Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ప్రవక్తలు - రాజులు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    5 - సొలొమోనుపశ్చాత్తాపం

    సొలొమోను రాజ్యపరిపాలన కాలంలో ప్రభువు అతడికి రెండుసార్లు ప్రత్యక్షమై తన అంగీకారాన్ని తెలిపి హితవు పలికాడు - గిబియోనులో రాత్రిదర్శనంలో వివేకం, సంపద, ఘనత గురించిన వాగ్దానం తర్వాత వినయంగాను, విధేయంగాను ఉండాల్సిందిగా హితవు పలికాడు; ఆలయ ప్రతిష్ట అనంతరం మరోసారి అతణ్ని నమ్మకంగా జీవించమంటూ హితవు పలికాడు. ప్రభువు సొలొమోనుకిచ్చిన హితవు స్పష్టంగా ఉంది. ఆయన చేసిన వాగ్దానం అద్భుతమయ్యింది. కాగా పరిస్థితులకి, ప్రవర్తనకి, జీవితానికి చక్కగా వర్తించిన ఆ ఉపదేశాన్ని పాటించి, దేవుడు కోరినదాన్ని నెరవేర్చాల్సిన అతణ్ని గురించి ఈ దాఖలా ఉంది : “యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొన”లేదు. “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి రెండు మారులు ప్రత్యక్షమై - నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్దనుండి తొలగిపోయెను.” 1 రాజులు 11:9,10. అతడి భ్రష్టత ఎంత సంపూర్ణం, అతిక్రమంలో అతడి హృదయం ఎంత కాఠిన్యం అయ్యాయంటే, అతడి పరిస్థితి దాదాపు చేజారిపోయినట్లు కనిపించింది.PKTel 38.1

    దైవ సహవాస ఆనందానికి విముఖుడై సొలొమోను ఇంద్రియ వినోదాల సంతృప్తిపై దృష్టిపెట్టాడు. ఈ అనుభవం గురించి అతడు ఇలా అంటున్నాడు :PKTel 38.2

    “నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించు కొంటిని, ద్రాక్షతోటలు నాటించుకొంటిని ... పనివారిని పనికత్తెలను సంపాదించు కొంటిని ... నాకొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకులను, గాయకురాండ్రను మనుష్యులిచ్చయించు సంపదలను సంపాదించుకొని ... నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటెను నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని...”PKTel 38.3

    “నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండ నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన దేదియు అనుభవింపకుండ నేను నా హృదయమును నిర్బందింప లేదు. ఇదే నా పనులన్నిటివలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నియు, వాటికొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నియు వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యునిక్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను.PKTel 39.1

    “రాజు తరువాత రాబోవువాడు, ఇదివరకు జరిగినదాని విషయము సయితము ఏమిచేయునో అనుకొని నేను జ్ఞానమును, వెట్టితనమును, మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని .... సూర్యునిక్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటిని ... తెలిసికొని నేను వాటియందు అసహ్యపడితిని.” ప్రసంగి. 2:4-18. PKTel 39.2

    జీవిత పరమార్థాన్ని ప్రాపంచిక విషయాల్లో వెదకే జీవితం వ్యర్ధజీవితమని తన సొంత చేదు అనుభవం ద్వారా సొలొమోను నేర్చుకున్నాడు. అన్యదేవతలకు బలిపీఠాలు నిర్మించి ఆత్మశాంతికి వాటి వాగ్దానం ఎంతవ్యర్థమైందో తెలుసుకున్నాడు. రాత్రింబగళ్లు అతడి ఆత్మను బాధకరమైన ఆలోచనలు క్షోభపెట్టాయి. అతడికి ఇక ఎంతమాత్రం సంతోషంగాని, మనశ్శాంతిగాని లేవు. భవిష్యత్తు చీకటితో, నిరాశ నిస్పృహలతో నిండి ఉంది.PKTel 39.3

    అయినా ప్రభువు అతణ్ని విడిచిపెట్టలేదు. తాను అనుసరిస్తున్న మార్గం పాపపూరితమని రాజు గుర్తించటానికి మందలింపు వర్తమానాలు, కఠిన తీర్పులద్వారా అతణ్ని మేలుకొల్పటానికి ప్రయత్నించాడు. ఆయన అతడి చుట్టూ ఉన్న తన సంరక్షణ వలయాన్ని తొలగించాడు. అతడి రాజ్యాన్ని శత్రువులు అస్థిరపరచి బలహీనం చెయ్యటానికి అనుమతించాడు. “యెహోవా ఎదోమియుడైన హదదు అను ఒకని సొలొమోనునకు విరోధిగా లేపెను ... మరియు దేవుడు అతనిమిదికి ... రెజోను అను ఇంకొక విరోధిని రేపెను. ఇతడు కొందరిని సమకూర్చి ... దమస్కులో రాజాయెను .... మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజుమిదికి లేచెను.” 1 రాజులు 11:14-28.PKTel 39.4

    తుదకు ఒక ప్రవక్తద్వారా ప్రభువు సొలొమోనుకి ఈ వర్తమానం పంపించాడు, “నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక యీ రాజ్యము నీకుండకుండ నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను. అయినను నీ తండ్రియైన దావీదు నిమిత్తము నీ దినములయందు నేను ఆలాగున చేయక నీ కుమారుని చేతిలోనుండి దాని తీసివేసెదను.” 11,12 వచనాలు.PKTel 39.5

    తనపైన తన వంశం పైన వెలువడ్డ ఈ తీర్పువల్ల సొలొమోను కలనుంచి మేల్కొన్నవాడిలా మనస్సాక్షి స్వరంవిని తన పొరపాటును యదార్థమైన వెలుగులో చూడనారంభించాడు. మందలింపుపొందిన ఆత్మతో, బలహీనపడిన మనసుతోను, శరీరంతోను, బద్దలై నీళ్లు నిలవని లోకపు తొట్లలోనుంచి తాగటంవల్ల అలసిపోయిన దప్పికగా ఉన్న అతడు జీవపు ఊటలోనుంచి మరొకసారి తాగటానికి ఆశపడ్తున్నాడు. కడకు ఇతడి విషయంలో శ్రమల క్రమశిక్షణ దాని లక్ష్యాన్ని సాధించింది. తప్పునుంచి వైదొలగటానికి ఆశక్తతవల్ల పూర్తినాశనం సంభవిస్తుందేమోనన్న భయం అతణ్ని ఎంతోకాలం వేధించింది. అయితే ఇప్పుడు తనకు వచ్చిన వర్తమానంలో ఒక ఆశాకిరణం కనిపించింది. దేవుడు అతణ్ని పూర్తిగా కొట్టిపారెయ్యలేదు. కాని మరణంకన్నా క్రూరమైన చెరనుంచి అతణ్ని విడిపించటానికి సిద్దంగా ఉన్నాడు. ఆ చెరనుంచి విడిపించుకోటానికి అతడికి శక్తిలేదు. “అధికారము నొందినవారి మిద మరి ఎక్కువ అధికారము నొందిన” ప్రభువు అధికారాన్ని, ప్రేమానురాగాల్ని సొలొమోను కృతజ్ఞతతో గుర్తించాడు (ప్రసంగి. 5:8). తాను ఏ సమున్నత, పవిత్రస్థాయి నుంచి పడిపోయాడో ఆ స్థాయిని చేరటానికి పశ్చాత్తాపంతో కుమిలి పోతూ అడుగులు వెనక్కివెయ్యటం మొదలు పెట్టాడు. పాపంవల్ల కలిగే దారుణ ఫలితాల్ని తప్పించుకో లేడు. తాను అవలంబించిన విచ్చలవిడి జీవిత సరళి జ్ఞాపకాల నుంచి విముక్తి పొందలేక పోతున్నాడు. కాని ఆ మార్గాన్ని అనుసరించకుండా ఇతరుల్ని ఒప్పించటానికి అతడు చిత్తశుద్ధితో కృషి చెయ్యడానికి నిర్ణయించుకున్నాడు. దీన మనసుతో తన తప్పులు ఒప్పుకొని, తాను ప్రారంభించిన దుష్టత తాలూకు ప్రభావానికి ఇతరులు బలికాకుండా గళమెత్తి హెచ్చరించటానికి పూనుకున్నాడు.PKTel 40.1

    యధార్ధ పశ్చాత్తాపం పొందే వ్యక్తి తన గత పాపాల్ని గుర్తుకి తెచ్చుకుంటాడు. సమాధానాన్ని పొందిన వెంటనే తాను చేసిన పాపాల విషయంలో అలక్ష్యం, నిర్లిప్త వైఖరి ఏర్పడదు. తన కార్యాలవల్ల దుర్మార్గులైన వారి గురించి ఆలోచిస్తాడు. వారిని తిరిగి మంచి మార్గంలో నడిపించటానికి అన్నివిధాల ప్రయత్నిస్తాడు. తనకు వచ్చిన వెలుగు ఎంత స్పష్టంగా ఉంటే సన్మార్గంలో ఇతరుల్ని నడిపించాలన్న కోరిక అతడిలో అంత బలంగా ఉంటుంది. అతడు తన చెడు మార్గాన్ని సమర్ధించడు. తన తప్పును స్వల్ప విషయంగా కొట్టి పారేయడు. కాని ఇతరులు జాగ్రత్తగా ఉండేందుకు ప్రమాద ఘంటికలు మోగిస్తాడు.PKTel 40.2

    “నరుల హృదయము చెడుతనముతో నిండియున్నది, వారు బ్రదుకు కాలమంతయు వారి హృదయమందు వెట్టితనముండును” (ప్రసంగి 9:3) అని సొలొమోను గుర్తించాడు. అతడు ఇంకా ఇలా అన్నాడు, “దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయ పూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. పాపాత్ములు నూరు మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవునియందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నందురనియు భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియు, వారు నీడవంటి దీర్ఘాయువును పొందక పోవుదురనియు నేనెరుగుదును.” ప్రసంగి 8:11-13.PKTel 41.1

    తాను వ్యర్థపుచ్చిన సంవత్సరాలు వాటి హెచ్చరికా పాఠాల చరిత్రను అనంతర తరాల ప్రజలకోసం ఆత్మావేశంవల్ల రాజు రచించాడు. అతడు విత్తిన విత్తనాలు దుర్నీతి పంటను తన ప్రజలు కోసుకున్నప్పటికీ అతడి జీవిత కృషి పూర్తిగా వ్యర్థం కాలేదు. తన చివరి దినాల్లో సొలొమోను సాత్వికంగా దీనమనసుతో “జనులకు జ్ఞానమును బోధించెను. అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను.” అతడు “యింపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమునుగూర్చిన మాటలు యధార్థ భావముతో వ్రాయుటకు పూనుకొనెను.” “జ్ఞానులు చెప్పుమాటలు ములుకోలలవలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకులవలెను ఉన్నవి. అవి ఒక్క కాపరివలన అంగీకరింపబడి నట్టున్నవి. ఇదియునుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము.” ప్రసంగి. 12:9-12.PKTel 41.2

    అతడు ఇలా రాశాడు, “ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్ధమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచు చుండవలెను, మానవకోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదేగాని చెడ్డదేగాని, తీర్పు లోనికి తెచ్చును.” 13, 14 వచనాలు.PKTel 41.3

    సొలొమోను తన చెడు మార్గాల్ని గుర్తించినకొద్దీ, తనకు దేవుడిచ్చిన ప్రశస్తవరాల్ని వ్యర్థపుచ్చటానికి దారితీసిన తప్పిదాల్లో యువజనులు పడకుండా వారిని హెచ్చరించటానికి ప్రత్యేక శ్రద్ద చూపించాడని అతడి చివరిదినాల రచనలు వెల్లడి చేస్తున్నాయి. దేవున్ని తన ఆదరణ, ఆధారం, జీవనంగా ఎంపిక చేసుకుని ఉండాల్సిన తన యౌవనకాలంలో, పరలోకపు వెలుగునుంచి దేవుని వివేకంనుంచి తొలగిపోయి యెహోవా ఆరాధనస్థానంలో విగ్రహారాధనను స్థాపించానని అతడు దుఃఖంతోను, సిగ్గుతోను ఒప్పుకున్నాడు. ఇప్పుడు అట్టి జీవితంలోని బుద్దిహీనతను విషాదభరితమైన అనుభవంద్వారా తెలుసుకున్న మిదట తాను పొందిన అవాంఛనీయ అనుభవాన్ని పొందకుండా ఇతరుల్ని కాపాడాలన్న తపన అతనిలో చోటుచేసుకుంది.PKTel 41.4

    దేవుని సేవలో యువతముందున్న విశేషావకాశాలు బాధ్యతల గురించి ఇలా కరుణార్ధంగా రాశాడు : “వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నుల కింపుగా నున్నది. ఒకడు చాల సంవత్సరములు బ్రదికిన యెడల చీకటిగల దినములు అనేకములు వచ్చునని యెరిగియుండి తాను బ్రదుకు దినములన్నియు సంతోషముగా ఉండవలెను, రాబోవునదంతయు వ్యర్థము. యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టియొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము, అయితే వీటన్నిటినిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచు కొనుము. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములోనుండి వ్యాకులమును తొలగించు కొనుము. నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము.” ప్రసంగి. 11:7-10.PKTel 42.1

    “దుర్దినములు రాకముందే - ఇప్పుడు వీటియందు
    నాకు సంతోషములేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే.”

    “తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే
    వాన వెలిసిన తరువాత మేఘములు రాకముందే
    నీ బాల్యమునందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.”

    “ఆ దినమున ఇంటి కావలివారు వణకుదురు
    బలిష్ణులు వంగుదురు, విసరువారు కొద్దిమందియగుట చేత
    పని చాలించుదురు, కిటికీలగుండ చూచువారు కానలేకయుందురు
    తిరుగటిరాళ్లధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును.”

    “పిట్టయొక్క కూతకు ఒకడు లేచును; సంగీతము చేయు స్త్రీలు
    నాదము చేయు వారందరును నిశ్శబ్దముగా ఉంచబడుదురు.”

    “ఎత్తు చోటులకు భయపడుదురు. మార్గములయందు
    భయంకరమైనవి కనబడును.”

    “బాదము వృక్షము పువ్వులు పూయును
    మిడుత బరువుగా ఉండును
    బుడ్డ బుడుసరి కాయ పగులును.”

    “ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికిపట్టునకు పోవుచున్నాడు
    వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు.” “వెండిత్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును
    ధారయొద్దకుండ పగిలిపోవును బావియొద్ద చక్రము పడిపోవును.”

    “మన్నయినది వెనుకటివలెనే మరల భూమికి చేరును
    ఆత్మ దాని దయచేసిన దేవునియొద్దకు మరలపోవును.”
    PKTel 42.2

    ప్రసంగి 12:1-7.

    యువతకు మాత్రమేకాదు పరిణత వయస్కులికి, పడమటి సూర్యుడి దిశగా నడుస్తున్న పెద్ద వయస్కులికి కూడా సొలొమోను జీవితంనిండా హెచ్చరిక ఉన్నది. యువతలోని అస్థిరతను మనం చూస్తాం, దాన్ని గురించి వింటాం. యువజనులు మంచిచెడుల మధ్య ఊగిసలాడ్డారు. ఆవేశకావేషాల్ని ప్రతిఘటించటానికి వారికి బలంచాలదు. పరిణత వయసులో ఉన్నవారు అస్థిరంగా అపనమ్మకంగా ఉండకూడదు. సాధారణంగా వారు స్థిర ప్రవర్తన పటిష్ఠ నియమాలు కలిగి ఉండాలని మనం ఆశిస్తాం. అయితే ఇది ఎల్లప్పుడూ జరగదు. సింధూర వృక్షంలా స్థిరంగా నిలువవలసినప్పుడు సొలొమోను శోధనకులోనై కూలిపోయాడు. తాను బలంగా ఉండాల్సినప్పుడు అతడు మిక్కిలి బలహీనుడయ్యాడు. PKTel 43.1

