Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ప్రవక్తలు - రాజులు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    39 - బబులోను రాజు ఆస్థానంలో

    డెబ్బయి సంవత్సరాల దాస్యకాల ప్రారంభంలో బబులోనుకి బానిసలుగా తీసుకు పోబడ్డ ఇశ్రాయేలు పిల్లల్లో క్రైస్తవ మత భక్తులున్నారు. నియమాలకు నిజాయితీగా నిలిచే మనుషులు వారు. స్వార్ధం వారిని పాడు చెయ్యలేకపోయింది. సర్వాన్నీ కోల్పోయినా దేవుణ్ని ఘనపర్చి పూజించే భక్తులువారు. యెహోవాను ఎరగటంమూలంగా ఒనగూడే దీవెనల్ని తాము బానిసలుగా ఉన్న దేశంలో ఈ మనుషులు అన్యప్రజా రాజ్యాలకు అందించటంద్వారా దేవుని సంకల్పాన్ని నెరవేర్చాల్సి ఉన్నారు. దేవునికి ప్రతినిధులుగా వ్యవహరించాల్సి ఉన్నారు. వారు విగ్రహారాధకులతో ఎన్నడూ రాజీపడరాదు. సజీవుడైన దేవుని ఆరాధించే వారిగా తమ విశ్వాసాన్ని తమ పేరును ఉన్నత గౌరవంగా వహించాల్సి ఉన్నారు. ఇది వారు చేశారు. సుఖాల్లోను దుఃఖాల్లోను వారు దేవున్ని ఘనపర్చారు. దేవుడు వారిని ఘనపర్చాడు. PKTel 334.1

    యెహోవాను ఆరాధించే ఈ మనుషులు బబులోనులో బానిసలన్న వాస్తవం, దేవుని ఆలయంలోని ఉపకరణాలు బబులోను దేవతల గుడిలో ఉంచబడటం - వీటిని విజేతలైన బబులోనీయులు తమ మతమూ తమ ఆచారాలూ హెబ్రీయుల మతమూ ఆచారాలకన్నా గొప్పవి అనటానికి నిదర్శనాలని అతిశయంగా చెప్పుకున్నారు. అయినా తనను విడిచిపెట్టి ఇశ్రాయేలు దూరంగా వెళ్లిపోటంవల్ల కలిగిన అవమానంద్వారానే తన ఆధిక్యతను, తన ధర్మవిధుల పరిశుద్ధతను, అవిధేయత తెచ్చే పర్యవసానాల్ని గూర్చిన నిదర్శనాల్ని దేవుడు బబులోనుకి ఇచ్చాడు. తనకు నమ్మకంగా నిలిచినవారి ద్వారా ఆయన ఈ సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఈ రీతిగా మాత్రమే ఇది సాధ్య పడింది. PKTel 334.2

    దేవునికి నమ్మకంగా నిలిచి తమ విశ్వాసపాత్రతను కొనసాగించినవారిలో దానియేలు అతడి ముగ్గురు సహచరులు ఉన్నారు. శక్తి వివేకాలుగల దేవునితో ఏకమైతే మనుషులు ఏమి కాగలరో అన్నదానికి వీరు ప్రముఖ సాదృశ్యాలు. రాజవంశానికి చెందిన ఈ యువకుల్ని తమ సాదాసీదా యూదీయ గృహంనుంచి లోక రాజుల్లో మిక్కిలి గొప్ప రాజు ఆస్థానంలోకి దేవుడు తీసుకువెళ్లటం జరిగింది. నెబుకద్నెజరు “అప్పెనజు అను తన నపుంసకుల యధిపతిని పిలిపించి అతనికీలాగు ఆజ్ఞాపించెను - ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై, లోపములేని సౌందర్యమును సకల విద్యాప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసినవారై రాజు నగరమునందు నిలువదగిన కొందరు బాలురను” రప్పించుము....PKTel 334.3

    “యూదులలోనుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో ఉండిరి.” ఈ యువకుల్లోని గొప్ప ప్రతిభను గుర్తించి నెబుకద్నెజరు తన రాజ్యంలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించటానికి వీరికి శిక్షణనివ్వాలని నిశ్చయించు కున్నాడు. తమ బాధ్యతల నిర్వహణకు సంపూర్తి అర్హత సాధించేందుకు వారు కల్దీయుల భాష నేర్చుకోటానికి ఏర్పాటు చేశాడు రాజు. ఆ రాజ్యంలోని రాకుమారులికి ఉండే అరుదైన విద్యావకాశాలు వారికి మూడేళ్లపాటు కొనసాగించాలని ఆదేశించాడు. దానియేలు అతడి సహచరుల పేర్లు మార్చి కల్దీయుల దేవతల పేళ్లు వారికి పెట్టాడు. హెబ్రీ తలిదండ్రులు తమ బిడ్డలికి పెట్టుకునే పేర్లకు గొప్ప ప్రాధాన్యముండేది. తరచు ఈ పేర్లు కొన్ని గుణలక్షణాల్ని సూచించేవి. అవి తమ బిడ్డలు కలిగి ఉండాలన్నది ఆ తలిదండ్రుల ఆకాంక్ష. బానిసలైన ఈ యువకులకు బాధ్యుడుగా ఉన్న అధిపతి “దానియేలుకు బెత్తెషాజరు అనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేళ్లు పెట్టెను.”PKTel 335.1

    ఈ హెబ్రీ యువకులు తమ విశ్వాసాన్ని పరిత్యాగం చేసి విగ్రహారాధన ఆచరించాల్సిందని రాజు ఒత్తిడి చెయ్యలేదు. ఈ మార్పు క్రమక్రమంగా తేవాలని భావించాడు. విగ్రహారాధనను సూచించే పేళ్లు వారికి పెట్టటంద్వారా, విగ్రహారాధనకు సంబంధించిన ఆచారాలు కర్మకాండతో అనుదినం పరిచయం ఏర్పర్చటం ద్వారా, అన్యమత ఆరాధన ఆచారాల ప్రభావానికి లోను చెయ్యటం ద్వారా వారిని తమ జాతీయ మతాన్ని త్యజించేటట్లు బబులోనీయుల మతాన్ని అవలంబించేటట్లు చేయాలని అతడు ఎదురుచూశాడు.PKTel 335.2

    తమ సేవ ఆరంభంలోనే వారి ప్రవర్తనకు ఓ పరీక్ష వచ్చింది. వారు రాజు భోజనం బల్లనుంచి వచ్చే భోజనం తిని ద్రాక్షారసం తాగటానికి ఏర్పాట్లు జరిగాయి. ఇలా చెయ్యటంద్వారా తమపట్ల తనకు ప్రత్యేకాభిమానం ఉన్నదని, తమ సంక్షేమం విషయంలో తనకు ఆసక్తి ఉన్నదని రాజు వ్యక్తం చేయాలనుకున్నాడు. అయితే అందులో కొంతభాగం విగ్రహాలకు అర్పించటంవల్ల రాజు బల్లవద్దనుంచి వచ్చిన భోజనం విగ్రహార్పితమయ్యింది. దాన్ని భుజించే వ్యక్తి బబులోను దేవతలకు నమస్కరించినట్లే పరిగణన పొందుతాడు. అలాంటి క్రియలో దానియేలు అతడి సహచరులు పాలు పంచుకోకుండా యెహోవాపట్ల భక్తి నిషేధించింది. ఆ ఆహార పానాల్లో పాల్గొన్నట్లు కేవలం నటించటం సయితం విశ్వాస పరిత్యాగంతో సమానం. ఇలా చెయ్యటం వారు అన్యమతం పక్క నిలిచి దేవుని ధర్మశాస్త్ర నియమాల్ని అగౌరవ పర్చినట్లవుతుంది. తమ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధిపై పనిచేసి, దౌర్బల్యం కలిగించే విలాసాలు వ్యసనాల ప్రమాదాన్ని ఆహ్వానించటానికి వారు సాహసించలేదు. నాదాబు అబీహుల చరిత్ర వారికి సుపరిచితమే. వారి ఆత్మనిగ్రహ రాహిత్యం దాని పర్యవసానాల దాఖలా పెంటటూష్ గ్రంథపు చుట్టలో భద్రపర్చి ఉంది. ద్రాక్షరసం వాడకంవల్ల తమ శారీరక మానసిక శక్తులికి విఘాతం కలుగుతుందని వారికి తెలుసు.PKTel 335.3

    దానియేలు అతడి సహచరుల తల్లిదండ్రులు వారిని మితానుభవ సూత్రాల్ని అనుసరించి పెంచారు. తమకున్న శక్తిసామర్థ్యానికి దేవుడు తమను జవాబుదారుల్ని చేస్తాడని, వారు తమ శక్తుల్ని ఎన్నడూ అణచివెయ్యటంగాని బలహీనపర్చటంగాని చెయ్యకూడదని తలిదండ్రులు వారికి నేర్పించారు. బబులోను రాజు ఆస్థానంలోని చెడు ప్రభావాల నడుమ దానియేలుకి అతడి సహచరులికీ ఈ విద్య ఒక పరిరక్షక సాధనంగా ఉపకరించింది. భ్రష్టమైన విలాసాలతో నిండిన ఆ ఆస్థాన జీవితంలో బలీయమైన శోధనలు ఆకర్షణలు అనేకాలు. కాని వాటికి వీరు దూరంగా ఉన్నారు. చిన్న వయసులో వాక్యపఠనంనుంచి దేవుని ప్రకృతినుంచి వారు నేర్చుకున్న నియమాల నుంచి ఏ శక్తీ ఏ ప్రభావం వారిని కదపలేకపోయింది.PKTel 336.1

    దానియేలేగనుక కోరుకునిఉంటే కచ్చితమైన మితానుభవ అలవాట్ల నుంచి వైదొలగటానికి తనచుట్టూ ఉన్న పరిస్థితుల్లో మంచి సాకుల్ని కనుగొనేవాడు. రాజు ప్రాపకంమీద ఆధారపడి అతడి అదుపాజ్ఞలికి లోబడి ఉన్న తనకు రాజు భోజనం తినటం అతడి పానాన్ని సేవించటం తప్ప గత్యంతరం లేదని వాదించి ఉండేవాడు. ఎందుకంటే అతడు దేవుని బోధనను ఆచరించినట్లయితే రాజును నొప్పించవచ్చు. పర్యవసానంగా తన హోదాను తన ప్రాణాన్నీ కోల్పోవచ్చు. దేవుని ఆజ్ఞను మారినట్లయితే అతడు రాజు అభిమానాన్ని చెక్కుచెదరకుండా నిలుపుకుని వ్యక్తిగతంగా ఎన్నో మానసిక ప్రయోజనాలు ఉజ్వలమైన భావికి అవకాశాలు సొంతం చేసుకునేవాడు.PKTel 336.2

    కాని దానియేలు వెనకాడలేదు. లోకంలో మిక్కిలి శక్తిమంతుడైన రాజు అనుగ్రహంకన్నా దేవుని ఆమోదం దానియేలుకి ఎంతో విలువైంది. అది తన సొంత ప్రాణంకన్నా ఎంతో విలువైంది. ఆరునూరైనా, దాని పర్యవసానం ఏమైనా దేవునికి నమ్మకంగా నిలబడాలని నిశ్చయించుకున్నాడు. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచు కొనకూడదని దానియేలు ఉద్దేశించాడు. ఈ తీర్మానానికి తన ముగ్గురు సహచరులు మద్దతు పలికారు.PKTel 336.3

    ఈ తీర్మానం చేసుకోటంలో ఈ హెబ్రీ యువకుడు అహంభావంతో వ్యవహరించ లేదు. దేవునిమిద ధృఢంగా ఆనుకుని ఆ పనిచేశాడు. వారు వ్యత్యాసంగా ఉండాలని ఎంపిక చేసుకోలేదు. కాని దేవున్ని అగౌరవపర్చటంకన్నా అలాగుండటమే వారి అభీష్టం. ఈ సందర్భంలో పరిస్థితులకి ఒత్తిడికి తలవంచి తప్పుతో రాజీ పడటం నియమానికి ఇలా నీళ్లిదలటం వారి విచక్షణాశక్తిని చెడుగుపట్ల వారి అసహ్యతను బలహీన పర్చేది. మొదటి తప్పు మరిన్ని తప్పులుకి దారితీసి చివరికి దేవునితో వారి సంబంధాన్ని తెంచివేసేది. వారు శోధనకు లొంగిపడిపోయేవారు.PKTel 337.1

    “దేవుడు నపుంసకుల యధిపతి దృష్టికి దానియేలునకు కృపాకటాక్షము నొంద ననుగ్రహించెను.” రాజు భోజన పానాలు పుచ్చుకుని తన్నుతాను అపవిత్ర పర్చుకోకూడదంటూ దానియేలు చేసిన మనవిని అతడు అంగీకరించాడు. అయినా ఆ అధికారి వెనకాడాడు. “మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుర ముఖములకంటే మి ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేల? అట్లయితే మీరు రాజుచేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు” అని దానియేలుతో అన్నాడు. PKTel 337.2

    దానియేలు ఆ హెబ్రీ యువకులికి బాధ్యుడుగా ఉన్న మెల్టషరుని అనగా అధికారిని రాజు భోజనం రాజు ద్రాక్షరసం తీసుకోకుండా తమను విడిచిపెట్టాల్సిందిగా వేడుకున్నాడు. తాము ప్రతిపాదించిన ఆ విషయాన్ని పదిరోజుల పాటు పరీక్షించాల్సిందని ఈ కాలావధిలో తమకు సామాన్యమైన ఆహార పానాలు ఇవ్వగా తక్కిన తమ సహచరులికి రాజు భోజన పానాలు ఇవ్వవలసిందని దానియేలు వేడుకున్నాడు.PKTel 337.3

    ఆ మనవిని అంగీకరిస్తే రాజు ఆగ్రహాలికి గురికావచ్చునన్న భయం లోలోన పీడిస్తున్నా ఆ అధికారి అందుకు సమ్మతించాడు. తమకు జయం కలుగుతుందని దానియేలుకి తెలుసు. ఆ పదిరోజుల పరీక్ష దరిమిలా కనిపించిన ఫలితాల్నిబట్టి ఆ అధికారి వెలిబుచ్చిన భయాలు నిర్ణేతుకమని తేలింది. “వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖములకంటె సౌందర్యముగాను కళగాను” కనబడ్డాయి. వ్యక్తిగతమైన ఆకృతిలో ఈ హెబ్రీ యువకులు తమ సహచర యువకుల కన్నా ఎంతో ఉన్నతస్థాయిలో ఉన్నారు. ఫలితంగా దానియేలు అతడి సహచరులు తమ శిక్షణ కాలమంతా తమ సామాన్య అన్నపానాల్ని కొనసాగించవచ్చునని రాజు అనుమతి ఇచ్చాడు.PKTel 337.4

    “జ్ఞానమును సకలశాస్త్ర ప్రవీణతయు వివేచనయు” సంపాదించటానికి ఈ హెబ్రీ యువకులు మూడు సంవత్సరాలు అధ్యయనం చేశారు. ఈ కాలంలో వారు దేవునిపట్ల నమ్మకంగా నిలిచారు. సర్వదా ఆయన శక్తిమీదే ఆధారపడి నివసించారు. ఆత్మ త్యాగపు అలవాట్లతోపాటు వారు కార్యదీక్ష జాగరూకత, నిశ్చలత్వం అలవర్చు కున్నారు. రాజు ఆస్థానంలోకి, దేవుణ్ని ఎరుగని, ఆయనకు భయపడని వారి సహవాసంలోకి వారిని రప్పించింది గర్వంగాని దురాశగాని కాదు. వారు ఓ పరదేశానికి బానిసలుగా వచ్చినవారు. అనంత జ్ఞాని అయిన దేవుడే వారిని అక్కడకు రప్పించాడు. గృహ ప్రభావానికి, పరిశుద్ద సాంగత్యానికి దూరమై ఉన్నవారు తమ పీడిత ప్రజల ప్రతిష్ట కోసం, తాము ఎవరికి సేవకులో ఆ ప్రభువుని మహిమపర్చటంకోసం నీతిగా జీవించటానికి వారు కృషిచేశారు.PKTel 338.1

    ఈ హెబ్రీ యువకుల ధృఢత్వాన్ని, ఆత్మ త్యాగశీలతను, వారి లక్ష్య పవిత్రతను దేవుడు ఆమోదించాడు. ఆయన ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉన్నాయి. దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేకమును అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడైయుండెను.” “నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును.” అన్న దైవ వాగ్దానం వీరిలో నెరవేరింది. 1 సమూ. 2:30. దానియేలు అచంచలమైన విశ్వాసంతో దేవున్ని హత్తుకుని ఉన్నాడు. అతడికి ప్రవచన వరం లభించింది. ఆస్థాన జీవిత విధుల్ని గురించి మానవుడివద్దనుంచి ఉపదేశం పొందుతుండగా దేవుడు దానియేలుకి భవిష్యత్తును గూర్చిన మర్మాలు చదవటం, కాలాంతంవరకు లోక చరిత్ర ఘటనల్ని చిత్రాలు సంకేతాల రూపంలో భావితరాలవారికి దాఖలు చేయటం నేర్పిస్తున్నాడు. PKTel 338.2

    శిక్షణలో ఉన్న యువకుల్ని పరీక్షించాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ రాజ్యంలో సేవలకు ఇతర అభ్యర్థులతోపాటు ఈ హెబ్రీ యువకుల్ని పరీక్షించటం జరిగింది. “వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటివారెవరును కనబడ లేదు.” వారి సూక్ష్మగ్రాహ్యత, వారి విస్తృత జ్ఞానం, వారి మాటల తీరు, భాషా వినియోగం - ఇవన్నీ చెక్కు చెదరని వారి మానసిక శక్తుల గురించి సాక్ష్యం ఇచ్చాయి. రాజు వీరియొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంతటనుండు శకున గాండ్రకంటెను గారడీ విద్యగలవారికంటెను పదియంతలు శ్రేష్ఠులని తెలియబడెను.” “గనుక వారే రాజు సముఖమునందు నిలిచిరి.”PKTel 338.3

    బబులోను రాజు ఆస్థానంలో అన్నిదేశాల ప్రతినిధులు సమావేశమయ్యారు. వారు అత్యున్నత ప్రతిభాపాటవాలుగల వ్యక్తులు. స్వాభావిక వరాలు పుష్కళంగా ఉన్న మనుషులు. లోకంలోని గొప్ప సంస్కృతి తమ సొంతమని గర్వంగా చెప్పుకున్న వ్యక్తులు. అయినా వారెవ్వరూ ఈ హెబీ యువకులికి సాటికారు. వారికీ వీరికీ మధ్య తేడా హస్తి మశకాంతరం. శారీరక శక్తి సౌందర్యం విషయంలో, మానసిక చురుకుదనం సాహితీ సాధన విషయాల్లో ఎవరూ ఎదురులేకుండా వీరికి వీరే సాటిగా నిలబడ్డారు. విగ్రహంలా నిటారుగా ఉండే ఆకృతి, పటిష్టమైన అడుగులు, చక్కని ముఖాకృతి, కళకళతాడే ఇంద్రియాలు, స్వచ్చమైన శ్వాస - ఇలా మంచి అలవాట్లకు ఎన్నో యోగ్యతా పత్రాలు... తన చట్టాలకు లోబడి నివసించే వారిని సన్మానించి ప్రకృతి ఇచ్చే ఉదాత్త సూచక చిహ్నాలు. ఎన్నో మరెన్నెన్నో!PKTel 339.1

    బబులోనులో తననుగురించి సాక్ష్యమివ్వటానికి దేవుడు దానియేలుని పిలిచినట్లే నేడు లోకంలో తనకు సాక్షులుగా ఉండటానికి మనల్ని పిలుస్తున్నాడు. జీవితంలోని అతి చిన్న విషయాల్లోను అతి పెద్ద విషయాల్లోను తన రాజ్య నియమాల్ని ప్రజలకు వెల్లడి చేయాల్సిందిగా ఆయన మనల్ని కోరుతున్నాడు. ఎవరో తమకు గొప్ప కార్యాల్ని ఇవ్వాలని కనిపెడ్తూ, దేవునికి నమ్మకంగా ఉన్నట్లు వెల్లడించటానికి అనేకులు రోజుకు రోజు తమకు వస్తున్న అనేక తరుణాల్ని జారవిడుస్తారు. జీవితంలోని చిన్నచిన్న విధుల్ని మనస్ఫూర్తిగా నిర్వర్తించటం, ప్రతీదినం అశ్రద్ధ చేస్తారు. తమకున్నట్లుగా తాము భావించే గొప్ప వరాల్ని వినియోగించటానికి ఏదో మహత్తర కార్యంకోసం ఎదురుచూస్తూ ఆరకంగా తమ హృదయ వాంఛను తృప్తిపర్చుకుంటుండగా వారి దినాలు గతించి పోతాయి.PKTel 339.2

    యధార్థ క్రైస్తవుడి జీవితంలో ప్రాముఖ్యం కాని విధులంటూ ఉండవు. సర్వశక్తుని దృష్టిలో ప్రతీ విధీ ముఖ్యమైందే. సేవకులు వినియోగించగల ప్రతీ అవకాశాన్నీ ప్రభువు ఖచ్చితంగా కొలుస్తాడు. వినియోగమైన సామర్థ్యాల్ని లెక్కకట్టినట్లే వినియోగంకాని సామర్ధ్యాల్నీ ఆయన లెక్కకడ్డాడు. దేవుని మహిమ పర్చటానికి మన శక్తి సామర్థ్యాల్ని వినియోగించని కారణంగా మనం సాధించాల్సింది సాధించకపోతే, మనం సాధించి ఉండాల్సిన దాన్నిబట్టి తీర్పు పొందుతాం.PKTel 339.3

    ఉదాత్త ప్రవర్తన కాకతాళీయంగా సంభవించేది కాదు. అది దేవుని ప్రత్యేక ప్రసన్నతవల్ల గాని లేదా దాన ప్రదానంవల్లగాని లభించదు. అది ఆత్మ నిగ్రహం ఫలం. క్షుద్ర స్వభావాన్ని ఉన్నత స్వభావానికి లోపరచటంవల్ల కలిగే ఫలం. స్వార్థాన్ని దేవుని సేవకు మానవ సేవకు సమర్పించటం వల్ల ఒకగూడే ఫలం.PKTel 339.4

    మితానుభవ సూత్రాల ఆచరణలో ఈ హెబ్రీ యువకులు కనపర్చిన నమ్మకం ద్వారా నేటి యువతతో దేవుడు మాట్లాడుతున్నాడు. సత్యం న్యాయం పక్షంగా దానియేలులా సాహసించి కార్యాచరణ చేపట్టే మనుషుల అవసరం నేడు ఎంతయినా ఉంది. స్వచ్ఛమైన హృదయాలు, బలమైన చేతులు, భయపడని స్వభావం అవసరం ఎంతయినా ఉంది. ఎందుకంటే చెడుకు నీతికి మధ్య జరుగుతున్న పోరాటంలో ఎడతెగని జాగృతి అవసరం. తిండిపట్ల అమితాసక్తి విషయంలో ఆకర్షణీయమైన అనేక శోధనలతో ప్రతీ ఆత్మ వద్దకూ సాతాను వస్తాడు.PKTel 340.1

    ప్రవర్తన నిర్మాణానికి మనసును ఆత్మను వృద్ధి పర్చటంలో శరీరం ఒక ముఖ్యమైన మాధ్యమం. అందుకే అపవాది శరీర శక్తుల్ని బలహీనపర్చి వాటిని భ్రష్టపర్చటానికి తన శోధనల్ని సంధిస్తాడు. ఇక్కడ అతడు విజయం సాధిస్తే మనిషి మొత్తం దుర్మార్ధతకు దాసుడవుతాడు. శారీరక స్వభావ ప్రవృత్తులు ఓ ఉన్నత శక్తి ఆధీనంలో ఉంటే తప్ప అవి శిధిలం మరణం కలిగించటం తథ్యం. శరీరాన్ని వ్యక్తి ఉన్నత శక్తుల అదుపులో ఉంచటం అవసరం. చిత్తం ఆవేశాల్ని ఉద్రేకాల్ని అదుపు చెయ్యాలి. ఆ చిత్తం దేవునికి లోబడి ఉండాలి. పరిపాలనాధికారం కలిగి దైవకృపచే శుద్దమైన వివేచన జీవితాన్ని నడిపించాలి. మానసిక శక్తి, శారీరక బలం, జీవితం నిడివి మార్పులేని చట్టాలమీద ఆధారపడి ఉంటాయి. ఈ చట్టాలకు విధేయుడై నివసించటంద్వారా మనిషి తనపై తాను విజయుడు కాగలుగుతాడు. తన వాంఛల్ని జయించగలుగుతాడు. ప్రధానుల పైన అధికారుల పైన విజయుడు కాగలుగుతాడు. “అంధకార సంబంధులగు లోకనాధుల”పై “ఉన్నత స్థలాల్లోని ఆధ్యాత్మిక దుష్టత” పై విజయుడు కాగలుగుతాడు. ఎఫెసీ. 6:12. PKTel 340.2

    చిహ్న రూపంలోని సువార్త అయిన పూర్వపు బలి అర్పణ సేవలో కళంకమున్న అర్పణను దేవుని బలిపీఠం వద్దకు తేవటం నిషిద్ధం. క్రీస్తును సూచించాల్సి ఉన్న అర్పణ నిష్కళంక అర్పణ కావాలి. ఆయన బిడ్డలు ఎలాంటివారై ఉండాలన్న దానికి అనగా “సజీవ యాగముగా” “పరిశుద్ధమైన” వారిగా “నిర్దోషమైన” వారిగా ఉండాలనటానికి ఉదాహరణగా దైవవాక్యం దీన్ని సూచిస్తున్నది. రోమా. 12:1; ఎఫెసీ. 5:27.PKTel 340.3

    ఘనత వహించిన ఈ హెబ్రీ యువకులు మనవంటి స్వభావంగల మనుషులే. అయినా బబులోను రాజు ఆస్థానంలో ప్రబలిన చెడు ప్రభావాల నడుమ వారు ధృఢంగా నిలిచారు. ఎందుచేతనంటే వారు అనంత శక్తిగల దేవునిమీద ఆధారపడ్డారు. అన్యమతాన్ని అవలంబించే ఒక జాతి ప్రజలు వారిలో దేవుని మంచితనానికి ఔదార్యానికి క్రీస్తు ప్రేమకు సాదృశ్యాన్ని చూశారు. శోధనపై నియమం విజయానికి, దుష్టతపై పవిత్రత విజయానికి, నాస్తికత విగ్రహారాధనపై భక్తి విశ్వసనీయతల విజయానికి ఉదాహరణను వారి అనుభవంలో మనం చూస్తున్నాం. PKTel 340.4

    దానియేలుని నడిపించిన ఆత్మను నేటి యువత కలిగి ఉండవచ్చు. అదే శక్తి మూలంనుంచే వారు శక్తిని పొందవచ్చు. ఆత్మ నిగ్రహానికి శక్తిని పొందవచ్చు. తమ జీవితాల్లో ప్రతికూల పరిస్థితుల్లో సయితం అదే సౌమ్యతను ప్రదర్శించవచ్చు. ఆత్మకు తృప్తినిచ్చే వినోదాలు విలాసాలు చుట్టూ ఉన్నా - ముఖ్యంగా శారీరక తృప్తినిచ్చే ప్రతీ రకమైన వినోదం ఆకర్షణీయంగా ఉండి సులభంగా లభించే పెద్ద పెద్ద నగరాల్లో దైవ కృపద్వారా దేవున్ని ఘనపర్చటమన్న వారి సంకల్పం చెక్కు చెదరకుండా స్థిరంగా ఉండవచ్చు. వారు తమ ఆత్మపై దాడి చేసే శోధనని ధృఢ సంకల్పం, అవిశ్రాంత జాగృతిద్వారా ప్రతిఘటించవచ్చు. న్యాయం న్యాయమైంది గనుక న్యాయం చెయ్యటానికి నిశ్చయించుకున్నవాడు మాత్రమే విజయం సాధిస్తాడు.PKTel 341.1

    ఈ ఉదాత్త హెబ్రీయుల జీవిత కర్తవ్యం ఎంత సమున్నతమైనది! వారు తమ చిన్ననాటి గృహాలికి కన్నీటితో వీడ్కోలు చెప్పినప్పుడు తమ ఉజ్వల భవిష్యత్తు గురించి వారికి ఎలాంటి అభిప్రాయం లేదు. తమద్వారా దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చేందుకు గాను వారు నమ్మకంగాను ధృఢంగాను నిలిచి దేవుని మార్గనిర్దేశాన్ని అనుసరించారు.PKTel 341.2

    ఈ మనుషుల ద్వారా దేవుడు మానవులికి బయలుపర్చిన మహత్తర సత్యాల్నే నేడు యువజనులు బాలలద్వారా బయలుపర్చాలని అభిలషిస్తున్నాడు. తమ్మును తాము ఆయనకు సమర్పించుకుని ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చటానికి పూర్ణ హృదయంతో కృషిచేసే వారికి ఆయన ఏమి చేస్తాడో అన్నదానికి దానియేలు అతడి సహచరుల జీవితం ఓ ఉదాహరణ.PKTel 341.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents