Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

మహా సంఘర్షణ

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయం 27—నవీన ఉజ్జీవం

    దైవ వాక్యప్రబోధం ఎక్కడ నమ్మకంగా జరుగుతుందో అక్కడ సత్ఫలితాలు చోటుచేసుకొంటాయి. ఆపని దేవుని మూలంగా జరిగినదని ఆ ఫలితాలు చాటి చెబుతాయి. దైవభక్తులు అందించిన వర్తమానాలకు దేవుని ఆత్మ అండదండలుండటం వలన వాక్య ప్రబోధం శక్తిమంతంగా సాగింది. పాపులలో మనస్సాక్షి నిద్రలేచింది. “నిజమైన వెలుగు... లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచు” వారి ఆత్మలలోని రహస్య సలాలను వెలుగుతో నింపింది. చీకటిలో మరుగై ఉన్న విషయాలు స్పష్టమయ్యాయి. దృఢమైన విశ్వాసం వారి మనస్సుల్లోను హృదయాల్లోను నెలకొన్నది. పాపం, నీతి, రానున్న తీర్పు అన్న అంశాలపై వారికి నమ్మకం ఏర్పడింది. యెహోవా నీతిమంతుడన్న ఆలోచన బలీయమయ్యింది. తమ అపరాధాలుతో అపరిశుద్ధతలతో హృదయాలు పరిశోధించే ఆ ప్రభువు ముందు నిలువటమన్నది వారిలో భయం పుట్టించింది. హృదయ వేదనతో ఇలా ప్రథాపించారు, “ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?” మానవుల పాపాల నిమిత్తం కల్వరి సిలువపై జరిగిన బలిదానాన్ని వివరించినప్పుడు తమ పాపాలకు క్రీస్తు నీతి తప్ప మరేదీ ప్రాయశ్చిత్తం కాజాలదని వారు స్పష్టంగా గ్రహించారు. ఇదొక్కటే దేవునితో మానవుడిని సమాధానపర్చగలదని గుర్తించారు. లోక పాపాలు మోసుకొనిపోయే దేవుని గొర్రెపిల్లను విశ్వాసంతోను వినయ మనస్సుతోను వారు అంగీకరించారు. యేసు రక్తం ద్వారా “పూర్వము చేయబడిన పాపములను... దేవుడు” ఉపేక్షించాడు.GCTel 432.1

    వీరు పశ్చాత్తాపం చెంది అందుకు అనుగుణంగా ఫలాలు ఫలించారు. విశ్వసించి బాప్తిస్మం పొంది క్రీస్తులో నూతన వ్యక్తులుగా నివసించటానికి తమ గత జీవిత ఆశలు, ఆశయాలను అనుసరించి నివసించటానికి గాక దేవుని కుమారుడు క్రీస్తు అడుగుజాడల్లో నడవటానికి, ఆయన ప్రవర్తనను ప్రతిబింబించటానికి ఆయన పరిశుద్దుడై ఉన్నట్లు వారు తమ్మును తాము పవిత్రులను చేసుకోటానికి నీటి సమాధినుంచి లేచారు. ఒకప్పుడు తాము ద్వేషించిన వాటిని ఇప్పుడు ప్రేమించారు. ఒకప్పుడు తాము ప్రేమించిన వాటిని ఇప్పుడు ద్వేషించారు. అహంకారులు, పొగరుబోతులు సాత్వికులయ్యారు. పనిపాటు లేకుండా తిరిగే వారు బుద్ధిమంతులయ్యారు. దుర్భాషలాడే వారు మర్యాదస్తులయ్యారు. తాగుబోతులు తాగుడు మానారు. వ్యభిచార్లు సత్ప్రవర్తనులయ్యారు. వ్యర్ధమైన లౌకిక విలాసాలతో ఇక పనిలేదు. “జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు కొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా వుండక సాధువై నట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను.” (1పేతురు 3:3,4.) అన్న ఉపదేశాన్ని పాటించారు. GCTel 432.2

    ఉజ్జీవ సభలు హృదయ పరిశోధనకు దారితీసి దీన స్వభావం కలిగించాయి. క్రీస్తు రక్తాన్ని కొనుగోలు చేసుకోటానికి కోరిక పుట్టిస్తూ పాపికి గంభీరమైన హృదయపూర్వకమైన విజ్ఞాపనలు చేసిన సభలవి. మనుషుల రక్షణ నిమిత్తం దేవునితో పోరాడుతూ పురుషులు, మహిళలు ప్రార్ధన చేశారు. ఆ ఉజ్జీవసభల ఫలితంగా ఆత్మోపేక్షకు త్యాగాలకు వెనుకాడక క్రీస్తు నిమిత్తం నిందలు శ్రమలు భరించటానికి తమకు యోగ్యత కలిగిందని పరిగణించి ఆనందించే వారెందరో లేచారు. యేసు నామం ధరించినవారి జీవితాల్లో చోటుచేసుకొన్న మార్పు మనుషులకు స్పష్టంగా కనిపించింది. వారి ప్రభావం వల్ల సమాజానికెంతో మేలు చేకూరింది. నిత్యజీవమునే పంటను కోయటానికిగాను వారు ఆత్మను విత్తి క్రీస్తుతో కలిసి పోగుచేశారు.GCTel 433.1

    “మీరు దుఃఖపడి మారుమనస్సు పొందితిరని” వారిని గురించి చెప్పవచ్చును. “దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్ధమైన మారుమనస్సును కలుగజేయును. ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించును. అయితే లోకసంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైన ప్రతి వాదమును ఎట్టి ఆగ్రహమును, ఎట్టిభయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతి దండనను మీలో పుట్టించెనో చూడుడి. ఆ కార్యమునుగూర్చి సమస్త విషయములలోను మీరు నిర్దోషులై యున్నారని ఋజువు పరుచుకొంటిరి” 2 కొరింథి 7:911.GCTel 433.2

    ఇది దేవుని ఆత్మ పని వలన కలిగే ఫలితం. నిజమైన మారుమనసుకు దిద్దుబాటే నిదర్శనం. కుదువ సొమ్మును అతను మరల అప్పగిస్తే, దొంగిలించిన దాన్ని తిరిగి ఇచ్చివేస్తే, తన పాపాల్ని ఒప్పుకొని దేవున్ని సహమానవుల్ని ప్రేమిస్తే పాపికి దేవునితో సమాధానం ఏర్పడుతుంది. మతపరమైన ఉజ్జీవ సమావేశాలవల్ల గతంలో చేకూరిన ఫలితాలు అట్టివి. తాము ఫలించిన ఫలాన్ని బట్టి మనుషుల రక్షణ విషయంలోను మానవకోటి విశాల హితం విషయంలోను దేవుని అనుగ్రహం పొందిన జనులువారు.GCTel 433.3

    కాకపోతే ప్రస్తుత కాలంలోని ఉజ్జీవ సభల్లో ప్రదర్శితమయ్యే దైవ కృప పూర్వం దైవజనుల సేవలో కనిపించిన కృపకన్న వ్యత్యాసంగా వున్నది. ప్రజల్లో ఎక్కువ ఆసక్తి కనిపిస్తున్నమాట నిజమే. మారుమనసు పొందినట్లు అనేకులు చెబుతున్నారు. సంఘ సభ్యత్వాలు గణనీయంగా పెరుగుతున్నాయి. అయినా ఆధ్యాత్మిక జీవితంలో నిజమైన ప్రగతి కనిపించటం లేదు. కొంతకాలం ప్రకాశవంతంగా కనిపించే వెలుగు త్వరలోనే ఆరిపోతున్నది. పర్యవసానంగా క్రితంకన్నా మరెక్కువ చీకటి అలముకొంటున్నది. GCTel 434.1

    జన ప్రియ ఉజ్జీవ సభలు భావోద్వేగాలను రెచ్చగొట్టి నూతన విషయాలు ఉద్రేకాలపట్ల ఆసక్తిని పెంచే ఊహాగానాలకు తరచు ప్రాధాన్యం ఇస్తాయి. ఈ రకంగా విశ్వాసులైన వారికి బైబిలు సత్యాలు వినపొంపుగా లేవు. ప్రవక్తలు, అపోస్తలుల సాక్ష్యాలు రుచించటం లేదు. మత పరమైన కార్యక్రమంలో ఉద్వేగభరిత అంశం ఏదైనా లేకపోతే వారికి ససేమిరా ఆసక్తి ఉండదు. ఉద్రేకాన్ని రెచ్చగొట్టని సందేశానికి వారు స్పందించరు. తమ నిత్యజీవంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న శుద్ధమైన వాక్యోపదేశాలను వారు లెక్కచేయరు.GCTel 434.2

    నిజంగా హృదయపరివర్తన చెందిన వారందరూ దేవునితో తమ సంబంధం గురించి నిత్యజీవనాంశాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కాగా రనాడు ప్రసిద్ధ సంఘాల్లో దేవుని గురించిన ఆలోచన ఎక్కడుంది? విశ్వాసులు తమ దర్పాన్నిగాని లోకంపట్ల మమకారాన్నిగాని వదులుకోరు. హృదయ పరివర్తనకు ముందుకంటే ఇప్పుడు మరెక్కువగా స్వారాన్ని ఉపేక్షించి తమ సిలువనెత్తుకొని యేసును వెంబడించటానికి వారు ఇష్టపడరు. నాస్తికులకు విశ్వాసులకు మతం ఒక క్రీడగా మారింది. ఎందుకంటే మతాన్ని ధరించిన వారిలో పెక్కుమందికి దాని సూత్రాలేమిటో తెలియవు. అనేక సంఘాల్లో దైవభక్తి ఏ కోశానా కనిపించదు. వనభోజనాలు, నాటిక ప్రదర్శనలు, సంతలు, చక్కని ఇండ్లు, వ్యక్తిగత ప్రదర్శన దేవుని గూర్చిన ఆలోచనలను తరిమివేస్తున్నాయి. భూములు, వస్తువులు, లోకవ్యాపారాలు మనసును ఆకట్టుకోగా నిత్యజీవనానికి సంబంధించిన విషయాలు మరుగున పడుతున్నాయి.GCTel 434.3

    విశ్వాసం భక్తి విస్తారంగా క్షీణించినప్పటికీ ఈ సంఘాల్లో క్రీస్తును యధార్ధంగా అనుసరిస్తున్న విశ్వాసులున్నారు. భూమిపై దేవుని తీర్పులు పడకముందు అపోస్తలుల దినాలనుంచి కనుమరుగైన సనాతన దైవభక్తి ప్రజల్లో దర్శనమిస్తుంది. దేవుని ఆత్మ దేవుని శక్తి ఆయన ప్రజల మీదికి దిగివస్తాయి. ఆ సమయంలో దేవుని ప్రేమస్థానే లోకాశలపై మనసు నిలుపుతున్న సంఘాలను అనేకమంది విడిచిపెడ్తారు. ఎంతోవుంది బోధకులేగాని సామాన్య ప్రజలేగాని ఆ మహత్తర సత్యాలను స్వీకరిస్తారు. ప్రభువు రెండోరాకకు ఒక జనాంగాన్ని సిద్ధం చేయటానికిగాను ఈ మహత్తర సత్యాలను ఈ సమయంలో ప్రకటించటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ పరిచర్యను అడ్డుకోటానికి అపవాది ప్రయత్నిస్తాడు. అందునుబట్టి అలాంటి ఉద్యమానికి సమయం రాకముందే నకిలీని ప్రవేశ పెట్టడం ద్వారా దాన్ని రాకుండా చేయటానికి సాతాను ప్రయత్నిస్తాడు. ఏ సంఘాలనైతే వంచనతో తన స్వాదీనంలోకి తెచ్చుకోగలడో వాటిలో దేవుని ప్రత్యేక దీవెన ప్రదర్శితమైనట్లు చూపిస్తాడు. గొప్ప మతాసక్తిలా కనిపించే పరిస్థితిని కల్పిస్తాడు. తమ నిమిత్తం దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడంటూ అనేకులు సంబరపడ్డారు. కాని అది దురాత్మ కృత్యమేగాని మరేదీకాదు. మతం మారువేషంలో తన దుష్ప్రభావాన్ని క్రైస్తవ లోకంపై ప్రసరింపజేయటానికి సాతాను ప్రయత్నిస్తాడు.GCTel 434.4

    గత అర్ధ శతాబ్ది కాలంలో జరిగిన అనేక ఉజ్జీవ సమావేశాల్లో కొంచెం అటూ ఇటుగా ఇదే రకమైన ప్రభావాలు చురుకుగా పని చేశాయి. భవిష్యత్తులో మరింత ఉదృత రూపంలో ఈ ఉద్యమాలు దర్శనమిస్తాయి. భావోద్వేగంతో నిండిన ఉద్రేకం చోటుచేసుకొంటుంది. వాస్తవాలు, అవాస్తవాలు సమ్మిళిత మవుతాయి. ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు వీటిని మలుచుకోటం జరుగుతుంది. అయినా ఎవరూ మోసపోనక్కరలేదు. దైవ వాక్యం వెలుగులో ఈ ఉద్యమాల్ని నిగ్గు తేల్చటం కష్టం కాదు. సరళమైన ఆత్మ పరిశోధనకు దారి తీసే సత్యాలను, ఆర్మోపేక్ష స్వరూప స్వభావాల్ని లోకాశల పరిత్యాగం కోరే సత్యాలను ఉద్దేశించే బైబిలు సాక్ష్యాన్ని మనుషులు తృ ణీకరించటం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ దేవుని దీవెనలు ఉండవనటంలో సందేహం లేదు. “వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు” (మత్తయి 7:16.) అంటూ స్వయాన క్రీస్తే ఇచ్చిన నిబంధన ప్రకారం ఈ ఉద్యమాలు దేవుని ఆత్మమూలంగా కలిగినవి కావు.GCTel 435.1

    బైబిలు గ్రంథంలోని సత్యాలలో దేవుడు తన్నుతాను మనుషులకు ప్రత్యక్ష పర్చుకొన్నాడు. వాటిని అంగీకరించిన వారందరికీ అవి సాతాను మోసాల నుంచి రక్షణగా ఉంటాయి. ఈ సత్యాల పట్ల ఉదాసీనతకు ఇప్పుడు మతపరంగా ప్రబలుతున్న దుర్నీతికి ద్వారం తెరిచింది. దైవ ధర్మశాస్త్ర స్వభావ ప్రాముఖ్యత మరుగున పడింది. దైవ ధర్మశాస్త్ర స్వభావం, నిత్యత్వ విధిని గూర్చిన తప్పుడు అభిప్రాయం మారు మనసును గూర్చి పరిశుద్ధీకరణను గూర్చి ఎన్నో పొరపాట్లకు కారణమై సంఘంలోని భక్తి క్షీణతకు దారితీసింది. ఈ రోజుల్లోని ఉజ్జీవ సభల్లో ఆత్మలోపించటానికి కారణం ఇదే.GCTel 435.2

    ఆయా మతశాఖల్లో దైవభక్తికి పేరుగాంచిన వ్యక్తులు ఎందరో ఈ విషయాన్ని అంగీకరించి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో మతపరమైన అపాయాలను పేర్కొంటూ ఆచార్య ఎడ్వర్డ్ ఏ సార్క్ ఇలా అంటున్నాడు, “దైవ నిబంధనలను అమలు పర్చటానికి ప్రసంగ వేదికను నిర్లక్ష్యం చేయటం అపాయానికి ఒక కారణం. పూర్వం ప్రసంగ వేదిక మనస్సాక్షికి ప్రతిబింబంగా ఉండేది... ప్రభువు ఆదర్శాన్ని అనుసరిస్తూ ధర్మశాస్త్రానికి అందులోని సూత్రాలకు హెచ్చరికలకు ప్రాధాన్యం ఇస్తూ ఖ్యాతి వహించిన మన ప్రబోధకులు తమ బోధలకు హుందాతనాన్ని, వన్నెను చేకూర్చేవారు. ధర్మశాస్త్రం దైవ సంపూర్ణతకు నకలు అన్న నియమాన్ని, ధర్మశాస్త్రాన్ని అభిమానించని వ్యక్తి సువార్తనూ అభిమానించడు అన్న సూత్రాన్ని పదేపదే వ్యక్తం చేసేవారు. ఎందుకంటే ధర్మశాస్త్రం, సువార్త దేవుని యధార్ధ ప్రవర్తనను ప్రతిబింబించే అద్బం లాంటివి. ఈ అపాయం మరో ప్రమాదానికి దారితీస్తుంది. అదే పాపాన్ని దాని విస్తృతిని దాని దుష్టత్వాన్ని తక్కువగా పరిగణించటం ఆజ్ఞ న్యాయబద్ధత దాని అతిక్రమ దోషిత్వానికి సమాన పరిమాణంలో ఉంటుంది.GCTel 436.1

    “ఇదివరకే పేర్కొన్న అపాయాలకు సంబందించిన మరో అపాయం దేవుని న్యాయ విధానాన్ని తక్కువ అంచనావేయటం. నవీన ప్రసంగ వేదిక తత్వం ఏమిటంటే దైవ న్యాయ విధానాన్ని దైవ దాక్షిణ్యం నుంచి వేరుచేయటం కాని దయాళుత్వాన్ని సూత్రం స్థాయికి లేపేకన్నా భావన స్థాయికి దిగజార్చటం కాని దేవుడు కలిపినదాన్ని నవీన వేదాంత ప్రిజమ్ వేరుచేస్తున్నాం. దైవ ధర్మశాస్త్రం మేలా లేక కీడా? అది మంచిదేనా? అయితే న్యాయం మంచిదే. దైవ ధర్మశాస్త్రాన్ని అనుసరించటానికి అది సిద్ధమనసు నిస్తుంది. దైవ ధర్మశాస్త్రాన్ని, న్యాయాన్ని మానవ అవిధేయత విస్తృతిని, అనర్ధాన్ని లెక్కచేయని అలవాటు నుంచి పాపప్రాయశ్చిత్తాన్ని ఏర్పాటు చేసిన కృపను, తక్కువ అంచనా వేసే అలవాటుకు మనుషులు సులభంగా దిగజారిపోతారు. ఈ విధంగా మానవ మనసుల్లో సువార్త విలువ ప్రాముఖ్యం తగ్గటం, స్వల్పకాలంలోనే వారు బైబిలును తృణీకరించటం జరుగుతుంది.GCTel 436.2

    క్రీస్తు తన మరణం ద్వారా ధర్మశాస్త్రాన్ని రద్దుచేశాడని అందును బట్టి ధర్మశాస్త్రాన్ని మనుషులు ఆచరించాల్సిన అవసరం లేదని పలువురు మతోపదేశకులు బోధిస్తున్నారు. అది భారమైన కాడి అని కొందరు బోధిస్తున్నారు. దర్మశాస్త్రంపు బానిసత్వం బదులు సువార్త స్వేచ్ఛను ప్రకటిస్తున్నదని ఉద్ఘాటిస్తున్నారు.GCTel 436.3

    కాని ప్రవక్తలు, అపోస్తలులు ధర్మశాస్త్రాన్ని ఆ విధంగా పరిగణించలేదు. దావీదన్నాడు, “నేను నీ ఉపదేశములను వెదకు వాడను నిర్బంధములేక నడుచుకొను వాడను” కీర్తనలు 119:45. క్రీస్తు మరణానంతరం రచనలు చేసిన అపోస్తలుడైన యాకోబు పది ఆజ్ఞల చట్టాన్ని “ప్రాముఖ్యమైన ఆజ్ఞ” “స్వాతంత్ర్యము నిచ్చు... నియమము” అని వ్యవహరించాడు. యాకోబు 2:8; 1:25. సిలువ అనంతరం అర్ధశతాబ్ది తర్వాత “జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మముల గుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ఆయన ఆజ్ఞలు గైకొనే వారు ధన్యులు” అంటున్నాడు ప్రకటన రచయిత. ప్రకటన 22:14.GCTel 437.1

    తన మరణం ద్వారా క్రీస్తు తన తండ్రి చట్టాన్ని రద్దు పర్చాడన్న అనేక మతశాఖల బోధకుల బోధ నిరాధారమైంది. ఆజ్ఞల్ని మార్చడం లేదా తోసిరాజనటం సాధ్యమై ఉంటే పాపం వలన కలిగే శిక్ష నుంచి మానవుణ్ణి రక్షించటానికి క్రీస్తు మరణించాల్సిన అవసరం ఉండేది కాదు. క్రీస్తు మరణం ఆజ్ఞల్ని రద్దుచేసేకన్నా అవి మార్పులేనివని నిరూపిస్తున్నది. దైవ కుమారుడైన క్రీస్తు “ఉపదేశ క్రమమొకటి ఘనపర్చి గొప్ప” చేయటానికి వచ్చాడు. యెషయా 42:21. ఆయన ఇలా అంటున్నాడు, “ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు.” “ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దాని నుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదు” మత్తయి 5:17 18. తన గురించి తాను ఆయన ఇలా అంటున్నాడు, “నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో నున్నది.” కీర్తనలు 40:8.GCTel 437.2

    స్వభావసిద్ధంగా దైవ ధర్మశాస్త్రం మార్పులేనిది. తన కర్త అయిన దేవుని అది బయలుపర్చుతుంది. దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన ధర్మశాస్త్రం ప్రేమతో కూడినది. “ప్రేమ పొరుగువానికి కీడుచేయదు. కనుక ప్రేమ కలిగియుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.” రోమా 13:10. దేవుని ప్రవర్తన నీతి సత్యాలతో కూడినది. ఆయన ధర్మశాస్త్రం స్వభావం అలాంటిదే. కీర్తన కారుడు అంటున్నాడు, “నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము” ” నీ ఆజ్ఞలన్నియు న్యాయములు” కీర్తనలు 11:142, 17:2. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, “ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది ఆజ్ఞకూడ పరిశుద్ధమైనదనియు నీతి గలదియు ఉత్తమమైనయునైయున్నది.” రోమా 7:12. దేవుని మనసును చిత్తాన్ని వ్యక్తీకరించే ఇలాంటి ధర్మశాస్త్రం దాని రక్తమల్లే నిత్యత్వం కలిగివుండాలి.GCTel 437.3

    హృదయ పరివర్తన హృదయశుద్ధీకరణ ద్వారా మానవులకు శరీరంతో సమాధానం ఏర్పడుతుంది. ధర్మశాస్త్ర సూత్రాలకు అనుగుణంగా మనుషులను మార్చటం ద్వారా ఆ కార్య సాధన జరుగుతుంది. ఆదిలో మానవుడు దేవుని స్వరూపంలో రూపొందాడు. దైవ చిత్తంతోను దైవధర్మశాస్త్రంతోను అతనికి సంపూర్ణ ఐక్యత ఉన్నది. అతని మనసుపై నీతి సూత్రాల ముద్ర ఉన్నది. అయితే పాపం వల్ల అతనికి దేవునితో ఎడబాటు కలిగింది. అతడు దైవ స్వరూపాన్ని ఇక ప్రతిబింబించలేక పోయాడు. ధర్మశాస్త్ర సూత్రాలకు అతనికి మధ్య వైరుధ్యం ఏర్పడింది. శరీరాను సారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏమాత్రమును లోబడదు.” రోమా 8:7. అయితే “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.” మనుషుడు దేవునితో సమాధానం కలిగి ఉండేందుకు ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానిని” అనుగ్రహించాడు. క్రీస్తు నీతిని బట్టి మానవుడు తన సృష్టికర్తతో సాన్నిహిత్యాన్ని పునరుద్ధరించుకోవచ్చు. అయితే అతని మనసు దైవ కృ ప ద్వారా నూతనం కావాలి. అతని బతుకు ఆత్మ మూలంగా నూతనమవ్వాలి. ఆ మార్చే నూతన జన్మ. ఇది లేకుండా ఒకడు “దేవుని రాజ్యమును చూడలేడు” అని యేసంటున్నాడు. GCTel 438.1

    దేవునితో సమాధానపడటంలో మొదటి మెట్టు వ్యక్తి తాను పాపినన్న స్పృహ. “ఆజాతిక్రమమే పాపము”. “ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియ బడుచున్నది.” 1యోహాను 3:4; రోమా 3:20. తన దోషిత్వాన్ని గ్రహించేందుకు పాపి తన ప్రవర్తనను దేవుని నీతి ప్రమాణంతో పరీక్షించి చూసుకోవాలి. అది ఒక అద్దం. అది పరిపూర్ణమైన నీతి ప్రవర్తనను చూపించి వ్యక్తి ప్రవర్తనలోని లోపాలను తేటపర్చుతుంది.GCTel 438.2

    ధర్మశాస్త్రం వ్యక్తి దోషాలను చూపిస్తుందే గాని వాటికి పరిష్కారం సమకూర్చదు. విధేయులైన వారందరికి నిత్యజీవాన్ని వాగ్దానం చేస్తున్నది. దోషులకు మరణం ప్రకటిస్తున్నది. పాపపర్యవసాన శిక్ష నుంచి లేదా మాలిన్యం నుంచి మానవునికి విదుదల కలిగించేది క్రీస్తు సువార్త ఒక్కటే. ఎవరి ధర్మశాస్త్రాన్ని తాను అతిక్రమించాడో ఆ దేవునితో మనుషుడు తన పాపాల్ని ఒప్పుకొని తన ప్రాయశ్చిత్తార్ధ బలి అయిన క్రీస్తు మీద విశ్వాసం కలిగి ఉండాలి. ఈ విధంగా “పూర్వము చేసిన పాపములకు క్షమాపణ” పొంది దైవ స్వభావంలో అతను పాలిభాగస్తుడవుతాడు. దత్తత స్పూర్తిని పొందిన వాడైన అతను దేవుని బిడ్డ. అందువలన అతను “నాయనా తండ్రి ” అని కేకలు వేస్తాడు.GCTel 438.3

    అయితే దైవధర్మశాస్త్రాన్ని అతిక్రమించటానికి అతనికి ఇప్పుడు స్వేచ్ఛ ఉంటుందా? పౌలు ఏమంటున్నాడో వినండి, “విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లనరాదు. ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము.” “పాపము విషయమై చనిపోయిన మసము ఇక మీదట ఏలాగు దానిలో జీవించుదుము?” యోహాను ఇలా అంటున్నాడు, “మన మాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ” రోమా 3:31; 6:2; 1 యోహాను 5:3. కొత్తగా జన్మించినప్పుడు హృదయం దేవునితోను ఆయన ధర్మశాస్త్రంతోను ఒకటవుతుంది. పాపిలో మహత్తరమైన ఈ మార్పు చోటుచేసుకొన్నప్పుడు అతను మరణం నుంచి జీవంలోకి దాటిపోతాడు. పాపం నుంచి పరిశుద్ధతలోకి దాటిపోతాడు. అతిక్రమాలు, తిరుగుబాబుల నుంచి విధేయత విశ్వసనీయతల్లోకి దాటిపోతాడు. దేవునికి దూరంగా ఉండటమున్న పాత జీవితం అంతమయ్యింది. సమాధానం, విశ్వాసం ఆప్యాయతలతో కూడిన కొత్త జీవితం ఆరంభమయ్యింది. “ధర్మశాస్త్ర సంబంధమైనGCTel 439.1

    నీతి విధి నెరవేర్చబడవలెనని ... ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను” రోమా 8:4. ఆత్మ మాట్లాడే బాష ఇలాగుంటుంది, “నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను.” కీర్తనలు 119:97GCTel 439.2

    “యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యధార్ధమైనది. అది ప్రాణమును తెప్పరిల్ల చేయును” కీర్తనలు 19:7. ధర్మశాస్త్రం లేకపోతే దేవుని పవిత్రత పరిశుద్ధతలను గూర్చిగాని తమ సొంత అపరాధం అపవిత్రతలను గూర్చి మనుషులకు సరియైన అభిప్రాయం ఉండేది కాదు. యధార్ధమైన పాప స్పృహ పశ్చాత్తాపం అవసరమున్న గుర్తింపు కలిగేది కాదు. దైవ ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్న వారు తమ పతన స్థితిని గుర్తించని కారణంగా పాపప్రాయశ్చిత్తారం క్రీస్తు చిందించిన రక్తం తమకు అగత్యమని గుర్తించరు. హృదయపరివర్తన లేకుండానే లేదా జీవితంలో దిద్దుబాటు లేకుండానే వారు రక్షణ నిరీక్షణను అంగీకరిస్తారు. ఈ తీరున కపట మారుమనసులు ఇబ్బడిముబ్బడిగా చోటు చేసుకుంటాయి. క్రీస్తును స్వీకరించని ప్రజలు ఇలా గుంపులు గుంపులుగా సంఘంలో చేరతారు.GCTel 439.3

    పరిశుద్ధీకరణను గూర్చిన తప్పుడు సిద్ధాంతాలు దైవ ధర్మశాస్త్రాన్ని అశ్రద్ధ చేయటం నుంచి లేదా తృణీకరించటం నుంచి పుట్టుకు వచ్చి ఆయా సమయాల్లో ప్రబలుతున్న మత ఉద్యమాల్లో ప్రముఖస్థానం ఆక్రమిస్తున్నాయి. ఈ సిద్ధాంతాల పరిణామాలు ప్రమాదకరమైనవి. వీటికి సామాన్యంగా లభిస్తున్న ఆదరణను బట్టి ఈ అంశంపై లేఖనాలు ఏమి బోధిస్తున్నవో తెలుసుకోటం ప్రాముఖ్యాన్ని సంతరించుకొంటుంది.GCTel 439.4

    వాస్తవిక పరిశుద్ధీకరణ ఒక బైబిలు సిద్ధాంతం. థెస్సలొనీకయుల సంఘానికి తాను రాసిన ఉత్తరంలో పౌలు ఇలా అంటున్నాడు, “మీరు పరిశుద్ధులగుటయే... దేవుని చిత్తము”. “సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచునుగాక” అని ప్రార్ధిస్తున్నాడు. 1థెస్స 4:3; 5:23. పరిశుద్ధీకరణ అంటే ఏంటో దాన్ని ఎలా పొందగలమో అన్న అంశాలపై బైబిలు బోధ స్పష్టంగా ఉన్నది. శిష్యుల కోసం రక్షకుడైన యేసు ఇలా ప్రార్ధించాడు, “సత్యమందు వారిని ప్రతిష్ఠచేయుము. నీ వాక్యమే సత్యము.” యోహాను 17:17. విశ్వాసులు పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడ వలసియున్నారని” పౌలు బోధిస్తున్నాడు. రోమా 15:16. పరిశుద్ధాత్మ కర్తవ్యం ఏమిటి? తన శిష్యులనుద్దేశించి యేసు ఈ మాటలన్నాడు, “ఆయన అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును “యోహాను 16:13. ” నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము” అంటున్నాడు కీర్తనకారుడు. ధర్మశాస్త్రంలోని గొప్ప నీతి సూత్రాలు దేవుని వాక్యం మూలంగానూ దేవుని ఆత్మ మూలంగానూ మానవులకు సుబోధక మవుతున్నాయి. దైవ ధర్మశాస్త్రం “పరిశుద్ధమైనది, న్యాయమైనది మంచిది” గనుక అది దేవుని శీల పరిపూర్ణత నకలు గనుక దాని ఆధారంగా ఏర్పడ్డ ప్రవర్తన పరిశుద్ధ ప్రవర్తన అనటం హేతుబద్ధం. అలాంటి ప్రవర్తనకు క్రీస్తే నిర్దుష్టమైన ఉదాహరణ. ‘’నేను నాతండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్నాను” అంటున్నాడు ఆయన. యోహాను 15:10; 8:29. క్రీస్తు అనుచరులు ఆయనను పోలి నివసించాల్సి ఉన్నారు. దైవ కృపద్వారా ధర్మశాస్త్ర సూత్రాలకు అనుగుణంగా వారి ప్రవర్తన రూపుదిద్దుకోవాలి. బైబిలు ప్రబోధించే పరిశుద్ధీకరణ ఇదే..GCTel 440.1

    క్రీస్తుపై విశ్వాసం ద్వారా హృదయంలో దైవాత్మ నివసించటం ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుంది. విశ్వాసులకు పౌలు ఈ హితవు పలుకుతున్నాడు, “భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయు వాడు దేవుడే” ఫిలిప్పీ 2:12, 13. క్రైస్తవుడు పాపం చేయటానికి ప్రేరణలుంటాయి. కాని అతడు వాటిని నిత్యం ప్రతిఘటిస్తూ వుండాలి. ఇక్కడే క్రీస్తు సహాయం అవసరమవుతుంది. మానవ బలహీనత దేవుని శక్తితో ఏకమవ్వాలి. “అప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు విజయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక” అంటూ విశ్వాసం ఆశ్చర్యపడుతుంది. 1 కొరింథీ 15:57.GCTel 440.2

    పరిశుద్ధీకరణ జీవితాంతం సాగే ప్రక్రియ అని లేఖనాలు స్పష్టంగా బోధిస్తున్నాయి. మారుమనసు కలిగి ప్రాయశ్చితార్ధం క్రీస్తు చిందించిన రక్తం ద్వారా పాపికి దేవునితో సమాధానం ఏర్పడినప్పుడే క్రైస్తవ జీవితం ప్రారంభమవుతుంది.” క్రీస్తు శరీరము క్షేమాభివది చెందుటకు” గాను “సంపూర్తుల మగుటకు సాగిపోదము.” అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ” నేనిదివరకే పట్టుకొని యున్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను. వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తు చున్నాను.” ఫిలిప్పీ 3:13,14. బైబిలు సూచిస్తున్న పరిశుద్ధతను సొంతం చేసుకోటానికి మనం తీసుకోవలసిన చర్యలేమిటో పేతురు మనకు వివరిస్తున్నాడు, “మీరు సంపూర్ణ జాగ్రత్త గలవారై, మీ విశ్వాసమునందు సదుణమును సద్గుణమునందు జ్ఞానమును,GCTel 441.1

    జ్ఞానమునందు ఆశనిగ్రహమును, ఆశనిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను అలవర్చుకొనుడి... మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్రిల్లరు.” 2 పేతురు 1:511.GCTel 441.2

    బైబిలు ప్రతిపాదిస్తున్న పరిశుద్ధతను కలిగి ఉన్నవారు వినయ స్వభావాన్ని ప్రదర్శిస్తారు. మోషే వీక్షించినట్లు వారు పరిశుద్ధత తాలూకు గంభీరమైన ఔన్నత్యాన్ని వీక్షించి అనంతుడైన ఆ ప్రభువు పరిశుద్ధత సంపూర్ణతలతో పోల్చుకొన్నప్పుడు తాము అయోగ్యులమని గుర్తిస్తారు.GCTel 441.3

    నిజమైన పరిశుద్ధతకు దానియేలు ప్రవక్త సాదృశ్యం. ఆయన సుదీర్ఘ జీవితమంతా ప్రభువు సేవకు అంకితమయ్యింది. దానియేలు దేవునికి “బహు ప్రియుడు” దానియేలు 10:11. అయినా పరిశుద్ధుణ్ణి అని చెప్పుకొనే బదులు ఈ ప్రవక్త ఇశ్రాయేలీయులోని పాపుల్లో తానొకణ్ణని చెప్పుకొని తన ప్రజల నిమిత్తం దేవునికి ఇలా విజ్ఞాపన చేశాడు, “సీ గొప్ప కనికరమును బట్టియే మేము నిన్ను ప్రార్ధించుచున్నాము. గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్ధించుటలేదు.” “మేమైతే పాపము చేసి చెడు నడతలు నడచిన వారము.” ఆయన ఇలా అంటున్నాడు: ” నేను ఇంక పలుకుచు ప్రార్ధన చేయుచు పవిత్ర పర్వతముకొరకు నా దేవుడైన యెహోవా యెదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపనము చేయుచుంటిని ” తనకు ఉపదేశం ఇవ్వటానికి అనంతరం దైవ కుమారుడు దర్శనమిచ్చినప్పుడు దానియేలు ఈ మాటలన్నాడు, “నాలో బలమేమియులేకపోయెను, నా సొగసు వికారమాయెను. బలము నాయందు నిలువలేదు” దానియేలు 9:18,15,20; 10:8.GCTel 441.4

    యెహోవా స్వరం సుడిగాలిలో నుంచి వినబడినప్పుడు యోబు ఇలా స్పందించాడు: “నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను.” యోబు 42:6. ప్రభువు మహిమను కళ్లారా చూసినప్పుడు “సైన్యముల కధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు” అని కెరూబులు పలుకుతున్న మాటలు విన్నప్పుడు “అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను” అని కేకలు వేశాడు యెషయా. యెషయా 6:3,5. పౌలు మూడో ఆకాశానికి కొనిపోబడి వచింప శక్యంగాని మాటలు విన్న తరువాత “పరిశుద్ధులందరిలో అత్యల్పడును” అని తన్ను గూర్చి తాను చెప్పుకొన్నాడు. 2 కొరింథి 12:24, ఎఫెస్సీ 3:8. యేసు రొమ్మున ఆనుకొని ఆయన మహిమను వీక్షించిన ప్రియతమ శిష్యుడు యోహాను దేవదూత పాదాల ముందు చచ్చినవాడివలె పడ్డాడు. ప్రకటన 5:117.GCTel 442.1

    కల్వరి సిలువ నీడను మసలే ప్రజలు ఆత్మస్తుతికి ఆకర్షితులు కారు. పాపం నుంచి విముక్తి పొందామని అతిశయపడరు. తమ పాపమే దైవ కుమారుడి హృదయాన్ని చీల్చిందని హృదయవేదన చెందుతారు. ఈ మనఃప్రవృత్తి తమ్మును తాము అసహ్యించుకొనేటట్లు చేస్తుంది. యేసుకు మిక్కిలి సమీపంగా నివసించేవారు మానవ అశక్తతను పాప స్వభావాన్ని గుర్తిస్తారు. సిలువలో మరణించి తిరిగి లేచిన రక్షకుని నీతి మూలంగానే తమకు రక్షణ అన్నదే వారి ఏకైక నిరీక్షణ.GCTel 442.2

    మత సంబంధమైన ప్రపంచంలో ఇప్పుడు ప్రాధాన్యం గడిస్తున్న పరిశుద్ధతలో, ఆత్మ గౌరవ స్వభావం, దైవ ధర్మశాస్త్రం పట్ల ఉపేక్ష కలిగిస్తున్నాయి. కనుక ఇలాంటి పరిశుద్ధత బైబిలుని బోధించే మతానికి సంబంధించినది కాదని వ్యక్తమవుతున్నది. పరిశుద్ధత పొందటం చిటికెలో జరిగేపని అని విశ్వాసం ద్వారా సంపూర్ణ పవిత్రాత్మను పొందవచ్చునని ఆ సిద్ధాంత ప్రబోధకుల భావన. “నమ్మితే చాలు, పరిశుద్ధత అనే దీవెన కలుగుతుంది” అని వారి బోధ. గ్రహీత చేయాల్సిందింకేమీలేదని వారి ఉద్దేశం. అదే సమయంలో ఆజ్ఞలు ఆచరించాల్సిన బాధ్యత నుంచి తమకు విముక్తి కలిగిందంటూ వారు ధర్మశాస్త్ర అధికారాన్ని నిరాకరిస్తారు. అయితే ఆయన స్వభావానికి చిత్తానికి వివరణ అయి ఆయనను ప్రసన్నుణ్ని చేసే ధర్మ సూత్రాలకు అనుగుణంగా జీవించకుండా మనుషులు పరిశుద్ధులవటం సాధ్యపడుతుందా?GCTel 442.3

    శ్రమపడనక్కరలేని, ఆత్మోపేక్ష కోరని, లోకంతో తెగతెంపులు అవసరంలేని సాఫీ మతంపై ఆశ నెరవేర్పుకు కేవలం విశ్వాసం ఉంటే సరిపోతుంది అన్న సిద్ధాంతం ప్రజాకర్షణగల సిద్ధాంతంగా రూపుదిద్దుకొన్నది. అయితే దైవ వాక్యం చెబుతున్నదేంటి? అపోస్తలుడైన యాకోబు అంటున్నాడు, “నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలగదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము అట్టివిశ్వాస మతనిని రక్షింపగలదా?... వ్యర్ధుడా, క్రియలులేని విశ్వాసము నిష్పలమైనదని తెలిసి కొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలి పీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియలవలన నీతిమంతుడని తీర్పుపొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసెననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావుగదా?... మనుష్యుడు విశ్వాసము మూలమున మాత్రమునేకాక క్రియల మూలమునను నీతిమంతుడని యెంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి” యాకోబు 2:1424.GCTel 443.1

    క్రియలులేని విశ్వాసమన్న ఈ మోసకరమైన సిద్ధాంతాన్ని దైవ వాక్యం ఖండిస్తున్నది. కృపను పొందటానికి గల షరతుల్ని నెరవేర్చకుండా దేవుని దయను పొందజూసేది విశ్వాసం కాదు, అహంకారం. ఎందుకంటే నిజమైన విశ్వాసానికి లేఖనాల్లోని వాగ్దానాలు వ్యవస్థలే పునాది.GCTel 443.2

    దేవుని ఆజల్లో ఒకదాన్ని కావాలని అతిక్రమిస్తూ తాము పరిశుదులం కాగలమని నమ్మటం ద్వారా ఎవరూ తమ్మును తాము మోసగించుకోకుందురుగాక. పాపమని తెలిసి కూడా పాపం చేస్తే పరిశుద్ధాత్మ స్వరం మూగబోతుంది. మన ఆత్మ దేవునికి దూరమవుతుంది. “ఆజ్ఞాతిక్రమమే పాపము”. “పాపము చేయువాడెవడును ఆయనను చూడనులేదు, ఎరుగను లేదు” 1 యోహాను 3:6. తన పత్రికలలో యోహాను ప్రేమనుగూర్చి ఎంతగానో ప్రస్తావిస్తున్నప్పటికీ దైవధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తూనే తాము పరిశుదులమని చెప్పుకొనే ప్రజల యదార్ధ ప్రవర్తనలను బట్టబయలు చేయటానికి యోహాను వెనుకాడటం లేదు. “ఆయనను ఎరిగియున్నాని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. వానిలో సత్యములేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను.” 1యోహాను 2:4,5. ప్రతిసారి విశ్వాసాన్ని నిగ్గుతేల్చే పరీక్ష ఇదే. ఇహ పరలోకాల్లో పరిశుద్ధతకు గీటురాయి దేవుని ఏకైక ప్రమాణమైన ధర్మశాస్త్రమే. ఆ ప్రమాణంతో పోల్చి చూడకుండా ఏ మనిషి పరిశుద్దుడని నిర్ధారించలేం. మనుషులు నీతి ధర్మశాస్త్రానికి ప్రాధాన్యం ఇవ్వకుంటే, ధర్మశాస్త్ర సూత్రాల్ని పూచిక పుల్లపాటి విలువలేనివిగా కొట్టిపారేస్తే, ఆజ్ఞల్లో మిక్కిలి స్వల్పమైనదాన్ని అతిక్రమిస్తూ అందుకు ఇతరులను కూడా ప్రోత్సహిస్తే వారు దేవుని దృష్టిలో కొరగాని వారు. వారి మాటల్లో యధార్ధత లేదని తెలుసుకొంటాం.GCTel 443.3

    ఏ వ్యక్తి అయినా తనలో పాపం లేదని చెప్పుకోవటమే అతను పరిశుద్ధతకు ఆమడ దూరాన ఉన్నాడనటానికి రుజువు. దేవుని అపార నీతి పరిశుద్ధత విషయంలో అతనికి అవగాహన లేదు గనుక, లేదా ఆయనతో సన్నిహితత్వాన్ని కలిగి నివసించే ప్రజలు ఎంత ధన్యులో అతనికి తెలియదు గనుక, యేసు పరిశుద్ధత ఔన్నత్యాలను గురించి పాపం తాలూకు దుర్నీతి దుర్మార్గతల్ని గురించి అతనికి సరైన అభిప్రాయం లేదు గనుక, ఆ వ్యక్తి తాను పరిశుద్దుడనని భావించవచ్చు. ఆ వ్యక్తికి క్రీస్తుకు మధ్య ఎంత ఎక్కువ దూరం వుంటే దేవుని ప్రవర్తనను గురించి ఆయన ఆజ్ఞలను గురించి అతని అవగాహన అంత తక్కువగా ఉంటుంది. తన దృష్టికి అతను అంత ఎక్కువ నీతిమంతుడుగా కనిపిస్తాడు.GCTel 444.1

    లేఖనాలు వ్యక్తిరిస్తున్న పరిశుద్ధత పూర్తి వ్యక్తి మొత్తానికి సంబందించింది. అది జీవాన్ని ఆత్మను శరీరాన్ని స్పృశిస్తుంది. “మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక” అంటూ థెస్సలొనీకయులను ఉద్దేశించి పౌలు ప్రార్థన చేశాడు. 1థెస్సలొ 5:53. మళ్ళీ విశ్వాసులకు రాస్తూ ఆయన ఇలా అంటున్నాడు, (“కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను.” రోమా 12:1. పూర్వం ఇశ్రాయేలీయుల కాలంలో దేవునికి అర్పణగా తెచ్చే బలిని అతి జాగ్రత్తగా పరీక్షించేవారు. బలిగా తెచ్చిన జంతువులో ఏదైనా లోపం ఉంటే దాన్ని అంగీకరించే వారుకాదు. అర్పణ ” లోపరహితంగా” ఉండాలని దేవుని ఆదేశం కాబట్టి క్రైస్తవులు తమ శరీరాలను “పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా” ను అర్పించాల్సి ఉన్నారు. ఇది చెయ్యాలంటే వారు తమ సర్వశక్తుల్ని ఉత్తమ స్థితిలో సంరక్షించుకోవాలి. శారీరకమానసిక శక్తుల్ని బలహీనపర్చే ప్రతీ కార్యం మానవుణ్ణి దైవ సేవకు అసర్దుణ్ణి చేస్తుంది. ఉన్న వాటిలో అత్యుత్తమమైనది సమర్పించకపోతే దేవుడు సంతోషిస్తాడా? క్రీస్తు ఇలా ఉపదేశించాడు, “నీ పూర్ణ హృదయముతో... నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను.” పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించేవారు తమ జీవితంలోని ఉత్తమ భాగాన్ని దైవసేవకు సమర్పిస్తారు. ఆయన చిత్తాన్ని జరిగించటానికి తమకు సామర్థ్యాన్నిచ్చే శక్తిని పటిష్ఠపర్చే నియమాలకు అనుగుణంగా నివసించటానికి సర్వదా కృషి చేస్తారు. ఆశకు లేదా ఉద్రేకానికి తావివ్వటం ద్వారా వారు తమ పరమ జనకునికి సమర్పించే అర్పణను అపరిశుద్ధం చేయరు.GCTel 444.2

    “ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించడ” మంటున్నాడు పేతురు. 1 పేతురు 2:11. ప్రతి పాపక్రియ ఆలోచనా శక్తిని మందగిలజేసి మానసిక ఆధ్యాత్మిక శక్తులను బలహీనపర్చుతుంది. కనుక దైవవాక్య ప్రభావం లేదా దైవాత్మ ప్రభావం హృదయంపై అంతంత మాత్రంగానే పడుతుంది. కొరింథీయులను ఉద్దేశించి పౌలు ఇలా రాస్తున్నాడు, “దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తిచేసుకొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషమునుండి మనలను పవిత్రులనుగా చేసికొందము “2 కొరింథి 7:1. ఇంకా ఆత్మఫలాలైన “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము” తరగతిలో “ఆశనిగ్రహాన్ని” చేరుడమన్నాడు. గలతీ 5:22, 23.GCTel 445.1

    ఆవేశపూరిత బోధలు ఇన్ని వున్నప్పటికినీ లాభాలు ఆర్జించటంలోను ఫ్యాషన్ ని ఆరాధించటంలోను ఎంతమంది క్రైస్తవులు తమ శక్తి సామర్ధ్యాల్ని వ్యర్ధ పర్చటంలేదు? ఎంతమంది దేవుని పోలిన తమ రూపాన్ని తిండిబోతుతనం తాగుడు నిషిద్ధ సుఖభోగాలవల్ల నాశనం చేసుకోవటం లేదు? రుచులు, అభిరుచులపట్ల ధనార్జన లేదా సుఖభోగాలపట్ల, సంఘ ఖజానాను నింపుకోవటం పట్ల అత్యాశ పుట్టించటం ద్వారా సంఘం ఈ దుర్మారతను ప్రోత్సహిస్తుందేగాని ఖండించటం లేదు. క్రీస్తు పట్ల ప్రేమ వీటిని సరఫరా చేయలేకపోతున్నది. యేసు ఈ నాటి సంఘాల్లో ప్రవేశించి మతం పేరిట సాగుతున్న విందులు వినోదాలు అపవిత్ర వ్యాపార వ్యవహారాలు వీక్షిస్తే అలనాడు క్రయవిక్రయదారుల్ని దేవాలయంలో నుంచి వెళ్లగొట్టిన ప్రభువు ఈ కార్యకర్తల్ని తరిమివేయడా?GCTel 445.2

    “పై నుంచి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది” అంటున్నాడు అపోస్తలుడైన యాకోబు. తమ పెదవుల్ని పొగాకుతో అపవిత్రం చేసే వారిని ఆ శ్వాసతో ఇల్లూ వళ్లూ నింపటమేగాక దేవుడిచ్చిన స్వచ్ఛమైన గాలిని కాలుష్యమయం చేసి ఆ విషవాయువును ఇతరులు పీల్చుకొనేటట్లు చేసేవారు. ఆయనకు ఎదురై వుంటే పరిశుద్ధమైన సువార్తకు బద్ద విరుద్ధంగా వున్న ఈ దురభ్యాసం ఆయన దృష్టికి వచ్చివుంటే అది “భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానమువంటిదియునై యున్నది” అని ఖండించి ఉండేవాడు కాదా? పొగాకుకు బానిసలైన వారు కొందరు తాము పరిశుద్ధులమని చెప్పుకొంటూ తమకు పరలోకమందున్న నిరీక్షణను వ్యక్తం చేస్తున్నారు. అయితే దైవవాక్యం స్పష్టంగా చెబుతున్నది ఇది, ” నిషిద్ధమైన దేదైనను... జరిగించువాడెవడైనను దానిలో ప్రవేశింపనే ప్రవేశింపడు” ప్రకటన 21:27.GCTel 445.3

    “మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్దాత్మకు ఆలయమైయున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు. విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి” 1 కొరింథీ 6:19,20. పరిశుద్దాత్మకు ఎవని దేహం ఆలయమై ఉన్నదో అతను హానికరమైన అభ్యాసాలకు బానిసకాడు. తనను రక్తంతో కొన్న క్రీస్తుకి అతని శక్తులు చెందుతాయి. అతని ఆస్తి ప్రభువుకు చెందుతుంది. తనకు అప్పజెప్పిన మూలధనాన్ని దుబారా చేస్తుంటే అతను నిర్దోషి ఎలా కాగలడు? జీవవాక్యం అందకుండా ఎంతోమంది మరణిస్తుండగా క్రైస్తవులమని చెప్పుకొనే వారందరు హానికరమైన వ్యసనాలకు ఎంతో ద్రవ్యాన్ని వ్యయం చేస్తున్నారు. దశమ భాగాలు కానుకలు ఇవ్వకుండా దేవుని దోచుకుంటున్నారు. బీదలను ఆదుకోవటం కన్నా సువార్త ప్రకటనకు ద్రవ్యం సమకూర్చటంకన్నా బలిపీఠం మీద శరీరేచ్ఛలను అతిగా అర్పిస్తున్నారు. క్రీస్తు అనుచరులమని చెప్పుకొంటున్న వారందరూ వాస్తవ పరిశుద్ధత గలవారైతే వారు తమద్రవ్యాన్ని అనవసరమైన, హానికరమైన వ్యసనాలకు తగులపెట్టేబదులు దాన్ని ప్రభువుకి సమర్పిస్తారు. మితానుభవం, ఆత్మనిరసన, ఆత్మత్యాగం విషయాల్లో క్రైస్తవులు ఆగర్శాలుగా నివసిస్తారు. వారు అప్పుడు లోకానికి వెలుగై ప్రకాశిస్తారు.GCTel 446.1

    లోకంలో సుఖభోగాల పట్ల ఆసక్తిమెండు. “శరీరాశయు, నేత్రాశయు జీవపు డంబమును” ప్రజాసామాన్యాన్ని నియంత్రిస్తున్నవి. అయితే క్రీస్తు అనుచరులకు ఉన్నతమైన పిలుపు వస్తున్నది: “మీరు వారి మధ్యనుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన బానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.” లోక భోగాలు లోకాశల పరిత్యాగానికి దారితీయని పరిశుద్ధత నిజమైన పరిశుద్ధత కాదని దైవ వాక్యాధారంగా చెప్పగలం.GCTel 446.2

    వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడి” అన్న ఆదేశాన్ని పాటించే ప్రజలకు దేవుడే వాగ్దానం చేస్తున్నాడు: “వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి అపవిత్రమైన దానిని ముట్టకుడి... మరియు నేను మిమ్మును చేర్చుకొందును. మీకు తండ్రినైయుందును. మీరునాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు.” 2 కొరింథీ 6:17, 18. దైవకార్యాలను గూర్చిన విశేషానుభవం పొందటం ప్రతి క్రైస్తవుడికి లభించే గొప్ప తరుణం. ‘నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు గలిగి యుండును” అన్నాడు యేసు. యోహాను 8:12. “పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును” సామెతలు 4:18. విశ్వాసంతోను విధేయతతోను వేసే ప్రతి అడుగు “ఎవరియందు చీకటిలేనేలేదో” లోకానికి వెలుగైన ఆ ప్రభువుతో ఆత్మను మరింత పటిష్టంగా అనుసంధానపర్చుతుంది. దైవసేవకులపై నీతి సూర్యుడి కిరణాలు తేజోవంతంగా ప్రకాశిస్తాయి. వారు ఆ కిరణాల్ని ప్రతిబింబించాల్సి ఉన్నారు. తాము సూర్యుడి వెలుగును బట్టి ప్రకాశిస్తున్న సంగతిని నక్షత్రాలు ఎలా వెల్లడి చేస్తాయో అలాగే విశ్వ సింహాసనంపై దేవుడున్నాడని ఆయనను మనం స్తోత్రించి అనుకరించాలని క్రైస్తవులు సాక్ష్యమివ్వాలి. ఆత్మమూలమైన ఆయన కృపలు ఆయన పవిత్ర పరిశుద్ధ ప్రవర్తన ఆయన అనుచరులలో ప్రదర్శితమవుతాయి.GCTel 446.3

    దేవుడు తన బిడ్డలకు ఏర్పాటుచేసిన దీవెనలను గురించి కొలోస్సీయులకు రాసిన ఉత్తరంలో పౌలిలా అంటున్నాడు, “మేమును మీ నిమిత్తము ప్రార్ధన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకముగల వారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైనGCTel 447.1

    జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు... దేవుని బ్రతిమాలుచున్నాను.” కొలొస్సీ 1:911.GCTel 447.2

    క్రైస్తవుడి ఆధిక్యం అతని ఔన్నత్యం ఎఫేసులోని క్రైస్తవ సహోదరులు అవగాహన చేసుకోవాలన్నదే తన ఆకాంక్షని పౌలు రాస్తున్నాడు. మహోన్నతుడైన దేవుని కుమారులు కుమార్తెలుగా వారికి సొంతం కానున్న శక్తి జ్ఞానాల గురించి వారికి స్పష్టమైన భాషలో వ్యక్తం చేస్తున్నాడు. వారు “ప్రేమయందు వేరుపారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకు తగిన శక్తి కలవారు కావలెననియు” అది వారికి ఏర్పాటు చేయటం జరిగింది. “మీరు దేవుని పరిపూర్ణతయందు పూర్ణులగునట్లుగా” అని ప్రార్థించినప్పుడు పౌలు ఆధిక్యత శిఖరానికి ఎగసిపోతున్నది. ఎఫెస్సీ. 3:1619.GCTel 447.3

    పరమందున్న మన తండ్రి నియమాల్ని నెరవేర్చినప్పుడు ఆయన వాగ్దానాలపై విశ్వాసం నిలపటం ద్వారా మనం చేరగల ఉన్నత శిఖరాలేమిటో ఇక్కడ మనకు గోచర మవుతున్నాయి. క్రీస్తు నీతివల్ల అనంత శక్తి సంపూర్ణుడైన దేవుని సింహాసనం అధిష్టించేందుకు మనకు హక్కు కలుగుతుంది. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరికొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును ఎందుకు అనుగ్రహింపడు?” రోమా 8:32. తండ్రి తన ఆత్మను కుమారునికి పరిమితులు లేకుండా అనుగ్రహించాడు. మనం కూడా దానిలో పాలు పంచుకోవచ్చు. “మీరు చెడ్డవారైయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్యనెరిగి యుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును” అంటున్నాడు యేసు. లూకా 11:13. “మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును” యోహాను 14:14; 16:24.GCTel 448.1

    క్రైస్తవుడి జీవితం అణకువ నమ్రతలతో సాగాలి గాని విచారంతోను ఆత్మనిందతోను కుంగిపోకూడదు. దేవుడు తమ్మును ఆమోదించి దీవించేందుకు యోగ్యత అలా నివసించే ఆధిక్యత ప్రతివారికి ఉన్నది. మనం నిత్యమూ నిందితులుగాను శంకితులుగాను నివసించటం దేవుని చిత్తం కాదు. హృదయం స్వార్ధాలోచనలతో నిండి ఉన్నప్పుడు, వినయ సూచకంగా తలవంచు కొని నడవటం నిజమైన అణకువకు నిదర్శనం కాదు. మనం యేసు వద్దకు వెళ్లి శుద్ధి పొందవచ్చు. అప్పుడు ధర్మశాస్త్రం ఎదుట నిస్సిగ్గుగా నిర్విచారంగా నిలబడవచ్చు. కాబట్టి యిప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను” రోమా 8:1.GCTel 448.2

    పతనమైన ఆదాము కుమారులు యేసు ద్వారా “దేవుని కుమారు” లవుతారు. పరిశుద్ధపరచువారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికి ఒక్కటే మూలము. ఈ హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గు పడడు. హెబ్రీ 2:11. క్రైస్తవ జీవితం దేవునిలో విశ్వాస జీవితం, విజయవంతమైన జీవితం, ఆనందమయమైన జీవితం కావాలి. “దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే” 1యోహాను 5:4. దైవసేవకుడు నెహెమ్యా ఇలా వాస్తవాన్ని పలికాడు. “యెహోవాయందు ఆనందించుటవలన మీరు బలమొందుదురు” నెహెమ్యా 8:10. “ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి. మరల చెప్పుదును ఆనందించుడి”, “ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము” ఫిలిప్పీ 4:4; 1థెస్స 5:1618.GCTel 448.3

    బైబిలు ఆచరణ వలన చోటుచేసుకునే మారుమనసు, పరిశుద్ధతలాంటివి. దైవ ధర్మశాస్త్రంలోని నీతి సూత్రాలపట్ల క్రైస్తవ లోకం ప్రదర్శిస్తున్న నిర్లిప్తత కారణంగా ఈ ఫలాలు ఏమంతగా కనిపించటం లేదు. గతంలోని ఉజ్జీవ సభల్లో ప్రస్ఫుటంగా కనిపించిన దైవాత్మ పరిచర్య ఇప్పుడు కనిపించక పోవటానికి కారణం ఇదే.GCTel 449.1

    వీక్షించటం పరివర్తన కలిగిస్తుంది. సంపూర్ణమైన పరిశుద్ధమైన దైవ శీలాన్ని బయలుపర్చే పరిశుద్ధ సూత్రాలను మనుషులు నిర్లక్ష్యం చేయటంవల్ల వారి మనసులు మానప ప్రబోధాలు సిద్ధాంతాలపై మోజు పడటంతో సంఘంలో భక్తి విశ్వాసాలు సన్నగిల్లటంలో ఆశ్చర్యమేముంది? ప్రభువిలా అంటున్నాడు, “నా జనులు రెండు నేరములు చేసియున్నారు. జీవజలముల ఊటనైన నన్ను విడిచియున్నారు. తమకొరకు తొట్లను అనగా బ్రద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని యున్నారు.” యిర్మీయా 2:13.GCTel 449.2

    “దుష్టుల ఆలోచన చొప్పున ” నడవకుండ ఉండే వాడు “యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకువాడక తనకాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును.” కీర్తనలు 1:13. దైవ ధర్మశాస్త్రానికి దాని ఉచిత స్థానం లభించినప్పుడే దేవుని ప్రజలమని చెప్పుకొనే వారిలో సనాతన విశ్వాసం భక్తి పునరుద్ధరణ పొందుతాయి. “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు- మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి. మేలుకలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి. అప్పుడు మీకు నెమ్మది కలుగును” యిర్మీయా 6:16.GCTel 449.3