Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

మహా సంఘర్షణ

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయం 9—స్విస్ సంస్కర్త

    సంఘ స్థాపనలో కనిపిస్తున్న దైవ ప్రణాళికే సంఘ సంస్కరణ సాధనాల ఎంపికలోనూ కనిపిస్తున్నది. ప్రజా నాయకులుగా ప్రశంసలు నివాళులు అందుకోటానికి అలవాటుపడ్డ గొప్ప వ్యక్తులను అధికార హోదాలు గల వారిని భాగ్యవంతులను పరమ గురువు యేసు పిలువలేదు. వారు గర్వాంధులై ఆత్మవిశ్వాసంతో నిండి తాము అధికులమని విర్రవీగిన కారణంగా తోటి మానవుల పట్ల సానుభూతి కలిగిన నజరేయుడు దీనుడు అయిన యేసుతో కలిసి పని చేయటానికి వారిని తీర్చి దిద్దటానికి సాధ్యపడలేదు. చదువులేని వారు, శ్రమజీవులు అయిన గలిలయ మత్సకారులకు “నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతును” (మత్తయి 4:19) అన్న పిలుపు వచ్చింది. శిష్యులు అణకువగలవారు, నేర్చుకొనేందుకు ఆసక్తిగల వారు. తమ కాలంలోని తప్పుడు బోధనల ప్రభావానికి ఎంత తక్కువగా లోనైతే అంత ఎక్కువ విజయవంతంగా వారిని యేసు ఉపదేశించి తన సేవకోసం తర్ఫీతు చేయగలిగేవాడు. సంస్కరణ కాలంలో జరిగిందీ అదే. సంస్కరణోద్యమంలోని ప్రధాన నాయకులు సాధారణ మనుషులు, అంతస్తువల్ల గర్వం లేనివారు. మత మౌఢ్యంవల్ల పూజారి నైపుణ్యం వల్ల ప్రభావితులు కాని వారు. గొప్ప ఫలితాలు సాధించటానికి సామాన్య సాధనాలను ఉపయోగించటం దేవుని సంకల్పం. అప్పుడు మహిమ మనుషులకు కాక తన చిత్తం తన దయాసంకల్పం నెరవేర్చే వ్యక్తుల ద్వారా పనిచేసే ఆ ప్రభువుకే కలుగుతుంది.GCTel 152.1

    జర్మనీలోని సేక్సనీ పట్టణంలో ఒక గని కార్మికుడి ఇంట లూథర్ జన్మించిన కొన్ని వారాలకు ఆల్ప్ పర్వత ప్రాంతంలో ఒక పశువుల కాపరి ఇంట ఉరిక్ జ్వింగ్లీ జన్మించాడు. బాల్యంలోను తొలినాళ్ల తర్ఫీతులోను జ్వింగ్లో పెరిగిన పరిసరాలు తన భావి కర్తవ్యానికి ఆయనను సన్నద్ధం చేయటానికి అనుకూలించాయి.GCTel 152.2

    ప్రకృతి సిద్ధమైన సౌందర్యం అందం సుందర దృశ్యాలు భీకర గాంభీర్యతల నడుమ పెరిగిన జ్వింగ్లీ చిన్ననాటి నుంచే దేవుని ఔన్నత్యాన్ని మహాశక్తిని మహిమా ప్రభావాల్ని గుర్తించి అభినందించాడు. తాను జన్మించిన పర్వతాల్లో జరిగిన సాహస కార్యాల చరిత్ర ఆయన యౌవన హృదయంలో అభిలాషలను రగిలించింది. భక్తురాలైన తన తల్లి సంఘ ఆచారాలు సంప్రదాయాల నుంచి పోగుచేసిన కొన్ని బైబిలు కథలు చెప్పగా వినేవాడు. పితరులు ప్రవక్తల భక్తి జీవిత కార్యాలను, పాలస్తీన కొండల్లో తమ మందల్ని కాస్తుండగా దేవదూత మాట్లాడిన గొర్రెల కాపర్లను బేల్లెహేము శిశువును కల్వరిలోని రక్షకుణ్ణి గూర్చిన కథల్ని ఎంతో ఆశగా వినేవాడు.GCTel 153.1

    జాన్ లూథరల్లే జ్వింగ్లీ తండ్రి కూడా తన కుమారుడు చదువుకోవాలని కోరి లోయలోని తన నివాసం నుంచి ఆ బాలుణ్ణి బైటికి పంపాడు. ఆ బాలుడి మనసు త్వరగా వికాసం చెందింది. అతనికి విద్య నేర్పేందుకు సమరుడైన అధ్యాపకుణ్ణి కనుగోటం కష్టమయ్యింది. పదమూడేళ్ల ప్రాయమప్పుడు అతడు బర్న్ నగరానికి వెళ్లాడు. అక్కడ అప్పటిలో స్విట్జర్లాండ్ దేశమంతటిలోను ఉత్తమమైన విద్యాలయం ఉండేది. అయితే ఇక్కడ ఒక చిక్కు ఏర్పడింది. అది ఇతని భవిష్యత్తునే భగ్నం చేసేదిగా తోచింది. ఈ యువకుణ్ణి ఆశ్రమ జీవితంలోకి ఆకర్షించేందుకు సన్యాసులు విశ్వప్రయత్నాలు చేశారు. ప్రజాదరణకోసం డొమినికన్ సన్యాసులు గ్రీన్ సిస్కన్ సన్యాసుల మధ్య పోరాటం కొనసాగేది. ఆలయాన్ని ఆకరణీయంగా అలంకరించటం, ఆడంబరమైన ఆచారకర్మలు ప్రసిద్ధ మృతావశేషాల ప్రదర్శన, సూచక క్రియలు చేసే విగ్రహాలు వీటి ద్వారా ఈ కార్యాన్ని సాధించటానికి ప్రయత్నించేవారు.GCTel 153.2

    ప్రతిభాశాలి అయిన ఈ యువ విద్వాంసుణ్ణి తమ పక్కకు తిప్పుకో గలిగితే తమకు లాభం గౌరవం రెండూ చేకూరగలవని బరిలోని డొమినికన్లు భావించారు. అతని నస యౌవనం, వక్తగా రచయితగా అతని ప్రతిభ, సంగీతంలోను కవితలోను అతని అసాధారణ చాతుర్యం ప్రజల్ని తమ ఆరాధనలకు ఆకర్షించటంలోను తమ వ్యవస్థ ఆదాయాన్ని పెంచటంలోను తమ డాబు డంబం ప్రదర్శనలకన్నా ఇవి ఎక్కువ శక్తిమంతంగా ఉండేవి. జ్వీంగ్లీ తమ ఆశ్రమంలో చేరేందుకుగాను వారు మోసం, ముఖస్తుతి ఉపయోగించి ప్రయత్నించారు. పాఠశాల విద్యార్థిగా ఉన్న రోజుల్లో లూథర్ తన ఆశ్రమంలో తన్నుతాను సమాధి చేసుకొన్నాడు. దేవుడు ఆయనను విడిపించి ఉండకపోతే ప్రపంచం ఆయనను కోల్పోయి ఉండేది. అదే ప్రమాదాన్ని జ్వీంగ్లీ ఎదుర్కోటం దేవుని చిత్తం కాదు. సన్యాసుల కుతంత్రాల గురించి జ్వీంగీ తండ్రికి సమాచారం అందింది. సోమరులు, వ్యర్ధులు అయిన సన్యాసులలో తన కుమారుడు చేరటం ఆయనకు సుతరాం ఇష్టం లేదు. కుమారుడి భవిష్యత్తు ప్రమాదంలో ఉన్నదని గుర్తించి వెంటనే తిరిగి ఇంటికి రావలసిందిగా ఆదేశించాడు.GCTel 153.3

    కొడుకు తండ్రి ఆజ్ఞను పాలించాడు. అయితే ఆ యువకుడికి తాను పుట్టిన లోయలో సంతృప్తి కొరవడింది. కొద్ది కాలంలోనే బేసిల్ నగరానికి వెళ్లి తన విద్యను కొనసాగించాడు. ఇక్కడ మొట్టమొదటగా జ్వీంగ్లీ దేవుని ఉచిత కృపను గూర్చిన సువార్త విన్నాడు. ప్రాచీన భాషాధ్యాపకుడు విటెమ్ బర్గ్ గ్రీకు, హెబ్రీ భాషలు బోధించే తరుణంలో పరిశుద్ధ లేఖనాలతో జ్వీంగ్లీ పరిచయం ఏర్పడింది. ఈ విధంగా అతడి విద్యార్థుల మనసుల్లోకి దైవకాంతి కిరణాలు ప్రసరించాయి. విద్యావేత్తలు, తత్వజ్ఞానులు బోధించిన సిద్ధాంతాలకన్న ఎంతో ప్రాచీనమైన ఎంతో విలువైన సత్యం ఒకటుందని అతడు ప్రకటించాడు. క్రీస్తు మరణం మాత్రమే పాపికి క్రయధనం అన్నదే ఈ ప్రాచీన సత్యం. జ్వీంగ్లీకి ఈ మాటలు ఉదయాన్ని ప్రవేశపెట్టే తొలికాంతిరేఖల్లా కనిపించాయి.GCTel 154.1

    అనతికాలంలోనే జీవితకాలమంతా చేయాల్సిన పనికి జ్వింగ్లీ పిలుపు పొందాడు. మొట్టమొదటగా తాను సేవచేయాల్సిన స్థలం తన జన్మస్థలానికి ఆట్టే దూరంలోలేని ఆల్పయి. పేరిష్ ప్రీస్టుగా అభిషేకం పొందిన జ్వింగ్లీ ‘ “తన పూర్ణ ఆత్మతో సత్యాన్వేషణకు పూనుకొన్నాడు. ఎందుకంటే క్రీస్తు తన కప్పగించిన మంద నిమిత్తం ఎంత నేర్చుకోవాలో ఆయనకు బాగా తెలుసు” అన్నాడు జ్వింగ్లీ సహచర సంస్కర్త- విలీ,పుస్త 8, అధ్యా 5. లేఖనాల్ని ఎంత ఎక్కువ పరిశోధిస్తే వాటిలోని సత్యాలకు రోము బోధించే తప్పుడు సిద్ధాంతాలకూ మధ్య ఉన్న వ్యత్యాసం అంత స్పష్టంగా అతడు చూడగలిగాడు. దైవ వాక్యమైన బైబిలుకు అతడు తన్నుతాను సమర్పించుకొన్నాడు. వాక్యమే సమగ్రమైన నిర్దుష్టమైన నియమమని అంగీకరించాడు. బైబిలుకి బైబిలే వివరణనిస్తుందని అతడు గ్రహించాడు. ముందే ఏర్పర్చుకొన్న ఒక అభిప్రాయాన్నిగాని, సిద్ధాంతాన్నిగాని వివరించేందుకు లేఖనాల్ని ఉపయోగించటానికి అతడు ప్రయత్నించలేదు. వాక్యం సూటిగా స్పష్టంగా బోధిస్తున్న దాన్నే నేర్చుకోటం తన విధిగా పరిగణించాడు. దాని భావాన్ని పూర్తిగా, నిర్దుష్టంగా అవగాహన చేసుకోటానికి ప్రతివిధమైన సహాయ సహకారాల్ని ఉపయోగించుకోటానికి ప్రయత్నిస్తూ పరిశుద్ధాత్మ సహాయాన్ని అర్థించాడు. చితశుద్ధితోను ప్రార్ధన పూర్వకంగాను వెదకే వారందరికీ పరిశుద్ధాత్మ తోడ్పడ్డాడని వ్యక్తీకరించాడు.GCTel 154.2

    జ్వింగ్లో ఇలా అన్నాడు, “లేఖనాలు దేవుని వరం, అవి మానవుడి వల్ల కలిగినవి కావు. జ్ఞానం కలిగించే దేవుడే ఆయన మాటల్ని గ్రహించే శక్తి నీకు ఇస్తాడు. దైవ వాక్యం తప్పక నెరవేరుతుంది. అది ప్రకాశవంతమైంది, దాన్ని అదే బోధించుకొంటుంది. దాన్నదే ఆవిష్కరించుకొంటుంది. ఆత్మను కృపతోను రక్షణతోను వెలిగిస్తుంది. ఆత్మకు దేవుని ఆదరణనిస్తుంది. దీనతను చేకూర్చుతుంది. అందుచేత అత్మ తన ఉనికిని కోల్పోయి దేవున్ని స్వీకరిస్తుంది.” ఈ మాటల్లోని సత్యాన్ని జ్వింగ్లీ జీవితమే నిరూపించింది. ఈ సమయంలో తన అనుభవాన్ని గూర్చి మాట్లాడూ కొంతకాలం తర్వాత ఆయన ఇలా రాశాడు, “పరిశుద్ధ లేఖనాలకు నన్నునేను పూర్తిగా అంకితం చేసుకొన్నప్పుడు తత్వం, వేదాంతం కొన్ని వైరుధ్యాల్ని నాకు ప్రతిపాదిస్తూ ఉండేవి. తుదకు నేను ఈ తీర్మానానికి వచ్చాను. ఈ మొత్తాన్ని విడిచిపెట్టి స్పష్టమైన దైవ వాక్యం నుంచి దేవుడంటే అర్ధమేంటో నేర్చుకొని అనంతరం దేవా నాకు వినయం ప్రసాదించుమని దేవుని అడగనారంభించాను. అంతట లేఖనాలు నాకెంతో సులభంగా గ్రాహ్యమయ్యా యి.” అదే పుస్తకం, పుస్త 8, అధ్యా 6. GCTel 154.3

    జ్వింగ్లీ బోధించిన సిద్ధాంతం ఆయన లూథర్ వద్ద నేర్చుకోలేదు. అది క్రీస్తు బోధించిన సిద్ధాంతం. స్విస్ సంస్కర్త ఇలా అన్నాడు, “లూథర్ క్రీస్తును బోధిస్తుంటే నేను చేస్తున్నపనే ఆయనా చేస్తున్నాడన్నమాట. క్రీస్తు వద్దకు ఆయన నడిపించిన ప్రజల సంఖ్య, క్రీస్తు వద్దకు నేను నడిపించిన వారి సంఖ్యకంటే హెచ్చు. ఇది ముఖ్యం కాదు. నేను క్రీస్తు సైనికుణ్ణి, క్రీస్తీ నా అధినేత, క్రీస్తు నామం తప్ప వేరే నామం నేను ధరించునుగాక ధరించను. నేను లూథర్ కి ఎన్నడూ ఒక్క మాట కూడా రాసి ఎరుగను. లూథరూ నాకు రాయలేదు. ఎందుకని దేవుని ఆత్మ విషయంలో ఎంత ఏకత్వం ఉన్నదో చూపించటం ఎలా జరుగుతుందంటే ఎలాంటి సంబంధం లేకుండా మేమిరువురం క్రీస్తు సిద్ధాంతాల్ని భేదమేమీలేకుండా ఒకే విధంగా బోధిస్తున్నాం. ” డి అబినే, పుస్త 8,అధ్యా 9.GCTel 155.1

    1516లో ఏసిడెలోని సన్యాసినుల ఆశ్రమంలో బోధకుడుగా సేవ చెయ్యటానికి జ్వింగ్లీకి పిలుపు వచ్చింది. ఇక్కడ రోమను మతవాదుల అనీతికార్యాలను సూక్ష్మంగా పరిశీలించి సంస్కర్తగా సంస్కరణల ప్రభావం తన స్వప్రదేశమైన ఆల్మ్ పర్వతాల్ని దాటి ప్రసరించేటట్లు వివరించాల్సి ఉన్నాడు. ఏసిడెన్ లోని ముఖ్య ఆకర్షణల్లో ఒకటి కన్య మరియ విగ్రహం. దానికి అద్భుతాలు చేసే శక్తి ఉన్నదని ప్రజల నమ్మకం. సన్యాసినుల ఆశ్రమ ముఖ ద్వారంపై “ఇక్కడ సంపూర్ణ పాపక్షమాపణ లభిస్తుంది” అన్నమాటలు రాసి వున్నాయి.” అదే పుస్తకం, పుస్త 8, అధ్యా 5. యాత్రికులు అన్ని కాలాల్లోనూ ఈ కన్యక పుణ్యక్షేత్రాన్ని సందర్శించేవారు. కాని ఆ విగ్రహ ప్రతిష్ఠ సాంవత్సరిక మహోత్సవానికి స్విట్జర్లాండు నలుమూలల నుంచి ఫ్రాన్స్, జర్మనీ దేశాలనుంచి వేవేల ప్రజలు హాజరయ్యేవారు. దానికి ఎంతగానో క్షోభించిన జ్వింగ్లీ మూఢనమ్మకాల బానిసలకు సువార్త ద్వారా స్వేచ్ఛ ప్రకటించటానికి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొన్నాడు. ప్రజల నుద్దేశించి ఆయన ఇలా అన్నాడు, “సృష్టిలోని ఏ తావులోకన్నా ఈ ఆలయంలోనే దేవుడు ఎక్కువగా ఉన్నాడని” ఊహించకండి. మీరు నివసిస్తున్న దేశం ఏదైనా దేవుడు మీచెంత ఉండి మీరు చెప్పేది వింటాడు... దీర్ఘ తీర్థయాత్రలు, కన్య మరియమ్మకు లేదా పరిశుద్ధులకు ప్రాసల వంటి అర్ధంలేని క్రియలు మీకు దైవ కృపను సంపాదించి పెట్టగలవా? అర్ధం పర్ధంలేని అనేక మాటలతో మనం చేసే ప్రార్ధనలు దేనికి ఉపయోగపడ్డాయి? నిగనిగలాడే అంగీ, నున్నగ గొరిగిన తల, జీరాడే పొడవాటి రోబ్, బంగారం పొదిగిన పాదుకలు దేనికి ? దేవుడు హృదయాన్ని చూస్తాడు. మన హృదయాలు ఆయనకు దూరంగా ఉన్నాయి.” ఇంకా ఇలా అన్నాడు, “సిలువపై ఒకసారి బలి అయిన క్రీస్తు, విశ్వసించేవారి పాపాల నిమిత్తం అనంతకాలం నిలిచే అర్పణ అయ్యాడు. ” అదే పుస్తకం, పుస్త 8, అద్యా 5.GCTel 155.2

    వినేవారిలో చాలా మందికి ఈ బోధనలు హితంగా లేవు. తాము శ్రమపడి చేసిన యాత్ర నిరర్ధకమని చెప్పటం వారిలో నిరుత్సాహం పుట్టించింది. క్రీస్తు ద్వారా తమకు ఉచితంగా వస్తున్న క్షమాపణను వారు అవగాహన చేసుకోలేకపోయారు. పరలోకానికి రోము నిర్దేశించిన పాతమార్గం వారికి తృప్తినిచ్చింది. అంతకన్నా మెరుగైన మార్గాన్ని వెదకే శ్రమ మాకెందుకులెమ్మని వెనుకంజ వేశారు. తమ రక్షణభారం “ప్రీస్టులకు పోపుకు అప్పగించటం పవిత్ర హృదయం కోసం కృషి చేయటం కన్నా సులువని వారికి తోచింది.”GCTel 156.1

    క్రీస్తు ద్వారా రక్షణ అన్న వార్తను ఆనందంగా అందుకొన్న ప్రజలు కొందరున్నారు. రోము నాయకులు విధించిన ఆచారాలు ఆత్మకు శాంతి నివ్వలేకపోయాయి. అందుచేత తమ పాపాలకు ప్రాయశ్చిత్తంగా రక్షకుని రక్తాన్ని వారు విశ్వాసంతో అంగీకరించారు. సత్యం ఆ విధంగా గ్రామాలకు, పట్టణాలకు వెళ్లింది. మరియమ్మ మందిరాన్ని సందర్శించే యాత్రికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కానుకలు తగ్గిపోయాయి. జ్వింగ్లీ జీతం వాటినుంచి వచ్చేదే గనుక అదీ తగ్గిపోయింది. ఇది జ్వింగ్లీకి ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే తన బోధన మతమౌఢ్యాన్ని, మూఢనమ్మకాల్ని నాశనం చేస్తున్నట్లు గ్రహించాడు.GCTel 156.2

    సంఘ అధికారులు, జ్విం చేస్తున్న పనిని చూస్తూ కూర్చోలేదు. తాత్కాలికంగా సహనం పాటించి జోక్యం చేసుకోలేదు. పొగడ్తల ద్వారా ఆయనను తమ పక్కకు తిప్పుకొని లబ్ది పొందాలని చూశారు. ఇంతలో సత్యం ప్రజల హృదయాలను ఆకట్టుకొంటుంది.GCTel 156.3

    ఏసిడెన్లో జ్వింగ్లీ చేసిన కృషి ఆయనను ఉన్నత సేవలకు సన్నద్ధం చేసింది. ఈ సేవలో ఆయన త్వరలోనే ప్రవేశించనున్నాడు. ఇక్కడ మూడు సంవత్సరాలు సేవచేసిన తర్వాత జూరిక్ నగరంలోని కెతీ డ్రల్ లో బోధకుడుగా పిలుపు పొందాడు. ఆ దినాల్లో ఈ నగరం స్విట్జర్లాండు దేశంలో చాలా ప్రాముఖ్యమైన నగరం. ఇక్కడ జరిగిన సేవ ప్రభావం బహుగా విస్తరిస్తుంది. ఏ మతగురువుల ఆహ్వానంపై జ్వింగీ జూరిక్ కి వచ్చాడో వారు కొత్త మార్పుల్ని, రానీయకూడదని ఆకాంక్షించి తన విధులేంటో జ్వింగ్లీకి ఉపదేశించటానికి ఉపక్రమించారు.GCTel 157.1

    “చిన్న మొత్తాన్ని కూడా ఉపేక్షించకుండ సంఘ సభ వసూళ్లను పోగుచేయటానికి శక్తివంచనలేకుండా నీవు కృషిచేయాలి. దశమ భాగాలు, అర్పణలు చెల్లించి తద్వారా సంఘంపట్ల తమ ప్రేమ ప్రదర్శించాలని నమ్మకంగా ఉన్న సభ్యునికి ప్రసంగ వేదిక నుంచి క్షమాభిక్ష స్థలం నుంచి హితవు చెప్పాలి. వ్యాధిగ్రస్తుల నిమిత్తం మాస్ ఆరాధనల నిమిత్తం ఇంకా చెప్పాలంటే మతపరమైన ప్రతి ఆచారం నిమిత్తం డబ్బు వసూలుచేసి ఆదాయం పెంచటంలో శ్రద్ధవహించాలి. ” ( ఇక పవిత్రసంస్కారాలు, వాక్యసేవ, సభ్యుల మంచి చెడ్డల మాటకొస్తే ఇవన్నీ బోధకుడి విధులే. వీటిని నిర్వహించటానికి ముఖ్యంగా వాక్యసేవకు నీవు ఒక సహాయకుణ్ణి నియమించుకో వచ్చు. నీవు పవిత్ర సంస్కారాలు ప్రముఖ వ్యక్తులకే వారు కోరినప్పుడే జరిపించాలి. అంతస్తులు పాటించకుండా వీటిని జరిపించకూడదు.” అని వారు ఆదేశించారు. అదే పుస్తకం, పుస్త 8, అధ్యా 6.GCTel 157.2

    ఈ కార్య భార కథనాన్ని జ్వింగ్ మౌనంగా విని ప్రాముఖ్యమైన ఈ స్థలంలో సేవకై పిలుపు నిచ్చినందుకు కృష్ణతలు తెలుపుకొన్న మీదట తాను అనుసరించదలచిన విధానాన్ని వారికి వివరించటం మొదలు పెట్టాడు. క్రీస్తు జీవితాన్ని ప్రజలకు తెలియకుండా చాలా కాలం దాచి ఉంచటం జరిగింది. మొత్తం మత్తయి సువార్త మీద బోధిస్తాను. వాక్యాన్ని వాక్యంతో సరిపోల్చుతూ లేఖనపు ఊటలనుంచి దాని లోతులకు వెళ్లి, అవగాహన కోసం చిత్తశుద్ధితో ప్రార్థన చేస్తూ భోధిస్తాను. దేవుని మహిమకు, ఆయన ఏకైక కుమారుని స్తోత్రానికి, ఆత్మల రక్షణకు, నిజమైన విశ్వాసం విషయంలో ఆత్మల జ్ఞానోదయానికి నా సేవను అంకితం చేస్తున్నాను” అంటూ బదులు పలికాడు జ్వింగ్లీ. - అదే పుస్తకం, పుస్త 8, అధ్యా 6. మతగురువులు కొందరు ఆయన ప్రణాళికను ఆమోదించకపోయినప్పటికీ జ్వింగ్లీ సమ్మకంగా నిలబడ్డాడు. తాను కొత్త పద్ధతిని ప్రవేశపెట్టటం లేదని పూర్వం సంఘం పవిత్రంగా ఉన్న దినాల్లోని పాత పద్ధతినే అవలంబిస్తున్నానని ఆయన ప్రకటించాడు.GCTel 157.3

    ఆయన బోధించిన సత్యాల పట్ల ప్రజలు ఆసక్తి కనపర్చారు. ఆయన బోధ వినటానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆరాధన సభలకు హాజరు కావటం ఎన్నడో మానివేసిన అనేకమంది ఆయన సభలకు హాజరయ్యారు. సువార్తలు తెరచి క్రీస్తు జీవితం, బోధనలు, మరణం గురించిన వివరాల్ని చదివి వివరణ ఇవ్వటం ద్వారా ఆయన తన పరిచర్యను ప్రారంభించాడు. ఏసిడెన్లో లాగే ఇక్కడా దేవుని వాక్యాన్ని నిర్దుష్టమైన ఏకైక అధికారంగాను, క్రీస్తు మరణాన్ని ఏకైక సంపూర్ణ త్యాగంగాను ప్రజల కవి గాను ముందుంచాడు. నిజమైన రక్షణ మార్గమైన క్రీస్తు వద్దకు మిమ్మల్ని నడిపించాలని ఆ కాంక్షిస్తున్నాను.” అన్నాడు జ్వింగ్లీ. - అదే పుస్తకం, పుస్త 8, అధ్యా 6. బోధకుడి చుట్టూ రాజకీయవేత్తలు, పండితులు, హస్తకళాకారులు, కర్షకులు: అన్ని తరగతుల ప్రజలు గుమి గూడారు. ఆయన మాటల్ని ఎంతో ఆసక్తిగా విన్నారు. ఉచిత రక్షణను ప్రకటించటమేగాక, నాటి దుర్మార్గతను అవినీతిని ఆయన నిర్భయంగా ఖండించాడు. పలువురు దేవుని స్తుతిస్తూ గుడి నుంచి తిరిగి వెళ్ళారు. “ఈయన సత్యాన్ని నేర్పించే బోధకుడు, ఈ ఐగుప్తు చీకటిలో నుంచి మిమ్మల్ని వెలుపటికి నడిపించే మోషే ఈయనే” అన్నారు. అదే పుస్తకం, పుస్త 8, అధ్యా 6.GCTel 158.1

    ఆదిలో ఆయన సేవలకు మంచి స్పందన లభించినా కొంతకాలానికి వ్యతిరేకత తలెత్తింది. సన్యాసులు ఆయన కృషికి మోకాలడ్డి ఆయన బోధనల్ని ఖండించారు అనేకులు ఆయనను హేళన చేశారు. అపహసించారు. కొందరు అవమానించటానికి, బెదరించటానికి దిగారు. దీనంతటినీ జ్వింగ్లీ ఇలాగంటూ సహించాడు. “దుష్టుల్ని యేసుక్రీస్తు వద్దకు తీసుకురాగోరితే అనేక దుష్కృత్యాలకు మనం కళ్లుమూసుకోవాల్సి ఉంటుంది.” అదే పుస్తకం, పుస్త 8, అధ్యా 6.GCTel 158.2

    ఈ తరుణంలో దిద్దుబాటు కృషికి దోహదకారిగా ఒక నూతన సాధనం దర్శనమిచ్చింది. దిద్దుబాటు విశ్వాసానికి మిత్రుడు బేసిల్ నగరవాసి అయిన ఒక వ్యక్తి లూసియన్ అనే వ్యక్తిని లూథర్ చేసిన కొన్ని రచనలతో జూరిక్ నగరానికి పంచటం జరిగింది. సత్యాన్ని వెదజల్లటానికి ఈ రచనల విక్రయం మంచి సాధనం కావచ్చునని ఆ మిత్రుడు అభిప్రాయపడ్డాడు. ఈ వ్యక్తికి అవసరమైనంత జత ప్రావీణ్యం ఉన్నదోలేదో పరీక్షించి లూథర్ పుస్తకాల్ని మరీ ముఖ్యంగా ప్రభువు ప్రార్ధనపై బోధకేతర సభ్యులకోసం లూథర్ రాసిన వివరణను స్విట్జర్లాండ్ లోని నగరాల్లోను, పట్టణాల్లోను, గ్రామాల్లోను పంచిపెట్టాలని ఈ వ్యక్తి జ్వీంగ్లికి సూచించాడు. వాటి గురించి ప్రజలకు ఎంత ఎక్కువ తెలిస్తే వాటి కొనుగోలు దారుల సంఖ్య అంత పెరుగుతుంది.” అన్నాడు. అదే పుస్తకం, పుస్త 8, అధ్యా 6. సత్యం ఇలా ప్రవేశించింది.GCTel 158.3

    అజ్ఞానం అంధ విశ్వాసం సంకెళ్లను విరగకొట్టటానికి దేవుడు సిద్ధపడుతున్నప్పుడు మనుషుల చుట్టూ అంధకారం సృషించి వారిని మరింత బలమైన సంకెళ్లతో బంధించటానికి సాతాను అత్యధిక శక్తితో పని చేస్తాడు. క్రీస్తు రక్తం ద్వారా క్షమాపణ, నీతిమంతుడని తీర్పు పొందటాన్ని ప్రకటించేందుకు ఆయాదేశాల్లో మనుషులు ముందుకు వస్తుండగా, డబ్బుతో కొనేవారికి పాపక్షమాపణ ఇవ్వజూపుతూ రోము క్రైస్తవ లోకమంతటా తన విక్రయ కేంద్రాల్ని నూతనోత్సాహంతో తెరవనారంభించింది.GCTel 159.1

    ప్రతి పాపానికి దాని దాని వెల ఉండేది. సంఘ ఖజానాను నింపిన వారు ఏ నేరమైనా చేయటానికి లైసెన్స్ పొందేవారు. ఇలా రెండు ఉద్యమాలు సాగాయి. ఒకటి డబ్బు చెల్లిస్తే పాపక్షమాపణ. రెండోది క్రీస్తు ద్వారా పాపక్షమాపణ. రోము నేతలు పాపానికి లైసెన్స్ ఇచ్చి దాన్ని ఆదాయ వనరు చేసుకొన్నారు. సంస్కర్తలు పాపాన్ని ఖండించి క్రీస్తును పాపప్రాయశ్చిత్తంగా విమోచకుడుగా ప్రజల ముందుంచారు. GCTel 159.2

    డొమినికవర్గ సన్యాసులు జర్మనీలో పాపక్షమాపణ విక్రయాలు దుష్టుడైన టెట్ జెల్ నాయకత్వం కింద నిర్వహించే వారు. స్విడ్జర్లాండులో ఎన్ని వర్గం వారు ఈ అమ్మకాలు ఇటలీదేశ సన్యాసి సేమ్సన్ ఆధ్వర్యంలో నిర్వహించేవారు. సేమ్సన్ సంఘానికి ఇదివరకే మంచి సేవ చేశాడు. జర్మనీ నుంచి స్విట్జర్లాండ్ నుంచి అపార నిధులు పోగుచేసి పోపుఖజానాని నింపాడు. ఇప్పుడితను స్విడ్జర్లాండంతా తిరిగి జనసమూహాల్ని ఆకర్షిస్తూ పేద కర్షకుల చాలీచాలని ఆదాయాల్ని కొల్లగొడుతున్నాడు. భాగ్యవంతులవద్ద నుంచి విలువైన పారితోషికాలు అందుకొంటున్నాడు. అవి చాలామట్టుకు తగ్గిపోయాయి. సేమ్సన్ స్విడ్జర్లాండ్ చేరిన వెంటనే ఏన్ సిడెన్ పరిసర పట్టణంలోకి తన వస్తుజాలంతో వెళ్లినప్పుడు జ్వీంగ్లీ ఏసిడెన్లోనే ఉన్నాడు. సేమ్సన్ కార్యకలాపాలు గురించి తెలిసిన తర్వాత సంస్కర్త అతణ్ణి వ్యతిరేకించటం మొదలు పెట్టాడు. వారిద్దరూ ఎక్కడా దసులు పడలేదు. అయినా ఆ సన్యాసి మోసాన్ని జ్వింగ్లీ జయప్రదంగా ఎండగట్టినందువల్ల అతడు ఆపట్టణం విడిచిపెట్టి వేరే స్థలానికి వెళ్ళిపోవలసి వచ్చింది. GCTel 159.3

    జూరిక్ లో పాపక్షమాపణ అమ్మకం దారుల్ని గర్జిస్తూ జ్వింగ్లీ ఉద్రేకంగా ప్రసంగించాడు. సేమ్సన్ ఆ నగరాన్ని సమీపించినప్పుడు సభనుంచి వచ్చిన దూత తాను అందించాల్సి ఉన్న ఒక వర్తమానంతో సేమ్సన్ ని కలుసుకొన్నాడు. అతడు కపటోపాయంతో నగరంలోకి ప్రవేశం సంపాదించాడు కాని ఒక్క క్షమాపణ కూడా విక్రయించకుండా సేమ్సస్ అతణ్ణి వెనక్కి పంపివేశాడు. తర్వాత త్వరలోనే అతడు కూడా సిద్ధర్తాండ్ విడిచి వెళ్లిపోయాడు.GCTel 159.4

    1519లో స్వీడ్జర్లాండ్ ను అతలాకుతలం చేసిన ప్లేగు లేదా ఘోర మరణం దిద్దుబాటుకు గొప్ప ప్రేరణ నిచ్చింది. మనుషులు మరణాన్ని ముఖాముఖి ఎదుర్కొన్నప్పుడు తాము కొద్దికాలం క్రితమే కొన్న పాపక్షమాపణలు వ్యర్ధము నిరర్ధకము అని గుర్తించారు. వారు తమ విశ్వాసానికి నిశ్చితమైన పునాదికోసం ఎదురు చూశారు. జూరిక్ లో జ్వింగ్ ప్లేగుకు గురి అయ్యాడు. దాని తీవ్రతకు జ్వింగ్లీ చాలా నీరసించాడు.ఆయన బతికి బట్టకడతాడన్న ఆశ కనిపించలేదు. ఆయన మరణించాడన్న పుకారు లేచింది. ఆ క్లిష్టపరిస్థితిలో ఆయన ధైర్యం కోల్పోయాడు. విశ్వాసంతో కల్వరి సిలువను వీక్షించాడు. తన పాపానికి సంపూర్ణ ప్రాయశ్చితమైన ఆ ప్రభువును నమ్మాడు. మరణ ద్వారం నుంచి తిరిగి వచ్చినప్పుడు సువార్తను ముందెన్నటికన్నా బలంగా ఉత్సాహంగా బోధించటానికి పూనుకొన్నాడు. ఆయన మాటలు ప్రబలమైన శక్తిని సంతరించుకొన్నాయి. మరణం నోటిలో నుంచి తిరిగి వచ్చిన తమ ప్రియతమ పాదిరిని ప్రజలు ఆనందోత్సాహాలతో స్వాగతించారు. వారుకూడా వ్యాధి గ్రస్తులకి మరణిస్తున్న వారికి సేవలందించి వచ్చినవారే. వారు సువార్త విలువను ముందెన్నటికన్నా ఈ సమయంలో మరెక్కువ గుర్తించారు.GCTel 160.1

    అంత ఉదాత్తాశయాలతో వాక్యంలోని సత్యాల్ని జ్వింగ్లీ మరింత స్పష్టంగా అవగాహన చేసుకొన్నాడు. నూతన పర్చే వాక్యశక్తిని అనుభవ పూర్వకంగా తెలుసుకొన్నాడు. మానవుడి పతనం, విమోచన ప్రణాళిక అంశాలే ఆయన మనసును నింపాయి. “మనమందరం ఆదాములో అవినీతిలో కూరుకపోయి శిక్షార్హులమై మరణించాం” అన్నాడు. - విలీ, పుస్త 8, అధ్యా 9. “ఎన్నడు అంతంకాని విమోచనను...క్రీస్తు మన కోసం కొన్నాడు. నిత్యత్యాగం, నిత్య స్వస్థతే ఆయన ప్రగాఢ వాంఛ. బలమైన అచంచలమైన విశ్వాసంతో తన మీద ఆధారపడే వారి పక్షంగా ఆది దేవుని న్యాయాన్నినిత్యమూ తృప్తిపర్చుతుంది.” క్రీస్తు కృపను చూసుకొని మనుషులు పాపంలో కొనసాగరాదని ఆయన విస్పష్టంగా బోధించాడు. “దేవునిమీద విశ్వాసం ఎక్కడుంటుందో అక్కడ దేవుడుంటాడు. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఉత్సాహం చోటుచేసుకొని సత్కియలకు మనుషుల్ని ఒత్తిడి చేస్తుంది. “. డి అబినే, పుస్త 8, అధ్యా 9.GCTel 160.2

    జ్వింగ్లీ బోధకు ప్రజలు ఆకర్షితులయ్యారు. ఆయన బోధ వినటానికి వచ్చిన జనులతో ఆలయం క్రిక్కిరిసి పోయేది. వారి గ్రహణ శక్తి ననుసరించి కొంచెం కొంచెంగా శ్రోతలకు ఆయన సత్యాన్ని వివరించేవాడు. ఆదిలోనే వెగటు కలిగించే అంశాలు ప్రస్తావించి వారిలో విరోధభావం పుట్టించకుండా ఎంతో జాగ్రత్త తీసుకొనేవాడు. వారి మనసుల్ని క్రీస్తు బోధనలకు ఆకర్షించటం, క్రీస్తు ప్రేమచేత వారి హృదయాల్ని మెత్తబర్చి ఆయన ధర్మాన్ని వారి ముందుంచబమే ఆయన ఉద్దేశం. సువార్త సూత్రాల్ని గ్రహించే కొద్దీ వారు తమ మూఢనమ్మకాల్ని, దురాచారాల్ని విడిచిపెడ్తారని భావించాడు.GCTel 161.1

    జూరిక్ లో సంస్కరణ అంచెలంచెలుగా సాగింది. సంస్కరణ విరోధులు ఆందోళన చెంది క్రియాశీల వ్యతిరేకతకు దిగారు. ఒక ఏడాది క్రితం విట్బెర్గ్ సన్యాసి వమ్స్ నగరంలో పోపును చక్రవర్తిని ధిక్కరించాడు. ఇక ఇప్పుడు జూరిక్ లో పోపు అధికారానికి అలాంటి ప్రతిఘటనే ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జ్వింగ్లీపై పదే పదే దాడులు జరిగాయి. పోపు ప్రాబల్యం గల రాష్ట్రాల్లో సువార్త విశ్వాసులు సజీవ దహన దండన పొందేవారు. అయితే ఇది చాలదు. సిద్ధాంత వ్యతిరేకతను ప్రబోధించే వ్యక్తి మరణించి తీరాలి. అందుకుగాను సంఘ నిబంధనల అతిక్రమాన్ని ప్రోత్సహిస్తూ బోధించటం ద్వారా జ్వింగ్లీ సమాజ శాంతి భద్రతలను భగ్నం చేస్తున్నాడన్న ఆరోపణలతో కాన్స్టెన్స్ బిషప్ ముగ్గురు ప్రతినిధులను జూరిక్ సభకు పంపాడు. సంఘాధికారాన్ని తోసిపుచ్చితే దేశమంతటా అరాజకం ప్రబలుతుందని విజ్ఞాపన చేశాడు. “జూరిక్ లో తాను నాలుగు సంవత్సరాలుగా సువార్త బోధిస్తున్నా జూరిక్ నగరం దేశంలోని అన్ని నగరాలకన్న ఎక్కువ ప్రశాంతంగా, శాంతి భద్రతలు కలిగి ఉన్నది. కనుక దేశ భద్రతకు ఉత్తమ సాధనం క్రైస్తవ మతం కాదా” అని జ్వింగ్లీ బదులు పలికాడు- విలీ, పుస్త 8, అధ్యా 11.GCTel 161.2

    పోపు సంఘంలోనే కొనసాగటం ఉత్తమమని సంఘం వెలుపల రక్షణ పొందమని ప్రతినిధులు సభవారికి హితవు చెప్పారు. సమాధానంగా జ్వింగ్లీ పలికిన మాటలివి, “ఈ ఆరోపణను నమ్మకండి. తనను క్రీస్తు అని పేతురు ఒప్పుకొన్నందున పేతురికి ఆ పేరు పెట్టిన క్రీస్తు అనే బండయే సంఘానికి పునాది. ప్రతి జనంలోను ఏ వ్యక్తి అయితే తన పూర్ణ హృదయంతో యేసు ప్రభువును విశ్వసిస్తాడో అతణ్ణి దేవుడు అంగీకరిస్తాడు. వాస్తవానికి సంఘమంటే ఇదే. ఈ సంఘం వెలుపల ఎవరికీ రక్షణలేదు.” డి అబినే, లండన్ ఎడి, పుస్త 8, అధ్యా 11. సభ ఫలితంగా బిషప్ ప్రతినిధుల్లో ఒక ప్రతినిధి దిద్దుబాటు విశ్వాసాన్ని స్వీకరించాడు.GCTel 161.3

    జ్వింగ్లీపై చర్యతీసుకోటానికి సభ నిరాకరించింది. తాజా దాడికి రోము సిద్ధమయ్యింది. ప్రత్యర్థుల కుతంత్రాల గురించి సమాచార మందినప్పుడు సంస్కర్త ఇలా స్పందించాడు, “వాళ్లను నామీదికి రానీయండి. అడుగున హోరెత్తుతూ లేచిపడుతున్న సముద్ర తరంగాలకు పక్కనే ఎత్తుగా నిలిచి ఉన్న పర్వత శిఖరం ఎంత భయపడుందో వారికి అంతే భయపడ్డాను” విలీ, పుస్త 8, అధ్యా 11. మత గురువులు ఏ పనినైతే నాశనం చేయటానికి కృషి చేశారో తమ ప్రయత్నాల ద్వారా ఆసంస్కరణ పురోగతికి తోడ్పడ్డారు. సత్యవ్యాప్తి కొనసాగింది. జర్మనీలో లూథర్ కనిపించనందువల్ల అధైర్యం చెందిన దిద్దుబాటు విశ్వాసులు స్విట్జర్లాండులో సువార్త సాధిస్తున్న ప్రగతిని చూసి ధైర్యం తెచ్చుకొన్నారు.GCTel 162.1

    జూరిక్ లో దిద్దుబాటు స్థిరపడగా దాని ఫలితాలు ప్రస్ఫుటంగా కనిపించాయి. దుష్టత్వం అణగారి పోయింది. సమాజంలో క్రపుజీవనం సామరస్యం చోటు చేసుకొన్నాయి. ” మా పట్టణంలో శాంతి నివాసం ఏర్పర్చుకొన్నది. జగడాలు లేవు. వేషధారణ, ఈర్ష, విభేదం లేవు. ఇలాంటి ఐక్యత ప్రభువువద్ద నుంచి తప్ప మరెక్కడినుంచి వస్తుంది? సమాధానంతోను భక్తితోను మనల్ని నింపే సిద్ధాంతం ప్రభువు వద్ద నుంచి తప్ప మరెక్కడనుంచి వస్తుంది?” అంటూ జ్వింగ్లీ రాశాడు. అదే పుస్తకం, పుస్త 8, అధ్యా 15.GCTel 162.2

    సంస్కరణ సాఫల్యాలు రోము మత వాదుల్ని కలచివేశాయి. ఆ ఉద్యమాన్ని అణచివేయటానికి మరింత పట్టుదలతో కృషి చేయటానికి పూనుకొన్నారు. జర్మనీలో లూథర్ నోరు నొక్కేయటానికి తాము ప్రయోగించిన హింసాసాధనం ఎలానిరర్ధక మయిందో చూసి సంస్కరణను తమ సొంత అస్త్రాలతో ఎదుర్కోవాలని తీర్మానించారు. జ్వింగ్లీతో ఒక వాగ్వాదం ఏర్పాటు చేయాలని దానికి ఏర్పాటు చేసే బాధ్యత వహించి వాదన జరిగే స్థలాన్ని మాత్రమేకాకుండా వాదోపవాదాల మధ్య తీర్పు చెప్పే న్యాయాధిపతుల్ని కూడా తామే ఎంపిక చేసుకోవటం ద్వారా విజయాన్ని కైవసం చేసుకోవాలన్నది వారి ఎత్తుగ. జ్వింగ్లీని ఈసారి తమ వలలో చిక్కించుకుంటే ఇక తప్పించుకోకుండా జాగ్రత్త తీసుకోవచ్చునని భావించారు. నాయకుణ్ణి మట్టు పెడితే అతడి ఉద్యమాన్ని వెంటనే అణచివేయవచ్చని తలంచారు. ఈ ఉద్దేశాన్ని గోప్యంగా ఉంచారు.GCTel 162.3

    ఈ వాగ్వాదం బేడెన్ అనే స్థలంలో జరగాల్సి ఉంది. కాని జ్వింగ్లీ హాజరుకాలేదు. పోపు మత వాదుల ఉద్దేశాన్ని శంకించి, రాష్ట్రంలో సువార్తను నమ్మేవారికి సిద్ధంచేసి ఉంచిన దహన స్తంభాల నుంచి హెచ్చరిక సంకేతాలు పొంది జూరిక్ సభకు జ్వింగ్లీ వెళ్లి అపాయంలో చిక్కుకోకూడదని ఆయనను వాదించారు. జ్వింగ్లీ జూరిక్ లో అయితే రోము పంపించే వారందరితో సమావేశం కాగలడు. కాని సత్యం కోసం హతసాక్షుల రక్తం చిందిన బేడెన్‌కు వెళ్లటం మరణానికి వెళ్లటమే ఔతుంది. సంస్కర్తల ప్రతినిధులుగా ఎకోవేంపడియస్, హాలర్లు ఎంపిక కాగా అనేకమంది వేదపండితులు, ప్రిలేట్ల మద్దతుగల ప్రఖ్యాత డాక్టర్ ఎక్ రోముకు ప్రతినిధిగా ఎన్నికయ్యారు.GCTel 162.4

    ఆ సభలో జ్వింగ్లీ లేకపోయినా అక్కడ ఆయన ప్రభావం ఉన్నది. లేఖర్లను పోపు నేతలే ఎంపిక చేసుకొన్నారు. ఇతరులు ఏమీ రాయకూడదని రాస్తే మరణదండనకు గురి అవుతారని ప్రకటించారు. ఇది ఇలా ఉండగా బేడెన్లో జరుగుతున్నదంతా నివేదిక రూపంలో ఏనాటికానాడు జ్వింగ్లీకి అందేది. ఆ వాగ్వాదానికి హాజరైన ఒక విద్యార్ధి ఆరోజు వాదనలను ఆ సాయంత్రం జాగ్రత్తగా దాఖలు చేసేవాడు. ఏకోవేంపడియన్ రోజూ రాసే ఉత్తరాలతో పాటు ఈ పత్రాలను కూడా జూరిక్ లో ఉన్న జ్వింగ్లీకి ఇద్దరు విద్యార్ధులు అందజేసేవారు. సంస్కర్త సలహాలు సూచనలతో వాటికి సమాధానం ఇచ్చేవాడు. జ్వింగ్లీ తన లేఖల్ని, రాత్రుళ్లు రాస్తే విద్యార్థులు వాటిని పట్టుకొని బేడెన్ కి ఉదయం వెళ్లేవారు. నగర ద్వారాల వద్ద కావలివాళ్లను మభ్యపెట్టేందుకు ఈ దూతలు తలలమీద కోళ్లగంపలు పెట్టుకొని వెళ్లటం కావలివాళ్లు వాళ్లని ఆపకుండా పోనివ్వటం జరిగేది.GCTel 163.1

    తన ధూర్త ప్రత్యర్థులతో జ్వింగ్లీ ఈ విధంగా తన పోరాటాన్ని సాగించాడు. మైకోనియస్ ఇలా అన్నాడు, “తన ధ్యానం ద్వారా, నిద్రలేకుండా రాత్రంతా పనిచేయటం ద్వారా బేడెనక్కు పంపిన సూచనల ద్వారా ఆయన సాధించింది వ్యక్తిగతంగా తన ప్రత్యర్థులతో చర్చించగల దానికన్న ఎంతో గణనీయం” - డి, అబినే, పుస్త 11, అధ్యా 13.GCTel 163.2

    విజయం తమనే వరిస్తుందన్న ఆశాభావంతో ఉప్పొంగుతూ ఖరీదైన దుస్తులు, ధగధగ మెరిసే ఆభరణాలు ధరించి రోము మత వాదులు బేడెన్‌కి వచ్చారు. చవులూరించే ఖరీదైన వంటకాలు, శ్రేష్టమైన మద్యపానీయాలు వారిముందు బల్లల మీద ఏర్పాటయ్యాయి. తమ మతపరమైన విధి నిర్వహణా భారాన్ని తింటూ తాగుతూ కొంత మట్టుకు తేలిక పర్చుకొంటున్నారు. సంస్కర్తలు వీరికి భిన్నంగా కనిపించారు. ప్రజలు వారిని బిచ్చగాళ్లకన్నా కాస్త మెరుగైన వారిగా పరిగణించేవారు. బల్లవద్ద కాళ్లూపూ కూర్చొని చాలీచాలని భోజనం తిని లేచేవారు. తనగదిలో ఉన్నప్పుడు ఎకోవేంపడియసేను పరిశీలించిన అతడి గృహ యజమాని ఎకోవేంపడియస్ ఎప్పుడూ అధ్యయనంలోనో ప్రార్ధనలోనో ఉండటం చూసి ఏది ఏమైనా ఈ సిద్ధాంత వ్యతిరేకి చాలా భక్తిపరుడు” అని వ్యాఖ్యానించాడు.GCTel 163.3

    సభ జరుగుతున్న స్థలంలో “ఎక్ అందంగా అలంకరించిన బోధకుడి వేదిక అధిరోహించగా ఏకోవేంపడియస్ సామాన్య దుస్తులు ధరించి తన ప్రత్యర్థికి ఎదురుగా ఉన్న గతుకుల స్టూలుపై కూర్చోవలసి వచ్చింది.” అదే పుస్తకం, పుస్త 11,అధ్యా 13. ఎక్ గంభీర స్వరం, అంతులేని నిశ్చయత అతడికి గొప్ప అండ. బంగారం లభిస్తుందన్న ఆశ, పేరు ప్రతిష్ఠలు అతడికి ఉద్రేకాన్ని ఉత్సాహాన్ని చేకూర్చాయి. విశ్వాసాన్ని పరిరక్షించే వ్యక్తికి మంచి పారితోషికం లభించేది. వాదనలు ఫలించనప్పుడు అతడు దూషణకు శాపనార్ధాలకు దిగేవాడు.GCTel 164.1

    నిరాడంబరుడు, నిగర్వి అయిన ఎకోవేంపడియస్ పోరాటానికి వెనుకాడాడు. ఈ గంభీర ప్రకటన చేసి పోరాటంలో ప్రవేశించాడు, “తీర్పుకి ప్రామాణికంగా దైవ వాక్యాన్ని తప్ప మరే ప్రమాణాన్ని నేను గుర్తించను” - అదే పుస్తకం, పుస్త 11, అధ్యా 13. మృదు స్వభావి, వినయ వినమృడు అయినా సమర్థుడుగా, దృఢ మనస్కుడుగా తన్ను తాను నిరూపించుకొన్నాడు. రోము నాయకులు తమ వాడుక ప్రకారం సంఘాచారాలు ప్రామాణికమని వాటిని అనుసరించటం ధర్మమని విజ్ఞాపన చేస్తుండగా సంస్కర్త మాత్రం పరిశుద్ధ లేఖనాల్ని మాత్రమే నమ్మకంగా అనుసరించాడు. “రాజ్యాంగ బద్ధం కాకపోతే మన స్విట్జర్లాండు దేశంలో సంప్రదాయానికి చెల్లుబాటు లేదు. విశ్వాసపరంగా బైబిలే మన రాజ్యాంగం అన్నాడు. ” - అదే పుస్తకం, పుస్త 11, అధ్యా 13.GCTel 164.2

    ఈ సంవాదహకులిద్దరి మధ్యగల భేదం నిష్ఫలం కాలేదు. సంస్కర్త ఎకోవేంపడియస్ సున్నితంగా మర్యాదగా వెలిబుచ్చిన నిశ్చల విస్పష్ట వాదన ఎక్ ఊహల డాంబిక ఉద్వేగ భరిత వ్యక్తీకరణతో విసుగెత్తిన మనసులను ఆకట్టుకొంది.GCTel 164.3

    చర్చ పద్దెనిమిది దినాలపాటు జరిగింది. అది ముగిశాక విజయం తమదేనని పోపు మతవాదులు ధీమా వ్యక్తం చేశారు. సభలో ఎక్కువమంది రోమును సమర్ధించారు. సంస్కర్తలు ఓడిపోయారని, కనుక వారు తమ నాయకుడైన జ్వింగ్లీతో పాటు సంఘం నుంచి బహిష్కృతులని విధాన సభ ప్రకటించింది. అయితే ఆ సభ ఫలించిన ఫలాలను బట్టి విజయం ఎవరిదో వెల్లడయ్యింది. ఆపోటీ ప్రొటస్టాంట్ లక్ష్యానికి ఉత్తేజాన్నిచ్చింది. కొద్దికాలంలోనే బర్న్, బేసిల్ వంటి ముఖ్య నగరాలు సంస్కరణకు మద్దతు పలికాయి.GCTel 164.4