Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ప్రవక్తలు - రాజులు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    17 - ఎలీషాపిలుపు

    తనకు మారుగా ప్రవక్తగా సేవచెయ్యటానికి ఇంకొక వ్యక్తిని అభిషేకించాల్సిందిగా ఏలీయాను దేవుడు ఆదేశించాడు. “నీకు మారుగా ప్రవక్తయైయుండుటకు... షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము” అని దేవుడన్నాడు. (1రాజులు 19:16) ఆ ఆజ్ఞమేరకు ఏలీయా ఎలీషాకోసం బయలుదేరాడు. అతడు ఉత్తరానికి ప్రయాణిస్తున్నప్పుడు కొద్దికాలం క్రితం దృశ్యానికి ఇప్పటి దృశ్యానికి మధ్య ఎంత మార్పు కనిపించింది! అప్పుడు భూమి ఎండిపోయి ఎడారిలా ఉంది. పంటభూములున్న ప్రాంతాలు బీడుపడిఉన్నాయి. ఎందుకంటే మంచుగాని, వరంగాని ఒక్క బిగిని మూడేళ్లు లేవు. ఇప్పుడు వర్షాభావానికి కరవుకు జరిగిన నష్టానికి పరిహారమన్నట్లుగా అన్నిచోట్ల పచ్చని మొక్కలు వస్తున్నాయి.PKTel 142.1

    ఎలీషా తండ్రి సిరిసంపదలుగల రైతు. దాదాపు దేశమంతా మతభ్రష్టమైన సమయంలో ఎలీషా కుటుంబీకులు బయలు ముందు మోకరించలేదు, నమస్కరించలేదు. అది దేవున్ని ఘనపర్చిన గృహం. సనాతన ఇశ్రాయేలు విశ్వాసాన్ని ఆచరించటం తమ అనుదిన నియమంగా పెట్టుకొని నివసించిన కుటుంబం అది. అలాంటి ఆధ్యాత్మిక పరిసరాల్లో ఎలీషా బాల్యం గడిచింది. ప్రశాంతమైన గ్రామీణ జీవిత వాతావరణంలో, దేవుడు, ప్రకృతి, క్రమశిక్షణతో కూడిన, ప్రయోజనకరమైన పని సమకూర్చిన ఉపదేశం ద్వారా, సామాన్య అలవాట్లను గూర్చి, తల్లిదండ్రులికి దేవునికి విధేయంగా ఉండటాన్ని గూర్చి అతడు పొందిన శిక్షణ ఆనక తాను ఆక్రమించాల్సిఉన్న ఉన్నత హోదాకు అతణ్ని సమర్ధుణ్ని చెయ్యటానికి తోడ్పడింది. .PKTel 142.2

    తన తండ్రి సేవకులతో కలిసి పొలం దున్నుతున్న సమయంలో ప్రవక్త కావటానికి ఎలీషాకు దేవుని పిలుపు వచ్చింది. అతడు తన దగ్గరలో ఉన్న పనిని చేపట్టి నిర్వహించాడు. ప్రజల నడుమ నాయకుడుగా ఉండటానికి సమర్థతలు, పనిచెయ్యటానికి సిద్దంగా ఉండే వ్యక్తిగా సాత్వికం ఎలీషాకున్నాయి. నెమ్మదిపరుడు సాధుస్వభావి అయినా అతడు చురుకుదనం దృఢత్వం గలవాడు. విశ్వాసపాత్రత, విశ్వసనీయత, దేవునిపట్ల ప్రేమ, భయభీతి అతడికున్నాయి. తన దినదిన సామాన్య విధుల నిర్వహణలో కార్య దీక్షను, ఉదాత్త ప్రవర్తనను సాధించాడు. అలా కృపలోను జ్ఞానంలోను నిత్యం పెంపారాడు. గృహ జీవనవిధుల్లో తండ్రితో సహకరిస్తూండగా అతడు దేవునితో సహకరించటం నేర్చుకుంటున్నాడు.PKTel 142.3

    చిన్నచిన్న విషయాల్లో నమ్మకంగా ఉండటం ద్వారా ఎలీషా గురుతర బాధ్యతలకు సిద్ధపడ్తున్నాడు. ఆచరణాత్మక అనుభవం ద్వారా అతడు దినదినం ఉన్నతబాధ్యతల నిర్వహణకు సమర్ధతను సంపాదించుకున్నాడు. పరిచర్య చెయ్యటం నేర్చుకున్నాడు. ఇది నేర్చుకోటంలో ఉపదేశించటం, నాయకత్వం వహించటం నేర్చుకున్నాడు. ఈ పాఠం మనందరికీ ఉపకరిస్తుంది. దేవుడిచ్చే క్రమశిక్షణ ఉద్దేశమేంటో ఎవరూ తెలుసుకోలేరు. అయితే చిన్నచిన్న విషయాల్లో నమ్మకం ఉన్నత బాధ్యతల నిర్వహణ యోగ్యతకు నిదర్శనమని అందరూ తెలుసుకోవచ్చు. జీవితంలోని ప్రతీ చర్య ప్రవర్తనను వెల్లడి చేస్తుంది. స్వల్పవిషయాల్లో, “సిగ్గుపడనక్కరలేని పనివానిగా” నిరూపించుకునే వారిని దేవుడు ఉన్నత బాధ్యతలతో గౌరవిస్తాడు. 2 తిమో 2:15.PKTel 143.1

    చిన్నచిన్న బాధ్యతల్ని ఎలా నిర్వహించినా వర్వాలేదు అని భావించే వ్యక్తి మరింత గౌరవప్రదమైన స్థానానికి అనర్హుణ్నని నిరూపించుకుంటాడు. ఉన్నత విధుల్ని చేపట్టటానికి తాను సమరుణ్నని ఒక వ్యక్తి భావించవచ్చుగాక. కాని దేవుడు పైకి కనిపించే దానికన్నా లోతుగా చూస్తాడు. పరీక్ష పరిశోధన అనంతరం అతణ్ని గురించి ఈ తీర్పు రాయటం జరుగుతుంది, “నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనపడితివి.” అతడి అపనమ్మకం అతడికి వ్యతిరేకంగా ప్రతిస్పందిస్తుంది. మినహాయింపులేని సమర్పణ ద్వారా పొందే కృపను, శక్తిని, ప్రవర్తన బలిమిని అతడు సాధించలేడు.PKTel 143.2

    ఏదో మత సంబంధిత సేవతో తమకు ప్రత్యక్ష సంబంధంలేదు గనుక తమ జీవితాలు ప్రయోజనంలేనివని, దేవుని రాజ్యవ్యాప్తికి తాము ఏమి చెయ్యటంలేదని భావించేవారు అనేకమంది ఉన్నారు. ఏదో గొప్పకార్యం చెయ్యగలిగితే వారు దాన్ని ఎంత ఉత్సాహానందాలతో చేపడతారు! కాగా చిన్న బాధ్యతలు మాత్రమే నిర్వహించవలసినందుకు తాము నిష్క్రియాపరులై ఉండటం సబబేనని భావిస్తారు. సామాన్య అనుదిన విధులు నిర్వహించేటప్పుడు ఒక వ్యక్తి దేవుని ప్రత్యక్ష సేవలో ఉండవచ్చు. అది చెట్లు నరకటం, నేల శుభ్రం చెయ్యటం లేక పొలం దున్నటం కావచ్చు. తన బిడ్డల్ని క్రీస్తు కోసం తర్బీతు చేసే తల్లి ఒక బోధకుడు ప్రసంగ వేదిక నుంచి చేసే సేవ వంటి సేవను దేవునికి చేస్తుంది.PKTel 143.3

    జీవితాన్ని మాధుర్యంతో నింపే చిన్నచిన్న పనులు చుట్టూపడి ఉండగా అద్బుత సేవ చెయ్యటానికి ప్రత్యేక వరాలకోసం ఆశతో ఎదురుచూసేవారు వాటిని గుర్తించరు. అలాంటి వారు ప్రత్యక్షంగా తమ మార్గంలో ఉన్న విధుల్ని నిర్వర్తించటం మంచిది. జయం వరాలమీదకన్నా శక్తిమీద సంసిద్ధత మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. యోగ్యమైన సేవచెయ్యటానికి సామర్థ్యాన్నిచ్చేది గొప్ప వరాల్ని కలిగిఉండటంకాదు గాని దినదిన విధుల్ని మనస్సాక్షి కలిగి ఆచరించటం, తృప్తిపడే స్వభావం కలిగి ఉండటం, ఇతరుల క్షేమాభివృద్ధిపై యధార్ధమైన ఆసక్తి కనపర్చటం. మిక్కిలి సామాన్యుల జీవితంలో ఉతృష్టత కనిపించవచ్చు. నమ్మకంగా నిర్వర్తించే అతిసామాన్య విధులు దేవుని దృష్టికి మిక్కిలి రమ్యంగా కనిపిస్తాయి.PKTel 144.1

    తన వారసుడి కోసం ఏలీయా దేవుని నడుపుదల కింద అన్వేషణ సల్పుతూ ఎలీషా దున్నుతున్న పొలం పక్కనుంచి వెళ్తుండగా సమర్పణ సూచకంగా అతడి భుజాలపై ఏలీయా తన దుప్పటిని వేశాడు. కరవుకాలంలో షాపాతు కుటుంబం ఏలీయా పరిచర్యను గూర్చి తెలుసుకున్నది. ఇప్పుడు ప్రవక్త చేసిన కార్యం భావాన్ని గూర్చి దేవుని ఆత్మ ఎలీషా మనసులో అవగాహన పుట్టించాడు. దేవుడు ఏలీయాకి వారసుడిగా తనను పిలిచాడనటానికి దాన్ని గుర్తుగా ఎలీషా భావించాడు.PKTel 144.2

    “అతడు ఎడ్లను విడిచి ఏలీయా వెంటపరుగెత్తి - నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దుపెట్టుకొని తిరిగివచ్చి నిన్ను వెంబడించెదనని చెప్పి అతనిని సెలవడుగగా” “పోయిరమ్ము నావలన నీకు నిర్బంధములేదు” అని ఏలీయా అన్నాడు. ఇది తిరస్కారంకాదు, విశ్వాసపరీక్ష. ఎలీషా తానే లాభనష్టాల్ని బేరీజు వేసుకుని ఆ పిలుపును అంగీకరించటమో తిరస్కరించటమో నిర్ణయించుకోవాల్సి ఉంది. ఇంటిని దాని సుఖాన్ని కోరుకున్నట్లయితే అక్కడే ఉండిపోవచ్చు. అయితే ఎలీషా ఆ పిలుపులోని అర్ధాన్ని అవగతం చేసుకున్నాడు. అది దేవుని పిలుపని గ్రహించాడు. దాన్ని ఆచరించటానికి సందేహించలేదు. దేవుని దూత అవ్వటానికి కలిగిన ఆ విశేషాధిక్యతను లేదా ఆ దైవ సేవకుడి సహవాసానికి కలిగిన అవకాశాన్ని దక్కించుకోటానికి ఎంతటి ఐహిక లబ్దినైనా పోగొట్టుకోటానికి ఎలీషా సిద్ధంగా ఉన్నాడు. అతడు “కాడియెడ్లను తీసి, వధించి వాటి మాంసమును గొర్తిగల చేత వంటచేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలీయా వెంబడి వెళ్లి అతనికి ఉపచారము చేయు చుండెను.” 1 రాజులు 19:20,21. ప్రవక్త అస్థిర జీవితంలో అతడి సహచరుడుగా ఉండేందుకు ఏమాత్రం సందేహించకుండా తనను అమితంగా ప్రేమించిన తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు.PKTel 144.3

    తన పని ఏంటని లేక తన బాధ్యతలేంటని ఎలీషా ఏలీయాని ప్రశ్నించి ఉంటే అతడు ఇలా సమాధానం ఇచ్చేవాడు: అది దేవునికే తెలుసు. ఆయనే నీకు తెలియజేస్తాడు. నీవు ప్రభువుని అడిగితే ఆయనే నీ ప్రశ్నకు సమాధానం చెబుతాడు. దేవుడు నిన్ను పిలిచాడన్న నిదర్శనం నీకు ఉంటే నీవు నాతో రావచ్చు. వచ్చి దేవుడు నావెనక ఉన్నాడని నీవు వింటున్నది ఆయన స్వరమని నీవు తెలుసుకోవచ్చు. దేవుని ప్రసన్నత సంపాదించటంతో పోలిస్తే లోకంలోని సమస్తం వ్యర్ధపదార్ధమని పరిగణించవచ్చు. ఎలీషాకి వచ్చిన పిలుపువంటిదే క్రీస్తు ఒక యువ అధికారి ప్రశ్నకు ఇచ్చిన సమాధానం. “బోధకుడా, నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెను?” అని అతడు ప్రశ్నించగా “నీవు పరిపూర్ణుడవగుటకు కోరినయెడల, పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము” అని ఆయన సమాధానమిచ్చాడు. మత్త 19:16,21.PKTel 145.1

    దైవసేవకు వచ్చిన పిలుపును ఎలీషా అంగీకరించాడు. తాను విడిచిపెడ్తున్న వినోదాలు సుఖసౌకర్యాలవంక తిరిగి చూడలేదు. కాని ఆ యువ అధికారి రక్షకుని మాటలు విన్నప్పుడు ఆ యౌవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆమాట విని వ్యసనపడి వెళ్లిపోయెను.” 22వ వచనం. ఆ త్యాగం చెయ్యటానికి అతడు సిద్ధంగా లేడు. దేవుని మీద ప్రేమకంటే తన ఆస్తిమీద ప్రేమ ఎక్కువగా ఉంది. క్రీస్తు నిమిత్తం సమస్తాన్ని విడిచిపెట్టటానికి నిరాకరించటం ద్వారా రక్షకుని సేవలో స్థానానికి అర్హుణ్ని కానని అతడు నిరూపించుకున్నాడు.PKTel 145.2

    తమ సర్వస్వాన్నీ సేవా బలిపీఠంపై పెట్టాల్సిందిగా ప్రతీవారికీ పిలుపు వస్తుంది. మనమందరం ఎలీషాలా సేవచెయ్యాలనిగాని లేక మనకున్నదంతా అమ్మివేయ్యాలనిగాని ఆయన కోరటంలేదు. కాని మనం తన సేవకు మన జీవితాల్లో మొదటి స్థానాన్నివ్వాలని, ఆయన సేవవృద్ధికి ఏదో కొంత చేయకుండా దినం గతించిపోనివ్వకూడదని ఆయన మనల్ని కోరుతున్నాడు. అందరూ ఒకేలాంటి సేవ చెయ్యాలని ఆయన కోరటంలేదు. ఒకరు పరదేశంలో పరిచర్య చెయ్యటానికి పిలుపు పొందవచ్చు. ఇంకొకరు సువార్త సేవావ్యాప్తికి ద్రవ్యం ఇవ్వటానికి పిలుపు పొందవచ్చు. దేవుడు ప్రతీవారి కానుకనూ అంగీకరిస్తాడు. జీవితాన్ని జీవితాసక్తులన్నిటిని సమర్పించటం అవసరం. ఈ సమర్పణ చేసేవారు దేవుని పిలుపును వింటారు, ఆచరిస్తారు.PKTel 145.3

    తన కృపలో పాలివారయ్యే వారందరికి తాము ఇతరులికి చెయ్యాల్సిన పనిని ప్రభువు నియమిస్తాడు. వ్యక్తిగతంగా మనం చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుము” అంటూ మన స్థానంలో నిలిచిఉండాలి. ఒక వ్యక్తి సువార్త బోధకుడైనా, వైద్యుడైనా, వ్యాపారి అయినా, వ్యవసాయకుడైనా, వృత్తి పనివాడైనా, యాంత్రిక పనివాడైనా అతడెవరైనా బాధ్యత అతడిదే. ఇతరులకు రక్షణసువార్తను వెల్లడించటం అతడి పని. తాను చేసే ప్రతీపనీ ఈ లక్ష్యసాధనకు ఒక మార్గం.PKTel 145.4

    మొదట్లో ఎలీషా చేయాల్సిఉన్న పని ఏమంతగొప్ప పనికాదు. సామాన్య విధులు అతడి శిక్షణలో భాగంగా ఇంకా కొనసాగాయి. అతడి గురువు ఏలీయా చేతులు కడుగుకునేటప్పుడు అతడు నీళ్ళు పోసేవాడనేవారు. ప్రభువు ఆదేశం మేరకు ఏపనైనా చేయటానికి అతడు సిద్దంగా ఉన్నాడు. ప్రతీ మెట్టువద్ద వినయం, సేవలను గూర్చి పాఠాలు నేర్చుకున్నాడు. ప్రవక్తకు వ్యక్తిగత సహాయకుడుగా చిన్నచిన్న విషయాల్లో నమ్మకస్తుడని నిరూపించుకుంటూ, దినదినం బలపడేందుకు దేవుడు తనకు నియమించిన కర్తవ్య నిర్వహణకు తన్నుతాను సమర్పించుకున్నాడు.PKTel 146.1

    ఏలీయాతో కలిసి పనిచేయటం మొదలు పెట్టిన తర్వాత ఎలీషా జీవితం శోధనలు లేకుండా సాగలేదు. ఎన్నో శ్రమలు కలిగాయి. కాని ప్రతీ అత్యవసర పరిస్థితిలోను అతడు దేవునిమీద ఆధారపడ్డాడు. తాను విడిచి వచ్చిన తల్లిదండ్రుల్ని గృహాన్ని గురించి బెంగపెట్టుకోటానికి శోధనలు కలిగేవి. కాని వాటిని అతడు లెక్కచెయ్యలేదు. నాగటిమిద చెయ్యివేసిన మిదట వెనక్కి చూడకూడదని అతడు నిర్ధారించుకున్నాడు. పరీక్షలు శ్రమల అనంతరం అతడిషాద దేవుడు ఉంచిన నమ్మకాన్ని పోగొట్టుకోలేదు.PKTel 146.2

    సువార్త పరిచర్య అంటే వాక్యం బోధించటమేకాదు. దాని అర్ధం ఏంటంటే ఏలీయా ఎలీషాని తర్బీదుచేసిన రీతిగా యువకుల్ని తర్బీతు చేయటం. యువకుల్ని తమ సామాన్య విధులనుంచి తీసుకుని దేవుని సేవలో బాధ్యతలివ్వటం - ముందు చిన్నచిన్న బాధ్యతలిచ్చి ఆ తర్వాత వారు బలం పొంది అనుభవం గడించేకొద్ది పెద్ద బాధ్యతలు ఇవ్వటం. సువార్త పరిచర్యలో గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తులు ప్రార్ధన చేసే వ్యక్తులు ఉన్నారు. “జీవవాక్యమును గూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో,... మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము.” అని చెప్పగల వ్యక్తులు వారు. 1 యోహా 1:1-3. అనుభవంగల దైవ సేవకులు అనుభవంలేని యువకులైన సేవకుల్ని తమతో ఉంచుకుని సువార్త పరిచర్య చెయ్యించటం ద్వారా వారికి శిక్షణనివ్వాలి. ఇలా ఆ యువ సేవకులు భారం వహించటం నేర్చుకుంటారు.PKTel 146.3

    యువ బోధకుల్ని తర్బీతు చేసేవారు ఘనమైన సేవ చేస్తున్నారు. దేవుడు వారితో సహకరించి పనిచేస్తాడు. ఏ యువకులతో దైవ వాక్యం మాట్లాడ్తుందో, యధార్ధత దైవ భక్తిగల పనివారితో సన్నిహితంగా ఉండి పనిచెయ్యటం అన్న ఆధిక్యత ఏ యువకులికి లభిస్తుందో వారు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలి. వారిని తన సేవకు ఎంపిక చేసుకోటం ద్వారా, ఆ కార్యనిర్వహణకు వారు మరింత సామర్థ్యాన్ని సంపాదించగల స్థానంలో వారిని ఉంచటం ద్వారా దేవుడు వారిని గౌరవిస్తున్నాడు. వారు వినయస్వభావులై, నమ్మకంగాను విధేయంగాను ఉండి త్యాగం చెయ్యటానికి సిద్దంగా ఉండాలి. ఆయన ఆదేశాల్ని అనుసరిస్తూ, ఆయన సేవకుల్ని తమ సలహాదారులుగా ఎన్నుకుని వారు దేవుని క్రమశిక్షణకు తమ్మును తాము సమర్పించుకుంటే, వారు నీతి, ఉన్నత నియామాలు, స్థిరత గల మనుషులుగాను దేవుడు ఉన్నత బాధ్యతలివ్వగల మనుషులుగాను వృద్ధి పొందుతారు.PKTel 146.4

    సువార్త స్వచ్ఛంగా ప్రకటితమయ్యేకొద్దీ మనుషులు నాగళ్లు విడిచిపెట్టి వ్యాపారాలు వర్తకాలు విడిచిపెట్టివచ్చి సమర్థంగా సేవచేయటం అనుభవంగల దైవ సేవకులతో కలిసి పనిచేసి నేర్చుకుంటారు. సమర్థంగా సేవచెయ్యటం నేర్చుకున్నప్పుడు వారు సత్యాన్ని గొప్పశక్తితో ప్రకటిస్తారు. దేవుడు అద్భుతంగా పనిచెయ్యటంవల్ల పర్వతాల్లాంటి కష్టాలు తొలగిపోతాయి. భూనివాసులకు ఎంతో విలువైన దైవ వర్తమానాన్ని జనులు విని అవగాహన చేసుకుంటారు. మనుషులు సత్యాన్ని తెలుసుకుంటారు. సత్యం పురోగమిస్తుంది. లోకమంతా హెచ్చరికను వినేంతవరకూ పురోగమిస్తుంది. అంతట అంతం వస్తుంది.PKTel 147.1

    ఎలీషాకి పిలుపువచ్చిన తర్వాత అనేక సంవత్సరాలు ఏలీయా ఎలీషాలు కలిసి పనిచేశారు. ఎలీషా దినదినం తన పరిచర్యకు కావలసిన సిద్దబాటును పొందుతున్నాడు. గొప్ప పాపాన్ని నిర్మూలించటంలో ఏలీయా దేవునిచేతిలో సాధనమయ్యాడు. అహాబు, అన్యురాలైన యెజెబెలు మద్దత్తుతో జరిగించిన విగ్రహారాధన ఆ జాతిని తప్పుదారి పట్టించగా దాన్ని నిలువరించటం జరిగింది. బయలు ప్రవక్తలు హతులయ్యారు. ఇశ్రాయేలు ప్రజలందరూ తీవ్ర అలజడికి లోనయ్యారు. అనేకులు జీవంగల దేవుని ఆరాధనకు తిరిగి వస్తున్నారు. ఏలీయా వారసుడుగా ఎలీషా జాగరూకతతో, ఓర్పుతో కూడిన ఉపదేశంతో ఇశ్రాయేలుని సురక్షిత మార్గాల్లో నడిపించటానికి ప్రయత్నించాలి. మోషే తర్వాత అంత గొప్ప ప్రవక్త అయిన ఏలీయాతో ఎలీషా సహవాసం తాను త్వరలో ఒంటరిగా చేపట్టనున్న పరిచర్యకు అతణ్ని సిద్ధం చేసింది.PKTel 147.2

    వారు సంయుక్తంగా సేవ చేసిన ఈ సంవత్సరాల్లో మిక్కిలి భయంకర పాపాల్ని కఠినంగా గద్దించటానికి అప్పుడప్పుడు పిలుపు పొందాడు. దుష్ట అహాబు నాబోతు ద్రాక్షతోటను స్వాధీనపర్చుకున్నప్పుడు అతడి నాశనాన్ని అతడి కుటుంబీకుల నాశనాన్ని ప్రవచించిన స్వరం ఏలీయాదే. తన తండ్రి అహాబు మరణం అనంతరం అహజ్యా నిజదేవుణ్నుంచి తొలగిపోయి ఎక్రోను దేవత బయల్హబూబుని పూజించటం మొదలు పెట్టినప్పుడు దాన్ని తీవ్రంగా నిరసిస్తూ వినిపించిన స్వరం ఏలీయాదే.PKTel 147.3

    సమూయేలు స్థాపించిన ప్రవక్తల పాఠశాలలు ఇశ్రాయేలు మత భ్రష్టత కాలంలో క్షీణించిపోయాయి. ఏలీయా ఈ పాఠశాలల్ని పునఃస్థాపించాడు. యువకులు ధర్మశాస్త్రాన్ని అవగాహన చేసుకుని దాన్ని ఘనపర్చటానికి నడిపించే విద్యను నేర్చుకోటానికి ఏర్పాట్లు చేశాడు. గిల్గాలు, బేతేలు యెరికోల్లో ఉన్న పాఠశాలల్ని రికార్డులో పేర్కోటం జరిగింది. ఏలీయా పరలోకానికి అరోహణానికి కొంచెం ముందు ఏలీయా ఎలీషాలు ఈ శిక్షణా కేంద్రాల్ని సందర్శించారు. తాము క్రితంలో వీటిని సందర్శించినప్పుడు ఏలీయా వారికి నేర్పిన పాఠాల్ని ఇప్పుడు అతడు మళ్లీ బోధించాడు. పరలోకమందున్న దేవునిపట్ల తమ విశ్వాస పాత్రతను నమ్మకంగా కొనసాగించాలని అది తమ గొప్ప ఆధిక్యతని వారికి ఉపదేశించాడు. సరళత నిరాడంబరత తమ విద్యలోని ప్రతీ అంశంలోను నిక్షిప్తం కావటం ముఖ్యమని వారి మనసుల్లో నాటింపజెయ్యటానికి ప్రయత్నించాడు. ఈ విధంగా మాత్రమే వారు దేవుని మూసను పొంది ఆయన మార్గాల్లో పని చెయ్యటానికి ముందుకు సాగగలుగుతారు.PKTel 148.1

    ఈ పాఠశాలల ద్వారా జరుగుతున్న సువార్త సేవను చూసినప్పుడు ఏలీయా హృదయానికి అమితానందం కలిగింది. సంస్కరణ కృషి ఇంకా సమాప్తం కాలేదు. కాని దేశమంతటా “అయినను ఇశ్రాయేలువారిలో బయలుకు మోకాళ్లూనక... ఉండు ఏడువేలమంది నాకు ఇంకను మిగిలియుందురు” (1 రాజులు 19:18) అన్న ప్రభువు మాటలోని వాస్తవాన్ని చూడగలిగాడు.PKTel 148.2

    ఎలీషా ఏలీయా ప్రవక్త వెంట ఒక పాఠశాలనుంచి ఒక పాఠశాలను సందర్శిస్తూ వెళ్లినప్పుడు అతడి విశ్వాసం, అతడి తీర్మానం మరోసారి పరీక్షకు గురిఅయ్యాయి. గిల్గాలులోను మళ్లీ బేతేలులోను యెరికోలోను ప్రవక్త ఎలీషాను తిరిగి వెళ్లిపొమ్మని సలహా ఇచ్చాడు. “యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ నుండుము” అన్నాడు. నాగలితో దున్నటం నేర్చుకున్న తొలిదినాల్లో ఎలీషా వైపల్యాలు జరగకుండా చూడటం లేక నిరాశ చెందకుండా ఉండటం నేర్చుకున్నాడు. ఇప్పుడు అతడు ఇంకొక రకమైన సేవలో నాగలిమీద చెయ్యివేశాడు. కనుక తన ఉద్దేశం నుంచి మరలటం జరగదు. సేవలో మరింత నేర్చుకునే అవకాశం ఉన్నంతకాలం అతడు తన గురువుని విడిచి పెట్టటానికి ఇష్టపడలేదు. ఏలీయా ఆరోహణ మవ్వనున్న సంగతి ప్రవక్తల పాఠశాల్లోని అతడి శిష్యులికి ముఖ్యంగా ఎలీషాకు వెల్లడయ్యింది. ఇది ఏలీయాకి తెలియదు. కనుక ఈ ప్రవక్తకు నమ్మకమైన సేవకుడు ఎలీషా అతణ్ని విడిచిపెట్టకుండా కూడా ఉంటున్నాడు. వెనక్కు వెళ్లిపోమంటూ ఆహ్వానించిన ప్రతీసారీ ఎలీషా “యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువను” అని చెప్పాడు.PKTel 148.3

    “వారిద్దరు ప్రయాణమై సాగివెళ్లాలి.... వారిద్దరు యెర్గాను నది దగ్గర నిలిచిరి. అంతట ఏలీయా తన దుప్పటి తీసికొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది ఇవతలకును అవతలకును విడిపోయెను గనుక వారిద్దరు పొడి నేలమీద దాటిపోయిరి. వారు దాటిపోయిన తరువాత ఏలీయా ఎలీషాను చూచి - నేను నీ యొద్దనుండి తీయబడకమునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదువో దానినడుగుమని చెప్పాడు.PKTel 149.1

    ఎలీషా లోక గౌరవాన్ని గాని లోకంలోని గొప్పవారి మధ్య ఉన్నత స్థానాన్ని గాని కోరలేదు. తాను కోరుకున్నది దేవుడు ఏలీయాకి ధారాళంగా ఇచ్చిన దైవాత్మను అధికంగా అనుగ్రహించాల్సిందిగా కోరాడు. దేవుడు తనకు నియమించిన స్థానంలో సమర్థంగా సేవచేయ్యటానికి ఏలీయాపై నిలిచిన ఆత్మ మాత్రమే తనను యోగుణ్ని చేయగలడని అతడికి తెలుసు. కనుక “నీకు కలిగిన ఆత్మలో రెండుపాళ్లు నా మీదికి వచ్చునట్లు దయచేయుము” అన్నాడు.PKTel 149.2

    ఈ మనవికి ప్రతిస్పందిస్తూ ఏలీయా ఇలా అన్నాడు, “నీవు అడిగినది కష్టతరముగా నున్నది, అయితే నీ యొద్దనుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన యెడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని యెడల అది. కాకపోవునని చెప్పెను. వారు ఇంక వెళ్లుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్నిరథమును, అగ్ని గుఱ్ఱములును కనబడి వీరిద్దరిని వేరు చేసెను అప్పుడు ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయెను.” 2 రాజులు 2:1-11. చూడండి.PKTel 149.3

    క్రీస్తు రెండోరాక సమయంలో జీవించిఉండి, మరణం రుచి చూడకుండ “ఒక్క రెప్పపాటున, కడబూర మ్రోగగానే... మార్పుపొందు” భక్తులికి ఏలీయా ఒక ఛాయారూపకం. 1 కొరింథీ. 15:51,52. క్రీస్తు ఇహలోక పరిచర్య దాదాపు సమాప్త మౌతున్న సమయంలో మరణించకుండ అక్షయులుగా మార్పుచెందే భక్తులకు ప్రతినిధిగా రూపాంతర పర్వతం మీద మోషేతో పాటు ఏలియా రక్షకుని పక్క నిలబడటం జరిగింది. మహిమాపూర్ణులైన వీరిలో విమోచన పొందినవారి రాజ్యాన్ని శిష్యులు సూక్ష్మరూపంలో చూశారు. యేసు పరలోక వెలుగును ధరించి ఉండటం వారు చూశారు. ఆయన్ని దేవుని కుమారుడుగా గుర్తిస్తూ “ఒక శబ్దము ఆ మేఘములో నుండి” రావటం వారు విన్నారు. (లూకా 9:35), రెండో రాకడ సమయంలో మృతుల్లోనుంచి లేపబడేవారికి ప్రతినిధిగా నిలిచిన మోషేని వారు చూశారు. అక్కడ ఏలీయా కూడా నిలబడి ఉన్నాడు. లోక చరిత్ర ముగింపు సమయంలో మర్త్యులు అమర్త్యులుగా మార్పుచెంది మరణాన్ని చూడకుండా పరలోకానికి వెళ్లే భక్తుల్ని ఏలీయా సూచిస్తున్నాడు.PKTel 149.4

    అధైర్యం చెంది ఒంటరిగా అరణ్యంలో ఉన్నప్పుడు జీవితం ఇకచాలు నేను మరణించటం మంచిదంటూ ఏలీయా ప్రార్ధించాడు. కాని కృపగల దేవుడు అతడి ప్రార్ధనను అంగీకరించలేదు. ఏలీయా చేయాల్సిఉన్న గొప్ప పరిచర్య ఇంకాఉంది. ఆ పరిచర్య ముగిశాక ఒంటరిగా అధైర్యంతో అతడు మరణించాల్సిలేడు. అతడు సమాధిలోకి దిగాల్సిలేడు. దేవుని దూతలతో దేవుని మహిమలోకి పైకి వెళ్లాల్సి ఉన్నాడు.PKTel 150.1

    “ఎలీషా అది చూచి - నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులును నీవే అని కేకలు వేసెను, అంతలో ఏలీయా అతనికి మరల కనబడక పోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని రెండు తునకలుగా చేసెను. మరియు ఏలీయా దుప్పటి క్రింద పడగా అతడు దాని తీసికొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటిమిద నుండి క్రిందపడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటిమీద కొట్టి - ఏలీయా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి యొడ్డునకు నడిచిపోయెను. యెరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి - ఏలీయా ఆత్మ ఎలీషా మీద నిలిచియున్నదని చెప్పుకొని, అతని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము” చేశారు. 2 రాజులు 2:12-15.PKTel 150.2

    ప్రభువు తాను ఎవరికి వివేకాన్నిస్తాడో వారిని తన సంకల్పం చొప్పున తన సేవనుంచి తొలగించటం అవసరమని చూసినప్పుడు, వారి వారసులు ఆయన సహాయాన్నికోరి ఆయన మార్గాల్లో నడవటానికి సమ్మతంగా ఉంటే ఆయన వారికి సహాయం చేసి వారిని బలోపేతుల్ని చేస్తాడు. అప్పుడు తమ ముందున్న వారికన్నా వారు వివేకవంతులు కావచ్చు. ఎందుచేతనంటే వీరు తమ ముందటి వారి అనుభవం నుంచి లబ్ధిపొందవచ్చు. వారి పొరపాట్ల నుంచి జ్ఞానం పొందవచ్చు.PKTel 150.3

    ఆనాటి నుంచి ఎలీషా ఏలీయా స్థానంలో నిలిచాడు. మిక్కిలి స్వల్ప విషయాల్లో నమ్మకంగా ఉన్న అతడు గొప్ప విషయాల్లో నమ్మకంగా ఉన్నట్లు నిరూపించుకోవలసి ఉంది.PKTel 150.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents