Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ప్రవక్తలు - రాజులు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    25 - యెషయా పిలుపు

    అజర్యాగా కూడా పిలిచే ఉజ్జియ యూదా బైన్యామినులపై సుదీర్ఘ పరిపాలన చేశాడు. రెండు శతాబ్దాల ముందు దేశాన్ని పరిపాలించిన సొలొమోను కాలంనుంచి పరిపాలించిన రాజులందరి పాలనకన్నా ఉజ్జయ పాలనలో దేశం ఎక్కువ వృద్ధి గాంచింది. అనేక సంవత్సరాలు రాజు జ్ఞాన వివేకాలతో పరిపాలన చేశాడు. గతంలో పొగొట్టుకున్న కొన్ని భూభాగాల్ని దేవుని మార్గదర్శకత్వంలో అతడి సైన్యం తిరిగి స్వాధీన పర్చుకుంది. పట్టణాల్ని ప్రాకారాలతో తిరిగి కట్టటం జరిగింది. చుట్టూ ఉన్న దేశాల నడుమ ఆ జాతి స్థానం బాగా పటిష్టమయ్యింది. వాణిజ్యం పుంజుకుంది. జాతుల సంపద యెరూషలేములోకి వచ్చిపడింది. ఉజ్జియకు “ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను.” 2 దిన వృ. 26:15.PKTel 204.1

    బాహ్యమైన ఈ ప్రగతివెంట ఆధ్యాత్మిక పునరుజ్జీవనం చోటు చేసుకోలేదు. దేవాలయ సేవలు గతంలోలాగే కొనసాగాయి. వేలమంది జీవంగల దేవున్ని ఆరాధించటానికి సమావేశమయ్యేవారు. అతిశయం సంప్రదాయం క్రమక్రమంగా వినయం చిత్తశుద్ధి స్థానాన్ని ఆక్రమించాయి. ఉజ్జియా గురించి ఇలా ఉంది : “అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ... యెహోవా మిద ద్రోహము చేశాడు. 16వ వచనం. PKTel 204.2

    ఉజ్జియకు తీవ్రప్రమాదంగా విపరిణమించిన పాపం దురభిమాన పాపం. అహరోను సంతతివారు మాత్రమే యాజకులుగా సేవ చెయ్యాలి అన్న యెహోవా స్పష్టమైన ఆజ్ఞను ఉల్లంఘించి “ధూపపీఠముమిద ధూపము వేయుటకై” రాజు దేవాలయంలో ప్రవేశించాడు. ప్రధాన యాజకుడైన అజర్యా అతని సహచరులు ఆ పని చేయవద్దని రాజుని బతిమాలారు. “నీవు ద్రోహము చేయుచున్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదు” అని వారించారు. 16,18 వచనాలు. PKTel 204.3

    రాజైన తనను వారు అలా గద్దించినందుకు ఉజ్జియకి పట్టజాలనంత కోపం వచ్చింది. అయినా ఆ ఆలయాధికారుల సంయుక్త ప్రతిఘటనతో అతడు ఆలయాన్ని అపవిత్ర పర్చలేకపోయాడు. ఆగ్రహంతోను తిరుగుబాటుతోను అక్కడే నిలబడి ఉన్న రాజును హఠాత్తుగా దేవుడు మొత్తాడు. అతడి నొసటిపై కుష్టు కనిపించింది. ఆందోళనతో అతడు ఆలయంలోనుంచి వెళ్లిపోయి మళ్లీ ఎప్పుడూ ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టలేదు. కొన్ని సంవత్సరాల అనంతరం తాను మరణించే దినంవరకు ఉజ్జియ కుష్ఠు రోగిగానే మిగిలిపోయాడు. “యెహోవా సెలవిచ్చుచున్నాడు” అన్న స్పష్టమైన వాక్యానికి విరుద్ధంగా నడుచుకోటంలోని అవివేకానికి ఇది నిలువెత్తు సాక్ష్యం. తన సమున్నత స్థానం లేక తన సుదీర్ఘ సేవాజీవితం తన ఏలుబడి చరమదశలో తన జీవితాన్ని మసకబార్చి అతణ్ని దేవుని తీర్పుకు గురిచేసిన దురభిమాన పాపానికి నిష్కృతి కాలేకపోయింది.PKTel 205.1

    దేవుడు పక్షపాతి కాడు. “అయితే దేశమందు పుట్టినవాడేగాని పరదేశియేగాని యెవడైనను సాహసించి పాపము చేసినయెడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు ... నిశ్చయముగా జనులలోనుండకుండ కొట్టివేయ బడును.” సంఖ్యా. 15:30.PKTel 205.2

    ఉజ్జియకు దేవుడిచ్చిన శిక్ష అతడి కుమారుణ్ని నిలువరించే ప్రభావం ప్రసరించింది. యోతాము తన తండ్రి చివరి సంవత్సరాల్లో భారమైన పరిపాలనా బాధ్యతలు నిర్వహించాడు. తన తండ్రి ఉజ్జయ మరణించాక యోతాము రాజయ్యాడు. యోతాము గురించి లేఖనం ఇలా చెబుతున్నది. “అతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రియైన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించెను. అయినను ఉన్నత స్థలములను కొట్టివేయకుండెను. జనులు ఉన్నత స్థలములందు ఇంకను బలుల నర్పించుచు ధూపము వేయుచునుండిరి.” 2 రాజులు 15:34,35. PKTel 205.3

    ఉజ్జయ ఏలుబడి సమాప్తం కావస్తుంది. యోతాము చాలా ప్రభుత్వ బాధ్యతలు అప్పటికే నిర్వహిస్తూ ఉన్నాడు. అప్పుడు రాజవంశపువాడైన యెషయా ఇంకా చిన్న వయసులో ఉండగానే ప్రవక్తగా పరిచర్య చెయ్యటానికి పిలుపు పొందాడు. దైవ సేవకు యెషయా పిలుపుపొందిన కాలం దైవప్రజల్ని ఒక వింతైన అపాయం ఎదుర్కొంటున్న సమయం. ఉత్తర ఇశ్రాయేలు సిరియా సేనలు సంయుక్తంగా యూదాపై దాడి సల్పటాన్ని ప్రవక్త చూడాల్సి ఉన్నాడు. దేశంలోని ముఖ్య పట్టణాల ముందు అష్షూరు సైన్యం శిబిరం వెయ్యటం చూడాల్సి ఉన్నాడు. అతడి జీవితకాలంలో షోమ్రోను పతనం ఇశ్రాయేలు పదిగోత్రాలు దేశదేశాలకి చెదిరిపోవాల్సి ఉన్నాయి. అపూరు సైన్యాలు యూదాపై పదేపదే దాడిసల్పాల్సి ఉన్నాయి. దేవుడు అద్భుత రీతిగా కలుగజేసుకుని ఉండకపోతే యెరూషలేము కూలటానికి దారితీసి ఉండే ముట్టడి సంభవించేది. దక్షిణ రాజ్య ప్రజల శాంతి భద్రతల్ని తుడిచివేసే ప్రమాదం అప్పటికే తలఎత్తింది. దేవుడు తన కాపుదలను ఉపసంహరించుకున్నాడు. అష్షూరు సేనలు యూదాదేశాన్ని ఆక్రమించటానికి సిద్దంగా ఉన్నాయి.PKTel 205.4

    బాహ్య ప్రమాదాలు తీవ్రంగా ఉన్నా అంతర్గత ప్రమాదాలు మరింత తీవ్రరూపం ధరించాయి. ప్రవక్తకు ఆందోళనను తీవ్ర సంతాపాన్ని కలిగించింది ప్రజల వక్రధోరణి. ప్రజలమధ్య సత్య ప్రచారకులుగా నిలవాల్సినవారు తమ మత భ్రష్టతవలన దేవుని తీర్పులు కొనితెచ్చుకుంటున్నవారయ్యారు. ఉత్తర రాజ్యపతనాన్ని వేగవంతం చేస్తున్న పాపాల్లోను ఇటీవలి కాలంలోనే హోషేయ ఆమోసు ప్రవక్తలు ఖండించిన పాపాల్లోను అనేకమైనవి యూదా రాజ్యాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.PKTel 206.1

    ప్రజల సాంఘిక జీవన పరిస్థితులు నిరాశాజనకంగా కనిపించాయి. లాభార్జనపై యావ చొప్పున ప్రజలు ఇల్లుమీద ఇల్లు పొలంమీద పొలం సంపాదిస్తున్నారు. యెష. 5:8 చూడండి. న్యాయం తల్లకిందులయ్యింది. బీదలపట్ల దయ కరవయ్యింది. ఈ పాపాలగురించి దేవుడిలా అన్నాడు, “మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్ము మా యిండ్లలోనే యున్నది.” “నా ప్రజలను నలుగగొట్టి మిరేమి చేయుదురు? బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు?” యెష. 3:14,15. అసహాయుల్ని కాపాడాల్సిన న్యాయాధిపతులు సైతం బీదలు, విధవరాండ్రు, తండ్రిలేని పిల్లల మొరల్ని వినటం లేదు. యెష 10:1,2 చూడండి.PKTel 206.2

    హింసతో, భాగ్యంతో గర్వం, డంబం, తాగుడు, సుఖలాలసత వచ్చాయి. యెష 2:11,12; 8:16, 18:28; 5:22,11,12 చూడండి. యెషయా దినాల్లో విగ్రహారాధన ఉనికి ఆశ్చర్యం కలిగించలేదు. యెష. 2:8,9 చూడండి. అన్ని తరగతుల ప్రజల్లోను పాపపు అలవాట్లు అంతటా వ్యాపించటంతో దేవునికి నమ్మకంగా నిలబడ్డ కొద్దిమంది నిసృహ చెందటం తరచుగా జరిగేది. ఇశ్రాయేలీయుల విషయంలో దేవుని సంకల్పాలు విఫలమవుతున్నట్లు, అవిధేయమైన ఆ జాతికి సొదొమ గొమొర్రాల గతి పట్టేటట్లు కనిపించింది.PKTel 206.3

    అలాంటి పరిస్థితుల్లో ఉజ్జయ పరిపాలన చివరి సంవత్సరంలో దేవుని హెచ్చరిక, మందలింపు వర్తమానాల్ని యూదాకి అందించాల్సిందిగా యెషయాకి పిలుపు వచ్చినప్పుడు ఆ బాధ్యతను అంగీకరించటానికి అతడు వెనకాడటంలో ఆశ్చర్యం లేదు. తనకు మొండి ప్రతిఘటన ఎదురవుతుందని అతడికి తెలుసు. ఆ పరిస్థితిని ఎదుర్కోటానికి తన ఆశక్తతను గుర్తించినప్పుడు, తాను ఏ ప్రజలకోసం పనిచెయ్యాలో వారి మంకుతనం అపనమ్మకాన్ని గురించి తలంచినప్పుడు అతడి కర్తవ్య సాధన అసాధ్యంగా కనిపించింది. అందుచేత అతడు నిరాశచెంది తన కర్తవ్యాన్ని విడిచిపెట్టి, యూదా ప్రజల్ని విగ్రహారాధనకు విడిచిపెట్టి మూటముల్లె సర్దుకుని వెళ్లిపోవాలా? ఆకాశమందున్న దేవున్ని ధిక్కరిస్తూ నీనెవే దేవతలు భూమిని పరిపాలించాలా?PKTel 206.4

    దేవాలయద్వార మండపం కింద నిలబడిఉండగా ఇలాంటి తలంపులు యెషయా మనసును నింపుతున్నాయి. అర్థాంతరంగా దేవాలయద్వారం దేవాలయం లోపలి తెర పైకి లేచినట్లు కనిపించింది. అతి పరిశుద్ధ స్థలాన్ని వీక్షించటానికి అతడికి అనుమతి లభించింది. అందులోకి ప్రవక్త సయితం వెళ్లటానికి అనుమతిలేదు. ఒక ఉన్నత సింహాసనం మీద యెహోవా ఆసీనుడై ఉన్న దర్శనం అతడి ముందుకి వచ్చింది. ఆయన మహిమతో దేవాలయం నిండింది. ఆయన సింహాసనానికి రెండుపక్కలా సెరాపులున్నారు. వారు తమ సృష్టికర్తముందు పరిచర్యచేస్తూ తమ స్తోత్రగాన ధ్వనికి స్తంభాలు ద్వారం కంపిస్తున్నట్లు, తమ స్తుతితో ఆలయమంతా నిండినట్లు కనిపించేవరకు “సైన్యములకధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది” అంటూ ప్రార్థన చేస్తున్నారు. యెష. 6:3.PKTel 207.1

    యెషయా ప్రభువు మహిమను ఔన్నత్యాన్ని వీక్షించినప్పుడు దేవుని పవిత్రత పరిశుద్దత అతడి అవగాహనకు అతీతంగా ఉన్నాయి. సృష్టికర్త పరిపూర్ణత్వానికీ, ఆయన ఎన్నుకున్న ప్రజలుగా చెలామణి అవుతున్నవారికీ - తనతోసహా - ఎంత వ్యత్యాసముంది! “అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనులమధ్య నివసించువాడను; నేను నశించితిని. రాజును సైన్యముల కధిపతియగు యెహోవాను నేను చూచితిని” అన్నాడు. 5వ వచనం. ఆలయంలోపల దేవుని సన్నిధి కాంతిలో నిలబడి, తాను తన అసంపూర్ణత అసమర్ధతతోనే ఉండిపోతే, తాను ఏ కర్తవ్య నిర్వహణకు పిలుపు పొందాడో దాన్ని సాధించటంలో పూర్తిగా విఫల మొందుతానని గుర్తించాడు. అయితే అతడికున్న ఆ వ్యాకులతను తొలగించి ఆ గొప్ప కర్తవ్యానికి అతణ్ని సమర్ధుణ్ని చెయ్యటానికి దేవుడు ఒక సెరాపును పంపించాడు. బలిపీఠంనుంచి ఒక నిప్పును తీసి దూత అతడి పెదవులమీద పెట్టి ఈ మాటలన్నాడు, “ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను. నీ దోషము తొలగిపోయెను.” అప్పుడు ఈ మాటలంటూ దేవుని స్వరం వినిపించింది, నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవును?” యెషయా ఇలా స్పందించాడు, “చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుము.” 7,8 వచనాలు.PKTel 207.2

    వేచిఉన్న దైవ సేవకుణ్ని పరలోక రాయబారి ఇలా ఆదేశించాడు. నీవు పోయి యీ జనులతో ఇట్లనుము:PKTel 208.1

    “మీరు నిత్యము వినుచుందురుగాని గ్రహింపకుందురు
    నిత్యము చూచుచుందురుగాని తెలిసికొనకుందురు
    వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో
    గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు
    ఈ జనుల హృదయము క్రోవ్వచేసి వారి చెవులు మంద
    పరచి వారి కనులు మూయించమని చెప్పెను.”
    PKTel 208.2

    9,10 వచనాలు.

    ప్రవక్త విధి విస్పష్టం. ప్రబలుతున్న పాపాల్ని ఖండిస్తూ అతడు గళమెత్తాలి. కాని వారిలో మార్పు కలుగుతుందన్న ఆశాభావానికి కొంత భరోసా లేకుండా ఆ కార్యాన్ని చేపట్టటానికి భయపడ్డాడు. “ప్రభువా, ఎన్నాళ్ల వరకు?” అని ప్రశ్నించాడు. 11వ వచనం. నీవు ఎంపిక చేసుకున్న ప్రజల్లో గ్రహించే వారు పశ్చాత్తాపపడి స్వస్థత పొందేవారు ఎవరూ లేరా? PKTel 208.3

    అపరాధంలో ఉన్న యూదా నిమిత్తం అతడనుభవించిన ఆత్మవేదన వ్యర్థం కాలేదు. అతడి పరిచర్య పూర్తిగా నిష్పలం కాదు. అయినా అనేక తరాలుగా పెచ్చు పెరుగుతూవచ్చిన దుష్టత్వాన్ని ఒక్క రోజులో నిర్మూలించటం సాధ్యపడదు. జీవితకాలమంతా ఓపికతో ధైర్యంతో బోధించాలి. నిరీక్షణ ప్రవక్తగా, నాశనాన్ని తెలిపే ప్రవక్తగా సేవ చెయ్యాలి. దేవుని సంకల్పం చివరికి నెరవేరాక, అతడి కృషికి, నమ్మకంగా పనిచేసిన దేవుని సేవకుల సేవకు సంపూర్ణ ఫలం కనిపిస్తుంది. శేషించిన కొద్దిమంది రక్షణ పొందుతారు. ఇది సంభవించటానికి హెచ్చరిక, విజ్ఞాపన వర్తమానాల్ని తిరుగుబాటు చేస్తున్న జాతికి అందించటం జరగాలి. ప్రభువిలా అంటున్నాడు :PKTel 208.4

    “నివాసులు లేక పట్టణములును మనుష్యులు లేక
    యిండ్లును పాడగువరకు దేశము బొత్తిగా
    బీడగువరకు యెహోవా మనుష్యులను దూరముగా
    తీసికొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు
    విస్తారమగువరకును ఆలాగున జరుగును.”
    PKTel 208.5

    11,12 వచనాలు.

    పశ్చాత్తాపం లేనివారి పైకి రానున్న యుద్ధం, చెర, హింస, జాతుల మధ్య అధికారాన్ని గౌరవాన్ని పోగొట్టుకోటం అన్న తీర్పుల్ని ద్రోహానికి గురిఅయిన దేవుని హస్తాన్ని వీటిలో గుర్తించి వారు మారుమనసు పొందేందుకు ఇవన్నీ జరగాల్సి ఉన్నాయి. ఉత్తర రాజ్యంలోని పది గోత్రాల ప్రజలు ప్రపంచ జాతుల్లోకి కొద్దికాలంలో చెదరిపోనున్నారు. వారి పట్టణాలు నిర్మానుష్యం కానున్నాయి. వైరి సేనలు నాశనం చేసుకుంటూ వారి దేశంపై పదేపదే దాడులు చెయ్యనున్నాయి. యెరూషలేము సయితం తుదకు పతనం కానుంది. యూదా చెరపట్టబడాల్సి ఉంది. అయినా వాగ్దత్త దేశం నిత్యం విసర్జించబడ్డ దేశం కాబోదు. పరలోక దూత యెషయాకిచ్చిన భరోసా యిది: PKTel 209.1

    “దానిలో పదియవ భాగము మాత్రము విడువబడును
    అదియును నాశనమగును
    సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత
    అది మిగిలియుండు మొద్దువలె నుండును
    అట్టి మొద్దునుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును.”
    PKTel 209.2

    13వ వచనం.

    దేవుని సంకల్పం చివరకు నెరవేర్తుందన్న భరోసా యెషయా హృదయాన్ని ధైర్యంతో నింపింది. లోక రాజ్యాలు యూదాకి వ్యతిరేకంగా మోహరించి ఉన్నా ఏమౌతుంది? దైవ సేవకుడికి వ్యతిరేకత, ప్రతిఘటన ఎదురైనా ఏమౌతుంది? రాజు సైన్యాలకు అధిపతిఅయిన యెహోషువాను యెషయా చూశాడు. సెరాపులు “సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది” అంటూ పాడిన పాటను విన్నాడు. యూదాలోని విశ్వాస ఘాతకులకు యెహోవా వర్తమానం వెంట మార్పు కలిగించే పరిశుద్దాత్మ శక్తి ఉంటుందని దేవుడు అతడికి వాగ్దానం చేశాడు. తనముందున్న కర్తవ్య సాధనకు అది ప్రవక్తకు ధైర్యానిచ్చింది. 3వ వచనం. దీర్ఘమైన కష్టభరితమైన తన పరిచర్య అంతటిలోను ఈ దర్శనం జ్ఞాపకం అతడి మనసులో నిలిచిపోయింది. నిరీక్షణ ప్రవక్తగా భవిష్యత్తులో సంఘం విజయాన్ని నిర్భయంగా ప్రవచిస్తూ యెషయా అరవై సంవత్సరాలకు పై చిలుకు యూదా ప్రజలముందు నిలిచాడు.PKTel 209.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents