Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ప్రవక్తలు - రాజులు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    47 - యెహోషువ, దేవదూత

    ఆలయ నిర్మాణకులు సాధిస్తున్న పురోగతి దుష్టశక్తుల్ని తీవ్రంగా ఆందోళన పర్చింది. తమ ప్రవర్తన లోపాల్ని తమ ముందుంచటంద్వారా దైవప్రజల్ని మరింత బలహీనపర్చి వారిని కుంగదియ్యటానికి సాతాను శాయశక్తుల కృషిచెయ్యటానికి తీర్మానించుకున్నాడు. అతిక్రమం ఫలితంగా దీర్ఘకాలం శ్రమలనుభవించిన వారిని దేవుని ఆజ్ఞల్ని నిర్లక్ష్యం చెయ్యటానికి మళ్లీ అతడు ప్రేరేపించగలిగితే వారిని మళ్లీ పాపదాస్యంలోకి తీసుకురావచ్చు. PKTel 408.1

    ఇశ్రాయేలీయులు దేవునిగూర్చిన జ్ఞానాన్ని లోకంలో పరిరక్షించేందుకు ఎంపికయ్యారు గనుక వారు సాతాను శత్రుత్వానికి ప్రత్యేకంగా గురి అయ్యారు. వారిని నిర్మూలించటానికి కృతనిశ్చయుడయ్యాడు. వారు విధేయులుగా ఉన్నంతకాలం వారికి ఏ హానీ చెయ్యలేడు. కాబట్టి వారిని పాపంలోకి లాగటానికి తనశక్తిని యుక్తిని వినియోగించాడు. అతడి శోధనలకు లొంగి వారు దైవ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి శత్రువు చేతుల్లో పాపులవ్వటానికి మిగిలిపోయారు.PKTel 408.2

    అయినప్పటికీ వారిని చెరపట్టి బబులోనుకి బందీలుగా కొనిపోవటం జరిగినా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. గద్దింపులు హెచ్చరికలతో తన ప్రవక్తల్ని వారివద్దకు పంపాడు. వారు తమ దోషాల్ని గుర్తించేందుకు వారిని మేల్కొలిపాడు. వారు తమ్మును తాము తగ్గించుకుని యధార్ధ పశ్చాత్తాపంతో తనవద్దకు తిరిగి వచ్చినప్పుడు వారిని ధైర్యపర్చే వర్తమానాల్ని పంపి, తమను చేరనుంచి విమోచిస్తానని, తన ప్రసన్నతను పునరుద్ధరిస్తానని, తమను మరోసారి తమ దేశంలో నెలకొల్పుతానని వారికి ప్రకటించాడు. ఇప్పుడు ఈ పునరుద్ధరణ కృషి ప్రారంభమై ఇశ్రాయేలీయుల శేషం యూదా దేశానికి తిరిగి వచ్చారు గనుక దేవుని సంకల్పాన్ని భంగపర్చటానికి సాతాను పూనుకున్నాడు. ఈ లక్ష్యాన్ని సాధించటానికి అతడిప్పుడు అన్యజాతుల్ని రెచ్చగొట్టి దైవ ప్రజల్ని పూర్తిగా నాశనం చెయ్యటానికి ప్రయత్నిస్తున్నాడు.PKTel 408.3

    ఈ క్లిష్ట పరిస్థితిలో ప్రభువు తన ప్రజల్ని “ఆదరణయైన మధుర వచనములతో) బలోపేతుల్ని చేశాడు. జెకర్యా 1:13. సాతాను పనిని క్రీస్తు పనిని చక్కని ఉదాహరణ ద్వారా చూపించి దైవ ప్రజలపై నిందలు మోపే అపవాదిని జయించటానికి క్రీస్తు శక్తిమంతుడని తెలిపాడు.PKTel 409.1

    “ప్రధాన యాజకుడు యెహోషువ” “మలిన వస్త్రములు ధరించినవాడై” (జెకర్యా. 3:1,3) ప్రభువు దూతముందు నిలబడి, బాధలనుభవిస్తున్న తన ప్రజలకు కృప చూపించాల్సిందిగా దేవునితో విజ్ఞాపన చెయ్యటం ప్రవక్త దర్శనంలో చూశాడు. అతడు దేవుని వాగ్దానాల నెరవేర్పుకోసం విజ్ఞాపన చేస్తుండగా సాతాను అతణ్ని ప్రతిఘటించ టానికి ధైర్యంగా నిలబడ్డాడు. అతడు ఇశ్రాయేలీయుల అతిక్రమాల్ని పేర్కొని వాటిమూలంగా వారిపట్ల దేవుడు సుముఖత చూపకూడదని వాదించాడు. వారు తన బందీలని, వారిని తనకు అప్పజెప్పాలని డిమాండు చేశాడు.PKTel 409.2

    ప్రధాన యాజకుడు సాతాను ఆరోపణల విషయంలో తన్నుతాను కాపాడుకోలేడు, తన ప్రజల్ని కాపాడలేడు. ఇశ్రాయేలీయులు నిర్దోషులని చెప్పలేడు. ప్రజల ప్రతినిధిగా వారి పాపాలకు చిహ్నంగా మలిన వస్త్రాలు ధరించి, వారి పాపాల్ని ఒప్పుకుంటూ, వారి పశ్చాత్తాపాన్ని దీనత్వాన్ని చూపిస్తూ, పాపాన్ని క్షమించే విమోచకుడి కృపమీద ఆధారపడి, దూతముందు నిలబడ్డాడు. విశ్వాసంద్వారా దేవుని వాగ్దానాల నెరవేర్పును కోరుతున్నాడు.PKTel 409.3

    ఆ దూత ఎవరోకాదు, పాపుల రక్షకుడైన క్రీస్తే. “సాతానా, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలోనుండి తీసిన కొరవివలెనే యున్నాడు గదా” అన్నాడా దూత. 2వ వచనం. ఇశ్రాయేలీయులు దీర్ఘకాలం కష్టాల కొలిమిలో బాధపడ్డారు. సాతాను రగిలించిన మంటల్లో తమ పాపాలవల్ల దాదాపు నిర్మూలమయ్యారు. అయితే ఇప్పుడు వారిని బయటికి తీసుకురావటానికి దేవుడు తన చెయ్యి చాపాడు.PKTel 409.4

    యెహోషువ విజ్ఞాపనను అంగీకరించిన దూత “ఇతని మైల బట్టలు తీసివేయుడి” అని ఆజ్ఞాపించాడు. యెహోషువతో దూత ఇలా అన్నాడు, “నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను.” “వారు అతని తలమీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి.” 4, 5 వచనాలు. అతడి పాపాలు అతడి ప్రజల పాపాలు క్షమించబడ్డాయి. ఇశ్రాయేలీయుల్ని ప్రశస్తమైన వస్త్రములతో” అలంకరించాడు. వారికి ఆపాదించబడ్డ క్రీస్తు నీతి అది. యెహోషువ తలమీద పెట్టిన పాగా యాజకులు ధరించేపాగా వంటిది. దానిమీద “యెహోవాకు ప్రతిష్ఠితము” (నిర్గమ. 28:36) అన్నమాటలు ఉన్నాయి. తాను గతంలో అతిక్రమాలు చేసినా అతడిప్పుడు దేవుని మందిరంలో దేవుని ముందు పరిచర్య చెయ్యటానికి అర్హత గలవాడని ఇది సూచిస్తున్నది.PKTel 409.5

    దూత ఇప్పుడు యెహోషువతో ఇలా అన్నాడు : “సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా - నా మార్గములలో నడుచుచు నేను నీకప్పగించిన దానిని భద్రముగా గైకొనినయెడల, నీవు నా మందిరముమీద అధికారివై, నా ఆవరణములను కాపాడు వాడగుదువు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును.” జెకర్యా. 3:7. విధేయుడై నివసిస్తే అతడు ఆలయంమీద ఆలయ సేవల విషయంలో తీర్పరిగా లేక పాలకుడుగా ఉంటాడు. ఈ జీవితంలో సయితం అతడు దేవదూతల సాహచర్యంలో నడుస్తాడు. చివరగా అతడు దేవుని సింహాసనం చుట్టూ ఉండే మహిమాన్విత భక్తజన సమూహంలో ఉంటాడు.PKTel 410.1

    “ప్రధాన యాజకుడైన యెహోషువ నీయెదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు; నీవును వారును నా మాట ఆలకింపవలెను, ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోవుచున్నాను.” 8వ వచనం. రానున్న విమోచకుడైన చిగురులోనే ఇశ్రాయేలీయులకు నిరీక్షణ ఉంది. రానున్న రక్షకుడిపై విశ్వాసం ద్వారానే యెహోషువ అతడి ప్రజలు పాపక్షమాపణ పొందారు. క్రీస్తుపై విశ్వాసంద్వారా వారు దేవుని సుముఖతను తిరిగి పొందారు. వారు ఆయన మార్గాల్లో నడిచి ఆయన కట్టడల్ని ఆచరించినట్లయితే, ఆయన బలిమివల్ల వారు ప్రజలకు విస్మయం కలిగించే వ్యక్తులుగా ఉంటారు. వారు దేవుడు ఎంపికచేసుకున్న వారుగా లేక ప్రజల గౌరవ మన్ననల్ని అందుకుంటారు.PKTel 410.2

    సాతాను యెహోషువ మీద అతడి ప్రజలమీద నేరాలు మోపినట్లే అన్ని యుగాల్లోను దేవుని కృపను ప్రసన్నతను ఆకాంక్షించే వారిపైనా నేరాలు మోపుతాడు. “రాత్రింబగళ్లు మన దేవుని యెదుట మన సహోదరులమీద నేరములు మోపువాడైన అపవాది” అతడు. ప్రక. 12:10. దుష్టశక్తినుంచి విడుదల పొందిన ప్రతీ ఆత్మమీద గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరిపేరు దాఖలయ్యిందో ఆ ఆత్మపై సంఘరణ పునరావృత మౌతుంది. శత్రువు నుంచి తీవ్ర ప్రతిఘటన లేకుండా దేవుని కుటుంబంలోకి ఒక్క ఆత్మను సయితం అంగీకరించటం జరగదు. కాగా అప్పుడు ఇశ్రాయేలుకి నిరీక్షణ, కాపుదల, నీతి, విమోచన ఎవరో నేడూ సంఘానికి నిరీక్షణ ఆయనే. PKTel 410.3

    దేవున్ని వెదకే వారిపై సాతాను ఆరోపణలు వారి పాపాల నిమిత్తం కలిగిన ఆగ్రహం వల్ల కాదు. వారి ప్రవర్తనలో లోపాలు అతడికి ఆనందం కలిగిస్తాయి. ఎందుకంటే వారు దైవ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించటంవల్లనే అతడికి వారిపైPKTel 410.4

    అధికారం లభిస్తుంది. అతడి నేరారోపణలన్నీ అతడికి క్రీస్తుపట్ల వ్యతిరేకతనుంచి పుట్టుకొస్తున్నాయి. రక్షణ ప్రణాళిక ద్వారా యేసు మానవులపై సాతాను పట్టును తొలగించి అతడి శక్తినుంచి ఆత్మల్ని రక్షిస్తున్నాడు. క్రీస్తు ఆధిక్యాన్ని చూసినప్పుడు ఆ ఆది తిరుగుబాటుదారుడి ద్వేషం దుర్బుద్ధి పెచ్చు పెరుగుతాయి. అందుకే రక్షణను అంగీకరించిన మనుషుల్ని ఆయననుంచి లాగుకోటానికి దురావేశంతో వంచనతో పనిచేస్తాడు. అతడు మనుషుల్ని సంశయాలతోనింపి, దేవునిపై నమ్మకాన్ని పోగొట్టి, వారిని దేవుని ప్రేమకు దూరం చేస్తాడు. ధర్మశాస్త్రాన్ని అతిక్రమించటానికి వారిని శోధించి, ఆ తర్వాత వారు తన బందీలని చెప్పి, వారిని తన వద్దనుంచి తీసుకోటానికి క్రీస్తుకి హక్కులేదని వాదిస్తాడు.PKTel 411.1

    దేవుని క్షమాపణ కోరేవారు, ఆయన కృపను యాచించేవారు వాటిని పొందుతారని సాతానుకి తెలుసు. కనుక వారిని నిర్వేదానికి గురి చెయ్యటానికి వారి పాపాల్ని వారి ముందుకి తెస్తాడు. దేవునికి విధేయులై నివసించగోరే వారిపై ఫిర్యాదులు చెయ్యటానికి అతడు ప్రతినిత్యం అవకాశంకోసం కనిపెడ్తాడు. వారి అత్యుత్తమమైన, సర్వసమ్మతమైన సేవను సయితం భ్రష్టసేవగా చిత్రీకరిస్తాడు. అతి మోసపూరితమైన, అతి క్రూరమైన అనేక సాధనాలద్వారా వారికి శిక్ష పడటానికి ప్రయత్నిస్తాడు.PKTel 411.2

    మానవుడు తన సొంత శక్తితో అపవాది ఆరోపణల్ని ఎదుర్కోలేడు. పాపపు మరకలుగల వస్త్రాలతో, తన పాపాన్ని ఒప్పుకుంటూ అతడు దేవునిముందు నిలబడ్డాడు. అయితే పశ్చాత్తాపంద్వారా విశ్వాసమూలంగా తమ ఆత్మల్ని ఆయనకు సమర్పించుకునే వారి పక్షంగా మన ఉత్తరవాది అయిన యేసు బలంగా విజ్ఞాపన సల్పుతాడు. వారి కేసును ఆయన వాదిస్తాడు. బలమైన కల్వరి వాదనలతో ప్రత్యర్థి నేరారోపణను రద్దు చేస్తాడు. దైవ ధర్మశాస్త్రానికి ఆయన పరిపూర్ణ విధేయత ఆయనకు పరలోకంలోను భూమిమీదను సర్వోన్నత శక్తినిచ్చింది. తండ్రినుంచి కృపను, పాప మానవుడితో సమాధానాన్ని ఆయన కోరుతున్నాడు. తన ప్రజలపై నేరారోపణ చేసే అపవాదితో ఆయన ఇలా అంటున్నాడు, “సాతానా, ప్రభువు నిన్ను గద్దిస్తున్నాడు. వీరు నా రక్తంతో కొన్నవారు, మంటలోనుంచి తీసిన కొరవులు.” విశ్వాసంద్వారా తనపై ఆధారపడిన వారికి ఆయన ఈ భరోసా ఇస్తున్నాడు, “నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను.” జెకర్యా. 3:4.PKTel 411.3

    క్రీస్తు నీతి వస్త్రాన్ని ధరించినవారందరు ఎన్నుకొన్నవారు, నమ్మకమైనవారు, నిజమైన వారిగా ఆయన ముందు నిలబడతారు. రక్షకుని చేతిలోనుంచి వారిని లాక్కోటానికి సాతానుకి శక్తిలేదు. పశ్చాత్తాపపడి, విశ్వసిస్తూ తన పరిరక్షణను కోరే ఒక్క ఆత్మను కూడా శత్రువు ఆధీనంలోకి వెళ్లటానికి క్రీస్తు సమ్మతించడు. ఆయన మాట ఇచ్చాడు : “ఈలాగు జరుగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను, నాతో సమాధానపడవలెను. వారు నాతో సమాధానపడవలెను.” యెష. 27:5. యెహోషువకు దేవుడిచ్చిన వాగ్దానం అందరికీ ఉద్దేశించింది : “నా మార్గములలో నడుచుచు నేను నీకప్పగించిన దానిని గైకొనినయెడల.... నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును.” జెకర్యా. 3:7. వారికి కుడి ఎడమల దేవదూతలు నడుస్తారు. చివరికి వారు దేవుని సింహాసనంచుట్టూ నిలిచే దేవదూతల సమూహంలో ఉంటారు.PKTel 411.4

    యెహోషువను దేవదూతను గూర్చి జెకర్యాకు కలిగిన దర్శనం ప్రాయశ్చిత్తార్థ దినం నాటి ముగింపు సన్నివేశాల్లోని దైవప్రజల అనుభవానికి వర్తిస్తుంది. శేషించిన సంఘానికి గొప్ప శ్రమ, దుఃఖం కలుగుతుంది. దేవుని ఆజ్ఞల్ని యేసును గూర్చిన విశ్వాసాన్ని కాపాడే ప్రజలు ఘటసర్పం దాని సైన్యాల ఆగ్రహానికి గురి అవుతారు. లోక ప్రజల్ని తన పాలిత ప్రజలుగా సాతాను లెక్కించు కుంటాడు. క్రైస్తవులమని చెప్పుకునే వారిపై సయితం అతడు అదుపు సాధిస్తాడు. కాని తన సర్వాధికారాన్ని ప్రతిఘటించే చిన్న సమూహమొకటి ఉంటుంది. వారిని లోకంలోనుంచి పూర్తిగా తుడిచి వేయగలిగితే అతడి విజయం తిరుగులేనిదవుతుంది. ఇశ్రాయేలును నాశనం చెయ్యటానికి అన్యజాతుల్ని ప్రభావితం చేసినట్లు సమీప భావిలో దేవుని ప్రజల్ని నిర్మూలించటానికి అతడు దుష్ట ప్రభుత్వాల్ని రెచ్చగొడ్డాడు. దైవ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించి మానవ చట్టాల్ని ఆచరించటానికి మనుషుల్ని ఒత్తిడి చెయ్యటం జరుగుతుంది.PKTel 412.1

    నిజమైన దేవునికి నమ్మకంగా ఉన్నవారిని బాధలకు గురి చేసి, తప్పుపట్టి, వెలివేయటం జరుగుతుంది. వారు “తల్లిదండ్రుల చేతను సహోదరులచేతను బంధువుల చేతను స్నేహితుల చేతను... అప్పగింపబడుదురు” - మరణించటానికి సయితం. లూకా 21:16. దేవుని కృపే వారి ఏకైక నిరీక్షణ. ప్రార్థనే వారి ఏకైక భద్రత. దేవదూత ముందు యెహోషువ విజ్ఞాపన చేసినట్లు శేషించిన సంఘం తమ ఉత్తరవాది అయిన యేసుద్వారా క్షమాపణ కోసం విమోచనకోసం విరిగి నలిగిన హృదయంతోను అచంచల విశ్వాసంతోను విజ్ఞాపన చేస్తుంది. తమ పాప జీవితాల గురించి వారికి పూర్తిగా తెలుసు. తమ బలహీనతలు అయోగ్యత వారికి తెలుసు. వారు నిరుత్సాహంతో కుంగి పోవటానికి సిద్ధంగా ఉన్నారు.PKTel 412.2

    యెహోషువను ప్రతిఘటించటానికి నిలబడి ఉన్నట్లు వారిపై నేరారోపణలు చెయ్యటానికి శోధకుడు నిలిచిఉంటాడు. తమ బలహీనతల్ని, పొరపాట్లని, కృతఘ్నతాపరాధాల్ని, క్రీస్తుతో తమకు ఏమి పోలికలేక పోవటాన్ని వారి ముందుంచుతాడు. తమ రక్షకుడ్ని అగౌరవ పర్చింది ఈ వర్తనే అని. తమ పరిస్థితి ఘోరమైందని, తమ అపవిత్రత మరక ఎన్నటికి పోదని చెప్పి వారిని భయ పెడ్తాడు. తన శోధనలకు లొంగిదేవునికి అపనమ్మకంగా తయారయ్యేందుకు వారి విశ్వాసాన్ని నాశనం చెయ్యటానికి ప్రయత్నిస్తాడు.PKTel 412.3

    తాను శోధించగా దేవుని ప్రజలు చేసిన పాపాలు సాతానుకి ఖచ్చితంగా తెలుసు. కనుక వారిపై అతడు ఆరోపణలు చేసి వారు తమ పాపాల వలన దేవుని పరిరక్షణార్హతను పోగొట్టుకున్నారని, అందువలన వారు తనకు చెందినవారని వాదిస్తాడు. దేవుని కృపకు తానెంత అపాత్రుడనో వారూ అంతే అపాత్రులని వాదిస్తాడు. అతడు “పరలోకంలో నా స్థానాన్ని, నాతో ఏకమైన దూతల స్థానాన్ని ఆక్రమించే ప్రజలు వీరా? దైవ ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నట్లు చెప్పుకుంటారు గాని దాని సూత్రాల్ని అనుసరిస్తున్నారా? దేవుని సేవకన్నా తమ ఆసక్తులే ముఖ్యంకావా? వారు లోకంలో ఉన్నవాటిని ప్రేమించటం లేదా? వారు చేసిన, చేస్తున్న పాపాలు చూడండి! వారి స్వార్థాశ, వారి కుబుద్ది, వారి పరస్పర విద్వేషం చూడండి! దేవుడు నన్ను నా దూతల్ని పరలోకంనుంచి తరిమివేసి అవే పాపాలికి పాల్పడినవారికి నజరానాలిచ్చి పరలోకంలో చేర్చుకుంటాడా? ప్రభువా, నీవు ఇది చెయ్యటం సబబుకాదు. వారికి శిక్ష విధించటమే న్యాయం” అని నిలదీస్తాడు.PKTel 413.1

    అయితే క్రీస్తు అనుచరులు, పాపం చేస్తున్నవారు సాతాను సంబంధమైన శక్తుల్ని తమని అదుపు చెయ్యనియ్యటంలేదు. తమ పాపాల నిమిత్తం వారు పశ్చాత్తాపపడి దీన మనసుతో విరిగి నలిగిన హృదయంతో ప్రభువుని వెదుకుతారు. పరలోక ఉత్తరవాది వారిపక్షంగా విజ్ఞాపన సల్పుతాడు. వారి కృతఘ్నతవల్ల ఎన్నో అన్యాయాలు శ్రమలు భరించిన ఆయన, వారి పాపాలు వారి పశ్చాత్తాపం ఎరిగిన ఆయన ఇలా అంటున్నాడు: “సాతానా, ప్రభువు నిన్ను గద్దిస్తున్నాడు. ఈ ఆత్మలకోసం నేను నా ప్రాణమిచ్చాను. వారిని నా అరచేతిలో చెక్కుకున్నాను. వారిలో ప్రవర్తన లోపాలుండవచ్చు. తమ ప్రయత్నాల్లో వారు విఫలులై ఉండవచ్చు. కాని వారు పశ్చాత్తాపపడ్డారు. నేను క్షమించి వారిని అంగీకరిస్తున్నాను.”PKTel 413.2

    సాతాను దాడులు బలమైనవి. అతడి మోసాలు కపటమైనవి. కాని ప్రభువు దృష్టి తన ప్రజలమీద నిలిచిఉంది. వారి శ్రమలు అమితం. కొలిమి మంటలు వారిని కబళించటానికి సిద్దంగా ఉన్నాయి. కాని అగ్నిలో పుటంవేసిన బంగారంలా వాళ్లని యేసు బయటికి తీసుకువస్తాడు. క్రీస్తు రూపం వారిలో సంపూర్ణంగా ప్రత్యక్షమయ్యేందుకు వారి ఐహికతను తొలగించివేస్తాడు.PKTel 413.3

    సంఘం ఎదుర్కొనే ప్రమాదాల్ని, సంఘానికి దాని శత్రువులు చేసే హానిని ప్రభువు కొన్నిసార్లు మర్చిపోయినట్లు కనిపించవచ్చు. కాని దేవుడు మర్చిపోడు. ఈ లోకంలో తన సంఘమంత ప్రియమైంది దేవునికి ఇంకొకటిలేదు. ప్రాపంచిక విధానం తన సంఘ జీవితాన్ని దుర్నీతిమయం చెయ్యటం దేవుని చిత్తంకాదు. సాతాను శోధనలు తన ప్రజలపై విజయం సాధించటానికి ఆయన వారిని విడిచిపెట్టడు. ఆయన్ని గురించి తప్పుడు ప్రచారం చేసేవారిని ఆయన శిక్షిస్తాడు. కాని యధార్థంగా పశ్చాత్తాపపడే వారికి ఆయన కరుణ చూపిస్తాడు. క్రైస్తవ ప్రవర్తనను బలోపేతం చేసుకోటానికి వృద్ధి పర్చుకోటానికి ప్రయత్నించేవారికి అవసరమైన సహాయమంతా అందిస్తాడు. ”PKTel 414.1

    అంత్యకాలంలో చోటుచేసుకునే హేయకార్యాలు చూసి దైవ ప్రజలు ప్రలాపిస్తారు. దైవధర్మశాస్త్రాన్ని కాలరాయటం ప్రమాదకరమంటూ దుష్టుల్ని కన్నీటితో హెచ్చరిస్తారు. వారు అమిత సంతాపంతో పశ్చాత్తాపంతో దేవునిముందు దీనులై ప్రార్థిస్తారు. దుర్మార్గులు వారి సంతాపాన్ని ఎగతాళి చేస్తారు. వారి విజ్ఞాపనని గేలిచేస్తారు. కాని పాపపర్యవసానంగా తాము పోగొట్టుకున్న శక్తిని సచ్ఛీలతను తిరిగి సంపాదించుకుంటున్నారనటానికి దేవుని ప్రజల ఆవేదన, వినమ్రత తిరుగులేని నిదర్శనం; వారు క్రీస్తుకు సమీపమవుతున్నారు గనుక, వారి దృష్టి ఆయన పరిపూర్ణ పరిశుద్ధతపై కేంద్రీకృతమయ్యింది గనుక, పాపం ఎంత నీచమయ్యిందో వారు స్పష్టంగా చూడగలుగుతారు. విజయానికి షరతులు సాత్వికం, దీనత్వం. సిలువ పాదం వద్ద ప్రణమిల్లే వారికోసం మహిమ కిరీటం వేచిఉంది.PKTel 414.2

    నమ్మకంగా ఉండి ప్రార్థించే దైవజనులు ఆయనతోనే ఏకాంతంగా నిలిచిపోయినట్లుంటుంది. తాము ఎంత భద్రంగా కాపాడబడుతున్నారో వారికే తెలియదు. సాతాను ప్రోద్బలంతో వారిని నిర్మూలం చెయ్యటానికి ఈ లోక పాలకులు ప్రయత్నం చేస్తున్నారు. కాగా దోతానులో ఎలీషా సేవకుడిలా దేవుని బిడ్డల కళ్లు తెరవబడినట్లుయితే, తమచుట్టూ దేవుని దూతలు ఉండటం, వారు అంధకార సైన్య సమూహాన్ని అదుపు చెయ్యటం చూస్తారు.PKTel 414.3

    దైవప్రజలు విరిగినలిగిన ఆత్మలతో హృదయశుద్ధికోసం ప్రభువుముందు విజ్ఞాపన చెయ్యగా వారి “మైల బట్టలు తీసివేయుడని” ఆజ్ఞ ఇవ్వటం, “నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను” అన్న ఉత్సాహపూరితమైన మాటలు పలకటం జరిగింది. జెకర్యా. 3:4. తీవ్ర శ్రమలననుభవించి, శోధనలు ఎదుర్కొని, నమ్మకంగా నిలిచిన దేవుని బిడ్డలకు నిష్కళంకమైన క్రీస్తు నీతివస్త్రాన్ని ఆయన ధరింపజేస్తాడు. తృణీకరించబడ్డ శేషించిన ప్రజలు మహిమకరమైన వస్త్రాలు ధరిస్తారు. లోక సంబంధమైన చెడుగు వారిని అపవిత్ర పర్చలేదు. గొర్రెపిల్ల జీవగ్రంథంలో యుగయుగాల నీతిమంతుల పేళ్ల నడుమ వారి పేర్లు ఉంటాయి. వారు సాతాను మోసాల్ని ప్రతిఘటించేవారు. ఘటసర్పం గర్జనకు భయపడి తమ విశ్వాసం విడిచిపెట్టి వెనుదిరగనివారు. ఇప్పుడు వారు శోధకుడి మోసాల్లో పడకుండా నిత్యం భద్రంగా ఉంటారు. వారి పాపాలు పాపానికి కర్త అయిన సాతానుకు మార్పిడి అవుతాయి. వారి తలమీద “తెల్లని పాగా” పెట్టటం జరుగుతుంది.PKTel 414.4

    సాతాను తన ఆరోపణల్ని పేర్కొంటుండగా, అదృశ్యులైన పరిశుద్ధ దూతలు అటూ ఇటూ తిరుగుతూ నమ్మకస్తులైన ఆ భక్తులపై దేవుని ముద్రను వేస్తారు. తమ నొసళ్లపై తండ్రి పేరు ధరించి, సీయోను పర్వతంమీద గొర్రెపిల్లతో నిలబడేవారు వీరే. వారు సింహాసనంముందు కొత్త పాట పాడారు. లోకంలోనుంచి విమోచించబడ్డ నూట నలభై నాలుగు వేలమంది తప్ప మరెవరూ ఆ పాటను నేర్చుకోలేరు. “వీరు స్త్రీ సాంగత్యము ఎరుగనివారునైయుండి, గొఱ్ఱపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు; వీరు దేవుని కొరకును గొఱ్ఱపిల్ల కొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలోనుండి కొనబడినవారు. వీరినోట ఏ అబద్దమును కనబడలేదు; వీరు అనింద్యులు.” ప్రక. 14:4,5PKTel 415.1

    దూత పలికిన ఈ మాటల పరిపూర్ణ నెరవేర్పు ఇప్పుడు జరుగుతుంది : “ప్రధాన యాజకుడైన యెహోషువా, నీ యెదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోవుచున్నాను.” జెకర్యా. 3:8. క్రీస్తు తన ప్రజల రక్షకుడుగా విమోచకుడుగా వెల్లడవుతాడు. ఇప్పుడు వారి యాత్ర కాలంలోని కన్నీరు పరాభవం పోయి దేవుని సముఖంలోను గొర్రెపిల్ల సముఖంలోను ఆనందం ఘనత వారికి కలుగగా శేషించిన ప్రజలు వాస్తవంగా “సూచనలుగా ఉన్నారు.” “ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును. ఇశ్రాయేలులో తప్పించుకొనినవారికి భూమిపంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. సీయోనులో శేషించిన వారికి యెరూషలేములో నిలువబడినవారికి అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్దుడని పేరుపెట్టబడును.” యెష 4:2,3.PKTel 415.2