Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

మహా సంఘర్షణ

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయం 4—వాల్దెన్సీయులు

    పాపుల అధికారం సాగిన దీర్ఘకాలంలో లోకంలో నెలకొన్న అంధకారం మధ్య సత్యజ్యోతి పూర్తిగా ఆరిపోలేదు. ప్రతి యుగంలోను దేవునికి సాక్ష్యులున్నారు. మానవుడికి దేవునికి మధ్య క్రీస్తు ఏకైక మధ్యవర్తి అని నమ్మిన మనుషులు, మానవుడి జీవితానికి నియమ నిబంధన గ్రంథం బైబిలేనని నమ్మిన మనుషులు నిజమైన సబ్బాతును పరిశుద్ధంగా ఆచరించిన మనుషులు వారు. వీరికి లోకం ఎంత రుణపడి ఉన్నదో భావితరాల ప్రజలు గ్రహించలేరు. సంఘ సిద్ధాంత వ్యతిరేకులుగా వారిపై ముద్ర వేశారు. వారి ఉద్దేశాలను శంకించారు. వారి ప్రవర్తనలు చెడ్డవి అన్నారు. వారి రచనల్ని అణచివేశారు. వాటికి తప్పుడు అర్ధాలు చెప్పారు. లేదా వాటిని ధ్వంసం చేశారు. అయినా వీరు అచంచలంగా నిలిచారు. బైబిలు పరిశుద్ధ గ్రంధమున్న విశ్వాసాన్ని యుగయుగాలుగా కాపాడుకొని దాన్ని భావి తరాల వారికి పవిత్ర స్వాస్థ్యంగా నిలిపారు. GCTel 44.1

    రోము ప్రాబల్యాన్ని సాధించిన నాటి నుంచి సంభవించిన చీకటి యుగాల్లోని దైవ ప్రజల చరిత్ర పరలోకంలో లిఖితమయ్యింది. కాని మానవ దాఖలాల్లో దానికి స్థానం దొరకలేదు. వారిని హింసించిన వారి నిందా వాక్యాల్లో తప్ప వారి ఉనికికి కూడా నిదర్శనాలు దాదాపు కనిపించవు. తన సిద్ధాంతలపైగాని ఆదేశాలపైగాని అసమ్మతి వ్యక్తమైతే దాన్ని తుడిచివేయటం రోము విధానం. వ్యక్తుల రూపంలోగాని, రచనల రూపంలోగాని తలెత్తిన సంఘ సిద్ధాంత వ్యతిరేకతను రోము నాశనం చేసింది. పోపుల సిద్ధాంతాల ప్రామాణికత విషయమై సందేహం వ్యక్తం చేయటంగాని ప్రశ్నించటంగాని ఎవరైనా చేస్తే వారు ధనికులేగాని, దరిద్రులేగాని అధికులేగాని అధములేగాని అది చాలు వారు ప్రాణాలు కోల్పోటానికి. అసమ్మతీయుల పట్ల తము క్రూర ప్రవర్తన దాఖలాన్ని నాశనం చేయటానికి రోము విశ్వ ప్రయత్నాలు చేసింది. వాటి వివరాలున్న పుస్తకాల్ని దాఖలాన్ని కాల్చివేయాలని పోపుల సభలు ఆదేశాలు జారీచేశాయి. అచ్చుయంత్రం రాకపూర్వం పుస్తకాలు ఎక్కువ వుండేవికాదు. వాటి తయారీ వాటిని భద్రపర్చటం కష్టమైన రూపంలో ఉండేది. అందుచేత రోమా మతవాదులు తమ నిర్దిష్ట కార్యాల్ని సాధించటానికి ప్రతి బంధకాలు ఎక్కువలేవు.GCTel 44.2

    రోము పరిధిలో ఉన్న ఏ సంఘమూ తన మనస్సాక్షి ననుసరించి మతాన్ని అవలంబించటానికి లేదు. పోపు మతానికి అధికారం లభించిన మరుక్షణమే తన ఆధిపత్యాన్ని అంగీకరించని వారందరిని అణగ దొక్కటానికి పూనుకొన్నది. సంఘాలు ఒకదాని వెంట మరొకటి పోపు అధికారాన్ని అంగీకరించాయి.GCTel 45.1

    బ్రిటన్లో సనాతన క్రైస్తవ మతం వేళ్లూనింది. తొలి శతాబ్దాలలో బ్రిటన్ ప్రజలకు అందిన సువార్త రోమను మతభ్రష్టత అంటకుండా వచ్చిన స్వచ్చమైన సువార్త. అన్యమత చక్రవర్తుల వలన కలిగిన శిక్షే బ్రిటన్లోని ఈ మొదటి సంఘాలు రోము నుంచి పొందిన బహుమతి. దూరతీరాలకు సయితం హింస విస్తరించింది. ఇంగ్లాండులో ప్రబలుతున్న హింస నుంచి అనేకులు స్కాట్లాండుకు పారిపోయి తలదాచుకొన్నారు. అక్కడ నుంచి సత్యం ఐర్లాండ్సుకు అందింది. ఈ దేశాలన్నింటిలోను ప్రజలు ఆనందోత్సాహాలతో సత్యాన్ని అంగీకరించారు.GCTel 45.2

    సెక్షన్లు బ్రిటన్ పై దాడి జరిపినప్పుడు అన్యమతం ప్రాధాన్యం సంతరించుకొన్నది. బానిస ప్రజలిచ్చే ఉపదేశం అందుకోటమన్నది విజయం సాధించిన సీక్షన్లకు మింగుడు పడలేదు. ఫలితంగా క్రైస్తవులు కొండల్లోను అరణ్యాల్లోను ఆశ్రయం వెదుక్కోవలసి వచ్చింది. ఏమైనా కొద్దికాలం మరుగైన వెలుగు మళ్లీ ప్రకాశించటం మొదలు పెట్టింది. ఒక శతాబ్దం అనంతరం స్కాట్లాండులో ఆ వెలుగు దేదీప్యమానంగా ప్రకాశించింది. ఆ వెలుగు సుదూర ప్రాంతాలకు కూడా ప్రసరించింది. ఐర్లాండ్ నుంచి కొలంబస్, ఆయన అనుచరులు వచ్చారు. వారు చెదరివున్న విశ్వాసులను ఒంటరిగా ఉన్న దీవిలో పోగుచేసి ఆ దీవిని తమ సువార్త సేవకు కేంద్రం చేసుకొన్నారు. ఈ సువార్త సేవకులలో ఒకరు బైబిలు సబ్బాతును ఆచరిస్తున్న వ్యక్తి. ఈ సత్యం ఈ విధంగా అక్కడి ప్రజలకు అందింది. అయోనాలో ఒక పాఠశాల స్థాపితమయ్యింది. ఆ పాఠశాల నుంచి ఇంగ్లాడు, స్కాట్లాండ్లకే గాక జర్మనీ, స్వీట్జర్లాండు, ఇటలీ దేశాలకు మిషనెరీలు వెళ్లారు.GCTel 45.3

    రోము కన్ను బ్రిటన్ మీద పడింది. బ్రిటనను తన ప్రాబల్యం కిందికి తెచ్చుకోవాలన్న కృతనిశ్చయంతో వుంది. ఆరో శతాబ్దంలో రోము మత మిషనరీలు అన్యమత సేన్షన్లను క్రైస్తవులుగా మార్చటానికి పూనుకొన్నారు. ఆత్మాభిమానులైన ఈ అనాగరికులు వారిని సాదరంగా అంగీకరించారు. రోమను మత విశ్వాసాన్ని స్వీకరించటానికి వేలాదిమందిని వారు ప్రొత్సహించారు. సంఘం వృద్ధి చెందిన కొద్దీ పోపుమత నాయకులు, వారు సంపాదించిన విశ్వాసులు సనాతన క్రైస్తవుల్ని కలుసుకోవడం జరిగింది. వారికీ వీరికీ మధ్య తేడా కొట్టొచ్చినట్లు కనిపించింది. వీరు నిరాడంబరులు, వినయ మనస్కులు, ప్రవర్తన సిద్ధాంతం మర్యాదల విషయంలో వాక్యాన్ని అనుసరించిన ప్రజలు. ఇకపోతే వారు మూఢ నమ్మకాలున్న వారు, పోపుల విలాస జీవితాన్ని ప్రేమిస్తూ అహంభావంతో నిండిన వారు. సర్వాధికారం గల పోపు ఆధిక్యాన్ని క్రైస్తవ సంఘాలు అంగీకరించాలని రోము పంపిన దూత హక్కుగా అడిగాడు. తాము మనుషులందరిని ప్రేమించ గోరుతున్నామని అయితే పోపును సంఘంలో అత్యధికుడని గుర్తించటం జరగదని క్రీస్తు అనుచరులు ప్రతి వారికి ఇచ్చే గౌరవాన్నే పోపుకూ ఇస్తామని బ్రిటన్ ప్రజలు మర్యాదగా సమాధానం చెప్పారు. వారి విధేయతను పొందటానికి రోము పదేపదే ప్రయత్నించింది. కాని దీనులైన ఈ క్రైస్తవులు రోము పంపగా వచ్చిన దూతలు ప్రదర్శించిన గర్వానికి దిగ్ర్భాంతి చెంది క్రీస్తు మినహ తమకు వేరొక యజమాని లేడని ఘంటాకంఠంగా సమాధానం చెప్పారు. పోపుల నిజ స్వభావం ఇప్పుడు బయటపడింది. సమాధానం తెచ్చే శత్రువులను మీరు అంగీకరించాల్సి ఉంటుంది. సెక్షన్లకు జీవిత మార్గాన్ని చూపించటంలో మీరు మాతో కలసిరాకపోతే వారి వద్దనుంచి మీరు మరణాన్నే అందుకోవలసి ఉంటుంది. ” అంటూ హెచ్చరించాడు రోము నేత. జె.ఎచ్.మర్ డి అబీస్, హిస్టరీ ఆఫ్ ది రిఫర్మేషన్ ఆఫ్ ది సిక్సీన్ సెంచురి, పస్తకం 17, అధ్యాయం 2. ఇవి వట్టి బెదరింపులు కావు. బైబిలు విశ్వాసానికి నిలబడ ఈ సాక్షుల్ని లొంగదీసుకోటానికి రోము యుదాన్ని, కుట్రను వంచనను ఉపయోగించింది. తుదకు బ్రిటన్లోని సంఘాలు నాశనమవ్వటమో లేక పోపుల అధికారానికి లొంగిపోవటమో జరిగింది.GCTel 45.4

    రోము అధికార పరిధిలో లేని దేశాల్లో పోపుల కాలుష్యం తాకని క్రైస్తవ సమాజాలు అనేక శతాబ్దాలుగా వర్ధిల్లాయి. వాటిని అన్యమతం చుట్టుముట్టి వుంది. కాలం గతించిన కొద్దీ అన్యమత దుష్ప్రభావం వారిని బలహీన పర్చింది. అయినా తమ విశ్వాసానికి ఒరవడిగా బైబిలునే వారు అంగీకరించి అందలి సత్యాల్ని ఆచరించారు. ఈ క్రైస్తవులు దైవ ధర్మశాస్త్రం నిత్యమైనదని నమ్మి నాల్గో ఆజ్ఞలోని సబ్బాతును ఆచరించారు. ఈ విశ్వాసాన్ని అనుసరించి నివసించిన సంఘాలు మధ్య ఆఫ్రికాలోను ఆసియాలోని ఆర్మేనీయుల మధ్య వర్ధిల్లాయి.GCTel 46.1

    ఇకపోతే, పోపుల అధికార దురాక్రమణను ప్రతిఘటించిన వారిలో అగ్రగాములుగా నిలిచిన వారు వాల్దెన్సీయులు. పోపులు తమ పరిపాలన కేంద్రాన్ని ఏర్పాటుచేసుకొన్న దేశంలోనే దాని మోసానికి, దుర్నీతికి తీవ్ర ప్రతిఘటన లేచింది. అనేక శతాబ్దాలుగా పైడ్మంట్ సంఘాలు తమ స్వాతంత్ర్యాన్ని కాపాడుకొంటూ వచ్చాయి. అయితే అవి తన చెప్పుచేతల్లోకి రావాలని రోము పట్టుపట్టే సమయం వచ్చింది. రోము నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తూ వ్యర్ధ పోరాటాలు జరిపిన అనంతరం ఈ సంఘ నాయకులు లోకమంతా నీరాజనాలర్పిస్తున్న ఈ అధికారానికి అయిష్టంగా కొందరు తలవంచారు. కొందరు పోపు లేదా ప్రధానాచార్యుడి అధికారానికి సమ్మతించదని లేదని కరాఖండిగా చెప్పేశారు. దేవునికి విధేయులై నిరాడంబరమైన, పవిత్రమైన తమ విశ్వాసాన్ని కాపాడుకోటానికి నిశ్చయించు కొన్నారు. ఇరువర్గాలూ విడిపోయి సనాతన విశ్వాసానికి కట్టుబడివున్న వారు వేరైపోయారు. కొందరు ఆల్పు కొండల్లోవున్న తమ జన్మ భూమిని విడిచి పరాయి దేశాలకు వలస వెళ్ళి అక్కడ సత్యధ్వజం ఎగురవేశారు. మరికొందరు ఇరుకైన కొండలోయల్లోను, పర్వతాల్లోని దుర్గాల్లోను నివాసాలు ఏర్పరచుకొని జనావాసాలకు దూరంగా నివసిస్తూ దైవారాధనకు తమకున్న స్వేఛ్ఛను కాపాడుకొన్నారు.GCTel 46.2

    వాల్టెన్సీయ క్రైస్తవులు శతాబ్దాలు తరబడి ఆచరిస్తూ ప్రబోధించిన విశ్వాసం రోము బోధించిన తప్పుడు సిద్ధాంతాలకు చాలా విరుద్ధమైంది. వారి మత విశ్వాసం దేవుని లిఖిత వాక్యం మీద ఆధారపడివుంది. అదే నిజమైన క్రైస్తవ మత వ్యవస్థ. ప్రపంచానికి దూరంగా మారుమూలల్లోవున్న తమ నివాసాలలో నివసిస్తూ తమ మందల్ని కాచుకొంటూ ద్రాక్షాతోటల్లో సేద్యం చేసుకొంటూ బతుకు వెళ్లదీసే పేద రైతులు ఆచరించిన సత్యం, భ్రష్టమతం ప్రబోధించే సిద్ధాంత విరుద్ధమైన సత్యం తమంతట తామే కనుగొన్నది కాదు. వారి విశ్వాసం కొత్తగా స్వీకరించిన విశ్వాసమూ కాదు. తమ మత విశ్వాసం వారికి తమ తండ్రులు పితరుల నుంచి స్వాస్యంగా వచ్చింది. వారు అపోస్తలుల సంఘం కోసం “పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తము” పోరాడారు. యూదా 3. ప్రపంచంలో గొప్ప ముఖ్య పట్టణంలో కొలువుదీరి, గర్వాంధులైన అధికార గణాలతో పరిపాలించేది కాదు క్రీస్తు యధార్ధ సంఘం. కాని అరణ్యంలోని ఈ సంఘమే” లోకానికి ప్రకటించటానికిగాను దేవుడు తన ప్రజలకు అప్పగించిన సత్యమనే సిరులను పరిరక్షించే సంఘం.GCTel 47.1

    నిజమైన సంఘం రోముతో విడిపోవటానికి కారణాల్లో ప్రధానమైంది బైబిలు సబ్బాతు పట్ల రోము పెంచుకొన్న ద్వేషం. ప్రవచనం ముందే చెప్పినట్లు పోపుల పాలన సత్యాల్ని నేలమీద పడవేసింది. మానవకల్పిత సంప్రదాయాల్ని, ఆచారాల్ని హెచ్చించి దైవ ధర్మశాస్త్రాన్ని నేల మట్టిలో వేసి తొక్కింది. తన పాలన కిందవున్న సంఘాలు ఆదివారాన్ని పరిశుద్ధ దినంగా ఆచరించాలంటూ పోపుల పాలన వాటి మీదకి ఆరంభలోనే ఒత్తిడి తెచ్చింది. కొనసాగుతున్న తప్పులు, మూఢనమ్మకాల మధ్య దేవుని యధార్ధ ప్రజలు సహా అనేకమంది గందరగోళంలో పడి సబ్బాతును ఆచరిస్తూనే ఆదివారం నాడు కూడా ఏ పనీ చేయకుండా నిలిచిపోయారు. ఇది పోపు మత గురువులకు తృప్తి కలిగించలేదు. ఆదివారాన్ని పరిశుద్ధంగా ఆచరించటమేగాక సబ్బాతును అపవిత్రం చేయాలని వారు గరించారు. సబ్బాతును అప రిశుద్ధంగా పరిగణించటానికి సాహసించని ప్రజల్ని కఠిన పదజాలంతో విమర్శించారు. రోము పరిపాలనా పరిధి నుంచి పారిపోవటం ద్వారా మాత్రమే దైవ ధర్మశాస్త్రాన్ని నిర్మలంగా ఆచరించటం సాధ్యపడింది.GCTel 47.2

    పరిశుద్ధలేఖనాలకు అనువాదాన్ని సంపాదించటంలో ఐరోపా ప్రజలలో వాల్దెన్సీయులు ప్రధములు. సంస్కరణోద్యమానికి వందలాది సంవత్సరాలు ముందే తమ మాతృ భాషలో బైబిలు రాత ప్రతి వారికి వుంది. వీరికి కలితీలేని సత్యం వుంది. ద్వేషానికి, హింసకు వీరు ప్రత్యేకంగా గురి అవటానికి ఇదే కారణం. ప్రకటన పేర్కొంటున్న భ్రష్ట బబులోను రోము సంఘమేనని వారు ప్రకటించారు. తమ ప్రాణాలొడ్డి ఆ సంఘ దురాచారాల్ని ఖండించటానికి వారు నడుం బిగించారు. దీర్ఘకాలం కొనసాగిన హింసాకాండ ఒత్తిడికింద కొంతమంది తమ విశ్వాసం విషయంలో రాజీపడి తమ విలక్షణ నియమాల్ని కొంచెం కొంచెంగా విడిచి పెట్టగా తక్కిన వారు సత్యాన్ని గట్టిగా పట్టుకొని వున్నారు. చీకటి యుగాల్లో, మతభ్రష్టత కాలంలో రోము సర్వాధికారాన్ని విగ్రహారాధనను తిరస్కరించి నిజమైన సబ్బాతును ఆచరించిన వాల్దెన్సీయులున్నారు. తీవ్ర వ్యతిరేకత తుఫానుల మధ్య వారు తమ విశ్వాసాన్ని కాపాడుకొన్నారు. బళ్ళెం చీల్చినా, రోము రగిలించిన మంటలు దహించినా, వారు దేవుని వాక్యం కోసం ఆయన గౌరవం కోసం అచంచలంగా నిలిచారు.GCTel 48.1

    సంరక్షణ, భద్రత లిచ్చే ఎత్తయిన పర్వతాల వెనుక- పీడితులకు హింసితులకు అన్ని యుగాల్లోను ఆశ్రయదుర్గమై - వాల్దెన్సీయులు దాక్కోటానికి స్థలం దొరికింది. మధ్యయుగాల చీకటిలో ఇక్కడ సత్యజ్యోతి వెలుగులు నింపింది. ఇక్కడ సత్యసాక్షులు వెయ్యి సంవత్సరాలుగా సనాతన విశ్వాసాన్ని ఆచరించారు.GCTel 48.2

    దేవుడు తన ప్రజలకు సుందరమైన దేవాలయాన్నిచ్చాడు. వారు పొందిన గొప్ప సత్యాలకు దీటైన ఆలయమది. నమ్మకమైన ఆ ప్రవాస భక్తులకు ఆ పర్వతాలు మార్పులేని దైవ నీతికి చిహ్నం. తమ ముందున్న ఎత్తయిన గంభీరమైన పర్వతాల్ని తమ పిల్లలకు చూపిస్తూ ఎవరిలో ఏ చంచలత్వం అయిన ఏ ఛాయఅయిన లేదో ఎవరిమాట కొండలవలె నిత్యం నిలిచి ఉంటుందో ఆ దేవుని గురించి వారితో మాట్లాడేవారు. దేవుడు పర్వతాల్ని సృష్టించి వాటికి శక్తినిచ్చాడు. వాటిని వాటి స్థానాలనుంచి అనంతశక్తి గల ఆయన తప్ప వేరెవ్వరు కదల్ప లేరు. అలాగే ఆయన తన ధర్మశాస్త్రాన్ని స్థాపించాడు. ఇహలోకంలోను, పరలోకంలోను ఆయన ధర్మశాస్త్రమే ఆయన ప్రభుత్వానికి పునాది. మానవుడి హస్తం, తోటి మానవుల్ని పట్టుకొని నాశనం చేయవచ్చునేమో. అయితే ఆయన హస్తం యెహోవా ధర్మశాస్త్రంలో నుంచి ఒక నియమాన్ని మార్చగలిగినంత అవలీలగా లేక తన చిత్రాన్ని నెరవేర్చే ప్రజలకు ఆయన చేసిన వాగ్దానాల్లో ఒకదాన్ని తుడిచివేయగలిగినంత సులువుగా పర్వతాల్ని తమ పునాదులనుంచి పెకలించి వాటిని సముద్రంలోకి విసిరివేయగలడు. దైవ ధర్మశాస్త్రానికి నిబద్దులై నమ్మకంగా నివసించే విషయంలో దైవ ప్రజలు మార్పులేని కొండలవలె స్థిరంగా వుండాలి.GCTel 48.3

    ఆ లోయల చుట్టూవున్న పర్వతాలు దేవుని సృజన శక్తి, అనంతమైన ఆయన సంరక్షణ, ఆలన పాలన నిశ్చయతకు నిత్యసాక్ష్యాలు.యెహోవా సన్నిధిని సూచించే ఆ చిహ్నాల మూగ భాషను ప్రేమించటం ఆ యాత్రికులు నేర్చుకొన్నారు. తమకు కలిగిన కష్టాలు శ్రమలను గురించి వారు గొణుగుకోలేదు. ఆ పర్వతాల నడుమ ఏ కాంతంలో వారు ఎన్నడూ ఒంటరిగాలేరు. మానవుల క్రూరత్వం నుంచి ఆగ్రహం నుంచి తమకు ఆశ్రయం కల్పించినందుకు వారు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. ఆయనను ఆరాధించుకోటానికి తమకు స్వేచ్ఛ వున్నందుకు ఆనందించారు. తరచు శత్రువులు తమను వెన్నంటి తరిమినప్పుడు ఆ కొండల బలమే వారికి అండగా నిలిచింది. అనేక ఉన్నత శిఖరాలపై నుంచి దేవునికి స్తుతిగానాలు సమర్పించేవారు. ఆ వందనార్పణ గీతాలను రోము సైన్యాలు ఆపలేకపోయాయి.GCTel 49.1

    ఈ క్రీస్తు అనుచరులది పవిత్ర, నిరాడంబర, ఉత్సాహ భరిత భక్తి. ఇళ్లకన్న, భూములకన్న, మిత్రులు, బంధువులు — ఆమాటకొస్తే తమ ప్రాణంకన్న వారు సత్యానికి ఎక్కువ విలువ నిచ్చారు. ఈ సత్య సూత్రాలకు యువతను ఆకర్షితుల్ని చేయటానికి పాటు పడ్డారు. తమ పసితనం నుంచే యువతకు లేఖనాల్ని ఉపదేశించారు. దైవ ధర్మశాస్త్ర నియమాల్ని పవిత్రమైనవిగా పరిగణించటం వారికి నేర్పించారు. బైబిలు ప్రతులు చాలా అరుదు. అందుచేత ప్రశస్త వాక్యాన్ని కంఠస్థం చేయటం జరిగింది. అనేకమంది పాత నిబంధన, కొత్త నిబంధన పుస్తకాల నుంచి దీర్ఘ వాక్య భాగాలు వల్లించగలిగే వారు. గంభీరమైన ప్రకృతి దృశ్యాలతో దినదిన జీవితంలో అనుభవానికి వచ్చే చిన్న చిన్న ఉపకారాలతో, దేవుని గూర్చిన భావాల్ని జతపర్చటం జరిగేది. ప్రతీమేలు ప్రతి సౌకర్యం దేవుని అనుగ్రహం వల్ల కలుగుతున్నవేనని గుర్తించి దేవునికి కృతజ్ఞతలు తెలుపటం చిన్నారులు నేర్చుకొన్నారు.GCTel 49.2

    ప్రేమ మమతలు గల తల్లిదండ్రులు తమ చిన్నారులను ఎంతో ప్రేమించి వారిని స్వారాశలకు దూరంగా వుంచారు. వారి ముందు కష్టాలు శ్రమల జీవితం బహుశా తమ విశ్వాసం నిమిత్తం హతసాక్షి మరణం వున్నాయి. చిన్న నాటినుంచి కష్టాలు భరించటం, అధికారులకు అణిగిమణిగి వుండటం, అయినా స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోటం వారు నేర్చుకొన్నారు. బాధ్యత వహించటం, ఆచి తూచి మాట్లాడటం మౌనం వివేకమని గ్రహించటం చిన్నప్పుడే నేర్చుకొన్నారు. తమ విరోధుల వినికిడిలో అపసవ్యమైన ఒక్కమాట, ఆ వ్యక్తికేగాక వందలాది మందికి ప్రాణహాని కలిగించవచ్చు. ఎందుకంటే తమకు స్వాతంత్ర్యమున్నదని చెప్పుకొనే వారిని వెంటాడటానికి వేటకు బయలుదేరిన తోడేళ్ళమల్లే సత్యవిరోధులు వేచివున్నారు. GCTel 50.1

    వాల్దెన్సీయులు సత్యం కోసం లోకంలో ప్రగతిని త్యాగం చేశారు. ఉదర పోషణకు ఓర్పు సహనంతో కష్టించి పని చేశారు. పర్వతాల మధ్య సేద్యానికి పనికివచ్చే ప్రతీ స్థలాన్ని సేద్యపర్చారు. లోయల్లోను తక్కువ సారవంతమైన మెట్ట ప్రాంతాల్లోను కష్టపడి పని చేసి మంచి ఫలసాయం పొందారు. మితవ్యయం ఆత్మ పరిత్యాగం బిడ్డలు తమ స్వాస్థ్యంగా పొందిన విద్యలో ముఖ్యభాగమయ్యాయి. దేవుడు జీవితాన్ని క్రమశిక్షణకు రూపొందించాడని, తమ కోరికలు అవసరాలు వ్యక్తిగత పరిశ్రమ, యోచన, జాగరూకత విశ్వాసం వల్ల సరఫరా అవుతాయని తలిదండ్రులు బిడ్డలకు నేర్పించారు. ఈ ప్రక్రియ శ్రమతోను ఆయాసంతోను కూడినదైనా ఆరోగ్యవంతమైంది. తన పతనస్థితిలో మానవుడికి ఇది అవసరం. అతని తర్బీతుకు అభివృద్ధికి దేవుడు ఏర్పాటు చేసిన పాఠశాల ఇది. యువజనులను శ్రమకు కష్టానికి అలవర్చే తరుణంలో వారి మేధావికాసాన్ని అశ్రద్ధ చేయలేదు. తమ శక్తి సామర్థ్యాలు దేవునికి చెందినవని వాటిని దేవుని సేవకోసం వృద్ధి పర్చుకోవాలని వారికి నేర్పించారు.GCTel 50.2

    పవిత్రమైన, నిరాడంబరమైన వాడయి సంఘాలు అపోస్తలుల కాలంలోని సంఘాన్ని తలపించాయి. పోపు, ప్రైవేటుల ఆధిక్యాన్ని తోసిపుచ్చుతూ ఎన్నడూ పొరపడని బైబిలుకి మాత్రమే ఆ స్థానం వున్నదని వారు విశ్వసించారు. వారి పాదురులు, అధికారం చెలాయించే రోము మతగురువుల మల్లేగాక “సేవచేయించుకోటానికి కాదుగాని సేవ చేయటానికి వచ్చిన” తమ నాయకుని ఆదర్శాన్ని అనుసరించారు. పచ్చిక గల చోట్లకు జీవవాక్య జలాల ఊటల వద్దకు నడిపిస్తూ, దేవుని మందను మేపారు. మానవ మహిమకు దర్పానికి స్మృతి చిహ్నాలకు దూరంగా వారి సమావేశాలు జరిగాయి. బ్రహ్మండమైన ఆలయాల్లోను లేక చక్కని కేతిఒళ్లలోను కాదు అవి జరిగింది. కొండల ఛాయల్లో, ఆల్పు పర్వత లోయల్లో లేదా ప్రమాధ భరిత తరుణాల్లో ఏదో రాతి దుర్గంలో క్రీస్తు సేవకులు బోధించే సత్యాన్ని వినటానికి వారు సమావేశ మయ్యేవారు. సంఘ కాపరులు సువార్తను బోధించటమేగాక, వ్యాధి బాధితుల్ని సందర్శించటం చిన్న బిడ్డలకు ఉపదేశమివ్వటం, తప్పిదస్తులకు హితవు చెప్పటం తగవులు తీర్చి సామరస్యం సహోదర ప్రేమల్ని ప్రోది చేయటం చేసేవారు. శాంతి సమాధానాల దినాల్లో ప్రజల స్వేచ్ఛార్పణలతో వారి పోషణ జరిగేది. కాని డేరాలు కుట్టిన పౌలు మల్లే వారిలో ప్రతి ఒక్కరు అవసరమైనప్పుడు తమ్ముతాము పోషించు కొనేందుకు ఒక చేతి పనినో వృత్తినో చేసుకొవారు.GCTel 50.3

    సంఘకాపరులే యువతకు అధ్యాపకులు. ఆయాసామాన్య విధ్యావిభాగాల ననుసరించి విద్యాబోధన సాగినప్పటికీ వారు పధానంగా బైబిలునే అధ్యయనం చేశారు. మత్తయి సువార్త, యోహాను సువార్త వాటితోపాటు చాలా పత్రికల్ని వారు కంఠస్థం చేశారు. లేఖనాలకు ప్రతులు రాయటానికి కూడా యువతను ఉపయోగించటం జరిగింది. కొన్ని రాత ప్రతుల్లో బైబిలు అంతా వుండేది. తక్కిన వాటిలో చిన్నచిన్న భాగాలు మాత్రమే వుండేవి. లేఖనాలు విశదీకరించగలిగినవారు రాసిన సరళ విశదీకరణలు వాటికి జోడించటం జరిగేది. దేవునికి పైగా తమ్మును తాము హెచ్చించుకో జూచిన వారు ఎంతో కాలం గోప్యంగా ఉంచిన సత్యసంపద ఇలా వెలుగులోనికి రావటం జరిగింది.GCTel 51.1

    వాక్యం తర్వాత వాక్యం, అధ్యాయం తర్వాత అధ్యాయం ఓపికగా అవిశ్రాంతంగా, కొన్ని సార్లు భూగర్భంలో లోతైన చీకటి గుహల్లో దివిటీల వెలుగులో పరిశుద్ధ లేఖనాల నకళ్లు రాసేవారు. ఈ దైవకార్యం ఇలా కొనసాగింది. బహిర్గతమైన దైవచిత్తం స్వచ్చమైన అపరంజివలె ప్రకాశించింది. సత్యం నిమిత్తం తాము అనుభవించిన శ్రమల కారణంగా అది మరెంత తేజోవంతంగా, మరెంత స్పష్టంగా, మరెంత శక్తిమంతంగా ప్రకాశించిందో ఆ బాధ్యతను నిర్వహించిన వారు మాత్రమే గుర్తించ గలుగుతారు.GCTel 51.2

    తప్పుల చెత్త కింద తప్పుడు సిద్ధాంతాల్ని మూఢ నమ్మకాల కింద దేవుని సత్యవాక్కుల్ని కప్పి వుంచడమని పోపు మత గురువులను, ప్రిలేట్లను సాతాను యాచించాడు. కాని అద్భుత రీతిగా చీకటి యుగాల పొడవునా సత్యం ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా నిలిచి ఉంది. దానిపై మానవుడి ముద్రకాదు దేవుని ముద్ర ఉన్నది. సరళమైన, సులభమైన లేఖన భాగాల్ని మసకబార్చి బైబిలు తన్నుతాను ఖండించుకొనేటట్లు చేయటానికి ఎందరో నిర్విరామంగా కృషి చేశారు. చేస్తున్నారు. అయితే అది సముద్ర తరంగాల మీది ఓడల్లే తన్ను నాశనం చేస్తామని భయపెట్టే తుపానులను అధిగమించి పయనిస్తుంది. గని కింది పొరలో దాగి ఉన్న బంగారం, వెండి నిక్షేపాలు కోరేవారంతా తవ్వటం ఎలా అవసరమో అలాగే పరిశుద్ధ లేఖనాల్లో సత్యమనే బంగారు నిక్షేపాలున్నాయి. అవి యధార్ధవంతులు, వినయమనస్కులు, ప్రార్ధనాసక్తులు అయిన విశ్వాసులకే బయలు పడ్డాయి. మానవులు బాల్యంలోను, యౌవనంలోను, వృద్ధాప్యంలోను ఎల్ల సమయాల్లోను అధ్యయనం చేసేందుకు బైబిలును పాఠ్య గ్రంధంగా దేవుడు రూపొందించాడు. తన ప్రత్యక్షతగా ఆయన మానవులకు తన వాక్యానిచ్చాడు. బయలు పడిన ప్రతి నూతన సత్యం దాని కర్త అయిన దేవుని ప్రవర్తనను గూర్చి తాజా వివరణ అవుతుంది. మానవుల్ని సృష్టికర్తకు చేరువ చేయటానికి తద్వారా ఆయన చిత్తాన్ని గూర్చి వారికి స్పష్టంగా తెలియజేయటానికి దేవుడు సంకల్పించిన దివ్య సాధనం బైబిలు పఠనం. దేవునికి మానవునికి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలకు మాధ్యమం బైబిలే.GCTel 51.3

    యెహోవాపట్ల భయభక్తులు కలిగి ఉండుటమే జ్ఞానానికి మూలమని వాల్దెన్సీయులు పరిగణించినప్పటికీ మనోవికాసానికి, పరిసరాల అవగాహనకు మనుష్యుల జీవితాన్ని గూర్చిన జ్ఞానం ప్రాముఖ్యమన్న విషయాన్ని వారు విస్మరించలేదు. పర్వతాల్లోని తమ పాఠశాలల నుంచి కొందరు యువజనులు ఫ్రాన్స్ లేక ఇటలీలో విద్యాసంస్థలకు వెళ్లారు. తాము జన్మించిన ఆల్పు పర్వత పాఠశాలల్లోకన్న అధ్యయనానికి, ఆలోచనకు పరిశీలనకు మరిన్ని సదుపాయాలు అవకాశాలు అక్కడ వున్నాయి. ఇలా వెళ్ళిన యువజనులు శోధనలకు గురి అయ్యారు. వారు నేరాన్ని దుర్నీతిని ూశారు. వారికి అతినీచమైన సాతాను అనుచరులు ఎదురయ్యారు. మిక్కిలి మోసకరమైన తప్పుడు సిద్ధాంతాలను అపాయకరమైన మోసాలను వారు ఈ యువజనులముందు పెట్టారు. అయితే చిన్ననాటి నుంచి వీరు నేర్చుకొన్న విద్య ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోటానికి వీరిని తయారు చేసింది.GCTel 52.1

    చదువుకోటానికి తాము వెళ్లిన సంస్థలల్లో వారు ఎవరితోను సన్నిహితంగా వుండకూడదు. ప్రశస్తసంపద అయిన లేఖన ప్రతుల్ని దాచి వుంచటానికి అనువైన రీతిగా వారి దుస్తుల తయారీ జరిగింది. మాసాలుగా సంవత్సరాలుగా శ్రమపడి తయారు చేసిన ఈ ప్రతుల్ని వారు తమతో పట్టుకువెళ్లే వారు. అనుమానం కలిగించకుండా ఎప్పుడైతే సత్యమంటే ఆసక్తిగా ఉన్నవారికి పంచటం విజ్ఞతో అప్పుడు వారికి ఇచ్చేవారు. ఇలాంటి సేవకోసం వాల్టెన్సీయ యువత తమ తల్లి ఒడిలోనే శిక్షణ పొందేవారు. తమ కర్తవ్యమేంటో వారు ఎరిగి దాన్ని నమ్మకంగా నిర్వహించే వారు. ఈ విద్యా సంస్థల్లోని కొందరు క్రైస్తవ విశ్వాసాన్ని స్వీకరించారు. కొన్నిసార్లు ఆ విశ్వాస నియమాల ప్రభావం పాఠశాల అంతా ప్రసరించేది. కాగా పోపు మత నేతలు ఎంత పట్టుదలతో దర్యాప్తు చేసినా ప్రజల్ని చెరచే తప్పుడు బోధగా వారు వర్ణిస్తున్న బోధనకు కారకుల్ని కనిపెట్టలేక పోయేవారు.GCTel 52.2

    క్రీస్తు స్వభావం సువార్తను పంచే స్వభావం. క్రీస్తు నూతన పరచిన హృదయం మొదటి ఆలోచన ఇతరులను కూడా రక్షకుని వద్దకు తీసుకురావాలన్నదే. వాడోయి క్రైస్తవుల స్పూర్తి అలాంటిదే. తాము సత్యాన్ని పవిత్రంగా కాపాడి తమ సంఘాల్లో భద్రంగా ఉంచటం కన్నా ఇంకా ఎక్కువ తమ నుంచి దేవుడు కోరుతున్నాడని, చీకటిలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు తమ వెలుగు ప్రకాశింప జేయటం తమ బాధ్యత అని వారు భావించారు. దైవ వాక్యానికున్న మహాత్తర శక్తి వల్ల, రోము విధించిన దాస్య శృంఖలాల్ని బద్దలు కొట్టటానికి వారు కృషిచేశారు. వాడోయి సువార్త సేవకులు మిషనెరీలుగా శిక్షణ పొందారు. సువార్త సేవ చేయాలని ఆశించిన ప్రతీవారు మొదట బోధకుడిగా కొంత అనుభవం సంపాదించటం తప్పనిసరి. మాతృదేశంలో ఒక సంఘానికి బాధ్యత వహించకముందు ప్రతి ఒక్కరూ మూడు సంవత్సరాలు ఏదో స్థలంలో సువార్తసేవ చేయటం అవసరం. మా వ ఆత్మలకు పరీక్షగా పరిణమించిన ఆ దినాల్లో ఆత్మపరిత్యాగం, త్యాగం ఆరంభంలోనే అవసరమయ్యే ఈ సేవ పాదిరి జీవితానికి సరైన ఆరంభం. ఈ పవిత్ర బాధ్యతకు అభిషేకం పొందిన యువకులు ఈ సేవలోకి సంపదల కోసం, పేరు ప్రతిష్ఠలకోసం కాక కష్టభరిత జీవితం, అపాయం . ఇంకా చెప్పాలంటే క్రీస్తుకు సాక్షిగా మరణించటం - వీటికోసం ఎదురు చూశారు. యేసు తన శిష్యుల్ని పంపినరీతిగా ఈ మిషనెరీలు ఇద్దరిద్దరుగా వెళ్లారు. ఒక యువకుడు వయసు అనుభవమూ ఉన్న ఒక వ్యక్తి కలిసి పని చేసేవారు. ఈ యువకుణ్ణి తన సహచరుడు నడిపిస్తూ శిక్షణ నిచ్చేవాడు. యువకుడు ఈ పెద్ద వ్యక్తి సూచనల్ని పాటించితీరాలి. ఈ తోటిపనివారు అన్ని సమయాల్లోనూ కలిసివుండేవారు కాదు. కాని ప్రార్థనకు సలహాలకు తరచుగా కలుసుకొనేవారు. ఇలా వీరు ఒకరినొకరు విశ్వాసంలో పటిష్ఠ పర్చుకొనేవారు.GCTel 53.1

    వారు తమ ఉద్దేశమేంటో ప్రకటించివుంటే అది ఆ ఉద్దేశం పరాజయానికి తోడ్పడి వుండేది. అందువలన వారు తమ యధార్థ వర్తనను మరుగున ఉంచారు. ప్రతీ బోధకుడు ఒక చేతిపనినో, వృత్తినో చేపట్టేవాడు. ఒక లౌకిక వృత్తి ముసుగుతో ఈ మిషనెరీలు తమ సేవను నిర్వహించేవారు. సర్వసాధారణంగా వారు వర్తకుడిగానో, వ్యాపారిగానో వ్యవహరించేవారు. పెద్ద పెద్ద దుకాణాల్లో తప్ప సాధారణంగా ప్రజలకు అందుబాటులోలేని “సిల్కు బట్టలు, ఆభరణాల వంటి వస్తువులను అమ్మటానికి వారు వెళ్లేవారు. మిషనెరీలగా వెళ్లే లెక్కచేయని ప్రజలు వాళ్లను వ్యాపారులుగా స్వాగతించారు.” విలీ, పుస్త1, అధ్యాయం 7. ఇలా వ్యవహరించిన సమయ మంతటిలోను బంగారంకన్న ముత్యాల కన్న ఎంతో ప్రశస్తమైన భాగ్యాన్ని ప్రజలకు అందించటంలో వివేకాన్ని అనుగ్రహించుమని వారు ప్రార్థన చేసేవారు. వారు బైబిలు ప్రతులను లేదా దాని పుస్తకాల ప్రతులను తమతో రహస్యంగా ఉంచుకొనేవారు. అవకాశం వచ్చినప్పుడు ఆ ప్రతుల్ని వినియోగదారుల దృష్టికి తీసుకువెళ్ళేవారు. దైవ వాక్యాన్ని పఠించాలన్న కోరిక తరచు ఈ విధంగా మొగ్గ తొడిగేది. ఆసక్తి చూపించిన వారివద్ద దైవ వాక్యభాగాన్ని విడిచి వెళ్లటం జరిగేది.GCTel 54.1

    ఈ మిషనెరీల సేవ తమ పర్వత లోయలలోను పరిసర ప్రాంతాలలోను, పట్టణాలు, గ్రామాల్లోను ప్రారంభమైంది. వాటి పొలిమేరలు దాటి కూడా అది విస్తరించింది. తమ ప్రభువు యేసు శిష్యుల్లాగనే వారు వట్టికాళ్లతో ప్రయాణంలోమాసి మరకలు పడ్డ దుస్తులలో పెద్దపెద్ద నగరాలు దాటుకుంటూ దూరదేశాలకు వెళ్లేవారు. వారు ప్రతిచోటా సత్యబీజాన్ని నాటారు. వారి మార్గంలో సంఘాలు లేచాయి. హతసాక్షుల రక్తం సత్యం పక్షంగా సాక్ష్యమిచ్చింది. నమ్మకమైన ఈ బోధకుల సేవల ఫలితంగా ఎంత విస్తారమైన పంట లభించిందో దేవుని దినాన వెల్లడికానుంది. దేవుని వాక్యం ముసుగులో ఉండి సడిచప్పుడులేకుండా క్రైస్తవ లోకంలో ముందుకు సాగుతున్నది. ప్రజల గృహాలు మనసులు దాన్ని సంతోషంగా అంగీకరించాయి.GCTel 54.2

    వాల్టెన్సీయులకు లేఖనాలంటే గతంలో దేవుడు మానవులతో వ్యవహరించిన దాఖలాలు, ప్రస్తుత కాలానికి బాధ్యతలు విధుల దాఖలాలు మాత్రమేకాదు గాని, భవిష్యత్తులోని అపాయాలు, మహిమల విశదీకరణ కూడా. లోకంలోని సమస్తమూ అంతమొందే సమయం ఆట్టే దూరంలో లేదని వారు నమ్మారు. ప్రార్ధనతోను, కన్నీళ్ళతోను బైబిలును అధ్యయనం చేసిన కొద్దీ అందున్న సత్యాలకు ఆకర్షితులై రక్షణ కలిగించే ఆ సత్యాల్ని ఇతరులకు పంచటం తమ విహిత కర్తవ్యమని గుర్తించారు. పవిత్రమైనఆ గ్రంథం పుటల్లో రక్షణ ప్రణాళిక విశదీకరణ వారు స్పష్టంగా చూశారు. యేసును విశ్వసించటం ద్వారా ఓదార్పును, నిరీక్షణను సమాధానాన్ని పొందారు. వాక్యజ్ఞానం వల్ల తమ అవగాహన ఉజ్వలమై తమ హృదయాలు సంతోషానందాలతో నిండగా పోపుల తప్పుడు బోధల కటికి చీకటిలో మగ్గుతున్న ప్రజలపై సత్యకిరణాలు ప్రసరింప జేయాలని వారు ఆశించారు.GCTel 54.3

    పోపు మతగురువుల మార్గదర్శకత్వం కింద వేలాది ప్రజలు తమ శరీరాలను హింసించుకోటం ద్వారా పాపక్షమాపణ పొందటానికి వ్యర్ధంగా ప్రయత్నించటం వారు చూశారు. తమ సత్కియలే తమకు రక్షణ నిస్తాయన్న బోధను నమ్మి ప్రజలు తమపై తామే ఆధారపడ్డారు. వారి మనసులు తమ పాప స్థితిని గూర్చి తలంచి తాము దేవుని ఉగ్రతకు గురి కానున్నట్లు గుర్తించి శరీరాత్మలను హింసించుకొన్నా, ఉపశమనం కరవయ్యింది. మనస్సాక్షిగల ఆత్మలు ఇలా రోము సిద్ధాంతాలకు బందీలయ్యాయి. వేలాదిమంది స్నేహితులను బంధువులను విడిచిపెట్టి తమ జీవితాలను ఆశ్రమాలలో గడిపారు. తరచుగా ఉపవాసాలు ఆచరించటం ద్వారా కొరడాలతో క్రూరంగా కొట్టుకోటం ద్వారా, జాగారాల ద్వారా, దీర్ఘయాత్రల ద్వారా మనస్సాక్షిని శాంతపర్చడానికి అనేకమంది వ్యర్ధంగా ప్రయత్నించారు. పాపం చేశామన్న క్షోభతో, దేవుని ఉగ్రతకు లోను కానున్నామన్న భయంతో బాధపడూ, అలసిపోయి నిస్పృహకు గురిఅయి నిరీక్షణను కోల్పోయి ఎంతోమంది సమాధుల్లోకి వెళ్లి పోయారు.GCTel 55.1

    ఆకలిగావున్న ఆత్మలకు జీవాహారాన్ని వడ్డించాలని, దేవుని వాగ్దానాల్లో ఉన్న సమాధాన వర్తమానాన్ని వారిముందుంచాలని వాల్దెన్సీయులు తహతహలాడారు. రక్షణకు ఒకే ఒక నిరీక్షణ యేసే అని వారు సూచించారు. దైవధర్మశాస్త్ర ఉల్లంఘనకు సుక్రియల సిద్ధాంతం పరిష్కార మన్నది తప్పుడు బోధమీద ఆనుకొని ఉంది. మన నీతిపై ఆధారపడటం క్రీస్తు అనంత ప్రేమను చూడకుండ మనకడ్డం వస్తుంది. పాపంలో పడ్డ మానవజాతి తన్నుతాను దేవునికి సిపార్సు చేసుకోజాలదు. గనుక యేసు మానవుడి కోసం బలి పశువుగా మరణించాడు. సిలువలో మరణించి తిరిగి లేచిన రక్షకుని నీతే క్రైస్తవ విశ్వాసానికి పునాది. ఒక అవయవం శరీరం మీద లేదా ఒక తీగ పాదు మీద ఆధారపడి జీవించటం ఎంత నిజమో క్రీస్తు మీద ఆత్మ ఆధారపడి జీవించటం అంతే నిజం.GCTel 55.2

    దేవుని ప్రవర్తన, ఇంకా చెప్పాలంటే క్రీస్తు ప్రవర్తన కూడా, కఠినమైంది, నిస్తేజమైంది, ఆకర్షణరహితమైందీ అని మనుషులు భావించటానికి పోపులు, మతగురువుల తప్పుడు బోధలే కారణం. పాపస్థితిలో ఉన్న మాసవుని పట్ల రక్షకునికి సానుభూతి బొత్తిగా లేదని అందుచేత మతగురువులు మరణించిన పరిశుద్దుల మధ్యవర్తిత్వం కోరటం అవసరమని ప్రచారం జరిగింది. దైవవాక్యం వలన ఉత్తేజం పొందిన వారు యేసును దయామమకారాలు గల ప్రభువుగాను, చేతులు చాపి అందరూ తమ పాప భారంతో, చింతలతో, దుఃఖంతో తన చెంతకు రండంటూ ఆహ్వానిస్తున్న రక్షకుడుగాను ప్రజలకు చూపించాలని ఆకాక్షించారు. మనుషులకు దేవుని వాగ్దానాలు కనిపించకుండా సాతాను సృష్టించిన ప్రతిబంధకాలను తొలగించి వారు ప్రత్యక్షంగా దేవుని వద్దకు వచ్చి తమ పాపాలు ఒప్పుకొని క్షమాపణను సమాధానాన్ని పొందటానికి తోడ్పడాలని వారు అభిలషించారు.GCTel 55.3

    తెలుసుకోగోరే మనసుకు ప్రశస్త సువార్త సత్యాన్ని వివరించేందుకు వాడోయి మిషనెరీ ఆతృతగా వుండేవాడు. ఆచితూచి అడుగులు వేస్తూ అతడు పరిశుద్ధ లేఖన భాగాల్ని అందించేవాడు. కక్ష తీర్చుకునే వాడిగా, న్యాయాన్ని నిర్దాక్షిణ్యంగా అమలు చేయటానికి కాచుకొని ఉన్నవాడిగా మాత్రమే దేవుని చూడగలిగిన, మనసాక్షి పాపస్పృహ కలిగిన ప్రజలకు నిరీక్షణ నీయటం అతనికి అమితానందం కలిగించింది. వణికే పెదవులతో, చేమర్చే కళ్ళతో మోకాళ్లూని పాపికున్న ఒకే ఒక నిరీక్షణను వెలువరించే ప్రశస్త వాగ్దానాల్ని సహోదరులకు వివరించేవాడు. అనేక చీకటి హృదయాల్లోకి సత్యకాంతి ఈ విధంగా ప్రసరించి నీతి సూర్యుడు తన కాంతి పుంజాల్తో స్వస్థతతో ప్రకాశించేంత వరకు చీకటి తెరను నిలువరించింది. విన్నది నిజమని ధ్రువపర్చుకోటానికా అన్నట్లు కొన్ని లేఖన భాగాల్ని పదేపదే చదవటం తరచు జరుగుతుండేది. మరీ ముఖ్యంగా ఈ మాటల్ని పదేపదే వినటానికి వారు ఆశించేవారు “ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును” 1యోహాను 1:7. “అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో, ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను.” యోహాను 3:14,15.GCTel 56.1

    తన హక్కుగా రోము భావిస్తున్నదాని విషయంలో ఎక్కువమంది మోసపోలేదు. పోపుల తరపున మనుషులుగాని, దేవదూతలుగాని, మధ్యవర్తులుగా వ్యవహరించట మన్నది వ్యర్ధభావన అని వారు గ్రహించారు. తమ అంతరంగంలో యధార్ధమైన వెలుగు ఉదయించగా ఆనందోత్సాహాలతో వారు ఇలా పలికారు, “క్రీస్తే నా యాజకుడు, ఆయన రక్తం నాకోసం ఆయన చేసిన బలిదానం, ఆయన బలిపీఠం నా పాపపు ఒప్పుకోలును ఆయన వినే స్థలం” ఈ మాటలు పలుకుతూ వారు పూర్తిగా యేసు నీతి ప్రభావంమీద ఆధారపడి ఉన్నారు. “విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడై యుండుట అసాధ్యము.” హెబ్రీ. 11:6. “ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము” అ.కా.4:12.GCTel 56.2

    రక్షకుని ప్రేమ తమకు నిశ్చయంగా ఉన్నదని ఈ తుఫాను పీడిత ప్రజలు కొందరు గ్రహించటం కష్టమయ్యింది. కాగా అది వారికి అసూహ్యమైన ఉపశమనాన్ని ఇచ్చింది. సత్యకాంతి వరదల్లే ముంచి వారిని తిన్నగా పరలోకానికి రవాణా చేసినట్లనిపించింది. వారు తపు చేయిని క్రీస్తు చేతిలో నిస్సంకోచంగా ఉంచారు. వారి పాదాలు యుగయుగాల శిలపై స్థిరంగా నిలిచాయి. తమ విమోచకుని నామాన్ని ఘనపర్చటానికి చెరసాలకు వెళ్లేందుకు అగ్నిలో కాలేందుకు వారు ఇప్పుడు సిద్ధమయ్యారు.GCTel 57.1

    దైవ వాక్యాన్ని రహస్య స్థలాలకు తీసుకువెళ్ళి అక్కడ కొన్ని సార్లు ఒక వ్యక్తికి కొన్ని సార్లు సత్యమంటే ఆశగా ఉన్న కొంతమంది ప్రజలకు చదివి వినిపించేవారు. తరచు ఇలాంటి అధ్యయనంలో రాత్రంతా గడిచిపోయేది. వినేవారికి చెప్పలేనంత ఆశ్చర్యం ఆనందం కలిగేవి. ఈ కృపావర్తమానాన్ని అందించే వ్యక్తి రక్షణ వార్తల్ని గూర్చి వారికి గ్రహింపు కలిగేంతవరకు చదవటం తరచుగా అపటం జరిగేది. వారినుంచి తరచు ఇలాంటి మాటలు వినిపించేవి “నా అర్పణసు దేవుడు అంగీకరిస్తాడా? ఆయన నన్ను కటాక్షిస్తాడా? నన్ను క్షమిస్తాడా?” “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును” (మత్తయి 11:28). అన్న జవాబు చదివి వినిపించటం జరిగేది.GCTel 57.2

    ఆ వాగ్దానాన్ని విశ్వాసం అవగాహన చేసుకొన్నది. దానికి ప్రతి స్పందన కూడా వినిపించింది “పుణ్యక్షేత్రాలు దీర్ఘయాత్రలతో ఇక పనిలేదు. గుళ్ళు గోపురాల సందర్శనార్ధం దీర్ఘ ప్రయాణాలు ఇక అక్కరలేదు. నేనున్న స్థితిలోనే అనగా వా = పాప, అపవిత్ర స్థితిలో యేసువద్దకు రావచ్చు. మార్పు చెందిన పాపి ప్రార్ధనను ఆయన తోసిపుచ్చడు. నీపాపములు క్షమింపబడియున్నవి, నాపాపాలకు కూడా క్షమాపణ వుంటుంది!”GCTel 57.3

    పరిశుద్దానందం హృదయాన్ని వరదల్లే నింపగా స్తుతివందనాలతో వారు యేసు నామాన్ని ఘనపర్చటం జరిగింది. సత్యాన్ని ప్రకటించటానికి యధార్ధమైన సజీవమైన మారాన్ని కనుగొన్న తమ నూతన అనుభవాన్ని తమ శక్తిమేరకు ఇతరులకు వివరించటానికి ఆనందంతో ఉప్పొంగుతున్న ఆ విశ్వాసులు తమ గృహాలకు తిరిగి వెళ్లారు. సత్యం కోసం ఆశగా ఎదురు చూస్తున్న వారి హృదయాలతో ప్రత్యక్షంగా మాట్లాడేందుకు లేఖన వాక్కుల్లో ఒక గంభీర, విశిష్ట శక్తి వుంది. అది దేవుని స్వరం.GCTel 57.4

    సత్యదూత తన దారిన తాను వెళ్లిపోయాడు. అయితే అతని వినయ వైఖరి, నిజాయితీ, శ్రద్ధాసక్తులు, ఉత్సాహోద్రేకాలు చర్చాంశాలయ్యాయి. అనేక సందర్భాల్లో అతని శ్రోతలు ఎక్కడ నుంచి వచ్చావు? ఎక్కడకు వెళ్లావు? అని అతణ్ణి ప్రశ్నించలేదు. ఆదిలో వారు విస్మయానికి గురి అయ్యారు. అనంతరం తమలో పెల్లుబికిన కృతజ్ఞత ఆనందాలవల్ల అతణ్ణి ప్రశ్నించాలనుకోలేదు. తమ గృహాలకు రావలసిందిగా వారు ఆహ్వానించినప్పుడు తప్పిపోయిన గొర్రెల్ని తాను సందర్శించాలని ప్రత్యుత్తర మిచ్చాడు. అతను పరమునుంచి వచ్చిన దేవదూతా అని ఒకరినొకరు ప్రశ్నించుకొన్నారు.GCTel 58.1

    పెక్కు సందర్భాల్లో ఆ సత్యదూత మళ్లీ కనిపించలేదు. తక్కిన దేశాలకు వెళ్లాడో లేక ఏదో అజాత బందీగృహంలో మగ్గుతున్నాడా లేక సత్యాన్ని బలపర్చుతూ ఎక్కడైతే సాక్ష్యం చెప్పాడో ఆ తాపుల్లోనే హింస పొందుతున్నాడో ఏమో. అతను చెప్పిపోయిన మాటల్ని మాత్రం ఎవరూ నాశనం చేయలేరు. మనుషుల హృదయాల్లో అవి తమ పనిని చేస్తూనే ఉన్నాయి. వాటి శుభప్రధమైన ఫలితాలు తీర్పు దినానే బయలు పడ్డాయి.GCTel 58.2

    వాల్టెన్సీయ మిషనెరీలు సాతాను సామ్రాజ్యంపై దాడి చేస్తున్నారు. అందుచేత చీకటి శక్తులు అప్రమత్తమయ్యాయి. సత్యాన్ని చాటే ప్రతి ప్రయత్నాన్ని, దుర్నీతి దొర జాగ్రత్తగా పరిశీలించి తన అనుచరుల యాల్ని రెచ్చగొట్టాడు. ఈ పేద సంచారక సువార్తికుల సేవ తమ పనికి ప్రమాదకరమన్న సూచికలు పోపునేతలకు స్పష్టంగా కనిపించాయి. సత్యకాంతి ప్రకాశించకుండా అడ్డు కొనక పోతే ప్రజల్ని కప్పివేసిన అసత్యాల మేఘాన్ని అది విడగొడుంది. సత్యం మనుషుల్ని దేవుని వద్దకు నడిపించి చివరికి రోము ప్రాబల్యాన్ని అంతం చేస్తుంది.GCTel 58.3

    సనాతన సంఘ విశ్వాసాన్ని అనుసరించే ఈ ప్రజల ఉనికి రోము మత భష్టతకు నిత్యసాక్ష్యం గనుక అది తీవ్ర విద్వేషాన్ని హింసను రెచ్చగొట్టింది. లేఖనాల్ని తనకు స్వాధీన పర్చటానికి వారు నిరాకరించటం రోము సహించలేని నేరం. వారిని భూతలం నుంచి తుడిచివేయటానికి రోము కృత నిశ్చయంతో ఉంది. పర్వతాల్లోని తమ గుహాల్లో ఉంటున్న దైవ ప్రజలకు వ్యతిరేకంగా అతిభయానక దండయాత్రలు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. వారిపై దర్యాప్తు జరపటానికి దర్యాప్తు వాదుల్ని వారి వెనుక ఉంచారు. హంతకుడు కయీను చేతిలో నిరపరాధి హేబేలు మరణించిన సన్నివేశం పునరావృత్తమయ్యింది.GCTel 58.4

    వారి పొలాలను గృహాలను పదేపదే విధ్వంసం చేశారు. వారి మందిరాల్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఒకప్పుడు ఈ అమాయక శ్రమజీవులు పండించుకొన్న పొలాలు, నివసించిన గృహాలు అరణ్యంగా మిగిలాయి. రక్తం రుచి చూసిన క్రూరమృగం మరింత బీభత్సంగా ఎలా తయారవుతుందో అలాగే తమ బాధితుల కష్టాలు శ్రమలు పోపు వర్గాల క్రూరత్వాన్ని తీవ్రతరం చేశాయి. పవిత్ర విశ్వాసానికి సాక్షులుగా నిలబడ్డ అనేకమందిని పర్వతాలు దాటి కూడా వెంబడించి దట్టమైన అరణ్యాలు పర్వత శిఖరాల నడుము లోయల్లో తలదాచుకొంటున్న వారిని జంతువుల్లా వేటాడి చంపారు.GCTel 59.1

    బహిష్కరణకు గురి అయిన ఈ ప్రజల నైతిక ప్రవర్తన విషయంలో ఎలాంటి నిందలు మోపలేకపోయారు. వారు శాంతి కాముకులు, నెమ్మదిపరులు, భక్తిపరులూ అని తమ శతృవులు సహితం వారి గురించి సాక్ష్యమిచ్చారు. వారు చేసిన గొప్ప నేరం పోపు నిర్దేశించిన పద్దతిలో దేవున్ని ఆరాధించకపోవటం. ఈ నేరానికి శిక్షగా సిగ్గు, అవమానం, మానవులుగాని దయ్యాలుగాని రూపొందించలేనంత దారుణమైన హింసకు వారిని గురిచేశారు.GCTel 59.2

    తాను ఎంతగానో ద్వేషిస్తున్న ఆ ప్రజల్ని నిర్మూలించాలని పోపు ఒకప్పుడు నిర్ధారణ చేసుకొని వారిపై సంఘ సిద్ధాంత వ్యతిరేకులుగా ముద్రవేసి శిరచ్ఛేదనానికి అప్పగిస్తూ ఒక ప్రకటన పత్రాన్ని (బుల్) జారీ చేశాడు. వారిని సోదరుగా, అపనమ్మకస్తులుగా లేక క్రమంలేని వ్యక్తులుగా నిర్ధారించలేదు. కాని “నిజమైన మందతాలూకు గొర్రెలను” పాడు చేసేందుకు భక్తిపరులుగాను పరిశుద్ధులుగాను పైకి కనిపించే రూపం గలవారిగా నిందించాడు. కాబట్టి “అపాయకరమైన, హేయమైన, ఆ దుర్జనులు తమ నమ్మకాల్ని వదులుకోకపోతే విషసర్పాన్ని నలిపి చంపేటట్లు చంపండి” అన్నది పోపు హుక్కుం-విలీ, పుస్త, 16, అధ్యా. 1. గర్వాంధుడైన ఈ పరిపాలకుడు ఆ మాటలు మళ్లీ వింటానని అనుకొన్నాడా? తీర్పు సమయంలో తనకు వినిపించటానికిగాను అవి దాఖాలయ్యాయని అతడికి తెలుసా? “మిక్కిలి అల్పులైన యీనా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరిగనుక నాకు చేసితిరి” మత్తయి 25:40.GCTel 59.3

    సంఘ సిద్ధాంత వ్యతిరేకులకు వ్యతిరేకంగా పోరాటం సాగించటంలో సంఘ సభ్యులందరూ ఏకం కావాలని ఈ ప్రకటన పత్రం పిలుపునిచ్చింది. క్రూరమైన కార్యనిర్వహణలో నిమగ్నులయ్యే వారికి ప్రోత్సాహంగా “మత సంభంధమైన శ్రమలు బాధల నుంచి, జరిమానాలనుంచి, చేసిన వాగ్దానాల నుంచి విముక్తి కలిగించి తాము అన్యాయంగా సంపాదించిన ఆస్తికి వారి హక్కుదారీ తనాన్ని చట్టబద్ధం చేస్తానని, సిద్ధాంత వ్యతిరేకుల్ని చంపిన వారి పాపాలన్నింటినీ క్షమిస్తానని ఆ పత్రం వాగ్దానం చేసింది. వాల్డోయిలకు ఉపకరించే గుత్తలన్నింటిని రద్దుచేసి వారి యిళ్లలో పనిచేసేవారు ఆ పనులు విరమించుకోవలసిందిగా ఆజ్ఞాపించి, వారికి ఎవరూ ఎలాంటి సహాయం చేయటం నిషేధించింది. ప్రకటన పత్రం వారి ఆస్తిని సొంతం చేసుకోటానికి అందరికీ హక్కును ప్రసాదించింది. ” విలీ, పుస్త16, అధ్యా 1. ఈ సన్ని వేశాల వెనుక వున్న దుండగుణ్ణి ఈ పత్రం బట్టబయలు చేస్తున్నవి. ఇక్కడ వినిపిస్తున్నది క్రీస్తు వాణికాదు, ఘటసర్పం గర్జన.GCTel 59.4

    పోపుమతనాయకుల ప్రవర్తన ఒరవడికి దైవ ధర్మశాస్త్రం ప్రమాణంకాదు. తమకు అనుకూలంగా ఉండే రీతిలో ప్రమాణాలు రూపొందించుకొని అందరూ వాటిని అనుసరించాలని కోరే రోమా ప్రభువుల చిత్తమే. అతి దారుణ విషాదాలు చోటు చేసుకొన్నాయి. అవినీతిపరులు, భ్రష్టులు అయిన మత గురువులు తమకు సాతాను అప్పగించిన పనిని నిర్వహిస్తున్నారు. వారి నైజంలో దయదాక్షిణ్యాలకు తావులేదు. ఏ ముష్కర స్వభావం క్రీస్తును సిలువవేసిందో, అపోస్తలుల్ని సంహరించిందో, తన కాలంలో నివసించిన విశ్వాసుల్ని హింసించి చంపటానికి పచ్చినెత్తురు తాగే నీరోను ఉద్రేకపర్చిందో అదే స్వభావం లోకంలో ఉన్న దేవుని బిడ్డలను మట్టుపెట్టటానికి కృషి చేస్తున్నది.GCTel 60.1

    దేవుని ప్రేమిస్తూ నివసిస్తున్న ప్రజలు అనేక శతాబ్దాలుగా తమకు కలిగిన హింసను సహసంతో, దేవునికి మహిమ తెచ్చే అచంచల విశ్వాసంతో సహించారు. తమపై దాడులు, అమానుషమైన ఊచకోత సాగుతున్నప్పటికీ ప్రశస్త సత్యాన్ని వెదజల్లేందుకు వారు మిషనెరీలను పంపుతూనే ఉన్నారు. వారిని జంతువుల్లా వేటాడి చంపారు. అయినా వారు తాము విత్తిన విత్తనాల్ని తమ రక్తంతో తడిపారు. ఆ విత్తనాల పంట సమృద్ధిగా వచ్చింది. ఈ విధంగా లూథర్ జనానికి శతాబ్దాలు ముందే వాల్దెన్సీయులు దేవున్ని గూర్చి సాక్ష్యమిచ్చారు. అనేక దేశాల్లోకి చెదరిపోయి విక్లిఫ్ కాలంలో ఆరంభమై “దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును” (ప్రకటన 1:9.) శ్రమలను భరించటానికి సిద్ధంగా ఉన్నవారి ద్వారా లోకాంతం వరకు కొనసాగాల్సిన సంస్కరణ ఉద్యమానికి వారు అంకురార్పణ చేశారు.GCTel 60.2