Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

మహా సంఘర్షణ

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయం 8—విధానసభ (డయట్) ముందు లూథర్

    కొత్త చక్రవర్తి చార్లెస్ V జర్మనీ సింహాసనాన్ని అధిష్టించాడు. రోము దూతలు రాజుకి అభినందనలు తెలిపి సంస్కరణోద్యమానికి వ్యతిరేకంగా అతడి సహాయ సహకారాలు అర్థించటానికి ఆగమేఘాలమీద జర్మనీకి వెళ్లారు. ఇలా వుండగా చార్లెస్ కి కిరీటం దక్కటానికి తోడ్పడ్డ సేక్సనీ ఓటరు లూథర్ చెప్పేది వినేంతవరకు ఆయనపై ఎలాంటి చర్యా చేపట్టరాదని చార్లెస్ ని అభ్యర్థించాడు. ఈ పరిస్థితి చక్రవర్తిని ఇరకాటంలో పడేసి, ఇబ్బంది పెట్టింది. లూథరకు మరణదండన విధిస్తూ రాజాజ్ఞ జారీ అవ్వటం ఒక్కటే పోపు మత వాదులకు తృప్తినిస్తుంది. “సామ్రాజ్య ప్రభువైన చక్రవర్తిగాని మరే యితర వ్యక్తిగాని లూథర్ రచనలు అవాస్తవాలని నిరూపించలేదని ఉద్ఘాటించి విద్వాంసులు, భక్తులు నిష్పాక్షిక న్యాయాధిపతులతో కూడిన ముందు డాక్టర్ లూథర్ మాట్లాడేందుకు సురక్షిత ప్రయాణ హామీతో ట్రిబ్యూనల్ అవకాశం ఇవ్వవలసిందిగా అభ్యర్థించాడు.” డి అబినే, పుస్త 6, అధ్యా 11.GCTel 126.1

    అన్ని వర్గాల ప్రజల గమనం జర్మను రాష్ట్రాల విధాన సభ మీద కేంద్రీకృతమై ఉన్నది. చక్రవర్తిగా చార్లెస్ సింహాసనాన్ని అధిరోహించిన వెంటనే ఈ సభను వమ్స్ నగరంలో ఏర్పాటు చేశాడు. ఈ జాతీయ సభ పరిశీలించాల్సిన ముఖ్యమైన సమస్యలు ఆసక్తులు ఉన్నాయి. జర్మనీలోని సామంతరాజులు తమ నవయౌవన చక్రవర్తితో ఈ చర్చా సభకు సమావేశం కానున్నారు. దేశం అన్ని ప్రాంతాల నుంచి సంఘ, రాజకీయ అధికారులు విచ్చేశారు. లౌకికాధికారులు, అగ్రజాతులవారు, ప్రాబల్యం కలవారు, తపు వంశ పారంపర్య హక్కుల విషయం పట్టింపుగలవారు, హోదాలోను, అధికారంలోను, అధికులమన్న స్పృహతో విర్రవీగే రాజవంశపు మతాచార్యులు, రాజ దర్భారుల్లోని సాహసికులు, వారి పోషకులు, విదేశాలనుంచి వచ్చిన దూతలు - అందరూ పమ్స్ లో సమావేశమయ్యారు. అంతటి మహాసభలో సంచలనాన్ని ఆసక్తిని రేపిన అంశం సేక్సన్ సంస్కర్త లూథర్ చేపట్టిన కార్యమే.GCTel 126.2

    తనతో పాటు విధాన సభకు తీసుకొని రావలసిందని లూథర్ ని ఆదేశిస్తూ, లూథర్ కి పరిరక్షణ ఏర్పాటు చేసి, సమర్థులైన వ్యక్తులతో వివాదాంశాలపై లూథర్ స్వేచ్ఛగా చర్చించేందుకు ఏర్పాటు చేస్తానని లోగడ చార్లెస్ ఓటరుకి హామీ ఇచ్చాడు. చక్రవర్తి ముందు హాజరు కావటానికి లూథర్ ఆత్రుతగా ఉన్నాడు. ఈ తరుణంలో ఆయన ఆరోగ్యం ఏమంత బాగాలేదు. అయిన ఆయన ఓటరుకి ఇలా రాశాడు, “వర్మకి మంచి ఆరోగ్యంతో వెళ్లలేకపోతే జబ్బుగా ఉన్న నన్ను మోసుకువెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే చక్రవర్తి నన్ను రమ్మంటుంటే అది దేవుని పిలుపే అన్నది నిస్సందేహం. ఒకవేళ వాళ్లు నాపై దౌర్జన్యానికి దిగితే అది సంభవించవచ్చు, హాజరుకమ్మని నన్ను కోరటం ఉపదేశం పొందటానికి కాదు. ఆ విషయాన్ని ప్రభువు చేతుల్లో పెడుతున్నాను. మండుతున్న అగ్నిగుండంలోని ముగ్గురు యువకుల్ని పరిరక్షించిన దేవుడు ఇంకా జీవించే ఉన్నాడు. ఆయన ఇంకా పరిపాలిస్తూనే ఉన్నాడు. ఒకవేళ ఆయన నన్ను రక్షించకపోతే నా ప్రాణం ఏమంత ముఖ్యమయ్యింది కాదు. దుర్మార్గుల అవహేళనకు గురికాకుండా మనం సువార్తను కాపాడాలి. వారు విజయం పొందకుండేందుకు రక్తాన్ని అర్పిద్దాం. ప్రజల రక్షణకు దోహదపడేది నా జీవితమో, మరణమో నిర్ణయించేది నేను కాదు... నా నుంచి మీరు దేనినైనా ఆశించవచ్చు... పారిపోవటం, ఉపసంహరించుకోటం మినహా. పారిపోలేను, ఉపసంహరించుకోనూలేను” అదే పుస్తకం, పుస్త 7, అద్యా 1.GCTel 127.1

    వరమ్స్ విధాన సభకు లూథర్ హాజరు కాబోతున్నాడన్న వార్త సంచలనం సృ పించింది. ఈ వ్యవహారాన్ని ప్రత్యేకంగా చూసుకొంటున్న పోపు ప్రతినిధి ఏలియెండర్ కి ఈ వార్త ఆగ్రహాన్ని, ఆందోళనను పుట్టించింది. దాని పర్యవసానం పోపు దృష్టికి విఘాతం కలిగిస్తుందని అతడు గ్రహించాడు. ఇప్పటికే పోపు వెలిబుచ్చిన తీర్మానంపై దర్యాప్తు జరపటం పోపు అధికారాన్ని కించపరచటమే. పైగా లూథర్ శక్తిమంతమైన వాదనలు అనేకమంది సామంత రాజులను పోపుకు పోపు కర్తవ్యానికి దూరం చేస్తుందని భయపడ్డాడు. వెంటనే అతడు లూథర్ వమ్స్ సభకు హాజరవ్వటం మంచిదికాదని చార్లెస్ కి తెలియజేశాడు. లూథర్ వెలివేతను ప్రకటిస్తూ జారీ అయిన బుల్ ప్రకటన ఇదే సమయంలో ప్రచురితమయ్యింది. ఇదీ దీనితో పాటు ప్రతినిధి పంపిన విజ్ఞప్తి చక్రవర్తి మనసు మార్చాయి. తన నమ్మకాల్ని ఉపసంహరించుకోకపోతే లూథర్ విట్బె ర్గ్ లో నిలిచిపోవాలని చక్రవర్తి ఓటరుకు లేఖ రాశాడు.GCTel 127.2

    ఈ విజయంతో తృప్తి చెందక ఏలియెండర్ లూథర్ కి శిక్ష విధించటానికి తన శక్తి యుక్తుల నుపయోగించి కృషి చేశాడు. “లూథర్ ” రాజద్రోహాన్ని, తిరుగుబాటును, అధర్మాన్ని, దేవదూషణను ప్రోత్సహిస్తున్నాడని నింద మోపుతూ సామంతరాజులు, ప్రిలేటులు తదితర విధానసభ సభ్యుల మద్దతు కోసం ఏలియెండర్ శాయశక్తుల కృషి చేశాడు.” పోపు ప్రతినిధి ప్రదర్శించిన ఉగ్రత, క్రోధం అతడు ఎవరి స్వభావాన్ని బయలు పర్చుతున్నాడో విశదపర్చుతూనే ఉంది. “అతణ్ణి చైతన్య పర్చుతున్నది ద్వేషం, పగ, ఉత్సాహమే గాని భక్తి కాదు” అని అందరూ వ్యాఖ్యానించారు. అదే పుస్తకం, పుస్త 7, అధ్యా 1. విధానసభలో అధిక సంఖ్యాకులు లూథర్ కృషిని అభిమానించారు.GCTel 128.1

    పోపు శాసనాన్ని అమలుపర్చాల్సిన విధిని ఏలియెండర్ చక్రవర్తికి సూచించాడు. అయితే జర్మనీ దేశ చట్ట ప్రకారం సామంతరాజుల ఆమోదం లేకుండా ఇది సాధ్యపడదు. కాగా పోపు ప్రతినిధి ఎడతెగని విజ్ఞాపన వల్ల తన కేసును విధానసభ (డయెట్) నివేదించుమని ప్రతినిధిని చక్రవర్తి ఆదేశించాడు. పోపు దూతకు అది పర్వదినం. అది బ్రహ్మాండమైన సభ. ఆనాటి సభాకార్యం అంత కన్నా బ్రహ్మాండమైంది. సంఘాలన్నింటికి తల్లి, ఉంపుడుకత్తె అయిన రోము పక్షంగా ఏలియెండర్ వాదించ నున్నాడు. క్రైస్తవ లోకంలోని రాష్ట్రాలన్నింటి నుంచి సమావేశమైన నేతల ముందు పేతురు సామంత రాజరికాన్ని ప్రతినిధి నిరూపించాల్సి ఉన్నాడు. “అతడు మంచి వ్యక్త, ఆ సమయ సందర్భాలకు తగిన వ్యక్తిగా కనిపించాడు. తాను దోషిగా తీర్పు పొందక పూర్వం ఆ ప్రతిష్టాత్మకమైన ట్రిబ్యూనల్ ముందు తన పక్షంగా వాదించటానికి రోముకి అతి సమరుడైన వ్యక్త ఉండటం దేవుని చిత్తం.” విలీ పుస్త 6, అధ్యా 4. సంస్కర్తను అభిమానించిన కొందరికి అనుమానం కలిగింది. ఏలియెండర్ వాదన ఫలితం ఎలాగుంటుందో అని భయపడ్డారు. సేక్సనీ ఓటరు ఆ సభకు హాజరు కాలేదుగాని పోపు దూత ప్రసంగ విషయాలు రాసి నివేదించటానికి అతడి అనుచరులు కొందరు సభకు హాజరయ్యారు.GCTel 128.2

    తన పరిజ్ఞానాన్ని వాగ్దాటిని పురస్కరించుకొని ఏలియెండర్ సత్యాన్ని తారుమారు చేయటానికి పూనుకొన్నాడు. సంఘ విద్రోహి, దేశద్రోహి, జీవించి ఉన్నవారికి, మరణించిన వారికి, బోధక వర్గానికి సభ్య గణాలకు, సభలకు, వ్యక్తిగత క్రైస్తవులకు లూథర్ విరోధి అంటూ ఏలియెండర్ ఆయనపై నిందమీద నింద మోపాడు. లూథర్ చేసిన అపరాధాలు ఒక లక్షమంది సిద్ధాంత వ్యతిరేకుల సజీవ దహనం పొందటానికి సరిపోతాయి అని ఉరిమాడు. చివరగా దిద్దుబాటు విశ్వాసాన్ని, అవలంబిస్తున్న వారిపై నిప్పులు చెరగటానికి సమకట్టాడు. “లూథర్ అనుచరులు ఎవరు? పొగరెక్కిన ఉపాధ్యాయులు, అవినీతిపరులైన ప్రీస్టులు, కామాంధులైన సన్యాసులు, అజ్ఞానులైన న్యాయవాదులు, భ్రష్టులైన ధనికులు, వారితోపాటు తాము తప్పుదారి పట్టించి చెడగొట్టిన సామాన్య ప్రజలు వీరే. సంఖ్యలోను, శక్తిసామర్థ్యాల్లోను కథోలిక్ పక్షం ఎంతో ఉన్నతమైనది. ప్రసిద్ధమైన ఈ సభ నుంచి ఏకగ్రీవ ఆదేశం సామాన్యుల్ని ఉత్తేజపర్చి మర్యాద లేని వారిని హెచ్చరించి, ఊగిసలాడే వారికి స్థిరత్వాన్ని, బలహీనులకు శక్తిని ఇస్తుంది.” డి అబినే, పుస్త 7, అధ్యా 3.GCTel 128.3

    సత్య ప్రబోధకులపై ప్రతి యుగంలోను ఇలాంటి ఆయుధాలతో దాడి జరిగింది. స్థిరపడిపోయిన అసత్యాలకు విరుద్ధంగా దైవ వాక్యాన్ని స్పష్టంగా, సూటిగా బోధించటానికి సాహసించే వారిపై ఇవే వాదనలతో ఇంకా దాడి జరుగుతున్నది. ఈ కొత్త సిద్ధాంతాలు బోధిస్తున్న ప్రబుద్దు లేపరు? చదువులేనివాళ్లు, సంఖ్యాపరంగా అంతంత మాత్రంగా ఉన్నవాళ్లు, బీదవర్గాల ప్రజలు అయినా వారు తమకు సత్యముందంటున్నారు. దేవుడు ఎంపిక చేసుకొన్న ప్రజలం మేమే అంటున్నారు. వారు అజ్ఞానులు. మోసపోయిన ప్రజలు. మా సంఘం వారికన్నా సభ్యత్వంలోను, పలుకుబడి విషయంలోను ఎంతో ఉన్నతమైంది. మాసంఘంలోని వారు పేరు ప్రతిష్ఠలుగలవారు. విద్యాధికులు, మా పక్క సమధికమైన బలం ఉన్నది. ఈ వాదనలు లోకాన్ని అమితంగా ప్రభావితం చేస్తున్నాయి. అయితే సంస్కర్త దినాల్లోలాగే నేడు కూడ ఇవి నిర్ణయాత్మక వాదనలు కావు.GCTel 129.1

    అనేకులు అనుకొన్నట్లు సంస్కరణ లూథర్ తో అంతమొందలేదు. లోక చరిత్ర చివర దాకా సంస్కరణ కొనసాగించాల్సి ఉంది. తనపై ప్రకాశించేందుకు దేవుడు అనుమతించిన సత్యాన్ని ఇతరులపై ప్రతిబింబించటమున్న మహా కార్యాన్ని లూథర్ నిర్వహించాడు. అయినా లోకానికి అందించాల్సిన సత్యమంతా లూథర్ పొందలేదు. అప్పటి నుంచి నేటి పరకు లేఖనాలపై కొత్త వెలుగు ప్రకాశిస్తూ, కొత్త సత్యాల ఆవిష్కరణ కొనసాగుతూనే ఉన్నది.GCTel 129.2

    ప్రతినిధి ప్రసంగం విధాన సభను ఆకట్టుకొన్నది. పోపు మతసమర్దకుణ్ణి గెలిచేందుకు స్వచ్ఛమైన, స్పష్టమైన, విశ్వాసం పుట్టించే దైవ వాక్యం గల లూథర్ లేడు. సంస్కర్తను సమర్దించే ప్రయత్నం జరగలేదు.. అయినా ఆయన బోధించిన సిద్ధాంతాలను గద్దించటానికేగాక సాధ్యమైతే సిద్ధాంత వ్యతిరేకతను పూర్తిగా నిర్మూలించాలన్న చిత్త ప్రవృత్తి అన్ని చోట్లా ప్రదర్శితమైంది. తన ఉద్దేశాన్ని సమర్ధించుకునే తరుణం రోముకి ఉన్నది. తన వాదనను సమర్థించుకొంటూ రోము నాయకత్వం చెప్పగలిగిందం చెప్పింది. కాని విజయంలా కనిపించేది పరాజయ సూచికే. ఇక సత్యానికి అసత్యానికి మధ్యగల భేదం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే బహిరంగ యుద్ధం ద్వారానే వారు గెలుపు సాధించాల్సి ఉన్నారు. రోముకు అప్పటివరకూ ఉన్న భద్రత ఆనాటి నుంచి ఇక ఎన్నటికీ కరవయ్యింది.GCTel 129.3

    విధానసభ సభ్యుల్లో అధిక సంఖ్యాకులు లూథర్ ని రోము నేతలకు అప్పగించేందుకు సందేహించక పోయినప్పటికీ సంఘంలో ప్రబలుతున్న భ్రష్టతను గర్జించి అధికార గణం దుర్నీతి దురాశలవల్ల జర్మను ప్రజలకు కలుగుతున్న చేబుకు భరతవాక్యం పలకాలని అనేకులు ఆ కాంక్షించారు. ప్రతినిధి పోపు నిబంధనను సభ్యులకు నచ్చే విధంగా వ్యక్తీకరించాడు. పోపుల నిరంకుశ పరిపాలనను వాస్తవికంగా వివరించటానికి విధాన సభ సభ్యుడొకణ్ణి దేవుడు ప్రేరేపించాడు. ఆ సామంత రాజుల సభలో సేక్సనికి చెందిన డ్యూక్ జార్జి లేచి పోపుల మోసాల్ని, హేయకార్యాల్ని, వాటి ఘోర పరిణామాల్ని పూసగుచ్చినట్లు వివరించాడు. డ్యూక్ జార్జి చివరగా ఇలా అన్నాడు: GCTel 130.1

    “రోమును ఖండిస్తున్న దురాచారాల్లో ఇవి కొన్ని మాత్రమే. సిగ్గును వదిలేసిన వారి ఒకే ఒక గురి... డబ్బు, డబ్బు, డబ్బు. ఫలితంగా సత్యాన్ని బోధించాల్సిన బోధకులు అబద్దాలు బోధిస్తున్నారు. ప్రజాదరణ పొందటమే కాదు, పారితోషికాలు కూడా పొందుతున్నారు. ఎన్ని అబద్ధాలు బోధిస్తే అంత ఎక్కువ లాభం వారికి వస్తున్నది. కలుషితమైన ఈ ఊటనుంచి మురికి నీరు ప్రవహిస్తున్నది. వ్యభిచారం చేయి చాపి దురాశసు భిక్షమడుగుతున్నది... బోధక వర్గం ప్రారంభించిన అపవాదు అనేక ఆత్మలను నిత్యనాశనానికి నడిపించింది. సాధారణ సంస్కరణ చోటు చేసుకోవాలి. ” అదే పుస్తకం, పుస్త 7, అధ్యా 4.GCTel 130.2

    పోపుల దురాచారాలను దుష్కృత్యాలను ఇంతకన్న సమర్థంగా తీవ్రంగా స్వయాన లూథరే ఖండించగలిగి ఉండకపోవచ్చునేమో. అంతేకాదు వక్త సంస్కరకు బద్ద విరోధి అన్నది అతడి మాటలకు మరింత శక్తిని చేకూర్చింది.GCTel 130.3

    సభవారు కన్నులు తెరచి ఉండివుంటే అసత్యపు చీకట్లను చెదరగొడూ సత్యానికి మనసుల్ని హృదయాన్ని తెరుస్తూ సత్యకాంతి ప్రసరిస్తున్న దేవదూతల్ని వారు చూడగలిగివుండేవారే. సత్యదేవుని శక్తి వివేకాలు సంస్కరణ వ్యతిరేకుల్ని సహితం అదుపుచేసి జరగాల్సిన సంస్కరణ కృషికి మార్గం సుగమం చేశాయి. మార్టిన్ లూథర్ అక్కడలేడు. కాని ఆ సభలో లూథర్‌ కున్న ఉన్నతమైన ప్రభువు స్వరం వినిపించింది.GCTel 130.4

    జర్మను ప్రజలను కుంగదీసి వారిని నానా కష్టాలకు అరిష్టాలకు గురి చేస్తున్న పోపుల దుష్కియల జాబితా తయారు చేసేందుకు వెంటనే ఒక కమిటీని సభ నియమించింది. నూట ఒక్క నిర్దిష్ట అవినీతి కార్యాలున్న జాబితాను చక్రవర్తికి సమర్పించి వాటిని సవరించటానికి తక్షణ చర్య తీసుకోవలసిందిగా ఆ కమిటీ అభ్యర్థించింది. క్రైస్తవ ఆత్మలు నశించటం ఎంత గొప్ప నష్టం? క్రైస్తవలోకానికి ఆధ్యాత్మిక అధి నాయకుడైన వ్యక్తిని చుట్టు ముట్టిన నిందల కారణంగా ఎలాంటి దోపిడీలు, బలవంతపు వసూళ్లు నిరాఘాటంగా కొనసాగాయి! మన ప్రజలకు సంభవించనున్న వినాశనాన్ని, మోసాన్ని తప్పించటం మా విహిత కర్తవ్యం. ఈ కారణంగా సంస్కరణలకు ఆదేశాలు జారీచేసి అవి అమలయ్యేటట్లు చూడాల్సిందిగా మిమ్మును వినయ పూర్వకంగా అభ్యర్థిస్తున్నాం” అంటూ దరఖాస్తు దారులు కోరారు. అదే పుస్తకం, పుస్త 7, అధ్యా 4. GCTel 131.1

    తన ముందు సంస్కర్త హాజరుకావాలని ఇప్పుడు ఆసభ డిమాండ్ చేసింది. ఏలియెండర్ విజ్ఞాపనల్ని, నిరసనల్ని, బెదరింపుల్ని లెక్కచేయకుండా లూథర్ సభ ముందు హాజరు కావలసిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ ఆదేశాలతోపాటు లూథర్‌కు సురక్షిత ప్రయాణ హామీ కూడా చక్రవర్తి ఇవ్వటం జరిగింది. ఆ ఆదేశాలతో ఒక దూత విటన్బర్గ్ కు వెళ్లి ఆయనను వమ్స్ నగరానికి తోడుకొని రావలసిందిగా ఆదేశాలు పొందాడు.GCTel 131.2

    లూథర్ మిత్రులు భయకంపితులై ఆందోళన చెందారు. లూథర్ పట్ల ఉన్న ప్రతికూలతను శత్రుత్వాన్ని ఎరిగిన మిత్రులు చక్రవర్తి ఆయన కిచ్చిన సురక్షిత ప్రయాణ హామీని కూడా తోసిపుచ్చుతాడని భయపడూ తన ప్రాణాన్ని ప్రమాదానికి గురి చేసుకోకూడదని లూథర్ కి విజ్ఞప్తి చేశారు. “పోపు మత వాదులు నేను వరము రావాలని కోరుకోలేదు. వాళ్లకు కావలసింది నాకు శిక్ష పడటం, నా మరణం. పర్వాలేదు.GCTel 131.3

    నా కోసం ప్రార్థించకండి. దేవుని వాక్యం కోసం ప్రార్ధించండి... ఈ తప్పుడు బోధకుల్ని జయించటానికి క్రీస్తుతన ఆత్మనిస్తాడు. జీవితకాలంలో వారిని ద్వేషిస్తూ వచ్చాను. నా మరణం ద్వారా వారిపై విజయం సాధిస్తాను. నా నమ్మకాల్ని వదులుకోమని నన్ను ఒత్తిడి చేయటానికి వరమ్స్ లో వాళ్లు తర్జన భర్జనలు చేసుకొంటున్నారు. నేను చేసుకొనే ఉపసంహరణ ఇది. పోపు క్రీస్తు ప్రతినిధి అని క్రితంలో అన్నాను. అతడు ప్రభువు విరోధి సైతాను అపోస్తలుడు అని ఇప్పుడంటున్నాను. ” అదే పుస్తకం, పుస్త 7, అధ్యా 6.GCTel 131.4

    అపాయంతో నిండిన తన ప్రయాణం లూథర్ ఒంటరిగా చేయటం క్షేమంకాదు. చక్రవర్తి నియమించిన దూతకు అదనంగా లూథర్‌కు సన్నిహిత మిత్రులు ముగ్గురు ఆయనతో ప్రయాణించటానికి నిశ్చయించుకొన్నారు. వారితో వెళ్లాలని మెలాంగ్ తన్ ఆశించాడు. లూథర్ అంటే అతనికి ప్రాణం. ఆయనతో ఎక్కడికైనా వెళ్లడానికి వెనుదీసేవాడు కాదు. - చెరసాలకు, చివరికి మరణానికి కూడా. కాని మెలాంగ్ తన్ తనతో వెళ్లటానికి లూథర్ అంగీకరించలేదు. లూథర్ మరణిస్తే సంస్కరణ నిరీక్షణ యువకుడైన ఈ సహచరుడి పైనే కేంద్రీకృతం కావాలి. మెలాంగ్ తన్ వద్ద సెలవు తీసుకొంటున్న తరుణంలో సంస్కర్త ఈ మాటలు పలికాడు, ” నాశత్రువులు నన్ను హతమార్చటం జరిగి నేను తిరిగి రాకపోతే బోధించటం కొనసాగించు. సత్యంలో స్థిరంగా నిలబడి పుండు. నాకు బదులుగా పని చేయి... నీవు బతికి ఉంటే నామరణంవల్ల పెద్ద నష్టం కలుగదు.” అదే పుస్తకం, పుస్త 7, అధ్యా 7. లూథరిని సాగనంపటానికి సమావేశమైన విద్యార్థులు, పురజనులు కంటతడి పెట్టారు. సువార్తకు సానుకూలంగా స్పందించిన జనసమూహాలు లూథర్ కి కన్నీటితో వీడ్కోలు చెప్పారు. సంస్కర్త ఆయన సహచరులు విట్బెర్గ్ నుంచి ఇలా బయలు దేరారు.GCTel 132.1

    ప్రజల మనస్సులను భయాందోళనల చీకట్లు అలముకొన్నట్లు వారు తమ ప్రయాణంలో గుర్తించారు. కొన్ని పట్టణాల్లో వారికి గౌరవ మర్యాదలు కరవయ్యాయి. రాత్రి విశ్రాంతి తీసుకోటానికి ఒక స్థలంలో ఆగినప్పుడు ఒక ఇటలీ దేశ సంస్కర్త హతసాక్షిగా మరణించిన ఉదంతాన్ని ఒక ప్రీస్టు లూథర్‌కు వివరించి తన భయాలు వ్యక్తం చేశాడు. ఆ మరుసటి రోజు వమ్ సభలో లూథర్ రచనలు సిద్ధాంత వ్యతిరేక రచనలుగా ప్రకటితమయ్యాయని వారు విన్నారు. నిషిద్ధ రచనల్ని న్యాయాధిపతుల వద్దకు తేవలసిందటూ ప్రజలను హెచ్చరిస్తూ చక్రవర్తి జారీచేసిన డికీని చక్రవర్తి దూతలు ప్రకటిస్తున్నారు. సభలో లూథర్ క్షేమం గురించి భయపడూ, అప్పటికే తన తీర్మానం సడలి వుంటుందని భావించి, ఆయన వెంట ప్రయాణం చేస్తున్న దూత తనకు ఇంకా ముందుకు సాగాలన్న ఉద్దేశం ఉన్నదా అని లూథర్ ని ప్రశ్నించాడు. “ప్రతీ నగరంలో నిషేధానికి గురి అయినా తాను మాత్రం ముందుకి వెళ్తాను” అన్నది ఆయన సమాధానం అదే పుస్తకం, పుస్త 7, అధ్యా 7.GCTel 132.2

    ఎ లో ప్రజలు లూథర్ ని గౌరవ మర్యాదలతో స్వాగతించారు. భిక్షపాత్ర పట్టుకొని తాను తిరిగిన వీధుల్లో అభినందిస్తూ స్వాగతిస్తూ నిలచిన జనసమూహాల మధ్య నడచి వెళ్లాడు. తన ఆశ్రమం గదిని సందర్శించి ఇప్పుడు జర్మనీ దేశాన్ని నింపటంలో అనేక శ్రమలనెదుర్కొంటున్న సత్యం తన ఆత్మలో ఎలా ప్రకాశించిందో జాపకం చేసుకొన్నాడు. ప్రసంగించవలసిందిగా లూథర్ ని ప్రజలు కోరారు. ఆయన ప్రసంగించటం నిషిద్ధం. కాని తనతో ఉన్న దూత ఆయనకు అనుమతి నీయగా ఒకప్పుడు ఆ ఆశ్రమంలో ఊడిగం చేసిన సన్యాసే బోధకుడి వేదిక నలంకరించాడు.GCTel 132.3

    జనులు క్రిక్కిరిసి ఉన్న ఆ సమావేశంలో క్రీస్తు పలికిన “మీకు సమాధానము కలుగునుగాక” అన్నమాటలపై ప్రసంగించాడు. నిత్య జీవం పొందే మార్గాన్ని ప్రజలకు బోధించటానికి తత్వవేత్తలు, వేదాంత పండితులు, రచయితలు ప్రయత్నించి విఫలులయ్యారు. నేను ఆ మార్గాన్ని మీకు బోధిస్తాను... మరణాన్ని నాశనంచేసి పాపాల్ని నిర్మూలించి నరక ద్వారాలను మూసివేసేందుకు మరణం నుంచి ఒక మనుష్యుణ్ణి దేవుడు లేపాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు... ఇదే రక్షణ క్రియ... క్రీస్తు జయించాడు. ఇది సంతోషకరమైన వార్త. మనం ఆయన నిర్వహించిన క్రియ ద్వారా రక్షణ పొందుతున్నాం. మన సొంత క్రియల ద్వారా కాదు. “మీకు సమాధానం కలుగునుగాక. నా చేతులు చూడండి... నీ పాపాల్ని తీసివేసి నిన్ను విమోచించింది నేనే మరెపరూకాదు. కనుక ఇప్పుడు నీకు సమాధానం కలుగుతుంది.” అంటున్నాడు ప్రభువు.GCTel 133.1

    వాస్తవిక విశ్వాసం పరిశుద్ధ జీవితంలో ప్రదర్శితమౌతుందని చెబుతూ తన ప్రసంగాన్ని కొనసాగించాడు. “దేవుడు మనల్ని రక్షించాడు గనుక ఆయనకు అంగీకృతమైన కార్యాలనే మనం చేయాలి. నీవు ధనవంతుడివా? అయితే నీ సంపదను బీదల అవసరాలు తీర్చటానికి ఉపయోగించు. నీ సంపాదన నీ ఒక్కడికే ఉపకరిస్తే దేవుని సేవ చేస్తున్నట్లు నీవు నటించే నటన అబద్దం”. - అదే పుస్తకం, పుస్త 9, అధ్యా 7.GCTel 133.2

    ప్రజలు మంత్రముగ్ధులై విన్నారు. ఆకలిగా ఉన్న ఆత్మలకు జీవాహారం వడ్డించటం జరిగింది. పోపులు, పోపుప్రతినిధులు, చక్రవర్తులు రాజులకన్నా ఉన్నతంగా క్రీస్తును హెచ్చించటం జరిగింది. తానున్న అపాయకర పరిస్థితిని లూథర్ చర్చించలేదు. ప్రజల ఆలోచనలను సానుభూతిని తన మీదికి తిప్పుకోవటానికి ప్రయత్నించలేదు. క్రీస్తును గురించిన ధ్యానంలో తన్నుతాను మర్చిపోయాడు. పాపి రక్షకుడుగా యేసును చూపించే ప్రయత్నంలో లూథర్ కల్వరి కథానాయకుడి వెనుక మరుగై నిలిచాడు.GCTel 133.3

    సంస్కర్త ప్రయాణం కొనసాగిన కొద్దీ ప్రజలు అన్ని చోట్ల ఆయన పట్ల గౌరవాదరాలు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఒక చోట కొంతమంది ఆయన చుట్టూ మూగారు. స్నేహపూరిత స్వరాలు రోము మతవాదుల దురుద్దేశాల్ని గూర్చి ఆయనను హెచ్చరించాయి. “లూథర్‌ గారూ, వాళ్లు జాన్వాసను కాల్చి బూడిద చేసినట్లు మిమ్మల్ని కాల్చి మీ శరీరాన్ని బూడిద చేస్తా.” అంటూ కొందరు హెచ్చరించారు. “వరమ్స్ నుంచి విట్బెర్గ్ వరకు మార్గమంతా వాళ్లు మంటలు వెలిగించినా అవి ఆకాశాన్నంటేంత బ్రహ్మాండమైన మంటలైనా ప్రభువుపేరట ఆ మంటల్లో నుంచి నడిచి వెళ్తాను. వారి ముందు నిలబడ్డాను. ఈ క్రూరమృగం నోటిలోకి వెళ్లి యేసు ప్రభువు నామాన్ని ఒప్పుకొంటూ దాని కోరలు విరగగొడ్డాను” అంటూ సమాధానం చెప్పాడు లూథర్. - అదే పుస్తకం, పుస్త 7, అధ్యా 7.GCTel 134.1

    ఆయన వమని సమీపిస్తున్నాడనే వార్త గొప్ప గందరగోళం రేపింది. స్నేహితులు ఆయన భద్రత గురించి ఆందోళన చెందనారంభించారు. ఆయన ప్రత్యర్థులు తమ కార్యం సఫలం కాదేమోనని భయపడున్నారు. నగరంలో ప్రవేశించకుండేందుకు ఆయనను ఒప్పించటానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. మిత్రుడైన ఒక నైట్స్ (సాహసికుడి) భవనానికి వెళ్ళుమని, అక్కడ సమస్యలన్నీ సామరస్యంగా పరిష్కరించుకోవచ్చునని పోపుమతవాదుల ప్రేరణతో కొందరు లూథర్ కి సలహా చెప్పారు. పొంచి ఉన్న అపాయాల్ని వివరించటం ద్వారా ఆయనలో భయం పుట్టించటానికి లూథర్ మిత్రులు ప్రయత్నించారు. కాని వారి ప్రయత్నాలు విఫల మయ్యాయి. లూథరైతే చలనం లేకుండా నిలిచి “ఇళ్లపై ఎన్ని పెంకులున్నాయో అన్ని దయ్యాలు వమ్స్ లో ఉన్నాసరే నేను ఆ నగరంలో తప్పక ప్రవేశిస్తాను” అన్నాడు. -అదే పుస్తకం, పుస్త 7, అధ్యా 7.GCTel 134.2

    ఆయన వమ్స్ నగరం చేరిన వెంటనే ఆయనకు స్వాగతం చెప్పటానికి గుమ్మం వద్ద జనులు గుమి గూడారు. చక్రవర్తిని స్వాగతించటానికి కూడ అంత గొప్ప ప్రజా సమూహం సమావేశం కాలేదు. ప్రజల్లో ఉత్సాహోద్రేకాలు ఉరకలువేశాయి. ఆ ప్రజాసమూహం మధ్య నుంచి ఒక విషాద స్వరం వినిపించింది. లూథర్ కి సంభవించనున్న విషాదం గురించి హెచ్చరికగా పాడిన మరణ గీతం అది. తన వాహనం నుంచి కిందకు దిగుతూ “దేవుడే నాకు రక్ష” అన్నాడు లూథర్.GCTel 134.3

    లూథర్ వమ్స్ నగరానికి వస్తాడని పోపు అధికారులు అనుకోలేదు. ఆయన రాక వారికి దిగ్భ్రాంతి కలిగించింది. ఏమి చేయాలో ఆలోచించటానికి చక్రవర్తి వెంటనే తన సలహా సంఘ సభ్యున్ని పిలిచాడు. కరడు గట్టిన పోపు మతవాది అయిన ఒక బిషప్ ఇలా అన్నాడు, ” ఈ అంశంపై మనం చాలాకాలం సంప్రదింపులు జరిపాం. ఏలినవారు ఈ వ్యక్తికి వెంటనే మరణదండన విధించాలని మనవి. చక్రవర్తి సిగ్మండ్ నికోరగా జానహకి సజీవ దహన దండన విధించలేదా? సిద్ధాంత వ్యతిరేకికి సురక్షిత ప్రయాణహామీ ఇవ్వటంగాని దాన్ని ఆచరించటంగానీ చేయనక్కర లేదు”” “అలాక్కాదు. చేసిన వాగ్దానాన్ని మనం నిలుపుకోవాలి” అన్నాడు చక్రవర్తి - అదే పుస్తకం, పుస్త 7, అధ్యా 8. కాబట్టి సంస్కర్త మాట్లాడాలన్నదే చక్రవర్తి తీర్మానం.GCTel 134.4

    ఆ నగరంలోని ప్రజలంతా ఈ మహావ్యక్తిని చూడటానికి తహతహలాడున్నారు. ఆయన ఉన్న స్థలం సందర్శకులతో కిటకిటలాడింది. తనకు ఇటీవల వచ్చిన జబ్బు నుంచి లూథర్ పూర్తిగా కోలుకోలేదు. రెండు వారాలపాటు జరిగిన ప్రయాణం వల్ల బాగా అలసిపోయాడు. రేపటి ప్రధాన సమస్యలను ఎదుర్కోటానికి ఆయనసిద్ధపడాలి. ఆయనకు ప్రశాంతత విశ్రాంతి ఎంతో అవసరం. ధనవంతులు, నైట్లు, ఫ్రీస్టుల్లో, పుర ప్రజల్లో ఆయనను కలుసుకోవాలన్న ఆశ అత్యధికంగా ఉన్నందున ఆయనకు కొన్ని గంటల విశ్రాంతి మాత్రమే లభించేది. వారిలో చాలామంది ధనికులున్నారు. మత గురువులు, ప్రబోధకులలో పెరిగిపోతున్న దుష్కృతాలను చక్రవర్తి సంస్కరించాలని వారు ధైర్యంగా డిమాండ్ చేశారు. ‘నేను బోధిస్తున్న సువార్త ఎల ప్రజలను స్వతంత్రుల్ని చేసింది.” అంటున్నాడు లూథర్ - మార్టిన్, పుట 393. శత్రువులు, మిత్రులు జంకు కొంకులేని ఈ సన్యాసిని చూడటానికి బారులు తీరారు. వారిని నిశ్చల ప్రశాంతతతో ఆహ్వానించి మర్యాద విజ్ఞతలతో వారికి సమాధానమిచ్చాడు. ఆయన ధైర్య సాహసాలతో మెలగాడు. శారీరక శ్రమవలన వ్యాధివలన బలహీనమై చిక్కిన ముఖంలో దయ, కనికరాలు, ఆనందోత్సాహాలు కనిపించాయి. ఆయన మాటల్లోని గంభీరత ప్రగాఢ విశ్వసనీయత తన విరోధులు సహితం ప్రతిఘటించలేని శక్తిని ఆయనకు సమకూర్చాయి. శత్రువులు మిత్రులు విస్మయం చెందారు. ఆయనకు దైవ ప్రభావం ఉన్నదని కొందరి నిశ్చితాభిప్రాయం. క్రీస్తు విషయంలో పరిసయ్యులు అన్నట్లు కొందరు “ఆయనలో దురాత్మ” ఉన్నదన్నారు.GCTel 135.1

    మరుసటిరోజు విధాన సభకు హాజరు కావలసిందిగా లూథర్ కి ఆదేశాలందాయి. సభా స్థలానికి ఆయన ను తీసుకొని వెళ్లడానికి ప్రభుత్వాధికారి ఒకడు నియమితుడయ్యాడు. అయినా ఆ స్థలం చేరటం చాలా కష్టమయ్యింది. పోపు అధికారాన్ని ధిక్కరించగల ధైర్యం ఉన్న సన్యాసిని చూసేందుకు వచ్చిన వారితో వీధులు కిటకిటలాడాయి.GCTel 135.2

    న్యాయమూర్తుల ముందుకు లూథర్ వెళ్లక ముందు అనేక యుద్ధాలు చేసిన వు ద్ద సేనాధికారి లూథర్ తో ఇలా అన్నాడు. “సన్యాసీ, నేనుగాని మరేయితర సేనాపతిగాని ఎన్నడూ ఎదుర్కోని సమరంకన్న తీవ్రమైన సమరాన్ని ఇప్పుడు నీవు ఎదుర్కో బోతున్నావు. కాని నీ కర్తవ్యం యధార్ధమైనదైతే అందుకు నీ కెలాంటి సందేహం లేకపోతే దైవనామంలో ముందుకు సాగు. ఎవరికీ దేనికీ భయపడకు. దేవుడునిన్ను విసర్జించడు” డి. అబినే, పుస్త 7, అధ్యా 5.GCTel 136.1

    చివరకు లూథర్ సభముందు నిలబడ్డాడు. చక్రవర్తి సింహాసనం అధిష్టించాడు. ఆ సామ్రాజ్యంలో ప్రసిద్ధిగాంచిన, వ్యక్తులు అతని చుట్టూ ఆసీనులై ఉన్నారు. తన నమ్మకాల నిమిత్తం సంజాయిషీ చెప్పటానికి మార్టిన్ లూథర్ హాజరవుతున్న ఆ సభకన్న ఉత్తమ సభముందు ఏవ్యక్తి ఎన్నడూ హాజరు కాలేదు. లూథర్ ఇలా సభకు హాజరు కావటమే పోపుల అధికారంపై ఘన విజయం. పోపు ఆయనను అపరాధిగా తీర్పు తీర్చగా ఆయన ఇపుడు ట్రిబ్యూనల్ ముందు నిలిచాడు. ఆ ట్రిబ్యూనల్ పోపు అధికారానికన్న ఉన్నతమైందని ఇది నిరూపిస్తున్నది. పోపు ఆయనను వెలివేసి సమాజానికి దూరంగా ఉంచాడు. అయినా ఆయనను ప్రపంచంలో మిక్కిలి ప్రతిషాత్మక విధాన సభకు మర్యాదగా ఆహ్వానించటం జరిగింది. పోపు ఆయన మాట్లాడకుండా మౌనం దాల్చాలని తీర్మానించాడు. ఇప్పుడు ఆయన క్రైస్తవ లోకం నలుమూలల నుంచి వచ్చిన వేలాదిమంది శ్రద్ధగా వినే సభలో మాట్లాడ నున్నాడు. లూథర్ ద్వారా విప్లవాత్మకమైన మార్పు చోటుచేసుకొన్నది. రోము అధికారం తన సింహాసనం నుంచి దిగివస్తున్నది. ఈ పరాభవాన్ని కలిగించింది ఒక సన్యాసి స్వరం” అదే పుస్తకం, పుస్త 7, అధ్యా 8.GCTel 136.2

    సామాన్య కుటుంబంలో జన్మించిన సంస్కర్తకు హక్కులు, అధికారాలు ఉన్న సభ్యుల సమావేశంలో కొంచెం భయంగాను ఇబ్బందిగాను ఉంది. తన భావోద్రేకాన్ని గమనించి చాలామంది సామంతరాజులు ఆయన వద్దకు వచ్చారు. వారిలో ఒక వ్యక్తి లూథర్ లో నెమ్మదిగా ఇలా అన్నాడు, “ఆత్మను చంపలేక దేహమునే చంపువారికి భయపడకుడి ” ఇంకొక వ్యక్తి ఇలా అన్నాడు, “వీరికిని అన్యజనులకును సాక్షార్హమై నా నిమిత్తము మీరు అధిపతులయొద్దకును, రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించునప్పుడు ఏలాగు మాట్లాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింపకుడి, మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకనుగ్రహించబడును.” మత్తయి 10:28, 18, 19. కష్టకాలంలో దైవ సేవకుణ్ణి బలపర్చటానికి ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు క్రీస్తు మాటల్ని ఇలా ఉపయోగించారు.GCTel 136.3

    చక్రవర్తి సింహాసనం ముందున్న స్థానానికి లూథర్ ని నడిపించారు. సభలంతా నిశబ్దమయ్యింది. అంతట ఒక అధికారి లేచి లూథర్ రచనల సంకలనాన్ని చూపిస్తూ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పమని సంస్కర్తను కోరాడు. వాటిని తన రచనలుగా అంగీకరిస్తున్నాడా అన్నది, అందులోని అభిప్రాయాన్ని ఉపసంహరించుకునే ఉద్దేశం ఉన్నదా అన్నది ఆ రెండు ప్రశ్నలు. ఆ పుస్తకాల పేర్లు, అతడు చదివాక మొదటి ప్రశ్నకు సమాధానంగా ఆ పుస్తకాలు తనవేనని లూథర్ ఒప్పుకున్నాడు. ఇక రెండో ప్రశ్నకు వస్తే అది విశ్వాసం ఆత్మల రక్షణకు సంబంధించిన సంగతి గనుక లోకంలోగాని పరలోకంలోగాని మిక్కిలి ప్రశస్త ధనమైన దైవవాక్యంతో అది ముడిపడి ఉన్నది. గనుక ఆలోచించకుండా సమాధానం చెప్పటానికి ప్రయత్నిస్తే నేను బుద్ధిహీనంగా వ్యవహరించినట్లవుతుంది. నేను పరిస్థితులు కోరుతున్నదానికన్న తక్కువ ధ్రువపర్చి లేదా సత్యం నిర్దేశిస్తున్న దానికన్న ఎక్కువ ధ్రువపర్చి క్రీస్తు చెప్పిన ఈ మాటలకు విరుద్ధంగా పాపం చేయనీయవద్దు” (“మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న - నా తండ్రి యెదుట నేనును ఎరుగనందును” మత్తయి 10:33 ” ఓ రాజా, ఈ కారణంగా దైవ వాక్యానికి ద్రోహం జరగకుండా సమాధానం చెప్పేందుకుగాను నాకు సమయం ఈయవలసిందిగా మిమ్మల్ని వినయంగా అర్ధిస్తున్నాను.” డి అబినే, పుస్త 7, అధ్యా 8.GCTel 137.1

    ఈ మనవి చేయటంలో లూథర్ తెలివిగా వ్యవహరించాడు. లూథర్ వ్యవహరించిన తీరును బట్టి ఆయన ఉద్రేకంగా గాని ఉద్వేగంగాగాని మెలగలేదని ఆ సభ గుర్తించింది. జంకు కొంకు లేని, రాజీపడని వ్యక్తిగా పేరు పొందిన లూథర్ లో అలాంటి నిశ్చలత ఆత్మనిగ్రహం తన శక్తిని అధికం చేసి అనంతరం తన విరోధుల్ని నిరుత్సాహపర్చి వారికి శృంగ భంగం కలిగించే విధంగా విజ్ఞతతో నిర్ణయాత్మకతతో, వివేకంతో హుందాతనంతో సమాధానం చెప్పటానికి ఆయనకు సామర్థ్యాన్ని చేకూర్చాయి.GCTel 137.2

    తన చివరి సమాధానం ఇచ్చేందుకు ఆ మరుసటిరోజు ఆయన సభకు హాజరు కావాల్సి వున్నాడు. సత్యానికి వ్యతిరేకంగా జతకట్టిన శక్తుల గురించి ఆలోచించినప్పుడు ఆయనకు కాస్త నిరుత్సాహం కలిగింది. ఆయన విశ్వాసం సన్నగిల్లింది. ఆయనకు భయము వణకు పుట్టాయి. ఆయన ముందున్న అపాయాలు అధికమయ్యాయి. శత్రువులు గెలుపు సాధిస్తున్నట్లు కనిపించింది. చీకటి శక్తులదే పైచేయిగా కనిపించింది. ఆయనను మేఘాలు ఆవరించి తనని దేవునికి దూరం చేసినట్లు అనిపించింది. సైన్యాలకు అధిపతి అయిన యెహోవా తనతో ఉన్నాడన్న నిశ్చయత కోసం ఆయన ఎదురు చూశాడు. హృదయవేదనతో నేలమీద పడి క్రీస్తు మాత్రమే గ్రహించగల హృదయవిదారక దుఃఖాన్ని వెలిబుచ్చాడు.GCTel 137.3

    “సర్వశక్తుడవు నిత్యుడవు అయిన దేవా, ఈ లోకం ఎంత భయంకరమైందో చూశావా? అది మింగటానికి నోరు తెరచింది. నీమీద నాకున్న విశ్వాసం అంతంత మాత్రమే... నా నమ్మకాన్ని ఈ లోకం మీదే పెుకోవలసి ఉంటే అంతా అయిపోయినట్లే...నా చివరి క్షణం వచ్చింది. నా శిక్ష ప్రకటితమయ్యింది... ఓ దేవా ఈ లోక జ్ఞానానికి వ్యతిరేకంగా నాకు సహాయమందించు. నీవే ఇది నాకు చేయి... ఇది నాపని కాదు నీది. ఇక్కడ నాకు పనేమీ లేదు. లోకంలోని ఈ గొప్ప వ్యక్తులతో నేను పోరాడవలసిందేమీలేదు... ఈ కార్యం నీది ... ఇది నీతిమంతమైన... నిత్యకాలికమైన కార్యం. ఓ ప్రభువా నాకు సహాయం చేయి. నమ్మకమైన మార్పులేని దేవా, నా నమ్మకం మరే మానవుడి మీదా లేదు. మానవుడికి చెందిన సమస్తమూ అనిశ్చితం. మానవుడి వద్దనుంచి వచ్చే సమస్తం విఫలమవుతుంది... ఈ పనికి నీవు నన్ను ఎంపికచేసుకొన్నావు. నీ ప్రియ కుమారుడు క్రీస్తు నిమిత్తం నా పక్క నిలబడు. క్రీస్తే నా కవచం, నా డాలు, నా ఆశ్రయ దుర్గం” అదే పుస్తకం, పుస్త 7, అధ్యా 8.GCTel 138.1

    లూథర్ తన ముందున్న అపాయాన్ని గుర్తించటానికి సర్వజ్ఞాని అయిన దేవుడు అనుమతించాడు. తన స్వశక్తిని నమ్ముకొని మూర్ఖంగా అపాయంలో పడకుండా ఉండటానికి దేవుడు దాన్ని అనుమతించాడు. త్వరలోనే సంభవించబోతున్నట్లు కనిపించి నందున అది ఆయనకు భయం పుట్టించింది. వ్యక్తిగతమైన బాధగాని, హింసగాని, మరణాన్ని గూర్చిన భీతిగాని కాదు. ఆయన క్లిష్ట సమయానికి వచ్చాడు. దాన్నెదుర్కొనే సామర్థ్యం తనకులేదని గుర్తించాడు. తన బలహీనతవల్ల సత్యసంబంధమైన కృషి దెబ్బతింటుందేమోనని భీతిల్లాడు. తన క్షేమం నిమిత్తం కాదు సువార్త విజయం కోసం ఆయన దేవునితో పోరాడాడు. ఆ రాత్రి ఆ ఏకాంతపురేవు పక్క, పెనుగులాటలో యాకోబుకు కలిగిన వేదన లాంటిదే లూథర్ ఆత్మలో లేచిన వేదన సంఘర్షణ. యాకోబులాగే ఆయన దేవునితో పోరాడి గెలిచాడు. తన నిస్సహాయ స్థితిలో ఆయన విశ్వాసం విమోచకుడైన క్రీస్తుపై స్థిరంగా నిలిచింది. ఆ సభముందు ఒంటరిగా నిలువబోను అన్న నిశ్చయత ఆయనకు బలం చేకూర్చింది. తన ఆత్మలో మళ్లీ శాంతి నెలకొంది. రాజ్యపాలకుల ముందు దైవవాక్యాన్ని ఘనపర్చటానికి అనుమతి లభించినందుకు సంతోషించాడు.GCTel 138.2

    దేవుని మీద నమ్మకం పెట్టుకొని తన ముందున్న పోరాటం కోసం లూథర్ సిద్ధపడ్డాడు. తన సమాధానానికి ప్రణాళిక రూపకల్పన చేసుకొన్నాడు. తన రచనల్లోని భాగాలను సమీక్షించుకొన్నాడు. తన అంశాల్ని సమర్ధించుకోటానికి లేఖనాల నుంచి తగిన నిదర్శనాలను సేకరించుకొన్నాడు. అనంతరం తన ముందు తెరచి ఉన్న పరిశుద్ధ గ్రంధం మీద తన ఎడమ చేయి ఉంచి తన కుడిచేతిని ఆకాశంవేపుకు ఎత్తి “సువార్తకు నమ్మకంగా నిలుస్తానని తన విశ్వాసాన్ని స్వేచ్ఛగా ప్రకటిస్తానని అవసరమైతే తన సాక్ష్యాన్ని తన రక్తంతో ఖరారుచేసుకుంటానని” ప్రమాణం చేశాడు. అదే పుస్తకం, పుస్త 7, అధ్యా 8.GCTel 139.1

    మళ్లీ విధాన సభ ముందుకి వెళ్లినప్పుడు ఆయన ముఖంలో భయంగాని, కలపరంగాని కనిపించలేదు. ప్రపంచంలోని గొప్ప వ్యక్తుల మధ్య దేవుని సాక్షిగా నిర్మలంగా, ప్రశాంతంగా, ధైర్యంగా ఉదాత్తంగా లూథర్ నిలబడి ఉన్నాడు. తన సిద్ధాంతాలను ఉపసంహరించుకొనే విషయంలో తన తీర్మానాన్ని ప్రకటించాల్సిందంటూ ప్రభుత్వాధికారి డిమాండ్ చేస్తున్నాడు. తన జవాబును లూథర్ దీన స్వరంతో కోపతాపాలుగాని ఉద్రేకంగాని లేకుండా ఇచ్చాడు. ఆయన వినయ మర్యాదలతో వ్యవహరించాడు. అయినా ఆయనలో మూర్తీభవించిన విశ్వాసం, ఆనందం సభను విస్మయపర్చింది.GCTel 139.2

    “చక్రవరుల్లారా, సామంతరాజుల్లారా, లార్డుల్లారా, నిన్న నాకు జారీ అయిన ఆదేశం మేరకు ఈ రోజు మీ ముందు హాజరయ్యాను. చక్రవర్తుల వారు, ఘనత వహించిన సామంతరాజులు, లార్డులు న్యాయమైన, యధార్ధమైన నా విన్నపాన్ని సానుభూతితో ఆలకించవలసిందిగా మనవి. నేను అజ్ఞానం వల్ల న్యాయస్థాన సంప్రదాయాలను మర్యాదలను అతిక్రమిస్తే నన్ను క్షమించుమని వేడుకొంటున్నాను. నేను రాజుల భవనాల్లో పెరిగిన వాణ్ణి కాను. సన్యాసి ఆశ్రమంలో పెరిగిన వాణ్ణి ” అన్నాడు లూథర్. - అదే పుస్తకం, పుస్త 7, అధ్యా 8.GCTel 139.3

    ప్రశ్నల్ని ప్రస్తావిస్తూ తన ప్రచురిత గ్రంథాలన్నీ ఒకే రకమైనవి కావని లూథర్ తెలిపాడు. కొన్ని గ్రంథాల్లో విశ్వాసం పనుల గురించి చర్చించానని అవి హానికరమైనవి కాకపోటమేకాక ఎంతో సహాయకర గ్రంథాలని తన శత్రువులు సహితం ఒప్పుకొంటున్నారని చెప్పి వీటిని ఉపసంహరించుకోటం అందరూ నమ్ముతున్న సత్యాన్ని ఖండించటమౌతుందన్నాడు. రెండో వర్గానికి చెందిన రచనలు పోపుల అవినీతిని, దురాచారాలను బహిర్గతం చేసేవి. ఈ గ్రంథాల్ని ఉపసంహరించుకోటం రోము నిరంకుశత్వాన్ని సమర్పించి తద్వారా అనేక తీవ్ర పాపాలకు ద్వారాలు తెరవటమవుతుంది. మూడో వర్గానికి చెందిన పుస్తకాల్లో అప్పుడు ఆచరణలో ఉన్న దుష్కృతాలను సమర్ధిస్తున్న వ్యక్తుల్ని లూథర్ వ్యతిరేకించాడు. వీటి విషయంలో తాను కొంచెం ఎక్కువ కటువుగా ఉన్నట్లు లూథర్ ఒప్పుకున్నాడు. తనలో తప్పులు లేవని ఆయన అనలేదు. వీటిని కూడా ఉపసంహరించుకోటానికి లూథర్ ఇష్టపడలేదు. ఆ చర్య సత్యం పట్ల శత్రుత్వం ప్రదర్శిస్తున్న వారిని బలపర్చుతుందని వారు దీన్ని ఆసరా చేసుకొని మరింత దౌర్జన్యంగా దైవ ప్రజలను నాశనం చేస్తారని ఆయన అభిప్రాయ పడ్డాడు.GCTel 139.4

    లూథర్ ఇలా అన్నాడు, “నేను మానవుణ్ణి, దేవుణ్ణి కాదు. క్రీస్తు తన్ను తాను ఇలా సమర్ధించుకొన్నట్లు ‘నేను కానిమాట ఆడిన యెడల ఆ కానిమాట ఏదో చెప్పుము”. నేను కూడా నన్ను నేను సమర్ధించు కొంటాను... ఘనమైన చక్రవర్తీ, ప్రసిద్ధిగాంచిన సామంత రాజుల్లారా, ఆ యా స్థాయిలలో ఉన్న పురజనులారా నేను తప్పు చేసినట్లు ప్రవక్తలు, అపోస్తలుల రచనల నుంచి నిరూపించవలసిందిగా దేవుని కృపను బట్టి మిమ్మల్ని వేడుకొంటున్నాను. ఇది నిరూపితమైన వెంటనే ప్రతి తప్పునూ ఉపసంహరించుకోటంలో నా పుస్తకాలన్నింటినీ తెచ్చి మంటల్లో పారేయటంలో నేను మొదటివాడినౌతాను.GCTel 140.1

    “ఏ అపాయాలకు నన్నునేను గురిచేసుకొంటూ ఇలా చేస్తున్నానో, వాటిని, జాగ్రత్తగా పరిగణించే చేస్తున్నానని నేను ఇప్పుడే చెప్పిన మాటలను బట్టి స్పష్టంగా బోధపడుతున్నది. కాగా నిరాశ చెందే బదులు పూర్వకాలంలోలాగే ఇప్పుడు కూడా సువార్త శ్రమలకు విభేదాలకు హేతువవుతున్నదని నేను ఆనందిస్తున్నాను. దైవవాక్య స్వభావం, దైవవాక్య ధ్యేయం ఇదే, ‘ఖడ్గమునేగాని, సమాధానమును పంపుటకు నేను రాలేదు’ అన్నాడు. యేసుక్రీస్తు. దేవుని ఉపదేశాలు ఆశ్చర్యకరమైనవి. భయంకరమైనవి. విభేదాలను రూపుమాపుతున్నామని భావించి దేవుని పరిశుద్ధ వాక్యాన్ని హింసించి ప్రస్తుత ప్రమాదాలు, నిత్యనాశనం రూపంలో అధిగమించలేని భయంకర అపాయాల ఉప్పెనను మీ పైకి మీరే తెచ్చుకోకుండా జాగ్రత్త పడండి... దైవ లేఖనాలనుంచి ఎన్నో సాదృశ్యాలను ఉటంకించగలను. ఫరోలు, బబులోను రాజులు, ఇశ్రాయేలు రాజుల గురించి మాట్లాడవచ్చు. జ్ఞానయుక్తంగా కనిపించిన హితవాక్యాల ద్వారా తమ రాజ్యాన్ని బలోపేతం చేసుకోటానికి వారు ప్రయత్నించినప్పుడు ఆ ప్రయత్నాలు వారి వినాశనానికే ఎక్కువ తోడ్పడ్డాయి. దేవుడు పర్వతాలను తొలిగిస్తాడు. అది వారికి తెలియదు.” అదే పుస్తకం, పుస్త 7, అధ్యా 8.GCTel 140.2

    లూథర్ జర్మను భాషలో మాట్లాడాడు. అదే లేటెస్లో చెప్పాలని కోరారు. అప్పటిదాకా మాట్లాడి బాగా అలసిపోయినప్పటికీ దాని కంగీకరించి మళ్లీ అదే స్పష్టతతో ఉద్రేకంతో ఆయన లేటిన్లో మాట్లాడాడు. ఈ కార్యంలో ఆయనను దేవుడు నడిపించాడు. సామంతరాజుల మనసుల్ని తప్పుడు బోధనలు గుడ్డి నమ్మకాలు ప్రభావితం చేసినందున మొదటిసారి లూథర్ వాదనలోని హేతుబద్ధతను వారు గుర్తించలేదు. అయితే వాటిని తిరిగి చెప్పటం వల్ల ఆ విషయాల్ని వారు స్పష్టంగా గ్రహించారు.GCTel 141.1

    వెలుగును చూడకుండా మూర్ఖంగా కళ్లు మూసుకొని సత్యాన్ని గుర్తించ కూడదని తీర్మానించు కొనేవారు లూథర్ శక్తిమంతమైన మాటలు విని కోపోద్రిక్తులయ్యారు. ఆయన మాటలాడి కూర్చున్న వెంటనే విధాన సభాపతి కోపంగా ఇలా అన్నాడు, “నీకు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పనేలేదు... నీవు స్పష్టమైన సంక్షిప్తమైన సమాధానాలు ఇవ్వాల్సి ఉన్నావు. నీవు ఉపసంహరించు కొంటావా? ఉపసంహరించుకోవా?”GCTel 141.2

    సంస్కర్త ఇలా సమాధానం ఇచ్చాడు, “చక్రవర్తి, ఉన్నతాధికారులు నావద్దనుంచి స్పష్టమైన, సరళమైన, క్లుప్తమైన జవాబు కోరుతున్నారు గనుక అలాగే చెబుతాను. నా సమాధానం ఇది. నా విశ్వాసాన్ని పోపుకుగాని, సభలకుగాని సమర్పించలేను. ఎందుకంటే పోపులు సభలు పొరపాట్లు చేయటం పరస్పరం విరుద్ధంగా మాటలాడటం తరచుగా జరుగుతున్నది. కనుక లేఖనాల సాక్ష్యం ద్వారా లేదా స్పష్టమైన హేతువాదం ద్వారా నాకు నమ్మకం ఏర్పడితే తప్ప, నేను ఉల్లేఖించిన వాక్యభాగాల వలన నాకు ప్రేరణ కలిగితే తప్ప, అవి ఇలా దైవ వాక్యం వలన నా అంతరాత్మను బంధిస్తేనే తప్ప నేను ఉపసంహరించుకోలేను. ఉపసంహరించుకోను. ఎందుకంటే క్రైస్తవుడు తన అంతరాత్మకు వ్యతిరేకంగా మాటలాడటం క్షేమంకాదు. నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. నేనింకేమీ చేయలేను. దేవుడు నాకు తోడై ఉండునుగాక. ఆమెన్” అదే పుస్తకం, పుస్త 7, అధ్యా 8.GCTel 141.3

    ఈ నీతిమంతుడు ఇలా దైవ వాక్యమనే సిరమైన పునాది మీద నిలబడి ఉన్నాడు. ఆయన ముఖం పరలోకపు వెలుగుతో ప్రకాశించింది. అబద్ధ బోధనల్ని ఖండించి లోకాన్ని జయించే విశ్వాసం ఔన్నత్యాన్ని గూర్చి సాక్ష్యమిస్తుండగా ఆయన ప్రవర్తన గొప్పతనం పవిత్రత, ఆయన హృదయంలోని శాంతి ఆనందం బహిర్గతమయ్యాయి.GCTel 142.1

    కొంతసేపు ఆ సభ అంతా దిగ్ర్భాంతితో అవాక్కయ్యింది. మొదటి సమాధానం చెప్పే తరుణంలో లూథర్ చిన్న స్వరంతో అణిగి మణిగి మాట్లాడాడు. ఆయన ధైర్యం సడలిపోతుందనటానికి నిదర్శనంగా దీన్ని రోమను మత వాదులు భావించారు. సమయం కోసం వచ్చిన వినతి ఉపసంహరణకు నాందిగా భావించారు. ఒకింత తిరస్కార ధోరణితో సన్యాసి లూథర్ చిక్కిన శరీరం, సాదాదుస్తులు, సామాన్య మాటల తీరు చూసి, ” ఈ సన్యాసి నన్ను ఎన్నడూ సిద్ధాంత వ్యతిరేకిగా తీర్చిదిద్దలేడు.” అన్నాడు చక్రవర్తి చార్లెస్. ఇప్పుడు ఆయన ప్రదర్శించిన ధైర్యం, సైర్యం, శక్తిమంతము స్పష్టము అయిన హేతువాదం అందరినీ ఆశ్చర్యపరిచాయి. అభినందనతోనిండిన చక్రవర్తి ఇలా వ్యాఖ్యానించాడు, “ఈ సన్యాసి నిర్భయ హృదయంతో అచంచల ధైర్యంతో మాట్లాడున్నాడు. ” తమ దేశరాయబారి అయిన లూథర్ వంక జర్మనీ సామంతరాజులు సగర్వంగా ఆనందోత్సాహాలతో చూశారు.GCTel 142.2

    రోము వర్గీయులు ఖంగుతిన్నారు. వారి కృషికి ఆదరణ కరవవుతున్నట్లు కనిపించింది. లేఖనాల మద్దతుతోకాక బెదరింపులతో తమ అధికారాన్ని నిలుపుకోటానికి వారు ప్రయత్నించారు. అదే రోము వాదనా విధానం. విధాన సభాపతి ఇలా అన్నాడు, ” నీవు ఉపసంహరించుకోకపోతే చక్రవర్తి, ఈ సామ్రాజ్యంలోని రాష్ట్రాలు బాగుపర్చ వీలులేని సిద్ధాంత వ్యతిరేకుల విషయంలో ఏ చర్య చేపట్టాలో ఆలోచిస్తాడు.”GCTel 142.3

    ఉదాత్తమైన ఆ ప్రతివాదనను ఉత్సాహోద్రేకాలతో విన్న లూథర్ మిత్రుల్ని ఈ మాటలు భయాందోళనలతో నింపాయి. అయితే లూథర్ శాంతంగా ఇలా అన్నాడు, “నాకు అండగా దేవుడే ఉంటాడు, ఎందుకంటే నేను ఉపసంహరించుకోనేది ఏమీలేదు.” అదే పుస్తకం, పుస్త 7, అధ్యా 8.GCTel 142.4

    సావుంత రాజులు సంప్రదించుకొనే తరుణంలో లూథర్ సభనుంచి నిష్క్రమించాల్సిందిగా ఆదేశించారు. గొప్ప సంక్షోభం ఏర్పడిందని భావించారు. లొంగుబాటుకి లూథర్ నిరంతరం తిరస్కరించటం యుగాల పర్యంతం సంఘ చరిత్రకు విఘాతం కలిగించవచ్చు. ఉపసంహరించుకోటానికి ఆయనకు మరో తరుణం ఇవ్వాలని తీర్మానించారు.GCTel 142.5

    విధాన సభ ముందు లూథర్ ని చివరిసారిగా హాజరు పర్చారు. తన సిద్ధాంతాన్ని ఉపసంహరించుకొంటావా లేదా అని మళ్లీ ఆయనను ప్రశ్నించారు. “క్రితం చెప్పిన సమాధానంకన్న వేరే సమాధానం నావద్దలేదు” అన్నాడాయన. రోము ఫర్మానాకు ఆయన లొంగేటట్లు చేయటానికి వాగ్దానాలుగాని, బెదరింపులుగాని పని చేయవని స్పష్టమయ్యింది.GCTel 143.1

    రాజులను సామంత రాజులను గజగజలాడించిన తమ అధికారం ఒక సామాన్య సన్యాసిచేత భంగపడటం పోపు నేతలు జీర్ణించుకోలేక పోయారు. తనను హింసించి తన జీవితం దుర్భరం చేయటం ద్వారా ఆయనకు తమ ఉగ్రతను చవి చూపించాలని వారు భావించారు. అయితే తన ముందున్న అపాయాన్ని గుర్తించిన లూథర్ అందరితోను క్రైస్తవ మర్యాదతో, ప్రశాంతతో మాట్లాడాడు. ఆయన మాటల్లో దర్పం, ఉద్రేకం, వక్రీకరణ ధోరణి లేనేలేవు. ఆయన తన్నుతాను మర్చిపోయాడు. తన చుట్టూ ఉన్న గొప్పవారిని మర్చిపోయాడు. పోపులు, ప్రిలేటులు, రాజులు, చక్రవర్తుల కన్నా ఉన్నతుడైన ప్రభువు సమక్షంలో ఉన్నానని గుర్తించాడు. లూథర్ సాక్ష్యం ద్వారా క్రీస్తు మాట్లాడాడు. అవి శక్తిమంతమైన, ఉత్తమమైన మాటలు. అవి మిత్రులను శత్రువులను ఆ సమయంలో సంభ్రమాశ్చర్యాలతో నింపాయి. ఆ సభలో దేవుని ఆత్మ ఉండి ఆ సామ్రాజ్యనేతల హృదయాల్ని ప్రభావితం చేశాడు. పలువురు సామంతరాజులు లూథర్ చెబుతున్నది హేతుబద్యమైందని ధైర్యంగా ఒప్పుకొన్నారు. అనేకులు సత్యాన్ని గుర్తించారు. అయితే కొందరి విషయంలో ఆ అభిప్రాయాలు ఎక్కువకాలం నిలువలేదు. ఇంకొక తరగతి ప్రజలున్నారు. వారు ఆ సమయంలో తమ నమ్మకాల్ని వ్యక్తపర్చలేదు గాని, లేఖనాన్ని స్వయంగా పరిశోధించిన మీదట భవిష్యత్ లో వారు నిర్భయంగా సంస్కరణకు మద్దతుపలికాడు.GCTel 143.2

    విధాన సభముందు లూథర్ హాజరు కావాలని ఓటరు ఫ్రెడ్రిక్ ఎంతో ఆశతో ఎదురుచూశాడు. ఆ సభలో లూథర్ మాట్లాడినప్పుడు ఫ్రెడ్రిక్ ప్రగాఢ ఉద్రేకంతో విన్నాడు. డాక్టర్ లూథర్ ప్రదర్శించిన ధైర్య సాహసాలను, సైర్యాన్ని, ఆత్మనిగ్రహాన్ని, తన ప్రతివాదనలో మరింత బలంగా నిలవాలన్న తన తీర్మానాన్ని అతను సంతోషంతోను సగర్వంగాను తిలకించాడు. ఆ పోటీలోని వివిధ పక్షాల నడుమ ఉన్న తేడాలను అతను గుర్తించాడు. పోపులు, రాజులు, ఏలేటుల వివేకం లేఖనాల శక్తి ముందు నిరర్ధకమయ్యింది. పోపుల అధికారం పరాజయం పాలయ్యింది. ఇది అన్ని యుగాలలోని అన్ని జాతుల ప్రజలను ప్రభావితం చేయనున్నది.GCTel 143.3

    లూథర్ వాదన పర్యవసానాన్ని గ్రహించిన పోపు ప్రతినిధి రోము అధికారం భద్రత విషయంలో ఎంతో భీతిల్లి సంస్కర్త వినాశనానికి శక్తి వంచనలేకుండా కృషి చేస్తానని శపధం చేశాడు. వాక్చాతుర్యానికి రాజకీయ విజ్ఞతకు పోపు దూత పేరుగాంచిన వ్యక్తి అయినప్పటికీ కొరగాని ఒక సన్యాసి మూలంగా శక్తిమంతమైన రోము మతాధినేత స్నేహాన్ని మద్దతును చేజార్చిన మందమతిగా అపాయానికి ప్రతీకగా యువ చక్రవర్తి దృష్టిలో మిగిలాడు.GCTel 144.1

    అతడి మాటలు వట్టిమాటలు కావు. లూథర్ సమాధానం ఇచ్చిన మరుసటిరోజు చార్లెస్ విధాన సభకు ఒక వర్తమానం పంపాడు. కథోలిక్ మతాన్ని ఆచరించి దాన్ని సమర్దించటమన్న తన ముందు రాజుల విధానాన్నే తానూ అనుసరించటానికి నిశ్చయించుకొన్నట్లు ప్రకటించాడు. తన దోషాలను విడనాడటానికి లూథర్ నిరాకరించాడు. గనుక ఆయనను ఆయన బోధిస్తున్న సిద్దాంత వ్యతిరేక బోధలను అడ్డుకోటానికి కఠిన చర్యలు చే పట్టటం అవసరం. “తన మూర్యత్వాన్ననుసరించి ఒక సన్యాసి క్రైస్తవలోకం విశ్వాసానికి వ్యతిరేకంగా లేచాడు. అలాంటి అధర్మశీలతను ఆపటానికి నా రాజ్యాలను, నా ధనాగారాలను, నా మిత్రులను, నా శరీరాన్ని, నా రక్తాన్ని, నా ఆత్మను, నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను. అగస్టిస్ వాద లూథర్ ని బర్త్ రఫ్ చేసి ప్రజల మధ్య అశాంతి సృష్టించవద్దని ఆదేశించబోతున్నాను. ఆ తర్వాత ఆయనపైన ఆయన అనుచరులపైన సిద్ధాంత వ్యతిరేకులుగా వెలివేత, నిషేధం వంటి చర్యలు చేపడతాను. వారిని నాశనం చేయటానికి అవసరమైన ప్రతి సాధనాన్ని ఉపయోగిస్తాను. నమ్మకమైన క్రైస్తవులుగా మసలుకోవలసిందిగా రాష్ట్రాలలోని సభ్యులందరికి పిలుపునిస్తాను” అదే పుస్తకం, పుస్త 7, అధ్యా 9. ఏదేమైనా లూథర్ కిచ్చిన సురక్షిత ప్రయాణహామీ అమలవుతుందని తనపై చర్య ప్రక్రియ ప్రారంభంకాక ముందు ఆయన సురక్షితంగా తన నివాసం చేరాలని చక్రవర్తి ప్రకటించాడు.GCTel 144.2

    విధానసభ సభ్యుల్లో రెండు పరస్పర విరుద్ధాభిప్రాయాలున్నాయి. పోపు దూతలు ప్రతి నిధులు లూథర్ కి ఇచ్చిన సురక్షిత ప్రయాణహామీ అమలు పర్చకూడదని డిమాండ్ చేశారు. “ఒక శతాబ్దం కిందట జాన్వాస్ బూడిదను అంుకొన్నట్లు లూథర్ బూడిదను రైన నది అందుకోవాలని” అన్నారు వారు. అదే పుస్తకం, పుస్త 7, అధ్యా 9. పోతే జర్మనీ సామంత రాజులు పోపు మతవాదులు, లూథర్ ప్రత్యర్థులూ అయిన కొందరు అలాంటి బహిరంగ నమ్మకద్రోహాన్ని వ్యతిరేకించారు. ఆ చర్య దేశ గౌరవ ప్రతిష్టలపై మాయని మచ్చగా నిలుస్తుందని విమర్శించారు. హస్ మరణానంతరం చోటుచేసుకొన్న దుర్ఘటనలను ప్రస్తావించి జర్మనీ మీదకు, తమ యువచక్రవర్తి తలమీదకు ఆ భయానక దుర్ఘటనలు మళ్లీ రావాలని తాము కోరుకోటం లేదని గళమెత్తారు.GCTel 144.3

    ప్రధాన ప్రతిపాదనకు సమాధానమిస్తూ చార్లెస్ చక్రవర్తి ఇలా అన్నాడు, “లోకం అంతటిలో నుంచి గౌరవం విశ్వాసం బహిష్కృతమైనప్పటికీ వాటికి సామంతరాజుల హృదయాల్లో మాత్రం ఆశ్రయం లభించాలి.” అదే పుస్తకం, పుస్త 1, అధ్యా 9. సిగ్మండ్ హను సంఘం దయాదాక్షిణ్యాలకు ఎలా విడిచి పెట్టాడో అలాగే తానూ సంస్కర్తతో వ్యవహరించాలని లూథర్ బద్ద విరోధులైన పోపు నేతలు చక్రవర్తిని అభ్యర్థించారు. బహిరంగ సభలో హస్ తన సంకెళ్లను చూపుతూ తన భ్రష్ట విశ్వాసం గురించి చక్రవర్తికి జ్ఞాపకం చేసిన సంగతి మననం చేసుకుంటూ చార్లెస్ V ఇలా అన్నాడు, “సిగిస్మండ్ సిగ్గుపడ్డట్టు నేను సిగ్గుపడసు” లెస్ట్, సం 1, పుట 42.GCTel 145.1

    లూథర్ అందించిన సత్యాన్ని చార్లెస్ కావాలని విసర్జించాడు. “నా పూర్వికుల ఆదర్శాన్ని అనుసరించటానికి నేను దృఢంగా తీర్మానించుకొన్నాను.” అని చక్రవర్తి రాశాడు.- డి అబినే, పుస్త 7, అధ్యా 9. సత్యం విషయంలో నీతి మార్గాల్లో నడిచే విషయంలో సహితం ఆచారం బాట నుంచి తప్పుకోకుండా ఉండాలని నిశ్చయించుకొన్నాడు.GCTel 145.2

    తన పూర్వికులు పోపు మతాన్ని ఆదరించారు కాబట్టి తాను కూడా క్రూరత్వం అవినీతితో నిండిన ఆ మతాన్ని సమర్పించటానికి పూనుకొన్నాడు చార్లెస్. తన పూర్వికులు నమ్మిన సత్యాలకు అదనంగా వచ్చిన సత్యాల్ని అంగీకరించకూడదని పెట్టుకొన్నాడు. వారు నిర్వహించని ఏ విధిని తాను నిర్వహించకూడదని నిశ్చయించుకొన్నాడు.GCTel 145.3

    తమ తండ్రుల ఆచారాలను సంప్రదాయాలను గట్టిగా పట్టుకొని ఉండేవారు నేడు అనేకులున్నారు. ప్రభువు వద్దనుంచి అదనపు వెలుగు వస్తే వారు దాన్ని నిరాకరిస్తారు. కారణమేంటంటే అది తమ పూర్వికులు నమ్మిన సత్యం కాదు. మన పెద్దలు జీవించిన కాలంలో మనం లేము. కనుక మన విధులు బాధ్యతలు వారి విధులు, బాధ్యతల వంటివి కావు. మనకై మనం దైవ వాక్యాన్ని పరిశోధించే బదులు మన విధులేంటో తెలుసుకోటానికి మన తండ్రుల మాదిరి కోసం మనం చూడటం దేవుని చిత్తం కాదు. మన బాధ్యత మన పూర్వికుల బాధ్యత కన్న ఉన్నత మైనది. వారు పొంది మనకు స్వాస్థ్యంగా అందించిన సత్యానికి మనం జవాబు దారులం. ఇప్పుడు దైవ వాక్యం నుంచి మనపై ప్రకాశిస్తున్న అదనపు వెలుగు నిమిత్తం కూడా మనం జవాబుదారులం.GCTel 145.4

    విశ్వసించని యూదుల గురించి క్రీస్తు ఇలా అన్నాడు, ” నేను వారికి బోధింపకుండిన యెడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు.” యోహాను 15:22. అదే దైవశక్తి లూథర్ ద్వారా జర్మనీ చక్రవర్తితోను సామంత రాజులతోను మాట్లాడింది. దైవ వాక్యం నుంచి వెలుగు ప్రకాశిస్తుండగా ఆ సభలోని అనేకమందితో ఆయన ఆత్మ చివరిసారిగా మాట్లాడాడు. శతాబ్దాల పూర్వం లోకరక్షకునికి వ్యతిరేకంగా తన కళ్లను మూసివేయటానికి గర్వాన్ని ప్రజాదరణను అనుమతించినట్లు, భయంతో వణుకుతున్న ఫెలిక్స్ తనకు సత్యాన్నందిస్తున్న దూతతో ఇలా అన్నట్లు “ఇప్పటికి వెళ్లుము నాకు సమయమైన నిన్ను పిలువనంపింతును” గర్విష్టుడైన అగ్రిప్ప ఇలా ఒప్పుకొన్నట్లు “ఇంత సులభముగా నన్ను, క్రైస్తవుని చేయజూచుచున్నావే” (అపో. 24:25, 26:28.) అయినా దేవుడు పంపిన దూత నుంచి దూరంగా వెళ్లిపోయినట్లు చార్లెస్ V గర్వానికి కుయుక్తికి లోనై సత్యకాంతిని విసర్జించటానికి తీర్మానించు కొన్నాడు.GCTel 146.1

    లూథర్ ని మట్టు పెట్టటానికి దురాలోచనలు సాగుతున్నవన్న పుకార్లు వ్యాపించగా నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంస్కర్తకు చాలామంది మిత్రులయ్యారు. తన దురాగతాలను బహిర్గతం చేయటానికి సాహసిం వారిపట్ల రోము క్రూరత్వాన్ని ఎరిగిన ఆ మిత్రులు లూథర్ మరణించకూడదని తీర్మానించుకొన్నారు. ధనిక వర్గానికి చెందిన వందలాది మంది ఆయనను పరిరక్షించటానికి పూనుకొన్నారు. రాజు వర్తమానం రోము నియంత్రణ శక్తికి లొంగిపోయి పంపినదని చాలామంది విమర్శించారు. ఇళ్లగేటుల తలుపులమీద, బహిరంగ స్థలాల్లో ప్రకటనలు అంటించారు. కొన్ని లూథర్ ని ఖండిస్తుంటే కొన్ని ఆయనను సమర్ధిస్తున్నాయి. ఒక ప్రకటనలోని మాటలు జ్ఞాని సొలోమోను రాసిన ఈ మాటలు, “దేశమా, దాసుడు నీకు రాజైయుండుట... నీకుఅశుభము” ప్రసంగి 10:16. లూథర్ కి అన్యాయం జరిగితే అది దేశంలోని శాంతి భద్రతలకు విఘాతం కలిగించి చక్రవర్తి సింహాసనాన్నే అస్థిరపర్చవచ్చని జర్మనీ అంతటా లూథర్ పట్ల పెల్లుబుకుతున్న ప్రజాదరణను బట్టి చక్రవర్తికి విధానసభకు అర్ధమయ్యింది.GCTel 146.2

    సేక్సనికి చెందిన ఫ్రెడ్రిక్ సంస్కర్త పట్ల తన సానుభూతి బైటపడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఎక్కువ మాట్లాడకుండా ఉంటూ జాగ్రత్తగా ఆయనను కాపాడుతూ ఆయన కదలికల్ని ఆయన శత్రువుల కదలికల్ని నిత్యమూ కనిపెడూ ఉన్నాడు. ఇలాగుండగా కొందరు లూథర్ పట్ల తమ సానుభూతిని బహిరంగంగా కనపర్చారు. సామంతరాజులు, కౌంటులు, బేరన్లు, మతాధికారుల్లోను సభ్యుల్లోను ప్రముఖ వ్యక్తులు లూథర్ ని సందర్శించారు. వచ్చిన సందర్శలకు డాక్టర్ లూథర్ చిన్నగది చాలేదికాదు” అని సలాటిన్ రాశాడు. మార్టిన్, సం 1, పుట 404. ప్రజలు ఆయనను ఒక మానవాతీత వ్యక్తివలె చూసేవారు. ఆయన సిద్ధాంతాలను నమ్మని వ్యక్తులు కూడా తన అంతరాత్మ ప్రబోధాన్ని అతిక్రమించే బదులు మరణానికి సాహసించిన ఆయన సమున్నత చిత్తశుద్ధిని అభినందించారు.GCTel 147.1

    రోముతో లూథర్ రాజీ కోసం ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. సంఘ తీర్మానాన్ని సభల తీర్పుని కాదని తన సొంత అభిప్రాయలపై ఆధారపడితే సామ్రాజ్యం నుంచి బహిష్కృతి పొంది భద్రత లేకుండా నివసించాల్సి వస్తుందని ధనిక వర ప్రముఖులు సామంత రాజులు లూథర్ కి సలహా చెప్పారు. దీనికి లూథర్ సమాధానం ఇది. ‘‘బాధకలిగించకుండా సువార్తను ప్రకటించటం సాధ్యం కాదు... కనుక అపాయ భీతి ప్రభువు నుంచి దివ్యసత్య వాక్యం నుంచి నన్ను ఎందుకు దూరం చేయాలి? అది జరగదు. దానికి బదులు నా శరీరాన్ని, నా రక్తాన్ని, నా ప్రాణాన్ని ఒదులుకొంటాను” డి అబినే, పుస్త 1, అధ్యా 10.GCTel 147.2

    చక్రవర్తి తీర్పుకు తన్నుతాను అప్పగించుకోమ్మని అప్పుడు తాను దేనికీ భయపడాల్సిన పని వుండదని మళ్లీ విజ్ఞప్తి వచ్చింది. “చక్రవర్తి, సామంతరాజులు, అతి సాధారణ క్రైస్తవుడు సహా నా రచనల్ని పరిశీలించి తీర్పు చెప్పాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. కాని దానికో షరతుంది. అదేమిటంటే దేవుని వాక్యాన్ని వారు ప్రమాణంగా అంగీకరించాలి. మనుషులు దాన్ని అనుసరించాలి అంతే. నా అంతరాత్మకు దౌర్జన్యాన్ని ప్రతిపాదించకండి. అది లేఖనాలకు బందీ అయివున్నది” అదే పుస్తకం, పుస్త 1, అధ్యా 10.GCTel 147.3

    ఇంకో విజ్ఞప్తికి స్పందిస్తూ ఆయన ఇలా అన్నాడు, “నా సురక్షిత ప్రయాణ హామీ ఉపసంహరణకు అంగీకరిస్తాను. నా దేహాన్ని, నాప్రాణాన్ని చక్రవర్తి చేతుల్లో పెడతాను. దైవ వాక్యాన్ని మాత్రం పెట్టను — ఎన్నటికీ పెట్టను. ” అదే పుస్తకం, పుస్త 7, అధ్యా 10. సర్వసభ తీర్మానాన్ని అంగీకరిస్తానని అయితే ఆ సభ తీర్మానం లేఖనాల ననుసరించి ఉండాలన్న షరతు పాటించాలని ఆయన తెలిపాడు. “పది లక్షల సభల దన్ను ఉన్న పోపు ఎంతమంచి తీర్పరో దైవ వాక్యానికి విశ్వాసానికి సంబంధించినంత వరకు ప్రతి క్రైస్తవుడూ అంతే మంచి తీర్పరి నాకు” మార్టిన్ సం 1, పుట 410. అనుకూలురు ప్రతికూలురు అందరూ ఇక రాజీ ప్రయత్నాలు వ్యర్ధమని గుర్తించారు.GCTel 147.4

    సంస్కర్త ఒక్క విషయంలో లొంగటం జరిగి ఉన్నా సైతాను అతడి అనుచరగణం విజయం సాధించి ఉండే వారే. కాని ఆయన దృఢ వైఖరి వల్లనే సంఘానికి దాస్య విముక్తి కలిగి మెరుగైన నూతన యుగారంభం సాధ్యపడింది. మత విషయాల్లో స్వతంత్రంగా ఆలోచించి వ్యవహరించటానికి సాహసించిన ఈ ఒక్క వ్యక్తి ప్రభావం తన కాలంలోనేగాక భావి తరాల్లోని సంఘంపై లోకంపై ప్రసరించనై ఉన్నది. లోకాంతంవరకు ఇలాంటి అనుభవాలతో బతుకులు వెళ్లదీస్తున్న వారికి ఆయన దృఢత్వం విశ్వసనీయత బలాన్ని చేకూర్చుతాయి. మానవాలోచనలకు, సైతాను ప్రచండ శక్తికి పైగా స్థిరంగా దేవుని శక్తి ప్రాభవాలు నిలిచి ఉన్నాయి.GCTel 148.1

    ఇంటికి తిరిగి వెళ్లిపోవలసిందిగా చక్రవర్తి ఆదేశాలు లూథర్ కి అందాయి. ఈ ప్రకటన వెనువెంటనే తనను దోషిగా నిర్ణయించి శిక్ష విధించటం జరుగుతుందని ఆయనకు తెలుసు. తన మార్గాన్ని బెదరింపు మేఘాలు ఆవరించాయి. కాని వమ్స్ నగరాన్ని విడిచి పెట్టినప్పుడు ఆయన హృదయాన్ని ఆనందం స్తుతిగానం నింపాయి. “స్వయాన సాతానే పోపు కోటను కాపాడున్నాడు కాని క్రీస్తు దాన్ని బద్దలు కొట్టాడు. ప్రభువు తనకన్నా శక్తిమంతుడని సాతానే ఒప్పుకోవలసి వచ్చింది.” అన్నాడు. డి అబినే, పుస్త 1, అధ్యా 11.GCTel 148.2

    అక్కడ నుంచి వెళ్లిన తర్వాత, తన దృఢవైఖరి తిరుగుబాటుగా అపార్ధం కాకుండేందుకు, లూథర్ చక్రవర్తికి ఉత్తరం రాశాడు. “ఘనమైన రాజా, మానవుడు అనుసరించవలసిన దైవ వాక్యం విషయంలో తప్ప మరే విషయంలోను మినహాయింపు లేకుండ గౌరవానికి అగౌరవానికి జీవించటానికి మరణించటానికి నేను మీకు విధేయుడనని చెబుతున్నాను. హృదయాన్ని పరిశోధించే దేవుడే ఇందుకు సాక్షి. ప్రస్తుత జీవితానికి సంబంధించిన విషయాలన్నింటిలో నా స్వామి భక్తి అచంచలమైనది. ఇక్కడ లాభనష్టాలు రక్షణకు ప్రాముఖ్యం కాదు. అయితే నిత్యజీవన సంబంధమైన ఆసక్తులు వచ్చేసరికి మనిషి మరో మనిషికి ఆధీనుడు కాకూడదన్నది దేవుని చిత్తం. ఆధ్యాత్మిక విషయాల పరంగా అట్టి లొంగుబాటు నిజమైన ఆరాధన. అది సృష్టికర్తకు మాత్రమే చెందే ఆరాధన” అన్నాడు. -అదే పుస్తకం, పుస్త 7, అధ్యా 11.GCTel 148.3

    వమ్స్ నగరం నుంచి తిరుగు జరిగిన ప్రయాణంలో లూథర్ పొందిన ప్రజాదరణ అక్కడ నుంచి జరిగిన ప్రయాణంలోకన్న ఎక్కువ ఉత్సాహభరితంగా ఉన్నది. సామంతరాజ్యాల్లో అనేక మతగురువులు నిషిద్ధ సన్యాసికి స్వాగతం పలికారు. చక్రవర్తి ఖండించిన ఆయనను పౌరపాలనాధికారు అభిమానించారు. బోధించాల్సిందిగా విజ్ఞప్తి వచ్చినప్పుడు చక్రవర్తి విధించిన ఆంక్షను తోసిరాజని మళ్లీ ఆయన ప్రసంగ వేదికను అలంకరించాడు. “వాక్యాన్ని గొలుసులతో బంధించటానికి నేను ఎన్నడూ వాగ్దానం చేయలేదు, చేయనుకూడా” అన్నాడు. మార్టిన్, సం 1, పుట 420.GCTel 149.1

    ఆయన వమ్ విడిచిపెట్టి ఎంతోకాలం కాకముందే పోపు మత వాదులు ఆయనకు వ్యతిరేకంగా ప్రభుత్వ శాసనాన్ని జారీ చేయాల్సిందిగా చక్రవర్తిని కోరారు. ఈ శాసనంలో లూథరిని ఈ పదజాలంతో ఖండించారు, “ఇతడు మానవ రూపం దాల్చి సన్యాసి అంగీ తొడుగుకొన్న సాతాను”- డి అబినే, పుస్త 7, అధ్యా 11. తన సురక్షిత ప్రయాణ హామీ కాలావధి ముగిసిన వెంటనే ఆయన పనిని ఆపటానికి చర్యతీసుకోవాలని సిఫార్సు చేయటం జరిగింది. ఆయనకు ఎవరూ ఆశ్రయం, ఆహారం, పానం ఇవ్వటం నిషిద్ధం. మాట ద్వారాగాని క్రియ ద్వారాగాని బహిరంగంగాగాని రహస్యంగాగాని ఆయనకు ఎవరూ సహాయం చేయటం సహకరించటం నిషిద్ధం. లూథర్ ఎక్కడున్నా ఆయనను బంధించి ఆధికారులకు అప్పగించాలి. ఆయన అనుచరులను ఖైదులో వేసి వారి ఆస్తులను స్వాధీనపర్చుకోవాలి. ఆయన రచనలను కాల్చివేయాలి. చివరగా ఈ డిక్రీకి వ్యతిరేకంగా ప్రవర్తించే వారందరు ఇదే శిక్షావిధికి పాత్రులు.” సేక్సనీ, ఓటరు, లూథరు సానుభూతి పరులైన సామంతరాజులు లూథర్ వెళ్లిన వెంటనే వర్మ నుంచి వెళ్లిపోయారు. చక్రవర్తి డిక్రీ విధాన సభ ఆమోదం పొందింది. రోము మతవాదులు ఉత్సాహంతో గంతులు వేశారు. సంస్కరణోద్యమం చతికిల పడిందని భావించారు.GCTel 149.2

    ఈ ప్రమాదకర ఘడియలో తన సేవకుడు తప్పించుకొనే మార్గాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. అప్రమత్తమైన నేత్రం లూథర్ కదలికలు కనిపెడ్తూ ఉంది. యధార్ధమైన ఉదాత్తమైన హృదయం ఆయనను కాపాడేందుకు కృత నిశ్చయంతో ఉంది. లూథర్ మరణమే రోముకు తృప్తినిస్తుందన్నది సుస్పష్టం. ఎవరికీ కనిపించకుండా ఆయనను దాచటమే సింహం కోరలకు చిక్కకుండా ఆయనను పరిరక్షించే మార్గం. సంస్కర్త ప్రాణాల్ని కాపాడేందుకు ప్రణాళికను రచించటానికి సేక్సనికి చెందిన ఫ్రెడ్రిక్ కి దేవుడు వివేకానిచ్చాడు. యధార్ధ మిత్రుల సహకారంతో ఓటరు ఉద్దేశం సాకారమయ్యింది. లూథర్ ని విజయవంతంగా మిత్రులకు శత్రువులకు కనిపించకుండా ఉంచగలిగాడు. గృహం దిశగా జరుగుతున్న ప్రయాణంలో ఆయనను బంధించి సహచరులు మిత్రుల నుంచి విడదీసి, అడవి మార్గం గుండా దూరంగా కొండల మధ్య ఉన్న వార్ట్ బర్గ్ దుర్గానికి హుటాహుటీగా తరలించారు. ఆయనను బంధించటం దాచటం రెండూ మర్మగర్భిత కార్యాలే. ఆయనను ఎక్కడ దాచారో అన్న విషయం ఫ్రెడ్రిక్ కి కూడా చాలా కాలం వరకు తెలియలేదు. ఈ అజ్ఞానం పథకం ప్రకారం చోటు చేసుకొన్నదే. లూథర్ అనుపానులు ఓటరుకు తెలియనంతకాలం అతడు ఏమి బహిర్గతం చేయలేడు. సంస్కర్త సురక్షితంగా ఉన్నాడన్న విషయం అతనికి సంతృప్తి నిచ్చింది. ఈ సమాచారంతో ఆయనకు మనశ్శాంతి కలిగింది.GCTel 149.3

    వసంతకాలం, వేసవికాలం, శరత్కాలం గడిచిపోయి చలికాలం వచ్చింది. లూథర్ ఇంకా బందీగానే ఉన్నాడు. సత్యజ్యోతి ఆరిపోటానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించినప్పుడు ఏలియెండర్ అతడి సహచరులు సంతోషించారు. అయితే దీనికి భిన్నంగా సంస్కర్త తన దివిటీని సత్యనిధి నుంచి నింపుకొంటున్నాడు. దాని కాంతి గొప్ప తేజస్సుతో ప్రకాశింప నుంది.GCTel 150.1

    వార్ట్ బర్గ్ స్నేహపూరిత భద్రత కింద పోరాటం వేడి నుంచి గందరగోళం నుంచి లూథర్ కి కొంతకాలం విశ్రాంతి లభించింది. ప్రశాంత వాతావరణంలో విశ్రాంతి తీసుకొంటూ జీవితం గడపటం ఆయనకు తృప్తినీయలేదు. కార్యకలాపాల మధ్య కఠిన సంఘర్షణ నడుము నివసించిన ఆయన పనీ పాటలేకుండా సాగే జీవితాన్ని సహించలేక పోయాడు. తాను ఒంటరిగా ఉన్న దినాల్లో సంఘ పరిస్థితి తన కళ్లముందు కదలాడింది. నిస్పృహతో ఇలా రోదించాడు, “అయ్యో, ఈ చివరి దినాల్లో ఇశ్రాయేలును రక్షించటానికి ప్రభువు ముందు గోడలా నిలబడటానికి ఎవరూ లేరు. ” - అదే పుస్తకం, పుస్త 9, అధ్యా 2. తన ఆలోచనలు మళ్లీ తన వద్దకే తిరిగి వచ్చాయి. పోటీ నుంచి పిరికిగా వెనుదిరిగాడు అన్న నింద తనమీద పడుతుందేమోనని భయపడ్డాడు. అనంతరం తన సోమరితనానికి, సుఖలాల సత్వానికి తన్నుతాను నిందించుకొన్నాడు. అయినప్పటికీ ఒక్క మనిషి చేయగలిగినదానికన్నా ఎక్కువ పనిని ప్రతీ దినం ఆయన చేస్తూనే ఉన్నాడు. ఆయన కలం ఊరకే ఉన్న రోజులేదు. ఆయనను మాట్లాడకుండా చేశామని తన ప్రత్యర్థులు ప్రగల్భాలు పలుకుతూ ఉండగా ఆయన ఇంకా క్రియాశీలంగా ఉన్నాడని తెలుసుకొని విస్మయం చెందారు. ఆయన రచించిన కరపుస్తకాలు జర్మనీ అంతటా ప్రచారమయ్యాయి. కొత్త నిబంధనను జర్మన్ భాషలోకి అనువదించి తన దేశ ప్రజలకు లూథర్ ఎనలేని సేవ చేశాడు. తన రాతి పత్మాసు నుంచి సువార్త ప్రకటిస్తూ ఆ దినాల్లో ప్రబలుతున్న పాపాల్ని తప్పులను ఖండిస్తూ దాదాపు ఒక సంవత్సరమంతా గడిపాడు.GCTel 150.2

    కాని దేవుడు తన సేవకుడైన లూథర్ ని ప్రజా జీవన రంగం నుంచి మరుగుపరిచింది కేవలం ఆయనను తన శత్రువుల కోపతాపాల నుంచి కాపాడటానికో లేక ఆయనకు ఈ ప్రత్యేక కర్తవ్యాల నుంచి కొంతకాలం విశ్రాంతి నీయటానికో కాదు. ఇంతకన్నా ప్రశస్తమైన ఫలితాలు సాధించాల్సి ఉంది. పర్వతాల నడుమ తన ఏకాంత నివాసంలో మానవ మద్దతుకు ప్రశంసలకు లూథర్ దూరంగా ఉన్నాడు. తరచు విజయం తెచ్చిపెట్టే అహంకారం ఆత్మవిశ్వాసం నుంచి ఇలా లూథర్ ని దేవుడు రక్షించాడు. తాను హఠాత్తుగా చేరుకొన్న ఉన్నత శిఖరాలపై మళ్లీ నడవటానికి, శ్రమలు అవమానాల ద్వారా దేవుడు ఆయనను ఆయత్తం చేస్తున్నాడు.GCTel 151.1

    సత్యం తెచ్చే స్వేచ్ఛలో ఆనందించేటప్పుడు, తప్పుల్ని మూఢనమ్మకాల్ని తొలగించటంలో దేవుడు ఉపయోగించిన వ్యక్తుల్ని మనుషులు ప్రస్తుతించటం జరుగుతుంటుంది. మనుషుల ఆలోచనలను అనురాగాలను దేవుని మీద నుంచి తొలగించి వాటిని మానవ వ్యవస్థల మీద కేంద్రీకరించటానికి సాతాను ప్రయత్నిస్తాడు. దైవ కృత్యాలను నడిపించే హస్తాన్ని ఉపేక్షించి కేవలం మానవ సాధనాలను సన్మానించటానికి అతడు మనుషుల్ని నడిపిస్తాడు. ఇలా ప్రశంసలు, సన్మానాలు అందుకోనే మత నాయకులు తాము దేవుని మీద ఆధారపడ్డామన్న విషయం విస్మరించి తమ్మును తాము నమ్ముకొంటారు. ఫలితంగా వారు ప్రజల మనసుల్ని అంతరాత్మల్ని అదుపుచేయటానికి ప్రయత్నిస్తారు. ప్రజలు మార్గదర్శకత్వం కోసం దేవుని వాక్యాన్ని నమ్ముకొనే బదులు మతనాయకుల్ని నమ్ముకొంటారు. సంస్కరణకు మద్దతు పలికేవారిలో ఇలాంటి స్వభావం చోటు చేసుకోటం వల్ల సంస్కరణ కృషి తరచు కుంటుపడుతుంది. ఆ కార్యంపై మానవుడి ముద్రకాక తన ముద్ర పడాలన్నది దేవుని కోరిక. సత్యవ్యాఖ్యాతగా లూథర్ మీదకే ప్రజల దృష్టితిరిగింది. సత్యానికి కర్త అయిన ప్రభువు మీదనే అందరి దృష్టి కేంద్రీకృతం కావాలని ఆయనను వారి మధ్యనుంచి తొలగించాడు దేవుడు.GCTel 151.2