Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ప్రవక్తలు - రాజులు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    20 - నయమాను

    “సిరియరాజు సైన్యాధిపతియైన నయమాను అనునొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసియుండెను. గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయపొందినవాడాయెను. అతడు మహా పరాక్రమశాలియై యుండెనుగాని అతడు కుష్ఠరోగి.”PKTel 162.1

    సిరియా రాజు బెనదదు ఇశ్రాయేలు సైన్యాన్ని ఓడించాడు. ఆ యుద్ధంలో అహాబు మరణించాడు. అప్పటినుంచి సిరియన్లకు ఇశ్రాలీయులతో నిత్యం సరిహద్దు ఘర్షణలు జరుగుతున్నాయి. వారు చేసిన ఒక దాడిలో ఒక బాలికని దాసీగా చెరపట్టుకు పోయారు. ఆ బాలిక నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను.” దూరదేశంలో బానిసగా ఉన్న ఈ బాలిక దేవునికి సాక్షిగా ఉంది. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎందు నిమిత్తం ఎంపికచేసుకున్నాడో ఆ ఉదేశాన్ని ఈ బాలిక తనకు తెలియకుండానే నెరవేర్చుతున్నది. ఆ అన్య దేశంలో సేవచేస్తూ ఆ బాలిక తన యజమానుడిపట్ల సానుభూతితో నిండింది. ఎలీషా ద్వారా దేవుడు చేసిన సూచక క్రియల్ని జ్ఞప్తికి తెచ్చుకుని తన యజమానురాలితో ఇలా అంది, “షోమ్రోనులో నున్న ప్రవక్త దగ్గర నాయేలిన వాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను, అతడు నాయేలినవానికి కలిగిన కుష్ఠ రోగమును బాగుచేయును.” ఎలీషాకు దేవునిశక్తి ఉందని ఆమెకు తెలుసు. ఈ శక్తి వలన నయమాను స్వస్తత పొందుతాడని ఆమెకు తెలుసు.PKTel 162.2

    ఆ బానిస బాలిక అన్యగృహంలో మెలగిన తీరు చిన్న వయసులోని గృహ శిక్షణ శక్తికి బలమైన సాక్ష్యం. తమ బిడ్డల పెంపకం విషయంలో తల్లిదండ్రులికి అప్పగించబడ్డ బాధ్యతకన్నా ఉన్నత బాధ్యత ఇంకొకటిలేదు. అలవాట్లకు ప్రవర్తనకు తల్లిదండ్రులు పునాదులు వేస్తారు. వారి ఆదర్శం వారి బోధన వారి బిడ్డల భవిష్యత్తును చాలామట్టుకు నిర్ణయిస్తాయి.PKTel 162.3

    ఎవరి జీవితాలు దైవజీవితానికి యధార్ధ ప్రతిబింబాలై ఉండి దేవుని వాగ్దానాలు ఆజ్ఞలు తమ పిల్లల్లో కృతజ్ఞత గౌరవం పుట్టిస్తాయో, ఎవరి దయ న్యాదృష్టి దీర్ఘశాంతం పిల్లలకు దేవుని ప్రేమను, న్యాయశీలతను దీర్ఘశాంతాన్ని విశదం చేస్తాయో, ఎవరు తమపిల్లలికి వాటిని ప్రేమించటం, విశ్వసించటం, ఆచరించటం నేర్పిస్తారో వారు సంతోషానందాలుగల తల్లిదండ్రులు. వారు వారిపిల్లలికి తమ పరలోకపు తండ్రిని ప్రేమించి విశ్వసించి ఆయనకు విధేయులుగా నివసించటం నేర్పిస్తున్నవారవుతారు. తమ బిడ్డలికి అలాంటి వరం ఇచ్చే తల్లిదండ్రులు బిడ్డలికి యుగయుగాలుగా అనంతంగా నిలిచే భాగ్యాన్ని ఐశ్వర్యాన్ని అందిస్తున్న వారవుతారు.PKTel 162.4

    మన బిడ్డలు ఏరీతిగా సేవచేయ్యటానికి పిలుపుపొందుతారో మనకు తెలియదు. వారు గృహ పరిధిలోనే తమ జీవితాలు గడపవచ్చు. జీవిత సామాన్య వృత్తుల్లో పనిచెయ్యవచ్చు. లేదా సువార్త బోధకులుగా విదేశాలకు వెళ్ళవచ్చు. అయితే దేవుని మిషనెరీలుగా సేవ చెయ్యటానికి, లోకానికి కరుణ పంచే సేవకులుగా సేవచేయ్యటానికి అందరూ పిలుపుపొందుతున్నారు. స్వార్ధరహిత సేవచెయ్యటానికి క్రీస్తు పక్క నిలబడటానికి తమను సిద్దం చేసే విద్యను వారు పొందాలి. PKTel 163.1

    ఈ హెబ్రీ బాలిక తలిదండ్రులు ఆమెకు దేవుని గురించి బోధించినప్పుడు ఆమె భవిష్యత్తు ఎలాగుండబోతుందో వారికి తెలియదు. కాని వారు తమ బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించారు. వారి బిడ్డ తాను ఘనపర్చటం నేర్చుకున్న దేవుని గురించి సిరియా సేనాధికారి గృహంలో సాక్ష్యమిచ్చింది.PKTel 163.2

    ఆ హెబ్రీ బాలిక తన యజమానురాలితో అన్నమాటల్ని నయమానువిన్నాడు. రాజు అనుమతి పొంది “అతడు ఇరువది మణుగుల వెండియు లక్ష యిరువది వేలరూపాయల బంగారును పది దుస్తుల బట్టలను తీసికొని” స్వస్తత కూర్చే వ్యక్తిని వెదకటానికి బయలుదేరాడు. సిరియా రాజునుంచి ఇశ్రాయేలు రాజుకి ఒక ఉత్తరం కూడా తీసుకున్నాడు. ఆ ఉత్తరంలో ఇలాగుంది, నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగుచేయవలెనని పంపించి యున్నాను.” ఇశ్రాయేలు రాజు ఉత్తరం చదువుకుని “వస్త్రములు చింపుకొని - చంపుటకును బ్రదికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుటకు నా యొద్దకు ఇతడు పంపుటయేమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదకుచున్నాడో మీరు ఆలోచించుడి.” PKTel 163.3

    ఈ విషయం ఎలీషాకు తెలిసింది. అతడు రాజుకి ఈ వర్తమానం పంపాడు, “నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త యొకడున్నాడని అతనికి తెలియబడునట్లు అతని నా యొద్దకు రానిమ్ము.”PKTel 163.4

    నయమాను గుఱ్ఱములతోను రధములతోను వచ్చి ఎలీషా ఇంటిద్వారము ముందర నిలిచి ఉన్నాడు. “నీవు యోర్దాను నదికిపోయి యేడుమారులు స్నానము చేయును, నీ ఒళ్లు మరల బాగై నీవు శుదుడవగుదువు” అని ఒక దూతతో కబురు పంపాడు.PKTel 163.5

    పరలోకం నుంచి అద్భుతశక్తి ప్రదర్శన జరుగుతుందని నయమాను ఎదురు చూశాడు. అతడిలా అన్నాడు, “అతడు నాయొద్దకు వచ్చి నిలిచి, తన దేవుడైన యెహోవా నామమునుబట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలముమీద ఆడించి కుష్టరోగమును మాన్పునని నేననుకొంటిని. యోర్ధానులో స్నానం చేయమని చెప్పినప్పుడు అతడి ఆత్మాభిమానం దెబ్బతిన్నది. అవమానంతో, నిస్పృహతో ఇలా అన్నాడు, “దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానముచేసి శుద్ధి నొందలేనా? అనుకొని రౌద్రుడై తిరిగివెళ్లిపోయెను.”PKTel 164.1

    ఎలీషా నిర్దేశించిన మార్గాన్ని అనుసరించటం నయమాను అహం వ్యతిరేకించింది. సిరియా సేనాపతి పేర్కొన్న నదులు మంచి నదులు. వాటి చుట్టూ వనాలున్నాయి. ఈ నదుల గట్టులమీద దేవతా విగ్రహాల్ని పూజించటానికి ప్రజలు గుంపుగుంపులుగా పోగుపడేవారు. వాటిలో ఒకదానిలో మునగటం నయమాను పరువుకి గొప్ప నష్టం కలిగేదికాదు. అయితే ప్రవక్త నిర్దేశించిన సూచనల్ని అనుసరించటం ద్వారా మాత్రమే అతడికి స్వస్తత లభించాల్సి ఉంది. ఇష్టపూర్వక విధేయత మాత్రమే ఆశించిన ఫలితాన్నిస్తుంది.PKTel 164.2

    నయమాను సేవకులు ఎలీషా సూచనల్ని అవలంబించాల్సిందిగా అతణ్ని బతిమాలారు : “ఆ ప్రవక్త యేదైన నొక గొప్ప కార్యము చేయుమని నియమించిన యెడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా?” అన్నారు. అతిశయం ఆధిక్యంకోసం పోరాడ్డుండగా నయమాను విశ్వాసం పరీక్షించబడింది. అయితే విశ్వాసం జయించింది. గర్విష్టుడైన ఆ సిరియా దేశస్తుడు తన అహంకారాన్ని దిగమింగి యెహోవా చిత్తానికి తలవంచాడు. “దైవజనుడు చెప్పినట్లు” అతడు యోర్ధానులో ఏడుసార్లు మునిగాడు. అతడి విశ్వాసం సఫలమయ్యింది. “అతని దేహము పసిపిల్ల దేహమువలెనై అతడు శుద్దుడాయెను.”PKTel 164.3

    అతడు కృతజ్ఞతతో తన పరివారముతో కూడ దైవజనుని దగ్గరకు తిరిగివచ్చి” “చిత్తగించుము ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరియొక దేవుడు లేడని నేను ఎరుగుదును” అని ప్రకటించాడు.PKTel 164.4

    నాటి ఆచారాన్ననుసరించి, నయమాను ఒక విలువైన కానుకతెచ్చి దాన్ని అంగీకరించాల్సిందిగా ఎలీషాని కోరాడు. ప్రవక్త దాన్ని నిరాకరించాడు. దేవుడు తన కృప చొప్పున అనుగ్రహించిన దీవెనకు పారితోషికం తీసుకోటం అతడికి ఇష్టంలేదు. “యెహోవా జీవముతోడు నేనేమియు తీసుకొనను” అన్నాడు ఎలీషా. నయమాను “అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయెను.”PKTel 164.5

    “అప్పుడు - యెహోవాకు తప్ప దహనబలినైనను మరి యేబలియైనను ఇతరమైన దేవతలకు నేనిక అర్పింపను, రెండు కంచరగాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడనైన నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతిమీద ఆనుకొనునప్పుడు, నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసిన యెడల, రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడైన నన్ను క్షమించునుగాకని నయమాను చెప్పగాPKTel 165.1

    “ఎలీషా - నెమ్మది గలిగిపొమ్మని అతనికి సెలవిచ్చెను. అతడు ఎలీషానుండి వెళ్లి కొంతదురము సాగిపోయెను.”PKTel 165.2

    తన యజమానుడి సేవలో ప్రస్పుటంగా కనిపించిన ఆత్మ త్యాగ స్పూర్తిని అలవర్చుకోటానికి ఎలీషా సేవకుడు గేహజీకి తన సేవాకాలంలో ఎన్నో అవకాశా లున్నాయి. ప్రభువు సైన్యంలో ధ్వజం మోసే విశేషావకాశం అతడికి కలిగింది. దేవుని ఉత్తమ వరాలు చాలాకాలం అతడి అందుబాటులో ఉన్నాయి. అయినా వీటిని విడిచిపెట్టి పనికిమాలిన లోహమిశ్రమం అయిన లోకభాగ్యాన్ని ఆశించాడు. ఇప్పుడు నిగూఢంగా ఉన్న ఆ దురాశ తోసి పుచ్చలేని శోధనలోకి అతణ్ని నడిపించింది. “సిరియనుడైన యీ నయమాను తీసికొని వచ్చినవాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెనుగాని.... నేను పరుగెత్తుకొనిపోయి అతని కలిసికొని అతనియొద్ద ఏదైనను తీసికొందము” అని తనలో తాను అనుకున్నాడు. ఇలా గేహజీ “నయమానును కలిసికొనుటకై” వెళ్లాడు.PKTel 165.3

    “నయమాను తన వెనుకనుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని - క్షేమమా అని అడిగెను. అతడు క్షేమమని” చెప్పాడు. “నా యజమానుడు నా చేత వర్తమానము పంపి - ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యౌవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారికొరకు రెండు మణుగుల వెండియు రెండు దుస్తుల బట్టలును దయచేయుమని సెలవిచ్చుచున్నాడు” అన్నాడు. ఆ మనవిని నయమాను సంతోషంగా అంగీకరించాడు. గేహజీకి రెండు మణుగుల వెండి బదులు నాలుగుమణుగుల వెండిని “రెండు దుస్తుల బట్టలును” ఇచ్చి తన సేవకులతో వాటిని పంపాడు.PKTel 165.4

    గేహజీ ఎలీషా గృహాన్ని సమీపించినప్పుడు నయమాను సేవకుల్ని పంపివేసి ఆ వెండిని దుస్తుల్ని దాచిపెట్టాడు. ఇది చేసిన తర్వాత “అతడు లోనికిపోయి తన యజమానుని ముందు నిలిచి తన యజమానుడి మందలింపునుPKTel 165.5

    తప్పించుకునేందుకు అతడు రెండో అబద్దమాడాడు. “నీ వెచ్చటనుండి వచ్చితివి?” అని ప్రవక్త అడిగిన ప్రశ్నకు “నీ దాసుడనైన నేను ఎచ్చటికిని పోలేదు” అని బదులు పలికాడు. PKTel 166.1

    తనకు అంతా తెలిసిందని సూచిస్తూ ఎలీషా తీవ్ర ఖండనతో కూడిన నేరారోపణ చేశాడు. ఎలీషా ఇలా అన్నాడు, “ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడ రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్లతోటలను ద్రాక్షతోటలను గొట్టెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును.” నేరస్తుడికి శిక్ష వెంటనే వచ్చింది. అతడు ఎలీషా సముఖం నుంచి “మంచువలె తెల్లనైన కుష్ఠు కలిగి” బయటికి వెళ్లిపోయాడు.PKTel 166.2

    దేవుడు ఉన్నతమైన పరిశుద్దమైన ఆధిక్యతలిచ్చిన ఒక వ్యక్తికి కలిగిన ఈ అనుభవం బోధించే పాఠాలు గంభీరమైనవి. గేహజీ చేసిన పని నయమాను మార్గంలో అడ్డుబండవేసినట్లయ్యింది. నయమాను మనసుపై గొప్ప వెలుగు ప్రకాశించింది. అతడు సజీవ దేవుని సేవ చెయ్యటానికి ఆసక్తిగా ఉన్నాడు. గేహజీ పాల్పడ్డ మోసానికి ఎలాంటి సాకూలేదు. అతడు మరణించే రోజు వరకూ కుష్ఠరోగిగా మిగిలిపోయాడు. అతణ్ని దేవుడు శపించాడు. సాటి మనుషులు విసర్జించారు.PKTel 166.3

    “కూట సాక్షి శిక్షనొందకపోడు. అబద్దములాడువాడు తప్పించుకొనడు.” సామె 19:5. మానవులు తమ దూష్కార్యాల్ని ఇతరుల కంటికి కనపడకుండా దాచవచ్చు. కాని వారు దేవుని కన్ను కప్పలేరు. “మనమెవనికి లెక్క యొప్పజెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.” హెబీ 4:13. గేహజీ ఎలీషాను మోసగించాలనుకున్నాడు. కాని గేహజీ నయమానుతో అన్నమాటల్ని వారిద్దరి మధ్య జరిగిన సన్నివేశ వివరాలు దేవుడు ఎలీషాకు వెల్లడిచేశాడు.PKTel 166.4

    సత్యం దేవుని నుంచి వస్తుంది. మోసం సాతాను నుంచి అనేకరూపాల్లో వస్తుంది. ఏరీతిలోనైనా సత్యం నుంచి ఎవరు తొలగిపోతారో వారు సాతాను శక్తికి తమ్మును తాము అప్పగించుకుంటున్నారు. క్రీస్తు వద్ద నేర్చుకున్నవారు “నిష్పలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండరు. ఎఫె 5:11. పలుకులోను జీవితంలోను వారు నిరాడంబరంగా, ముక్కుసూటిగా, నిజాయితీగా ఉంటారు. ఎందుకంటే ఎవరి నోళ్ళలో అబద్దమన్నది ఉండదో ఆ పరిశుద్దులతో సహవాసం కొరకు వారు సిద్ధపడుతున్నారు. ప్రక 14:5 చూడండి.PKTel 166.5

    నయమాను శరీర స్వస్తత, ఆత్మలో మార్పుపొంది సిరియాలోని తన గృహానికి వెళ్లిన కొన్ని శతాబ్దాల అనంతరం రక్షకుడు అతడి విశ్వాసం గురించి ప్రస్తావించి, దేవుని సేవ చేస్తున్నామని చెప్పే వారందరికీ అది ఆదర్శనీయమని ప్రశంసించాడు. ఆయన ఇలా అన్నాడు, “ప్రవక్తయైన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠురోగులుండినను, సిరియ దేశస్తుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను.” లూకా 4:27. తమ అపనమ్మకం ఉపకారం తలుపు మూసివేసింది గనుక ఇశ్రాయేలులోని అనేకమంది కుష్ఠురోగుల్ని దేవుడు దాటి వెళ్లిపోయాడు. తానిచ్చిన ఆధిక్యతల్ని నిర్లక్ష్యం చేసి తృణీకరించి శ్రమల్లో ఉన్న ఇశ్రాయేలుకన్నా తనకు సత్యమని తోచిన దానికి నమ్మకంగా నిలిచి తనకు సహాయం అవసరమని గుర్తించిన ఒక అన్యజనాధికారి దేవుని దృష్టికి ఎక్కువ యోగ్యుడు. తన ఉపకారాల్ని అభినందించి పరలోకం నుంచి వచ్చే వెలుగుకు స్పందించే వారి పక్షంగా దేవుడు పని చేస్తాడు.PKTel 167.1

    నేడు ప్రతీ దేశంలో యధార్ద హృదయులున్నారు. వీరిపై పరలోకం నుంచి వస్తున్న వెలుగు ప్రకాశిస్తున్నది. తమ విధిగా తాము అవగాహన చేసుకున్నదాన్ని వారు నమ్మకంగా అవలంబించటం కొనసాగిస్తే నయమానులాగ జీవంగల దేవుడు సృష్టికర్త తప్ప “లోకమంతటియందును మరియొక దేవుడు లేడు” అని గుర్తించే వరకు వారికి ఎక్కువ వెలుగు అనుగ్రహించబడ్తుంది.PKTel 167.2

    “వెలుగులేక చీకటిలో నడచు” ప్రతీ యధార్ధ ఆత్మకు ఈ అహ్వానం వస్తుంది. “యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను.” “తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచియుండలేదు. అట్టి దేవుడు, కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు. నీ మార్గములనుబట్టి నిన్ను జ్ఞాపకము చేసికొనుచు సంతోషముగా నీతిననుసరించువారిని నీవు దర్శించుచున్నావు.” యెష 50:10, 64:4, 5.PKTel 167.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents