Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ప్రవక్తలు - రాజులు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    56 - దైవధర్మశాస్త్రంపై ఉపదేశం

    అది పర్ణశాలల పండుగ సమయం. అనేకమంది యెరూషలేములో సమావేశ మయ్యారు. అది దుఃఖకరమైన దృశ్యం. యెరూషలేము ప్రాకారాన్ని తిరిగి కట్టటం, ద్వారాలు అమర్చటం జరిగింది. కాని పట్టణంలో చాలా భాగం ఇంకా శిధిలాలుగానే ఉంది.PKTel 465.1

    ఓ విశాలమైన వీధిలో, వెళ్లిపోయిన యెహోవా మహిమ జ్ఞాపికల నడుమ నిర్మితమైన చెక్కవేదికపై ఇప్పుడు వృద్దుడైన నెహెమ్యా నిలబడిఉన్నాడు. అతడి కుడి ఎడమల తన సోదర లేవీయులు సమావేశమై ఉన్నారు. వేదికపైనుంచి చూస్తున్న వారి కళ్లు సముద్రంలా విస్తారమైన జనసమూహాన్ని చూశాయి. దేశమంతటినుంచి నిబంధన ప్రజలు అక్కడ సమావేశమయ్యారు. “ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరు తమ చేతులెత్తి - ఆమెన్ ఆమెన్ అని పలుకుచు, నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి.”PKTel 465.2

    అయినా ఇక్కడ సయితం ఇశ్రాయేలు పాపానికి నిదర్శనం కనిపించింది. ప్రజలు ఇతర జాతుల ప్రజల్ని వివాహం చేసుకోటం ద్వారా హెబ్రీ భాష సంకరమయ్యింది. బోధకులు ప్రజల భాషలో ధర్మశాస్త్రాన్ని విశదపర్చి అందరికీ అవగాహన కలిగించటంలో అపూర్వ శ్రద్ద వహించాల్సి వచ్చింది. కొందరు యాజకులు లేవీయులు ఎజ్రాతోకలిసి ధర్మశాస్త్ర సూత్రాల్ని ప్రజలకు వివరించారు. “వారు దేవుని గ్రంథములను స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించునట్లు దానికి అర్థము చెప్పిరి.”PKTel 465.3

    “ఆ జనులందరును ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి.” వారు సర్వోన్నతుని మాటల్ని ఆసక్తిగా భక్తితో విన్నారు. ధర్మశాస్త్రాన్ని విశదీకరించటం జరిగినప్పుడు, వారు తమ దోషిత్వాన్ని గుర్తించారు. తమ అతిక్రమాల గురించి దుఃఖించారు. అయితే ఈ దినం పండుగరోజు, సంతోషించాల్సిన దినం, పరిశుద్ధ సమావేశ దినం, ప్రజలు సంతోషానందాల్లో ఆచరించాల్సిందని దేవుడు ఆజ్ఞాపించిన దినం. ఇందుమూలంగా వారు తమ దుఃఖాన్ని నియంత్రించుకుని, తమపట్ల దేవుని గొప్ప కృపనుబట్టి ఉత్సహించాల్సిందిగా వారిని ఆదేశించటం జరిగింది. “మీరు దుఃఖపడవద్దు, ఏడ్వవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినము.... పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైనదానిని పానము చేయుడి. ఇదివరకు తమకొరకు ఏమియు సిద్ధము చేసికొననివారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువుకు ప్రతిష్టిత దినమాయెను, మీరు దుఃఖపడకుడి. యెహోవాయందు ఆనందించుటవలన మీరు బలమొందుదురు.” అన్నాడు నెహెమ్యా.PKTel 465.4

    దినంలో మొదటి కొంతభాగం మత కార్యక్రమానికి వినియోగించారు. తక్కిన సమయాన్ని, దేవుడు తమకిచ్చిన దీవెనల్ని గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం లోను, ఆయన అనుగ్రహించిన భోజనాన్ని ఆరగించి సంతోషించటంలోను గడిపారు. తినటానికి భోజనంలేని పేదలకు కొంత ఆహారాన్ని పంపించారు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని వారికి చదివి వినిపించినందుకు, దాన్ని వారు గ్రహించినందుకు సంతోషానందాలు వెల్లివిరిశాయి.PKTel 466.1

    మరుసటి రోజు ధర్మశాస్త్ర పఠనం విశదీకరణ కొనసాగాయి. నిర్ణీత సమయంలో అనగా ఏడోనెల పదోరోజున దేవుని ఆజ్ఞప్రకారం ప్రాయశ్చితార్థ దినాచరణ జరిగింది.PKTel 466.2

    అదే మాసం పదిహేనునుంచి ఇరవై రెండు వరకు ప్రజలు వారి అధికారులు మరోసారి పర్ణశాలల పండుగను ఆచరించారు. వారు తమ పట్టణములన్నిటిలోను యెరూషలేములోను ప్రకటన చేయవలసినదేమనగా - మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను అడవి ఒలీవ చెట్ల కొమ్మలను గొంజిచెట్ల కొమ్మలను ఈతచెట్ల కొమ్మలను గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి, వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరు తమతమ యిండ్లమిదను తమ లోగిళ్లలోను దేవమందిరపు ఆవరణములోను... పర్ణశాలలు కట్టుకొనిరి.... అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. ఇదియునుగాక మొదటి దినము మొదలుకొని కడదినమువరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచు వచ్చెను.”PKTel 466.3

    ప్రజలు ధర్మశాస్త్ర ఉపదేశాన్ని దినదినం వింటున్నప్పుడు వారు తమ అతిక్రమాల్ని గతంలో తమ జాతి చేసిన పాపాల్ని గుర్తించారు. తాము దేవునికి దూరంగా వెళ్లి పోయినందుకే ఆయన పరిరక్షణను కోల్పోయామని, ఇశ్రాయేలు ప్రజలు పరదేశాల్లోకి చెదిరి పోయారని వారు గ్రహించారు. దేవుని కృపను అర్థిస్తూ ఆయన ఆజ్ఞలకు విధేయులమై నడుచుకుంటామని వాగ్దానం చెయ్యాలని తీర్మానించుకున్నారు. పర్ణశాలల పండుగ ముగిసిన తర్వాత రెండోరోజున జరిగిన ఈ గంభీర ఆరాధన కార్యక్రమంలో ప్రవేశించకముందు వారు తమ మధ్య ఉన్న అన్యజనుల నుంచి వేరైపోయారు.PKTel 466.4

    ప్రజలు ప్రభువు ముందు సాగిలపడి, తమ పాపాలు ఒప్పుకుని క్షమాపణకు విజ్ఞాపన చేస్తున్నప్పుడు, దేవుడు తన వాగ్దానం ప్రకారం వారి ప్రార్థన విన్నాడని విశ్వసించాల్సిందిగా తమ నాయకులు వారిని ప్రోత్సహించారు. దుఃఖించటం, పశ్చాత్తాపపడటం మాత్రమేకాదు, తమను దేవుడు క్షమించాడని వారు నమ్మాలి. ఆయన కృపల్ని జ్ఞాపకం చేసుకోటం ఆయన దయాళుత్వానికి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించటం ద్వారా వారు తమ విశ్వాసాన్ని ప్రదర్శించాలి. “నిలువుడి, నిరంతరము మీకు దేవుడైయున్న యెహోవాను స్తుతించుడి.” అని ఆ నాయకులు ప్రోత్సహించారు.PKTel 467.1

    అంతట సమావేశమైఉన్న ఆ ప్రజలు ఆకాశంవైపు చేతులెత్తి దేవున్ని ఇలా స్తోత్రించారు :PKTel 467.2

    “సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము
    స్తుతింపబడును గాక. నీవే, అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును
    మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది
    అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి
    వాటినన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము
    చేయుచున్నది.”
    PKTel 467.3

    స్తోత్రార్పణ ముగిశాక నాయకులు ఇశ్రాయేలు చరిత్రను సమీక్షించి, దేవుడు తమపట్ల చూపించిన దయాదాక్షిణ్యాలు ఎంత విస్తారమైనవో తాము ఆయనకు ఎంత ద్రోహం చేశారో వివరించారు. అంతట ఆ సభలో ఉన్న ప్రజలందరూ దేవుని ఆజ్ఞ లన్నిటినీ ఆచరిస్తామంటూ దేవునితో నిబంధన చేసుకున్నారు. వారు తమ పాపాలకు శిక్షననుభవించారు. దేవుడు తమతో వ్యవహరించిన విధం న్యాయమైనదని వారు ఒప్పుకుని ఆయన ధర్మశాస్త్రానికి విధేయులమై నివసిస్తామని ప్రమాణం చేశారు. ఇది “స్థిరమైన నిబంధన”గా ఉండేందుకు, నిత్యం భద్రంగా నిలిచేందుకు, తమ నిబద్దతకు విధికి స్మారక చిహ్నంగా, దాన్ని రచించటం జరిగింది. దానిపై యాజకులు లేవీయులు సంతకం చేశారు. అది తమ విధిని గుర్తుచేసి శోధనకు అడ్డుకట్టగా దోహదపడాల్సి ఉంది. “దేవుని దాసుడైన మోషేద్వారా నియమింపబడిన దేవుని ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుచు, మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదుమని” ప్రజలు ప్రమాణం చేశారు. ఈ సమయంలో చేసిన ప్రమాణంలో ఆ దేశ ప్రజలతో వివాహాలు చేసుకోమన్నది కూడా ఉంది.PKTel 467.4

    ఉపవాసదినం అంతంకాకముందు ప్రజలు సబ్బాతును అపవిత్రం చెయ్యకుండా ఉంటామని ప్రమాణం చెయ్యటంద్వారా ప్రభువువద్దకు తిరిగి రావాలన్న తమ ధృఢ సంకల్పాన్ని వ్యక్తం చేశారు. ఈ సమయంలోను, తదనంతరం కూడా అన్యులైన వ్యాపారస్తుల్ని యెరూషలేములో ప్రవేశించకుండా చెయ్యటానికి నెహెమ్యా తన అధికారాన్ని ఉపయోగించలేదు. కాని శోధనకు లొంగకుండా ప్రజలికి సహకరించే ప్రయత్నంలో, సబ్బాతునాడు వారివద్దనుండి ఏమి కొనుగోలు చెయ్యమన్న వాగ్దానాన్ని ప్రజలతో చెయ్యించుకున్నాడు. ఇది ఆ వ్యాపారుల్ని నిరుత్సాహపర్చి ఆ వ్యాపారానికి అంతం పలుకుతుందని నిరీక్షించాడు. PKTel 468.1

    దైవారాధన కొనసాగింపుకు ప్రజల చేయూతకు కూడా ఏర్పాటు చెయ్యటం జరిగింది. దశమభాగం చెల్లింపుకు అదనంగా ఆలయ సేవల నిమిత్తం ప్రతీ సంవత్సరంలో ఓ నిర్దిష్ట మొత్తాన్ని చెల్లిస్తామని సభ్యులు ప్రమాణం చేశారు. నెహెమ్యా ఇలా రాస్తున్నాడు, “మా భూమి యొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల ప్రథమ ఫలములను, ప్రతి సంవత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసికొనివచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి. మా కుమారులలో జ్యేష్ఠ పుత్రులు, మా పశువులలో తొలిచూలులను ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలో తొలిచూలులను... తీసికొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి.”PKTel 468.2

    ఇశ్రాయేలు ప్రజలు తమ అపనమ్మకానికి తీవ్ర సంతాపంతో దేవుని వద్దకు తిరిగివచ్చారు. దుఃఖిస్తూ ప్రలాపిస్తూ తమ పాపాల్ని ఒప్పుకున్నారు. దేవుడు తమతో వ్యవహరించిన తీరు న్యాయమైంది నీతివంతమైంది అని ఒప్పుకున్నారు. ఆయన ధర్మశాస్త్రానికి విధేయులమై ఉంటామని నిబంధన చేసుకున్నారు. ఇప్పుడు ఆయన వాగ్దానాల పై నమ్మకముంచారు. వారి పశ్చాత్తాపాన్ని దేవుడు ఆమోదించాడు. తమకు పాప క్షమాపణ లభించినందుకు తాము దేవుని కరుణా ప్రసన్నతల్ని తిరిగి పొందగలుగుతున్నందుకు వారు ఇప్పుడు ఉత్సహించాల్సి ఉన్నారు. PKTel 468.3

    నిజమైన దేవుని ఆరాధనను పునరుద్దరించటానికి నెహెమ్యా కృషి విజయవంత మయ్యింది. ప్రజలు తాము చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉన్నంతకాలం, వారు దేవుని వాక్యానుసారంగా నివసించినంతకాలం దేవుడు తన వాగ్దానాల్ని నెరవేర్చుతూ వస్తాడు. వారిని బహుగా ఆశీర్వదిస్తాడు.PKTel 468.4

    తాము పాపం చేశామని గుర్తించి తాము అయోగ్యులమని భావించేవారికి ఈ దాఖలాలో విశ్వాసం గురించి ఉద్రేకం గురించి నేర్చుకోవలసిన పాఠాలున్నాయి. ఇశ్రాయేలీయుల మతభ్రష్టత ఫలితాల్ని బైబిలు నమ్మకంగా ప్రకటిస్తున్నది. అంతేకాదు, వారు ప్రభువువద్దకు తిరిగి రావటంలో అనుభవించిన అవమానాన్ని పశ్చాత్తాపాన్ని, ప్రదర్శించిన భక్తిని, చేసిన త్యాగాన్ని కూడా బైబిలు వివరిస్తున్నది.PKTel 469.1

    ప్రభువువద్దకు తిరిగిరావటం జరిగిన ప్రతీ సందర్భంలోను జీవితం అమితానందంతో నిండుతుంది. పాపి పరిశుద్ధాత్మ ప్రభావానికి లొంగినప్పుడు, హృదయాన్ని పరిశోధించే ఆ ప్రభువు పరిశుద్ధతకు భిన్నంగా ఉన్న తన సొంత అపరాధాన్ని తన సొంత అపవిత్రను చూస్తాడు. పాపిగా తన దోషిత్వాన్ని శిక్షార్హతను గుర్తిస్తాడు. అయితే ఈ హేతువుచేత అతడు నిసృహచెందకూడదు. ఎందుకంటే అతడికి క్షమాపణ లభించింది. క్షమాపణపొందిన స్పృహతో, పాపక్షమ ప్రసాదించే పరలోక జనకుని ప్రేమలో అతడు ఆనందించవచ్చు. పశ్చాత్తాపం పొందిన పాపుల్ని తన ప్రేమా హస్తాల్లో బంధించటం, వారి గాయాలు కట్టడం, వారికి పాపశుద్ధి కలిగించటం, వారికి రక్షణ వస్త్రాలు ధరింప చెయ్యటంలో దేవుడు మహిమ పొందుతాడు.PKTel 469.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents