Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అపొస్తలుల కార్యాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    38—బందీ అయిన పాలు

    మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మును సంతోషముతో చేర్చుకొనిరి. మరునాడు పెద్దలందరు అక్కడికి వచ్చియుండగా పౌలు మాతో కూడ యాకోబునొద్దకు వచ్చెను.”AATel 283.1

    యూదు సహోదరుల్లోని పేదల సహాయార్థం క్రైస్తవులైన అన్యజనుల సంఘాలు అర్పించిన విరాళాల్ని ఈ సమయంలో పౌలు అతని సహచరులు యెరూషలేములోని సంఘ నాయకులకు అందజేశారు. ఈ విరాళాల్ని పోగుచెయ్యటంలో పౌలు అతని తోటి పనివారు ఎంతో సమయం గడిపారు. ఎంతో శ్రమపడ్డారు. నిధుల మొత్తం యెరూషలేములోని సహోదరుల అంచనాలకు మించి ఉన్నది. అది ఎన్నో త్యాగాలకు, ఆ అన్య విశ్వాసులు పడ్డ తీవ్రమైన పస్తులకు ప్రతీక.AATel 283.2

    లోక వ్యాప్తంగా వ్యవస్థీకృతమైన దైవ సేవకు క్రైస్తవులైన అన్యజనుల ప్రభుభక్తికి విశ్వసనీయతకు ఈ స్వేచ్చార్పణలు ప్రతీక. వాటిని కృతజ్ఞతతో అంగీకరించ వలసింది. అయితే ఇప్పుడు పౌలు అతని సహచరులు ఎవరిముందు నిలిచి ఉన్నారో ఆ నాయకుల్లో కొందరు ఆ విరాళాలకు హేతువైన సహోదర ప్రేమాస్ఫూర్తిని అభినందించలేకపోయినట్లు వారు గ్రహించారు.AATel 283.3

    అన్యజనుల మధ్య సువార్త సేవ జరిగిన తొలినాళ్ళలో యెరూషలేములోని సహోదరులలో కొందరు తమ దురభిప్రాయాల్ని ఆలోచనా ధోరణిని వదలకుండా పౌలు అతని సహచరులతో హృదయ పూర్వకంగా సహకరించలేదు. అర్థరహితమైన కొన్ని ఆచారాలు కర్మకాండల్ని కాపాడుకోటానికి తమ ఆతృత కొద్దీ తమనూ, తాము నిర్వహిస్తున్న సేవనూ, తక్కిన ప్రాంతాల్లో జరుగుతున్న సేవనూ, ఏకం చేయటంవల్ల ఒనగూడే గొప్ప దీవెనను వారు విస్మరించారు. క్రైస్తవ సంఘం తాలూకు ఆసక్తుల్ని కాపాడుకోవాలన్న కోరిక ఉన్నప్పటికీ పురోగమిస్తున్న దైవకృపల లబ్ది పొందటంలో విఫలులయ్యారు. తమ మానవ జ్ఞానంతో అనవసరమైన ఆంక్షలతో పనివారిని బంధించి ఉంచారు. మారుతున్న పరిస్థితులు, ఇతర దేశాల్లో ఉన్నవారి ప్రత్యేకావస రాలు వ్యక్తిగతంగా తెలియని ఒక వర్గం ఇలా బయలుదేరి, ఈ విషయాల్లో తమ సహోదరులు నిర్దిష్ట పద్ధతిని అవలంబించాలని ఆదేశించే అధికారం తమకున్న దని చెప్పారు. తమ అభిప్రాయాలకు అనుగుణంగా సువార్త సేవ సాగాలని వారు పట్టుపట్టారు.AATel 283.4

    అన్యజనుల మధ్య సువార్త సేవ చేస్తున్న వారి విధివిధానాల్ని గురించిన సమస్యల్ని పరిశీలించటానికి సహోదరులు ప్రధాన సంఘ నాయకులతో కలిసి యెరూషలేములో సమావేశమైనప్పటినుంచి అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ సభ ఫలితంగా, సున్నతితో సహా కొన్ని కర్మకాండలు ఆచారాల పై సంఘాలకు నిర్దిష్టమైన సిఫార్సులు ఏకగ్రీవంగా చేశారు. ఈ సాధారణ సభలోనే విశ్వాసుల విశ్వాసాభిమానాలకు పాత్రులైన సేవకులుగా క్రైస్తవ సహోదరులు సంఘాలకు బర్నబాను పౌలును ఏకగ్రీవంగా సిఫార్సు చేశారు.AATel 284.1

    అన్యజనులకు సువార్త ప్రకటించాల్సి ఉన్న ఈ అపొస్తలుల సేవా పద్ధతుల్ని తీవ్రంగా విమర్శించిన వారిలో కొందరు ఈ సభకు హాజరైన వారిలో ఉన్నారు. అయితే సభ జరుగుతున్న తరుణంలో దేవుని ఉద్దేశాన్ని గూర్చిన వారి అభిప్రాయాలు విశాలమయ్యాయి. వారు కూడా సహోదరులతో ఏకీభవించి వివేకవంతమైన తీర్మానాలు తీసుకోటానికి సహకరించారు. విశ్వాసులందరినీ ఒకటి చెయ్యటానికి ఇది తోడ్పడింది.AATel 284.2

    అనంతరం, అన్యజనుల్లోనుంచి సత్యాన్నంగీకరిస్తున్నవారి సంఖ్య వేగంగా పెరగటంతో యెరూషలేములో నాయకత్వం వహిస్తున్న కొందరు పౌలు అతని సహాయకులు అనుసరిస్తున్న సేవా విధానాన్ని గురించి తమ పూర్వద్వేషాన్ని మళ్ళీ ప్రదర్శించటం మొదలు పెట్టారు. సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ ప్రతికూలాభి . ప్రాయాలు బలం పుంజుకున్నాయి. చివరికి సువార్త పరిచర్య ఇకనుంచి తమ అభిప్రాయాల ప్రకారమే జరగాలని నాయకులు తీర్మానించుకున్నారు. వారు ప్రబోధిస్తున్న కొన్ని విధానాల ప్రకారం పౌలు పనిచేస్తే వారు పౌలు సేవకు గుర్తింపును మద్దతను ఇవ్వాలని అలాక్కాకపోతే ఆ సేవకు ఆదరణ మద్దతు ఇవ్వకూడదని నిశ్చయించుకున్నారు.AATel 284.3

    దేవుడే తన ప్రజలకు ఉపదేశకుడని, నాయకుడైన దేవుని అనుసరించటంలో ప్రతీ దైవ సేవకుడూ వ్యక్తిగతానుభవం కలిగుండాలేగాని నడుపుదలకోసం మానవుడి మీద ఆధారపడకూడదని, దేవుని సేవచేసేవారు మానవాభిప్రాయాల్ని బట్టికాక దేవుని పోలికలో తమ్ముని తాము రూపుదిద్దుకోవాలని ఈ నేతలు విస్మరించారు.AATel 284.4

    తన సువార్త పరిచర్యలో ప్రజలకు “మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారముచేసికొనిన” విశ్వాసాన్ని, తనకు పరిశుద్ధాత్మ బయలుపర్చిన సత్యాల్ని పౌలు బోధించాడు. “ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకేగాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకేగాని మరి ఎవనికిని తెలియవు... మనుష్య జ్ఞానము నేర్పు మాటలతోగాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము” అంటున్నాడు పౌలు (1 కొరి. 2:4,10-13).AATel 284.5

    తన సువార్త పరిచర్య అంతటిలోను దేవుని నడుపుదల పైనే పౌలు ఆధారపడి అదే సమయంలో యెరూషలేములోని సాధారణ సభ తీర్మానాల్ని అనుసరించి పనిచెయ్యటంలో జాగరూకత వహించాడు. ఫలితంగా “సంఘము విశ్వాసమునందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను.” అ.కా. 16:5. కొందరు అనాదరణ నిరాసక్తత కనపర్చినప్పటికీ తన విశ్వాసుల్లో ప్రభుభక్తి, ఔదార్యం సహోదర ప్రేమ ప్రోత్సహించటంలో తన విధిని నిర్వహించానన్న స్పృహ అతనికి స్వాంతననిచ్చింది. ఈ తరుణంలో యూదు నాయకుల ముందు తాను సమర్పించిన ఉదార విరాళాలు ఈ సహోదర ప్రేమను వెల్లడి చేశాయి.AATel 285.1

    విరాళాల సమర్పణ దరిమిల పౌలు “తన పరిచర్యవలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పెను.” దేవుని దీవెనవల్లనే ఈ పని జరిగిందన్న నమ్మకం సందేహిస్తున్న సహోదరులతో సహా అందరి హృదయాల్లోను చోటుచేసుకొంది. “వారు విని దేవుని మహిమ పరచిరి.” ఈ అపొస్తలుడు అనుసరించిన సేవా విధానంపై దేవుని ఆమోద ముద్ర ఉన్నదని అందరూ గుర్తించారు. అన్య విశ్వాసుల మధ్య స్థాపించిన సంఘాల విశ్వసనీయతను గురించి పౌలిచ్చిన సాక్ష్యానికి వారి ముందున్న ధారాళ విరాళాలు బలం చేకూర్చాయి. యెరూషలేములో నాయకత్వ బాధ్యతలు వహిస్తూ కొన్ని నియంత్రణ చర్యలు చేపట్టటం అవసరమని పట్టుపట్టిన వ్యక్తులు పౌలు చేస్తున్న సేవను నూతనకోణంలో చూసి తాము అనుసరించిన విధానం సరైంది కాదని, తాము యూదుల ఆచారాలు సంప్రదాయాలకు బందీలై ఉన్నామని, క్రీస్తు మరణం యూదులు అన్యుల మధ్య నిలిచిన అడ్డుగోడను పడగొట్టిందన్న సత్యాన్ని తాము గుర్తించని కారణంగా సువార్త సేవకు ఆటంకం ఏర్పడిందని గుర్తించారు.AATel 285.2

    పౌలు ద్వారా దేవుడు ఈ కార్యాన్ని చేశాడని తాము కొన్నిసార్లు పౌలు విరోధుల నివేదికల్ని అనుమతించి అసూయకు ద్వేషానికి తావివ్వడంలో పొరపాటు చేశామని చిత్తశుద్ధితో ఒప్పుకోటానికి నాయక సహోదరులికి ఇది ఒక సువర్ణావకాశం. కాని బాధితుడికి న్యాయం చెయ్యటంలో ఏకమయ్యే బదులు వారు అతనికి హితవు చెప్పారు. ప్రస్తుతం ఉన్న ద్వేషానికి పౌలే కారణమన్నది తమ అభిప్రాయమన్నట్లు అది ధ్వనించింది. వారు అతనికి మద్దతుగా నిలువలేదు. పొరపాటులో ఉన్నవారి పొరపాటును ఎత్తిచూపించలేదు. పైగా భేదాభిప్రాయాల్ని తొలగించే విధానాన్ని అవలంబించటం మంచిదంటూ హితవు పలుకుతూ రాజీ కుదర్చటానికి ప్రయత్నించారు.AATel 285.3

    పౌలు ఇచ్చిన సాక్ష్యానికి జవాబుగా వారిలా అన్నారు. “సహోదరుడా, యూదులలో విశ్వాసులైనవారు ఎన్ని వేలమంది యున్నారో చూచుచున్నావుగదా? వారందరును ధర్మశాస్త్రమందు ఆసక్తిగలవారు. అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయించకూడదనియు, మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుటవలన వారందరు మోషేను విడిచి పెట్టవలెనని నీవు బోధించుచున్నట్లు వీరు నిన్ను గూర్చి వర్తమానము వినియున్నారు. కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయుము మ్రొక్కుబడియున్న నలుగురు మనుమ్యలు మా యొద్ద ఉన్నారు. నీవు వారిని వెంటబెట్టుకొనిపోయి వారితో కూడ శుద్ధిచేసికొని, వారు తలకొరము చేయించుకొనుటకు వారికయ్యెడి తగులుబడి పెట్టుకొనుము; అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు, నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొను చున్నావనియు తెలిసి కొందురు, అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి - వారు విగ్రహములకు అర్పించినవాటి రక్తమును గొంతు పిసికి చంపినదానిని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసియున్నామని చెప్పిరి.”AATel 286.1

    తాము ప్రతిపాదించిన కార్యాచరణను పౌలు నిర్వహించటంద్వారా తనను గురించి ప్రచారమౌతున్న తప్పుడు సమాచారం అబద్ధమని తెలుస్తుందని సహోదరులు భావించారు. విశ్వసించిన అన్యజనుల్ని గూర్చి, ఆచారధర్మ శాస్త్రాన్ని గూర్చి దీనికి ముందు జరిగిన సభ చేసిన తీర్మానం అమలులోనే ఉందని వారు పౌలుకి భరోసా ఇచ్చారు. అయితే ఇప్పుడు వారిచ్చిన సలహా ఆ తీర్మానానికి అనుకూలమయ్యింది కాదు. ఈ తీర్మానాన్ని దేవునిఆత్మ ప్రేరేపించలేదు. అది పిరికితనం పర్యవసనం. ఆచారధర్మశాస్త్రాన్ని పాటించకపోవటంవల్ల క్రైస్తవులు యూదుల ద్వేషానికి గురి అయి కఠోర హింసను కొనితెచ్చుకుంటారని యెరూషలేములోని సంఘనాయకులకు తెలుసు. సువార్త ప్రగతికి మోకొలడ్డటానికి సన్ హెడ్రిన్ శాయశక్తుల కృషిచేస్తున్నది. అపొస్తలుల్ని ముఖ్యంగా పౌలుని వెంబడించి వారి సేవను అన్నివిధాలా వ్యతిరేకించటానికి ఈ సన్ హెడ్రిన్ సభ కొంతమందిని ఎంపికచేసిపంపింది. క్రీస్తు విశ్వాసుల్ని చట్టాన్ని అతిక్రమించినవారిగా సన్ హెల్త్న్ సభముందు నిలబెట్టినట్లయితే వారిని యూదు విశ్వాసభ్రష్టులుగా నిర్ణయించి వారికి సత్వర కఠినశిక్ష విధించవచ్చు.AATel 286.2

    సువార్తను స్వీకరించిన యూదుల్లో అనేకమంది ఆచారధర్మశాస్త్రం పట్ల ఇంకా మక్కువగానే ఉన్నారు. వారు ఆచారాల విషయంలో బుద్ధిహీనమైన మినహా యింపులు చెయ్యటానికి సిద్ధంగా ఉన్నారు. తోటి పౌరుల విశ్వాసాన్ని పొంది వారిలో ఉన్న ద్వేషాన్ని నిర్మూలించి వారిని క్రీస్తు విశ్వాసంలోకి నడిపించాలన్నది వారి ఆశాభావం. యెరూషలేములోని నాయకుల్లో ఎక్కువమంది తన పట్ల ద్వేషభావం కొనసాగించినంతకాలం తనకు వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉంటారని పౌలు గుర్తించాడు. ఏదైనా సముచితమైన రాయితీద్వారా వారిని సత్యంలోకి నడిపించగలిగితే సత్యంపట్ల ఇతర స్థలాల్లో ఉన్న ప్రతిబంధకాన్ని తొలగించవచ్చని భావించాడు. కాని సహోదరులు కోరిన మేరకు అంగీకరించటానికి పౌలుకి దేవుని ఆదేశం లేదు.AATel 286.3

    సహోదరులతో సమాధానంగా నివసించాలన్న పౌలు తాపత్రయం గురించి, విశ్వాసంలో బలహీనులై వారిపట్ల అతని కనికరం గురించి, క్రీస్తుతో ఉన్న అపొస్తలులపట్ల అతనికున్న అపార గౌరవం గురించి, ప్రభువు సోదరుడు యాకోబు పట్ల, నియమాలికి నీళ్ళోదలకుండా అందరికీ అనుకూలంగా మెలగాలన్న అతని సూత్రం విషయంలో అతని మనోగతం గురించి మనం ఆలోచించినప్పుడు పౌలు ఇంతవరకూ అనుసరిస్తూ వచ్చిన నిర్దిష్ట విధానంనుంచి తొలగవలసి రావటం మనకు ఏమంత విస్మయం కలిగించదు. కాగా, ఉద్దేశించిన కార్యాన్ని సాధించేబదులు సయోధ్యకు అతడు చేసిన ప్రయత్నం సమస్యను మరింత జటిలంచేసి ముందే ఊహించిన తన శ్రమల్ని వేగవంతంచేసి తనను తన సహోదరులనుంచి వేరు చేసి సంఘం బలమైన స్తంభాల్లో ఒకదాన్ని పడగొట్టి లోకమంతటా ఉన్న క్రైస్తవులికి తీరని దుఃఖాన్ని కలిగించింది.AATel 287.1

    పెద్దలు చెప్పిన సలహాను పౌలు మరుసటిరోజే అమలుపర్చటం మొదలు పెట్టాడు. ఈ నలుగురూ నాజీరు ఒట్టుకింద ఉన్నవారు (సంఖ్యా 6). దాని కాలావధి దాదాపు ముగిసింది. పౌలు “వారిలో ప్రతివాని కొరకు కానుక అర్చించువరకు శుద్దిదినములు” నెరవేర్చటానికి ఆలయంలోకి తీసుకు వెళ్ళాడు. శుద్ధి చేయటానికిగాను విలువైన బలులు ఇంకా అర్పించాల్సి ఉంది.AATel 287.2

    ఈ చర్య తీసుకోటానికి పౌలును ప్రోత్సహించినవారు దానివల్ల అతనికి ఏర్పడే ప్రమాదాన్ని పరిగణించలేదు. ఈ కాలంలో ఆరాధకులు పలుదేశాలనుంచి యెరూషలేముకు వచ్చేవారు. దేవుని ఆదేశానుసారంగా పౌలు అన్యులకు సువార్త ప్రకటిస్తున్న తరుణంలో అతడు లోకంలోని అనేక మహానగరాల్ని సందర్శించటం, పండుగ ఆచరించటానికి ఇతర దేశాలనుంచి విచ్చేసిన వారిలో వేలమందికి అతడు పరిచయస్తుడై ఉండటం జరిగింది. పౌలు పట్ల తీవ్ర వ్యతిరేకత ద్వేషంగలవారు వీరిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో పౌలు ఆలయంలో ప్రవేశించటం తన ప్రాణానికే ముప్పుగా పరిణమించింది. కొన్ని రోజుల పాటు ఆరాధకుల నడుమ ఎవరూ గుర్తించకుండా వస్తూపోతూ ఉండేవాడు. అయితే నిర్దేశిత కాలావధి ముగియక ముందు అతడు ఒక యాజకుడితో అర్పించాల్సిన బలుల్ని గూర్చి మాట్లాడున్న సమయంలో ఆసియానుంచి వచ్చిన కొందరు యూదులు పౌలుని గుర్తించారు.AATel 287.3

    “ఇశ్రాయేలీయులారా, సహాయము చేయరండి, ప్రజలకు ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే” అని భయంకర భూతాలమల్లే కేకలు వేస్తూ అతనిమీద పడ్డారు. ఆ పిలుపును అందుకొని వచ్చిన ప్రజలు - “మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయములోనికి తీసికొని యీ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచియున్నాడు” అంటూ మరో ఆరోపణ మోపారు.AATel 288.1

    సున్నతి పొందని ఒక వ్యక్తి పరిశుద్ధాలయంలోని లోపలి భాగంలోకి వెళ్ళటం యూదుల చట్టం ప్రకారం మరణదండనకు అర్హమైన నేరం. పౌలుతో ఎఫెసీయుడైన త్రోఫిమును ప్రజలు ఆ పట్టణంలో చూశారు. పౌలు త్రోఫిమును ఆలయంలోకి తీసుకువచ్చి ఉంటాడని ఊహించుకున్నారు. పౌలు ఆ పనిచెయ్యలేదు. యూదుడైన పౌలు ఆలయంలోకి వెళ్ళటం చట్టవిరుద్ధం కాదు. అది అసత్య ఆరోపణే అయినా ప్రజల్లో ద్వేషాన్ని రెచ్చగొట్టటానికి సాయపడింది. ఆ కేక ఆలయ ప్రాంగణంలో ప్రతిధ్వని చేస్తూ వినిపించటంతో అక్కడ సమావేశమైన జనసమూహాలు ఉన్మాదంతో కదం తొక్కాయి. ఆ వార్త యెరూషలేమంతా శరవేగంగా పాకింది. “పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరుగెత్తిరి.”AATel 288.2

    ప్రపంచం అన్ని ప్రాంతాలనుంచి దైవారాధన నిమిత్తం వేలాది ప్రజలు యెరూషలేముకి వచ్చిన సమయంలో ఇశ్రాయేలులోని ఒక భ్రష్టుడు ఆలయాన్ని, అపవిత్రపర్చటమన్నది ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పుట్టించింది. వారు “పౌలును పట్టుకొని దేవాలయములోనుండి అతనిని వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను.”AATel 288.3

    “వారతని చంపవలెనని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై యధికారికి వర్తమానము వచ్చెను.” తాను అణచవలసిన దౌర్జన్యపరులెవరో కౌదియ, లూసియకు బాగా తెలుసు. “వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంటబెట్టుకొని వారి యొద్దకు పరుగెత్తి వచ్చెను. వారు పై యధికారిని సైనికులను రాణువువారిని చూచి పౌలును కొట్టుట మానిరి.” ఆ గందరగోళానికి హేతువేంటో అతనికి తెలియదు. కాని ప్రజల ఆగ్రహం పౌలు పై కేంద్రీకృతమవ్వటం చూసి ఆ రోమా సైనికాధికారి పౌలు అప్పటివరకూ తప్పించుకు తిరుగుతున్న ఐగుప్తు దేశపు తిరుగుబాటుదారుడని భావించాడు. “అతని పట్టుకొని, రెండు సంకెళ్ళతో బంధించమని ఆజ్ఞాపించి - ఇతడెవడు? ఏమిచే సెను” అని అడిగాడు. ఉద్రేకాగ్రహాలతో ఆరోపణలు చేస్తూ అనేక స్వరాలు వినిపించాయి. “కొందరిలాగు కొందరాలాగు కేకలు వేయుచున్నప్పుడు అల్లరిచేత అతడు నిజము తెలిసికొనలేక కోటలోనికి అతని తీసికొనిపొమ్మని ఆజ్ఞాపించెను. పౌలు మెట్ల మీదికి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతనిని మోసికొని పోవలసివచ్చెను. ఏలయనగా - వానిని చంపుమని జనసమూహము కేకలు వేయుచు వెంబడించెను.”AATel 288.4

    ఆ గందరగోళం నడుమ పౌలు ప్రశాంతంగా ఆత్మనిబ్బరంతో ఉన్నాడు. దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. తన చుట్టూ పరలోక దూతలున్నారని అతనికి తెలుసు. సత్యమేంటో తన దేశ ప్రజలకు తెలుపకుండా ఆ దేవాలయాన్ని విడిచి వెళ్ళకూడదని భావించాడు. తనను కోటలోకి తీసుకువెళ్ళకముందు సేనాధిపతితో ఇలా అన్నాడు, “నేను నీతో ఒకమాట చెప్పవచ్చునా?” అన్నాడు. లూసియ “గ్రీకు భాష నీకు తెలియునా? ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి, నరహంతకులైన నాలుగువేలమంది మనుష్యులను అరణ్యమునకు వెంటబెట్టుకొనిపోయిన ఐగుప్తీయుడవు నీవుకావా?” అని ప్రశ్నించాడు. పౌలు ఈ విధంగా సమాధానమిచ్చాడు. ‘నేను కిలకియలోని తార్సువాడనైన యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను. జనులతో మాటలాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నాను.”AATel 289.1

    అతడు పౌలు మనవిని అంగీకరించాడు. “పౌలు మెట్లమీద నిలువబడి జనులకు చే సైగచేసెను.” ఆ సైగ వారి గమనాన్ని ఆకర్షించింది. అతని ముఖవైఖరి గౌరవప్రదంగా ఉంది. “వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లనెను - సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ యెదుట చెప్పు సమాధానము నాలకించుడి.” సుపరిచితమైన హెబ్రీ భాష విన్నప్పుడు “వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి.” ఆ నిశ్శబ్దవాతావరణంలో పౌలిలా చెప్పటం మొదలు పెట్టాడు.AATel 289.2

    “నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదములయొద్ద పెరిగి, మన పితరుల ధర్మశాస్త్రసంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరు నేడు ఉన్న ప్రకారము దేవునిగూర్చి ఆసక్తుడనై” ఉన్నాను. అతడు చెప్పిన దాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. అతడు చెప్పిన వాస్తవాలు యెరూషలేములో ఇంకా బతికి ఉన్న వారికి బాగా తెలిసిన విషయాలే. ఆ తర్వాత, క్రీస్తు అనుచరుల్ని హింసించటంలోను చంపేవరకూ పోవటంలోను క్రితంలో తన ఉద్రేకాన్ని గురించి ప్రస్తావించాడు. అంతట తన హృదయ పరివర్తనకు సంబంధించిన ఘటనల్ని గూర్చి చెబుతూ తన అహంభావ పూరిత హృదయం సిలువను పొందిన నజరేయుని ముందు వంగి నమస్కరించటం ఎలాచోటు చేసుకుందో తన శ్రోతలకు వివరించాడు. తన విరోధులతో తర్కానికి దిగి ఉంటే అతని మాటలు వినటానికి వారు నిరాకరించి ఉండేవారు. కాని తన అనుభవాన్ని గూర్చిన కథనం గొప్ప శక్తితో నిండి వింటున్నవారి హృదయాల్ని మెత్తబర్చి ఆకట్టుకున్నది.AATel 289.3

    ఆ మీదట అన్యజనుల మధ్య తాను చేస్తున్న పరిచర్య తనంతట తాను ఎంపిక చేసుకుని ప్రారంభించింది కాదని విశదం చెయ్యటానికి ప్రయత్నించాడు. తన ప్రజల కోసం పనిచెయ్యాలన్నది తన ఆకాంక్ష అని కాని ఆ దేవాలయంలోనే పరిశుద్ధ దర్శనంలో దైవ స్వరం తనతో మాట్లాడి “దూరముగా అన్యజనుల యొద్దకు” తనను నడిపించిందని చెప్పాడు.AATel 289.4

    ఇప్పటివరకూ ప్రజలు శ్రద్ధగా విన్నారు కాని పౌలు తన చరిత్రలో క్రీస్తు తనను అన్యజనులికి రాయబారిగా నియమించటానికి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళ ఉగ్రత కట్టలు తెంచుకుంది. దేవుని ఆదరానుగ్రహాల్ని గుత్తగా పొందిన ప్రజలుగా తమ్మును తాము పరిగణించుకోటానికి అలవాటు పడ్డ వారు ఇప్పటివరకూ తమకే చెందినట్లు తాము భావించిన ఆధిక్యతల్ని హక్కుల్ని అన్యజనులతో పంచుకోటానికి ససేమిరా ఇష్టపడలేదు. “ఇటువంటివాడు బ్రదుకతగడు, భూమిమీద ఉండకుండ వానిని చంపివేయుడని” తమ స్వరాల్ని ఎత్తి కేకలు వేశారు.AATel 290.1

    “వారు కేకలు వేయుచు తమ పై బట్టలు విదుల్చుకొని ఆకాశము తట్టు దుమ్మెత్తి పోయుచుండగా వారతనికి విరోధముగా ఈలాగు కేకలు వేసిన హేతువేమో తెలిసికొనుటకై సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి, విమర్శింపవలెనని చెప్పి కోటలోనికి తీసికొనిపొండని ఆజ్ఞాపించెను.AATel 290.2

    “వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచియున్న శతాధిపతిని చూచి - శిక్షవిధింపకయే రోమీయుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారమున్నదా? అని అడిగెను. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి - నీవేమి చేయబోవుచున్నావు? ఈ మనుష్యుడు రోమీయుడు సుమీ అనెను. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచి - నీవు రోమీయుడువా? అది నాతో చెప్పుమనగా అతడు - అవునని చెప్పెను. సహస్రాధిపతి - నేను బహు ద్రవ్యమిచ్చి యీ పౌరత్వము సంపాదించుకొంటిననెను. అందుకు పౌలు - నేనైతే ముట్టుకతోనే రోమీయుడననెను. కాబట్టి అతనిని విమర్శింపబోయినవారు వెంటనే అతనిని విడిచి పెట్టిరి. మరియు అతడు రోమీయుడని తెలిసికొన్నప్పుడు అతనిని బంధించినందుకు సహస్రాధిపతి కూడ భయపడెను.AATel 290.3

    “మరునాడు, యూదులు అతనిమీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలిసికొనగోరి, సహస్రాధిపతి అతని వదిలించి, ప్రధాన యాజకులును మహా సభవారందరును కూడి రావలెనని ఆజ్ఞాపించి, పౌలును తీసికొనివచ్చి వారియెదుట నిలువబెట్టెను.”AATel 290.4

    తాను క్రైస్తవుడు కాకముందు ఏ న్యాయస్థానానికి సభ్యుడుగా ఉన్నాడో అదే ఇప్పుడు పౌలుకు తీర్పు తీర్చాల్సి ఉంది. యూదు ప్రధానులముందు నిలబడినప్పుడు పౌలు ప్రశాంతంగా ఉన్నాడు. అతని ముఖం పై క్రీస్తు శాంతి కనిపించింది. “మహాసభవారిని తేరిచూచి - సహోదరులారా, నేను నేటివరకు కేవలము మంచి మనస్సాక్షిగల వాడనై దేవుని యెదుట నడుచుకొనుచుంటిని” అని చెప్పాడు. ఈ మాటలు విన్నప్పుడు వారి ద్వేషం తాజాగా రగుల్కొన్నది.AATel 290.5

    “అందుకు ప్రధాన యాజకుడైన అననీయ - అతని నోటిమీద కొట్టుడని దగ్గర నిలిచియున్న వారికి ఆజ్ఞాపించగా” పౌలు ఈ మాటలన్నాడు, “సున్నము కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్పింప కూర్చుండి, ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టుట కాజ్ఞాపించుచున్నావా?” “దగ్గర నిలిచియున్నవారు - నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించెదవా? అని అడిగిరి.” తన స్వాభావిక వినయంతో పౌలిలా బదులు పలికాడు, “సహోదరులారా, యితడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి యున్నది.AATel 291.1

    “వారిలో ఒక భాగము సదూకయ్యులును మరియొక భాగము పరిసయ్యులునైయున్నట్టు పౌలు గ్రహించి - సహోదరులారా! నేను పరిసయ్యుడను, మనకున్న నిరీక్షణను గూర్చియు, మృతుల పునరుత్థానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను. .AATel 291.2

    “అతడాలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమాజము రెండు పక్షములు ఆయెను. సదూకయ్యులు పునరుత్థానములేదని దేవదూతయైనను ఆత్మయైనను లేదనియు చెప్పుదురుగాని పరిస్యులు రెండును కలవని యొప్పుకొందురు.” రెండు పక్షాలవారు వాదించుకోటం మొదలు పెట్టటంతో పౌలును వ్యతిరేకించటంలో వారి దూకుడు తగ్గింది. “పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరులేచి - ఈ మనుష్యుని యందు ఏ దోషమును మాకు కనబడలేదు. ఒక ఆత్మయైనను దేవదూతయైనను అతనితో మాటలాడియుంటే మాటలాడియుండవచ్చునని చెప్పుచు తగువులాడిరి.”AATel 291.3

    ఆ గందరగోళాన్ని ఆసరాచేసుకుని సద్దూకయ్యులు పౌలును చేజిక్కించు కోవాలని చూశారు. పౌలుని మట్టు పెట్టటమే వారి ఉద్దేశం. అయితే పరిసయ్యులు కూడా అతణ్ని కాపాడటానికి అంతే ఉద్రేకంతో ప్రయత్నించారు. “వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి - మీరు వెళ్ళి వారి మధ్యనుండి అతనిని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసికొనిరండని సైనికులకు ఆజ్ఞాపించెను.”AATel 291.4

    అనంతరం ఆనాటి అనుభవంగురించి ఆలోచిస్తూ తాను చేసినపని దేవునికి సమ్మతంగాలేదేమోనని పౌలు భయపడ్డాడు. అనలు యెరూషలేమును సందర్శిం చటమే తాను చేసిన పొరపాటా? సహోదరుల్ని కలవాలన్న తన ప్రగాఢ వాఁచే ఈ దుష్పరిణామానికి దారి తీసిందా?AATel 291.5

    దైవ ప్రజలుగా చెప్పుకొంటున్న యూదులకు విశ్వసించని లోకం దృష్టిలో ఉన్న ప్రతిపత్తి పౌలుకు తీవ్ర వేదనను కలిగించింది. అన్యులైన ఆ అధికారులు వారిని గురించి ఏమనుకుంటారు? యెహోవాను సేవించే వారమని చెప్పుకొంటూ, పరిశుద్ధ హోదాలు అలంకరిస్తూ, అర్థంలేని ఆవేశానికి ఆగ్రహానికి లోనై, మత విశ్వాసం విషయంలో తమతో ఏకీభవించని తమ సహోదరుల్ని నిర్మూలించటానికి సమకట్టి, తమ పవిత్ర చర్చావేదికను సంఘర్షణకు గందరగోళానికి రంగస్థలంగా మార్చిన వారిని గూర్చి ఏమనుకుంటారు ఆ అన్యులు? అన్యుల దృష్టిలో తన దేవుని నామం నిందల పాలయ్యిందని పౌలు బాధపడ్డాడు.AATel 292.1

    ఇప్పుడు పౌలు ఖైదులో ఉన్నాడు. ద్వేషంతో నిండిన శత్రువులు తన ప్రాణం తియ్యటానికి ఏ పనైనా చెయ్యవచ్చునని అతడు గ్రహించాడు. సంఘాలపరంగా తన సేవ సమాప్తమయ్యిందా? సంఘాల్లో క్రూరమైన తోడేళ్ళు ప్రవేశించటానికి సిద్ధంగా ఉన్నాయా? క్రీస్తు సేవే పౌలు హృదయానికి అత్యంత ప్రియమైంది. ఆయా ప్రాంతాల్లో చెదిరి ఉన్న సంఘాలకు ఏర్పడ్డ ప్రమాదకర పరిస్థితుల్ని గురించి పౌలు తీవ్ర ఆందోళనకు గురి అయ్యాడు. ఆ సంఘాలు తాను సన్ హెల్త్న్ సభలో ఎదుర్కొన్న వ్యక్తుల్లాంటివారినుంచి కలిగే హింసకు గురికావచ్చు. ఆవేదనతో హృదయ భారంతో విలపిస్తూ ప్రార్థన చేశాడు.AATel 292.2

    ఈ చీకటి ఘడియలో ప్రభువు తన సేవకుణ్ని మర్చిపోలేదు. ఆలయ ఆవరణలోని ఖూనీకోరు మూకనడుమ దేవుడు అతణ్ని కాపాడాడు. సెన్ హెడ్రైన్ సభలో ప్రభువు అతనితో ఉన్నాడు. కోటలో అతనితో ఉన్నాడు. మార్గదర్శనం కోసం అపొస్తలుడు చేసిన ప్రార్థనకు జవాబుగా ఆయన తన నమ్మకమైన సాక్షికి ప్రత్యక్షమయ్యాడు. “ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి • ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్నుగూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో ఆలాగున రోములో కూడ సాక్ష్యమియ్యవలసియున్నావని చెప్పెను.”AATel 292.3

    పౌలు రోమును సందర్శించాలని చాలా కాలంగా ఆశించాడు. అక్కడ క్రీస్తును గూర్చి సాక్ష్యమివ్వాలని ఆకాంక్షించాడు. అయితే తన ఉద్దేశాలకు యూదుల వ్యతిరేకత అడ్డుకట్టవేస్తుంది. ఇప్పుడు కూడా అక్కడికి ఖైదీగానే వెళ్తానన్న విషయం అతనికి తట్టలేదు.AATel 292.4

    ప్రభువు తనను ఉద్రేక పర్చుతుండగా అతణ్ని నాశనం చెయ్యటానికి తన విరోధులు కుట్రలు పన్నుతున్నారు. “ఉదయమైనప్పుడు యూదులు కట్టకట్టి తాము పౌలును చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి. ఈ కుట్రలో చేరినవారు నలుబదిమందికంటె ఎక్కువ.” ఇక్కడ వీరి ఉపవాసం యెషయాద్వారా ప్రభువు ఖండిస్తున్న ఉపవాసం వంటిది, “కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు” ఆచరించే ఉపవాసం. యెషయా 58:4.AATel 292.5

    కుట్రదారులు “ప్రధాన యాజకుని యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి - మేము పౌలును చంపువరకు ఏమియు రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొని యున్నాము. కాబట్టి మీరు మహాసభతో కలిసి అతనిని గూర్చి మరి పూర్తిగా విచారించి తెలిసికొనబోవునట్టు అతనిని మీ యొద్దకు తీసికొని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయుడి. అతడు దగ్గరకు రాకమునుపే మేమతని చంపుటకు సిద్ధపడియున్నామని చెప్పిరి.”AATel 293.1

    ఈ క్రూర పథకానికి వారిని మందలించేబదులు యాజకులు ప్రధానులు దాన్ని ఆమోదించారు. అననీయను సున్నం కొట్టిన సమాధికి పోల్చటంలో పౌలు సత్యాన్నే పలికాడు.AATel 293.2

    తన సేవకుని ప్రాణం కాపాడేందుకు దేవుడు కలుగజేసుకున్నాడు. ఒక యువకుడు హంతకులు “పొంచియున్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు పౌలు శతాధిపతులలో నొకనిని తన యొద్దకు పిలిచి - ఈ చిన్నవానిని సహస్రాధిపతి యొద్దకు తోడుకొని పొమ్ము ఇతడు అతనితో ఒక మాట చెప్పవలెననియున్నాడు అనెను. శతాధిపతి సహస్రాధిపతి యొద్దకతని తోడుకొనిపోయి - ఖైదీయైన పౌలునన్ను పిలిచి - నీతో ఒక మాట చెప్పుకొనవలెనని యున్న యీ పడుచువానివి నీ యొద్దకు తీసికొని పొమ్మని నన్ను అడిగెనని చెప్పెను.AATel 293.3

    కౌదియ లూపియ ఆ యువకుడిపట్ల దయగా వ్యవహరించి అతణ్ని పక్కకు తీసికువెళ్ళి “నీవు నాకు చెప్పవలసి ఉన్నదేమిటి?” అని ప్రశ్నించాడు. ఆ యువకుడు ఇలా సమాధానమిచ్చాడు, “నీవు పౌలును గూర్చి సంపూర్తిగా విచారింపబోవునట్టు అతనిని రేపు మహాసభయొద్దకు తీసికొనిరావలెనని నిన్ను వేడుకొనుటకు యూదులు కట్టుకట్టి యున్నారు. వారి మాటకు నీవు సమ్మతింపవద్దు, వారిలో నలుదిమందికంటె ఎక్కువ మనుష్యులు అతని కొరకు పొంచియున్నారు. వారు అతని చంపుటకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనియున్నారు. ఇప్పుడు నీ యొద్దమాట తీసికొనవలెనని కని పెట్టుకొని సిద్ధముగా ఉన్నారు.”AATel 293.4

    “అందుకు సహస్రాధిపతి - నీవు ఈ సంగతి నాకు తెలిపితివని యెవనితోను చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువానిని పంపివేసెను.”AATel 293.5

    లూసియ పౌలును తన అధికార పరిధినుంచి న్యాయాధికారి అయిన ఫేలిక్సుకు బదలాయించాడు. యూదులు ఆవేశం ఆగ్రహం దండిగా గల ప్రజలు. కొట్లాటలు గందరగోళాలు తరచు సంభవిస్తుండేవి. అపొస్తలుడు యెరూషలేములోనే ఉండటం ఆ పట్టణానికి అక్కడి అధికారికీ ముప్పు తెచ్చే పరిణామాలకు దారితీయవచ్చు. అందుచేత ఆ అధికారి “శతాధిపతులలో ఇద్దరిని తన యొద్దకు పిలిచి — కైసరయకు వెళ్ళుటకు ఇన్నూరు మంది సైనికులను డెబ్బదిమంది గుఱ్ఱపు రౌతులను ఇన్నూరుమంది యీటెలవారిని రాత్రి తొమ్మిది గంటలకు సిద్ధపరచి పౌలును ఎక్కించి - అధిపతియైన ఫేలిక్సునొద్దకు భద్రముగా తీసికొనిపోవుటకు గుఱ్ఱములను సిద్ధపరచుడని చెప్పెను.”AATel 293.6

    పౌలును పంపటంలో ఏ మాత్రం జాప్యం జరగటానికి లేదు. “అతడు వారికాజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రివేళ అంతిపత్రికి తీసికొనిపోయిరి.” ఆ స్థలంనుంచి గుర్రపు రౌతులు ఖైదీతో కలిసి కైసరయకు వెళ్ళగా నాలుగు వందలమంది సైనికులు తిరిగి యెరూషలేముకి వెళ్ళిపోయారు. గుర్రపు రౌతుల నాయకుడైన అధికారి సహస్రాధిపతి తనతో పంపిన లేఖతోపాటు ఆ ఖైదీని ఫేలిక్సుకి అప్పగించాడు.AATel 294.1

    “మాహా ఘనత వహించిన అధిపతియైన ఫొలిక్సుకు, కౌదియ లూసియ వందనములు. యూదులు ఈ మనుష్యునిపట్టుకొని చంపబోవుచున్నప్పుడు, అతడు రోమీయుడని నేను విని, సైనికులతో వచ్చి అతనిని తప్పించితిని. వారు అతనిమీద మోపిన నేరమేమో తెలిసికొనగోరి నేను వారి మహాసభ యొద్దకు అతనిని తీసికొనివచ్చితిని. వారు తమ ధర్మశాస్త్రవాదములనుగూర్చి అతని మీద నేరము మోపిరేగాని మరణమునకైనను, బంధకములకైనను తగిన నేరము అతని యందేమియు కనబడలేదు. అయితే వారు ఈ మనుష్యుని మీద కుట్ర చేయనైయున్నారని నాకు తెలియవచ్చినందున, వెంటనే అతనిని నీ యొద్దకు పంపించితిని. నేరము మోపినవారు కూడ అతని మీద చెప్పవలెనని యున్న సంగతి నీ యెదుట చెప్పుకొన నాజ్ఞా పించితిని.” AATel 294.2

    లేఖ చదివిన తర్వాత ఖైదీ ఏ రాష్ట్రానికి చెందినవాడని ఫేలిక్సు ప్రశ్నించాడు. అతడు కిలికియవాడని వినటంతో ఫేలిక్సు ఇలా అన్నాడు “నీ మీద నేరము మోపువారుకూడ వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారింతునని చెప్పి, హేరోదు అధికార మందిరములో అతనిని కావలియందుంచవలెనని ఆజ్ఞాపించెను.”AATel 294.3

    దైవ ప్రజలమని చెప్పుకొనేవారి దుర్మార్థతనుంచి అన్యుల మధ్య ఆశ్రయం పొందినవారిలో పౌలు మొదటివాడు కాదు. పౌలు పై తమకున్న మూర్ఖపు కోపంలో యూదులు తమ జాతీయ చరిత్రలోని నేరాల జాబితాలో మరో నేరాన్ని నమోదు చేసుకున్నారు. సత్యంపట్ల తమ హృదయాల్ని మరింత కఠినపర్చుకున్నారు. అలా తమ నాశనాన్ని మరింత స్థిరపర్చుకున్నారు.AATel 294.4

    అభిషిక్తుడైన మెస్సీయాను తానేనని నజరేతులోని సమాజమందిరంలో క్రీస్తు ప్రకటించినప్పుడు ఆ మాటల ఆంతర్యాన్ని గ్రహించినవారు బహు కొద్దిమంది మాత్రమే. దుఃఖించేవారిని, పాప రోగ బాధితుల్ని ఓదార్చటం, దీవించటం, రక్షించటమే తాను ఎంపిక చేసుకున్న కర్తవ్యమని ఆయన వెల్లడిచేశాడు. తన శ్రోతల్ని దురహంకారం, అవిశ్వాసం అదుపుచేస్తున్నట్లు గమనించి, తన ప్రజల అవిశ్వాసం తిరుగుబాటు కారణంగా గతంలో దేవుడు వారికి విముఖుడై అన్యజనుల దేశాల్లో దేవుని సత్యాన్ని విసర్జించని ప్రజలకు తన్నుతాను ప్రత్యక్షపర్చుకున్న సంగతి వారికి గుర్తుచేశాడు. సారెపతు గ్రామంలోని విధవరాలు, సిరియాకు చెందిన సామాను తమకు తెలిసిన సత్యం ప్రకారం నివసించారు. అందుచేత దైవమార్గంనుంచి వైదొలగి లోకప్రతిష్ఠకోసం ధర్మసూత్రాల్ని త్యాగం చేసిన దైవ ప్రజలకన్న వారు ఎక్కువ నీతిమంతులుగా పరిగణన పొందారు.AATel 294.5

    సత్వంనుంచి తొలగిపోయిన ఇశ్రాయేలీయుడితో నమ్మకమైన దైవ సేవకుడు నివసించటం క్షేమంకాదని క్రీస్తు బోధించినప్పుడు నజరేతులోని యూదులకు ఆయన ఓ భయంకర సత్యాన్ని ప్రకటించాడు. వారు అతని విలువను గ్రహించరు. అతడి శ్రమను అభినందించరు. దేవుని ఘనపర్చటం పట్ల ఇశ్రాయేలీయుల హితం పట్ల తమకు అమితాసక్తి ఉన్నట్లు చాటుకొనే యూదునాయకులు ఆ రెండింటికీ శత్రువులే. తమ ఉచ్చరణ, ఆచరణ రెండింటి ద్వారా ప్రజల్ని దేవునికి దూరంగా నడిపిస్తున్నారు. కష్టకాలంలో తమకు ఆయన సహాయం అందించలేని స్థితిలోకి ప్రజల్ని నడిపిస్తున్నారు.AATel 295.1

    నజరేతు ప్రజలతో రక్షకుడు పలికిన మందలింపు మాటలు, పౌలు పరంగా విశ్వసించని యూదులకే కాదు నమ్ముతున్న తన సహోదరులకు కూడా వర్తిస్తున్నాయి. సంఘ నాయకులు పౌలుపట్ల తమ మనస్పర్థల్ని పూర్తిగా విడిచి పెట్టి, అన్యులకు సువార్త ప్రకటించటానికి ప్రత్యేకంగా దేవునిచే ఎంపికైన వ్యక్తిగా అతన్ని అంగీకరించి ఉంటే దేవుడు అతణ్ని వారి మధ్య ఉండి సేవ చేయటానికి కాపాడే వాడే. పౌలు సేవలకు అంత త్వరగా అంతం పలకాలన్నది దేవుని సంకల్పం కాదు. కాని యెరూషలేము సంఘ నాయకుల చర్యల పర్యవసానాల్ని రద్దు చేయటానికి దేవుడు అద్భుతాన్ని చెయ్యలేదు.AATel 295.2

    ఇదే స్వభావం ఇలాంటి పర్యవసానాలకే ఇంకా దారితీస్తున్నది. దైవ కృపవలన ఏర్పాటైన వనరుల్ని అభినందించి వృద్ధిపర్చటం అశ్రద్ధ చేయటంతో సంఘం గొప్పదీవెనలు పోగొట్టుకొంటున్నది. ఒక నమ్మకమైన దైవ సేవకుని పరిచర్యను ప్రజలు అభినందించి ఉంటే ఆ సేవకుని పరిచర్యను ప్రభువు ఇంకా కొంతకాలం పొడిగించటం ఎంత తరచుగా జరుగుతూ ఉండేది! అయితే, అవగాహనను వక్రీకరించి క్రీస్తు సేవకుడి మాటల్ని కృషిని ప్రజలు అపార్థం చేసుకుని, తప్పుడు ప్రచారం చేసేలా సంఘం సాతానుకి తావిస్తే, దైవ సేవకుడికి ప్రతిబంధకాలు కల్పించి అతడి సేవను నిరర్థకం చేస్తే, ప్రభువు అనుగ్రహించిన ఆ దీవెనను కొన్నిసార్లు వారిమధ్యనుంచి ఆయనే తొలగించివేస్తాడు.AATel 295.3

    ప్రజాహితం దిశగా గొప్ప కార్యాలు సాధించటానికి దేవుడు ఎంపిక చేసుకున్న వ్యక్తుల్ని సాధనాల్ని అధైర్యపర్చి నాశనం చెయ్యడానికి సాతాను సర్వదా తన ప్రతినిధులద్వారా పనిచేస్తూ ఉంటాడు. దైవ సేవ ప్రగతికోసం వారు తమ ప్రాణాల్ని సయితం త్యాగం చెయ్యటానికి సిద్ధంగా ఉండవచ్చు. అయినా ఈ అపూర్వ వంచకుడు వీరిగురించి వీరి సహోదరులకు సందేహాలు పుట్టిస్తారు. వాటిని నమ్మితే అది వారి ప్రవర్తన విషయంలోను భక్తి విషయంలోను విశ్వాసాన్ని నాశనం చేసి వారి ప్రయోజకత్వాన్ని వ్యర్ధం చేస్తుంది. తరచు తమ సహోదరుల ద్వారా వారికి హృదయ వేదనను దుర్భర దుఃఖాన్ని కలుగజేయటంలో సాతాను జయం పొందటంతో దేవుడు కలుగజేసుకుని హింసకు గురి అవుతున్న తన సేవకులకు విశ్రాంతినిస్తాడు. ప్రాణంలేని దేహంపై చేతులు మడిచిన తర్వాత, హెచ్చరిక చేసే స్వరం, ఉత్సాహ పర్చే స్వరం మూగపోయినప్పుడు, తాము తోసిపుచ్చిన ఆశీర్వాదాల్ని గుర్తించి ఆదరించటానికి ఆ పాషాణ హృదయాలు మేల్కొంటాయి. వారు బతికి ఉండి సాధించలేకపోయింది మరణించి సాధిస్తారు.AATel 295.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents