Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

మహా సంఘర్షణ

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయం 24—అతిపరిశుద్ధ స్థలంలో

    గుడార సేవాంశం 1844 ఆశాభంగ మర్మాన్ని తెరచే తాళపు చెవి అని చెప్పాలి. అది సత్య పద్ధతిని సంపూర్తిగా సహేతుకంగా బయలుపర్చి ఆగమన ఉద్యమకర్త దేవుడే అని సూచిస్తూ దైవ ప్రజల పరిస్థితిని ప్రస్తుతం వారు నిర్వహించాల్సిన సేవా బాధ్యతను వెలుగులోకి తెచ్చింది. యేసు శిష్యులు హృదయవేదనకు తీవ్ర ఆశాభంగానికి గురి అయిన రాత్రి గతించాక ప్రభువును చూసినప్పుడు ఉత్సహించిన రీతిగా ఆయన రెండోరాక కోసం విశ్వాసంతో కనిపెట్టినవారు ఇప్పుడు ఉత్సహించారు. తన సేవకులకు ప్రతిఫలం ఇవ్వటానికి ఆయన మహిమతో వస్తాడని వారు కనిపెట్టారు. తమ ఆశలు నిరాశలవ్వటంతో వారు యేసును మర్చిపోయి సమాధి వద్ద మరియతో కలసి ప్రభువును “సమాధిలోనుండి యెత్తుకొని పోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో యెరుగము” అంటూ రోధించారు. ఇప్పుడు అతిపరిశుద్ధ స్థలంలో కరుణగల తమ ప్రధాన యాజకుడు, త్వరలో రానున్న తమ రాజు, విమోచకుడు అయిన ప్రభువును మళ్లీ చూశారు. పరలోకగుడారం నుంచి ప్రకాశించిన వెలుగు గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును కాంతితో నింపింది. తన నిర్దుష్ట సంకల్పం చొప్పున దేవుడే తమను నడిపించాడని వారు తెలుసుకొన్నారు. మొదటి శిష్యుల మాదిరిగా వీరు తాము ప్రకటిస్తున్న వర్తమానాన్ని తామే గ్రహించలేక పోయినా వర్తమానం మాత్రం యధార్థం. దాన్ని ప్రకటించటంలో వారు దేవుని సంకల్పాన్ని నెరవేర్చారు. వారి ప్రయాస ప్రభువుకు సంబంధించినంతవరకు వృధాకాలేదు. “జీవముతో కూడిన నిరీక్షణను” కలిగి “చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషమును” పొందారు. GCTel 396.1

    దానియేలు 8:14 లోని “రెండువేల మూడువందల దినముల మట్టుకే...అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్పబడును” అన్న ప్రవచనం “దేవునికి భయపడి ఆయనను మహిమపర్చుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను” అన్న మొదటి దూత వర్తమానం. ఈ రెండు అతిపరిశుద్ధ స్థలంలో క్రీస్తు పరిచర్యను పాప పరిశోధక తీర్పును సూచిస్తున్నాయి. తన ప్రజల్ని విమోచించటానికి, దుర్మార్గులను నాశనం చేయటానికి యేసు రావటాన్ని సూచించటం లేదు. పొరపాటు ప్రవచన కాలావధుల్ని నిర్ధారించటంలో జరగలేదు. 2300 దినాల ముగింపులో చోటుచేసుకొనే ఘటన విషయంలో జరిగింది. ఈ పొరపాటు మూలంగా విశ్వాసులు ఆశాభంగానికి గురి అయ్యారు. ప్రవచనం ముందే చెప్పినట్లు లేఖనాను సారంగా వారు ఎదురు చూసింది సంభవించింది. తాము నిరీక్షించి ఎదురుచూసింది సంభవించని కారణంగా వారు క్షోభిస్తున్న తరుణంలోనే ఆ వర్తమానం ప్రవచించిన ఘటన సంభవించింది. తన సేవకులకు ప్రతిఫలం ఇవ్వటానికి ప్రభువు రాకపూర్వం అది సంభవించాలి.GCTel 396.2

    క్రీస్తు వచ్చాడు. వారనుకొన్నట్లు భూమికి కాదు.. ఛాయారూపకంగా సూచించినట్లు పరలోక గుడారంలోని అతిపరిశుద్ధ స్థలంలోకి. ఆయన ఈ సమయంలో మహా వృద్ధుని వద్దకు వస్తున్నట్లు దానియేలు ప్రవక్త సూచిస్తున్నాడు. “రాత్రి కలిగిన దర్శనములను నేనింక చూచుచుండగా, ఆకాశమేఘారూఢుడై మనుష్యకుమారుని పోలిన యొకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను” దానియేలు 7:13.GCTel 397.1

    ఈ రాకడ గురించి మలాకీ ప్రవక్త కూడా ప్రవచించాడు. “మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు” మలాకీ 3:1. ప్రభువు తన ఆలయానికి రావటం హఠాత్తుగా జరిగింది. ఆయన ప్రజలు ఎదురుచూడని సమయంలో అది జరిగింది. ఆయన కోసం వారు అక్కడ కనిపెట్టలేదు. ఆయన ఈ భూమికి వస్తాడని కనిపెట్టారు. “అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన” చేయటానికి లోకానికి వస్తాడని ఎదురు చూశారు. 2 థెస్స 1:8.GCTel 397.2

    ఆ ప్రజలు తమ ప్రభువును కలుసుకోటానికి ఇంకా సిద్ధంగా లేరు. వారింకా సిద్ధపడాల్సి ఉన్నారు. పరలోకంలో ఉన్న ఆలయంపై వారి దృష్టి కేంద్రీకృతం కావలసి ఉంది. ఆ ఆలయంలో తమ ప్రధాన యాజకుని పరిచర్యను విశ్వాస మూలంగా పరిశీలిస్తే నూతన విధులు వారికి తెలియవస్తాయి. సంఘానికి హెచ్చరికా ఉపదేశాలతో కూడిన మరొక వర్తమానం రావలసి ఉంది.GCTel 397.3

    ప్రవక్త ఇలా అంటున్నాడు, “అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సంప గలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్నివంటి వాడు. చాకలివాని సబ్బు వంటివాడు. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని యుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండిబంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలము చేయును” మలాకీ 3:2, 3. పరలోక గుడారంలో క్రీస్తు విజ్ఞాపన ముగిసేటప్పుడు భూమిపై జీవిస్తున్నవారు విజ్ఞాపకుడు లేకుండగనే దేవునిముందు నిలబడాల్సి ఉంటుంది. వారి వస్త్రాలు కళంకం లేకుండా ఉండాలి. వారి ప్రవర్తనలు రక్తప్రోక్షణ ద్వారా శుద్ధీకరణ పొందాలి. దైవకృప ద్వారాసు తమ సొంత కృషి ద్వారాను దుర్మార్గతతో పోరాటంలో వారు విజయం సాధించాలి. పరలోకంలో పాప పరిశోధక తీర్పు జరుగుతున్నప్పుడు పశ్చాత్తాపం పొందిన విశ్వాసుల పాపాల్ని పరలోక గుడారం సుంచి తొలగించేటప్పుడు ప్రత్యేక శుద్ధీకరణ కార్యం ద్వారా దైవ ప్రజలు పాపాల్ని విడిచి పెట్టటం జరగాల్సి ఉన్నది. ప్రకటన 14 లోని వర్తమానాల్లో ఈ కార్య వివరణ మరింత స్పష్టంగా ఉంది.GCTel 397.4

    ఈ కార్యాచరణ పూర్తి అయినప్పుడు క్రీస్తు అనుచరులు ఆయన రాకకు సిద్ధంగా ఉంటారు. “అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును, పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యూదావారును యెరూషలేము నివాసులును చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును” మలాకీ 3:4. అప్పుడు మన ప్రభువు వచ్చినప్పుడు ఆయన అంగీకరించే సంఘం “కళంకమైనను ముడతయైనను, అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనదిగా” ఉంటుంది. ఎఫెస్సీ 5:27. అప్పుడు సంఘం “సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందముగలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలును గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణి” అయి ఉంటుంది. పరమగీతములు 6:10.GCTel 398.1

    ఆలయానికి ప్రభువు రాక గురించి మాత్రమే గాక ప్రభువు రెండోరాక గురించి, తీర్పు తీర్చటానికి రావటం గురించి మలాకీ ఈ మాటల్లో ప్రవచిస్తున్నాడు, “తీర్పు తీర్చుటకై నేను మీయొద్దకు రాగా, చిల్లంగి వాండ్ర మీదను, వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను, నాకు భయపడక వాని కూలి విషయములో కూలి వారిని విధవరాండ్రను తండ్రిలేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయువాని మీదను దృఢముగా సాక్ష్యము పలుకుడునని సైన్యముల కధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు” మలాకీ 3:5. యూదా ఈ సన్నివేశం గురించే ప్రస్తావిస్తూ ఇలా అంటున్నాడు, “ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరును భక్తిహీనముగా చేసినవారి భక్తిహీన క్రియలన్నింటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువుతన వేవేల పరిశుద్దుల పరివారముతో వచ్చెను. ” యూదా 14:15. ఈ రాక, తన ఆలయానికి ప్రభువురాక - ఈ రెండూ స్పష్టమైన వేర్వేరు ఘటనలు.GCTel 398.2

    దానియేలు 8:14 సూచిస్తున్నట్లు ఆలయాన్ని పవిత్రీకరించటానికి క్రీస్తు అతిపరిశుద్ధ స్థలంలో ప్రవేశించటం దానియేలు 7:13 చెబుతున్న రీతిగా మనుష కుమారుడు మహావృద్ధుని పద్దకు రావటం, మలాకీ ప్రవచించినట్లు ప్రభువు తన ఆలయానికి రావటం, ఇవన్నీ ఒకే సంఘటన వర్ణనలు. మత్తయి 25వ అధ్యాయంలో పదిమంది కన్యకల్ని గురించి క్రీస్తు చెప్పిన ఉపమానంలో పెండ్లికుమారుడు పెళ్లికి రావటాన్ని కూడా ఇది సూచిస్తున్నది.GCTel 399.1

    1844 ఎండాకాలంలోను శరత్కాలంలోసు “ఇదిగో పెండ్లి కుమారుడు” అన్న ప్రకటన వెలువడింది. బుద్ధిగల కన్యకలు బుద్దిలేని కన్యకలన్న రెండు తరగతులు అప్పుడు ఏర్పడతాయి. ప్రభువురాకకు ఆనందంతో ఎదురు చూస్తూ ఆయనను కలుసుకోటానికి శ్రద్ధగా సిద్ధపడున్నది ఒక తరగతి. భయభ్రాంతులకులోనై బెదురు బెదురుగా వ్యవహరిస్తూ సత్యాన్ని గూర్చిన సిద్ధాంతాలతోనే తృప్తి చెందుతూ దైవ కృప విషయంలో శూన్యులై మసలువారు ఒక తరగతి ప్రజలు. ఉపమానంలో పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు “సిద్ధపడి యున్న వారు అతనితో కూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి.” పెండ్లికి ముందు పెండ్లి కుమారుడు రావటం జరుగుతున్న విషయం గమనార్హం. ఈ పెండ్లి క్రీస్తు తన రాజ్యాన్ని స్వీకరించటాన్ని సూచిస్తోన్నది. ఆ రాజ్యానికి కేంద్రం ప్రతినిధి అయిన పరిశుద్ద పట్టణం యెరూషలేము “పెండికుమార్తె... గొర్రెపిల్ల యొక్క భార్య “ను గూర్చి దేవదూత యోహానుతో ఇలా అన్నాడు, “ఇటురమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదను”. “ఆత్మవశుడనైయున్న నన్ను ఎత్తయిన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను” అని ప్రవక్త అంటున్నాడు. ప్రకటన 21:9,10. పెండ్లి కుమార్తె పరిశుద్ధ పట్టణం అయిన పెండ్లి కుమారుణ్ణి కలుసుకోటానికి బయలుదేరిన కన్యకలు సంఘానికీ చిహ్నాలన్నది స్పష్టం. ప్రకటనలో దైవ ప్రజలు పెండ్లి విందులో అతిథులు ప్రకటన 19:9. వారు అతిథులైతే వారిని పెండ్లికుమార్తెగా కూడా సూచించలేము. దానియేలు ప్రవక్త చెప్పినట్లు క్రీస్తు పరలోకమందున్న ఆ మహావృదుని వద్దనుంచి ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును” అందుకొంటాడు. “తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి ” ఉన్న నూతన యెరూష లేమును తన రాజానికి కేంద్ర పట్టణంగా ఆయన స్వీకరిస్తాడు. దానియేలు 7:14 ప్రకటన 21:2. రాజ్యాన్ని స్వీకరించిన అనంతరం తన ప్రజల్ని రక్షించేందుకోసం రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా వస్తాడు. గొర్రెపిల్ల పెండ్లి విందులో పాలుపొందటానికి “అబ్రాహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను” ఆ రాజ్యంలో ఆయన ప్రజలు కూర్చుంటారు. మత్తయి 8:11; లూకా 22:30.GCTel 399.2

    1844 ఎండాకాలంలో (“ఇదిగో పెండ్లి కుమారుడు” అన్న ప్రకటన ప్రభువు వెంటనే వస్తాడని వేలాది మంది నమ్మటానికి దారితీసింది. నిర్ణీత సమయంలో పెండ్లికుమారుడు వచ్చాడు. భూలోకానికి కాదు గాని పరలోకంలోని మహావృద్ధుని వద్దకు వివాహానికి తన రాజ్యాన్ని స్వీకరించటానికి సిద్ధపడి యున్న వారు అతనితోకూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతట తలుపు మూయబడెను” పెండ్లి విందుకు వారు వ్యక్తిగతంగా హాజరు కానక్కరలేదు. వారు ఈ లోకంలో నివసిస్తున్నప్పుడే ఆ విందు పరలోకంలో జరుగుతుంది. “తమ ప్రభువు పెండ్లి విందునుండి ” వచ్చే వరకు క్రీస్తు అనుచరులు ఆయనకోసం ఎదురు చూడాలి. లూకా 12:36. ఆయన పనిని అవగాహన చేసుకొని ఆయన దేవుని ముందుకు వెళ్లేటప్పుడు వారు ఆయనను వెంబడించాలి. పెండ్లి విందుకు ఈ విధంగా వారు హాజరు కావాల్సి ఉన్నారు.GCTel 400.1

    ఉపమానంలో తమ దివిటీల్లో నూనె ఉన్న వారే పెండ్లికి వెళ్లారు. లేఖనాలు చదివి సత్యాన్ని తెలుసుకొన్న వారికే దేవుని ఆత్మ దేవుని కృప ఉన్నాయి. తమకు చేదు అనుభవం కలిగిన కాళరాత్రిలో వారు ఓపికతో కనిపెడూ స్పష్టమైన సత్యం కోసం బైబిలును పరిశోధించారు. పరలోకంలోని గుడారాన్ని అందులో క్రీస్తు పరిచర్యలోని మార్పును గూర్చిన సత్యాన్ని వీరు అవగతం చేసుకోగలిగారు. పరలోక గుడారంలో ఆయన చేస్తున్న పరిచర్యను విశ్వాసమూలంగా గ్రహించి ఆయనను అనుసరించారు. చివరి విజ్ఞాపన పరిచర్య నిర్వహించటానికి, దాని సంపూర్తి పిదప తన రాజ్యాన్ని స్వీకరించటానికి క్రీస్తు దేవుని సముఖములోనికి వెళ్తున్నప్పుడు లేఖనాల సాక్ష్యాన్ని సత్యాలనే అంగీకరించి విశ్వాసం ద్వారా ఆయనను వెంబడించినవారు-వీరందర్నీ పెండ్లి విందుకు లోపలికి వెళ్తున్నట్లుగా సూచించటం జరుగుతున్నది.GCTel 400.2

    మత్తయి 23 లోని ఉపమానంలో ఈ వివాహ రూపక చిత్రమే కనిపిస్తున్నది. వివాహానికి ముందు పాప పరిశోధక తీర్పు జరగవలసి ఉన్నట్లు సూచన స్పష్టంగా కనిపిస్తున్నది. అందరూ పెండ్లి వస్త్రం ధరించారో లేదో తనఖీ చేసేందుకు పెండ్లికి ముందు రాజు లోపలికి వచ్చాడు. ఈ పెండ్లి వస్త్రం గొర్రెపిల్ల రక్తంలో తెల్లగా ఉతికిన నిష్కళంక ప్రవర్తన అనే వస్త్రం. మత్తయి 22:11; ప్రకటన 7:14. లోటుపాట్లున్న వానిని బైటికి నెట్టి వేయటం జరిగింది. కాగా పరిశోధనలో పెండ్లి వస్త్రం ధరించి ఉన్నట్లు తేలినవారందరినీ అంగీకరించి తన రాజ్యపాలనకు తనసింహాసనాన్ని అధిష్టించటానికి యోగ్యులుగా దేవుడు పరిగణిస్తాడు. ప్రవర్తనను గూర్చిన ఈ పరిశోధన దేవుని రాజ్యంలో నివసించటానికి ఎవరు సిద్ధపడ్డారో అన్న నిర్ధారణ ప్రక్రియే పాప పరిశోధక తీర్పు, పరలోక గుడారంలో ఇప్పుడు జరుగుతున్న, త్వరలో పూర్తికానున్న పని ఇదే.GCTel 400.3

    పరిశోధక తీర్పు పూర్తి అయినప్పుడు అన్నియుగాల్లోను క్రీస్తు అనుచరులమని చెప్పుకొన్న విశ్వాసుల నిజాయితీ నిర్ధారణ అయి తదనుగుణంగా తీర్పు జరిగేంతవరకు కృపకాలం అంతంకాదు. కృపా ద్వారం మూతపడదు. “సిద్ధపడియున్నవారు అతనితో కూడ పెండ్లి విందుకు లోపలికిపోయిరి. అంతట తలుపు వేయబడెను” అన్న ఒక్క వాక్యంలో ప్రభువు చేస్తున్న పరిచర్య చివరిదశను అనగా మానవ రక్షణలో ఆయన మహాత్యాగ పరిసమాప్తిని మనం చూస్తున్నాం.GCTel 401.1

    భూలోక గుడార సేవలు పరలోక గుడారసేవకు ఛాయారూపకాలని తెలుసుకొన్నాం. ప్రాయశ్చిత్తార్ధ దినం నాడు ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు గుడారం మొదటి విభాగంలోని పరిచర్య ఆగిపోయింది. దేవుడు ఇలా ఆజ్ఞాపించాడు, “పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోనికి పోవునప్పుడు... ఇశ్రాయేలీయుల సమస్త సమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తముచేసి బయటికి వచ్చువరకు ఏ మనుష్యుడుసు ప్రత్యక్షపు గుడారములో ఉండరాదు.” లేవీకాండం 16:17. అలాగే చివరి ప్రాయశ్చిత్తం చేసేందుకు క్రీస్తు అతిపరిశుద్ధ స్థలంలోకి వెళ్లినప్పుడు మొదటి విభాగంలోని పరిచర్యను ఆయన ఆపివేశాడు. అయితే మొదటి విభాగంలోని పరిచర్య ముగియగానే రెండో విభాగంలోని పరిచర్య ప్రారంభమయ్యింది.GCTel 401.2

    ఛాయారూపక పరిచర్యలో, ప్రాయశ్చిత్తార్ధ దినం నాడు ప్రధాన యాజకుడు పరిశుద్ధస్థలం విడిచిపెట్టి, తమ పాపాల నిమిత్తం యధార్ధంగా పశ్చాత్తాపపడిన ఇశ్రాయేలు ప్రజల పాపాలకు పాపపరిహారార్ధ బలి అర్పించటానికి, దేవుని ముందుకు వెళ్ళేవాడు. అలాగే మన విజ్ఞాపకుడిగా క్రీస్తు తన పరిచర్యలోని ఒక భాగాన్ని మాత్రమే ముగించి ఆ పరిచర్యలోని మరొక భాగాన్ని మొదలు పెట్టాడు. పాపుల నిమిత్తం తన రక్తాన్ని చిందించానని ఆయన తండ్రి ముందు ఇంకా విజ్ఞాపన సల్పుతూనే ఉన్నాడు.GCTel 401.3

    ఆగమన విశ్వాసులు ఈ అంశాన్ని 1844 లో అవగాహన చేసుకోలేకపోయారు. ప్రభువు రావలసిన సమయం గతించిన తర్వాత కూడా ఆయన రాక సమీపంలోనే ఉన్నదని వారి విశ్వాసం. తాము ముఖ్యమైన క్లిష్టమైన సమయానికి వచ్చామని దేవుని ముందు విజ్ఞాపకుడిగా క్రీస్తు సేవ ముగిసిపోయిందని వారు నమ్మారు. మేఘారూఢుడై ప్రభువు రావటానికి కాస్త ముందు మానవుడి కృపకాలం ముగుస్తుందని బైబిలు బోధిస్తున్నట్లు వారు భావించారు. కృపా ద్వారం వద్ద మనుషులు వెదకినా, తట్టినా, ప్రభాపించినా అది తెరుచుకోదని బోధించే లేఖనాలనిబట్టి ఇలా అర్ధం చేసుకొన్నారు. ప్రభువు వస్తాడని తాము భావించిన సమయం ఆయన వాస్తవంగా వచ్చే సమయానికి ముందుండే కాలవ్యవధి ప్రారంభం కావచ్చునన్న ఆలోచన వారిలో చోటుచేసుకొన్నది. తీర్పు గడియ సమీపించిందన్న హెచ్చరికను అందించిన తాము లోకంలో చేయాల్సిన పరిచర్యను ముగించామని భావించారు. ఆత్మలను రక్షించాలన్న హృదయభారం ఆసక్తి వారికిక లేవు. భక్తిహీనులు పేట్రేగి దేవదూషణకు ఎగతాళికి దిగటం దేవుని కృపను తృణీకరించే వారి వద్ద నుంచి దేవుని ఆత్మ ఉపసంహరించ బడిందనటానికి మరో నిదర్శనంగా వారు పరిగణించారు. కృపకాలం ముగిసిందనటానికి ఇవన్నీ నిదర్శనాలని వారు నిర్ధారించుకొన్నారు. ఈ పరిస్థితిని “మూతపడ్డ కృపా ద్వారం” అని వారు వివరించారు. ఇకపోతే గుడార పరిచర్య అంశాన్ని తరచి తరచి పరిశోధించగా వారికి జ్ఞానోదయం కలిగింది. 1844 లో 2300 దినాలు అంత మొందటంతో ప్రాముఖ్యమైన క్లిష్ట పరిస్థితి మొదలయ్యిందని తాము భావించటంలో పొరపాటేమీ లేదని ఇప్పుడు వారు గ్రహించారు. పద్దెనిమిది శతాబ్దాల పాటు మనుషులు దేవుని వద్దకు రావటానికి తెరచుకొని ఉన్న కృప నిరీక్షణల ద్వారం మూసుకొన్నా అతిపరిశుద్ధ స్థలంలో క్రీస్తు చేస్తున్న విజ్ఞాపన పరిచర్య ద్వారా మనుషులకు పాపక్షమాపణ కలుగటానికి మరో ద్వారం తెరుచుకొన్నది. పరలోక గుడారానికి ఇంకా “తలుపు తెరచి ఉంది”. ఈ గుడారంలో క్రీస్తు పాపుల పక్షంగా పరిచర్య చేస్తున్నాడు.GCTel 402.1

    ఈనాటి సంఘాన్ని ఉద్దేశించి ప్రకటనలో క్రీస్తు పలికిన మాటల ప్రాధాన్యాన్ని ఇప్పుడు గ్రహిస్తున్నాం. “దావీదు తాళపు చెవి కలిగి, యెవడును వేయకుండ తీయువాడును, ఎవడును తీయలేకుండ వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేసనగా నీ క్రియలను నేనెరుగుదును, నీకున్న శక్తి కొంచెమైయుండినను నీవు నా వాక్యము గైకొని నానామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ యెదుట తీసియుంచియున్నాను. దానిని ఎవడును వేయలేడు.” ప్రకటన 3:7,8.GCTel 402.2

    యేసు చేస్తున్న ప్రాయశ్చితార్ధ పరిచర్యను ఎవరైతే విశ్వాసంతో అనుసరిస్తారో వారు తమ నిమిత్తం ఆయన చేస్తున్న పరిచర్య తాలూకు ఉపకారాన్ని పొందుతారు. ఎవరైతే దాన్ని తృణీకరిస్తారో ఆ సేవ వారికి లభి కూర్చదు. ఆయన మొదటి రాకను గూర్చిన సత్యాన్ని తృణీకరించి ఆయన లోకరక్షకుడన్న సత్యాన్ని నమ్మనందువల్ల ఆయన ద్వారా యూదులకు పాపక్షమాపణ లభించలేదు. యేసు పరలోకానికి ఆరోహణమైన సమయంలో తన విజ్ఞాపన పరిచర్య ఉపకారాలను తన శిష్యులకు అందించటానికి తన రక్తంతో పరలోక గుడారంలో ప్రవేశించినప్పుడు, యూదులు తమ వ్యర్ధమైన బలులు అర్పణలు అర్పించటానికి చీకటిలోనే మిగిలిపోయారు. గుర్తులు ఛాయారూపక సేవలు అంతమొందాయి. మనుషులు దేవుని వద్దకు వెళ్లేందుకు పూర్వం తెరచివున్న ద్వారం మూసుకొన్నది. ఆయనను కనుగోగలిగిన ఒకే ఒక మార్గాన్ని అనుసరించటానికి యూదులు నిరాకరించారు. అదే పరలోక గుడార పరిచర్య ద్వారా ఏర్పడ్డ మార్గం కనుక వారికి దేవునితో సంబంధం ఏర్పడలేదు. వారికి ఆ మార్గం మూసుకొన్నది. నిజమైన బలి దేవుని ముందు ఒకే ఒక విజ్ఞాపకుడు అయిన క్రీస్తును గూర్చి వారు ఎరుగరు. అందుచేత ఆయన విజ్ఞాపన వల్ల కలిగే మేళ్లు వారు పొందలేకపోయారు.GCTel 403.1

    విశ్వసించని యూదుల పరిస్థితి కృపామయుడైన మన ప్రధానయాజకుని పరిచర్యను గూర్చి ఇష్టపూర్వకంగా అజ్ఞానులై ఉన్న నామమాత్రపు క్రైస్తవుల్లో కొందరి పరిస్థితికి అద్దంపడున్నది. ఛాయారూపక సేవలో ప్రధాన యాజకుడు అతిపరిశుద్ధ స్థలంలో ప్రవేశించినప్పుడు ఇశ్రాయేలీయులంతా గుడారం చుట్టూ సమావేశమై తమ పాపాలకు క్షమాపణ కలిగేందుకోసం సమాజం నుంచి దూరమై పోకుండా ఉండేందుకోసం వినయమనస్కులై దేవుని ముందు వేచి ఉండాల్సి ఉంది. వాస్తవమైన ప్రాయశ్చితార్థ దినాన మన ప్రధాన యాజకుడి సేవను అవగాహన చేసుకొని మన విధులేంటో తెలుసుకోవటం మరెంతో ప్రాముఖ్యం.GCTel 403.2

    కృపామయుడైన దేవుడు పంపుతున్న హెచ్చరికను మనుషులు తృణీకరించి దాని పర్యవసానాన్ని తప్పించుకోలేరు. నోవహు కాలం నాటి ప్రపంచానికి దేవుడు వర్తమానం పంపించాడు. దానికి ఆ ప్రజలు స్పందించిన తీరు మీద వారి రక్షణ ఆధారపడి ఉంది. ఆ హెచ్చరికను వారు తోసిపుచ్చినందువల్ల దేవుడు తన ఆత్మను వారి నుంచి ఉపసంహరించు కొన్నాడు. పర్యవసానంగా వారందరూ జల ప్రళయంలో నాశనమయ్యారు. అబ్రాహాము కాలంలో అపరాధులైన సొదొమ నివాసుల విషయంలో కృప పనిచేయలేదు. ఫలితంగా లోతు అతని భార్య ఇద్దరు కుమార్తెలు మినహా అందరూ పరలోకం నుంచి వచ్చిన అగ్నికి ఆహుతి అయిపోయారు. అలాగే క్రీస్తు దినాల్లోను జరిగింది. తనను నమ్మని ఆనాటి యూదు ప్రజలతో దైవ కుమారుడు ఇలా అన్నాడు, “ఇదిగో మీ యిల్లు మీకు విడువబడి యున్నది.” మత్తయి 23:38. అనంత శక్తిగల దేవుడు, చివరి దినాలపై దృష్టి ఉంచుతూ “సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరికి” ఇలా చెబుతున్నాడు, “దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి యుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాష గలవారందరును శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. “2 థెస్స 2:1012. వారు వాక్య ప్రబోధాన్ని తిరస్కరిస్తున్నందున దేవుడు తన ఆత్మను ఉపసంహరించుకొని తాము ప్రేమించే మోసాలకు వారిని విడిచిపెడ్తాడు.GCTel 403.3

    అయితే మానవుడి పక్షంగా క్రీస్తు ఇంకా విజ్ఞాపన సల్పుతూనే వుంటాడు. అన్వేషించిన వారికి సత్యం లభిస్తుంది. ఆగమన వాదులకు ఇది ఆదిలో గ్రాహ్యం కాకపోయినా తమ వాస్తవ భావాన్ని బహిర్గతం చేసే స్వభావం గల లేఖనాలు తమను తాము వివరించుకొనే కొద్దీ తేటతెల్లమయ్యాయి.GCTel 404.1

    1844 లో గతించిపోయిన సమయం ఆగమన విశ్వాసాన్ని ఇంకా నమ్ముతున్న వారికి తీవ్ర పరీక్షా సమయంగా పరిణమించింది. తమ యధార్ధ విశ్వాసానికి సంబంధించినంత వరకు వారి ఆశలన్నీ పరలోక గుడారాన్ని గూర్చిన సత్యం మీద కేంద్రీకృతమై ఉన్నాయి. ప్రవచన కాలావధుల్ని లెక్కకట్టటంలో అవలంబించిన పద్ధతుల విశ్వసనీయతను కొందరు ప్రశ్నించి పరిత్యజించి ఆగమన ఉద్యమాన్ని నడిపించిన పరిశుద్ధాత్మ శక్తిమంతమైన ప్రభావాన్ని మానవ శక్తులకు లేదా సాతాను కుతంత్రాలకు ఆపాదించారు. తమ గతానుభవంలో ప్రభువు తమను నడిపించాడని, దేవుని చిత్తమేంటో తెలుసుకోటానికి తాము వేచి మెలకువగా ఉండి ప్రార్ధించగా తమ ప్రధానయాజకుడు తన పరిచర్యలోని మరో పనిని ప్రారంభించాడని, విశ్వాసమూలంగా ఆయనను అనుసరిస్తూ సంఘం చేయాల్సిన ముగింపు పరిచర్యను తాము చూడగలిగామని మరోవర్గం వారు విశ్వసించారు. మొదటి దూత రెండోదూత వర్తమానాల్ని వారు విస్పష్టంగా అవగతం చేసుకొన్నారు. ప్రకటన 14 లోని మూడోదూత వర్తమానాన్ని అంగీకరించి దాన్ని గూర్చి ప్రపంచాన్ని హెచ్చరించటానికి సమాయత్త మయ్యారు.GCTel 404.2