Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ప్రవక్తలు - రాజులు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    55 - అన్యజనుల కుట్రలు

    సన్బల్లటు అతడి తోటికుట్రదారులు యూదులతో బహిరంగంగా యూద్దానికి దిగటానికి సాహసించలేదు. కాని వారిని నిరుత్సాహపర్చటానికి తికమక పెట్టటానికి, గాయ పర్చటానికి తమ రహస్య ప్రయత్నాల్ని కసిగా కొనసాగించారు. యెరూషలేము చుట్టూ నిర్మాణమౌతున్న గోడ వేగంగా పూర్తి అవుతున్నది. అది పూర్తి అయి దానికి గుమ్మాలు అమర్చబడితే ఇశ్రాయేలికి శత్రువులైన వీరు ఆ పట్టణంలోకి బలవంతంగా ప్రవేశించలేరు. కనుక ఆ పనిని వెంటనే ఆపటానికి ఆత్రంగా ఉన్నారు. నెహెమ్యాను తానున్న స్థలంనుంచి రప్పించటానికి చివరికి ఓ పథకం వేశారు. అతడు తమకు చిక్కిన తర్వాత అతణ్ని మట్టుపెట్టటమో ఖైదులో బంధించటమో చెయ్యాలని భావించారు.PKTel 459.1

    అతడితో రాజీ కోరుతున్నట్లు నటిస్తూ తమతో నెహెమ్యా సమావేశాన్ని కోరారు. ఓనో మైదానంలో ఉన్న ఓ గ్రామంలో సమావేశానికి ఆహ్వానించారు. అయితే వారి దురుద్దేశం గురించి పరిశుద్దాత్మ హెచ్చరిక పొందిన నెహెమ్యా ఆ ఆహ్వానాన్ని తిరస్కరించాడు. అతడిలా రాస్తున్నాడు, “నేను చేయుపని గొప్పది, దాని విడిచి మియొద్దకు వచ్చుటకై నేను దానినెందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని.” శోధకులు తమపట్టు విడువలేదు. అలాంటి వర్తమనాన్నే నాలుగుసార్లు పంపారు. ప్రతీసారీ నెహెమ్యా అదే సమాధానాన్ని పంపాడు. PKTel 459.2

    ఈ పథకం విజయవంతం కాకపోటంతో వారు మరింత సాహసవంతమైన పథకం పన్నారు. సన్బల్లటు నెహెమ్యాకు ఓ బహిరంగ ఉత్తరం రాసి ఓ దూతతో పంపాడు. అందులో : “వారిపైన రాజుగా ఉండవలెనని నీవు ప్రాకారమును కట్టించు చున్నావనియు, ఈ హేతువుచేతనే నీవును యూదులును రాజుమీద తిరుగుబాటు చేయునట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివనియు మొదలగు మాటలును - రాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలును - అందునిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసెదము రండనియు ఈ సంగతులు అన్యజనుల వదంతియనియు దానిని గెషెము చెప్పుచున్నాడనియు వ్రాయబడెను.”PKTel 459.3

    ఇక్కడ ప్రస్తావించిన వదంతి నిజంగా ప్రచారమై ఉంటే, భయపడటానికి హేతువు ఉండేది. ఎందుకంటే అది త్వరగా రాజు దృష్టికి వెళ్లేది. రాజుకి చిన్న అనుమానం వచ్చినా అతడు కఠిన చర్య తీసుకోటానికి అది కారణమయ్యేది. ఆ ఉత్తరం పూర్తిగా అబద్దమని, తనకు భయం పుట్టించి తనను వలలోకి లాగటానికి రాసిందని నెహెమ్యాకు తెలుసు. ప్రజలు ఆ ఉత్తరం చదివి అందులోని విషయాల్ని తెలుసుకుని భయాందోళనలు చెందాలన్నది వారి ఆలోచనని దాన్ని తెరిచి బహిరంగంగా పంపంటంలోనే అర్థమైతున్నది.PKTel 460.1

    నెహెమ్యా వెంటనే ఈ జవాబు పంపాడు, “ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారముకాము, వీటిని నీ మనస్సులో నుండి నీవు కల్పించుకొంటివి.” సాతాను తంత్రాలు నెహెమ్యాకు తెలియనివికావు. పనివారిని బలహీనపర్చి వారి కార్యాన్ని భంగపర్చటానికే ఈ ప్రయత్నాలు జరుగుతున్నవని అతడికి తెలుసు.PKTel 460.2

    సాతాను పదేపదే ఓడిపోయాడు. ఇప్పుడు మరింత ద్వేషంతో కపటంతో దైవ సేవకుణ్ని మట్టు పెట్టటానికి ఇంకా ప్రమాదకరమైన ఉచ్చుపన్నాడు. సన్బల్లటు అతడి అనుచర్లు దేవుని వర్తమానమని చెప్పి నెహెమ్యాకు తప్పుడు సలహా ఇవ్వటానికి నెహెమ్యా మిత్రుల్ని నియమించారు. ఈ దుష్కార్యానికి నియమితుడైన వ్యక్తి క్రితంలో నెహెమ్యా అభిమానించిన మయా. ఇతడు అపాయంలో ఉన్నట్లు ప్రాణభయంతో దేవాలయం సమీపంలో ఓ గదిలో తలుపులు వేసుకుని ఉన్నాడు. ఈ సమయంలో దేవాలయం చుట్టూ ప్రాకారం గుమ్మాలు ఉన్నాయి. పట్టణం మంచి భద్రత కలిగి ఉంది. కాని పట్టణ ద్వారాలు ఇంకా నిర్మితం కాలేదు. నెహెమ్యా క్షేమం నిమిత్తం ఆందోళన చెందుతున్నట్లు నటిస్తూ షెమయా అతణ్ని దేవాలయంలో తలదాచుకోవలసిందిగా సలహా చెప్పాడు. అతడు ఇలా ప్రతిపాదించాడు, “రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక, దేవుని మందిర గర్భాలయము లోపలికి మనము పోయి తలుపులు వేసికొనెదము రండి.” PKTel 460.3

    నెహెమ్యా మోసపూరితమైన ఈ సలహాను పాటించిఉంటే, అతడు దేవునిపై తనకున్న విశ్వాసాన్ని త్యాగం చేసేవాడు; ప్రజల దృష్టిలో అతడు పిరికివాడుగా, ఏమి విలువలేని వ్యక్తిగా మిగిలేవాడు. తాను చేపట్టిన కార్యం ప్రాముఖ్యం దృష్ట్యా దేవుని శక్తిపై తనకు ప్రగాఢ నమ్మకమున్నదని చెబుతున్నందువల్ల, భయంతో దాకొని ఉండటం పూర్తిగా అసంబద్దంగా అర్థరహితంగా ఉండేది. ఆ భయం ప్రజల్లోకి పాకేది. ప్రతీ వ్యక్తీ తనమట్టుకు తాను ఆ పంథాలో క్షేమాన్ని అన్వేషించేవాడు. అప్పుడు పట్టణం సంరక్షణ లేకుండా ఉండేది. శత్రువులు దాన్ని సునాయాసంగా వశపర్చుకునేవారు. బుద్ధిహీనమైన ఆ ఒక్కక్రియ నెహెమ్యా జరిగించిఉంటే, అప్పటి వరకు సాధించినదంతా వ్యర్ధమైపోయేది.PKTel 460.4

    తన సలహాదారు యదార్ధ ప్రవర్తనను ఉద్దేశాన్ని గ్రహించటానికి నెహెమ్యాకి ఆట్టే సమయం పట్టలేదు. నెహెమ్యా ఇలా అంటున్నాడు, “దేవుడు అతని పంపలేదనియు, టోబియాయును సన్బల్లటును అతనికి లంచమిచ్చినందున నా విషయమై యీ ప్రకటన చేసెననియు తేటగ కనుగొంటిని. ఇందువలన నాకు భయము పుట్టగా, నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునని అనుకొని, నామీద నింద మోపునట్లుగా నన్నుగూర్చి చెడు వార్త పుట్టించుటకు వారతనికి లంచమిచ్చి యుండిరి.”PKTel 461.1

    షేమయా ఇచ్చిన సలహాకు వంతపాడినవారు ఒకరుకాదు ఎక్కువమందే ఉన్నారు. నెహెమ్యా మిత్రులుగా నటిస్తూ రహస్యంగా అతడి విరోధులతో చేతులు కలిపినవారు ఆ ఘనులు. కాని పాపం వారి పాచిక పారలేదు. నెహెమ్యా సూటిగా ఇచ్చిన సమాధానం ఇది, “నా వంటివాడు పారిపోవచ్చునా? ఇంతటివాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపను.” PKTel 461.2

    శత్రువులు బహిరంగంగాను రహస్యంగాను ఎన్ని కుట్రలు చేసినప్పటికీ ఆలయ నిర్మాణం కొనసాగింది. నెహెమ్యా వచ్చినప్పటినుంచి రెండు మాసాలు గడవక ముందే పట్టణం చుట్టూ ప్రాకారం నిర్మితమైంది. కట్టడం పనివారు గోడలమీద నడిచి పరాజయం పొందిన తమ శత్రువుల వంక చూడగలిగారు. “మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును, మా చుట్టునుండు అన్యజనులందరు జరిగిన పని చూచి నప్పుడును, వారు బహుగా ఆశ్చర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలిసికొనిరి” అంటూ నెహెమ్యా రాస్తున్నాడు.PKTel 461.3

    అయినా దేవుని హస్తం నడిపింపుకు ఈ నిదర్శనం సయితం ఇశ్రాయేలీయుల అసంతృప్తిని, తిరుగుబాటును, నమ్మక ద్రోహాన్ని అదుపు చెయ్యలేక పోయింది. “యూదుల ప్రధానులు టోబియాయొద్దకు మాటిమాటికి పత్రికలు పంపుచు వచ్చిరి. అతడును వారికి పత్రికలు పంపుచుండెను. అతడు అరహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు... గనుక యూదులలో అనేకులు అతని పక్షమున నుండెదమని ప్రమాణము చేసిరి.” విగ్రహారాధకులతో పెళ్లిళ్లు చేసుకోవటంవల్ల కలిగే దుష్పలితాల్ని ఇక్కడ చూడగలుగుతున్నాం. ఓ యూదా కుటుంబం దేవుని శత్రువులతో బంధుత్వం అందుకుంది. ఆ బాంధవ్యం ఓ ఉచ్చుగా పరిణమించింది. ఇంకా ఇతరులు కూడా ఆ మార్గాన్నే అనుసరించారు. ఇశ్రాయేలీయులతో ఐగుప్తు నుంచి వచ్చిన మిశ్రిత జనంలా వీరు నిత్యం సమస్యలు శ్రమలకు కారణమయ్యారు. వారు దైవ సేవలో హృదయ పూర్వకంగా పాలుపంచుకోలేదు. దేవుని సేవలో త్యాగం అవసరమైనప్పుడు తమ సహకారం మద్దతు విషయంలో తాము చేసిన గంభీర ప్రమాణాన్ని అతిక్రమించటానికి సిద్ధపడేవారు.PKTel 461.4

    యూదులికి హాని కలిగించటానికి కుట్రలు పన్నిన ప్రముఖుల్లో కొందరు ఇప్పుడు వారితో స్నేహాన్ని వాంఛిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. విగ్రహారాధక వివాహ బంధాల్లో చిక్కుకుని టోబియాతో విద్రోహక ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ అతడికి సేవ చేస్తామంటూ ప్రమాణం చేసిన యూదా ప్రధానులు ఇప్పుడతడు ప్రజ్ఞాపాటవాలు, దూరదృష్టి గలవాడని, అతడితో స్నేహబంధం యూదులికి శ్రేయస్కరమని వత్తాసు పలుకుతున్నారు. అదే సమయంలో నెహెమ్యా ప్రణాళికల్ని కదలికల్ని అతడికి చేరవేస్తున్నారు. దేవుని ప్రజల పనిపై శత్రువులు దాడి చెయ్యటానికి ఈరకంగా మార్గం ఏర్పడింది. నెహెమ్యా మాటలు కార్యాల్ని అపార్థం చేసుకోటానికి, అతడి పనిని అడ్డుకోటానికి అవకాశం లభించింది.PKTel 462.1

    పేదలు బాధితులు తమకు జరిగిన అన్యాయాలు, అక్రమాల్ని నివారించాల్సిందిగా నెహెమ్యాకు విజ్ఞప్తి చేసినప్పుడు నెహెమ్యా వారికి మద్దతుగా ధైర్యంగా నిలబడి తప్పిదంలో ఉన్నవారు తమ తప్పును సవరించుకుని తమమీద ఉన్న నిందను తొలగించుకునేటట్లు చేశాడు. అయితే అట్టడుగున ఉన్న తన దేశ ప్రజల పక్షంగా తాను వినియోగించిన అధికారం ఇప్పుడు తనకోసం వినియోగించుకోలేదు. అతడి కృషిని కొందరు అభినందించలేదు. వారు కృతఘ్నులు నమ్మకద్రోహులు అయ్యారు. కాని ద్రోహుల్ని తన అధికారం ఉపయోగించి శిక్షించలేదు. ప్రశాంతంగా నిస్వార్థంగా తన ప్రజాసేవను కొనసాగించాడు. అతడు ఈ కృషిని ఉద్రేకంగా కొనసాగించాడు. అతడి ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు.PKTel 462.2

    దేవుని సేవను పురోగమింపజెయ్యటానికి శ్రమపడే వారిపై దాడి చెయ్యటానికి సాతాను నిత్యం కృషి చేస్తుంటాడు. తరచు భంగపడినా అతడు తన దాడుల్ని నూతనోత్సాహంతో కొనసాగిస్తూ ముందు ప్రయోగించని సాధనాల్ని ప్రయోగిస్తాడు. అయితే దేవుని మిత్రులమని ఘంటాకంఠంగా చెప్పుకునేవారి ద్వారా అతడు గోప్యంగా పనిచెయ్యటాన్ని గురించి ఎక్కువ భయపడాల్సి ఉంది. బహిరంగ వ్యతిరేకత భయంకరం క్రూరం కావచ్చు. కాని దేవుని సేవిస్తున్నామని చెప్పుకుంటూ హృదయంలో సాతాన్ని ప్రేమించేవారి రహస్య శతృత్వం కన్నా అది ఎంతో తక్కువ ప్రమాదకరం. దేవుని సేవకు ఆటంకాలు కలిగించటానికి, ఆయన సేవకులికి హాని చెయ్యటానికి తమ జ్ఞానాన్ని వినియోగించేందుకు సమ్మతంగా ఉన్నవారి చేతులికి ప్రతీ సదుపాయాన్ని అందించే శక్తి వీరికుంది.PKTel 462.3

    తన ప్రతినిధులతో దైవ సేవకులు కూటమిగా ఏర్పడటానికి ప్రోత్సహించే ఆ చీకటి శక్తుల అధిపతి ప్రతిపాదించగల ప్రతీ సాధనాన్ని ఉపయోగించటం జరుగుతుంది. తమ విధులనుంచి వారిని బయటికి రప్పించటానికి మాటిమాటికీ విజ్ఞప్తులు చెయ్యటం జరుగుతుంది. కాని నెహెమ్యాలా వారు “నేను చేయుపని గొప్పది దానిని విడిచి... నేను రాలేను” అని కరాఖండిగా సమాధానం ఇవ్వాలి. దైవ సేవకులు తమ పనిని చేసుకుంటూ పోవాలి. శత్రువులు తమకు హాని తల పెట్టి ద్వేషంతో కల్పించే అబద్దాల్ని దైవ సేవకులు తమ పనులద్వారా ఖండించాలి. వారు ఒక్కక్షణంకూడా అజాగ్రత్తగా, ప్రమత్తంగా ఉండకూడదు. ఎందుచేతనంటే శత్రువులు నిరంతరం వారి మార్గంలోనే పొంచిఉంటారు. వారు ఎల్లప్పుడు ప్రార్థిస్తూ “వారి భయముచేత రాత్రింబగళ్లు కావలి” ఉండాలి. నెహెమ్యా. 4:9. PKTel 463.1

    అంత్యకాలం సమీపమయేకొద్దీ సాతాను అత్యధిక శక్తితో తన శోధనల్ని దేవుని సేవకులపై ప్రయోగిస్తాడు. “గోడను నిర్మించే వారిని” ఎగతాళి చెయ్యటానికి దూషించ టానికి మనుషుల్ని నియమిస్తాడు. పనివారు తమ శత్రువుల దాడుల్ని తిప్పికొట్టటానికి కిందికివస్తే వారిపనిలో జాప్యం చోటుచేసుకుంటుంది. వారు తమ శత్రువుల ప్రయత్నాల్ని తిప్పికొట్టటానికి ప్రయత్నించాల్సిందే. కాని అది వారి పనికి ఆటంకం కలిగిస్తుంది. సత్యం అసత్యం కన్నా బలమైంది. న్యాయమే అన్యాయాన్ని ఓడిస్తుంది.PKTel 463.2

    తమ మైత్రిని సానుభూతిని చూరగొని తమ విధి నిర్వహణనుంచి తమను ఆకర్షించటానికి తమ శత్రువులికి వారు తావివ్వకూడదు. తన అజాగ్రత్తవల్ల ఏ వ్యక్తి అయినా దేవుని సేవకు నిందతేస్తే లేక తన సాటి సేవకుల చేతుల్ని బలహీన పర్చితే తొలగించటం సులభంకాని మచ్చను తన ప్రవర్తన పైకి తెచ్చుకుని, భవిష్యత్తులో తన ప్రయోజకత్వానికి తీవ్ర ప్రతిబంధకాలు సృష్టించుకున్నవాడవుతాడు.PKTel 463.3

    “ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడుచుందురు.” సామె. 28:4. లోకంతో ఏకమైనా తామెంతో పరిశుద్దులమని చెప్పుకునేవారు నిత్యం సత్యాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నవారితో ఐక్యతను ప్రబోధించినప్పుడు నెహెమ్యాలాగ మనం భయంతో నిండి వారిని నిరాకరించాలి. అలాంటి సలహా ఆత్మల విరోధి. నుంచి వస్తుంది. అది కాలయాపన చేసేవారు ఉపయోగించే భాష దాన్ని అప్పటిలాగే నేడు కూడా పట్టుదలతో ప్రతిఘటించాలి. దేవుని నడుపుదలపై దైవ ప్రజల విశ్వాసాన్ని అస్థిరపర్చే ప్రభావం ఏదైనా దాన్ని ప్రతిఘటించాలి.PKTel 463.4

    నెహెమ్యా శత్రువులు అతణ్ని తమ వశంలోకి తెచ్చుకోటంలో పరాజయం పొందటానికి కారణం అతడు దేవుని సేవకు అచంచలంగా అంకితమవ్వటం దేవునిపై బలంగా ఆధారపడటమే. సోమరిపోతు అయిన వ్యక్తి శోధనకు ఇట్టే లొంగిపోతాడు. కాని ఉదాత్తాశయం సమ్మున్నతోద్దేశంగల జీవితంలో దుష్టతకు తావుండదు. నిరంతరం ముందుకు సాగేవాడి విశ్వాసం బలహీనపడదు. పైన కింద వాటికి అవతల అనంత ప్రేమామూర్తిని అతడు చూస్తాడు. తన ఉద్దేశాన్ని నెరవేర్చటానికి ఆయన సర్వాన్ని ఆయత్తపర్చటం చూస్తాడు. కృపాసనం తమకు నిత్యాధారం గనుక దేవుని యధార్థ సేవకులు తిరుగులేని ధృఢ సంకల్పంతో పనిచేస్తారు.PKTel 464.1

    మానవ వనరులికి అతీతమైన సకల అత్యవసర పరిస్థితులికీ దేవుడు దివ్య సహాయాన్ని ఏర్పాటు చేశాడు. ప్రతీ కష్టంలోను సహాయం అందించటానికి, మన నిరీక్షణను నిశ్చయతను బలోపేతం చెయ్యటానికి, మన మనసుల్ని వికాసంతో నింపటానికి, మన హృదయాల్ని పవిత్ర పర్చటానికి ఆయన పరిశుద్ధాత్మను మనకిస్తాడు. అవకాశాల్ని ఇచ్చి, పనిచేసే మార్గాల్ని తెరుస్తాడు. తన కృపా సంకల్పాల నెరవేర్పు సూచికల్ని పరిశీలిస్తూ తన ప్రజలు ఆయనతో సహకరించటానికి సంసిద్దులై ఉన్నట్లయితే, వారు అద్భుతమైన ఫలితాల్ని చూస్తారు.PKTel 464.2