Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ప్రవక్తలు - రాజులు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    30 - అష్షూరు చెర విముక్తి

    జాతీయంగా మిక్కిలి ప్రమాదకర సమయంలో అషూరీయులు దాడిచేస్తే దాని ఫలితంగా జరిగే సర్వనాశనం నుంచి యెరూషలేమును రక్షించగలిగింది ఏదీలేనట్లు కనిపించే సమయంలో ఆ అన్యమత హింసకులను ధైర్యంగా ప్రతిఘటించటానికి విడుదల పొందటానికి యెహోవా శక్తిమీద ఆధారపడటానికి తన రాజ్యంలోని ప్రజల్ని హిజ్కియా సంఘటితపర్చాడు. హిజ్కియా ప్రజల్ని ఇలా ఉద్రేకపర్చాడు, “మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి; అష్షూరు రాజుకైనను అతని కూడనున్న సైన్యమంతటి కైనను మీరు భయపడవద్దు. విస్మయ మొందవద్దు. అతనికి కలిగియున్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంససంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు.” 2 దిన వృ. 32:7,8.PKTel 239.1

    ఫలితం గురించి హిజ్కియా నిశ్చితంగా మాట్లాడటం కారణరహితం కాదు. అతిశయంగా మాట్లాడే అష్షూరు ప్రజల్ని దేవుడు కొంతకాలం జాతుల్ని శిక్షించటానికి తన కోపం చేతిలో కొరడగా ఉపయోగించటం జరిగినా వారు ఎల్లప్పుడూ విజయాలు సాధించాల్సి లేరు. యెష. 10:5 చూడండి. “అష్షూరు రాజుకు... భయపడవద్దు” అన్నది సీయోనులో నివసిస్తున్న వారికి యెషయద్వారా కొన్ని సంవత్సరాలముందు ప్రభువిచ్చిన వర్తమానం. “అష్షూరు కఱ్ఱతో నిన్ను కొట్టి నీమీద తన దండము ఎత్తినను భయపడకుము. ఇకను కొద్దికాలమైన తరువాత... నా ఉగ్రత తిరుగును. ఓరేబు బండయొద్ద మిద్యానును హతము చేసినట్లు సైన్యములకధిపతియగు యెహోవా తన కొరడాలను వానిమీద ఆడించును. ఆయన దండము సముద్రమువరకు వచ్చును. ఐగుప్తీయులు దండమెత్తినట్లు ఆయన దానినెత్తును. ఆ దినమున నీ భుజముల మిదనుండి అతని బరువు తీసివేయబడును. నీ మెడ మిదనుండి అతని కాడి కొట్టివేయబడును. నీవు బలిసినందున ఆ కాడి విరుగుగొట్టబడును.” 24-27 వచనాలు.PKTel 239.2

    “రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున” మరొక ప్రవచన వర్తమానంలో ప్రవక్త ఇలా ప్రకటించాడు, “సైన్యములకధిపతియగు యెహోవా ప్రమాణ పూర్వకముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు - నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును. నేను యోచించినట్లు స్థిరపడును. నా దేశములో అషూరును సంహరించెదను. నా పర్వతములమీద దాని నలుగదొక్కెదను. వాని కాడి నా జనులమీదనుండి తొలగిపోవును.. వాని భారము వారి భుజముల మీదనుండి తొలగింపబడును. సర్వలోకమునుగూర్చి నేను చేసిన ఆలోచన ఇదే. సైన్యముల కధిపతియగు యెహోవా దాని నియమించియున్నాడు. రద్దుపరచగల వాడెవడు? బాహువు చాచినవాడు ఆయనే. దాని త్రిప్పగలవాడెవడు?” యెష 14:8,24-27.PKTel 240.1

    హింసకుడి శక్తిని నిర్వీర్యం చేయాల్సి ఉంది. అయినా ఆహాజు చేసుకున్న ఒప్పందం మేరకు హిజ్కియా తన పరిపాలన తొలి సంవత్సరాల్లో అషూరుకి కప్పం చెల్లించాడు. అంతలో రాజు తన యధిపతులతోను పరాక్రమశాలులతోను యోచన” చేసి తన రాజ్యాన్ని కాపాడటానికి చేయగలిగినదంతా చేశాడు. యెరూషలేము పట్టణ ప్రాకారంలోపల నీళ్లు సమృద్ధిగా అందుబాటులో ఉండటానికి, కాని పట్టణం వెలపల నీటికి ఎద్దడి ఏర్పడటానికి హిజ్కియా ఏర్పాట్లు చేశాడు. “మరియు రాజు ధైర్యము తెచ్చుకొని, పాడైన గోడ యావత్తు కట్టించి, గోపురములవరకు దాని ఎత్తు చేయించి, బయట మరియొక గోడను కట్టించి దావీదు పట్టణములో మిల్లో దుర్గమును బాగు చేయించెను.” 2 దిన వృ. 32:3,5,6. ముట్టడి సమయంలో కావలసిన సిద్దబాటు అంతా ఏ లోపం లేకుండా చేశాడు.PKTel 240.2

    హిజ్కియా యూదా సింహాసనానికి వచ్చేసరికే అపూరీయులు ఉత్తరరాజ్యం నుంచి ఇశ్రాయేలీయుల్ని పెద్ద సంఖ్యతో చెరపట్టుకుపోయారు. హిజ్కియా పరిపాలించటం మొదలు పెట్టిన కొన్ని సంవత్సరాల అనంతరం, అతడింకా యెరూషలేమును పటిష్ట పర్చుతున్న తరుణంలో అషూరీయులు షోమ్రోనును ముట్టడించి పట్టుకుని, పదిగోత్రాల ప్రజల్నీ అష్షూరు దేశమంతటా చెదరగొట్టారు. యూదా సరిహద్దులు కొద్దిదూరంలోనే ఉన్నాయి. యెరూషలేము ఏభై మైళ్ల దూరంలోనే ఉంది. దేవాలయంలో ఉన్న ధనం శత్రువులు తిరిగి రావటానికి గొప్ప శోధనగా ఉండేది.PKTel 240.3

    ఇలాగుండగా యూదరాజు శత్రువుని ప్రతిఘటించటంలో తనపాత్రను నిర్వహించటానికి ధృఢ సంకల్పంతో ఉన్నాడు. మానవ శక్తియుక్తులన్నిటినీ వినియోగించి తాను చేయగలిగిందంతా చేశాక, అతడు తన సైన్యాన్ని సమీకరించి ధైర్యంగా ఉండాల్సిందిగా హితవు చెప్పాడు. “నీ మధ్యనున్న ఇశ్రాయేలుయొక్క పరిశుద్ద దేవుడు ఘనుడైయున్నాడు అన్నది యూదాకు యెషయా ఇచ్చిన వర్తమానం. రాజు అచంచల విశ్వాసంతో ఇలా ప్రకటించాడు, “మనకు సహాయము చేయుటకు మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు.” యెష 12:6; 2 దిన వృ. 32:8.PKTel 240.4

    విశ్వాస జీవితం విశ్వాసాన్ని పుట్టిస్తుంది. ఈ పనిని ఇంకేదీ చెయ్యలేదు. యూదా రాజు రానున్న తుపానుకి సిద్ధపడ్డాడు. అష్షూరు విషయంలో ప్రవచనం తప్పక నెరవేర్తుందన్న విశ్వాసంతో ఇప్పుడతడు దేవునిమీద ఆధారపడ్డాడు. యూదా ప్రజలు రాజైన హిజ్కియా చెప్పిన మాటలయందు నమ్మికయుంచిరి.” 2 దిన వృ. 32:8. లోకంలోని సమున్నత దేశాల్ని జయించి ఇశ్రాయేలులోని షోమ్రోనుపై విజయం సాధించిన అష్షూరు సైన్యం ఇప్పుడు తన దృష్టిని యూదాపై నిలిపితే మాత్రం ఏమిటి? “విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి గదా? వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహములకంటే ఎక్కువైనవి గదా? షోమ్రోనుకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా?” అని వారు ప్రగల్భాలు పలికితే మాత్రం ఏమిటి? యెష 10:10,11. యూదా ఎవరికీ దేనికీ భయపడాల్సిన అవసరంలేదు. ఆ ప్రజలు యెహవాను నమ్ముకున్నారు.PKTel 241.1

    వారు చాలాకాలంగా భయపడ్తున్న విపత్తు వచ్చిపడింది. విజయం సాధిస్తున్న అష్షూరు సేనలు యూదాలో ప్రత్యక్షమయ్యాయి. విజయం తమదేనన్న ధీమాతో నాయకులు తమ సేనను రెండుగా విభజించారు. ఒక విభాగం దక్షిణాన ఐగుప్తు సైన్యాన్ని ఎదుర్కోగా రెండో విభాగం యెరూషలేమును ముట్టడి వేయాల్సి ఉంది.PKTel 241.2

    ఇప్పుడు యూదా నిరీక్షణ దేవునిమీదే ఉంది. ఐగుప్తు నుంచి సహాయమందే మార్గాలు మూతపడ్డాయి. సహాయమందించటానికి ఏ రాజ్యమూ సమీపంలో లేదు.PKTel 241.3

    సుశిక్షితమైన తమ సేనలని నమ్ముకుని అష్షూరు అధికారులు యూదాలోని ప్రధాన వ్యక్తులతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో వారు యెరూషలేమును తమకు స్వాధీనం చెయ్యాల్సిందని యూదా ప్రధానుల్ని డిమాండు చేశారు. దానితోపాటు వారు హెబ్రీ ప్రజల దేవుణ్ని దూషించారు. ఇశ్రాయేలు ప్రజలు యూదా ప్రజల బలహీనతవల్ల మతభ్రష్టతవల్ల చుట్టుపట్లఉన్న రాజ్యాలలో దేవుని భయంలేదు. ఆయన నామం నిత్యం నిందకు ఎగతాళికి గురి అయ్యింది. యెష. 52:5 చూడండి.PKTel 241.4

    సనెరీబు ప్రధానాధికారుల్లో ఒకడైన రబాకే ఇలా అన్నాడు, “ఈ మాట హిజ్కియాలో తెలియజెప్పుడు - మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా - నీవు ఈలాగు చెప్పవలెను. నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏపాటి ప్రయోజనకారి? యుద్ద విషయములోని యోచనయు నీ బలమును వట్టిమాటలే. ఎవని నమ్ముకొని నామీద తిరుగుబాటు చేయుచున్నావు?2 రాజులు. 18:19,20.PKTel 242.1

    అధికారులు పట్టణ ద్వారాల వెలపల మాట్లాడుకుంటున్నారు. వారి మాటలు పట్టణ ప్రాకారాలపై కావలివాండ్రికి వినిపిస్తున్నాయి. అష్షూరు రాజు ప్రతినిధులు యూదా ప్రధానులతో ప్రస్తావిస్తున్న అంశాలు కావలివారికి తెలియకుండా ఉండేందుకు వారు యూదా భాషలోగాక సిరియా భాషలో మాట్లాడాల్సిందిగా కోరటం జరిగింది. ఆ మనవిని లెక్కచెయ్యకుండా రబాకే గొంతెత్తి యూదా భాషలో ఇలా బిగ్గరగా అన్నాడు:PKTel 242.2

    “మహారాజైన అష్పూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చునదే మనగా - హిజ్కియా చేత మోసపోకుడి. మిమ్మును విడిపింప శక్తివానికి చాలదు. యెహోవానుబట్టి మిమ్మును నమ్మించి - యెహోవా మనలను విడిపించును; ఈ పట్టణము అష్షూరు రాజుచేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే, హిజ్కియా చెప్పిన మాట మిరంగీకరింపవలదు.PKTel 242.3

    “అష్షూరు రాజు సెలవిచ్చునదేమనగా నాతో సంధి చేసికొని నాయొద్దకు మీరు బయటికి వచ్చిన యెడల మీలో ప్రతిమనిషి తన ద్రాక్షచెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచుండును. అటు పిమ్మట మీరు చావక బ్రదుకునట్లుగా నేను వచ్చి మీ దేశమువంటి దేశమునకు, అనగా గోధుమలును ద్రాక్షరసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్షచెట్లునుగల దేశమునకును మిమ్మును తీసికొనిపోదును.PKTel 242.4

    “యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును మోసపుచ్చు చున్నాడు. ఆయా జనుల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరు రాజు చేతిలోనుండి విడిపించేనా? హమాతు దేవతలేమాయెను? అర్పాదు దేవతలేమాయెను? సెపర్వయీము దేవతలేమాయెను? షోమ్రోను దేశపు దేవత నా చేతిలోనుండి షోమ్రోనును విడిపించేనా? యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును విడపించు ననుటకు ఈ దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును నా చేతిలోనుండి విడిపించినది కలదా?” యెష 36:13-20.PKTel 242.5

    ఈ ఎగతాళి మాటలకు “వారెంత మాత్రమును ప్రత్యుత్తరమియ్యక ఊరకొనిరి.” సమావేశం ముగిసింది. యూదు ప్రతినిధులు “బట్టలు చింపుకొని హిజ్కియా యొద్దకు వచ్చి రబాకే పలికిన మాటలన్నియు తెలియజెప్పిరి.” 21,22 వచనాలు. దేవదూషణతో నిండిన ఆ సవాలును విన్న హిజ్కియా తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు” వెళ్లాడు. 2 రాజులు. 19:1.PKTel 242.6

    ఆ సమావేశ ఫలితాన్ని యెషయాకు వివరించటానికి రాజు ఒక దూతను పంపాడు. హిజ్కియా ఈ వర్తమానం పంపాడు, “ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయుగల దినము... జీవముగల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబాకే పలికిన మాటలన్నియు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి, నీ దేవుడైన యెహోవాకు వినబడియున్న ఆ మాటలనుబట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో కాబట్టి నిలిచిన శేషముకొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము.” 3,4 వచనాలు.PKTel 243.1

    “రాజైన హిజ్కియాయును, ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశముతట్టు చూచి మొఱ్ఱ” పెట్టారు. 2 దిన వృ. 32:20.PKTel 243.2

    దేవుడు తన సేవకుల ప్రార్థనల్ని ఆలకించి సమాధానం ఇచ్చాడు. యెషయా ద్వారా హిజ్కియాకు ఈ వర్తమానం పంపాడు : “యెహోవా సెలవిచ్చునదేమనగా - అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక యాత్మను నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశమునకు వెళ్లిపోవును. తన దేశమందు కత్తిచేత అతని కూలచేయుదును.” 2 రాజులు 19:6,7.PKTel 243.3

    యూదా ప్రధానులతో జరిగిన సమావేశంనుంచి అష్షూరు ప్రతినిధులు వెళ్లి ప్రత్యక్షంగా తమ రాజుతో మాట్లాడారు. ఐగుప్తు నుంచి పట్టణానికి ప్రవేశ ద్వారాన్ని కాపాడున్న సైనిక విభాగంతో అతడు ఉన్నాడు. ఆ నివేదిక విని సనెరీబు, “ఇతర దేశముల జనుల దేవతలు తమ జనులను నా చేతిలోనుండి యేలాగున విడిపింప లేకపోయిరో ఆలాగున హిజ్కియా సేవించే దేవుడును తన జనులను నా చేతిలోనుండి విడిపింపలేకపోవునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిందించుటకును, ఆయనమీద అపవాదములు పలుకుటకును అతడు పత్రికలు వ్రాసి పంపెను.” 2 దిన. 32:17.PKTel 243.4

    ఈ బెదిరింపుతో జతచేసి ఈ వర్తమానం కూడా పంపాడు : “యూదా రాజగు హిజ్కియాతో ఈలాగు చెప్పుడి - యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింప బడదని చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవునిచేత మోసపోకుము. ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినదిగదా నీవు మాత్రము తప్పించుకొందువా? నా పితరులు నిర్మూలము చేసిన గోజానువారు గాని హారానువారుగాని, రెజేపులుగాని, తెలశ్శారులో నుండిన ఏదైనీయులుగాని తమ దేవతల సహాయమువలన తప్పించుకొనిరా? హమాతు రాజు ఏమాయెను? అర్పాదు రాజును సెపర్వతాము హేనఇవ్వా అను పట్టణముల రాజులును ఏమైరి?” 2 రాజులు 19:10-13.PKTel 243.5

    యూదా రాజు ఈ ఎత్తిపొడుపు ఉత్తరం అందుకున్న తర్వాత దాన్ని దేవాలయంలోకి తీసుకువెళ్లి “యెహోవా సన్నిధిని దాని విప్పి పరిచి” ఇశ్రాయేలీయుల దేవుడు సజీవుడని ఆయన విశ్వపరిపాలన చేస్తున్నాడని భూజనులందరూ తెలుసు కునేటట్లు సహాయం అందించమంటూ ప్రగాఢ విశ్వాసంతో ప్రార్థన చేశాడు. 14వ వచనం. యెహోవా ప్రతిష్ఠకు విఘాతం కలిగే ప్రమాదం ఏర్పడింది. విమోచన ఆయనవల్ల మాత్రమే సాధ్యం.PKTel 244.1

    హిజ్కియా ఇలా ప్రభువుతో విజ్ఞాపన చేశాడు : “యెహోవా, కెరూబులమధ్య నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యాకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవైయున్నావు. యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము; జీవముగల దేవుడవైన నిన్ను దూషించుటకై సనెరీబు పంపిన వాని మాటలను చెవినిబెట్టుము. యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడుచేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుండ్లు కాక మనుష్యులచేత చేయబడిన కఱ్ఱలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవానని తెలిసికొనునట్లుగా అతని చేతిలోనుండి మమ్మును రక్షించుము.” 2 రాజులు 19:15-19.PKTel 244.2

    “ఇశ్రాయేలునకు కాపరీ, చెవియొగ్గుము
    మందవలె యోసేపును నడిపించువాడా,
    కెరూబులమీద ఆసీనుడవైనవాడా, ప్రకాశింపుము
    ఎఫ్రాయిము బెన్యామీను మనష్షే అనువారి యెదుట
    నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మును రక్షింప
    రమ్ము
    దేవా, చెరలోనుండి మమ్మును రప్పించుము
    మేము రక్షణనొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింప
    జేయుము “యెహోవా, సైన్యములకధిపతియగు దేవా,
    నీ ప్రజల మనవి నాలకింపక నీవెన్నాళ్లు నీ కోపము
    పొగరాజనిచ్చెదవు?
    కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు
    విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చు
    చున్నావు
    ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మును అప
    హాస్యము చేయుచున్నారు
    సైన్యములకధిపతియగు దేవా, చెరలోనుండి మమ్ము
    రప్పించుము
    మేము రక్షణనొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింప
    జేయుము

    “నీవు ఐగుప్తులోనుండి, ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి
    అన్య జనులను వెళ్లగొట్టి నాటితివి
    దానికి తగిన స్థలము సిద్దపరచితివి
    దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపిం
    చెను
    దాని నీడ కొండలను కప్పెను
    దాని తీగెలు దేవుని దేవదారు వృక్షములను ఆవ
    రించెను
    దాని తీగెలు సముద్రము వరకు వ్యాపించెను
    యూఫ్రటీసు నదివరకు దాని రెమ్మలు వ్యాపించెను”

    “త్రోవను నడుచువారందరు దాని తెంచివేయునట్లు దాని చుట్టునున్న
    కంచెలను నీవేల పాడు చేసితివి?
    అడవి పంది దాని పెకలించుచున్నది.
    పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి
    సైన్యములకధిపతియగుదేవా, ఆకాశములోనుండి
    మరల చూడుము
    ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము
    నీ కుడిచేయి నాటిన మొక్కలను కాయుము
    నీకొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము
    నీవు మమ్మును బ్రదికింపుము అప్పుడు నీ నామమును
    బట్టియే మేము మొఱ్ఱపెట్టుదము యెహోవా, సైన్యములకధిపతియగుదేవా, చెరలో
    నుండి మమ్మును రప్పించుము
    మేము రక్షణనొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింప
    జేయుము.”
    PKTel 244.3

    కీర్తన 80.

    యూదా పక్షంగాను తమ సర్వోన్నత పరిపాలకుని ఘనత పక్షంగాను హిజ్కియా చేసిన విన్నపం దేవుని చిత్తానికి అనుగుణంగా ఉంది. దేవాలయ ప్రతిష్ట సమయంలో సొలొమోను చేసిన ప్రార్థనలో “ఆయన... ఇశ్రాయేలీయులగు తనజనుల కార్యమును అవసరము చొప్పున ఎల్లప్పుడు నిర్వహించుచు” “లోకమందున్న జనులందరును యెహోవాయే దేవుడనియు, ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియు” తెలుసుకునేటట్లు చేయాల్సిందని మనవి చేశాడు. 1 రాజులు 8:59,60. మరీ ముఖ్యంగా యుద్ధ సమయంలో లేక ఒక సైన్యంచే హింస పొందుతున్న సమయంలో ఇశ్రాయేలువారి ప్రముఖులు దేవాలయంలోకి వెళ్లి విడుదలకోసం ప్రార్థించాల్సి ఉన్నారు. దేవుడు వారికి సహాయం అందించాల్సి ఉంది. 33,34 వచనాలు.PKTel 246.1

    హిజ్కియా నిరీక్షణ లేనివాడు కాడు. అతడికి యెషయా ఈ వర్తమానం పంపాడు, “ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా - అష్షూరు రాజైన సన్సెరీబు విషయమందు నీవు నా యెదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించియున్నాను.” అతనిగూర్చి యెహోవా సెలవిచ్చుమాట యేదనగాPKTel 246.2

    “సీయోను కుమారియైన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది; నిన్ను అపహాస్యము చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది.”PKTel 246.3

    “నీవు ఎవరిని తిరస్కరించితివి? ఎవరిని దూషించితివి? నీవు గర్వించి యెవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునినే గదా? నీ దూతలచేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవేగదా - నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరమునకును లెబానోను పార్శ్వములకును ఎక్కియున్నాను. ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికి వేసియున్నాను. వాని దూరపు సరిహద్దులలో సత్రములలోనికిని కర్మెలు ఫలవంతములగు క్షేత్రమైన అడవి లోనికిని ప్రవేశించియున్నాను. నేను త్రవ్వి పరుల నీళ్లు పానము చేయుచున్నాను. నా అరకాలిచేత నేను దిట్టమైన స్థలముల నదులన్నిటిని ఎండిపోజేయుచున్నాను.”PKTel 246.4

    “నేనే పూర్వమందే దీని కలుగజేసితిననియు పురాతన కాలమందే దీని నిర్ణయించితిననియు నీకు వినబడలేదా? ప్రాకారములుగల పట్టణములను నీవు పాడు దిబ్బలుగా చేయుట నావలననే సంభవించినది. కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి. విశ్రాంతి నొంది పొలములోని గడ్డివలె కాడవేయని చేలవలె అయిరి.”PKTel 246.5

    “నీవు కూర్చుండుటయు బయలు వెళ్లుటయు లోపలికి వచ్చుటయు నామీద వేయు రంకెలును నాకు తెలిసే యున్నవి. నామీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను. నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను.” 2 రాజులు 19:20-28.PKTel 247.1

    ముట్టడి వేసిన సైన్యం దేశాన్ని ధ్వంసం చేసింది. కాని ప్రజల అవసరాల్ని ప్రభువు అద్బుతరీతిగా తీర్చుతానని వాగ్దానం చేశాడు. హిజ్కియాకి ఈ వర్తమానం పంపాడు: “ఈ సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దానినుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు, మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు; ద్రాక్షతోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరుతన్ని మీదికి ఎదిగి ఫలించును. శేషించినవారు యెరూషలేములోనుండి బయలుదేరుదురు. తప్పించుకొనివారు సీయోను కొండలోనుండి బయలుదేరుదురు; సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తి దీని నెరవేర్చును.”PKTel 247.2

    “కాబట్టి అష్షూరు రాజునుగూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా - అతడు ఈ పట్టణములోనికి రాడు. దానిమీద ఒక బాణమునైనను ప్రయోగింపడు. ఒక కేడెమునైన దానికి కనుపరచడు. దానియెదుట ముట్టడి దెబ్బకట్టడు. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును.” 29-34 వచనాలు.PKTel 247.3

    ఆ రాత్రే విడుదల కలిగింది. “యెహోవా దూత బయలుదేరి అషూరువారి దండుపేటలో జొచ్చి లక్షనుబది యయిదు వేలమందిని హతము చేసెను.” 35వ వచనం. “అష్షూరు రాజు దండులోని సేనానాయకులను అధికారులను” నాశనం చేశాడు. 2 దిన వృ. 32:21.PKTel 247.4

    యెరూషలేముని పట్టుకోటానికి తాను పంపిన సైన్యం సర్వనాశనమైన వార్త ఐగుప్తు నుంచి యూదాకు వచ్చే ముఖద్వారాన్ని ఇంకా కావలికాస్తున్న సనెరీబుకి అందింది. అష్షూరు రాజు భయకంపితుడై త్వరత్వరగా దేశమునకు తిరిగిపోయెను.” 21వ వచనం. అతడు తిరిగి రావటానికి సమయం లేకపోయింది. అతడి ఆకస్మిక అంతానికి సంబంధించిన ప్రవచనానికి అనుగుణంగా అతడి సొంత ఇంటివారే అతణ్ని హత్య చేశారు. “అప్పుడు అతని కుమారుడైన ఎసరద్రోను అతనికి మారుగా రాజాయెను.” యెష 37:38.PKTel 247.5

    గర్విష్ణులైన అషూరీయులపై హెబ్రీయుల దేవుడు విజయం సాధించాడు. చుట్టూ ఉన్న రాజ్యాల దృష్టిలో యెహోవా ప్రతిష్ఠ ఇబ్బడి ముబ్బడి అయ్యింది. యెరూషలేములో ప్రజల హృదయాలు పరిశుద్దానందంతో నిండాయి. విడుదలకోసం వారి విజ్ఞాపన పాపపు ఒప్పుకోళ్లతోను కన్నీటితోను సమ్మిళితమయ్యాయి. తమకు ఏర్పడ్డ గొప్ప అవసరంలో తమను రక్షించడానికి శక్తిమంతుడైన దేవునిమిద వారు సంపూర్తిగా ఆధారపడ్డారు. ఆయన వారిని ఆశాభంగపర్చలేదు. ఇప్పుడు ఆలయావరణం గంభీర స్తుతిగీత గానంతో మారుమోగింది.PKTel 248.1

    “యూదాలో దేవుడు ప్రసిద్ధుడు
    ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది
    షాలేములో ఆయన గుడారమున్నది
    సీయోనులో ఆయన ఆలయమున్నది
    అక్కడ వింటి అగ్ని బాణములను
    కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన
    విరుగగొట్టును”
    “దుష్ట మృగములుండు పర్వతముల సౌందర్యముకంటే
    నీవు అధిక తేజస్సు గలవాడవు
    కఠిన హృదయులు దోచుకొనబడియున్నారు
    వారు నిద్రనొంది యున్నారు
    పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను
    యాకోబు దేవా, నీ గద్దింపునకు
    రథసారధులకును గుఱ్ఱములకును గాఢ నిద్ర కలిగెను.”

    “నీవు, నీవే భయంకరుడవు
    నీవు కోపపడు వేళ నీ సన్నిధిని విలువగలవాడెవడు?
    నీవు తీర్చిన తీర్పు ఆకాశములోనుండి వినబడ జేసితివి.
    దేశములో శ్రమ నొందినవారినందరిని రక్షించుటకై
    న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు
    భూమి భయపడి ఊరకుండెను” “నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును
    ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు
    మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మి
    మొక్కుబడులను చెల్లించుడి
    ఆయన చుట్టునున్నవారందరు భయంకరుడగు ఆయనకు
    కానుకలు తెచ్చి అర్పింపవలెను
    అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు
    భూరాజులకు ఆయన భీకరుడు.”
    PKTel 248.2

    కీర్త. 76.

    అష్షూరు రాజ్యం ఉత్థాన పతనాల్లో నేటి ప్రపంచ జాతులు నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో ఉన్నాయి. అష్షూరు రాజ్యం ప్రగతిపథంలో అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు దేవుని వనంలో ఉన్న చెట్లు అన్నిటికన్నా ఉన్నతంగా నిలిచి ఉన్న ఉదాత్తమైన వృక్షానికి దాని ప్రాభవాన్ని పోల్చుతున్నది లేఖనం.PKTel 249.1

    “అపూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనట్లుండిరి. దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దాని కొన బహు ఎత్తయినందున మేఘములకంటెను .... దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను. ఈలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలములున్నచోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైనదాయెను.... దేవుని వనమైన ఏదేనులోనున్న వృక్షములన్నియు దాని సొగసు చూచి దానియందు అసూయపడెను.” యెహె. 31:3-9.PKTel 249.2

    అయితే అష్పూరు పరిపాలకులు తమ అపూర్వ ప్రగతిని మానవుల హితానికి వినియోగించే బదులు అనేక దేశాలకు కంటకంగా పరిణమించారు. కరుణాకటాక్షాలు మర్చిపోయి, దేవుని గురించి సాటి మనుషులగురించి ఆలోచనలేకుండా, నీనెవె దేవతల్ని సర్వోన్నతులుగా పరిగణించాలన్న స్థిర విధానాన్ని అనుసరించారు. వారిని హెచ్చరించ టానికి దేవుడు యోనాను పంపాడు. వారు కొంతకాలం దేవుని ముందు వినయ మనసుతో క్షమాపణను వేడుకున్నారు. కాని కొద్దికాలంలోనే విగ్రహారాధనకు తిరిగివెళ్లి లోకాన్ని జయించటానికి బయలు దేరారు.PKTel 249.3

    నీనెవెలోని దుష్టుల్ని ఖండిస్తూ నహూము ప్రవక్త ఇలా అంటున్నాడు :PKTel 249.4

    “నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ, అది ఎడతెగక యెర పట్టుకొనుచు మోసముతోను బలాత్కారముతోను నిండియున్నది. సారధియొక్క చబుకు ధ్వనిరు చక్రముల ధ్వనియు గుఱ్ఱముల తొక్కుడు ధ్వనియు వడిగా పరుగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నవి. రౌతులు వడిగా పరుగెత్తుచున్నారు. ఖడ్గములు తళతళలాడుచున్నవి. ఈటెలు మెరయుచున్నవి. చాలమంది హతమవుచున్నారు. చచ్చినవారు కుప్పలు కుప్పలుగా పడియున్నారు. పీనుగులకు లెక్కయేలేదు. పీనుగులు కాలికి తగిలి జనులు తొట్రిల్లుచున్నారు. చక్కనిదానవై వేశ్యవై చిల్లంగి తనమందు జ్ఞానముగలదానవై జారత్వము చేసి జనాంగము మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా నీవు చేసిన అధిక జారత్వమునుబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే. నేను నీకు విరోధినై యున్నాను. నీ చెంగులు నీ ముఖముమీది కెత్తి జనములకు నీ నామమును రాజ్యములకు నీ యవమానమును నేను బయలు పరతును.” నహూము 3:1-5.PKTel 249.5

    అనంత జ్ఞాని అయిన దేవుడు జాతుల మేలుకీడుల్ని నిర్దుష్టంగా దాఖలు చేసి ఉంచుతున్నాడు. పశ్చాత్తాపానికి పిలుపునిస్తూ కనికరం కనపర్చుతూ ఉన్నప్పుడు ఈ దాఖలాను తెరచి ఉంచుతాడు. కాని ఆ అంకెలు తాను నియమించిన సంఖ్యను మించినప్పుడు ఆయన ఉగ్రత ప్రారంభమవుతుంది. ఆ దాఖలా మూతపడ్తుంది. వారి పక్షంగా విజ్ఞాపన చెయ్యటానికి ఇక కృప ఉండదు.PKTel 250.1

    “యెహోవా దీర్ఘశాంతుడు; మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుపానులోను సుడిగాలిలోను వచ్చువాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును. నదులన్నిటిని ఆయన యెండిపోజేయును. బాషానును వాడిపోవును. లెబానోను పుష్పము వాడిపోవును. ఆయనకు భయపడి పర్వతములు కంపించును. కొండలు కరిగిపోవును. ఆయన యెదుట భూమి కంపించును. లోకమును అందలి నివాసులును వణకుదురు. ఆయన ఉగ్రతను సహింపగల వాడెవడు? ఆయన కోపము అగ్నివలె పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును.” నహూము. 1:3-6.PKTel 250.2

    “నావంటి పట్టణము మరియొకటి లేదని మురియుచు, ఉత్సాహపడుచు నిర్విచారముగా ఉండిన” నీనెవె జనులులేని పాడుపడ్డ స్థలంగాను, “వట్టిదిగాను, శూన్యముగాను, పాడుగాను” “ఎవరిని బెదిరింపకుండ సింహమును ఆడు సింహమును సింహపు పిల్లలను తిరుగులాడు” స్థలంగాను మారింది. జెఫన్యా 2:15; నహూము 2:10-11.PKTel 250.3

    అషూరీయుల గర్వం కుప్పకూలే సమయానికి ఎదురుచూస్తూ నీనెవెను గూర్చి జెఫన్యా ప్రవక్త ఇలా ప్రవచించాడు : “దానిలో పసులమందలు పండుకొనును, సకల జాతి జంతువులును గుంపులుగా కూడును. గూడబాతులును తుంబోళ్లును వారి ద్వారము పైకమ్ములమీద నిలుచును. పక్షుల శబ్దములను కిటికీలలో వినబడును. గడపలమిద నాశనము కనిపించును. వారు చేసికొనిన దేవదారు కఱ్ఱపని యంతటిని యెహోవా నాశనము చేయును.” జెఫన్యా. 2:14.PKTel 250.4

    అష్షూరు ప్రభ సమున్నతమైనది. దాని పతనంకూడా సమున్నతమైందే. ఉదాత్తమైన దేవదారు వృక్షం పోలికను కొనసాగిస్తూ అష్పూరు తన గర్వం క్రూరత్వం కారణంగా పతనం కానున్నదని యెహెజ్కేలు స్పష్టంగా ప్రవచించాడు. ప్రవక్త ఇలా ప్రకటించాడు :PKTel 251.1

    “కావున ప్రభువైన యెహోవా ఈమాట సెలవిచ్చుచున్నాడు; ... తన కొన మేఘములకంటజేసి తన యెత్తునుబట్టి అతడు గర్వించెను. కాబట్టి యతని దుష్టత్వమును బట్టి యతనిని తరిమివేసి, జనములలో బలముగల జనమునకు నేనతని నప్పగించెదను; ఆ జనము అతనికి తగిన పనిచేయును. జనములలో క్రూరులైన పరదేశులు అతనిని నరికి పారవేసిరి, కొండలలోను లోయలన్నిటిలోను అతని కొమ్మలు పడెను. భూమి యందున్న వాగులలో అతని శాఖలు విరిగిపడెను. భూజనులందరును అతని నీడను విడిచి అతనిని పడియుండనిచ్చిరి. పడిపోయిన అతని మోడుమిద ఆకాశ పక్షులన్నియు దిగివ్రాలును, అతని కొమ్మలమీద భూజంతువులన్నియు పడును. నీరున్నచోటున నున్న వృక్షములన్నిటిలో ఏదియు తన యెత్తునుబట్టి అతిశయ” పడదు....PKTel 251.2

    “ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా - అతడు పాతాళము లోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలుగజేసితిని, ... అతని పడవేయగా అతనిపాటు ధ్వనిచేత జనములను వణకజేసితిని.” యెహె. 31:10-16. PKTel 251.3

    అష్షూరు గర్వం పతనం లోకాంతం వరకు సాదృశ్యపాఠంగా ఉపకరిస్తుంది. నేడు తనకు వ్యతిరేకంగా మోహరించిన లోక రాజ్యాలగురించి దేవుడిలా అడుగు తున్నాడు, “ఘనముగాను గొప్పగా నున్న నీవు ఏదెను వనములోని వృక్షములలో దేనికి సముడవు? నీవు పాతాళము లోనికి త్రోయబడి, ఘనులై అక్కడికి దిగిపోయిన రాజులయొద్ద ఉందువు.” 18వ వచనం.PKTel 251.4

    “యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. తనయందు నమ్మికయుంచువారిని ఆయన ఎరుగును.” సర్వోన్నతునికి పైగా తమ్మును తాము హెచ్చించుకోచూచేవారిని “ప్రళయ జలమువలె ఆయన... నిర్మూలము చేయును.” నహూము 1:7-8.PKTel 251.5

    “అపూరీయుల అతిశయాస్పదము కొట్టివేయబడును, ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకొందురు.” జెకర్యా. 10:11. పూర్వం దేవుని వ్యతిరేకరించిన జాతుల విషయంలోనే గాక; నేడు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చని జాతుల విషయంలోనూ ఇది వాస్తవం. చివరి తీర్పు వెలువడే దినాన నీతిమంతుడైన న్యాయాధిపతి “జల్లెడతో ... జనములను గాలించును” (యెషయా 30:28). సత్యాన్ని ఆచరించినవారు దేవుని పట్టణంలో ప్రవేశం పొందుతారు. విమోచన పొందిన వారి విజయగీతాలతో పరలోకమంతా మారుమోగుతుంది. ప్రవక్త ఇలా అంటున్నాడు, “రాత్రియందు పండుగ నాచరించునట్లుగా మీరు సంగీతము పాడుదురు. ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన యెహోవా యొక్క పర్వతమునకు పిల్లనగ్రోవి నాదముతో ప్రయాణము చేయువారికి కలుగునట్టి హృదయ సంతోషము కలుగును. యెహోవా తన ప్రభావముగల స్వరమును వినిపించును.... యెహోవా దండముతో అషూరును కొట్టగా అది ఆయన స్వరము విని భీతినొందును. యెహోవా అషూరుమిద పడవేయు నియామక దండము వలని ప్రతిదెబ్బ తంబుర సితారాల నాదముతో పడును.” 29-32 వచనాలు.PKTel 252.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents