Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అపొస్తలుల కార్యాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    2—పన్నెండుమంది శిష్యుల శిక్షణ

    తన సేవను నిర్వహించేందుకు యూదు సెన్ హెడ్రన్ లోని వక్తల్నిగాని రోమా రాజ్యంలోని అధికారులను గాని క్రీస్తు ఎంపిక చేసుకోలేదు. స్వనీతిపరురైన యూదు రబ్బీల్ని పక్కన పెట్టి, విద్యలేని సీదాసాదా వ్యక్తుల్ని ప్రభువు ఎన్నుకొన్నాడు. ఆ సామాన్యుల్ని సంఘ నాయకులుగా తీర్చిదిద్దాలని సంకల్పించాడు. సువార్త సేవను విజయవంతంగా నిర్వహించేందుకుగాను వారు పరిశుద్ధాత్మ శక్తి పొందాల్సి ఉన్నారు. మానవ శక్తిచేతగాని మానవ జ్ఞానం చేతగాని కాక దేవుని శక్తి వలన మాత్రమే సువార్త ప్రకటితం కావాల్సి ఉన్నది.AATel 14.1

    మూడున్నర సంవత్సరాల పాటు శిష్యులు మహామహోపాధ్యాయుడు క్రీస్తు పాదాల చెంత శిక్షణ పొందారు. వ్యక్తిగత బాంధవ్యం సహవాసం ద్వారా తన సేవకోసం క్రీస్తు వారిని తర్బీతు చేశాడు. దినదినం ఆయనతో వారు నడిచారు, మాట్లాడారు. వ్యాధిగ్రస్తుల్ని దురాత్మల పీడితుల్ని బాగుచేసిన ఆయన శక్తిని చూశారు. కొన్నిసార్లు సముద్రం పక్క కొన్నిసార్లు దారిలో నడిచేటప్పుడు దేవుని రాజ్యమర్మాల్ని ఆయన బయలు వర్చాడు. దైవ వర్తమానానికి ఎక్కడైతే హృదయ ద్వారాలు తెరుచుకొన్నాయో అక్కడ రక్షణ సత్యాల్ని ఆయన ప్రకటించాడు. ఇది చేయమని అది చేయమని శిష్యుల్ని ఆయన ఆదేశించలేదు కాని ” నన్ను వెంబడించుము ” అన్నాడు. తాను ప్రజలకు బోధించటం శిష్యులు పరిశీలించేందుకోసం ఆయన వారిని తనతో తీసుకువెళ్లాడు. ఆయనతో వారు గ్రామం నుంచి గ్రామానికి ప్రయాణంచేశారు. ఆయనతో కలిసి భోజనం చేశారు. ఆయనకు మల్లే తరచు ఆకలిగా ఉన్నారు, అలసిపోయారు. జనాలతో నిండిన వీధుల్లో సరస్సు తీరాన, అరణ్యంలో శిష్యులు ఆయనతో ఉన్నారు. జీవితంలోని అన్ని కోణాల నుంచి ఆయనను పరిశీలించారు.AATel 14.2

    పన్నెండు మంది శిష్యుల అభిషేకమప్పుడు సంఘ వ్యవస్థీకరణ దిశగా మొదటి చర్యతీసుకోడం జరిగింది. క్రీస్తు పరలోకానికి వెళ్లిన తర్వాత ఆయన సేవను లోకంలో ఆయన సంఘమే కొనసాగించాల్సి ఉన్నది. ఈ అభిషేకం గురించి లేఖనం ఇలా చెబుతున్నది, “ఆయన కొండెక్కి తన కిష్టమైనవారిని పిలువగా వారాయన వద్దకు వచ్చిరి. వారు తనతో కూడ ఉండువట్లును ... సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన పండ్రెండుమందిని నియ మించెను.” మార్కు 3 : 13-15.AATel 14.3

    ఆసక్తికరమైన ఈ సన్నివేశం చూడండి. పరలోక ప్రభువు ఎంపిక చేసుకొన్న పన్నెండుమందీ ఆయన చుట్టూ ఉన్నారు చూడండి. తమ సేవ నిమిత్తం వారిని ప్రత్యేకించటానికి ఆయన సిద్ధమై ఉన్నాడు. తవ వాక్యం ద్వారా, తన ఆత్మ ద్వారా ఈ బలహీనుల భాగస్వామ్యంతో రక్షణను సర్వ ప్రజలకు అందుబాటులో ఉంచటానికి ఆయన సంకల్పించాడు. AATel 15.1

    దేవుడు, దేవదూతలు ఈ దృశ్యాన్ని అమితానందంతో వీక్షించారు. ఈ మనుషుల ద్వారా దేవుని సత్యం ప్రజ్వలిస్తుందని రక్షకుడు క్రీస్తును గూర్చి వారు పలికే మాటలు తరం నుంచి తరానికి కాలాంతం వరకు ప్రతిధ్వనిస్తాయని తండ్రికి తెలుసు.AATel 15.2

    క్రీస్తు గురించి తాము విన్నవాటిని గురించి కన్నవాటి గురించి లోకానికి సాక్ష్యమివ్వడానికి శిష్యులు వెళ్లాల్సి ఉన్నారు. మానవులకు దేవుడిచ్చిన బాధ్యతల్లో ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ మాట కొస్తే, క్రీస్తు పరిచర్య తర్వాత ప్రాముఖ్య మైన బాధ్యత ఇదే. వారు మానవ రక్షణ కార్యంలో దేవునితో కలిసి పనిచేయాల్సి ఉన్నారు. పాత నిబంధనలో పన్నెండు మంది పితరులు ఇశ్రాయేలు ప్రతినిధులుగా పరిగణన పొందిన తీరుగానే, పన్నెండు మంది అపొస్తులు, సువార్త సంఘానికి ప్రతినిధులుగా నిలుస్తారు.AATel 15.3

    తన భూలోక పరిచర్యలో యూదులకు అన్యులకు మధ్య అడ్డుగోడను తొలగించి క్రీస్తు మానవులందరికి సువార్త ప్రకటించడం మొదలు పెట్టాడు. యూదుడైన ఆయిన సమరయులతో స్నేహ భావంతో మెలిగాడు. ద్వేషానికి గురి అయన ఆ జాతి ప్రజల విషయంలో యూదుల ఆచారాలను లెక్కచేయలేదు. వారి ఇళ్లలో నిద్రించాడు వారితో కలిసి భోజనం చేశాడు. వారి వీధుల్లో బోధించాడు.AATel 15.4

    ఇశ్రాయేలుకు ఇతర ప్రజలకు మధ్య అడ్డుగా నిలిచిన ” మధ్య గోడ” అనగా “అన్యజనులు... సమాన వారసులును” “సువార్త వలన క్రీస్తు యేసు నందు... పాలివారు (ఎఫెసీ 2:14; 3:6) ఉన్నారన్న సత్యాన్ని విస్మరించే మధ్య గోడను కూల్చడం గురించి తన శిష్యులకు వివరించాలని రక్షకుడు ఎంతగానో ఆశించాడు. కపెర్నహోములో శతాధిపతి విశ్వాసానికి క్రీస్తు ప్రతిఫలం ఇచ్చినప్పుడు సుఖారు గ్రామ నివాసులకు సువార్త ప్రకటించినప్పుడు ఈ సత్యం పాక్షికంగా ప్రకటితమయ్యింది. ప్రభువు ఫినికయను సందర్శించినప్పుడు ఒక కనాను స్త్రీ కుమార్తెను స్వస్థపర్చిన తరుణంలో ఈ సత్యం మరింత స్పష్టంగా ప్రకటిత మయ్యింది. రక్షణకు అర్హులు కారని అనేకులు భావించేవారిలో సత్యం కోసం అనేక ఆత్మలు ఆకలిగా ఉన్నాయని శిష్యులు గ్రహించడానికి ఈ అనుభవాలు తోడ్పడ్డాయి.AATel 15.5

    దేవుని రాజ్యంలో సరిహద్దులు, కుల తత్వం, సంపన్న వర్గం ఉండవని; (ప్రేమ గల రక్షకుని వర్తమానంతో తాము ప్రతీ జాతి ప్రజల వద్దకు వెళ్లాలని శిష్యులకు నేర్పించడానికి క్రీస్తు ప్రయత్నించాడు. అయితే కొంత కాలం గతించేవరకు దేవుడు వచించిన ఈ సత్యాన్ని శిష్యులు గ్రహించలేదు: ” యావద్భూమి మీద కాపురముండుటకు ఆయవ యొకని నుండి ప్రతిజాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో యని, తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.” అ. కా. 17:26, 27.AATel 16.1

    ఈ తొలి శిష్యుల మధ్య స్పష్టమైన వైవిధ్యం కనిపిస్తుంది. వారు ప్రపంచ బోధకులుగా పని చేయాల్సి ఉన్నారు. వారు రకరకాల తత్వాల్ని వ్యక్తిత్వాల్ని సూచించారు. తాము చేయాల్సిన పనిని జయప్రదంగా నిర్వర్తించేందుకు గాను వివిధ మనస్తత్వాలు అలవాట్లు గల ఈ వ్యక్తులు తమ ఆలోచనల్లో, కార్యాచరణలో ఐక్యత సాధించడం అవసరం. ఈ ఐక్యత సాధనే క్రీస్తు లక్ష్యం. ఈ దృష్టితో వారిని తనలో ఐక్యపర్చడానికి ఆయన ప్రయత్నించాడు. తన కృషి ముఖ్యోద్దేశ మేంటో ఆయన తన తండ్రికి చేసిన ఈ ప్రార్థనలో వ్యక్తంచేశాడు: ” తండ్రీ, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై యుండవలెనని” ” నీవు నన్ను ప్రేమించితిననియు, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడ ప్రేమించితివనియు లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని “యోహాను 17:21, 23. వారు సత్యం ద్వారా పరిశుద్ధత పొందాలని క్రీస్తు వారికోసం ఎల్లప్పుడూ ప్రార్థించాడు. లోక సృష్టికి ముందే సర్వశక్తిగల దేవుని నిర్ణయం అది, అని గుర్తించి నిశ్చయతతో ప్రార్థించాడు. దేవుని రాజ్యసువార్త సకల ప్రజలకు ప్రకటితమవుతుందని ఆయనకు తెలుసు. దుర్మారతతో పోరాటంలో పరిశుద్దాత్మ ఆయుధాన్ని ధరించిన సత్యం జయం సాధిస్తుందని రక్తంతో తడిసిన ఆయన ధ్వజం తన అనుచరుల తలలపై ఎగురుతుందని ఆయనకు తెలుసు.AATel 16.2

    లోకంలో క్రీస్తు పరిచర్య చివరి ఘట్టానికి చేరుతున్నప్పుడు వ్యక్తిగత పర్యవేక్షణ లేకుండా తన పరిచర్యను శిష్యులు కొనసాగించాల్సి ఉంటుందని గుర్తించినప్పుడు వారిని ధైర్యపర్చి భవిష్యత్తును ఎదుర్కోడానికి వారిని ఆయత్తపర్చడానికి పూనుకొన్నాడు. తప్పుడు ఆశలు రేపి వారిని మోసగించలేదు. ఏమి జరగబోతున్నదో వారికి నిష్కర్షగా తెలియజేశాడు. వారిని విడిచి వెళ్లిపోతానని, వారు తోడేళ్ల మధ్య గొర్రెల్లా ఉంటారని ఆయనకు తెలుసు. వారు హింసకు గురి అవుతారని, సమాజ మందిరాల్లో నుంచి గెంటివేయబడ్డారని, చెరసాలల్లో మగ్గుతారని ఆయనకు తెలుసు. తననే మెస్సీయా అని సాక్షం ఇచ్చినందుకు కొంత మందికి మరణదండన విధించటం జరుగుతుందని ఆయనకు తెలుసు. దీన్ని గురించి వారికి కొంత చెప్పాడు. వారి భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఆయన స్పష్టంగా కచ్చితంగా మాట్లాడాడు. తమకు రానున్న శ్రమ కాలంలో వారు తాను చెప్పిన మాటల్ని జ్ఞప్తికి తెచ్చుకొని బలం పొంది తనను రక్షకుడుగా విశ్వసించమని చెప్పాడు.AATel 16.3

    వారికి ఉత్సాహాన్ని ధైర్యాన్ని కలిగించే మాటలు మాట్లాడాడు. ” మీ హృదయములను కలవరపడనియకుడి; దేవుని యందు విశ్వాసముంచుచున్నారు నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రియింట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచి వెళ్లుచున్నాను. నేను వెళ్లి నాకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా మొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.” యోహాను 14:1-4. మీ కోసమే నేను లోకంలోకి వచ్చాను, మీ కోసమే నేను పని చేస్తున్నాను. మీరు నన్ను విశ్వసించేందుకుగాను నేను లోకంలోకి వచ్చి నన్నునేను మీకు బయలు పర్చుకొన్నాను. నేను మన తండ్రి వద్దకు వెళ్తున్నాను. మీ పక్షంగా అక్కడ తండ్రితో కలిసి పనిచేస్తాను.AATel 17.1

    “నేను తండ్రి యొద్దకు వెళ్లుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును నా కంటె మరిగొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” యోహాను 14:12. దీనిభావం తనకన్న శిష్యులు మరింత తీవ్రంగా కృషి చేస్తారని కాదు గాని వారి పని పరిధి మరింత విశాలంగా ఉంటుందని. కేవలం సూచక క్రియల్ని దృష్టిలో ఉంచుకొనే ఆయన మాట్లాడలేదు. పరిశుద్దాత్మ నడుపుదల కింద చోటుచేసుకోనున్న సమస్త కార్యాల్ని దృష్టిలో ఉంచుకొని మాట్లాడాడు. ” తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణ కర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపియైన ఆత్మ వచ్చిప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదట నుండి నా యొద్ద నున్నారు. గనుక మీరును సాక్ష్యమిత్తురు.” యెహోను 15:26-27. ఈ మాటలు అద్భుతకరంగా నెరవేరాయి. పరిశుద్ధాత్మ దిగివచ్చిన దరిమిల ప్రభువు పట్ల, ఆయన ఏ ప్రజల కోసం మరణించాడో ఆ ప్రజల పట్ల ప్రేమ శిష్యుల హృదయాల్ని నింపింది. వారు పలికిన మాటలు చేసిన ప్రార్ధనల వల్ల హృదయాలు కరిగాయి. వారు పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడారు. ఆ శక్తి ప్రభావం వలన వేలాది ప్రజలు మారుమనసు పొందారు.AATel 17.2

    శిష్యులు. క్రీస్తు రాయబారులైన అపొస్తలులు లోకాన్ని ప్రభావితం చేయాల్సి ఉన్నారు. అపోస్తలులు సామాన్యులన్న వాస్తవం వారి ప్రభావాన్ని తగ్గించకపోగా దాన్ని పెంచుతుంది. ఎందుకంటే వారి శ్రోతల హృదయాలు తమకు కనిపించకపోయినా అవి తమతో పనిచేస్తున్న రక్షకుని మీదికి తిరుగుతాయి. అపోస్తలుల అద్భుత బోధనలు, ఉత్సాహాన్ని నమ్మకాన్ని పుట్టించే వారి మాటలు, తాము చేస్తున్న కార్యాలు తమసొంత శక్తితో చేస్తున్నవి కావని వాటికి మూలం క్రీస్తు శక్తి అని అందరిలోను దృఢ నమ్మకం పుట్టిస్తాయి. యూదులు సిలువవేసింది జీవనాధుడైన క్రీస్తునని ఆయన సజీవదేవుని కుమారుడని ఆయన చేసిన కార్యాలే తాము ఆయన పేర చేస్తున్నామని వారు వినయంగా ప్రకటిస్తారు.AATel 18.1

    సిలువకు ముందు రాత్రి శిష్యులతో మాట్లాడేటప్పుడు రక్షకుడు తాను పొందిన శ్రమల గురించి ఇంకాపొందనున్న శ్రమల గురించి ప్రస్తావించలేదు. తన ముందున్న అవమానం గురించి ప్రస్తావించలేదు గాని తమ విశ్వాసాన్ని బలపర్చే విషయాల్ని వారి గమనానికి తేవడానికి ప్రయత్నించాడు. జయించేవారు పొందనున్న ఆనందాన్ని వారి ముందుంచడానికి ప్రయత్నించాడు. తన అనుచరులకు తాను వాగానం చేసిన వాటికన్నా మరెక్కువ చేయగలను, చేస్తాను అన్న స్పృహ, హృదయాలయాన్ని శుద్ధిచేసి ప్రవర్తనలో మానవుల్ని ప్రవర్తనలో తనకు మల్లే రూపుదిద్దేందుకు తన నుంచి ప్రేమ దయ ప్రవహిస్తాయన్న స్పృహ, పరిశుద్ధాత్మ ఆయుధ శక్తిగల సత్యం, జయం నుంచి అధిక జయం సాధిస్తూ ముందంజ వేస్తుందన్న స్పృహ ఉన్నందుకు ఆనందించాడు.AATel 18.2

    ఆయన ఇలా అన్నాడు: “నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి యున్నాను.” యోహాను 16 : 33. క్రీస్తు అపజయం పొందలేదు. అధైర్యంచెందలేదు కూడా. శిష్యులు కూడా అలాటి అచంచల విశ్వాసాన్నే చూపించాలి. ఆయనపై విశ్వాసముంచి వారు కూడా ఆయన కృషి చేసినట్లే కృషిచేయాలి. అసాధ్యాలతో నిండి మార్గం అగమ్యంగా కనిపించినా వారు ముందడుగు వేయాల్సి ఉన్నారు. నిస్పృహకు తావీయకుండా సమస్తం సాధ్యమన్న ఆశాభావంతో ముందుకు సాగాల్సి ఉన్నారు.AATel 18.3

    క్రీస్తు తన కర్తవ్యాన్ని ముగించాడు, మనుష్యుల మధ్య తన పరిచర్యను కొనసాగించే నిమిత్తం కార్యకర్తల్ని ఎంపిక చేశాడు. అనంతరం ఆయన ఇలా ఆన్నాడు: ” వారి యందు నేను మహిమ పరచబడి యున్నాను. నేనికను లోకములో ఉండను గాని మీరు లోకములో ఉన్నారు; నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమైయున్న లాగున వారును ఏకమైయుండునట్లు నీవునాకు అనుగ్రహించిన నీనామ మందు వారిని కాపాడుము.” ” మరియు నీవు నన్ను పంపితివని లోకమునమ్మునట్లు, తండ్రీ, నా యందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్ధించుటలేదు, వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరును ఏకమైయుండవలెనని వారి కొరికును ప్రార్ధిచు చున్నాను... నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడ ప్రేమించితివనియు లోకము తెలిసికొనునట్లు నాకనుగ్రహించిన మహిమను వారికిచ్చితిని.” యోహాను 17 : 10, 11, 20 - 23.AATel 18.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents