Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

మహా సంఘర్షణ

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయం 14—తదుపరి ఇంగ్లీష్ సంస్కర్తలు

    మూసి ఉన్న బైబిలుని లూథర్ జర్మనీ దేశ ప్రజలకు తెరుస్తున్న తరుణంలో అదే కార్యాన్ని ఇంగ్లాండు ప్రజలకు చేయవలసిందిగా దేవుని ఆత్మ టిండేల్ ని ప్రేరేపించాడు. విక్లిఫ్ బైబిలు లేటిన్ నుంచి అనువాదమయ్యింది. అందులో చాలా తప్పులున్నాయి. అది ముద్రితం కాలేదు. రాత ప్రతుల ఖరీదు చాలా ఎక్కువ. అందుచేత ధనవంతులు, ఉన్నత పౌరులు మాత్రమే వాటిని కొనగలిగే వారు. అదీగాక సంఘం దాన్ని నిషేధించినందువల్ల దాని ప్రసారం గణనీయంగా తగ్గింది. లూథర్ సిద్ధాంత వ్యాసాల ప్రచురణకు ఒక ఏడాది ముందు 1516 లో ఇరేస్మస్ నూతన నిబంధనను గ్రీకు లేటిన్ భాషల్లో ప్రచురించాడు. దైవ వాక్యం మొట్ట మొదటి సారిగా ఆదివ, గ్రీకు భాషలో ముద్రణ పొందింది. ఈ గ్రంథం ముందు ప్రచురణల్లో చోటు చేసుకొన్న అనేకమైన పొరపాట్లు సవరించి భావాన్ని మరింత స్పష్టంగా వ్యక్తీకరించటం జరిగింది. విద్యావంతుల్లో అనేకమంది సత్యాన్ని మరింత మెరుగుగా గ్రహించి సంస్కరణ కృషికి నూతనోత్తేజాన్ని చేకూర్చారు. కాని దైవ వాక్యం చాలా మేరకు సామాన్య ప్రజలకు అందుబాటులోకి రాలేదు. తన దేశ ప్రజలకు బైబిలును అందించటానికి విక్లిఫ్ ప్రారంభించిన పనిని టిండేల్ పూర్తిచేయాల్సి ఉంది.GCTel 226.1

    శ్రద్ధాసక్తులుగల విద్యార్ధి, చిత్తశుద్ధిగల సత్యాన్వేషి అయిన టిండేల్ ఇరేస్మస్ అనువదించిన గ్రీకు కొత్త నిబంధన చదివి సువార్తను తెలుసుకొన్నాడు. తన నమ్మకాలను నిర్భయంగా బోధించాడు. సిద్ధాంతాలన్నీ లేఖన పరీక్షకు నిలవాలన్నాడు. బైబిలును సంఘమే ఇచ్చింది. కనుక సంఘమే దాన్ని విశదం చేయగలుగుతుందన్న పోపు మతనాయకుల వాదనకు టిండేల్ ఇలా స్పందించాడు, “గ్రద్దలకు ఆహారం కనుక్కోటం ఎవరు నేర్పారో తెలుసా? ఆ దేవుడే ఆకలిగా ఉన్న తన పిల్లలు తమ తండ్రిని వాక్యంతో కనుక్కొటం నేర్పుతాడు. మాకు లేఖనాల్ని ఇవ్వకపోగా మాకు కనిపించకుండా వాటిని దాచి వేసింది మీరే. వాటిని బోధించేవారిని సజీవ దహనం చేస్తున్నది మీరే. సాధ్యపడితే మీరు లేఖనాల్ని కూడా కాల్చివేస్తారు. ”- డి అబినే, హిస్టరీ ఆఫ్ ది రిఫర్మేషన్ ఆఫ్ ది సిక్సీన్ సెంచురి, పుస్త 18, అద్యా 1.GCTel 226.2

    టెండేల్ ప్రబోధం గొస్స ఆసక్తిని రేకెత్తించింది. అనేకులు సత్యాన్ని స్వీకరించారు. కాకపోతే ప్రీస్టులు అప్రమత్తులై అక్కడ నుంచి టిండేశ్ వెళ్లిపోగానే బెదరింపులతో అసత్య ప్రచారంతో ఆయన కృషిని నాశనం చేయటానికి ప్రయత్నించారు. తరచుగా విజయం సాధించారు కూడా. ఆయన ఇలా వ్యాఖ్యానించాడు, “ఏం చేసేది? నేను ఒక చోట విత్తుతుంటే నేను విడిచి పెట్టిన స్థలాన్ని విరోధి నాశనం చేస్తున్నాడు. అన్ని చోట్లా ఉండలేను గదా? తమ సొంత భాషలో క్రైస్తవులకు పరిశుద్ధ లేఖనాలుంటే తమంతటతామే ఈ కుతర్కవాదుల్ని ప్రతిఘటించ గలుగుతారు. బైబిలు లేకుండా సామాన్య విశ్వాసులను సత్యంలో పాదుకొల్పటం సాధ్యం కాదు. ”- అదే పుస్తకం, పుస్త 18, అధ్యా 4.GCTel 227.1

    ఇప్పుడు ఒక నూతన కర్తవ్యంపై మనసు పెట్టాడు. “యెహోవా ఆలయంలో ఇశ్రాయేలు భాషలో ప్రజలు కీర్తనలు పాడారు. సువార్త ఇంగ్లాండు భాషలో మనతో మాట్లాడవద్దా?... సంఘానికి ఉదయం కంటే మధ్యాహ్నం తక్కువ వెలుగు ఉండాలా?... క్రైస్తవులు నూతన నిబంధనను తమ సొంత భాషలో చదువుకోవాలన్న విషయమై” సంఘంలోని పేదశాస్త్ర వేత్తలు బోధకులు ఒకరితో ఒకరు భేదించారు. బైబిలు వలన మాత్రమే సత్యం తెలుసుకోటం సాధ్యం. “ఒకడు ఈ వేదాంతిని ఇంకొకడు ఆ వేదాంతిని సమర్థిస్తున్నారు. తప్పుచెబుతున్న వ్యక్తి ఎవరో సత్యం చెబుతున్న వ్యక్తి ఎవరో ఎలా తెలుసుకోగలం? ఎలా? వాస్తవంగా దైవ వాక్యం ఆధారంగానే”. అదే పుస్తకం, పుస్త 18, అధ్యా 4.GCTel 227.2

    అదైన కొద్ది కాలానికి ఒక కథోలిక్ వేద పండితుడు టిండే తో వాదిస్తూ “పోపు చట్టాలు కాదు దేవుని చట్టాలు లేకున్నప్పుడే మేము మెరుగుగా ఉన్నాం” అన్నాడు. దానికి బదులిస్తూ టిండేల్ ఇలా అన్నాడు, “పోపుని అతని చట్టాన్ని ధిక్కరిస్తాను. దేవుడు నాకు ఇంకా ఆయువు ఇస్తే నేను కాలం చేయక ముందు ఒక కుర్రవాడికి నీకన్న ఎక్కువ వాక్యజ్ఞానం కలిగేటట్లు చేస్తాను” ఏండర్‌సన్, ఏనల్స్ ఆఫ్ ది ఇంగ్లీష్ బైబిల్, పుట 19,GCTel 227.3

    ప్రజలకు తమ సొంత భాషలో నూతన నిబంధన లేఖనాన్ని అందించాలన్న ఉద్దేశం ఇప్పుడు ధ్రువపడింది. ఇక జాప్యం లేకుండా కార్యసాధనకు పూనుకొన్నాడు. వెంటాడుతున్న హింసవల్ల ఇల్లు విడచి లండన్ చేరుకొన్నాడు. కొంతకాలం అక్కడ ఆటంకాలేమీ లేకుండా తన పనిని కొనసాగించాడు. పోపు మత వాదుల దౌర్జన్యం మళ్లీ తలెత్తటంతో అక్కడ నుంచి పారిపోయాడు. ఇంగ్లాండు అంతటిలోనూ తనకు తావులేనట్లు కనిపించింది. జర్మనీలో తల దాచుకోటానికి తీర్మానించుకొన్నాడు. ఇక్కడ ఇంగ్లీష్ నూతన నిబంధన ముద్రణను ప్రారంభించాడు. అంతరాయం ఏర్పడి పని రెండుసార్లు ఆగిపోయింది. ఒక నగరంలో ముద్రణను నిషేధిస్తే మరోనగరానికి వెళ్లాడు. కొన్ని ఏళ్ల క్రితం డయట్ ముందు సువార్తను లూథర్ ఏ నగరంలో సమర్ధించాడో డర్‌ హేమ్ నగరానికి చివరికి వెళ్లాడు. ఆ ప్రాచీన నగరంలో సంస్కరణ విశ్వాసం పట్ల సుముఖత గల మిత్రులెందరో ఉన్నారు. టిండేల్ అక్కడ తన కార్యాన్ని ఏ ఆటంకాలు లేకుండా నెరవేర్చుకొన్నాడు. మూడు వేల కొత్త నిబంధన ప్రతులు పూర్తి అయ్యాయి. అదే సంవత్సరం మరో ముద్రణ జరిగింది.GCTel 228.1

    ఆయన పట్టుదలతోను ఓర్పుతోను తన పనిని కొనసాగించాడు. ఇంగ్లాండు దేశంలోని అధికార్లు తమ ఓడ రేవుల్ని పగడ్బందీగా కాపాడుతున్నప్పటికీ దైవ వాక్యాన్ని వేర్వేరు మార్గాల్లో రహస్యంగా లండన్ కి పంపటం అక్కడ నుంచి దేశమంతటికీ పంపటం జరిగింది. పోపు నాయకులు సత్యాన్ని అణచివేయటానికి వ్యర్ధ ప్రయత్నాలు చేశారు. ఒకసారి డర్ హేమ్ బిషప్ టెండేల్ మిత్రుడైన ఒక పుస్తక విక్రయదారుడి వద్ద ఉన్న బైబిళ్లన్నింటినీ కాల్చివేయటానికి కొన్నాడు. ఆ పని సంస్కర్తను దెబ్బతీస్తుందని భావించాడు. అలా జరగకపోగా ఈ రూపంలో ఆదా అయిన డబ్బు మెరుగైన కొత్త ముద్రణకు అవసరమైన వస్తువుల కొనుగోలుకు తోడ్పడింది. దరిమిల టిండేలను ఖైదులో వేసిన తరుణంలో బైబిళ్లు ముద్రించటంలో సాయపడ్డవారి పేర్లు చెపితే చెరనుంచి విడుదల చేస్తామని అధికార్లు అన్నప్పుడు అందరికన్నా ఎక్కువగా డర్ హ్మ్ బిషప్ సాయం చేశాడని మిగిలి ఉన్న పుస్తకాలకు అతడు హెచ్చుధర పెట్టి కొనటం ద్వారా తాను ధైర్యంగా ముందుకు సాగటానికి సాయంచేశాడని టిండేల్ చెప్పాడు.GCTel 228.2

    నమ్మకద్రోహం వల్ల ప్రత్యర్థుల చేతికి టిండేల్ చిక్కాడు. ఒకసారి అనేక మాసాలు ఖైదులో శ్రమలు పొందాడు. చివరికి హతసాక్షి అవ్వటం ద్వారా తన విశ్వాసం ఎలాంటిదో చాటి చెప్పాడు. ఆయన రూపొందించిన ఆయుధాలు అన్ని శతాబ్దాలలోను యుద్ధం చేయటానికి ఇతరులకు తోడ్పడ్డాయి. ప్రస్తుత కాలంలోను తోడ్పడుతున్నాయి.GCTel 228.3

    ప్రజలు తమ సొంత భాషలో బైబిలు చదువుకోవాలని లాటిమర్ ప్రసంగ వేదికపై నుంచి చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు, “పరిశుద్ధ లేఖనాల కర్త దేవుడే” ఈ లేఖనం దానికర్త మహాశక్తి లోను నిత్యత్వంలోను పాలుపంచుకొంటుంది. రాజు, చక్రవర్తి, మేజిస్ట్రేట్, పరిపాలకుడు, అందరూ ఆయన పరిశుద్ధ వాక్యానికి విధేయులు కావలసిందే. ” (మనం పక్కదారులు పట్టకూడదు. మనల్ని దేవుని వాక్యమే నడిపించాలి. మన పితరుల్ని అనుసరించి మనం నడవకూడదు. వాళ్లు వెదకిన దాన్ని మనం వెదక కూడదు. వాళ్లు వెదకి ఉండవలసిన దాన్ని మనం వెదకాలి.” - హ్యూగ్ లాటిమర్, ఫస్ట్ సెర్మన్ ప్రీమ్డ్ బి ఫోర్ కింగ్ ఎడ్వర్డ్ VIGCTel 229.1

    సత్యానికి మద్దతు పలకటానికి టిండేల్ మిత్రులు బాన్స్, ప్రి లు లేచారు. రిడ్లీలు, క్రేన్ మర్ వారి వెనుక వచ్చారు. ఇంగ్లీష్ సంస్కరణ కృషిలోని ఈ నాయకులు విద్యావంతులు ఉద్రేకం భక్తిప్రపత్తుల పరంగా వారిలో పెక్కుమందికిGCTel 229.2

    రోమీయ సంఘంలో ఎంతో గౌరవం ఉంది. “పరిశుద్ధ గురువు” పోపు అపరాధాలను గురించి బాగా తెలియటమే పోపుమతం పట్ల వారి వ్యతిరేకతకు కారణం. బబులోను మర్మాలతో వారికున్న పరిచయం ఆమెకు వ్యతిరేకంగా వారిచ్చే సాక్ష్యానికి బలం చేకూర్చింది.GCTel 229.3

    “ఇప్పుడొక విచిత్రమైన ప్రశ్న అడుగుతాను. ఇంగ్లాండు దేశమంతటిలోను సేవా తత్పరత గల బిషప్ ప్రిలేటు ఎవరు?... అతడి పేరు చెప్తానని మీరు శ్రద్ధగా వింటున్నారు. నాకు తెలుసు. ఆ పేరు చెప్తాను. అతడు సాతాసు.అతడు తన డయాస్ విడచి ఎక్కడకీ వెళ్లడు. ఎప్పుడంటే అప్పుడు పిలవండి. అతను ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాడు... అతను ఎప్పుడూ దున్నుతూనే ఉంటాడు. పని లేకుండా ఎప్పుడూ వుండడు. అది ఖండితంగా చెప్పగలను. సాతాను ఎక్కడుంటే అక్కడ పుస్తకాలుండ కూడదు. దీపాలు వెలుగుతాయి, బైబిళ్లుండకూడదు. జపమాలలు వెలుస్తాయి. సువార్త జ్యోతి దూరంగా పోవాలి. కొవ్వొత్తులు వెలగాలి. ఔను మధ్యాహ్న కాంతిలోనే... క్రీస్తు సిలువ వద్దు. ప్రాయశ్చిత్త స్థలం (పర్గెటరీ) కావాలి. బట్టలు లేనివారికి, బీదలకు, వికలాంగులకు బట్టలు వద్దు. విగ్రహాల్ని, రాళ్లను, రప్పలను అలంకరించాలి. మానవుడు కల్పించిన సంప్రదాయాల్ని చట్టాల్ని ఘనపర్చాలి. దైవ సంప్రదాయాన్ని, పరిశుద్ధ వాక్యాన్ని తోసి పుచ్చాలి. చెడును విత్తటంలో సాతాను ఎంత శ్రద్ధ వహిస్తాడో అంత శ్రద్ధతో మన పీలేటులు మంచి సిద్ధాంతం అనే మంచిని విత్తితే ఎంత బాగుండును.” అదే పుస్తకం, సెర్మన్ ఆఫ్ ది ప్లల్”.GCTel 229.4

    విశ్వాసానికి ఆచరణకు పరిశుద్ధ లేఖనాలే నిర్దుష్టమైన ప్రమాణం అన్న ఉత్తమ సూత్రాన్ని ఈ సంస్కర్తలు అనుసరించారు. వాల్దెన్సీయులు, విక్లిఫ్, జానా హస్, లూథర్, జ్వింగ్లీ వారితో కలసి పని చేసిన వారు ఇదే సూత్రాన్ని అనుసరించారు. మత సంబంధిత విషయాల్లో మనస్సాక్షిని నియంత్రించటానికి పోపులకు, సభలకు, ఫాదర్లకు, రాజులకు ఎలాంటి హక్కులేదని వారు నొక్కి చెప్పారు. బైబిలే వారికి ప్రామాణికం. అన్ని సిద్ధాంతాల్ని, సర్వహక్కుల్నీ వారు బైబిలు బోధనలతో పరీక్షించారు. ఈ పరిశుద్దులు మంటలలో తమ ప్రాణాలు విడిచేటప్పుడు వారిని నిలిపింది దేవునిమీద ఆయన వాక్యం మీద వారి కున్న విశ్వాసమే. మంటలు తమను కబళించి వేయటానికి సిద్ధంగా ఉన్నప్పుడు లాటిమర్ తన తోటి హత సాక్షితో ఇలా అన్నాడు, “అధైర్యపడకు ఎన్నడూ ఆరిపోని దీపాన్ని మనం ఇంగ్లాడులో ఈ రోజు వెలిగిస్తున్నాం” వ ఆఫ్ హ్యూగ్ లాటిమర్ సం 1, పుట VIII.GCTel 230.1

    స్కాట్లండలో కొలంబ ఆయన సహచరులు వెదజల్లిన సత్యవిత్తనాలు పూర్తిగా నాశనం కాలేదు. ఇంగ్లాండు సంఘాలు రోము ఆధిపత్యాన్ని అంగీకరించిన అనంతరం కొన్ని వందల సంవత్సరాల వరకు స్కాలేండ్ సంఘాలు స్వతంత్రతను కాపాడు కొన్నాయి. కాగా పన్నెండో శతాబ్దంలో ఇక్కడ పోపు సంఘం స్థాపితమయ్యింది. ఆ సంఘం ఇక్కడ చెలాయించినంత అధికారం మరే దేశంలోను చెలాయించలేదు. ఇక్కడ ఉన్నంత చీకటి ఇంకెక్కడా లేదు. అయినా తెల్లవారుతుందన్న నిశ్చయతను సూచించే కాంతి కిరణాలు చీకటిని చీల్చుకుంటూ వచ్చాయి. ఇంగ్లాండు నుంచి వచ్చిన లొల్లాలు బైబిలును, విక్లిఫ్ బోధనల్ని తీసుకువచ్చారు. సువార్తను గూర్చిన జ్ఞానాన్ని పరిరక్షించటంలో వారు గణనీయంగా సేవచేశారు. ఫలితంగా సాక్షులు హతసాక్షులు ప్రతీ శతాబ్దంలోనూ ఉంటూ వచ్చారు.GCTel 230.2

    మహా సంస్కరణ ప్రారంభం కావటంతో లూథర్ రచనలు ఆ తర్వాత టిండేల్ అనువదించిన నూతన నిబంధన వెలువడ్డాయి. పోపు మతాధినేతలకు తెలియకుండా ఈ దూతలు చడీ చప్పుడు లేకుండా పర్వతాలు లోయలు దాటి స్కాంట్ లేండ్ లో దాదాపు ఆరిపోయిన సత్యజ్యోతిని వెలిగించి నాలుగు శతాబ్దాల హింస ద్వారా రోము స్థాపించిన పనికి తెర దించారు.GCTel 230.3

    అంతట హతసాక్షులు చిందించి నరక్తం సంస్కరణోద్యమానికి నూతనోత్తేజాన్నిచ్చింది. తాము నిర్వహిస్తున్న సేవ ప్రమాదానికి గురి కానున్నట్లు గుర్తించి పోపుమత నేతలు స్కాంట్ లేండ్ కుమారుల ఉత్తమమైన వారిని, గౌరవనీయులైన కొందరిని సజీవదహనం చేశారు. వారు వేదికను నిర్మించారు. ఆ వేదిక నుంచి మరణిస్తున్న సాక్షుల మాటలు ఆ దేశమంతటా వినిపించాయి. ఆ మాటలు ప్రజల ఆత్మలను ఉత్సాహపర్చి రోము బంధాలను తెంచుకోవాలన్న సంకల్పాన్ని బలపర్చాయి.GCTel 230.4

    హేమిటన్, విషాలు జన్నతః మాత్రమేకాక ప్రవర్తన పరంగా కూడా రాజులే. వారి శిష్యుల సంఖ్య చాలా పెద్దది. వారందరూ సామాన్యులే. హేమిన్, విషార్టర్లు సజీవ దహనంలో తమ ప్రాణాలర్పించారు. విషార్టన్ను దహించిన మంటల నుంచి ఒక మహావ్యక్తి వచ్చాడు. మంటలు ఆయన స్వరాన్ని ఆపలేకపోయాయి. దేవుని కాపుదల కింద ఉన్న ఆయన స్కాలేంలో పోపు ఆధిపత్యానికి మరణ ఘటికలు మోగించాల్సి ఉన్నాడు. GCTel 231.1

    జాన్నెక్స్ సంఘం ప్రబోధిస్తున్న సంప్రదాయాలు, యోగ దర్శనాలను నమ్మటం మాని దైవ వాక్యంలోని సత్యాలపై ధ్యానం నిలపటం మొదలు పెట్టాడు. విషార్ట్ బోధనలు రోము మత సహవాసాన్ని విడిచిపెట్టి హింసకు గురి అవుతున్న సంస్కర్తలతో కలవాలన్న తన తీర్మానాన్ని ధ్రువపర్చాయి.GCTel 231.2

    ప్రబోధక పదవిని స్వీకరించాల్సిందిగా మిత్రులు విజ్ఞప్తి చేస్తే దాన్ని అంగీకరించటానికి భయపడ్డాడు. నాక్స్ కొన్ని రోజులు ఏకాంత వాసం తీవ్ర అంతర్గత సంఘర్షణ తర్వాతే ఆ పదవిని అంగీకరించాడు. ఒకసారి పదవిని అంగీకరించాక తిరుగులేని నిశ్చయతతో మొక్కవోని ధైర్యంతో ప్రాణం ఉన్నంత వరకు ముందుకు సాగాడు. చిత్తశుద్ధిగల ఈ సంస్కర్త మానవుడికి భయపడలేదు. తన చుట్టూ లేస్తున్న హతసాక్షి జ్వాలలు ఆయనలో లేస్తున్న ఉత్సాహాగ్నిపై ఆజ్యం పోశాయి. తన శిరస్సును ఖండించటానికి పైకి గొడ్డలి లేచినప్పుడు నాక్స్ చలించకుండా నిలిచి, విగ్రహారాధనను కూలదోయటానికి కుడి పక్క, ఎడమపక్క బలమైన దెబ్బలు కొట్టాడు.GCTel 231.3

    ఎవరి సముఖంలో అనేకమంది ప్రొటస్టాంట్ నాయకుల ఉద్రేకం చల్లారిపోయిందో ఆ స్కాట్ లేండ్ రాణిని ముఖాముఖి కలుసుకొన్నప్పుడు జాన్ నాక్స్ నిశ్చలంగా నిలిచి సత్యాన్ని సమర్ధిస్తూ సాక్ష్యం చెప్పాడు. ఆయనను ముద్దులతో వశపర్చుకోటం సాధ్య పడలేదు. బెదరింపులకు ఆయన భయపడలేదు. సిద్ధాంత వ్యతిరేకత, అభియోగాన్ని రాణి ఆయనపై మోపింది. ప్రభుత్వం నిషేధించిన మతాన్ని ప్రజలకు బోధించి దాన్ని స్వీకరించేటట్లు చేశాడని తద్వారా ప్రజలు తమ రాజులకు విధేయులై యుండాలన్న దైవాజ్ఞను అతిక్రమించేటట్లు చేశాడని ఆయనపై నిందమోపింది. నాక్స్ దానికి గట్టి సమాధానం చెప్పాడు.GCTel 231.4

    “మొదట్లో సరి అయిన మతం బలాన్నిగాని, అధికారాన్నిగాని రాజుల వద్దనుంచి పొందలేదుగాని నిత్యుడైన దేవుని వద్దనుంచే పొందింది గనుక ప్రజలు తమ రాజుల అభిరుచుల ననుసరించి తమ మతాన్ని రూపొందించుకోవలసిన పని లేదు. ఎందుచేతనంటే దేవుని యధార్ధమైన మతం విషయంలో రాజుల పరిజ్ఞానం బహు స్వల్పం... అబ్రాహాం సంతతి వారంతా దీర్ఘకాలంగా తమ రాజైన ఫరోవతాన్ని అవలంబించివుంటే, మేడమ్ గారూ, ఈ భూమండలంపై ఏమతం ఉండేది? లేదా అపోస్తలుల కాలంలోని మనుషులందరూ రోమా చక్రవర్తుల మతావలంబులై ఉంటే ఈలోకంలో ఏమతం ఉండేది?... కనుక మేడమ్ గారూ రాజులకు విధేయులై ఉండాలన్న ఆదేశం ప్రజలకున్నప్పటికీ ప్రజలు తమ రాజుల మతాన్ని అవలంబించాల్సిన అవసరం లేదని స్పష్టంగా కనిపిస్తున్నది.GCTel 232.1

    నీవు ఒక విధంగా చెబుతుంటే వారు - రోమన్ కథోలిక్ గురువులు మరో విధంగా లేఖనాలకు అర్ధం చెబుతున్నారు! నేను ఎవరిని నమ్మాలి? న్యాయనిర్ణేత ఎవరు? అడిగింది రాణి మేరీ.GCTel 232.2

    “తన వాక్యంలో విస్పష్టంగా చెబుతున్న దేవునినే మీరు నమ్మాలి. వాక్యంలో ఏదైతే లేదో దాన్ని మీరు నమ్మవద్దు. దేవుని వాక్యం స్పష్టంగా ఉన్నది. ఒక చోట ఏదైన అస్పష్టత చోటుచేసుకొంటే తన్నుతాను ఎన్నడు వ్యతిరేకించుకోని పరిశుద్ధాత్మ ఆ విషయాన్ని మరోచోట విశదీకరిస్తాడు. అజ్ఞానంలో కొనసాగాలనుకొనే వారు తప్ప తక్కిన వారు తమ సందేహాలు ఇలా తొలగించుకోవచ్చు.” బదులిచ్చాడు సంస్కర్త. - డేవిడ్ లేంగ్, ది కనెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జాన్నాక్స్, సం 2, పుటలు 281, 284.GCTel 232.3

    భయమంటే ఎరుగని సంస్కర్త ప్రాణాపాయ పరిస్థితిలో కూడా రాణీ ముందు నిర్భయంగా పలికిన సత్యాలు ఇలాంటివి. ప్రార్ధిస్తూ ప్రభువు యుద్ధాలు చేస్తూ పోపు అధికారం నుంచి స్కాలేండ్ కి స్వేచ్ఛ సాధించేంతవరకు అదే విధమైన సాహసంతో నాక్స్ తన లక్ష్యాన్ని అనుసరించాడు.GCTel 232.4

    ఇంగ్లాండులో ప్రొటస్టాంట్ విశ్వాసం జాతీయ మతంగా నెలకొల్పటంతో హింస తగ్గిందిగాని పూర్తిగా ఆగిపోలేదు. రోమను మత సిద్ధాంతాల్లో చాలా వాటిని త్యజించటం జరిగినా దాని ఆచారాలు చాలా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పోపు ఆధిక్యాన్ని తోసిపుచ్చారు. కాని పోపు స్థానంలో రాజును సంఘాధినేతగా అందలమెక్కించారు. సంఘారాధన సువార్త పవిత్రతకు సరళతకు ఇంకా ఎంతో దూరంలో ఉంది. మతస్వేచ్ఛ అన్న గొప్ప సూత్రాన్ని గూర్చి సరైన అవగాహన ఇంకా కలుగలేదు. సిద్ధాంత వ్యతిరేకత సందర్భంగా రోము గైకొన్న క్రూర చర్యల్ని ప్రొటస్టాంట్ పరిపాలకులు అప్పుడప్పుడూ గైకొన్నప్పటికీ తన మనస్సాక్షి ప్రకారం దేవుని ఆరాధించేందుకు ప్రతీ మనిషికీ ఉన్న హక్కును వారు గుర్తించలేదు. గుర్తింపు పొందిన సంఘసిదాంతాలు ఆరాధన సంబంధిత ఆచారాల్ని ప్రజలందరు తప్పక ఆచరించాలి. అసమ్మతీయులు హింసకు గురి అయ్యేవారు. ఇది కొన్ని వందల సంవత్సరాలు సాగింది.GCTel 233.1

    పదిహేడో శతాబ్దంలో వేలాదిమంది పాదుర్లు తమ పదవుల నుంచి ఉద్వాసన పొందారు. సంఘం ఆమోదించిన మత సమావేశాలు తప్ప తక్కిన వాటికి హాజరు కావటం నిషిద్ధం. ఈ ఆంక్ష అతిక్రమణకు శిక్ష భారీ జరిమానా, ఖైదు, దేశ బహిష్కృతి. దేవుని ఆరాధించకుండా ఉండలేని విశ్వాసులు చీకటి సంధుల్లో, చీకటి గదుల్లో, కొన్ని కాలాల్లో మధ్యరాత్రిలో అడవుల్లో సమావేశమయ్యేవారు. దేవుని సొంత ఆలయమైన అడవుల్లో హింసకు గురై చెదరిపోయిన దైవ జనులు ప్రార్ధనల ద్వారా తమ హృదయభారాన్ని దేవునికి వెలిబుచ్చుకొని ఆయనను స్తోత్రించటానికి సమావేశమయ్యేవారు. ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకొన్నా అనేకులు తమ విశ్వాసం కోసం అనేక శ్రమలనుభవించారు. ఖైదులు కిక్కిరిసి పోయేవి. కుటుంబాలు చెల్లాచెదురయ్యేవి. పలువురు దేశ బహిష్కృతికి గురి అయ్యేవి. చాలా మందిని సముద్రాలు దాటించి అమెరికాకు బహిష్కరించారు. ఇక్కడ పౌరస్వాతంత్ర్యానికి మత స్వాతంత్ర్యానికి వారు పునాదులు వేశారు. ఈ స్వాతంత్ర్యాలు ఈ దేశానికి (అమెరికాకు) ఆశ్రయదుర్గంగాను మహిమా కిరీటంగాను పరిణమించాయి.GCTel 233.2

    అపోస్తలుల దినాల్లోలాగే సువార్త పురోగతికి హింస దోహదపడింది. హేయమైన చీకటి కొట్టులో నీతి బాహ్యులు అపరాధుల మధ్య జ్బా నియన్ పరలోక వాతావరణాన్ని అనుభవించగలిగాడు. యాత్రికుడు నరకం నుంచి పరిశుద్ధపట్టణానికి చేసిన ప్రయాణాన్ని గూర్చిన చక్కని రూపకాన్ని అక్కడే రచించాడు. బెడ్ ఫోర్ట్ జైలు నుంచి ఆ స్వరం రెండు వందల సంవత్సరాలకు మించి మనుషుల హృదయాలతో మాట్లాడుతున్నది. బనియన్ రాసిన “యాత్రికుని ప్రయాణం” (పిల్ గ్రిమ్స్ ప్రోగ్రెస్) పాపులలో ఘోరపాపికి కృపాసమృద్ధి” (గ్రేస్ ఎ బౌండింగ్ టు ది చీఫ్ ఆఫ్ సిన్నర్స్) అనేక పాదాల్ని జీవమార్గంలోకి నడిపించాయి.GCTel 233.3

    ప్రతిభ, విధ్య, క్రైస్తవానుభవం ఉన్న బేక్స్టర్, ఫేవెల్, ఏలీన్ ఇంకా ఇతరులు ఒకప్పుడు భక్తులు పొందిన విశ్వాసాన్ని ధైర్య సాహసాలతో కాపాడటానికి లేచారు. లోక పరిపాలకులు నిషేధించినా ఈ వ్యక్తులు సాధించిన పని ఎన్నటికీ నాశనం కాదు. ఫ్లెవెల్ రచించిన (1జీవపు ఊట కృపాపద్దతి” (ఫౌంటెన్ ఆఫ్ లైఫ్ అండ్ మెండ్ ఆఫ్ గ్రేస్) తమ ఆత్మల సంరక్షణను క్రీస్తుకి అప్పగించట మెలాగో అన్న అంశంపై వేలకొద్ది ప్రజలకు ఉపదేశమందించింది. బేక్స్టర్ రాసిన ‘’మారిన పాదిరి” (రిఫామ్ పాస్టర్) దైవ సేవ ఉజ్జీవాన్ని కోరే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. “పరిశుద్ధులు నిత్యవిశ్రాంతి ” (సెయిస్ట్స్ ఎవర్ లాస్టింగ్ రెస్ట్) అన్న ఆయన పుస్తకం దైవ ప్రజలకు లభించే విశ్రాంతికి ఆత్మలను నడిపించటంలో తన పనిని పూర్తి చేసింది.GCTel 234.1

    వంద సంవత్సరాల తర్వాత గొప్ప ఆధ్యాత్మిక అంధకార దినాల్లో వైట్ ఫీల్డ్, వెస్లీలు దేవునికి సత్య దూతలుగా రంగప్రవేశం చేశారు. సంస్థాగత సంఘ పరిపాలన కింద ఇంగ్లాండు అధ్యాత్మిక క్షీణతతో దిగజారిపోగా అన్యమతానికి క్రైస్తవానికి తేడా కనిపించలేదు. స్వాభావిక మతంపై బోధక వర్గం ఆసక్తిగా అధ్యయనం చేసింది. ఇందులో ఎక్కువ భాగం వారి వేదాంతమే. దైవ భక్తి అంటే ఉన్నత వర్గాల ప్రజలు ఎగతాళి చేశారు. మత ఛాందసంతో కూడిన భక్తి తమకు లేదని వారు గర్వపడ్డారు. కింది తరగతుల ప్రజలు అజ్ఞానంలో కూరుకుపోయారు. దుర్వ్యసనాలకు బానిసలయ్యారు. ఇక సంఘం విషయానికొస్తే విశ్వాసం ఏ కోశానాలేదు. కూలిపోతున్న సత్యాన్ని బలపర్చటానికి ధైర్యంగాని, విశ్వాసంగాని లేదు.GCTel 234.2

    లూథర్ విపులంగా బోధించిన విశిష్ట సిద్ధాంతం విశ్వాసం ద్వారా నీతిమంతుడుగా తీర్పు పొందమున్నది. దీన్ని దాదాపు పూర్తిగా విస్మరించటం జరిగింది. దీని స్థానంలో సర్రియల్ని నమ్ముకోటమున్న రోమను మత సూత్రం నెలకొన్నది. వైట్ ఫీల్డ్, వెస్లీలు సంస్థాగత సంఘసభ్యులు. మనసా వాచా కర్మణా అన్వేషించిన భక్తులు, నీతి జీవితం ద్వారా మతపరమైన ఆచారాల్ని ఆచరించటం ద్వారా దైవానుగ్రహాన్ని దైవానుగ్రహాన్ని సంపాదించవచ్చునని వీరు నేర్చుకొన్నారు.GCTel 234.3

    ఒక సారి చార్లెస్ వెస్లీ జబ్బుపడి మరణం సమీపిస్తుందని భావించిన తరుణంలో నిత్యజీవాన్ని గూర్చిన తన నిరీక్షణను దేనిపై ఆధారం చేసుకొన్నావు అని ఒక మిత్రుడు వేసిన ప్రశ్నకు వెస్లీ “దేవుని సేవచేయటానికి నాశక్తి కొలది ప్రయత్నించాను” అని సమాధానం చెప్పాడు.GCTel 235.1

    ఆయన ఇచ్చిన సమాధానంతో ఆ మిత్రుడు పూర్తిగా తృప్తిచెందనట్లు కనిపించటంతో వెస్లీ ఇలా ఆలోచించాడు, “ఏమిటీ? నా ప్రయత్నాలు, నా నిరీక్షణకు చాలినంత ఆధారం కావా? నా ప్రయత్నాల్ని ఇతడు కాదంటాడా? నేను నమ్ముకో గలిగింది ఇంకేమీ లేదు” జాన్ ఫీల్డ్, లైఫ్ ఆఫ్ రెవరెండ్ చార్లెస్, వెస్లీ, పుట 102. సంఘాన్ని ఆవరించిన చీకటి అంత దట్టమైంది. అది క్రీస్తు ప్రాయశ్చిత్తాన్ని మరుగుపర్చి ఆయన మహిమను దొంగిలించి తమ రక్షణకు ఒకే ఒక నిరీక్షణ అయిన క్రీస్తు రక్తం నుంచి మానవుల మనస్సుల్ని మరల్చుతుంది.GCTel 235.2

    యధార్ధమైన మతం హృదయంలో నెలకొంటుందని, ఆలోచనలు, మాటలు, క్రియలకు విస్తరిస్తుందని వెస్లీ ఆయన అనుచర గణం భావించారు. హృదయశుద్ధి, బాహ్య ప్రవర్తనలో నిర్దుష్టత అవసరమని గుర్తించి, నూతన జీవిత విధానాన్ని రూపొందించుకోటానికి పూనుకొన్నారు. స్వాభావిక హృదయం నుంచి జనించే దుర్నీతిని పరిశ్రమ ద్వారా, ప్రార్ధన పూర్వక కృషి ద్వారా అణచివేయటానికి ప్రయత్నించారు. ఆత్మ త్యాగంతో కూడిన జీవితం జీవించారు. దాన ధర్మాలు చేశారు. అవమానం భరించారు. తమ హృదయాలు ఎంతగానో ఆశిస్తున్న ‘దైవానుగ్రహాన్ని పొందటానికి అవసరమైన పరిశుద్ధతను సాధించటానికి దోహదపడే ప్రతి ఆచారాన్ని నిష్టగా, నిర్దుష్టంగా ఆచరించారు. ఇంత చేసినా ఆశించిన ఫలితాన్ని సాధించలేక పోయారు. పాపశిక్ష నుంచి నిష్కృతి పొందబానికి లేదా పాపశక్తిని నిరర్ధకం చేయటానికి వారి ప్రయత్నాలు వ్యర్ధమయ్యా యి. ఎఫర్ట్ చెరసాల గదిలో లూథర్ మనసులో లేచిన సంఘర్షణ కూడా ఇదే. ఆయన ఆత్మను క్షోభింపజేసిన సమస్యా ఇదే. - “నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును?” యోబు 9:2.GCTel 235.3

    ప్రొటస్టాంట్ బలిపీఠాలమీద దాదాపు ఆరిపోయిన దైవ సత్యాగ్ని జ్వాలలు బోహీమియా క్రైస్తవులు యుగాల పొడవునా అందిస్తూ వచ్చిన ప్రాచీన దీపం నుంచి వెలుగును తిరిగి పొందాలి. సంస్కరణ అనంతరం బోహీమియాలో వర్ధిల్లిన ప్రొటస్టాంటు విశ్వాసాన్ని రోము మత దుండగులు కాళ్లతో తొక్కేశారు. సత్యాన్ని త్యాగం చేయటానికి నిరాకరించిన వారందరిని బైటికి తరిమివేశారు. వీరిలో కొందరు సేక్సనీలో ఆశ్రయం పొందారు. అక్కడ వారు తమ సనాతన విశ్వాసాన్ని కాపాడుకొన్నారు. ఈ క్రైస్తవుల సంతతి వారి నుంచి వెస్లీకి ఆయన సహచరులకు సత్యం వచ్చింది. GCTel 236.1

    సువార్త సేవకు అభిషేకం పొందిన అనంతరం జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీలను సేవ నిమిత్తం అమెరికాకు పంపారు. వారెక్కిన ఓడలో కొంతమంది మొరేవియన్లు ఉన్నారు. మార్గంలో భీకర తుఫానులు లేచాయి. మరణం ఆసన్నమైనప్పుడు జాన్ వెస్లీ తనకు దేవునితో సమాధానం ఏర్పడలేదని క్షోభించాడు. కాగా తనకు లేని ప్రశాంతత, నమ్మకం జర్మనలో వెల్లివిరిశాయి.GCTel 236.2

    “వారి గంభీర ప్రవర్తనను ఎప్పుడో గమనించాను. తమ వినయ వర్తనను వారు నిత్యమూ కనపర్చుతూనే ఉన్నారు. ఇంగ్లీషువారు చేసేందుకు ఇష్టపడని నీచ సేవలు ఇతర ప్రయాణికులకు వారు చేస్తున్నారు. ఆ సేవలకు ప్రతిఫలం లేదు, వారు ఆశించనూ లేదు. ఆ సేవలు చేయటం తమ గర్వం అణగటానికి మంచిదని, ఎందుకంటే తమ రక్షకుడు తమకు ఇంకా ఎక్కువ సేవ చేశాడని వారంటారు. తమ సాత్వికాన్ని ప్రదర్శించటానికి అనుదినం వారికి అవకాశాలు కలుగుతున్నాయి. వారి సాత్విక స్వభావాన్ని ఎట్టి హాని నాశనం చేయలేదు. వారిని ఎవరైనా గెంటినా, కొట్టినా లేకGCTel 236.3

    ఈడ్చినా పైకి లేచి తమ దారిని తాము వెళ్లిపోతారు. ఫిర్యాదనేది వారి నోటివెంట రాదు. భయాన్ని బట్టిగాని గర్వం, ఆగ్రహం, కక్షను బట్టిగాని అలా వ్యవహరించారేమో పరీక్షించటానికి ఇప్పుడొక అవకాశం కలిగింది. వారి ఆరాధన కార్యక్రమం ఒక కీర్తనతో ప్రారంభమయ్యింది. కీర్తన మధ్యలో సముద్రం కల్లోలితమయ్యింది. ఓడ ప్రధాన తెరచాపను ముక్కముక్కలు చేసింది. ఓడను నీటితో నింపింది. ఆ మహాజలనిధి ఓడను మింగివేసిందా అన్నట్లు పై కప్పు నీటిమయమయ్యింది. ఇంగ్లీష్ వారు కేకలు బొబ్బలు పెట్టటం మొదలు పెట్టారు. జర్మన్లు నిశ్చలంగా తమ పాట కొనసాగించారు. తర్వాత వారిలో ఒకర్ని “భయం వేయలేదా?” అని అడిగాను. లేదు ‘దేవునికి వందనాలు’ బదులిచ్చాడు, మీ మహిళలు, పిల్లలూ? అడిగాను మళ్లీ. లేదు ‘మా మహిళలు, పిల్లలూ మరణించటానికి భయపడరు’ అన్నాడు నింపాదిగా” వైట్ హెడ్, లైఫ్ ఆఫ్ రెవ. జాన్ వెస్లీ, పుట 10. GCTel 236.4

    సావనా చేరగానే వెస్లీ మొరేవియన్లతో కొద్ది కాలం గడిపాడు. వారి క్రైస్తవ ప్రవర్తన ఆయనను ఎంతగానో ఆకట్టుకొన్నది. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండు సంఘంలోని నిర్జీవమైన, ఆచారబద్ధమైన ఆరాధన పద్ధతికి వ్యత్యాసంగా ఉన్న వారి ఆరాధనను గూర్చి వెస్లీ ఇలా రాశాడు, “మొత్తం ఆరాధన నిరాడంబరంగా గంభీరంగా ఉన్నది. మధ్యనున్న పదిహేడు వందల సంవత్సరాల్ని మరిపించి రూపము, స్థితీ లేని ఆనాటి ఒక సమావేశంలో నేనున్నట్లు ఊహించుకొనేటట్లు చేసింది. అయితే డేరాతయారీదారి పౌలు, జాలరి పేతురు అధ్యక్షత వహించారు. అక్కడ పరిశుద్ధాత్మ ఉన్నాడు. గొప్ప శక్తి ప్రదర్శిత మయ్యింది.”- అదే పుస్తకం, పుటలు 11,12.GCTel 237.1

    ఇంగ్లాండుకు తిరిగి వచ్చాక మొరేవియన్ బోధకుడి ఉపదేశం పొందిన మీదట బైబిలు విశ్వాసంపై వెస్లీకి స్పష్టమైన అవగాహన ఏర్పడింది. రక్షణ పొందేందుకు తాను నమ్ముకొంటున్న క్రియల్ని త్యజించాలని ‘లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల’ను పూర్తిగా విశ్వసించాలని గుర్తించాడు. లండన్లోని మొరేవియన్ సమాజGCTel 237.2

    సమావేశంలో విశ్వాసి హృదయంలో పరిశుద్దాత్మ కలిగించే మార్పును వివరిస్తూ లూథర్ రచనల నుంచి ఒక ప్రకటనను చదవటం జరిగింది. వెస్లీ ఆ ప్రకటన విన్నప్పుడు ఆయన ఆత్మలో విశ్వాసం రగులుకొన్నది. నా హృదయంలో వెచ్చదనం పుట్టినట్లనిపించింది. నేను క్రీస్తును నమ్ముకొన్నానన్న భావన, నా రక్షకుడు క్రీస్తే అన్నGCTel 237.3

    భావన కలిగింది. ఆయన నా పాపాల్ని తీసివేసి పాప మరణ శాసనాల నుంచి నన్ను రక్షించాడన్న నిశ్చయత నాకు కలిగించింది. ”- అదే పుస్తకం, పుట 52.GCTel 237.4

    అనేక సంవత్సరాల ప్రయాస ద్వారా- సంవత్సరాల కొద్దీ ఆత్మత్యాగం, తిరస్కారం, అవమానం దేవుని వెదకటం ద్వారా తన ఏకైక లక్ష్యాన్ని వెస్లీ నమ్మకంగా అనుసరించాడు. ఇప్పుడు దేవుని కనుగొన్నాడు. ప్రార్ధనలు, ఉపవాసాలు, దానధర్మాలు, ఆత్మతిరస్కారం ద్వారా సంపాదించాలని ప్రయత్నించిన కృప “ద్రవ్యం లేకుండా, ధర పెట్టకుండా” ఉచితంగా వచ్చేవరమని తెలుసుకొన్నాడు.GCTel 237.5

    క్రీస్తు మీద విశ్వాసంలో స్థిరపడటంతో మహిమకరమైన దేవుని ఉచిత కృపా సువార్తను ప్రతీ చోటా ప్రకటించాలన్న ఆకాంక్ష వెస్లీ ఆత్మను దహించింది అన్నాడు, ‘లోకమంతా నా పేరిష్ గా భావిస్తాను. దానిలో నేనేమూల ఉన్నా, వినటానికి ఇష్టంగా ఉన్న వారందరికీ రక్షణ సువార్తను ప్రకటించటం నా విధ్యుక్త ధర్మమని భావిస్తున్నాను.” - అదే పుస్తకం, పుట 74.GCTel 237.6

    కఠినమైన, ఆత్మత్యాగ పూరిత జీవితాన్ని కొనసాగించాడు. ఆ జీవితం ఇప్పుడు విశ్వాసానికి కాక దాని ఫలితానికి కారణమయ్యింది. దాని పరిశుద్ధతకు కాక, ఫలానికి కారణమయ్యింది. క్రీస్తులోని దైవకృప క్రైస్తవ నిరీక్షణకు పునాది. ఆ కృప విధేయత ద్వారా ప్రదర్శిత మౌతుంది. తాను పొందిన గొప్ప సత్యాలను అనగా ప్రాయశ్చిత్తం కూర్చే క్రీస్తు రక్తంపై విశ్వాసం ద్వారా నీతిమంతుడుగా తీర్పు పొందటం, హృదయంపై పరిశుద్ధాత్మ నవీకరణ శక్తి మూలంగా క్రీస్తు ఆదర్శాన్ననుసరించి జీవించే జీవితం ఫలాలు ఫలించటం అన్న సత్యాలను ప్రకటించటానికి వెలస్త్రీ తన జీవితాన్ని అంకితం చేసుకొన్నాడు.GCTel 238.1

    తప్పిపోయి ఉన్న తమ దుస్థితిని దీర్ఘకాలంగా వ్యక్తిగతంగా గుర్తించటం ద్వారా వైట్ ఫీలో వెలసీలు తాము చేయాల్సిన సేవకు అవసరమైన సిద్ధబాటును పొందారు. మంచి క్రీస్తు సైనికులుగా శ్రమలు భరించటానికిగాను విశ్వ విద్యాలయంలోను సువార్త సేవారంగంలోను ప్రవేశిస్తున్న తరుణంలో వారు తిరస్కారం, హేళన, హింస వంటి శ్రమలకు గురికావలసి వచ్చింది. వారిని వారిపట్ల సానుభూతి గల ఇంకా కొందరిని తోటి విద్యార్థులు ద్వేష భావంతో “మెథడిస్టులు”అని హేళన చేసేవారు. ఇంగ్లాండులోను అమెరికాలోను ఈ పేరు ఇప్పుడు గౌరవ ప్రతిష్టలుగల పెద్ద మత శాఖ పేరు.GCTel 238.2

    చర్చ్ ఆఫ్ ఇంగ్లాండు సభ్యులుగా ఆ సంఘం ఆరాధనాచారాల పట్ల వారికి ఎంతో అభిమానం. కాకపోతే వాక్యంలో వారి ముందు దేవుడుంచినవి ఇంకా ఉన్నతమైన ప్రమాణాలు. సిలువ మరణం పొందిన క్రీస్తును బోధించాలని పరిశుద్దాత్మ వారిని ప్రోత్సహించాడు. సర్వోన్నతుని శక్తి వారి కృషిని బలపర్చింది. వేలాదిమంది ప్రజలు మారుమనసు పొంది క్రైస్తవులయ్యారు. ఈ గొర్రెలను ఆకలిగొన్న తోడేళ్ల నుంచి తప్పించాల్సిన అవసరం ఏర్పడింది. కొత్త మత శాఖలను స్థాపించాలన్న ఉద్దేశం వెస్లీకి లేదు. కాని వారిని మెథడిస్టులుగా వ్యవస్థీకరించాడు.GCTel 238.3

    ఈ బోధకులకు సంస్థాగత సంఘం నుంచి మర్మపూరితమైన వ్యతిరేకత ఎదురయ్యింది. అయితే సంఘంలోనే దిద్దుబాటు ప్రారంభం కావటానికి జ్ఞాని అయిన దేవుడు పరిస్థితులను అదుపుచేశాడు. పూర్తిగా బైట నుంచి వచ్చి ఉంటే అది అత్యవసరమైన చోట్లకు వెళ్లి ఉండేది కాదు. ఉజ్జీవ బోధకులు సంఘాల వ్యక్తులు గనుక. అవకాశం దొరికిన చోట సంఘ పరిధిలో పని చేశారు గనుక, మూతపడే తలుపులు వారి సేవల ద్వారా సత్యం ప్రవేశించేందుకు తెరుచుకున్నాయి. బోధక వర్గంలోని కొందరు తమ నైతికమైన మత్తును వదిలించుకొని కళ్లు తెరచి తమ సొంత పేరి లో బోధకులయ్యారు. మత మౌఢ్యంతో కరడుగట్టిన సంఘాలు ప్రాణం పోసుకొని రెపరెపలాడాయి.GCTel 238.4

    సంఘ చరిత్రలో యుగాలన్నింటిలో లాగే వెస్లీ కాలంలో ఆయా వరాలున్న వ్యక్తులు తమ నియమిత సేవలను నిర్వహించారు. సిద్ధాంతానికి సంబంధించిన ప్రతీ అంశంపై ఏకీభావం లేకపోయినా పరిశుద్ధాత్మ వారందరినీ చైతన్య పర్చి క్రీస్తుకు ఆత్మలను సంపాదించాలన్న లక్ష్యంతో వారిని ఐక్యపర్చాడు. వైట్ ఫీల్డ్ కి, వెస్లీలకు మధ్య తలెత్తిన భేదాభిప్రాయాలు వేర్పాటుకు దారితీసే ప్రమాదం ఒకప్పుడు కనిపించింది. అయితే క్రీస్తు పాఠశాలలో వారు నేర్చుకొన్న సాత్వికం, సహనం, ప్రేమ వారి మధ్య సామరస్యాన్ని నెలకొల్పాయి. అపరాధం, అధర్మం ప్రతీచోటా పెచ్చరిల్లుతుండగా, పాపులు నాశనం దిశగా పరుగులు తీస్తుండగా వారి మధ్య వివాదాలకు తావులేదు.GCTel 239.1

    దైవ సేవకులు మిట్టపల్లాల మార్గంలో ప్రయాణించారు. ప్రాబల్యం, విజ్ఞానం గల వ్యక్తులు వారిని వ్యతిరేకించారు. కొంత కాలానికి బోధకవర్గంలో పెక్కుమంది తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించారు. పవిత్ర విశ్వాసానికి, దాన్ని ప్రకటిస్తున్న బోధకులకు సంఘాల ద్వారాలు మూతపడ్డాయి. వేదిక మీద బోధకులు అంధకార, అజ్ఞాన, దుష్ట శక్తులను తప్పు పట్టటం వారిని మేల్కొలిపింది. దేవుని కృప ద్వారా మాత్రమే జాన్ వెస్లీ పదేపదే ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగాడు. ఆయనపై ప్రజాగ్రహం రెచ్చగొట్టటం జరిగి తప్పించుకునే మార్గం లేకపోయిన తరుణంలో మానవ రూపంలో ఒక దేవదూత ఆయన పక్కకు రాగా ఆ గుంపు వెనుకంజ వేసింది. అప్పుడు ప్రమాదకరమైన ఆ స్థలం నుంచి దైవ సేవకుడు క్షేమంగా వెళ్లిపోయాడు.GCTel 239.2

    ఇలాంటి ఒక సమయంలో రెచ్చిపోయిన ఒక ప్రజాసమూహం నుంచి తాను తప్పించుకోటం గురించి వెస్లీ ఇలా అన్నాడు, “కాలుజారే మార్గం ద్వారా పట్టణానికి వెళ్లటానికి కొండ దిగుతున్నప్పుడు నన్ను కిందకు నెట్టటానికి అనేకమంది ప్రయత్నించారు. ఒక సారి నేలమీద పడటం జరిగివుంటే నేను ఇక లేవటం జరిగేదు కాదు, వారికి అందకుండా దూరంగా వెళ్లేంతవరకు నేను తూలిపడటంగాని, జారిపడటంగాని జరగలేదు. నా చొక్కానుగాని దుస్తుల్నిగాని పట్టుకొని నన్ను కింద పడవేయటానికి ఎంతోమంది ప్రయత్నించినా వారికి పట్టుదొరకలేదు. ఒకడు మాత్రం నా వేస్ట్ కోటు ఒక అంచును పట్టుకోగా అది అతడి చేతిలోకి ఊడి వచ్చింది. అది అతడి చేతిలో మిగిలిపోయింది. తక్కిన అంచుకున్న జేబులో బేంక్ నోటు ఉన్నది. ఆ అంచు సగానికి చినిగింది. నా వెనుక ఉన్న ఒక బలమైన వ్యక్తి పెద్ద కర్రతో నన్ను కొట్టటానికి కర్రను చాపుతున్నాడు. దానితో నాతల వెనుక భాగంపై కొట్టి ఉంటే నాతో అతడికిక పని ఉండకపోవును. కాని ప్రతీసారీ దెబ్బపక్కకు పడేది. ఎందుకో నాకు తెలియదు. ఎందుకంటే నేను కుడికిగాని, ఎడమకుగాని తిరగలేకపోయాను... ఇంకోవ్యక్తి గుంపులో నుంచి గబగబా వచ్చి నన్ను కొట్టటానికి చెయ్యెత్తి అర్థాంతరంగా దాన్ని దింపేసి నాతల నిమురుతూ ఇలా అన్నాడు, “ఈయన జుట్టు ఎంత సుతిమెత్తగా ఉన్నది. పరివర్తన చెందిన వారిలో మొట్టమొదటి వారు ఆ పట్టణంలో వీరులు. వారు అన్ని సందర్భాల్లోను అల్లరి మూకకు నాయకులు. అందులో ఒకడు బహుమానం కోసం పోరాడే యోధుడు.GCTel 239.3

    “తన చిత్తం కోసం మనల్ని దేవుడు ఎంత సున్నితంగా సిద్ధం చేస్తాడు! రెండేళ్ల క్రితం ఇటుక ముక్క ఒకటి నా భుజాలను రాసుకొంటూ వెళ్లింది. అదైన ఒక ఏడాదికి ఒక రాయి నాముక్కుమీద తగిలింది. గతమాసం నాకోదెబ్బ తగిలింది. ఈ సాయంత్రం రెండు దెబ్బలు తగిలాయి. ఒకటి మేము ఈ పట్టణంలో ప్రవేశించక పూర్వం, ఒకటిGCTel 240.1

    మేము బైటికి వెళ్లిపోయిన అనంతరం. కాని ఆరెండూ ఏమీలేనట్లే. ఎందుకంటే ఒక వ్యక్తి నన్ను ఛాతిమీద బలంగా కొట్టినప్పటికీ మరొక వ్యక్తి రక్తం ప్రవహించేంత గట్టిగా నోటిమీద కొట్టినప్పటికీ ఆ రెండు దెబ్బల్లో ఏదీ గడ్డిపరకతో కొట్టినంత నొప్పి కూడా కలిగించలేదు.” - జాన్ వెస్లీ, వర్క్స్, సం 3, పుటలు 297,298.GCTel 240.2

    తొలినాళ్ల మెథడిస్టులు, ప్రబోధకులు తమ బోధలవల్ల ఆగ్రహం కలిగిన మత దురభిమానుల అవహేళనను, హింసను భరించారు. న్యాయస్థానాలకు ఈడ్చి వారిపై నిందలు మోపారు. ఆ రోజుల్లో న్యాయస్థానాలు పేరుకు మాత్రమే న్యాయస్థానాలు. వాటిలో న్యాయం దొరకటం అరుదు. హింసకుల చేతుల్లో వారు తరచు దౌర్జన్యానికి గురి అయ్యేవారు. అల్లరి మూకలు ఇంటింటికీ వెళ్లి సామగ్రిని, వస్తువులను ధ్వంసం చేసి దొరికిన వస్తువులను దోచుకొని మగవారు, మహిళలు, చిన్న పిల్లల పట్ల క్రూరంగా ప్రవర్తించే వారు. మెథడిస్టుల కిటికీలు పగులకొట్టి వారి ఇళ్లు దోచుకోటానికి సాయం చేయటానికి ఇష్టపడేవారు. ఫలానా సమయంలో పలానా స్థలంలో సమావేశమవ్వాల్సిందని కొన్ని సందర్భాల్లో పబ్లిక్ నోటీసులు జారీచేసేవారు. మానవ చట్టాలు దైవ చట్టాల ఉల్లంఘన చిన్న మందలింపైనా లేకుండా కొనసాగేది. పాపుల పాదాలను నాశన మార్గం నుంచి నీతి మార్గానికి మళ్లించటానికి ప్రయత్నించటమన్న పొరపాటే ఈ ప్రజలపై సాగిస్తున్న హింసకు కారణం..GCTel 240.3

    తనపైన తన సహచరులపైన మోపిన ఆరోపణలను ప్రస్తావిస్తూ జాన్ వెస్లీ ఇలా అన్నాడు, “ఈ వ్యక్తులు బోధించే సిద్ధాంతాలు అబద్ధాలతో, తప్పులు ఉద్రేకాలతో నిండి ఉన్నాయని, మొన్న మొన్నటి వరకు అవి ఎవరూ విని ఉండని కొత్త విషయాలని, అవి క్వేకరు వాద, ఛాందసవాద, పోపుమతవాద సిద్ధాంతాలని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ సిద్ధాంతంలోని ప్రతీ భాగం మన సంఘం వివరించే స్పష్టమైన లేఖన సిద్ధాంతమని చూపించటం ద్వారా ఈ బూటకాన్ని సమూలంగా నరికివేయటం జరిగింది. కాబట్టి లేఖనం నిజమైనదైతే అది అబద్ధమైనదనిగాని తప్పులతో నిండినదనిగాని చెప్పటానికి వీలులేదు. వారి సిద్ధాంతం చాలా కఠినమైన సిద్ధాంతం. వారు పరలోక మార్గాన్ని ఇరుకు మార్గం చేస్తున్నారు అని ఇతరులు నిందిస్తారు. వాస్తవంగా ఇది మొదట్లోని అభ్యంతరం.(కొంతకాలం వరకు ఇదొక్కటే అభ్యంతరం) ఇది ఆయా రూపాల్లో కనిపించే వేలాది అభ్యంతరాలకు పునాది. అయితే మన ప్రభువు ఆయన శిష్యులు చేసిన దానికన్న పరలోకమార్గాన్ని వారు ఎక్కువ ఇరుకుచేస్తున్నారా? వారి సిద్ధాంతం బైబిలు సిద్ధాంతం కన్న కఠినంగా ఉన్నదా? స్పష్టంగా ఉన్న కొన్ని వచనాల్ని మాత్రమే పరిశీలించండి. “నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. మనుషులు పలుకు వ్యర్ధమైన ప్రతిమాటను గూర్చియు విమర్శ దిమున లెక్క చెప్పవలసియుండును. మీరు భోజనము చేసినను, పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి.”GCTel 241.1

    “వారి సిద్ధాంతం దీనికన్నా కఠినంగా ఉంటే వారిని నిందించాల్సిందే. కాని అది నిజంకాదని మీ అంతరాత్మకు తెలుసు. ఒక పొల్లు తక్కువ కఠినంగా వుండి దైవ వాక్యానికి అపచారం చేయకుండా ఉండగలవారెవరు? దైవ మర్మాల నిర్వహణాధికారి వ్యక్తి అయిన అపవిత్ర విషయాల స్వభావ స్వరూపాల్ని మార్చివేసి విశ్వాస పాత్రుడవ్వగలరా? అవ్వలేరు. అతడు దేన్ని రద్దుచేయలేడు. దేన్నీ తగ్గించలేడు. అందరికీ ఇలా ప్రకటించటం తప్పనిసరి అవుతుంది. ‘లేఖనాన్ని మీకు నచ్చేటట్లు మార్చలేను. మీరే దాని ప్రకారం నడుచుకోవాలి. లేకపోతే నిత్యమూ నశించిపోతారు, ‘ఈ మనుషుల కాఠిన్యం గురించి ప్రజల గగ్గోలుకు అసలు కారణం ఇది. వారు కఠినంగా వ్యవహరించారా? ఏ విషయంలో? ఆకలిగా ఉన్న వారికి వారు భోజనం పెట్టటం లేదా? బట్టలు లేని వారికి బట్టలివ్వటంలేదా? కాదు. కావలసింది అదికాదు. ఇందులో వారు వెనుకబడిలేరు. కాని విమర్శించటంలో వారు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. తమ పద్ధతిలో నివసించే వారికి తప్ప ఇతరులకు రక్షణ లేదని వారినమ్మకం” - అదే పుస్తకం, సం 3, పుటలు 152,153.GCTel 241.2

    వెస్లీ కాలానికి ముందు ఇంగ్లాండులో ప్రబలిన ఆధ్యాత్మిక దుస్థితికి కారణం ఆజ్ఞలు కాపాడటం ముఖ్యం కాదన్న బోధే. క్రీస్తు నీతి ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడని, అందుచేత క్రైస్తవుడు దాన్ని ఆచరించనవసరం లేదని, “సత్ర్కియల చెర నుంచి విశ్వాసానికి స్వేచ్ఛ లభించిందని” అనేకమంది నొక్కి పలికారు. ఇతరులు ధర్మశాస్త్రం నిత్యం అమలులో ఉంటుందన్నది అంగీకరిస్తూ దాన్ని ఆచరించాలంటూ బోధకులు ప్రజలకు చెప్పటం అనవసరమని అభిప్రాయపడ్డారు. ఎందుచేతనంటే రక్షణ కోసం దేవుడు ఎవరినైతే ఎంపిక చేస్తాడో వారు దైవ కృపను బట్టి భక్తిగా, నీతిగా నివసిస్తారని నిత్యనాశనానికి ఎంపికైన వాళ్లు ధర్మశాస్త్రాన్ని ఆచరించటానికి శక్తిని కోల్పోతారని వారు నమ్మారు.GCTel 242.1

    “ఎంపిక అయిన వారు దైవ కృప నుంచి పడిపోటంగాని దైవానుగ్రహాన్ని కోల్పోటంగాని” జరగదని “తాము జరిగించే దుష్కియలు నిజంగా పాప క్రియలు కావని వాటిని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేసే పనులకు సాదృశ్యంగా పరిగణించకూడదని, ఫలితంగా తమ పాపాల్ని ఒప్పుకోవాల్సిన పశ్చాత్తాపం ద్వారా వాటి నుంచి విముక్తి పొందాల్సిన అవసరం ఉండదని భావించేవారు కొందరున్నారు.” - మెక్ క్లింటాక్, ఎన్ సైక్లోపీడియా, వ్యాసం. ” ఏంటినోమియన్స్.”. కనుక ఎంపిక అయిన వారిలో ఎవరైన లోకమంతా అతిఘోర ధర్మశాస్త్ర ఉల్లంఘనగా పరిగణించే నీచాతినీచమైన పాపం చేసినా అది పాపంగా పరిగణనలోనికి రాదని “ఎందుకనంటే దేవునికి హితంకాని కార్యాలుగాని ధర్మశాస్త్రం నిషేధించిన పనులుగాని చేయలేకపోవటం ఎంపికైన వారి విలక్షణమని వారు ఉద్ఘాటించారు.” ఈ భయంకర సిద్ధాంతాలు అనంతరం వచ్చిన ప్రఖ్యాత విద్యావేత్తలు వేదాంత పండితుల సిద్ధాంతాల వంటివే. అవి ఏవంటే- మంచి చెడ్డల విషయంలో మార్చరాని దైవ నిబంధనంటూ ఏదీలేదు. కాని నీతి ప్రమాణాల్ని సమాజమే నిర్దేశిస్తుంది. అవి నిత్యమూ మారుతుంటాయి. ఈ అభిప్రాయాలన్నీ ఒకే దుష్టుడు సృష్టించినవి. పరలోకంలోని పాపరహిత దూతల మధ్య సయితం దేవుని పరిశుద్ధ ధర్మశాస్త్ర సూత్రాలను భగ్నం చేసే తన దుష్కృతిని ప్రారంభించిన వాడూ ఆ దుష్టుడే.GCTel 242.2

    దేవుడే మనుషుల ప్రవర్తనను నిర్ణయిస్తాడు. అది ఎన్నడు మారకుండా ఉంటుంది అన్న సిద్ధాంతం అనేకులు దైవ ధర్మశాస్త్రాన్ని తిరస్కరించటానికి దారి తీసింది. దైవ ధర్మశాస్త్రం ప్రాముఖ్యం కాదన్న సిద్ధాంత బోధకుల తప్పుడు బోధల్ని వెస్లీ వ్యతిరేకించి ఆ సిద్ధాంతం లేఖనాలకు విరుద్ధమని వివరించాడు. “సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైన...” “ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై యున్నది. ఆయన మనుష్యులందరు రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గల వారై యుండవలెనని యిచ్ఛయించు చున్నాడు. దేవుడొక్కడే, దేవునికిని, నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తుయేససు నరుడు. ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను.” తీతుకు 2:11. తిమోథి 2:36. ప్రతి వారికీ రక్షణ మారాన్ని ఉపదేశించటానికి దేవుడు తన ఆత్మను ఉచితంగా అనుగ్రహిస్తాడు. ఈ విధంగా “నిజమైన వెలుగు” క్రీస్తే. అది ‘లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది.” యోహాను 1:9 మనుషులు నిత్యజీవ వరాన్ని ఇష్టపూర్వకంగా విసర్జించటం వల్ల రక్షణను పొందలేకపోతున్నారు.GCTel 243.1

    క్రీస్తు మరణించినప్పుడు ఆచార ధర్మశాస్త్రంతోపాటు పది ఆజ్ఞలు కూడా రద్దయ్యా యన్న వాదనకు సమాధానమిస్తూ వెస్లీ ఇలా అంటున్నాడు, “పది ఆజ్ఞలలో ఉన్న, ప్రవక్తలు అమలుపర్చిన నీతి ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేయలేదు. ఇందులో ఏ భాగాన్ని రద్దుపర్చటానికి ఆయన రాలేదు. ఇది ఎన్నడూ అతిక్రమించరాని ధర్మశాస్త్రం పరలోకంలో నమ్మకమైన సాక్షిగా నిలిచే ధర్మశాస్త్రం. రాతి పలకల మీద...రాయబడక పూర్వం మానవులు సృష్టికర్త చేతులలోనుంచి ఉనికిలోకి వచ్చినప్పుడు వారి హృదయాలపై లిఖితమైన ఈ ధర్మశాస్త్రం లో కారంభం నుంచి వస్తున్నదే. ఒకప్పుడు దేవుడు తన సొంత వేలితో రాసిన అక్షరాలను పాపం చాలా మట్టుకు చెరిపివేసింది. అయిన మనలో మంచి చెడ్డల స్పృహ ఉన్నంతకాలం అక్షరాలు పూర్తిగా చెరిగిపోవు. కాలంపైగాని, స్థలంపైగాని మార్పుకు లోనయ్యే ఏ పరిస్థితిపైగాని ఆధారపడక, దేవుని స్వభావంపైన మానవుడి స్వభావం పైన మార్పులేని వారి పరస్పర సంబంధంపైన ఆధారపడి, అన్నియుగాల్లోను మానవులందరి విషయంలోను ఈ ధర్మశాస్త్రంలోని ప్రతీ భాగం అమలుకావలసిందే.GCTel 243.2

    “నెరవేర్చుటకేగాని కొట్టివేయుటకు నేను రాలేదు.... ఇక్కడ ఆయన అర్థం ఏమిటంటే (ముందు చెప్పిన దానికి ఆ తర్వాత చెప్పిన దానికి అనుగుణంగా) మనుషులు ఏమి చెబుతున్నా నేను దాన్ని నెరవేర్చటానికే వచ్చాను అని అందులో ఏదైతే స్పష్టంగా లేదో దాన్ని స్పష్టంగా బయలుపర్చటానికి వచ్చాను, అందులోని ప్రతీGCTel 244.1

    భాగం ప్రాధాన్యాన్ని ప్రకటించటానికి, అందులో ఉన్న ప్రతి ఆజ్ఞ పొడవు, వెడల్పు, ఎత్తు, లోతు, పవిత్రత, దాని వివిధ శాఖల ఆధ్యాత్మికతను వివరించటానికి వచ్చాను అని” వెస్లీ, ప్రసంగం 25.GCTel 244.2

    ధర్మశాస్త్రానికి సువార్తకు మధ్యగల సామరస్యాన్ని, వెస్లీ ప్రకటించాడు. కాబట్టి ధర్మశాస్త్రానికి సువార్తకు మధ్య చాలా దగ్గర సంబంధమున్నది. ఒక పక్క ధర్మశాస్త్రం నిత్యం మనకు మార్గం సరాళం చేసి మనల్ని సువార్త వద్దకు నడుపుతుంది. మరోపక్క ధర్మశాస్త్రాన్ని మరెక్కువ కచ్చితంగా నెరవేర్చటానికి సువార్త మనల్ని నడిపిస్తుంది. ఉదాహరణకు, దేవున్ని ప్రేమించుమని, మన పొరుగువాన్ని ప్రేమించుమని, సాత్వికం, అణకువ లేక పరిశుద్ధత కలిగి నివసించుడని ధర్మశాస్త్రం మనల్ని కోరుతుంది. వీటిని నిర్వహించటానికి మనం సరిపోమని భావిస్తాం. ఔను. మానవుడికి ఇది అసాధ్యమే. మనల్ని దీనంగా, సాత్వికంగా, పరిశుద్ధంగా రూపుదిద్దటానికి మనకు అట్టి ప్రేమనిస్తానన్న వాగ్దానం ఉంది. ఈ సువార్తను, ఈ శుభవార్తను మనం పట్టుకొని ఉండాలి. మన విశ్వాసాన్ని బట్టి అది మనకు కలుగుతుంది. యేసుక్రీస్తుపై విశ్వాసం ద్వారా (ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి(మనయందు) నెరవేర్చబడాలి.”GCTel 244.3

    క్రీస్తు సువార్త విరోధులలో ధర్మశాస్త్రాన్ని బహిరంగంగా, స్పష్టంగా విమర్శించేవారు, ధర్మశాస్త్రం గురించి చెడ్డగా మాట్లాడే వారు, చిన్నది పెద్దది అన్న తేడాలేకుండా ఆజ్ఞలను అతిక్రమించండంటూ ప్రజలకు బోధించే వారు అగ్రశ్రేణికి చెందిన వారు... ఈ మోసం సందర్భంగా ఒక చిత్రమైన విషయమేంటంటే దానిలో పడ్డవారు క్రీస్తు ధర్మశాస్త్రాన్ని తోసిరాజనటం ద్వారా ఆయనను మహిమపర్చుతున్నామంటూ, ఆయన సిద్ధాంతాల్ని నాశనం చేస్తూనే ఆయన అధికారాన్ని గౌరవిస్తున్నామని భావించటం. ఔను, ఆయనను గౌరవిస్తున్నారు. ఇలాగున యూదా గౌరవించినట్లు బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. నీవుముద్దు పెట్టుకొని మనుష్యకుమారుని అప్పగించుచున్నావా?” అని వారిలో ప్రతివారితోను ఆయన అనటం న్యాయమే. ఆయన రక్తం గురించి మాట్లాడి ఆయన కిరీటాన్ని తీసివేయటం, ఆయన సువార్తను ప్రచురిస్తున్నామన్న మిషతో ఆయన ధర్మశాస్త్రాన్ని కించపర్చటం, ఆయనను ముద్దు పెట్టుకొని అప్పగించటంగాక మరేంటి? ప్రత్యక్షంగాగాని, పరోక్షంగాగాని ఏ విషయంలోను ఏ రీతిలోను అవిధేయతను ప్రోత్సహించే విధంగా బోధించే ఏ వ్యక్తి అయినా, దేవుని ఆజ్ఞల్లో ఎంత స్వల్పమైన ఆజ్ఞనైనా తొలగించటానికి గాని దుర్బలపర్చటానికి గాని ప్రయత్నిస్తే ఈ నేరానికి బాధ్యుడు.” అదే పుస్తకం.GCTel 244.4

    “సువార్త ప్రకటన ధర్మశాస్త్ర లక్ష్యాలను నెరవేర్చుతుంది.” అని వాదించే వారికి వెస్లీ సమాధానం ఇది, “దీన్ని మేము కాదంటున్నాం. ఇది మొట్టమొదటి లక్ష్యాన్నే అనగా మానవులకు పాప స్పృహ కలిగించటం, నరకం అంచున నిద్రపోతున్న వారిని మేల్కొలపటం అన్న లక్ష్యాన్ని సాధించలేక పోతున్నది. ” “ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడు చున్నది.” అంటున్నాడు అపోస్తలుడు. “మానవుడికి పాప స్పృహ కలిగినప్పుడే ప్రాయశ్చిత్తం కూర్చే క్రీస్తు రక్తం తనకు అవసరమని అతడు గుర్తిస్తాడు. మన రక్షకుడన్నట్లు • రోగులకేగాని ఆరోగ్యము గలవానికి వైద్యుడక్కరలేదు గదా?’ ఆరోగ్యంగా ఉన్నవారికి లేదా ఆరోగ్యంగా ఉన్నామని తలంచే వారికి వైద్యుణ్ణి పురమాయించటం విజ్ఞతకాదు. తాము వ్యాధి బాధితులని వారిని ముందు ఒప్పించాలి. అది జరగకపోతే మీరందించే చేయూతను వారు అభినందించరు. ఎన్నడూ నలగకుండా ఆరోగ్యంగా ఉన్న హృదయానికి క్రీస్తును అందించటం అంతే అవివేకం” అదే పుస్తకం, ప్రసంగం 35.GCTel 245.1

    దైవ కృపా సువార్తను ప్రకటించే తరుణంలో వెస్లీ తన ప్రభువుమల్లే “ఉపదేశ క్రమము... ఘనపరచి గొప్ప” చేయటానికి ప్రయత్నించాడు. తనకు దేవుడిచ్చిన పనిని నమ్మకంగా నిర్వహించాడు. బ్రహ్మాండమైన ఫలితాన్ని కూడా కళ్లారా చూశాడు. తన ఎనభై సంవత్సరాల జీవితకాలం చివరి - ఏభై ఏళ్లకు పైగా చిలుకు సంచార సువార్త సేవలో గడిచాయి- ఆయన ద్వారా క్రీస్తును కనుగొన్న ఆత్మలు పదిలక్షలు. ఆయస సేవల ద్వారా పాప దుస్థితి నుంచి భ్రష్టత నుంచి ఉన్నతమైన, పవిత్రమైన జీవిత సరళికి చేరిన వేలాది ప్రజలు, ఆయన బోధనల వల్ల ప్రగాఢ క్రైస్తవానుభవాలు గడించిన వారు ఎందరో అన్నది రక్షణ పొందిన కుటుంబమంతా దేవుని రాజ్యంలో సమావేశమయ్యే ఆ సుదినం వరకు చెప్పలేం. ఆయన జీవితం ప్రతి క్రైస్తవుడికి వెలలేని పాఠాలు నేర్పుతుంది. నేటి సంఘాల్లో ఈ మహనీయుడి విశ్వాసం, సాత్వికం, అలుపెరుగని ఉద్రేకం, త్యాగశీలత, దైవభక్తి ప్రతిబింబిస్తే ఎంత బాగుంటుంది!GCTel 245.2