Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ప్రవక్తలు - రాజులు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    46 - “దేవునియొక్క ప్రవక్తలువారితో కూడ నుండి సహాయము చేయుచు వచ్చిరి”

    ఆలయ నిర్మాణాన్ని చేపట్టిన ఇశ్రాయేలీయులికి సమీపంగా సమరయులు నివసించారు. సమరయులు ఓ మిశ్రమ జాతి ప్రజలు. అది అషూరు రాష్ట్రాల్లోనుంచి వలసవచ్చిన వారికీ, సమరయ గలిలయల్లో శేషించిన పదిగోత్రాలవారికీ అంతర్వివాహాల ఫలితంగా ఉనికిలోకి వచ్చిన జాతి. తదుపరి సంవత్సరాల్లో తాము యధార్ధ దేవున్ని ఆరాధించేవారమని సమరయులు చెప్పుకున్నారు. కాని హృదయంలోను ఆచరణ వ్యవహరణ విషయాల్లోను వారు విగ్రహారాధకులు. తమ విగ్రహాలు సజీవ దేవున్ని గుర్తు చెయ్యటానికి మాత్రమే ఉన్నవని వారి వాదన. ఆ ప్రజలు విగ్రహాల్ని పూజించటానికే మొగ్గుచూపారు. PKTel 396.1

    పునరుద్ధరణ కాలంలో ఈ సమరయులు “యూదా వంశస్తులకును బెన్యామినీయులకును విరోధులు”గా పేరుపొందారు. “చెరనివారణ యయినవారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఆలయము కట్టుచున్న సంగతివిని” వారు “జెరుబ్బాబెలు నొద్దకును పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి” ఆలయ నిర్మాణంలో వారితో ఏకమవ్వాలన్న కోరిక వెలిబుచ్చారు. “మీరు ఆశ్రయించునట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము. ఇచ్చటికి మమ్మును రప్పించిన అషూరు రాజైన ఏపర్షదోమ యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారము, మేమును మీతో కలిసి కట్టెదము” అన్నారు. కాని వారు కోరిన విశేషావకాశాన్ని వీరు నిరాకరించారు. ఇశ్రాయేలు నాయకులు వారితో ఇలా అన్నారు, “మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తములేదు. మేమే కూడుకొని పారసీక దేశపు రాజైన కోరెషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టుదుము.” ఎజ్రా. 4:1-3.PKTel 396.2

    బబులోను నుంచి తిరిగి రావటానికి కొద్దిమంది మాత్రమే ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు వారు తమ శక్తికి మించిన పనిని చెయ్యటానికి పూనుకోగా తమకు అతి సమీపంగా ఉన్న పొరుగువారు సహాయం చేస్తామంటూ ముందుకు వచ్చారు. సమరయులు తాము నిజదేవున్ని ఆరాధించటాన్ని గూర్చి ప్రస్తావించి, ఆలయ సేవలకు సంబంధించిన ఆధిక్యతల్లోను దీవెనల్లోను పాలుపంచుకోవాలన్న అభిలాషను వ్యక్తం చేస్తుంటారు. “మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము”, “మేమును మీతో కలిసి కట్టెదము” అంటున్నారు. యూదులు ఈ సహకారాన్ని అంగీకరించి ఉంటే, విగ్రహారాధనకు తలుపు తెరిచేవారు. సమరయుల కపట బుద్ధిని వారు గ్రహించారు. యెహోవా ఇచ్చిన స్పష్టమైన ఆజ్ఞల్ని అనుసరించటం వల్ల కలిగే దీవెనలతో పోల్చితే సమరయుల్లో జతకట్టటంవలన ఒనగూడే మేలు ఏదీ లేదని గుర్తించారు.PKTel 396.3

    తమ చుట్టూ ఉండే ప్రజలతో ఇశ్రాయేలీయుల సంబంధ బాంధవ్యాల గురించి ప్రభువు మోషేద్వారా ఇలా సెలవిచ్చాడు, “వారితో నిబంధన చేసికొనకూడదు. వారిని కరుణింపకూడదు. వాని కుమారునికి నీ కుమార్తె నియ్యకూడదు. నన్ను అనుసరింప కుండ ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందునుబట్టి యెహోవా కోపాగ్ని నీమీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును.” “నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్టిత జనము. మరియు యెహోవా భూమిమీద నున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లుగా నిన్ను ఏర్పరచుకొనెను.” ద్వితి. 7:2-4; 14:2.PKTel 397.1

    తమ చుట్టుపట్ల నివసించేవారితో నిబంధన బాంధవ్యంలో ప్రవేశించటంవల్ల కలిగే ఫలితాన్ని ప్రభువు స్పష్టంగా చెప్పాడు. మోషే ఇలా హెచ్చరించాడు, “దేశముయొక్క యీ కొనమొదలుకొని ఆ కొనవరకును సమస్త జనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివియునైన అన్యదేవతలను పూజింతువు. ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు. నీ అరకాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును నేత్రక్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును. నీకు ఎల్లప్పుడు ప్రాణ భయము కలిగి యుండును. నీవు రేయింబగళ్లు భయపడుదువు. నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమియు ఉండదు. నీ హృదయములో పుట్టు భయముచేతను, నీ కన్ను చూచువాటిచేతను ఉదయమున - అయ్యో యెప్పుడు సాయంకాలమగునా అనియు, సాయంకాలమున - అయ్యో యెప్పుడు ఉదయమగునా అనియు అనుకొందువు.” ద్వితి. 28:64-67. “అయితే అక్కడనుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకినయెడల, నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను వెదకినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును.” అన్నది వాగ్దానం. ద్వితి. 4:29.PKTel 397.2

