Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అపొస్తలుల కార్యాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    26—కొరింథులో అపోల్లో

    కొరింథునుంచి వెళ్లిన తర్వాత పౌలు పరిచర్య అందించిన స్థలం ఎఫెసు. సమిసిస్తున్న పండుగకు హాజరయ్యేందుకు పౌలు యెరూషలేము వెళ్తున్నాడు. కనుక ఎఫెసులో అతను ఉన్నది స్వల్ప వ్యవధి మాత్రమే. యూదులతో సమాజమందిరంలో చర్చజరిపాడు. ఆ చర్చ తమను ఎంతగానో ఆకట్టుకొన్నందున తమ మధ్య తన సేవలు కొనసాగించాల్సిందిగా వారు పౌలును కొరారు. తాను సంకల్పించిన యెరూషలేము సందర్శనం కారణంగా అతను అక్కడ ఉండిపోడానికి సాధ్యపడలేదు. కాని ” దేవుని చిత్తమైతే” తమవద్దకు తిరిగివస్తానని వారికి వాగ్దానం చేశాడు. అకుల ప్రిస్కిల్లలు పౌలు వెంట ఎఫెసుకు వెళ్ళారు. అక్కడ తాను ప్రారంభించిన పనిని చూసుకోటానికి పౌలు వారినక్కడ విడిచి పెట్టాడు.AATel 190.1

    ఆ సమయంలో “అలెక్సంద్రియవాడైన అపాల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడునై యుండెను.” అతడు బాప్తిస్మమిచ్చే యోహాను బోధవిని మారుమనసు విషయమైన బాప్తిస్మం పొందాడు. ఆ ప్రవక్త సేవ వ్యర్థంకాలేదనటానికి సజీవసాక్షిగా నిలిచాడు. ” అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశముపొంది తన ఆత్మయందు తీవ్రపడి, యోహాను బాప్తిస్మము మాత్రమే తెలిసికొనినవాడైనను, యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు, సమాజమందిరములో ధైర్యముగా మాటలాడ నారంభించెను.” అని లేఖనాలు చెబుతున్నాయి.AATel 190.2

    ఎఫెసులో ఉన్నతరుణంలో అపోల్లో ” సమాజ మందిరములో ధైర్యముగా మాటలాడనారంభించెను.” అతని బోధను వింటున్నవారిలో అకుల ప్రిస్కల్లలు కూడా ఉన్నారు. వారు ” విని అతనిని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి.” అకుల ప్రిస్కల్లల ఉపదేశం ద్వారా అతను స్పష్టమైన లేఖనావగాహనను పొంది ఉత్తమ క్రైస్తవమత ప్రబోధకుల్లో ఒకడయ్యాడు.AATel 190.3

    అపోల్లో అకయకు వెళ్లాలని భావించినప్పుడు ఎఫెసులోని సహోదరులు క్రీస్తు సంఘబోధనల్ని అనుసరించి బోధించే బోధకుడిగా “అతనిని చేర్చుకొనవ లెనని... ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి.” పౌలు సత్వమనే విత్తనం విత్తాడు. అపొల్లో దానికి నీరు పోశాడు. అజల్లో సువార్త సేవ సాధించిన విజయాల్ని బట్టి కొందరు విశ్వాసులు అపోల్లో సేవ పౌలు సేవకన్నా ఘనమైందని పరిగణించారు. ఒకరితో ఒకర్ని పోల్చటమన్నది సంఘంలోకి పార్టీతత్వాన్ని ప్రవేశపెట్టింది. సువార్త ప్రగతికి అది గొడ్డలి పెట్టుగా పరిణిమించే ప్రమాదం ఏర్పడింది. -AATel 190.4

    కొరింధులో తానున్న ఏడాదిన్నర కాలంలో ఉద్దేశపూర్వకంగానే సువార్తను అతిసామాన్యరీతిలో పౌలు బోధించాడు. కొరింథీయుల వద్దకు “వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతోగాని” రాలేదు. కాని భయంతోను వణకుతోను వారి “విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక దేవుని శక్తిని ఆధారము చేసికొని యుండవలెనని... పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతముల”తో వచ్చాడు. 1 కొరింథీ 2 : 1, 4, 5.AATel 191.1

    సంఘపరిస్థతికి తగినట్లుగా పౌలు తన బోధనాసరళిని మల్చుకొన్నాడు. “సహోదరులారా! ఆత్మబంధువులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు, మీతో మాటలాడవలసివచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయి నందున పాలతోనే మిమ్మును పెంచితినిగాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీరసంబంధులై యుండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై యున్నారు కారా? ” అని అనంతరం వారికి విశదంచేశాడు. 1 కొరింథీ 3 : 1, 2. తమకు బోధించటానికి పౌలు ప్రయాసపడున్న పాఠాల్ని కొరింథీ విశ్వాసుల్లో పెక్కుమంది త్వరగా నేర్చుకోలేకపోయారు. వారికున్న ఆధిక్యతలు తరుణాల మేరకు వారి ఆధ్యాత్మిక జ్ఞానం వృద్ధిచెందలేదు. క్రైస్తవానుభవంలో ఎంతో ప్రగతి చెంది వాక్యంలోని లోతైన సత్యాల్సి అవగాహనచేసుకొని వాటిని వారు ఆచరణలో పెట్టాల్సి ఉండగా, “నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవుగాని యిప్పుడు మీరు వాటిని సహింపలేరు” (యోహాను 16 : 12) అని క్రీస్తు తన శిష్యులతో అన్న తరుణంలో వారున్న స్థితిలోనే వీరూ ఉన్నారు. “అన్నిటిని దేవుని. మర్మములను కూడ పరిశోధించు” (1 కొరింథీ 2 : 10) పరిశుద్దాత్మ చేసేపనికి వ్యతిరేకంగా వ్యవహరించటానికి అసూయ, దుర్మారపు ఊహాగానాలు, నిందా రోపణలు అనేకమంది కొరింథీయుల హృదయాల్ని తప్పుదారి పట్టించాయి. వారు లోకజ్ఞానంలో ఎంత అధికులైనా క్రీస్తుజ్ఞానం విషయంలో పసివారే.AATel 191.2

    కొరింథీయ విశ్వాసుల్ని క్రీస్తు విశ్వాసంలో పటిష్ఠపర్చటమన్న పనిలో పౌలు నిమగ్నమై ఉన్నాడు. మనసుల్లో దేవుని శక్తి పనిచెయ్యటమంటే తెలియనివారికి నేర్పేటట్లు వారికి బోధించాల్సి వచ్చింది. ఆ తరుణంలో రక్షణ మర్మాల్ని వారు గ్రహించలేకపోయారు. ఎందుకంటే ” ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మవిషయములను అంగీకరింపడు, అది అతనికి వెట్టితనముగా ఉన్నది. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.” 14వ వచనం. పౌలు విత్తనం నాటటానికి కృషిసల్పాడు. ఇతరులు దానికి నీరుపోయాల్సి ఉన్నారు. తన వెనుకవచ్చినవారు అతను ఎక్కడైతే విడిచి పెట్టాడో అక్కడ నుంచి ఆ పనిని కొనసాగిస్తూ తగిన సమయంలో సంఘం అవగాహన చేసుకొనే కొద్దిపాటి ఆధ్యాత్మిక వెలుగును జ్ఞానాన్ని అందించాలి.AATel 191.3

    ఈ అపొస్తలుడు కొరింథులో తన సేవను ప్రారంభించినప్పుడు తాను బోధించగోరుతున్న గొప్ప సత్యాన్ని అతి జాగ్రత్తగా ఉపదేశించాల్సిన అవసరముందని గుర్తించాడు. తన బోధనలు వినటానికి వచ్చేవారిలో మానవ సిద్ధాంతాల్ని విశ్వసించేవారు, తప్పుడు మతాచార ప్రబోధకులు ఉంటారని, లేఖనాల్లో ఆవిష్కృతమైన నిత్యజీవ వాస్తవాల్ని కొట్టివేయటానికి ప్రకృతి గ్రంధంలో ఏవైనా సిద్ధాంతాలు దొరుకుతాయేమోనని గుడ్డివారిలా తడుములాడేవారు ఉంటారని పౌలుకు తెలుసు. దేవుడిచ్చిన వాక్యానికి క్రైస్తవులు చెప్పే అర్థాన్ని తప్పుపట్టటానికి కృషిచేస్తే విమర్శకులుంటారని. క్రీస్తు సువార్తను అపహసించి కించపర్చే అవిశ్వాసులుంటారని కూడా అతనికి తెలుసు.AATel 192.1

    ఆత్మల్ని సిలువ నీడకు నడిపించే ప్రయత్నంలో విచ్చలవిడి ప్రవర్తనగలవారిని మందలించటానికి లేదా దేవుని దృష్టిలో వారి పాపం ఎంత ఘోరమయ్యిందో వ్యక్తంచెయ్యటానికి పౌలు చొరవ తీసుకోలేదు. దానికి బదులు జీవిత వాస్తవిక లక్ష్యాన్ని వారి ముందుంచి, పరమబోధకుడు యేసు నేర్పిన బోధనల్ని వారి మనస్సులో నాటింపజేయటానికి ప్రయత్నించాడు. ఆ బోధనల్ని ఆచరణలో పెట్టినప్పుడు అవి వారిని లోకవాంఛల నుంచి పాపం నుంచి పైకిలేపి పవిత్రతను నీతిని వారిలో ప్రోదిచేస్తాయి. దేవుని రాజ్యంలో స్థానానికి యోగ్యులయ్యేవారిలో చోటు చేసుకోవాల్సిన దైవభక్తి పరిశుద్ధతల గురించి నొక్కి వక్కాణించాడు. తమ దురాచారాలు ఆచరణలు దేవునికి ఎంత హేయమైనవో గుర్తించేందుకు వారి మనసుల్లో ముసురుతున్న చీకట్లను క్రీస్తు సువార్త కాంతి పటాపంచలు చెయ్యటం చూడాలని ఎంతో ఆశించాడు. అందుచేత వారిమధ్య అతని బోధకు కేంద్రబిందువు సిలువును పొందిన క్రీస్తే, దేవుని ముందు పశ్చాత్తాపం, ప్రభువైన యేసుక్రీస్తు పై విశ్వాసం ద్వారా రక్షణ కలుగుతుందన్న మహత్తర సత్యాన్ని అధ్యయనం చేయటం తమకు అపూర్వానందాన్నిస్తుందని వారికి బోధపర్చటానికి కృషి చేశాడు.AATel 192.2

    తత్వజ్ఞాని రక్షణ వెలుగుకు దూరంగా ఉంటాడు. ఎందుకంటే అతని సిద్ధాంతాల్ని రక్షణ ప్రక్రియ కించపర్చుతుంది. లౌకికవ్యక్తి దాన్ని అందుకోటానికి నిరాకరిస్తాడు. ఎందుకంటే అది అతణ్ని తన లౌకిక విగ్రహాలనుంచి వేరుచేస్తుంది. మనుషులు క్రీస్తును ప్రేమించకముందు లేదా విశ్వాస నేత్రంతో సిలువను అవలోకించక ముందు వారు క్రీస్తు ప్రవర్తనను అవగాహన చేసుకోవటం అవసరమని పౌలు గ్రహించాడు. రక్షణ పొందినవారు అనంతయుగాల పొడవునా అధ్యయనం చేయనున్న విజ్ఞానశాస్త్రం, పాడనున్న పాట, సంబంధిత పఠనం ఇక్కడే ప్రారంభం కావలసి ఉంది. సిలువ వెలుగులో మాత్రమే మానవాత్మ వాస్తవిక విలువను అంచనావేయటం సాధ్యపడుతుంది.AATel 192.3

    దైవకృపకున్న శుద్ధీకరణ ప్రభావం మానవుడి స్వాభావిక చిత్త ప్రవృత్తిని మార్చుతుంది. శరీరానుసారమైన మనసుగల వారికి పరలోకం పట్ల ఆశ ఉండదు. స్వాభావికమైన, అపవిత్రమైన వారి హృదయాలకు పవిత్రమైన, పరిశుద్ధమైన ఆస్థలం ఆకర్షణీయంగా ఉండదు. వారు అక్కడకు వెళ్లటం సాధ్యపడితే అక్కడ వారికి నచ్చేదేమీ ఉండదు. పతనమైన మానవుడు పరలోకంలో ప్రవేశించి అక్కడ పరిశుద్ధ దూతల సహవాసంలో నివసించటానికి యోగ్యుడుగా రూపొందక ముందు అతడి స్వాభావిక మనసును నియంత్రించే ప్రవృత్తులు క్రీస్తు కృప అదుపుకిందికి రావాలి. మానవుడు పాపం విషయమై మరణించి క్రీస్తునందు నూతనజీవం పొంది లేచినప్పుడు అతని హృదయాన్ని దైవప్రేమ నింపుతుంది. అతని అవగాహన పరిశుద్ధమవుతుంది. అతడు అనంతమైన ఆనందాన్ని జ్ఞానాన్ని పొందుతాడు. అతనితో జీవపు వెలుగైన యేసు నిత్యమూ ఉంటాడు గనుక అతని మార్గమంతా నిత్యజీవపు వెలుగు ప్రకాశిస్తుంది.AATel 193.1

    తానూ తన సహచర సువార్తికులు తమకు సత్యం బోధించటానికి దేవునివల్ల నియమితులైన కార్యకర్తలమనీ, తామంతా ఒకే కార్యసాధనలో నిమగ్నులై ఉన్నవారనీ, తమ ఉమ్మడి సేవ విజయానికి తామంతా ఏకరీతిగా దేవుని మీద ఆధారపడి ఉన్నవారమేనని కొరింథీయ సోదరులకు బోధపర్చటానికి పౌలు ప్రయత్నించాడు. వివిధ బోధకుల యోగ్యతల చర్చ సందర్భంగా సంఘంలో తలెత్తిన విభేదాలు దేవుడు సంకల్పించినవికావు. అవి స్వాభావిక హృదయ వాంఛలవల్ల ఏర్పడ్డ విపరిణామాలు. “ఒకడు- నేను పౌలువాడను, మరియొకడు - నేను అపోల్లోవాడను, అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా? అపోల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులేగదా? ఒక్కొకరికి ప్రభువను గ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపొల్లో నీళ్లుపోసేను, వృద్దికలుగజేసినవాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగ జేయు దేవునిలోనే గాని, నాటు వాని లోనైనను నీళ్లు పోయువానిలోనైనను నేమియులేదు.” 1కొరింధి 3 : 4, 7.AATel 193.2

    కొరింథులో మొట్టమొదటగా సువార్త ప్రకటించింది సంఘాన్ని స్థాపించింది పౌలే. ఇదే అతనికి ప్రభువు నియమించిన పని. అనంతరం దేవుని మార్గదర్శకత్వం కింద ఇతరులు వచ్చి తమ తమ స్థానాల్లో నిలిచారు. నాటిన విత్తనానికి నీరు పొయ్యాలి. ఈ పని అపొల్లో చేయ్యాల్సి ఉన్నాడు. ఇంకా ఎక్కువ ఉపదేశం ఇవ్వటానికి, నాటిన విత్తనం మొక్కయి పెరగటానికి తోడ్పడేందుకు అపొల్లో పౌలు వెనక వెళ్లి పనిచేశాడు. అతడు ప్రజల ఆదరాభిమానాల్ని పొందాడు. అయితే వృద్ధినిచ్చింది దేవుడే. ప్రవంన్తలో మార్పు తెచ్చేది మానవశక్తి కాదు, దైవశక్తే. విత్తనాన్నినాటే వారు దానికి నీరుపోసేవారు దానికి పెరుగుదలనియ్యలేరు. వారు దేవుడు నియమించిన సాధనాలుగా ఆయనతో సహకరించి ఆయన కింద పనిచేస్తారు. విజయంతోపాటు వచ్చే గౌరవం మహిమ నాయక కార్యకర్తకే చెందుతాయి.AATel 193.3

    దైవ సేవకులందరికీ ఒకే విధమైన వరాలుండవు. అయినా వారందరూ దేవుని కార్యకర్తలే. ప్రతీవారూ ఈ అపూర్వబోధకుణ్ని గూర్చి నేర్చుకొని ఆ మీదట తాము నేర్చుకొన్నది ప్రకటించాల్సి ఉన్నారు. తన కార్యకర్తల్లో ప్రతివారికి వ్యక్తిగతంగా తమ తమ పనిని దేవుడు నిర్దేశించాడు. దేవుని వరాలు వివిధమైనవి. అయితే వివిధ వరాలు గల దైవ సేవకులందరు పరిశుద్ధాత్మ నియంత్రణ కింద సమైఖ్యంగా సామరస్యంగా పనిచేయాల్సి ఉన్నారు. అప్పుడు వారు రక్షణ సువార్తను ప్రచురపర్చగా దైవశక్తివలన అనేకులు విశ్వసించి మార్పు పొందుతారు. మానవ సాధనం క్రీస్తుతో కూడా దేవునియందు దాచబడి ఉంటాడు. క్రీస్తు పదివేల మందిలో ప్రత్యేకంగా విలక్షణంగా కనిపిస్తాడు. ఆయన అతి కాంక్షణీయుడు.AATel 194.1

    “నాటువాడును నీళ్లు పోయువాడును ఒక్కడే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై యున్నారు.” 8,9 వచనాలు. ఈ లేఖనంలో దేవుడు నాటగా వ్యవసాయకులు పనిచేసి పండించే పంటపొలానికి సంఘాన్ని అపొస్తలుడు పోల్చుతున్నాడు. ఇంకా, ప్రభువుకు పరిశుద్ధాలయంగా వృద్ధి చెందాల్సిన నిర్మాణానికి దాన్ని పోల్చుతున్నాడు. దేవుడు మహోన్నత కార్యకర్త. ప్రతీ వారికి తమతమ వంతు పనిని ఆయనే నియమిస్తాడు. అందరూ ఆయన పర్యవేక్షణ కింద పనిచెయ్యాలి. తమ కార్యకర్తల కోసం తన కార్యకర్తల ద్వారా ఆయనను అందరూ పనిచెయ్యనివ్వాలి. వారికి విజ్ఞతను నైపుణ్యాన్ని ఆయన ఇస్తాడు. తన ఉపదేశానుసారం వారు నడుచుకొంటే వారి కృషి ఫలిస్తుంది. AATel 194.2

    దేవుని సేవకులు “ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ” (రోమా 12:10) ఎంచుకొంటూ వినయవిధేయతలు కలిగి కలసికట్టుగా పనిచెయ్యాలి. ఇతరుల సేవను విమర్శించకూడదు. ధ్వంసం చెయ్యకూడదు. ప్రభువువల్ల వర్తమానం పొందిన ప్రతీ వ్యక్తికి ఒక నిర్దిష్ట కర్తవ్యముంటుంది. ప్రతీ ఒక్కరికి తమతమ వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని ఎవరూ ఇతరులకు అంకితం చెయ్యకూడదు. అయినా ప్రతీవారూ తమ సహోదరులతో సామరస్యంగా పనిచెయ్యాలి. దైవ సేవకులంతా కలిసి ఒకే వ్యక్తిగా పనిచేయాలి. తాను ఇతరులకు వరవడి అన్నట్లు వ్యవహరిస్తూ ఏ ఒక్కరూ సహ పనివారి గురించి అమర్యాదగా మాట్లాటకూడదు. లేక వారిని కొరగాని వారిగా పరిగణించకూడదు. ప్రతివారూ తమకు దేవుడు నిర్దేశించిన వనిని నిర్వర్తించాలి. పనివారు తమ సహపనివారిని గౌరవించి, ప్రేమించి, ఉద్రేకపర్చాలి. అందరూ సంఘటితంగా పనిచేసి కర్తవ్యసిద్ధిని సాధించాలి.AATel 194.3

    కొరింథు సంఘానికి పౌలు మొట్టమొదటి పత్రికలో ఈ నియమాల్ని విశదీకరించటం జరిగింది. “క్రీస్తు సేవకుల” ను “దేవుని మర్మముల విషయములో గృహనిర్వాహకు”లని అపొస్తలుడు వ్యవహరిస్తూ వారి సేవను గూర్చి ఇలా అంటున్నాడు: “గృహనిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైనవాడై యుండుట అవశ్యము. మీ చేతనైనను, ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేను విమర్శించుకొనను నాయందు నాకు ఏదోషమును కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను. నన్ను విమర్పించువాడు ప్రభువే కాబట్టి సమయము రాక మునుపు అనగా ప్రభువు వచ్చువరకు, దేనినిగూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపర్చునప్పుడు, ప్రతివానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును” 1 కొరింథీ 4:1-5.AATel 195.1

    దైవ సేవకుల విషయంలో వీరు మంచివారు వీరు చెడ్డవారు అని ఏమానవుడూ తీర్పు తీర్చకూడదు. మానవుడి క్రియల్ని విమర్శించాల్సినవాడు దేవుడే, ప్రతివారికి తమ తమ ప్రతివ లాన్నిచ్చేవాడు ఆయనే. తన సేవల్ని అపొల్లో సేవల్ని తులనాత్మకంగా చర్చించి విమర్శించటాన్ని పౌలు ప్రత్యక్షంగా ప్రస్తావించాడు: “సహోదరులారా, మీరు మమ్మును చూచి, లేఖనములయందు వ్రాసియున్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని, మీరొకని పక్షమున మరియొకని మీద ఉప్పొంగకుండనట్లు ఈ మాట మీ నిమిత్తమై నామీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్వరూపముగా చెప్పియున్నాను. నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందినది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేల?” 6,7 వచనాలు.AATel 195.2

    క్రీస్తును బట్టి తమ మధ్య తాను తన సహచర సేవకులు భరించిన శ్రమలు కష్టాల్ని పౌలు సంఘానికి విశదం చేశాడు. “ఈ గడియ వరకు ఆకలిదప్పులు గలవారము, దిగంబరులము; సిడిగుద్దులు తినుచున్నాము; నిలువరమైన నివాసము లేక యున్నాము. స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము. హింసించబడియు ఓర్చుకొనుచున్నాము. దూషింపబడియు బతిమాలుకొనుచున్నాము. లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటివరకు ఎంచబడియున్నాము. మిమ్మును సిగ్గుపరచవలెనని కాదుగాని నా ప్రియమైన పిల్లలని నాకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయుచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేల మంది యున్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని” (11,16 వచనాలు) అన్నాడు.AATel 195.3

    కొందరు బోధకుల్ని అభిమానించి ఇతర బోధకుల సేవల్ని అంగీకరించటానికి ఇష్టపడనంతగా సభ్యులు వారికి అతుక్కుపోయినప్పుడు, సువార్త సేవకుల్ని తన రాయబారులుగా పంపుతున్న ప్రభువును వారు కించపర్చుతున్నారు. ప్రభువు తన ప్రజలకు సహాయం అందిస్తాడు. వీరు కోరిన రీతిలోనే అది ఎల్లప్పుడూ జరగదు. కాని వారి అవసరాన్ని బట్టి అది జరుగుతుంది. మనుషులు హ్రస్వదృష్టి కలవారు గనుక తమకు ఏది మేలుకరమో గుర్తించలేరు. క్రైస్తవ వరాలన్నిటిలో సంఘాన్ని సంపూర్ణంగా తీర్చిదిద్దటానికి అవసరమైన యోగ్యతలు ఏ ఒక్క బోధకుడిలోనో నిక్షిప్తమై ఉండటం. అందుచేత ఇతరుల్లో లేని సమర్థతలున్న కొందరు బోధకుల్ని వారి వద్దకు దేవుడు పంపించటం తరచుగా జరుగుతుంది.AATel 196.1

    ప్రభువుని ఏ విధంగా అంగీకరిస్తుందో ఆ విధంగానే క్రీస్తు సేవకుల్ని కూడా సంఘం అంగీకరించాలి. ప్రతీ బోధకుడు దైవవాక్యం నుంచి ఇచ్చే ఉపదేశం నుంచి పొందగలిగినంత ఆధ్యాత్మిక లబ్ది పొందటానికి వారు కృషిచెయ్యాలి. దైవ సేవకులందించే సత్యాల్ని వినయ మనసులతో అంగీకరించి అభినందించాలి. కాని ఏ బోధకుణ్నీ విగ్రహాన్ని పూజించేటట్లు పూజించకూడదు.AATel 196.2

    క్రీస్తు కృపను బట్టి సువార్త సేవకులు వెలుగును దీవెనల్ని అందించే దూతలుగా వ్యవహరిస్తారు. సిలువ విజయాల్ని విస్తరింపచెయ్యాలన్న ఉద్రేకంతో నిండిన హృదయాల్లో, యధార్ధ,విశ్వాస సహిత ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ వరదానాన్ని పొందే కొద్దీ వారు తమ కృషికి ఫలితాల్ని చూడగలుగుతారు. వారు స్వీయ ప్రతిభ ప్రదర్శించుకోటానికీ, స్వీయ ఔన్నత్యాన్ని చాటుకోటానికి ఏమాత్రం తావీయకుండా సాతాను దాడుల్ని తట్టుకోగల పటిష్ఠమైన సేవను స్థాపిస్తారు. దైవ సాధనంగా వ్యవహరించే మానవుడి వలనగాక క్రీస్తు వలన మనుషుల్లోనూ ఓర్పు కలుగుతుంది. స్వార్థం కనుమరుగవుతుంది. కల్వరి ప్రభువైన క్రీస్తు మాత్రమే కంటికి కనిపిస్తాడు.AATel 196.3

    అపొస్తలుల యుగంలో సువార్త ప్రకటించిన మహానీయుల ప్రాభవాన్నే నేడు క్రీస్తు సేవలో శ్రమించేవారూ ప్రదర్శించవచ్చు. పౌలు, అపోలో, సీల, తిమోతీ, పేతురు, యాకోబు యోహానులకు శక్తి నివ్వటానికి సంసిద్ధుడై ఉన్నట్టే ఈనాడు తన సేవకులకూ శక్తినివ్వటానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. AATel 196.4

    అపొస్తలుల కాలంలో వంచనకు గురిఅయి క్రీస్తును విశ్వసిస్తున్నట్లు చెప్పుకొంటూ ఆయన రాయబారుల్ని గౌరవించటానికి నిరాకరించినవారు కొందరున్నారు. తాము ఏ మానవ బోధకుణ్నీ అనుసరించటం లేదని సువార్త ప్రబోధ కుల చేయూత లేకుండానే ప్రత్యక్షంగా క్రీస్తు వలననే ఉపదేశం అందుకొంటున్నామని వారు ప్రచురించుకొన్నారు. వారు సంఘ స్వరానికి విధేయులు కాని స్వతంత్రులు. అట్టి మనుషులు మోసంలో పడిపోయే ప్రమాదముంది. పరిశుద్ధాత్మ చిత్రాన్ని జరిగించేందుకుగాను అనేకమంది ఉమ్మడి వివేకం కలిసి వివిధ వరాలు గల మనుషుల్ని సంఘంలో సహాయకులుగా దేవుడు ఉంచాడు. దైవ సేవలో పండిన అనుభవంగల ఇతరులతో కలిసి పనిచెయ్యటానికి నిరాకరిస్తూ తమ తలబిరుసు ప్రవర్తనను అనుసరించి వ్యవహరించేవారు ఆత్మ విశ్వాసం వల్ల అంధులై యుక్తాయుక్త జ్ఞానాన్ని కోల్పోతారు. అలాంటి వారిని సంఘనాయకులుగా ఎంపిక చెయ్యటం క్షేమంకాదు. ఎందుకంటే సహోదరుల ఆలోచన ఏమైనా వారు తమ ఆలోచన ప్రకారమే వ్యవహరిస్తారు. ప్రతీమెట్టు ఎక్కటానికి తమకే చేయాత అవసరమై ఉన్నా, క్రీస్తు సాత్వికాన్ని నేర్చుకోకుండా స్వశక్తితో ఆత్మల సంరక్షణ కార్యాన్ని చేపట్టే వారి ద్వారా సాతాను తన కార్యాన్ని సాధించటం నల్లేరు పై బండినడకే.AATel 196.5

    విధి నిర్వహణకు సదభిప్రాయం ఒక్కటే సురక్షితమైన మార్గదర్శకం కాదు. మనుషులు వాస్తవంలో మానవాభిప్రాయాన్ని అనుసరిస్తూ ఉండగా తమను దేవుడే నడిపిస్తున్నాడని నమ్మటానికి వారిని తరచు అపవాది నమ్మిస్తాడు. అయితే మనం అప్రమత్తులమై ఉండి సహోదరులతో కలసి ఆలోచన చేస్తే దేవుని చిత్తాన్ని గూర్చిన అవగాహన మనకు కలుగుతుంది. ఎందుకంటే ఆయన ఈ వాగ్దానం చేశాడు, “న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును” కీర్తనలు 25:9.AATel 197.1

    తొలి దినాళ్ళ క్రైస్తవ సంఘంలో పౌలునుగాని అపోల్లోనుగాని గుర్తించక పేతురే తమ నాయకుడన్నవారు కొందరుండేవారు. క్రీస్తు జీవించి ఉండగా పేతురు ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉండగా పౌలు విశ్వాసుల్ని హించించాడని వారనేవారు. వారి అభిప్రాయాలు మనోగతాలు తమ పూర్వాభిప్రాయలతో ముడిపడి ఉన్నాయి. హృదయంలో క్రీస్తు నివసిస్తున్నాడని సూచించే ఉదార భావం, దయారసం వారిలో ఏకోశానా కనిపించలేదు.AATel 197.2

    ఈ ముఠాతత్వం వల్ల క్రైస్తవ సంఘానికి ఎనలేని కీడు వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. దానికి అభ్యంతరం తెలిపి వారికి హితవు చెప్పవలసిందిగా ప్రభువు పౌలును ఆదేశించాడు. “నేను పౌలువాడను, ఒకడు-నేను అపొల్లో వాడను” మరి యొకడు - నేను కేఫావాడను. ఇంకొకడు - నేను క్రీస్తువాడను అనేవారిని “క్రీస్తు విభజింపబడియున్నాడా? పౌలు మికొరకు సిలువ వేయబడెనా? పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా?” అని పౌలు ప్రశ్నించాడు. “కాబట్టి యెవడును మునుష్యుల యందు అతిశయింపకూడదు. సమస్తమును మీవి. పౌలైనను అప్సొయైనను, కేఫాయైనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవియైనను రాబోవునవియైనను సమస్తమును మావే. మీరు క్రీస్తువారు; క్రీస్తు దేవునివాడు” అంటు విజ్ఞాపన చేశాడు 1 కొరింథీ 1:12,13; 3:21-23.AATel 197.3

    పౌలు అపొలోలు సామరస్యంగా నివసించారు. కొరింథు సంఘంలో తలెత్తిన విభేదాలు అజల్లోకి తీవ్ర మనస్తాపం కలిగించాయి. తనకు అనుకూలంగా వ్యక్తమైన ప్రజాభిప్రాయం వల్ల లబ్ది పొందటానికి చూడలేదు. అలాంటి భేదాన్ని ప్రోత్సహించలేదు. విభేదాలతో నిండిన ఆ స్థలాల్ని విడిచి వెళ్లిపోయాడు. మళ్లీ అక్కడకు వెళ్లి సేవచేయాల్సిందిగా తనను పౌలు కోరినప్పుడు అపోల్లో నిరాకరించాడు. ఆ సంఘం ఆధ్యాత్మికంగా మెరుగైన స్థాయికి వచ్చేంతవరకూ ఆ సంఘంలో అపొల్లో మళ్లీ పరిచర్య చేయలేదు.AATel 198.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents