Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ప్రవక్తలు - రాజులు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    9 - తిషీయుడైన ఏలీయా

    అహాబు దినాల్లో యోర్దానుకి తూర్పున ఉన్న గిలాదు పర్వతాల్లో గొప్ప విశ్వాసం ప్రార్ధనబలిమి గల భక్తుడొకడు నివసించాడు. ఇశ్రాయేలులో పెచ్చు పెరుగుతున్న మతభ్రష్టతకు అతడి నిర్బయ పరిచర్య అడ్డుకట్ట వేయనుంది. గొప్ప పట్టణాలకు దూరంగా ఉంటూ, సామాన్య జీవితం జీవిస్తూ ఉన్న తిషీయుడైన ఏలీయా దేవుని సంకల్పంపై బలమైన నమ్మకంతో, తనకు విజయం చేకూరు తుందని నిరీక్షిస్తూ తన కర్తవ్య సాధనకు పూనుకున్నాడు. అతడు విశ్వాసం పుట్టించే, శక్తినిచ్చే మాటలు మాట్లాడాడు. అతడి యావజ్జీవితం సంస్కరణ కృషికి అంకిత మయ్యింది. అతడిది పాపాన్ని గద్దించి దుష్టత ఉప్పెనను వెనక్కు మళ్లించటానికి అరణ్యంలో కేకవేసే స్వరం. అతడు పాపాలు ఖండించే వాడుగా ప్రజలవద్దకు రాగా, స్వస్తత పొందగోరుతున్న పాపరోగ పీడిత ఆత్మలకు అతడి వర్తమానం గిలాదు గుగ్గిలాన్ని అందించింది.PKTel 70.1

    ఇశ్రాయేలు విగ్రహారాధనలో కూరుకుపోవటం చూసినప్పుడు అతడి హృదయం వేదన చెందింది. అతడికి పట్టలేని కోపం వచ్చింది. దేవుడు తన ప్రజలకు గొప్ప కార్యాలు చేశాడు. వారిని బానిసత్వంనుంచి విడిపించి “వారు తన కట్టడలను గైకొనునట్లును తన ధర్మశాస్త్ర విధులను ఆచరించునట్లును అన్యజనుల భూములను ఆయన వారికప్పగించెను.” కీర్త. 105:44,45. కాని వారిప్పుడు యెహోవా ఉపకారాలన్నిటిని దాదాపుగా మర్చిపోయారు. అవిశ్వాసం దేవుడు ఎన్నుకున్న ప్రజల్ని, తమ శక్తికి ఆధారమైన ప్రభువునుంచి, విడదీస్తున్నది. తన పర్వత ఆశ్రమంనుంచి ఏలీయా ఈ మతభ్రష్టతను చూసి దుః ఖాక్రాంతుడయ్యాడు. ఒకప్పుడు తన ప్రాపకాన్ని పొందిన ప్రజల దుర్మార్గాన్ని నిలువరించమని, తన మార్గంనుంచి తొలగిపోవటాన్ని వారు వాస్తవమైన వెలుగులో చూచేందుకు వారికి జ్ఞానోదయం కలిగించటానికి అవసరమైతే వారిమీదికి తీర్పులు పంపమని హృదయ వేదనతో ఆ భక్తుడు దేవునికి విజ్ఞప్తి చేశాడు. వారు తమ చెడుతనంలో పూర్తిగా కూరుకుపోవటం ద్వారా దేవునికోపం రేపారు. ఆయన వారిని నాశనం చెయ్యకముందు వారు పశ్చాత్తాపం పొందటం చూడాలని అతడు ఎంతో ఆశించాడు.PKTel 70.2

    ఏలీయా ప్రార్థనకు సమాధానం వచ్చింది. తరచుగా వచ్చిన విజ్ఞప్తులు, విమర్శలు, హెచ్చరికలు ఇశ్రాయేలు ప్రజల్లో పశ్చాత్తాపం పుట్టించలేకపోయాయి. దేవుడు వారితో తీర్పులద్వారా మాట్లాడటానికి సమయం వచ్చింది. మంచు వర్షం వంటి ఆకాశ వనరులు యెహోవా వద్దనుంచి కాదు ప్రకృతి శక్తుల్నుంచి వస్తున్నాయని సూర్యుడి సృజన శక్తివల్ల భూమి సారవంతమై” విస్తార ఫలసాయం ఇస్తుందని బయలు ఆరాధకులు ప్రబోధించారు గనుక ఆ కలుషిత దేశంపై దేవుని శాపం బలంగా పడాల్సి ఉంది. ఐహికమైన దీవెనల కోసం బయలును నమ్ముకోటం బుద్దిహీనమని మతభ్రష్టులైన ఇశ్రాయేలీయుల గోత్రాలికి చూపించాల్సి ఉంది. వారు పశ్చాత్తాపంతో దేవునివద్దకు వచ్చి సకల దీవెనలు ఉపకారాలికి ఆయనే మూలమని గుర్తించేవరకూ ఆ భూమిమీద మంచుగాని వర్షంగాని పడకూడదు.PKTel 71.1

    దేవుని తీర్పునుగూర్చిన వర్తమానాన్ని అహాబుకి అందించే కర్తవ్యం ఏలీయాకు అప్పగించటం జరిగింది. యెహోవా దూతగా ఉండాలని అతడు కోరుకోలేదు. యెహోవా వాక్కు అతడికి వచ్చింది. వర్తమానాన్ని అందించటమంటే దుష్టుడైన రాజు చేతిలో మరణాన్ని ఆహ్వానించటమేనని ఎరిగినా పరిశుద్ద దైవసేవ ఘనత విషయంలో రోషంతో నిండిన ఏలీయా దైవాజ్ఞను ఆచరించటానికి సందేహించలేదు. ప్రవక్త వెంటనే బయలుదేరి రాత్రింబగళ్లు ప్రయాణంచేసి షోమ్రోను చేరాడు. రాజభవనంలో ప్రవేశానికి అనుమతి కోరలేదు. రాజు సముఖంలోకి లాంఛనంగా ప్రవేశపెట్టబడటానికి ఆగలేదు. నాటి ప్రవక్తలు సామాన్యంగా ధరించే ముతక వస్త్రాలు ధరించి బహుశా గమనించని రాజభటుల్ని దాటి విస్మయం చెందుతున్న రాజుముందు నిలిచాడు.PKTel 71.2

    తన ఆకస్మిక దర్శనానికి ఏలీయా క్షమాపణ వేడుకోలేదు. ఇశ్రాయేలు రాజుకన్నా అధికుడు మాట్లాడవలసిందిగా ఆజ్ఞాపించాడు. కనుక చెయ్యి ఆకాశం వైపుకి ఎత్తి సర్వోన్నతుని తీర్పులు ఇశ్రాయేలుమిద పడనున్నాయని జీవంగల దేవుని పేర గంభీరంగా ప్రకటించాడు. “ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక, యీ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదు.”PKTel 71.3

    దేవునిమాటపై ఎనలేని విశ్వాసం ప్రదర్శించటంద్వారానే ఏలీయా ఆ వర్తమానాన్ని రాజుకి ప్రకటించగలిగాడు. తాను ఎవర్ని సేవిస్తున్నాడో ఆ ప్రభువు మీద తిరుగులేని నమ్మకం తనకు లేకపోతే అతడు అహాబు ముందుకి వచ్చేవాడే కాడు. షోమ్రోనుకు వెళ్లే మార్గంలో ఏలీయా వాగుల్ని, పచ్చని గడ్డితో నిండిన కొండల్ని, సుందరమైన అడవుల్ని దాటి ప్రయాణించాడు. అవి వరాభావానికి అతీతంగా ఉన్నట్లు కనిపించాయి. అతడి కంటికి కనిపించిందంతా ఎంతో సుందరంగా ఉంది. ఎన్నడూ ఎండిపోని ఆ వాగులు ఏరులు ఎలా ఎండిపోగలవు అని లేదా ఆ కొండలు లోయలు ఎలా అనావృష్టికి మాడిపోగలవు అని ఆలోచనలో పడిఉండవచ్చు. కాని అతడు అపనమ్మకానికి తావివ్వలేదు. మతభ్రష్టులైన ఇశ్రాయేలు ప్రజలికి ప్రభువు బుద్ది చెబుతాడని అతడు పూర్తిగా నమ్మాడు. ఆయన తీర్పులద్వారా వారు మారుమనసు పొందుతారని విశ్వసించాడు.PKTel 71.4

    పరలోక డిక్రీ జారీ అయ్యింది. దేవుని మాటకు తిరుగు అంటూ ఉండదు. ఏలీయా తన ప్రాణం పణంగా పెట్టి దైవాజ్ఞను నెరవేర్చాడు. మబ్బులేని ఆకాశం నుంచి విరుచుకుపడ్డ పిడుగులా రానున్న తీర్పును గురించిన వర్తమానం దుర్మారుడైన రాజు చెవిని పడింది. కాని అహాబు విస్మయంనుంచి కోలుకోకముందే లేక జవాబును ఆలోచించుకోకముందే, తన వర్తమానం ప్రభావాన్ని చూడటానికి ఆగకుండా ఏలీయా ఎంత అకస్మాత్తుగా వచ్చాడో అంత అకస్మాత్తుగా మాయమయ్యాడు. ప్రభువు అతడి మార్గాన్ని సుగమం చేస్తూ అతడిముందు వెళ్లాడు. ప్రవక్తకు ఈ ఆదేశం వచ్చింది, “నీవు ఇచ్చటనుండి తూర్పువైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతువాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చుటకు కాకోలములకు ఆజ్ఞాపించితిని.”PKTel 72.1

    రాజు అతనికోసం శ్రద్దగా వెదకించాడు. ప్రవక్త ఎక్కడా కనిపించలేదు. ఆకాశ వనరుల్ని బంధించివేసిన వర్తమానాన్ని యెజెబెలు రాణి వెంటనే బయలు యాజకులతో మాట్లాడింది. వారంతా ఆమెతో కలిసి ప్రవక్తను శపించి యెహోవాను ధిక్కరించారు. తమపై శ్రమలు, శాపాల్ని పలికిన ప్రవక్తను పట్టుకోవాలని ఎంత కోరుకున్నా, వారికి అతడు కనిపించలేదు. వారికి మిగిలింది నిరాశే. అలాగని వారు సాగుతున్న మతభ్రష్టత ఫలితంగా తమ దేశంమీదికి వచ్చిన తీర్పును గూర్చిన వార్తను ఇతరులికి తెలియకుండా దాచి ఉంచలేకపోయారు. ఇశ్రాయేలువారి పాపాల నిమిత్తం ఏలీయా ఖండించటం, శిక్ష త్వరగా వస్తుందని ప్రకటించటం వీటిని గూర్చిన వార్త దేశమంతటా శరవేగంగా వ్యాపించింది. కొందరు భయాందోళనలకు లోనయ్యారు. కాని సామాన్యంగా ఈ దైవ వర్తమానాన్ని ప్రజలు ద్వేషించి ఎగతాళి చేశారు. PKTel 72.2

    ప్రవక్త పలికిన మాటలు వెంటనే అమలయ్యాయి. విపత్తు తలంపును ఆదిలో ఎగతాళి చెయ్యటానికి దిగినవారు తీవ్రంగా ఆలోచించాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఎందుకంటే కొన్ని మాసాలైన తర్వాత మంచుగాని వర్షంగాని లేని భూమి ఎండిపోయింది. మొక్కలు పంటలు ఎండిపోయాయి. కాలం గడిచేకొద్దీ నిత్యం ప్రవహించే ఏరులు క్షీణించటం మొదలు పెట్టాయి. వాగులు ఎండిపోటం ప్రారంభించాయి. అయినా నాయకులు బయలు శక్తిని నమ్ముకోమని ఏలీయా ప్రవచనాన్ని పట్టించుకోవాల్సిన పనిలేదని చెబుతూ ప్రజల్ని ఉత్సాహపర్చుతున్నారు. బయలు శక్తిద్వారానే వర్షం కురుస్తుందని యాజకులు ఇంకా ప్రజలికి బోధిస్తున్నారు. ఏలీయా దేవునికి భయపడకండి. ఆయన మాటలికి భయంతో కంపించకండి. వాటివాటి కాలాల్లో పంటలిచ్చి మనుషులికి జంతువులికి ఆహారం ఇచ్చే దేవత బయలు మాత్రమే అని యాజకులు ప్రజలికి ధైర్యం చెప్పారు.PKTel 72.3

    అహాబుకి దేవుడు పంపిన వర్తమానం యెజెబెలుకి ఆమె యాజకులికి, బయలు అషారోతు అనుచరులికి తమ దేవతల శక్తిని పరీక్షించటానికీ, సాధ్యమైతే ఏలీయా మాట తప్పని నిరూపించటానికీ అవకాశం ఇచ్చింది. ఏలీయా ప్రవచనం వందలాది విగ్రహారాధక యాజకులిస్తున్న భరోసాకు విరుద్దంగా ఉంది. ప్రవక్త ప్రవచనం అలాగుంటే, బయలు మంచుని వరాన్ని ఇచ్చి, ఏరులు ప్రవహించేటట్లు, మొక్కలు పంటపొలాలు వర్ధిల్లేటట్లు చేయగలిగితే, అప్పుడు ఇశ్రాయేలు రాజు బయలుని పూజించవచ్చు. ప్రజలు బయలునే దేవుడనవచ్చు.PKTel 73.1

    ప్రజల్ని మోసంలో ఉంచటానికి కృతనిశ్చయులైన బయలు యాజకులు తమ దేవతలకు బలులర్పించటం, వర్షంతో భూమిని తెప్పరిల్ల జేయమంటూ రాత్రింబగళ్లు ఆ దేవతలకు మొరపెట్టుకోటం కొనసాగించారు. యాజకులు విలువైన అర్పణలతో కోపంగా ఉన్న దేవుళ్లని ప్రసన్నుల్ని చెయ్యటానికి ప్రయత్నించారు. గొప్ప ఉద్రేకంతో సహనంతో వారు తమ అన్య బలిపీఠాల చుట్టూ సాష్టాంగపడి వర్షంకోసం భక్తిగా ప్రార్థన చేశారు. ఆ దేశమంతా ప్రతీ రాత్రి వారి కేకలు విజ్ఞాపనలు వినిపించాయి. పగలు సూర్యతాపంనుంచి కాపాడటానికి ఆకాశంలో మబ్బులేమి కనిపించలేదు. దప్పిగొన్న భూమిని సేదదీర్చటానికి మంచుగాని వర్షంగాని పడలేదు. బయలు యాజకులు చేయగలిగిందంతా చేసినా యెహోవా వాక్కు మార్పులేకుండా నిలిచి ఉంది.PKTel 73.2

    ఒక సంవత్సరం గడిచింది. అయినా వర్షంలేదు. అగ్నితో కాల్చినట్లు భూమి ఎండిపోయింది. ఏదైనా కొంచెం పచ్చదనం మిగిలిఉంటే దాన్ని సూర్యతాపం మార్చి మసిచేసింది. వాగులు ఎండిపోయాయి. పశువుల మందలు, మేకలు, గొర్రెల మందలు దీనంగా అరుచుకుంటూ అటూ ఇటూ సంచరించాయి. ఒకప్పుడు పచ్చని పొలాలు మొక్క మోడులేని మండుటెడారిలా తయారయ్యాయి. విగ్రహారాధనకి ప్రతిష్టితమైన వనాలు ఆకులు రాలిపోయి మోడులయ్యాయి. అడవి వృక్షాలు అస్తిపంజరాలై నీడ నివ్వలేదు. గాలిలోని తేమ పోయి ఊపిరి ఆడటం కష్టమయ్యింది. ధూళి తుఫాన్లు రేగి కళ్లకు గుడ్డితనం కలిగించాయి. వాటివల్ల శ్వాసక్రియ దాదాపు ఆగిపోయింది. ఒకప్పుడు వృద్ధిలో ఉన్న పట్టణాలు గ్రామాలు శోకస్థలాలుగా మారాయి. మనుషులు జంతువులు ఆకలితో దాహంతో అలమటిస్తూ మరణిస్తున్నారు. భయంకరమైన కరవు ఎంతో దూరంలోలేదు.PKTel 73.3

    దేవుని శక్తికి ఇన్ని నిదర్శనాలు కనిపించినా ఇశ్రాయేలు ప్రజలు పశ్చాత్తాప పడలేదు. దేవుడు నేర్పించదలచిన పాఠాన్నీ వారు నేర్చుకోలేదు. ప్రకృతిని సృజించిన ఆయన ప్రకృతి నియమాల్ని అదుపు చెయ్యగలడని వాటినే దీవెనలకు నాశనానికి సాధనాలుగా చేసుకోగలడని వారు గ్రహించలేదు. గర్విష్ణులు, తప్పుడు ఆరాధనకు ఆకర్షితులు అయినవారు బలమైన దేవుని హస్తం కింద తమ్మునుతాము తగ్గించు కోటానికి సమ్మతంగా లేరు. తమ కష్టాలకి వేరే హేతువును చూపించటానికి ప్రయత్నించటం మొదలు పెట్టారు.PKTel 74.1

    అనావృష్టి యెహోవా తీర్పు మూలంగా వచ్చిందన్న వాదనను యెజెబెలు పూర్తిగా తోసిపుచ్చింది. పరలోకమందున్న దేవుణ్ని ధిక్కరించటం కొనసాగిస్తూ ఆమె దాదాపు ఇశ్రాయేలీయులందరితో ఏకమై తమ కష్టాలన్నిటికీ కారణం ఏలీయా అని ఖండించింది. తమ ఆరాధన ఆచారాలని అతడు విమర్శించలేదా? అతణ్ని మార్గంలో నుంచి తప్పించివేస్తే దేవతలకోపం తగ్గుతుంది, తమ కష్టాలన్నీ కడతేరతాయి అని వాదించింది.PKTel 74.2

    ప్రవక్త దాగి ఉన్న స్థలంకోసం అన్వేషణకు రాణి విజ్ఞప్తిపై అహాబు చర్యలు చేపట్టాడు. తాను ద్వేషిస్తున్న భయపడున్న ఏలీయాను వెదకి పట్టుకోవలసిందిగా ఆదేశించి తన దూతల్ని చుట్టూ ఉన్న రాజ్యాలికి పంపించాడు. ఆ అన్వేషణ పకడ్బందీగా జరగాలన్న కోరికతో ఆ రాజ్యాలు జాతులు తమకు ప్రవక్త ఆచూకీ తెలియదని ఒట్టు పెట్టి ప్రకటించాలని అహాబు వారిని కోరాడు. అయితే ఆ అన్వేషణ వ్యర్థమయ్యింది. ఎవరి పాపాలు దేవునికి హేయమైనవో, ఎవరి పాపాలు ఆ దేశంమీదికి దేవుని ఖండనను శాపాన్ని తెచ్చాయో ఆ రాజు దుష్టతనుంచి ప్రవక్త క్షేమంగా సురక్షితంగా ఉన్నాడు. PKTel 74.3

    ఏలీయాపై ఆధిక్యాన్ని సంపాదించటానికి చేసిన ప్రయత్నాలన్నిటిలో విఫలమవ్వటంతో యెజెబెలు తన పగ తీర్చుకోటానికి యెహోవా ప్రవక్తలందరినీ సంహరించాలని తీర్మానించుకుంది. ఒక్కడుకూడ జీవించకూడదని నిశ్చయించుకుంది. ఆగ్రహావేశాలతో నిండిన ఆ స్త్రీ అనేకమంది దైవ సేవకుల్ని చిత్రవధ చేసి తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంది. అయినా అందరూ నశించలేదు. అహాబు గృహనిర్వాహకుడైన ఓబద్యా యెహోవాపట్ల భయభక్తులున్నవాడు. తన ప్రాణాల్ని పణంగా పెట్టి యెహోవా ప్రవక్తలను “గుహలో ఏబదేసి మందిగా నూరుగురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను.” 1 రాజులు 18:4.PKTel 74.4

    కరవులో రెండో సంవత్సరం గడిచింది. ఆకాశం ఇంకా కనికరం చూపించలేదు. వర్షపు ఛాయలు ఎక్కడా కనిపించలేదు. అనావృష్టి కరవు దేశమంతా స్వైర విహారం చేస్తున్నాయి. తల్లులు తండ్రులు తమ బిడ్డల బాధల్ని చూస్తూ ఏమి చెయ్యటానికి శక్తిలేక వారు మరణించటం నిస్సహాయంగా చూశాడు. అయినా మతభ్రష్టులైన ఇశ్రాయేలు ప్రజలు దేవునిముందు దీన హృదయులై ఉండక, ఎవరి మాట ప్రకారం వారికి ఈ భయంకర తీర్పులు వచ్చాయో ఆ ఏలీయా మిద సణుగుకోవటం కొనసాగించారు. తమ బాధలోను దుఃఖంలోను పశ్చాత్తాపానికి వస్తున్న పిలుపును వారు గుర్తించనట్లు కనిపించింది. తాము దైవ క్షమాపణ హద్దును దాటి నాశనం దిశలో వేస్తున్న అడుగుల్ని ఆపటానికి ఆ బాధ దుఃఖాలు దేవుడు కలిగించినవేనని వారు గుర్తించినట్లు లేదు. PKTel 75.1

    కరవు కాటకాలకన్నా మరింత భయంకర ఘోరం ఇశ్రాయేలు మతభ్రష్టత. ప్రజల్ని మోసంనుంచి విముక్తుల్ని చేసి, తమ జీవం తమ సర్వం ఎవరి వద్దనుంచి వస్తుందో ఆ దేవునికి తాము జవాబుదారులమన్న అవగాహన వారికి కలిగించటానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. తాము కోల్పోయిన విశ్వాసాన్ని వారిలో పునరుద్దరించటానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. కనుక వారికి గొప్ప శ్రమ కలిగించాలి. అది అవసరం.PKTel 75.2

    “దుష్టులు మరణము నొందుటచేత నాకేమాత్రమైనను సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా సెలవిచ్చు వాక్కు” “మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్దియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణము నొందుదురు? ... మరణము నొందువాడు మరణము నొందుటనుబట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి. అప్పుడు మీరు బ్రదుకుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.” “ఇశ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్ధతనుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందెదరు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు”PKTel 75.3

    తనవద్దకు తిరిగివచ్చి నమ్మకంగా నివసించవలసిందంటూ ఇశ్రాయేలు ప్రజలవద్దకు దేవుడు తన సేవకుల్ని పంపాడు. ఈ విజ్ఞప్తులు విని బయలును విడిచి పెట్టి జీవంగల దేవుని వద్దకు వారు తిరిగివచ్చి ఉంటే ఏలీయా అందించిన తీర్పు వర్తమానం వారికి వచ్చేది కాదు. తమకు జీవార్థమైన జీవపు వాసనగా ఉపకరించిఉండే హెచ్చరికలు వారికి మరణార్థమైన మరణపు వాసనగా పరిణమించాయి. వారి ఆత్మగౌరవం దెబ్బతిన్నది. దైవ సేవకులపై వారి ఆగ్రహం రేగింది. ఇప్పుడు ఏలీయా ప్రవక్త పట్లవారికి తీవ్రద్వేషం ఏర్పడింది. ఏలీయాను హతమార్చటంవల్ల అతడి మాటల నెరవేర్పును ఆపగలిగేటట్లు, అతడు తమకు చిక్కితే వారు అతణ్ని ఆనందంగా యెజెబెలుకి అప్పగించే వారు. తీవ్రమైన విపత్తుకు గురిఅయినా వారు తమ విగ్రహారాధనలో ధృఢంగా కలిసికట్టుగా ఉన్నారు. దేవుని తీర్పులికి దారితీసిన అపరాధాన్ని ఈరీతిగా మరెక్కువ చేసుకున్నారు.PKTel 75.4

    వ్యాధిగ్రస్తమైన ఇశ్రాయేలుకి ఒకటే మందుంది. తమమీదికి సర్వశక్తుని హస్తాన్ని తెచ్చిన పాపాలనుంచి వైదొలగటం, పూర్ణ హృదయంతో ప్రభువు పక్కకు తిరగటం - ఇదే. వారికి ఈ వాగ్దానం ఉంది, “వాన కురియకుండ నేను ఆకాశమును మూసివేసి నప్పుడేగాని, దేశమును నాశనము చేయుటకు మిడుతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనులమీదికి తెగులు రప్పించినప్పుడేగాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడచిన యెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థన విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును.” 2 దిన వృ. 7:13,14. ఈ శుభ పరిణామాన్ని కలిగించాలన్న ఉద్దేశంతోనే, ఖచ్చితమైన దిద్దుబాటు చోటుచేసుకునేవరకు ఆ దేశంపై మంచుగాని వర్షంగాని పడకుండా దేవుడు ఆపుచేశాడు.PKTel 76.1