    యువత ఏంటి పెద్దవారేంటి మెలకువగా ఉండి ప్రార్థించటంలోనే అందరికీ క్షేమముందని ఈ సాదృశ్యాలనుంచి మనం నేర్చుకోవాలి. ఉన్నత హోదాల్లోను, ప్రత్యేక హక్కులు ఆధిక్యతల్లోను భద్రతలేదు. ఒక వ్యక్తి అనేక సంవత్సరాలు యధార్థ క్రైస్తవ జీవితానుభవం కలిగి ఉండవచ్చు. అయినా అతడు సాతాను దాడులికి అతీతుడు కాడు. అంతర్గత పాపంతో బహిర్గత శోధనతో పెనుగులాటలో జ్ఞాని, శక్తిమంతుడు అయిన సొలొమోను పరాజయం పాలయ్యాడు. ఒక వ్యక్తి ప్రతిభ ఎంతటిదైనా, గతంలో అతడు దేవునికి ఎంత గొప్ప సేవ చేసిఉన్నా అతడు తన సొంత వివేకాన్ని నమ్ముకోటం క్షేమంకాదని సొలొమోను వైఫల్యం బోధిస్తున్నది.PKTel 43.2

    ప్రతీ తరంలో, ప్రతీ దేశంలో ప్రవర్తన నిర్మాణానికి పునాది నమూనా ఒక్కటే. “నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో ప్రేమింపవలెను .... నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను” అన్న దైవ ధర్మశాస్త్రం, క్రీస్తు జీవితంలో ప్రదర్శితమైన నీతి నియమం. ఇదే ఒకే ఒక స్థిరమైన పునాది. ఒకే ఒక నిశ్చితమైన మార్గదర్శి. (లూకా 10:27). “నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును. రక్షణ బాహుళ్యమును, బుద్ధిజ్ఞానముల సమృద్ధియు కలుగును.” (యెష 33:6). అవి దైవ వాక్యం మాత్రమే ఇవ్వగల బుద్దిజ్ఞానాలు. “ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలెను. వాటినిగూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మాకు వివేకము” (ద్వితీ. 4:6) అంటూ ఇశ్రాయేలు ఆజ్ఞల్ని ఆచరించటం గురించి చెప్పిన ఈ మాటలు నాడు ఎంత నిజమో నేడు అంతే నిజం. వ్యక్తిగత విశ్వాస పాత్రతకు, కుటుంబ పవిత్రతకు లేదా జాతి సుస్థిరతకు ఇదే సూత్రం. జీవిత సమస్యలు, అపాయాలు, పరస్పర విరుద్ద హక్కుల నడుమ సురక్షితమైన స్థిరమైన నియమం దేవుడు చెబుతున్నదే. “యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి”, “ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు.” కీర్త. 19:8; 15:5. PKTel 43.3

    సొలొమోను భ్రష్టత హెచ్చరికను లక్ష్యపెట్టేవారు అతణ్ని నాశనం చేసిన పాపాల్ని ఆరంభంలోనే విసర్జిస్తారు. దైవవిధులకు విధేయత మాత్రమే వ్యక్తిని భ్రష్టుడు కాకుండా కాపాడ్తుంది. దేవుడు మానవుడికి గొప్ప వెలుగును అనేక దీవెనలను ఇచ్చాడు. వీటిని మనం స్వీకరిస్తేనే తప్ప అవి మనల్ని అవిధేయతనుంచి, భ్రష్టతనుంచి భద్రపర్చలేవు. దేవుడు ఎవరిని ఉన్నత స్థానాల్లో ఉంచుతాడో వారు ఆయననుంచి తొలగిపోయి మానవ జ్ఞానాన్ని నమ్ముకుంటే వారి వెలుగు చీకటిగా మారుతుంది. వారికి దేవుడిచ్చిన సామర్ద్యాలు ఒక ఉచ్చుగా మార్తాయి.PKTel 44.1

    మంచి చెడులమధ్య సంఘర్షణ సమాప్తమయ్యేంతవరకు దేవునినుంచి విడిపోయేవారు ఉంటూనే ఉంటారు. దైవశక్తి మనల్ని కాపాడ్డూ ఉంటే తప్ప సాతాను పరిస్థితుల్ని అదుపుచేసి మన ఆత్మశక్తుల్ని నిర్వీర్యం చెయ్యటానికి ప్రయత్నిస్తాడు. అడుగడుగున మనం “ఇది ప్రభువు మార్గమేనా?” అని ప్రశ్నించుకోవాలి. జీవించినంత కాలం స్థిరబుద్ధితో మన అభిరుచులు రాగద్వేషాల గురించి జాగ్రత్తగా ఉండాలి. దేవునిపై ఆనుకొని ఉంటేనేగాని ఒక్క నిమిషంకూడా మనకు క్షేమం ఉండదు. మన జీవితం క్రీస్తులో దాగి ఉండాలి.PKTel 44.2

    దేవుని పట్టణంలో ప్రవేశించేవారందరూ ఇరుకు ద్వారంగుండా ప్రవేశిస్తారు - బాధాకరమైన ప్రయాసతో. ఎందుకంటే “నిషిద్దమైనదేదైనను దానిలో ప్రవేశింపనే” ప్రవేశించదు. ప్రక. 21:27. కాగా పడిపోయినవారెవరూ నిస్పృహ చెందనవసరంలేదు. ఒకప్పుడు దేవుడు గౌరవించిన పెద్ద వయస్కులు తమ ఆత్మల్ని అపవిత్రపర్చుకుని ఉండవచ్చు. కామ బలిపీఠంపై సచ్ఛీలాన్ని బలి ఇచ్చి ఉండవచ్చు. అయినా వారు పశ్చాత్తాపపడి, పాపాన్ని విడచిపెట్టి దేవుని తట్టు తిరిగినట్లయితే, వారికి ఇంకా నిరీక్షణ ఉన్నది. “మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటమిచ్చెదను” అన్న ఆయనే “భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యెహోవా వైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును.” అన్న ఆహ్వానాన్ని అందిస్తున్నాడు. ప్రక. 2:10; యెష. 55:17. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు. కాని పాపిని ప్రేమిస్తాడు. “నేను వారిని గుణపరచెదను.” “మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును.” అని ప్రకటిస్తున్నాడు. హోషే 14:4.PKTel 44.3

    సొలొమోను పశ్చాత్తాపం యధార్ధమైంది. అయితే అతడి ప్రవర్తనవల్ల జరిగిన కీడును రద్దుపర్చటం సాధ్యంకాదు. అతడి భ్రష్టత సంభవించిన కాలంలో దేవునికి నమ్మకంగా నిలిచిన మనుషులు ఆ రాజ్యంలో ఉన్నారు. వారు తమ పవిత్రతను విశ్వాసనీయతను కాపాడుకున్నారు. కాని అనేకమంది అపమార్గం పట్టారు. విగ్రహారాధన, లోకాచారాల ఆచరణవల్ల విజృంభించిన దుష్టశక్తుల్ని పశ్చాత్తపుడైన రాజు నిలువరించలేకపోయాడు. అతడి ప్రభావం బలహీనమవ్వటంతో జరగాల్సినది జరగలేదు. అతడి నేతృత్వాన్ని పూర్తిగా విశ్వసించటానికి అనేకులు వెనకాడారు. రాజు తన పాపాల్ని ఒప్పుకొని భావితరాల మేలుకోసం తన పాపాన్ని పశ్చాత్తాపాన్ని గూర్చిన కథ రచించినా తన దుష్కృతాల హానికరమైన ప్రభావాన్ని పూర్తిగా నిర్మూలించటం సాధ్యపడలేదు. అతడి భ్రష్టత చేకూర్చిన ధైర్యంతో అనేకులు దుర్వర్తనను విచ్చలవిడిగా కొనసాగించారు. అతడి తర్వాత వచ్చిన అనేకమంది. రాజుల నీతిబాహ్య ప్రవర్తన పలుకుబడివల్ల దేవుడిచ్చిన వరాల వక్రీకరణ జరిగింది.PKTel 45.1

    తాను అవలంబించిన దుర్మార్గం గురించి హృదయవేదనతో ఆలోచిస్తూ సొలొమోను ఇలా అన్నాడు, “యుద్దాయుధములకంటే జ్ఞానము శ్రేష్టము; ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును.” “పొరపాటున అధిపతిచేత జరుగు దుష్కార్యమొకటి నేను చూచితిని. ఏమనగా బుద్దిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుట.”PKTel 45.2

    “బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుటచేత అది చెడు వాసన కొట్టును; కొంచెము బుద్దిహీనత త్రాసులో ఉంచినయెడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును.” ప్రసంగి 9:18; 10: 5,6,1. PKTel 45.3

    సొలొమోను జీవితం బోధిస్తున్న అనేక పాఠాల్లో ఒకటి పలుకుబడికి మంచికో చెడుకో ప్రభావితంచేసే శక్తి ఉన్నదని నొక్కి చెబుతుంది. మన పరిధి ఎంత చిన్నదైనా మనం మంచికో చెడుకో ప్రభావితం చేస్తాం. మనం గ్రహించకుండగనే ఇతరులికి దీవెనగానో శాపంగానో అది పరిణమించవచ్చు. అది అసంతృప్తి, స్వార్థంతో భారంగా మారవచ్చు. లేక ప్రియమైన పాపంతో విషపూరితమై ఉండవచ్చు, లేక అది ప్రాణమిచ్చే శక్తిగల విశ్వాసం, ఉత్సాహం, నిరీక్షణతో నిండి ఉండవచ్చు, ప్రేమతో పరిమళించేది కావచ్చు. కాని అది మేలుకో కీడుకో గొప్ప శక్తి కలిగి ఉంటుంది.PKTel 45.4

    మన ప్రభావం మరణం కలిగించే వాసన కావటమన్నది భయంకరమైన తలంపు. అయినా అది సాధ్యమే. మనం తప్పుదారిని నడిపించిన ఒక ఆత్మ నిత్య జీవితానందాన్ని పోగొట్టుకోటం - ఆ నష్టాన్ని ఎవరు అంచనా కట్టగలరు! అయినా ఒక్క దుందుడుకు కార్యం, ఆలోచించకుండా మనం అన్న ఒక్కమాట మరొకరిపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. అది అతడి ఆత్మను నాశనం చెయ్యవచ్చు. ప్రవర్తనలో ఒక్కమచ్చ అనేకుల్ని క్రీస్తునుంచి దూరంగా వెళ్లిపోయేటట్లు చేయవచ్చు.PKTel 46.1

    నాటిన విత్తనం పంట పండటం దా నాటటంలాగే ఇది కూడా విస్తారమైన పంట పండుతుంది. ఇతరులతో మన సంబంధంలో ఇది వాస్తవం. ప్రతీ క్రియ, ప్రతీమాట ఒక విత్తనం. అది దాని పంట పండుతుంది. దయగల ప్రతీ కార్యం, ప్రతీ విధేయ కార్యం, ప్రతీ ఆత్మ త్యాగ కార్యం, ఇతరుల్లో పునరావృత మౌతుంది, వారిద్వారా ఇంకా ఇతరుల్లో అది పునరావృతమౌతుంది. ఇలా అసూయ ద్వేషం లేక విభేదంతో నిండిన ప్రతీ కార్యం ఒక విత్తనం లాంటిది. అది “చేదైన వేరు”గా మొలిచి, అనేకుల్ని అపవిత్రులు చేస్తుంది. (హెబ్రీ. 12:15). ఆ “అనేకులు” ఇంకా ఎంతమందిని అపవిత్రుల్ని చేస్తారు! ఇలా మంచి చెడులు నాటటం ఇప్పుడు సాగుతుంది, ఇకముందుకూడా సాగుతుంది.PKTel 46.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents