Go to full page →

48 - “శక్తిచేతనైనను బలముచేతనైనను” కాదు PKTel 416

యెహోషువ దేవదూత గురించి జెకర్యాకు వచ్చిన దర్శనం వెనువెంటనే జెరుబ్బాబెలు పనినిగూర్చి ప్రవక్తకు ఒక వర్తమానం వచ్చింది. జెకర్యా ఇలా అన్నాడు, “నాతో మాటలాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన యొకని లేపినట్లు నన్ను లేపి నీకు ఏమి కనబడుచున్నదని యడుగగా నేను - సువర్ణమయమైన దీపస్తంభములును దానిమీద ఒక ప్రమిదేయును, దీప స్తంభమునకు ఏడు దీపములును ఏడేసి గొట్టములును కనబడుచున్నవి. మరియు రెండు ఒలీవచెట్లు దీపస్తంభమునకు కుడిప్రక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నదని చెప్పి - PKTel 416.1

“నా యేలినవాడా, యిదేమిటియని నాతో మాటలాడుచున్న దూత నడిగితిని.... అప్పుడతడు నాతో ఇట్లనెను - జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే; శక్తిచేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చెను.” PKTel 416.2

“దీపస్తంభమునకు ఇరుప్రక్కలనుండు ఈ రెండు ఒలీవచెట్లు ఏమిటనియు రెండు బంగారపు కొమ్మలలోనుండి సువర్ణ తైలము కుమ్మరించు ఒలీవ చెట్లకున్న రెండు కొమ్మలును ఏమిటనియు నేనతని నడుగగా.... అతడు వీరిద్దరు సర్వలోక నాధుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయువారై యున్నారనెను.” జెకర్యా. 4:1-6; 11-14. PKTel 416.3

ఈ దర్శనంలో దేవునిముందు నిలిచి ఉన్న రెండు ఒలీవచెట్లు బంగారు కొమ్మలనుంచి తమ సువర్ణ తైలాన్ని దీపస్తంభం పళ్లెంలోకి కుమ్మరిస్తున్నట్లు సూచించటం జరిగింది. అవి కాంతివంతంగా నిత్యం వెలిగేందుకు ఈ నూనె దీపాలికి సరఫరా అవుతున్నది. అలాగే దేవుని సముఖంలో నిలబడే అభిషిక్తులనుంచి దేవుని వెలుగు, ప్రేమ, శక్తి ఆయన ప్రజలకు సరఫరా అవ్వాల్సి ఉన్నాయి. వారు వెలుగు ఆనందం ఉత్తేజం ఇతరులికి అందించేందుకు వీటిని దేవుడు అనుగ్రహించటం జరుగుతుంది. ఇలా దైవకృపలతో ఐశ్వర్యవంతు లయ్యేవారు ఇతరుల్ని దైవప్రేమతో భాగ్యవంతుల్ని చెయ్యాల్సి ఉన్నారు. PKTel 416.4

ప్రభువు మందిరాన్ని తిరిగి నిర్మించటంలో జెరుబ్బాబెలు అనేక కష్టాల్ని ఎదుర్కొంటూ పనిచేశాడు. విరోధులు “యూదా వంశస్తులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్నవారిని బాధపరచి” “బలవంతము చేతను అధికారముచేతను వారు పని ఆపునట్లు” చేశారు. ఎజ్రా. 4:4,23. అయితే కట్టేవారి తరపున ప్రభువు జోక్యం చేసుకున్నాడు. ఇప్పుడు తన ప్రవక్తద్వారా జెరుబ్బాబెలుతో మాట్లాడ్డూ ఇలా అన్నాడు “గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదునువగుదువు - కృప కలుగునుగాక కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసికొని పెట్టించును.” జెకర్యా. 4:7. PKTel 417.1

దేవుని ఉద్దేశాల్ని నెరవేర్చటానికి శ్రమిస్తున్న వారిముందు అధిగమించటం అసాధ్యంగా కనిపించిన పర్వతాల్లాంటి కష్టాలు దైవప్రజల చరిత్ర అంతటిలోను ప్రత్యక్షమయ్యాయి. వారి విశ్వాసాన్ని పరీక్షించటానికి అలాంటి ఆటంకాల్ని దేవుడే అనుమతించాడు. శత్రువు అన్నిపక్కలూ మూసివేసినప్పుడు అన్ని సమయాల్లోకన్నా అప్పుడే మనం దేవున్ని ఆయన ఆత్మ తాలూకు శక్తిని విశ్వసించాలి. సజీవ విశ్వాసం కలిగి ఉండటమంటే అధిక ఆధ్మాత్మిక శక్తిని కలిగిఉండటం, అచంచలమైన నమ్మకాన్ని పెంచుకోటం. ఆత్మ ఈ రీతిగా జయించే శక్తి అవుతుంది. క్రైస్తవుడి మార్గంలో సాతాను కల్పించే ప్రతిబంధకాలు విశ్వాసం ఆదేశంపై మాయమవుతాయి. ఎందుకంటే పరలోక శక్తులు అతణ్ని ఆదుకుంటాయి. “మీకు అసాధ్యమైనది ఏదియు నుండదు.” మత్త. 17:20. PKTel 417.2

డాబు డంబంతో ప్రారంభించటం లోకంతీరు. చిన్న చిన్న కార్యాలు జరిగే దినాన్ని సత్యం, నీతి సాధించే విజయానికి నాంది చెయ్యటం దేవుని తీరు. కొన్నిసార్లు తన సేవకులకు నిరాశ అపజయం కలిగించటం ద్వారా ఆయన శిక్షణనిస్తాడు. వారు కష్టాల్ని అధిగమించటం నేర్చుకోటమే ఆయన ఉద్దేశం. PKTel 417.3

మనుషులు తరచు తమకు ఎదురయ్యే ఆందోళనలు ఆటంకాలముందు తడబడతారు. కాని వారు తమ ఆరంభ విశ్వాసాన్ని చివరివరకు స్థిరంగా పదిలంగా ఉంచుకుంటే, దేవుడు వారి మార్గాన్ని సుగమం చేస్తాడు. కష్టాలతో పోరాడుతున్నప్పుడు విజయం వస్తుంది. భయమెరుగని స్వభావం చలించని విశ్వాసం గల జెరుబ్బాబెలు ముందు పర్వతంలాంటి కష్టం చదునైన మైదానంలా మారుతుంది. ఎవరి చేతులు పునాదులు వేశాయో “అతని చేతులు ముగించును.” “కృప కలుగునుగాక కృప కలుగును గాక” అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసికొని పెట్టించును.” జెకర్యా. 4:9,7. PKTel 417.4

మానవాధికారం మానవ శక్తి దేవుని సంఘాన్ని నెలకొల్పలేదు. అవి సంఘాన్ని నాశనం చెయ్యలేవు కూడా. మానవ శక్తి అనే బండమీదగాక యుగయుగాల బండ అయిన క్రీస్తు యేసు మిద సంఘం స్థాపితమయ్యింది. “పాతాళలోక ద్వారములు దానియెదుట నిలువనేరవు.” మత్త. 16:18. దేవుని సముఖం ఆయన సేవకు స్థిరత నిస్తుంది. రాజుల చేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి.” అన్నది మనకు వస్తున్న దైవవాక్కు కీర్త. 146:3. “మీరు ఊరకుండి నమ్ముకొనుటవలన మీకు బలము కలుగును.” యెష 30:15. నిత్య సత్య సూత్రాలపై స్థాపితమైన దైవ సేవ ఎన్నడూ పరాజయం పొందదు. అది నానాటికీ బలం పుంజుకుంటూ ముందుకు సాగుతుంది, “శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చెను.” జెకర్యా. 4:6. PKTel 418.1

‘జెరుబ్బాబెలు చేతులు యీ మందిర పునాది వేసియున్నవి, అతని చేతులు ముగించును.” 9వ వచనం. అన్న వాగ్దానం అక్షరాల నెరవేరింది. “యూదుల పెద్దలు కట్టించుచు, ప్రవక్తయైన హగ్గయియు ఇదో కుమారుడైన జెకర్యాయు హెచ్చరించు చున్నందున పని బాగుగ జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞ ననుసరించి వారు కట్టించుచు, కోరేషు దర్యావేషు ఆర్తహషస్త అను పారసీక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి. రాజైన దర్యావేషు ఏలుబడియందు ఆరవ సంవత్సరము అదారునెల మూడవ నాటికి మందిరము సమాప్తి చేయబడెను.” ఎజ్రా. 6:14,15. PKTel 418.2

పూర్తి అయిన కొద్ది కాలానికే ఆలయ ప్రతిష్ట జరిగింది. “అప్పుడు ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును చెరలోనుండి విడుదల నొందిన తక్కినవారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్టించిరి.” “మొదటినెల పదునాలుగవ దినమున పస్కాపండుగ ఆచరించిరి.” 16,17,19 వచనాలు. PKTel 418.3

వైభవపరంగా రెండో దేవాలయం మొదటి దేవాలయంతో సరిసాటి కాదు. మొదటి ఆలయంలా రెండో ఆలయం దేవుని సముఖాన్ని సూచిస్తున్న గుర్తులతో పరిశుద్ధ పర్చబడలేదు. దీని ప్రతిష్టప్పుడు మానవాతీత శక్తి ప్రదర్శన జరగలేదు. మహిమతో నిండిన మేఘం కొత్తగా నిర్మించిన ఆలయాన్ని నింపలేదు. దీని బలిపీఠం మీది బలిని దహించటానికి పరలోకంనుంచి అగ్ని దిగిరాలేదు. అతి పరిశుద్ధ స్థలంలో కెరూబుల మధ్య షెకీనా ఇకలేదు. మందసం, కృపాసనం, పది ఆజ్ఞల పలకలు లేవు. విజ్ఞాపన చేస్తున్న యాజకుడికి యెహోవా చిత్రాన్ని తెలియజేస్తూ పరలోకంనుంచి ఏ సూచనా రాలేదు. PKTel 418.4

అయినా హగ్గయి ప్రవక్త నోట : “ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరముయొక్క మహిమను మించును” అని ప్రభువు చెప్పిన కట్టడం ఇదే. “నేను అన్యజనులందరిని కదలింపగా అన్యజనులందరియొక్క యిష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు” హగ్గయి. 2:9,7. దేవుడు హగ్గయి ద్వారా చేసిన వాగ్దానం ఎందులో నెరవేరిందో చూపించటానికి మేధావులు శతాబ్దాలుగా ప్రయత్నిస్తున్నారు. అయినా సర్వజనుల కాంక్షణీయుడు, ఏ మహనీయుని వ్యక్తిగత సముఖంవల్ల ఆలయం పరిశుద్దమయ్యిందో ఆ నజరేయుడైన యేసులో ఏ ప్రత్యేకతా ఏ ప్రాధాన్యం చూడటానికి అనేకులు నిరాకరిస్తున్నారు. ప్రవక్త మాటల వాస్తవిక అర్ధాన్ని గుర్తించకుండా అతిశయం అవిశ్వాసం వారికి గుడ్డితనం కలిగించాయి. PKTel 419.1

రెండో ఆలయం యెహోవా మహిమా మేఘంతో ఘనపర్చబడలేదుగాని “దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా” ఎవరియందు ఉన్నదో ఆయన సముఖంతోనే అనగా “సశరీరుడుగా ప్రత్యక్షు”డైన దేవుని సముఖంతోనే అది ఘనపర్చబడింది. కొలొస్స. 2:9;1 తిమోతి. 3:16. తన ఇహలోక పరిచర్య కాలంలో క్రీస్తు వ్యక్తిగత సముఖంతో అది ఘనపర్చబడింది. ఇందులోనే మొదటి ఆలయం మహిమను రెండో ఆలయం మహిమ అధిగమించింది. నజరేతువాడు పరిశుద్ధ ఆలయ ఆవరణలో బోధించినప్పుడు స్వస్తపర్చినప్పుడు “అన్యజనులందరియొక్క యిష్ట వస్తువులు” అయిన క్రీస్తు వాస్తవంగా తన ఆలయంలోకి వచ్చాడు. PKTel 419.2