    జెరుబ్బాబెలుకి అతడి సహచరులికి వీటితో ఇలాంటి అనేక లేఖనాలతో పరిచయముంది. తమ ఇటీవలి చెరకాలంలో వాటి నెరవేర్పుకి కోకొల్లలుగా నిదర్శనం ఉంది. మోషేద్వారా దేవుడు ముందే చెప్పిన తీర్పులు తమమీద తమ తండ్రులమిద పడటానికి హేతువైన పాపాల నిమిత్తం ఇప్పుడు పశ్చాత్తాప పడ్డారుగనుక; తమ పూర్ణ హృదయంతో దేవుని పక్కకు తిరిగి ఆయనతో తమ నిబంధన బాంధవ్యాన్ని నవీకరించు కున్నారు గనుక, ఏదైతే నాశనమయ్యిందో దాన్ని పునరుద్ధరించేందుకుగాను వారు తిరిగి యూదాకు రావటానికి ఆయన అనుమతించాడు. ఆ కర్తవ్య ప్రారంభంలోనే వారు విగ్రహారాధకులతో నిబంధన చేసుకోవచ్చా?PKTel 398.1

    “వారితో నిబంధన చేసికొనకూడదు” అన్నాడు దేవుడు. ఆయన ఆలయ శిధిలాలముందు నిర్మించిన బలిపీఠం వద్ద ఇటీవలే తమ్ముని తాము దేవునికి పునరంకితం చేసుకున్నవారు. దైవ ప్రజలకు లోకానికి మధ్య ఉన్న విభజన రేఖను నిత్యం స్పష్టంగా ఉంచాలని గుర్తించారు. ధర్మశాస్త్ర విధులతో పరిచయమున్నప్పటికీ వాటిని ఆచరించని వారితో నిబంధన చేసుకోటానికి వారు ససేమిరా అన్నారు. PKTel 398.2

    ఇశ్రాయేలీయుల ఉపదేశం ఆచరణ నిమిత్తం ద్వితియోపదేశకాండంలో దాఖలు పర్చిన నియమాల్ని దైవప్రజలు లోకాంతంవరకు ఆచరించాలి. దేవునితో మన నిబంధన బాంధవ్యం కొనసాగింపుపైనే వాస్తవమైన అభివృద్ది ఆధారపడి ఉంటుంది. దేవునికి భయపడని వారితో నిబంధన చేసుకోటంద్వారా నియమంపై రాజీపడకూడదు..PKTel 398.3

    లోక ప్రజల మధ్య పలుకుబడి కలిగి ఉండేందుకు తాము కొంత మేరకు లోకాన్ననుసరించి మెలగటం అవసరమని క్రైస్తవులమని చెప్పుకునేవారు భావించే ప్రమాదం నిత్యం ఉంటుంది. ఇలాంటి విధానం ఎంతో ప్రయోజనకరంగా కనిపించినప్పటికీ ఆధ్యాత్మికంగా అది ఎప్పుడూ హానికరమే. సత్యవిరోధుల ప్రలోభాల ద్వారా ఆకట్టుకోటానికి ప్రయత్నించే ప్రతీ కుటిల ప్రభావంనుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. దైవప్రజలు ఈ లోకంలో యాత్రికులు పరదేశులు. వారిమార్గం అపాయంతో నిండిన మార్గం. విశ్వసనీయత మార్గంలో నుంచి తొలగటానికి ఉద్దేశించి వంచనల్ని ప్రోత్సాహకాల్ని వారు లెక్కచెయ్యకూడదు.PKTel 398.4

    మనం ఎక్కువ భయపడాల్సింది దేవుని సేవను బాహాటంగా వ్యతిరేకించే శత్రువులికి కాదు. యూదా బైన్యామినుల శత్రువులమల్లే మెత్తని మాటలతో చక్కని ప్రసంగాలతో వచ్చి దేవుని బిడ్డలతో మైత్రీ బంధాల్ని ఆకాంక్షించేవారు మోసపుచ్చటానికి ప్రబల శక్తి గలవారు. ఆచితూచి అమర్చిన పెద్ద ఉచ్చులో చిక్కుకోకుండేందుకు అలాంటి వారి విషయంలో ప్రతీ ఆత్మ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా లోక చరిత్ర ముగింపుకు వస్తున్న ఈ కాలంలో తన బిడ్డలు అలుపెరుగని అప్రమత్తత కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సంఘర్షణ నిర్విరామంగా సాగుతున్నప్పటికీ ఒంటరి పోరు సల్పటానికి దేవుడు ఎవర్నీ విడిచిపెట్టడు. తనను నమ్ముకున్న ఒక్క వ్యక్తికి కూడా మన ప్రభువు నమ్మకద్రోహం చెయ్యడు. దుష్టి నుంచి పరిరక్షణ కోసం తన బిడ్డలు ఆయన దరి చేరినప్పుడు, కనికరంతోను ప్రేమతోను వారి పక్షంగా తన ధ్వజం ఎత్తుతాడు. అది శత్రువుకి ఎదురుగా నిలుస్తుంది. వారిని ముట్టవద్దు. వారు నావారు. వారిని నా అరచేతిలో చెక్కుకున్నాను అంటాడు ప్రభువు.PKTel 399.1

    దైవ ప్రజల్ని విసుగు విరామంలేకుండా వ్యతిరేకిస్తూ సమరయులు “యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్నవారిని బాధ పరచిరి. మరియు పారసీక దేశపు రాజైన కోరెషుయొక్క దినము లన్నిటిలోను పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలము వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచమిచ్చిరి.” ఎజ్రా. 4:4, 5. తప్పుడు సమాచారం ప్రచారం చేసి అనుమానాలు రేపి మనసుల్ని అనుమానాల్లో నింపారు. అయినా అనేక సంవత్సరాలవరకు దేవుడు దుష్టశక్తుల్ని అదుపులో ఉంచాడు. యూదాలో ఉన్న ప్రజలు తమ కర్తవ్యాన్ని స్వేచ్ఛగా కొనసాగించారు.PKTel 399.2

    మాదీయ పారసీక రాజ్యంలోని ఉన్నతాధికారుల్ని ప్రభావితంచేసి వారి ద్వారా దైవప్రజలకు విఘాతం కలిగించటానికి సాతాను శాయశక్తులా కృషి చేస్తుండగా దేవదూతలు చెరప్రజల పక్షంగా పనిచేశారు. అది పరలోకమంతా ఆసక్తి చూపుతున్న సంఘర్షణ. అది మంచిచెడుల మధ్య జరుగుతున్న సంఘర్షణ దృశ్యం. అది దానియేలు ప్రవక్త ద్వారా మనకు సంక్షిప్తంగా వస్తున్నది. కోరెషు మనసుమీద పనిచేస్తున్న అంధకార శక్తుల దుష్ప్రభావాల్ని ప్రతిఘటించటానికి గబ్రియేలు వాటితో మూడువారాలు పోరాడాడు. ఆ పోరాటం ముగియకముందు స్వయాన క్రీస్తే గబ్రియేలుకి సాయం చెయ్యటానికి వచ్చాడు. “పారసీకుల రాజ్యాధిపతి ఇరువది ఒక్క దినములు నన్ను ఎదిరించెను. ఇంక పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను.” అని గబ్రియేలు అన్నాడు. దాని. 10:13. దైవప్రజలకోసం దేవుడు చెయ్యగలిగిందంతా చేశాడు. చివరికి విజయం లభించింది. కోరెషు కాలమంతటిలోను, రమారమి ఏడు సంవత్సరాలు పరిపాలించిన అతడి కుమారుడు కాంబిసీసు కాలంలోను శత్రువులు అదుపులో ఉన్నారు.PKTel 399.3

    ఇది యూదులకు అద్భుతమైన అవకాశాలున్న సమయం. పరలోకంలోని అత్యున్నత అధికార సాధనాలు రాజుల హృదయాలపై పనిచేస్తున్నాయి. ఇక దేవుని ప్రజలు కోరేషు డిగ్రీని అమలు పర్చటానికి చురుకుగా పనిచెయ్యటం అవసరం. ఆలయ పునరుద్ధరణకు ఆలయ సేవల పునరుద్దరణకు యూదయలోని తమ గృహాల్లో తిరిగి స్థిరపడటానికి వారు శ్రమించి పనిచెయ్యాల్సింది. కాని దేవుని శక్తి ప్రదర్శితమైన ఆ సమయంలో అనేకులు సమ్మతంగా లేనట్లు నిరూపించుకున్నారు. శత్రువుల వ్యతిరేకత తీవ్రంగా ఉంది. నిర్మాణకులు క్రమంగా నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. మూలరాయి వేసినప్పటి దృశ్యాన్ని కొందరు మర్చిపోలేక పోయారు. అప్పుడు పలువురు ఆ కార్యాచరణ విషయంలో తమ అపనమ్మకాన్ని వ్యక్తీకరించారు. సమరయులు మరింత ధైర్యపడటంతో అసలు ఆలయ పునరుద్దరణకు సమయం వచ్చిందా అన్న సందేహాన్ని అనేకమంది యూదులు వెలిబుచ్చటం మొదలు పెట్టారు. ఆ వ్యతిరేకాభిప్రాయం వెంటనే గుప్పుమని అంతటా ప్రచారమయ్యింది. పనిచేస్తున్న కార్యకర్తల్లో అనేకులు నిరాశచెంది పొట్టపోసుకోటానికి వేరేమైనా పనులు చేసుకోటానికి ఇళ్లకు వెళ్లిపోయారు.PKTel 400.1

    కేంబిసీసు పరిపాలన కాలంలో ఆలయ నిర్మాణం మందకొడిగా సాగింది. (ఎజ్రా. 4:7లో అర్తహషస్త అనబడ్డ) అబద్ధ స్మెర్టీసు పాలనలో యూదులు తమ ఆలయాన్ని పట్టణాన్ని తిరిగి కట్టకూడదంటూ ఓ డిక్రీ జారీ చెయ్యటానికి సమరయులు ఈ మోసగాణ్ని ప్రేరేపించాడు.PKTel 400.2

    ఒక ఏడాదికి పైగా ఆలయ నిర్మాణాన్ని అశ్రద్ధ చెయ్యటం, దాదాపు దాని మాటే మర్చిపోటం జరిగింది. ప్రజలు తమ గృహాల్లో నివసిస్తూ ఐహిక ప్రగతిని సాధించటానికి పాటుపడుతున్నారు. అయితే వారి పరిస్థితి శోచనీయంగా ఉంది. ఎంత కష్టపడినా వారు వృద్ది పొందటంలేదు. ప్రకృతి శక్తులే వారికి ఎదురు తిరిగినట్లు కనిపించింది. దేవాలయాన్ని శిధిలాల స్థితిలోనే విడిచిపెట్టినందుకు దేవుడు వారిమీదికి కరవు పంపించాడు. వారిపట్ల తన ప్రసన్నతకు సూచికగా దేవుడు వారికి పండ్లు, కూరగాయలు, ధాన్యం, ద్రాక్షారసం, నూనె సమృద్ధిగా ఇచ్చాడు. కానీ వారీ వనరుల్ని స్వార్థ ప్రయోజనాలికి వినియోగించుకున్నారు గనుక ఆ దీవెనల్ని తొలగించాడు. దర్యావేషు హిస్టాస్పీస్ పరిపాలన పూర్వభాగంలో ప్రబలిన పరిస్థితులు అలాంటివి. ఆధ్యాత్మికంగాను లోకసంబంధంగాను ఇశ్రాయేలీయుల పరిస్థితి దయనీయం. శిధిలాలుగా పడిఉన్న దేవుని ఆలయాన్ని ప్రజలు నిర్లప్తంగా చూస్తూ తమ వ్యక్తిగత ఆసక్తులికి ప్రాధాన్యం ఇస్తూ సణుగుకుంటూ ఎంతోకాలం సందేహాలు వ్యక్తం చేస్తూ ఉండటంతో, అనేకులు దేవుడు తమను యూదయకు ఎందుకు తిరిగి తీసుకువచ్చాడన్నదాన్ని మర్చిపోయారు. “యెహోవా మందిరమును కట్టించుటకు సమయమింక రాలేదు.” అన్నారు. హగ్గయి. 1:2.PKTel 400.3

    అయినా దేవున్ని నమ్ముకున్న వారికి ఈ చీకటి గడియ సహితం నిరీక్షణ లేనిదికాదు. ఈ సంక్లిష్ట సమయాన్ని ఎదుర్కోటానికి హగ్గయి, జెకర్యాల్ని దేవుడు లేపాడు. దేవుడు నియమించిన ఈ ప్రవక్తలు కదిలించే తమ సాక్ష్యాలతో తమ శ్రమలకు కారణాల్ని ప్రజలకు వివరించాడు. ఐహికాభివృద్ధి లేకపోవటానికి ప్రజలు దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వకపోవటమే హేతువని ప్రవక్తలు ప్రకటించారు. ఇశ్రాయేలీయులు దేవున్ని ఘనపర్చిఉంటే, ఆయన మందిరాన్ని నిర్మించటం తమ ప్రథమ కర్తవ్యంగా చేపట్టటం ద్వారా ఆయనకు గౌరవాన్ని విధేయతను చూపించిఉంటే, ఆయన సముఖాన్ని ఆయన దీవెనను ఆహ్వానించేవారు.PKTel 401.1

    అధైర్యంచెందిన వారిని హగ్గయి ఇలా సూటిగా ప్రశ్నిస్తున్నాడు, “ఈ మందిరము పాడైయుండగా మీరు సరంజీవేసిన యిండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా - మీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి.” ఆలయ నిర్మాణం పని అంత స్వల్పంగా ఎందుకు చేశారు? మీ సొంత యిళ్లు కట్టుకోవాలని అంతగా తాపత్రయపడ్డూ ప్రభువు మందిర నిర్మాణం విషయంలో అంత ఉదాసీనత ఎందుకు? ప్రభువు మందిర పునరుద్దరణకు ఒకప్పుడు మీరు కనపర్చిన ఉత్సాహం, ఉద్రేకం ఎక్కడున్నాయి? స్వార్థ ప్రయోజనాలకు పాకులాడి ఏమి సంపాదించారు? పేదరికాన్ని వదిలించుకోవాలన్న కోరిక మీరు దేవాలయ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చెయ్యటానికి దారితీసింది. కాని ఆ నిర్లక్ష్యమే మీరు దేనికి భయపడ్డారో ఆ పేదరికాన్ని మీమీదికి తెచ్చింది. “మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది. పానము చేయుచున్నను దాహము తీరకయున్నది. బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగి పోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది.” 4-6 వచనాలు.PKTel 401.2

    ఆ మీదట అతి స్పష్టమైన, వారు గ్రహించగల మాటల్లో తమకు లేమి కలగటానికి గల కారణాన్ని ప్రభువు వెల్లడించాడు : విస్తారముగా కావలెనని మీరు ఎదురు చూచితిరిగాని కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదర గొట్టితిని; ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడైయుండగా మీరందరు మి మీ యిండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనేగదా. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురువక యున్నది, భూమి పండకయున్నది. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి, ధాన్యము విషయములోను ద్రాక్షరసము విషయములోను తైలము విషయములోను భూమి ఫలించు విషయములోను చేతి పనులన్నిటి విషయములోను క్షామము పుట్టించియున్నాను.” 9-11 వచనాలు.PKTel 401.3

    ప్రభువువారితో ఇలా అన్నాడు, “మీ ప్రవర్తనను బట్టి ఆలోచించుకొనుడి. పర్వతములెక్కి మ్రాను తీసికొనివచ్చి మీరు ఈ మందిరమును కట్టించినయెడల దానియందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందును.” 7,8 వచనాలు.PKTel 402.1

    హగ్గయి ద్వారా వచ్చిన హితవు హెచ్చరికలను ఇశ్రాయేలీయుల ప్రజా నాయకులు హృదయపూర్వకంగా అంగీకరించారు. దేవుడు తమపట్ల ఆసక్తిగా ఉన్నాడని గ్రహించారు. లోకపరంగాను ఆధ్మాత్మికంగాను తమ అభ్యుదయం దేవుని ఆజ్ఞలకు నమ్మకంగా లోబడి నివసించటంపైనే ఆధారపడి ఉంటుందంటూ పదేపదే వచ్చిన ఉపదేశాన్ని వారు పక్కన పెట్టలేకపోయారు. ప్రవక్త హెచ్చరికలతో ఉత్తేజం పొంది జెరుబ్బాబెలు యెహోషువలు “శేషించిన జనులందరును తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్తయైన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్తవిని యెహోవాయందు భయభక్తులు పూనిరి.” 12వ వచనం.PKTel 402.2

    ఇశ్రాయేలీయులు దేవునికి విధేయులవ్వటానికి నిశ్చయించుకున్న వెంటనే ఆ హెచ్చరిక మాటల వెనుక ప్రోత్సాహపర్చే వర్తమానాన్ని దేవుడు ఇచ్చాడు. “అప్పుడు... హగ్గయి... జనులకు ప్రకటించినదేమనగా - నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే యెహోవా వాక్కు యెహోవా... జెరుబ్బాబెలు యొక్క మనస్సును” యెహోషువ మనస్సును “శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపించగా వారు కూడివచ్చి... సైన్యములకధిపతియగు తమ దేవుని మందిరపు పనిచేయ మొదలు పెట్టిరి.” 13-15 వచనాలు.PKTel 402.3

    ఆలయ నిర్మాణం కొనసాగింపు పనిని మళ్లీ చేపట్టి ఒక నెలకూడా గడవకముందే నిర్మాణకుల్ని ఉత్సాహంతో నింపే మరో వర్తమానం వచ్చింది. తన ప్రవక్త పరిముఖంగా ప్రభువే ఈ ఆదరణ వర్తమానాన్ని పలికాడు, “జెరుబ్బాబెలూ, ధైర్యము తెచ్చుకొమ్ము... యెహోషువా, ధైర్యము తెచ్చుకొమ్ము; దేశములోనున్న సమస్త జనులారా, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి; నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు” హగ్గయి. 2:4.PKTel 402.4

    సీనాయి పర్వతం ముందు శిబిరం వేసిన ఇశ్రాయేలువారికి ప్రభువిలా ప్రకటించాడు. “నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడనైయుందును. కావున నేను వారిమధ్య నివసించునట్లు ఐగుప్తు దేశములోనుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలిసికొందురు. నేనే వారి దేవుడనైన యెహోవాను.” నిర్గమ. 29:45,46. వారు పదేపదే “తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప” జేసినప్పటికీ (యెష 63:10) దేవుడు వారిని రక్షించటానికి తన ప్రవక్తద్వారా తన హస్తం చాపుతున్నాడు. తన సంకల్పంతో వారి సహకారానికి గుర్తింపుగా తన ఆత్మ వారిమధ్య ఉంటాడంటూ తాను చేసిన నిబంధనను ఆయన నవీకరిస్తున్నాడు. “భయపడకుడి” అంటున్నాడు.PKTel 403.1

    నేడు తన బిడ్డలతో ప్రభువిలా అంటున్నాడు, “ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీతో కూడ ఉన్నాను.” క్రైస్తవుడికి దేవుడు ఎల్లప్పుడు బలమైన సహాయకుడు. దేవుడు సహాయంచేసే మార్గం మనకు తెలియకపోవచ్చు. కాని ఇది మనకు తెలుసు. ఆయన్ని ఎవరు నమ్ముకుంటారో వారిని ఆయన ఎన్నడూ నిరాశ పర్చడు. తమ విషయంలో అపవాది ఉద్దేశాలు నెరవేరకుండేందుకు ఎన్నిసార్లు ప్రభువు తమ మార్గాన్ని సుగమం చేశాడో క్రైస్తవులు గుర్తించగలిగిఉంటే వారు ఫిర్యాదులు చేస్తూ తూలిపడరు. దేవునిపై వారి విశ్వాసం ధృఢంగా ఉంటుంది. ఎలాంటి కష్టం వారిని కుంగదీయలేదు. ఆయనే తమ జ్ఞానంగా, తమ సామర్థ్యంగా వారు గుర్తిస్తారు. తమ ద్వారా ఆయన చేయాలనుకున్న దాన్ని ఆయన సాకారం చేస్తాడు.PKTel 403.2

    హగ్గయి ద్వారా పంపిన విజ్ఞాపనల్ని ప్రోత్సాహాన్ని నొక్కిచెబుతూ, హగ్గయి పక్క ఉండటానికి దేవుడు లేపిన జెకర్యా తన విజ్ఞాపనల్ని వాటితో జోడించి ఆలయ నిర్మాణానికి దేవుడిచ్చిన ఆజ్ఞను ఆచరించాల్సిందిగా ఇశ్రాయేలీయులిని కోరాడు. దేవుని వాక్యం ఎన్నడూ తప్పదని, ఆయన ప్రవచన వాక్యాన్ని వినుకునే వారికి అది దీవెన వాగ్దానమని జెకర్యా మొదటి వర్తమానం భరోసా ఇస్తుంది.PKTel 403.3

    తమ పొలాలు పంటలు లేకుండా బీడుపడి ఉన్నా, కొంచెంగానే ఉన్న తమ ఆహారధాన్యాలు వేగంగా తరిగిపోతున్నా, తమ చుట్టూ ఉన్న ప్రజలు తమకు వ్యతిరేకులైనా, ఇశ్రాయేలీయులు దైవ సేవకుల పిలుపుకు స్పందిస్తూ విశ్వాసంతో ముందుకు వచ్చి పాడైఉన్న దేవాలయాన్ని పునరుద్ధరించటానికి కష్టపడి పనిచేశారు. అది దేవునిమీద ఆధారపడి నిర్వహించాల్సిన పని. ప్రజలు తమవంతు పనిని చెయ్యటానికి ప్రయత్నిస్తూ హృదయంలోను జీవితంలోను దైవకృప నవీకరణను కోరుతుండగా హగ్గయి జెకర్యాల ద్వారా దేవుడు ఒకదానివెంట ఒకటిగా వర్తమానాలు పంపి, తమ విశ్వాసానికి ప్రతిఫలం పొందుతారని, ఇప్పుడు తాము దేని గోడల్ని కడుతున్నారో ఆ ఆలయం భవిష్యత్ ప్రభావం గురించి దేవుడు చెప్పిన మాట నెరవేరుతుందని వారికి భరోసా ఇచ్చాడు. కాలం పరిసమాప్తమై నప్పుడు ఈ ఆలయంలోనే సకలజాతుల కాంక్షణీయుడైన ప్రభువు మానవాళి బోధకుడుగాను రక్షకుడుగాను ప్రత్యక్ష మౌతాడు అన్నాడు.PKTel 403.4

    నిర్మాణకులు ఇలా ఒంటరివారు కారు; “ప్రవక్తలు వారితోకూడ ఉండి సహాయము చేయుచు వచ్చిరి.” “ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి; నేను మీకు తోడుగా ఉన్నాను.” అని సైన్యాలకు అధిపతి అయిన యెహోవా తానే ప్రకటించాడు. ఎజ్రా. 5:2; హగ్గయి 2:4..PKTel 404.1

    హృదయంనుంచి వచ్చిన పశ్చాత్తాపంతో విశ్వాసమూలంగా ముందుకి సాగేందుకు వారు చూపించిన సంసిద్ధతతో ఐహికమైన అభివృద్ధికి వాగ్దానం వచ్చింది. “ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను.” అని ప్రభువు ప్రకటించాడు. 19వ వచనం. వారు బబులోను నుంచి తిరిగివచ్చిన నాటినుంచి గడిచిన సంవత్సరాలన్నిటి లోను ఎన్నో బాధలకు తీవ్ర పరీక్షలకు గురి అయిన వారి నాయకుడు జెరుబ్బాబెలుకి విలువైన వర్తమానం వచ్చింది. దేవుని ప్రజల విరోధులందరూ నిర్మూలమయ్యే దినం వస్తుందని ప్రభువు వెల్లడించాడు. “జెరుబ్బాబెలూ, నేను నిన్ను ఏర్పరచుకొనియున్నాను. గనుక ఆ దినమున నేను నిన్ను తీసికొని ముద్ర యుంగరముగా చేతును. ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు” 23వ వచనం. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు అధికారి ఆశాభంగం, ఆందోళనగుండా తనను నడిపించిన దైవకృపను అర్థం చేసుకోగలిగాడు. దానంతటిలోను అతడు దేవుని సంకల్పాన్ని అవగాహన చేసుకోగలిగాడు.PKTel 404.2

    ప్రతీయుగంలోను దేవుని బిడ్డల్ని ధైర్యపర్చటం కోసం జెరుబ్బాబెలుకి దేవుడిచ్చిన ఈ వ్యక్తిగత వాగ్దానం దాఖలు కావటం జరిగింది. తన బిడ్డలకి శ్రమలు పంపటంలో దేవునికి ఓ ఉద్దేశముంది. వారు ఆరంభంనుంచి ఆయన ఉద్దేశాన్ని చూడగలిగి, తాము నెరవేర్చుతున్న సంకల్పం తాలూకు మహిమను వారు గ్రహించగలిగితే, తాము ఎంపిక చేసుకున్న దారిలోనే తప్ప వేరేమార్గాన ఆయన వారిని నడిపించడు. పరీక్షలు కష్టాల రూపేణ వారిమీదికి ఆయన రప్పించే సమస్తం వారు బలంగా ఉండి తన కార్యాలు జరిగించి తనకోసం బాధలను భవించేందుకే రప్పిస్తాడు.PKTel 404.3

    హగ్గయి జెకర్యాలు అందించిన వర్తమానాలు ప్రజల్ని ఉత్తేజపర్చి ఆలయ పునర్నిర్మాణానికి శాయశక్తుల కృషిచేయటానికి వారిని నడిపించాయి. అయితే వారు పనిచేస్తుండగా సమరయులు ఇతరత్రా మనుషులు వారిని శ్రమలకు గురిచేశారు. వారి పనికి ఎన్నో అంతరాయాలు కలిగించారు. ఒక సందర్భంలో మాదీయ పారసీక అధికార్లు యెరూషలేమును సందర్శించి ఆ ఆలయ పునరుద్దరణను ఆదేశించిన వ్యక్తి పేరు చెప్పాల్సిందిగా కోరారు. ఆ సమయంలో యూదులు మార్గ నిర్దేశంకోసం దేవునిపై ఆధారపడి ఉండకపోతే ఈ విచారణ వారికి ఆశనిపాతంగా మారేది. “యూదుల దేవుడు వారి పెద్దలమీద తన దృష్టి యుంచినందున ఆ అధికారులు వారిని పని మాన్పింపలేదు.” ఎజ్రా, 5:5. అధికారులికి వారిచ్చిన జవాబు జ్ఞానయుక్తంగా ఉండటంతో వారు అప్పటి మాదీయ పారసీక రాజైన దర్యావేషుకి ఉత్తరంరాసి, యెరూషలేములోని దేవుని మందిరాన్ని తిరిగి నిర్మించాల్సిందని, దాని ఖర్చు రాజు ధనాగారం నుంచి చెల్లించాల్సిందని కోరేషు జారీచేసిన మొట్టమొదటి డిక్రీకి అతడి గమనాన్ని తిప్పటానికి నిశ్చయించుకున్నారు.PKTel 404.4

    దర్యావేషు ఆ డిగ్రీని వెదకి పట్టుకున్నాడు. ఆ మీదట ఆలయ నిర్మాణాన్ని కొనసాగనివ్వాల్సిందిగా దర్యాప్తు చేస్తున్న వారిని ఆదేశించాడు. రాజిలా ఆజ్ఞాపించాడు, “దేవుని మందిరపు పని జరుగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టనియ్యుడి.”PKTel 405.1

    దర్యావేషు ఇంకా ఇలా అన్నాడు, “మరియు దేవుని మందిరమును కట్టించునట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయమును గూర్చి మేము నిర్ణయించినదేమనగా - రాజుయొక్క సొమ్ములోనుండి, అనగా నది యవతలనుండి వచ్చిన పన్నులోనుండి వారు చేయు పని నిమిత్తము తడవు ఏ మాత్రమును చేయక వారి ప్రయత్నమునకు కావలసినదాని ఇయ్యవలెను. మరియు ఆకాశమందలి దేవునికి దహన బలులు అర్పించుటకై కోడెలేగాని గొట్టెపొట్టేళ్లేగాని గొట్టె పిల్లలేగాని గోధుమలే గాని ఉప్పేగాని ద్రాక్షారసమేగాని, యెరూషలేములోనున్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసనయైన అర్పణములు అర్పించి, రాజును అతడి కుమారులు జీవించునట్లు ప్రార్థన చేయు నిమిత్తమై వారు చెప్పిన దానినిబట్టి ప్రతిదినమును తప్పకుండ వారికి కావలసినదంతయు ఇయ్యవలెను.” ఎజ్రా. 6:7-10.PKTel 405.2

    ఈ డిక్రీలో ఎవరైనా ఎలాంటి మార్పులైనా చేస్తే వారికి కఠిన శిక్ష విధించాల్సిందిగా రాజు మరో డిక్రీ జారీ చేశాడు. దాన్ని రాజు ఈ చక్కని మాటలతో ముగించాడు : “ఏ రాజులేగాని యే జనులేగాని యీ ఆజ్ఞను భంగపరచి యెరూషలేములో నున్న దేవుని మందిరమును నశింప జేయుటకై చెయ్యి చాపిన యెడల, తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపజేయును. దర్యావేషు అను నేనే యీ ఆజ్ఞ ఇచ్చితిని. మరియు అది వేగముగా జరుగవలెను.” 12వ వచనం. ఆలయ నిర్మాణాన్ని పూర్తి చెయ్యటానికి ప్రభువు ఈ విధంగా మార్గం సుగమంచేశాడు.PKTel 405.3

    ఈ డిక్రీ జారీ అవ్వటానికి కొన్ని మాసాల ముందునుంచే ఇశ్రాయేలీయులు విశ్వాసంతో పనిచేస్తూ ఉన్నారు. కాలానుగుణంగా వర్తమానాలు అందించటం ద్వారా దైవప్రవక్తలు వారికి చేదోడు వాదోడుగా మెలగుతూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం దేవుని ఉద్దేశాల్ని ఆ వర్తమానాలద్వారా నిర్మాణకుల ముందుంచటం జరుగుతూ వచ్చింది. హగ్గయి తన చివరి లిఖిత వర్తమానం అందించిన రెండు నెలలకి భూమిపై దేవుని సేవను గూర్చి జెకర్యాకి కొన్ని దర్శనాలు వచ్చాయి. ఉపమానాలు, సంకేతాల రూపంలో ఉన్న ఈ వర్తమానాలు గొప్ప అనిశ్చితి ఆందోళన నెలకొన్న కాలంలో వచ్చాయి. అవి ఇశ్రాయేలు దేవుని పేరిట పురోగమిస్తున్న ప్రజలకు ప్రత్యేకతను ప్రాముఖ్యాన్ని సమకూర్చాయి. ఆలయ నిర్మాణానికి యూదులికి ఇచ్చిన అనుమతి ఉపసంహరించుకోటానికి అంతా సిద్ధంగా ఉన్నట్లు నాయకులికి కనిపించింది. భవిష్యత్తు అంధకారంగా కనిపించింది. తన అనంతప్రేమ కనికరాల వెల్లడిద్వారా తన ప్రజల్ని ఆదుకోటం ఉత్సాహపర్చటం అవసరమని దేవుడు గుర్తించాడు.PKTel 406.1

    దర్శనంలో దేవదూత తనను ఇలా ప్రశ్నించినట్లు జెకర్యా విన్నాడు, “సైన్యముల కధిపతియగు యెహోవా, డెబ్బది సంవత్సరములనుండి నీవు యెరూషలేము మిదను యూదా పట్టణము మిదను కోపముంచియున్నావే, యిక ఎన్నాళ్లు కనికరింపక యుందువు?... యెహోవా నాతో మాటలాడుచున్న దూతకు ఆదరణయైన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను.” అని జెకర్యా అన్నాడు.PKTel 406.2

    “కాబట్టి నాతో మాటలాడుచున్న దూత నాతో ఇట్లనెను - నీవు ప్రకటన చేయవలసినదేమనగా - సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు - నేను యెరూషలేము విషయములోను సీయోను విషయములోను అధికాసక్తి కలిగియున్నాను; నిమ్మళముగా ఉన్న అన్యజనులమీద నేను బహుగా కోపించుచున్నాను. ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలెనన్న తాత్పర్యముతోవారు సహాయులైరి. కాబట్టి యెహోవా సెలవిచ్చున దేమనగా - వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగియున్నాను. అందులో నా మందిరము కట్టబడును. యెరూషలేము మీద... నూలు పోగు లాగుదురు.” జెకర్యా. 1:12-16.PKTel 406.3

    ఇలా ప్రవచించాల్సిందిగా ప్రవక్తను ఇప్పుడు దేవుడు ఆదేశించాడు, “ఇక నా పట్టణము భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును.” 17వ వచనం.PKTel 406.4

    అనంతరం జెకర్యా “యూదావారిని ఇశ్రాయేలువారిని యెరూషలేము నివాసులను చెదరగొట్టిన” రాజ్యాధికారాల్ని చూశాడు. ఆ రాజ్యాధికారాల్ని నాలుగు కొమ్ములు సూచించాయి. దాని తర్వాత జెకర్యా నలుగురు వడ్రంగుల్ని చూశాడు. తన ప్రజల్ని తన ఆరాధన మందిరాన్ని పునరుద్దరించటానికి దేవుడు వినియోగించిన సాధనాల్ని వీరు సూచిస్తున్నారు. 18-21 వచనాలు చూడండి.PKTel 407.1

    జెకర్యా ఇలా అన్నాడు, “నేను తేరిచూడగా కొలనూలు చేతపట్టుకొనిన యొకడు నాకు కనబడెను. నీవెక్కడికి పోవుచున్నావని నేనతని నడుగగా అతడు - యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోవు చున్నాననెను. అంతట నాతో మాటలాడుచున్న దూత బయలుదేరగా మరియొక దూత యతనిని ఎదుర్కొన వచ్చెను. రెండవ దూత - పరుగెత్తిపోయి యెరూషలేములో మనుష్యులును పశువులును విస్తారమైనందున అది ప్రాకారములులేని మైదానముగా ఉండునని ఈ యావనునికి తెలియజేయుమని మొదటి దూత ఆజ్ఞ ఇచ్చెను. నేను దానిచుట్టు అగ్ని ప్రాకారముగా ఉండును. నేను దానిమధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉండును.” జెకర్యా. 2:1-5.PKTel 407.2

    యెరూషలేమును తిరిగి కట్టాల్సిందిగా దేవుడు ఆజ్ఞాపించాడు. పట్టణాన్ని కొలతవేసే దర్శనం బాధలనుభవిస్తున్న తనవారికి ఆదరణను శక్తిని ఇచ్చి తన నిత్య నిబంధన వాగ్దానాల్ని వారికి నెరవేర్చుతానన్నదానికి భరోసా. తన సంరక్షణ “అగ్ని ప్రాకారముగా ఉండును” అని వారి ద్వారా తన మహిమ మనుషులికి వెల్లడవుతుందని ఆయన తెలియజేశాడు. తన జనులికి ఆయన చేస్తున్న కార్యాలు లోకమంతటా వెల్లడవు తాయి. “సీయోను నివాసీ, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ద దేవుడు ఘనుడైయున్నాడు.” యెష. 12:6.PKTel 407.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents