్తారు.DATel 841.1

    రక్షకుడి వెంబడి కల్వరికి వెళ్తున్న జనసమూహంలో చాలా మంది నాడు ఆయన విజయుడుగా యెరుషలేములో ప్రవేశించినప్పుడు సంతోషంగా హోసన్న నినాదాలు చేసి ఈత మట్టలు ఊపినవారే. అప్పుడు దానికి ప్రజాదరణ ఉంది కాబట్టి ఆయనకు నివాళులర్పించిన వారిలో చాలామంది “వానిని సిలువవేయుము వానిని సిలువ వేయుము” అని కేకలు వేస్తున్నారు. క్రీస్తు యెరూషలేములోకి విజయుడుగా ప్రవేశించినప్పుడు శిష్యుల ఆశలు ఆకాశాన్నంటాయి. వారు రక్షకుణ్ని అంటిపట్టుకుని తిరిగారు. ఆయనతో కలిసి ఉండడం గొప్ప గౌరవంగా భావించారు. ఇప్పుడు ఆయనకు వచ్చిన కష్టంలో శ్రమలో ఆయనకు దూరంగా ఉండి ఆయన్ని వెంబడించారు. వారి గుండెల నిండా దుఃఖం ఉంది. నిరాశతో నిస్పృహతో నీరుగారిపోయారు. యేసు చెప్పిన ఈ మాటలు ఎంత వాస్తవం : “ఈ రాత్రి మీరందరు నా విషయమై అభ్యంతరపడెదరు ఏలయనగా - గొట్టెల కాపరిని కొట్టుదురు, మందలోని గొట్టెలు చెదరిపోవును.”DATel 841.2

    ఖైదీలు వధ్యా సలానికి వచ్చాక వారిని సిలువలికి మేకులతో కొట్టారు. తమను సిలువలపై పెడ్తున్న వారి చేతుల్లోనుంచి విడిపించుకోడానికి ఆ ఇద్దరు దొంగలూ అటూఇటూ కొట్టుకున్నారు. కాని క్రీస్తు అలాంటిదేమీ చెయ్యలేదు. యేసు తల్లి ప్రియ శిష్యుడు యోహాను చేయూతతో కుమారుడి వెంట కల్వరికి వెళ్లింది. సిలువ భారం కింద ఆయన సొమ్మసిల్లి పడడం చూసింది. గాయాలతో రక్తం కారుతున్న ఆయన తలకింద చెయ్యి పెట్టి ఒకప్పుడు తన ఒడిలో ఊగిన ఆ తలను కడగాలనుకుంది. కాని ఆమెకు ఆ ఆధిక్యత దొరకలేదు. యేసు తన శక్తిని ప్రదర్శించి తన శత్రువుల చేతుల్లోనుంచి తప్పించుకుంటాడని శిష్యులతో పాటు ఆమెకూడా నమ్మింది. అయితే ఆయన ముందే చెప్పిన మాటల్ని గుర్తుచేసుకుని వాటి ప్రకారంగానే ఇప్పుడు జరగడం చూసినప్పుడు ఆమె హృదయం మళ్లీ కుంగిపోయింది. ఆ దొంగల్ని సిలువకు మేకుల్తో కొడ్తున్నప్పుడు ఆమె బాధగా చూసింది. మరణించిన వారిని బతికించిన ఆయన తనను సిలువ చెయ్యడానికి ఒప్పుకుంటాడా? దేవుని కుమారుడు ఈ విధంగా క్రూరంగా మరణం పొందడానికి సమ్మతిస్తాడా? యేసే మెస్సీయా అన్న తన నమ్మకాన్ని ఆమె విడిచిపెట్టుకోవాలా? తన శ్రమల్లో ఆయనకు పరిచర్య కూడా చేయడానికి అవకాశం లేకుండా, ఆయన అవమానాన్ని దుఃఖాన్ని ఆమె చూడాలా? ఆయన చేతులు సిలువ మీద చాపి ఉంచడం ఆమె చూసింది. సుత్తి మేకులు తెచ్చారు. ఆ కరకు మేకుల్ని సున్నితమైన ఆయన శరీరంలో దించుతున్నప్పుడు మూర్చిల్లుతున్న ఆమెను ఆ క్రూర సన్నివేశం నుంచి శిష్యులు తీసుకునిపోయారు.DATel 841.3

    రక్షకుడు గొణగలేదు. ఫిర్యాదు చెయ్యలేదు. ఆయన ముఖం ప్రశాంతంగా నిర్మలంగా ఉంది. కాని ఆయన నుదుటి మీద చెమట బిందువులు నిలిచాయి. ఆయన ముఖం మీద నుంచి మరణపు మంచును తుడవడానికి దయగల హస్తం ఏదీ లేదు. ఆయనమానవ హృదయానికి ధైర్యాన్ని స్థయిర్యాన్ని కూర్చే మాటలు చెప్పడానికి ఎవరూ లేరు. సైనికులు తమ క్రూరకృత్యాన్ని చేస్తున్నప్పుడు యేసు తన శత్రువుల కోసం “తండ్రీ, వీరేమీ చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము” అని ప్రార్ధన చేశాడు. తన బాధనుంచి, తన్ను హింసిస్తోన్న వారి పాపం మీదికి, వారికి కలుగనున్న శిక్ష మీదికి ఆయన మనసు పోయింది. తమ లక్ష్యాన్ని సాధించామని గొప్పలు చెప్పుకుంటూ ప్రగల్భాలు పలుకుతున్న యాజకులు అధికారుల పట్ల ఆయనకి ఎలాంటి కక్ష లేదు. వారి క్షమాపణకు “వీరేమి చేయుచున్నారో వీరెరుగరు” అన్న, విజ్ఞాపన మాత్రమే ఆయన చేశాడు.DATel 842.1

    పాప మానవ జాతిని నిత్య నాశనం నుంచి రక్షించడానికి వచ్చిన ఆయన్ని తాము హింసిస్తున్నామని వారు తెలుసుకుని ఉంటే వారికి తీవ్ర పశ్చాత్తాపం కలిగేది. భయం పుట్టేది. అయినా తమ అజ్ఞానం వారి దోషిత్వాన్ని తొలగించలేదు. ఎందుకంటే యేసుని తెలుసుకుని ఆయన్ని తమ రక్షకుడుగా స్వీకరించే తరుణం వారికి కలిగింది. అందులో కొందరు తమ పాపాన్ని గుర్తించి, పశ్చాత్తాపపడి క్రీస్తుని విశ్వసించే అవకాశం ఇంకా ఉంది. కొందరు తమ పాపం నిమిత్తం దుఃఖించకుండా ఉన్నందువల్ల క్రీస్తు చేసిన ప్రార్ధన తమ విషయంలో నెరవేరకుండా చేసుకుంటారు. అయినా దేవుని ఉద్దేశం నెరవేర్పును సమిపిస్తోంది. తండ్రి సమక్షంలో విజ్ఞాపకుడుగా సేవ చెయ్యడానికి యేసు తన హక్కును సంపాదించుకుంటున్నాడు.DATel 843.1

    తన శత్రువుల నిమిత్తం క్రీస్తు చేసిన ప్రార్ధన లోకంలో ఉన్నవారందరినీ ఉద్దేశించింది. లోకం ఆరంభం నుంచి అంతం వరకూ నివసించిన లేదా ఇంకా నివసించాల్సి ఉన్న ప్రతీ పాపినీ అది స్వీకరించింది. దైవ కుమారుణ్ని సిలువ వేసిన అపరాధం అందరి మీదా ఉంది. అందరికీ క్షమాపణ అందుబాటులో ఉంది. “ఇచ్ఛయించువారు” దేవునితో సమాధానం ఉచితముగా పొంది నిత్యజీవాన్ని స్వతంత్రించుకోవచ్చు.DATel 843.2

    యేసుని మేకులతో సిలువకు కొట్టిన వెంటనే బలమైన మనుషులు దాన్ని పైకి లేపారు. దానికి ఏర్పాటు చేసిన స్థలంలో దాన్ని గొప్ప దౌర్జన్యంతో నిలిపారు. ఇది దైవకుమారునికి తీవ్రమైన బాధ కలిగించింది. అనంతరం పిలాతు హెబ్రీ, గ్రీకు, లాటిన్ భాషల్లో “యూదుల రాజైన నజరేయుడగు యేసు” అని రాయించి సిలువమిద యేసుతలపై పెట్టించాడు. ఈ పై విలాసం యూదులికి కోపం పుట్టించింది. పిలాతు న్యాయస్థానంలో “వానిని సిలువ వేయుము” అని వారు కేకలు వేశారు. ‘కైసరు తప్ప మాకు వేరొకరాజు లేడు” అన్నారు. ఏ వ్యక్తి అయినా వేరొకరిని రాజుగా గుర్తిస్తే అతడు దేశద్రోహి అన్నారు. వారు వ్యక్తం చేసిన అభిప్రాయన్నే పిలాతు రాశాడు. యేసు యూదుల రాజు అనడం తప్ప ఏ అభ్యంతర కారణం లేదు. ఆ పై విలాసం రోమా అధికారం పట్ల యూదుల ప్రభుభక్తిని గుర్తిస్తోంది. ఎవరు ఇశ్రాయేలు రాజునని చెప్పుకుంటారో అతణ్ని వారు మరణానికి అర్హుడని తీర్పు తీర్చుతారని అది ప్రకటిస్తోంది. యాజకులు అతిగా స్పందించారు. వారు క్రీస్తుని చంపడానికి కుట్రపన్నుతున్నప్పుడు జాతిని రక్షించడానికి ఒక్కడు మరణించడం అవశ్యమని కయప చెప్పాడు. ఇప్పుడు వారి వేషధారణ బయటపడింది. క్రీస్తుని నాశనం చెయ్యడానికి వారు తమ జాతి అస్తిత్వాన్నే త్యాగం చేయడానికి సిద్ధమయ్యారు.DATel 843.3

    యాజకులు తాము చేసిన పొరపాటును గుర్తించి ఆ పైవిలాసాన్ని మార్చాల్సిందిగా పిలాతుకి వినతి చేశారు. “నేను యూదుల రాజునని వాడు చెప్పినట్లు వ్రాయుముగాని - యూదుల రాజు అని వ్రాయవద్దని” అన్నారు. అయితే పిలాతు క్రితం తాను ప్రదర్శించిన బలహీనత నిమిత్తం తన్నుతాను నిందించుకున్నాడు. అసూయపరులు, ధూర్తులు అయిన యాజకుల్ని అధికారుల్ని పిలాతు ద్వేషించాడు. నిర్లక్ష్యంగా “నేను వ్రాసినదేమో వ్రాసితిని” అని వారికి జవాబిచ్చాడు.DATel 844.1

    యేసుతలపై ఆ పై విలాసాన్ని పెట్టడంలో పిలాతుకన్నా ఉన్నతమైన శక్తి ఆదేశం ఉంది. ఆది ఆలోచనను మేల్కొల్పి లేఖన పరిశీలనకు దారి తియ్యాలన్నది దైవ సంకల్పం. క్రీస్తుని సిలువ వేసిన స్థలం పట్టణానికి సమీపంలో ఉంది. అప్పుడు యెరుషలేములో వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రజలు వేల సంఖ్యలో నజరేయుడైన యేసు మెస్సీయా అన్న పై విలాసం వారి గమనానికి వస్తుంది. దేవుడు నడిపించిన ఒక హస్తం రాసిన సజీవ సత్యం అది.DATel 844.2

    క్రీస్తు సిలువ పై అనుభవించిన శ్రమల్లో ప్రవచనం నెరవేరింది. తాను పొందనున్న శ్రమల గురించి సిలువకు ఎన్నో శతాబ్దాల ముందే రక్షకుడు చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు, “కుక్కలు నన్ను చుట్టుకొనియున్నవి. దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు. నా యెముకలన్నియు నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా అంగీ కొరకు ట్లు వేసికొనుచున్నారు.” కీర్త 22:16-18. వస్త్రాల్ని గురించిన ప్రవచనం సిలువను పొందిన క్రీస్తు స్నేహితులు లేక శత్రువుల సలహా మేరకు లేక ప్రమేయం వల్ల నెరవేరింది కాదు. ఆయన్ని సిలువ మీద పెట్టిన సైనికులకి ఆయన బట్టలు ఇచ్చారు. ఆ వస్త్రాల్ని తమ మధ్యపంచుకునేటప్పుడు జరిగిన వివాదాల్ని క్రీస్తు విన్నాడు. ఆయన అంగీ ఎక్కడా కుట్టు లేకుండా మొత్తం పూర్తిగా నేసింది. కనుక వారు “దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దాని కోసరము ఓట్లు వేయమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి”DATel 844.3

    ఇంకొక ప్రవచనంలో రక్షకుడిలా ప్రకటించాడు, “నిందకు నా హృదయము బద్ద లాయెను. నేను బహుగా కృషించియున్నాను. కరుణించువారికొరకు కనిపెట్టుకొంటిని గాని యెవరును లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని యెవరును కానరైరి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి. నాకు దప్పియైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి” కీర్త 60:29, 21. సిలువపై మరణ దండన పొందిన వారు బాధను తెలుసుకోకుండా వారి జ్ఞానేంద్రియాలకు మత్తు కలిగించడానికి చిరకను అనుమతించేవారు. దీన్ని యేసుకివ్వబోయారు. ఆయన దాన్ని రుచి చూసినప్పుడు దాన్ని తిరస్కరించాడు. తన మనసుకు మత్తు కలిగించేదేదీ ఆయనకు సమ్మతం కాదు. ఆయన విశ్వాసం దేవున్ని గట్టిగా పట్టుకొని ఉండడం అవసరం. అదే ఆయన బలం. ఆయన జ్ఞానేంద్రియాల్ని మొద్దుబార్చనియ్యడం సాతానుకు సహాయపడడమౌతుంది.DATel 845.1

    ఆయన సిలువ మీద వేలాడున్నప్పుడు యేసు విరోధులు ఆయనపై తమ కోపాన్ని చూపించారు. మరణిస్తున్న రక్షకుణ్ని ఎగతాళి చెయ్యడంలో యాజకులు, అధికారులు, శాస్త్రులు ఏకమయ్యారు. క్రీస్తు బాప్తిస్మమప్పుడు, క్రీస్తు రూపాంతరమప్పుడు దేవుడు ఆయన్ని తన కుమారుడని ప్రకటించినప్పుడు దేవుని స్వరాన్ని వారు విన్నారు. మళ్లీ క్రీస్తు అప్పగింతకు కొంచెం ముందు దేవుడు తన కుమారుని దైవత్వం గురించి ప్రకటించాడు. ఇప్పుడు ఆకాశం నుంచి వచ్చే స్వరం మౌనంగా ఉంది. క్రీస్తు పక్షంగా ఏ సాక్ష్యం వినిపించడం లేదు. దుష్టుల చేతిలో దౌర్జన్యం ఎగతాళి ఒంటరిగా భరించాడు.DATel 845.2

    “నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుము” అన్నారు. “వీడు దేవుడేర్పరచుకొనిన క్రీస్తు అయిన యెడల తన్నుతాను రక్షించుకొనును” అన్నారు. శోధనారణ్యంలో సాతాను ఇలా అన్నాడు, “నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము.”, “నీవు దేవుని కుమారడవైతే దేవాలయ శిఖరం నుంచి క్రిందికి దుముకుము” అన్నాడు. మత్త 4:3, 6, సాతాను, మానవరూపంలో అతడి దూతలు సిలువ వద్ద ఉన్నారు. దురాత్మల అధినేత అతడి సేనలు యాజకులు అధికారులతో సహకరిస్తోన్నారు. తమను ఎవరికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చేందుకు తీసుకువచ్చారో ఆయన ముఖం అప్పటి వరకూ చూడని ఆజ్ఞాన ప్రజల్ని ఆయన పై తీర్పు ప్రకటించడానికి ప్రజాబోధకులు ఉద్రేకపర్చారు. యాజకులు, అధికారులు, పరిసయ్యుం? దుష్టులైన సామాన్య ప్రజలు ఒక కూటమిగా ఏర్పడి ఉన్మాదంతో ఆయని వ్యతిరేకించారు. మతాధికారులు సాతానుతోను అతడి దూతలతోను చెయ్యి కలిపారు. వారందరూ అతడి ఆజ్ఞల్ని పాలిస్తోన్నారు. “వీడితరులను రక్షించెను, తన్నుతాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగిరావచ్చును అప్పుడు మనము చూచినమ్ముదము” అని యాజకులంటున్న ప్రతీమాటనీ బాధపడుతూ మరణిస్తోన్న యేసు విన్నాడు. క్రీస్తు సిలువ మీద నుంచి దిగి రాగలిగేవాడే. కాని ఆయన తన్నుతాను రక్షించుకోడానికి ఇష్టపడనందుకే పాపికి క్షమాపణ దేవుని ప్రసన్నత లభించే మార్గం ఏర్పడింది. ప్రవచన బోధకులమని చెప్పుకుంటున్న ఆ మనుషులు ఆ సమయంలో తాము ఏమాటలు పలుకుతారని ప్రవచనం తెలిపిందో ఆ మాటల్నే రక్షకుణ్ని ఎగతాళి చెయ్యడంలో ఉపయోగించారు. తమ గుడ్డితనంలో తాము ప్రవచనాన్ని నెరవేర్చుతున్నామని వారు గుర్తించలేదు. “వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయన కిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించును” అంటూ ఎగతాళి చేసినవారు తమ సాక్ష్యం అప్పటి నుంచి గతిస్తోన్న యుగాలన్నిటిలోను వినిపిస్తోందని తలంచలేదు. అయితే ఈ మాటల్ని ఎగతాళిగా అన్నప్పటికీ వారు క్రీస్తు పరిచర్య పరమార్థాన్ని గ్రహించారు. యేసుని సిలువ వేసినప్పుడు ఆయన్ని గూర్చిన జ్ఞానం విస్తారంగా వ్యాప్తి చెందింది. దానికి మునుపెన్నడూ అది ఎక్కువగా విస్తరించలేదు. సిలువ సన్నివేశాన్ని చూసిన వారి హృదయాల్లోకి, ఆయన మాటలు విన్నవారి హృదయాల్లోకి సత్యం ప్రవేశించి తన వెలుగును విరజిమ్ముతోంది.DATel 845.3

    సిలువ పై బాధననుభవిస్తోన్న యేసుపై ఒక్క ఓదార్పు కిరణం పడింది. అది మారుమనసు పశ్చాత్తాపం పొందిన దొంగ చేసిన ప్రార్ధన. క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డ దొంగలిద్దరూ మొదట్లో ఆయన్ని ఎగతాళి చేశారు. ఒకడు తాననుభవిస్తోన్న బాధను బట్టి సహనం కోల్పోయి ధిక్కారంగా మాట్లాడాడు. కాని అతడి మిత్రుడు అలాలేడు. ఇతడు కరడుగట్టిన నేరగాడుకాడు. తన దుష్ట స్నేహాలు స్నేహితుల వల్ల అతడు చెడిపోయాడు. తప్పు దారి పట్టాడు. అయినా సిలువ పక్క నిలబడి రక్షకుణ్ని ఎగతాళి చేస్తూ నిందిస్తోన్న అనేకులకన్నా అతడు తక్కువ నేరస్తుడు. అతడు యేసుని చూశాడు. ఆయన బోధలు విన్నాడు. కాని యాజకులు ఆలయాధికార్లు అతణ్ని తరిమి వేశారు. ఆత్మ ప్రబోధం నోరునొక్కుతూ అతడు పాపంలో లోతుగా కూరుకుపోయాడు. చివరికి పట్టుబడి నేరస్తుడిగా తీర్పుపొందాడు. అతడికి సిలువపై మరణ శిక్ష పడింది. తీర్పు గదిలోను కల్వరికి వెళ్ళే మార్గంలోను అతడు యేసు సాహచర్యంలో ఉన్నాడు. “ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు.” అని పిలాతు ఆయన్ని గురించి చెప్పడం విన్నాడు. ‘యోహా 19:4). దేవుని పోలిన ఆయన ప్రవర్తనను తన హింసకుల పట్ల ఆయన క్షమాగుణాన్ని గుర్తించాడు. సిలువపై ఉన్న యేసు ప్రభువును గొప్ప గొప్ప మత నేతలు నోరు పారేసుకుని ఆయన్ని ఎకసక్కెం చెయ్యడం నిందించడం విన్నాడు. దానికి తలలు ఊపుతున్న వారిని చూశాడు. తన తోటి నేరగాడు వెటకారంగా - “నీవు క్రీస్తువుగదా? నిన్ను నీవు రక్షించుకొనుచు, మమ్మునుకూడా రక్షించుము” అన్నప్పుడు విన్నాడు. దారిన పోతున్న వారిలో అనేకులు ఆయన్ని సమర్ధించడం విన్నాడు. వారు ఆయన మాటలు ఆయన చేసిన మహత్కార్యాల గురించి చెప్పుకోడం విన్నాడు. ఈయనే క్రీస్తు అన్న నమ్మకం అతనిలో స్థిరపడింది. తోటి నేరగాడి పక్కకు చూస్తూ, “నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా?” అని గద్దించాడు. మరణిస్తోన్న దొంగలు మనుషుడికి భయపడాల్సిన అవసరం లేదు. కాని వారిలో ఒకడికి దేవుడున్నాడు ఆయనకు భయపడాలన్న నమ్మకం భావి జీవితం పొందాలన్న కోరిక కలిగాయి. ఇప్పటి వరకు పాపంతో నిండిన అతడి జీవిత చరిత్ర ముగియడానికి సిద్ధంగా ఉంది. “మనకైతే యిది న్యాయమే; మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని యీయన ఏ తప్పిదము చేయలేదు” అంటూ సంతాపపడ్డాడు.DATel 846.1

    ఇప్పుడు సమస్యలేదు. సందేహాలు లేవు నిందలు లేవు. తన నేరానికి శిక్ష పడినప్పుడు ఆ దొంగకు నిరీక్షణలేదు. నిరాశకు లోనయ్యాడు. కాని ఇప్పుడు విచిత్రమైన సున్నితమైన ఆలోచనలు అతడిలో చెలరేగుతున్నాయి. యేసుని గురించి తాను విన్నవాటన్నిటిని గుర్తుచేసుకున్నాడు. వ్యాధిగ్రస్తుల్ని ఆయన బాగుచెయ్యడం, పాపాన్ని క్షమించడం గుర్తు చేసుకున్నాడు. యేసుని విశ్వసించి దుఃఖిస్తూ ఆయన్ని వెంబడిస్తోన్న వారి మాటల్ని విన్నాడు. రక్షకుడి తల మీద పెట్టిన పై విలాసాన్ని చూశాడు, చదివాడు. ఆ దారిని వెళ్తున్న వారు ఆ మాటల్ని ఉచ్చరించడం విన్నాడు. కొందరు ఆ మాటల్ని వణుకుతున్న పెదవుల్తో పలుకుతుంటే కొందరు హస్యాస్పదంగాను ఎగతాళిగాను పలకడం విన్నాడు. పరిశుద్ధాత్మ అతడి హృదయాన్ని వెలుగుతో నింపగా అతడికి క్రమక్రమంగా నిదర్శనం ఏర్పడింది. గాయపర్చబడి, అసహ్యించుకోబడి, సిలువపై వేలాడున్న యేసులో లోక పాపాన్ని మోసుకునిపోయే దేవుని గొర్రెపిల్లను అతడు చూశాడు. నిస్సహాయమైన, మరణిస్తున్న ఆ ఆత్మ తన్ను తాను మరణిస్తున్న రక్షకునికి సమర్పించుకుంటూ బాధతో నిండిన స్వరంతో నిరీక్షణను వ్యక్తం చేస్తూ, “యేసూ, నీవు నీ రాజ్యములోనికి వచ్చుచున్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము” అన్నాడు.DATel 847.1

    వెంటనే సమాధాన వచ్చింది. ఆ స్వరం మృదువుగా మధురంగా, ప్రేమ కనికరంతో నిండిన స్వరం. ఆ స్వరంతో ఆయన ఇలా అన్నాడు, నీవు నాతో పరదైసులో ఉంటావని నేడు నీతో నిశ్చయంగా చెబుతున్నాను.DATel 848.1

    దీర్ఘంగా గంటలు తరబడి నిందలు మోపుతోన్న ఎగతాళి చేస్తున్న స్వరాలే ఆయనకు వినిపించాయి. ఆయన సిలుపై వేళాడున్నప్పుడు వారు చేస్తున్న ఎగతాళి వారు పలుకుతున్న శాపనార్ధాలు ఆయనకు వినబడుతున్నాయి. తన శిష్యుల నుంచి తమ విశ్వాసాన్ని ప్రకటించే మాటలు వినిపిస్తాయేమోనని ఆశగా వింటోన్నాడు. “ఇశ్రాయేలును విమోచింపబోయేవాడు ఈయనే అని మేము నిరీక్షించియుంటిమి” అన్న దుఃఖంతో నిండి మాటల్ని వారి నుంచి విన్నాడు. ఇలా ఉండగా, మరణిస్తోన్న ఆ దొంగ అన్న మాటలు రక్షకుని పట్ల ఎంత కృతజ్ఞతతో నిండిన మాటలు! ఎంత ఊరట కూర్చే మాటలు! ప్రధానమైన యూదులు ఆయన్ను విసర్జించగా, శిష్యులు సయితం ఆయన దేవత్వాన్ని సందేహించగా, నిత్యత్వం అంచున ఉన్న ఆ దొంగ యేసుని ప్రభువా అని పిలిచాడు. ఆయన సూచక క్రియలుచేసినప్పుడు ఆయన సమాధి నుంచి లేచినప్పుడు ఆయన్ని ప్రభువా అని పిలవడానికి అనేకులు సిద్ధంగా ఉన్నారు. కాని ఆయన సిలువపై వేళాడున్నప్పుడు, పశ్చాత్తాపం పొంది చివరి ఘడియలో రక్షణ పొందిన ఆ దొంగ తప్ప ఆయన్ని ఎవ్వరూ గుర్తించలేదు.DATel 848.2

    పక్కన నిలబడి ఉన్నవారు ఆ దొంగ యేసుని ప్రభువా అని పిలుస్తున్నప్పుడు ఆ మాటలు విన్నారు. పశ్చాత్తాపం పొందిన అతడి మాటల ధోరణి వారి గమనాన్ని ఆకర్షించింది. సిలువ పాదం వద్ద క్రీస్తు వస్త్రాల కోసం పోట్లాడుకుంటున్నవారు, ఆయన అంగీకోసం ఓట్లు వేసుకుంటున్నవారు వాటిని ఆపి ‘ఆ మాటలు విన్నారు. వారి కోపతాపాలు సద్దణిగాయి. మౌనందాల్చి పైకి యేసువంక చూశారు. మరణిస్తోన్న ఆ పెదవుల్నుంచి వచ్చే సమాధానం కోసం ఎదురుచూశారు.DATel 848.3

    ఆయన ఆ వాగ్దానపు మాటలు పలికినప్పుడు, సిలువను కమ్మిన నల్లని మేమాన్ని ప్రకాశవంతమైన సజీవమైన వెలుగు పటాపంచలు చేసినట్లనిపించింది. మారిన దొంగకు దేవునితో సయోధ్య ఏర్పండిందన్న శాంతి కలిగింది. అవమానంభరిస్తున్న క్రీస్తుకి మహిమ కలిగింది. అందరి దృష్టిలోను పరాజితుడుగా ఉన్న ఆయన విజయుడయ్యాడు. పాపాలు మోసేవానిగా ఆయన్ని గుర్తించడం జరిగింది. మనుషులు ఆయన మానవ శరీరంపై అధికారం చలాయించవచ్చు. ముళ్లకీరిటం ఆయన కణతల్ని గాయపర్చవచ్చు. ఆయన ఒంటి పై నుంచి తన వస్త్రాల్ని తీసివేసి వాటి విభజన నిమిత్తం సిగపట్లు పట్టవచ్చు. అయితే ఒకటి వారు చెయ్యలేరు; పాపాలు క్షమించడానికి ఆయన శక్తిని రద్దుపర్చలేరు. మరణించడంలో తన దేవత్వాన్ని చాటి తండ్రి మహిమకు సాక్ష్యమిచ్చాడు. వినలేకపోవడానికి ఆయన చెవి చెవిటిదికాదు. ఆయన హస్తం రక్షించలేకపోడానికి కురచయ్యింది కాదు. తన ద్వారా దేవుని వద్దకు వచ్చే వారందరిని రక్షించే రాచరికపు హక్కు ఆయనకుంది.DATel 849.1

    నీవు నాతో పరదైసులో ఉంటావని నేడు నీతో చెబుతున్నాను. ఆ దొంగ ఆ రోజే తనతో పరదైసులో ఉంటాడనలేదు ఆయన. ఆ రోజు ఆయన పరదైసుకి వెళ్లలేదు. ఆయన సమాధిలో నిద్రించాడు. పునరుత్థాన దినాన ఆయన ఇలా అన్నాడు, “నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు” యోహా 20:17. కాని అపజయంతో చీకటితో నిండిన దినంగా కనిపించిన సిలువ దినాన ఆయన వాగ్దానం చేశాడు. “ఈరోజు” నేరస్తుడిగా సిలువపై మరణిస్తున్న క్రీస్తు నీవు నాతో పరదైసులో ఉంటావని ఆ దినాన పాపికి వాగ్దానం చేశాడు.DATel 849.2

    యేసుతో సిలువ వేసిన దొంగలను “ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒనిని మధ్యన యేసుని” ఉంచి సిలువ చేశారు. ఈ పని యాజకులు అధికారుల సూచన మేరకు చేశారు. క్రీస్తుని మధ్యను ఉంచడంలో ఆ ముగ్గురిలోను ఎక్కువ అపరాధి క్రీస్తేనని చూపించడమేవారి ఉద్దేశం. “అతిక్రమము చేసిన వారిలో ఎంచబడినవాడాయెను” (యెష 53:12) అన్న ప్రవచనం ఇలా నెరవేరింది. కాని తమ కార్యం సంపూర్ణ పరిధిని యాజకులు చూడలేదు. దొంగల మధ్య సిలువ వెయ్యబడ్డ క్రీస్తుని ఆ యిద్దరి మధ్య ఉంచినట్లే పాపంలో మగ్గుతున్న లోకం మధ్య ఆయన సిలువను ఉంచాడు దేవుడు. మారిన దొంగకు క్రీస్తు ఇచ్చిన క్షమాపణ లోకం మారుమూలల్లో ప్రకాశించే జ్యోతిని వెలిగించింది.DATel 849.3

    దేవదూతలు యేసు ప్రేమను అమితాశృంతో వీక్షించారు. మానసికంగాను శారీరకంగాను ఎంతో బాధననుభవిస్తున్నప్పటికీ ఆయన ఇతరుల గురించే ఆలోచించి విశ్వసించడానికి పశ్చాత్తాపపడ్డ ఆత్మను ప్రోత్సహించాడు. తనకు కలిగిన పరాభవంలో ప్రవక్తగా యెరుషలేము కుమార్తెల్ని సంబోధించాడు. యాజకుడు గాను విజ్ఞాపకుడుగాను తన హంతకులను క్షమించమంటూ తండ్రితో విజ్ఞాపన చేశాడు. ప్రేమగల రక్షకుడుగా పశ్చాత్తాపపడ్డ దొంగ పాపాల్ని క్షమించాడు.DATel 850.1

    తన చుట్టూ ఉన్న జనం వంక చూసినప్పుడు ఒక వ్యక్తి ఆయన దృష్టిని ఆకర్షించింది. సిలువ పాదం వద్ద తన తల్లి శిష్యుడు యోహాన్ని ఆనుకుని నిలబడింది. కుమారుడు లేకుండా జీవించడం భరించలేకనపోతోంది. ఆయన అంతం సమీపించిందని గ్రహించి యోహాను ఆమెను మళ్లీ సిలువ వద్దకు తీసుకువచ్చాడు. తన మరణ గడియలో క్రీస్తు తన తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ఆమెతో ఇలా అన్నాడు, “అమ్మా, యిదిగో నీ కుమారుడు.” అంతట యోహానుతో “యిదిగో నీ తల్లి” అని చెప్పాడు. యోహాను క్రీస్తు మాటల్ని గ్రహించి ఆమెను తల్లిగా అంగీకరించాడు. అతడు వెంటనే మరియను తన ఇంటికి తీసుకు వెళ్లి ఆ గడియ నుంచి ఆమెను ప్రేమతో ఆదరించాడు. ఎంతో దయగల ప్రేమగల రక్షకుడు అంత తీవ్రమైన శారీరక బాధను మానసిక వేదనను అనుభవిస్తున్నప్పటికీ తల్లిపట్ల ఎంతో జాగరూకత, శ్రద్ధ కనపర్చాడు. ఆమె ఆలనపాలన చూడడానికి ఆయన వద్ద డబ్బులేదు. కాని యోహాను మనసులో ఆయన ఆరాధ్యదైవం. ఆయన తన తల్లిని పారంపర్యంగా వచ్చిన ఆస్తిగా యోహానుకి ఇచ్చాడు. ఈ రకంగా ఆమెకు అవసరమైన అండ ఏర్పాటు చేశాడు. ఆమె యేసుని ప్రేమించింది గనుక యోహాను ఆమెను ప్రేమించాడు. అతడి జాగ్రత్తలో తల్లిని విడిచి పెట్టాడు. ఆమెను పరిశుద్ధ నిధిగా స్వీకరించడంలో యోహాను గొప్ప ఆశీర్వాదాన్ని పొందాడు. ఆమె యోహానుకి తన ప్రియమైన ప్రభువుని తలపించేది.DATel 850.2

    తల్లిపట్ల ప్రేమకు క్రీస్తు చూపించిన ఆదర్శం యుగాల పొడవున నిత్యం తేజోవంతంగా ప్రకాశిస్తోంది. ముప్పయి సంవత్సరాలుగా ఆయన శ్రమచేసి కుటుంబ భారాన్ని భరించడంలో తోడ్పడ్డాడు. ఇప్పుడు తన తీవ్ర బాధ సమయంలో కూడా దుఃఖంతో నిండిన, విధవరాలైన తల్లి పోషణకు ఏర్పాటు చేశాడు. ప్రభువును విశ్వసించిన ప్రతీ అనుచరుడిలో ఇదే స్ఫూర్తి కనిపిస్తుంది. క్రీస్తును వెంబడించేవారు తల్లిదండ్రుల్ని గౌరవించి వారి పోషణకు ఏర్పాటు చెయ్యడం తమ మతంలో భాగమని భావిస్తారు. దేవుని పట్ల ప్రేమగల హృదయం నుంచి తల్లిదండ్రులు ఉచితమైన శ్రద్ధను సున్నితమైన సానుభూతిని ఎల్లప్పుడు పొందుతారు.DATel 851.1

    మహిమ ప్రభువు ఇప్పుడు మానవాళి విమోచన క్రయధనంగా మరణిస్తున్నాడు. విలువైన తన ప్రాణాన్ని త్యాగం చెయ్యడంలో క్రీస్తుని విజయోత్సాహం బలపర్చలేదు. అంతా భయంకరమైన చీకటి. ఆయనకు వేదన కలిగిస్తోన్న మానసిక క్షోభ సిలువ మరణ బాధ గాని అందువల్ల కలిగే సిగ్గు గాని కాదు. క్రీస్తు బాధను భరించడంలో రాజు. అయితే ఆయన వేదన పాపం తాలుకు దుష్టత్వం గురించి. పాపం తాలూకు జానం గురించి దుర్మార్గంతో పరిచయం ద్వారా మానవుడు పాపం నీచత్వాన్ని గుర్తించలేని గుడ్డివాడవ్వడం గురించి. మానవ హృదయంపై పాపం ఎంత బలమైన పట్టు కలిగి ఉన్నదో, దాని ప్రాబల్యం నుంచి తప్పించుకోడానికి ఎంత కొద్దిమంది ఇష్టంగా ఉన్నారో క్రీస్తు గుర్తించాడు. దేవుని సహాయం లేకపోతే మానవజాతి నశిస్తుందని ఆయనకు తెలుసు. విస్తారమైన సహాయం అందుబాటులో ఉన్నప్పటికీ కోట్లాదిమంది నశించడం ఆయన చూశాడు.DATel 851.2

    మనకు ప్రత్యామ్నాయం, భరోసా అయిన క్రీస్తుమీద మన అందరి పాపం మోపబడింది. ధర్మశాస్త్రం విధించే శిక్షనుంచి మనల్ని కాపాడేందుకు ఆయన ఆపరాధిగా పరిగణన పొందాడు. ఆదాము సంతతి వారందరి ఆపరాధం ఆయన హృదయాన్ని కుంగదీస్తోంది. పాపం పట్ల దేవుని ఉగ్రత, అనగా పాపంవల్ల దేవుడు ప్రదర్శించే అసంతృప్తి ఆయన కుమారునికి దిగ్ర్భమ కలిగించింది. తన జీవితమంతా క్రీస్తు తండ్రి కృపను గురించి క్షమపూరిత ప్రేమను గురించి పాపంలో పడ్డ భూలోకంలో ప్రచురించాడు. అతి ఘోర పాపికి కూడా రక్షణ కలదన్నది ఆయన ప్రధానంశం. అయితే ఇప్పుడు రాజీ పరిచే తండ్రి ముఖాన్ని ఆయన చూడలేడు. మిక్కిలి బాధాకరమైన ఈ గడియలో రక్షకుని నుంచి తండ్రి తన సముఖాన్ని దాచుకోడం ఆయన హృదయాన్ని చీల్చి ఆయన్ని మానవావగాహనకు మించిన దుఃఖంతో నింపింది. ఈ వేదన ఎంత తీవ్రమైందంటే తనకు కలుగుతున్న శారీరక బాధను ఆయన లెక్కచెయ్యలేదు.DATel 851.3

    సాతాను తన భయంకర శోధనలతో యేసు హృదయాన్ని మెలివేశాడు. రక్షకుడు సమాధిని అధిగమించి చూడలేకపోయాడు. సమాధిలోనుంచి జయప్రదంగా బయటికి వస్తానన్న నిశ్చయత లేదా తండ్రి తన త్యాగాన్ని అంగీకరిస్తాడన్న నిశ్చయత ఆయనకు లేదు. పాపం పట్ల దేవుని తీవ్ర అభ్యంతరం వల్ల తమ ఎడబాటు నిరంతరంగా ఉండిపోతుందేమోనని క్రీస్తు భయపడ్డాడు. పాపమానవాళి పక్షంగా విజ్ఞాపన చెయ్యడానికి ఇక కృప లేనప్పుడు పాపి అనుభవించే హృదయ వేదనను క్రీస్తు అనుభవించాడు. మానవుడి ప్రత్యామ్నాయంగా తన మీదికి తండ్రి ఉగ్రతను తెచ్చే పాపం దైవకుమారుడు తాగాల్సి ఉన్న గిన్నెను చేదుగా చేసి హృదయాన్ని బద్దలు కొట్టింది.DATel 852.1

    రక్షకుని దుఃఖ భారాన్ని దేవదూతలు ఆశ్చర్యంగా వీక్షించారు. ఆ భయానక దృశ్యం చూడకుండా పరలోక దూతలు తమ ముఖాలు కప్పుకున్నారు. మరణిస్తోన్న తన సృష్టికర్తను అవమానించినప్పుడు అచేతన ప్రకృతి ఆయనకు సానుభూతి వ్యక్తం చేసింది. ఘోరమైన ఆ దృశ్యాన్ని చూడడానికి సూర్యుడు నిరాకరించాడు. మధ్యాహ్న సమయంలో భూమండలాన్ని ప్రచండమైన కాంతితో నింపే సూర్యకిరణాలు ఆకస్మాత్తుగా మటుమాయమయ్యాయి. సిలువను దట్టమైన చీకటి ఆవరించింది. “మూడుగంటల వరకు ఆ దేశమంతటి మిద చీకటి కమ్మెను.” ఈ చీకటి సూర్యగ్రహణం వల్లనో లేక ఇతర స్వాభావిక కారణాల వల్లనో కలిగింది కాదు. అది చంద్రుడు నక్షత్రాలు ప్రకాశించని ఆర్ధరాత్రి అంధకారం వంటి చీకటి. అనంతర తరాల వారి విశ్వాసం స్థిరపడేందుకు అది దేవుడిచ్చిన అద్భుతమైన సాక్ష్యం .DATel 852.2

    దట్టమైన ఆ చీకటిలో దేవుని సముఖం మరుగుపడి ఉంది. చీకటిని తన గుడారం చేసుకుని మానవ నేత్రాలికి కనిపించకుండా ఆయన తన మహిమను మరుగుపర్చుతాడు. దేవుడు ఆయన పరిశుద్ధ దూతలు సిలువ పక్కన ఉన్నారు. తండ్రి కుమారునితో ఉన్నాడు. అయినా ఆయన సన్నిధి కనిపించిలేదు. ఆ మేఘంలోనుంచి ఆయన మహిమ ప్రకాశించి ఉంటే చూస్తున్న ప్రతీ మనిషి నశించేవాడే. ఆ భీకర గడియలో తండ్రి క్రీస్తుని తన సముఖంతో ఓదార్చడానికి లేకపోయింది. ఆయన ఒంటరిగా శ్రమలనుభవించాడు. తన వారిలో ఒకడు కూడా ఆయనతో లేడు.DATel 853.1

    దట్టమైన ఆ చీకటిలో దేవుడు తన కుమారుని మానవ వేదనను కప్పాడు. బాధననుభవిస్తోన్న క్రీస్తుని చూసినవారందరు ఆయన దేవత్వాన్ని నమ్మారు. ఒక్కసారి మానవులు చూసిన ఆ ముఖాన్ని వారు మరిచిపోలేరు. కయీను ముఖం అతడు హంతకుడని ఎలా సూచించిందో అలాగే క్రీస్తు ముఖం నిర్దోషిత్వాన్ని ప్రశాంతతను, ఔదార్యాన్ని అనగా దేవుని స్వరూపాన్ని వెల్లడించింది.DATel 853.2

    మరణం లాంటి మౌనం కల్వరిని అలముకొంది. సిలువ చుట్టూ చేరిన జనుల్ని ఏదో అవ్యక్త భయం ఆవరించింది. శాపనార్థాలు అపహస్యాలు సగంలోనే ఆగిపోయాయి. పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ నేలపై సాగిలపడ్డారు. మేఘం నుంచి అప్పుడప్పుడు స్పష్టమైన మెరుపులు మెరుస్తున్నాయి. ఆ కాంతిలో సిలువ కనిపించేది. దాని మీద ఉన్న రక్షకుడు కనిపించేవాడు. యాజకులు, అధికారులు, శాస్త్రులు, తలారులు, ప్రజల మూక - అందరూ తాము ప్రతిఫలం అనుభవించాల్సిన సమయం వచ్చిందనుకున్నారు. యేసు ఇప్పుడు సిలువను దిగి వస్తాడని అనేకులు గుసగుసలాడుకుంటున్నారు. కొందరు దారి తడుముకుంటూ పట్టణానికి తిరిగి వెళ్ళిపోడానికి ప్రయత్నించారు. వారు గుండెలు బాదుకుంటూ భయంతో రోదిస్తోన్నారు.DATel 853.3

    మధ్యాహ్నం మూడుగంటలకు ఆ చీకటి ప్రజల మీద నుంచి తొలగిపోయింది. కాని అది ఇంకా రక్షకుణ్ని కప్పింది. అది ఆయన హృదయంలో ఉన్న బాధ వేదనకు సూచిక. సిలువను ఆవరించిన చీకటిని ఏ కన్నూ ఛేదించలేకపోయింది. బాధననుభవిస్తోన్న యేసు ఆత్మను కప్పిన గాఢాంధకారాన్ని ఎవరూ చీల్చలేకపోయారు. ఆయన సిలువపై వేలాదుండగా కోపించిన మెరుపులు ఆయన్ని తాకుతున్నట్లు కనిపించాయి. అప్పుడు “యేసు ఎలోయీ, ఎలోయీ, లోమా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా, నాదేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అర్ధము. ” రక్షకునికి వెలుపల ఉన్న చీకటి విడిపోయినప్పుడు అనేకులు ఇలా అన్నారు. దేవుని కోపం ఆయన మీద ఉంది. ఆయన దేవుని కుమారుణ్ని అన్నందుకు దేవుని కోపం ఉరుములు మెరుపులుగా ఆయన మీద పడింది. ఆయనపై విశ్వాసముంచిన అనేకులు ఆయన నిస్పృహగా వేసిన కేకను విన్నారు. వారిలో నిరీక్షణ నశించింది. దేవుడే యేసుని విడిచిపెడితే ఆయన అనుచరులు దేన్ని నమ్ముకోవాలి?DATel 853.4

    బాధతో నిండిన క్రీస్తు ఆత్మనుంచి చీకటి విడిపోయినప్పుడు ఆయన తనకు కలిగిన బాధను గుర్తించగలిగి, “నేను దప్పిగొనుచున్నాను” అన్నాడు. ఒక రోమా సైనికుడు ఆయనపై జాలిపడి ఒకస్చంజిని హిస్సోపు పుడకకు తగిలించి దాన్ని చిరకలో ముంచి ఆయననోటికి అందించాడు. యాజకులు ఆయన బాధపడడం చూసి ఎగతాళి చేశారు. లోకాన్ని చీకటి కమ్మినప్పుడు వారు భయభ్రాంతులయ్యారు. వారి భయం వారిని పీడించింది. “ఎలోయీ, ఎలోయీ, లోమా సబక్తానీ” అన్న మాటల్ని వారు అపార్థం చేసుకున్నారు. తీవ్ర ద్వేషంతో ధిక్కారంతో “ఇదిగో ఏలియాను పిలుచుచున్నాడు” అన్నారు. ఆయన బాధను నివారించడానికి చివరి ఆవకాశాన్ని వారు తోసిపుచ్చారు. “తాళుడి; ఏలీయా వీనిని దింపవచ్చునేమో చూతము” అన్నారు. ఒళ్ళంతా కొరడా దెబ్బల గాయాలతో కళంకంలేని దైవకుమారుడు సిలువపై వేలాడుతున్నాడు. తరచుగా దీవించడానికి చాపిన ఆ హస్తాల్ని మేకులతో కొయ్యకు కొట్టారు. ఆ రాచ శిరస్సును ముళ్లకిరీటంతో గాయపర్చారు. వణుకుతున్న ఆ పెదాలు దుఃఖించడానికి కదులుతున్నాయి. ఆయన భరించిందంతా - తన తలనుంచి చేతులనుంచి, కాళ్లనుంచి కారిన రక్తపు చుక్కలు, తన శరీరాన్ని చీల్చిన బాధ, తండ్రి తన ముఖం చాటు వేసుకున్నందుకు కలిగిన హృదయవేదన - ప్రతీమానవుడితోను ఇలా చెబుతోంది: నీ కోసమే దైవ కుమారుడు ఈ ఆపరాధ భారాన్ని మొయ్యడానికి సమ్మతించాడు. నీ కోసమే ఆయన మరణ రాజ్యాన్ని జయించి, పరలోక ద్వారాల్ని తెరిచాడు. ఆగ్రహించిన సముద్రాన్ని శాంతపర్చిన ప్రభువు, నురుగులు కక్కుతూ ఎగసిపడ్తోన్న తరంగాలపై నడచిన ప్రభువు, దయ్యాల్ని వణికించి వ్యాధుల్ని బాగుచేసిన ప్రభువు, గుడ్డికళ్లు తెరిపించిన ప్రభువు, మృతుల్ని బతికించిన ప్రభువు తన్నుతాను బలిగా సిలువపై ఆర్చించుకున్నాడు. ఇది నీ మీద ప్రేమ చొప్పున చేశాడు. పాపాన్ని మోసే ఆయన దైవ న్యాయపాలిక ఉగ్రతను భరించి నీకోసం తానే స్వయంగా పాపమయ్యాడు.DATel 854.1

    ఆ భయంకర దృశ్యం అంతం కావడానికి ప్రేక్షకులు మౌనంగా కనిపెట్టారు. సూర్యుడు ప్రకాశిస్తోన్నాడు. కాని సిలువను ఇంకా చీకటి ఆవరించి ఉంది. యాజకులు అధికారులు యెరుషలేము తట్టుచూస్తున్నారు. దట్టమైన మేఘం ఆ పట్టణం మిద యూదా మైదానాల మీద నిలిచింది. లోకానికి వెలుగు ఆయిన నీతి సూర్యుడు తన కిరణాల్ని ఒకప్పుడు తనకు ప్రియమైన యేరుషలేము నుంచి ఉపసంహరించుకుంటోన్నాడు. దేవుని ఉగ్రత భయంకర మెరుపులు పిడుగులు ఆ పట్టణాన్నే లక్షించాయి.DATel 855.1

    హఠాత్తుగా సిలువమిద నుంచి ఆ చీకటి తొలగిపోయింది. సృష్టి అంతటికి వినిపిస్తున్నట్లు అనిపించే స్పష్టమైన బూరధ్వని వంటి స్వరంతో “సమాప్తమైనది” “తండ్రీ నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను.” అని యేసు కేక వేశాడు. సిలువ చుట్టూ వెలుగు ప్రకాశించింది. రక్షకుని ముఖం సూర్యకాంతిలా మహిమతో ప్రకాశించింది. అప్పుడు ఆయన తల ఛాతిమీదికి వంచి మరణించాడు.DATel 855.2

    ఆ భయంకరమైన చీకటిలో, దేవుడు విడిచి పెట్టునట్లు కనిపిస్తూ, ఉండగా క్రీస్తు మానవ దుఃఖ పాత్రలోని చేదును చివరి బొట్టువరకూ తాగాడు. ఆ భయంకర గడియల్లో తన తండ్రి ఆమోదానికి నిదర్శనం మిద ఆయన ఆధారపడ్డాడు. తన తండ్రి ప్రవర్తన ధోరణి ఆయనకు తెలుసు. ఆయన న్యాయశీలతను, ఆయన కృపను, ఆయన మహా ప్రేమను క్రీస్తు అవగాహన చేసుకున్నాడు. విశ్వాసమూలంగా క్రీస్తు ఆయన యందు విశ్రమించాడు. ఆయనకు విధేయుడై ఉండడమే క్రీస్తుకి నిత్యానందం. విధేయతతో ఆయన తన్ను తాను తండ్రికి అప్పగించుకున్నప్పుడు, తండ్రి ప్రసన్నతను కోల్పోయానన్న మనోభావం ఆయనను వదిలి వెళ్లిపోయింది. విశ్వాసం ద్వారా క్రీస్తు విజయుడయ్యాడు.DATel 855.3

    అలాంటి దృశ్యాన్ని లోకం మునుపెప్పుడూ వీక్షించలేదు. ప్రజలు నిశ్చేష్టితులై నిలిచిపోయారు. ఊపిరి బిగపట్టుకుని రక్షకుని వంక తేరిచూశారు. భూమిని మళ్లీ చీకటి కమ్మింది. పిడుగు శబ్దంలాంటి ఒక కర్కశ శబ్దం వినిపించింది. భయంకరమైన భూకంపం సంభవించింది. ప్రజలు ఆ భూకంపానికి పోగులు పోగులుగా కిందపడ్డారు. పెద్ద గందరగోళం ఆందోళన చెలరేగాయి. చుట్టుపట్ల ఉన్న పర్వతాల్లో రాతిబండలు బద్దలై కింద ఉన్న మైదానాల్లోకి విసురుగా వచ్చి పడ్డాయి. సమాధులు తెరచుకున్నాయి. మృతుల అవశేషాలు సమాధుల్లో నుంచి చెదిరిపడ్డాయి. సృష్టి వణుకుతున్నట్లు కనిపించింది. యాజకులు, అధికారులు, సైనికులు, తలారులు, ప్రజలు భయంతో ఉలుకు పలుకూ లేకుండ నేలపై సాష్టాంగపడ్డారు.DATel 856.1

    “సమాస్తమైనది” అన్న గంభీరమైన కేక క్రీస్తు నోటి నుంచి వచ్చినప్పుడు యాజకులు దేవాలయంలో పరిచర్య చేస్తున్నారు. అది సాయంత్ర బలి అర్పణకు సమయం. క్రీస్తుని సూచించే గొర్రె పిల్లను తెచ్చారు బలి అర్పణకు. ప్రాముఖ్యం గల తన అందమైన యాజక దుస్తులు ధరించిన యాజకుడు, అబ్రహము తన కుమారుణ్ని బలి ఇవ్వడానికి సిద్ధమైన రీతిగా కత్తి ఎత్తి నిలబడి ఉన్నాడు. ప్రజలు ఆసక్తిగా చూస్తోన్నారు. కాని భూమి దద్దరిల్లుతోంది, కంపిస్తోంది. ఎందుకంటే ప్రభువే దగ్గరకు వస్తున్నాడు. ఒక అదృశ్యహస్తం గుడి తెరను పైనుంచి కిందకు పరపర శబ్దంతో చింపి ఒకప్పుడు దేవుని సముఖం ఉండే స్థలాన్ని జనసమూహాల దృష్టికి తెరిచి ఉంచింది. ఈ స్థలంలోనే షెకీనా ఉండేది. ఇక్కడ కృపాసనంపై దేవుడు తన మహిమను కనపర్చేవాడు. ప్రధాన యాజకుడు ప్రజల పాపాలికి ప్రాయశ్చిత్తం చెయ్యడానికి ఏడాదికొక్కసారి మాత్రమే ఆ స్థలంలో ప్రవేశించేవాడు. ఆయ్యో, ఇప్పుడా తెర నడిమధ్యకు చినిగిపోయింది! ఇహలోక గుడారంలోని అతి పరిశుద్ధస్థలం ఇక పరిశుద్ధమయ్యింది కాదు!DATel 856.2

    అంతటా భయం గందరగోళం రాజ్యమేలుతోంది. యాజకుడు బలిపశువును వధించడానికి సమయాత్తమయ్యాడు. అయితే అతడి చేతిలో నుంచి కత్తి జారి కింద పడింది. గొర్రెపిల్ల పారిపోయింది. దైవకుమారుడి మరణంలో గురుతు నిజ స్వరూపాన్ని కలిసింది. నిజ స్వరూపం గుర్తును రద్దుపర్చింది. ఆ మహాత్యాగం జరిగింది. అతి పరిశుద్ధ స్థలంలోని మార్గం తెరవబడింది. ఒక నూతన, సజీవమైన మార్గం అందరికీ ఏర్పాటయ్యింది. పాపులు దుఃఖాక్రాంతులు అయిన మానవులు ప్రధానయాజకుడి రాకకోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇక నుంచి యాజకుడు గాను ఉత్తరవాదిగాను రక్షకుడు మహాకాశంలో పరిచర్య చేయనున్నాడు. అది ఒక సజీవ స్వరం ఆరాధకులతో మాట్లాడినట్లుంది. ఇప్పుడు పాప పరిహారార్ధ బలులు అర్పణలకు అంతం వచ్చింది. “దేవా నీ చిత్తము నెరవేర్చుటకు (అప్పుడు నేను - గ్రంధపుచట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము) వచ్చియున్నాను.” అన్న తన వాక్యానుసారం దేవకుమారుడు వచ్చాడు. “తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను.” హెబ్రీ 10:7; 9:12,13.DATel 856.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents