తమపట్ల కోరెషు చూపించిన దయ, సానుభూతివల్ల యూదులు తమ దేశానికి తిరిగి వెళ్లిపోవచ్చునన్న డిగ్రీని చెరలో ఉన్న వారిలో దాదాపు ఏభైవేలమంది వినియోగించుకున్నారు. మాదీయ పారసీక దేశమంతటా చెదిరిపోయి ఉన్న లక్షలమందితో పోల్చిచూస్తే వీరు బహు కొద్దిమంది మాత్రమే. ఇశ్రాయేలీయుల్లో అధిక సంఖ్యాకులు తిరుగు ప్రయాణంలోని కష్టాలు, మనుష సంచారంలేని తమ పట్టణాలు, పాడుపడిన తమ గృహాల్లో తిరిగి స్థిరపడటంలోని సమస్యలు దృష్టిలో ఉంచుకుని తమ చెరదేశంలోనే ఉండిపోటానికి నిర్ణయించుకున్నారు. PKTel 420.1
ఇరవై సంవత్సరాలు పైగా గడిచాయి. అప్పుడు రాజుగా పరిపాలిస్తున్న దర్యావేషు హిస్టాపెస్ రెండో డిక్రీ జారీ చేశాడు. అది కూడా మొదటి డిక్రీలాగే యూదులికి అనుకూలంగా ఉంది. ఈవిధంగా మాదీయ పారసీక రాజ్యంలో ఉన్న యూదులు తమ పితరుల దేశానికి తిరిగి వెళ్లటానికి కృపామయుడైన దేవుడు మరొక అవకాశం కల్పించాడు. ఎస్తేరు పుస్తకంలోని అహష్వేరోషు పరిపాలనలో రానున్న కష్టాల్ని ప్రభువు ముందే చూశాడు. కనుక అధికారంలో ఉన్న మనుషుల హృదయాలోచనల్ని మార్చటమేగాక చెరదేశంలో ఉన్న ప్రజల్ని తిరిగి తమ దేశానికి వెళ్లిపోవాల్సిందిగా విజ్ఞాపన చేయమని దేవుడు జెకర్యాను ఆవేశపర్చాడు. PKTel 420.2
స్వదేశంలోని తమ గృహాలకు దూరంగా ఉన్న పరదేశంలో అనేక ప్రాంతాల్లో చెదిరి ఉన్న ఇశ్రాయేలు గోత్రాలవారికి దేవుడు పంపిన వర్తమానం ఇది : “ఉత్తర దేశములో ఉన్నవారలారా, తప్పించుకొని రండి; ఆకాశపు నాలుగు వాయువులంత విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసియున్నాను; ఇదే యెహోవా వాక్కు బబులోను దేశములో నివాసివగు సీయోనూ, అచ్చటినుండి తప్పించుకొని పొమ్ము ఇదే యెహోవా వాక్కు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా - మిమ్మును ముట్టువాడు తన కనుగుడ్డును ముట్టినవాడని యెంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి, మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. నేను నా చేతిని వారిమీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకధిపతియగు యెహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలిసికొందురు.” జెకర్యా. 2:6-9. PKTel 420.3
తన ప్రజలు లోకంలో మంచిపేరు తెచ్చుకుని తన నామానికి మహిమ తేవాలన్నది ఆదినుంచి లాగే ఇప్పుడు కూడా దేవుని ఉద్దేశం. దీర్ఘకాలంగా సాగిన వారి చెర సంవత్సరాల్లో తన పక్కకుమళ్లి తనకు నమ్మకంగా ఉండటానికి ఆయన వారికి అనేక తరుణాలిచ్చాడు. కొందరు వినుకుని ఆయనకు విధేయులై నివసించటానికి తీర్మానించుకోగా కొందరు శ్రమలమధ్యనే రక్షణ కనుగొన్నారు. వీరిలో చాలామంది తిరిగి రావాల్సిఉన్న శేషించిన ప్రజల్లో లెక్కించబడాల్సి ఉంది. పరిశుద్ద లేఖనం వారిని “ఇశ్రాయేలు దేశములోని యెత్తుగల పర్వతము మీద” నాటాల్సిఉన్న ఎత్తయిన దేవదారు వృక్షపు కొమ్మ”తో పోల్చుతున్నది. యెహె. 17:23,22, PKTel 421.1
“ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో” (ఎజ్రా. 1:5) వారందరూ కోరెషు డిక్రీ ప్రకారం తమ దేశానికి తిరిగి వచ్చారు. కాగా తమ చెర దేశంలోనే ఉండిపోటానికి ఎంపిక చేసుకున్న వారితో విజ్ఞాపన చెయ్యటాన్ని దేవుడు మానలేదు. అనేక మార్గాల్లో వారి తిరిగి రాకను సాధ్యపరిచాడు. కోరెషు డిక్రీకి స్పందించని వారిలో అధిక సంఖ్యాకులు తర్వాతి ప్రభావాలకు మెత్తబడకుండా నిలిచిపోయారు. ఎలాంటి జాప్యంలేకుండా వెంటనే బబులోను నుంచి పారిపోవాల్సిందంటూ జెకర్యా చేసిన హెచ్చరికను సయితం వారు లెక్కచెయ్యలేదు. PKTel 421.2
ఇంతలో మాదీయ పారసీక రాజ్యంలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. యూదులకు దయచూపించిన రాజు దర్యావేషు హెస్టాపెస్ అనంతరం అహష్వేరోషు సింహాసనానికి వచ్చాడు. బబులోనునుంచి పారిపోవలసిందిగా వచ్చిన పిలుపును నిరాకరించిన యూదులు ఈ రాజు ఏలుబడిలోనే తీవ్ర క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. దేవుడు ఏర్పాటుచేసిన మార్గాన్ని వినియోగించుకుని తప్పించుకునే అవకాశాన్ని విసర్జించి వారిప్పుడు మరణాన్ని ఎదుర్కుంటున్నారు. PKTel 421.3
అగాగీయుడైన హామాను మదీయ పారసీక రాజ్యంలో ఉన్నతాధికారి. నీతి నియమాలు లేని వ్యక్తి. దేవుని కార్యాలకు అడ్డుకట్ట వెయ్యటానికి ఈ సమయంలో సాతాను ఇతడి ద్వారా పనిచేశాడు. యూదుడైన మొర్రెకైపై హామనుకి తీవ్ర ద్వేషం. మొర్ధికై హామానికి చేసిన హాని ఏమిలేదు. అతడి ముందు వంగి నమస్కరించటానికి నిరాకరించటమే ఇతడు చేసిన నేరం. “మొర్ధికై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమనియెంచి” “అహష్వేరోషు యొక్క రాజ్యమందంతట నుండు మొర్ధికై స్వజనులగు యూదులందరిని సంహరించుటకు” హామాను కుట్రపన్నాడు. ఎస్తేరు. 3:6. PKTel 421.4
హామాను తప్పుడు సమాచారాన్నిబట్టి మోసపోయిన అహష్వేరోషు మాదీయ పారసీక “రాజ్య సంస్థానములన్నిటియందుండు జనులలో... చెదరిఉన్న” యూదుల నరమేధానికి ఓ డిగ్రీని జారీ చెయ్యటానికి అంగీకరించాడు. 8వ వచనం. యూదుల సంహారానికి వారి ఆస్తుల స్వాధీనానికి ఒక దినం నియమితమయ్యింది. ఈ డిక్రీ పూర్తిగా అమలైతే చోటుచేసుకునే దీర్ఘకాలిక పర్యవసానాల్ని రాజు గుర్తించలేదు. ఈ పథకానికి అజ్ఞాత ప్రేరేపకుడు సాతానే. దేవుని గూర్చిన జ్ఞానాన్ని పరిరక్షిస్తున్న ఈ ప్రజల్ని భువిలోనుంచి తుడిచివేయటానికి అతడు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. PKTel 422.1
“రాజుయొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖములోను ఏడ్పులోను మునిగియున్నవారై, అనేకులు గోనెను బూడిదెను వేసికొని పడియుండిరి.” ఎస్తేరు 4:8. మాదీయులు పారసీకుల శాసనం రద్దు చెయ్యటం సాధ్యంకాదు. యూదులికి ఎలాంటి నిరీక్షణా లేనట్లు కనిపించింది. ఇశ్రాయేలీయులందరు నిర్మూలమవ్వటం తథ్యం. PKTel 422.2
ఇలాగుండగా మానవులమధ్య రాజ్యమేలే ఒక శక్తి, శత్రువు ఎత్తుగడల్ని చిత్తు చేసింది. సర్వోన్నతునికి భయపడే ఎస్తేరు అనే యూదురాలు దేవుని కృపలో మాదీయ పారసీక రాజ్యానికి రాణి అయ్యింది. ఆమెకు మొర్దికై దగ్గర బంధువు. తమ ఈ అత్యవసర పరిస్థితిలో తమ ప్రజల పక్షంగా అహష్వేరోషు రాజుకి మనవి చేసుకోవాలని వీరు నిర్ణయించుకున్నారు. ఎస్తేరు సాహసించి విజ్ఞాపకురాలుగా రాజు సముఖంలోకి ప్రవేశించాల్సి ఉంది. “నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుము.” అన్నాడు మొద్దెకై. 14వ వచనం. PKTel 422.3
ఎస్తేరు ముందున్నది అతి క్లిష్ట పరిస్థితి. దానికి తక్షణ చర్య అవసరం. అయితే ఆమె మొరెకై ఇద్దరూ గుర్తించిందేంటంటే దేవుడు తమ పక్షంగా అద్భుత కార్యం చేస్తే తప్ప, తమ సొంత ప్రయత్నాలు నిష్పలమన్నది. కాబట్టి ఎస్తేరు దేవునితో ప్రార్థనలో సమయం గడపటానికి నిశ్చయించుకుంది. తన శక్తి ఆయనయందే ఉన్నదని గుర్తించింది. మొరెకైని ఇలా ఆదేశించింది, “నీవు పోయి షూషనునందు కనబడిన యూదులందరిని సమాజ మందిరమునకు సమకూర్చి, నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలును కూడ ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగనున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును; నేను నశించిన నశించెదను.” 16వ వచనం. PKTel 422.4
ఎస్తేరు రాజు ముందుకి వెళ్లటం, ఆమెపట్ల రాజు చూపిన ప్రసన్నత, తాను ఒక్కడే అతిథిగా రాజుతోను రాణీతోను హామాను విందులు, రాజు కలత నిద్ర, మొరేకై పట్ల ప్రదర్శితమైన బహిరంగ గౌరవం, హామాను పరాభవం అతడి కుట్ర బయటపడటంతో అతడి పతనం - ఒకదాని వెంట ఒకటి వేగంగా జరిగిన ఈ ఘటనలన్నీ తెలిసిన కథలోని భాగాలే. పశ్చాత్తాపపడ్డ తన ప్రజల పక్షంగా దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. ముందటి శాసనానికి వ్యతిరేకంగా వారు తమ ప్రాణ రక్షణకోసం పోరాడవచ్చునంటూ రాజుచేసిన మరో శాసనాన్ని రాజ్యంలోని ప్రతీ ప్రాంతానికి తెలియజేసేందుకు గుర్రాలపై వార్తాహరులు “రాజు మాటవలన ప్రేరేపింపబడి అతి వేగముగా బయలుదేరిరి.” “రాజు చేసిన తీర్మానమును అతని చట్టము వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను, అది శుభ దినమని విందు చేసుకొనిరి. మరియు దేశములో యూదులయెడల భయము కలిగెను కనుక అనేకులు యూదుల మతమును అవలంబించిరి.” ఎస్తేరు. 8:14,17. PKTel 423.1
తమను సంహరించటానికి నియమించిన దినాన “యూదులు రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలోనుండు పట్టణముయందు తమకు కీడు చేయవలెనని చూచిన వారిని హతము చేయుటకు కూడుకొనిరి. వారినిగూర్చి సకల జనులు భయము కలిగినందున ఎవరును వారి ముందర నిలువ లేకపోయిరి.” వారు తమ ప్రాణములను రక్షించుకొనుటకై” నిలబడినప్పుడు తన ప్రజల్ని కాపాడటానికి దేవుడు దూతల్ని పంపించాడు. ఎస్తేరు. 9:2,16. PKTel 423.2
క్రితం హామాను నిర్వహించిన హోదాను మొరెకైకిచ్చాడు రాజు. అతడు “రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి ... యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టుడుగా ఉండెను.” (ఎస్తేరు. 10:3). ఇశ్రాయేలీయుల శ్రేయానికి కృషి చేశాడు. ఈరకంగా మాదీయ పారసీకుల ఆస్థానంలోని పాలకులకు తన ప్రజలపట్ల మరొకసారి సహృదయత కలగటానికి దేవుడు తోడ్పడ్డాడు. వారిని తిరిగి తమ దేశానికి పంపటమనే తన ఉద్దేశం నెరవేర్పును ఇది సాధ్యపర్చింది. కాని అనేక సంవత్సరాలు గతించేవరకూ అనగా అహష్వేరోషు వారసుడైన మొదటి అర్తహషస్త పరిపాలన ఏడో సంవత్సరంవరకూ గణనీయమైన సంఖ్యలో ఎజ్రా నాయకత్వంలో యూదులు యెరూషలేముకు తిరిగి రావటం జరగలేదు. PKTel 423.3
ఎస్తేరు దినాల్లో దైవ ప్రజలకు కలిగిన శ్రమానుభవాలు ఆ యుగానికే పరిమితమైనవి కావు. ప్రకటన గ్రంథ రచయిత అంత్యకాలం వరకు జరగనున్న యుగాల్ని పరికిస్తూ ఇలా అన్నాడు, “ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని, దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చిన సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్దము చేయుటకై బయలుదేరి సముద్ర తీరమున నిలిచెను.” ప్రక. 12:17. నేడు భూమిపై నివసిస్తున్న వారిలో కొందరు ఈ మాటల నెరవేర్పును కళ్లారా చూస్తారు. గతించిన యూగాల్లో సంఘాన్ని హింసించటానికి మనుషుల్ని నడిపించిన దుష్ట స్వభావమే భవిష్యత్తులో దేవునికి నమ్మకంగా నివసించేవారిపట్ల అలాంటి విధానాన్నే అవలంబించటానికి దారితీస్తుంది. ఈ గొప్ప పోరాటానికి ఇప్పుడు సయితం సిద్ధబాటు జరుగుతున్నది. PKTel 423.4
దేవుని శేషించిన ప్రజలకు వ్యతిరేకంగా అంతిమంగా జారీకానున్న డిక్రీ యూదులికి వ్యతిరేకంగా అహష్వేరోషు జారీచేసిన డిక్రీ లాగుంటుంది. నిజమైన దైవ సంఘానికి విరోధులు నేడు సబ్బాతును ఆచరించే చిన్న సంఘంలో గుమ్మంవద్ద ఉన్న ఒక మొరెకైని చూస్తారు. దేవునిపట్ల భయభీతులు విడిచిపెట్టి ఆయన సబ్బాతును కాలరాచే వారికి దైవప్రజలు దైవ ధర్మశాస్త్రం పట్ల చూపే గౌరవం నిత్యం మందలింపుగా పరిణమిస్తుంది. PKTel 424.1
ప్రజల ఆచారాలు సంప్రదాయాల్ని తిరస్కరించే అల్పసంఖ్యాక వర్గంపై సాతాను ఆగ్రహాన్ని రెచ్చగొడతాడు. దైవప్రజల్ని వ్యతిరేకించటానికి హోదాగలవారు పలుకుబడి గలవారు అల్లరి మూకతో చేతులు కలుపుతారు. ఐశ్వర్యం, ప్రతిభ, విద్య ఏకమై వారిలో తిరస్కార స్వభావాన్ని పుట్టిస్తాయి. హింసకులైన పాలకులు, బోధకులు, సంఘ సభ్యులు వారికి వ్యతిరేకంగా జట్టుకడతారు. గళంతోను కలంతోను, బింకాలు, బెదిరింపులు, ఎగతాళితోను వారి విశ్వాసాన్ని నాశనం చెయ్యటానికి ప్రయత్నిస్తారు. తప్పుడు ప్రచారంద్వారా, ఆగ్రహం వెలిబుచ్చే విజ్ఞప్తులద్వారా మనుషులు ప్రజల్లో ఉద్రేకాన్ని రెచ్చగొడతారు. బైబిలు సబ్బాతును ప్రబోధించేవారిని ఎదుర్కోటానికి “లేఖనం ఇలా చెబుతున్నది” అని చెప్పటానికి ఏమిలేక ఆ లోటును భర్తీచెయ్యటానికి హింసాత్మక చట్టాలు రూపొందించి అమలు పర్చుతారు. ప్రజాదరణ ప్రజాభిమానం కోసం శాసన కర్తలు ఆదివారాచరణ చట్టాల డిమాండుకు తలొగ్గుతారు. అయితే దేవునికి భయపడే ప్రజలు పది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను ఉల్లంఘించే ఓ వ్యవస్థను ఆమోదించలేరు. సత్యం, అబద్ధం ఈ రెంటి మధ్య జరిగే అంతిమ పోరాటం ఈ యుద్ద భూమిపైనే జరుగుతుంది. ఈ అంశంపై మనం సందేహంలో కొట్టుమిట్టాడే ” పనిలేదు. ఎస్తేరు మొర్దికై దినాల్లోలాగే నేడూ ప్రభువు తన సత్యాన్ని తన ప్రజల్ని నిరూపిస్తాడు. PKTel 424.2