Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ప్రవక్తలు - రాజులు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    42 - నిజమైన గొప్పతనం

    నెబుకద్నెజరు లోక ప్రతిష్ఠ శిఖరాన్ని అధిరోహించాడు. దైవావేశం అతణ్ని “రారాజు”గా పేర్కొన్నది (యెహెజ్కేలు. 26:7). అయినా అతడు కొన్నిసార్లు తన రాజ్య వైభవం తన ఏలుబడి ప్రశస్తి యెహోవా కటాక్షం వల్లనే సాధ్యపడినట్లు చెప్పుకునే వాడు. ఆ బ్రహ్మాండమైన ప్రతిమను గూర్చి తాను కన్నకల అనంతరం చోటుచేసుకున్న పరిస్థితి ఇది. ఆ దర్శనం అతడి మనసును ప్రభావితం చేసింది. బబులోను సామ్రాజ్యం ప్రపంచ రాజ్యమైనా అది చివరికి పతనమౌతుందని, అనంతరం ఇతర రాజ్యాలు వస్తాయని చివరగా వాటన్నిటిని నాశనంచేసి దేవుని రాజ్యం స్థాపితమౌతుందని అది ఎన్నటికీ నాశనంకాని రాజ్యమన్న తలంపు అతడి మనసును తీవ్రంగా ప్రభావితం చేసింది.PKTel 358.1

    రాజ్యాల విషయంలో దేవుని సంకల్పాన్నిగూర్చి నెబుకద్నెజరుకున్న ఉదాత్త అభిప్రాయం అనంతర కాలంలోని అనుభవంలో మరుగున పడిపోయింది. అయినా దూరా మైదానంలో జనసమూహం ముందు అతడి అహంకారం దెబ్బతిన్నప్పుడు మరొకసారి దేవుని రాజ్యం “శాశ్వత రాజ్యము; ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది” అని గుర్తించాడు. పుట్టుకతోను శిక్షణ మూలంగాను విగ్రహారాధకుడు, విగ్రహారాధక ప్రజలకు రాజు అయినా అతడు స్వాభావికంగా న్యాయబుద్దిగలవాడు, సత్యానికి నిలబడేవాడు. తిరుగుబాటు స్వభావం గలవారిని శిక్షించటానికి, తన సంకల్పాన్ని నెరవేర్చటానికి దేవుడు అతణ్ని తన సాధనంగా వినియోగించుకున్నాడు. ఎన్నో సంవత్సరాలు ఓర్పుతో శ్రమపడిన అనంతరం “అన్యజనులలో క్రూరు” డయిన నెబుకద్నెజరు తూరును జయించాడు. (యెహె. 28:7). ఐగుపును కూడా అతడి సేనలు హస్తగతం చేసుకున్నాయి. దేశం తర్వాత దేశాన్ని జయించి వాటితో బబులోను సామ్రాజ్యాన్ని విస్తరించుకోటంతో అతడు ఆ యుగంలో అతిగొప్ప రాజుగా కీర్తి గడించాడు.PKTel 358.2

    ఎన్నో ఆశలతో అతిశయ స్వభావంతో నిండి విజయపథంలో ప్రస్తావిస్తున్న చక్రవర్తి నిజమైన గొప్పతనానికి దారితీసే విధేయతా మార్గాన్ని విడిచిపెట్టటం ఆశ్చర్యం కలిగించదు. తన దండయాత్రల మధ్యకాలంలో తన రాజధానిని బలో పేతం చేసి దాన్ని సుందరనగరంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన ప్రబల మవ్వటంతో తుదకు బబులోను నగరం తన రాజ్యానికి “బంగారు నగరం”గా “సర్వజగత్తు ప్రశంస” లందుకునే నగరంగా ప్రఖ్యాతి చెందాలని తలపోశాడు. నిర్మాణకుడిగా అతడి ఉద్రేకం, బబులోనును లోక వింతల్లో ఒకటిగా రూపొందించటంలో అతడు సాధించిన ఘనవిజయం అతడిలో అహంకారం పెంచింది. అది అతడు విజ్ఞత వివేకంగల పరిపాలకుడు అన్న మంచిపేరును చెరిపి, దేవుడు తన సంకల్పాల నెరవేర్పుకు అతణ్ని తన సాధనంగా వినియోగించుకోలేనంతగా పెంచింది.PKTel 358.3

    కృపగల దేవుడు అతడికి ఇంకొక కల ఇచ్చాడు. అది తానెదుర్కోబోతున్న అపాయాన్ని గురించి అతడికి అమర్చబడి ఉన్న ఉచ్చునుగురించి హెచ్చరించే కల. ఓ రాత్రి దర్శనంలో నెబుకద్నెజరు భూమి మధ్యనుంచి పెరుగుతున్న ఓ బ్రహ్మాండమైన చెట్టును చూశాడు. దాని చివర ఆకాశన్నంటుతుంది. దాని కొమ్మలు భూదిగంతాల వరకూ విస్తరించాయి. పర్వతాలు కొండలనుంచి మందమందలుగా వచ్చిన జంతువులు దానికింద విశ్రమిస్తున్నాయి. ఆకాశపక్షులు దాని కొమ్మల్లో గూళ్లు కట్టుకున్నాయి. “దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారముండెను.... సకల మనుష్యులకు చాలునంత ఆహారము దానియందుండెను.” PKTel 359.1

    రాజు ఆ మహావృక్షాన్ని చూస్తున్నప్పుడు “జాగరూకుడగు ఒక పరిశుద్దుడు” ఆ వృక్షంవద్దకు వస్తూ గొప్ప స్వరంతో ఇలా అనటం విన్నాడు :PKTel 359.2

    “ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి; పశువులను దాని నీడనుండి తోలివేయుడి; పక్షులను దాని కొమ్మలనుండి ఎగురగొట్టుడి. అయితే అది మంచునకు తడిసి పశువులవలె పచ్చికలో నివసించునట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి, పొలములోని గడ్డి పాలగునట్లు దానిని భూమిలో విడువుడి. ఏడు కాలములు గడచువరకు వానికున్న మానవ మనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును. ఈ ఆజ్ఞ జాగరూకులగు దేవదూతల ప్రకటన ననుసరించి జరుగును. నిర్ణయమైన పరిశుద్దుల ప్రకటన ననుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారియైయుండి, తానెవరికి అనుగ్రహింప నిచ్చయించునోవారికనుగ్రహించుననియు, ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుష్యులందరు తెలిసికొనునట్లు ఈలాగు జరుగును.”PKTel 359.3

    ఏదో ఆపదను గూర్చిన ప్రవచనంలా కనిపిస్తున్న ఆ కలను గురించి ఆందోళన చెందిన రాజు “శకునగాండ్రును గారడీవిద్యగలవారును కల్దీయులును జ్యోతిష్యులును” తన సన్నిధికి రాగా ఆ కల వారికి చెప్పాడు. కల ఎంతో స్పష్టంగా ఉన్నా జ్ఞానుల్లో ఎవరూ దాని భావాన్ని చెప్పలేకపోయారు.PKTel 359.4

    దేవుని ప్రేమించి ఆయనకు భయపడేవారు మాత్రమే దేవుని రాజ్యానికి సంబంధించిన మర్మాల్ని అవగాహన చేసుకోగలుగుతారని ఈ విగ్రహారాధక దేశంలో మరోసారి సాక్ష్యం చెప్పాల్సి ఉంది. దిక్కుతోచని రాజు, నమ్మకానికి స్థిరతకు పేరు పొందినవాడు సాటిలేని జ్ఞానం గలవాడు అయిన తన సేవకుడు దానియేలును పిలిపించాడు. PKTel 360.1

    రాజు ఆజ్ఞప్రకారం దానియేలు అతడి సమక్షంలో నిలిచినప్పుడు నెబుకద్నెజరు ఇలా అన్నాడు, “శకునగాండ్ర అధిపతియగు బెత్తెషాజరూ, పరిశుద్ద దేవతల ఆత్మ నీయందున్నదనియు, ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియు నేనెరుగుదును గనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియజెప్పుము.” తన కలను చెప్పిన తర్వాత నెబుకద్నెజరు ఇలా అన్నాడు, “బెత్తెషాజరూ, ... నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు. నీయందు పరిశుద్ధ దేవతల ఆత్మ యున్నది గనుక నీవే దానిని చెప్ప సమర్థుడవు.”PKTel 360.2

    దానియేలుకి ఆ కల భావం స్పష్టమయ్యింది. దాని ప్రాముఖ్యం అతడికి దిగ్రృమ కలిగించింది. అతడు “ఒక గంట సేపు విస్మయమునొంది మనస్సునందు కలవర” పడ్డాడు. దానియేలు సందేహిస్తూ వెనకాడటాన్ని విచార వైఖరిని చూసి రాజు తన సేవకుడిపట్ల సానుభూతి కనపర్చాడు. “బెత్తెషాజరూ, యీ దర్శనమువలనగాని దాని భావమువలనగాని నీవు కలవరపడకుము” అన్నాడు.PKTel 360.3

    “నా యేలినవాడా, యీ దర్శనఫలము తమరిని ద్వేషించువారికి కలుగును గాక, దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక” అన్నాడు దానియేలు. తన గర్వం అహంకారం కారణంగా తనమీదకు రానున్న తీర్పును నెబుకద్నెజరుకు వెల్లడి చేసే గంభీర విధిని దేవుడు తనకు అప్పగించాడని ప్రవక్త గుర్తించాడు. దానియేలు ఆ కల భావాన్ని రాజు గ్రహించగల మాటల్లో చెప్పాలి. దాని భయంకర ప్రాముఖ్యం అతణ్ని విస్మయంతో నింపి వెనకాడేటట్లు చేసినప్పటికీ, తనకు దాని పర్యవసానం ఏమైనప్పటికీ అతడు సత్యాన్నే చెప్పాలి.PKTel 360.4

    అప్పుడు దానియేలు దేవుడిచ్చిన తీర్పును రాజుకు తెలియపర్చాడు. దానియేలు ఇలా వివరించాడు, “తాము చూచిన చెట్టు వృద్ధినొంది బ్రహ్మాండమైన దాయెను; దాని పై కొమ్మలు ఆకాశమునకంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారముండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను గదా. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది, నీ ప్రభావము వృద్ధి నొంది ఆకాశమంత ఎత్తాయెను. నీ ప్రభుత్వము లోకమంతట వ్యాప్తి చెందియున్నది.PKTel 360.5

    “చెట్టును నరుకుము, దాని నాశనము చేయుము గాని దానిమొద్దును భూమిలో ఉండనిమ్ము; ఇనుము ఇత్తడి కలిపిన కట్టుతో ఏడు కాలములు గడుచువరకు పొలములోని పచ్చికలోదాని కట్టించి, ఆకాశపు మంచుకు తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగరూకుడగు ఒక పరిశుద్దుడు పరలోకమునుండి దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివిగదా. రాజా, యీ దర్శన భావమేదనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా యేలినవాని గూర్చి చేసిన తీర్మానమేదనగా తమయొద్ద నుండకుండ మనుష్యులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి తినెదవు; ఆకాశపు మంచు నీమీదపడి నిన్ను తడుపును; సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారియై యున్నాడనియు, తానెవనికి దాని ననుగ్రహింప నిచ్చయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలిసికొను వరకు ఏడు కాలములు నీకీలాగు జరుగును. చెట్టుయొక్క మొద్దు నుండనియ్యుడని వారు చెప్పిరిగదా దానివలన సర్వోన్నతుడు అధికారియని నీవు తెలిసికొనిన మీదట నీ రాజ్యము మరల ఖాయముగ వచ్చునని తెలిసికొమ్ము.”PKTel 361.1

    కల భావాన్ని చెప్పిన తర్వాత, పశ్చాత్తాపంపొంది దేవుని తట్టు తిరగమని, నీతి న్యాయాల్ని అనుసరించి జీవించటంద్వారా తనకు రానున్న ఆ కీడులను తప్పించుకో వచ్చునని దానియేలు రాజుతో చెప్పాడు. “రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకార మగును గాక; ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయముల ననుసరించి నీవు బాధ పెట్టినవారియందు కరుణ చూపినయెడల నీకున్న క్షేమము నీకికమీదట నుండును.” అంటూ ప్రవక్త విజ్ఞాపన చేశాడు.PKTel 361.2

    ప్రవక్త చేసిన హెచ్చరిక హితోపదేశం ప్రభావం నెబుకద్నెజరుపై కొంతకాలం బలంగా పనిచేశాయి. కాని దేవుని కృపవలన పరివర్తన చెందని హృదయంపై పరిశుద్ధాత్మ ప్రభావం ముద్ర త్వరలోనే చెరిగిపోతుంది. సుఖభోగ కోర్కెలు, అత్యాశ రాజు మనసులో నుంచి ఇంకా పూర్తిగా నిర్మూలం కాలేదు. కొంతకాలానికి ఈ గుణాలు మళ్లీ వచ్చాయి. తనకు కృపతోకూడిన ఉపదేశం వచ్చినా, గతానుభవం నుంచి ఎన్నో హెచ్చరికలు ఉన్నా, తన వెనుక రానున్న రాజ్యాలపట్ల అసూయ ఈర్ష్యల అదుపులోనుంచి నెబుకద్నెజరు బయట పడలేకపోయాడు. క్రితంలో న్యాయాన్ని కరుణా కటాక్షాల్ని అనుసరించి సాగిన అతడి రాజ్యపాలన ఇప్పుడు క్రూరంగా తయారయ్యింది. హృదయాన్ని కఠిన పర్చుకుని దేవుడిచ్చిన సామర్ధ్యాన్ని ఆత్మస్తుతికి, తనకు ప్రాణాన్ని అధికారాన్ని ఇచ్చిన దేవునికన్నా తన్నుతాను హెచ్చించుకోటానికి వినియోగించుకున్నాడు.PKTel 361.3

    దేవుని తీర్పు అమలుకాకుండా కొన్నిమాసాలపాటు నిలిచిఉంది. దేవుడు చూపించిన ఈ సహనం ఫలితంగా పశ్చాత్తాపడే బదులు రాజు మరింత గర్విష్టుడై కడకు కల భావాన్ని నమ్మలేని స్థితికి వచ్చాడు. తన కిందటి భయాలన్నీ వట్టివిగా కొట్టి పారేశాడు.PKTel 362.1

    తనకు హెచ్చరిక వచ్చిన ఏడాదికి నెబుకద్నెజరు తన రాజభవనంలో నడుస్తూ, రాజుగా తన అధికారంగురించి, నిర్మాణకుడిగా తన విజయం గురించి సగర్వంగా తలస్తూ ఇలా అన్నాడు, “బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా?”PKTel 362.2

    ఆ గర్వపు మాటలు ఇంకా రాజు పెదవులపై ఉండగానే దేవుడు నియమించిన తీర్పుకు సమయం వచ్చిందని ప్రకటిస్తూ పరలోకంనుంచి ఒక స్వరం వినిపించింది. అతడి చెవులికి యెహోవా ఇచ్చిన ఈ తీర్పు వినిపించింది: “రాజగు నెబుకద్నెజరూ, యిదే నీకు ప్రకటన - నీ రాజ్యము నీయొద్దనుండి తొలగిపోయెను. తమయొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమేదరు; నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారియైయుండి, తానెవనికి దాని అనుగ్రహింప నిచ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలిసికొనువరకు ఏడు కాలములు నీకీలాగు జరుగును.”PKTel 362.3

    ఒక్క క్షణంలో అతడి వివేచన విచక్షణా శక్తి పోయింది. తనదైన ఏ జ్ఞానం పరిపూర్ణమైందని రాజు భావించాడో, తనదైన ఏ వివేకం గురించి అతడు అతిశయించాడో అది అతడికి ఇకలేదు. ఒకప్పుడు మహాశక్తిమంతుడైన రాజు ఇప్పుడు పిచ్చివాడు. అతడి చెయ్యి రాజదండాన్ని ఇక పట్టుకోలేక పోయింది. తనకు వచ్చిన హెచ్చరికల్ని అతడు లెక్క చెయ్యలేదు. ఇప్పుడు దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయి, మనుషుల్లోనుంచి తరుమబడి నెబుకద్నెజరు “పశువులవలె గడ్డి మేసెను, ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తలవెండ్రుకలు పక్షి రాజు రెక్కల ఈకల వంటివియు అతని గోళ్లు పక్షుల గోళ్ల వంటివియు నాయెను.”PKTel 362.4

    నెబుకద్నెజరు ఏడు సంవత్సరాలు తన పాలిత ప్రజలకు ఆశ్చర్యం గొలిపాడు. ఏడు సంవత్సరాలు అతడు సర్వప్రపంచం ముందు దీనుడై సిగ్గును భరించాడు. అప్పుడు అతడికి బుద్ధి కుశలత కలిగింది. పరలోకమందున్న దేవుని వంకచూస్తూ తన శిక్షలో దేవుని హస్తాన్ని గుర్తించాడు. ఓ బహిరంగ ప్రకటనలో అతడు తన అపరాధాన్ని ఒప్పుకున్నాడు. తన పునరుద్ధరణలో అతడు తన అపరాధాన్ని ఒప్పుకున్నాడు. తన్ను పునరుద్దరించటంలో దేవుని గొప్ప కరుణను గుర్తించాడు. రాజు ఇలా అన్నాడు, “ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరను నేను మరల నా మానవ బుద్దిగలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రము చేసి ఘనపరచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు ఆయన రాజ్యము తరతరములకు నున్నవి. భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన యెడలను భూనివాసుల యెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్ధుడుకాడు.PKTel 362.5

    “ఆ సమయమందు నా బుద్ది మరల నాకు వచ్చెను, రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను, నా మంత్రులును నా క్రింది యధిపతులును నాయొద్ద ఆలోచన చేయ వచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను ఎక్కువ ఘనత నొందితిని.”PKTel 363.1

    ఒకప్పుడు గర్విష్ఠుడైన రాజు ఇప్పుడు దీనమనస్కుడు వినయుడు అయి దేవుని బిడ్డ అయ్యాడు. క్రూర, నిరంకుశ పాలకుడు, జ్ఞానము కనికరముగల రాజు అయ్యాడు. ధిక్కార వైఖరితో పరలోక దేవున్ని దూషించిన వ్యక్తి ఇప్పుడు సర్వోన్నతుని అధికారాన్ని గుర్తించి యెహోవా భయభక్తుల్ని తాను పాలించే ప్రజల ఆనందాన్ని ప్రోది చెయ్యటానికి పూనుకున్నాడు. రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అయిన ఆయన మందలింపు కింద కడకు పరిపాలకులందరు నేర్చుకోవలసిన పాఠం అనగా నిజమైన మంచితనంలోనే నిజమైన గొప్పతనం ఉందన్న పాఠం నెబుకద్నెజరు నేర్చుకున్నాడు. యెహోవానే జీవంగల దేవుడుగా గుర్తిస్తూ ఇలా అన్నాడు, “నెబుకద్నెజరను నేను పరలోక రాజుయొక్క కార్యములన్నియు సత్యములును, ఆయన మార్గములు న్యాయములునై యున్నవనియు, గర్వముతో నటించువారిని ఆయన అణప శక్తుడనియు, ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను.”PKTel 363.2

    ప్రపంచంలోని అతి గొప్ప రాజ్యం తన్ను మహిమపర్చి స్తుతించాలన్న దైవ సంకల్పం ఇప్పుడు నెరవేరింది. దేవుని కృపాబాహుళ్యాన్ని మంచితనాన్ని అధికారాన్ని గుర్తిస్తూ నెబుకద్నెజరు చేసిన బహిరంగ ప్రకటన పరిశుద్ద చరిత్రలో దాఖలైన అతడి జీవిత అంతిమ చర్య.PKTel 363.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents