Go to full page →

24 - “జ్ఞానములేనివారై నశించుచున్నారు” PKTel 196

ఇశ్రాయేలీయుల పట్ల దేవుని అనుగ్రహం ఎల్లప్పుడూ వారి విధేయత షరతు పై లభ్యమయ్యింది. ఆయనకు “సమస్త దేశ జనులలో ... స్వకీయ సంపాద్యము” అవ్వటానికి సీనాయి పర్వతంవద్ద వారు ఆయనతో నిబంధన చేసుకున్నారు. విధేయతా మార్గంలో ఆయన్ని వెంబడిస్తామని గంభీర వాగ్దానం చేశారు. “యెహోవా చెప్పినదంతయు చేసెదము” అని ముక్తంకంఠంతో చెప్పారు. నిర్గమ. 19: 5,8. కొన్నిదినాల తర్వాత సీనాయి పర్వతంపైనుంచి దేవుడు తననోటితో ధర్మశాస్త్రాన్ని ఉచ్చరించి, కట్టడలు నీతి విధుల రూపంలో అదనపు ఉపదేశాన్ని మోషేద్వారా అందజేసినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు ముక్తకంఠంతో ఇలా వాగ్దానం చేశారు, “యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసెదము.” నిబంధనను ధ్రువపర్చేటప్పుడు ప్రజలు మరోసారి ఏకమై ఇలా వాగ్దానం చేశారు, “యెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుము.” నిర్గమ. 24:3,7. దేవుడు ఇశ్రాయేలీయుల్ని తన ప్రజలుగా ఎంపిక చేసుకున్నాడు. వారు ప్రభువుని తమ రాజుగా ఎన్నుకున్నారు. PKTel 196.1

అరణ్య సంచారం దాదాపు అంతమవుతున్న తరుణంలో నిబంధన షరతుల్ని పునరుచ్చరించటం జరిగింది. వాగ్దత్త దేశం సరిహద్దుల్లో ఉన్న బయెల్పెయోరు వద్ద అనేకులు ఒక మోసకరమైన శోధనకు ఆహుతి అయిపోయారు. దేవునికి నమ్మకంగా నిలిచినవారు తమ విశ్వసనీయతను నవీకరించుకున్నారు. భవిష్యత్తులో తమకు ఎదురు కానున్న శోధనల్ని గురించి మోషేద్వారా వారికి హెచ్చరిక వచ్చింది. తమ చుట్టూ ఉన్న జాతులనుంచి వేరుగా ఉంటూ దేవున్ని మాత్రమే ఆరాధించాల్సిందిగా వారిని ప్రోత్సహించటం జరిగింది. PKTel 196.2

మోషే ఇశ్రాయేలీయులికి ఇలా ఉద్బోధించాడు, “కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రదికి మీ పితరుల దేవుడైన యెహవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరచుకొనునట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మోకాజ్ఞాపించిన మాటతో దేనిని కలుప కూడదు, దానిలోనుండి దేనిని తీసివేయకూడదు .... ఈ కట్టడలనన్నిటిని మీరు గైకొని అనుసరింపవలెను. వాటినిగూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి - నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేకములు గల జనమని చెప్పుకొందురు.” ద్వితి. 4:1-6. PKTel 196.3

దైవ ధర్మశాస్త్రాన్ని విస్మరించకూడదని, దానికి విధేయులై నివసించినప్పుడే తాము శక్తిపొంది దీవెనల్ని అందుకోగలుగుతారని ఇశ్రాయేలు ప్రజలికి చెప్పటం జరిగింది. “అయితే నీవు జాగ్రత్తపడుము. నీవు కన్నులార చూచినవాటిని మరువకయుండునట్లును, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములోనుండి తొలగిపోకుండునట్లును, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని” నేర్పుమంటూ మోషేద్వారా ప్రభువు వారికి ఆజ్ఞాపించాడు. 9వ వచనం. సీనాయి పర్వతం పై నుంచి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన సన్నివేశాలు ఎన్నటికీ మరువరానివి. తమ పొరుగున ఉన్న జాతుల్లో అనుసరిస్తున్న విగ్రహారాధక ఆచారాల్ని గురించి వారికి వచ్చిన హెచ్చరికలు స్పష్టమైనవి, నిర్ణయాత్మకమైనవి. కావున మీరు చెడిపోయి భూమిమీద నున్న యే ... ప్రతిమనైనను” “ఆకాశమువైపు కన్నులెత్తి సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలుకొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్తపడుడి.” “మీ దేవుడైన యెహోవా మికు ఏర్పరచిన నిబంధనను మరచి నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసికొనకుండునట్లు మీరు జాగ్రత్త పడవలెను.” 15,16,19,23 వచనాలు. PKTel 197.1

యెహోవా కట్టడల్ని అనుసరించకపోవటంవల్ల సంభవించే దుష్పరిణామాల్ని మోషే వివరించాడు. వాగ్దత్త దేశంలో దీర్ఘకాలం నివసించిన తర్వాత ప్రజలు తప్పుడు ఆరాధన ఆచారాల్ని అనుసరించి, విగ్రహాలకు మొక్కినట్లయితే, దేవుని ఉగ్రత రగులుకుంటుందని వారు చెరపట్టబడి అన్యజనులమధ్య చెదరగొట్టబడ్డారని ప్రకటించి దానికి భూమ్యాకాశాల్ని సాక్ష్యులుగా ఉండాల్సిందంటూ పిలుపునిచ్చాడు. అతడు వారిని ఇలా హెచ్చరించాడు, “మీరు ఈ యోర్గాను దాటి స్వాధీన పరచుకొనబోవు దేశములో ఉండకుండ త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమ్యాకాశములను మిమీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహు దినములుండక మీరు బొత్తిగా నశించి పోయెదరు. మరియు యెహోవా జనములలో మిమ్మును చెదరగొట్టును. యెహోవా ఎక్కడికి మిమ్మును తోలివేయునో అక్కడి జనములలో మీరు కొద్దిమందే మిగిలియుందురు. అక్కడ మీరు మనుష్యుల చేతిపనియైన కఱ్ఱ రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు.” 26-28 వచనాలు. PKTel 197.2

న్యాయాధిపతుల కాలంలో పాక్షికంగా నెరవేరిన ఈ ప్రవచనం అషూరులో ఇశ్రాయేలువారి చెరలోను బబులోనులో యూదావారి చెరలోను సంపూర్తిగా, అక్షరాల నెరవేరింది. PKTel 198.1

ఇశ్రాయేలీయుల మతభ్రష్టత క్రమక్రమంగా జరిగింది. దేవుడు ఎంపిక చేసుకున్న ప్రజలు ఏ “కట్టడలన్నియు, ఆజ్ఞలన్నియు నిరంతరం ఆచరిస్తామని వాగ్దానం చేశారో వాటిని వారు మర్చిపోయేటట్లు చెయ్యటానికి ప్రతీ యుగంలోను సాతాను పదేపదే ప్రయత్నించాడు (ద్వితీ. 6:1). దేవున్ని మర్చిపోటానికి “ఇతర దేవతల ననుసరించి పూజించి నమస్కరించటానికి ఇశ్రాయేలీయుల్ని నడిపించగలిగితే వారు “నిశ్చయముగా నశించిపోదురని” అతడికి తెలుసు. ద్వితీ. 8:19. PKTel 198.2

ఎవరు “ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక” “కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు” కలిగి “వేయి వేలమందికి కృపచూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించునో” ఆ యెహోవా దయాదాక్షిణ్య స్వభావాన్ని లోకంలో ఉన్న దైవ సంఘానికి విరోధి అయిన సాతాను పరిగణనలోకి తీసుకోలేదు. (నిర్గమ. 34:6, 7). ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం దేవుని సంకల్పాన్ని భగ్నం చెయ్యటానికి సాతాను శతథా ప్రయత్నిస్తున్నా, దుష్టశక్తులు విజయం సాధిస్తున్నట్లు కనిపించినా, చరిత్ర అంధకార గడియల్లో సయితం ప్రభువు తన్ను తాను ప్రత్యక్ష పర్చుకున్నాడు. తమ జాతి సంక్షేమానికి ఏవి అవసరమో వాటిని ఇశ్రాయేలు ప్రజల ముందు ఉంచాడు. “నేను అతని కొరకు నా ధర్మ శాస్త్రమును వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను.” “ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పినవాడను నేనే; నేనే వారిని స్వస్థపరచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు” అని హో షేయద్వారా ప్రభువంటున్నాడు. హోషే 8:12, 11:3. దయ కలిగిన ప్రభువు వారితో నివసించాడు. తన ప్రవక్తలద్వారా వారికి వాక్యం వెంబడి వాక్యం సూత్రం వెంబడి సూత్రం బోధించాడు. PKTel 198.3

ఇశ్రాయేలు ప్రజలు ప్రవక్తల వర్తమానాల ప్రకారం నివసించి ఉంటే అనంతరం ఆ జాతికి కలిగిన పరాభవం తప్పేది. వారు తన ధర్మశాస్త్ర ఆచరణనుంచి తొలగి పోయారు గనుక వారిని బానిసత్వంలోకి పోనివ్వటం కన్నా దేవునికి వేరే మార్గం లేకపోయింది. “నా జనులు జ్ఞానము లేనివారై నశించుచున్నారు.” “నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక .... నిన్ను విసర్జింతును; నీవే నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేనును” మిమ్ముల్ని విసర్జిస్తాను అన్నది హోషేయద్వారా ఆయన వర్తమానం. హోషే 4:6. PKTel 198.4

ప్రతీయుగంలోను దైవ ధర్మశాస్త్ర ఉల్లంఘన వెంట పర్యవసానాలు వచ్చాయి. నోవహు దినాల్లో ప్రజలు ప్రతీ నీతి నియమాన్ని అతిక్రమించటంతో పాపం దుర్నీతి విస్తరించినందువల్ల దేవుడు ఇక సహించలేకపోయాడు. కనుక ఆయన తీర్మానం ఇది, “నేను సృజించిన నరులను ... భూమిమీద నుండకుండ తుడిచివేయుదును.” ఆది. 6:7. అబ్రహాము దినాల్లో సొదొమ ప్రజలు బాహాటంగా దేవున్ని ధిక్కరించి ఆయన ధర్మశాస్త్రాన్ని కాలరాచారు. జలప్రళయానికి ముందున్న ప్రజల్లో చోటుచేసుకున్న దుష్టత, దుర్నీతి, అనైతిక విచ్చలవిడి ప్రవర్తనా అక్కడ రాజ్యమేలాయి. సొదొమ నివాసులు దేవుని ఓర్పు అవధుల్ని దాటిపోయారు. వారిపై దేవుని ఉగ్రత మంటలు రాజుకున్నాయి. PKTel 199.1

ఇశ్రాయేలు పదిగోత్రాల చెరకు ముందు ప్రబలిన అవిధేయత దుర్మార్గత అలాంటిదే. వారు దైవ ధర్మశాస్త్రాన్ని ఖాతరు చెయ్యలేదు. ఇశ్రాయేలులోకి వరదలా వస్తున్న దుష్టతకు ఇది గుమ్మాలు తెరచింది. హోషేయ ఇలా అన్నాడు, “సత్యమును కనికరమును దేవునిగూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యెమాడుచున్నాడు. అబద్ద సాక్ష్యము పలుకుటయు అబద్ద మాడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుకయ్యెను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు.” హోషే 4:1,2. PKTel 199.2

ఆమోసు, హో షేయ ప్రవక్తలు అందించిన తీర్పులు శిక్షల ప్రవచనాల వెనుక భవిష్యత్ మహిమను గూర్చిన ప్రవచనాలు కూడా అందించారు. దీర్ఘకాలం తిరుగుబాటు చేస్తూ పశ్చాత్తాపం లేకుండా నివసించిన పదిగోత్రాలకు పాలస్తీనాలో తమ పూర్వ అధికారం పూర్తి పునరుద్దరణ వాగ్దానం లేదు. లోకాంతంవరకు వారు “దేశము విడిచి అన్యజనులలో సంచరించాల్సి ఉన్నారు. కాని ప్రపంచ చరిత్ర అంతంలో క్రీస్తు రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను ప్రత్యక్షమైనప్పుడు దైవప్రజలు పొందనున్న చివరి పునరుద్ధరణలో పాలు పంచుకునే ఆధిక్యతను వారి ముందుంచే ప్రవచనం ఒకటి హోషేయ ద్వారా దేవుడు ఇచ్చాడు. పదిగోత్రాలవారు “చాల దినములు రాజు లేకయు, అధిపతి లేకయు బలినర్పింపకయు నుందురు. దేవతా స్తంభమును గాని ఏఫోదునుగాని గృహ దేవతలను గాని యుంచుకొనకుందురు.” ప్రవక్త ఇంకా ఇలా అన్నాడు. “తరుణత ఇశ్రాయేలీయులు తిరిగివచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదు నొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు.” హోషే 3:4,5. PKTel 199.3

వాగ్దత్త దేశంలో ఉన్నప్పుడు తనకు నమ్మకంగా నివసించిన ఇశ్రాయేలీయులకి ఇచ్చిన దీవెనల్ని పది గోత్రాలకు పునరుద్ధరించే దైవ ప్రణాళికను భూమిపై ఉన్న దేవుని సంఘంతో సంయుక్తమవ్వటానికి పశ్చాత్తాపపడి సిద్దంగా ఉన్న ప్రతీ ఆత్మ ముందు హో షేయ ద్వారా ప్రభువు ఉంచాడు. కరుణ చూపించటానికి తాను ఆశిస్తున్న జనాంగంగా ఇశ్రాయేలును ప్రస్తావిస్తూ ప్రభువిలా అన్నాడు, “దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుదును. అక్కడనుండి దానిని తోడుకొనివచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును. ఆకోరు (శ్రమగల) లోయను నిరీక్షణ ద్వారముగా చేసెదను, బాల్యమున ఐగుప్తు దేశములోనుండి అది వచ్చినప్పుడు నామాట వినినట్లు అది ఇచ్చటనుండి నా మాట వినును. నీవు - బయలు అని నన్ను పిలువక - నా పురుషుడవు అని పిలుతువు. ఇదే యెహోవా వాక్కు అది ఇక మీదట బయలు దేవతల పేర్లను జ్ఞాపకమునకు తెచ్చుకొనకుండను అవి దానినోట రాకుండను నేను చేసెదను.” హోషే 2:14-17. PKTel 200.1

ఈ లోక చరిత్ర చివరి దినాల్లో, ఆజ్ఞలు కాపాడే దైవ ప్రజలతో దేవుని నిబంధన నవీకరణ పొందాల్సి ఉంది. “ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూ జంతువులతోను ఆకాశ పక్షులతోను నేలనుప్రాకు జంతువులతోను నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండ మాన్పించి వారిని నిర్భయముగా నివసింపజేయుదును. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతినిబట్టి తీర్పుతీర్చుటవలనను, దయా దాక్షిణ్యములు చూపుటవలన నిన్ను ప్రధానము చేసికొందును. నీవు యెహోవా ఎరుగునట్లు నేను నమ్మకమునుబట్టి నిన్ను ప్రధానము చేసికొందును. PKTel 200.2

“ఆ దినమున నేను మనవి ఆలకింతును. ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమియొక్క మనవిని ఆలకించును. భూమి ధాన్య ద్రాక్షరస తైలముల మనవి ఆలకింపగా అవి యెజ్రాయేలు చేయు మనవి ఆలకించును. నేను దానిని భూమియందు నాకొరకై విత్తుదును. జాలినొందనిదాని యందు నేను జాలి చేసికొందును. నా జనము కానివారితో - మిరే నా జనమని నేను చెప్పగా వారు - నీవే మా దేవుడవు అని యందురు. ఇదే యెహోవా వాక్కు” 18-23 వచనాలు. PKTel 200.3

“ఆ దినమున” “ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించు కొనినవారును ... ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు.” యెష 10:20. వారిలో “మీరు దేవునికి భయపడి ఆయనను మహిమ పరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను.” అన్న వర్తమానానికి సంతోషంగా స్పందించేవారు కొందరుంటారు. తమను లోకానికి బంధించే ప్రతీ విగ్రహాన్ని తోసిపుచ్చి “ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారం చేస్తారు. వారు ప్రతీ బంధకాన్నీ విడిపించుకుని దేవుని కృపకు చిహ్నాలుగా లోకంముందు నిలబడ్డారు. దైవవిధుల్ని నమ్మకంగా నెరవేర్చుతూ నివసించే వీరు “దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును” గైకొంటున్నవారిగా దేవదూతల చేత మనుషులచేత గుర్తింపు పొందుతారు. ప్రక. 14:6, 7,12. PKTel 201.1

“రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు. విత్తనములు చల్లువారి వెంటనే ద్రాక్షపండ్లు తొక్కువారు వత్తురు. పర్వతములనుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును. కొండలన్ని రసధారలగును. ఇదే యెహోవా వాక్కు మరియు శ్రమనొందుచున్న నా జనులగు ఇశ్రాయేలీయులను నేను చెరలోనుండి రప్పింతును. పాడైన పట్టణములను మరల కట్టుకొని వారు కాపురముందురు. ద్రాక్షతోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పండ్లను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును. నేను వారికిచ్చిన దేశములోనుండి వారు ఇక పెరికి వేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు.” ఆమోసు. 9:13-15. PKTel 201.2