Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ప్రవక్తలు - రాజులు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    13 - “ఇచ్చట నీవేమి చేయుచున్నావు?”

    హోరేబు పర్వతంపై ఏలీయా ఆశ్రయం మానవుడికి మరుగై ఉన్నా దేవునికి తెలిసిందే. తనను తరుముకు వస్తున్న అంధకార శక్తులతో ఒంటరిగా పోరాడటానికి అలసిపోయిన, అధైర్యం చెందిన ఆ ప్రవక్తను దేవుడు విడిచిపెట్టలేదు. ఏలీయా అవసరాల్ని తెలుసుకోటానికీ, ఇశ్రాయేలుపట్ల తన సంకల్పాన్ని అతడికి విశదం చెయ్యటానికి తాను పంపిన దూత ద్వారా దేవుడు అతణ్ని తాను బసచేసిన గుహద్వారం వద్ద కలిశాడు.PKTel 105.1

    ఏలీయా దేవున్ని పూర్తిగా నమ్మేవరకు మోసపోయిన బయలు ఆరాధకుల కోసం తన సేవను పూర్తిచేయ్యలేడు. కర్మెలు శిఖరంపై లభించిన అఖండ విజయం మరిన్ని గొప్ప విజయానికి మార్గం తెరిచింది. అయినా ఏలీయా తన ముందున్న మహత్తర అవకాశాల్ని యెజెబెలు బెదిరింపువల్ల విడిచి పెట్టి పారిపోయాడు. తనకు దేవుడు ఉద్దేశించిన ఉత్తమ స్థానంతో తన ప్రస్తుత బలహీన పరిస్థితిని సరిపోల్చుకుని, అందులోని బలహీనతను ఏలీయా అవగాహన చేసుకునేటట్లు చెయ్యటమే దేవుని ఉద్దేశం. PKTel 105.2

    నమ్మకమైన తన సేవకుణ్ని దేవుడు ఇలా ప్రశ్నించాడు, “ఏలీయా, ఇక్కడ నీవు ఏంచేస్తున్నావు? నిన్ను కెరీతువాగు వద్దకు, ఆతర్వాత సారెపతు విధవరాలి వద్దకు పంపాను. నీవు ఇశ్రాయేలుకి తిరిగివచ్చి, విగ్రహారాధక యాజకుల ముందు నిలబడమని నిన్ను ఆజ్ఞాపించాను. యెజ్రాయేలు గుమ్మం వరకు రాజు రథానికి మార్గం చూపించటానికి నీకు బలాన్నిచ్చాను. అయితే ఈ హడావుడి పయనం మిద అరణ్యంలోకి నిన్ను పంపిందెవరు? ఇక్కడ నీ పని ఏమిటి?”PKTel 105.3

    హృదయ వేదనతో ఏలీయా ఇలా ఫిర్యాదు చేశాడు, “ఇశ్రాయేలువారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గముచేత హతము చేసిరి. సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణమును కూడ తీసివేయుటకై చూచుచున్నారు.”PKTel 105.4

    గుహలోనుంచి బయటికి వచ్చి దేవుని ముందు నిలబడి ఆయన మాటలు వినటానికి పర్వతం ఎక్కమని దూత అతణ్ని ఆదేశించాడు : “అంతట యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను శిలలు చిన్నాభిన్నములాయెను గాని యెహోవా ఆ గాలిదెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలిపోయిన తరువాత భూకంపము కలిగెనుగాని ఆ భూకంపమందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపుపుట్టెనుగాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దానివిని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను.”PKTel 106.1

    తన మహాశక్తి ప్రదర్శనలోకాక నిమ్మళంగా మాట్లాడే చిన్న స్వరంలో దేవుడు తన సేవకుడికి తన్నుతాను వెల్లడి చేసుకున్నాడు. తన సంకల్పాన్ని నెరవేర్చటంలో ఎల్లప్పుడు పనే అత్యున్నత విజయ ప్రదర్శన కాదని ఏలీయాకు నేర్పించాలని దేవుడు ఉద్దేశించాడు. ఏలీయా ప్రభువు ప్రత్యక్షతకోసం వేచి ఉన్నప్పుడు పెద్దగాలి లేచింది, మెరుపులు మెరిశాయి. మంటలు రేగాయి. కాని వాటన్నిటిలోను దేవుడు ప్రత్యక్షం కాలేదు. అప్పుడు నిమ్మళంగా మాట్లాడే స్వరం వినిపించింది. దేవుని సముఖం ముందు ప్రవక్త ముఖం కప్పుకున్నాడు. అతడి కోపం పోయింది. అతడి స్వభావం మెత్తబడింది, లొంగుబాటు కొచ్చింది. దేవుని విశ్వసించి ఆయనపై బలంగా ఆధారపడటం ద్వారానే అవసరంలో కావాల్సిన సహాయం తాను ఎప్పుడూ పొందగలనని అతడు ఇప్పుడు గ్రహించాడు. PKTel 106.2

    దేవుని వాక్యాన్ని తెలివిగా సమర్పించటం ఆత్మలో ఎల్లప్పుడూ మార్పు కలిగించదు. వాగ్దాటి లేక తర్కం మానవ హృదయాల్ని వశపర్చుకోలేవు. ఆ పని పరిశుద్ధాత్మ ప్రభావ మాధుర్యం వల్లనే జరుగుతుంది. అది సడి చప్పుడు లేకుండా సాగే పని. అది మార్పు కలిగించి ప్రవర్తనను మెరుగుపర్చుతుంది. నిమ్మళంగా మాట్లాడే ఆ స్వరానికి హృదయాన్ని మార్చే శక్తి ఉంది.PKTel 106.3

    “ఏలియా, యిచ్చట నీవేమి చేయుచున్నావు?” అని ప్రశ్నించిందా స్వరం. ప్రవక్త మళ్లీ ఇలా బదులు పలికాడు, “ఇశ్రాయేలువారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గముచేత హతము చేసిరి, సైన్యముల కధిపతియగు దేవుడునగు యెహోవా కొరకు మహాదోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణమును కూడ తీసివేయుటకై చూచుచున్నారు.” PKTel 106.4

    ఇశ్రాయేలులోని దుర్మార్గులు శిక్షను అనుభవించాలి అన్నాడు ప్రభువు. ఆ విగ్రహారాధక రాజ్యాన్ని శిక్షించటంలో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చటానికి మనుషుల్ని ప్రత్యేకంగా ఎంపిక చేయాల్సి ఉంది. నిజ దేవుని పక్క నిలబడటానికి అందరికీ అవకాశం కల్పించే నిమిత్తం కఠినమైన చర్య చేపట్టాల్సి ఉంది. ఏలీయా ఇశ్రాయేలుకి తిరిగివెళ్లి ఆ దేశంలో దిద్దుబాటు తేవటంలో ఇతరులతో భారం పంచుకోవాల్సి ఉంది.PKTel 107.1

    ప్రభువు ఏలీయాకు ఈ ఆదేశం ఇచ్చాడు, “నీవు మరలి అరణ్యమార్గమున దమస్కునకుపోయి దానిలో ప్రవేశించి సిరియ దేశము మిద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. ఇశ్రాయేలు వారిమీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము; నీకు మారుగా ప్రవక్తయై యుండుటకు అబేల్మెజోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకొనువారిని యెహూ హతము చేయును. యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకొనువారిని ఎలీషా హతము చేయును.” ఇశ్రాయేలు అంతటిలో నిజమైన దేవున్ని ఆరాధించేవాడు తానొక్కడనే అని ఏలీయా అనుకున్నాడు. కాని మత భ్రష్టత సాగిన దీర్ఘకాలంలో తనకు నమ్మకంగా నిలిచిన భక్తులు చాలామంది ఉన్నారని అందరి హృదయాలు చదవగల ప్రభువు ఏలీయాతో చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్లూనకయు, నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు ఏడు వేలమంది నాకు ఇంకను మిగిలియుందురు.”PKTel 107.2

    ఏలీయా అనుభవంలో నిరుత్సాహంగా అపజయంగా కనిపించిన పరిస్థితి ఎదురైన దినాల్నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. నీతి న్యాయాల్ని దాదాపుగా విడిచి పెట్టేసిన ఈ యుగంలో దేవుని సేవకులికి ఈ పాఠాలు ఎంతో విలువైనవి. ఈ ప్రవక్త దినాల్లో ఇశ్రాయేలులో ప్రబలిన మత భ్రష్టతలాంటిదే నేడూ విస్తరిస్తున్నది. దైవానికన్నా మానవుణ్ని ఘనపర్చటంలో, ప్రజానాయకుల్ని స్తుతించటంలో, సిరిసంపదల్ని పూజించటంలో, దైవావేశం అనుగ్రహించిన సత్యాలకు మిన్నగా శాస్త్ర బోధనల్ని పరిగణించటంలో ఈనాడు లక్షలాది మంది బయలును వెంబడిస్తున్నారు. సందేహం అపనమ్మకం వాటి దుష్ప్రభావాన్ని మనసు మీద, హృదయం మీద ప్రసరిస్తున్నాయి. అనేకులు పరిశుద్ద లేఖనాల బదులు మానవ సిద్ధాంతాల్ని ఆచరిస్తున్నారు. మానవ జ్ఞానాన్ని దైవ వాక్య బోధనలకన్నా ఉన్నతంగా పరిగణించాల్సిన స్థితికి మనం చేరుకున్నామని బహిరంగంగా బోధించటం జరుగుతున్నది. వీటికి ప్రామాణికమైన దైవ ధర్మశాస్త్రం రద్దయ్యిందని ప్రకటించటం జరుగుతున్నది. మానవ సంస్థల్ని దేవుని స్థానంలో ఉంచటానికి స్త్రీలని, పురుషుల్ని నడపించటానికి, మానవుల ఆనందానికి రక్షణకు దేవుడు ఏర్పాటు చేసినదాన్ని విస్మరించటానికి సత్యవిరోధి తన వంచక శక్తుల్ని ఉపయోగిస్తూ పనిచేస్తున్నాడు.PKTel 107.3

    ఈ మతభ్రష్టత విస్తరించి ఉన్నప్పటికీ లోక వ్యాప్తంకాలేదు. లోకంలో ఉన్న ప్రజలందరూ అవిధేయులు పావులుకారు. అందరూ శత్రువుతో చెయ్యి కలిపినవారు కారు. బయలుకు మోకాలు వంచని వారు దేవునికి వేలమంది ఉన్నారు. క్రీస్తును గూర్చి ధర్మశాస్త్రాన్ని గూర్చి అవగాహన చేసుకోవాలని ఆశిస్తున్నవారు, క్రీస్తు త్వరగా వచ్చి పాపాన్ని మరణాన్ని అంతం చేస్తాడని వ్యర్ధంగా నిరీక్షిస్తున్నవారు చాలామంది ఉన్నారు. అజ్ఞానంతో బయలుని ఆరాధిస్తున్నవారూ చాలామంది ఉన్నారు. దేవుని ఆత్మవారి హృదయాల్లో ఇంకా పనిచేస్తూనే ఉన్నాడు.PKTel 108.1

    దేవుని శక్తిని నమ్ముకోటం నేర్చుకున్నవారి వ్యక్తిగత చేయూత వీరికి అవసరం. ఇలాంటి సమయంలో దేవుని నమ్మిన ప్రతీ బిడ్డా ఇతరులికి చెయ్యి అందిస్తూ క్రియాశీలులు కావాలి. బైబిలు సత్యాల అవగాహన గలవారు వెలుగుకోసం ఆశగా కనిపెట్టేవారిని వెదకుతుండగా దేవదూతలు వారికి తోడుగా ఉంటారు. దేవదూతలు తోడుగా వచ్చేచోట ముందుకి సాగటానికి ఎవరూ భయపడనవసరం లేదు. అంకితభావంతో పనిచేసే కార్యకర్తల సేవ ఫలితంగా అనేకుల విగ్రహారాధన నుంచి సజీవ దేవుని ఆరాధనకు ఆకర్షితులవ్వుతారు. అనేకులు మానవులు సృష్టించిన సంస్థల్ని స్తుతించటం మాని దైవ ధర్మశాస్త్రం పక్క నిర్భయంగా నిలబడ్డారు.PKTel 108.2

    దేవునికి యధార్ధంగా నమ్మకంగా నిలబడ్డవారి అకుంఠిత సేవమిద చాలా ఆధారపడి ఉంటుంది. ఈ కారణంచేతనే విధేయులైన విశ్వాసుల కృషిద్వారా దేవుని ఉద్దేశం నెరవేరకుండా ఆపటానికి సాతాను తన శక్తి మేరకు ప్రయత్నిస్తాడు. తమ ఉన్నతమైన పరిశుద్ధమైన కర్తవ్యాన్ని విస్తరించి జీవిత సుఖభోగాలతో తృప్తి పొందేటట్లు కొందరిని తప్పుదారి పట్టిస్తాడు. వారిని సుఖజీవితంలో స్థిరపడిపో టానికి నడిపిస్తాడు. లేదా ఐహిక సంబంధమైన ప్రయోజనాల నిమిత్తం మంచిని ప్రోది చేసే ప్రభావంగల స్థానం నుంచి నిష్క్రమించేటట్లు చేస్తాడు. ఇంకా కొంతమందిని కాఠిన్యంవల్ల హింసవల్ల నిరాశచెంది తమ విధులు విడిచి పెట్టి పారిపోయేటట్లు చేస్తాడు. అట్టివారందరి పట్ల దేవుడు దయ కలిగి ఉంటాడు. ఆత్మల బద్దవిరోధి ఎవరి నోళ్ళుముయ్యించటంలో సఫలుడయ్యాడో తన నమ్మకమైన ఆ సేవకుల్ని దేవుడు “ఇక్కడ నీవేమి చేయుచున్నావు?” నిన్ను సర్వలోకంలోకి వెళ్లి సువార్త ప్రకటించమని, దేవుని దినం కొరకు ఒక జనాంగాన్ని సిద్ధం చెయ్యమని ఆదేశించానుగదా? నీవు ఇక్కడెందుకున్నావు? నిన్ను ఎవరు పంపారు? అని ప్రభువు అడుగుతున్నాడు.PKTel 108.3

    క్రీస్తు ముందున్న ఆనందం, త్యాగంలో బాధలో బలాన్ని చేకూర్చిన ఆనందం, పాపులు రక్షణ పొందటం చూసి పొందిన ఆనందం. ఇదే ఆయన ప్రతీ అనుచరుడి ఆనందం కావాలి. అతడి ఆశకు ప్రోత్సాహకం కావాలి. తమకు తమ సాటి మనుషులికి విమోచన ఏంచేస్తుందో కొంతమట్టుకైన గుర్తించేవారు మానవాళి విస్తృత ఆధ్యాత్మికా వసరాల్ని కొంతమేరకు అవగాహన చేసుకోగలుగుతారు. భయంకర నాశనం పడగ నీడలో ఉన్న వేలమంది నైతిక, ఆధ్యాత్మిక పేదరికాన్ని చూసినప్పుడు వారి హృదయాలు దయతో కరుగుతాయి. దానితో పోల్చితే శారీరకమైన బాధ లెక్కలోనికి రాదు.PKTel 109.1

    వ్యక్తుల్ని ప్రశ్నించినట్లు కుటుంబాల్ని కూడా “ఇచ్చట నీవేమి చేయుచున్నావు?” అని ప్రశ్నించవచ్చు. దైవ వాక్యంలోని సత్యాలపై మంచి ఉపదేశం పొందిన కుటుంబాలు అనేక సంఘాల్లో ఉన్నాయి. ఆ కుటుంబాలు తాము అందించగల సేవలు అవసరమైన స్థలాలకు వలస వెళ్ళటం ద్వారా తమ ప్రభావపరిధిని విస్తృతపర్చగలుగుతారు. లోకంలోని చీకటి స్థలాలికి వెళ్లి, ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నవారికోసం జ్ఞానవంతంగా పనిచెయ్యటానికి దేవుడు క్రైస్తవ కుంటుంబాలకి పిలుపునిస్తున్నాడు. ఈ పిలుపుకు సానుకూలంగా స్పందించటానికి ఆత్మ త్యాగం అవసరం, ప్రతీ ఆటంకం తొలగిపోయే వరకూ అనేకులు వేచి ఉంటుండగా, నిరీక్షణ లేకుండా, దేవున్ని ఎరుగకుండ ఆత్మలు నశిస్తున్నాయి. లోక సంపదకోసం, శాస్త్ర జ్ఞానం కోసం వ్యాధులు ప్రబలే స్థలాలికి వెళ్లి కష్టాల్ని లేమిని భరించటానికి మనుషులు సిద్ధంగా ఉన్నారు. రక్షకుణ్ని గూర్చి ఇతరులికి చెప్పటానికి అలా త్యాగం చెయ్యటానికి సిద్ధంగా ఉన్నవారు ఎక్కడున్నారు?PKTel 109.2

    ఆధ్యాత్మిక శక్తిగల మనుషులు తీవ్ర కష్టపరిస్థితుల ఒత్తిడివల్ల నిరాశ నిస్పృహలకు లోనైతే కొన్ని సార్లు జీవితంలో ఎంపిక చేసుకోటానికి వాంఛనీయమయ్యింది ఏమి వారికి కనిపించకపోవటం విచిత్రమూ కాదు, కొత్త విషయమూకాదు. ఆగ్రహించిన ఒక స్త్రీ ఉగ్రత నుంచి మిక్కిలి శక్తిమంతులైన ప్రవక్తల్లో ఒకడైన ఏలీయా ప్రాణం కాపాడుకొనేందుకు పారిపోయాడని అట్టివారందరు జ్ఞాపకముంచుకోవాలి. పారిపోతూ ప్రయాణం వల్ల అలసిపోయి, తీవ్ర ఆశాభంగం మనసును కుంగదియ్యగా మరణించటం మంచిదని కోరుకున్నాడు. అయితే నిరీక్షణ మాయమైనప్పుడు, జీవితమంతా తాను చేసిన సేవ విఫలమయ్యేటట్లు కనిపించినప్పుడు, అతడు తన జీవితంలో మిక్కిలి విలువైన పాఠాలు నేర్చుకున్నాడు. తన మిక్కిలి బలహీన ఘడియలో, అననుకూల పరిస్థితులో, దేవుని విశ్వసించాల్సిన అవసరాన్ని అవకాశాన్ని అతడు గ్రహించాడు PKTel 109.3

    ఆత్మార్పణతో నిండిన సేవలో తమ జవసత్వాలు ధారబోస్తున్న తరుణంలో దైవసేవకులు శోధనకు లొంగి నిస్పృహకు అవిశ్వాసానికి చోటిచ్చినప్పుడు ఏలీయా అనుభవం నుంచి ధైర్యం పొందవచ్చు. ఎవరి ఉద్రేకాన్ని అపార్థం చేసుకోటం లేక అభినందించకపోవటం జరుగుతుందో, ఎవరి హితవాక్యాలు హెచ్చరికలు తోసిపుచ్చటం జరుగుతుందో, దిద్దుబాటు కోసం ఎవరి కృషికి ఫలితంగా ద్వేషం, వ్యతిరేకత ప్రదర్శితమవుతాయో అట్టి తన సేవకుల విషయంలో దేవుడు తన శ్రద్ధను, తన ప్రేమను, తన శక్తిని ప్రదర్శిస్తాడు.PKTel 110.1

    తీవ్ర బలహీనత ఉన్న సమయంలోనే సాతాను ఆత్మపై భయంకర శోధనలతో దాడి చేస్తాడు. దైవ కుమారునిపై విజయం సాధించటానికి ఇలాగే ప్రయత్నించాడు. ఎందుకంటే ఈ విధానం ద్వారా మానవుడిపై అతడు అనేక విజయాలు సాధించాడు. మనోశక్తి బలహీనపడినప్పుడు, విశ్వాసం నశించినప్పుడు సత్యంకోసం ధైర్యంగా దీర్ఘకాలంగా నిలిచినవారు శోధనకు లొంగి పడిపోయారు. నలభై సంవత్సరాలు సంచారంతో అవిశ్వాసంతో సతమతమై, విసిగి, అనంతశక్తిగల దేవుని మిద మోషే తనపట్టును ఒక్క క్షణం విడిచిపెట్టాడు. వాగ్దత్త దేశం పొలిమేరల్లో అతడు పరాజయం పాలయ్యాడు. అలాగే ఏలీయాకూ జరిగింది. అనావృష్టి కరవు సాగిన సంవత్సరాల్లో యెహోవాను బలంగా నమ్ముకున్న అతడు, అహాబు ముందు నిర్భయంగా నిలిచిన అతడు కర్మెలు పర్వతంమీద నిజమైన దేవునికి సాక్షిగా నిలిచిన అతడు ఇశ్రాయేలు జాతి ముందు తీవ్ర శ్రమతో నిండిన ఆ దినమంతా నిలిచిన అతడు ఒక్క బలహీన క్షణంలో మరణ భయానికి లోనై దేవునిపై తన పట్టును జారవిడిచాడు.PKTel 110.2

    అలాగే నేడూ జరుగుతున్నది. మనల్ని సందేహం చుట్టుముట్టినప్పుడు, పరిస్థితులు గలిబిలి పరిచినప్పుడు, లేక పేదరికం శ్రమలు మానసిక వ్యధ కలిగించినప్పుడు యెహోవాపై మన విశ్వాసాన్ని కదల్చటానికి తాను ప్రయత్నిస్తాడు, అప్పుడు మన పొరపాట్లను మన ముందుకు తెచ్చి దేవునిపై మన నమ్మకాన్ని పోగొట్టటానికి, ఆయన ప్రేమను ప్రశ్నించటానికి, మనల్ని నడిపించటానికి అతడు ప్రయత్నిస్తాడు. మనల్ని అధైర్యపర్చి దేవునిపై మన నమ్మకాన్ని నాశనం చెయ్యాలనుకుంటాడు.PKTel 110.3

    సంఘర్షణలో ముందు నిలిచి, ఒక ప్రత్యేక సేవ నిర్వహించటానికి పరిశుద్దాత్మ ప్రేరణ పొందినవారు ఆ ప్రేరణ ఒత్తిడి తొలగిపోయిన తర్వాత తరచుగా వ్యతిరేకతను గుర్తిస్తారు. నిసృహ మిక్కిలి స్థిరమైన విశ్వాసాన్ని కదిలించి పటిష్టమైన చిత్రాన్ని బలహీనపర్చుతుంది. దేవుడు అర్దం చేసుకుంటాడు. ఆయన దయచూపించి ప్రేమించటం మానడు. హృదయాలోచనను ఉద్దేశాల్ని ఆయన చదువుతాడు. ఓపికతో కనిపెట్టటం, అంతా చీకటిగా ఉన్నప్పుడు నమ్మకంతో ఉండటం అన్న పాఠాన్ని దైవ సేవలోని నాయకులు నేర్చుకోటం అవసరం. కష్టకాలంలో దేవుడు వారిని విడిచిపెట్టడు. తాను ఏమిలేనివాడనని గుర్తించి పూర్తిగా దేవుని మీద ఆధారపడే ఆత్మ, పైకి బలహీనంగా కనిపించినా దాన్ని జయించటం అసాధ్యం.PKTel 110.4

    కష్టాలు ఆపదల కాలంలో దేవున్ని ఎలా విశ్వసించాలో తన అనుభవంలో ఏలీయా నూతనంగా నేర్చుకున్న పాఠం గొప్ప బాధ్యత నిర్వహించే వ్యక్తులకు మాత్రమే కాదు. ఏలీయాకు బలం తానే అయిన ప్రభువు శ్రమపడుతున్న తన ప్రతీ బిడ్డను ఆదుకోగలిగినంత శక్తిమంతుడు. ఆ బిడ్డ ఎంత బలహీనుడైనా పర్వాలేదు. ప్రతీ బిడ్డా తనకు నమ్మకంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. ప్రతీవారికి వారివారి అవసరం ప్రకారం ఆయన శక్తినిస్తాడు. సొంత శక్తిగల మనుషుడు బలం లేనివాడు. అయితే అతడు దేవుని శక్తితో దుష్టిని జయించటానికి, ఇతరులికి చెయ్యూతనివ్వటానికి శక్తిమంతుడవ్వుతాడు. ఎవరు దేవున్ని తమ రక్షణగా ఎంపిక చేసుకుంటారో వారిని సాతాను ఎన్నడూ జయించలేడు. “యెహోవాయందే నీతి బలములున్నవని జనులు నన్నుగూర్చి చెప్పుదురు.” యెష 45:24. సోదర క్రైస్తవా, సాతానుకి మి బలహీనత ఏంటో తెలుసు. కనుక క్రీస్తును పట్టుకుని ఉండండి. క్రీస్తు ప్రేమలో నిలిచిఉంటూ మీరు ప్రతీ పరీక్షను గెలవవచ్చు. లోకంలో ప్రబలుతున్న దుష్టతను అడ్డుకోటానికి క్రీస్తు నీతి మాత్రమే మీకు శక్తినివ్వగలదు. మా విశ్వాసాన్ని అనుభవంలోకి తీసుకురండి. విశ్వాసం ప్రతీ భారాన్ని తేలిక చేస్తుంది. ప్రతీ అలసటను తొలగిస్తుంది. ప్రస్తుతం మర్మాలుగా ఉన్న దైవ సంకల్పాల్ని దేవునిపై ఎడతెగని విశ్వాసం పరిష్కరిస్తుంది. దేవుడు నిర్దేశించిన మార్గాల్లో విశ్వాసమూలంగా నడవండి. శ్రమలు కలుగుతాయి, అయినా ముందుకి సాగండి. ఇది మీ విశ్వాసాన్ని పటిష్ఠపర్చి మిమ్మల్ని సేవకు సమర్ధుల్ని చేస్తుంది. మనది కేవలం చదివి అభినందించే విశ్వాసమే గాక పూర్వం దైవ సేవకుల్ని క్రియాత్మకం చేసిన విశ్వాసం. మనలో పనిచేసేందుకు పరిశుద్ద చరిత్ర దాఖలాన్ని రచించటం జరిగింది. తన శక్తి ప్రదర్శనకు విశ్వాస పూరిత హృదయాలున్నచోట ప్రభువు ఇప్పుడు కూడా విలక్షణ రీతిలో పనిచేస్తాడు. PKTel 111.1

    పేతురుతో అన్నట్లు ప్రభువు మనతో ఇలా అంటున్నాడు, “ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెనుగాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని లూకా 22:31,32. క్రీస్తు తాను ఎవరి నిమిత్తం మరణించాడో వారిని ఎన్నడూ విడిచిపెట్టడు. మనం ఆయన్ని విడిచిపెట్టవచ్చు, శోధనకు లొంగిపోవచ్చు. కాని తాను ఎవరికోసం తన ప్రాణాన్ని క్రయధనంగా ఇచ్చాడో ఆ మానవాళిలోని ఒక్కడి నుంచి కూడా ఆయన వైదొలగడు. మన ఆధ్యాత్మిక దృష్టి తెరుచుకుంటే, కాఠిన్యం ఒత్తిడి కింద, దుఃఖం భారం కింద, పనల బరువుకి కుంగిపోతున్న బండలా ఆత్మలు కుంగిపోయి నిరాశతో మరణించటానికి సిద్దంగా ఉండటం చూడగలుగుతాం. శోధనకు గురి అయిన ఈ ఆత్మలకు సాయం అందించటానికి, వారి చుట్టూ ఉన్న దుష్టశక్తుల సమూహాల్ని వెనక్కి నెట్టి, వారి పాదాలు స్థిరమైన పునాది మీద నిలపటానికి దేవదూత వారి వద్దకు ఎగిరి వెళ్ళటం మనం చూస్తాం. ఈ రెండు సైన్యాలమధ్య జరిగే పోరాటం ఈ లోకంలోని సైన్యాల మధ్య జరిగే యుద్ధమంత వాస్తవం. ఈ ఆధ్యాత్నిక సంఘర్షణ అంశాలపై నిత్యజీవానికి సంబంధించిన భవిష్యత్తులు ఆనుకొని ఉన్నాయి.PKTel 111.2

    యెహెజ్కేలు ప్రవక్త దర్శనంలో కెరూబు రెక్కలకింద చెయ్యివంటి ఒక ఆకారం ఉంది. విజయాన్నిచ్చేది దైవశక్తేనని ఇది దైవ సేవకులకు బోధించాల్సి ఉంది. దేవుడు ఎవర్ని తన దూతలుగా నియోగిస్తాడో వారు ఆయన పని తమమీద ఆధారపడి ఉందని భావించకూడదు. ఈ బాధ్యతను ఆయన మానవమాత్రులికి విడిచి పెట్టలేదు. ఆయన కునుకడు నిద్రపోడు. తన సంకల్పాల నెరవేర్చుకు తెంపు లేకుండా పని చేసే ఆయన తన సేవను ముందుకు నడుపుతాడు. ఆయన దుష్టుల కార్యాల్ని అడ్డుకుని తన ప్రజలకు వ్యతిరేకంగా వారు పన్నిన కుట్రల్ని నిర్వీర్యం చేసి వారి ఆలోచనల్ని గందరగోళపర్చుతాడు. రాజు, సైన్యాలకధిపతి అగు యెహోవా అయిన ఆయన కెరూబుల మధ్య కూర్చుంటాడు. జాతుల పోరాటం అలజడి మధ్య ఆయన తన బిడ్డల్ని కాపాడాడు. రాజుల దుర్గాలు కూలినప్పుడు, తన శత్రువుల గుండెల్ని ఆయన ఆగ్రహ బాణాలు చీల్చినప్పుడు ఆయన ప్రజలు ఆయన చేతుల్లో క్షేమంగా ఉంటారు.PKTel 112.1