Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ప్రవక్తలు - రాజులు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    12 - యెజ్రాయేలు నుంచి హోరేబుకి

    బయలు ప్రవక్తల సంహారంతో ఉత్తర రాజ్యంలోని పదిగోత్రాల నడుమ ఆధ్యాత్మిక సంస్కరణ ప్రారంభానికి మార్గం ఏర్పడింది. ఏలీయా ప్రజలముందు తమ మత భ్రష్టతను ఎత్తిచూపి తమ్మును తాము తగ్గించుకుని, దేవుని తట్టు తిరగాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. దేవుని తీర్పులు అమలయ్యాయి. ప్రజలు తమ పాపాల్ని ఒప్పుకుని తమ తండ్రుల దేవుడే జీవంగల దేవుడని గుర్తించారు. ఇప్పుడు దేశంమిది శాపం ఉపసంహరించబడాల్సి ఉంది. ఐహిక దీవెనలు ప్రారంభంకావాల్సి ఉంది. భూమి వర్షంతో తెప్పరిల్లాల్సి ఉంది. “విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది. నీవు పోయి భోజనము చేయుము” అని ఏలీయా అహాబుతో అన్నాడు. అప్పుడు ప్రవక్త ప్రార్ధన చెయ్యటానికి పర్వత శిఖరానికి వెళ్లాడు. PKTel 96.1

    అహాబుని వర్షానికి సిద్దపడమని ఏలీయా అంత నిశ్చితంగా చెప్పటం వర్షం కురుస్తాదనటానికి ఏదో బాహ్యమైన నిదర్శనాన్నిబట్టి కాదు. ప్రవక్త ఆకాశంలో మేఘాల్ని చూడలేదు. ఉరుము ఉరమటం వినలేదు. బలమైన తన సొంత విశ్వాసానికి ప్రతిస్పందనగా పరిశుద్ధాత్మ అతణ్ని ఆవేశంతో నింపగా అతడు ఆ మాటలు పలికాడు. దినమంతా అతడు దేవుని చిత్తాన్ని తు.చ. తప్పకుండా జరిగించాడు. దేవుని వాక్యంలోని ప్రవచనాలపై తిరుగులేని విశ్వాసాన్ని ప్రదర్శించాడు. ఇప్పుడు తాను చెయ్యగలిగిందంతా చేశాక తాను వాగ్దానం చేసిన దీవెనల్ని దేవుడు ఇస్తాడని అతడికి ఖండింతంగా తెలుసు. అనావృష్టిని పంపిన దేవుడే వారి మంచి పనికి ప్రతిఫలంగా విస్తారమైన వర్షాన్నిస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఏలీయా ఆ వాగ్దత్త కుంభవృష్టికి ఎదురుచూస్తున్నాడు. దీన స్వభావంతో ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొని” పశ్చాత్తప్త ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవునితో విజ్ఞాపన చేశాడు.PKTel 96.2

    దేవుడు తన ప్రార్ధన విన్నాడనటానికి ఏదైనా సూచన కనిపిస్తుందేమోనని ఏలీయా మాటిమాటికీ తన సేవకుణ్ని మధ్యధరా సముద్రం కనిపించే ఒక తావుకి పంపించాడు. సేవకుడు తిరిగివచ్చి “ఏమియు కనపడలేదు” అని చెప్పాడు. ప్రవక్త సహనాన్నిగాని విశ్వాసాన్నిగాని కోల్పోలేదు. కాని తన విజ్ఞాపనను కొనసాగించాడు. ఆకాశంలో వర్షసూచనలేవీ కనిపించటంలేదన్న వార్త సేవకుడు ఆరుసార్లు తెచ్చాడు. నిరుత్సాహ పడకుండా ఏలీయా తన సేవకుణ్ని మరొక్కసారి పంపించాడు.. ఈసారి సేవకుడు “అదిగో మనిషి చెయ్యియంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నది” అన్నాడు.PKTel 96.3

    ఇది చాలు. ఆకాశం మేఘావృతం కావటానికి ఏలీయా ఆగలేదు. ఆ చిన్న మేఘంలో అతడు విశ్వాసమూలంగా విస్తారమైన వర్షాన్ని చూశాడు. తన విశ్వాసానికి అనుగుణంగా కార్యాచరణ చేపట్టాడు. తక్షణమే అహాబు వద్దకు తన సేవకుణ్ని “నీవు వెళ్ళకుండ వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధము చేసికొని పొమ్ము.” అన్న వర్తమానంతో పంపాడు.PKTel 97.1

    ఏలీయా గొప్ప విశ్వాసమున్నవాడు కాబట్టే ఇశ్రాయేలు చరిత్రలో ఈ క్లిష్టసమయంలో దేవుడు అతణ్ని ఉపయోగించుకున్నాడు. అతడు ప్రార్ధిస్తున్నప్పుడు అతడి విశ్వాసం దేవుని వాగ్దానాన్ని గ్రహించగలిగింది. తన మనవులు ఫలించేవరకు అతడు విడువకుండ ప్రార్ధించాడు. దేవుడు తన ప్రార్ధన విన్నాడన్న దానికి నిదర్శనం కోసం ఆగలేదు. దైవానుగ్రహానికి ఆ చిన్నగుర్తును ఆసరా చేసుకుని సాహసంతో ముందంజ వెయ్యటానికి పూనుకున్నాడు. అయినా అతడు ఏమైతే చేయగలిగాడో అదే అందరూ తమ పరిధిలో దేవుని సేవలో చేయగలుగుతారు. ఎందుకంటే గిలాదు పర్వత ప్రాంతపువాడైన ఆ ప్రవక్తను గురించి లేఖనం “ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్ధన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమిమీద వర్షింపలేదు.” అంటుంది. యాకోబు 5:17.PKTel 97.2

    నేడు అలాంటి విశ్వాసం ఎంతైనా అవసరం. దేవుని వాగ్దానాల్ని అందిపుచ్చుకుని దేవుడు వినేవరకు వాటిని విడిచిపెట్టకుండా కొనసాగే విశ్వాసం అవసరం. ఇలాంటి విశ్వాసం మనల్ని దేవునికి దగ్గరచేసి చీకటి శక్తుల్ని ఎదిరించటానికి మనకు శక్తినిస్తుంది. దేవుని బిడ్డలు విశ్వాసం ద్వారా “రాజ్యములను జయించిరి, నీతికార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లు మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్దములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి.” హెబ్రీ 11:33,34. మన నిమిత్తం దేవుని సంకల్పాన్ని నేడు విశ్వాసం ద్వారా మనం నెరవేర్చగలుగుతాం. “నమ్ముట నీ వలనైతే, నమ్ముతానికి సమస్తమును సాధ్యమే.” మార్కు 9:23.PKTel 97.3

    ఫలదాయక ప్రార్ధనలో విశ్వాసం ముఖ్యభాగం. “దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను.” “ఆయన చిత్తానుసారముగా మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మన మెరిగిన యెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము, హెబ్రీ 11:6:1 యోహా 5:14,15. యాకోబు వంటి ఎడతెగని విశ్వాసంతో ఏలీయా వంటి అచంచలమైన పట్టుదలతో మనం మన మనవుల్ని తండ్రికి సమర్పించవచ్చు. ఆయన వాగ్దానం చేసిన వాటన్నిటినీ పొందవచ్చు. తన మాట నెరవేర్పుకు ఆయన తన సింహాసన గౌరవాన్ని పణంగా పెట్టాడు.PKTel 98.1

    అహాబు కర్మెలు పర్వతంనుంచి దిగటానికి ఆయత్తమౌతున్నప్పుడు సాయంసంధ్య నీడలు విస్తరిస్తున్నాయి. “అంతలో ఆకాశము మేఘములతోను, గాలితోను కారుకమ్మెను. మోపైన వాన కురిసెను గనుక అహాబు రథమెక్కి యెజైయేలునకు వెళ్ళిపోయెను.” చీకటిలోను, కన్ను కనపడకుండా కురుస్తున్న వర్షంలోను అహాబు రాజనగరికి వెళ్తున్నాడు. అహాబుకి తన ముందున్న మార్గం కనిపించటంలేదు. దేవుని ప్రవక్తగా ఆ దినాన అహాబుని తన ప్రజలముందు చిన్నబుచ్చి, విగ్రహారాధకులైన ప్రవక్తల్ని సంహరించిన ఏలీయా అతణ్ని ఇంకా ఇశ్రాయేలీయుల రాజుగా గుర్తించాడు. ఇప్పుడు దేవుడిచ్చిన బలంతో, గౌరవసూచకంగా అతడు రాజు రథం ముందు పరుగెత్తుతూ నగర ప్రవేశద్వారం వరకు దారి చూపించాడు.PKTel 98.2

    దైవ సేవకులమని చెప్పుకుంటున్నా తమ సొంత దృష్టిలో ఘనులమని విర్రవీగే వారికి ఈ దైవ సేవకుడి దయకార్యం నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఉంది. తమ దృష్టికి నీచ సేవలుగా కనిపించే విధుల నిర్వహణకు తాము అతీతులమని కొందరు భావిస్తారు. తాము సేవకుడు చేసే విధులు నిర్వర్తించటం ఎవరైనా చూస్తారేమోనన్న భయంతో వారు అవసర విధుల్ని కూడా నిర్వహించ టానికి వెనకాడారు. ఇలాంటివారు ఏలీయా ఆదర్శం నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. అతడి మాటచేత ఆకాశ వనరులు భూమిమీద పడకుండా మూడున్నర సంవత్సరాలు నిలిచిపోయాయి. కర్మెలు పర్వతం మీద అతడి ప్రార్ధనకు జవాబుగా ఆకాశం నుంచి అగ్ని దిగివచ్చి బలిని దహించటం ద్వారా అతణ్ని దేవుడు ఘనంగా ఆదరించాడు. విగ్రహారాధక ప్రవక్తల్ని సంహరించటంలో అతడి హస్తం దేవుని తీర్పును అమలుపర్చింది. వర్షం కోసం అతడు చేసిన ప్రార్ధన సఫలమయ్యింది. అతడికి అపూర్వ విజయాలిచ్చి అతడి బహిరంగ సేవను దేవుడు గౌరవించిన తర్వాత అతడు నీచ సేవలు చెయ్యటానికి సిద్ధంగా ఉన్నాడు.PKTel 98.3

    యెజ్రాయేలు గుమ్మంవద్ద అహాబు ఏలీయా విడిపోయారు. నగర ప్రాకారం బయటే ఉండాలని భావించిన ప్రవక్త తన దుప్పటిని కప్పుకుని నిద్రించటానికి వట్టినేలమీదే పడుకున్నాడు. రాజు నగరంలోకి వెళ్లి రాజభవనం చేరుకుని తన భార్యకు ఆ దినం జరిగిన కార్యాలన్నిటినీ వివరించాడు. యెహోవానే నిజమైన దేవుడని ఏలీయా ఆయన ఎంపిక చేసుకున్న ప్రవక్త అని ఇశ్రాయేలు ప్రజలకు నిరూపిస్తూ చోటు చేసుకున్న దైవశక్తి ప్రదర్శనను గురించి ఆమెకు చెప్పాడు. అహాబు విగ్రహారాధక ప్రవక్తల సంహారం గురించి చెప్పినప్పుడు యెజెబెలు హృదయం కఠినమయ్యింది. మారుమనసన్నది ఆమెకులేదు. ఆగ్రహంతో వణికింది. కర్మెలు పర్వతంపై చోటుచేసుకున్న ఘటన దైవసంకల్ప ప్రకటనగా స్వీకరించటానికి నిరాకరించింది. దైవ ధిక్కారంలో పేట్రేగిపోయి ఏలీయా మరణించాలని ధైర్యంగా ప్రకటించింది.PKTel 99.1

    ఆ రాత్రి ఒక వార్తాహరుడు ఏలీయాను తట్టిలేపి యెజెబెలు అన్న మాటను అతడికి చెప్పాడు: “రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణమువలె చేయని యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక.” PKTel 99.2

    అంతగొప్ప ధైర్యం ప్రదర్శించిన తర్వాత, రాజుమిద, యాజకులమీద, ప్రజల మీద అంత సంపూర్ణం విజయం సాధించిన తర్వాత, ఏలీయా ఎన్నడూ నిస్పృహకు చోటివ్వటంగాని బెదిరింపులకు భయపడటంగాని జరగదనిపించింది. కాని దేవుని శ్రద్దకు ఆయన ప్రేమకు అనేక నిదర్శనాలు చూసిన అతడు మానవ బలహీనతలకు అతీతుడుకాడు. ఈ చీకటి ఘడియలో విశ్వాసం, నైతిక ధైర్యం అతణ్ని విడిచిపెట్టాయి. నిద్రలేచి ఆ వార్త విని కలవరం చెందాడు. వర్షం ధారాపాతంగా పడ్తుంది. అంతా చీకటిగా ఉంది. మూడేళ్ళ కిందట యెజెబెలు ద్వేషానికి దూరంగా ఉండటానికి, తన కోసం వెదకుతున్న అహాబుకి దొరకకుండా ఉండటానికి దేవుడు తనను ఒక ఆశ్రయ స్థానానికి నడిపించాడన్న సంగతి మర్చిపోయి, ఏలీయా ఇప్పుడు తన ప్రాణాన్ని కాపాడుకోటానికి పారిపోతున్నాడు. బెయేరెబా చేరుకుని “అచ్చట ఉండుమని తన సేవకునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి” వెళ్లాడు.PKTel 99.3

    ఏలీయా తన సేవా స్థలం నుంచి పారిపోకుండా ఉండవలసింది. యెహోవా నామ ఘనతను రుజువు చేయమని ఆదేశించిన ప్రభువు పరిరక్షణ కోరి యెజెబెలు బెదిరింపును ఎదుర్కోవలసింది. తాను ఎవరిని నమ్ముకున్నాడో ఆ ప్రభువు తనను ద్వేషం నుంచి కాపాడాడని ఆమె దూతకు చెప్పాల్సింది. అద్భుతమైన దైవశక్తి ప్రదర్శనను అతడు చూసి కొద్దిగంటలు మాత్రమే గడిచాయి. తనను దేవుడు ఇప్పుడు విడిచిపెట్టడు అన్న భరోసా అతడికి ఆ సంఘటన ఇచ్చి ఉండాల్సింది. అతడు తానున్నచోటే ఉండి ఉంటే, దేవున్ని తన ఆశ్రయంగాను బలంగాను పరిగణించి సత్యంకోసం స్థిరంగా నిలిచి ఉంటే, అతడికి ఏ హాని కలుగకుండా దేవుడు కాపాడేవాడు. యెజెబెలు మీద తీర్పు ప్రకటించటం ద్వారా ప్రభువు అతడికి మరొక అపూర్వ విజయం చేకూర్చేవాడు. రాజు మీద ప్రజల మీద ఆ చర్య చూపే ప్రభావం వల్ల గొప్ప సంస్కరణ చోటు చేసుకునేది.PKTel 99.4

    కర్మెలు పర్వతంపై జరిగిన అద్భుతకార్యం నుంచి ఏలీయా ఎంతో ఆశించాడు. దైవశక్తి ప్రదర్శన దరిమిలా అహాబు మనసుమిద యెజెబెలు ప్రభావం ఏమి ఉండదని, ఇశ్రాయేలు రాజ్యమంతటిలోను వేగవంతమైన దిద్దుబాటు చోటుచేసుకుంటుందని భావించాడు. కర్మెలుపై దినమంతా అన్నపానాలు లేకుండ పనిచేశాడు. అయినా ఆహాబు రథానికిముందు పరుగెత్తి యెజైలు గుమ్మం వరకూ దారి చూపించినప్పుడు శారీరక శ్రమకోర్చి ఆకార్యాన్ని చేసినప్పుడు సైతం అతడి ధైర్యం చెక్కుచెదరలేదు.PKTel 100.1

    అయితే గొప్ప విశ్వాసం, మహిమాన్వితమైన విజయం వెంట తరచుగా సంభవించే ప్రతిక్రియలాంటిది ఏలీయాను వెంటాడుంది. కర్మెలు మిద ప్రారంభమైన దిద్దుబాటు ఎక్కువకాలం ఉండదన్నభయం అతడిలో పుట్టింది. నిరుత్సాహం దిగులు అతణ్ని కుంగదీశాయి. పిస్తా శిఖరానికి ఎగసిన అతడు ఇప్పుడు లోయలో పడి ఉన్నాడు. సర్వశక్తుని ఆవేశంతో నిండి ఉండగా అతి తీవ్రమైన విశ్వాస పరీక్షకు తట్టుకున్నాడు. కాని నిరాశకు గురి అయిన ఈ సమయంలో, యెజెబెలు బెదిరింపులు తన చెవుల్లో గింగురు మంటున్నప్పుడు, ఈ దుష్ట స్త్రీ కుట్రలద్వారా సాతాను పైచెయ్యి సాధిస్తున్నట్లు కనిపించినప్పుడు దేవునిపై అతడికున్న పట్టు జారిపోయింది. అతణ్ని మితిమీరి హెచ్చించటం జరగగా దానికి స్పందన అద్భుతంగా ఉంది. దేవున్ని మర్చిపోయి ఏలీయా దూరంగా పారిపోయాడు. చివరికి ఒక నిర్జన ప్రదేశం చేరుకున్నాడు. ఒంటరి అయ్యాడు. బాగా అలసిపోవటంతో విశ్రాంతి తీసుకోటానికి ఒక బదరీ వృక్షం కింద కూర్చున్నాడు. అక్కడ కూర్చుని నేను మరణిస్తే బాగుండును అని తనలో తాను అనుకున్నాడు. “యెహోవా, నా పితరులకంటే నేను ఎక్కువవాడను కాను: ఇంతమట్టుకు చాలును, నా ప్రాణమును తీసుకొనుము” అని ప్రార్ధన చేశాడు. ఏలీయా పారిపోతున్నాడు. మనుషుల నివాసాలికి ఎంతో దూరంగా ఉన్నాడు. తీవ్ర ఆశాభంగంతో అతడి హృదయం నలిగిపోయింది. మళ్లీ మనుషుల ముఖాలు చూడకూడదనుకున్నాడు. ఈ స్థితిలో ఉన్న అతడు అలసి చివరికి నిద్రించాడు. PKTel 100.2

    అందరి అనుభవంలోను ఆశాభంగాలు నిరాశ చోటుచేసుకున్న సమయా లుంటాయి. దుఃఖించిన దినాలు, తన బిడ్డలకు దేవుడింకా సహాయం చేస్తున్నాడంటే నమ్మటం కష్టమయిన దినాలు, జీవించటంకన్నా మరణించటమే మేలు అనుకునేంతగా కష్టాలు బాధలు ఆత్మను క్షోభింపజేసిన దినాలు ఉంటాయి. అట్టి సమయాల్లో అనేకులు దేవునిపై నమ్మకాన్ని కోల్పోతారు. సందేహానికి బానిసలవుతారు. అవిశ్వాసానికి బందీలవుతారు. అట్టి సమయాల్లో దేవుని సంకల్పాల భావాన్ని ఆధ్యాత్మిక దృష్టితో అవగాహాన చేసుకుంటే, మనల్ని మనం నాశనం చేసుకోకుండా కాపాడటానికి, కొండలకన్నా స్థిరమైన పునాది మీద మన పాదాల్ని నిలపటానికి దేవదూతలు కృషి చెయ్యటం మనం చూస్తాం. అప్పుడు మనలోకి నూతన విశ్వాసం నూతన జీవం నదిలా ప్రవహిస్తాయి.PKTel 101.1

    తన కష్టకాలంలో తన చీకటి దినాల్లో యోబు ఇలా అన్నాడు.
    “నేను పుట్టిన దినము లేకపోవునుగాక”

    “నా దుఃఖము చక్కగా తూచబడునుగాక
    దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో
    పెట్టబడునుగాక!”

    “ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక
    నేను కోరుదానిని దేవుడు నెరవేర్చునుగాక
    దేవుడు తన యిష్టానుసారముగా నన్ను నిలుపును గాక
    చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక
    అప్పుడు నేను పరిశుద్ద దేవుని మాటలను ఒప్పుకొన
    కుండలేదని నేను ఆదరణ పొందుదును.”

    “కావున నేను నా నోరు మూసుకొనను
    నా ఆత్మవేదన కొలది నేను మాటలాడెదను
    నా మనోవేదనను బట్టి మూల్గుచుండెదను.”

    “మరణమొందుట నాకిష్టము ....
    నిత్యము బ్రతుకుట నా
    కిష్టములేదు
    నా దినములు ఊపిరివలెనున్నవి
    నా జోలికి రావద్దు.”
    PKTel 101.2

    యోబు 3:3, 6:2,8-10, 7:11,15,16

    జీవితంతో విసిగిపోయినప్పటికీ యోబు మరణం ఆమోదించబడలేదు.. భవిష్యత్తు అవకాశాల గురించి అతడికి సూచించటం జరిగింది. అతడికి ఈ నిరీక్షణావర్తమానం వచ్చింది :PKTel 101.3

    “నిర్భయుడవై నీవు స్థిరపడియుందువు
    నిశ్చయముగా నీదుర్గశను నీవు మరచెదవు
    దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసికొనునట్లు
    నీవు దానిని జ్ఞాపకము చేసికొనెదవు
    అప్పుడు నీ బ్రదుకు మధ్యాహ్నకాల తేజస్సుకంటే
    అధికముగా ప్రకాశించును
    చీకటికమ్మినను అది అరుణోదయమువలె కాంతిగా
    నుండును
    నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్య
    ముగా ఉందువు...
    ఎవరి భయములేకుండ నీవు పండుకొందువు
    అనేకులు నీతో విన్నపములు చేసెదరు
    దుష్టుల కనుచూపు క్షీణించిపోవును
    వారికి ఆశ్రయమేమియు ఉండదు
    ప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురు
    చూచుచుందురు.”
    PKTel 102.1

    యోబు 11:15-20.

    నిరాశ నిస్పృహ అగాధాల్లో నుంచి దేవుని కృప, దేవుని రక్షణ శక్తి శిఖరాలికి యోబు లేచాడు. విజయం సాధించి ఇలా వెల్లడించాడు :PKTel 102.2

    “ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు
    కనిపెట్టుచున్నాను ...
    ఇదియు నాకు రక్షణార్ధమైనదగును.”

    “నా విమోచకుడు సజీవుడనియు, తరువాత
    ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగు
    దును.”

    ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీర
    ముతో నేను దేవుని చూచెదను
    నా మట్టుకు నేను చూచెదను మరి ఎవరును కాదు నేనే కన్నులార
    ఆయనను చూచెదను.”
    PKTel 102.3

    యోబు 13:15,16; 19: 25-27.

    “అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి ఈలాగు యోబునకు” తన మహాశక్తిని వెల్లడి చేశాడు (యోబు 38:1). యోబుకి తన సృష్టికర్త క్షణదర్శనం కలిగిన తర్వాత అతడు తన్నుతాను అసహ్యించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడ్డాడు. అప్పుడు ప్రభువు అతణ్ని దీవించగలిగాడు. అతడి చివరి సంవత్సరాలు తన జీవితంలో ఉత్తమ సంవత్సరాలు చేశాడు.PKTel 103.1

    దైవ సేవ పరిపూర్ణతకు నిరీక్షణ ధైర్యం ప్రాముఖ్యం. అవి విశ్వాసఫలాలు. నిస్పృహ పాపం. అది హేతుబద్దం కాదు. తన సేవకులు కష్టాలు శ్రమలు భరించటానికి వారికి “మరి నిశ్చయముగా” (హెబ్రీ 6:17) ఆయన శక్తినిస్తాడు. శక్తినివ్వటానికి ఆయన సమర్థుడు, సంసిద్ధంగా ఉన్నాడు కూడా. తన సేవను వ్యతిరేకించే శత్రువుల ప్రణాళికలు పటిష్టంగాను స్థిరంగాను విజయవంతమవు తున్నట్లుగాను కనిపించవచ్చు. కాని వీటిలో అతి పటిష్టమైన వాటిని సయితం దేవుడు కూలదోయగలడు. తన సేవకుల విశ్వాసం పరీక్షకు నిలబడినట్లు గ్రహించిన తర్వాత ప్రభువు ఈ పనిని తాను ఎన్నుకున్న సమయంలోను తాను ఎన్నుకున్న మార్గంలోను చేస్తాడు.PKTel 103.2

    నిరాశ చెందినవారికి నిశ్చితమైన పరిష్కార మార్గం - విశ్వాసం, ప్రార్ధన, కృషి విశ్వాసం, క్రియాశీలత నిశ్చయతను సంతృప్తిని ఇస్తాయి. అవి రోజుకి రోజు పెరుగుతాయి. భయాందోళన లేక నిస్పృహ మనోభావాలకు మీరు లొంగిపోతున్నారా? బాహ్యాకారాలు మిక్కిలి భయంకరంగా కనిపిస్తున్న చీకటి దినాల్లో భయానికి తావియ్యవద్దు. దేవునిపై విశ్వాసముంచండి. మీ అవసరమేంటో ఆయనకు తెలుసు ఆయన సర్వశక్తిగలవాడు. ఆయన అపార ప్రేమకు దయకు అలుపుండదు. ఆయన తన వాగ్దానాల్ని నెరవేర్చడన్న భయం మీకక్కరలేదు. నిత్య సత్యం ఆయనే. తన్ను ప్రేమించే వారితో ఆయన చేసే నిబంధనను ఆయన ఎన్నడూ మార్చడు. నమ్మకస్తులైన తన సేవకులకు అవసరమైన సామర్థ్యాన్ని ఆయన ఇస్తాడు. అపొస్తలుడు పౌలు ఇలా సాక్ష్యమిస్తున్నాడు: “నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి సంపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను.... నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను.” 2 కొరింథి 12:9,10.PKTel 103.3

    ఏలీయాను తన కష్టకాలంలో దేవుడు విడిచిపెట్టాడా? లేదే! తన ప్రార్ధనకు జవాబుగా ఆకాశం నుంచి అగ్ని దిగివచ్చి పర్వత శిఖరాన్ని వెలుగుతో నింపినప్పుడు తనను ఎంత ప్రేమించాడో, దేవుడు మానవుడూ తనను విడిచి పెట్టేశారని నిసృహ చెంది ఉన్నప్పుడు కూడా దేవుడు అతణ్ని అంతే ప్రేమించాడు. ఆయన ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు ఏలీయా నిద్రిస్తుండగా ఒక సున్నిత్తువ స్పర్శ ఒక మధురమైన స్వరం అతణ్ని మేల్కొలిపాయి. శత్రువు తనను కనుగొన్నాడేమోనన్న భయంతో పారిపోవటానికి సిద్దంగా ఉన్నట్లు ఉలిక్కిపడి లేచాడు. కాని వంగి తన వంక దయగా చూస్తున్న ముఖం శత్రువు ముఖం కాదు. మిత్రుడి ముఖం. దేవుడు పరలోకం నుంచి తన సేవకుడికి దేవదూతతో ఆహారం పంపించాడు. ఆ దూత ఇలా అన్నాడు, “నీవు లేచి భోజనము చేయుము... అతడు చూచినంతలో అతని దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పుమును, నీళ్ళ బుడ్డియు కనబడెను.”PKTel 103.4

    తన కోసం తయారు చేసిన అల్పాహారాన్ని ఏలీయా భుజించి మళ్లీ నిద్రపోయాడు. దూత రెండోసారి వచ్చాడు. అలసిపోయి గాఢంగా నిద్రిస్తున్న అతణ్ని తట్టి దూత సాదరంగా ఇలా అన్నాడు, “నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్దమైయున్నది; నీవులేచి భోజనము చేయుము” “అతడు లేచి భోజన” పానాలు చేశాడు. ఆ భోజనం బలంతో “నలువది రాత్రింబగళ్లు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అక్కడ ఒక గుహలో దాకొన్నాడు.PKTel 104.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents