Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ప్రవక్తలు - రాజులు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    50 - యాజకుడు శాస్త్రి అయిన ఎజ్రా

    జెరుబ్బాబెలు యెహోషువ నాయకత్వంలో బబులోను చెర ప్రజలు తిరిగివచ్చిన సుమారు డెబ్బయి సంవత్సరాలికి అర్తహషస్త లాంగిమనస్ మాదీయ పారసీక సింహాసనానికి వచ్చాడు. వరుసగా జరిగిన కొన్ని అద్భుతమైన దైవకృపా కార్యాలవల్ల పరిశుద్ధ చరిత్రలో ఈ రాజు పేరు ముడిపడి ఉంది. ఇతడి పరిపాలన కాలంలోనే ఎజ్రా, నెహెమ్యాలు నివసించి సేవచేశారు. క్రీIIపూII 457లో యెరూషలేము పునరుద్దరణకు ఆఖరిసారిగా మూడోడిక్రీ జారీచేసింది ఇతడే. ఎజ్రా నాయకత్వంలో కొంతమంది యూదులు తిరిగి రావటం, నెహెమ్యా అతడి సహచర బృందం యెరూషలేము గోడల నిర్మాణాన్ని పూర్తి చెయ్యటం, దేవాలయ సేవల పునర్వ్యవస్థీకరణ, ఎజ్రా నెహెమ్యాల ఆధ్వర్యంలో చోటు చేసుకున్న గొప్ప మత సంస్కరణలు ఇతడి పాలనా కాలంలోనే జరిగాయి. దీర్ఘమైన ఇతడి ఏలుబడి కాలంలో ఇతడు దేవుని ప్రజలకు తన ప్రియమైన యూదు. మిత్రులైన ఎజ్రా నెహెమ్యాలికి ఎన్నో ఉపకారాలు చేశాడు. ప్రత్యేక దైవ సేవ నిమిత్తం దేవుడు ఎంపిక చేసుకున్న మనుషుల్ని దైవజనులుగా గుర్తించాడు.PKTel 425.1

    బబులోనులో ఉండిపోయిన యూదుల మధ్య నివసిస్తున్నప్పుడు ఎజ్రాకు కలిగిన అనుభవం ఎంతో అసాధారణమయ్యింది కావటంతో అది రాజు అర్తహషస్తను ఆకట్టుకుంది. దేవుని శక్తిని గురించి, యూదుల్ని యెరూషలేముకి తిరిగి రప్పించటంలో దేవుని ఉద్దేశం గురించి రాజుతో ఎజ్రా స్వేచ్చగా మాట్లాడుతుండేవాడు.PKTel 425.2

    అహరోను కుమారుల సంతానమైన ఎజ్రా యాజక శిక్షణ పొందాడు. అంతేగాక అతడు గారడీ విద్య గలవారు, జ్యోతిషాస్త్రవేత్తలు, మాదీయ పారసీక రాజ్యంలోని జ్ఞానుల రచనలతో పరిచయం కలిగి ఉన్నాడు, అయితే తన ఆధ్యాత్మిక స్థితి అతడికి తృప్తినివ్వలేదు. దేవునితో సంపూర్ణ సామరస్యాన్ని ఆకాంక్షించాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి వివేకాన్ని ఆశించాడు. కనుక యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు” నడుం బిగించాడు. ఎజ్రా. 7:10. ప్రవక్తలు రాజుల రచనల్లో దాఖలై ఉన్న దైవ ప్రజల చరిత్రను శ్రద్దగా అధ్యయనం చెయ్యటానికి ఇది అతణ్ని నడిపించింది. యెరూషలేము నాశనానికి, తన ప్రజలు ఓ అన్యజనుల దేశంలోకి చేరబందీలుగా తీసుకుపోబడటానికి యెహోవా అనుమతించటానికి కారణాన్ని తెలుసుకోటానికి బైబిలులోని చారిత్రక పుస్తకాల్ని, కవితల పుస్తకాల్ని పరిశోధించాడు.PKTel 425.3

    దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసినప్పటినుంచి ఇశ్రాయేలీయులికి వచ్చిన అనుభవాలపై ఎజ్రా ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. సీనాయి పర్వతంవద్ద దేవుడిచ్చిన ఉపదేశాన్ని, సుదీర్ఘమైన వారి అరణ్య సంచారంలో ఆయన వారికిచ్చిన ఉపదేశాన్ని అధ్యయనం చేశాడు. తన ప్రజలతో దేవుడు వ్యవహరించిన తీరును లోతుగా మరింత లోతుగా పఠించి సీనాయి పర్వతంవద్ద దేవుడిచ్చిన ధర్మశాస్త్రం పరిశుద్దతను అవగతం చేసుకున్నప్పుడు, ఎజ్రా హృదయం చైతన్యవంతమయ్యింది. అతడిలో ఓ నూతనమైన సంపూర్ణమైన మార్పు కలిగింది. ఆ పరిశుద్ధ చరిత్ర దాఖలాల్ని కూలంకషంగా పఠించి, జ్ఞానం సంపాదించి, ఆ జ్ఞానాన్ని తన ప్రజలకు దీవెనలు కలిగేందుకు పరిశుద్ద వికాసం కలిగేందుకు వినియోగించాలని నిశ్చయించుకున్నాడు.PKTel 426.1

    తన ముందున్నదని తాను నమ్మిన కర్తవ్య నిర్వహణకు తన హృదయాన్ని సిద్ధం చేసుకోటానికి ఎజ్రా కృషి చేశాడు. ఇశ్రాయేలీయులికి మంచి బోధకుడిగా తనను తయారు చేయాల్సిందిగా దేవునికి ప్రార్థన చేశాడు. మనసును చిత్తాన్ని దేవునికి అర్పించటం నేర్చుకున్నప్పుడు, నిజమైన తృప్తికి సంబంధించిన సూత్రాలు అతడి జీవితంలోకి వచ్చాయి. అనంతర సంవత్సరాల్లో ఉపదేశం నిమిత్తం తనవద్దకు వచ్చే యువత మీదమాత్రమే గాక తనతో సహవాసంచేసే ఇతరులపై కూడా మార్పు కలిగించే ప్రభావాన్ని ప్రసరించాడు.PKTel 426.2

    చెర కొనసాగిన సంవత్సరాల్లో చాలామేరకు వన్నెను కోల్పోయిన యాజకత్వానికి ఘనతను సంతరించేందుకు ఇశ్రాయేలీయులికి మేలు చేసే సాధనంగా దేవుడు ఎజ్రాను ఎన్నుకున్నాడు. ఎజ్రా అసమాన్యమైన జ్ఞాన సంపదగల వ్యక్తిగా వృద్ధి చెంది మోషే యొక్కధర్మశాస్త్రమందు ప్రవీణతగల శాస్త్రి” అయ్యాడు. 6వ వచనం. ఈ అర్హతలు అతణ్ని మాదీయ పారసీక రాజ్యంలో ప్రఖ్యాత వ్యక్తిని చేశాయి.PKTel 426.3

    ఎజ్రా దేవుని ప్రతినిధి అయ్యాడు. తన పరిసరాల్లో ఉన్న ప్రజల్ని పరలోక పరిపాలన సూత్రాలపై చైతన్య పర్చాడు. తన శేష జీవితకాలంలో మాదీయ పారసీక రాజు ఆస్థానంలోనేగాని లేక యెరూషలేములోనేగాని ఎజ్రా ప్రధానంగా బోధకుడుగా పనిచేశాడు. తాను నేర్చుకున్న సత్యాల్ని ఇతరులికి బోధించే కొద్దీ అతడి సేవా సామర్థ్యం పెరిగింది. అతడు భక్తిపరుడు, ఉత్సాహం ఉద్రేకంతో నిండిన వ్యక్తి. దినదిన జీవితాన్ని ఉదాత్తం చేసే బైబిలు సత్యానికున్న శక్తికి అతడు ప్రభువు ఎంపికచేసుకున్న సాక్షి.PKTel 426.4

    లేఖన పఠనంపై ఆసక్తిని పునరుద్ధరించటానికి, ఆ పరిశుద్ధ రచనల్ని పరిరక్షించి, విస్తరించటానికి ఎజ్రచేసిన కృషి ఫలితాలు తన జీవితకాల శ్రమవల్ల శాశ్వతత్వం పొందాయి. ధర్మశాస్త్ర ప్రతులన్నిటినీ పోగుచేసి వాటి నకళ్లు రాయించి ఆ ప్రతుల్ని పంచిపెట్టించాడు. ఈ విధంగా పరిశుద్ద వాక్యం వృద్ధిచెంది అనేకుల చేతుల్లోకి వెళ్లటం జరిగింది. ఆ వాక్యం వారికి ఎంతో విలువైన జ్ఞానాన్ని అందించింది. PKTel 427.1

    దైవవాక్య పఠనాసక్తిని పునరుద్దరించటానికి, పరిశుద్ద పట్టణాన్ని పునరుద్ద రించటంలో తన సహోదరులికి సహాయపడటానికి యెరూషలేముకి తిరిగి వెళ్లాలన్న తన కోరికను అర్తహషస్తకు తెలపటంలో తన ప్రజలపక్షంగా దేవుడు మహత్కార్యాలు చేస్తాడన్న తన ప్రగాఢ విశ్వాసం ఎజ్రాను బలపర్చి నడిపించింది. తన ప్రజల్ని కాపాడటానికి వారి అవసరాల్ని తీర్చటానికి ఇశ్రాయేలీయుల దేవుడు సమర్థుడన్న తన సంపూర్ణ విశ్వాసాన్ని ఎజ్రా ప్రకటించినప్పుడు రాజుకి నమ్మకం పుట్టింది. ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించటానికి యెరూషలేముకి తిరిగి వెళ్తున్నారని అతడు గ్రహించాడు. అయినా రాజుకి ఎజ్రా నిజాయితీపట్ల ఉన్న నమ్మకాన్ని బట్టి అతడిపై దయచూపించి అతడి మనవిని అంగీకరించాడు. ఆలయ సేవలనిమిత్తం ఎజ్రాకి ఎన్నో విలువైన కానుకలిచ్చాడు. అతణ్ని మాదీయ పారసీక రాజ్యం ప్రత్యేక ప్రతినిధిగా నియమించి తన మనసులో ఉన్న ఉద్దేశాలన్నిటినీ ఆచరణలో పెట్టటానికి అతడికి కార్యనిర్వహణాధికారాలు ఇచ్చాడు.PKTel 427.2

    యెరూషలేము పునరుద్ధరణకు అర్తహషస్త లాంగిమనస్ జారీ చేసిన డిక్రీలో పరలోక దేవున్ని గురించి, ఎజ్రా సాధనలగురించి, దేవుని ప్రజలకు ఇవ్వబడ్డ ధారాళ నిధుల్ని గురించి రాజు వాడిన పదబంధాలకు చాలా ప్రాముఖ్యం ఉంది. డెబ్బయి సంవత్సరాల చెర ముగిసినప్పటినుంచి జారీ అయిన డిక్రీల్లో ఇది మూడోది. అర్తహషస్త ఎజ్రాను “యెహోవా ఆజ్ఞల వాక్యములయందును, ఆయన ఇశ్రాయేలీయులకు విధించిన కట్టడల యందును శాస్త్రియు యాజకుడు” గాను “ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రి” గాను ప్రస్తావిస్తున్నాడు. రాజు తన మంత్రులతో కలిసి “యెరూషలేములోని నివాసముగల ఇశ్రాయేలీయుల దేవునికి” స్వేచ్ఛగా కానుకలర్పించాడు. అంతేగాకుండా అనేకమైన పెద్ద పెద్ద ఖర్చులకు “రాజుయొక్క ఖజానానుండి” చెల్లించాల్సిందిగా ఆజ్ఞాపించాడు. 11,12,15,20 వచనాలు.PKTel 427.3

    అర్తహషస్త ఎజ్రాతో ఇలా అన్నాడు, “చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యూదానుగూర్చియు యెరూషలేమునుగూర్చియు విమర్శ చేయుటకు నీవు రాజుచేతను అతని యేడుగురు మంత్రులచేతను పంపబడితివి.” ఇంకా రాజిలా ఆజ్ఞాపించాడు, “ఆకాశమందలి దేవునిచేత ఏది నిర్ణయమాయెనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలసినది. రాజుయొక్క రాజ్యము మీదికిని అతని కుమారుల మిదికిని కోపమెందుకు రావలెను?” 13,23 వచనాలు.PKTel 428.1

    ఇశ్రాయేలీయులు తిరిగి తమ దేశానికి వెళ్లిపోటానికి అనుమతి ఇవ్వటంలో యాజకులకు తమ పూర్వపు ఆచారాలు ఆధిక్యతల్ని పునరుద్దరించటానికి అర్తహషస్త ఏర్పాటు చేశాడు. రాజిలా ప్రకటించాడు, “యాజకులును లేవీయులును గాయకులును ద్వారపాలకులును నెతీనీయులును దేవుని మందిరపు సేవకులునైన వారందరిని గూర్చి మేము మికు నిర్ణయించినదేమనగా, వారికి శిస్తుగాని సుంకముగాని పన్నుగాని వేయుట కట్టడపు న్యాయము కాదని తెలిసికొనుడి.” ప్రజలను యూదుల చట్టాల ప్రకారం న్యాయంగా పరిపాలించటానికి పౌర అధికారుల నియామకానికి అతడు ఏర్పాటు చేస్తూ రాజు ఇలా ఆదేశించాడు, “ఎజ్రా, నది యవతలనున్న జనులకు తీర్పుతీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవే నీ దేవునియొక్క ధర్మశాస్త్ర విధులను తెలిసికొనిన వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉంచవలెను. ఆ ధర్మశాస్త్ర విషయములో తెలియని వారెవరో వారికి నేర్పవలెను. నీ దేవుని ధర్మశాస్త్రము గాని, రాజు యొక్క చట్టముగాని, గైకొననివాడెవడో త్వరగా విచారణచేసి, మరణ శిక్షయైనను స్వదేశ త్యాగమైనను ఆస్తి జప్తియైనను ఖైదునైనను వానికి విధింపవలెను.” 24-26 వచనాలు.PKTel 428.2

    ఇలా “తన దేవుని కరుణా హస్తము తనకు తోడుగా నున్నందున” మాదీయ పారసీక రాజ్యంలో ఉన్న ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు” “యెరూషలేము పట్టణమునకు వెళ్లుటకు మనః పూర్వకముగా ఇష్టపడువారెవరో”, అందరూ తిరిగి రావటానికి అన్ని ఏర్పాట్లూ చెయ్యటానికి అర్తహషస్త రాజును ఎజ్రా సమ్మతింపజేశాడు. 9-13 వచనాలు. తాము ఏ దేశాన్ని స్వతంత్రించుకోటంతో దేవుడు ఇశ్రాయేలు వంశానికి చేసిన వాగ్దానాలు ముడిపడి ఉన్నాయో ఆ దేశానికి ఈ చెదిరిపోయిన దేవుని ప్రజలు తిరిగి రావటానికి ఇలా మరో అవకాశం కలిగింది. తన ప్రజల్ని గురించి దేవుని ఉద్దేశాల్ని ఎజ్రాతో కలిసి అధ్యయనం చేస్తున్న వారికి ఈ డిక్రీ అమితానందం కలిగించింది. విస్మయం చెందుతూ ఎజ్రా ఇలా అన్నాడు, “యెరూషలేములోనుండు యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను, రాజును అతని మంత్రులను రాజుయొక్క మహాధిపతులును నాకు దయ అనుగ్రహింప జేసినందునను, మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి, నాతోకూడ వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చితిని.” 27,28 వచనాలు. PKTel 428.3

    అర్తహషస్త ఈ డిక్రీ జారీ చెయ్యటంలో దేవుని చిత్తం వ్యక్తమయ్యింది. కొందరు దీన్ని గుర్తించి సానుకూల పరిస్థితుల్లో తిరిగి వెళ్లటానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పర్చుకున్నారు. అందరూ సమావేశమవ్వటానికి ఓ స్థలాన్ని పేర్కొన్నారు. నిర్ణీత సమయంలో యెరూషలేముకు తిరిగి వెళ్లటానికి అభిలషించే వారంతా ఆ దీర్ఘ ప్రయాణానికి సిద్ధపడి సమావేశమయ్యారు. ఎజ్రా ఇలా అంటున్నాడు, “వీరిని నేను అహవా వైపునకు పారు నదియొద్దకు సమకూర్చితిని. అచ్చట మేము మూడు దినములు గుడారములలో ఉంటిమి.” ఎజ్రా. 8:15.PKTel 429.1

    యెరూషలేముకి తిరిగి వెళ్లటానికి ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారని ఎజ్రా తలంచాడు. తన పిలుపుకు స్పందించి వచ్చినవారు బహుకొద్దిమంది మాత్రమే. ఇళ్లు భూములు సంపాదించుకున్నవారు వాటిని విడిచిపెట్టటానికి ఇష్టపడలేదు. వారు సుఖ సౌక్యాల్ని ప్రేమించారు. అక్కడ ఉండిపోటానికే నిర్ణయించుకున్నారు. విశ్వాసంతో ముందుకు సాగుతున్న వారితో కలిసి సాగటానికి తీర్మానించుకుని ఉండేవారికి వారి ఆదర్శం ప్రతిబంధకంగా మారింది.PKTel 429.2

    సమావేశమైనవారి వంక చూసినప్పుడు అందులో లేవీ కుమారులెవ్వరూ లేకపోవటం ఎజ్రాని ఆశ్చర్యపర్చింది. దేవాలయ పరిశుద్ధ సేవలకు ప్రత్యేకించి ఎంపికైన గోత్ర సభ్యులు ఎక్కడున్నారు? ప్రభువు పక్షాన ఉన్నవారెవరంటూ వచ్చిన పిలుపుకు ప్రప్రథమంగా స్పందించాల్సింది లేవీయులే. చెరకాలంలోను ఆ తర్వాత కూడా వారికి ప్రత్యేక అవకాశాలు ఇవ్వటం జరిగింది. చెరలో ఉన్న తమ సహోదరులకు ఆధ్యాత్మికంగా పరిచర్య చేసే స్వేచ్ఛను కలిగి వీరు ఆనందించారు. ప్రజలు సమాజ మందిరాన్ని నిర్మించినప్పుడు అందులో యాజకులు దైవారాధనలు జరిపి ప్రజలకు సత్యాన్ని బోధించారు. సబ్బాతు ఆచరణ, యూదు విశ్వాసానికి సంబంధించిన ఆచారాలు ప్రజలు స్వేచ్చగా నిర్వహించుకునేవారు.PKTel 429.3

    కాగా చెర ముగిశాక గతించిన సంవత్సరాల్లో పరిస్థితుల్లో మార్పు కలిగింది. ఇశ్రాయేలు నాయకుల భుజస్కంధాలపై అనేక బాధ్యతలు పడ్డాయి. యెరూషలేములోని ఆలయ నిర్మాణం ప్రతిష్ట అయ్యాయి. దాని సేవల నిర్వహణకు ఎక్కువమంది యాజకుల అవసరం ఉంది. ప్రజలకు బోధించటానికి దైవభీతిగల మనుషుల అవసరం మరెక్కువగా ఉంది. ఇదిలాగుండగా బబులోనులో మిగిలిఉన్న యూదులు తమ మత స్వేచ్చ నియంత్రణను ఎదుర్కునే ప్రమాదంలో ఉన్నారు. జెకర్యా ప్రవక్తద్వారా, ఎస్తేరు మొర్దేకైల శ్రమల కాలంలో తమ ఇటీవలి అనుభవంద్వారా, మాదీయ పారసీక రాజ్యంలో ఉన్న యూదులు తమ దేశానికి తిరిగి వెళ్లిపోవాల్సిందిగా స్పష్టమైన హెచ్చరిక వచ్చింది. అన్యమత ప్రభావాల నడుమ నివసించటం ఇక ఎంతమాత్రం క్షేమంకాని సమయం వచ్చింది. మారిన పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక డిక్రీ జారీలో యెరూషలేముకి తిరిగి వెళ్లమంటూ వచ్చిన పిలుపును బబులోనులోని యాజకులు గ్రహించి ఉండాల్సింది.PKTel 430.1

    యూదుల తిరిగి రాకకు మార్గం తెరవటంలో రాజు అతడి అధిపతులు తమ వంతు సహాయం కన్నా ఎక్కువే చేశారు. ఆర్థిక వనరుల్ని సమృద్ధిగా సమకూర్చారు. కాని మనుషులేరి? తమ సహోదరులతోకలిసి వెళ్లటమన్న తీర్మానం ప్రభావం ఇతరులు తమ మాదిరిని అనుసరించటానికి స్ఫూర్తినిచ్చే సమయంలో లేవీ కుమారులు ముఖం చాటేశారు. తన ప్రజల నిమిత్తం దేవుని సంకల్పం విషయంలో బబులోనులోని ఇశ్రాయేలీయుల వైఖరికి వారి విచిత్రమైన నిర్లిప్తత అద్దం పడుతున్నది.PKTel 430.2

    తిరిగి వెళ్తున్న వారి సహవాసంలో చేరాల్సిందిగా ఆహ్వానం పంపుతూ లేవీయులికి ఎజ్రా మరోసారి విజ్ఞప్తి చేశాడు. సత్వర చర్య ప్రాముఖ్యాన్ని నొక్కిచెబుతూ తన రాతపూర్వక విజ్ఞప్తులతో పాటు అనేకమంది ప్రధానులను” “పెద్దలైన” వారిని పంపాడు. ఎజ్రా. 7:28; 8:16.PKTel 430.3

    ఈ ప్రయాణికులు ఎజ్రాతో ఉండగా “మా దేవుని మందిరమునకు పరిచారకులు” కూడిరండి అన్న విజ్ఞప్తితో విశ్వాసపాత్రులైన ఈ దూతలు వెళ్లారు. (ఎజ్రా. 8:17). ఆ విజ్ఞప్తికి యాజకులు స్పందించారు. సందేహిస్తున్న కొందరు తిరిగి యెరూషలేముకి వెళ్లటానికి తీర్మానించుకున్నారు. ఏభైమంది యాజకులు, రెండువందల ఇరవై నెతీనీయుల్ని - విజ్ఞులైన పరిచారకులుగా, ఉపదేశకులుగా సహాయకులుగా ఎజ్రా వినియోగించగల మనుషుల్ని - శిబిరానికి తీసుకు వచ్చారు.PKTel 430.4

    అందరూ ఇప్పుడు బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని నెలలుపట్టే ప్రయాణం వారి ముందున్నది. పురుషులు భార్యల్ని పిల్లల్ని తమ సంపాదనను తమతో తీసుకువెళ్తున్నారు. దేవాలయానికి దేవాలయ సేవలకి పెద్ద మొత్తంలో ద్రవ్యాన్ని కూడా తీసుకు వెళ్తున్నారు. తనను తన బృందాన్ని దోచుకుని నాశనం చెయ్యటానికి మార్గంలో శత్రువులు పొంచిఉన్నారని ఎజాకు తెలుసు. అయినా తమను పరిరక్షించేందుకు సాయుధ దళాల్ని పంపమని రాజుని కోరలేదు. అతడిలా అన్నాడు, “మేలు కలుగ జేయుటకై ఆయనను ఆశ్రయించువారికందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని, ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించువారందరిమీదికి వచ్చునని మేము రాజుతో చెప్పియుంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావలెనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను.” 22వ వచనం.PKTel 430.5

    ఈ విషయంలో అన్యజనుల ముందు దేవుని నామాన్ని మహిమ పర్చటానికి ఎజ్రా అతడి సహచరులు ఒక అవకాశాన్ని చూశారు. ఇశ్రాయేలీయులు ఇప్పుడు తమ నాయకుడైన దేవునిపై అచంచల విశ్వాసాన్ని కనపర్చితే జీవంగల దేవుని శక్తిమీద విశ్వాసం బలీయమవుతుంది. అందుచేత తమ సంపూర్ణ విశ్వాసాన్ని ఆయనమీద ఉంచటానికి కృతనిశ్చయులయ్యారు. సైనికుల రక్షణను కోరకూడదనుకున్నారు. దేవునికి మాత్రమే చెందాల్సిన మహిమను మానవుడి శక్తికి ఆపాదించటానికి అన్యజనులికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని తలంచారు. దైవ ప్రజలుగా ఆయనపై పూర్తిగా ఆధారపడతామన్న విషయమై అన్యులైన తమ మిత్రుల మనసుల్లో ఎలాంటి సందేహాలికీ వారు తావివ్వకూడదు. భాగ్యంవలనగాని, విగ్రహారాధకుల అధికారం ప్రాబల్యంవలన గాని కాక దేవుని కృపద్వారా మాత్రమే వారికి శక్తి లభిస్తుంది. దైవ ధర్మశాస్త్రాన్ని ముందుంచుకుని, దాన్ని ఆచరించటం ద్వారా మాత్రమే వారికి భద్రత కలుగుతుంది. PKTel 431.1

    అభివృద్దినిచ్చే దేవుని హస్తం కింద సంతోషానందాలతో కొనసాగటం ఏ షరతులపై సాధ్యమవుతుందో వాటిని గూర్చిన జ్ఞానం ఆ విశ్వాసుల బృందం బయలు దేరకముందు ఎజ్రా జరిపిన సమర్పణ కార్యక్రమానికి అసామాన్య గంభీరతను చేకూర్చింది. ఈ అనుభవం గురించి ఎజ్రా ఇలా అంటున్నాడు : “అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపర్చుకొని, మాకును మా చిన్నవారికిని మా ఆస్తి కిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నదిదగ్గర ఉపవాస ముండుడని ప్రకటించితిని.” “మేము ఉపవాసముండి ఆ సంగతినిబట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను.” 21,23 వచనాలు.PKTel 431.2

    దేవుని దీవెనలు నడుపుదల ఉన్నందున తమకు విజ్ఞత ముందుచూపు అవసరం లేదని వారనుకోకూడదు. ద్రవ్యాన్ని వెండి బంగారాల్ని కాపాడే విషయంలో ముందు జాగ్రత్త చర్యగా ఎజ్రా “యాజకులలోనుండి ప్రధానులైన పండ్రెండు మందిని” - వీరు నమ్మకమైన నమ్మదగిన మనుషులు - “ఏర్పరచి మా దేవుని మందిరమును ప్రతిష్టించుట విషయములో రాజును అతని మంత్రులును అధిపతులును అక్కడనున్న ఇశ్రాయేలీయులందరును ప్రతిష్టించిన వెండి బంగారములను ఉపకరణములను తూచి వాటిని” వారికి అప్పగించాడు. తమకు అప్పగించ బడిన నిధుల్ని కాపాడటంలో అప్రమతులైన గృహనిర్వాహకులుగా వ్యవహరించాల్సిందిగా వీరిని గట్టిగా హెచ్చరించటం జరిగింది. ఎజ్రా వారితో ఇలా అన్నాడు, “మీరు యెహోవాకు ప్రతిష్టింపబడినవారు, పాత్రలును ప్రతిష్ఠితములైనవి. ఈ వెండి బంగారములును మీ పితరుల దేవుడైన యెహోవాకు స్వేచ్ఛార్పణములైయున్నవి. కాబట్టి మీరు యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదులలో, యాజకుల యొక్కయు లేవీయుల యొక్కయు ఇశ్రాయేలు పెద్దల యొక్కయు ప్రధానులైనవారి యెదుట వాటిని తూచి అప్పగించువరకు వాటిని భద్రముగా ఉంచుడి.” 24,25,28,29 వచనాలు.PKTel 431.3

    ప్రభువు నిధుల భద్రత రవాణా విషయాల్లో ఎజ్రా తీసుకున్న శ్రద్ద నేర్పుతున్న పాఠం శ్రద్దతో అధ్యయనం చేయాల్సిన అంశం. విశ్వసనీయులైన వారిని మాత్రమే ఎంపిక చెయ్యటం జరిగింది. వారు తమపై ఉన్న బాధ్యత విషయమై ఉపదేశం పొందారు. దేవుని నిధులు భద్రపరచటానికి ఖజానాదారులుగా సేవ చెయ్యటానికి నమ్మకస్తులైన అధికారుల్ని నియమించటంలో క్రమాన్ని, వ్యవస్తీకరణను ఎజ్రా పాటించాడు.PKTel 432.1

    నదివద్ద విడిది ఉన్న కొద్దిదినాల్లో ఆ దీర్ఘ ప్రయాణానికి కావలసినదంతా సమకూర్చుకోటం జరిగింది. ఎజ్రా ఇలా రాస్తున్నాడు, “మేము మొదటి నెల పండ్రెండవ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అవాహు నది నుండి బయలుదేరగా, మా దేవుని హస్తము మాకు తోడుగానుండి, శత్రువుల చేతిలోనుండియు మార్గమందు పొంచియున్నవారి చేతిలోనుండియు మమ్మును” తప్పించాడు. 31వ వచనం. అది సుమారు నాలుగు నెలలపాటు సాగిన ప్రయాణం. ఎజ్రావెంట బయలుదేరిన జనులు స్త్రీలు పిల్లలు సహా కొన్ని వేలమంది ఉన్నారు. అందుచేత ప్రయాణం నెమ్మదిగా సాగటం అనివార్యమయ్యింది. విశేషమేంటంటే అందరూ సురక్షితంగా క్షేమంగా ఉన్నారు. శత్రువులు వారికి హాని చెయ్యకుండా దేవుడు వారిని అదుపుచేశాడు. వారి ప్రయాణం సుఖంగా సాగింది. అర్తహషస్త ఏలుబడి ఏడో సంవత్సరంలో అయిదోనెల మొదటి రోజున వారు యెరూషలేము చేరారు.PKTel 432.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents