Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

మహా సంఘర్షణ

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయం 30—మానవుడికి సాతానుకి మధ్య వైరం

    మరియు నీకును సీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదువు” ఆదికా 3:15. మానవుడి పతనం అనంతరం సాతానుపై దేవుడు వెలువరించిన తీర్పు ప్రవచనం కూడా అది. లోకం చివరివరకు సాగే యుగాలన్నింటిలోనూ భూమిపై నివసిస్తున్న నివసించనున్న సకల జాతుల ప్రజలు పాలుపొందబోతున్న మహాసంగ్రామానికి సంబంధించిన ప్రవచనం.GCTel 475.1

    “వైరము కలుగజేసెదను” అంటున్నాడు దేవుడు. వైరం స్వాభావికంగా నచ్చదు. మానవుడు దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినప్పుడు అతని స్వభావం దుర్మార్గ స్వభావ మయ్యింది. అతను సాతానుకు దగ్గరయ్యాడు. అతనితో విభేదాలులేవు. పాపమానవుడికి పాపానికి కర్తకు మధ్య స్వాభావికంగా వైరుధ్యం ఉండదు. భ్రష్టత ద్వారా వీరిద్దరూ దుష్టులయ్యారు. తన మాదిరిని అనుసరించటానికి ఇతరులను ప్రభావితం చేయటం ద్వారా సానుభూతి మద్దతు సంపాదిస్తే తప్ప భ్రష్టుడికి విశ్రాంతి ఉండదు. ఈ కారణం వల్ల దుష్టదూతలు దుర్జనులు సన్నిహితులవుతారు. స్వయంగా దేవుడు కలుగజేసుకోకపోతే మానవుడు సాతాను జట్టుకట్టి దేవున్ని వ్యతిరేకించే వారు. అప్పుడు సాతానుతో వైరం పెంచుకొనే బదులు మానవజాతి దేవునికి వ్యతిరేకంగా సంఘటితమయ్యేది.GCTel 475.2

    దేవునికి వ్యతిరేకంగా తాను సల్పుతున్న పోరాటంలో సహకారం సంపాదించేందుకు దేవదూతల తిరుగుబాటు లేపినట్లే, పాపం చేయటానికి మానవుణ్ణి శోధించాడు సాతాను. క్రీస్తు పట్ల ద్వేషం విషయంలో సాతానుకి భ్రష్ట దూతలకు మధ్య భేదాలులేవు. మిగిలిన అంశాలన్నింటిలోను విభేదాలున్నా విశ్వపరిపాలకుడైన దేవుని అధికారాన్ని వ్యతిరేకించటంలో మాత్రం వారంతా ఒకటి. తనకు స్త్రీకి మధ్య తన సంతానానికి స్త్రీ సంతానానికి మధ్య వైరం వుంటుందని విన్నప్పుడు మానవ నైజాన్ని భ్రష్టం చేయటానికి తన ప్రయత్నాలకు అడ్డుకట్ట పడుతుందని తన శక్తిని ప్రతిఘటించటానికి మానవుడికి కావలసిన బలం లభిస్తుందని సాతానుకు తెలుసు.GCTel 475.3

    మానవ జాతిపట్ల సాతాను వైరం రగుల్కొంటుంది. అందుకు కారణం క్రీస్తు ద్వారా మానవులు దేవుని ప్రేమకు, కృపకు అర్హులవ్వటమే. దేవుని హస్తకృత్యాలను వికృతం చేయటం ద్వారా లేదా పాడుచేయటం ద్వారా దేవునికి అపఖ్యాతి కలిగించటానికిగాను మానవ రక్షణకు దేవుడు చేసిన ప్రణాళికను నిర్వీర్యం చేయటానికి సాతాను ఉవ్విళ్లూరాడు. పరలోకాన్ని వేదనతోను భూమిని దుఃఖంతోను విధ్వంసంతోను నింపాలన్నది అతని ధ్యేయం. ఈ చేటుకి, అపకారం అంతటికి కారణం దేవుడు మానవుణ్ణి సృజించటమేనని నిందించాడు.GCTel 476.1

    ఆత్మలో క్రీస్తు ప్రతిష్ఠించే కృప సాతానుకి మానవుడికి మధ్య వైరాన్ని సృష్టిస్తుంది. మార్పు కలిగించే ఈ కృప, హృదయాన్ని నూత్నపర్చే ఈ శక్తి, లేకుండా మానవుడు సాతానుకి సర్వదా సేవలందించే బానిసగా మిగిలి ఉంటాడు. అయితే ఆత్మలో ఇప్పుడు పని చేస్తున్న నూతన నియమం, మునుపు సమాధానం ఉన్నస్థలంలో సంఘర్షణను సృష్టిస్తుంది. క్రీస్తు అనుగ్రహించే శక్తి, నిరంకుశ పాలకుణ్ణి, అక్రమదారుణ్ణి ప్రతిఘటించటానికి సామర్థ్యాన్నిస్తుంది. ఎవరైతే పాపాన్ని ప్రేమించరో, ఎవరైతే దాన్ని ద్వేషిస్తారో, అంతర్గతంగా లేచే ఆశలను ఆకాంక్షలను ఎవరైతే నిలువరించి జయిస్తారో, వారు దేవుని మూలమైన ఆ సూత్రాల పని ఫలితాన్ని కనపర్చుతారు.GCTel 476.2

    క్రీస్తు స్వభావానికి సాతాను స్వభావానికి మధ్య గల వైరం ప్రపంచం యేసును అంగీకరించే అవకాశం ప్రస్ఫుటంగా కనిపించింది. యూదులు ఆయనను విసర్జించటానికి కారణం ఆయన ధనం, డంబం, హుందాతనం లేనట్టు కనిపించటం కాదు. బాహ్యమైన ఈ లాభాల లోటును భర్తీచేయగల మహత్తర శక్తి ఆయనలో ఉన్నట్లు వారు గ్రహించారు. కాగా ఆయన పవిత్రత, పరిశుద్ధత భక్తిహీనుల్లో ఆయన పట్ల ద్వేషం పుట్టించాయి. గర్వాంధులు, భోగలాలసులు అయిన ప్రజలకు ఆత్మనిరసన, నిష్కళంక భక్తితో కూడిన ఆయన జీవితం నిత్యమూ గద్దింపుగా పరిణమించింది. దైవ కుమారుని పట్ల వ్యతిరేకతను పుట్టించింది ఇదే. సాతాను దుష్టదూతలు దుర్జనులతో చేతులు కలిపారు. సత్యం కోసం పోరాడే వీరుడికి వ్యతిరేకంగా భ్రష్టశక్తులన్నీ సంఘటితమయ్యాయి.GCTel 476.3

    తమ ప్రభువు పట్ల ప్రదర్శితమైన వ్యతిరేకత క్రీస్తు అనుచరుల పట్ల కూడా ప్రదర్శితమవుతున్నది. పాపం హీయ స్వభావాన్ని గుర్తించి దైవ శక్తితో దాన్ని ఎవరైతే ప్రతిఘటిస్తారో వారిపట్ల సాతాను అతని అనుచరుల వ్యతిరేకత రగుల్కొంటుంది.GCTel 477.1

    పాపం, పాపులు ఉన్నంతకాలం సత్యసూత్రాల పట్ల ద్వేషం సత్యప్రబోధకుల పట్ల హింస ప్రబలుతూనే ఉంటాయి. క్రీస్తు అనుచరులు, సాతాను సేవకులు సామరస్యంతో నివసించలేరు. క్రీస్తును అనుసరించటం నేరంగా పరిగణించటం ఇంకా ఆగలేదు. “క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించువారందరు హింస పొందుదురు.” 2 తిమోతి 3:12.GCTel 477.2

    సాతాను అధికారాన్ని స్థాపించటానికి, దేవుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అతని రాజ్యాన్ని నెలకొల్పటానికి సాతాను ఆధ్వర్యంలో అతని అనుచరులు ప్రతినిత్యం పని చేస్తున్నారు. ఈ లక్ష్యసాధనకు వారు క్రీస్తు అనుచరులను వంచించి వారిని లోకాశలతో నింపి తమ భక్తి జీవితాల నుంచి మళ్లించటానికి ప్రయత్నిస్తున్నారు. తమ నాయకుని వలే వారు కూడా తమ లక్ష్యసాధనకు లేఖనాలకు అపార్ధాలు తీసి వాటిని ప్రచారం చేస్తారు. దేవుని విమర్శించడానికి సాతాను ప్రయత్నించిన రీతిగానే ఆయన ప్రజలపై నిందలు మోపటానికి సాతాను అనుచరులు ప్రయత్నిస్తారు. క్రీస్తును చంపటానికి ఉద్యమించిన దుర్బుద్దే ఆయన అనుచరులను మట్టు పెట్టటానికి ప్రయత్నిస్తుంది. ఇదంతా ఆ మొదటి ప్రవచనంలో వ్యక్తం చేయటం జరిగింది. “మరియు నీకును స్త్రీని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను.” ఈ వైరము లోకాంతం వరకు కొనసాగుతుంది.GCTel 477.3

    ఈ పోరాటంలో సాతాను తనసేనలన్నింటిని మోహరిస్తాడు. తనశక్తి సామర్థ్యాలన్నింటిని వినియోగిస్తాడు. అతనికి ప్రతిఘటన అంతగా ఎదురు కావటం లేదు. ఎందుకు? క్రీస్తు సైనికుల నిద్రమత్తు వదలటం లేదు. ఎందుకు? వారి ఉదాసీనత దేనికి? ఎందుకంటే క్రీస్తుతో వారికున్న సంబంధం అంతంత మాత్రమే. వారిలో పరిశుద్ధాత్మ నివసించటం లేదు. తమ ప్రభువుకు పాపం హేయమై ఉండగా వారికి అది హేయంగా జుగుప్సాకరంగా కనిపించదు. క్రీస్తు మాదిరిగా వారు పాపాన్ని నిశ్చయాత్మకంగా పటిష్టంగా ప్రతిఘటించరు. వారు పాపం తీవ్ర దుష్టత్వాన్ని ప్రాణాంతక స్వభావాన్ని గుర్తించరు. అంధకార రాజ్యాధినేత అయిన సాతాను ప్రవర్తన అధికారం విషయంలో వారు గుడ్డివారు. సాతాను పట్ల అతని పనులపట్ల ఏమంత వ్యతిరేకత లేకపోవటానికి కారణం అతని శక్తిని గూర్చి, అతనివల్ల కలిగే చేటును గురించి, క్రీస్తుకు క్రీస్తు సంఘానికి వ్యతిరేకంగా అతను సల్పుతున్న సంఘర్షణ విస్తృతిని గూర్చి ప్రబలుతున్న అజ్ఞానమే.GCTel 477.4

    జనం ఇక్కడే మోసపోతున్నారు. తమ విరోధి భ్రష్టదూతల మనసుల్ని అదుపుచేసే గొప్ప సేనాధిపతి అని మంచి ప్రణాళికలు ఎత్తుగడలతో మానవ రక్షణ కృషిని అడ్డుకోటానికి క్రీస్తుకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నాడని వారెరుగరు. క్రైస్తవులమని చెప్పుకొనేవారు, సువార్త సేవకులు సహా అప్పుడప్పుడు ప్రసంగ వేదిక నుంచి ఉచ్చరించటం మినహాయిస్తే సాతానుగురించి ప్రస్తావించటం వినిపించదు. నిత్యము సాగే అతని కార్యకలాపాల గురించి అతను సాధించే జయాల గురించి వారు తలంచరు. అతని కుటిల వర్తనను గూర్చిన హెచ్చరికలను లెక్కచేయరు. అతని ఉనికినే విస్మరిస్తున్నట్లు కనిపిస్తారు.GCTel 478.1

    తన తంత్రాలు కుతంత్రాలు మనుషులు గ్రహించలేని స్థితిలో ఉంటుండగా, చురుకైన ఈ శత్రువు సర్వదా వారిని వెంటాడుతూనే ఉంటాడు. గృహంలోని ప్రతి విభాగంలోను, మన నగరాల్లోని ప్రతీ వీధి లోను, సంఘాల్లోను, జాతీయ సభల్లోను, న్యాయస్థానాల్లోను అతను చొరబడ్డాడు. అన్నిచోట్ల గందరగోళం సృష్టిస్తాడు, మోసగిస్తాడు, భ్రష్టత కలిగిస్తాడు. పురుషుల్ని, మహిళల్ని, చిన్నారుల్ని, నాశనం చేస్తాడు. కుటుంబాల్ని విడదీస్తాడు. ద్వేషం పుటిస్తాడు. అనుకరణ ప్రోత్సహిస్తాడు. కలహాలు, తిరుగుబాట్లు రేపుతాడు, హత్యకు గురిచేస్తాడు. అవి దేవుడు సంకల్పించినవని, వాటిని భరిస్తూ నివసించాలని క్రైస్తవలోకం భావిస్తుంది.GCTel 478.2

    దైవ ప్రజలను లోకం నుంచి వేరుగా వుంచే నియమాలను నిష్టలను నాశనం చేయటం ద్వారా వారిని వశపర్చుకోటానికి సాతాను అవిశ్రాంతంగా కృషిచేస్తున్నాడు. దేవుడు నిషేధించిన బాంధవ్యాలు అన్యులతో ఏర్పర్చుకోవటం వల్ల పూర్వం ఇశ్రాయేలు ప్రజలు పాపంలో పడ్డారు. నవీన ఇశ్రాయేలు ప్రజలు అనగా నేటి క్రైస్తవులు అలాగే పక్కదారి పడున్నారు. “దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగసంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.” 2 కొరింథి 4:4. క్రీస్తుకు నమ్మకమైన అనుచరులు కానివారందరు సాతాను బానిసలు. మారుమనస్సులేని వ్యక్తి హృదయంలో పాపేచ్ఛ, పాపాన్ని దాచిపెట్టి దాన్ని సమర్థించేతత్వం చోటు చేసుకొంటుంది. మారువునసు పొందిన హృదయంలో పాపవుంటే ద్వేషం ఏర్పడుతుంది. దాన్ని ప్రతిఘటించే తత్వం కూడా ఏర్పడుతుంది. క్రైస్తవులు భక్తిహీనులతోను అవిశ్వాసులతోను స్నేహబంధాలు పెంచుకొన్నప్పుడు తమ్మును తాము శోధనకు గురిచేసుకొంటున్న వారవుతారు. సాతాను వారికి కనపడకుండా ఉండి తన మోసాలతో వారి కళ్లు కప్పుతాడు. అలాంటి సాంగత్యం తమకు కీడు చేస్తుందని వారు తెలుసుకోలేరు. ఈ కాలమంతటిలోను, మాటల్లోను, క్రియల్లోను లౌకిక వ్యవహార సరళిలోను మునిగితేలుతున్నందువల్ల, వారు మరెక్కువ గుడ్డివారవుతారు.GCTel 478.3

    లోకాచారాలు అలవాట్లు సంఘాన్ని లౌకిక వ్యవస్థగా మార్చుతున్నవి. అవి లోకాన్ని క్రీస్తు తట్టుకు తిప్పలేవు. పాపంతో పరిచయం పాపం పట్ల హేయభావాన్ని క్షీణింపజేస్తుంది. సాతాను అనుచరులతో సాంగత్యం చేయటానికి ఎంపిక చేసుకునేవారు త్వరలో ప్రభువును ప్రేమించటం మానేస్తారు. రాజు ఆస్థానంలో పనిచేస్తున్న తరుణంలో దానియేలుకు సంభవించినట్లు, విధి నిర్వహణలో మనకు ఆపద కలిగినప్పుడు దేవుడు మనల్ని కాపాడాడన్న నిశ్చయతతో మనం ఉండవచ్చు. కాగా శోధన మార్గంలో మసలితే మనం పడిపోవటం తథ్యం.GCTel 479.1

    తనకు సంబంధించిన వారిని ఎవరూ అనుమానించని వారిని శోధకుడైన సాతాను తరచు విజయవంతంగా ఉపయోగించి తన దుష్కార్యాలు సాగిస్తుంటాడు. ప్రతిభ, విద్య, దైవభక్తికి ప్రత్యామ్నాయాలన్నట్టు దైవప్రసన్నతకు అర్హతలన్నట్లు ఇవి ఉన్నవాని అభినందించి సన్మానించటం జరుగుతుంది. వస్తుతః ప్రతిభ, సంస్కృతి దేవుని వరాలు. అయితే వీటిని భక్తి వుండాల్సిన స్థానంలో ఉంచితే ఆత్మను దేవుని చెంతకు నడిపించే బదులు ఆయనను దూరం చేసి అవి శాపంగాను ఉచ్చుగాను పరిణమిస్తాయి. మర్యాదలా, సంస్కారంలా, కనిపించేదంతా ఒక రకంగా క్రీస్తు సంబంధమైనవని అనేకుల అభిప్రాయం. ఇంతకన్నా పెద్ద తప్పు ఇంకొకటి ఉండదు. ఈ లక్షణాలు ప్రతి క్రైస్తవుడి ప్రవర్తనను అలంకరించాలి. ఎందుకంటే యధార్ధమైన మతంపై వాటి ప్రభావం మెండు. అవి దేవునికి సమర్పితం కావాలి. లేకపోతే అవికూడ దుర్మార్థతను ప్రోత్సహిస్తాయి. నీతిబాహ్య కార్యంగా పరిగణించే పని ఏదీ చేయక, సంస్కృతి మర్యాద గల పెద్ద మనుషులుగా చెలామణి అయ్యే అనేకులు సాతాను చేతిలో మెత్తని కత్తిలాంటి వారు. అతని మోసపూరిత ప్రభావం, ఆదర్శం, అజ్ఞానులు సంస్కారం లేనివారు కలిగించే హానికన్నా ఎక్కువ హాని కలిగిస్తుంది.GCTel 479.2

    పట్టుదలతో కూడిన ప్రార్ధనవలన దేవునిపై పూర్తిగా ఆధారపడటం వలన సొలోమోను లోకఖ్యాతిగాంచిన జ్ఞానాన్ని పొందాడు. కానీ ఆయన తన జ్ఞానానికి ఆధారమైన దేవునికి దూరంగా వెళ్లిపోయినప్పుడు, స్వశక్తిమీద ఆధారపడి ముందుకు సాగినప్పుడు శోదనకు లొంగిపోయాడు. అప్పుడు జ్ఞానిగా ప్రఖ్యాతిగాంచిన ఈ రాజు ఆత్మల విరోధి అయిన సాతానుకి కుడి భుజమయ్యాడు.GCTel 479.3

    తమ మనసులకు అంధత్వం కలిగించటానికి సాతాను ప్రతి నిత్యం పరిశ్రమిస్తుండగా తాము “పోరాడునది శరీరులతోకాదుగాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాధులతోను ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను”అని క్రైస్తవులు ఎన్నడూ మరువకూడదు. ఎఫెసీ 6:12. పరిశుద్ధలేఖనం శతాబ్దాలుగా మనకు వినిపిస్తూ ఈ మాటల్లో వస్తున్నది, “నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.” 1 పేతురు 5:8. “మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ” ఎఫెసీ 6:11.GCTel 480.1

    ఆదాము నాటి నుంచి నేటి వరకూ హింసించటానికి, నాశనం చేయటానికే మన బద్ద శత్రువు తన సర్వశక్తుల్ని వినియోగిస్తున్నాడు. ఇప్పుడు సంఘానికి వ్యతిరేకంగా తన అంతిమ ఉద్యమాన్ని నడపటానికి ఆయత్తమవుతున్నాడు. యేసును వెంబడించే వారందరు ఈ శత్రువుతో తలపడాల్సిందే. క్రైస్తవుడు దేవుని మాదిరిని ఎంత నమ్మకంగాGCTel 480.2

    అనుసరిస్తే సాతాను దాడులకు అంత నిర్దిష్టమైన గురిగా తన్నుతాను చేసుకుంటున్న వాడవుతాడు. సాతాను మోసాల్ని బయట పెట్టి క్రీస్తును ప్రజలకు పరిచయం చేసే దైవ సేవలో పని చేసే వారందరూ “ప్రభువుకు దీన మనస్సుతోను, కన్నీళ్లతోను, శోధనలతోను ప్రభుపుకు సేవ చేశానంటూ” పౌలిస్తున్న సాక్ష్యంతో గొంతు కలపగలుగుతారు.GCTel 480.3

    సాతాను క్రీస్తుపై అతి భయంకరమైన శోధనలతో దాడి చేశాడు. అయితే ప్రతీ సంఘర్షణలోనూ సాతాను ఖంగుతిన్నాడు. ఈ సంఘర్షణల్ని క్రీస్తు మన పక్షంగా ఎదుర్కొన్నాడు. ఆయన సాధించిన జయాలు మనం జయించటం సాధ్యపర్చాయి. శక్తిని కోరీవారందరికీ క్రీస్తు శక్తిని అనుగ్రహిస్తాడు. ఏ వ్యక్తినీ తన సమ్మతి లేకుండా సాతాను వశపర్చుకోలేడు. చిత్తాన్ని నియంత్రించటానికిగాని, పాపం చేయటానికి గాని ఆత్మ ఒత్తిడి చేయటానికి గాని శోధకుడైన సాతానుకు శక్తి లేదు. ఆత్మను బంధించవచ్చు కానీ, దాన్ని పంకిలం చేయలేడు. వేదన కలిగించవచ్చు గాని దాన్ని అపవిత్రపర్చలేడు. క్రీస్తు జయించాడన్న వాస్తవం క్రీస్తు అనుచరులు సాతానుకి పాపానికి వ్యతిరేకంగా ధైర్యంతో పోరాడటానికి స్పూర్తినివ్యాలి.GCTel 480.4