Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

మహా సంఘర్షణ

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయం 20—మేల్కొన్న గొప్ప మతాసక్తి

    ప్రకటన 14 లో మొదటి దూత వర్తమానంలోని ప్రవచనం మతపరమైన గొప్ప మేల్కొలుపు చోటుచేసుకొంటుందని చెబుతున్నది. అది క్రీస్తు త్వరితాగమన వర్తమాన ప్రకటన ఫలితంగా సంభవిస్తుంది. దూత కనిపించాడు. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాటాడు వారికిని, ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్య సువార్త తీసికొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను” గొప్ప స్వరముతో ప్రకటిస్తోన్నాడు అన్న వర్తమానాన్ని “దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుకGCTel 330.1

    ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి.” వర్తమానాన్ని (వచనాలు 6,7)GCTel 330.2

    ఈ హెచ్చరికను అందించటానికి దేవదూత ఏర్పాటవ్వటం గమనార్హం. పరిశుద్ధత, మహిమ, పరలోక దూతల శక్తి ఈ వర్తమానం సాధించవలసిన కార్యం ఔన్నత్యాన్ని దానిలో - ఇమిడి ఉన్న శక్తి మహిమలను సూచిస్తున్నాయి. “ఆకాశ మధ్యమున” దూత ఎగరటం, హెచ్చరిక ప్రకటించిన ” గొప్ప స్వరము” “భూనివాసులకు” “ప్రతి జనమునకును, ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికిని” ప్రకటన చేయటం-ఇవి, ఈ ఉద్యమం వేగానికి, ఈ వర్తమానం ప్రపంచ వ్యాప్త పరిధికి నిదర్శనం.GCTel 330.3

    ఈ ఉద్యమం ఎప్పుడు చోటుచేసుకొంటుందో ఈ వర్తమానమే సూచిస్తున్నది. “నిత్యసువార్త’లో ఇది ఒక భాగం. ఈ వర్తమానం తీర్పు ఆరంభాన్ని ప్రకటిస్తున్నది. రక్షణ వర్తమానం అన్నియుగాల్లోనూ ప్రకటితమయ్యింది. కాగా ఇది చివరిదినాల్లోనే ప్రకటితం కావలసిన సువర్తమానంలోని భాగం. ఎందుచేతనంటే తీర్పు తీర్చే గడియ వచ్చిందనటం చివరి దినాల సందర్భంగానే వాస్తవం. ప్రవచనాలు తీర్పు ఘడియకు దారితీసే ఘటనాపరంపరను పేర్కొంటున్నాయి. ప్రత్యేకించి దానియేలు గ్రంథం విషయంలో ఇది వాస్తవం. కాగా చివరి దినాలకు సంబంధించిన దానియేలు ప్రవచన భాగం మరుగున ఉండి అంత్యకాలము” వరకు మూతపడి ఉండాల్సి ఉంది. ఈ ప్రవచనాల నెరవేర్పు ఆధారంగా తీర్పును గూర్చిన వర్తమానం ప్రకటించటం మనం ఈ సమయాన్ని ఎదుర్కొంటేనేగాని జరుగదు. కాని చివరి దినాల్లో “చాలమంది నలుదిశల సంచరించినందున తెలివి అధికముగును” (దానియేలు 12:4) అంటున్నాడు ప్రవక్త.GCTel 330.4

    క్రీస్తు రాకడ తాను జీవిస్తున్న దినాల్లో సంభవిస్తుందని సంఘం ఎదురు చూడకూడదని పౌలు హెచ్చరించాడు. “మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుదేరితేనేగాని ఆ దినము రాదు” అంటున్నాడు. 2 థెస్స. 2:3. భ్రష్టత్వం సంభవించి “పాప పురుషుని” సుదీర్ఘ పరిపాలన గడిస్తేనేగాని ప్రభువు రాకడ సంభవించదు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము“గా కూడా వ్యవహరించబడున్న “పాపపురుషుడు” (“నాశనపాత్రుడు” (“ ఆ దుష్టుడు” అన్న పదబంధాలు పోపుల అధికారాన్ని సూచిస్తున్నవి. ప్రవచనంలో ఉన్న ప్రకారం ఈ అధికారం తన ఆధిపత్యాన్ని 1260 సంవత్సరాలు కొనసాగించింది. ఈ ఆధిపత్య కాలం 1798 లో అంత మొందింది. ఆ సంవత్సరానికి ముందు క్రీస్తు రావటం అసాధ్యం . పౌలు చేసిన హెచ్చరిక 1798 వరకు ఉన్న క్రైస్తవ లోకానికి వర్తించింది. ఆ కాలంలోని ఈ భాగానికి క్రీస్తు రెండో రాకడ వర్తమానం ప్రకటితం కావలసి ఉంది.GCTel 331.1

    గడచిన యుగాల్లో ఇలాంటి వర్తమానం ఎన్నడూ ప్రకటితం కాలేదు. మనకు తెలిసిన విధంగా పౌలు దాన్ని ప్రకటించలేదు. అప్పటికి ఎంతో దూరాన ఉన్న ప్రభువు రాకకు సహోదరుల గమనాన్ని తిప్పాడు. సంస్కరణోద్యమం కూడా దాన్ని ప్రకటించలేదు. తాను నివసించిన కాలం నుంచి మూడు వందల సంవత్సరాల కాలంలో తీర్పు వస్తుందని మార్టిన్ లూథర్ భావించాడు. అయితే 1798 నుంచి దాని యేలు గ్రంథం తెరువ బడింది. ప్రవచన సంబంధమైన జ్ఞానం పెరిగింది. తీర్పు ఘడియ సమీపంగా ఉన్నదన్న వర్తమానాన్ని అనేకమంది ప్రకటించారు, ప్రకటిస్తున్నారు.GCTel 331.2

    పదహారో శతాబ్దంలోని సంస్కరణమల్లే క్రీస్తు ఆగమనోద్యమం క్రైస్తవ ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఒకే సమయంలో చోటుచేసుకొన్నది. ఐరోపాలోను, అమెరికాలోను భక్తిపరులు ప్రార్ధనా పరులు ప్రవచనాల్ని పరిశోధించటం మొదలు పెట్టారు. పరిశుద్ధ వాక్యాన్ని అధ్యయనం చేసి అంత్యకాలం సమీపంగా ఉన్నదని నిర్ధారించారు. వివిధ దేశాల్లో అక్కడక్కడ ఉన్న క్రైస్తవ సమూహాలు రక్షకుని రాక సమీపంగా ఉన్నదన్న నమ్మకాన్ని కేవలం లేఖన పఠనం ద్వారా పొందాయి.GCTel 331.3

    తీర్పు సమయాన్ని గూర్చిన ప్రవచనాల విషయంలో మిల్లర్ ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చిన అనంతరం మూడు సంవత్సరాలకు అనగా 1821 లో “ప్రపంచ మిషనెరీగా” సేవలందిస్తున్న డా|| జోసఫ్ ఉల్ఫ్ ప్రభువు త్వరలో ఈ లోకానికి వస్తాడని బోధించటం మొదలు పెట్టాడు. ఉల్ఫ్ జర్మనీలో జన్మించాడు. తలిదండ్రులు హెబ్రీయులు. తండ్రి యూదుమత రబ్బీ. (గురువు) బాల్యంలోనే క్రైస్తవ మతం సత్యమైన మతమని నమ్మాడు. ఆయనది చురుకైన విశ్లేషణాత్మకమైన మనసు. ఇంట్లో తన తండ్రితో సమావేశమై యూదు భక్తులు తమ నిరీక్షణను ఆశల్నీ రానున్న మెస్సీయా మహిమను, ఇశ్రాయేలు పునరుద్ధరణను ప్రతి దినం చర్చించుకొనేటప్పుడు ఈయన ఆసక్తిగా వినేవాడు. ఒక రోజు నజరేయుడైన యేసు పేరు ఎవరో ఎత్తటం విని ఆయన ఎవరు అని బాలుడైన ఉల్ఫ్ ప్రశ్నించాడు. “అపూర్వ ప్రతిభ గల ఒక యూదుడు మెస్సీయగా నటించినందువల్ల మరణ దండనకు గురి అయ్యాడు.” అన్న జవాబు వచ్చింది. “యెరూషలేము ఎందుకు ధ్వంసమయ్యింది? మనం దాస్యంలో ఎందుకు మగ్గుతున్నాం?” అడిగాడా బాలుడు. “అయ్యో, అయ్యో, ఎందుకంటే యూదులు ప్రవక్తల్ని చంపేశారు.” బదులుపలికాడు తండ్రి. “యేసు ప్రవక్త ఏమో, ఆయన నిరపరాధి అయినప్పటికీ ఆయనను యూదులు చంపారు.” అన్న ఆలోచన ఆ చిన్నారికి కలిగింది.- ట్రావిల్స్ అండ్ ఎడ్వంచర్స్ ఆఫ్ ది రెవరెండ్ జోసఫ్ ఉత్, సం 1, పుట 6. ఈ మనోభావం ఎంతో బలీయంగా ఉండటంతో క్రైస్తవ దేవాలయంలో అడుగుపెట్టకూడదన్న నిషేధం ఉన్నప్పటికీ లోపలి బోధ వినేందుకుగాను తరచు ఆలయం వెలుపల నిలబడే వాడు. ఏడేళ్ల ప్రాయమప్పుడే మెస్సీయా ఆగమనంతో ఇశ్రాయేలు విజయం సంభవిస్తుందంటూ ఒక వృద్ధ క్రైస్తవుడితో ఈ బాలుడు సగర్వంగా అన్నప్పుడు “బాబూ, నిజమైన మెస్సీయా ఎవరో నేను చెబుతాను. నీ పూర్వికులు పూర్వం ప్రవక్తలను సిలువ వేసిన రీతిగా వారు సిలువ వేసి చంపిన యేసే ఆయన. ఇంటికి వెళ్లి యెషయా 53 వ అధ్యాయం చదువు. యేసు క్రీస్తే దేవుని కుమారుడని నీకు తెలుస్తుంది.” అన్నాడా వృద్ధుడు. - అదే పుస్తకం, సం 1, పుట 7. వెంటనే అతనిలో విశ్వాసం పుట్టింది. ఇంటికి వెళ్లి లేఖనం చదివాడు. నజరేయుడైన యేసు విషయంలో లేఖనం ఎంత సంపూర్ణంగా నెరవేరింది! ఆ వృద్ధ క్రైస్తవుడన్న మాట నిజమా? ఆ కుర్రాడు ఆ ప్రవచనాన్ని విశదం చేయుమంటూ తండ్రినడిగాడు. దానికి సమాధానంగా తండ్రిలో కనిపించిన నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉందంటే మళ్లీ ఆ పసివాడు ఆ అంశాన్ని ఎన్నడూ ప్రస్తావించలేదు. క్రైస్తవ మతం గురించి తెలుసుకోవాలన్న కోరికకు ఇది పదును పెట్టింది.GCTel 332.1

    తాను పెరుగుతున్న యూదు గృహంలో తాను అన్వేషిస్తున్న జ్ఞానాన్ని తల్లిదండ్రులు అతిభద్రంగా దాచి పెట్టారు. అయితే పన్నెండేళ్ల ప్రాయమప్పుడే తండ్రి గృహానికి స్వస్తి చెప్పి విద్య నార్జించి తనకు నచ్చిన మతాన్ని జీవన వృత్తిని ఎంపిక చేసుకోటానికి బైట ప్రపంచంలోకి వెళ్లాడు. కొద్ది కాలం పాటు బంధువులతో నివసించాడు. భ్రష్టుడుగా నిర్ధారించి వారు కొద్ది కాలానికే తమ ఇంటినుంచి వెళ్లగొట్టారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఒంటరిగా పరాయివాళ్ల నడుమ ఆ బాలుడు తన జీవనాన్ని వెళ్లదీయాల్సి వచ్చింది. హెబ్రీ బాష బోధిస్తూ ఉపాధి పొందుతూ ఒక ఊరు నుంచి మరో ఊరికి వెళ్లాడు. అదే సమయంలో లేఖనాల్ని శ్రద్ధగా పఠించాడు. ఒక కథోలిక్ ప్రబోధకుడి స్పూర్తితో రోముమత విశ్వాసాన్ని స్వీకరించి తన సొంత ప్రజలకు మిషనెరీ సేవలందించాలన్న తీర్మానానికి వచ్చాడు. కొన్నేళ్ల అనంతరం ఈ ఉద్దేశంతో రోము నగరంలోని కాలేజ్ ఆఫ్ ప్రోపగండాలో చదవటానికి వెళ్లాడు. స్వతంత్రంగా ఆలోచించటం, కుండ బద్దలుకొట్టినట్లు మాట్లాడటం అన్న తన స్వాభావిక లక్షణం అతణ్ణి సంఘ సిద్ధాంత వ్యతిరేకి అన్న ఆరోపణకు గురి చేసింది. సంఘంలోని దురాచారాలను బహిరంగంగా వ్యతిరేకించి వాటి దిద్దుబాటును కోరాడు. పోపు అధికారులు ఆదిలో అతనిపై ప్రత్యేక శ్రద్ధ చూపించినా కొంత కాలం అయిన తర్వాత అతణ్ణి రోమునుంచి తొలగించారు. అతను సంఘ పర్యవేక్షణ కింద వివిధ స్థలాలకు వెళ్లాడు. చివరికి ఆతణ్ణి రోము మతతత్వ దాస్యంలో బంధించి ఉంచటం జరగని పని అని వారికి స్పష్టమయ్యింది. అతణ్ణి మార్చటం అసాధ్యమని గుర్తించిన నేతలు తాసు ఇష్టం వచ్చిన చోటికి వెళ్లిపోవచ్చునని అతనితో చెప్పారు. ఇక ఉల్ఫ్ ఇంగ్లాడుకు పయనమయ్యాడు. ప్రొటస్టాంట్ విశ్వాసాన్ని స్వీకరించి ఇంగ్లిషు చర్చి సభ్యత్వం పొందాడు. రెండు సంవత్సరాల లేఖన ఆధ్యయనం అనంతరం తాను ఎంపిక చేసుకొన్న సువార్త ప్రచార సేవను 1821 లో ప్రారంభించాడు.GCTel 333.1

    ” వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడుగాను” క్రీస్తు మొదటి సారి వచ్చాడన్న సత్యాన్ని ఉల్ఫ్ అంగీకరించగా మహిమతోను ప్రభావం తోను ఆయన రెండవరాకడ సంభవించటాన్ని ప్రవచనాలు స్పష్టంగా చెబుతున్నట్లు ఆయన గుర్తించాడు. నజరేయుడైన యేసును వాగ్రత్త మెస్పీయాగాను దీనమైన ఆయన మొదటి రాకను తన ప్రజల పాపాల నిమిత్తం అర్పితమైన బలిగాను తన ప్రజలకు చూపిస్తూ రాజుగాను విమోచకుడుగాను ఆయన రెండోసారి వస్తాడని బోధించాడు. GCTel 333.2

    “ఎవరి కాళ్లూ చేతులకు చీలల గాయాలయ్యాయో, వధించటానికి తెచ్చిన గొర్రె వలె ఎవరిని తెచ్చారో, ఎవరు వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిగ్రస్తుడుగాను ఉన్నాడో, యూదానుంచి దండం తొలగి అతని కాళ్ల మధ్య నుంచి రాజదండం పోయినప్పుడు ఎవరు మొదటిసారి వచ్చాడో నజరేయుడైన ఆ యేసు ప్రధాన దూత శబ్దంతో మేఘాసనుడై రెండోసారి వస్తాడు” (జోసఫ్ ఉత్, రిసర్చేస్, ఆండ్ మిషనరీ లేబర్స్, పుట 62). ‘ఆయన ఒలీవ కొండమీద నిలబడ్డాడు. ఒకప్పుడు సృష్టి పై ఆదాము ఏ అధికారం పొంది పోగొట్టుకొన్నాడో (ఆది 1:26; 3:17) దాన్ని యేసు పొందుతాడు. సర్వలోకానికి ఆయన రాజుగా ఉంటాడు. సృష్టిలోని బాధలు దుఃఖాలు కడతేరాయి. ఉత్సాహ గానాలు స్తుతి కీర్తనలు వినిపిస్తాయి... తండ్రి మహిమతోను పరిశుద్ధ దూతలతోను యేసు వచ్చినప్పుడు చనిపోయిన భక్తులు ముందు లేస్తారు. 1 థెస్స 4:16; 1 కొరింథి 15:32. క్రైస్తవులైన సునం దీన్ని మొదటి పునరుత్థాన మంటాం. అప్పుడు వన్యప్రాణి ప్రపంచపు నైజం మార్పు చెందుతుంది. (యెషయా 11:69) అవి యేసుకు లొంగి నివసిస్తాయి. కీర్తనలు 8. విశ్వశాంతి రాజ్యమేలుతుంది. ” జర్నల్ ఆఫ్ రెవ. జోసఫ్ ఉల్ఫ్, పుటలు 378,379. “ప్రభువు మళ్లీ భూమిని చూసినప్పుడు అది చాల మంచిదిగా ఉండెను” - అదే పుస్తకం, పుట 294.GCTel 333.3

    ప్రభువు రాక అతిసమీపమని ఉల్ఫ్ నమ్మాడు. ఆయన ప్రవచన కాల వివరణ ప్రకారం ఆ మహాసంఘటన రమారమి మిల్లర్ సూచించిన కాల వ్యవధిలోనే జరగాల్సి ఉంది. “ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు యే మనుష్యుడైనను” ఎరుగడు, ఆయన ఆగమన సామీప్యాన్ని గూర్చి మనుషులకు ఏమీ తెలియదు అంటూ లేఖనాల్ని ఉటంకించే వారికి ఉల్ఫ్ ఇలా సమాధానం ఇచ్చాడు, “ఆ దినము ఆ గడియ ఎన్నడూ తెలియరాదని మన ప్రభువన్నాడా? అంజూరపు చెట్టు చిగిరించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉన్నదని అర్ధమయ్యేటట్లు ఆయన రాకడ సమీపంగా ఉన్నదని తెలిపే కాల సూచనలను ఆయన ఇవ్వలేదా? మత్తయి 24:32. దానియేలు గ్రంథాన్ని పఠించటమేగాక దాన్ని అవగాహన చేసుకోమంటూ ఆ ప్రభువే చెబుతుండగా ఆ కాలాన్ని మనం ఎన్నడూ గ్రహించటం జరగదా? ఆ దానియేలు గ్రంథంలోనే కాలాంతం వరకు ముద్రితం కావలసి ఉన్న ఈ మాటలు (కాలం గురించి ఆలోచించటం అన్న అరంగల హెబ్రీపదబంధం) “తెలివి అధికమవ్వటం గురించిన ప్రస్తావన ఉన్నది. దానియేలు 12:4. పైగా దీన్నిబట్టి రాకడ సమయం తెలియరానిదని కాదుగాని ఆ దినమూ, ఆ ఘడియా ఏ మానవుడికీ తెలియదని ప్రభువంటున్నాడు. నోవహు ఓడను సిద్ధం చేసినట్లే ఆయస రాకడ కోసం మనల్ని సన్నద్ధం చేయటానికి కాలంలోని సూచనల ద్వారా చాలినంత జ్ఞానం మనకు లభిస్తుందని ఆయనంటున్నాడు. ”- ఉల్ఫ్, రిసర్సెస్ అండ్ మిషనరీ లేబర్స్, పుటలు 404,405.GCTel 334.1

    లేఖనాలకు అర్ధం చెప్పలేక అపార్ధం చెప్పే సామాన్య పద్ధతిని గూర్చి ఉల్ఫ్ ఇలా రాశాడు. “క్రైస్తవ సంఘంలో అధిక సంఖ్యాకులు స్పష్టమైన లేఖన భావం విడిచిపెట్టి, మానవాళికి గాలిలో సంచరించటంలోనే ఆనందం లభిస్తుందని, యూదులు వాటిని అన్యులని, యెరూషలేము అని చదివేటప్పుడు; సంఘం అని భూమి అని అన్నప్పుడు, ఆకాశం అని ప్రభువు రాకడ అని చదివేటప్పుడు, మిషనెరీ సమాజాలని, ప్రభువు పర్వతం ఎక్కటమని అంటే మెథడిస్టుల సమావేశమని వారి నమ్మకం” జర్నల్ ఆఫ్ రెవ జోసఫ్ ఉల్స్, పుట 96.GCTel 335.1

    1821-1845 మద్యకాలంలోని ఇరవైనాలుగు సంవత్సరాల్లో ఉల్ఫ్ చాలా చాలా ప్రయాణం చేశాడు. ఆఫ్రికా, ఈజిప్టు, అబిసీనియా, ఆసియా, పాలస్తీనా, సిరియా, పర్షియా, బొక్కారా, ఇండియా దేశాల్ని సందర్శించాడు. ఆయన అమెరికా కూడా సందర్శించాడు. ఆ ప్రయాణంలో సెంట్ హెలీనా ద్వీపంలో ప్రసంగించాడు. 1837లో ఆగస్టు మాసంలో న్యూయార్క్ నగరం వెళ్లాడు. ఆ మహానగరంలో ప్రసంగించాక ఫిలడెల్ఫియ, బాల్టిమోర్ నగరాల్లో ప్రసంగించి వాషింగ్టన్ నగరానికి వెళ్లాడు. అమెరికన్ కాంగ్రెస్ ఒక సభలో “మాజీ అధ్యక్షుడు జాన్ క్విన్ సి ఏడమ్స్ ప్రతిపాదనను బలపర్చుతూ కాంగ్రెస్ హాలో నేను ఉపన్యసించటానికి సభ అంగీకరించింది. ఒక శనివారం రోజునGCTel 335.2

    ఆ ఉపన్యాసం చేశాను. దానికి కాంగ్రెస్ (పార్లమెంట్) సభ్యులు, వర్జినియా రాష్ట్ర బిషప్, వాషింగ్టన్ లోని ప్రబోధక వర్గం, పురజనులు హాజరయ్యారు. ఆసియాలో నా పరిశోధనలపైన క్రీస్తు వ్యక్తిగత పరిపాలనపైన ఉపన్యసించగా దానికి హాజరైన న్యూజెర్సీ, పెన్సిల్వేనియా రాష్ట్రాల ప్రభుత్వాధి కారులు గొప్ప ఆదరాభిమానాలు చూపారు.” - అదే పుస్తకం, పుటలు 398, 399.GCTel 335.3

    అనేక ప్రమాదాల నడుమ ఎన్నో శ్రమలు భరించి, ఐరోపా నుంచి ఎలాంటి భద్రతా లేకుండా డా|| ఉల్ఫ్ మిక్కిలి అటవిక దేశాల్లో పర్యటించాడు. ఆయనను బరిసెలతో బాదారు, అన్నం పెట్టకుండా మాడ్చారు. బానిసపనికి అమ్మారు. ఆయనకు మూడుసార్లు మరణశిక్ష విధించారు. దొంగలు ఆయనను దోచుకొన్నారు. పలుమార్లు దాహార్తితో మరణించినంత పని అయ్యింది. ఒకసారి కొండల మధ్య ప్రయాణం చేస్తున్నప్పుడు దొంగలు ఆయనకున్నదంతా దోచుకోగా ఆ పర్వత ప్రాంతంలో కాలినడకన వందలాదిమైళ్లు ప్రయాణించాల్సి వచ్చింది. కురుస్తున్న మంచు, ముఖాన్ని కొడుతుంది. మంచుతో గడ్డకట్టిన నేలపై వట్టికాళ్లతో నడుస్తుంటే ఆయన పాదాలు స్పర్శకోల్పోయాయి.GCTel 335.4

    అనాగరిక, క్రూర గిరిజనుల మధ్యకు ఆయుధాలు లేకుండా వెళ్లవద్దన్న హెచ్చరిక వచ్చినప్పుడు ” ఆయుధాలున్నాయి” “ప్రార్ధన, క్రీస్తు కోసం ఉద్రేకం, ఆయనందించే సహాయంపై నమ్మకం అని ప్రకటించాడు. “నా హృదయంలో దేవుని ప్రేమ, నా పొరుగువాని పట్ల ప్రేమ కూడా ఉన్నాయి. నా చేతిలో బైబిలు వున్నది” అన్నాడాయన. - డబల్యూ ఎచ్.డి. ఏడమ్స్, ఇన్ పెరిల్స్ ఆఫ్ట్, పుట 192. ఎక్కడకు వెళ్లినా ఆయన హెబ్రీ బైబిలు, ఇంగ్లీషు బైబిలు తీసుకు వెళ్లేవాడు. కొద్దికాలం క్రితం తాను చేసిన ప్రయాణం గురించి ఆయన ఇలా అన్నాడు, “నేను...బైబిలు తెరచి పట్టుకొన్నాను. నాశక్తి ఆ గ్రంథంలోనే ఉన్నదని దాని బలం నన్ను ఆదుకొంటుందని భావించాను” - అదే పుస్తకం, పుట 201.GCTel 336.1

    తీర్పును గూర్చిన వర్తమానం ప్రపంచ ప్రజల్లో ఎక్కువ మందికి అందేంతపరకు ఆయన అకుంఠిత దీక్షతో కృషి చేశాడు. యూదులు, టర్కులు, పార్సీలు, హిందువులు ఇంకా అనేక ఇతర జాతులు తెగల మధ్య వారివారి భాషల్లో దైవ వాక్యాన్ని పంచి సమీపిస్తున్న మెస్సీయా పరిపాలనను ప్రతిచోటా ఉల్ఫ్ ప్రచురించాడు.GCTel 336.2

    బొఖరాలో తాను చేసిన ప్రయాణాల్లో బైట ప్రపంచంతో సంబంధంలేని ఒక మారుమూలలో ఉన్న ప్రజలు ప్రభువు త్వరితాగమన సిద్ధాంతాన్ని నమ్ముకొన్నట్లు ఉల్ఫ్ కనుగొన్నాడు. యమెలోని అరబ్బుల వద్ద “నెర” అనే పుస్తకమున్నదని అందులో క్రీస్తు రెండోరాకడ గురించి ఆయన మహిమా రాజ్యాన్ని గురించి సూచన ఉన్నదనీ 1840 లో విశేష సంఘటనలు చోటు చేసుకొంటాయని వారు కనిపెడున్నారు” అంటున్నాడాయన - జర్నల్ ఆఫ్ రెవ. జోసఫ్ ఉల్ఫ్, పుట 377. “యమెలో రెకాబ్ పిల్లలతో ఆరు దినాలు గడిపాను. వారు మద్యం తాగరు. ద్రాక్షాతోటలు నాటరు. విత్తనాలు చల్లరు, డేరాల్లో నివసిస్తారు. రెకాబ్ కుమారుడు జొనదాబ్ మంచితనాన్ని ఆ ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుచేసుకొంటూ ఉంటారు. వారి సహవాసంలో ఉన్న వారిలో దాను తెగకు చెందిన ఇశ్రాయేలు ప్రజల్ని నేను చూశాను. రెకాబ్ పిల్లలతో పాటు వారు కూడా మెస్సీయా మేఘారూఢుడై త్వరలోనే వస్తాడని ఎదురుచూస్తున్నారు.” అదే పుస్తకం, పుట 389.GCTel 336.3

    ఇలాంటి నమ్మకమే టారి దేశంలో ఉన్నట్లు మరో మిషనరీ కనుగొన్నాడు. క్రీస్తు రెండోసారి ఎప్పుడు వస్తాడని ఒకGCTel 337.1

    టారి పూజారి ఆ మిషనెరీని ప్రశ్నించాడు. ఆ విషయం తనకు తెలియదని మిషనరీ బదులు పలికినప్పుడు బైబిలు బోధకుడినని చెప్పుకొనే ఆయస అజ్ఞానానికి విభ్రాంతి చెంది క్రీస్తు రమారమి 1844 లో వస్తాడని ప్రవచనంపై ఆధారపడ్డ తన నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.GCTel 337.2

    1826 ప్రాంతంలోనే ఇంగ్లండులో ఆగమన వర్తమానం ప్రచారమయ్యింది. ఆగమనోద్యమం అమెరికాలో ఉన్నంత నిర్దిష్టంగా ఇంగ్లండులో లేదు. రాకడకు కచ్చితమైన సమయాన్ని బోధించటం జరగలేదుగాని గొప్ప శక్తితోను మహిమతోసు క్రీస్తు త్వరలో వస్తాడన్న మహా సత్యాన్ని బహుళంగా ప్రచారం చేయటం జరిగింది. ఇది అసమ్మతి వాదులు మతవిరోధుల మధ్య మాత్రమే జరిగిన ప్రచారం కాదు. చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ కు చెందిన సుమారు ఏడువందల మంది బోధకులు ” ఈ రాజ్య సువార్త ప్రకటనలో నిమగ్నులై ఉన్నట్లు ఇంగ్లిష్ రచయిత మరంట్ బ్రాక్ అంటున్నాడు. ప్రభువు రాకడ 1844 లో సంభవిస్తుందన్న వర్తమానం గ్రేట్ బ్రిటన్లో కూడ ప్రకటితమైంది. రెండోరాకడ గురించి అమెరికాలో ముద్రితమైనపత్రికలు బ్రిటన్ ప్రజలకు ధారాళంగా లభ్యమయ్యాయి. 1842 లో అమెరికాలో ఆగమన విశ్వాసాన్ని స్వీకరించిన రాబర్ట్ వింటర్ అనే ఆంగ్లేయుడు తన నూతన విశ్వాసాన్ని ప్రచారం చేయాలన్న ఉద్దేశంతో స్వదేశానికి తిరిగి వెళ్లాడు. తన పనిలో ఆయనతో అనేకమంది చేతులు కలిపారు. తీర్పును గురించిన వర్తమానం ఇంగ్లండులోని వివిధ ప్రాంతాల్లో ప్రకటితమయ్యింది.GCTel 337.3

    దక్షిణ అమెరికాలో అనాగరికత కపట పౌరోహిత్యం నడుమ స్పెయిన్ దేశస్తుడు జెసువైట్ విశ్వాసి అయిన లకుంజా లేఖన పఠనానికి మార్గం ఏర్పడింది. ఇలా ఆయన క్రీస్తు త్వరితాగమన సత్యాన్ని కనుగొనటం జరిగింది. ప్రజలకు ఈ హెచ్చరిక అందించాలి అన్న ప్రేరణ బలంగా ఉన్నా రోము అభిశంసనకు గురి కాకూడదన్న ఉద్దేశంతో “రబ్బీ బెన్ ఎజ్రా” అన్న కలం పేరుతో మత మార్పిడి చేసుకొన్న యూదుడిగా తన్నుతాను చూపించుకొంటూ తన అభిప్రాయాల్ని వెలువరించాడు. లకుంజా పద్దెనిమిదో శతాబ్దంలో నివసించాడు. కాని లండను చేరుకొన్న ఆయన పుస్తకం 1825 లోనే ఆంగ్లభాషలోకి అనువాదమయ్యింది. రెండోరాకడ విషయంలో ఇంగ్లండులో రేకెత్తిస ఆసక్తి ప్రబల మవ్వటానికి ఈ పుస్తకం దోహద పడింది.GCTel 337.4

    లూథరన్ సంఘకాపరి, ప్రఖ్యాత బైబిలు విద్వాంసుడు, విమర్శకుడు అయిన బెన్ జెల్ ఆగమన సిద్ధాంతాన్ని పద్దెనిమిదో శతాబ్దంలో జర్మనీలో ప్రబోధించాడు. విద్యాభ్యాసం పూర్తి అయ్యాక బెల్ “వేదాంత అధ్యయనంలో తల మునకలై ఉన్నాడు. ఆయన గంభీరమైన మతాసక్తిగల మనస్తత్వం దీనికి బాగా సరిపోయింది. బాల్యంలో ఆయన పొందిన శిక్షణ క్రమశిక్షణ ఆ మనస్తత్వానికి పదునుపెట్టాయి. సదాలోచన, సత్పవర్తన కలిగి తనకు ముందు తన వెనుక జీవించిన ఇతర యువకులమల్లే మతసంబంధమైన సందేహాలు సమస్యలతో ఆయన సతమత మయ్యాడు. “తన హృదయాన్ని చీల్చి తన యౌవనాన్ని దుర్భరం చేసిన అనేక బాణాలగురించి” ఆయన భావోద్రేకంతో ప్రస్తావిస్తున్నాడు. విటన్బర్గ్ సంఘ సభలో సభ్యత్వం పొందిన మీదట ఆయన మతస్వేచ్ఛ ఉద్యమాన్ని చేపట్టాడు. సంఘహక్కులు ఆధిక్యతలను ఆయన సమర్ధించాడు. అదే సమయంలో తమ ఆత్మ ప్రబోధాన్ని అనుసరించి సంఘ సహవాసం నుంచి విడిపోయే వారికి స్వేచ్ఛ ఉండాలని ప్రబోధించాడు” ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా, 9 వ ముద్రణ, వ్యాస. “బెల్. ఈ విధానం వల్ల ఒనకూడిన ఉపకారాలు ఆయన స్వరాష్ట్రంలో నేటికీ కనిపిస్తున్నాయి.”GCTel 337.5

    ప్రకటన 21వ అధ్యాయంపై ఆగమన ఆదివారానికి ప్రసంగాన్ని సిద్ధం చేసుకొంటున్న తరుణంలో క్రీస్తు రెండో రాకడను గూర్చిన సత్యకాంతి బెజిల్ మనస్సులో ప్రకాశించింది. ప్రకటన గ్రంధంలోని ప్రవచనాలు ముందెన్నటికన్నా విస్పష్టంగా ఆయనకు గ్రాహ్యమయ్యాయి. ప్రవక్త అందిస్తున్న దృశ్యాల ప్రాముఖ్యాన్ని వర్ణనాతీతమైన మహిమను గ్రహించి నిర్ఘాంతపోయి ఆ అంశంపై ధ్యానాన్ని కొంత కాలం ఆపివేశాడు. ప్రసంగ వేదికపై ఉండగా మళ్లీ అదే అంశం మీద మరింత స్పష్టతతోను శక్తితోను ఆయన మనోనేత్రం ముందు నిలిచింది. అప్పటి నుంచి ఆయన ప్రవచన అధ్యయనంపై దృష్టి సారించాడు. ఆయన అధ్యయనం ముఖ్యంగా ప్రకటన గ్రంధ ప్రవచనాలపై సాగింది. అవి క్రీస్తు రాకడ సామీప్యాన్ని సూచిస్తున్నట్లు తెలుసుకొన్నాడు. క్రీస్తురాకకు బ్వెల్ నిర్ధారించిన తేదీ అనంతరం మిల్లర్ నిర్ధారించిన తేదీకి సమీపంలో ఉంది.GCTel 338.1

    బెజిల్ రచనలు క్రైస్తవ లోకమంతా ప్రచారమయ్యాయి. ప్రవచనం గురించి ఆయన అభిప్రాయాలు తన సొంత రాష్ట్రమైన విట్బెర్గ్ లోను కొంత మేరకు జర్మనీలోని ఇతర ప్రాంతాల్లోను ప్రజామోదం పొందాయి. ఆయన మరణం తర్వాత కూడా ఆ ఉద్యమం కొనసాగింది. ఆగమన వర్తమానం ఇతరదేశాల్లో వినిపించిన కాలంలోనే జర్మనీ లోనూ వినిపించింది. కొంతకాలమైన తర్వాత కొందరు విశ్వాసులు రష్యాకు వలసవెళ్లి స్థావరాలు ఏర్పర్చుకొన్నారు. ఆ దేశంలోని జర్మను సంఘాల్లో క్రీస్తు త్వరితాగమన విశ్వాసం ఇంకా బలంగా ఉన్నది.GCTel 338.2

    ఆ వెలుగు ఫ్రాన్స్ లోనూ స్విట్జర్లాండులోనూ ప్రకాశించింది. ఫేరల్, కెల్విన్ సంస్కరణ సత్యాన్ని ప్రకటించిన జెనీవాలో రెండో రాకడ వర్తమానాన్ని గాసెస్ ప్రకటించాడు. పద్దెనిమిదో శతాబ్ది చివరి భాగంలోను పందొమ్మిదో శతాబ్ది ఆరంభలోను ఐరోపాలో ప్రబలంగా ఉన్న హేతువాదం విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే ఎదురయ్యింది. సువార్త సేవలో ప్రవేశించినప్పుడు ఆయనకు వాస్తవిక విశ్వాసం తెలియక పోవటమేగాక నాస్తికత పట్ల మొగ్గు చూపాడు. యౌవ్వనంలో ఉన్నప్పుడు ప్రవచన అధ్యయనంలో ఆసక్తి కనపర్చాడు. రాసిన ” ఏషంట్ హిస్టరీ (ప్రాచీన చరిత్ర) చదివిన తర్వాత ఆయన దృష్టి దానియేలు రెండో అధ్యాయంపై పడింది. చరిత్రకారుడి దాఖలాల్లో రుజువైన విధంగా ప్రవచనం నిర్దుష్టంగా, కచ్చితంగా నెరవేరటం చూసి విస్మయం చెందాడు. లేఖనాలు దైవావేశం వల్ల కలిగాయనటటానికి ఇది ప్రబల సాక్ష్యం. తర్వాతి కాలంలో ఉత్పన్నమైన, అపాయకర పరిస్థితులో ఆయనకు లంగరుగా ఉపకరించింది. హేతువాదం ఆయనకు తృప్తి నివ్వలేదు. బైబిలు పఠించి స్పష్టమైన వెలుగు కోసం అన్వేషించగా కొంత కాలానికి రూఢి అయిన విశ్వాసం దొరికింది.GCTel 339.1

    ఆయన తన ప్రవచన పరిశీలనను కొనసాగించి ప్రభువు రాక సమీపంగా ఉన్నదన్న నమ్మకానికి వచ్చాడు. ఈ గొప్ప సత్యం ప్రాముఖ్యాన్ని గుర్తించి దీన్ని ప్రజల ముందుకు తేవాలని ఆకాంక్షించాడు. కాని దానియేలు గ్రంథంలోని ప్రవచనాలు మర్మాలు వాటిని గ్రహించటం సాధ్యం కాదన్న ప్రజాభిప్రాయం తీవ్ర ప్రతిబంధకంగా నిలిచింది. జెనీవాలో సువార్త ప్రకటించటంలో తనకు ముందు ఫేరల్ చేసినట్లు, చివరికి ఆయన చిన్నపిల్లలతో ప్రారంభించి వారి ద్వారా వారి తలిదండ్రుల్ని ఆకర్షించాలని సంకల్పించాడు.GCTel 339.2

    ఈ కార్యాచరణలో తన ధ్యేయం గురించి ప్రస్తావిస్తూ ఆయన ఇలా అన్నాడు, “ఈ విషయాన్ని గ్రహించాలని ఆకాంక్షిస్తున్నాను. నేను సుపరిచితమైన ఈ రూపంలో సత్యాన్ని ఏర్పాటు చేయటం చిన్నారులకు దాన్ని అందించటం ఆ సత్యం ఏమంత ప్రాముఖ్యమైంది కాదని కాదుగాని దానికి గొప్ప విలువ ఉన్నందుకే. నేను చెప్పేది ప్రజలు వినాలన్నది నా కోరిక. అయితే ముందు పెద్దవారిని ఉద్దేశించి మాట్లాడితే వారు పట్టించుకోరని నా భయం. అందుచేత చిన్నారుల వద్దకు వెళ్లటానికి నిశ్చయించు కొన్నాను. కొంతమంది చిన్నపిల్లల్ని పోగు చేస్తాను. వాళ్ల సంఖ్య పెరిగితే, వారు వింటున్నట్లు వారికి ఆసక్తి ఉన్నట్లు వారు విషయాన్ని గ్రహించి వివరించగలిగినట్లు నేను గ్రహిస్తే త్వరలోనే రెండో గుంపును పోగుచేస్తాను. ఇది చూసి పెద్దవారు కూడా కూర్చోని వినటానికి అధ్యయనం చేయటానికి ముందుకు వస్తారు. ఇది జరిగినప్పుడు నేను ఆశించింది నెరవేర్తుంది. ” ఎల్.గాసెస్, డానియెల్ ది ప్రొఫెట్, సం 2, పీఠిక.GCTel 339.3

    ఆయస కృషి ఫలించింది. పిల్లలకు బోధించేటప్పుడు పెద్దవాళ్లు కూడా వచ్చి వినేవారు. గుడిలోని కుర్చీలు ఆసక్తిగా వింటున్న శ్రోతలతో నిండిపోయేవి. వారిలో జెనీవాను సందర్శించేందుకు వచ్చిన ఉన్నతాధికారులున్నారు, విద్యావంతులున్నారు, విదేశీయులు ఉన్నారు. ఈ విధంగా ఈ వర్తమానం ఇతర ప్రాంతాలకు వెళ్లింది.GCTel 340.1

    ఈ విజయంతో ఉత్సాహోద్రేకాలు పొందిన గాసెన్ ఫ్రెంచ్ సంఘాలలో ప్రవచనాలపై వెలువడే పుస్తకాల పఠనాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో తన పాఠాలను ప్రచురించాడు. “చిన్న పిల్లలకు నేర్పిన పాఠాలను ప్రచురించటంలోని ఉద్దేశం ఆ పుస్తకాలు అర్ధం కావని అందుచేత వాటిని పట్టించుకోటం లేదని సాకులు చెప్పేవారిని, వాటిని మీ చిన్నారులే అవగతం చేసుకొంటుంటే మీకెలా అగోచరంగా ఉంటాయి అంటూ వారిని నిలదీయటమే” అంటున్నాడాయన. సాధ్యమైతే మన సంఘాల్లో ప్రవచన జ్ఞానాన్ని సామాన్యులకు కూడా అందజేయాలన్నది నా చిరకాల వాంఛ”. “ప్రస్తుత కాలంలో ఏర్పడ్డ అవసరాన్ని తీర్చటానికి వీటి అధ్యయనంకన్న మెరుగైన మార్గం మరొకటి కనిపించటం లేదు.” “మనం ఈ విధంగానే అతి సమీపంలోనే ఉన్న మహాశ్రమ ఎదుర్కోటానికి సన్నద్ధమై క్రీస్తు రాకకోసం మెలకువగా ఉండి కనిపెట్టాల్సి ఉన్నాం.”GCTel 340.2

    ఫ్రెంచ్ భాషలో ప్రసిద్ధిగాంచిన, ప్రజానురాగాన్ని చూరగొన్న ప్రబోధకుడైనప్పటికీ గాసెన్ ని కొంతకాలం తర్వాత సువార్త పరిచర్య నుంచి తొలగించారు. నిస్సారమైన, హేతువాద పూరితమైన, విశ్వాసాన్ని ప్రోదిచేయని సంఘ ‘’కేటకిజమ్” (ప్రశ్నోత్తరాల గ్రంథం), బదులు చిన్న పిల్లలకు బైబిలు బోధించాడన్నది ఆయనపై మోపిన నేరం. అనంతరం ఆయన వేదాంత పాఠశాలలో అధ్యాపక వృత్తి చేపట్టి కేటకిస్టు (బోధకుడు)గా ఆదివారం నాడు యధావిధిగా చిన్నారులకు లేఖన సందేశం కొనసాగించాడు. ప్రవచన విషయాల సందర్భంగా ఆయన పుస్తకాలు ఉద్రేకాన్ని ఆసక్తిని రేకెత్తించాయి. ఆచార్య పీఠం నుంచి, తన కెంతో ప్రీతి పాత్రులైన బాలల అధ్యాపక వృత్తి నుంచి ఆయన గొప్ప ప్రభావాన్ని ప్రసరించి ప్రభువు రాకడ సామీప్యాన్ని తెలిపే ప్రవచనాల అధ్యయనంపైకి ప్రజల దృష్టిని ఆకర్షించటానికి కారకుడయ్యాడు.GCTel 340.3

    ఆగమన వర్తమానం స్కీండినేవియాలోనూ ప్రవేశించింది. ప్రజలు అమితాసక్తి ప్రదర్శించారు. అనేకులు తమ అజాగ్రత్త నుంచి తప్పుడు భధ్రత నుంచి మేల్కోని తమ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు నామంలో క్షమాపణ కోరారు. కాగా ఆ రాష్ట్ర సంఘ ప్రబోధకులు ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించి ఆగమన వర్తమాన బోధకులు కొందరిని ఖైదులో వేయించారు. ప్రభువు ద్వితీయాగమన బోధకులు ఈ రకంగా మౌనం వహించిన అనేక స్థలాల్లో అద్భుత రీతిలో చిన్న పిల్లల ద్వారా దేవుడు తన వర్తమానాన్ని ప్రజల కందించాడు. వారు పిన్నవయస్కులవటంచేత రాష్ట్ర నిబంధనలు వారిని నియంత్రిచలేక పోయాయి. ఆ చిన్నారులు నిరభ్యతరంగా బోధించగలిగారు.GCTel 340.4

    ఉద్యమం ప్రధానంగా బడుగు వర్గాల నడుమ పని చేసింది. ప్రజలు ఈ హెచ్చరిక వినటానికి శ్రామిక ప్రజల నివాసాల్లో సమావేశమయ్యేవారు. బాల ప్రబోధకుల్లో ఎక్కువమంది ఈ శ్రామిక వాడల్లోని వారే. ఆ చిన్నారుల్లో కొందరు ఆరు లేక ఎనిమిదేళ్ల వయసుకు మించిన వారు కారు. వారు రక్షకుడు యేసును ప్రేమించి ఆయన పరిశుద్ధ నియమాలను అనుసరించి నివసించటానికి ప్రయత్నిస్తున్నట్లు తమ జీవితాలు సాక్ష్యమిస్తున్నప్పటికీ ఆ వయసు పిల్లల బుద్ధి జ్ఞానాలనే వారూ ప్రదర్శించారు. కాకపోతే ప్రసంగించేందుకు ప్రజల ముందు నిలబడినప్పుడు తమ స్వాభావిక ప్రతిభకు మించిన ప్రభావం ఏదో వారిని చైతన్య పర్చుతున్నట్లు కనిపించేది. ధోరణి, శైలి మారిపోయేవి. “దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను” అంటున్న లేఖన వాక్యాలు ఉపయోగిస్తూ గంభీరశక్తితో వారు తీర్పును గూర్చిన హెచ్చరికను ప్రకటించారు. వారు ప్రజల పాపాల్ని ఖండిచారు. దుష్టత్వాన్ని నీతి బాహ్యతను మాత్రమేగాక లోకాశలను మత విషయక నిరాసక్తతను ఖండించి శ్రోతల్ని రానున్న ఉగ్రతనుంచి తప్పించుకోవలసిందిగా హెచ్చరించేవారు.GCTel 341.1

    ప్రజలు ఆవర్తమానం విని భయకంపితులయ్యారు. దేవుని ఆత్మ వారి హృదయాల్లో నమ్మకం పుట్టించాడు. నూతన ఆసక్తితో ప్రజలు లేఖనాలను పరిశోధించారు. ఆత్మ నిగ్రహం లేని వారు దుర్నీతిపరులు మార్పు చెందారు. నిజాయితీ లోపించిన వారు తమ చెడు మార్గాన్ని విడిచిపెట్టారు. గొప్ప దిద్దుబాటు చోటు చేసుకొన్నది. ఆ ఉద్యమంలో దేవుని హస్తం ఉన్నదని రాష్ట్ర సంఘ ప్రబోధకులే ఒప్పుకు తీరాల్సి వచ్చింది.GCTel 341.2

    స్కాండినేవియా దేశాల్లో యేసు రాకను గూర్చిన వర్తమానం ప్రచురణ కావటం దేవుని చిత్తానుసారంగా జరిగిన పని. ప్రబోధకుల స్వరాలు మూగబోయినప్పుడు దేవుడు చిన్న బిడ్డలకు తన ఆత్మనిచ్చి తన కార్యాన్ని నెరవేర్చుకొన్నాడు. యేసు యెరూషలేము సమీపానికి వచ్చినప్పుడు జన సమూహం ఖర్జూరపు మట్టలు పట్టుకొని జయజయ ధ్యానాలతో ఆయనను దావీదు కుమారునిగా ప్రకటిస్తున్న తరుణంలో వారిని వారించుమని పరిసయ్యులు యేసుతో చెప్పారు. ప్రవచనం నెరవేర్పుగానే అది అలా జరుగుతున్నదని వారు మాట్లాకుండా ఊరక ఉండిపోతే అక్కడున్న రాళ్లే కేకలు వేస్తాయని యేసు వారికి సమాధానమిచ్చాడు. యాజకులు పరిపాలకుల బెదరింపులకు జడిసి యెరూషలేము ద్వారంలో ప్రవేశించగానే ప్రజలు తమ జయజయ ధ్వానాలు మానివేశారు. ఆయితే ఆలయ ప్రాంగణంలో ఉన్న చిన్న బిడ్డలు ఆ పల్లవిని ఎత్తుకొని ఖర్జూరపు మట్టలు పట్టుకొని “దావీదు కుమారునికి జయము” అని కేకలు వేశారు. మత్తయి 21:816. తీవ్ర అసంతృప్తికి గురి అయిన పరిసయ్యలు వీరేమంటున్నారో విన్నావా?” అని ప్రశ్నించగా “విన్నాను” “బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించియున్నావు.” అని మీరు వినలేదా అని యేసు బదులుపలికాడు. క్రీస్తు మొదటి రాకలో చిన్న పిల్లల ద్వారా దేవుడు పని చేసినట్లే యేసు రెండోరాక సందర్భంగా ఆయన చిన్నారుల ద్వారా తన వర్తమానాన్ని చాటుతున్నాడు. రక్షకుని ఆగమన వర్తమానం ప్రతి జనానికి ప్రతి వంశానికి ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రకటితం కావాలన్న దైవ వాక్కు తప్పక నెరవేరాలి.GCTel 341.3

    విలియమ్ మిల్లర్, ఆయన సహచరులు ఈ హెచ్చరికను అమెరికాలో ప్రచురించటానికి పిలుపుపొందారు. ఆగమన ఉద్యమానికి అమెరికా గొప్ప కేంద్ర మయ్యింది. మొదటి దూత వర్తమానాన్ని గూర్చిన ప్రవచనం ప్రత్యక్షంగా నెరవేరింది ఇక్కడే. మిల్లర్ ఆయన అనుచరుల రచనలు దూరదేశాలకు వెళ్లాయి. ప్రపంచములో మిషనెరీలు ఎక్కడైతే ప్రవేశించారో అక్కడకు క్రీస్తు రాకను గూర్చిన శుభవార్త వెళ్లింది. “దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను” అన్న నిత్యసువార్త వర్తమానం అన్నిచోట్లా ప్రకటితమయ్యింది. .GCTel 342.1

    క్రీస్తురాక 1844 వసంతకాలంలో సంభవించనున్నట్లు సూచిస్తున్నట్లు కనిపించిన ప్రవచనాల సాక్ష్యం ప్రజల మనసుల్ని ఎంతగానో ఆకర్షించింది. వర్తమానం రాష్ట్రం నుంచి రాష్ట్రానికి వెళ్లినప్పుడు అన్నిచోట్లా అపూర్వాసక్తి నిద్రలేచింది. ప్రవచనాలు ఆధారంగా బయలుపడున్న సత్యాలు యధార్ధమైనవని అనేకులు విశ్వసించారు. తమ పూర్వాభి ప్రాయాలకు స్వస్తి పలికి వారు సంతోషంగా సత్యాన్ని స్వీకరించారు. కొందరు బోధకులు తమ సాంఘిక దురభిమానాన్ని మనోభావాలను పక్కనపెట్టి జీతాలు వదులుకొని తమతమ సంఘాల నుంచి బైటికి వచ్చి యేసు రాకడ ప్రకటనకు నడుము బిగించి ఉద్యమ నాయకులతో చేతులుకలిపారు. ఈ వర్తమానాన్ని అంగీకరించటానికి సంసిద్ధులైన ప్రబోధకులు బహుకొద్దిమంది మాత్రమే అందుచేత వర్తమాన ప్రచార బాధ్యత చాలా మట్టుకు విశ్వాసులే చేపట్టాల్సి వచ్చింది. వ్యవసాయదార్లు తమ పొలాలు, యాంత్రికపనివారు తమ యంత్రాలు, వ్యాపారులు తమ సరకులు, వృత్తి పనివారు తమ హోదాలు విడిచి పెట్టారు. అయినా ముందున్న పనితో పోల్చితే పనివారి సంఖ్య అతిస్వల్పం. దైవభీతిలేని పరిస్థితి, చుట్టూవున్న ప్రపంచంలో పెచ్చరిల్లుతున్న దుర్మార్గత, నిజాయితీగల భక్తులకు హృదయ వేదన కలిగించింది. ప్రజలు పరివర్తన చెంది రక్షణ పొందటానికి దోహదపడేందుకుగాను వారు శ్రమలు, లేమి, బాధలు అనుభవించటానికి సంసిద్ధులయ్యారు. సాతాను నిత్యమూ మోకాలడ్డుతున్నా ఉద్యమం క్రమేణా ముందుకు సాగింది. వేవేల ప్రజలు ఆగమన సత్యాన్ని స్వీకరించారు.GCTel 342.2

    రానున్న ఉగ్రత నుంచి తప్పించుకోవలసిందిగా లోకస్తుల్ని సంఘ సభ్యుల్ని ఒకేరీతిగా హెచ్చరిస్తూ ప్రతీ చోటా ఈ వర్తమానం వినిపించింది. స్నానికుడైన యోహానువలే నేడే చెట్టు మొదల గొడ్డలి పెట్టి మారుమనస్సుకు దీటైన ఫలాలు ఫలించమంటూ బోధకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హృదయాల్ని కలచివేసే వారి విజ్ఞపులకు సాధారణ ప్రసంగ వేదిక నుంచి వెలువడే శాంతి సుఖజీవనాల హామీలకు మధ్య ఎంతో వ్యత్యాసం కనిపించింది. ఎక్కడైతే ఈ వర్తమానం ప్రకటిత మయ్యిందో అక్కడ ప్రజలు మార్పు చెందారు. లేఖనాల సరళ ప్రత్యక్షత పరిశుద్దాత్మ శక్తి వలన అవగాహన కలిగించింది. ఎవరూ ప్రతిఘటించలేని విశ్వాసాన్ని పుట్టించింది. మతాచార్యులు తమ తప్పుడు భద్రతాభావం నుంచి మేల్కొన్నారు. వారు తమ నిరాసక్తతను, లోకాశలను, అవిశ్వాసాన్ని, గర్వాన్ని, స్వార్ధాసక్తుల్ని చూశారు. పలువురు మారుమనసు పొంది దీనమనస్కులై ప్రభువును అన్వేషించారు. ఇంతవరకు వారు లోకాన్ని ప్రేమించారు. ఇప్పుడు వారి దృష్టి పరలోకంపై కేంద్రీకృతమయ్యింది. దేవుని ఆత్మ వారి మీదికి వచ్చాడు. తమ హృదయాలు దైవ ప్రభావం వల్ల మెత్తబారి దేవునికి అంకితమవ్వటంతో “దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు ఘడియ వచ్చెను” అని ప్రకటించే వారితో గొంతు కలపటానికి సిద్ధమయ్యారు.GCTel 343.1

    “రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను?” అంటూ విలపిస్తూ పాపులు ప్రశ్నించారు. అపనమ్మకంగా వ్యవహరించిన వారు అన్యాయపు సొమ్మును తిరిగి చెల్లించటానికి ఆతృతగా ఉన్నారు. క్రీస్తులో శాంతిని కనుగొన్న వారంతా తాము పొందిన ఉపకారాల్ని ఇతరులతో పంచుకోటానికి తహతహలాడున్నారు. తల్లిదండ్రుల హృదయాలు పిల్లల తట్టు, పిల్లల హృదయాలు తలిదండ్రులతట్టు మళ్లాయి. గర్వం, ముభావం వంటి అడ్డుగోడలు కూలిపోయాయి. చిత్తశుద్ధితో తప్పిదాలు ఒప్పుకోటం జరిగింది. కుటుంబ సభ్యులు దగ్గర బంధువుల రక్షణ కోసం కృషి చేశారు. విజ్ఞాపన స్వరాలు తరచు వినిపించేవి. హృదయ భారంతో ఆత్మలు దేవునికి విజ్ఞాపన చేయటం ప్రతిచోటా జరిగింది. తమకు పాపక్షము కలిగిందన్న నిశ్చయత కోసం లేదా తమ బంధువులు లేదా పొరుగువారు క్రీస్తును రక్షకుడుగా స్వీకరించటం కోసం అనేకులు ప్రార్ధనలో రాత్రంతా పోరాడారు.GCTel 343.2

    ఆగమన వాదుల సమావేశాలకు అన్ని తరగతుల ప్రజలు తండోపతండాలుగా హాజరయ్యారు. ధనికులు, దరిద్రులు, అధికులు, అధములు రెండోరాకడ సిద్ధాంతాన్ని తమంతటతామే వినాలని ఆశించి సమావేశమయ్యారు. తన సేవకులు తమ విశ్వాసానికి కారణాలివి అని వివరిస్తున్న తరుణంలో దేవుడు విద్రోహక శక్తులను అదుపులో ఉంచాడు. కొన్ని సార్లు సాధనం బలహీనం కావచ్చు. దేవుని ఆత్మ సత్యానికి శక్తిని చేకూర్చాడు. ఈ సభలలో పరిశుద్ధ దూతల సన్నిధి అనుభవానికి వచ్చేది. దినదినం విశ్వాసుల సంఖ్య పెరిగింది. క్రీస్తు త్వరితాగమన నిదర్శనాల ప్రస్తావన పదేపదే జరుగుతుంటే జనసమూహాలు గంభీరమైన ఆ మాటలను నిశ్శబ్దంగా విన్నారు. ఆకాశమూ భూమి ఒకదానికొకటి సమీపమైనట్లనిపించింది. వృద్ధులు, యువజనులు, మధ్యవయస్కులు దైవశక్తి తమపై ప్రసరించినట్లు గుర్తించారు. మనుషులు తమ పెదవులపై స్తుతిగానాలతో తమ గృహాలకు వెళ్లారు. ఆ ప్రశాంత నిశబ్ద వాతావరణం ఉత్సాహధ్వనులతో మారుమోగింది. ఆ సమావేశాలకు హాజరైనవారెవరూ ఆశాజనకమైన ఆ దృశ్యాలను ఎన్నడూ మరవలేరు.GCTel 344.1

    క్రీస్తు రాకకు నిర్దిష్ట సమయాన్ని ప్రబోధించటాన్ని అన్ని వర్గాల నుంచి ప్రసంగ వేదిక నుంచి బోధకుడు మొదలు దైవ దూషకుడైన నికృష్ణ పాపి వరకు అందరూ వ్యతిరేకించారు. ఈ ప్రపచన వాక్యాలు నెరవేరాయి, “అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దాన మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున నున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురు” 2 పేతురు 3:3,4. రక్షకున్ని ప్రేమిస్తున్నట్లు చెప్పుకొనే అనేకమంది రెండోరాకడ సిద్ధాంతం విషయంలో తమ కెలాంటి వ్యతిరేకతా లేదని ఉద్ఘాటించారు. రాకడకు నిర్దిష్ట సమయం నిర్దేశించటాన్నే వ్యతిరేకించారు. అయితే దేవుని దివ్యదృష్టి వారి మనస్సులో ఏముందో గ్రహించింది. లోకానికి నీతి తీర్పు ఇవ్వటానికి క్రీస్తు రావటాన్ని గూర్చి వినటం వారికి కంటగింపు. వారు అపనమ్మకంగా నివసించిన దాసులు. హృదయ రహస్యాలు పరిశోధించే దేవుని తనిఖీకి వారి క్రియలు నిలువలేవు. రక్షకుని కలుసుకోవటానికి వారికి భయం కలుగుతున్నది. క్రీస్తు మొదటిరాక సమయాన యూదులమల్లే యేసుకు స్వాగతం పలకటానికి వారు సిద్ధంగా లేరు. స్పష్టమైన బైబిలు బోధనలను తోసిరాజనటమేగాక ప్రభువు రాకకు ఎదురు చూసే వారిని వారు ఎగతాళి కూడా చేశారు. సాతాను అతని దూతలు ఎంతగానో సంతోషించారు. తన ప్రజల మని చెప్పుకొనే వారు తాను రాకూడదని కోరుకొనేటంత కపట ప్రేమ చూపేవారంటూ సాతాను అతని దూతలు క్రీస్తును ఎగతాళి చేశారు.GCTel 344.2

    “ఆ దినంగాని గడియగాని ఏ మనుషుడూ ఎరుగడు” అన్నది ఆగమన విశ్వాసాన్ని నమ్మని వారి వాదన. లేఖనం ఇది, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమేగాని యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు” మత్తయి 24:36. ఈ వచనానికి స్పష్టమైన, వివరణను ప్రభువుకోసం ఎదురు చూస్తున్న వారు ఇస్తుండగా వారి ప్రత్యర్థులు దానికి తప్పుడు భాష్యాన్ని చెబుతున్నారన్నది తేటతెల్లం. చివరిసారిగా దేవాలయం నుంచి వెళ్లిన తర్వాత ఒలీవకొండ మీద తన శిష్యులతో సంభాషణలో క్రీస్తు పలికిన మాటలివి. “నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి?” అని శిష్యులు ప్రశ్నించారు. క్రీస్తు కొన్ని గురుతులిచ్చి ఇలా అన్నాడు, “మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే యున్నాడని తెలిసికొనుడి” 3,33 వచనాలు. ప్రభువు పలికిన ఒకమాటను నిరర్ధకం చేయటానికి ఇంకొక మాటను ఉపయోగించ కూడదు. ఆయన రాకడ దినంగాని ఘడియగాని ఏ మనుషుడికి తెలియక పోయినా అది సమీపంలో ఉన్నప్పుడు దాన్ని మనం గ్రహించాలని ఆయన ఉపదేశిస్తున్నాడు. ఆయన హెచ్చరికను లెక్కచేయక పోటం ఆయన రాకడ సమీపంగా ఉన్నదన్న విషయాన్ని నిరాకరించటం లేదా దాన్ని తెలుసుకోవటంలో అశ్రద్ధ చూపటం నోవహు దినాల్లో జలప్రళయం వస్తుందన్న విషయం నమ్మక నశించిన ప్రజల మాదిరిగా ప్రాణాలు కోల్పోవటమే ఔతుంది. అదే అధ్యాయంలో ఉన్న ఉపమానం, నమ్మకమైన సేవకుడికి అపనమ్మకస్తుడైన సేవకుడికి మధ్య ఉన్న తారతమ్యాన్ని చూపిస్తుంది. “నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడు” అనుకొనే సేవకుడికి దండన కలుగుతుంది. మెలకువగా ఉండి కనిపెడ్తూ వారిని ఆయన రాకడ సంభవించదని చెప్పే వారినీ పరిగణించి వారివారి ప్రతి ఫలాలు క్రీస్తు ఎలా ఇస్తాడో ఈ ఉపమానం స్పష్టం చేస్తున్నది. కనుక “మెలకువగా నుండుడి.” అంటున్నాడు ప్రభువు. “యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు” 42,46 వచనాలు. “నీవు జాగరూకుడవై యుండని యెడల నేను దొంగవలె వచ్చెదను. ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు” ప్రకటన 3:3.GCTel 345.1

    ఒక తరగతి ప్రజలకు ప్రభువు రాకడ హఠాత్తుగా ఉంటుంది. పౌలు వారిని గురించి ప్రస్తావిస్తున్నాడు, “రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చును...లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమియు లేదని చెప్పుకొనుచుండగా... నాశనము తటసించును గనుక వారెంతమాత్రమును తప్పించుకొనలేరు.” కాగా రక్షకుడు చేసిన హెచ్చరికను వినుకొన్న వారితో ఆయన ఇలా చెబుతున్నాడు, “మీరందరు వెలుగు సంబంధులును పగటి సంబంధులునై యున్నారు. మనము రాత్రివారము కాము, చీకటివారముకాము”1 థెస్స 5:25.GCTel 346.1

    ఇలా క్రీస్తు రాకడ సమీపంలో ఉండటాన్ని గూర్చి మనుషులు అజ్ఞానంలో ఉండటానికి లేఖనాలు ఎలాంటి తాపు ఇవ్వటం లేదు. కాకపోతే సత్యాన్ని నిరాకరించటానికి సాకు కావాలనుకొన్న వారే ఈ వివరణ వినబడకుండా చెవులు మూసుకొన్నారు. “దినంగాని గడియగాని ఏ మనుషుడును ఎరుగడు” అన్నమాటలు ఆపహాసకుడు ధైర్యంగా పదే పదే పలుకుతున్నాడు. ప్రబోధకుడినని చెప్పుకొనే వ్యక్తి కూడ ఇవే మాటలు పలుకుతున్నాడు. ప్రజలు మేల్కొని రక్షణ మార్గం తెలుసుకోటానికి ప్రయాసపడుతుంటే మత గురువులు వారికీ సత్యానికీ మధ్య అడుగు పెట్టి దైవ వాక్యానికి తప్పుడు భాష్యం చెప్పి ప్రజల భయాందోళనలను తొలగించటానికి ప్రయత్నించారు. విశ్వసనీయత లోపించిన కావలి వారు మోసాలకు ముత్తాత అయిన సాతానుతో చేయి కలిపి దేవుడు శాంతిని ఉద్దేశించనప్పుడు శాంతి శాంతి అని కేకలు వేస్తారు. క్రీస్తు దినాల్లోని పరిసయ్యులమల్లే అనేకమంది పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి నిరాకరించారు. ప్రవేశిస్తున్న వారిని ఆటంక పర్చారు. ఈ ఆత్మల రక్తానికి వారు మూల్యం చెల్లించాలి.GCTel 346.2

    వర్తమానాన్ని స్వీకరించే విషయంలో సంఘంలోని దీనులు, భక్తితత్పరులు ముందంజలో ఉంటారు. స్వయంగా బైబిలును పరిశోధించేవారు ప్రవచనం విషయంలో ప్రజలలో ప్రబలుతున్న అభిప్రాయాలను లేఖనాలు సమర్థించటం లేదని ఒప్పుకొంటారు. ప్రబోధక వర్గం తమ పలుకుబడితో ప్రజలను నియంత్రించకుండా ఉంటే, ప్రజలు వ్యక్తిగతంగా దైవవాక్యాన్ని పరిశోధించటం చేస్తే ఆగమన సిద్ధాంతానికి ఉన్న దైవాధికారాన్ని నిర్ధారించడానికి లేఖనాలతో దాన్ని పోల్చి చూస్తే సరిపోతుంది.GCTel 346.3

    అనేకమంది క్రైస్తవులు అవిశ్వాసులైన సహోదరుల చేతుల్లో హింసననుభవించారు. క్రీస్తు రాకడే తమ నిరీక్షణ అని కరాఖండిగా చెప్పే బదులు కొందరు మౌనం వహించారు. సంఘంలో తమ పదవులు కాపాడుకోటానికే వారిలా ప్రవర్తించారు. ఇతరులు దేవుడు తమకు అప్పగించిన సత్యాలను ఇలా దాచి పెట్టటం దేవునికి ద్రోహం తలపెట్టటమని భావించారు. క్రీస్తు రాకడను నమ్ముతున్నామని చెప్పినందుకు అనేకులు సంఘ బహిస్కృతికి గురి అయ్యారు. తమ విశ్వాసం నిమిత్తం శ్రమలకు గురి అయిన వారికి ప్రవక్త పలికిన ఈ మాటలు ఎంతో ప్రశస్తమైనవి, “మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడునట్లు యెహోవా మహిమ నొందునుగాక అని చెప్పుదురు. వారే సిగ్గు నొందుదురు.” యెషయా 66:5.GCTel 346.4

    ఈ హెచ్చరిక ఫలితం ఎలాగుంటుందో అని దేవదూతలు ఎంతో ఆసక్తితో కనిపెట్టు తున్నారు. ఈ వర్తమానాన్ని అన్ని సంఘాలు తోసిపుచ్చినప్పుడు దూతలు ఆవేదనతో వెళ్ళిపోయారు. ఆగమన సత్య అంశంపై ఇంకా పరీక్షను ఎదుర్కోని వారు అనేకులున్నారు. అనేకులు భర్తలు, భార్యలు, తలిదండ్రులు, పిల్లల మాటలువిని తప్పుదారి పట్టారు. ఆగమనవాదుల్ని సంఘ వ్యతిరేక సిద్ధాంతాలని వాటిని నమ్మటం పాపమని వారికి నూరిపోశారు. ఈ ఆత్మలను జాగ్రత్తగా చూసుకోటానికి దేవదూతలు నియమితులయ్యారు. ఎందుకంటే దైవ సింహాసనం నుంచి వారిపై మరింత వెలుగు ప్రకాశిస్తున్నది.GCTel 347.1

    వర్తమానాన్ని అందుకొన్న వారు తమ రక్షకుడి రాకకోసం గంపెడు ఆశతో ఎదురు చూశారు. ఆయనను కలుసుకుంటామని వారు భావించిన సమయం సమీపించింది. ఈ గడియను వారు గంభీరంగా, ప్రశాంతంగా ఎదుర్కోడానికి సన్నద్ధమయ్యారు. దేవునితో ప్రశాంత సహవాస వాతావరణంలో ఆ సమయం గడిపారు. ఇక ముందు వారు అనుభవించబోయే శాంతికి అది ఓ మచ్చుతునక. ఈ నిరీక్షణను విశ్వాసాన్ని అనుభవించిన వారెవరూ ఆయన రాకడ కోసం కనిపెట్టిన ఆ మధుర ఘడియల్ని మరచిపోలేరు. ఆ సమయానికి కొన్ని వారాలు ముందే లోక వ్యాపారాలకు తెరదిగింది. మరణ శయ్యపై ఉన్నట్లు కొద్ది నిమిషాల్లోనే లోక దృశ్యాలకు కన్ను మూతపడుతున్నట్లు నిజాయితీగల విశ్వాసులు తమ ఆలోచనలను భావోద్వేగాలను జాగ్రత్తగా పరీక్షించు కొన్నారు. “ఆరోహణ అంగీలు” తయారు చేసుకోలేదు. కాని రక్షకుని కలుసుకోటానికి తాము సర్వసన్నద్ధంగా ఉన్నామనటానికి కావలసిన అంతర్గత నిదర్శన ఆవశ్యకతను అందరూ గుర్తించారు. ఆత్మశుద్దే వారి తెల్లని వస్త్రాలు. అనగా ప్రాయశ్చిత్తంగా క్రీస్తు చించిందిన రక్తంలో పాపం నుంచి శుద్ధి పొందిన ప్రవర్తనలు, హృదయాన్ని పరిశోధించుకొనే ఈ స్వభావం, యధార్ధమైన, నిర్దిష్టమైన ఈ విశ్వాసం దైవ ప్రజలుగా చెప్పుకొనే వారిలో ఇంకా ఉంటే ఎంతో బాగుండును. వారు ఆ రీతిగా ప్రభువుముందు దీనులై ఉంటూ తమ మనవుల్ని కృపాసనం వద్ద పెట్టి ఉంటే వారి అనుభవం ఇప్పటికంటే ఎంతో పరిపుష్టంగా ఉండేది. ప్రార్ధన అంతంత మాత్రమే. నిజమైన పాప స్పృహ అంతంత మాత్రమే. సజీవ విశ్వాసం కొరవడటంతో రక్షకుడు సమృద్ధిగా ఏర్పాటు చేసిన కృపను అనేకులు పొందలేక పోతున్నారు.GCTel 347.2

    దేవుడు తన ప్రజల్ని పరీక్షించాలనుకొన్నాడు. ప్రవచన కాలాలను గూర్చిన లెక్కల్లో ఆయన హస్తం ఒక పొరపాటును కప్పి ఉంచింది. ఆగమన వాదులు ఆ పొరపాటును పట్టుకోలేకపోయారు. విద్యావంతులైన వారి ప్రత్యర్థులు సైతం ఆ పొరపాటును కనుక్కోలేక పోయారు. “ప్రవచన కాలాలకు సంబంధించిన మీ లెక్కలు సరియైనవే. ఏదో గొప్ప ఘటన సంభవింపబోతున్నది. కాని అది మిల్లర్ చెబుతున్నది మాత్రం కాదు. అది లోకం మారుమనస్సు పొందటం, క్రీస్తు రెండో రాకడ కానే కాదు” అన్నారు వారు.GCTel 348.1

    ఎదురుచూసిన సమయం గతించిపోయింది. తన ప్రజల్ని విమోచించేందుకు క్రీస్తు రాలేదు. తమ ప్రియతమ రక్షకుడి కోసం అచంచల విశ్వాసంతో ఎదురు చూసిన వారు తీవ్ర నిరుత్సాహంతో కుప్పకూలారు. ఏది ఏమైనా దేవుని కార్యాలు నెరవేర్తూనే ఉన్నాయి. తన రాకడ కోసం కనిపెడున్నామని చెప్పే ప్రజల హృదయాల్ని ఆయన పరీక్షిస్తున్నాడు. భయం వలన తప్ప మరే ఉన్నతాశయంతోను ఆవిధంగా వ్యవహరించిన వారు వారిలో అనేకమంది ఉన్నారు. వారు నమ్మిన విశ్వాసం వారి హృదయాల్లోగాని జీవితసరళిలోగాని మార్పు కలిగించలేదు. ఎదురు చూసిన ఘటన సంభవించనప్పుడు తాము నిరుత్సాహం చెందలేదని ఈ వ్యక్తులు అన్నారు. క్రీస్తు వస్తాడని వారు అసలు నమ్మలేదు. యధార్ధ విశ్వాసులు సంతాప పడుతున్నప్పుడు వారిని ఎగతాళి చేసిన వారిలో వీరు మొదటి వారు.GCTel 348.2

    నిరుత్సాహానికి గురి అయినప్పటికీ పరీక్ష వచ్చినప్పుడు నమ్మకంగా ఉన్న వారిని యేసు, పరలోకవాసులు ప్రేమతో సానుభూతితో వీక్షించారు. లోకంలో కనిపించే వాటిని కనిపించని వాటి నుంచి వేరుచేసే అడ్డుతెర తొలగించటం సాద్యపడి ఉంటే దేవుని పక్క నమ్మకంగా నిలిచిన ఈ ఆత్మలపై సాతాను సంబంధించిన బాణాలను నిర్వీర్యం చేయటానికి దగ్గరలోనే ఉన్న దూతలు కనిపించేవారే.GCTel 348.3